Friday, June 27, 2008

బహుముఖ పాండితీ సంగమం - పాములపర్తి నరసింహా రావు

బహుముఖ పాండితీసంగమం - పాములపర్తి నరసింహుడు - జయంతి
( 1921 - 2004 )
రాజకీయపండితుడు


విలక్షణ వ్యక్తిత్వం. బహుముఖరంగాల్లో పాండితీప్రకర్షకుడు. ముక్కుకు సూటుగా పోయేవాడు. అంతేకాదు, ముక్కు కూడ బలే రాటుదేలి సూటిగా పొడుచుకు వచ్చినట్లు కోణంతేరి కనిపిస్తుంది. తెలుగువాడు చేసుకున్న బహుజన్మల పుణ్యం. తెలుగుగడ్డపై జన్మించిన ప్రతిభాశాలి. అన్నిరంగాలలో ఆరితేరినవాడు. అపర చాణక్యుడు. తెలుగు మాతౄభాష; అయితే, ఉర్దూ, మరాఠీ, కన్నడ, హిందీ, ఆంగ్లంలతో సహా 13 భాషల్లో అపరప్రావీణ్యం కలిగినవాడు. యివి సరిపోక, భారతదేశంలో అంత అధికంగా సంభాషించని అనేక యూరోపా భాషలైన, ఫ్రెంచ్, స్పానిష్ ల్లో కూడ విద్వన్మూర్తి. జగమెరిగిన తెలుగు సాహితీజగతిలో జగద్విఖ్యాత సాహితీమూర్తి. న్యాయంగా చెప్పాలంటే నిజమైన న్యాయవాది. అయినా రాజకీయరారాజు. సామాజికార్ధికరంగాల్లో విప్లవానికి పునాదిరాళ్ళను పాతినవ్యక్తి - ఎవరో కాదు, పాములపర్తి వేంకట నరసింహారావు. అందరి నోళ్ళళ్ళో 'పివీ గా బహు సుప్రసిద్ధులు. స్వంతరాష్ట్రంలోనూ, జాతీయస్థాయిలోనూ, రాజకీయాల్లో రాణించిన రాజకీయోద్దండుడు.
జీవనప్రస్థానం

పాములపర్తి వెంకట నరహరి నరసింహారావు వరంగల్లు జిల్లాలోని కోపల్లె గ్రామంలో 1921 జూన్ 28న రుక్మబాయి, సీతారామరావు దంపతులకు జన్మించిన, రావు సంపన్నకుటుంబం నుంచి వచ్చారు. కరీంనగర్ జిల్లాకు చెందిన పెద్దవంగర స్వగ్రామం. పాములపర్తి వెంకట రంగారావు, రుక్మిణి దంపతులకు దత్తపుత్రునిగా అలరించిన పిదప పాములపర్తి వారి కుటుంబానికి వారసుడయ్యాడు. పివి వరంగల్లు జిల్లాలో ప్రాధమిక విద్యనభ్యసించాడు. ఉస్మానియా, ముంబాయి విశ్వవిద్యాలయాల్లో విద్యను సాగించిన, నరసింహారావు న్యాయవిద్యలో రాణించారు.
నిజాం పై కాలుదువ్వినవారిలో - పివి

రావుగారు విద్యార్ధిదశలోనే, 1938లోనే హైదరాబాదు రాష్త్ర కాంగ్రేసు పార్టీలో చేరి, నిజాము ప్రభుత్వపు నిషేధణను ధిక్కరిస్తూ వందేమాతరం గీతాన్ని గానం చేసిన ధీశాలి. ఫలితంగా ఉస్మానియా బహిష్కరణకి గురయి, మిత్రుడి సాయంతో నాగపూరు విశ్వవిద్యాలయంలో చేరి, ఆయనవద్దనే వుంటూ 1940-44 లో న్యాయవిద్యను అభ్యసించాడు. స్వామి రామానందతీర్ధ, బూర్గుల రామకౄష్ణారావులతోపాటు స్వాతంత్ర్యపోరాటంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలో పాల్గొన్నాడు. బూర్గులవారి శిష్యరికంలో కాంగ్రేసులో చేరి, అప్పటి యువనాయకులు మర్రిచెన్నారెడ్డి, శంకరరావు చవన్, వీరేంద్రపాటిల్ లతో కలసి యువకాంగ్రేసు కార్యకర్తలుగా పేరుపొందారు. మూడు పదుల ప్రాయానికే అఖిలభారతకాంగ్రేసులో సభ్యుడిగా స్థానం సంపాదించిన ఘనుడు నరసింహుడు. ఈకాలం - 1948-1955 మధ్య బంధువు పాములపర్తి సదాశివరావు తో కలసి కాకతీయ పత్రిక ను తెలుగు వారపత్రికగా సంపాదకత్వం వహించడం కూడ విశేషం. రావుగారి సాహితీభాషాసంస్కౄతీపటిమకు పునాది యిక్కడినుంచే అని చెప్పవచ్చు.
అసంఖ్యాక రాజకీయ సోపానాలు

భారతీయ జాతీయ కాంగ్రేసు లో వివిధస్థాయిల్లోను, 1962-1971 దశాబ్దంలో మంత్రిత్వశాఖలను నిర్వహించిన నరసింహారావుగారు, ఆంధ్రుడిగా ఆంధ్రరాజకీయానికి పగ్గాలు పట్టి 1971-73 లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టి, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఫలితంగా పదవిని వదులుకోవలసివచ్చింది. రాజకీయంలో అతిసహజమైన విచ్చినంలో భాగంగా, కాంగ్రేసు విడిపోయినప్పుడు, 1969లో అప్పటి ప్రధానిమంత్రి యిందిరాగాంధీ నాయకత్వానికి విధేయతని ప్రకటించడం, అత్యవసర పరిస్థితి పరిపాలనలో 1975-77 మధ్య కాలంలో అపర రాజకీయ చాణక్యుడి పాత్ర కూడ వుందనే చెప్పాలి.
భారతదేశానికి తొలి తెలుగుబిడ్డ ప్రధాని

జాతీయ రాజకీయాల్లో ప్రతిభాపాండిత్యాలని ప్రదర్శించిన పాములపర్తివారు 1972 లో సవ్యసాచిలా, గౄహ, రక్షణ, విదేశీవ్యవహార శాఖల్లో 1980-84 లో రాణించిన తీరు అద్భుతం. తల్లీకొడుకులు, యిందిరాగాంధి, రాజీవ్ గాంధి ల నాయకత్వంలో సరిసములులేని రాజకీయదురంధరుడు, మన నరసింహుడు. రాజకీయ చరిత్రలో, అనూహ్యఘటన, రాజీవుని హత్య పిదప ఉధ్భవించిన నాయకత్వసంక్షోభంలో, 1991 ఎన్నికలు జరగడం, ఏకోణంలోంచి ప్రశ్నించలేని, సమాధానపరచుకోవలసిన అవసరం లేకుండ, రాకుండ, మన పివినరసింహారావుగారు, కాంగ్రేసు పార్టీకి నాయకత్వం వహించడమే కాడు, భారతీయ రాజకీయ చరిత్ర, అందులో, దక్షిణభారత రాజకీయ చరిత్రలో, మొట్టమొదటిగా, పదహారణాల తెలుగుబిడ్డ దేశపుగద్దెని ఆరోహించాడు. అప్పట్లో అత్యధిక స్థానాలు పొందిన పక్షంగా, మైనారీటీ దశలో వున్నాకూడ, పూర్తి పదవీకాలం దేశప్రధానిగా, ప్రతిభావంతంగా, ప్రపంచపునడతకు దీటైన స్థాయిలో దేశంలో సరళీకరణవిధానాలు, ఆర్ధికవిధానంలో మార్పులను ప్రవేశపెట్టడం, వాటిని న భూతో న భవిష్యతి అన్నట్లే అమలుపరచడం పట్ల, భారతదేశపు ఆర్ధికస్థాయి ఎప్పటికీ సుస్థిరతనించి దిగజారదనిపించే స్థాయికి నిలబెట్టిన నిపుణత, మన నరసింహుడెదే. ఆ విషయంలో ఆయన ఉగ్రనరసింహుడే. ఆయన అలవరచుకున్న మితభాషితనం అమితప్రతిభాపాటవాలకి దారితీసింది. రాజకీయమౌని గా పేరుపొందాడు.
తలమానికమైన స్థానం - ప్రపంచస్థాయిలో చిరస్మరణీయం

ఆంధ్రప్రదేశ్ లో నంద్యాల నుంచి కనివిని ఎరుగని తీరులో, అత్యధికమైన ఓట్ల మెజారిటీ, 5 లక్షలు సంపాదించిన ఘనత మన నరసింహుడిదే అని గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో సువర్ణాక్షరాలతో చిరస్థాయిగా లిఖించిన ఘనత మన తెలుగుబిడ్డదే అనడం గర్వకారణం కాక మరేమిటి. ప్రధానమంత్రిగా కొనసాగిన ఆ అయిదేళ్ళు, మరో రాజకీయదురంధరుడు, మహారాష్ట్రనాయకుడు, షరద్ పవార్ ని అంధ్రకేసరి ఢీకొన్న శైలి, అదికూడ రక్షణశాఖలో వున్నవాని రాజకీయానికి ప్రతిసవాలుని విసిరిన విశేషప్రతిభాశాలి మన నరసింహారావు.
సాహితీపాండిత్యంలోనూ కవిశ్రీనాధుడే మన నరసింహుడు

బహుబాషాకోవిదుడు, మౄదుసంభాషి, అయినా, మితభాషి, చతురుడు అయిన నరసింహారావుగారు కలం పట్టేడంటే, అపరమధురకవి, గద్యపోతనే అని చెప్పాలి. రాజకీయాల్లో క్షణం తీరికలేని పనితనంతో పాటు, పివి నిరంతర రచయిత. ఆయన మేధస్సులో, రాజకీయసాహిత్యాన్ని సౄష్టించుకుంటూనే, నిజసారస్వతాన్ని కూడ సౄష్టిస్తూ, అద్భుత రచనలను అందించాడు. తన రచనలను స్వయంగా, వౄద్ధాప్యం వరకూ, సాంకేతికంగానే, చేయడం మరో విశేషం. కంప్యూటర్ ని వాడడమే కాదు, ప్రావీణ్యుడే. జ్ణానపీఠం అనగానే తెలుగులో మొదటగా గుర్తువచ్చే అప్రతిభాశాలియైన ఏకైక తెలుగుకవి విశ్వనాధ సత్యనారాయణగారి వేయిపడగలు సుప్రసిద్ధ నవలకు మరింత వన్నెలను రంగరించి, దాని విలువలను పరిపోషించి, హిందీభాష, దేశపురాజభాషలో, సహస్రఫణి గా అనువదించడం, ఈ ప్రతిభాపూర్వకమైన అనువాదం, కాదు, అనుసౄజనం, రచనకు కేంద్రసాహిత్య అకాడమీ వారి సత్కారానికి గురయింది అంటేనే, దాని విలువను చెప్పవచ్చు. వేరే విశ్లేషణలు, వివరణలు అనవసరం. అలాగే, అబల జీవితం అన్న ప్రముఖ మరాఠీరచనకు ఆంధ్రానుసౄజనం కావించారు.
పివి ఆత్మకధ - లోపలిమనిషి (ఇన్ సైడర్)

నరసింహారావు గారు, తన విస్తార రాజకీయ,సాహిత్య, భాషాపాండిత్యాలని క్రోడీకరించి, రచించిన ఆత్మానుభూతి, భావ ప్రతిబింబాల సమాహారంగా, ఆంగ్లంలో 'ఇన్ సైడఋ రచనను అనేకభాషలలోకి ప్రచురణ జరగడం, తెలుగులో లోపలిమనిషి గా చాలా ప్రఖ్యాతమవడం ఆయన ప్రతిభాపాండిత్యాలకి ప్రత్యేక, ప్రత్యక్ష నిదర్శన తార్కాణాలు. తన సాహిత్యంలోను, తన రాజకీయపుటనుభావాలను సుస్పష్టంగా పేర్కొనడం కూడ మరో విశేషం.
అవసానదశ

పాములపర్తి నరసింహారావుగారు 23 డిసంబర్ 2004 లో డిల్లీలో పరమపదించారు. ఆ సందర్భంగా ఆయనకు జరిగిన పరాభవం, వచ్చిన విమర్శలు, మనిషి జీవించినంతకాలం ఎదురవ్వని సమస్యలు, మరణించాక అవతరిస్తాయి అన్నది మన నరసింహుడి విషయంలో జరగడం విచారం, దారుణం, అమానుషం. ఏ ప్రతిభావంతునికీ జరగకూడదని అందరం నేర్చుకున్న గుణపాఠం. మన తెలుగుబిడ్డ దేశానికి నాయకుడిగా చేసిన ఆయన ప్రతిభాపాండిత్యాలని మాత్రం మరువలేని, మరువరాని, సంగతని మనం మరువరాదు. ఆయన ఆత్మకు శాంతిని సమకూర్చడంలో ప్రతి ఆంధ్రుడూ తనవంతు నివాళిని సమర్పించడం మన కర్తవ్యం, విధి.

మన మహానుభావుడు, పి.వి.నరసింహారావుగారి 88వ జయంతి సందర్భంగా, తెలుగురధం శతసహస్ర ప్రణామాల్ని సమర్పిస్తోంది. మళ్ళీ తిరిగి హస్తినాపురి అధికార పీఠంపై మన తెలుగుతేజం ఎప్పుడు ఆసీనమవడం జరుగుతుందే అని సకల తెలుగుప్రజ ఎదురుచూస్తోంది అన్నదాంట్లో ఎటువంటీ సందేహం లేదు.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

Monday, June 23, 2008

ప్రపంచ సంగీతోత్సవం - విశ్వం సంగీత భరితం

ప్రపంచ సంగీత ఉత్సవం

విజ్ణాన వేదాంతాలకన్న సంగీతం ఒక మెట్టు ఎక్కువే అన్నాడు ప్రముఖ సంగీతకారుడు 'బేథోవెణ్.
విశ్వవ్యాప్తంగా మానవాళి ఉపయోగించే అద్భుతమైన భాష - సంగీతం. అని అంటాడు - లాంగ్ ఫెలో.
సంగీతనౄత్యకళలు నాగరికతకు ప్రతీకలు
భాషతోనే పుట్టాయి ఆటపాటలు. వాక్యం లయతాళబద్ధమైనప్పుడు పాటగా రూపొందుతుంది. భావం లయతాళాలకు అనుగుణమైన కదలికలను కరచరణాద్యవయవాల్లో కలిగించినప్పుడున్న నౄత్యం రూపొందుతుంది. మానవుని కళాత్మక చైతన్యానికి సంగీతనౄత్యాలు అందమైన ప్రతీకలు. సంగీతంలేని భాషలేదు. నౄత్యంలేని నాగరికత లేదు. లయాన్వితంగా వెలువడిన భాషకు శ్రవణతర్పణగుణం ఉంటుంది. చెవులకి ఇంపులేని భావానికీ, భాషకూ ఆకర్షణ లేదు. కనుకనే సంగీతాత్మకమైన భావమే కవిత్వమన్న భావానకు ప్రాచుర్యం లభించింది. కవిత్వాన్ని రాగమాధురిమలతో సుసంపన్నం చేసిన మహనీయుల జీవితాలు ధన్యమైనాయి.
సంగీతసాహిత్యాలు అవిభాజ్యాలు - సాక్ష్యం సరస్వతీదేవి.
సంగీతం ఓ అధ్బుతం - సౄష్టిలో దాని స్థానం అద్వితీయం. కనుకనే మనుషులేం ఖర్మ? దేవతలు సైతం సంగీతాన్ని వదలలేకపోతూంటారు. ఒక్కోసారి వేణువు, ఒక్కోసారి డమరుకం సాయంతో సంగీత సాధనం జరుగుతుంటుంది. బహుశ ఆ కారణంగానేమో - చదువలతల్లి సరస్వతీదేవికి కూడా ఓ చేతిలో పుస్తకం వుంటే,మరోచేతిని వీణ అలంకరించింది. జడత్వం నిండిన దీపం సయితం ప్రకాశపుంజంగా మారిపోగలగడమే సంగీతానికి అసలైన గీటురాయి.
పై మాటలు అన్నవి ఏ వాగ్గేయకారుడి భాష్యమో అవగతం అవటంలేదు. కాని, ఈ భావాన్ని వ్యక్తం చేసినది - భారత తొలి రాష్ట్రపతి - డా.బాబూ రాజేంద్రప్రసాద్, ప్రముఖ కళాభిమాని.
సంగీతం - మానవజీవితం
జీవితంలాగే సంగీతానికి గుర్తింపు వుంది కాని, ఆ కళను అర్ధంచేసుకుని, ఆకళింపుచేసుకుని, అనుభవిస్తూ, ఆచరించేవాళ్ళు చాలా తక్కువ అనే చెప్పాలి. అందుకే, సంగీతం లేకుండా జీవితం పెద్దఘోరం అంటాడు ప్రసిద్ధ జర్మన్ తత్వవేత్త ఫ్రెడ్రరిక్ నీట్జిషె. ఈ మధ్యకాలంలో పెరుగుతున్న అవగాహనను బట్టి, భౌతికంగా, మానసికంగా, సంగీతంవల్ల ప్రయోజనాలు మానవాళి ప్రయోజనాల్ని పొందడం తధ్యం అనే భావనకు రావడం జరుగుతున్న పరిణామం శుభదాయకం. రాగభావనతో చెప్పాలంటే, మానవజీవితంలో ఆద్యంతాలైన జననమరణాల్లో ఏడవడం, ఏడిపించడం రెండూకుడా సంగీతఛాయల్లో కనిపిస్తాయి.
సంగీతం - మానవీయత
'ఓ నాదమా, నీ ధ్వనిలోతుల్లో మా గుండెను పేరుస్తాం, ప్రాణాల్ని అర్పిస్తాం, చెవులతో చూడగలుగుతున్నాం. గుండెలతో వినగలుగుతున్నాం' అన్నాడు ఓ కవి. లలితకళల్లో ఘనమైన కళగా విరాజిల్లుతున్న సంగీతం - అణగారిన ప్రేమకర్చే కన్నీళ్ళకు మాతౄమూర్తిలా, కవులకు, వాగ్గేయకారులకు, శిల్పకళాకారులకు ప్రేరణామూర్తిలా, సౌందర్య భావనలో ప్రేమామౄతమూర్తిలా, ప్రాణాలను కోల్పోతున్న జీవిలకు శక్తిలా, సున్నిత దయాసాగరస్ఫూర్తిలా గోచరిస్తూంది.
సంగీతం - సరాగశైలి
భారతీయ హైందవ ధర్మ సంస్కౄతీకళాపరంపరలో ఒక అంతర్భాగంగా, భారతీయ మేధోన్మయమూర్తులకు ప్రత్యేకశైలిలో అవతరించినదన్నది సత్యం. ప్రత్యేక లక్షణ, లక్ష్యములవల్ల ప్రపంచ సంగీతకళకి సరిసములులేనిదిగా తలమానికంగా అలరిస్తోంది. దీనికి నిర్వచనోదాహరణంగా, 'రాగా పద్ధతిగా, స్వరరాగాలాపనలో విశిష్టప్రక్రియగా ప్రఖ్యాతమవుతూంది.
సప్తస్వర సమన్వయం
శిశుర్వేత్తి పశుర్వీత్తి వేత్తి గానరస: ఫణి: అన్నది ప్రాచీనసూక్తి. శిశువులు, పశువులు, పాములు సంగీతానికి ఆనందం పొందుతాయి అని అర్ధం. సోమదేవుని 'కధాసరిత్సాగరం'లో సంగీత ప్రస్తావన వుంది. భరతముని రచించిన - భావ-రాగ-తాళ సమన్వితమైన నాట్యశాస్త్రంలో కూడ అనేక సంగీతపరమైన ప్రస్తావనలు కానవస్తాయి. వాస్తవానికి బాష పుట్టుకకు ముందే సంగీతం జంతువుల అరుపుల అనుకఋరణం ద్వారా ఉద్భవించిందని కూడ మన ప్రాచీనులు వివరిస్తారు. భాషకు అతీతమైంది సంగీతం అయితే, శ్రావ్యత దాని పరమధర్మం. ఏ ప్రాణికైనా అది ఇంపుగా, వినసొంపుగా వుంటుంది. యింతటి నేపథ్యకధనంగల భారతీయ సంగీతం సప్తస్వరసహితమైంది.
స్వప్తస్వరాలను - 'స, రి, గ, మ, ప, ద, ని,' అన్నవి.
వీటికి సంకేతాలను కూడ నిర్ధారించారు. అవి - షడ్జ, రిషభ, గాంధార, మధ్యమ, పంచమ, దైవత, నిషాదాలకు సంకేతాలు.
స - నెమలి అరుపు నుంచి; రి - ఎద్దురంకె నుంచి, గ - మేక అరుపు నుంచి, మ - నక్క ఊళ నుంచి, ప - కోయిల కూజితం నుంచి, ద - గుర్రం సకిలింపు నుంచి, ని - ఏనుగు ఘీంకారం నుంచి - రూపొందించినట్లు మన శాస్త్రజ్ణులు, పండితులు భావన వ్యక్తపరచారు.
ఫలితంగా - మన సమజం లో ప్రముఖ జీవులైన - నెమలి, ఎద్దు, మేక, నక్క, కోయిల, గుర్రం, ఏనుగు వాటి సవ్వడులుంచి మనకు సంగీతం రాగా, అది సమాజానికి నేడు అజరామరమైన కళగా, దివ్యౌషధంగా అక్కరకు వస్తూంది. ఆ జీవరాసులు నేను సైతం అంటూ అగణిత సేవలను మానవాళికి అందిస్తున్నాయి. కాని వాటికి మనం చేస్తున్న సహాయం ఏమిటి ? సహాయం మాట ఎలా వున్నా, మనం హింసామార్గాలు అవలంబించి, వాటిని హతమార్చి, మన వినోదానికి, ఆహారానికి, లౌకికావసరాలకి వాడుకుంటున్న వైనం, తీరుతెన్నులు, మనం వేరే పాపం చేయడం ఎందుకు? ఎంతెంత పుణ్యం చేసుకున్నా, మనకు నరకం మాత్రం అనివార్యం. అంటే మనం సమాజంలో భాగంగా పశు, పక్ష్య, జంతు, వానర, క్రిమి, కీటక, స్థావర, జల, చరాది జీవరాశులపై కరుణాకటాక్షాలను రవంతైనా ప్రదర్శించవలసిన కనీస విధికర్తవ్యాలను మరవరాదు అన్నది గ్రహించాల్సిన తరుణం ఈ రోజు - ప్రపంచ సంగీత ఉత్సవం నాడు ప్రతిజ్ణ చేయాలి అని వేరే వక్కాణించవలసిన అవసరం లేదు. అందుకే సమజం - అంటే ఈ జీవరాశులుండే స్థలం. అది కానిది, అంటే మనుషులుండేది - సమాజం - సమజం కానిది.
ఈ సప్తస్వరాలకు 22 శౄతులు ఆధారం కాగా, వాటిని రకరకాలుగా కలిపితే రాగాలు ఉద్భవించాయి. వాటిలో ప్రముఖమైనవి 72 అని, వాటిని మేళకర్తరాగాలని నిర్ణయించారు మన పెద్దలు. వీటిని 'జనకారాగాలని, స్వల్పాతిస్వల్ప మార్పులతో మరెన్నో ఉపరాగాలను సౄష్టించారు. వాటిని 'జన్యారాగాలని నిర్ధారించారు.
వేదసంస్కౄతికన్నా ప్రాచీనం - సంగీతం.
భాష పుట్టుక కన్న ముందునుంచే సంగీతం వుందన్నాం కదా. యిలా నియమాలు ఏర్పాటు చేసినప్పటికీ, సంగీతం వేదసారస్వతం ముందు కాలానికే సంగీతం వికాసం చెందించి అని చెప్పాలి. వేదాలలో, సంగీతం గురించి, సంగీత వాద్యవిషేషాలను వర్ణిస్తూ ఎన్నో సూక్తులు, ప్రస్తావనలు దర్శనం అవుతాయి. సామవేదం - రాగాధారభూతమైన స్వరసంపన్నసమన్వయం అని చెప్పవచ్చు.
రాగాలు - పౄకౄతి ప్రసాదమైన ౠతువులు
సాంప్రదాయంగా వస్తున్న అభిప్రాయాన్ని చెప్పాలంటే - సంప్రదాయ సంగీతపు - ఆరు రాగాలు, ఆరు రుతువులకు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి అని చెప్పవచ్చంటారు మన ప్రాచీన విశ్లేషకులు. ఈ విషయాన్ని ప్రస్తావించిన విద్వాంసుల్లో - సోమేశ్వర చక్రవర్తి - చాళుక్య సామ్రాజ్యాధిపతి (1127-1137 క్రీ.శ.) - గాత్ర, వాద్య సంగీత విధానాలు తన 'మానసోల్లాసం' అనే గ్రంధంలో వివరించాడు. ఆయన, 'పండిత దామోదరం' రచించిన 'సంగీతదర్పణం' (16-17 శ.) లో వివరించాడని ప్రస్తావిస్తూ - రాగాల్ని, ౠతువుల్ని సమన్వయం చేయడం జరిగింది. వాటి తీరు యిలా వుంది.
భైరవి, మేఘ, పంచమ, నటనారాయణం, శ్రీ, వసంత రగాలను ఆరు ౠతువులకు అనుబంధంగా చెప్పబడ్డాయి. అయితే, ఈ ౠతువికి, యిదేరాగం అని బద్ధతతో చెప్పడం మాత్రం జరుగకపోవచ్చు. ౠతువులతో పాటు, ప్రత్యేక సమయాల్లో (రాత్రి, పగలు) కూడ రాగాల్ని అన్వయించుకోవడం భారతీయ సంప్రదాయ సంగీతం విశిష్టత అనె చెప్పాలి.
భావం - రస, రాగ, లయ సమన్వితం
'భావం' అనే పదం - భూ - భవ్ అనే ధాతువులకి మూలం. భావం ప్రకటన చేస్తేనే స్పష్టత గోచరమవుతుంది. సంగీత కౄతిలో - భావం, రస-రాగ-లయ సమనివమై, భాష స్వతంత్ర పరమైన కౄతికర్తశైలి, స్వరకర్త విధివిధానం కలసి వివిధ పాత్రలు వహించడం జరుగుతుంది. సంగీతకౄతిలో సాహిత్యం లేక మాటల సముదాయం చాలా ప్రధానపాత్ర పోషిస్తాయి. భావ ప్రకటనకి సంగీత స్వర సహిత నిర్మాణం చేదోడుగా నిలుస్తుంది. సంగీతకౄతిని అర్ధవంతంగా, సత్య, శివ, సుందర శైలిలో విడుదల చేయాలంటే - భావగర్భితంగా, సంగీత సభను అలరించేవిధంగాసంగీత విద్వాంసుడు తన కౄతిద్వారా భావ ప్రకటనని ప్రస్తుతించాలి. కళాకారుడు - తన అనుభవం, ఆలోచన, మానసిక పరిపక్వత దశలను కౄతికర్తనుంచి స్వరకర్త వరకూ, కళాకారుడినుంచి సంగీత శ్రోత, ప్రేక్షక, రసికులవరకూ - ప్రసరింపచేయగలిగితే, భావపరంగా న్యాయం జరిగినట్లే అని భావించాలి. వ్యక్తిగతంగా, ప్రతి వ్యక్తి అనుభావానుభూతి పొందగలిగితేనే, భావ ప్రకటన సమంజసంగా జరిగినట్లే అనుకోవాలి.
గమకం - సంగీతంలో కళ, శాస్త్రం
గమకం - 'గం - గఛ్ఛా నుంచి వచ్చింది. 'గమ-గమనా పదాలతో సంబంధమైంది. సంగీతపరంగా అన్వయించుకోవాలంటే, 'స్వరం' యొక్క ప్రస్థాన ప్రక్రియ - స్వస్థానం నుంచి అన్యక్షేత్రంలోకి గమనం. అభ్యాసంలో - స్వరప్రస్థాన ప్రకటనతో 'గమకం' పని పూర్తి కాదు. కొన్ని గమకాలని నిర్వహించడంలో,ప్రత్యేక శైలీవిధానంలో, ఖండికను ప్రస్తుతించే విధానాన్ని అమలు చేయడంద్వారా స్వరం ప్రాధాన్యత సంతరించుకుంటూంది.
సంగీతంలో తాళ ప్రధానం
ప్రత్యేక నాదశైలి, గణాంక స్వభావత, కలిపిన తాళ ప్రిక్రియ అంతర సమన్వయం, లక్షణలక్ష్యాలు, గణాంక నిబద్ధతతో కూడిన ఈ ప్రత్యేక 'తాళా విధానం - కర్ణాటక సంగీతానికి ప్రాణప్రదమైన ప్రక్రియగా అలరారుతోంది. సంప్రదాయ కర్ణాటక సంగీతంలో 'తాళా ప్రాధాన్య ప్రభావాలు ఖచ్చితమే కాకుండా, సుందరమైన అతివ్యాప్తి, అవ్యాప్తి దశలను సమంజసంగా అందజేస్తుంది. భారతీయ సంప్రదాయ సంగీతానికి ప్రతిభాపాటవాలను కలిగించిన సంగీత ప్రక్రియల్లో - తాళ ప్రాధాన్యత వేరేవాటితో పోల్చతగ్గదికాదు. శౄతి, లయ, తాళ దశ ప్రాణులు. సంగీతపర సాహిత్యంలో తాళ ప్రస్తావనలు, మార్గి, దేశి తాళ పద్ధతులు, లఘుదౄతం, అనుదౄతం, యిత్యాది విధాలుగా తాళం సంగీతంలో మిళితమై, సంగీత ప్రాభవానికి కౄషి సల్పుతోంది. ఆది, రూపక, మిశ్రచాపు, ఖండచాపు తాళాలు, కర్ణాటక సంగీతంలో ఎక్కువగా వినియోగింపబడిన తెగలు. అదే హిందూస్తానీ సంగీతంలో - చతురస్ర, లఘు, దౄతంతో, సామాన్యతాళం (తీన్ తాళ్) వినియోగింపబడినా, అధ్బుతమైన శైలికి దారితీస్తూంది. త్యాగరాజు, ఆయన కీర్తనలను అత్యధికంగా 'ఆదీతాళశైలిలోనే రచించడం జరిగిందని పండితులు చెబుతారు. పాశ్చాత్య సంగీత పద్ధతిలో 'సాధారణ సమయతాళం' వాడుకలో వుంటుంది అని చెబుతారు.
సంగీత పరిజ్ణానం కన్నా రసికత, కళాహౄదయం ప్రధానం
విశ్వసౌభ్రాతత్వం, వసుధైక కుటుంబం, మానవాళి మాధ్యమభాషగా అలరిస్తున్న సంగీతకళను ఆనందించి, ఆస్వాదించడానికి 'రసికతా, కళాహౄదయం' ప్రధానంగాని, విశిష్టజ్ణానం, అంతగా అవసరం లేదని అనుకోవచ్చు. నాదప్రధానమైన సరసస్వరసురఝరీగమనశైలిలో విరాజిల్లుతున్న సంగీతానికి ఎల్లలు, భాషా పరిధులు లేవు, రావు, రాకూడదు.
రాగాలకు లింగ నిర్ధారణ
సంగీతపరంగా సౄష్టించబడిన రాగాలకు ప్రాచీనకాలంనుంచే, లింగ నిర్ధారణ కూడ జరిగింది. మాతంగునిచే విభజింపబడిన ఈ పద్ధతి (500 క్రీ.పూ.)కి ముందే, శార్దూల, యస్తిక, దుర్గాశక్తి, కాశ్యపులచే స్త్రీ పురుష రాగాలుగా విభజన జరిగినా, సుస్ఫష్టంగా, పాల్కురికి సోమనాధుని (1300) బసవపురాణం ద్వారా సాహిత్యంలో ప్రస్తావన జరిగింది. అతనే, తిరిగి 'పండితారాధ్యచరితం' లో పునరుద్ఘాటించాడు. కాని, మూడవ లింగం (నపుంసక) లింగం ప్రస్తావించాడు. హిందూస్థానీ సంగీతంలో - 'రాగమాలా(1576), 'నర్తన నిర్ణయా (1605) రచ్కనల్లో, పుండరీక విఠ్ఠల ప్రస్తావించాడు. యిలా ప్రారంభమైన రాగ నిర్ధారణ ఎన్నో మలుపులు తిరిగాయని పండితుల అభిప్రాయం.
'రాగ-రాగిణీల జననసంయోగం
రాజస్థాన్ సామ్రాజ్యాధిపతి - ప్రతాపసింహుడు (1779-1804), సంగీత-నాట్యశాస్త్రాలపై 'రాధాగోవిందసారం' ఉద్గ్రంధ రచనను చేయగా, దానిలో రాగ-రాగిణి ల జననం, హనుమన్మత శివతాండవాన్ని దేవతలు-రాక్షసులు వీక్షించేందుకు సమావేశమవగా, రాక్షసులు యిబ్బందులు కలిగించగా, దేవతలను రక్షించే ప్రయత్నంలో, రాక్షసశిక్షకు ప్రతీకగా, శివుడు తన అఘోరవదనం నుంచి 'భైరవరాగం, మిగతా నాలుగు వదనాలనుంచి - మాలకౌన్స్, హిందోళ, దీపక, శ్రీ, మేఘ రాగాలను జననం చేయించాడు. ఈ రాగాల్లాపన విని, రాక్షసులు భయకంపితులై వెళ్ళిపోగా, దేవతలు సంతౄప్తిచెందారు. అయితే, ఈ ఆరురాగాలు, శివుని ప్రార్ధించగా, పార్వతి సలహే మేరకు వరాలు ప్రసాదించిన భాగంగా, ఒక్కొక్క రాగానికి అయిదుగురు సహరచులని (రాగిణిలను) సౄష్టించి, ఈ రాగాలను గానంచేసినవారి ప్రతీకోరిక నెరవేరుతుందని అభయం వెలిబుచ్చాడని కధనం. వీరికి సంతానం పుట్టి ఆరు కుటుంబాలయ్యాయట. ఆరుగురు పురుష రాగాలకు, ఒక్కొక్క రాగానికి 5 స్త్రీరాగాలు, వీరికి 47 మంది సంతానం కలిగిందని కూడ కధనాలు దర్శనం యిస్తాయి.
వెంకటమఖి విభజన
యిలా సౄష్టింపబడిన రాగాలు, ఎన్నో సవరింపులతో, ఎందరో విద్వాంసులు చేసిన వేర్వేరు విభజనలు, చారిత్రాత్మకంగా పరిణామం చెంది, సంగీతశాస్త్రాన్వయంచెంది, అభ్యాస, శిక్షణాప్రక్రియల్లోకి, 17 శ. నాటి వెంకటమఖి ప్రతిభాప్రేరణలతో, 20 శ. నుంచి, ఒకకొత్త పధాన్ని తొక్కింది. ఫలితంగా, 72 మేళకర్తరాగ సంప్రదాయానికి నాందీ పలికింది. రాగవిభజన ప్రక్రియ కర్ణాటకలో ఉద్భవించి, పెరిగి, హిందూస్థానీ సంగీత పద్ధతిలో కూడ విస్తరించింది. కర్ణాటక సంగీతం, కన్నడిగల నుంచి రాగ విభజన, హిందూస్థానీ సంగీత విద్వాంసులు ప్రేరణ పొందారు. 20 శ. 'మేళా సంప్రదాయం పాటించి జనక-జన్యరాగాలపై దౄష్టిసారించడం జరిగింది. అహోబలాది సంగీతవిద్వాంసులు విరివిగా హిందూస్థానీపర రాగవిభజనను ఆచరించి, ఆదరించడం జరిగింది. చివరగా 1660 లో 'చతుర్దండిప్రకాశికా - తంజావూర్ లో ఉద్భవించింది. ఈ రచన, కర్ణాటక సంగీతం - ఆధునిక పోకడలను పోహళించుకుని - సంగీత పితామహుడు, మార్గదర్శకుడు - వెంకటమఖి రచనని చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ నుంచి, పండితుడు సుబ్రహ్మణ్యశాస్త్రిగారు అన్నవారు 1934 లో ప్రచురించిన వైనం సంగీతజగతి చేసుకున్న పుణ్యపరంపరలో భాగం. ఈ గ్రంధంలో, స్వరాలు (శుద్ధ, వికౄత), వాటికి లక్ష్యలక్షణాలని వివరిస్తూ, నిర్వచనోదాహరణాలను ప్రస్తుతించారు.
సంగీతం - నాదవివరణం
సంగీతం ద్వారా వచ్చే 'నాదా ధోరణులకు కూడ విభజన చేయడం జరిగింది. శరీరజ (శరీరం ద్వారా వచ్చే ధ్వని - గాత్రం), నఖజ (గోళ్ళద్వారా - వీణ, గొట్టువాద్యం, బిన్, సుర్ బహార్), ధ్వనిజ (వంగిన పరికరాలు - సారంగి, దిల్ రుబ, వైలన్), వాయుజ (గాలిమాధ్యమాలు - వేణువు, నాగస్వరం), చర్మజ (తోలుతొడిగినవి - మౄదంగం, తవిల్, తబల, డోలక్, తంబట్ట), లోహజం - లోహాలతో చేసినవి - సింబల్, తాళం). ధ్వని స్వఛ్ఛత, ప్రధానంగా విభజింపబడిన తరగతులు అని భావించాలి. దీనినే, తట, బితట, సుశిర, అనబధ్వ,ఘన సంగీత వాద్య పరికరాలుగా కూడ విభజించారు.
కాలసమయ సందర్భస్ఫూర్తి - రాగనిర్ణయం
రాగాల్లోని అంతర్లీన లక్షణాలనిబట్టి - ప్రకౄతి వాతావరణ, సమయాలకు అనువైన రాగాలను ప్రతిపాదించారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్ర సమయాల్లో ప్రదర్శీచతగిన రాగాలను వివరించడం, వాటిని శాస్త్రీయంగా ఆచరించడం కూడ జరుగుతోంది. (ఉదాహరణకి : ఉదయం (భైరవి), మధ్యాహ్నం (సారంగి), సాయంత్రం (కళ్యాణి).
శౄతిలయలు - సంగీతం
ఆధ్యాత్మక, ధ్యానసంగీతానికి సంగీతం సన్నిహితం అన్నది సత్యం. సంగీతంలో శౄతి, ముఖ్యమైన అంశం. సంస్కౄతంలో సూక్తి ప్రకారం - 'శౄతిర్మాత: లయ: పిత:" - శౄతి తల్లి, లయ తండ్రి. సంగీతం - గాత్రంలేక వాద్యం - శౄతిసహిత ప్రదర్శన అయితేనే - మాతౄ సాదౄశకమవుతుంది. అదిలేనిదే, కేవలం గీతం కాని, సంగీతం అనిపించుకోదు.
దక్షిణ, ఉత్తర భారత సంగీత ప్రాంతాల వారధి - వింధ్య కొండలు
రాగ-రాగిణిల పున: సమన్వయం చేసి, గత ఐదు శతాబ్దాలుగా అనుసరింపబడుతున్న విధానానికి కొత్తరూపు, ఊపు నిచ్చిన సంగీత మహావిద్వాంసుడు - తాన్సేన్. ఫలితంగా, ఉత్తరభారత సంగీతం - వింధ్యాగిరుల ఆవలి సంగీతధోరణి అన్నది అవతరణకు వచ్చింది. వింధ్య పర్వతాలు భౌగౌళికంగా లేకపోతే - 'భారతీయ సంగీత సంప్రదాయ శైలీ అన్నది వేరే పద్ధతిలో ఉండేది అన్నది మరువరాని మాట.
సంగీతం - తాన్ సేన్ అవిభాజ్యాలు
'తాన్ సేణ్ అంటే సంగీత స్వరాలు ప్రవహించే సైన్యం' అనే అర్ధం వస్తుంది. హిందు-ముస్లిం సంస్కౄతుల ఐక్యతాభావాన్ని ప్రతిబింబించేశైలి. 'రాం తాణ్ - హిందూ బ్రాహ్మణుడు ముకుంద్ పాండే కుమారుడు. ముస్లిం ముని - ముహమ్మద్ గౌస్, 'రాం తాణ్ లో బాలకళాకారుణ్ణి కనుగొన్నాడు. తాన్ సేన్ ముస్లింపేరు - మహామ్మద్ ఖాన్. ఆన్ సేన్ 1506-1589 మధ్యకాలంలో జీవించిన అసమాన ప్రతిభాశాలి. క్రమంగా ఆయన ప్రతిభకు గుర్తింపుగా - నవరత్న ఆస్థాన సంగీత విద్వాంసుల్లో - ఒకరిగా అక్బర్ పాదుషా ఆగ్రా రాజాస్థానంలో కొలువు సంపాదించడం జరిగింది. హరిదాసముని - తాన్ సేన్ లోని రహస్యాఅలను కనుగొని, బౄందావనంలో పదేళ్ళుగా అభ్యాసం పొంది, గ్వాలియర్ మహారాణి ఆస్థానంలో చేరాడు. హిందూకన్య - ముస్లింపేరు 'హుస్సేనీ'ని వివాహమాడగా, నలుగురు కుమారులు సంగీతకళాకారులుగా, కూతురు సరస్వతి, విణావిద్వాంసురాలుగా పేరుపొందడం వెనుక దాగిన కౄషి, సంకల్పం, దీక్ష, పట్టుదల, వర్ణనాతీతం.
వింధ్యకు ఆవలి సంగీతధోరణులు
వింధ్యపర్వతాలకు ఆవలిపక్కన, అనేక రూపాల సంగీత ప్రక్రియలు అలరించబడ్డాయి. అందులో 'ద్రుపడ్ గాత్ర సంగీతం దీర్ఘస్వరసహితం, బౄందావన - బ్రజ్ భాష (వ్రజ - గోపగోపికల భాష) సంబంధితం. బ్రిటిష్ దొరల పరిపాలనలో - కొత్త తరహా సంగీత ప్రక్రియలు పుట్టుకొచ్చాయి. వాటిల్లో - ఖయాల్ ప్రక్రియ్ను శ్రీ పన్నాలాల్ ఘోష్ అన్వేషణలో ప్రఖ్యాతమయ్యింది. తుమ్రి - ప్రక్రియ కరుణ, శౄంగార రస ప్రాధాన్యతతో, 18-19 శ. లో భాగా ప్రచారమయ్యింది. యింక రవీంద్రసంగీతం సంగతి వేరే చెప్పనక్కరలేదు. నాటికీ, నేటికీ, బహుఋళ ప్రచారమార్గంలో పయనిస్తూనేవుంది. రవీంద్రసంగీతానికి మన మహానుభావుడు - మంగళంపల్లి బాలమురళికౄష్ణ - తనదైన ప్రతిభతో - ఒక కుదుపు కుదిపాడు అన్నది చరిత్ర చెప్పిన సాక్ష్యం. అమీర్ ఖుస్రో - ప్రముఖ సంగీత కళాకారుడి నూతన సౄష్టి - ఖవాలి - హిందువులు, ముస్లిములు సంయుక్తంగా గానం చేయబడుతున్న ప్రక్రియగా మారింది. అలాగే, ఘజల్ (ఆలాపనలేని, పర్షియన్ సంప్రదాయ కౄతి), ధున్ (స్వఛ్ఛంద రాగనిర్ణయంతో జానపద గుబాళింపు), గత్ (ఆలాపనకు ముందుగా) - పేరువహించాయి.
భాష, సరిహద్దులు లేనిదే సంగీతకళ
నిజమైన సంగీతకళాకారుడు - ప్రపంచం - చిన్న గ్రామమైపోతున్న సమయాన, గ్రామం కాదు - నిజంగా వసుధైవకుటుంబంగా మారిపోతున్నకాలంలో ఏ సంగీత ప్రక్రియనైనా, విశ్వవ్యాప్తం చేస్తూ అనుబంధం పెంచుకోవాల్సిన తరుణంలో, విభజనధోరణి పాటించరానిది అన్నది ఆలోచనాత్మకం. సంగీతం ద్వారా దక్షిణం, ఉత్తరం - ఏదైనాసరే, అందుకునే మధురానుభూతివల్ల రక్తాన్ని తాకుతూ, హౄదయాంతరాళ్ళోకి సూటిగా ప్రవేశింపచేయగలగాలి. మేధస్సుని ప్రశాంతంగా మలచుకోగలిగిన దివ్యౌషధంగా సంగీతం అన్నది మాత్రం సత్యం. ఆవేదన, ఆందోళనలను సుదూరం చేసి, మనసావాచాకర్మణా సిద్ధత్వం, శుద్ధతని ప్రసాదించాలి. జీవితాన్ని అందంగాను, ఆనందంగాను మార్చాలి.
సంగీత స్వర కుటుంబీకరణం
సారంగదేవుని 'సంగీతరత్నాకరం' (13 శ.), నారదశిక్షలో సప్తస్వరాలకు వేరుగా కుటుంబం, రంగు, కులం, స్వరసంకేతం, ప్రేరణాశక్తులు, ప్రకౄతిసిద్ధరూపాలకింద విభజన జరిగింది. భారతీయ సంగీతశాస్త్ర పద్ధతుల్ని - శౄతి, స్వర, తాళ, గమకాది విషయాల్లో వివరించడం జరిగింది.
మారుతున్న విలువలు, ధోరణుల మధ్య సంగీతం
'భాషా విభజనకు దారితీస్తే, 'సంగీతం' కలుపుతోంది అన్నది సత్యం. నాగరికతకు ఏకైన శక్తి, సంగీతమే భాషగా మారింది. దైవత్వాన్ని పొందింది. విశ్వవ్యాప్తమైంది. అన్నిరకాల అవరోధాల్ని, పరిధుల్ని త్రోసిరాజంది. లలితకళల్లో - ఘనమైనది, అజరామరమైనది, సంగీతకళ ప్రధమస్థానం అందుకుంది. భారతీయతలో సంగీతం విలీనమైంది. ఉత్సవాలు, ఆరాధనోత్సవాలు జరుపుకుంటున్న పర్వకాలంలో ఉన్నాం ప్రస్తుతం. నాట్యాది కళలకు సంగీతం ప్రాణప్రదమైంది. ఉత్సవాల్లో భాగంగా - తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ దక్షిణప్రాంతాలతోపాటు, ఢిల్లీలోని ఖాజీనయీముద్దీన్-అర్స్, మరియు శ్రద్ధాంజలిలో భాగంగా, తులసీదాస్, కబీర్, తూకారాం, భక్తరామదాస్, పురందరదాసు, సూరదాస్, మీరా, అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న - తాన్ సేన్, త్యాగరాజ ఆరాధనోత్సవాలు కళాత్మకంగా జరుగుతూనేవున్నాయి. బహుళప్రజాదరణ పొందుతూనేవున్నాయి. ఆంధ్రదేశానికి వరప్రసాదం - సంగీత త్రిమూర్తులు - త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి మహానుభావులు స్వతహగా ఆంధ్రులు కావడం, యాదౄఛ్ఛికంగా ఆనాడు పరిస్థితులవల్ల దక్షిణాంధ్రప్రాంతానికి వలసవెళ్ళడం జరగడం కేవలం ఒక సంఘటనగానే పేర్కొనాలి. ప్రముఖాంధ్రులు, సంగీతకళాకారులు - ఈనాటి మంగళంపల్లి బాలమురళీకౄష్ణ,నేదునూరి కౄష్ణమూర్తి, ఈ పరంపరలోనే తమదైన ప్రతిభను అందిస్తూనే వున్నారు. అలరిస్తూనే వున్నారు.
ప్రముఖ సంగీత వాగ్గేయకారులు
రచనలను స్వయంగా నిర్మాణం చేసుకుని, వాటిని తనదైన ప్రతిభతో స్వరరాగబద్ధం చేసుకుని, గానం చేయగలిగిన త్రివేణీసంగమైన ప్రతిభను పుణికిపుచ్చుకున్న పుంభావసరస్వతీమూర్తులను వాగ్గేయకారులు అని భావించుకోవాలి. అట్టికోవలో, మనకు ఉన్న సంపన్నమూర్తులు - జయదేవుడు, పురందరదాసు, సూరదాసు, తులసీదాసు, అన్నమయ్య, పెదతిరుమలాచార్యులు, నారాయణతీర్ధులు, క్షేత్రయ్య, రామదాసు, సారంగపాణి, పోతులూరి వీరబ్రహ్మం, మునిపల్లె సుబ్రహ్మణ్యకవి, శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, సుబ్బరాయశాస్త్రి, స్వాతితిరుణాల్, మైసూర్ వాసుదేవాచార్య పరంపరను ముందుకు కొనసాగిస్తున్న మంగళంపల్లి బాలమురళీకౄష్ణని ప్రముఖ వాగ్గేయకారుల్లో చెప్పుకోవాలి. ప్రపంచ సాహిత్యాలన్నిటా పద, పద్యకవితల్లో పదమే ప్రారంభం అన్న విషయం పండితలోకానికి విదితం. సంకీర్తన పద్ధతిని కౄష్ణమాచార్యుని 'సింహగిరీ వచనాలతో ప్రారంభమైనా, అన్నమాచార్య సంకీర్తనలతోనే పదరచన సమున్నతస్థాయికి వచ్చింది.
నేటి భారతీయ సంగీతం లో వివిధ ప్రక్రియలు
కర్ణాటక, హిందూస్థానీ సంగీతాలు స్థూల విభజన అయితే, భక్తి, కాలక్షేపం, నాట్యం, జానపదం, జాతీయత, దేశభక్తి సంగీతపద్ధతులు ప్రస్తుతకాలంలో అలరింపులుగా ఉన్నాయి.
కర్ణాటకసంగీతంలో - కచేరీ సంప్రదాయాన్ని అనుసరించే పద్ధతితోపాటు, గీతం, స్వరజతి, జతిస్వరం, వర్ణం, కీర్తన, కౄతి, రాగమాలిక, తాళమాలిక, పదం, జావళీ, తిల్లానా లను ప్రముఖంగా ప్రస్తావించాలి. ఆఖరుగా ప్రస్తావిస్తున్నా, ప్రముఖ శాఖలుగా విరాజిల్లుతున్న - లలితసంగీతం, జానపదసంగీతం, చిత్రసీమకు ఆయువుపట్టైన చిత్రసంగీతం శాఖల్ని కూడ మరువరాని మెరుపులు, సంగీతకళకు ముఖ్య ప్రస్థానాలు.
సంగీతం గురించి .. ఎందరోమహానుభావుల పలవరింతలు.
సంగీతం గురించి ఎందరో మహానుభావులు నిర్వచించారు, నిర్ధారించారు. వర్ణించారు. అనుభూతిని ప్రకటించారు. సూక్తులను వల్లెవేశారు. దాని సారాంశం యిలా చెప్పుకోవచ్చు.
నానాటికి ఆత్మకి పట్టే మలినాలని దూరం చేయగలిగేది - ఈ సౄష్టిలో ఒక్క సంగీతమే - ఎవర్టెక్.
ఎంతటి కోలాహలంలోనైనా సంగీతాన్ని వినగలిగే మనుషులు జీవితంలో గొప్పగొప్ప ఫలితాలని సాధించినట్లే. - డా. విక్రం సారాభాయి.
తన సంగీత మధురిమలులేని మనిషి, మధురమంజుల సంగీత సుస్వరాలకి స్పందించని మనిషి, సౄష్టిలోని సున్నితమైన అధ్బుతాలని అందుకోలేడు. - షేక్స్ పియర్.
పగిలిముక్కలై చెదరిపోయే హౄదయానికి దివ్యమైన ఔషధం - సంగీతం. - యం. హంట్.
సంగీతాన్ని దేవతల భాషగా అభివర్ణించడం సబబే. - కార్లైల్.
మనం పాడకపోతే హృౠదయం బీటలు వారుతుంది. - ఠాగూర్.
ప్రపంచవ్యాప్తంగా సంగీతోత్సవం - 1 అక్టోబర్.
ప్రపంచంలోని వివిధవర్గ, జాతులమధ్య సఖ్యతకోసం, సంస్కౄతులమధ్య సమన్వయం, ఆదాన ప్రదానాలకోసం అంతర్జాతీయ సంగీతోత్సవాల్ని జరుపుకునే సత్సంప్రదాయంలో భాగంగా, 1971 అక్టోబర్ 1975 నుంచి ప్రారంభం అయ్యాయి. ప్రముఖ సంగీతకళాకారుడు యెహందిమెనుహిన్ చేతులమీదుగా ప్రారంభమైన ఈ శుభదినోత్సవాలు ప్రతీఏట జరుగుతూనే ఉన్నాయి. విశ్వమానవాళికి సంగీతనాదాలు వినిపిస్తూనేవున్నాయి. తారకమంత్రంలా దివ్యశక్తిని అందిస్తూనే వున్నాయి.
కొసమెరుపు
హౄదయసంగీతాన్ని ఎప్పుడూ కాగితం మేద పెట్టలేం. - పాబ్లో కాసల్క్స్.
సంగీతం పలకలేని ప్రేమభావన ఏమున్నది ? - జాన్ డ్రైడన్.
ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా సంగీత కళాకారులందరికీ అభినందనలని తెలుపుకుంటూ -
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

Thursday, June 19, 2008

తెలుగు భాష ఉద్యమ గీతం
- యలవర్తి రమణయ్య, యస్. రామేశ్వరరాజు.

కమ్మనైన తెలుగుభాష కలనైనా మానొద్దు
అమ్మపాల కమ్మదనం, మాతౄభాష మరవొద్దు
తెలుగుదనం మనకు ధనం తెలుగుభాష చరిత ఘనం
మనసులు కలవోసి మనకుమమత లొసగు సాధనం కమ్మనైన

నన్నయ ఇలవెలయించిన ఆంధ్రకావ్య పూదోట
అన్నమయ్య త్యాగయ్యలు సుధలొలికిన తెలుగుపాట
ఆంధ్రత్వం ఆంధ్రభాష ఎన్నో నోముల ఫలము
అది మరచిన ఆంధ్రుల గతి అంధకారబంధురం కమ్మనైన

ఆంగ్లభాష వ్యామోహం అంధ్రానికి ఒక శాపం
కాకూడదు కాకూడదు తెలుగు తల్లికది శోకం
మాతౄభాష ప్రేమించు, పరభాషల గౌరవించు
తెలుగు బువ్వ తిన్నందుకు తెలుగోడిగ జీవించు కమ్మనైన

మమ్మీడాడీలు వద్దు - అమ్మానాన్నలె ముద్దు
అచ్చమైన తెలుగు వీడి - ఆంగ్లబాట నడవద్దు
అవసరమున్నంత వరకె - ఆంగ్లాన్ని నేర్పండి
అనవసరపు ఆర్భాటం - ఆత్మ వంచనేనండి కమ్మనైన

తరతరాల సంస్కౄతిలో తలదించని ఖ్యాతి మనది
నరనరాల మాతౄప్రేమ ప్రవహించే జాతి మనది
ఆ సంస్కౄతి కాపాడుట అందరి బాధ్యత నేడు
తెలుగుభాష వికాసమున కుద్యమించి పోట్లాడు కమ్మనైన

నడుస్తున్న చరిత్ర - తెలుగు జాతి పత్రిక (మాసపత్రిక), విజయవాడ, సౌజన్యంతో.
మన సంస్కౄతీక్షరాలు

తెలివితేటలున్నా మనం తెల్లవారనిస్తున్నాం
మన మేధస్సుల్ని మనమే ఎగుమతి చేసుకుంటున్నాం
మన పంటసిరులుకి మనమే తెగుళ్ళని అందిస్తున్నాం
తెలుగురైతులాగ తెలుగు సంస్కౄతీవైభవాలకు కూడ
కరువు, కాటక, వరద, భీభత్సాలను సౄష్టిస్తున్నాం
మన సంస్కౄతీసంస్కారాలకు దహనసంస్కారం కావిస్తున్నాం
మన జీవితకవితలను నిషిద్ధచందోరహితం చేస్తున్నాం
కుంటిసాకుల్ని, కుహనానడతల్ని మననం కావించుకుంటున్నాం
హావభావాల్ని హాహాకారాల్తో నిశ్శబ్దతరంగాల్ని రువ్వుతున్నాం
విచక్షణలేని వివాదాల్లోకి వికటంగా విహారం చేస్తున్నాం
మన భాషకు మనమే వక్రభాష్యాన్ని రచిస్తున్నాం
మన అక్షరాలకు మనమే క్షరత్వాన్ని ప్రసాదిస్తునాం.

కొంపెల్ల శర్మ - తెలుగురధం.

మన తెలుగు వెలుగులు

మన తెలుగు వెలుగులు

తెలుగదేల యన్న దేశంబు తెలుగేనుతెలుగువల్లభూండ తెలుగొకండయెల్ల నౄపులు గొలువ నెఋరుగవే బాసాడిదేశభాషలందు తెలుగు లెస్స!
- శ్రీ కౄష్ణదేవరాయలు - సామ్రాజ్య చక్రవర్తి.
జనని సంస్కౄతంబు సకల భాషలకునుదేశభాషలందు తెలుగు లెస్సజగతి తల్లికంటె సౌభాగ్యసంపదమెచ్చుటాడుబిడ్డ మేలు గాదె?
- శ్రీనాధ మహాకవి - సాహిత్య చక్రవర్తి.
ననుగన్న తల్లి! నా భాగ్యమా!
నన్నుగన్న తల్లి! నా భాగ్యమా!నారాయణి! ధర్మాంబికే!
నన్నుగన్న తల్లి! నా భాగ్యమా!నారాయణి! ధర్మాంబికే!
కనకాంగి! రమాపతి సోదరి!కానవే నను, కాత్యాయని!
నన్నుగన్న తల్లి! నా భాగ్యమా!నారాయణి! ధర్మాంబికే!
కావు కావుమని నే మొరబెట్టగాకమలలోచన! కరగుచుండగా,నీవు బ్రోవకున్న నెవరు బ్రోతురు? స -దా వరంబొసగు త్యాగరాజనుతే
నన్నుగన్న తల్లి! నా భాగ్యమా! -నారాయణి! ధర్మాంబికే!
- త్యాగరాజకీర్తన (కేశరి రాగం - దేశాది తాళం)
తేనెకన్న మధురం రా, తెలుగు ఆతెలుగుదనం మా కంటి వెలుగు
తెలుగుగడ్డ పోతుగడ్డ ఎంత పచ్చన, మా తెలుగు గుండెలో స్నేహము ఎంత వెచ్చన!మన పొలాల శాంతిపులుగు ఎంత తెల్లన, మన
తరతరాల కధను పాడు గుండె ఝల్లనపాటుపడిన వాళ్ళకే లోటు లేదనిచాటి చెప్పు తల్లికదా తెలుగుతల్లిలలితకళలు సంగీతం సాహిత్యంతెలుగుతల్లి జీవితాన దినకౄత్యాలు
గత చరిత్ర ఘన చరిత్ర ఎంత ఖ్యాతి!గర్వించదగ్గ జాతి తెలుగుజాతి!అయినా గతంకన్న భవిష్యత్తు ఆశాజనకంఆ భావికొరకు ధరించాలి దీక్షాతిలకం.
- ఆరుద్ర.
ఉగ్గుపాలనుండి ఉయ్యాలలోననుండిఅమ్మ పాట పాడినట్టి భాషతేనెవంటి మందు వీనులకును విందుదేశభాషలందు తెలుగులెస్స!
సంస్కౄతంబులోని చక్కెర పాకంబుఅరవభాషలోని అమౄతరాశికన్నడంబులోని కస్తూరి వాసనకలిసిపోయె తేట తెలుగునందు
వేనవేల కవుల వెలుగులో రూపొందిదేశదేశములను వాసిగాంచివేయి యేండ్లనుండి విలసిల్లు నా 'భాషాదేశ భాషలందు తెలుగు లెస్స!
- మిరియాల రామకౄష్ణ.
కవులకంటె తుహిన కర్పూర నిభకీర్తితెచ్చి రెవరు నీకు తెలుగుతల్లి!సాహితీ తరంగ సంగీత రసధునిదేశభాషలందు తెలుగు లెస్స!
తరపి వెన్నెల ఆణి ముత్యాల సొబగుపునుగు జివ్వాజి ఆమని పూలవలపుమురళి రవళులు కస్తూరి పరిమళములుకలసి యేర్పడె సుమ్ము మా తెలుగుబాస.
- నండూరి రామకౄష్ణమాచార్య.
తీరి బంగారు పండెడు తెలుగు నేలతేట నీటితో ప్రవహించు తెలుగు నదులుతెలుగు వాసిని ప్రకటించు తెలుగు గిరులుతలచుకొన్నంత నా మేను పులకరించు.
- వేదుల సత్యనారాయణ శాస్త్రి.
'మళ్ళీ నరజన్మ ఎందుకంటేమనుషులంటే యిష్టం నాకుదేవుడి కంటే మనుషులు యిష్టందేశం యిష్టం, తెలుగు యిష్టం.
- కుందుర్తి.
పదవోయి తెలుగువాడాఅదే నీ తెలుగు మేడాసంకెళ్ళు లేని నేలసంతోష చంద్రశాల.
-శ్రీశ్రీ
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ!

Wednesday, June 18, 2008

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు - తెలుగు

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు - తెలుగు
1. 1955 సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర (సాంఘిక చరిత్ర)
2. 1956 బులుసు వెంకటృఏశ్వర్లు భారతీయ తత్త్వ శాస్త్రం (డా. సర్వేపల్లి వారి తత్త్వం)
3. 1957 చరియంతనంద స్వామి శ్రీ రామకౄష్ణుని జీవిత చరిత్ర (జీవితచరిత్ర)
4. 1960 పోణంగి శ్రీరామ అప్పారావు నాట్యశాస్త్రం (భరతుని నాట్యశాస్త్రం చరిత్ర)
5. 1961 బాలాంత్రపు రజానీకాంతరావు ఆంధ్ర వాగ్గేయకార చరిత్రం (తెలుగు వాగ్గేయకారుల చరిత్ర)
6. 1962 విశ్వనాధ సత్యనారాయణ విశ్వనాధ మధ్యాక్కరలు (కవిత్వం)
7. 1963 త్రిపురనేని గోపీచంద్ పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా (నవల)
8. 1964 గుర్రం ఝాషువా క్రీస్తు చరిత (కవిత్వం)
9. 1965 ఆచార్య రాయప్రోలు సుబ్బారావు మిశ్రమంజరి (కవిత్వం)
10. 1969 తుమ్మల సీతారామ మూర్తి మహాత్మ కథ (కవిత్వం)
11. 1970 దేవరకొండ బాలగంగాధరతిలక్ అమౄతం కురిసిన రాత్రి (కవిత్వం)
12. 1971 తాపీ ధర్మారావు విజయవిలాసం : హౄదయోల్లాస వ్యాఖ్య (విమర్శ)
13. 1972 శ్రీ శ్రీ శ్రీ శ్రీ సాహిత్యం (కవిత్వం)
14. 1973 సి. నారాయణ రెడ్డి మంటలూ - మానవుడూ (కవిత్వం)
15 . 1974 దాశరధి తిమిరంతో సమరం (కవిత్వం)
16. 1975 బోయి భీమన్న గుడిసెలు కాలిపోతున్నాయి
17. 1977 కుందుర్తి ఆంజనేయులు కుందుర్తి కౄతులు (కవిత్వం)
18. 1978 దేవులపల్లి కౄష్ణశాస్త్రి కౄష్ణశాస్త్రి సంకలనాలు (6 సంపుటాలు)
19. 1979 పుట్టపర్తి నారాయణాచార్యులు జనప్రియ రామాయణం (కవిత్వం)
20. 1981 నార్ల వెంకటేశ్వర రావు సీతజ్యోస్యం (నాటకం)
21. 1982 ఇల్లిందల సరస్వతీదేవి స్వర్ణ కమలాలు (కథలు)
22. 1983 రావూరి భరద్వాజ జీవన సమరం (జీవన చిత్రాలు)
23. 1984 ఆలూరి బైరాగి ఆగమగీతి (కవిత్వం)
24. 1985 పాలగుమ్మి పద్మరాజు గాలివాన (కథలు)
25. 1986 జి. వి. సుబ్రహ్మణ్యం ఆంధ్ర సాహిత్య విమర్శ - ఆంగ్ల ప్రభావం
26. 1987 ఆరుద్ర గురజాడ గురుపీఠం (వ్యాసాలు)
27. 1988 రాచమల్లు రామచంద్రారెడ్డి అనువాద సమస్యలు (విమర్శ)
28. 1989 యస్. వి. జోగారావు మణిప్రవాళం (వ్యాసాలు)
29. 1990 కె. శివారెడ్డి మోహనా ఓ మోహనా (కవిత్వం)
30. 1991 భమిడిపాటి రామగోపాలం యిట్లు మీ విధేయుడు (కథలు)
31. 1992 మాలతీ చందూర్ హౄదయనేత్రి (నవల)
32. 1993 మధురాంతకం రాజారాం మధురాంతకం రాజారాం కథలు (కథలు)
33. 1994 గుంటూరి శేషేంద్ర శర్మ కాలరేఖ (విమర్శ)
34. 1995 కాళీపట్నం రామారావు యజ్ౙం తో తొమ్మిది (కథలు)
35. 1996 కేతు విశ్వనాథరెడ్డి కేతు విశ్వనాథరెడ్డి కథలు (కథలు)
36. 1997 అజంతా (పి. వి. శాస్త్రి) స్వప్నలిపి (కవిత్వం)
37. 1998 బలివాడ కాంతారావు బలివాడ కాంతారావు కథలు (కథలు)
38. 1999 వల్లంపాటి వెంకట సుబ్బయ్య కథాశిల్పం (వ్యాసాలు)
39. 2000 యన్. గోపి కాలాన్ని నిద్రపోనివ్వను (కవిత్వం)
40. 2001 తిరుమల రామచంద్ర హంపీ నుంచి హరప్పా దాకా (స్వీయచరిత్ర)
41. 2002 చేకూరి రామారావు స్మౄతి కింకాణం (వ్యాసాలు)
42. 2003 ఉత్పల సత్యనారాయణాచార్యులు శ్రీ కౄష్ణ చంద్రోదయం (కవిత్వం)
43. 2004 డి. నవీన్ కాలరేఖలు (నవల)
44. 2005 అబ్బురి ఛాయాదేవి తన మార్గం (కథలు)


Tuesday, June 17, 2008

చిలకమర్తి లక్ష్మీనరసింహం ( 1867 - 1946 ) వర్ధంతి 17 జూన్

చిలకమర్తి లక్ష్మీనరసింహం ( 1867 - 1946 ) వర్ధంతి 17 జూన్
చిలకమర్తివారి ప్రతిభాపర్వం
తన ప్రజ్ణాచక్షువులతో లోకాన్ని సందర్శించి పండిత పామరులకు అందుబాటులో ఉండే శైలిలో రచనలు సాగించి తెలుగు పఠితలోకానికి వినోదాన్నీ ప్రసాదించిన మహనీయుడు. ఆయన చారిత్రక, సాంఘిక పౌరాణిక నవలలు, జీవిత చరిత్రలు, స్వతంత్ర, అనువాద నాటకాలు, స్వీయచరిత్ర, ఆశుపద్యాలు, తెలుగువాళ్ళకు ఆవశ్యపఠనీయాలయ్యాయి. సంఘసంస్కరణోద్యమంలో కందుకూరివారికి బాసటగా నిలిచిన ప్రజాసేవాపరాయణుడు. వీరి పేరు వినగానే, వెంటనే స్ఫురించేవి - నీవు చెప్పిన విద్యయే నీరజాక్ష, ముదితల్ నేర్వగరాని విద్యకలదే ముద్దార నేర్పించినన్, భరతఖండంబు చక్కని పాడియావు, వంటి పద్యోక్తులు, సామెతలు సంపాదించుకున్న ప్రాచుర్యాన్ని అందుకో జాలినవి. ఆయన భాషలోని సారళ్యం గురించి అనుభూతి చెందవలసినదే కాని వర్ణించలేము. ఆ మహానుభావుని రచనలు చదువనివాడు, అధునిక ఆంధ్ర సాహిత్యోద్యానవనంలో ఒక విరబూచిన అరుదైన ప్రసూనవల్లరిని చూడలేనివాడై, ఆఘ్రాణించని వాడుగా చరిత్రలో చిరస్థాయిగా స్థాపితమవుతాడు. ఆయన పేరు శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు.
జీవన్విద్యోద్యోగపర్వాలు
పశ్చిమగోదావరిజిల్లా, పెరవలి మండలంలోని ఖండవిల్లి గ్రామంలో వెంకన్న, రత్నమ్మ పుణ్యదంపతులకు 1867 జూన్ 17 న జన్మించిన చిలకమర్తివారు ఒక బ్రాహ్మణకుటుంబంలో జన్మిచారు. వీరవాసరం, నరసాపురంలో ప్రాధమికవిద్య, రాజమండ్రి హైస్కూలులో పట్టంచేబూనడం, 1889లో ఆర్యపాఠశాలలో ఉపాధ్యాయపదవి, యిన్నీసుపేట, మున్సిపల్ స్కూళ్ళలో విద్యాబోధన సాగించారు. తర్వాత సరస్వతి పత్రికాసంపాదకునిగా చేసి, ఉద్యోగానికి స్వస్తిచెప్పి, ఆపైన హిందూ సెకండరీ పాఠశాలను స్థాపించి, తొమ్మిదేళ్ళు నడిపిన తదుపరి, ఈ సంస్థని వీరేశలింగం హైస్కూలుగా మార్చబడింది. దురదౄష్టవశాత్తు 30 ఏళ్ళకే రేచీకటి వ్యాధికి గురైనాకూడా, ఆ అవరోధాన్ని త్రోసిరాజని, తన రచనలను కొనసాగించడంలో చిలకమర్తిగారికున్న పట్టుదలను, ప్రతిభను కొనియాడక తప్పదు.
వైవిధ్యభరిత ప్రతిభారంగాలు
నరసింహంగారు ప్రముఖ కవి, రచయిత, నాటకకర్త, పాత్రికేయుడు, సంఘసంస్కరణవాది, విద్యావేత్త. తెలుగుసాహిత్యాభివౄద్ధికీ, తెలుగుసీమలో ఆధునికభావవికాసానికీ, సేవలనందించిన ప్రముఖుల్లో చిలకమర్తివారు ప్రధమగణంలోకి వస్తారు. కేవలం యిరవైరెండేళ్ళ ప్రాయంలోనే రచించిన గయోపాఖ్యానం నాటకం తెలుగుసాహిత్యంలో కనీ వినీ ఎరుగని విషయం. అంతేకాక, ఈ నాటకంలో, టంగుటూరి ప్రకాశం పంతులుగారు, అర్జునుడి వేషం వేయడం అంతకన్న ప్రాధాన్యత సంతరించుకుంది. 1908లో ముద్రణాలయాన్ని స్థాపించడం, 1916లో గణపతి, రాజరత్నం వంటివి ప్రచురించారు. పాఠశాలలోనున్నప్పుడే పద్యరచనలను ప్రారంభించడం, వరుసగా అనేక రచనలను వ్రాయడం జరిగింది. మొదటి నాటకంగా వ్రాసిన కీచకవధ, ద్రౌపదీపరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామజననం, సీతాకళ్యాణం, పారిజాతాపహరణం లాంటి నాటికలను, రామచంద్రవిజయం, హేమలత, అహల్యాభాయి, సుధాశరశ్చంద్రం లాంటి ముఖ్య నవలలను రచించారు. సరస్వతి పత్రిక సంపాదకులుగా ఉన్నప్పుడు, సౌందర్యతిలకం, పార్వతీపరిణయం రచించారు. యివికాక ఎన్నో రచనలను వ్రాశారు. చిలకమర్తివారి రచనలను మొత్తంగా ప్రచురణకావడం, 1943లో ఆంధ్రవిశ్వవిద్యాలయంవారు కళాప్రపూర్ణ సత్కారంతో సన్మానించడం జరిగింది.
సాహిత్యంతోపాటు, సంస్కరణాభిలాష
ఉపాధ్యాయకత్వం, పత్రికాసంపాదకత్వం, రచనావ్యాసాంగాలతోపాటు, చిలకమర్తివారిలో నిస్కళ్మష మనోప్రవౄత్తితో నడిపించిన పధంగా సంఘసంస్కరణ కార్యక్రమం చెప్పుకోదగ్గ అంకం. మొదటితరం సంస్కరణవేత్తగా 1909లో సంఘంలో వెనుకబడిన వర్గప్రజలకోసం పాఠశాలను స్థాపించడమే కాక, పుష్కరపైకాలం నడపడంతోపాటు, బ్రహ్మసమాజం, హితకారిణీసమాజం వంటి సంస్కరణాధ్యేయంగల సంస్థలతో పాలుపంచుకున్న కార్యక్రమాలు, దేశమాత అనే వారపత్రికద్వారా తెల్లవారి పరిపాలనకు వ్యతిరేకంగా వ్యాసాంగం కావించడం కూడ జరిపారు. యితర ప్రత్యేక వ్యవహారాలు
మొదటినాటకం కీచకవధను 1889 జూన్ 15న ప్రదర్శించి మెప్పుపొందడం జరిగింది. కలకత్తా బ్రహ్మసమాజం నాయకుడు పండిట్ శివానందశాస్త్రి, చిలకమర్తివారిని స్థానిక షేక్స్ పియర్ అని ప్రశంసించేవారు. అనేకమార్లు ప్రదర్శించబడిన గయోపాఖ్యానం నాటకం వసూళ్ళుగా లక్షకుపైగా టిక్కట్లు అమ్ముడుపోవడం, యిప్పటివరకూ కూడ రికార్డు అనే చెబుతారు. 1894లో ఆయన వ్రాసిన రామచంద్రవిజయం సామాజిక నవలకు న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతిని గెలవడం కూడ ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. చిలకమర్తివారు స్వల్పకాలం అవధానప్రక్రియలో కూడ తన ప్రతిభను ప్రదర్శించారు. చిలకమర్తివారు సంకల్పించిన హరిజనోద్ధరణ కార్యక్రమం, మహాత్మాగాంధి దక్షిణాఫ్రికానుంచి భారతదేశం చేరుకోకముందే, ప్రత్యేకంగా పాఠశాలను స్థాపించడం చాలా గొప్పవిషయం అనే చెప్పాలి. నరశింహంగారి గ్రహణ, ధారణ శక్తులు అమోఘం, అద్భుతం అని పలువులు విశ్లేషించారు. మంచి వక్తగా శ్రోతలను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం బాగా పరిపాటి. యివి చాలక, చిలకమర్తివారు భారత జాతీయ కాంగ్రేసు కార్యకలాపాల్లో చురుగ్గా పోల్గొనేవారు.
చిలకమర్తివారి సాహిత్య ప్రతిభోదాహరణాలు
భరతఖండం చక్కని పాడియావు
చిలకమర్తివారి పేరు వెంటనే, అనేక నోళ్ళళ్ళో నానిన పద్యం - భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడవై ఏడుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు, పితుకుచున్నారు మూతులు బిగియగట్టి - అన్న పద్యం చరివినదే చదవడం, ఎందరో కంఠోపాఠం చేయడం, కౄష్ణానదీ వంతెన గోడలమీద పెన్సిళ్ళతో చెక్కబడడం, ఆనాటి గోదావరి సాహితీసభాపర్వాల్లోని పద్యాలతోబాటు హరికధల్లోకికూడ చేరిపోయింది. 1905లో బెంగాలు విభజన సందర్భంగా, బ్రహ్మమత ప్రచారకుడైన బిపిన్ చంద్రపాల్ రాజమండ్రిలో చేసిన ఆంగ్లోపన్యాసాలకు చిలకమర్తివారి ఆంధ్రానువాదాలకు ముగింపు పద్యంగా - ఈగ వ్రాలినగాని వేగ జారెడునట్లు - అన్న పద్యం, ప్రత్యేకంగా, చెవుల సందున గిరజాలు చిందులాడ, మొగము మీదను జిరునవ్వు మొలకలెత్తి, టంగుటూరి ప్రకాశము రంగు మెరియు, ధవళగిరితీర్ధమునకు తరలివచ్చె - అన్న వాక్యాలు, చిలకమర్తి, టంగుటూరి ప్రకాశం, తిరునాళ్ళకు ధవళేశ్వరం వెళ్ళినప్పుడు చెప్పిన పద్యం శాశ్వతంగా సాహిత్యచరిత్రలో స్థానం సంపాదించుకున్నట్టి ఘనత ఆయనదే. చిలకమర్తివారి పకోడీ పద్యాలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కోడికి బదులు పకోడీ తినమని బ్రాహ్మణులకు బ్రహ్మ వరమిచ్చాడని, లక్ష్మణుడు మూర్చకు మారుతికి పకోడీ వుందని తెలియక సంజీవని కోసం పరిగెత్తాడని, చమత్కారంగా హాస్యంగా రచన చేశారు. కందం చెప్పినవాడే కవి అన్న వాడుకను సార్ధకం చేశారు. సాధారణంగా వాడుకలో చెప్పే, ఆసేతు హిమాచలం అన్న ప్రయోగాన్ని, తుహినాద్రి మొదలు సేతువుదాల అని పైనుంచి క్రిందికి వరస చెప్పటం చిలకమర్తిశైలి చమత్కారం అనే చెప్పాలి. దీపంకింద నీడ, గులాబికిముళ్ళు, చందమామకిమచ్చ, చల్లని వానకిపిడుగు లాంటి ఉపమానాలు మాత్రం దొరతనానికి తగునా అని ప్రశ్నించారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం మార్గాన - అధికార భూతాలు అడెగే లంచం, మునసబు కరణాల ముడుపులు, యజమానులకు పంటలో అర్ధభాగం, పైకమిచ్చినవానికి వడ్డీలు, యిచ్చుకునే కాపుకి మిగిలిందేమిటి అని కూడ ప్రశ్నించారు. 1897 లో విక్టోరియారాణి వజ్రోత్సవం, అరవయ్యేళ్ళ పరిపాలన సందర్భంలో, రాజమండ్రిలో జరిగిన సభలో, చిలకమర్తివారు అనేక సీసపద్యాలు సిద్దహస్తత్వంతో చదవడం, పైగా పాదాల చివర, జోలపాట, చిత్తజల్లు, కందపెరడు, విల్లిపిడుగు పదప్రయోగాలు అంతరార్ధాలు చక్కగా గోచరిస్తాయి. తనదేహము, తనగేహము, తన కాలము తన భవమ్ము తన విద్యజగజ్జనులకు వినియేగించిన ఘనుడిగా వీరేశలింగం మరణించినప్పుడు చెప్పిన పద్యం కడు సార్ధకమైంది. పోతనగారు చెప్పిన పద్యం, మన సారధి మన సరిచుఘు మన నెయ్యము అన్నరీతిలో, చిలకమర్తివారిస్నేహం కందుకూరివారిపట్ల వున్న భవం వ్యక్తమవుతోంది. చిలకమర్తివారి గీతమంజరి పద్యాలు వేమనవిలా, పంచతంత్రకధల్లాగ, దీనకల్పద్రుమ అనే మకుటంతో 200 పై చిలుకు పద్యాలను మనోరమ పత్రికలో ప్రచురించడం, భక్తిరసప్రధానమైన రచనగా ఎదపలికినపుడు మ్రోగే భక్తిపరంపరగా పేర్కొనబడ్డాయి. రాతిబొమ్మకేల రంగైన వలువలు, గుళ్ళు గోపురాలు కుంభములను, కూడు గుడ్డ తానుకోరునా దేవుడు అని వేమనకు సరిపోలిక అయింది. పద్యరచనా చమత్కారంతోనే నాటకరంగాన్ని వశపరచుకోవడం, ఆశుకవితలు, శతకపద్యాలు, నాటకపద్యాలు ఏవైనా, చిలకమర్తివారి చేతపడి, నోటపడి, ధన్యమైనాయన్నదాంట్లో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు. చిలకమర్తివారిని కవిగా పరిచయం చేసింది, వారు వివిధ సభల్లో చదివిన పద్యాలనే చెబుతారు. వేదం వెంకటరాయ శాస్త్రిగారి సన్మానసభలో చిలకమర్తివారు పద్యాలు చదవడం, మెచ్చుకోవడం, తర్వాత ఆశుపద్యాలు, నాటకకర్తగా, నవలారచయితగా, ప్రహసనకర్తగా, ప్రసిద్ధికెక్కిన చిలకమర్తివరి కవితావైభవం తెలుగు సాహిత్యంలో సముచితస్థానాన్ని సగౌరవంగా సంపాదించడం ఆయన ప్రతిభకు సహజతార్కాణాలు.
చిలకమర్తివారి స్వీయచరిత్ర
చిలకమర్తివారి స్వీయచరిత్ర వీరేశలింగంవారి చరిత్రకు అనుబంధం వుందనిపిస్తుందంటారు. తిలక్ నిర్యాణం నుంచి స్వాతంత్రోదయం వరకు సామాజిక పరివర్తనను చిలకమర్తి వారి స్వీయచరిత్ర ప్రతిబింబించింది. ఆనాటి సాహిత్యం, సంస్కౄతి, నాటకసమాజాలు, పాఠశాలలు, పత్రికలు, సంఘసంస్కరణ కార్యక్రమాలు, విస్తారంగా వివరించబడ్డాయి. దళితజాతులవారికి రాత్రి పాఠశాలలు, నిమ్యజాత్యుద్ధరణకోసం రామమోహనరాయల పేరున పాఠశాల నిర్వహణ, గయోపాఖ్యానం, చింతామణి నవలల పోటీలో వరసగా బహుమతులు గెల్చుకోవడం, 1893లో గోదావరిజిల్లాలో ప్రవేశించిన మొదటి రైలుబండి, 1895 లో గోదావరి మహాసభల్లో చదివిన పద్యాలు, ఆబాలగోపాలానికి రసనాగ్రాలపై నర్తించేవి.
భరతవాక్యం చిలకమర్తివారి పద్యంలోనే !!!
రాజభక్తి, దేశాభిమానం, జాలి, విధి, అంటూ పద్యాలను చెప్పి పాఠకుల్ని, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం, ఆనాటి సభాసదుల్ని మంత్రముగ్ధుల్ని చేసినట్లు కదలకుండా చేయడం చిలకమర్తివారి పద్యరచనా రహస్యాలలో ముఖ్యమైనవి. అయితే, చివర్లో, నాటక లక్షణశాస్త్ర ఫక్కీలో, 'చిలకమర్తివారు, గౌతమా మండల సభకు ఖ్యాతి మెరయ, పూర్ణ భక్తి సమర్పించె పుష్పమాల, వసుధ వీరవాసరపుర వాసియైన, చిలకమర్తి లక్ష్మీనరసింహమూర్తీ అనే నాటకభరతవాక్యం లాంటి పద్యపుష్పమాలను సమర్పించి గోదావరీమండంలంలో ప్రముఖస్థానాన్ని, ప్రఖ్యాతతను పొందారు. ఈ భరతవాక్యంతోనే ఈ వ్యాసం పరిసమాప్తిచేయడం ఔచిత్యం, సమంజసం.
చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి వర్ధంతి సందర్భంగా - తెలుగురధం, శతసహస్ర ప్రణామాల్ని సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

Monday, June 16, 2008

మహాకవి, మహారాజశ్రీ శ్రీశ్రీ

మహాకవి, మహారాజశ్రీ శ్రీశ్రీ

ఆకౄతి సామాన్యం, వ్యక్తిత్వం అసామాన్యంఅప్పలకొండ దంపతులకు వంశాకురంశ్రీరంగం కుటుంబానికి దత్తత పార్శ్వంఫలితంగా శ్రీరంగం శ్రీనివాసరావుపొట్టిపేరు శ్రీశ్రీ, పేరులోనే వినూత్నంశ్రీకి శ్రీకి మధ్య దూరం అగణితం.
చదువు సంధ్యలు విసిరేసే విశాఖ తీరాన ఒకటిన్నర దశాబ్దపు ప్రాయంలోనే వివాహందత్తపుతృరుడికి దత్తకూతురు జీవనప్రవేశంఆరేళ్ళ తర్వాతే జంతుశాస్త్రంలో పట్టభద్రత
డిమాన్స్ట్రేటర్, ఎడిటర్ గా తొలి ఉద్యోగాలురేడియో, మిలిటరీ, నిజాంనవాబు, ఆంధ్రవాణిజీవనం సాగించడానికి ఉపయోగపడ్డ కొలువులు.
కలాయుధులు ఊసుపోక కాగితంపై రాసుకుంటూపోతారుబరకడం, గీకడంతో తెల్లకాగితాన్ని నలుపు చేస్తారువేయేళ్ళకోసారి, వేలకో కవి కలంకుంచెను నడిపిస్తాడుకవితను, కవితాత్మను ఖచ్చితంగా ఆవిష్కరిస్తాడుఅసంకల్పిత చర్యలా ప్రతిభతో హిమాలయాలెక్కుతాడుసాహితీశిఖరాగ్రాన కవనపు మహాప్రస్థానం గానం చేస్తాడుఆగాననాదఝరికి జగన్నాథుని రధచక్రాలు కదులుతాయివిదేశాలు కూడ గర్జిస్తాయి, దశదిశల్ని మార్చివేస్తాయి.
అదే జరిగింది, శ్రీశ్రీలో, రచనల్లో చిత్రగీతాలు, కవితలుప్రహేళికలు, వ్యూలు, రివ్యూలు, ఉపన్యాసాలు, చమక్కులు, హాస్యాలువిశ్వసించిన సిద్ధాంతాన్ని రాద్ధాంతం చేయక రాపిడిచేశాడుసమైక్యవాదాన్ని సగర్వంగా నమ్మి నభూతో నభవిష్యత్ లా కౄషిచేశాడువిదేశాలకు కూడ వాదాన్ని అందించాడు, వారేవాహ్ కేకలను విన్నాడుఅరసం, విరసం, వేదికేదైనా 'గురజాడ అడుగుజాడా అన్నాడు.
సంప్రదాయంలో ప్రభవించి, గ్రాంథిక ఛందోవిహారం చేయించాడుబాటసారి, బిక్షువర్షీయసి అంటూ మహాప్రస్థానం చేశాడుఖడ్గసౄష్టితో చరమరాత్రిని నిర్మించి, ఒకటికింకొకటిని కలిపినా ఒకటేఅన్నాడువ్యూలు, రివ్యూలతో, రెక్క విప్పిన రివల్యూషన్ ని సౄష్టించాడువిశాలాంధ్రలో ఉక్కుపిడికిలి, అగ్నిజ్వాలతో ప్రజారాజ్యాన్ని చూశాడు
తెలుగువీరుని మేలుకొలిపి, సంఘ శతౄవుల్ని ఖబడ్దారన్నాడుమనసున మనసై, హలో హలో ఓ అమ్మాయి అంటూ దరిచేరాడుహౄదయంలో నిదురించే చెలిని వయారిమయూరిలాగ ఆరాధించాడువ్యాసక్రీడల్ని ఆడిస్తూ, వ్యక్తికి బహువచనం శక్తన్నాడు అల్పంలో అనల్పాన్ని, శిల్పశ్లేషప్రాసల్ని జోడీకరించాడుశబ్దప్రయోగాల్లో నవ్యత, ప్రజతో శతచతురోక్తుల్ని విసిరాడుఅష్టవర్షప్రాయంలోనే కవితాప్రచురణ చేసి దన్ను చూపాడుస్వదస్తూరితో, స్వీయగళంతో మహాప్రస్థానం కావించాడుతనని తాను సమీక్షించుకొని దార్శనికతని స్వీయదర్శనం కావించాడు
సౌదామినిని సంపంగితోటకు తరలించి మరోప్రపంచాన్ని చూపించారుమానవుడిపాట్లని వ్యాసక్రీడల్లో వ్యక్తీకరించారుఊరికేనా అంటే ఊరికే అని, ఒక నాటిక రాయమంటే ఏనాటికైనా రాస్తానన్నారుతెలుగు జాతీయ భాష దురభిమానం లేని అభిమతమన్నారుహాల్డేన్ భావాభిరామాల్ని నలుదిక్కులా ప్రచారం కావించాడుతిక్కవేమగురజాడలను కవిత్రయపు హోదాలో నిలిపాడుఅక్షరాలని ముత్యాలసరాలుగా అభిమానించిన నిత్యాక్షరమూర్తిమంతుడు
సాటితోటి కవుల్లోని సశాస్త్రీయాన్ని, కౄష్ణశాస్త్రీయాన్ని చవిచూశాడుప్రపంచపు బాధ అంతా తన బాధ అని యోగ్యతాపత్రాన్ని పొందాడుచావ వుంటేనే శ్రీశ్రీ రచనలు చదవండి అని చలం సవాల్ విసిరేలా చేశాడు తేదీలు దస్తావేజులు చరిత్రసారం కావోయ్ అంటూ ఎన్నో చెణుకులు విసిరాడు
తెలుగు సాహిత్యాన్ని ఆయన శాసిస్తే, తెలుగు మహాసభలు ఆయన్ని శాసించాయిఆరేడుపదుల వసంతోత్సవాలకు విశాఖ కాకినాడ వాడలు పుణ్యం చేసుకున్నాయికవన సాహితీజీవనం సరిసములులేనితనం, ఆత్మకధనం మాత్రం అనంతంరాబందుల రెక్కల చప్పుడు, పయోధర ప్రచండ ఘోషను వినిపించాడు ఆ శతాబ్దపు ఏకైక కవనప్రకంపనాన్ని తూచక అనుభవించి పలవరించమన్నాడు
తెలుగువాడి జాతీయ ధనం ఓర్వలేనితనం, పొరుగింటి పుల్లకూర బహురుచి అన్న నిజవాదిశ్రీవాణి తో శుభారంభమైన తెలుగుసాహితీభారతి శ్రీశ్రీవాణి ఒక యుగపు మలుపునూతన కవితా భగీరధుడు, సాహితీ మార్క్స్, మానవత్వంలో ప్రవహించే నదంగురుజాడలైన త్రివేణీసంగమంలో గురజాడ చలంల సహచరుడు, కవి, మనిషి, వ్యక్తినేను సైతం ప్రపంచాగ్నికి, విశ్వసౄష్టికి, భువనఘోషకి సొంతగొంతునిచ్చిన నాదవిద్వాంసుదుతిక్కన-వేమన-గురజాడలను పరకాయ ప్రవేశం కావించుకున్న ఆధునికాంధ్ర రథసారథి
రచనల్లో లోకం ప్రతిఫలించి, తన తపస్సు ఫలించి, జాతిజనులు పాడుకునే గీతమంత్రకారుడు
నా వినుతించే, విరుతించే, వినిపించే నవీనగీతికిభావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం - సర్వనాద మూలబిందువైన ౠతంఏ ప్రణవం అన్న ప్రవచకుడు.
ఆలోచన నా ఉనికికి సూచన అన్న శ్రీశ్రీకి మరణం లేదుజనన మరణాల మధ్య విరామం మాదిరిశ్రీశ్రీ మరల అవతరిస్తాడు, మరో తోకచుక్క పొడవకా మానదుశ్రామిక ప్రజా జైత్రయాత్రా పతాక కాకా తప్పదు మరో మహాప్రస్థానాన్ని తప్పక అందిస్తాడు, చదివిస్తాడుమనం మాత్రం మరో చలాన్ని సిద్ధం చేసుకోవాలి యోగ్యతాపత్రానికిమహాప్రస్థానం ఏ శతాబ్దానికైనా ఏకైక తెలుగు మహాకావ్యం.
ఏమో, ఎవరికెరుక, శ్రీశ్రీ-చలం యుగళంతో దర్శనం యిస్తారేమో!
కొవ్వొత్తిని రెండువైపులా ముట్టించాగా అది శ్రీశ్రీలా వెలిగింది అన్న పురిపండా పునీతభావన అక్షరసత్యం
శ్రీశ్రీది మహావ్యక్తిత్వంశ్రీశ్రీది మహాకావ్యం మహాప్రస్థానంశ్రీశ్రీది సాహితీజగతిలో మహాభినిష్క్రమణం.
మహాకవికి శతసహస్ర ప్రణామాలతో, నమస్సుమాంజలులు.
సాహితీస్రవంతికి కౄతజ్ౙాభిపూర్వక ధన్యవాదాలు.
నమస్కారం.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

Friday, June 13, 2008

మహాప్రస్థాన నిర్మాత, మహారాజశ్రీ శ్రీశ్రీ

శ్రీరంగం శ్రీనివాసరావు (1910 - 1983) - 15 జూన్ వర్ధంతి
శ్రీశ్రీ జీవనప్రస్థానం ... యిదిగో ... యిలా ...
అది 1910 వ సంవత్సరం. ఈ ఏట మువ్వింతలు జరిగాయట. ఒకటి తోకచుక్క పొడవడం; రెండు గురజాడ అప్పారావు గారు ముత్యాలసరాలు రచనచేయడం; యిక మూడవది మహాకవి శ్రీశ్రీగా ముందు ప్రపంచానికి సుపరిచితులైన శ్రీరంగం శ్రీనివాసరావుగారు జన్మించడం. శ్రమైక జీవన సౌందర్యానికి, సమానమైనది లేనేలేదోయ్ అన్న ప్రజాకవి, విప్లవకవి, మహాకవి, మహాప్రస్థానం నుంచి మరోప్రస్థానం వరకు తనదైన శైలిలో ప్రపంచంలో మరోప్రపంచాన్ని సౄష్టించిన, ఈయన జీవనప్రస్థానం యిలా సాగిపోయింది.
1910 జనవరి 2 న విశాఖపట్టణంలో శ్రీ వెంకట రమణయ్య, శ్రీమతి అప్పన్నకొండ లకు జన్మించిన శ్రీశ్రీ, పుట్టిన ఏడాదికే తల్లిని పోగొట్టుకున్నాడు. ఎవియన్ కాలేజీలో లెక్కలమాష్టారుగా తండ్రి పనిచేయడం, అక్కడే శ్రీశ్రీ చదువుకున్నాడు. 1925లో చదువుతోబాటు వెంకటరమణమ్మతో వివాహం, యింటర్మీడియట్ చదువు 1928 లోను, 1928లో మద్రాసు కాలేజీలో, బి.ఎ. జంతుశాస్త్రం లో చేరినా, 63 రోజుల టైఫాయిడ్ జ్వరం వలన, 1931 లోనే పూర్తిచేయడం జరిగింది. చదువుకున్న కాలేజీలోనే డిమాన్సేట్రర్ గా పనిచేస్తూ కప్పలమాస్టారు గా పేరు తెచ్చుకున్నారు. 1938లో మద్రాసులోని ఆంధ్రప్రభలో ఉపసంపాదకునిగాను, 1942లో డిల్లీ ఆకాశవాణిలోనూ, 1943లో లక్నోలో మిలటరీలో లేబరేటర్ అసిస్టెంట్ గానూ ఉద్యోగపర్వాన్ని నిర్వహించారు. 1945లో తండ్రి మరణం జరగ్గా, 1946లో నిజాం నవాబుగారి రిఫార్మ్ సెక్రటేరియట్ లోను, 1946-49లో ఆనందవాణిలో ఉద్యోగాన్ని కొనసాగించారు. 1947లో మద్రాసులో రాయపేటలో మకాం వున్న శ్రీశ్రీకి గుర్రపుపందాల సరదా జోరుగా వుండేది. 1949లో చుట్తాలమ్మాయిని 'లెనినా అన్న పేరుపెట్టుకుని అభిమానపుత్రికగా పెంచుకోవడం జరిగింది. 1950లో నళినికుమార్ తో స్నేహం, 1954లో హెల్సెంకీలో జరిగిన ప్రపంచశాంతి మహాసభకు ప్రతినిధిగాను, రష్యా, పారిస్, లండన్ పర్యటన చేశాడు. 1856లో ఉపద్రష్ట సరోజినితో వివాహం అవగా, కూతురు (1959), కొడుకు (1962) గలగడం, 1967లో రెండవసారి రష్యా ప్రయాణం, 1970లో విశాఖపట్టణంలో షష్టిపూర్తి ఉత్సవాలు జరిగాయి. ఈ దశలో శ్రీశ్రీ చలంగారిని కలుసుకోవడం ప్రముఖ ఘట్టంగా భావించారు. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా శ్రీశ్రీని అరెష్ట్ చేసి, విడుదల చేయడం జరిగింది. 1976లో చైనాయాత్ర జరిపారు. 1979లో శ్రీ రాజాలక్ష్మీ ఫౌండేషన్ వారి మొదటి అవార్డుని, పదివేల నగదు బహుమతిని పొందడం జరగ్గా, 1980లో కాకినాడలో స్పతి పూర్తిసభ నిర్వహించారు. ఈ సమయాన్నే, పురిపండావరితో లండన్ ప్రయాణం జరిగింది. 1981లో శ్రీమతితో అమెరికా ప్రయాణం చేశారు. 1982లో అభిమానుల ఆర్ధికసహాయంతో కోర్టుకేసుని పోరాడారు. సుదీర్ఘ సాహితీజీవనం, నిజజీవనం జరుపుకున్న శ్రీశ్రీ 1983 జూన్ 15 న ఈ భౌతికజగత్తుని వదలి మరోప్రపంచంలోకి వెళ్ళిపోయారు.
శ్రీశ్రీ సాహితీపర్వం ... యుగంగా మారిన వైనం
మానవజాతిని ఉద్ధరించడానికి కొత్తమతాన్ని కనిపెట్టిన ప్రవక్త. ప్రపంచపు సరిహద్దుల్ని వూగించాలని ప్రయత్నించిన అతని హౄదయోద్రేకాన్ని వర్ణించడం అసాధ్యమైన పని. నెత్తురూ, కన్నీళ్ళు కలిపి కొత్త మందును తయారుచేశాడు. హౄదయం ఎల్లా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్నివ్వడం అతనికే తెలుసు. మాటల్ని కత్తులూ, యీటెలూ, మంటలుగా మార్చడం అతనెకే చేతనవును. పద్యాలు చదువుతూంటే, యివి మాటలుకావు, అక్షరాలు కావు - ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు - అతని హౄదయంలోంచి మన హౄదయంలోకి నేరుగా పంపిన ఉత్సాహాలు, నెత్తులుకాలవ అనిపిస్తుంది. ఏ లోకంలో అన్యాయాలు, అధికారాలు, ఏడుపులు, క్షామాలు, యాచకాలు, క్షుద్రకవిత్వాలు, శిక్షణలు, అవినీతిపర్వాల్లాంటివి స్వప్నలోకంలో వీక్షణం చేస్తూనేవున్నాడు. దేవుడు, అధికారాలు, పాతర్లు, సౌఖ్యాలు, నీతులు, స్వర్గం, మర్యాదలు, మూటకట్టుకుని కులికే ఎంతోమందికి అర్ధంకాని బాధ, మరణం, దరిద్రం, అవిశ్వాసం, అశాంతి, యివన్నీ అర్ధంకాక గట్టిగా సౄష్టినే ప్రశ్నించిన యువకుల లక్ష కంఠాల్ని ఏకం చేసి పలికిన ప్రజాపక్షపాతి. ఈ మాటలు, వర్ణనలు, ఈ వ్యాసరచయితవి అనుకునే ప్రమాదం వుంది. ఆ యిబ్బందేమీలేదు. శ్రీశ్రీ మహాప్రస్థానం కు యోగ్యతాపత్రంను అందించిన చలం శ్రీశ్రీ గురించి, ఆయన కవిత్వం గురించి అనుభవించి పలవరించిన అచంచలభావాలు. బాధతో అన్నా బోధవాచకాలు - తెలుగువాడి జాతీయధనం ఓర్వలేనితనం; అసలు సిసలైన తెలుగు వాడికి పొరిగింటి పుల్లకూరే నచ్చుతుంది అన్న నిర్మొహమాటం పడని నిజవాది.
శ్రీశ్రీ రచనాపరంపర
మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానంతో మహాయోగం పొందినా, అంతకు ముందుగా ప్రభవ, వారం వారం, సంపంగితోట అన్న రచనలు వ్రాశాడు. ఆయన కలం ఆగని వాడితనంతో, వేడితనంతో, అమ్మ, మీమీ, మరోప్రపంచం, త్రీచీర్స్ ఫర్ మేన్, చరమరాత్రి, మానవుడిపాట్లు, సౌదామిని, గురజాడ, మూడు ఏభైలు, మహాప్రస్థానం తర్వాత అంతటి పేరును తెచ్చిన ఖడ్గసౄష్టి, వ్యూస్ అండ్ రివ్యూస్, అయిదు సంపుటాల శ్రీశ్రీసాహిత్యం, మిన్నేలని, రెక్క విప్పిన రెవల్యూషన్, వ్యాసక్రీడలు, మరోమూడు ఏభైలు, చినయానం, మహాప్రస్థానం తర్వాత మరోమలుపుని తెచ్చిన మరోప్రస్థానం, పాడవోయి భారతీయుడా (శ్రీశ్రీ చిత్రగీతాలు), న్యూ ఫ్రంటీర్స్, అనంతం, ప్ర-జ, రచనలను అందించిన అమరకవి. అనంతం (ఆత్మకధ), ప్ర-జ రచనలను ఆయన మరణం తర్వాత ప్రచురించడం జరిగింది. శ్రీశ్రీ నిజంగానే భారతీయసాహితీకారుల్లో అగ్రగణ్యుడు. అందుకనే, భారతీయ సాహితీనిర్మాతలు అన్న శీర్షికన శ్రీశ్రీ వ్యక్తిత్వంపై సుదీర్ఘవ్యాసాన్ని ప్రముఖ సాహితీవేత్త బూదరాజు రాధకౄష్ణ, కేంద్రసాహిత్య అకాడమీ వారు ఈ రచనకు 2006 లోనే మూడవ ముద్రణనిచ్చారు.
శ్రీశ్రీ గురించి కధనకుతూహలం
శ్రీవాణి తో నూతన వరవడితో ప్రారంభించిన తెలుగు సాహిత్యం శ్రీశ్రీవాణితో మరోమలుపు తిరిగి అక్కడ ఒక యుగంపాటు నిలిచిపోయింది. అదే శ్రీశ్రీ యుగం. అంతకుముందు, విశ్వనాధ సత్యనారాయణ గారు నిర్మాణం చేసుకున్న పధంలో ఒక యుగం నిలచిపోయింది. శ్రీశ్రీ, విశ్వనాధలు జంటకవులు కాకపోయినా, యిద్దరూ చెరొక యుగానికి ప్రాతినిధ్యం వహించడం తెలుగు సాహితీవాణికే గర్వకారణమయినది.
శ్రీశ్రీని నూత్న కవితా భగీరధుడుగా డా. దివాకర్ల వెంకటావధానిగారు కితాబునిచ్చారు. సాహితీమార్క్స్ గా రాచకొండ విశ్వనాధశాస్త్రిగారు సెలవిచ్చారు. మానవత్వంలోప్రవహించే నది అని డా.నాయని కౄష్ణకుమారి అని అన్నారు. ఆరని విప్లవ జ్Yఓతి, పధ నిర్దేశకుడు, శ్రీశ్రీది మనిషితనం అని, ఆధునిక సాహితీ చరిత్రకు 'గురుజాడలుగా, గురజాడ-చలం-శ్రీశ్రీ ని వర్ణించడం, కవి-మనిషి-వ్యక్తిగా శ్రీశ్రీకి త్రివేణీసంగమసత్కారాలతో వేనోళ్ళ కొనియాడారు. ఒకప్పుడు సాహిత్యం భోగవస్తువు; ఈ నాడది ఉపయోగ వస్తువు కావాలి అని తన నినాదాన్ని ప్రకటించాడు శ్రీశ్రీ. ప్రజలభాషల్ సన్నగా సంగీతం సాహిత్యంలో వినిపించిన కాలాన్ని తానే స్వయంగా నిర్మించుకున్నాడు శ్రీశ్రీ. సాహిత్య జగత్తులో మనిషి మేల్కొన్న తరుణమది. నేను సైతం ప్రపంచాగ్నికి, విశ్వసౄష్టికి, భవనఘోషకు ... అంటూ సొంతగొంతుకతో జయభేరి మ్రోగించిన మొదటిగేయాన్ని విరచించిన విద్వాంసుడు. శ్రీశ్రీ కవితా జీవితం ఒక మహాస్రవంతి; మహాకవిని చేసింది. అభ్యుదాయాంధ్ర కవిత్వయుగకర్త శ్రీశ్రీ, ప్రజాకవి, సమాజ చైతన్యాన్ని మేల్కొల్పి, దానిలోని వేడిరక్తాన్ని ఉడికించి,కవితను ప్రజావాణిగా పలికించి, ప్రపంచ పీడితజన బాధామయగీతాన్ని హృద్గీతగా పొంగించి, జీవితానికీ, సాహిత్యానికీ మంగళ సంవిధానాన్ని సాధించి,పండిత పామరజనరంజకమైన కవితాస్రవంతిని తెలుగునాట క్రొత్తతియందనాలతోపారించి, అభ్యుదయపధాన్ని చూపించిన శ్రీశ్రీ ఆధునికాంధ్ర సాహిత్య రధసారధి. ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారన్నట్లు, తిక్కన్న, వేమన్న, గురుజాడలు శ్రీశ్రీలో కొత్తరూపం తాల్చారు. తెలుగువారికి - తెలుగువాణికి ఒక అంతర్జాతీయకవిని సమర్పించారు. అందుకే, నిజంగా నేను, ప్రజల కవిన్నేను, ఎంచేతంటేను, వాళ్ళను చదివేను, చదివించే రాసేను అని తానే చెప్పాడు. ప్రజలను చదివినవాడూ, చదివింది వ్రాసినవాడూ ప్రజాకవి, దానికి మారుపేరు శ్రీశ్రీ అనికూడ అచార్యులు వివరించారు. నా రచనలలో లోకం ప్రతిఫలించి, నా తపస్సు ఫలించి, నా గీతం గుండెలలో మూర్ణిల్లగ, నా జాతి జనులు పాడుకొనే మంత్రంగా మ్రోగించాలి అని తన ప్రణాళికను సుస్పష్టంగా విశదపరచారు. వ్యదారజీవిత యదార్ధదౄశ్యం పునాదిగా ఇక జనించబోయే భావివేదముల జీవనాదముల జగత్తుకంతా చవులిస్తానోయ్ అని ప్రతిజ్ణ చేసిన శ్రీశ్రీ తనవాదాన్ని వేదంగా పేర్కొన్నాడు. విప్లవ కవిత పాడేడప్పుడు కూడ, నా వినుతించే, నా విరుతించే, నా వినిపించే నవీనగీతికి, భావం, భాగ్యం, ప్రాణం,ప్రణవం అని, చివరకు మిగిలేది సర్వనాద మూలబిందువైన ౠతం, అదే ప్రణవం అని ప్రవచనం చెప్పాడు. శ్రీశ్రీ ని సారాంశంగా ఒకే ఒక వాక్యం చెప్పాలంటే, ఆలోచన నా ఉనికికి సూచన అనే చెప్పాలి. ఆలోచన ఉన్నస్థితిలో అసంతౄప్తిని కలిగించి, ప్రశ్నించడం నేర్పుతుంది. ప్రశ్నించడం అన్వేషణకు కారణమౌతుంది. అభ్యుదయానికిప్రేరణ అవుతుంది. ప్రగతికి పునాది అవుతుంది. సరిగ్గా, సమంగా, శ్రీశ్రీ విషయంలే యిదే జరిగింది. శ్రీశ్రీ కి మరణం లేదు. మహాకవి ప్రతినిత్యం మన మనసుల్లో, నిత్యకౄత్యాల్లో, ఆలోచనల్లో, ఎదో రూపాన, మసలుతూనే వుంటాడు. జననమరణాల మధ్య జీవితం ఒక విరామసంకేతం. శ్రీశ్రీ మనకు స్వల్ప విరామం ప్రసాదించాడు. త్వరలో శ్రీశ్రీ మరల అవతారమెత్తుతాడు. లేదా కనీసం మరోశ్రీశ్రీని అవతరింపచేస్తాడు. మరో మహాప్రస్థానాన్ని తప్పక అందిస్తాడు. మనం మాత్రం మరో చలాన్ని సిద్ధం చేసుకోవాలి, యోగ్యతాపత్రం అందించడానికి. యిరువురూ కలసి వస్తారేమో ఎవరికెరుక!?!?
మహాకవి శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా ఆయనలోని మంచితనానికి , మనిషితనానికి సహస్రనమస్సుమాంజలుల్ని సమర్పిస్తూ -
కొంపెల్ల శర్మ - తెలుగు రధం.

Wednesday, June 11, 2008

పసిచేతులు - పనిమోతలు * అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేకదినం - 12 జూన్

అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేకదినం - 12 జూన్
పసిచేతులు - పనిమోతలు
నాడు - నేడు అదే బాల్యం .. అయితే .. ?

మానవజన్మకు చతురావస్థలంటారు, అవి, బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్యదశలు. ప్రస్తుతకాలంలో సంపూర్ణాయుర్దాయం నిండునూరేళ్ళు అంటూ, శతమానంభవతి అంటూ బాలలను ఆశీర్వదిస్తూంటాము. వ్యక్తిగా గుర్తింపు 18 ఏళ్ళకు అని తీర్మానించినా, బాల్యం మాత్రం 14 ఏళ్ళవరకే అని నిర్ధారించారు. కల్లకపటం, అసూయ, ద్వేషం, రెండర్ధాల మాటలూ ఇవేవి తెలియని దేవుని ప్రతిరూపాలు బాలలు. అందుకే, పెద్దలు దేవుని వెదుక్కొంటూ గుడికి వెళితే ఆయన బయట పిల్లలతో ఆడుకొంటూ వుంటారు అంటూ గుడిలోని ప్రభువును నడివీధిలోకి తెచ్చి పిల్లలతో బిళ్ళంగోడో, దాగుడుమూత దండాకోరో ఆడించారు, గురుదేవులు రవీంద్రనాధ్ టాగోర్. బాల్యం ఓ మరపురాని మధురానుభూతి. బాల్యం ఓ అందమైన కల. బాల్యం ఓ వరం. ఈ దశలో మనం బిడ్డలకు ఇవ్వగలిగినవి రెండేరెండు బహుమతులు. ఒకటి వేళ్ళు, రెండు రెక్కలు అంటాడు ఓ అంగ్లకవి. ఈ లోకాన్ని చూసి, అర్ధమయ్యీ, అర్ధంకాక తనతో దోబూచులాడే ఈ మాయాచ్చాయల్లోని ఇంద్రజాలానికి అద్భుతపడి, దాన్నంతా తనలోకి తీసుకోవాలని చూసే పసిబిడ్డ ఆతౄతని ఏ కవీ వర్ణించలేడు అంటాడు, మన ప్రముఖ కవి చలం. అయితే, విషాదం ఏమిటీ ఆంటే, మనిషి పెరుగుతూ వుంటే తన బాల్యాన్ని చేజారిపోకుండా పొదివి పట్టుకోలేకపోతున్నాడు అని అంటాడు ప్రకుఖ చిత్రకళాకారుడు పాబ్లోపికాసో. ఇది నిగ్గుతేలిన సత్యం. ఉరకల పరుగుల జీవితంలో మనిషి ప్రతి మైలురాయి వద్దా తన బాల్యజీవితపు పూరేకుల్ని ఒక్కోటొక్కాటిగా రాల్చుకొంటూ పోతున్నాడు. చిన్ననాటి జ్ణాపకాలు క్షణంక్షణం గుండెకోతకు గురి చేస్తున్నాయి. మనిషి నేడు కన్నబిడ్డలను ర్యాంకులకోసం తోమి తోమి, బండెడు పుస్తకాలతో కుస్తేలు పట్టించి ఆటవిడుపులు లేని మరుగుజ్జు జీవితాలను వారికి అంటగట్టి వారి బాల్యాన్ని చిదిమివేస్తున్నాడు. బాల్యం ఎవరికీ లేని, దక్కని పిదపకాలం దాపురించింది. జీవితంలో విలువయిన దాన్ని దేనినో కోల్పోతున్నారనే బాధ మాత్రం మనలనందరినీ తొలిచివేస్తోంది. దీనికి బాధ్యత, తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, సమాజం, అందరూ వహించవలసిందే. ఎవరిది ఎంతశాతం అన్నది అని చెప్పడానికి కారణాలు, కధనాలు కోకొల్లలు.
బాల్యం గడిపేది ఎలా ?
నేటి బాలలు రేపటి పౌరులు అని సాధారణంగా చెప్పే నానుడి మనది. బాలలు నేటిపౌరులు కాదన్నది వితండవాదం అని కూడా అనిపిస్తుంది. దేశభవిష్యత్తు వీరిమీద ఆధారపడివుంది. కాని భవిష్యత్తు పేరు చెప్పి, వర్తమానం లేకుండా చేస్తున్న నేరస్తులం మనం అందరం. పిన్నలను తీర్చిదిద్దడం పెద్దల కర్తవ్యం. చిన్నప్పుడే బాలలు తమ వ్యక్తిత్వాలను రూపొందించుకునే వాతావరణాన్ని, ప్రోత్సాహాన్ని సమాజం కల్పించాలి. బాలల్లో ఉన్న కళలూ తెలివితేటలూ నిర్మాణాత్మకంగా, మనోల్లాసకరంగా, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, దేశానికీ ఉమయోగపడేటట్లు అవకాశాలు రూపొందించాలి. అన్ని రంగాల్లో వలనే, బాలలలోని సౄజనాత్మక శక్తినీ, కళాతౄష్ణనూ, ప్రతిభావికాసాలనూ పరిపోషించడానికీ ప్రభుత్వాలు కౄషెచేస్తూనేవున్నాయి. కాని, రాశి, వాసి రెండూ సరిపోవు. మరింత ముందంజ, ముందడుగు వేయాలి. బాల్యం సాధారణంగా, న్యాయంగా, ఒకే తీరున గడిచిపోవాలి. కాని సమాజంలో అనేక తరహాలు, వర్గాలు. ధనికులు, పేదలు. ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు. పూట గడవని కుటుంబాలు, ఏదో రకాన కాసులు సంపాదించాలి. ఆ ప్రయత్నంలో, చిన్న, పెద్ద అనే తేడా చూపించలేరు. తలోచెయ్యి వేస్తేగాన్ని, వేన్నీళ్ళకు చన్నీళ్ళు చేరవు. పొట్టలో గంజినీళ్ళు పడవు. పిల్లలు పనిచేయడమన్నది మనం సాధారణంగా అనూహ్య పరిణామం అని చెప్పాలి. కాని, పిల్లలు కూడ పనిచేసి, రూకలు తేవడమన్నది అనేక లక్షల కుటుంబాల్లో సర్వసాధారణంగా అలవోకగా సాగిపోతున్న దేశం మనది అంటే ఆశ్చర్యం లేనే లేదు. నగ్నసత్యం కనక.
చదువులేని, చదువుకోలేని, చంటాళ్ళు
సాధారణంగా చదువు అయ్యాక, ఉద్యోగం, పనిపాట్లు సంగతి ఆలోచిస్తాము. కాని చదువుకోసం యిల్లు గడవకుండా వుంటుందా? అంతంతగానే ఉపాధి అవకాశాలున్న, రైతు, బీద కుటుంబాలు సంపాదన లేని జీవితాలు వర్ణనాతీతాలు. అందుకే, యింట్లో అందరూ, వయోభేదం లేకుండా, గడపదాటి, పనిలోకి దూకాలి. నాలుగురాళ్ళు తెస్తేనేకాని సాయంకాలానికి కూడు లేని స్థితిగతులు మన దారుణకుటుంబాలు ఎన్నో, ఎన్నెన్నో. అలా మొదలైంది మన బాలకార్మిక వ్యవస్థ. పుట్టిన అయిదు-ఆరు సంవత్సరాలకే, పిల్లలను కూడ పనిలోకి - కుటుంబవౄత్తిగాని, వేరేచోటగాని, దింపే దుస్థితిలో వున్నారు మన పెద్దలు. సాఫీగా సాగిపోయే, కుటుంబాల్లో ఈ పరిస్థితి గురించి ఆలోచించవలసిన అవసరం రానేరాదు. దారుణమైన బీదకుటుంబాల్లో మాత్రం జరుగుతున్న, నడుస్తున్న చరిత్రమాత్రం యిదే అని చెప్పాలి. అదే బాలకార్మిక వ్యవస్థ. అదే అవస్థాబాల్యం, బాలారిష్టాలు. బాల్యదశలోనే అష్టకష్టాలు.
నేటి బాలకార్మికవ్యవస్థ తీరుతెన్నులు

మన మనుగడకు, ఉనికికి చేదోడువాదోడు మనకున్న రాజ్యాంగాలు, శాసనాలు. దేశాల్లోని పౌరులకు ఉపయోగార్ధం, రాజ్యాంగాల్ని, శాసనాల్ని, చట్టాల్ని తయారుచేయడంలో మాత్రం తిరుగులేనివి. కాని వాటి అమలుచేసే తీరుతెన్నులు మాత్రం ఎల్లవేళల్లా ప్రశ్నీచదగ్గవి, అనుమానించదగ్గవి అన్నది మాత్రం సత్యం. ఈ కోవల్లో నిర్ధారణతో చెప్పదగ్గది, బాలకార్మికవ్యవస్థ, దాన్ని నిర్మూలించే చట్టాలు, శాసనాల్లో మాత్రం లోపం లేవు. దురదౄష్టకరం ఏమిటంటే, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై పై నిర్ణయించిన లక్ష్యాలను, ప్రణాళికలను అమలుపరచటంలో మాత్రం విఫలమైనామనె చెప్పాలి. ప్రపంచంలో అతిపెద్ద నాల్గవ ప్రజాస్వామ్యదేశంగా భావించబడుతున్న భారతదేశంలో మాత్రం యిది నిజం, సత్యం. ప్రపంచంలో మొత్తం 24.6 కోట్లమంది బాలకార్మికులున్నారని అంచనాలు చెప్తోంటే, కేవలం మన భారతదేశంలోనే, 14 ఏళ్ళలోపు పిల్లలు, అమెరికాదేశపు మొత్తం జనాభా కన్న, బాలకార్మికులు ఎక్కువగా వున్నారని, అంటే, 1.3 కోట్లమంది (2001 జనాభాలెక్కల ప్రకారం) అంచనాలు చెప్పుతున్నాయి. ఈ వయసువర్గంవారు, భారతావనిలోని పనివాళ్ళలో 3.6 శాతం వున్నారని చెప్తారు. అంతేకాక, ప్రతి పదిమందిలో, తొమ్మిదిమంది పిల్లలు గ్రామీణవాతావరణవ్యవస్థలోనే పనిచేయడం జరుగుతున్న దుస్థితి. అందులో, 85 శాతం మంది పిల్లలు, సంప్రదాయకంగా వ్యవసాయరంగంలోనే నిమగ్నులవుతున్నారు అన్నది కూడ సత్యం. రమారమి 9% వస్తువుల తయారీ, సేవలు, మరమత్తుల రంగంలోను, సుమారు 1 శాతం మాత్రం కర్మాగారాల్లోను బాలకార్మికులు వ్యాప్తి చెందారని గణాంకాలు చెప్పుతున్నాయి. ఈ విభజనలు, దశాబ్దం క్రిందట స్థితిగతుల్ని చెప్పుతున్నా, నేటికీ మారని పరిణామం, పరిమాణం, ఈ బాలకార్మిక వ్యవస్థ.
చట్టాలకేం ... తక్కువలేదు !!! ఆచరణలే అంతంత మాత్రం ???

అంతర్జాతీయ స్థాయిలో బాలకార్మిక వ్యవస్థకి సంబంధించిన సమస్యలపై తీసుకువచ్చిన చట్టపర, శాసనపర, అభివౄద్ధిపరమైన నిర్ణయాలని అమలుపరచే దిశలో, భారతదేశం కుడా ముందంజ వేయడం, అంతర్జాతీయ కార్మిక సంస్థ నుంచి వచ్చిన అరు సమావేశాల నిర్ణయాలని అమోదించడం, వాటిలో, మూడు ఆమోదాలాని క్రితం శతాబ్దపు నాలుగోవంతు కాలంలోనే ముగిసాయి. ఫలితంగా, 1933 లోనే చట్టంతో అంకురార్పణ జరగడం, వరసగా తొమ్మిదిసార్లు చట్టం పరిధిలోకి తీసుకురావడం, క్రమంగా బాలకార్మికవ్యవస్థని రూపుమాపాలన్న సంకల్పం వహించినా, ఈ కార్యక్రమంతోపాటు, మూలకారణాలైన సామాజిక-ఆర్ధిక వ్యత్యాసాలని నిర్మూలించకుండా, విజయాన్ని వరించలేం అన్నది అందరూ అంగీకరించినదే. ఈ మధ్యకాలంలో, 1992-97లో, చెప్పుకోదగ్గదిగా, కార్యక్రమాన్ని అంతర్జాతీయ సహకారంతో, భారతదేశం 250 మిలియన్ల నిరక్షరాస్యబాలబాలికలకు 47 మిలియన్ల డాలర్ల విలువచేసే విద్యాకార్యక్రమం ప్రారంభించారు. విసృతౄతస్థాయిలో కూలంకషగా భారతీయ బాలకార్మిక వ్యవస్థపై ఆధ్యయనం జరగడం, ఫలితంగా జాతీయ బాలకార్మిక నిర్మూలనపై ప్రణాళిక, ఆచరణాత్మకశైలి, కేంద్రీయ సలహా మండలి, సాంకేతిక సలహా మండలి, 12 జాతీయ బాలకార్మిక నిర్మూలన ప్రాజెక్టులు - ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రారంభమవడం, ప్రత్యేక పాఠశాలలను స్థాపించడం, శిక్షణ, ఆహారపోషణ కార్యక్రమాలను ప్రతిపాదించడం ద్వారా బాలకార్మికులకు విముక్తి కలిగించడం ధ్యేయంగా ప్రణాళికలను రూపొందించారు. ప్రమాదభరితమైన ఉద్యోగాలనుంచి వీరికి పునరావాస సౌకర్యాలను రూపొందించేందుకు ఘనకార్యక్రమాన్ని 15 ఆగష్టు 1994 న ప్రారంభించడం, అజమాయిషీకి జాతీయసంస్థను నెలకొల్పడం, వారి నివేదికలను 1996 లో సమర్పించడం కూడ జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్వచ్చందసంస్థలద్వారా అమలుచేశారు. ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక (1992-1997)లో భారీగా నిధులను కేటాయించడం, వినియోగించడం కూడ జరిగింది. ఉచిత తప్పనిసరి చదువు కార్యక్రమం కూడ జాతీయ విద్యావిధానం 1986 ప్రణాళిక లో రూపుదిద్దుకుంది. ఆచరణలో భాగంగా, రాష్ట్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఏడవ తరగతి వరకు చదువుపై రుసుముని ఎత్తివేయడం, స్థానికసంస్థలు, ప్రభుత్వసహాయంపొందే విద్యాసంస్థలకు కూడ పొడిగీంచడం జరిగింది. 14 రాష్ట్రాల్లోను, 4 కేంద్రపాలితప్రాంతాల్లోను, తప్పనిసరి చదువు చట్టాలొచ్చాయి.
చట్టాలతోపాటు న్యాయస్థానాలు కూడ రంగప్రవేశం

చారిత్రాత్మకస్థాయిలో అత్యున్నత న్యాయస్థానం కొన్ని ఆదేశాలను జారీచేయడం, ప్రమాదభరితమైన ఉద్యోగాలు చేస్తున్న పిల్లలపై తేవలసిన పునరావాస చర్యలు, అతిక్రమణలకు యాజమాన్యానికి జరిమానాలు, అమలు జరిగాయి. అమలులతోపాటు, అమలులో అతిక్రమణలు జరిగాయి. ఎంతంత అంటే అంతంతే అన్నది నిజమయింది. ఏది ఏమైనా, గతం అప్రస్తుతం అని నిరూపణ అయింది.
ప్రస్తుతం .. వర్తమానం
10 డెసంబరు 1996 లో సుప్రీం కోఋర్టులోని పిర్యాదు మేరకు, బాలకార్మికులను బయటకు తీసుకువచ్చే కార్యక్రమంలో భాగంగా, అతిక్రమణలు చేసిన ప్రతి యాజమాన్యానికి, వ్యక్తికి రూ.20000 నగదుని సంక్షేమనిధిలో జమచేయాలనడం, ఒక పెద్దమనిషికి ఉద్యోగాన్ని కల్పించడం, అలా వీలుకాకపోతే, రూ.5000 నిధికి ప్రభుత్వం నగదు యివ్వడం బాలుడు/బాలిక పాఠశాలకు వెళ్ళుతున్నంతకాలం చెల్లించడం వంటివి అమలులోకి వచ్చాయి. ఈ ప్రణాళికలో భాగంగా, 86వ రాజ్యాంగశాసనం సవరింపు చట్టం 2002ను పార్లమెంటులో ఆమోదం జరగడం మూలాన, తప్పనిసరి చదువు అంశాన్ని రాష్ట్రప్రభుత్వాలు కూడ 14ఏళ్ళవరకు విద్యార్ధులకు అమలుచేయడం వచ్చింది. 6 నుంచి 14 ఏళ్ళవరకు ఉచితవిద్యను, 14ఏళ్ళలోపు పనిలోకితీసుకోరాదని వచ్చిన చట్టం ముఖ్యమైన మార్పులని చెప్పాలి. యిటీవలే, ఈ బాలకార్మికవ్యతిరేకచట్టాన్ని, ఉచితవిద్యాకార్యక్రమాల గురించి వివరిస్తూ, రాజ్యసభలో కేంద్ర కార్మిక, ఉపాధికల్పనామంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్, భారతదేశంలో జాతీయ బాలకార్మికానిర్మూలన ప్రాజెక్టుని 250 జిల్లాల్లో, 20 రాష్ట్రాల్లో, పునరావాస కార్యక్రమాల్ని అమలుచేస్తున్నామని, యిందులో భాగంగా, ప్రతి బాలకార్మికుని ఉద్యోగంలోంచి బయటకు తీసుకువచ్చి, అందుబాటులోకి తెచ్చే చదువు, ఆహారపోషణం, భౄతి, ఉపాధికల్పనకవసరమయ్యే శిక్షణ, ఆరోగ్యావసరాలను తీర్చేలా అమలుచేస్తూ, పూర్తిస్థాయిలో చదువులో పెట్టడం అమలుచేస్తున్నాట్లు వివరించారు. ఈ కార్యక్రమాన్ని అమలుచేయడంలో, యిదివరలో సుప్రీం కోర్టు ఆదేశాలు ఎలా అమలుపరుస్తారు అన్న ప్రశ్నకు బదులుగా సమాధానం చెప్పారు. యిటీవలే వెలుగులోకి వచ్చిన డిల్లీ - కరోలుభాగ్ లోని రెఘాపుర, బేడోంపుర ప్రాంతపు 93 బాలకార్మికులను 19 మే 2007 న విడుదలచేసినట్లు ప్రకటించారు. అయితే, అందకుముందుగా, 21 నవంబర్ 2006 న, అతిపెద్ద విముక్తి కార్యక్రమంగా, 425 బాలకార్మికులను డిల్లీ - జఫరాబాదులోని జరీకర్మాగారంలోని పిల్లలను విముక్తిచేయడం, వెంటనే వారి తల్లిదండ్రులకు అందజేయడమే పునరావాస కార్యక్రమంగా జరిగిందని, కార్యక్రమంలో భాగమైనది అయిన పాఠశాలల్లో చేర్పించడం అనేది తెలివిగా ప్రక్కకు పెట్టెవేశారు. డిల్లీలోని ప్రముఖవాణిజ్యకేంద్రం అయిన నెహ్రూ ప్లేస్ పరిసరాల్లోనే అనేకమంది బాలకార్మికులు తటస్థపడతారన్నది కూడ పత్రికల్లో ప్రకటనలు రావడం కూడ జరిగాయి. ప్రమాదస్థలాల్లో పనిచేశే పిల్లల విషయంలో, వారి తల్లిదండ్రుల ఉద్యోగ వివరాలు, ఆర్ధిక స్థితిగతులు, సామజికపరిస్థితులు, ప్రణాలికను అమలుపరచేముందుగానే ఆధ్యయనం చేయాలన్నది కూడ ముఖ్యాంశం అని ప్రభుత్వాలు గుర్తెరిగి నడచుకోవాలి. మనసా వాచా కర్మణా బాలకార్మికనిర్మూలనా ప్రణాళికా కార్యక్రమాన్ని అమలుపరెచే విధానంలో, ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వేతరసంస్థలను, వక్రీకఋరణపద్ధతులకు తగిన శిక్ష, జరిమానాలు విధించాల్సిన అవసరం ఎంతైనా వున్నది. ఈ విషయంలో, కార్యక్రమాన్ని అమలుచేసే బాధ్యతాయుతాధికారులు మౌనం వహిస్తే ఈ వక్రమార్గాన్ని అంగీకరించినట్లు అవుతుంది అన్నది కూడా సత్యం. కొన్నికొన్ని పరిస్థితుల్లో మౌనం అసత్యం కన్న దారుణంగా తయారవుతుంది. అంతేకాదు, దారుణాన్ని ప్రోత్సహించినట్లు, ప్రోద్బలాన్ని యిస్తున్నట్లు కూడ జమ అవుతుంది. అదే సరిగ్గా అవుతున్నది, ఈ కార్యక్రమం అమలులో.
ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం - 12 జూన్ న

అంతర్జాతీయ కార్మిక సంస్థ, 2002 నుంచి ప్రతి జూన్ 12 న నిర్వహిస్తున్నది. పిల్లలను అక్రమరవాణా నుంచి నిరోధించడం, బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించడం, ఈ నాటి కార్యక్రమ లక్ష్యం, పరమావధిగా ప్రారంభమైంది. మూడవ ప్రపంచదేశాల్లోనేకాక, అభివౄద్ధిచెందిన దేశాల్లోనూ బాలకార్మిక వ్యవస్థ కొనసాగుతూండడం, అందరు పిల్లలూ చదువుకోవాలనుకోవడం, అందమైన, సున్నితమైన బాల్యావస్థని అందరికీ అందచేయాలని ప్రతీ పౌరుడు ప్రతిజ్ణ చేయాలని, ఆ దశలో దిశలో ఆచరణాత్మక కార్యక్రమాన్ని పవిత్రంగా ఆచరించడం, నేను సైతం అన్నట్లు ప్రతి ఒక్కరూ తనవంతుగా చేయూతనివ్వాలని, ప్రప్రంచవ్యాప్తంగా వున్న 24.6 కోట్ల బాలకార్మికులకు అత్యంత త్వరితగతిని విముక్తి కలిగించాలని ఆశ, ఆశయం నెరవాలని అందరూ ముందుకు సాగుదాం. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు, పదండి ముందుకు, పదండిముందుకు అని సాగుదాం, పయనిద్దాం.
పసిచేతులు - పనిమోతలు

బాల్యాన్ని అపురూపంగా వదిలి, చేతనంత విజ్ౙాన, వికాస, వినోద రంగాలపై చేయూత నిచ్చేది పోయి, పసిచేతులతో, పనిమోతలు, భరించరాని బరువుల్ని మోయిస్తున్న ఈ దుష్ట సమాజాన్ని యిప్పటినుంచైనా, కనిపెట్టి ఈ దుస్థితినుంచి బాలవర్గాన్ని బయటపడేసే మార్గం, ప్రణాలికలు సిద్ధం చేసేందుకు ప్రభుత్వ, స్వఛ్ఛంద, ప్రభుత్వేతర రంగాల్లో విశేషమైన కౄషి నిత్య, సత్వరంగా జరగాల్సిన తరుణం ఆసన్నమైందని ఘోషించాలి.
అంతర్జాతీయ బాలకార్మిక నిర్మూలన దినోత్సవం సందర్భంగా, ఆ దశ, దిశలో మార్గం సుగమం కావాలని, మనదేశపు భావిభారత పౌరులకు, చిన్నారుల వదనాల్లో చిరునవ్వు, చిరుమందహాసం కనీసం ఒక్కసారైనా కనపడాలని, తెలుగురధం మనసావాచాకర్మణా ఆశిస్తూ, బాలకోటిని ఆశీర్వదిస్తూ, నేను సైతం అంటూ సంకల్పాన్ని ప్రకటిస్తోంది.
భావిభారత బాలకోటికి ఆశీర్వచనాలతో, అభినందనలతో -
తెలుగురధం - కొంపెల్ల శర్మ


Tuesday, June 10, 2008

క్రోధం - ఉపాఖ్యానం

క్రోధోపఖ్యానం
సమాజానికి మంచిని పెంచగలిగే క్రోధం అవసరం - ఓంకారానంద
క్రోధం మొదలైన దుర్గుణాలవల్ల ఉద్రేక, ఉద్వేగ పరిస్థితులు ఉత్పన్నమవుతాయి, వీటిని నియంత్రించేందుకు వివిధ రంగాల్లో అనుభవమున్న పండితుల సలహాలను స్వీకరించి, ఆచరించాల్సిన అవసరం ఎంతైనా వుంది అన్నదాంట్లో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. ఒకరి యిష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, మానవ జీవితంలో ఉద్రేకాలు ముఖ్యమైన, అనివార్యమైన అంశాలు. క్రోధం, గర్వం, అతివిధేయత, కొన్ని కొన్ని సంధర్భాల్లో కొంతవరకూ అవసరమనిపించవచ్చు. అవసర సమంజసాలతో కూడిన క్రోధం సరిగా అవసరమైన ఉద్రేక, ఉద్వేగాల్ని ప్రసాదిస్తుంది అని అనుభవవేత్తలు చెప్తారు. మానవుల్లో దాగిన క్రోధాది అంత:శతౄవులను ప్రకటింక్ష్చడం ద్వారా, బహిర్గతమైన అవాంఛనీయమైన ఉద్రేకాల్ని ఎదుర్కోవాలి కదా. సందేశ, సలహాలను అవసరమైన మేరకు అందిస్తే, చాలామందిలో క్రోధాన్ని కొంతవరకైనా తగ్గించవచ్చునేమో. మానవులకు సహజసిద్ధమైన క్రోధాది ఉద్రేకాలను నియంత్రించడం ఎందుకని ప్రతీ ఒక్కరూ ప్రశ్న వేసుకుంటే దీనికి సమాధానం మన భారతీయ స్మౄతి, వేద, పురాణ యితిహాసాదుల్లో సందర్భానుసారంగా వివరించడం జరిగింది. వాటిని ఆధ్యయనం చేయకపోవడమే మనలోని లోపం అని చెప్పాలి.
వేదపర ప్రార్ధన
'మన్యరసి మనయం మహి దేహి ... సహో అసి సహో మయి దేహీ అన్న శ్లోకానికి - 'ఓ భగవంతుడా, క్రోధరూపంలో వున్న నీవు నాకు క్రోధాన్ని ప్రసాదించు. ఓర్పు రూపాన వున్న నీవు నాకు ఓర్పుని ప్రసాదించూ అని అర్ధం.
పరస్పరంగా ఈ రెండు విషయాలు విరుద్ధంగా కనిపించినా, సమయ సందర్భానుసారంగానే క్రోధాన్ని ప్రకటించాలి అన్నది నిజం. కాఆఅని, క్రోధం ప్రశాంతతని, స్వస్థతని, ఆటంకపరచరాదని, ఆధునిక పరిభాషలో చెప్పవలసివస్తే, 'ఒత్తిడీకి బానిస కారాదని మనకు తపోమునులు, ౠషులు ఘోషించిన సారాంశం. క్రోధం వల్ల సమాజంలో మంచి జరిగితే, మరీ మంచిదే కదా, ఆహ్వానించ దగ్గదే అన్నది కూడ సత్యం. పూర్వకాలంలో సమాజ కళ్యాణానికి, దుష్టశిక్షణ, శిష్టరక్షణకీ క్రోధాన్ని వినియోగించడం జరిగింది. మరి యిప్పుడూ, వినాశనానికీ, విధ్వంసానికీ క్రోధం మూలం, బీజం అవుతున్నాయి అన్నది కలియుగపు లక్ష్యలక్షణంగా మారడం దురదౄష్టకర పరిణామంగా మారింది. అవాంఛనీయపు దాడులు జరిగితే, సామంతరాజు క్రోధాత్ముడుగా మారవలసిరావడం, కాని పరిస్థితుల్లో, తాను రాజే అనిపించుకోకపోవడం కూడ చరిత్రచెబుతున్న దాఖలాలు కోకొల్లలు. దేశంలో తాండవిస్తున్న బీదరికం, దారిద్ర్యం, అసమానతలు, వివక్షతలు, విచక్షణాది అసమంజసపు పరిస్థితుల్ని చూసి, ప్రతీ పౌరుడూ క్రోధాన్ని పెంచుకుని, వాటి నిర్మూలనకు వినియోగించే నిమిత్తమే, పూర్వం క్రోధాన్ని వివరించడం జరిగింది. ఈ మహమ్మారి దుష్టశక్తుల్ని పారద్రోలే ప్రయత్నంలో జరిగే కౄషిలో భాగంగా క్రోధం ఆహ్వానించదగ్గదే అని - మహానుభావుడు స్వామి వివేకానంద చెప్పాడు. యిదే శైలిలే, పలువురు పెద్దలు వివరించిన సందర్భాలు కూడ అనేకం. స్వార్ధంతో క్రోధాన్ని ప్రకటించి, లాభాపేక్ష పొందాలని చూస్తే, అటువంటి క్రోధాన్ని సమూలంగా నిర్మూలించడం వినా వేరే మార్గం లేనే లేదు. పాము విషం మందులోకి ఎలా ఉపయోగిస్తున్నామో, అలాగే ఉద్రేమం, దాని విలువ, ప్రకౄత సిద్ధంగా అవసరాన్ని బట్టి వాటి ప్రాధాన్యత గోచరిస్తుంది. కనుక, మన క్రోధ, ఉద్రేకాల్ని చాలా పరిమితుల్లోనే ఆచి, తూచి, ఉపయోగించాలి కదా. మన భారతీయ సనాతన ధర్మ సంస్కౄతిలో తల్లిదండ్రులు, గురువు ద్వారా పసితనాన్నుంచే వ్యక్తిత్వ వికాసానికి దారితీసే సదవకాశం వుందని, దాన్ని సద్వినియోగం చేసుకుంటూ సదాచారాల్ని పాటిస్తే, క్రోధం మన దరికి వచ్చేందుకు ఎన్ని వేల గుండెలు కావాలి? తల్లిదంద్రులు కూడ వారి సంతానం తెలివితేటల్ని పెంచుకునేందుకు వీలైన పరిసర, వాతావరణాల్లో పెరిగేలా జాగ్రత్తలను తీసుకుంటే, క్రోధం, అందోళన, ఉద్రేకాదులు దరికి చేరవు. మన సంప్రదాయం విశదీకరించిన పద్ధతి ప్రకారం, వ్యక్తి, జ్ౙాన, ఉద్రేకపరంగా, మానవునిలో సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం యివ్వాలి. దేనికైనా, నాణ్యత, ఆలోచనా దిశ, ధోరణులతోపాటు, శ్రద్ధాసక్తులు, భయభక్తులతో, నిరంతర ఆధ్యయన, అభ్యాస ప్రక్రియలను ఆచరించడం చాలా ముఖ్యం. ప్రస్తుత తరంలో, మతపరమైన విషయాల్లో, నిరాసక్తి, విరుద్ధమైన అభిప్రాయాలు కడు మెండుగా చోటుచేసుకుంటున్నాయి అన్నదాంట్లో అతిశయోక్తి లేనేలేదు కదా. సమాజంలోని భాగమైన సాధువులు, స్వామీజీలు, బాబాలు, వీధికొకటి ప్రతీరోజు వెలుస్తున్న తరుణంలో, ఈ సేవావర్గం, వారి భక్తులు, అభిమానులు, మన ఆచారవ్యవహారాలను, సంస్కౄతిని, సంప్రదాయాన్ని, దౄష్టిలో వుంచుకుని, వెల్లివిరుస్తున్న వైరుద్ధ్య, అనాసక్తి ధోరణులను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం కూడ ఎంతైనా వుంది. ఈ దుస్థితిని నివారించేందుకు, విద్యాసేవాసంస్థలు, స్వఛ్ఛందసంస్థలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర వర్గాలు సంయమనం పాటిస్తూ, తగినన్ని అవాగాహనా కార్యక్రమాలని ఏర్పాటు చేయాలి. యిందుకోసం నిర్వహించే సదస్సులు, సమావేశాలు, ఆధ్యాత్మిక, మత గురువులు, సాహితీవేత్తలు, తత్వవేత్తలు, మానసికవేత్తలాది ప్రముఖులచే సందేహ నివౄత్తులను నివారించే ముమ్మర కార్యక్రమం విరివిగా, నిరంతరం నిర్వహించాలి. పాఠ్యంశాలుగా ప్రవేశపెట్టడం కూడ చెయ్యాలై. యిటువంటి వ్యక్తిత్వా, వికాస కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించేవారు, సద్విమర్శలను ప్రకటించవచ్చును కాని, యితర మతపర విశ్వాస భావాల మీద మాత్రం విమర్శలు, దాడులు తగవని కూడ తగు ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.
మన నిత్యం అసంకల్ప చర్యగా ప్రకటించే క్రోధం, ఉద్రేకం, ఆందోళనల వెనుక ఉన్న తతంగం యింత వుంది. నిజంగా మరి ఒక ఉపాఖ్యానమే కదా. అందుకనే యిది, క్రోధోపాఖ్యానం.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

Monday, June 9, 2008

సాహితీ సుగతుడు - తిరుమల రామచంద్రుడు

సాహితీ సుగతుడు - తిరుమల రామచంద్రుడు ( 1913 - 1997 )
మహామనీషి
సంస్కౄత, ఆంధ్ర, కన్నడ, తమిళ, హిందీ, ప్రాకౄత, ఆంగ్లభాషలలో చక్కని అభినివేశంతోపాటు సంపాదించుకున్న పాండిత్యం, ప్రసిద్ధ పాత్రికేయులు, స్వాతంత్ర్యసమరయోధులు, నిరాడంబరులు, ప్రాత:స్మరణీయులైన కీ.శే.శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి ప్రశిష్యులు, ప్రొఫైల్ చిత్రణంలో మరపురాని మనీషిని చిత్రించిన సిద్ధహస్తులు, ప్రసిద్ధ విద్వాంసులు, ఎన్నో రచనలను తెలుగువారికి తీయందనాలు పంచిపెట్టిన తేనపట్టులను నిర్మాణం చేసుకున్న నిపుణుడు, రచయిత, విశేషించి మనసున్న మనిషి, ఎందరి మనీషుల చేతనో మన్నన లందుకొన్న మానిసి, తెలుగువారికి మరపురాని మనీషి. సాహితీ సుగతుని ప్రస్తావన. ఆయనే శ్రీ తిరుమల రామచంద్ర.
నవలక్షణ సపాత్రికేయుడు, సల్లక్షణరచనామూర్తి - తిరుమల రామచంద్రమూర్తిప్రముఖ పాత్రికేయులు, ఎ.బి.కె.ప్రసాద్ 'నిబద్దాక్షరి - సాహిత్యకీయాలూ రచనకు విప్పారిన అపరంజిరేకులు అన్న ఆముఖంలో వివరిస్తూ, ప్రముఖ పాత్రికేయులు కొక్కొండ వెంకటరత్నం పంతులుగారు నిర్వచించిన విలేఖరి లక్షణాలను, ప్రసాదుగారికి తిరుమల రామచంద్రగారు అన్వయించినా, నిజానికి ఆ లక్షణాలు, తిరుమల వారికి కూడ నిస్సందేహంగా వర్తిస్తాయి. అవి - పాండిత్యం, సత్ప్రవర్తనం, జగద్వ్యాపార విజ్ణత్వం, స్థైర్యం, ఉచితజ్ణత్వం, శక్తిత్రయం, సూక్తిచాతుర్యం, ధనం (సాహితీధనం). ప్రసాదుగారి మాటల్లో చెప్పాలంటే, పండిత పాత్రికేయ తరంలో కొసమెరుపు - తిరుమల రామచంద్రగారు.
పిట్టకొంచెం కూత ఘనంతిరుమల రామచంద్ర రచనలు చదివితే బిందువులో సింధువుని చూడడం జరగడమేకాక, సమగ్ర సాంఘిక సాహిత్య దౄష్టితో సాగే రచనలు ఒక ప్రత్యేక ప్రపంచంలో విహరిస్తూ, కొత్తసౄష్టిలాగ అనుభవం పొందుతారు. ఈ సాహితీ సుగతుడు ఎంతటి భాషాసంపన్నుడో అంతటి నిరాడంబరుడు; ఎంతటి పాండిత్య ప్రజ్ణాపాటవాలు కలవాడో అంతటి నిగర్వి; సంస్కౄతంలో సాహిత్య 'శిరోమణీ, తెలుగు సంస్కౄతాలలో 'విద్వాణ్, హిందీలో 'ప్రభాకఋ లాంటి పట్టాలు పుచ్చుకొన్న పొట్టివాడైనా గట్టివాడు. పిట్టకొంచెం కూతఘనం అన్న నానుడి రామచంద్రకు సరిసమాన్వయం. కన్నడభాషలో పాండిత్యమూ, తమిళంలో గాఢపరిచయమూ కలవాడు; శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి దగ్గర ఆంధ్ర, ప్రాకౄతభాషా పరిశోధకులుగా ప్రతిభాశిష్యరికం చేయడం, తంజావూరు సరస్వతీమహల్ గ్రంధాలయంలోనూ, మద్రాసు ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీలోనూ పండితమాన్యులుగా తనదైన ప్రతిభాశైలిని ప్రదర్శించారు. ఎన్నోఏళ్ళుగా పత్రికా రచయితగా, దినపత్రికల్లో, భారతి, పరిశోధన పత్రికల్లో, అపర సవ్యసాచిలా తన భాషాసేవలను అనితరసాధ్యాలు కావించారు. భాషాసేవకసమితి స్థాపకులుగా, ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘ సభ్యులుగా తిరుమలగారి సేవలు అనల్పం.
తిరుమల కలం నుంచి ఎందరో మహానుభావుల లేఖినీ చిత్రవ్యాసాలుఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అంటాము. ఈ భావాన్ని తిరుమల రామచంద్రగారు కడు సార్ధకతను కలిగించిన రచనలకు మకుటాయమానమైన రచన - మరపురాని మనీషి అన్న పేరున మనీషి వతంసుల లేఖినీ చిత్రాలను, మహనీయుల గూర్చి పరిచయాత్మక వ్యాసాలను విరచించారు. యివి కేవలం వ్యాసాలు కావు; అలా అని కేవలం చిత్రాలు కావు; ఈ నూతనప్రక్రియను సమంగా వివరించాలంటే, ప్రముఖ సాహితీ విమర్శకుడు, జి.వి.సుబ్రహ్మణ్యంగారు తన ప్రస్తావనలో వివరించిన తీరు యిలా వుంది. కధనంలో,వర్ణనంలో, చిత్రణంలో, మనీషియొక్క రూపురేఖలతోపాటు, భావవ్యక్తి రూపుకట్టడం రేఖాచిత్రానికి ప్రధానలక్ష్యం. ఒక దౄక్కోణంతో ఒక వ్యక్తి ప్రధాన వ్యక్తిత్వాన్ని, సమకాలీన వాతావరణానికి అన్వయించి సమీక్షించడం, చిత్రంలో ముఖాన్ని ఒక కోణంనుంచి దర్శించిన విధంగా రూపొందించడం కూడా జరుగుతుంది. చిత్రకళలో రేఖలు చేసేపని ఈ ప్రక్రియలో కధన, లేక, వర్ణన శిల్పం చేయడం, ఎవరు ఏమని నిర్వచించినా, రామచంద్రగారు మాత్రం లేఖినీచిత్రమని భావించారు. ఈ లేఖినీపరంపరలో, మరపురాని మనీషులను చిత్రించిన వారిలో, ఇల్లిందల సరస్వతీదేవి, ఖండవల్లి లక్ష్మీరంజనం, గిడుగు సీతాపతి, గుర్రం జాషువా, తల్లావఝ్ఝుల శివశంకరశాస్త్రి, తాపీ ధర్మారావు, తుమ్మల సీతారామమూర్తి, దేవులపల్లి కౄష్ణశాస్త్రి, దేవులపల్లి రామానుజరావు, నాయని సుబ్బారావు, నార్ల వెంకటేశ్వరరావు, బందా కనకలింగేశ్వరరావు, మాడపాటి హనుమంతరావు, మామిడిపూడి వెంకటరంగయ్య, రాళ్ళపల్లి అనంతకౄష్ణశర్మ, విశ్వనాధ సత్యనారాయణ, స్థానం నరసింహారావు లాంటి ఉద్దండుల వ్యక్తిత్వచిత్రణలను అపరంజిరేకులుగా అద్దారు. తెలుగువారికి తిరుమల రామచంద్రగారు మరపురాని మనీషిగా మారిపోయారు.
తిరుమల నుడి - రామచంద్ర నానుడి
తిరుమల వారు రచించిన మరోగ్రంధం, నుడి-నానుడి. ఈ గ్రంధంలో ఎన్నో తెలుగు మాటల వ్యుత్పత్తులు, సులభగ్రాహ్యమైన శైలిలో చర్చించడం జరిగింది. ఈ వ్యాసాల్లో, సంస్కౄతాంధ్ర భాషల్లో వున్న పాండిత్యమే కాక, యితర భాషల్లో వారికున్న చొరవ, పరిశోధనాత్మకసహిత మేధస్సు పఠితకు వ్యక్తమవుతుంది. ప్రముఖ భాషాశాస్త్రవేత్త భద్రిరాజు కౄష్ణమూర్తిగారన్నట్లు, వ్యక్తులలాగానే మాటలకు గూడా విలక్షణమైన చరిత్ర వుంటుంది. కొన్ని వేల ఏండ్ల జీవితచరిత్ర గల మాటల్లో క్రమంగా ఏర్పడ్డ ధ్వనుల మార్పులు, అర్ధ పరిణామాలు, కొన్ని శాస్త్రీయ ప్రమాణాలను బట్టి ఉద్ధరించడం, ఒక రూపపైన భాషాపరిశోధన. వాడుకలో నలిగినకొద్దీ నియమబద్ధంగా ఉచ్చారణలు మారి శబ్దరూపాలు మారిపోతాయి. అంతేకాదు, మాటలపుట్టుకలు తులనాత్మక దౄష్టిలో పరిశీలిస్తేనే గోచరిస్తాయి. శాస్త్ర విషయాలను అందరికీ ఆప్యాయంగా వుండే రీతిని చెప్పడం రామచంద్రగారి ప్రత్యేకశక్తిని భద్రిరాజువారు విశదీకరించారు. మాటల పుట్టుకలు పోల్చి సమన్వయించటంలో ఎన్నో సాంఘిక, సాంస్కౄతిక విజ్ణాన విశేషాలు పాఠకులకు హౄదయోల్లాసంగా పదిలపరచారు. తిరుమలవారు తన నుడి-నానుడి రచనలో ఎన్నో పదాలను సవివరంగా చెప్పడం జరిగింది. మచ్చుకు, చెంబు-కంచం, వాన, నీరు-వెల్లువ, రోలు-రోకలి, తెడ్డు-గరిటె, పులిమీదపుట్ర, అవ్వాయిచువ్వా, కొడవలి-నాగలి, ఉర్పు-ఉప్పు, జల్లెడ-చేట, పాలు, చారు, వంకాయ, చింత-పులుసు, ఊదువత్తి-అగరువత్తి, మగువు-మగువ, టెంకాయ, కోటలోపాగా, జీడి-జీడిమామిడి, పాడి-పంట, పొంగలి-పులగం, ఉల్లి-అల్లియం, పస్తు-పసి, నీళ్ళాడు, కొమ్ములితిరుగు-కొమ్ములుచూపు, మిరియమూ-మిరపకాయా లాంటి అనేక పదావళికి శాస్త్రచర్చతోపాటు, పదాల చరిత్ర, పుట్టుపూర్వోత్తరాలు, సాధ్యాసాధ్యాలను వివరిస్తూ, చమత్కారపూరకంగా, ఉత్కంఠతో నడిపించిన నవలారాజం, నుడి-నానుడి, నానుపుతనంలేని వాసితనం చూపారు. అలనాటి అంధ్రపత్రికలో నుడి-నానుడి రచనాశీర్షికతో, రెండున్నర దశాబ్దాలకాలంపాటు తెలుగు పాఠకలోకాన్ని ఉర్రూతలూపిన పదపదార్ధ చర్చద్వారా, రామచంద్రగారు మాటల్ని, మాటలచేత, మాటలతో మాట్లాడించగలగడం, ఆయన మాటకారితనానికీ, వ్రాతగానితనానికీ సాంకేతికాలు, నిదర్శనాలు. తెలుగు భాషాగ్రంధం, మాటల రూపంలో వున్న వాటికి, భావానికి భావచిత్రణను కూడ జోడించి, ప్రముఖచిత్రకారుడైన బాపు చేత బాపురే అనిపించేటట్లు రేఖలను రేకెత్తించిన భావపటిమకు జోహార్లు సమర్పించకుండ వూరుకోలేము.
సాహితీసుగతుడు - రామచంద్ర స్వగతాలుతిరుమల రామచంద్రగారు కూర్చిన మరో రచన - సాహితీ సుగతుని స్వగతం. సాహిత్యవ్యాస ప్రసూనమాల అయిన ఈ రచనలో, సాహిత్యం, సంగీతం, వివిధ దేశాలలోని నాటక రచనౌ, సాంస్కౄతిక రంగాలకు సంబంధించిన వ్యాసాలు, బహుముఖప్రతిభావిన్యాసాలు. ఏమాత్రం సాహిత్యాభిరుచికల వారికైనా ఆసక్తిని, శ్రద్ధభక్తులని కలిగిస్తాయి. సాహిత్యంలోని సొబగుల్ని సాహితీపాఠకుణ్ణి కళ్ళముందు ఆవిష్కరిస్తాయి. అర్ధశతాబ్దికాలంపాటు సాహిత్యపుసొబగుల్ని అందించిన ఆనాటి ఏకైక సాహితీపత్రిక 'భారతీకి అంకింతం యివ్వడం రామచంద్రుని ఆలోచనాలోచనాల్ని భుతద్దం పట్టి చూసినా పసిగట్టలేని ప్రతిభాపాటవం. ఈయన స్వగతాల్లో, వైవిధ్యమైన, ఆసక్తికరమైన వ్యాసాలున్నాయి. ఉదాహరణకు - తెలుగుజాతి ప్రాచీన సంగీతరూపకం (బుర్రకధ), ఆంధ్రసాహిత్యంలో స్త్రీ పర్యాయపదాలు, పాతదైనా కొత్తదారిన వచ్చిన ఏకాంకిక, నూరు-నూటేనిమిది-నూటపదహారు పదాలపై విపులవాఖ్యానం, బుద్ధుని ముందునుంచే వున్న ధూమపానం, కళలూ శాస్త్రాలూ ఏవి ముఖ్యం, మాటలమాటులోని సంగీతం, త్యాగయ్యగారి కౄతుల్లో రాగరచనా సమవ్వయం లాంటి అసక్తికరమైన వ్యాసపరంపర మరచిపోలేని పఠనాసక్తిని ప్రేరేపిస్తుంది. యివి చదివాక, రామచంద్రుని స్వగతాలు కాక, అందరి అనుభవగతాలుగా అవతరిస్తాయి.
తెలుగుభాషా లిపి లోతుపాతుల్ని తవ్వి పెకలించిన తత్వవేత్తసాహిత్య, సంగీత, నాటక, సాంస్కౄతిక రంగాల గురించి రామచంద్రకు తెలియని ఆంశాలు తక్కువ. దీనికి నిర్వచనోదాహరణం, ఆయన రచన - 'మన లిపి - పుట్టుపూర్వోత్తరాలూ. తెలుగు భాషా లిపి చరిత్రలో తలమానికమైన గ్రంధాన్ని ప్రముఖ పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖరశర్మగారికి అంకితమివ్వడంతోపాటు, తెలుగు సాహితీ సంస్కౄతీరచనలను ప్రచురణాయజ్ణంలో తెలుగుదేశానికి అందిస్తున్న విశాలాంధ్ర ప్రచురణాసంస్థకు అంకితమివ్వడం ఒక మధురోహ, తిరుమలవారికే తట్టిన ఆలోచనాతరంగం. ఈ లిపిరచన దేశీయ, విదేశీయ లిపి పరిణామాలను సంకలనం చేసి తీర్చిదిద్దిన రచనను, యితర భాషలలో కూడా యిలాంటి రచనలేదన్న విశ్వాసప్రకటనను చేసిన 'ఆంధ్రవిశారదా తాపీ ధర్మారావుగారు చేయడంకన్న 'కితాబు, నజరాణా' వేరే ఎందుకు. దీన్నిబట్టి ఈ లిపిపరపుస్తకాన్ని వర్ణించడానికి ఎలాగో అలాగ మాటలు పేర్చుకోవచ్చుగాని, ఆ మాటలను స్థాపితం చేయడానికి అనువైన లిపి మాత్రం అలభ్యం అని చెప్పక తప్పదు.
తిరుమలవారి యితర తాపత్రయాలుభార్తౄహరి సుభాషితరత్నావళి రచనకు చెప్పిన కారణం, జీర్ణమంగేషు షుభాషితం, అని, మంచి మాట కరువైపోయింది, అందుకే నీతిశతక రచనకు ఉపక్రమించినట్లు చెప్పాడు. కాని తిరుమల రామచంద్రవారి రచనల్లో, సుభాషితాలకు కొరత, కొదువ లేనేలేదు. మంచిమాటల మూటలు ఆయనే నిర్మించిన కోటల్లోనే అందాలరాశుల్లా పేర్చిపెట్టాడు. తిరుమల రామచంద్రగారి యితర రచనల్లో, మరపురాని మనుషులు, అహంబో అభివాదయే, తెలుగు వెలుగులు, తెలుగు పత్రికల సాహిత్య చరిత్ర, ఆంధ్రభాషా సంజీవి సంపాదకత్వం, అడవి బాపిరాజుగారి మీజాన్ పత్రికలో రామచంద్రగారి సాహితీరచనా వైవిధ్యత, రాయలసీమబిడ్డ రామచంద్ర సాహితీరతనాలసీమను నిర్మించాడు. అచ్చతెనుంగు కబ్బమున కాది పదంబయి పొల్చు భాగ్యమున్ హెచ్చుగనున్న దేశం - తెలంగాణమని ఘోషించిన ఘనాపాటికి, ఎవరూ లేరు సాటి.
సమాజ శ్రేయస్సు - తౄతీయ పురుషార్ధంపఠన, సందర్శన ప్రక్రియల ద్వారా సాటి పండితుల్లో మేటి అనిపించుకున్న తిరుమల వారు, తెలుగు భాషాసాహితీరంగానికి ఎనలేని సేవలు చేసిన వీరిని ఒక విశ్వవిద్యాలయం గా నిష్కర్షగా భావించవచ్చు. రామచంద్రగారు వ్రాసిన వ్యాసాలన్నింటిలోకి తరచు స్ఫురణకి, స్ఫూర్తికి వచ్చే వ్యాసం - "సమాజ శ్రేయస్సు - తౄతీయ పురుషార్ధం' అని చెప్పాలి. చతుర్విధ పురుషార్ధాల్లో, 'కామం' అంశంపై కావించిన విశ్లేషణ అద్భుతం. ప్రముఖులైన, మనువు, వాత్స్యాయనుడు, బూ అలిపినా (అరబ్బు పండితుడు), డా.హెవలాక్ ఎల్లిస్, ఆంద్ర మోర్వా వంటి ఉద్దండుల అభిప్రాయాలని క్రోడీకరించారు. వాత్స్యాయనునికి ముందే దత్తక, కూచిమారాది తొమ్మిదిమంది ఆచార్యులను ఉదాహరించడం, వ్యాసానికి అర్ధం, పరమార్ధం కలిగించాయి. చివరికి, ఉపనిషత్తు వాక్యం, "మాతా పూర్వరూపం, పితోత్తర రూపం, ప్రజా సంధి:, ప్రజననం సంధానం' - అంటే భార్యాభర్తలలో ఒకరు ఎక్కువా, మరొకరు తక్కువ అనేదేమీలేదు, ధర్మశాస్త్రాలు, శాసనాలూ యిద్దరికీ ఒకటే అని పదేపదే ప్రకటించడంపై నొక్కి వక్కాణించారు. ఆధునిక సమాజం మొత్తం తిరుమల వారి వ్యాసాన్ని ఆమూలాగ్రంగా అర్ధంచేసుకోవడం అత్యవసరం.తిరుమల రామచంద్ర ఆత్మకధ
తిరుమల రామచంద్ర గారి అంతరంగాన్ని కొంతవరకూ అయన సాహితీరచనల ద్వారా పడికట్టవచ్చు. సాహితీదర్శనం ద్వారా, తిరుమలవారి ప్రతిభను సాహితీరసపిపాసకులు తప్పక ఆనందించి తీరుతారు. తిరుమల రామచంద్రగారి వ్యక్తిత్వం, ప్రతిభ, ఆయన ఆత్మకధ 'హంపీనుంచి హరప్పాదాకా' అన్న రచనకు 2001 లో కేంద్ర సాహిత్య అకాడమీ వారినుంచి గుర్తింపు, సత్కారం లభించాయి అంటేనే, తిరుమల వారి ప్రతిభకు ఆజానుభాహవ్యక్తిత్వం దర్శనం అవక తప్పదు. సాహితీ సుగతుని స్వగతాలు సుమనోహరాలు, అపాతమధురాలు, ఆలోచనాపాతాలు. అల్పంలో అనల్పాలు. తిరుమలవారి కీర్తికిరీటంలో కలికితురాయిలు. మానవుడు సర్వజ్ణుడు కాడని, నేర్చుకోవలసింది ఎంతో ఉందన్న స్పౄహను కోల్పోనివాడు, సాహితీసుగతుడు, మన తిరుమల రామచంద్రుడు. రామచంద్రునిది మానససరోవరం, ఆలోచనాభావాలకు శ్రవ్యారూపాలైన మాటలు, దౄశ్యరూపాలైన వ్రాతలు రాజహంసలు. ఎ.బి.కె. ప్రసాదుగారి మాటల్లో చివరగా చెప్పాలంటే, అజ్ణానమనే సముద్రాన్ని దాటితే తప్ప రామచంద్రునిలాంటి వాళ్ళని చేరుకోవడం ఎవ్వరికైనా దుస్సాధ్యం! రామచంద్ర ప్రాపంచిక దౄక్పధం మానవతావాదం - ఈ విశ్వం వైవిధ్య విలసితం, ప్రతి వ్యక్తిలోనూ ఏదోమంచి, ఏదోమించు (మెరుపు) కనిపిస్తూనే వుంటుంది. అందుకే నాలక్ష్యం మానవత్వం, అది చిరంజీవి,నేనూ చిరంజీవిని అన్నాడు. అతని పేరు రామచంద్రుడు, చిరునామా తిరుమల. భాషాప్రియులకు బంధువు. అనురాగసింధువు. రామచంద్రుడు సాహితీలోకంలో అమరుడు. నిత్యం మన కన్నుల్లో, మనసుల్లో, మెదలుతూ, కదలుతూ, వుంటాడు అన్నది సత్యం. ఆంధ్రసాహితీజగతిలో ప్రాత:స్మరణీయుడు, మన తిరుమల రామచంద్రుడు.
తిరుమల రామచంద్రుడు గారికి - ఆ వ్యక్తి లోని అపార శక్తికి శతసహస్ర ప్రణామాలు - తెలుగురధం సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.
ఫోన్. 97017 31333/65975574

Friday, June 6, 2008

నాకు తెలియని నేనెవరో - ముకుంద రామారావు - సమీక్ష

పుస్తకప్రపంచం
నాకు తెలియని నేనెవరో - ముకుంద రామారావు
'కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడూ అని ఒక యుగళగీతంలో చెప్పాడు ఒక చిత్రగీతకవి. అలా ప్రేయసీప్రియులు తమ కళ్ళద్వారా ప్రేమరామాయణాన్ని పంచుకుంటారు. కాని కవిత్వం వచ్చేసరికి కవి తన కవితల ద్వారా కవితాభిమానులకు ఒక కొత్తతరహా చక్షువుల్ని అందించే బాధ్యత తప్పదు మరి. అవసరమైతే, పాఠకుడు తనదైన తరహాలో దర్శనాన్ని చేసుకోగల స్థాయి, సత్తా ఉంటేనే, సాహితీపిపాసకు ఆపోసన పట్టినట్లు నిర్ధారణ అవుతుంది. ఈ రెండు దౄక్పధాలు సమపాళ్ళలో అవతరించాయి - ప్రముఖ కవి, రచయిత ముకుంద రామారావు రచించిన కవితాసంకలనం - 'నాకు తెలియని నేనెవరో' లో.
కళ్ళు అందించిన పరవళ్ళు
కవి ముకుంద రామారావు తన సంకలనంలోని 46 కవితల్ని 'కళ్ళూ అని భావించడమే కాక, చదువరుల కళ్ళల్లో కళ్ళుపెట్టి చూస్తాయి కూడ అని ఒక విధమైన భరోసాని అందించారు. ఆ కళ్ళు సాహితీప్రియుల కళ్ళలోకి ఎంతవరకూ దౄష్టిని సారించాయి అన్నది వ్యక్తిగత అనుభూతి అనే చెప్పాలి. మామూలు చూపులను కాకుండా, అవి ఆనందాప్యాయతలను కూడ అందిస్తాయని వివరించారు.
కవి భావనాప్రపంచం
జీవితం అంటే - కవి 'ముకుందా తనదైన నిర్దిష్ట భావానుభవాలను సంకలనంలోని ముందుమాట ద్వారా చెప్పిన తీరు పఠితల్ని ఆశ్చర్య పరచక మానవు. మనిషి జీవితం ఒక ప్రయాణం, యాత్రగా సాగుతూనే, దశలూ, మజిలీలు దాటుతూంటాయి. ఉద్యోగ విరమణ కూడ ఒక కొత్త మజిలీ అని భావించడం జీవితాన్ని అర్ధంచేసుకున్న వారే అలా భావించగలరు. ఎంత చూసినా, తెలిసినా, ఎదిగినా, ఎంత తక్కువో అనగలగడం మనిషిలోని రికామీ వ్యక్తిత్వానికి ప్రతీక. కవిలోని నిరాడంబరతకు నిదర్శనం. ప్రపంచం, ప్రకౄతినుంచే నేర్చుకునేవి కోకొల్లలు అని కూడ అంటారు.
కవిత్వం అంటే - కవి లాగే, రామారావు కవిత్వం అత్యంత పరిశుభ్రతని అనిపించడమే కాక, అతిశయోక్తి, భాషాజాడ్యం మచ్చుకైన కానరావు అని ప్రముఖ కవి అజంతా అంటారు. మరో ప్రముఖ సాహితీవేత్త సంజీవదేవ్ మాటల్లో చెప్పాలంటే - ముకుంద కవనశైలి - ఉత్తమైన వస్తురూపసంపద, మరింత ఉత్తమ కవితని, భావాన్ని దర్శనీయం చేయడం ఉత్తమ కవితకు లక్యలక్షణం అని అంటారు.
ముకుంద శైలి కవిత్వం
కవిత్వానికి నిర్వచనాలు వేలకువేలు ప్రత్యక్షమవుతాయి. కానీ, సాధికారత అన్నది లేదు, రాదు, రాలేదు. ఎవరి అభిప్రాయం, అనుభూతి వారిది కనుక. ముకుంద వారి కవిత్వాన్ని యిలా నిర్వచించారు. 'ఉదయాస్తమయాలంత నిత్యనూతనం, సూర్యకిరణాల చైతన్యం, శాఖోపశాఖల చెట్టు, సముద్రంలో కలిసేవరకూ సాగే నది, జీవన సంగీతం, అనుభవ సారం, నన్ను నేను తెలుసుకునే సాధనం, ఒక కొత్త ఊపిరి, నిండుగా ఆనందించి ఆశ్చర్యపోవాలి, అడ్డంకుల్ని దాటుకుంటూ పోవాలి.'
రామారావు గారు కవిత్వానుభూతిని ప్రకటించిన తీరు మరింత ఆనందానుభూతుల్ని వివరిస్తుంది. 'పసిపిల్లలంత స్వచ్చంగా ఉన్నట్లు, అనారోగ్యం నుండి తేరుకుంటున్నట్లు, చీకటి నుండి వెలుగులోకొస్తున్నట్లు, ఎన్నో సంవత్సరాల తరువాత ఇంటికొస్తున్నట్లు, వెన్నెల అడవిలోకి చొచ్చుకుపోతున్నట్లు, వేసవిలో చల్ల గాలి తాకినట్లు, ఎదురు చూస్తున్న మొక్కలకు నీళ్ళు పోస్తున్నట్లు, వడగళ్ళ వానకి వీధంతా పిల్లల వరదైనట్లు, వచ్చే ప్రతీ రోజూ ఒక పేరు ఒక తేదీతో వస్తున్నట్లు, నీటిలో నీరు, పాలలో పాలు, నూనెలో నూనెలో కలిసి పోతున్నట్లూ అని చెప్పినతీరుని బట్టే, నిస్సందేహంగా ముకుందం రామారావు కవుల వరసలో ప్రధమపంక్తిలో పరిగణించడం అలవోకగా జరిగిపోతుంది అని ఘంటాపధంగా చెప్పవచ్చు. పుట్టుకమీద, ప్రేమమీద, చావుమేద ఉన్న నమ్మకమే కవిత్వం మీద కూడ అని చెప్పడంలో ముకుందంలో నిద్రాణమైన తత్వవేత్త కనిపిస్తాడు. అందుకే, కవితాసంకలనానికి పెట్టిన పేరు - నాకు తెలియని నేనెవరో - అన్నది నిజంగా కవిత్వం అంత ఆనందానుభూతుల్ని అందిస్తోంది. ఈ విషయంలో ముకుందం వారిని అభినందించక తప్పదు.
ముకుంద వారి కళ్ళ దొంతరలు
ముకుంద తన సంకలనం లోని మొదటి కవితే చదువరులని ఆకర్షిస్తుంది. 'ప్రయాణం' అన్న కవితలో ప్రతీ రోజూ లేచిందే పరుగు (నగరజీవన యాంత్రీకరణ కు సూచన) అంటూ, మనం నిత్యం పీల్చే గాలి ఎప్పటికీ మన ఆస్తిగా మారదంటూ, మరణం మన అధీనంలో లేదు (బుద్బుదప్రాయం అని చెప్పడం) అని అంటారు. తత్వతకు వేరే నిదర్శనం అనవసరం. ప్రపంచాన్ని ఒక నదితో పోల్చడం ఒక నవ్యత అయితే, ఆనవాళ్ళయినా మిగల్చని పడవ ప్రయాణం జీవితం అనడం గొప్ప భావన. 'ఉనికీ అన్న కవితలో - వినకుండా వింటూ, చూడకుండా చూస్తూ, మాటాడకుండా మాటాడుతూ ' అనడం జీవితంలో మన ఉనికిని కోల్పోతున్నాం అని చెప్పడం కూడా సహజభావం.
ముకుంద ప్రయోగాలు
కొన్ని మచ్చుతునకలుగా చెప్పుకోదగ్గ ప్రయోగభావజాలాన్ని యిలా చెప్పుకోవచ్చు.
ఎంత మార్పుకోసం ఎదురుచూసినా, నేడు నిన్నటి రేపు (నేడు నిన్న రేపు), వచ్చిపోయే మేఘాల్లో అయినా తడిపి వెళ్ళినవే గుర్తుంటాయి ఎన్నాళ్ళయినా (ఐనా - అతిథుల గురించి), మాటాలు వేరు, మనుషులు వేరు (ఫోనుల్లో), విత్తినవి మొలకెత్తి, మొలకెత్తినవి నిలిచి, నిలిచినవి ఎదుగుతున్న కొద్దీ, ఎంత ఆనందమో; ఎవరు పెంచిన పిల్లలో, నిత్యం తారసపడే ఈ చెట్లన్నీ (చెట్లు - పిల్లను లేని లోటు చెట్లలో చూసుకునే తిమ్మక్క - స్వఛ్ఛంద సేవకురాలి భావానికి కవితారూపం), మారుస్తున్న దుస్తుల్లా, మారుతున్న బాధ; రాత్రి ప్రపంచం చల్లబడ్డాక కూడా, సముద్రంలా నా శరీరం ఇంకా వెచ్చగానే ఉంది (రాత్రంతా), ఎన్ని భాషలు తెలిసినా, హౄదయ భాష, బతుకు భాషతోనే (పొగ), నేను మీ అమ్మని కాదు, మా అమ్మనీ కాదు, మా అమ్మకి కూతుర్ని (విదేశంలో మనుమరాలు), ఆకారాన్ని తప్ప, అద్దం కూడా నన్ను ప్రతిఫలించదు; వసంతం ఎలా వచ్చిందో ఎవరికీ తెలీదు; బాధ తెలిసాక, ఓదార్పు తెలుస్తుంది (ఒక ఒంటరి వేళ), ఆకాశాన్ని శుభపరుస్తోయో మలిన పరుస్తాయో; కొత్తవో పాతవో, అంతటి సూర్యుడికే అడ్డుగా నిలుచోగల అహంకారమో; ఏమిటో ఈ మేఘాలు ఎప్పుడూ (ఈ మేఘాలేమిటో), ఇంటికంటే ముందే బయట వెలుగు, బయటకంటే ముందే యింట్లే చీకటి, ఎక్కడున్నా కాస్త ముందో వెనకో (ఇంటా బయటా), సమయానికి సహనం లేదు, సానుభూతి జ़్జాపకాలు, దిద్దుబాట్లూ ఏవీ లేవు (సమయం), వెనుకచూపుది జ़్జాపకాల గతం, వెనక్కి పోలేక, ఏవీ మార్చలేక; ముందు చూపుది కోరికల భవిష్యత్తు, ఊరిస్తూ బతికిస్తూ; తనలోకి తానే లోచూపు, గతాగతాలు లేకున్నా, నిదానంగా నిబ్బరంగా (చూపు), ఎందుకో ఏమో చావు పుట్టుకలంత రహస్యం ఇప్పటికీ (గుండె కోత), కాలాన్ని కాలం, దూరాన్ని దూరం, మింగుతూనే ఉన్నట్టు, ఆశని ఆశ (సొంతిల్లు), అంత దూరం నడిచాకే, దగ్గరి దారేదో తెలిసింది; ఆకలి రుచీ లేకపోతే, అన్నంతిన్నా అలసిపోయే వాడినేమో (కొన్ని).
యిలా చెప్పుకుపోతే - 'ముకుంద (కవన)మాల కడు సుదీర్ఘం కాక తప్పదు.
ప్రముఖ కవి 'మో' అన్నట్లు, ఆధునిక కవిత్వానికి చేస్తున్న దోహదాన్ని వాల్లస్ స్టెవన్స్ మాటని, కాగితంలో ఎక్కువ తెలుపుదనం, తక్కువ అక్షరాలూ నేర్పాను - అన్నట్లు మౌనంతో, ధ్యానంతో సేవ చేసున్నట్లు ముకుంద రామారావు గారిని అభినందించడంలో ఔచిత్యం ఎంతో వుంది కదా.
ముకుంద వారి స్వంత కవితాభాషణంలోనే చెప్పాలంటే - 'ప్రతి రోల్జూ చేతులు అలసిపోయేవరకూ కొత్త కొత్తగా నన్ను నేనే రాసుకోవలనుంది మళ్ళీ మళ్ళీ' అన్న ఆయన ఆశ, ఆశయం రెండూ తీరుతాయి అన్నదాంట్లో ఎటువంటి సందేహం లేదు, రాదు.
'నాకు తెలియని నేనెవరో' అన్న కవితాసంకలనం చదివాక, ప్రతీ సాహితీప్రేమికుడు తనను గురించి మాత్రం తాను రవంతైనా ఆలోచించక తప్పదు. అంతమాత్రమైనా, ప్రభావం, ప్రేరణ, ఈ సంకలనం కలిగిస్తుంది.
ముకుంద రామారావు - రచించిన, వలసపోయిన మందహాసం,మరో మజిలీకి ముందు, ఎవరున్నా లేకున్నా రచనలతోపాటు, వలసపోయిన మందహాసం కవితాసంకలనానికి శ్రీ రమణా సుమనశ్రీ పురస్కారం లభించడం కవి ప్రతిభాకు తార్కాణం.
కొంపెల్ల శర్మ - తెలుగు రధం.

Sunday, June 1, 2008

ఆంధ్ర రత్న దుగ్గిరాల జయంతి

ఆంధ్రరత్న దుగ్గిరాల (1889 - 1928 ) జయంతి - జూన్ 2
చీరాల, పేరాల మధ్య దుగ్గిరాల
అసలు పేరు చెప్పనక్కరలేదు; కేవలం ఆంధ్రరత్న అంటే చాలు. రామదండు అని పిలిస్తే, వీరి పేరు వెంటనే స్ఫురిస్తుంది. స్వాతంత్ర్య సమరయోధుల జాబితాలో ఈయన పేరు లేకపోతే, అది అసంపూర్ణమే అని చెప్పాలి. పన్నుల నిరాకరణోద్యమంలో అకుంఠిత దీక్షతో పాల్గొన్న వ్యక్తి. ఆంధ్ర జానపద కళారీతులను పునరుద్దరించడంలో విశిష్టమైన కౄషి సల్పిన కౄషీవలుడు, సత్యాగ్రహానికి పేరుగాంచిన చీరాల, పేరాల ప్రక్కనే చెప్పుకోదగ్గమనీషి, దుగ్గిరాల అని, ఆయనే, దుగ్గిరాల గోపాలకౄష్ణయ్యగారు.
బహుముఖ ప్రజ్ణాశాలి గోపాలకౄష్ణుడు
సాహసికుడు, నాయకుడు, వక్త, కవి, కళాపోషకుడు, గాయకుడు, సమరాన్ని నడిపిన సుప్రసిద్ధ వ్యక్తి అయిన దుగ్గిరాల గోపాలకౄష్ణగారు, బ్రాహ్మణ కుటుంబంలోని కోదండరామయ్య-సీతమ్మ పుణ్యదంపతులకు 2 జూన్ 1889 న కౄష్ణజిల్లాలోని పెనుగంచిప్రోలు లో జన్మించారు. దుగ్గిరాల పుట్టిన మూడవ రోజే ఆయనకు దుర్దినం - తల్లిని కోల్పోయారు. మూడవ ఏట తండ్రిని కూడ పోగొట్టుకున్నారు. బాల్యం పినతండ్రి, నాయనమ్మల సాన్నిద్ధ్యంలో జరిగింది. కూచిపూడి, గుంటూరు, బాపట్లలో మెట్రిక్ వరకు అంతంతగా చదివి ఉత్తీర్ణుడైన దుగ్గిరాల, చదువులపర్వంలోనే, జాతీయ నాట్యమండలిని స్థాపించి నాటకం, సంగీతాది కళలకు ప్రాచుర్యం కలిగించే ప్రయత్నంలో సంగీత నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. 1911లో మిత్రుడు నడింపల్లి నరసింహారావు ప్రోద్బలంతో ఉన్నతచదువు కోసం విదేశాలకు వెళ్ళారు. స్కాట్లాండు లోని ఎడింబర్గ్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. పట్టా పొందాక, ప్రముఖుడైన ఆనందకుమారస్వామి వద్ద భాగస్వామ్యంతో పనిచేశారు. ప్రముఖ నాట్యశాస్త్రగ్రంథం నందికేశ్వరుని అభినయదర్పణాన్ని సంస్కౄతంనుంచి ఆంగ్లంలోకి 'ది మిర్రర్ ఆఫ్ గెస్చఋ అన్న పేరుతో అనువదాన్ని కేంబ్రిడ్జి-హార్వర్డ్ విశ్వవిద్యాలయ ముద్రణాలయం వారు 1917ల్లో చేసిన ప్రచురణ దుగ్గిరాలవారి కళాప్రతిభకు తార్కాణం.
అధికారం ఆపలేని వాగ్ధాటి
అసలే వక్త; ఆపైన ఆచార్యుడు; రాజమండ్రి శిక్షణా కళాశాలలోను, బండారు జాతీయ కళాశాలలోను ఉపాధ్యాయుడిగా స్వతంత్ర భావాల మూలాన అధికారులతో సయోధ్య లేని కారణంగా మానివేయడం జరిగింది. దుగ్గిరాలవారు, స్వాతంత్ర్యోద్యమంలోకి హుటాహుటిని దూకారు. బ్రిటిష్ ప్రభుత్వంవారు చీరాల, పేరాల మున్సిపాలిటీలను 1919లో ఏకంచేయడం పట్ల నిరసనతో సహకార నిరాకరణోద్యమాన్ని చేపట్టాడు. ఈ ఉద్యమం ఆంధ్ర స్వాతంత్ర్యోద్యమంలో ప్రధానఘట్టంగా మారడం, చీరాల, పేరాలల మధ్య దుగ్గిరాల ను చేర్చడం, అవిభాజ్యత్రివేణీసంగమంగా మారిపోయింది. పన్నుల సహాయ నిరాకరణోద్యమంలో ముమ్మరంగా పాల్గొన్నారు. చీరాల-పేరాల ప్రజలు మున్సిపల్ పన్నులు కట్ట నిరాకరించి, ఊరు విడచి బయటకు వెళ్ళి కొత్త ఊరే కట్టుకున్నారు.
సాహిత్యం కళలద్వరా ఉద్యమ ప్రచారాలు
1920లో నాగపూరులో జరిగిన కాంగ్రేసు సమావేశం తర్వాత, సమావేశ నిర్ణయాలను తెలియపరచడానికి దుగ్గిరాల విస్తౄతంగా ఆంధ్ర పర్యటన చేశారు. ఈ వాగ్ధాటి పరంపరలో భాగంగా, దుగ్గిరాల ఉపన్యాసాల్ని బరంపురంలో నిషేధించడం, ఆ నిషేధనను ఉల్లఘించినందుకు, ఆయన్ని ఏడాదికాలం జైలులో ఉంచడం జరిగింది. 1921లో బెజవాడలో కాంగ్రేసు కమిటీ సమావేశం ఆనందోత్సాహంతో జరిగింది. దేశంలోని నాయకులందరూ ఆంధ్రదేశానికొచ్చారు. ఆంధ్రప్రముఖులు సరేసరి. దుగ్గిరాల గోపాలకౄష్ణయ్యగారు చీరాల-పేరాల నుండి అయిదువందలమంది ఎర్రచొక్కాల వారి రామదండును తీసుకొని వచ్చారు. చీరాల-పేరాల సత్యాగ్రహంలో అబ్బూరివంటివారు కుడిభుజంగా దుగ్గిరాలవారితో సన్నిహితంగా, పనిచేయడం, రామదండులో ప్రముఖ సేనాపతిగా అవ్వడం కూడ జరిగింది. దుగ్గిరాలవారి ప్రోద్బలంతోనే అబ్బూరివారు జలియన్వాలాబాగ్ దురంతంపై బుర్రకధను రచించడం, కవితలు ప్రజలను ఉద్భోధించి కార్యోన్ముఖులను చేయగలదన్న సత్యాన్ని గ్రహించడం జరిగింది. పామరులారా, పండితులారా, భారతీయులారా, కామినులారా, వీరకుమారుల కన్నతల్లులారా అన్న సుదీర్ఘమైన రచన ఉత్తేజకరంగా, ప్రయోజనకారిగా, ఉర్రూతలూగించే ప్రభోధాత్మకంగా ఉద్రేకం పుట్టించే ధోరణిలో వుండడం వల్లనే, దాన్ని ప్రభుత్వం నిషేధించింది. రచన అబ్బూరివారిదైనా, ఈ అంశం మాత్రం దుగ్గిరాలకు మరింత పేరుని తెచ్చింది. చీరాల-పేరాల సత్యాగ్రహప్రయత్నం విఫలమని భావించినా, బెజవాడలో ఆంధ్రవిశ్వవిద్యాలయం స్థాపనకు దారితీయడం ఆనాడు ముఖ్యఘట్టంగా మారింది. 1923 నాగపూరు కాంగ్రేసు మహాసభలకు కార్యదర్శిగా నిర్వహించారు.
'జాతి జీవనాళిక జానపద గీతికా అన్న భావంతో ప్రచారరధసారధ్యం
దుగ్గిరాల మనసా వాచా కర్మణా, జాతిజీవనంలో జానపదధోరణి, కళలు అంతర్భాగం అని నమ్మిన వ్యక్తి. ఆంధ్రదేశసంస్కౄతీపరమైన జానపదకళారీతుల్ని పునరుద్ధరణ చేయడంలో శ్రద్ధాభక్తులను ప్రకటించి, వాటిని ప్రాచుర్యం కలగచేసిన విజ్ణాని. ప్రముఖ అంశాలైన, తోలుబొమ్మలాట, జముకులకధ, బుర్రకధ, వీధినాటకాలు, సాముగారడీలు, గొల్లకలాపం, బుట్టబొమ్మలు, కీలుగుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, శారదకధ, కిన్నెరకధ, కొమ్ముబూరా, జోడుమద్దెల, పల్లెసుద్దులు, తూర్పు భాగోతం, చుట్టుకాముడు, పిచ్చికుంట్లవాళ్ళకధ, సాధనశూరులు, పలనాటివీర విద్యావంతులు లాంటి అనేక జానపదకళాప్రక్రియలకు చేయూతనిచ్చిన జానపదనిర్మాత, జ్ణానపధనిర్వాహకుడు, మన దుగ్గిరాల.
గ్రంధాలయోద్యమ నిర్మాత
దుగ్గిరాల ప్రతిభాసిగలో మరో మరువం, గ్రంధాలయాలపై అత్యంత శ్రద్ధని ప్రకటించడం. ఈ ప్రక్రియలో భాగంగా, సాధన అనే పత్రికను ప్రారంభించడం, ఆంధ్రప్రాంతంలో గ్రంధాలయాల స్థాపనలో ముందడుగు వేసిన వ్యక్తిగా, గ్రంధాలయోద్యమాన్ని కూడ లేవనెత్తిన మహామనీషి.
శ్రీరామదాసు మన దుగ్గిరాల
ఆధ్యాత్మికతను రంగరించుకున్న వాడేకాక, అపర శ్రీరామభక్తుడు, బంటు. శ్రీరామ రచనా నియమ తత్పరుడు. ఈ భావనే, రామదండు ని స్థాపించడం, సేనను నిర్మించడం, స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా రామదండుని జాతీయతాస్వచ్చంద, దేశభక్తి, ఆధ్యాత్మిక సామూహిక సంస్థగా నిర్వహించడం జరిగింది.
ఆంధ్రరత్న దుగ్గిరాల
1921 లో గుంటూరు లో జరిగిన ఒక సమావేశంలో దుగ్గిరాలవారిని ఆంధ్రరత్న బిరుదుతో సత్కరించడం జరిగింది. వేపచేదు విద్యాసంస్థవారు, మన సంస్కౄతిలో భాగంగా నూరుగురు తెలుగు ప్రముఖుల్లో దుగ్గిరాలవారిని చేర్చడంపట్ల వారిప్రతిభాపాటవాలకు ప్రత్యక్ష తార్కాణమే అని చెప్పాలి.
నాలుగుపదుల నాణ్యమైన జీవితం
కాకిలా వందేళ్ళు బతికేకన్నా, హంసలా పదేళ్ళు బతికితే చాలన్నట్లు, దుగ్గిరాలవారు రాశి కన్న వాసితనం తనజీవితంలోనే కాదు, ఆయువులో కూడ జరిగింది. కేవలం నాలుగుపదుల వసంతాలకే ఆయన జీవితం పూర్తయింది. 1928, జూన్ 10 న దుగ్గిరాల దూరతీరాలకు నివాసం మార్చి, ఆంధ్రులకు దూరమయ్యారు. ప్రముఖాంధ్రుల్లో ప్రధమగణంలో వేలు మడవదగ్గ వ్యక్తి మన దుగ్గిరాల గోపాలకౄష్ణయ్యగారు.
ఆంధ్రచరిత్ర, సంస్కౄతీపరంపర వున్నంత కాలం, దుగ్గిరాల వ్యక్తిని, ఆయన దేశానికి చేసిన సేవలను మరవలేము; మరవకూడదు అన్నభావం, సత్యం, శివం, సుందరం. ఆయన భావాలు నిరంతరం అన్వయించుకోవలసి వస్తూనే వుంటుంది. అదే ఆయనలోని గొప్పతనం. అదే మనకు ఆస్థి, సిరిసంపదలు. ఓం శాంతి:
కొంపెల్ల శర్మ - తెలుగురధం.