Sunday, February 24, 2008

దేవులపల్లి కౄష్ణశాస్త్రి
నవ్యకవితా ప్రస్థానాచార్యులకు ఘన నివాళి


మనసున మల్లెల మాల లూగెనే, కన్నుల వెన్నెల డోలలూగెనే, ఎంతహాయి ఈ రేయి నిండెనో, ఎన్ని నాళ్ళకీ బ్రతుకు నిండెనో - యిలాంటివి ఎన్నో మధురిమ చిత్రాతిచిత్రగీతాలు.
వేదవిద్య నాటి వెలుగెల్ల నశియించె, గారె బూరె పప్పుచారు మిగిలె, బుర్ర కరిగి కరిగి బొర్రగా మారెరా! విశ్వదాభిరామ వినురవేమ - అని అభినవ వేమన శతకాది రచనలు.


చౌరస్తా! ఆహిస్తా! ఏక్ సవారీ, ఆఠణా, దో సవారీ బారాణా, సర్దీ, గర్మీ, చఢావ్, ఉతార్, రిక్షా జల్దీ తొక్కెస్తా!, అంటూ - బతికుంటే మరి కూడెట్టా? చావంటే మరి భయ మెట్టా, ఉండి ఉండి ఓ నాడెపుడో హుసేన్ సాగర్ చౌరస్తా - అంటూ ఆధునిక బడుగువర్గపు ప్రజాప్రతినిధిగా వత్తాసు తీసుకునే భావోద్వేగపూరిత కవితలు.
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా! కౄష్ణార్పణం అంటూ సంక్రాంతి లక్ష్మి శోభను వర్ణిస్తూ పర్వశోభాసంస్కౄతిని వర్ణిస్తూ గీతాలు.
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధత్రి! జయ జయ జయ శత సహస్ర నరనారీ హౄదయనేత్రీ! అన్న ప్రముఖ ప్రియభారతీగీతం.
యిలా ఎన్నో, మరెన్నో, సాహితీప్రక్రియలు అన్నింటినీ తట్టిన వారు నవ్యకవితా ప్రస్థానాచార్యులు. ఆయనే దేవులపల్లి కౄష్ణశాస్త్రిగారు.
దేవులు పుట్టిన వంశాన ...
'దేవులపల్లి వంశమున దేవులు పుట్టిరీ అని చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు.
మా కౄష్ణశాస్త్రి మామూలు మాటలలోనే కవిత్వం ఉంటుంది; చాలమంది వాటితోనే తౄప్తిపడిపోతారు; ఆయన కవిత్వం చెప్పదలచుకుంటే, అంతకన్నా పై స్థాయి ఉండాలి; అందువల్లనే ఆయన హెచ్చుగా వ్రాయలేకపోయాడు - అని కాటూరి వేంకటేశ్వరరావుగారు.
దేవులపల్లివారి జీవితప్రస్థానం
దేవులపల్లి కౄష్ణశాస్త్రిగారు విద్వత్వంశంలో 1887 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరిజిల్లాలోని చందనపాలెం లో జన్మించారు. ఈ గ్రామం ప్రఖ్యాత కవి కూచిమంచి తిమ్మకవి నివాసం చేసిన కవనస్థలి. దేవులపల్లివారి తండ్రి కూచిమంచి తిమ్మకవి మునిమనుమడు వెంకట్రాయమంత్రి వద్ద కవిత్వపు మెలకువలను నేరుకున్నారని చెప్తారు. వీరి పూర్వీకులు పిఠాపురం ఆస్థానకవివర్యులు. కనుక 'అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవా అని అల్లసాన పెద్దన అన్నట్లు పుట్టుకతోనే గొప్ప సంస్కారం ఆవహించింది. పదాల సంగీతం, మధుర జ్ణానపు సంగతులు అవగాహనకు రావడం, వారు ఏడవ ఏటనే సామర్లకోటలో 'నంద నందన ఇందిరానాధ వరదా అని తొలి పద్యాన్ని చదివారు. విద్యార్ధిగా పిఠాపురం, కాకినాడలో గడిపారు. 1918 లో పట్టభద్రులై జీవితంలో ఒక మలుపు తీసుకునే దశలో, బ్రహ్మసమాజం, వ్యవహార భాషావాదాలు తీవ్రంగా విరాజిల్లుతున్న రోజులవి. కాకినాడ, పెద్దాపురం మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయపదవిని నిర్వహించారు. 'ధర్మసాధనా అన్న పత్రికలో పిఠాపురం రాజావారికి వ్యతిరేకంగా వ్యాసం వ్రాయడం, ఫలితంగా రాజావారినుంచి వచ్చే ధనసహాయం ఆగిపోవడం, ఈ యిబ్బందుల్లోనే శాస్త్రిగారికి సతీవియోగం కలగడం దురదౄష్టకరం. శాస్త్రిగారి అంతరంగం కరిగి 'కన్నీరూ గా తరంగాలు, అలలుగా పేరుపొందాయి. ఇదే వారి తొలి ఖండకావ్యసంపుటి (1923). తిరిగి వివాహం చేసుకోవడం, పిఠాపురం హైస్కూలులో ఉద్యోగం దొరకడం జరిగాయి. ఏదైనా స్వల్పాలే. కవిగారి భావాలు రాజాగారికి నచ్చని కారణంగా పనికి వీడుకోలు యిచ్చారు. జరిగినవన్నీ మంచికనీ అనుకోవడం మనిషిమని అన్న సిద్ధాంతాన్ని నమ్మారు. దశాబ్దకాలంపాటు దేశయానం చేశారు. 1933 నుంచి పదేళ్ళు కాకినాడ కళాశాలలో ఉపాధ్యాయులుగా పనిచేశారు.
వౄత్తి-ప్రవౄత్తి మిశ్రమాలు
1942 లో చెన్నపురికి నివాసం మార్చారు. ఆనాటినుంచి నేటివరకూ చిత్రరాజమైన 'మల్లీశ్వరీ చిత్రానికి మాటలు, పాటలు రచించారు. రేడియో ప్రసారాలు, ప్రవక్త పాత్ర, యిలా ఎన్నో వైవిధ్యమైన విషయాల్లో తన ప్రతిభను ప్రదర్శించారు. శాస్త్రిగారి వైవిధ్య సాహితీ ప్రక్రియలను ప్రస్తావించాలంటే గేయాలు, వ్యాసాలు, నాటికలు, భక్తిరసాత్మకరూపకాలు, శ్రవ్యనాటికలు, చిత్రగీతాలు, ఆండాళ్ తిరుప్పావ్ కీర్తనలు, శౄంగార నాటికలు, యక్షగానాలు, సంగీత రూపకాలు - ప్రచురితమైనవి, సంకలనాలబట్టి చెప్పదగినవి. అప్రచురితాలు వేనకువేలు.
ప్రభావ, అనుభవ పరంపరలు, పలవరింతలు
1929లో రవీంద్రనాధ్ ఠాగూర్ ను కలవడం తర్వాత ఉప్పొంగిన భావనాలహరి.
వారి మామూలు మాటల్లోనే కవిత్వం గంతులేస్తుంది. ఒకసారి ఒక వౄద్ధునికి పరచియం చేస్తే, కంటిచూపు తగ్గింది బాబూ, చెబితేకాని తెలీదు నాయనా! అని అంటే, శాస్త్రిగారు - మీరు ఎంతో అదౄష్టవంతులు, చెబితే తెలుస్తున్నది, చెప్పినా తెలియనివారు ఎందరున్నారో భారతదేశంలో - అని నవ్వు ఆగని మనోల్లాసాన్ని కలిగించిన స్ఫూర్తిమంతుడు.
నా కవితలో నాన్నగారి లిరికల్ ఫెర్వర్, పెదనాన్నగారి జిగీ వచ్చాయి - అని ఆయనే చెప్పుకున్నారు.
జీవితంలోని ప్రతి అల్పానుభవాన్ని ఒక ఉదాత్తదౄష్టితో అనుభవించే శక్తీ గురువులవల్ల పొందగలిగాను - అని గురుభక్తిని ప్రకటించిన వినయశీలి.
నేనేదో భక్తకవిని కాను; మీరనుకునేంత భక్తుణ్ణీ కాను. కొందరు అనుకునేంత దుర్మార్గుణ్ణీ కాను. ఎప్పుడో హౄదయవేదన భరించలేనప్పుడు కేక పెడతాను. అది కీర్తన అవుతుంది అని రచనలోని పాయలన్నింటినీ వివరించారు.
నాకు కవిత్వం పుట్టలోని పాములాగ, తెల్లవారి తలుపులు తట్టి వచ్చిపడే అతిధిలాగ, రేకులు విచ్చుకున్న పూవులాగ రకరకాలుగా వస్తుంది అన్న వారి వాక్యాలే సత్యరచనలు.
రామాయణం మానస రచితమైన గొప్ప ఇతిహాసం; కలకాలానికి వర్తించేది; కాళిదాసు కవిత కవితాగుణాలన్నీ పుంజీభూతమైంది; పాతవారికి అంతా సత్యం, రామాయణం ఇప్పుడు ఎవరైనా వ్రాస్తే, నప్పదు; నన్నయ, తిక్కన, మానవుల లోతులు, ఎత్తులు సులభంగా తెలిపారు - అని ప్రబంధరచనకు పూనుకోనందుకు ఆయన యిచ్చిన వివరణ.
నేను హౄదయవాదిని; నాకు వేదాంతం తర్కం తలకెక్కవు; నన్ను ఎడారిలో కూర్చోబెట్టి వేయి పుస్తకాలు ఇస్తామన్నా వద్దు; ఒక్క పుస్తకమూ అక్కరలేదు; పనికిమాలినవారు, చెడ్డవారు, వికారరూపులు అయినా సరే - జనం మధ్యన నన్ను పడేయండి; నేను ఆరోగ్యంతో ఎంతకాలమైనా బ్రతుకుతాను; మనుష్యులు లేకపోతే కాయిలా (ఆరోగ్యంలేనితనం) పడుతాను - శాస్త్రిగారికి జనంలో నేను, నా చుట్టూ జనం అన్న వాదాన్ని వేదంలా భావించారు.
జాతి వయస్సులో ఉన్నప్పుడు ఠాగూర్ లాంటివారు పుట్టారు; సంఘదౄష్టి కలిగితే మంచి నాటకం, మంచి సాహిత్య విమర్శ వస్తాయి; కవిత ఆత్మాశ్రయం; వయస్సులో వచ్చేది; పెరిగాక నాటకకర్త అవుతాడు; నాటకకర్త ఇంటి యజమాని వంటివాడు అని సాహిత్యాన్నే కాక, సాహితీప్రక్రియను కవి ఏ వయసులో రచనకు పూనుకోవాలోకూడ వివరించిన విద్వన్మూర్తి.
నాది చిక్కని కవిత అని నా నమ్మకం; అన్ని వర్గాల పరిశీలనా ఉంది అని చెప్తూనే, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు? నా ఇచ్చయే గాక నాకేటి వెరపు? అని ప్రకటించుకున్న ధైర్యశాలి మన దేవులపల్లి.
చివరగా కవి గురించి శాస్త్రిగారు యిచ్చుకున్న నిర్వచనం
కవికి నిజాయితీ ఉండాలి. ప్రేమ ఉండాలి. మానవత ప్లస్ నిజాయితీ అన్నమాట. కవులు రెండు రకాలవారు, తాము చెప్పదలచింది నిజాయితో చెప్పేవారు. వారిది కొంతకాలం నిలుస్తుంది. కాలానుగుణమైన సత్యాన్ని - యుగధర్మాన్ని నిర్వచించేవరు రెండవవారు. వారిది శాశ్వతంగా ఉంటుంది. మానవత అంటే విభేదాలకు అతీతమైన రసాస్వాదనం. ఈ దౄష్టితో కవులందరూ విశిష్టాద్వైతులు. నేను మానవోద్యమానికి చెందినవాణ్ణి. నా మానవతావాదానికి విశ్వమానవ దౄష్టి ప్రధానసూత్రం.
కవిత్వంలో జాతులు, మతాలు చూస్తే గంగవెర్రితనం ఆవహిస్తుంది శాస్త్రిగారికి. విశ్వమానవ భావన లేనివాడు గొప్పకవి ఎలా అవుతాడని తరచు ప్రశ్న వేసేవారు.
యిలా చెప్పుకుపోతే, అంతులేని అనంతం. అందుకే గురజాడవారు గిరీశం నోటంట ఆణిముత్యాల్ని దొర్లించాడు. శాస్త్రిగారితో సాంగత్యం కేవలం ఎడ్యుకేషనేకాదు; వీరి సాన్నిధ్యం ఒక మత్తు; అద్భుత వశీకరణశక్తి. కొంపలు మునిగి పోతున్నా, వదల మనసురాదు. అదేదో అసదౄశమైన అయస్కాంతశక్తి - అని అన్నారు తిరుమల రామచంద్ర.
కౄష్ణశాస్త్రిగారి భావకవితా కుటీరం
దేవులపల్లివారు ఎక్కడ వుంటే, ఆ స్థలంలో ఒక రంగస్థలి చిత్రించబడుతుంది. మధుర మధుమాసం. దానిలో విరగబూసిన గున్నమామిడి. కొమ్మనెక్కి పాడే కోయిల. నిండు జాబిల్లి, వెన్నెలజల్లు. వియోగగీతిక, పసిరిపచ్చని పెండ్లిపందిరి, కన్నెలు, పన్నీరు, అగరువత్తులు, మంచిగంధం, మల్లెలు సరేసరి అవి - దేవులపల్లివారి వెంటే తిరుగుతాయి. ఎందుకంటే, ఆయన బ్రాండ్ మార్క్ మల్లెపూలు వేరెవరూ సాగుచేయలేనివి కనక.
అందుకే - శాస్త్రిగారు వ్రాసింది ఎంత అన్నది బాలికుల ప్రశ్న అన్నాడు ఒక సహౄదయుడు. దేవులపల్లివారు ఒక పద్యం వ్రాసినా, అది ప్రబంధేతిహాస సరిసమానమే.
కౄష్ణశాస్త్రిగారి రచనలపై భిన్నాభిప్రాయాలుండవచ్చు. వారివారి భావనలు వారివి కనక. తాను నమ్మిన సత్యాన్నే, తాను చూచిన దౄక్కోణాన్నే రచనలో ప్రదర్శించిన ప్రజ్ణానమూర్తి. రచనను ఆస్వాదిస్తే, యితివౄత్తంపై కన్నా, కవిపై గౌరవం కలిగించే రచనే, వెంటనే రచయితపై కూడ రసాస్వాదులకు కవిపైకూడ విశ్వాసాన్ని పొందాలి. సరిగ్గా యిదే జరిగింది, దేవులపల్లివారి వ్యక్తిత్వంలో, రచనల్లో, నడకలో, నడతలో. అంతకన్నా, కవికి, సమాజం నుంచి వచ్చే కానుకలు, ఏం కావాలి?
దేవులపల్లి కౄష్ణశాస్త్రిగారి సాహితీసంహితలో సోదాహరణాలు
గేయాలు - ఆకాశవాణిలో వినిపిస్తే, శాస్రిగారే దర్శనం యిచ్చేవారు.
నీ పదములే చాలు రామా, నీ పద ధూళులె పదివేలుశివశివశివ అనరాదా? ఎందుకయా సాంబశివా!
నాటికలు
గుహుడు - సీతారామలక్ష్మణులను నది దాటించడం - 'పడవ నేను నడపటమేమిటి? సర్వమూ నడిపేవాడిని నడిపేవాడెవడమ్మా"? అంటాడు గుహుడు సీతతో. పడవ నడుపుము కర్ణధారీ, కడిమి విడువక కడలి మీరీ, దుడుకు పరువుల పడవ, సుడులు తిరిగే పడవ, తడసి రానే లేక తల్లడిల్లే పడవా అంటూ రాముణ్ణి ప్రార్ధించుకుంటాడు.
కవి పరంపర
కవి పరంపర వ్యాసావళిలో - వేమన గురించి, 'వేమన బాగా లోతుల్లోకి దిగినవాడు. కాళ్ళకి గులకరాళ్ళు తగిలేదాక; అయితే, లోకానుభవ సముద్రుడై పైకి తేలినవాడు. పడమటిదేశాల్లో పుడితే, ఏ 'షా', 'స్విఫ్ట్' లాగానో అవవలసినవాడు. మాట ఎంత కరుకుదో మనస్సంత కమ్మని జాతి కోవలోకి చెందినవారు అని అంటారు.
కవితాప్రశస్తి
సాహిత్యంలో శబ్దం సౄష్టించే భావచిత్రణలను యిలా ప్రస్తావించారు. కవిత్వంలో శబ్దం పలకడమే కాదు, పాడుతుంది. నడవడమే కాదు, ఎగురుతుంది.
కౄష్ణపక్షం - ప్రవాసము-ఊర్వశి
శాస్త్రిగారు బెజవాడ నుంచి బళ్ళారీ ప్రయాణంలోని రైలు నడకలోని సమాన లయకు స్పందించి, చుట్టూవున్న నల్లమల అడవుల సోయగానికి స్పందించి, పరవశించి - ఆకులో ఆకునై, పూవులో పూవునై, ఒదిగిపోవడమే కాక, భావకవిత్వానికి మొదటి శ్రుతిని, నుతిని పలవరించారు. యిది ఒక మెరుపు, మలుపు అయి తిష్ఠ వేసుకుని నేటివరకూ కూర్చుంది.
బదరిక-పల్లకి
మంచి పాటలు రాసేవాడికి, నిజమైన పాట రాసేవాడికి, లోపల కూడ అంతరాంతరాల్లో సంగీతం వచ్చి ఉండాలి. ఏ అనుభూతికి ఏ రాగమో, ఏ వరసో, విరుపో, నొక్కో, ఒదుగో, మాటతో కలసివస్తాయి. గేయానికి ఎక్కున నగలు తొడగకూడదని, శబ్దార్ధాలంకారాలు, వాటి బరువు పాటను ఎగరనీయదు. లోతులకు రివ్వుమని దిగనీయదు - అంటారు శాస్త్రిగారు. అధిక, స్వల్ప భారాలు గేయానికి తగవు అంటూ, సరిసమతులనంతో నిర్మాణం చెయ్యాలి అంటారు. ఉదాహరణ:గవాక్షాలు హౄదయానకు నీ కన్నులు, అవే తెలుపు నీ లోపలి తలపు తెన్నులు, అవి చీకటి తునుకలు, అవి నీడల మొలకలు. నిన్నెరిగిన పులుగునకవి నీలి నీలి మిన్నులు, కాకయున్న మొలుచుటేల నాకు రెక్కలు, ఆ కన్నుల నిలుచుటేల ఆకాశపు చుక్కలు. ఈ చిరుగేయంలో - కన్నులు, తెన్నులు, తునుకలు, మొలకలు, మిన్నులు, రెక్కలు, చుక్కలు - అంటూ సప్తవర్ణశోభితమైన సంగమస్థలిలో పునీతం చేశారో గమనించదగ్గ అంశాలు.
వ్యాసావళి
ఆపాతమధురం, సమస్తమూ ఇక్షురసార్ణవమే - చెరుకురసాల కడలి - అంటాడు శ్రీశ్రీ.మహావ్యక్తులు, విలక్షణమూర్తులను పరిచయం చేస్తూ - బ్రతికున్నప్పుడుమహాపురుషులను గొప్పవారు అనిస్వీకరించడానికి మనస్సు ససేమిరా ఒప్పుకోదు; వారిలో కూడా మనలో లాగే సమానంగా ప్రతీదినం, ప్రతీనిముషం, రోగాలు, రొష్టులు, రాగాలు, ద్వేషాలు, కనబడి, మనకన్న వారు అధికులని అనాలని అనిపించదు అని ప్రకటించే ధైర్యసాహసగుణం ఎవరినబ్బుతుంది? అలాగే, 'గతించిన మహాపురుషులను కూడా ఖచ్చితంగా, సరిగ్గా విలువకట్టలేం; వారిని దేవపదవికయినా ఎత్తుతాం; లేదా, ఔను, కాదూ అన్నట్లు గోడమీదిపిల్లివాటంగా చిరుప్రస్తావనలు చేసి వదులుతాం' అన్న శాస్త్రిగారి భావాలు వర్ణనాతీతాలు.
మంగళ కాహళి
విజయభారతి, ఆంధ్రగేహళి అన్న అధ్యాయాలుగా రచించిన దేశభక్తి పరంపరలు - శ్రద్ధాభక్తులతో దేశమాతను స్తుతించారు. ప్రముఖమైన్ - 'జయజయజయ ప్రియభారత, జనాయిత్రీ దివ్యధాత్రీ' అన్న గేయాన్ని పరిచయం చేసే ప్రయత్నం దుస్సాహసమే అవుతుంది కదా. అలాగే, ఎత్తండీ, ఎత్తరేం, స్వాతంత్ర్యపు జెండా - ఎత్తవోయి, ఎత్తు, ఎత్తు, ఆకాశం నిండా' అన్న అనుప్రాస గమనించదగ్గది.
ఆంధ్రమాతను - 'శ్యామల నవ సస్యాంబర, కోమల సుమవల్లీ చికురగా వర్ణిస్తూ, 'అటు తెలంగాణ, ఇటు కళింగాన - అటనట కోస్తారాయలసీమల ప్రత్యాంధ్ర మందిర గేహళి - సర్వదా మ్రోగు నీ మంగళ కాహళీ అంటూ సంపూర్ణాంధ్ర జనయిత్రిని స్తుతించారు.
చిత్రాతి చిత్రగీతాలు - మేఘమాల
చివరిగా ప్రస్తావిస్తున్నా, మొదటగా చెప్పదగ్గ, చిత్రగీతాల్లో సచిత్రసాహితీవిలువల వలువలను తొడిగినవారు మన దేవులపల్లి. మచ్చుకు, కొన్నిలో కొన్ని మాత్రమే.
కోతీబావకు పెళ్ళంట, పరుగులు తీయాలి, పిలచిన బిగువటరా, మనసున మల్లెల మాలలూగెనే, నీవుండేదాకొండపై, సడిసేయకో గాలి, మేడంటే మేడాకాదు, రావమ్మా మహాలక్ష్మీ, పాతాళగంగమ్మా రారా, పదములె చాలు రామా, అడుగుడుగున గుడివుంది, మావిచిగురు తినగానే, ఆకులో ఆకునై పూవులో పూవునై, గోరింట పూచింది కొమ్మ లేకుండా, ఆరనీకుమా ఈ దీపం. సామాన్యులకు, పండితులకు, పామరులకూ, అందరినీ సరిసమంగా మెప్పించి, ఒప్పించేలా అలరించే సాహితీపుష్పాలు, మేఘమాలా తటిల్లతలు.
అలాగే, శర్మిష్ఠ, శ్రీ ఆండాళ్ళు తిరుప్పావై, శ్రీ విద్యావతి, యక్షగానం అతిధిశాల, ఎన్నో ప్రస్తావించాలి. కాని, దేవులపల్లి వారి హాస్యోక్తులను స్మరించకుండ వారి ప్రతిభా వ్యాసం అసంపూర్ణమే అవుతుంది.
కౄష్ణశాస్త్రీయంగా హాస్యరస గుళికలు
'నిజలింగప్పాకు అనారోగ్ఫ్యం
శాస్త్రిగారిని ఎప్పుడు చిత్రానికి మాటలను రాయమన్నా, నిజలింగప్ప అనారోగ్యం తగ్గాక రాస్తాను అనడం ఎవ్వరికీ అర్ధం అయ్యేది కాదట. కాని ఆయన పరిభాషలో నిజలింగప్ప అంటే, కవితాత్మ - అంటే, కవిగా మంచి స్పందన రాగానే, సినీమా పాట రాస్తానని భావనా అని చాలా కొద్దిమందికే అర్ధం అయేదట.
వేమన పద్యాలకు అనుకరణలు
కలికాలపు కవి పండితులకు వేద విద్యల్లో అసాధారణ ప్రతిభ గురించి -
"వేద విద్యనాటి వెలుగె నశియించెగారె, బూరె, పప్పుచారు, మిగిలె,బుర్ర కరగి కరగి తొర్రగా మారెరా!విశ్వదాభిరామ వినురవేమ."
స్వతహాగా పిరికివారికి రాని ధైర్యం గురించి -
"ప్రొద్దుపోక బాబు, బొబ్బిలి కధ వినిగోడమీద బల్లెమూడలాగిఒక్క కేకపెట్టి ఊరుకున్నాడయా!విశ్వదాభిరామ వినురవేమ."
వౄద్ధులను పరిచయం చేస్తే, శాస్త్రిగారి ప్రతిస్పందన -
"కంటిచూపు తగ్గింది బాబూ' చెబితేగాని తెలియదు నాయనా?" అంటూ, ఆ వచ్చిన వ్యక్తి శాస్త్రిగారితో అంటే -
"మీరు అదౄష్టవంతులు! చెబితే తెలిసే స్థితిలో వున్నారు. చెప్పినా తెలియనివారు ఎందరున్నారో, భారతదేశంలో" అనేవారట శాస్త్రిగారు నవ్విస్తూ. శాస్త్రీయమంటే యిది మరి.
దేవులపల్లి కౄష్ణశాస్త్రిగారికి సాహితీనీరాజనాలు, నివాళులు. వర్ధంతి (24 ఫిబ్రవరి 1980) సందర్భంగా తెలుగురధం ఘనసంస్మరణం చేసుకుంటు, వినమ్రతతో, వందనాలు సమర్పించుకుంటూ.

కొంపెల్ల శర్మ - తెలుగురధం.


Saturday, February 16, 2008

విశ్వగురువు, నిత్య సత్యాన్వేషి - 'జిడ్డు కౄష్ణమూర్తీ

విశ్వగురువు, నిత్య సత్యాన్వేషి - 'జిడ్డు కౄష్ణమూర్తీ ( 1895 - 1986 )
అష్టమగర్భసంజాతుడు - అపర శ్రీ 'కృౠష్ణమూర్తీ

అద్భుతమైన సౌందర్యంతో నిండిన జీవితాన్ని మనిషి ఎందుకు సమస్యలమయం చేసుకుంటున్నాడనే ఆవేదనతో ఈ భాధలకు, దు:ఖాలకు మూలకారణాలను అన్వేషించి చూపిన మహామనీషి. ఆయన మనసులోని చేతన, అచేతన పొరలను ఒక అపూర్వమైన తీరులో ఆవిష్కరించి చూపి, శ్రోతల చేత స్వయంగా తమ తమ అంతరంగాల శోధన చేయించిన తత్వవేత్త. మానవాళిని బాధాతుల్యులుగా కీర్తించబడిన వారి ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా విఖ్Yఆతి పొందాయి. నిత్య సత్యాణ్వేషి. మానవుడిని సమస్త బంధనాలనుండి విముక్తి చేయడమే తమ ఆశయమని, మతాల, సంస్థల, గురువుల ఆధిపత్యంలో కాకుండా స్వీయజ్ణానంగల స్వతంత్రజీవిగా మనిషి పయనించాలనీ ఉద్భోధించిన ఉత్తమోత్తముడు. ఆయనే జిడ్డు కృౠష్ణమూర్తిగారు. 'జికే గా నిరంతరం పిలువబడే ఈ ప్రజ్జానమూర్తి, 1895 లో మే 11న మదనపల్లిలో జన్మించారు. నారాయణయ్య - సంజీవమ్మ దంపతులకు, పదకోడుగురు సంతానంలో ఎనిమిదవవాడు, అష్టమగర్భసంజాతుడు, కనుక కౄష్ణమూర్తి అని సార్ధకనామధేయం నిశ్చయించారు. బాల్యావస్థలో ఆట పాట చదువుల్లో వెనుకబడడం, శారీరక దుర్బలత్వం, మానసికపుమందగొడితనం, బడిలో గోడకుర్చీలువేయడం, బెత్తందెబ్బలుతినడం, వగైరాది సంఘటనలు, జీవితాంతం సాంప్రదాయిక విద్యాభ్యాసం పట్ల విముఖిడిని చేశాయి. పెద్ద, పేద సంసారం, జికే కు దశాబ్దకాలం నిండకుండానే, తల్లి మరణించడం, కుటుంబపోషణకు చాలా యిబ్బందులను ఎదుర్కొనవలసివచ్చినది.

దివ్యజ్ణాణాసమాజం, అనిబిసెంట్ ల ప్రభావప్రేరణలు

సోదరుడు నిత్యానంద, మిత్రులతో ఆనాటి మద్రాసు, అడయార్ సముద్రతీరంలో, యువకులకు జరిగే అనుభవం కన్న విన్నూత్న అనుభవం 1909 లో జరిగింది. దివ్యజ్ణానసమాజపు అగ్రనాయకులు, చార్లెస్ వెబ్ స్టర్ లెడ్ బీటర్ దౄష్టి లో పడ్డాఋడు మన కౄష్ణుడు. అతీంద్రియ శక్తులు, మనిషిని చూడగానే పుట్టుపూర్వాలు గతం, భావి, కనిపెట్టగలడని ఘనవిశ్వాసం ఉన్న ఈతనికి 'జికే అసాధారణ బాలుడిగా కనిపించాడు. అప్పట్లో దివ్యసమాజం వారు భావి జగద్గురువు అవతరణ కోసం అన్వేషించడం, ఆ లక్షణాలను జికె లో దర్శనం కావ్వడం మూలాన, జగద్గురువు భూమికకు, అనిబిసెంట్ అంగీకారంతో,తండ్రి ఒప్పొందంతో, యిద్దరిని దత్తత తీసుకోవడం జరిగింది. ఈ అపూర్వ సంఘటన, పదునాలుగు వర్షాల బాలుడికి, సరైన అవగాహన కూడ లేని పరిస్థితి. తండ్రి నుంచి కొన్ని సమస్యలు ఎదురైనా, సోదరుల అంగీకారం మేరకు, అనిబిసెంట్ బాధ్యత కింద పోషణ చేయడం, మాతౄభాషను మరచిపోయినా, సంపూర్ణ యూరోపియన్ వేషభాషాసంస్కౄతీసంస్కారాల్ని అలవరచుకొని, ఫ్రెంచ్ భాషాధ్యయనం కావించుకున్నారు. 1923 లో దివ్యసమాజం వారు హాలెండ్ లోని ఒమెన్ పట్టణంలో 'జిడ్డు కౄష్ణమూర్తీని జగద్గురువు (మైత్రేయబోధిసత్వుడు) గా ప్రకటించారు. జికె అధినేతగా 'ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈష్ట్' (ప్రాచ్యతార) సంస్థను స్థాపించడం, ఖండాంతరాల నుంచి సహాయసహకారాలు లభించాయి.
జగద్గురువుకుకి బ్రహ్మరధం
భోగభాగ్యాలమధ్య పెరిగిన రాకుమారుడిలా, అందంతో సమ్మోహపరచిన అయస్కాంతపుశక్తితో ఆకర్షింపబడడం, అంత అందగాడిని తను ఎన్నడూ చూడలేదని, బెర్నాడ్ షా, చెప్పడం, హాలివుడ్ సంస్థ జికె నాయకత్వంలో గౌతమబుద్ధ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధపడినా, ఆ ప్రయత్నానికి జికె తిరస్కౄతి, వేష, భాష, నడక, ప్రవర్తనల్లో నూతనశైలితో జికె ఒక ప్రత్యేకశైలెలో ఆకర్షితుడయ్యేవాడు. 1925 లో మద్రాసులో అడయార్ లో ప్రవక్తలా తన మొదటి ప్రసంగం యిచ్చాడు. కౄష్ణమూర్తి అంగ్లకవితాసౌందర్యం, విధ్వంసానికి దూరంగా, విచ్చిన్నధోరణిరహిత నిర్మాణతకు ముందుకు వచ్చినట్లు విశదమవుతుందని పలువురి అభిప్రాయం. ఆంగ్లకవితాసౌందర్యంతో సమ్మోహితులను చేసే, జికె 1927 లో వ్రాసిన ది కింగడం ఒఫ్ హాపినెశ్ (1944) తన కాలేజీ రోజుల్లో చదివి వినిపించేవారు. జికెలాగున అతని వచన రచన కూడ అందంగానే వుండేదిట. తమ్ముడు నిత్యానంద క్షయవ్యాధితో మరణించడం, జికె జీవితంలో అశాంతి, అసంతౄప్తి ఎక్కువైనాయి. దివ్యసమాజం వారు సౄష్టించిన జగద్గురువు పాత్రను అభినయించడానికి తనను వినియోగించబడుతున్నాడని జికె క్రమేపీ భావించాడు. బంగారుపంజరంలోని చిలక అని నిర్ధారించుకున్నాడు. తాను జగద్గురువు కాదని, సామాన్యమానవుడనని, ప్రకటించి, క్రమేపీ దివ్యసమాజానికి దూరంగా వుండడం జరిగింది. కాని అనిబెసెంటుకు తన దత్తపుత్రునిపై ప్రేమానురాగాలు, జగద్గురుత్వంపై విశ్వాసాలు మాత్రం సడలలేదు. అయితే, 82 ఏళ్ళ వౄద్ధురాలు మనస్తాపంతో జబ్బుపడడమే కాకుండ, దౌర్జన్య, క్రౌర్య, కపటసహితమైన లోకంలో జికె ఒంటరివాడయిపోతాడనే దిగులు పడింది. కొందరు దివ్యసమాజపు సభ్యులు జికె వైపు వచ్చి, అండయిచ్చారు.
కౄష్ణమూర్తి ఫౌండేషన్, మద్రాసు

దివ్యసమాజంనుంచి దూరమైనా, నూతన అనుచరవర్గం పెరుగుతూ వచ్చింది. ప్రపంచ పర్యటనలు, ప్రసంగాలు, అనుచరుల సందేహాలను తీర్చడం, ముఖ్యంగా 'కౄష్ణమూర్తి ఫౌండేషన్, మద్రాసు, ఋౠషివ్యాలి (మదనపల్లి), వారణాసి, డిల్లీ, యింగ్లండు, అమెరికా మొదలైన చోట్ల విద్యాసంస్థలు, ప్రచురణసంస్థలు, ట్రష్టులు ప్రారంభమై, జికె సందేశాలు, తత్వధోరణి,కార్యక్రమాలను విస్తారంగా నడపడం ప్రారంభమైనవి. ద్వితీయ ప్రపంచయుద్ధం మూలాన, జికె కాలిఫోర్నియాలో సుస్థిరనివాసం ఏర్పాటుచేసుకున్నాడు. యుద్ధానంతరం 1947 లో యిండియా పున:ప్రయాణం, తరచుగా యిండియా రావడం, ఆయన విద్యాసంస్థల కార్యక్రమాల్ని విశ్లేషించేవాడు. విద్యాసంస్థలను తనిఖీచేయడం, ప్రసంగాలను అందించడం, విదేశ పయనాలు, ముఖ్యకార్యక్రమాలుగా వుండేవి.
ఘనులతో సుపరిచయాలు


ప్రపంచ పర్యటనలు సుప్రసిద్ధ వ్యక్తులతో సద్గోష్టులు, సజ్జనసాంగత్యాలు, సుపరిచయాలు జరిగాయి. ప్రముఖుల్లో, బెర్నాడ్ షా, ఆల్డస్ హక్స్ లీ, సోమర్ సెట్ మాం, హెన్రీ మిల్లర్ లాంటి వారు అతని స్నేహితులుగా మారారు. ఎందరో కళాకారులు, రాజకీయనాయకులు, అతిసన్నిహితులుగా మారిపోయారు. జవహర్ లాల్ నెహ్రూ, యిందిరాగాంధి, అచ్యుత్ పట్వర్ధన్ లకు జికె పై అమితగౌరవం కలిగింది.
విలక్షణ ఆకర్షణ్

వెండిజుట్టు, స్వేతవస్త్రధారణ, శిల్పికళాసౄష్టిలా అందమైన ఆజానుభాహవిగ్రహం, ముఖగాంభీర్యత, ప్రశాంతతల మిశ్రమశైలి, ఆవిగ్రహాన్నే చూస్తూ కూర్చునే అభిమానశ్రోతలు, ఉపన్యాసాలు, సందేహాలకు సమాధానాలు, మధ్యలో చమత్కారాలు, చలోక్తులు, పిట్టకధలు, ఉపమానాలు, ప్రకౄతివింతలు, అనుభవాలు, కవిత్వాలు, జీవితాలు, హితబోధలు, మందలింపులు, మానవ మనస్తత్వ పరిశీలనలు, దిట్టకవుల అష్టావధానప్రక్రియలా, తత్వ, జ్ణానబోధనలు ప్రవచించబడేవి. వినేకొద్ది వినాలని, ఆలోచించేకొద్ది ఆలోచించాలని, అంతులేనికధనాలుగా అలరించబడే వేదికలపై, జికె తన ప్రతిభావ్యుత్పత్తులని ప్రకటించేవారు. తన ప్రసంగాలలో - ప్రముఖ అంశాలుగా, సత్యం, శివం, సుందరం, న్యాయం, స్వేచ్చ, విద్య, విచ్హినత, ధ్యానం, శాంతియుతజీవనం, జీవితపరిపూఋర్ణత్వం, భయభ్రాంతులు, అధిమానసికస్థితి, హింస, స్వీయజ్ణానం, ఆలోచనాలహరి, బాంధవ్యాలు, మరణం, స్వయం అవగాయన, దు:ఖం, ఆరాటం, భద్రత, కోపం, నిబద్ధీకరణం, స్వాభిమానం, మన:ప్రకంపన, మానవాళి భవిష్యత్తు, అంతర్వీక్షణ, అనుగ్రహం, ఆగ్రహం, బాధ, పారమార్ధిక జీవనం, పరిత్యాగం, కంతిదర్శనం, 'నేనూ అన్న ఆంశంపై సుదీర్ఘవిశ్లేషణ, మానవజీవితాలు, యిత్యాది అనేక అంశాలపై భాష్యాన్ని, భావసౌందర్యసహితంగా ప్రవచ్ఫనాల్ని, నభూతో నభవిష్యతి అన్న మాదిరి ఒక తలమానికమైన శైలిని, తత్వాన్ని అందించారు.

Friday, February 15, 2008

'నార్లా వెంకటేశ్వరునికి ఘన నివాళి (1908 - 1985)
'నార్లావారి బాటమాటలు నాణ్యాల మూటలు - శతజయంతి సంబరాలు
బాట + మాట = నాణ్యం + మూట = నార్ల
ఏదివున్నా, ఏది లేకపోయినా, ఈయన రచనల్లో వైవిధ్యం మాత్రం పుష్కలంగా వుంది. అందుకని, వీరి రచనల సంకలనాల్లో ఏదో ఒక భాగం, ఎవరికో ఒకరికి, ఎంతో కొంత నచ్చకపోవడం అంటూ వుండదు అని పలువురు నమ్ముతారు. అంతేకాక, ఏ సమయంలోనైనా ఆసక్తిగా చదువుకోగలిగే సాహిత్యం. దీనికి ప్రామిసరీనోటులా కాలదోషం అంటూ వుండదు. ఆమాటకొస్తే, ఏ ప్రతిభ, సత్త వున్న రచయిత కలంనుంచి వచ్చే రచన అయినా, నూజివీడు మామిడి రసఫలంలా రసాలూరుతూనేవుంటుంది. అదే నార్ల వారి కలం, రచనల్లో కానవస్తుంది.
నవయుగాల బాట 'నార్లామాట
ఉత్తమస్థాయి పత్రికాసంపాదకుడు, సంస్కరణశీలి, హేతువాద తత్వవేత్త, భావజాలాన్ని నార్లవారి బాట అన్నమాదిరి విన్నూత్నంగా అందించిన ఆజానుభాహుడు, తెలుగు పత్రికారంగానికి అత్యాధునిక నూతనభావనారూపశిల్పి - ఎవరోకాదు, నార్ల వెంకటేశ్వరరావు గారు. అందరికీ 'నార్లా. ఆయన బాట, మాట, యుగయుగాలకూ వ్యాప్తి కాగల అర్హత, అధికారం పుష్కళంగా పుణికిపుచ్చుకున్న పుంభావ సరస్వతి. అందుకే 'నవయుగాల బాట నార్లమాటా అని ఆయనే యిచ్చుకున్న శతకరచనకు మకుటం ఆయన జీవితానికే కడు సార్ధకం అని చెప్పాలి.
నార్ల వలస జీవనబాల్యం
అది ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. అంటే, వనరులూ, ఆదాయం అంతంత మాత్రమే కదా. సమాజంలో భాగస్వామ్యం వహించేందుకు నార్ల బాల్యంలో చాలా కష్టపడ్డాడు. ఆనాటి మద్రాసు ప్రెసిడెన్సీ, ఆంధ్రప్రాంతంనుంచి పూర్వీకులు మధ్యప్రదేశ్ లోని కట్ని కి వలసపోవడం, సైన్యవిభాగాల్లోకి ఆహారపదార్ధాలను సరఫరా చేసే వ్యాపారంలో మునిగిన కుటుంబాల్లో, నార్ల వరి కుటుంబాలు ప్రముఖంగా చెలామణి అయ్యాయి. లక్ష్మణరావు, మహాలక్ష్మీ దంపతులకు, మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో 1 డిసెంబర్ 1908 న నార్ల వంశీకుడు జన్మించాడు - వెంకటేశ్వరరావు. బాల్యం, చదువు తర్వాత 'నార్లా కాలేజీ చదువు నిమిత్తం ఆంధ్రప్రాంతానికి తిరిగివచ్చాడు. పట్టభద్రుడవాలన్న చదువుతోపాటు, జాతీయ స్వాతంత్ర్యోద్యమ ప్రభావప్రేరణలతో పాల్గొన్నాడు.
ఆవహించిన పత్రికారంగం
నార్ల వారి ప్రతిభాజీవితన్ని రెండు దశలుగా భావించవచ్చు.
తొలి దశ - ఆంధ్రప్రభ
తలరాత మాట ఏమో కాని, కలంవ్రాత మాత్రం మన నార్లను నరనరాల వ్యాపించింది. బాల్యంనుంచే రాయడంపై మక్కువని పెంచుకున్న పత్రికామాధ్యమరంగంలోకి చొచ్చుకుపోయాడు. అదీ తెలుగుపత్రికారంగంలో. యిండియన్ ఎక్ష్క్స్ ప్రెస్ సంస్థలోని 'ఆంధ్రప్రభా కు ఆరాధ్యదైవంగా పేరుపొందిన సంపాదక వౄత్తిలో రాణించాడు మన నార్ల. రమారమి, రెండు దశాబ్దాలకాలంపాటు - రెండవ ప్రపంచయుద్ధం నుంచి స్వాతంత్ర్యానంతరం వరకూ - నార్ల వారి సంపాదకీయాలు, వ్యక్తిగత శీర్షికలు చదవడం అయాకే, మిగతా పేజీల జోలికి పోయేవారట. ఆనాటి మద్రాసు నుంచి ప్రారంభించిన ఆంధ్రప్రభ ప్రచురణ తెలుగు జర్నలిజంలో ఒక తలమానికమని చెప్పాలి.
మలిదశ - ఆంధ్రజ్యోతి
పత్రికాసంపాదకునిగా అపారమైన అనుభవాన్ని జోడించుకుని, నార్ల వారి విదేశీపర్యటనలను కేవలం తిరగడానికే కాకుండా, ప్రతీ యాత్ర, సాహిత్యం, కళ, వర్తమాన స్థితిగతులను అవలోకనం చేసుకుంటూ, తన ప్రతిభను విశ్వవ్యాప్తం చేయగలిగాడు. ప్రముఖ వ్యక్తులతోపాటు, గ్రంధాలయాలు, స్మారకచిహ్నాలు, కళాప్రదర్శనాలయాల్లోని స్మౄతివైభవాల్ని మరింత విస్తౄతం చేశాడు. ఈ భాగంలోనే, ఆంధ్రప్రభను విడిచి, స్నేహితులతో, ఆంధ్రప్రభలో అపారమైన అనుభవంతో, దీటైన మరొక పత్రిక - ఆంధ్రజ్యోతి - ని ప్రారంభించాడు. ఈ ప్రోత్సాహకుల్లో, ప్రముఖ వ్యాపారులు, జమీందారులు, రాజకీయనాయకులు జట్టుగట్టి, ఆంధ్రజ్యోతిని విడుదల చేశారు. వెంటనే, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్య ప్రచురణగా విజయవాడలోను, ఆ తర్వాత హైదరాబాదులోను (1960) ప్రారంభించారు. మద్రాసు విభాగం మూసివేశారు. అలా ప్రారంభించిన ఆంధ్రజ్యోతి చాలాకాలం ప్రముఖ పత్రికగా పేరుతెచ్చుకుని, మూసివేయడం, ఈ మధ్యనే పున:ప్రారంభం అవడం, చెన్నైలో కూడ ప్రచురణ ప్రారంభించడం కూడ జరిగింది.
ఈ రెండు పత్రికలూ, ఎన్ని యాజమాన్యాలు మారినా, మరెన్ని రూపురేఖలు మారినా, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పేర్లు స్మరిస్తే, నార్ల వెంకటేశ్వరరావు పేరు గుర్తురాక మానదు. స్మరణకు రాలేదంటే, ఆ వ్యక్తికి, సంస్థకి, పత్రికారంగంలో పరిచయం వుందంటే, అది కుహనాభావన, పరిజ़్జానం అని చెప్పి తీరాలి.
మరొక పరిణామం - హేతువాదం
మానసిక పరిపక్వతను పరిపుష్టంగా అందుకున్న నార్ల, గుండెజబ్బు వచ్చేకే తన పొగ తాగే అలవాటును పెంచుకుంటూనే అనారోగ్యాన్ని కూడా పెంచుకున్నాడు. ఫలితంగా, పొగని వదిలాడు. వదులుకోలేని మక్కువని తన గ్రంధాలయ నిర్వహణ విషయంలో శ్రద్ధ వహించాడు. అదే గ్రంధాలయాన్ని, తర్వాత, డా.అంబేద్కర్ విశ్వవిద్యాలYఆనికి విరాళంగా యివ్వడం కూడ జరిగింది. ఆయనలో లోతుగా పాతుకుపోయిన మానవతావాది, ఆయనలో అప్పటివరకూ అదౄశ్యంగా సంచరిస్తున్న హేతువాది ఒక్కసారి బయటకు వచ్చాడు. ఉపనిషత్తులు, భగవద్గీత, ఆధ్యాత్మిక గ్రంధాలతోపాటు, ప్రముఖుని యం.యన్.రాయ్ రచనలను చదివి ప్రభావితమయ్యాడు. ఈ దశలోనే, ప్రముఖులతోపాటు పరిచయాలు, స్నేహాలు పెరిగాయి. వారిలో ప్రముఖులు - ప్రేం నాధ్ బజాజ్ (షేక్ అబ్దుల్లా కాశ్మీర్ ప్రభుత్వం కావించిన బహిష్కరణ) కూడ రాయ్ అనుచరుల్లో ఒకరు. సుశీల్ ముఖర్జీ, నిరంజన్ ధర్, న్యాయవాది వి.యం.తర్కుండే (మానవ హక్కుల పరిరక్షకుడు), ఎ.బి.షా, ఆవుల గోపాలకౄష్ణమూర్తి (మానవత ఉద్యమంలో నాయకుడు)లను స్మరించలేకుండా జరగని పని. రాయ్ రచనలని, రాయ్ భావాలతోపాటు నార్ల చదివేవాడు. గాంధీ విధానాల్ని విమర్శించిన వారిలో రాయ్ ప్రముఖులు. రాజకీయాలకు గాంధీ అవలంబిస్తున్న మతధోరణిని కూడ రాయ్ విమర్శించేవారు.
హేతువాదితోనే పట్టింపులు
రాయ్ 1938 జూలై లో మద్రాసులో పత్రికాసమావేశంలో మాట్లాడడం, ప్రముఖ పత్రికాకారుడు ఖాసా సుబ్బారావు, యిండియన్ ఎక్స్ ప్రెస్ సంపాదకునిగా, రాయ్ భార్య ఎల్లెన్ గురించి వ్యాఖ్యలను ప్రచురించడం, సుబ్బారావుని విమర్శించడం జరిగింది. ఈ సంఘటనకి, పత్రికారంగం యావత్తూ, నార్లతో సహా, పత్రికాసమావేశాన్ని బహిష్కరించడం జరగడం, ఈ ఉదంతంతో రాయ్ ప్రస్తావన, దేశవ్యాప్తంగా మరణంపై (25 జనవరి 1954) రాయ్ ప్రతిభపై స్పందించినా, ఏమాత్రం నార్ల ఆంధ్రప్రభలో చేయకపోవడం గమనార్హం. కాని, ఒక ప్రముఖుడు గుంటూరులో చేసిన విమర్శకు ప్రభావం చెంది, వెంటనే రాయ్ రచనలన్నీ తెచ్చుకుని చదవడం, ప్రతిభావంతమైన భావాలకు ప్రేరణపొంది, 1956 లో రాయ్ గురించి నార్ల సంపాదకీయం రాయడం జరిగింది. రాయ్ భావాలు మదిలోకి వెళ్ళేకొద్దీ, నార్లకు అవి బాగా నచ్చేవి. ఫలితంగా, మునుపు విమర్శలు చేసిన, ఎ.జి.కె.మూర్తితో స్నేహం పెరిగింది. 1942-48 లో హేతువాదోద్యమాన్ని నిర్వహించిన రాయ్ చివరికి నార్ల జీవితంలో భాగం అవడం ఆశ్చర్యం, విశేషం కలిగించాయి. ఈ స్థితిలో, వయసు పైకి ముంచుకొస్తున్న కొలదీ, మానవునిలో ఆధ్యాత్మికత, కర్మవాదం అలవడుతాయి అన్న భావనకు వ్యతిరేకమేకాగ, తన విషయంలో అనుకూలత, ఆశ, మానవత్వం, పెరుగుతున్నాయన్నారు. అంతేకాక, నార్ల తన నిత్య జీవితానుభాలు, ప్రముఖుల పరిచయాలు, స్వంత ఆలోచనలు, డైరీలో ముఖ్యాంశాలను వ్రాసుకోవడం ప్రారంభించి, జీవితాంతం కొనసాగించేవారట.
గ్రంధాలు, గ్రంధాలయాల్లో మధ్య నార్ల
నార్ల గ్రంధాలయాల్ని నిత్యం దర్శించడం, చదవని పుస్తకాలని ఏరడం దినచర్య అనే చెప్పాలి. ప్రముఖంగా పాత పుస్తకాలని వెదకి పట్టుకోవడం ప్రక్రియ తనదైన శైలిలో కళాత్మకంగా జరిపేవారు. ఈ కార్యక్రమంలో ఆయన ఎన్నుకున్న విషయంలో పరిపూర్ణ పరిశోధన చేయడం జరిగాకే వ్రాయడం జరిగేది. ఈ పద్ధతిని గుర్తించి, భారతప్రభుత్వం, సాహిత్య అకాడమీవారి ఆధ్వర్యంలో, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, వేమన ల పై, భారతీయ సాహితీనిర్మాతలు అన్న ధారావాహికంలో, జీవితచిత్రణలను అందరూ మెచ్చుకునేలా రాయగలిగేరు.
పుస్తకాలతో పెంచుకున్న నేస్తం గురించి మన నార్లను చెప్పాలంటే, ఆయన తరచు చెప్పే భావం ఒకటి గుర్తు రాక మానదు.
'పుస్తకాలు కొనడమంటే నాకు చెడ్డ సరదా. జేబులో డబ్బున్నా లేకపోయినా, మంచి పుస్తకాన్ని చూడగానే బేరం చేస్తాను. ఆ పుస్తకంతో నాకు అవసరం వుండవచ్చు, లేకపోవచ్చు. ఒకసారి చదివిన తర్వాత మరి దానితో పనిలేకపోవచ్చు. అయినా దాన్ని కొనేదాక మనస్సు రెపరెపలాడుతూంటుంది. అప్పుచేసి కూడ పుస్తకాన్ని కొనడం అనేకసార్లు సంభవిస్తూంటుంది. పుస్తకాన్ని ఎరువివ్వక తప్పదు. అది పోవడం తప్పదు. అలాగనీ అసలు వాటిని కొనడమే మానలేం. ఇతరుల సంగతి తెలియదు కాని, నా విషయంలో యింతే. ఇప్పటికీ, ఎప్పటికీ."
పుస్తకాలపై నార్ల మరొక అభిప్రాయం యిలా సాగింది.
"విద్యావంతునికి పుస్తకం హస్తభూషణమని పెద్దలన్నారు. అయినా, మన విద్యావంతుల్లో పెక్కుమందికి పుస్తకం కాక, స్విచ్ వాచ్, సిగరెట్ టిన్, ట్రాన్ సిస్టర్ రేడియో మొదలైనవి హస్తభూషణాలు. నాగరీకుని గౄహానికి పుస్తకాలు అలంకారాలని వాత్స్యాయనుడు వ్రాశాడు. అయినా, మన నాగరికుల్లో అత్యధిక సంఖ్యాకుల గౄహాలకు పుస్తకాలుకాక, సోఫాసెట్లు, స్టీల్ బీరువాలు, చౌకబారు క్యాలెండర్లు మొదలైనవి అలంకారాలు. మనదేశంలో చదువులు పెరుగుతున్నా, సంస్కారం పెరగడం లేదనడానికి ఇది నిదర్శనం' నగరాలు పెరుగుతున్నా నాగరికత పెరగడం లేదనడానికి ఇది తార్కాణం."
వైవిధ్యం, విద్వత్తు, వెరసి నార్ల రచనలు
చరిత్ర, వేదాంతం, తత్వం, సంస్కౄతి, ఏదైనా సరే, నార్ల రచనాధోరణి ప్రత్యేకమే. భగవద్గీతకు వ్యాఖ్యానం రచించే ప్రయత్నంలో, ఎన్నో గీతాభాష్యాలను ఆధ్యయనం చేసి, వివిధ దౄక్కోణాల్లోంచి పరిశీలించి, వివరించడం జరిగింది. అలాగే, ఉపనిషత్తులు - ముల్లర్, షెఫ్ణోర్, నీట్జే లాంటి వ్యాఖ్యానాలను చదవడం, అనుకూల ప్రతికూలతలను విశ్లేషించడం, ఫలితంగా అనేక అభిప్రాయాలను, భావాలను, ప్రచురించారు. గీతపై సత్యశోధన, ఉపనిషత్తులపై సుదీర్ఘవ్యాసం, భారతదేశంలోని తెలివైన బీదతనం, ప్రాక్పశ్చిమరాజ్య సంస్కౄతి, యిలా ఎన్నో రచనలు వెలువడ్డాయి.
నార్ల భావలహరి
మతం కేవలం వ్యక్తిగత విశ్వాసంగా భావించి, రాజ్యం, పరిపాలనలోకి రానీయకూడదనేవారు. ప్రాచీనముని యాజ్ఞవల్క్య భావాలు పురోభివౄద్ధికి, మనుగడకు అవరోధాలేకాక నిరంకుశవాది, నియంత మూలాన, భారతదేశపు బీదతనానికి బాధ్యత అన్నారు. మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం, వెదకి నిర్ధారించ్లేని మహాత్మాగాంధి అంతరాత్మ ప్రభోధం లాంటి పద్ధతులు దేశపు స్వాతంత్ర్యం తెచ్చినా, బానిసత్వం పూర్తిగా పోలేదు అన్నారు. గాంధీకి శాస్త్రీయ విధానం లేదని, నిత్యం గీతపై ఆధారపడడం, ఆయన అహింస, సత్యాగ్రహ విధానాలే హింసకు.నిరాహార ధోరణి అనారోగ్యానికి చివరకు దారితీసాయన్నారు. యువకులకు కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలకు యువకులకు అవే మార్గాలని చెప్పి, ఆత్మసమర్ధత, ఆత్మసంయమనం అలవాటు చేసుకోనివ్వలేదన్నారు. హిందూతత్వం, మానవతాతత్వం మేళవించిన, సుగమం అయ్యేది అన్నారు. మానవతావిలువలపై దౄష్టిపెట్టి అలవరించినట్లయితే, మానవులు వారిపైనే స్వయంగా ఆధారపడి, వారి సమస్యలకు పరిష్కారాలు వారే కనుగొనేందుకు దోహదం అయేది.
యిందిరాగాంధి తెచ్చిన అవాంతరం, పోగొట్టుకున్న సంపాదకత్వం
పుష్కలమైన స్మౄతి, స్ఫూర్తి కలిగిన పత్రికాకారుడిగా, 1975లో యిందిరాగాంధి సిద్దాంతాలకు నార్ల అన్యధా ఆమోదితుడయినా, నిర్ణయం, అమలుపరచటం, నిరాశనే కలిగించింది. సంపాదకీయం తెల్లకాగితంలా వుంచుదామనుకున్నా, ఆంధ్రజ్యోతి యాజమాన్యం ససేమిరా అన్న మేరకు, నార్ల కుటుంబం యావత్తూ, అమెరికా ప్రయాణం చేయడం, జీవితంలో ప్రముఖ సంఘటన. నార్ల వారి సుగుణసంతానం, ఏడుగురూ, డాక్టర్లవ్వడం, ఉద్యోగులవ్వడం మూలాన, అత్యవసర పరిస్థితి అంతం అయ్యేకే, భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆంధ్రజ్యోతి సంఫాదకునిగా రాజీనామా చేశారు. యాజమాన్యం అనివార్య జోక్యం చేసుకున్నప్పుడల్లా, నార్ల రాజీనామా చేయడం కొత్తకాదు. యిదివరకు ఆంధ్రప్రభలో కూడ జరిగింది. కాంగ్రేసు పార్టీ రాజకీయాల్లో పాల్గొని, రాజ్యసభ సభ్యునిగా ప్రత్యక్షంగా వీక్షించిన రాజకీయాలు, నాయకుల అవినీతిధోరణి, ప్రజాజీవనం నుంచి తప్పుకోవలసివచ్చింది.
ప్రతిభావంతులకూ అండదండలు
ఏ ప్రతిభావంతునికి అన్యాయం జరిగినా నార్ల సహించలేదు. కేవలం పట్టభద్రుడైనా, జి.వి.కౄష్ణారావు చేసిన, కళాపూర్ణోదయం పై ఆంగ్లంపై పరిశోధనావ్యాసం పై రేకిత్తిన వివాదం విషయంలో, నార్ల స్వయంగా చదివి, ఉపాధ్యాయుని భాష, విశ్లేషణలోనే తప్పులున్నాయని. ఘాటుపదాలతోకూడిన లేఖను విశ్వవిద్యాలయం ఉపకులపతికి వ్రాయడంలో కనపరచిన ధైర్యసాహసాలు, కులగజ్జిధోరణితో విద్యావిధానాలను నిర్ణయిస్తున్న ఉపాధ్యాయుల వక్రతను, డా. గోవిందరాజులు నాయుడు గారు గ్రహించి న్యాయం చేయకపోతే, ప్రజలముందు ప్రస్తుతిస్తానని నిర్ద్వందంగా చెప్పడం, పట్టభద్రుని ప్రతిభ పరిశోధనలో ఉత్తీర్ణతను ప్రకటించవలసివచ్చింది. దీనితర్వాత, ఆంధ్రప్రభ లో కౄష్ణారావు వ్యాసాలు ఎన్నో ప్రచురించబడ్దాయి.
ముఖ్యమంత్రులు ఎవరైనా నార్లకు ముఖ్యులు కానేకారు!
కళాజీవన స్మౄతుల్ని, కళాకారుడిగా, అభిమానులకు జీవితముఖ్యాంశాలను పత్రికలో ప్రచురించేందుకు, గుంటూరు జిల్లా, తుమ్మపూడిలోని సూర్యదేవర సంజీవ్ దేవ్ ని నార్ల పరిచయం చేశారు. సమాజం, రాజకీయం లో అన్యాయాన్ని ఎన్నడూ సహించని నార్ల, రాష్ట్రపు ముఖ్యమంత్రులను సైతం ఖాతరు చేయని సన్నివేశాలు కోకొల్లలు. ఆంధ్రదేశపు ముఖ్య ముఖ్యమంత్రులైన - టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, పి.వి.నరసింహారావులతో ఢీకొట్టాడు నార్ల. కాసు రెడ్డిగారు అయితే, ఆంధ్రజ్యోతి పనివిధానాన్ని రోజువారీగా (1969), పత్రికాస్వేఛ్ఛని అంతరించేందుకు అసెంబ్లీలో చట్టాన్ని ప్రవేశపెట్టగా, పత్రికారంగం యావత్తూ విరోధించి, బిల్లును వెనక్కితీసుకునేలా ముఖ్యమంత్రిని చేయగలిగిన ఖ్యాతి, నాయకత్వం మన నార్లదే. ప్రముఖ పత్రికాసంపాదకుడు, మానికొండ చలపతిరావుగారు (నేషనల్ హెరాల్డ్ దినపత్రిక, సంపాదకులు), నార్ల నివాసాన్ని తరచుగా దర్శించి, నార్లతో ఎన్నో చర్చలు, సంభాషణలు జరిపేవారు. బౌద్ధ సంస్కౄతికి ప్రతిబింబంగా నార్ల అనేక వస్తువులు, జ़్జాపిలకు సంగ్రహం చేసుకునేవారు.
నార్ల రచనలు రసరమ్యాలు, రమణీయాలు
ప్రముఖ సంపాదకులేకాక, రచయితగా, కధలు, కవితలు, నాటికలు, దేశచరిత్రలు, వ్యాసాలు, ప్రసంగాలు, పుస్తకాలపై విశ్లేషణలు కోకొల్లలుగా వెలిసినా, నార్లను గర్వించే ఆలోచనావాది, రచయిత, తన అసమర్ధతను పదేపదే చెప్పుకున్నా, ఎదురులేని వక్తగా తన ప్రతిభను నిరూపించుకున్నారు.
సౌరభ సంకలనాలు
నార్ల వారి సాహిత్యం యావత్తునీ, వివిధ తరగతుల్లో విభజించి, ఏడు భాగాలుగా ప్రచురణకు నోచుకొని, సాహితీప్రేమికులకు కానుకగా మిగిలింది. వాటిని, దేశచరిత్రలు, సాంఘిక నాటికలు, వ్యాసాలు, పౌరాణిక నాటికలు, సాహిత్య రచనలు, సంస్కౄతి, సాహిత్యం, మతం, వర్తమాన సంఘటనలు, జీవిత చిత్రణలు అని రసరమ్యంగా, రమణీయంగా దర్శనం చేయించారు. నార్ల వారి రచనలు, వాటి పేర్లు, హేతువాదాన్ని చెప్పకనే చెప్తాయి. ఉదాహరణకు, నార్ల, సీతజోస్యం, నరకంలో సత్యహరిశ్చంద్ర, పురాణ వైరాగ్యం (అసంపూర్తి వ్యాసం),నవయుగాల బాట నార్లమాట అన్న శతకం, యిలా ఎన్నో చెప్పవచ్చు.
వలదన్న సాహిత్య అకాడమీ పురస్కారం
సంపాదకుని తర్వాత, నాటక రచయితగా అవతారం ఎత్తారు నార్ల. 1981 లో నార్ల వారి నాటకం - సీతజోస్యం - సాహిత్య, ఆధ్యాత్మిక రంగాల్లోని ప్రజల్లో మంచి ఆసక్తి రేకెత్తింది. అయితే, ఏ అకాడమీనుంచి పురస్కారం అందుకున్నారో, ఆ సంస్థనుంచి ప్రచురించే పత్రికలోనే రచనపై విమర్శనాత్మకమైన రచనను ప్రోత్సాహించడం, పద్ధతికాదని, బిరుదుని తిరస్కరించిన శైలి నార్ల వారిది. నార్ల జీవితంలోని అనుభవాలు, వాదోపవాదాలు, అభిప్రాయాలు, ప్రసంగాలు, ప్రబోధాలు, చెణుకులు, చురకలు, పరిచయాలు, పరిచయాలను అన్ని కలిపిన స్మౄతిలిఖితాలను కొన్ని ఏరికూర్చి, 'కదంబం'గా చాలా పేరుతెచ్చింది. చాలా రచనలు ఆంధ్రప్రభలో ముద్రితమయినా, పలుకుబడివర్గం నుంచి వచ్చిన యిబ్బందులవల్ల అవి మధ్యంతరంలోనే ఆగిపోయాయి.
'తెలుగువాడీ ఆత్మగౌరవ ఉద్యమానికి చేదోడు, ప్రోత్సాహం
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు శ్రీకారం చుట్టిన తెలుగువాడి ఆత్మగౌరవానికి ఎదురైన అవమానాన్ని ఎదుర్కొనడంలో ఆచరించిన ఉద్యమానికి, నార్లవారు కూడ తనదైన శైలిలో చేయూత, ప్రోత్సాహం,తెలుగుదేశం స్థాపనలో భాగస్వామ్యం వహించారు. సాంస్కౄతిక వ్యవహారాలపై, రామారావుగారి ప్రభుత్వానికి సలహాదారుగా నార్లవారు తన సలహాలను, సంప్రదింపులను అందించారు.
కుటుంబమంతా వైద్యుల మయం
ధర్మపత్ని సులోచనాదేవి సహకారం ఎప్పుడూ చెప్పుకునేవారు నార్ల. అనేక విశ్వవిద్యాలయాలు నార్లకు డాక్టర్ ప్రదానం చేసినా, ఆయన ఎప్పుడూ పేరుతో దాన్ని జోడించుకోలేదు అన్నది విశేషం. అష్టదిగ్గజాలవంటి సంతానం నార్లకు. పరిమితంపై అచంచలమైన అవిశ్వాసం. నలుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. అందరూ వైద్యులూ, వైద్యులనే వివాహమాడారు. శ్రీమతి నార్ల తప్పితే, అందరూ డాక్టర్లే అంటారు. రెండు సంస్కౄతులు, భాషలమధ్య వివాహాలు తనకు సంతౄప్తినిచ్చాయని చెప్పారు. సంతానం ఎంత పట్టుపట్టినా, నార్ల మాత్రం విదేశాలకు వలస మార్చలేదు. వచ్చిపోతూండడమే తప్ప.
జీవితాంతం వెంటాడిన గ్రంధాలయం, హేతువాది నిజ దేవాలయం
నార్ల వారి పుస్తకాలు, నిజనేస్తాలు. మనసుల్ని, మనుషుల్ని నిజస్వరూపులుగా తీర్చిదిద్దేవి పుస్తకాలే. మెదడుకి మేత పుస్తకాలే అంటారు. ఎవ్వరినీ, వాటిని చదవనిచ్చేవారు కాని, తీసుకోనిచ్చేవారు కారు. ఎన్నో సంగ్రహాలయాలు, విశ్వవిద్యాలయాలు, ఆయన గ్రంధాలయంపై కన్ను వేశాయి. ఆయన చివరి శ్వాస వరకూ వాటిని చెక్కుచెదరనీయలేదు. వాటి సమక్షంలోనే ఆయన ప్రాణం వదిలాదు. నార్ల వారికి నిజ నేస్తాలు - పుస్తకాలు, నేస్తాలు. నార్ల మరణం తర్వాత, భార్య సులోచన చాలాకాలం నిర్వహించి, చివరకు అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి భూరి విరాళంగా అందజేయడం తెలుగుకళ్ళు చేసుకున్న పుణ్యం. తెలుగు మేధ అందుకున్న మరింత తేజోకాంతిమయం. హైదరాబాదులో ప్రతీ ఏట, నార్ల పేరట స్మారక ఉపన్యాసాలు, సభాసమావేశాలు జరగడం పరిపాటి.
నార్ల వెంకటేశ్వరరావు గారికి నిజమైన స్మౄతినివాళి, తనకు ప్రేమాభిమానపాత్రమైన పత్రికారంగంలోని సంపాదకునిగా, రచయితగా, వెలిబుచ్చిన కొన్ని మచ్చుకైన అభిప్రాయాలను పున:శ్చరణ చేసుకోవడం కన్నా, ఆయన ఆత్మకు శాంతి లేదు, రాదు.
'నార్లావారి సునాదాలు
అనంత కోటి ముక్కలుగా చీలుతున్న ఈ భూగోళం మీద మనుషులందర్నీ కలిపే మార్గం ఒకటుంది. అదే వార్తావాహిని.
ప్రజల సరసన నిలచి ప్రధనమ్ము నడుపుట పరమ ధర్మమోయి పత్రికలకు.
ప్రభుత వక్రమౌను పత్రికలేకున్న
వేగం జర్నలిష్టుల వేదం.
పత్రికయె నియంత పక్కలో బల్లెమ్ము పత్రికయె ప్రజాళి పట్టుగొమ్మ.
వేయి ప్రశ్నలుండు విజ़్జానవేత్తకు ప్రశ్నలుండబోవు పామరునకు విజ़్జుడౌను నరుడు జిజ़్జాస.
వార్త పక్షాన వదంతిపై యుద్ధం, స్వాతంత్ర్యం పక్షాన నిరంకుశంపై యుద్దం. న్యాయం పక్షాన అన్యాయం పై యుద్ధం.
వార్తనేక మౌను ప్రాక్పశ్చమమ్ములు వార్తవలన స్వేఛ్ఛ పరిధి పెరుగు వార్త లేక వసుధ వర్ధిల్లనేరదు.
పదవినున్నవారు మదమ్మత్తులైనచో పట్టి పీకనట్టి పత్రికేల? తోకముడుచు పులని లోకమ్ము నమ్మదా?
పత్రికా రచయిత ప్రతిహారిగా నిల్వ అవని నిద్రపోవు నాదమరచి అతడు నిద్రపోవగతియించు భద్రత.
వర్తమాన జగతి పరివర్తనాలపై స్వేచ్ఛతోడ వ్యాఖ్య సేయనట్టి ఎడిటరెందుకోయి ఏటిలో గలుపనా.
పత్రికొక్కటున్న పదివేల సైన్యము.
పత్రికా రచనను పడుపు వౄత్తిగా మార్చు వెధవకంటే పచ్చి వేశ్య మేలు తనువు నమ్ము వేశ్య, మనసును కాదురా!
నార్లవారి శతజయంతి ఉత్సవాలు త్వరలో ... 1808 - 1908
ప్రతిభామూర్తి జయంతి, వర్ధంతి సాధారణమే. కాని, శతజయంతి నిజంగా, శతధా, సహస్రధా, జరుపుకోవడం, సర్వదా హర్షనీయం. నార్ల వారి ఆశయాలు, ఆశలు, ఈ ఏడాదిపాటు సింహావలోకనం చేసుకుని, అమలుపాటి కార్యక్రమాల్ని ప్రణాలికాబద్ధంగా విజయవంతంగా ఆచరణకు నోచుకుంటే, అంతకన్న అర్ధం, పరమార్ధం, లేవు, రావు.
ఘననివాళిని సమర్పించుకుంటూ ...

Wednesday, February 13, 2008

ప్రేమ ప్రేమతో సంధింప ... ?

ప్రేమ ప్రేమతో సంధింప ... ?
"ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమ మయముప్రేమ ప్రేమతో సంధింప నీమమగునుకాన ప్రేమను పూర్తిగా కలిగియున్నఅద్వితీయము చెందంగనర్హుడగును." శ్రీ సత్యసాయిబాబా.
విశ్వానికి మూలం ప్రేమ. ప్రేమయే దైవం, అద్వితీయం. మానవత్వానికి ప్రధానం. త్యాగసహిత సత్యశివసుందరమయం. నిర్మలత్వానికి సచిత్ర సంకేతం. ప్రేమ గుణం కాదు; జీవనవిధానం. ప్రేమ జీవితంలోకాహలి నిదానం కూడ. ప్రేమ - ప్రేమించడం - ప్రేమింపబడడం త్రివేణీ సంగమంలా ఏకైక సూత్రంగా విరాజిల్లాలి.
లౌకిక లోకంలోకి ప్రేమ పరకాయ ప్రవేశం చేస్తే, అనురాగసంకేతం, వాత్సల్యపూరితం, స్నేహమయం, దయాకరుణాలవాలంగా పరిణమించాలి. మానవుడికి విలువైన వలువ ప్రేమ. ఉదాత్త సంస్కారపూరిత, దివ్య, నిర్వ్యాజ బంధంగా రూపొందాలి ఈ లోకంలో. కాని ప్రేమ బంధానికి సరిసములు లేవు. జీవితాన్నైనా, మౄత్యువునైనా, ప్రేమించవలసిందే. ఏ అనామిక నిర్వచనమో అంతుపట్టదు కానీ, ప్రేమించిన హౄదయం నిత్యయవ్వనవతి. జీవితంలో గొప్ప సుఖానుభూతినిచ్చేది. నియమాలు, షరతులు నిర్ద్వందంగా ఆచరించి పాటిస్తేనే ఉనికిని ప్రదర్శిస్తుంది. స్వభావికంగా అందమైన అవసరం ప్రేమ. స్వభావానికి కూడ అవసరమే. మనల్ని తీర్చిదిద్దుతూ, మనలో నివసిస్తుంది. కళ్ళ(లో)తో కాకుండా, మనసుతో(లో) చూడగలిగినప్పుడు, ప్రేమ కూడ విద్యలాంటిదే. కష్టపడి, మన మామూలు చదువులాగే, దీన్నీ చదువుకొని, పరీక్షలను తట్టుకుని, వాటిలో నెగ్గుకురావాలి. అప్పుడే, అర్హతలు, అధికారాలు లభించేది. ఎక్కువ ప్రేమించినా, బాగా ప్రేమించినా, ప్రేమ చందమామలాంటిది. పెరగకపోయినా, తరుగుతూ, క్షీణిస్తూంటుంది. ప్రేమ మకరందం లాంటిది. మత్తుని, మదాన్ని ఒకేసారి కలిగిస్తుంది. వాత్సల్యాన్ని ఎలాగూ తోడు తెచ్చుకుంటుంది. ప్రేమ ఒక విధంగా 'వాత్సల్య మదమోహితా అని నిర్వచనం చెప్పవచ్చు. వాల్మీకి, రామాయణంలో కైక వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని సరిగ్గా యిలాగే, కొడుకు భరతుడి నోట చెప్పిస్తాడు.
మనపై మనకున్న ప్రేమ మొదటి రకానిది, స్వార్ధపూరితం. ఎవరూ నిన్ను ప్రేమించకపోతే, అది నీ తప్పిదం, ఏదో తెలియని లోపం. హౄదయంలో చోటుంటే యింట్లోనూ వుంటుంది. కక్కుని, దగ్గునైనా దాచుకోగలం కాని, ప్రేమను అణచుకోలేం. ధరణీసూర్యబంధం లాంటిది. జీవితం-ప్రేమ అవిభాజ్యం. ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును. 'నిరాశ్రయా న శోభంతే' - ఆశ్రయం లేనిచో శోభించదు - అన్న నానుడి ప్రేమకు వర్తిస్తుంది.
ప్రేమకు ఓ దుర్గుణం వుంది. కుంటుకుంటూ రంగప్రవేశం చేస్తుంది. రంగస్థలాన్నే రసాభాసం చేసి నిష్క్రమిస్తుంది. ఈ కలికాలపు పృరేమ, పెద్ద పెత్తందారైపోయింది. పుట్టకుండా మాయమయిపోతోంది. పుట్టగానే పారిపోతోంది. పొదల్లోకి, నగరోద్యానవనాల్లోకి, చెత్తకుండీల్లోకి నిర్దయగా విసరబడుతోంది. యుక్తయవస్కుల మేధమనోహౄదయాలను నిర్వికాసపూరితుల్ని చేసేస్తోంది. పరిణయమైనా, జాయాపతులచేత కూడ అవాంఛనీయ పరిణామాలకు దారి తీయిస్తోంది. అనుమానపు అసూయా ద్వేష రాగభరితుల్ని కావిస్తోంది. ఫలితంగా, స్వర్ణభారతం యుక్తప్రాయంలో అవాంఛనీయాల్లోకి, వివాహేతరబంధనాల్లోకి, తలమానికంగా పరిణమించింది. గర్భస్రావాలు గణాంకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రేమ అంటురోగాల్ని, అంటరానితనాల్ని కూడ ప్రసాదిస్తోంది. ప్రేమికుల దినోత్సవాలు ఏడాదికోసారి జరుపుకుంటున్నా, దాని ప్రభావప్రేరణలు మాత్రం జీవితాంతం వెంటాడుతూ, జీవన్నరకప్రాయం అవుతోంది.
జీవితం విద్యుత్తు బల్బులాంటిదని, ఫెల్మెంటు ఎప్పుడు టప్పుమంటుందో, వరద తుఫాను రాకపోకలమాదిరి, సరియైన సంకేత ప్రదర్శనలకే కరువైపోతోంది. ఈ ప్రమాద సంకేతాలని యువత గ్రహించాలి. నిగ్రహంగా నిలదొక్కుకోవాలి. ప్రేమల్ని పార్కుల్లోనూ, అమెరికావీసాల ద్వారా అందుకునే మేధోవలసల్లోనూ, ఉద్యోగాలకే పరిమితం కాకుండా, వెర్రితలలు వేసే విషసంస్కౄతి వ్యాపిస్తున్న అధోగతి నుంచి బయటపడడం గురించి రవంతైనా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ' అన్న సంస్కౄతి గురించి రవంతైనా ఆలోచిస్తే, ఈ ప్రేమదోమ యింతగా కుట్టి బాధించదు. ప్రేమగానే నిమిరి ముద్దాడుతుంది. మన మానవతా సంస్కౄతీ నైతిక విలువల వలువలను ధరించాలి. జగానికి గర్వకారణంగా మారాలి. ఈ కాముకతా ధోరణిని విడనాడాలి. ఆ యీ 'మెయిలూ మూఢత్వం నుంచి బయటపడాలి. మస్తిష్కాలను ఆమలినం చేసుకోక, హౄదయోద్యాన నందనవనవాటికల్లో ప్రేమానంద సువాసిత సుమాల్ని, భక్తి వినయ విశ్వాసాలతో మేళవించి, విజ్ణాన వినోద విలాసపు విత్తుల్ని నాటాలి. ప్రేమ వాత్సల్య రసానుభూతుల్ని వాయినాల మాదిరి యిచ్చిపుచ్చుకోవాలి. తులసివనాల్లో గంజాయిమొక్కల్ని పెరగకుండా మొదట్లోనే తుంచివేయాలి. నిజమైన ప్రేమ అందరినీ బంధించకమానదు. అమితానంద సందోహాలతో బంధింపపడకమానదు. మనందరి హౄదయద్వారాలకి ప్రవేశపు నిషిద్ధాక్షర సంకేతాల్ని రచించినా, దరహాసాలను చిందిస్తూ నన్నెవరూ ఆపలేరని, పొండు పొండని ముందుకు దూసుకు వస్తుంది. పునర్జన్మ సిద్ధాంత రాహిత్యం ప్రేమది - మరణం లేనేలేదు కనక.
వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకంటే, వలచి విఫలమొంది విలపింప మేలురా! అని బసవరాజు అప్పారావు గారు ఏనాడో చెప్పారు. నేటితరం ఈ సిద్ధాంతాన్ని సరిగ్గా అవగాహన చేసుకోకుండా, ఘనకార్యం చేస్తున్నట్లు ముందుకు దూసుకుపోతున్నారు. అనుకున్న ఆశయాల్ని, ఆలోచనల్ని ఆచరణలో పెట్టలేక, ఉభయుల మధ్య అవగాహనారాహిత్యంలో అహంబావం, ఆభిజాత్యం పెంచుకుని, ఎవరి పధాన్ని వారు పయనంచేసి, చివరకు పశ్చాత్తాపం చెంది, విఫలమై, విలపిస్తున్నారు. చివరికి, ఎవరికి వారే యమునా తీరే అని చతికిల పడిపోతూ, ఎక్కడున్నావు గొంగళీ అంటే, వేసినచోటే ఉన్నాను కదా అని సర్ది చెప్పుకుంటున్న సమయకాలం. మహాకవి, శరత్, ప్రేమలో పేరుకుపోతున్న మూర్ఖత్వాన్ని చక్కగా వివరిస్తూ - 'తన అజాగ్రత్తవలన చెట్టుమీదనుండి క్రిందపడి కాళ్ళు, చేతులు విరగకొట్టుకొని భూమ్యాకర్షణవల్లనే తను పడ్డానని, దానిమీద నేరం మోపితే ఎంత మూర్ఖంగా వుంటుందో ప్రేమ కఠినమన్నా, ఘౄణీభూతమన్నా అంత మూర్ఖంగా వుంటుంది - అన్నది ఈనాటి ప్రేమాయణాలకి, ప్రేమభాగవతాలకి సరిగ్గా సరిపోతుంది.
ప్రేమికుల దినోత్సవం - 14 ఫిబ్రవరి
ఫిబ్రవరి 14 న ప్రేమికుల దినోత్సవాల్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం, రివాజు. ప్రేమికులారా! ప్రేమను పవిత్రభావనగా భావించండి. ప్రేమ మిమ్మల్ని వరించాలి. ప్రేమ మిమ్మల్ని వధించకూడదు. ప్రేమించలేని వాడికన్నా, ప్రేమించగల వాడు హెచ్చుగా పరిణతి పొందినవాడు - ప్రేమికుడు అన్న నిర్వచనాన్ని మగ ప్రేమ మహారాజులు గ్రహించాల్సిన తరుణం నేడు. కాని నాగరికత ఎక్కువ అవుతున్న కొద్దీ, ప్రణయ రోగులు ఎక్కువవుతున్నారు. ప్రేమికులు తమను తామే వేటాడుకొనే విచిత్ర కిరాతకులు అనిపిస్తుంది. తమకే తెలిసీ తెలియకుండ, ఏకాంత తమసుల్లో రహస్యంగా వలపుల వాగురల్ని పన్నుతారు. ఆ ఉరులలో తామే చిక్కుకుని గిలాగిలా కొట్టుకునే దయనీయమైన సాధుజంతువులు ప్రేమికులు.
ప్రేమికులారా! ప్రేమికుల దినోత్సవం అన్న వెర్రితనంతో మీ జీవితాల్ని దు:ఖమయం చేసుకోకండి.మన సంస్కౄతిని, నాగరికతని అనుసరిస్తూ మీ జీవితాన్ని సుఖానందానుభూతుల్ని పొందండి.తస్మాత్! జాగ్రత్త! మెలకువలను పాటించండి. వక్రయించుకుంటే, గిరీశం అన్నట్లు - డామిట్! కధ అడ్డం తిరిగింది! అని, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన శోకసాగరంలో ఈత రాని చందాన, ప్రేమసాగరం మాట ఎలావున్నా, దు:ఖ సాగరంలో మునిగిపోవాల్సివస్తుంది. తిరిగిరాని లోకాలకు పయనించాల్సివస్తుంది.
చివరిగా, గీతాచార్యుడు సెలవిచ్చినట్లు, 'యధేఛ్ఛసి తధా కురూ - నీకు ఏది యిష్టమో, అది చేసుకో!' అన్న సూక్తి, నీవు చేసిన ఖర్మ నీవనుభవించక తప్పదన్నా! అని చెప్పక చెప్పాడు. అందుకని మీ అడుగు ఎటు వేసినా సరే. దాని ఫలితానికి తయారవ్వండి. తొందరగా అడుగులు వేసి, తప్పుదారి పట్టేసేలా అయితే, మీ చర్యలకు మీరే బాధ్యులు అన్నది మాత్రం మరువకండి.
ప్రేమ ప్రేరణ అయినప్పుడు మరియు జ़్జానం సరియైన తోవ చూపించినప్పుడే ఆహ్లాదకరమైన జీవితం సాధ్యమవుతుంది అని ప్రముఖ తత్త్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ అంటాడు. ప్రేమించడం అంటే మన ఆనందాన్ని మరొకరి ఆనందంతో ముడివేయడం. వివేకవతి అయిన స్త్రీ ప్రేమను సంపాదించడం కష్టం. ఆమె వివేకాన్ని తెలివి తేటలను పొగడకుండా నాటిని నీవు గౌరవిస్తున్నావన్న నమ్మకం కలిగితేనే ఆమె నిన్ను ప్రేమిస్తుంది. పొగిడావో, నిన్ను అసహించుకుంటుంది - అని గొప్ప తత్త్వవేత్త అభిప్రాయపడ్డాడు.
ప్రేరణ లేకుంటే, ప్రేరణకు జ़్జానం చేయూతగా లేకుంటే, జ़్జానం శ్రమ రూపం దాల్చకుంటే, శ్రమ ప్రేమ పూరితం కాకుంటే, జీవితం అంధకారం బంధురం - అంటాడు జీవనగీత లో కాళోజీ.
ప్రేమికుల దినోత్సవం, ఫిబ్రవరి 14 న, జరుపుకునే శుభసందర్భంలో, ప్రేమికులకు శుభాకాంక్షలు.

ప్రేమ ప్రేమతో సంధింప ... ?
"ప్రేమ రూపము బ్రహ్మంబు ప్రేమ మయముప్రేమ ప్రేమతో సంధింప నీమమగునుకాన ప్రేమను పూర్తిగా కలిగియున్నఅద్వితీయము చెందంగనర్హుడగును." శ్రీ సత్యసాయిబాబా.
విశ్వానికి మూలం ప్రేమ. ప్రేమయే దైవం, అద్వితీయం. మానవత్వానికి ప్రధానం. త్యాగసహిత సత్యశివసుందరమయం. నిర్మలత్వానికి సచిత్ర సంకేతం. ప్రేమ గుణం కాదు; జీవనవిధానం. ప్రేమ జీవితంలోకాహలి నిదానం కూడ. ప్రేమ - ప్రేమించడం - ప్రేమింపబడడం త్రివేణీ సంగమంలా ఏకైక సూత్రంగా విరాజిల్లాలి.
లౌకిక లోకంలోకి ప్రేమ పరకాయ ప్రవేశం చేస్తే, అనురాగసంకేతం, వాత్సల్యపూరితం, స్నేహమయం, దయాకరుణాలవాలంగా పరిణమించాలి. మానవుడికి విలువైన వలువ ప్రేమ. ఉదాత్త సంస్కారపూరిత, దివ్య, నిర్వ్యాజ బంధంగా రూపొందాలి ఈ లోకంలో. కాని ప్రేమ బంధానికి సరిసములు లేవు. జీవితాన్నైనా, మౄత్యువునైనా, ప్రేమించవలసిందే. ఏ అనామిక నిర్వచనమో అంతుపట్టదు కానీ, ప్రేమించిన హౄదయం నిత్యయవ్వనవతి. జీవితంలో గొప్ప సుఖానుభూతినిచ్చేది. నియమాలు, షరతులు నిర్ద్వందంగా ఆచరించి పాటిస్తేనే ఉనికిని ప్రదర్శిస్తుంది. స్వభావికంగా అందమైన అవసరం ప్రేమ. స్వభావానికి కూడ అవసరమే. మనల్ని తీర్చిదిద్దుతూ, మనలో నివసిస్తుంది. కళ్ళ(లో)తో కాకుండా, మనసుతో(లో) చూడగలిగినప్పుడు, ప్రేమ కూడ విద్యలాంటిదే. కష్టపడి, మన మామూలు చదువులాగే, దీన్నీ చదువుకొని, పరీక్షలను తట్టుకుని, వాటిలో నెగ్గుకురావాలి. అప్పుడే, అర్హతలు, అధికారాలు లభించేది. ఎక్కువ ప్రేమించినా, బాగా ప్రేమించినా, ప్రేమ చందమామలాంటిది. పెరగకపోయినా, తరుగుతూ, క్షీణిస్తూంటుంది. ప్రేమ మకరందం లాంటిది. మత్తుని, మదాన్ని ఒకేసారి కలిగిస్తుంది. వాత్సల్యాన్ని ఎలాగూ తోడు తెచ్చుకుంటుంది. ప్రేమ ఒక విధంగా 'వాత్సల్య మదమోహితా అని నిర్వచనం చెప్పవచ్చు. వాల్మీకి, రామాయణంలో కైక వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని సరిగ్గా యిలాగే, కొడుకు భరతుడి నోట చెప్పిస్తాడు.
మనపై మనకున్న ప్రేమ మొదటి రకానిది, స్వార్ధపూరితం. ఎవరూ నిన్ను ప్రేమించకపోతే, అది నీ తప్పిదం, ఏదో తెలియని లోపం. హౄదయంలో చోటుంటే యింట్లోనూ వుంటుంది. కక్కుని, దగ్గునైనా దాచుకోగలం కాని, ప్రేమను అణచుకోలేం. ధరణీసూర్యబంధం లాంటిది. జీవితం-ప్రేమ అవిభాజ్యం. ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును. 'నిరాశ్రయా న శోభంతే' - ఆశ్రయం లేనిచో శోభించదు - అన్న నానుడి ప్రేమకు వర్తిస్తుంది.
ప్రేమకు ఓ దుర్గుణం వుంది. కుంటుకుంటూ రంగప్రవేశం చేస్తుంది. రంగస్థలాన్నే రసాభాసం చేసి నిష్క్రమిస్తుంది. ఈ కలికాలపు పృరేమ, పెద్ద పెత్తందారైపోయింది. పుట్టకుండా మాయమయిపోతోంది. పుట్టగానే పారిపోతోంది. పొదల్లోకి, నగరోద్యానవనాల్లోకి, చెత్తకుండీల్లోకి నిర్దయగా విసరబడుతోంది. యుక్తయవస్కుల మేధమనోహౄదయాలను నిర్వికాసపూరితుల్ని చేసేస్తోంది. పరిణయమైనా, జాయాపతులచేత కూడ అవాంఛనీయ పరిణామాలకు దారి తీయిస్తోంది. అనుమానపు అసూయా ద్వేష రాగభరితుల్ని కావిస్తోంది. ఫలితంగా, స్వర్ణభారతం యుక్తప్రాయంలో అవాంఛనీయాల్లోకి, వివాహేతరబంధనాల్లోకి, తలమానికంగా పరిణమించింది. గర్భస్రావాలు గణాంకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రేమ అంటురోగాల్ని, అంటరానితనాల్ని కూడ ప్రసాదిస్తోంది. ప్రేమికుల దినోత్సవాలు ఏడాదికోసారి జరుపుకుంటున్నా, దాని ప్రభావప్రేరణలు మాత్రం జీవితాంతం వెంటాడుతూ, జీవన్నరకప్రాయం అవుతోంది.
జీవితం విద్యుత్తు బల్బులాంటిదని, ఫెల్మెంటు ఎప్పుడు టప్పుమంటుందో, వరద తుఫాను రాకపోకలమాదిరి, సరియైన సంకేత ప్రదర్శనలకే కరువైపోతోంది. ఈ ప్రమాద సంకేతాలని యువత గ్రహించాలి. నిగ్రహంగా నిలదొక్కుకోవాలి. ప్రేమల్ని పార్కుల్లోనూ, అమెరికావీసాల ద్వారా అందుకునే మేధోవలసల్లోనూ, ఉద్యోగాలకే పరిమితం కాకుండా, వెర్రితలలు వేసే విషసంస్కౄతి వ్యాపిస్తున్న అధోగతి నుంచి బయటపడడం గురించి రవంతైనా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా వుంది.
'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ' అన్న సంస్కౄతి గురించి రవంతైనా ఆలోచిస్తే, ఈ ప్రేమదోమ యింతగా కుట్టి బాధించదు. ప్రేమగానే నిమిరి ముద్దాడుతుంది. మన మానవతా సంస్కౄతీ నైతిక విలువల వలువలను ధరించాలి. జగానికి గర్వకారణంగా మారాలి. ఈ కాముకతా ధోరణిని విడనాడాలి. ఆ యీ 'మెయిలూ మూఢత్వం నుంచి బయటపడాలి. మస్తిష్కాలను ఆమలినం చేసుకోక, హౄదయోద్యాన నందనవనవాటికల్లో ప్రేమానంద సువాసిత సుమాల్ని, భక్తి వినయ విశ్వాసాలతో మేళవించి, విజ్ణాన వినోద విలాసపు విత్తుల్ని నాటాలి. ప్రేమ వాత్సల్య రసానుభూతుల్ని వాయినాల మాదిరి యిచ్చిపుచ్చుకోవాలి. తులసివనాల్లో గంజాయిమొక్కల్ని పెరగకుండా మొదట్లోనే తుంచివేయాలి. నిజమైన ప్రేమ అందరినీ బంధించకమానదు. అమితానంద సందోహాలతో బంధింపపడకమానదు. మనందరి హౄదయద్వారాలకి ప్రవేశపు నిషిద్ధాక్షర సంకేతాల్ని రచించినా, దరహాసాలను చిందిస్తూ నన్నెవరూ ఆపలేరని, పొండు పొండని ముందుకు దూసుకు వస్తుంది. పునర్జన్మ సిద్ధాంత రాహిత్యం ప్రేమది - మరణం లేనేలేదు కనక.
వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకంటే, వలచి విఫలమొంది విలపింప మేలురా! అని బసవరాజు అప్పారావు గారు ఏనాడో చెప్పారు. నేటితరం ఈ సిద్ధాంతాన్ని సరిగ్గా అవగాహన చేసుకోకుండా, ఘనకార్యం చేస్తున్నట్లు ముందుకు దూసుకుపోతున్నారు. అనుకున్న ఆశయాల్ని, ఆలోచనల్ని ఆచరణలో పెట్టలేక, ఉభయుల మధ్య అవగాహనారాహిత్యంలో అహంబావం, ఆభిజాత్యం పెంచుకుని, ఎవరి పధాన్ని వారు పయనంచేసి, చివరకు పశ్చాత్తాపం చెంది, విఫలమై, విలపిస్తున్నారు. చివరికి, ఎవరికి వారే యమునా తీరే అని చతికిల పడిపోతూ, ఎక్కడున్నావు గొంగళీ అంటే, వేసినచోటే ఉన్నాను కదా అని సర్ది చెప్పుకుంటున్న సమయకాలం. మహాకవి, శరత్, ప్రేమలో పేరుకుపోతున్న మూర్ఖత్వాన్ని చక్కగా వివరిస్తూ - 'తన అజాగ్రత్తవలన చెట్టుమీదనుండి క్రిందపడి కాళ్ళు, చేతులు విరగకొట్టుకొని భూమ్యాకర్షణవల్లనే తను పడ్డానని, దానిమీద నేరం మోపితే ఎంత మూర్ఖంగా వుంటుందో ప్రేమ కఠినమన్నా, ఘౄణీభూతమన్నా అంత మూర్ఖంగా వుంటుంది - అన్నది ఈనాటి ప్రేమాయణాలకి, ప్రేమభాగవతాలకి సరిగ్గా సరిపోతుంది.
ప్రేమికుల దినోత్సవం - 14 ఫిబ్రవరి
ఫిబ్రవరి 14 న ప్రేమికుల దినోత్సవాల్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవడం, రివాజు. ప్రేమికులారా! ప్రేమను పవిత్రభావనగా భావించండి. ప్రేమ మిమ్మల్ని వరించాలి. ప్రేమ మిమ్మల్ని వధించకూడదు. ప్రేమించలేని వాడికన్నా, ప్రేమించగల వాడు హెచ్చుగా పరిణతి పొందినవాడు - ప్రేమికుడు అన్న నిర్వచనాన్ని మగ ప్రేమ మహారాజులు గ్రహించాల్సిన తరుణం నేడు. కాని నాగరికత ఎక్కువ అవుతున్న కొద్దీ, ప్రణయ రోగులు ఎక్కువవుతున్నారు. ప్రేమికులు తమను తామే వేటాడుకొనే విచిత్ర కిరాతకులు అనిపిస్తుంది. తమకే తెలిసీ తెలియకుండ, ఏకాంత తమసుల్లో రహస్యంగా వలపుల వాగురల్ని పన్నుతారు. ఆ ఉరులలో తామే చిక్కుకుని గిలాగిలా కొట్టుకునే దయనీయమైన సాధుజంతువులు ప్రేమికులు.
ప్రేమికులారా! ప్రేమికుల దినోత్సవం అన్న వెర్రితనంతో మీ జీవితాల్ని దు:ఖమయం చేసుకోకండి.మన సంస్కౄతిని, నాగరికతని అనుసరిస్తూ మీ జీవితాన్ని సుఖానందానుభూతుల్ని పొందండి.తస్మాత్! జాగ్రత్త! మెలకువలను పాటించండి. వక్రయించుకుంటే, గిరీశం అన్నట్లు - డామిట్! కధ అడ్డం తిరిగింది! అని, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన శోకసాగరంలో ఈత రాని చందాన, ప్రేమసాగరం మాట ఎలావున్నా, దు:ఖ సాగరంలో మునిగిపోవాల్సివస్తుంది. తిరిగిరాని లోకాలకు పయనించాల్సివస్తుంది.
చివరిగా, గీతాచార్యుడు సెలవిచ్చినట్లు, 'యధేఛ్ఛసి తధా కురూ - నీకు ఏది యిష్టమో, అది చేసుకో!' అన్న సూక్తి, నీవు చేసిన ఖర్మ నీవనుభవించక తప్పదన్నా! అని చెప్పక చెప్పాడు. అందుకని మీ అడుగు ఎటు వేసినా సరే. దాని ఫలితానికి తయారవ్వండి. తొందరగా అడుగులు వేసి, తప్పుదారి పట్టేసేలా అయితే, మీ చర్యలకు మీరే బాధ్యులు అన్నది మాత్రం మరువకండి.
ప్రేమ ప్రేరణ అయినప్పుడు మరియు జ़్జానం సరియైన తోవ చూపించినప్పుడే ఆహ్లాదకరమైన జీవితం సాధ్యమవుతుంది అని ప్రముఖ తత్త్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ అంటాడు. ప్రేమించడం అంటే మన ఆనందాన్ని మరొకరి ఆనందంతో ముడివేయడం. వివేకవతి అయిన స్త్రీ ప్రేమను సంపాదించడం కష్టం. ఆమె వివేకాన్ని తెలివి తేటలను పొగడకుండా నాటిని నీవు గౌరవిస్తున్నావన్న నమ్మకం కలిగితేనే ఆమె నిన్ను ప్రేమిస్తుంది. పొగిడావో, నిన్ను అసహించుకుంటుంది - అని గొప్ప తత్త్వవేత్త అభిప్రాయపడ్డాడు.
ప్రేరణ లేకుంటే, ప్రేరణకు జ़్జానం చేయూతగా లేకుంటే, జ़్జానం శ్రమ రూపం దాల్చకుంటే, శ్రమ ప్రేమ పూరితం కాకుంటే, జీవితం అంధకారం బంధురం - అంటాడు జీవనగీత లో కాళోజీ.
ప్రేమికుల దినోత్సవం, ఫిబ్రవరి 14 న, జరుపుకునే శుభసందర్భంలో, ప్రేమికులకు శుభాకాంక్షలు.

Thursday, February 7, 2008

ప్రముఖ 'వీణా చిట్టిబాబు

ప్రముఖ 'వీణా చిట్టిబాబు
సంగీత కళాజగతి లో దక్షిణ భారత సంప్రదాయ శైలి లో కర్ణాటక సంగీతం, అందులో వాద్య సంగీత విభాగంలో అజరామరమైన వాద్య పరికరం ను ప్రస్తావించాలంటే, వీణ గురించే ముందు చెప్పాలి. వీణ కళాకారుల్లో, మన తెలుగు తేజాల్లో, ముఖ్యంగా 'చిట్టిబాబూ ఒక ప్రత్యేక అధ్యాయం. తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ లో చల్లపల్లి రంగారావు, సుందరమ్మ దంపతులకు ఏకైక సంతానం అయిన ఈ కళాకారుడు, 'వీణ చిట్టిబాబూగా అమోఘమైన పేరుప్రఖ్యాతులను గడించాడు. అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ, అన్నట్లు చిట్టిబాబు చిన్నారి వయసులోనే కళాకారుడి లక్షణాలు పుణికి పుచ్చుకున్నాడు. పుష్కరప్రాయంలోనే విద్యలో రాణించి, వైణిక విన్యాసంలో పేరు తెచ్చుకోవడమే కాక, పూర్తిస్థాయి వీణ సంగీత కచేరీ చేసి సంగీత రసికులను తన్మయపరచాడు. తొలిపాఠాలను అప్పలాచార్య వద్ద ఆకళింపు చేసుకుని, ఆ తర్వాత ప్రముఖ వైణిక విద్వాంసులు, మహామహోపాధ్యాయ, ఈమని శంకరశాస్త్రిగారి వద్ద శిష్యరికం చేసి గురువు పేరు నిలిపాడు. ప్రముఖ వీణాకచేరీ విద్వాంసుడిగా చిట్టిబాబు సంగీతకళాజగతి లో సుస్థిరస్థానాన్ని పొందాడు. ఆయన 'కోయిలా గీతావిన్యాసం తప్పక చెప్పుకునే అంశం. ఆయన వీణా వాదన విన్యాస కళపై లఘుచిత్రం 'కళాకోయిలా అన్నది కూడ మరువలేని సాక్ష్యం. కొన్ని చిత్రాలకు చిట్టిబాబు సంగీత దర్శకత్వం కూడ వహించడం విశేషం. ప్రముఖ నిష్ణాత సభ్యుల సంఘం - శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ సభ, తిరువాయూర్ లో సభ్యత్వం, శ్రీ కంచి కామకోటి పీఠం కు ఆస్థాన విద్వాంసకత్వం, చిట్టిబాబు ప్రతిభాసిగలో మరువాలు. చిట్టిబాబును ఆవరించిన అసంఖ్యాకమైన పురస్కారాల్లో, తిరుమల తిరుపతి దేవస్థానం కు ఆస్థాన విద్వాంసుడిగా, మన పొరుగు రాష్ట్రం తమిళనాడు ప్రభుత్వం (1981-87) కళాకారుడిగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ (1984) సంగీత నాటక అకాడమీ పురస్కారం (1990) ను ప్రస్థావించకుండా చిట్టిబాబు కళావ్యక్తిత్వం అసంపూర్ణం అనే చెప్పాలి. చిట్టిబాబు సంగీత కళలోని ప్రతిభాపాటవాల్ని చూసి సహాధ్యాయ కళాకారులు మెచ్చుకున్న సంఘటనలు కోకొల్లలు. కాని చిట్టిబాబు ప్రతిభ చేయించిన అనేక ప్రయోగాలు, సంప్రదాయవాదులకు అసూయ కలిగించి అక్కడక్కడ విమర్శలు కురిపించినా, చిట్టిబాబు ప్రతిభ గురించి విమర్శించే ధైర్యసాహసాలు వీరి దరికి వచ్చేవి కావు.
'వీణా చిట్టిబాబు సంగీత ప్రతిభకు ఘన నివాళి అందించడం, కళకు ప్రణామాల సరిసమానం.