Wednesday, December 31, 2008

నూతన సంవత్సర శుభాకాంక్షలు - 2009

నూతన సంవత్సర శుభాకాంక్షలు - 2009
పాతబడిన ధరణి నూతనత్వము నంద
వచ్చే నీ నవీన వత్సరమ్ము!
ఇంత ముసలి జగతి ఈనాడు యౌవన
వంత మగుట యెంతో వింతకాదె?
నవవర్షాన నరము నరమున
నవనవాభ్యుదయము నాట్యమాడు
ఈ అశాంతధోరణి ఎన్నడో ఒకనాడు
శాంతినందు ననుట భ్రాంతిగాదు.
(దాశరథి - కవితాపుష్పకం)
2009 - నూతన సంవత్సర శుభాకాంక్షలు.
శుభాబినందనలతో -

కొంపెల్ల శర్మ - అధ్యక్షులు - తెలుగురధం.

కొంపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ ( కె.బి.యస్. శర్మ )
ఫోన్ : +91 97017 31333 / +91 90007 31333 / + 91 40 6597 5574

Monday, December 29, 2008

అభినవ త్యాగరాజు - చిత్తూర్ నాగయ్య వర్థంతి



అభినవ త్యాగరాజు - 'నాగయ్యా వర్థంతి.



అధ్బుత సంగీత నటనావైదుష్యం'అభినవ త్యాగరాజూ, 'రంగభూషణా, 'నటయోగీ, 'పద్మశ్రీ', సత్కారాలతోబాటు, సకలకష్టాలను కూడ అనుభవించి, సగటు మానవుడు జీవితంలో పడకూడని ఆష్టకష్టాలు పడి, అర్ధాన్ని కూడబెట్టకపోయినా, పరమార్ధాన్ని పుష్కళంగా సంపాదించుకున్న మహానుభావుడు - చిత్తూరు వి. నాగయ్య. నాగయ్యను పరిచయంచేసే సాహసం, ధైర్యం ఎవరైనా చేయ ప్రయత్నించే దుస్సాహసం వారికి తగదు, కూడదు.
బాలసంగీతకళాకారుడు - సమగ్ర సంగీతాభ్యాసంచిత్తూరు వ్. నాగయ్య గా సుపరిచితులైన, నాగయ్యగారి యింటిపేరు 'వుప్పలధడియం' వారు. తండ్రి పేరు రామలింగేశ్వరశర్మగారు. 1904 మార్చి 28న గుంటూరు జిల్లా లోని రేపల్లె లో జన్మించారు. బాల్యదశలోనే, తండ్రి పాండిత్యాన్ని, సంగీతవిద్వత్తుని, యితిహాస-పురాణాలపై ఆసక్తిని రంగరించుకుని తనదైన మార్గాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేయసాగాడు. సంగీతసాధనలో తండ్రి దగ్గర శిక్షణ, చదువుపై కన్న, సంగీత కచేరీలపై మక్కువను పెంచింది. బాలనాగయ్య బాలకళాకారుడుగా రాణించడానికి అనువైన వాతావరణంలో పెరిగాడు. చెవిపోగుల్ని విక్రయం చేసి, సంగీతకచేరీలోని కళామాధుర్యానికి వినియోగం చేసేందుకు ప్రాధాన్యం చూపాడు. గమనించిన తండ్రి, నాగయ్యను 'విద్వాన్ చిత్తూరు పేరయ్య పిళ్ళే దగ్గర సంగీతాభ్యాసానికి ఏర్పాట్లు కడు సంతోషంతో చేశాడు. ఆనాటి ప్రముఖ సంగీత విద్వాంసులైన 'పుష్పవనం అయ్యఋ, 'గోవిందస్వామి పిళ్ళేలు తన తొలి గానప్రయత్నానికే, భాగవతంలోని ప్రహ్లాద పద్యాలని భావ, రాగ యుక్తంగా, మధుర స్వరాన్ని విని, 'గొప్ప కళాకారుడవుతావూ అని ఆశీర్వాదాలు పొందడం కన్న వేరే భాగ్యం ఎందుకు? నయన పిళ్ళె, మహారాజపురం విశ్వనాధ అయ్యర్ ల వద్ద సంగీత విద్యాభ్యాసం - మనసుకు మక్కువై, కాలేజీ చదువు అర్ధంతరంగా ముగిసింది.
చదువు - ఉద్యోగం మధ్య రాణించిన నటనాపర్వం
కర్ణాటక శైలితోబాటు హిందుస్తానీ సంగీతాన్ని కూడ ఆకళింపు చేసుకున్నారు. అయితే, కాలేజీచదువుతో పాటు, నాటకాల్లో వేషాలు చాలా పేరు తెచ్చాయి. చదువుకు భరతవాక్యం, చిత్తూరు బోర్డు కార్యాలయంలో గుమాస్తాగిరికి శ్రీకారం, స్థానిక లక్ష్మి, రామవిలాససభలు, మద్రాసులోని సుగుణవిలాససభ, యిండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీలాంటి నాటక సంస్థలనుంచి పోషించిన మొదటి దఫా, ఆడవేషాలు - సావిత్రి, దమయంతి, చిత్రాంగి పాత్రలు తెచ్చిన ప్రశంసలు, బళ్ళారి రాఘవతో కలిసి వేసిన నాటకాలు, కబీరు పాత్రలో 'కహో రాం రాం' అన్న పాట ప్రాభవం, అన్ని కలసి, నాగయ్య నటనా కౌశలాన్ని మెచ్చి, కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు 'రంగభూషణా బిరుదుని బంగారు పతకంతో సత్కార్యం పొందాఋరు.
కళాకారుడైనా తప్పని అష్టకష్టాలుకళల్లో దిట్ట అయినా, నాగయ్యకు జీవితంలో కష్టాలు తప్పలేదు, కుటుంబంలో చాలా అగాధం ఏర్పడి, మనోవ్యధకు గురయ్యారు. మనశ్శాంతికోసం నాగయ్య, రమణాశ్రమాన్ని ఆశ్రయం పొందారు. పుణ్యక్షేత్రసందర్శనంవల్ల కొంతగా లభించిన తనకు కళారంగమే సరి అని అంతరాత్మ ప్రబోధించింది. 1932 లో ఉద్యోగాన్ని వదలడం, రాజకీయప్రవేశం కూడ జరిగాయి. అక్కడా సరిపడక, తిరిగి మద్రాసు వచ్చి కళారంగంలో అడుగుపెట్టారు.ప్రలోభాలకు, మోసాలకు కూడ గురయ్యారు.
మరువని సంగీతం నుంచి మరువలేని నటనకునాగయ్యగారి చిరకాల మిత్రుడు అచ్యుతనాయుడు హచ్చిన్స్ సంగీతసంస్థలో సంగీత సంస్థ, మధురస్వరానికి ముగ్ధులై, సంగీతదర్శకునిగా నియమించుకున్నారు. ఎన్నో గ్రాంఫోను రికార్డులు పేరు తెచ్చాయి. ఈ దశలో, 1935లో ప్రముఖులు బి.యన్.రెడ్డిగారిని కలవడం, మిత్రులు హెచ్.యం.రెడ్డిగారికి పరిచయం చేయడం, 'గౄహలక్ష్మీ చిత్రంలో సంఘసేవకుని పాత్ర నాగయ్యను వరించడం, ఆపాత్ర అందించిన 'కల్లుమానండోయ్ బాబూ కళ్ళు తెరవండోయ్' అన్న పాట ఆంధ్రదేశం ప్రతిధ్వనించడం, ఆకాలపు మద్యపాన నిషేధం అమలు మూలాన, బహుళ ప్రజాదరణ పాటకు, నాగయ్యకు ఒకేసారి లభించాయి. తర్వాత, నాగయ్యకు తిరుగులేని ప్రయాణం. ఫలితంగా, 'వందేమాతరం', 'సుమంగళీ, 'దేవతా, చిత్రాలు పేరుప్రఖ్యాతులు లభించాయి. ఈ దశలో, 'ఫిల్మ్ యిండియా' పత్రిక నాగయ్య నటనాసార్వభౌమత్వాన్ని విశ్లేషిస్తూ, 'ఆంధ్రా పాల్ మునీ గా కొనియాడాడు.
నిరంతర నాగయ్య నటనాప్రభంజనంభక్తిపరంపర, హావభావాలు, చిరస్మరణీయ అభినయం వెరసి 'భక్తపోతనా ద్వారా నేటికీ మైమరపిస్తున్న 'పావన గుణ రామా', స్వయంగా చిత్రనిర్మాణం (రేణుకా సంస్థ) చేసిన 'త్యాగయ్యా చిత్ర ప్రారంభానికి ముందు తిరువాయూర్ లోని త్యాగయ్య సమాధి ముందు ఉపవాస దీక్ష, నాయకునిగా, సంగీత దర్శకునిగా అఖండ కీర్తితో బాటు, యునెస్కో ద్వారా అంతర్జాతీయ చిత్రోత్సవంలో భారతదేశ కీర్తిపతాకను రెపరెపలాడించిన ఘనతాకీర్తులు ఆయనవే. తెలుగు చిత్రాలతో పాటు, తమిళ రంగ ప్రవేశం చేశారు. మోసాలు, తంత్రాలకు గురవడం, విజయంతోపాటు ఆవహించిన అపస్వరాలు, నాగయ్య నిర్మించిన 'రామదాసూ నాయకుని కష్టాలతోపాటు, నిర్మాత నాగయ్య కూడ అంతకన్న కష్టాలు అనుభవించిన తీరుతెన్నులను వర్ణించనలవికావు అని నేటికీ అంటారు. ఎదురైన నిరాశ, అశాంతి, పుట్టపర్తిసాయినాధుని ఆశ్రయం పొందాయి. యిక్కడ సుగుణం, సుకౄతం ఏమిటంటే, నాగయ్యగాసి షష్టిపూర్తి కార్యక్రమం మద్రాసులో బాబా ఆధ్వర్యంలో, ఆశీస్సులతో నిర్వహించడం మరువరాని సంఘటన.
దక్షిణభారత చిత్రసీమలో మొదటి 'పద్మశ్రీ'మరోనటునికి దక్కని అగణిత సన్మాన, సత్కారాలు. 1965 లో మొదటి పద్మశ్రీ లభించడం, నాలుగు దశాబ్దాల చిత్రజీవితంలో 200 తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటిస్తే, కేవలం తమిళం లో 160 చిత్రాల్లో నటించడం, ఆయన పాత్రల ప్రత్యేకత - ఆయన నటించక, జీవించారనే చెప్పాలి. మహానటులేకాదు, మహాదాత కూడా. ఆంధ్రరాష్ట్రావతరణ సమయంలో, అంధ్రకేసరికి అప్పుచేసి భారీ విరాళాన్నివ్వడం తో పాటు, అనేక దానధర్మాలు చేసిన ఘనత ఆయనకు వచ్చినా, జీవనచరమాంకంలో ద్రవ్యం లేని గతి చాలా ఉపద్రవాన్నే తెచ్చిపెట్టింది. ఈ విషాదసారాన్ని, ఆయన ఆత్మకధలో ఆవేదనతో పేర్కొన్నారు.
భక్తి నుంచి వైరాగ్యానికిపోతన, త్యాగయ్య, రామదాసు లాంటి భక్తిరసామౄతాన్ని అందించిన నాగయ్య, వేమన, పోతన చిత్రాల్ని ప్రభావితంగా, ప్రేరణాపూర్వకంగా వీక్షించిన 'బాలుడూ యోగిగా మారి, ప్రసిద్ధ 'ముమ్మిడివరం బాలయోగీ గా మారిన వైనం మరచిపోలేని ఘటన. ప్రముఖుడు డా.సర్వేపల్లి రాధాకౄష్ణన్, నాగయ్య, ఆయన మిత్రులను చూసి, స్వయంగా అహ్వానితులు కావడమే కాక, నాగయ్యగారికి పాదాభివందనం చేస్తే చాలు, పుణ్యం వచ్చి తీరుతుంది అని పులకరింతలతో పలవరించారట. దానికి నాగయ్యకు కలిగిన పులకరింతలు వేలకు వేలు.
'రఘుపతి రాఘవ రాజారాం' తో చివరి శ్వాసఅవసాన దశలో, అనారోగ్యంతో సతమతమవుతున్న నాగయ్యకు, తన మిత్రులు 'రఘుపతి రాఘవ రాజారాం' అంటూ గానం చేస్తుంటే, అపర పోతన, అభినవ త్యాగరాజు, 1973 డిసెంబరు 30 న, మద్రాసు, అడయార్ లోని వి.హెచ్.యస్. వైద్యకేంద్రంలో, తన తుదిశ్వాసను వదలడం, కన్నుమూయడం ఒకేసారి జరిగాయి.
ప్రతిభకు ప్రతిమాదర్పణంతిరువాంకూరు మహారాజు దర్బారు హాలు, మహాపండితులు, సంగీత నాట్య,నటనాకళాకోవిదులతో, సకల రాజభోగ మర్యాదలతో, మేళతాళాలతో ప్రవేశించిన మహాతెలుగునటునకు, రాజు గద్దెదిగి, ఎదురేగి, ఆమహానటవిరాట్టుని సాదరంగా, కౌగలింతతో ఉక్కిరిబిక్కిరి అవడం, సమున్నాతసనం పై ఆసీనులై, వేదమంత్రఘోష మధ్య, పాదపూజ జరగడం, కనుకలను, బిరుదులతో సత్కరించబడడం, మైసూరు సంస్థానాధీశ్వీరుడు నటరాజుకు సకల రాజలాంచనసహిత స్వాగతంతో పాటు 101 బంగారు కాసుల బహూకరణం, మద్రాసు, త్యాగరాజనగర్, పానగల్ పార్కులో, 'నటయోగి నాగయ్యా కాంస్య విగ్రహ ప్రతిష్టాపన, వి.వి.గిరి చేతులమీదుగా జరగడం, ఏటా, డిసెంబరు 30 న, నాగయ్య వర్ధంత్యుత్సవాలు జరుపుకోవడం, ఆ మహావ్యక్తికి, ఆవ్యక్తిలో దాగిని కళామతల్లికి జోహార్లు నిత్యం అర్పించుకోవడం ఆయన ఘనతకు, కీర్తికి తార్కాణాలు.
ప్రముఖ కళాకారుడు చిత్తూర్ వి. నాగయ్యగారి వర్థంతి సందర్భంగా తెలుగురథం ఘననివాళిని సమర్పించుకుంటోంది.
కొంపెల్లశర్మ - తెలుగురథం.

పరమమౌనప్రాప్యుడు - భగవాన్ రమణ మహర్షి


'భగవాన్ శ్రీ రమణమహర్షీ - "పరమమౌనప్రాప్యుడు" (1879 - 1950)


" మనిషి జీవితంలో ముందుకు సాగేటప్పుడు, అనేక సార్లు అంతరాయాలు ఎదురవుతుంటాయి. ఆ అంతరాయాలని చూసి చలించిపోకూడదు. ఒక్కొక్క అంతరాయం వెక్కిరించేకొద్దీ, మనిషి సంకల్పాన్ని దౄఢంగా తయారు చేసుకోవాలి. అప్పుడు సాధించదలుచుకున్నది సాధ్యం అవుతుంది".
" ఈ జగత్తు అంతా ఒక తెరపైన గీయబడిన బొమ్మే".
"మనిషి ఎటువంటి స్థితిలో వున్నా హాయిగా జీవించడానికి అన్నిటికంటే అవసరమైనది - ప్రశాంతత. ప్రశాంతత ఎన్నో రకాలుగా ఉంటుంది. మాటలకి సంబంధించిన ప్రశాంతత ఒకటయితే, కళ్ళకి సంబంధించిన ప్రశాంతత యింకోటి, అలాగే మరొక రకం ప్రశాంతత చెవులతో సంబంధం కలిగి వుంటే, యింకో రకం ప్రశాంతత మనసుకి సంబంధించి వుంటుంది. ఈ అన్ని రకాల ప్రాశాంతతల్లోనూ - మానసిక ప్రశాంతత ఎంతో గొప్పది; మరెంతో ముఖ్యమైనది."
అంతరాయం నుంచి ప్రశాంతత కు చేసే పయనం లో మధ్యగతిలో జీవితాన్ని, జగత్తును 'తెరపైన గీయబడిన బొమ్మా గా చెప్పడం సామాన్య మానవమాత్రునికి మాత్రం సాధ్యం అయ్యే పని కాదు. మానవసేవయే మాధవసేవ అని భావించి, ఆ మార్గంలో మనసా, వాచా, కర్మణా అచరణయోగుల్లా అవతరించడం మానవరూపం లో కనిపించే మహామనీషి కి మాత్రమే సుసాధ్యం. అటువంటి మహామనీషి ఎవరో కాదు. సౌమ్యముఖులు, నిత్య దివ్యప్రేమను, జ్ణానాన్ని ప్రసరించిన తపోధనులు - 'భగవాన్ శ్రీ రమణ మహర్షీ.
'భగవాన్ శ్రీ రమణమహర్షి జీవితాన్ని విశ్లేషిస్తే, బాధలు అనుభవిస్తున్న మానవులు, తాము మరిచిపోయిన పరిపూఋర్ణతాసిద్ధిని తిరిగి పొందడానికి - "నేను ఎవర్ని?" అన్న ప్రశ్న నిరంతరం వేసుకుంటూనే వుండాలని నిత్యం ఉద్భోదించేవారు శ్రీ రమణులు.
శ్రీ రమణమహర్షి దర్శనానికి తిరువణ్ణామలై దగ్గరున్న అరుణాచలమనే పుణ్యగిరికి యాత్ర చేసి, ఆశ్రమంలో ఆప్యాయంగా రమణమహర్షి చే ఆదరించబడిన 'పరమహంశ యోగానందా "ఇది నిజంగా గొప్ప ఆత్మవిచారం. భక్తుడు ఇతర ఆలోచనల్ని కఠోరంగా తిరస్కరించి తన సత్యాత్మలోకి బాగా లోతుగా వెళ్ళగలుగుతాడు; పక్కదారి పట్టించే ఇతర ఆలోచనల భ్రమలు ఇక ముసరడం మానేస్తాయి" అన్న అభిప్రాయం, మౌనంవహిస్తూనే ప్రకటించబడినదని చెప్పడం కూడ పవిత్రభావనే.
శ్రీకౄష్ణుడు, భగవద్గీత ద్వారా అర్జునునికి హితోపదేశం చేస్తూ - "క్రమశిక్షణ ద్వారా శరీరాన్ని అదుపు చేసుకునే తపస్వుల కన్ననూ, జ్ౙానమార్గాన్నీనుసరించే వారికన్ననూ, కర్మ మార్గాన్నవలంబించే వారికన్ననూ, యోగి ఉన్నతుడుగా భావించబడుతున్నాడు. ఓ అర్జునా, నువ్వు యోగివి కమ్ము!" అంటాడు.
ఈ శ్లోకాన్ని, శ్రీ రమణమహర్షికి అన్వయిస్తే, ఆయన తపస్వి, జ్ౙాని, కర్మిష్టి కలబోసిన యోగి. యోగుల్లో ఉన్నతుడు. అందుకే ఆయనకు, భగనాన్ శ్రీ రమణ మహర్షీ అని సార్ధకనామధ్యేయం లభించింది.
'ఆర్ద్రాదర్శనం' నాడు జననం
గౌతముడు, పతంజలి, వ్యాఘ్రపాదాది భక్తులకు భగవానుడు శివుడే పవిత్ర దినమున ప్రత్యక్షమయ్యెనో ఆ 'ఆర్ద్రాదర్శనం' రోజునే శ్రీ రమణమహర్షి, సుందరం అయ్యంగారు - లకు తిరుచిళి లో 1879 డిసంబర్ 30 న జన్మించారు. తండ్రి సుందరం అయ్యంగార్ కి ఈయన ముగ్గురు కుమారుల్లో రెండవవారు. 'వెంకటేశ్వరణ్ పెట్టిన పేరు అయితే, 'వేంకటరామణ్ వ్యవహారనామంతో, తిరుచుళి, దిండిగల్లు, తర్వాత మధురలోని స్కాట్స్ మిడిల్, అమెరకన్ మిషన్ హై స్కూళ్ళలో విద్యాభ్యాసం కావించాడు. ఓ మోస్తరు తెలివితేటలు, ప్రతిభ కనబరచకపోవడం, శ్రద్ధ, పట్టుదలలు లేని చదువు కంటే, ఆటల్లో ఆసక్తి చూపేవారట. లౌకిక, మతపర విషయాల్లోనూ, అంతగా పనితనాన్ని ప్రదర్శించకపోవడం, ప్రజ్ణుడుగా పేరు రాకపోయినా, బలమైన శరీరం, విలక్షణమైన స్వాతంత్ర్యభావాలు పుష్కళంగా వుండేవి. పాఠశాల మానడం, స్వేచ్చాతిరుగు ఆయనకు నైజమే కాని, తరగతిలో ఉత్తమ స్థాన, పుస్థకపఠనం మీద అనాసక్తి, పుస్తకపఠనాదుల వల్ల కాని అనుగుణములుగ తోచలేదు.యితర విషయములందునూ, తోటి సామాన్య యువకులను మించలేదు అని చెప్తారు.
భగవాన్ రమణమహర్షి జన్మదినం సందర్భంగా తెలుగురథం శతసహస్ర ప్రణామాల్ని సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

Saturday, December 27, 2008

ఈ-తెలుగు వివరాలు

ఈ-తెలుగు వివరాల కోసం లింకులను క్రింద ఇస్తున్నాము.
'e-తెలుగు'/
తెలుగు ని ఈ-తెలుగు ద్వారా ప్రచారం చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

రాజ వాగ్గేయకారుడు - స్వాతి తిరునాళ్ వర్థంతి.


అభినవ త్యాగరాజు, పద్మనాభదాసుడు, రాజవాగ్గేయకారుడు - స్వాతి తిరునాళ్

పుట్టుకతోనే మహారాజ యోగభోగాలు


ఆ రోజు 5వ మేష, 988, మలయాళ శకంగా వచ్చిన తేదీ. మనందరి పరిభాషలో చెప్పాలంటే, తేదీ 16 ఏప్రిల్ 1813. స్వాతి నక్షత్రాన జననం. 'గర్భ శ్రీమాన్ శ్రీరామవర్మ కులశేఖర పెరుమాళ్ మహారాజా', జన్మ నక్షత్రం తెలియక పోతే, పోలిక చెప్పలేని పేరు. సదాచార, సత్సంప్రదాయాల ట్రావంకోర్ రాజకుటుంబ వారసుడు ఆవిర్భవించాడు. సంప్రదాయ కర్ణాటక సంగీత కుటుంబంలో మరొక ఆణిముత్యం, ధౄవతార జనించిన సంఘటన. వారసత్వం లేకుండ వున్న పరిస్థితిలో, స్వాతి తిరునాళ్ తల్లి మహారాణి, సేతు లక్ష్మిబాయి అధికారం స్వీకరించిన, రెండేళ్ళకే - జన్మించిన సమయం. పుట్టుకతోనే మహారాజు యోగం లభించిన వైనం. ఆగర్భ మహారాజు అని చెప్పాలి కదా. సంగీత త్రిమూర్తులతోపాటు, అరుణాచల కవిరాయ, గోపాలకౄష్ణ భారతి ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్న కాలమది.
తిరునాళ్ పిన్నప్రాయంలోనే అధిక భాషలు నేర్చుకునే వుత్సాహం చూపించాడుట. విశిష్టశైలిలో సంగీత, సాహిత్యాలను సన్మిశ్రం చేయగలిగిన ప్రతిభాశాలి. 16 వ ఏటనే రాజ్యాధిపత్యాన్ని స్వీకరించి, సమర్థనీయ పరిపాలనాధికారాల్ని నిర్వహించడంలో వన్నెకెక్కిన విశిష్టమూర్తి.

స్వాతి తిరునాళ్ ముందు కాలంలో, కేరళ రాజ్య సంగీతస్థాయి, ముఖ్యంగా "అట్టకథలు" అనే కీర్తనలను ఆయన పూర్వకుటుంబీకులు, అశ్వతి తిరునాళ్, రచించారు. అంతకు పూర్వం, కథకళి శైలి సంగీత, నౄత్య కళలతోనే సాహిత్య, సంగీతాల్ని నియంత్రించుకోవడం జరిగిందని అనిపించిన వైనాలు.

కర్ణాటక సంగీతజ్ౙానం, కేరళ సంగీత సంప్రదాయ ప్రక్రియల్లోకి అన్వయించినా, 'కథకళీ వైపు ఆయన సంగీతప్రస్థానం సాగలేదు. ఎందరో విద్వాంసులు, సాహితీకారులు, మహారాజు ఆశ్రయాన్ని పొందిన దాన్ని బట్టి, తిరునాళ్ వహించిన శ్రద్ధాసక్తులు అందరినీ ఆశ్చర్యపరచాయి.

'హరికథా ప్రక్రియకు ప్రాముఖ్య, ప్రాభవాలు కేరళలో కలిగించిన ఖ్యాతి స్వాతి కే దక్కినది. స్వయంగా రూపొందించిన 'కుచేలోపాఖ్యానం', 'అజమిలోపాఖ్యానం', సంస్కౄతంలో రచించాడు. మహారాష్ట్రలో రూపుదిద్దుకున్న 19 వ శతాబ్ది చివరినాటికి కర్ణాటక సంగీత చాయలను తాకింది. తంజావూర్ రాజాశ్రయం పొందిన 'అనంత పద్మనాభ గోస్వామీ ని, తిరునాళ్ ఆహ్వానించి, గురువుగా స్వీకరించి, హరికథా కార్యక్రమాలని నిర్వహించేలా ఏర్పాట్లు చేశాడు. తిరునాళ్, 'ఉత్సవ ప్రబంధం' అన్న హరికథను కూడ రచించాడు.

'సోపాన సంప్రదాయా సంగీతం కేరళలో బాగా ఆదరణ పొందుతుండగా, హిందూస్థానీ సంగీత చాయలు రవంత కూడ సోకని పరిస్థితి. ప్రముఖ విద్వాంసుడైన తంజావూర్ రంగ అయ్యంగార్, ఆస్థాన కళాకారుడిగా నియమించాడు. తదుపరి, తిరునాళ్ ఆస్థానంలో ప్రముఖ వైణిక విద్వాంసుడు, రఘ్నాథ రాయర్, సారంగి విద్వాంసుడైన చింతామణి భాగవతార్ కూడ ప్రవేశించడం జరిగింది.

స్వాతి తిరునాళ్ సంగీత కౄతుల గురించి, విస్తౄత పరిశోధనలను జరపవలసిన అవసరం ఎంతైనా వుంది. 600 కౄతులను సేకరించి, గతంలో ప్రచురించబడ్డాయి. కౄతులు ముఖ్యంగా సంస్కౄతం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో లభ్యంకావడం ఆనందకరమైన విషయం. ప్రముఖ 'మణిప్రవాళా శైలిగా సంస్కౄత - మలయాళ భాషల్లో కలిపి రచించడమే కాక, ప్రముఖ రాగాల్లో, హిందూస్తానీ సంగీతపు రాగాలు కూడ కలిపి, ఎప్పుడూ వినని రాగాలకు ప్రచార,ప్రాశస్త్య గౌరవాలు కల్పించిడం పట్ల వాగ్గేయకారుడి విశిష్టత వెల్లడైంది.
తిరునాళ్ రచించిన సంగీత సాహిత్య కౄతులను - కీర్తన, పదం, వర్ణం, తిల్లానా, ప్రబంధములుగా విభజించవచ్చు.

ఆయన రచించిన 'నవరత్నమాలికా, 'నవవిధ భక్తి మంజరీ పేరున 300 కి పైగా కౄతులను చెప్పుకోవలసిన ప్రత్యేకత సంతరించుకున్నాయి అని సంగీత విద్వన్మూర్తులు చెప్పడం జరిగింది. పదవర్ణాలు ప్రత్యేకంగా, సంగీతపరంగా చెప్పుకునే 'రిథం' నుంచి వచ్చే హావ, భావ విన్యాసం, విశిష్టమైన ప్రకాశవంతమైన ప్రక్రియాసారంగా చెప్పుకోవాలి.
స్వాతి తిరునాళ్, వాగ్గేయకారుడు, ఆయన పూర్వ సంగీత విద్వాంసుల్లాగే, 'పద్మనాభా భక్త సేవా పరాయణుడు. ఆయన పదరచన , 'పన్నగేంద్ర శయనా ఎనిమిది చరణాలతో నాయిక ఉదయం నుంచి రాత్రి వరకు పొందిన వివిధానుభూతుల్ని, అనువైన రాగాల్లో సౄష్టించడం జరిగిన తీరు అనేక మన్ననలను పొందింది. వర్ణాల్లోకి వస్తే, 'స్వామిని రమ్మనవే, 'యిందుముఖి నీ సమయా కౄతులు తిరునాళ్ ప్రతిభకు నిదర్శనంగా నిలచి పోయాయి. తిల్లానాలను కూడ రచించడం జరిగింది.
అత్యంత ప్రతిభ ఆవరించిన జీవంపై ఆయువుకు కూడ అసూయేమో మరి. అందుకే, యింత ప్రతిభావంత రాజవాగ్గేయ కళాకారుడికి 34 వ ఏటనే ఆయువు నిండింది. స్వల్పకాలంలో అనల్ప సంగీతసౄష్టిని కావించి, అసమాన ప్రతిభాపాటవాలని పొంది, కీర్తిప్రతిష్ఠాలు సంపాదించిన స్వాతి తిరునాళ్ కు 'అభినవ త్యాగరాజూ బిరుదు కడు సమంజసమే కాక, ఆయనకు సరిసముల్ని ఎన్నిక చేయడం సులభతరమైన పనికాదని పలువుగు అభిప్రాయపడడం కూడ సమంజసమే.
స్వాతి తిరునాళ్ ప్రసిద్ధ కౄతులు, రాగాలు


'పరిపాహి గణాధిపా' (సావేరి), 'రాసవిలాసా (కాంభోజి), 'సారసాక్షా (పంతువరాళి), 'జగదీశ సదా (నాటకురింజి), 'కారణం వినా కార్యం' (కాంభోజి), 'స్మర హరిహరి పాదారవిందం' (సామ), 'భావయామి రఘురామం (సామ), 'భావయే శ్రీ గోపాలం' (పున్నాగవరాళి), 'చలమేలా (శంకరాభరణం), 'సరసిజనాభా (కాంభోజి), 'సుమసాయకా (కాపి), 'అలరసార పరితాపం' (సురటి), 'రామచంద్ర ప్రభూ (సింధుభైరవి), 'ఛలియే కుంజననో' (బౄందావన సారంగ), ప్రఖ్యాతి పొందిన వాటిలో మచ్చుతునకలు, ఉదాహరణకు మాత్రమే అని చెప్పాలి. స్వాతి తిరునాళ్ రచించిన యితరములైన వాటిలో, 'పద్మనాభ శతకం', 'శ్యనందూర పురవర్ణన ప్రబంధం), 'భక్తిమంజరీ, ఆయనకున్న సంస్కౄత భాషాపటిమకు ప్రత్యక్ష నిదర్శనాలు.
అభినవ త్యాగరాజు, పద్మనాభదాసుడు, రాజవాగ్గేయకారుడు గా కీర్తింపబడిన స్వాతి తిరునాళ్ 25 డిసంబర్ 1846 న కీర్తిశేషులైనా, సంగీతకళా జగతిలో నిత్యనూతనంగా కొనియాడబడే విశిష్ట సంగీతకళాకారుడుగా భావించడం జరుగుతూనేవుంది.
స్వాతి తిరునాళ్ కు తెలుగురథం ఘననివాళి ని సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

Wednesday, December 24, 2008

సప్తపది - ఏడడుగుల అనుబంధం

సప్తపది
ఏడడుగుల బంధం

మేము ఒకరికి ఒకరై తోడూనీడై సుఖసంతోషాల ముఖద్వారంలో వేసేమురిపాల ముద్దుముచ్చట్ల-
మొదటి అడుగు
హౄదయాంతరంగాలలో ప్రేమభావ తరంగాలలో వేసే నింగికెగిసే రంగవల్లికల -

రెండవ అడుగు
పెద్దలపట్ల వినయ విధేయతల్ని చూపిస్తూసంత్సంప్రదాయాల సంరక్షణ కోసం వేసేముచ్చటైన -

మూడవ అడుగు
వేదధర్మానికి వన్నెలు దిద్దుతూభారతీయ సంస్కౄతికినిలువెత్తు సాక్ష్యంగా వేసే నాణ్యమైన -

నాల్గవ అడుగు.
ఉభయ కుటుంబాల ఔన్నత్యాన్నిదశదిశలా వ్యాపింపచేస్తూ వేసేఆభిజాత్యానికి ఆలవాలమైన -

ఐదవ అడుగు.
గౄహస్థాశ్రమ స్వీకారానికిశ్రీకారం చుడుతూ వేసేఆనందదాయకమైన -

ఆరవ అడుగు.
ఆనంత ప్రేమవాహినిలో విహరిస్తూజీవన వసంతాన్ని స్వాగతిస్తూ వేసేసత్యశివ సుందరమైన -

సప్తపది.
కొంపెల్ల శర్మ - తెలుగు రథం.

Monday, December 22, 2008

వైణిక సశాస్త్రీయం - శంకర నాద తరంగం


'మహామహోపాధ్యాయా ఈమని శంకరశాస్త్రి (1922 - 1987) -వర్థంతి


'ఈమనీ అంటే ఏమని !
వీణ ప్రాశస్త్యం, ప్రస్తావన
వీణ - తంత్రీవాద్యవిశేషం. వీణ అంటే మనకు వెంటనే స్ఫురణకు వచ్చే వ్యక్తులు, సరస్వతి, నారదుడు. సరస్వతి వీణ - కఛ్ఛపి. వారదుడి వీణ - మహతి. వీణ అంటె మెరపు. వీణియ - వీణావాద్యం. కస్తూరిమౄగముయెక్క కస్తూరియుండెడి బొడ్డుకాయ. భల్లాణచరిత్రం - అన్న రచనలో - వాలేశ్వరుడు అన్న కవి - కస్తూరి వీణియలును పిల్లిగడ్డలను - అని ప్రస్తావించాడు. ఆంధ్రకవితాపితామహుడు, అల్లసాని పెద్దన, మనుచరిత్రలో నాయిక వరూధునితో వీణను వాయింపచేశాడు. "తరుణాంగుళీ ధూతతంత్రీస్వనంబుతో జిలిబిలిపాట ముద్దులు నటింప ... కరపంకరుహ రత్న కటక ఝణఝణధ్వనిస్ఫూర్తి తాళమానములు గొలుప నింపు దళుకొత్త వీణ వాయింపుచుండీ అని అద్భుత వర్ణన చేశాడు. యింటి ఆవరణలోని మామిడిచెట్టు కింద అరుగుమీద కూర్చుని వీణ వాయిస్తూంటే, వేరే మద్దెల లేదట; అమె చేతి కంకణముల ధ్వనియే మద్దెలవలె వుందిట. అది వీణ ప్రాశస్త్యమో, లేక వరూధుని ప్రత్యేకతో మరి. వీణ ప్రాశస్త్యాన్ని ప్రముఖ కవి అడవి బాపిరాజుగారు - నారాయణరావు - నవలలో - వీణమీది తానం ఫిడేలు మీద కాదు. ఫిడేలు మీది సంగతి వీణకు రాదు. వీణ ఒదుగు ఫిడేలులో లేదు. వీణలో ధవి ఫిడేలులే లేదు. దీన్ని బట్టి ఫిడేలు రాగాలు వేరు, వీణ స్వరతంత్రీవాదవ విధానం ప్రత్యేకత కలిగినదని ఈ భావాన్ని బట్టి చెప్పవచ్చు.
శంకరశాస్త్రిగారి జీవన సంగీత రేఖలు
ఈమని శంకరశాస్త్రిగారు తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలో 23 సెప్టెంబర్ 1922న జన్మించారు. కేవలం మూడు వసంతాల ప్రాయంలో శాస్త్రిగారు వీణ పై దౄష్టిని పెట్టడం ఆశ్చర్యం. కేవలం సంగీత పరికరం పై దౄష్టికాదు, సంగీతంలోని లయ, గమకాల క్రమం పై అవగాహనను ఆకళింపు చేసుకోవడంలోనే ఆ శైశవకళాప్రతిభ వెల్లడైంది. సంగీతంలో వీణపై తొలి శిక్షణను తండ్రి అచ్యుతరామశాస్త్రివద్దనేకాక, తాతగారు ఆనాటి గొప్ప వైణికవిద్వాంసులు ఈమని సుబ్బరాయ శాస్త్రిగారి వద్ద కీలకాంశాలను అభ్యసించారు. ఈ అభ్యాసకాలంలో కేవలం వీణసంబంధిత శిక్షణే కాక, అంతవరకూ సంగీతకచేరీల్లో వీణకు పరిమితంగానే వుండడం గమనించి, వీణమాధ్యమంతో సంగీత కార్యక్రమాల్ని ఎలా విస్తౄతం చేయాలో తీవ్రతరంగా ఆలోచించారు.ఆయనకు ఒక విదేశీసంగీతాభిమాని బహుమతినిచ్చిన మైకు ద్వారా వీణానాదతంత్రీస్వరస్థాయిల్ని పెంచడంలో సాధ్యులయ్యారు. శంకరశాస్త్రిగారు వీణను మందర, అనుమందరస్థాయిల్లో తంత్రుల్ని మీటడంలో విశారదస్థాయిని అతిస్వల్పకాలంలోనే చేరుకున్నారు. అంతేకాక, వీణద్వారా నాదాల్ని దీర్ఘం, అనల్పకాలంపాటు ప్రదర్శించడం, ఆనాదాలు వాయుసంగీతపరికరాల ద్వారా వచ్చే నాదాలనుపోలడం కూడ ఈమని వారికి అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. వీణాసంగీతంలో ప్రతిభను సాధించినా, చదువును మాత్రం వెనక్కు నెట్టవలసి వచ్చింది. తండ్రి అచ్యుతరామశాస్త్రిగారికి మాత్రం తన శంకరతనయుడు సంగీతాన్ని వౄత్తిగా స్వీకరించడం ఎంతమాత్రం యిష్టంలేదు. కాకినాడ పిఠాపురం మహారాజా కాలేజీలో పట్టభద్రులయ్యాక, వైణికుడిగానే జీవితప్రారంభం చేశారు. కానీ, తనయుడి సంగీతకౄషిలో ప్రదర్శిస్తున్న తన్మయత్వాన్ని గమనించి, పట్టుదలను వీక్షించి, శ్రమకు ఫలితం తప్పక వుంటుందనే నమ్మకానికి రావడం ఒక శుభ పరిణామం. వీణతో జీవితాంతం తాదాత్మ్యం చెంది అవిభాజ్య సంబంధాన్ని పెనవేసుకున్న సంప్రదాయ సంగీత విద్వాంసులు, కళాకారుల్లో ఈమని శంకర శాస్త్రిగారిని ప్రప్రధమంగా ప్రస్తావించాలి. 1940 లో తిరుచ్చి ఆకాశవాణిలో శాస్త్రిగారు వీణాకచేరీ చేసిన తర్వాత, ఆయనకు వచ్చిన పేరు గగనవీధుల్ని తాకింది. 1942-50 మధ్యకాలంలో, మద్రాసు జెమినే స్టూడియోల్లో సాలూరు రాజేశ్వరరావుకు సంగీతంలో సహాయసహకారాల్ని అందజేయడంలో చూపిన ప్రతిభ అజరామరం. అందుకే పాతచిత్రాల్లో, ప్రముఖంగా, రాజేశ్వరరావుగారి చిత్రాల్లో, ముఖ్యంగా తప్పక ఒక వీణపాట వుండేది.
శంకరశాస్త్రిగారి శాస్త్రీయత
సంప్రదాయ సంగీతకుటుంబానికి వారసులేకాక, వీణావాదన సంగీతకళలో ఆలోచనాత్మకమైన సంగీతశైలిని నిర్మాణం కావించి, ఆ ప్రత్యేకశైలికి ప్రచారం చేయడమే కాక, శాస్త్రిగారిని శాస్త్రీయసంగీత ప్రపంచంలో సశాస్త్రీయమైన విశిష్ఠ కళాకారునిగా తీర్చిదిద్దబడ్డారు. కర్ణాటక శైలితోపాటు, హిందుస్తానీ, పాశ్చాత్య సంగీత శైలీవిధానాల్ని ఆకళింపు చేసుకున్న పుంభావసంగీతసరస్వతీపుత్రుడు - ఈమని శంకరశాస్త్రిగారు. శాస్త్రిగారు ముఖ్యంగా ఆకాశవాణిలో నిర్మాణం చేసిన సంగీత కార్యక్రమాలు, ఆయన నాయకత్వంలో ప్రదర్శించిన వాద్యబౄంద, స్వరరాగతాళ విన్యాస కార్యక్రమాలు నభూతో నభవిష్యతి అన్నట్లు ప్రఖ్యాతమయ్యాయి.
శాస్త్రీయ ప్రియ వీణారాగాలు
సంప్రదాయబద్ధమైన, శంకరాభరణం, వరాళి, కాంభోజి రాగాలతో అధికంగా తాదాత్మ్యం చెందినా, సంగీతరసికులకు ఎప్పుడూ ఎదో నూతన ప్రయోగం చేసి 'ఈమని అంటే ఏమనీ అని అందరూ ముక్కుమూద వేలు వేసుకునే సందర్భాలు తరచుగా ఎదురయ్యేవిట.
గళగాత్రంతో పాటు వీణావాదనం
సంప్రదాయ గాత్ర-వీణాసంగీత కళాకారుల మార్గంలోని వారైనా, శాస్త్రిగారు, సంగీతకచేరీలో వీణావాదనంతోపాటు ఆయనే గాత్రసంగీతాన్ని కూడ జోడించి బహుముఖ ప్రతిభను ఏకముఖంగా ప్రదర్శించేవారు. హిందూస్థానీ కౄతుల్ని మధ్యాంతరంలోను, హిందూస్థానీరాగాలజోడీని ప్రదర్శించడంతోపాటు సంగీత కార్యక్రమంలో, శాస్త్రిగారి వేదప్రవచనం - స్వరసహితంగా గానం చేస్తూనే, వీణాతంత్రీనాదస్వరాల్తో శ్రవణసుభగం చేసేవారట.
ఆకాశవాణి ఆదరించిన శాస్త్రీయత
1959 లో డిసంబర్ 1 న, ఆనాటి కేంద్ర సమాచార, ప్రసారశాఖామంత్రి, డా.కేస్కర్, కేంద్రకార్యదర్శి, ఆర్.కె. రాం దయానీ ల ఆహ్వానం మేరకు ఈమని శంకరశాస్త్రిగారు మద్రాసు - ఆకాశవాణిలో కళాకారునిగా చేరడం, రెండేళ్ళలోపునే కేంద్రప్రసారవిభాగానికి, జాతీయసంగీతవిభాగపు సంగీతవిభావరిశాఖకు నాయకత్వం కూడ వహించారు అంటే ఆయన ప్రతిభ వర్ణనాతీతం. ఆయన ప్రదర్శించిన అసమాన ప్రతిభ శాస్త్రిగారిని ముఖ్య నిర్మాతగానే కాక, జాతీయసంగీతవిభావరికి దర్శకునిగా నియమించబడ్డారు. అనూహ్యమైన ఈ సదవకాశం ద్వారా నూతన శైలిలో సంగీతరాగాల్ని, తన వాద్యబౄందాల ద్వారా అధ్బుతమైన ప్రతిభను వెన్నంటుకున్నారు.
సంప్రదాయ, ఆధునికతల సంగీతస్వరమేళవింపులు
శంకరశాస్త్రిగారు ఒక ఆసక్తికరమైన 'కొత్తపాతలమేలుకలయికా అన్న ప్రయోగం అన్నది నిర్వివాదం. కార్యక్రమాన్ని బట్టి, అవసరాన్ని దౄష్టిలో పెట్టుకుని శాస్త్రిగారు కౄతుల్ని ఎన్నుకుని, స్వరపరచుకునేవారు. ఆయన ప్రతిభాసిగలో నిత్యం తారసిల్లేవి, గమకాలు, స్వరప్రస్తారాలు, తానం అన్నవి ఆయన స్వాధీనంలోనే నివాసం చేసేవి.
ఈమని వారికి సంగీతం అంటే ...
శంకరశాస్త్రిగారికి, సంగీతం అంటే ఒక మహాసముద్రం - దాగిన ఎన్నో మణులు, మాణిక్యాలు. సంగీతంలోని శాస్త్రీయతను, పరమౌషధగుణాన్ని, ప్రజలదగ్గరకు తన రాగా, స్వరమాధుర్యాలద్వారా తీసుకుని వెళ్ళడంలో ఆయన ఎప్పుడూ కౄతతుల్యులయ్యారు.
స్వరరాగ సౄష్టికర్త - ఈమని
ఈమనివారు గొప్ప వైణిక విద్వాంసులేకాక, శాస్త్రిగారు ఎన్నో కౄతులు, పదాలు, జావళీలను రూపొందించడమే కాక, తోడిరాగంలో రాగం-తానం-పల్లవి అంశాలను కూడ నిర్మాణం చేశారు.
ఈమని వారి అంతేవాసులు
గొప్పవిద్వాంసుడు, కళాకారుడుగా రాణించి విశ్రాంతి తీసుకుంటే నడవదు. గురువుస్థానంలో ఉన్న కళాకారుడు అంతే సరిసమప్రతిభను కలిగిన అంతేవాసుల్ని తయారుచేయడంలోనే ప్రతిభావంతమైన కళకు, కళాకారుడికి సార్ధకత, సాఫల్యత చేకూర్చినప్పుడే కళలో ఆవౄత్తం పూర్తవుతుంది. శంకరశాస్త్రిగారు అంతే ప్రతిభ గల విద్వాంసులు - 'వీణా చిట్టిబాబు, యం.వై.కామశాస్త్రి గారు అవతరించారు. సాలూరివారిదగ్గర ఉన్నప్పుడు, ప్రముఖ నేపధ్యసంగీతకారుడు పి.బి.శ్రీనివాస్ ని చిత్రరంగానికి పరిచయం చేసిన ఘనత మన ఈమని శంకరశాస్త్రిగారిదే. శాస్త్రిగారు తెరవెనుక వున్న అధినాయకులు, తెరపై దర్శనం యిచ్చిన చిత్రసంగీతంలో ఆయన ప్రతిభతోపాటు పాళ్ళు కూడ అధికమే అని చెప్పే కళాకారులు ఎంతోమంది శాస్త్రిగారి సంగీత ప్రతిభను గురించి తరచు ప్రస్తావిస్తారు.
ఈ సౄష్టి వున్నంతకాలం కళ, కళలున్నంతకాలం సంగీతం, సంగీతం విరాజిల్లుతున్నంతకాలం వీణ, వీణ కనిపిస్తున్నంతకాలం మనకు ఈమని శంకరశాస్త్రిగారు మనకు జీవితంలో నిత్యభాగంగా, మన మనసుల్లో, హౄదయాల్లో, ఉల్లాస, వినోద, విజ్ణానంతోపాటు, మనకు దివ్యౌషధంగా పనికొచ్చే పరికరాలుగాను, ప్రముఖవ్యక్తుల్లో ఒకరుగాను, ప్రతిభాదర్శనం కావిస్తూనేవుండడం జరుగుతుంది. యిది తధ్యం. సత్యం.
ఈమనిశంకరశాస్త్రిగారి అమూల్య కరాగ్రనఖాగ్రాలతో అధ్బుతవిన్యాసాల్ని విశ్వవ్యాప్తంగా వినుతికెక్కిన ఈ సంగీతవిదురుడు, ప్రతిభాకోవిదుడు, నిత్యస్మరణీయుడు.
తెలుగుతేజం, వైణికులయిన ఈమని శంకరశాస్త్రిగారు 1987 డిసంబర్ 23 న కీర్తిశేషులయినా, వారి కీర్తి నేటికీ సంగీతకళారంగంలో దర్శనమవుతూనే వుంది.
'వీణా శంకరశాస్త్రిగారికి శతసహస్ర సంగీత కళాభివందనాలతో, వినమ్రతతో, నమస్సుల్తో తెలుగురథం సమర్పించుకుంటున్న నివాళి.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

Sunday, December 21, 2008

బహుముఖ పాండితీ సంగమం - పాములపర్తి నరసింహుడు


బహుముఖ పాండితీసంగమం - పాములపర్తి నరహరి నరసింహుడు
( 1921 - 2004 )


రాజకీయపండితుడు
విలక్షణ వ్యక్తిత్వం. బహుముఖరంగాల్లో పాండితీప్రకర్షకుడు. ముక్కుకు సూటుగా పోయేవాడు. అంతేకాదు, ముక్కు కూడ బలే రాటుదేలి సూటిగా పొడుచుకు వచ్చినట్లు కోణంతేరి కనిపిస్తుంది. తెలుగువాడు చేసుకున్న బహుజన్మల పుణ్యం. తెలుగుగడ్డపై జన్మించిన ప్రతిభాశాలి. అన్నిరంగాలలో ఆరితేరినవాడు. అపర చాణక్యుడు. తెలుగు మాతౄభాష; అయితే, ఉర్దూ, మరాఠీ, కన్నడ, హిందీ, ఆంగ్లంలతో సహా 13 భాషల్లో అపరప్రావీణ్యం కలిగినవాడు. యివి సరిపోక, భారతదేశంలో అంత అధికంగా సంభాషించని అనేక యూరోపా భాషలైన, ఫ్రెంచ్, స్పానిష్ ల్లో కూడ విద్వన్మూర్తి. జగమెరిగిన తెలుగు సాహితీజగతిలో జగద్విఖ్యాత సాహితీమూర్తి. న్యాయంగా చెప్పాలంటే నిజమైన న్యాయవాది. అయినా రాజకీయరారాజు. సామాజికార్ధికరంగాల్లో విప్లవానికి పునాదిరాళ్ళను పాతినవ్యక్తి - ఎవరో కాదు, పాములపర్తి వేంకట నరసింహారావు. అందరి నోళ్ళళ్ళో 'పివీ గా బహు సుప్రసిద్ధులు. స్వంతరాష్ట్రంలోనూ, జాతీయస్థాయిలోనూ, రాజకీయాల్లో రాణించిన రాజకీయోద్దండుడు.
జీవనప్రస్థానంపాములపర్తి వెంకట నరహరి నరసింహారావు వరంగల్లు జిల్లాలోని కోపల్లె గ్రామంలో 1921 జూన్ 28న రుక్మబాయి, సీతారామరావు దంపతులకు జన్మించిన, రావు సంపన్నకుటుంబం నుంచి వచ్చారు. కరీంనగర్ జిల్లాకు చెందిన పెద్దవంగర స్వగ్రామం. పాములపర్తి వెంకట రంగారావు, రుక్మిణి దంపతులకు దత్తపుత్రునిగా అలరించిన పిదప పాములపర్తి వారి కుటుంబానికి వారసుడయ్యాడు. పివి వరంగల్లు జిల్లాలో ప్రాధమిక విద్యనభ్యసించాడు. ఉస్మానియా, ముంబాయి విశ్వవిద్యాలయాల్లో విద్యను సాగించిన, నరసింహారావు న్యాయవిద్యలో రాణించారు.
నిజాం పై కాలుదువ్వినవారిలో - పివిరావుగారు విద్యార్ధిదశలోనే, 1938లోనే హైదరాబాదు రాష్త్ర కాంగ్రేసు పార్టీలో చేరి, నిజాము ప్రభుత్వపు నిషేధణను ధిక్కరిస్తూ వందేమాతరం గీతాన్ని గానం చేసిన ధీశాలి. ఫలితంగా ఉస్మానియా బహిష్కరణకి గురయి, మిత్రుడి సాయంతో నాగపూరు విశ్వవిద్యాలయంలో చేరి, ఆయనవద్దనే వుంటూ 1940-44 లో న్యాయవిద్యను అభ్యసించాడు. స్వామి రామానందతీర్ధ, బూర్గుల రామకౄష్ణారావులతోపాటు స్వాతంత్ర్యపోరాటంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలో పాల్గొన్నాడు. బూర్గులవారి శిష్యరికంలో కాంగ్రేసులో చేరి, అప్పటి యువనాయకులు మర్రిచెన్నారెడ్డి, శంకరరావు చవన్, వీరేంద్రపాటిల్ లతో కలసి యువకాంగ్రేసు కార్యకర్తలుగా పేరుపొందారు. మూడు పదుల ప్రాయానికే అఖిలభారతకాంగ్రేసులో సభ్యుడిగా స్థానం సంపాదించిన ఘనుడు నరసింహుడు. ఈకాలం - 1948-1955 మధ్య బంధువు పాములపర్తి సదాశివరావు తో కలసి కాకతీయ పత్రిక ను తెలుగు వారపత్రికగా సంపాదకత్వం వహించడం కూడ విశేషం. రావుగారి సాహితీభాషాసంస్కౄతీపటిమకు పునాది యిక్కడినుంచే అని చెప్పవచ్చు.
అసంఖ్యాక రాజకీయ సోపానాలుభారతీయ జాతీయ కాంగ్రేసు లో వివిధస్థాయిల్లోను, 1962-1971 దశాబ్దంలో మంత్రిత్వశాఖలను నిర్వహించిన నరసింహారావుగారు, ఆంధ్రుడిగా ఆంధ్రరాజకీయానికి పగ్గాలు పట్టి 1971-73 లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టి, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఫలితంగా పదవిని వదులుకోవలసివచ్చింది. రాజకీయంలో అతిసహజమైన విచ్చినంలో భాగంగా, కాంగ్రేసు విడిపోయినప్పుడు, 1969లో అప్పటి ప్రధానిమంత్రి యిందిరాగాంధీ నాయకత్వానికి విధేయతని ప్రకటించడం, అత్యవసర పరిస్థితి పరిపాలనలో 1975-77 మధ్య కాలంలో అపర రాజకీయ చాణక్యుడి పాత్ర కూడ వుందనే చెప్పాలి.
భారతదేశానికి తొలి తెలుగుబిడ్డ ప్రధానిజాతీయ రాజకీయాల్లో ప్రతిభాపాండిత్యాలని ప్రదర్శించిన పాములపర్తివారు 1972 లో సవ్యసాచిలా, గౄహ, రక్షణ, విదేశీవ్యవహార శాఖల్లో 1980-84 లో రాణించిన తీరు అద్భుతం. తల్లీకొడుకులు, యిందిరాగాంధి, రాజీవ్ గాంధి ల నాయకత్వంలో సరిసములులేని రాజకీయదురంధరుడు, మన నరసింహుడు. రాజకీయ చరిత్రలో, అనూహ్యఘటన, రాజీవుని హత్య పిదప ఉధ్భవించిన నాయకత్వసంక్షోభంలో, 1991 ఎన్నికలు జరగడం, ఏకోణంలోంచి ప్రశ్నించలేని, సమాధానపరచుకోవలసిన అవసరం లేకుండ, రాకుండ, మన పివినరసింహారావుగారు, కాంగ్రేసు పార్టీకి నాయకత్వం వహించడమే కాడు, భారతీయ రాజకీయ చరిత్ర, అందులో, దక్షిణభారత రాజకీయ చరిత్రలో, మొట్టమొదటిగా, పదహారణాల తెలుగుబిడ్డ దేశపుగద్దెని ఆరోహించాడు. అప్పట్లో అత్యధిక స్థానాలు పొందిన పక్షంగా, మైనారీటీ దశలో వున్నాకూడ, పూర్తి పదవీకాలం దేశప్రధానిగా, ప్రతిభావంతంగా, ప్రపంచపునడతకు దీటైన స్థాయిలో దేశంలో సరళీకరణవిధానాలు, ఆర్ధికవిధానంలో మార్పులను ప్రవేశపెట్టడం, వాటిని న భూతో న భవిష్యతి అన్నట్లే అమలుపరచడం పట్ల, భారతదేశపు ఆర్ధికస్థాయి ఎప్పటికీ సుస్థిరతనించి దిగజారదనిపించే స్థాయికి నిలబెట్టిన నిపుణత, మన నరసింహుడెదే. ఆ విషయంలో ఆయన ఉగ్రనరసింహుడే. ఆయన అలవరచుకున్న మితభాషితనం అమితప్రతిభాపాటవాలకి దారితీసింది. రాజకీయమౌని గా పేరుపొందాడు.
తలమానికమైన స్థానం - ప్రపంచస్థాయిలో చిరస్మరణీయంఆంధ్రప్రదేశ్ లో నంద్యాల నుంచి కనివిని ఎరుగని తీరులో, అత్యధికమైన ఓట్ల మెజారిటీ, 5 లక్షలు సంపాదించిన ఘనత మన నరసింహుడిదే అని గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో సువర్ణాక్షరాలతో చిరస్థాయిగా లిఖించిన ఘనత మన తెలుగుబిడ్డదే అనడం గర్వకారణం కాక మరేమిటి. ప్రధానమంత్రిగా కొనసాగిన ఆ అయిదేళ్ళు, మరో రాజకీయదురంధరుడు, మహారాష్ట్రనాయకుడు, షరద్ పవార్ ని అంధ్రకేసరి ఢీకొన్న శైలి, అదికూడ రక్షణశాఖలో వున్నవాని రాజకీయానికి ప్రతిసవాలుని విసిరిన విశేషప్రతిభాశాలి మన నరసింహారావు.
సాహితీపాండిత్యంలోనూ కవిశ్రీనాధుడే మన నరసింహుడుబహుబాషాకోవిదుడు, మౄదుసంభాషి, అయినా, మితభాషి, చతురుడు అయిన నరసింహారావుగారు కలం పట్టేడంటే, అపరమధురకవి, గద్యపోతనే అని చెప్పాలి. రాజకీయాల్లో క్షణం తీరికలేని పనితనంతో పాటు, పివి నిరంతర రచయిత. ఆయన మేధస్సులో, రాజకీయసాహిత్యాన్ని సౄష్టించుకుంటూనే, నిజసారస్వతాన్ని కూడ సౄష్టిస్తూ, అద్భుత రచనలను అందించాడు. తన రచనలను స్వయంగా, వౄద్ధాప్యం వరకూ, సాంకేతికంగానే, చేయడం మరో విశేషం. కంప్యూటర్ ని వాడడమే కాదు, ప్రావీణ్యుడే. జ్ణానపీఠం అనగానే తెలుగులో మొదటగా గుర్తువచ్చే అప్రతిభాశాలియైన ఏకైక తెలుగుకవి విశ్వనాధ సత్యనారాయణగారి వేయిపడగలు సుప్రసిద్ధ నవలకు మరింత వన్నెలను రంగరించి, దాని విలువలను పరిపోషించి, హిందీభాష, దేశపురాజభాషలో, సహస్రఫణి గా అనువదించడం, ఈ ప్రతిభాపూర్వకమైన అనువాదం, కాదు, అనుసౄజనం, రచనకు కేంద్రసాహిత్య అకాడమీ వారి సత్కారానికి గురయింది అంటేనే, దాని విలువను చెప్పవచ్చు. వేరే విశ్లేషణలు, వివరణలు అనవసరం. అలాగే, అబల జీవితం అన్న ప్రముఖ మరాఠీరచనకు ఆంధ్రానుసౄజనం కావించారు.
పివి ఆత్మకధ - లోపలిమనిషి (ఇన్ సైడర్)నరసింహారావు గారు, తన విస్తార రాజకీయ,సాహిత్య, భాషాపాండిత్యాలని క్రోడీకరించి, రచించిన ఆత్మానుభూతి, భావ ప్రతిబింబాల సమాహారంగా, ఆంగ్లంలో 'ఇన్ సైడఋ రచనను అనేకభాషలలోకి ప్రచురణ జరగడం, తెలుగులో లోపలిమనిషి గా చాలా ప్రఖ్యాతమవడం ఆయన ప్రతిభాపాండిత్యాలకి ప్రత్యేక, ప్రత్యక్ష నిదర్శన తార్కాణాలు. తన సాహిత్యంలోను, తన రాజకీయపుటనుభావాలను సుస్పష్టంగా పేర్కొనడం కూడ మరో విశేషం.
అవసానదశపాములపర్తి నరసింహారావుగారు 23 డిసంబర్ 2004 లో డిల్లీలో పరమపదించారు. ఆ సందర్భంగా ఆయనకు జరిగిన పరాభవం, వచ్చిన విమర్శలు, మనిషి జీవించినంతకాలం ఎదురవ్వని సమస్యలు, మరణించాక అవతరిస్తాయి అన్నది మన నరసింహుడి విషయంలో జరగడం విచారం, దారుణం, అమానుషం. ఏ ప్రతిభావంతునికీ జరగకూడదని అందరం నేర్చుకున్న గుణపాఠం. మన తెలుగుబిడ్డ దేశానికి నాయకుడిగా చేసిన ఆయన ప్రతిభాపాండిత్యాలని మాత్రం మరువలేని, మరువరాని, సంగతని మనం మరువరాదు. ఆయన ఆత్మకు శాంతిని సమకూర్చడంలో ప్రతి ఆంధ్రుడూ తనవంతు నివాళిని సమర్పించడం మన కర్తవ్యం, విధి.
మన ఘన తెలుగుతేజం, పాములపర్తి నరసింహారావు గారి వర్థంతి సందర్భంగా తెలుగురథం ఘననివాళిని సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

విశ్వవిఖ్యాత 'గణాంక ఘనుడూ - శ్రీనివాస రామానుజన్(1887 - 1920)


మనిషి నేర్చుకునే విద్యలో గణాంకశాస్త్రసంబంధిత విద్యకు రాణింపు, గుర్తింపు తప్పక వస్తుంది అన్నది నిత్యసత్యం. మానవ, కళా శాస్త్రాలు ఒక తీరులో ఆధ్యయనం జరిగితే, గణాంకాధ్యయనం లో వున్న ప్రత్యేకతలు అందులో ప్రవేశించి, ప్రవీణులు కావలసినదే కాని దాని వివరించలేము. విద్యార్ధి దశ నుంచి, భాషాసంబంధిత అంశాలకన్న, తికమకపెట్టే లెక్కలు, ఓపట్తాన కొరుకుపడని భౌతిక, రసాయనశాస్త్రాలు వేటి ప్రత్యేకత వాటిదే.
గణాంకశాస్త్రం గురించి బహుకొద్దిమంది నిర్వచనం చెప్పినా, ఈ విషయాధ్యయనాన్ని, ఒక ఎత్తైన పర్వతారోహణం గా వర్ణిస్తూ, గమ్యం చేరుకున్నాక పొందిన అలసట కన్న, కలిగిన ఆశ్చర్యాధ్బుతాలనే అనుభవించడం జరుగుతుంది. లెక్కల విషయానికొస్తే, కారణం, మేధస్సుకి గ్రహణశక్తి, సాధికారతలు లభిస్తాయి. ఒకవిధమైన సంభావ్యదశకి, దిశకి దారితీస్తాయి. ప్రతి విద్యార్ధికి తనదైన క్రమశిక్షణను కలిగించడమే కాక, విశ్వవ్యాప్తంగా మేధస్సుకి, హౄదయానికి కూడ విశిష్టమైన శిక్షణలను ప్రేరేపిస్తాయి. అనిర్వచనీయమైన ప్రోత్సాహ, ప్రోద్బలాలను కలిగిస్తాయి. సంచరించే స్వభావం వున్నవాడికి, లెక్కల విషయంలో, ప్రతిభను ప్రదర్షించేదుకు సంపూర్ణావకాశాలు లభిస్తాయి. అవరోధాలు, అవాంతరాలు వచ్చినా, మెట్టు, ఒక్కొక్కొటి ఎక్కుతూ, అరోహణం చేసుకుంటూ, ఎవరెష్టు, హిమశిఖరాగ్రభాగాల్ని, తమ ప్రతిభాగర్వంతో చుంబించాలి.
పైన వివరించిన దశల్ని, దిశల్ని అసమాన ప్రతిభాపాండిత్యాలతో, అగణిత శిఖరాగ్రాల్ని అతిసులభంగా తాకగలిగిన వ్యక్తి, ఎవరో కాదు, విశ్వవిఖ్యాత గణాంక ఘనుడు - 'శ్రీనివాస రామానుజణ్. చిరుప్రాయం నుంచి బాలశాస్త్రవేత్తగా భావించబడ్డ, రామానుజన్ ప్రపంచంలోనే తిరుగులేని 'లెక్కల్లోని మనిషీ అని చెప్పాలి. అందరూ, అంకెల్ని సంకెలలు గా భావిస్తే, వాటిని స్వీకరించి, ఘనంగా రాణింపు పొందినవాడు రామానుజన్.
22 డిసంబర్ 1887 లో తమిళనాడు లోని ఇరోడ్ లో అతిబీదకుటుంబంలో పుట్టడమే కాక, కటిక దారిద్ర్యాన్ని అనుభవించినవాడు. 17 సంవత్సరాలకి మెట్రిక్యులేషన్ లో ఉత్తీర్ణుడైన, 'శ్రీనివాసా, ఎప్పుడూ, తరగతి లో ప్రప్రధముడే. చాలా సంవత్సరాలు, మదరాసు విశ్వవిద్యాలయంలో ఆధ్యయనం చేసి, 1914 లో ప్రత్యేక ఆధ్యయనం కోసం కేంబ్రిడ్జ్ వెళ్ళాడు. ఈ దశలోనే, రామానుజన్ తన గణాంకవిద్యలో చాలా ప్రఖ్యాతుడైనాడు. అమోఘమైన మేధస్సున్నకారణంగా, వేలకొలది సమస్యలకు సులభ పరిష్కారం తెచ్చిన వ్యక్తి. 1917 లో యూరోపు ఖండం ఆయన ప్రతిభకు పట్టం కట్టింది. 1919లో, భారతదేశానికి తిరిగొచ్చి, తన పరిశోధనను ప్రారంభించాడు. అదే సంవత్సరం (1919) లో విశ్వవిఖ్యాత 'రాయళ్ సంస్థ అందించిన ప్రప్రధమ భారతీయునికిచ్చిన 'ఫెల్లో' గౌరవం, శ్రీనివాస రామానుజన్ కి దక్కడం, గణాంకశాస్త్రానికే గౌరవంగా మారింది. కేవలం 32 ఏళ్ళకే ఈ గౌరవం పొందడం చరిత్రగానే నేటికీ భావించబడుతోంది. గణాంక సమస్యలకు ఎన్నో కొత్త పరిష్కారాల్ని కనుగొన్నవాడు. రాయల్ గౌరవం పొందిన వెంటనే, ఏడాది కూడ దాటకముందే, రామానుజన్, చోల్పూర్ లో, 26 ఏప్రిల్, 1920 లో కీర్తిశేషుడైనాడు. ఆయన పరిశోధన ఫలితాలు, ఆయన మరణించాకనే, బయటపడ్దాయి. వాటిపై, మరింత పరిశోధనలు, నిరంతరంగా జరుగుతూనే వున్నాయి. ఆయన జీవితాంతం, ప్రతిభామేధస్సును గమనించి బ్రిటిషులోని ప్రముఖ గణాంక శాస్త్రవేత్తలు సైతం అవాక్కయేవారట.
కేవలం మూడు దశాబ్దాల, మూడు సంవత్సరాల్లోనే, భారతదేశానికి ఎనలేని ఘనతను తెచ్చిన గణాంక ఘనుడు. భారతదేశం వారు, ప్రత్యేక తపాళాబిళ్ళను విడుదల చేయడం కూడ జరిగింది. శ్రీనివాస రామానుజన్ పేరున, ప్రతిభాపురస్కారలని, భారత జాతీయ శాస్త్రసంస్థ, ఆయన స్మరణార్ధం, నెలకొల్పి, అనేక గణాంక శాస్త్రవేత్తలకు సత్కారాల్ని అందించి, తమ ప్రతిభకు పట్టం కడుతూండడం, శ్రీనివాస రామానుజన్ కారణభూతుడే అని చెప్పక తప్పదు. భావి భారతదేశంలో, మరింత గరించగల, శ్రీనివాస రామానజున్ లు వుద్భవించి, గణాంకరంగానికి మరింత ఘనాఘన సుందర సుసంపన్నతను అందించాలి. ఆ శుభతరుణం కోసం మన విద్యార్ధిలోకానికి ఆశీస్సుల్ని, అవకాశాల్ని అందించడంలో నేను సైతం అంటూ, సహాయ సహకారాల్ని అందిచాలి.
'పరుగెత్తి రానీ పవిత్ర భావనల్ పలుదెసలనుండీ పునీతులుగ చేయంగ మనలణ్ అన్న స్ఫూర్తితో, 'నేనెవరైన, నేనెంతటివాడనైన, నాౠణమామాతౄమూర్తికే!' అన్నది సత్యం. శ్రీనివాస రామానుజన్ ని కన్న ఆయన మాతౄమూర్తి, భారతదేశం కూడ ధన్యులే సుమా!
ఘన గణాంకమూర్తి - శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా తెలుగురథం ఘన నివాళిని సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

Monday, December 1, 2008

నవయుగాల నార్ల బాట - శత జయంతి

'నార్లా వెంకటేశ్వర జయంతి (1908 - 1985)

'నార్లావారి బాటమాటలు నాణ్యాల మూటలు - శతజయంతి సన్నాహాలకు స్వాగతాలు
బాట + మాట = నాణ్యం + మూట = నార్ల
ఏదివున్నా, ఏది లేకపోయినా, ఈయన రచనల్లో వైవిధ్యం మాత్రం పుష్కలంగా వుంది. అందుకని, వీరి రచనల సంకలనాల్లో ఏదో ఒక భాగం, ఎవరికో ఒకరికి, ఎంతో కొంత నచ్చకపోవడం అంటూ వుండదు అని పలువురు నమ్ముతారు. అంతేకాక, ఏ సమయంలోనైనా ఆసక్తిగా చదువుకోగలిగే సాహిత్యం. దీనికి ప్రామిసరీనోటులా కాలదోషం అంటూ వుండదు. ఆమాటకొస్తే, ఏ ప్రతిభ, సత్త వున్న రచయిత కలంనుంచి వచ్చే రచన అయినా, నూజివీడు మామిడి రసఫలంలా రసాలూరుతూనేవుంటుంది. అదే నార్ల వారి కలం, రచనల్లో కానవస్తుంది.
నవయుగాల బాట 'నార్లామాట
ఉత్తమస్థాయి పత్రికాసంపాదకుడు, సంస్కరణశీలి, హేతువాద తత్వవేత్త, భావజాలాన్ని నార్లవారి బాట అన్నమాదిరి విన్నూత్నంగా అందించిన ఆజానుభాహుడు, తెలుగు పత్రికారంగానికి అత్యాధునిక నూతనభావనారూపశిల్పి - ఎవరోకాదు, నార్ల వెంకటేశ్వరరావు గారు. అందరికీ 'నార్లా. ఆయన బాట, మాట, యుగయుగాలకూ వ్యాప్తి కాగల అర్హత, అధికారం పుష్కళంగా పుణికిపుచ్చుకున్న పుంభావ సరస్వతి. అందుకే 'నవయుగాల బాట నార్లమాటా అని ఆయనే యిచ్చుకున్న శతకరచనకు మకుటం ఆయన జీవితానికే కడు సార్ధకం అని చెప్పాలి.
నార్ల వలస జీవనబాల్యం
అది ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. అంటే, వనరులూ, ఆదాయం అంతంత మాత్రమే కదా. సమాజంలో భాగస్వామ్యం వహించేందుకు నార్ల బాల్యంలో చాలా కష్టపడ్డాడు. ఆనాటి మద్రాసు ప్రెసిడెన్సీ, ఆంధ్రప్రాంతంనుంచి పూర్వీకులు మధ్యప్రదేశ్ లోని కట్ని కి వలసపోవడం, సైన్యవిభాగాల్లోకి ఆహారపదార్ధాలను సరఫరా చేసే వ్యాపారంలో మునిగిన కుటుంబాల్లో, నార్ల వరి కుటుంబాలు ప్రముఖంగా చెలామణి అయ్యాయి. లక్ష్మణరావు, మహాలక్ష్మీ దంపతులకు, మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో 1 డిసెంబర్ 1908 న నార్ల వంశీకుడు జన్మించాడు - వెంకటేశ్వరరావు. బాల్యం, చదువు తర్వాత 'నార్లా కాలేజీ చదువు నిమిత్తం ఆంధ్రప్రాంతానికి తిరిగివచ్చాడు. పట్టభద్రుడవాలన్న చదువుతోపాటు, జాతీయ స్వాతంత్ర్యోద్యమ ప్రభావప్రేరణలతో పాల్గొన్నాడు.
ఆవహించిన పత్రికారంగం
నార్ల వారి ప్రతిభాజీవితన్ని రెండు దశలుగా భావించవచ్చు.
తొలి దశ - ఆంధ్రప్రభ
తలరాత మాట ఏమో కాని, కలంవ్రాత మాత్రం మన నార్లను నరనరాల వ్యాపించింది. బాల్యంనుంచే రాయడంపై మక్కువని పెంచుకున్న పత్రికామాధ్యమరంగంలోకి చొచ్చుకుపోయాడు. అదీ తెలుగుపత్రికారంగంలో. యిండియన్ ఎక్ష్క్స్ ప్రెస్ సంస్థలోని 'ఆంధ్రప్రభా కు ఆరాధ్యదైవంగా పేరుపొందిన సంపాదక వౄత్తిలో రాణించాడు మన నార్ల. రమారమి, రెండు దశాబ్దాలకాలంపాటు - రెండవ ప్రపంచయుద్ధం నుంచి స్వాతంత్ర్యానంతరం వరకూ - నార్ల వారి సంపాదకీయాలు, వ్యక్తిగత శీర్షికలు చదవడం అయాకే, మిగతా పేజీల జోలికి పోయేవారట. ఆనాటి మద్రాసు నుంచి ప్రారంభించిన ఆంధ్రప్రభ ప్రచురణ తెలుగు జర్నలిజంలో ఒక తలమానికమని చెప్పాలి.
మలిదశ - ఆంధ్రజ్యోతి
పత్రికాసంపాదకునిగా అపారమైన అనుభవాన్ని జోడించుకుని, నార్ల వారి విదేశీపర్యటనలను కేవలం తిరగడానికే కాకుండా, ప్రతీ యాత్ర, సాహిత్యం, కళ, వర్తమాన స్థితిగతులను అవలోకనం చేసుకుంటూ, తన ప్రతిభను విశ్వవ్యాప్తం చేయగలిగాడు. ప్రముఖ వ్యక్తులతోపాటు, గ్రంధాలయాలు, స్మారకచిహ్నాలు, కళాప్రదర్శనాలయాల్లోని స్మౄతివైభవాల్ని మరింత విస్తౄతం చేశాడు. ఈ భాగంలోనే, ఆంధ్రప్రభను విడిచి, స్నేహితులతో, ఆంధ్రప్రభలో అపారమైన అనుభవంతో, దీటైన మరొక పత్రిక - ఆంధ్రజ్యోతి - ని ప్రారంభించాడు. ఈ ప్రోత్సాహకుల్లో, ప్రముఖ వ్యాపారులు, జమీందారులు, రాజకీయనాయకులు జట్టుగట్టి, ఆంధ్రజ్యోతిని విడుదల చేశారు. వెంటనే, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్య ప్రచురణగా విజయవాడలోను, ఆ తర్వాత హైదరాబాదులోను (1960) ప్రారంభించారు. మద్రాసు విభాగం మూసివేశారు. అలా ప్రారంభించిన ఆంధ్రజ్యోతి చాలాకాలం ప్రముఖ పత్రికగా పేరుతెచ్చుకుని, మూసివేయడం, ఈ మధ్యనే పున:ప్రారంభం అవడం, చెన్నైలో కూడ ప్రచురణ ప్రారంభించడం కూడ జరిగింది.
ఈ రెండు పత్రికలూ, ఎన్ని యాజమాన్యాలు మారినా, మరెన్ని రూపురేఖలు మారినా, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పేర్లు స్మరిస్తే, నార్ల వెంకటేశ్వరరావు పేరు గుర్తురాక మానదు. స్మరణకు రాలేదంటే, ఆ వ్యక్తికి, సంస్థకి, పత్రికారంగంలో పరిచయం వుందంటే, అది కుహనాభావన, పరిజ్ౙానం అని చెప్పి తీరాలి.
మరొక పరిణామం - హేతువాదం
మానసిక పరిపక్వతను పరిపుష్టంగా అందుకున్న నార్ల, గుండెజబ్బు వచ్చేకే తన పొగ తాగే అలవాటును పెంచుకుంటూనే అనారోగ్యాన్ని కూడా పెంచుకున్నాడు. ఫలితంగా, పొగని వదిలాడు. వదులుకోలేని మక్కువని తన గ్రంధాలయ నిర్వహణ విషయంలో శ్రద్ధ వహించాడు. అదే గ్రంధాలయాన్ని, తర్వాత, డా.అంబేద్కర్ విశ్వవిద్యాలYఆనికి విరాళంగా యివ్వడం కూడ జరిగింది. ఆయనలో లోతుగా పాతుకుపోయిన మానవతావాది, ఆయనలో అప్పటివరకూ అదౄశ్యంగా సంచరిస్తున్న హేతువాది ఒక్కసారి బయటకు వచ్చాడు. ఉపనిషత్తులు, భగవద్గీత, ఆధ్యాత్మిక గ్రంధాలతోపాటు, ప్రముఖుని యం.యన్.రాయ్ రచనలను చదివి ప్రభావితమయ్యాడు. ఈ దశలోనే, ప్రముఖులతోపాటు పరిచయాలు, స్నేహాలు పెరిగాయి. వారిలో ప్రముఖులు - ప్రేం నాధ్ బజాజ్ (షేక్ అబ్దుల్లా కాశ్మీర్ ప్రభుత్వం కావించిన బహిష్కరణ) కూడ రాయ్ అనుచరుల్లో ఒకరు. సుశీల్ ముఖర్జీ, నిరంజన్ ధర్, న్యాయవాది వి.యం.తర్కుండే (మానవ హక్కుల పరిరక్షకుడు), ఎ.బి.షా, ఆవుల గోపాలకౄష్ణమూర్తి (మానవత ఉద్యమంలో నాయకుడు)లను స్మరించలేకుండా జరగని పని. రాయ్ రచనలని, రాయ్ భావాలతోపాటు నార్ల చదివేవాడు. గాంధీ విధానాల్ని విమర్శించిన వారిలో రాయ్ ప్రముఖులు. రాజకీయాలకు గాంధీ అవలంబిస్తున్న మతధోరణిని కూడ రాయ్ విమర్శించేవారు.
హేతువాదితోనే పట్టింపులు
రాయ్ 1938 జూలై లో మద్రాసులో పత్రికాసమావేశంలో మాట్లాడడం, ప్రముఖ పత్రికాకారుడు ఖాసా సుబ్బారావు, యిండియన్ ఎక్స్ ప్రెస్ సంపాదకునిగా, రాయ్ భార్య ఎల్లెన్ గురించి వ్యాఖ్యలను ప్రచురించడం, సుబ్బారావుని విమర్శించడం జరిగింది. ఈ సంఘటనకి, పత్రికారంగం యావత్తూ, నార్లతో సహా, పత్రికాసమావేశాన్ని బహిష్కరించడం జరగడం, ఈ ఉదంతంతో రాయ్ ప్రస్తావన, దేశవ్యాప్తంగా మరణంపై (25 జనవరి 1954) రాయ్ ప్రతిభపై స్పందించినా, ఏమాత్రం నార్ల ఆంధ్రప్రభలో చేయకపోవడం గమనార్హం. కాని, ఒక ప్రముఖుడు గుంటూరులో చేసిన విమర్శకు ప్రభావం చెంది, వెంటనే రాయ్ రచనలన్నీ తెచ్చుకుని చదవడం, ప్రతిభావంతమైన భావాలకు ప్రేరణపొంది, 1956 లో రాయ్ గురించి నార్ల సంపాదకీయం రాయడం జరిగింది. రాయ్ భావాలు మదిలోకి వెళ్ళేకొద్దీ, నార్లకు అవి బాగా నచ్చేవి. ఫలితంగా, మునుపు విమర్శలు చేసిన, ఎ.జి.కె.మూర్తితో స్నేహం పెరిగింది. 1942-48 లో హేతువాదోద్యమాన్ని నిర్వహించిన రాయ్ చివరికి నార్ల జీవితంలో భాగం అవడం ఆశ్చర్యం, విశేషం కలిగించాయి. ఈ స్థితిలో, వయసు పైకి ముంచుకొస్తున్న కొలదీ, మానవునిలో ఆధ్యాత్మికత, కర్మవాదం అలవడుతాయి అన్న భావనకు వ్యతిరేకమేకాగ, తన విషయంలో అనుకూలత, ఆశ, మానవత్వం, పెరుగుతున్నాయన్నారు. అంతేకాక, నార్ల తన నిత్య జీవితానుభాలు, ప్రముఖుల పరిచయాలు, స్వంత ఆలోచనలు, డైరీలో ముఖ్యాంశాలను వ్రాసుకోవడం ప్రారంభించి, జీవితాంతం కొనసాగించేవారట.
గ్రంధాలు, గ్రంధాలయాల్లో మధ్య నార్ల
నార్ల గ్రంధాలయాల్ని నిత్యం దర్శించడం, చదవని పుస్తకాలని ఏరడం దినచర్య అనే చెప్పాలి. ప్రముఖంగా పాత పుస్తకాలని వెదకి పట్టుకోవడం ప్రక్రియ తనదైన శైలిలో కళాత్మకంగా జరిపేవారు. ఈ కార్యక్రమంలో ఆయన ఎన్నుకున్న విషయంలో పరిపూర్ణ పరిశోధన చేయడం జరిగాకే వ్రాయడం జరిగేది. ఈ పద్ధతిని గుర్తించి, భారతప్రభుత్వం, సాహిత్య అకాడమీవారి ఆధ్వర్యంలో, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, వేమన ల పై, భారతీయ సాహితీనిర్మాతలు అన్న ధారావాహికంలో, జీవితచిత్రణలను అందరూ మెచ్చుకునేలా రాయగలిగేరు.
పుస్తకాలతో పెంచుకున్న నేస్తం గురించి మన నార్లను చెప్పాలంటే, ఆయన తరచు చెప్పే భావం ఒకటి గుర్తు రాక మానదు.
'పుస్తకాలు కొనడమంటే నాకు చెడ్డ సరదా. జేబులో డబ్బున్నా లేకపోయినా, మంచి పుస్తకాన్ని చూడగానే బేరం చేస్తాను. ఆ పుస్తకంతో నాకు అవసరం వుండవచ్చు, లేకపోవచ్చు. ఒకసారి చదివిన తర్వాత మరి దానితో పనిలేకపోవచ్చు. అయినా దాన్ని కొనేదాక మనస్సు రెపరెపలాడుతూంటుంది. అప్పుచేసి కూడ పుస్తకాన్ని కొనడం అనేకసార్లు సంభవిస్తూంటుంది. పుస్తకాన్ని ఎరువివ్వక తప్పదు. అది పోవడం తప్పదు. అలాగనీ అసలు వాటిని కొనడమే మానలేం. ఇతరుల సంగతి తెలియదు కాని, నా విషయంలో యింతే. ఇప్పటికీ, ఎప్పటికీ."
పుస్తకాలపై నార్ల మరొక అభిప్రాయం యిలా సాగింది.
"విద్యావంతునికి పుస్తకం హస్తభూషణమని పెద్దలన్నారు. అయినా, మన విద్యావంతుల్లో పెక్కుమందికి పుస్తకం కాక, స్విచ్ వాచ్, సిగరెట్ టిన్, ట్రాన్ సిస్టర్ రేడియో మొదలైనవి హస్తభూషణాలు. నాగరీకుని గౄహానికి పుస్తకాలు అలంకారాలని వాత్స్యాయనుడు వ్రాశాడు. అయినా, మన నాగరికుల్లో అత్యధిక సంఖ్యాకుల గౄహాలకు పుస్తకాలుకాక, సోఫాసెట్లు, స్టీల్ బీరువాలు, చౌకబారు క్యాలెండర్లు మొదలైనవి అలంకారాలు. మనదేశంలో చదువులు పెరుగుతున్నా, సంస్కారం పెరగడం లేదనడానికి ఇది నిదర్శనం' నగరాలు పెరుగుతున్నా నాగరికత పెరగడం లేదనడానికి ఇది తార్కాణం."
వైవిధ్యం, విద్వత్తు, వెరసి నార్ల రచనలు
చరిత్ర, వేదాంతం, తత్వం, సంస్కౄతి, ఏదైనా సరే, నార్ల రచనాధోరణి ప్రత్యేకమే. భగవద్గీతకు వ్యాఖ్యానం రచించే ప్రయత్నంలో, ఎన్నో గీతాభాష్యాలను ఆధ్యయనం చేసి, వివిధ దౄక్కోణాల్లోంచి పరిశీలించి, వివరించడం జరిగింది. అలాగే, ఉపనిషత్తులు - ముల్లర్, షెఫ్ణోర్, నీట్జే లాంటి వ్యాఖ్యానాలను చదవడం, అనుకూల ప్రతికూలతలను విశ్లేషించడం, ఫలితంగా అనేక అభిప్రాయాలను, భావాలను, ప్రచురించారు. గీతపై సత్యశోధన, ఉపనిషత్తులపై సుదీర్ఘవ్యాసం, భారతదేశంలోని తెలివైన బీదతనం, ప్రాక్పశ్చిమరాజ్య సంస్కౄతి, యిలా ఎన్నో రచనలు వెలువడ్డాయి.
నార్ల భావలహరి
మతం కేవలం వ్యక్తిగత విశ్వాసంగా భావించి, రాజ్యం, పరిపాలనలోకి రానీయకూడదనేవారు. ప్రాచీనముని యాజ్ఞవల్క్య భావాలు పురోభివౄద్ధికి, మనుగడకు అవరోధాలేకాక నిరంకుశవాది, నియంత మూలాన, భారతదేశపు బీదతనానికి బాధ్యత అన్నారు. మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం, వెదకి నిర్ధారించ్లేని మహాత్మాగాంధి అంతరాత్మ ప్రభోధం లాంటి పద్ధతులు దేశపు స్వాతంత్ర్యం తెచ్చినా, బానిసత్వం పూర్తిగా పోలేదు అన్నారు. గాంధీకి శాస్త్రీయ విధానం లేదని, నిత్యం గీతపై ఆధారపడడం, ఆయన అహింస, సత్యాగ్రహ విధానాలే హింసకు.నిరాహార ధోరణి అనారోగ్యానికి చివరకు దారితీసాయన్నారు. యువకులకు కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలకు యువకులకు అవే మార్గాలని చెప్పి, ఆత్మసమర్ధత, ఆత్మసంయమనం అలవాటు చేసుకోనివ్వలేదన్నారు. హిందూతత్వం, మానవతాతత్వం మేళవించిన, సుగమం అయ్యేది అన్నారు. మానవతావిలువలపై దౄష్టిపెట్టి అలవరించినట్లయితే, మానవులు వారిపైనే స్వయంగా ఆధారపడి, వారి సమస్యలకు పరిష్కారాలు వారే కనుగొనేందుకు దోహదం అయేది.
యిందిరాగాంధి తెచ్చిన అవాంతరం, పోగొట్టుకున్న సంపాదకత్వం
పుష్కలమైన స్మౄతి, స్ఫూర్తి కలిగిన పత్రికాకారుడిగా, 1975లో యిందిరాగాంధి సిద్దాంతాలకు నార్ల అన్యధా ఆమోదితుడయినా, నిర్ణయం, అమలుపరచటం, నిరాశనే కలిగించింది. సంపాదకీయం తెల్లకాగితంలా వుంచుదామనుకున్నా, ఆంధ్రజ్యోతి యాజమాన్యం ససేమిరా అన్న మేరకు, నార్ల కుటుంబం యావత్తూ, అమెరికా ప్రయాణం చేయడం, జీవితంలో ప్రముఖ సంఘటన. నార్ల వారి సుగుణసంతానం, ఏడుగురూ, డాక్టర్లవ్వడం, ఉద్యోగులవ్వడం మూలాన, అత్యవసర పరిస్థితి అంతం అయ్యేకే, భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆంధ్రజ్యోతి సంఫాదకునిగా రాజీనామా చేశారు. యాజమాన్యం అనివార్య జోక్యం చేసుకున్నప్పుడల్లా, నార్ల రాజీనామా చేయడం కొత్తకాదు. యిదివరకు ఆంధ్రప్రభలో కూడ జరిగింది. కాంగ్రేసు పార్టీ రాజకీయాల్లో పాల్గొని, రాజ్యసభ సభ్యునిగా ప్రత్యక్షంగా వీక్షించిన రాజకీయాలు, నాయకుల అవినీతిధోరణి, ప్రజాజీవనం నుంచి తప్పుకోవలసివచ్చింది.
ప్రతిభావంతులకూ అండదండలు
ఏ ప్రతిభావంతునికి అన్యాయం జరిగినా నార్ల సహించలేదు. కేవలం పట్టభద్రుడైనా, జి.వి.కౄష్ణారావు చేసిన, కళాపూర్ణోదయం పై ఆంగ్లంపై పరిశోధనావ్యాసం పై రేకిత్తిన వివాదం విషయంలో, నార్ల స్వయంగా చదివి, ఉపాధ్యాయుని భాష, విశ్లేషణలోనే తప్పులున్నాయని. ఘాటుపదాలతోకూడిన లేఖను విశ్వవిద్యాలయం ఉపకులపతికి వ్రాయడంలో కనపరచిన ధైర్యసాహసాలు, కులగజ్జిధోరణితో విద్యావిధానాలను నిర్ణయిస్తున్న ఉపాధ్యాయుల వక్రతను, డా. గోవిందరాజులు నాయుడు గారు గ్రహించి న్యాయం చేయకపోతే, ప్రజలముందు ప్రస్తుతిస్తానని నిర్ద్వందంగా చెప్పడం, పట్టభద్రుని ప్రతిభ పరిశోధనలో ఉత్తీర్ణతను ప్రకటించవలసివచ్చింది. దీనితర్వాత, ఆంధ్రప్రభ లో కౄష్ణారావు వ్యాసాలు ఎన్నో ప్రచురించబడ్దాయి.
ముఖ్యమంత్రులు ఎవరైనా నార్లకు ముఖ్యులు కానేకారు!
కళాజీవన స్మౄతుల్ని, కళాకారుడిగా, అభిమానులకు జీవితముఖ్యాంశాలను పత్రికలో ప్రచురించేందుకు, గుంటూరు జిల్లా, తుమ్మపూడిలోని సూర్యదేవర సంజీవ్ దేవ్ ని నార్ల పరిచయం చేశారు. సమాజం, రాజకీయం లో అన్యాయాన్ని ఎన్నడూ సహించని నార్ల, రాష్ట్రపు ముఖ్యమంత్రులను సైతం ఖాతరు చేయని సన్నివేశాలు కోకొల్లలు. ఆంధ్రదేశపు ముఖ్య ముఖ్యమంత్రులైన - టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, పి.వి.నరసింహారావులతో ఢీకొట్టాడు నార్ల. కాసు రెడ్డిగారు అయితే, ఆంధ్రజ్యోతి పనివిధానాన్ని రోజువారీగా (1969), పత్రికాస్వేఛ్ఛని అంతరించేందుకు అసెంబ్లీలో చట్టాన్ని ప్రవేశపెట్టగా, పత్రికారంగం యావత్తూ విరోధించి, బిల్లును వెనక్కితీసుకునేలా ముఖ్యమంత్రిని చేయగలిగిన ఖ్యాతి, నాయకత్వం మన నార్లదే. ప్రముఖ పత్రికాసంపాదకుడు, మానికొండ చలపతిరావుగారు (నేషనల్ హెరాల్డ్ దినపత్రిక, సంపాదకులు), నార్ల నివాసాన్ని తరచుగా దర్శించి, నార్లతో ఎన్నో చర్చలు, సంభాషణలు జరిపేవారు. బౌద్ధ సంస్కౄతికి ప్రతిబింబంగా నార్ల అనేక వస్తువులు, జ్ౙాపిలకు సంగ్రహం చేసుకునేవారు.
నార్ల రచనలు రసరమ్యాలు, రమణీయాలు
ప్రముఖ సంపాదకులేకాక, రచయితగా, కధలు, కవితలు, నాటికలు, దేశచరిత్రలు, వ్యాసాలు, ప్రసంగాలు, పుస్తకాలపై విశ్లేషణలు కోకొల్లలుగా వెలిసినా, నార్లను గర్వించే ఆలోచనావాది, రచయిత, తన అసమర్ధతను పదేపదే చెప్పుకున్నా, ఎదురులేని వక్తగా తన ప్రతిభను నిరూపించుకున్నారు.
సౌరభ సంకలనాలు
నార్ల వారి సాహిత్యం యావత్తునీ, వివిధ తరగతుల్లో విభజించి, ఏడు భాగాలుగా ప్రచురణకు నోచుకొని, సాహితీప్రేమికులకు కానుకగా మిగిలింది. వాటిని, దేశచరిత్రలు, సాంఘిక నాటికలు, వ్యాసాలు, పౌరాణిక నాటికలు, సాహిత్య రచనలు, సంస్కౄతి, సాహిత్యం, మతం, వర్తమాన సంఘటనలు, జీవిత చిత్రణలు అని రసరమ్యంగా, రమణీయంగా దర్శనం చేయించారు. నార్ల వారి రచనలు, వాటి పేర్లు, హేతువాదాన్ని చెప్పకనే చెప్తాయి. ఉదాహరణకు, నార్ల, సీతజోస్యం, నరకంలో సత్యహరిశ్చంద్ర, పురాణ వైరాగ్యం (అసంపూర్తి వ్యాసం),నవయుగాల బాట నార్లమాట అన్న శతకం, యిలా ఎన్నో చెప్పవచ్చు.
వలదన్న సాహిత్య అకాడమీ పురస్కారం
సంపాదకుని తర్వాత, నాటక రచయితగా అవతారం ఎత్తారు నార్ల. 1981 లో నార్ల వారి నాటకం - సీతజోస్యం - సాహిత్య, ఆధ్యాత్మిక రంగాల్లోని ప్రజల్లో మంచి ఆసక్తి రేకెత్తింది. అయితే, ఏ అకాడమీనుంచి పురస్కారం అందుకున్నారో, ఆ సంస్థనుంచి ప్రచురించే పత్రికలోనే రచనపై విమర్శనాత్మకమైన రచనను ప్రోత్సాహించడం, పద్ధతికాదని, బిరుదుని తిరస్కరించిన శైలి నార్ల వారిది. నార్ల జీవితంలోని అనుభవాలు, వాదోపవాదాలు, అభిప్రాయాలు, ప్రసంగాలు, ప్రబోధాలు, చెణుకులు, చురకలు, పరిచయాలు, పరిచయాలను అన్ని కలిపిన స్మౄతిలిఖితాలను కొన్ని ఏరికూర్చి, 'కదంబం'గా చాలా పేరుతెచ్చింది. చాలా రచనలు ఆంధ్రప్రభలో ముద్రితమయినా, పలుకుబడివర్గం నుంచి వచ్చిన యిబ్బందులవల్ల అవి మధ్యంతరంలోనే ఆగిపోయాయి.
'తెలుగువాడీ ఆత్మగౌరవ ఉద్యమానికి చేదోడు, ప్రోత్సాహం
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు శ్రీకారం చుట్టిన తెలుగువాడి ఆత్మగౌరవానికి ఎదురైన అవమానాన్ని ఎదుర్కొనడంలో ఆచరించిన ఉద్యమానికి, నార్లవారు కూడ తనదైన శైలిలో చేయూత, ప్రోత్సాహం,తెలుగుదేశం స్థాపనలో భాగస్వామ్యం వహించారు. సాంస్కౄతిక వ్యవహారాలపై, రామారావుగారి ప్రభుత్వానికి సలహాదారుగా నార్లవారు తన సలహాలను, సంప్రదింపులను అందించారు.
కుటుంబమంతా వైద్యుల మయం
ధర్మపత్ని సులోచనాదేవి సహకారం ఎప్పుడూ చెప్పుకునేవారు నార్ల. అనేక విశ్వవిద్యాలయాలు నార్లకు డాక్టర్ ప్రదానం చేసినా, ఆయన ఎప్పుడూ పేరుతో దాన్ని జోడించుకోలేదు అన్నది విశేషం. అష్టదిగ్గజాలవంటి సంతానం నార్లకు. పరిమితంపై అచంచలమైన అవిశ్వాసం. నలుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. అందరూ వైద్యులూ, వైద్యులనే వివాహమాడారు. శ్రీమతి నార్ల తప్పితే, అందరూ డాక్టర్లే అంటారు. రెండు సంస్కౄతులు, భాషలమధ్య వివాహాలు తనకు సంతౄప్తినిచ్చాయని చెప్పారు. సంతానం ఎంత పట్టుపట్టినా, నార్ల మాత్రం విదేశాలకు వలస మార్చలేదు. వచ్చిపోతూండడమే తప్ప.
జీవితాంతం వెంటాడిన గ్రంధాలయం, హేతువాది నిజ దేవాలయం
నార్ల వారి పుస్తకాలు, నిజనేస్తాలు. మనసుల్ని, మనుషుల్ని నిజస్వరూపులుగా తీర్చిదిద్దేవి పుస్తకాలే. మెదడుకి మేత పుస్తకాలే అంటారు. ఎవ్వరినీ, వాటిని చదవనిచ్చేవారు కాని, తీసుకోనిచ్చేవారు కారు. ఎన్నో సంగ్రహాలయాలు, విశ్వవిద్యాలయాలు, ఆయన గ్రంధాలయంపై కన్ను వేశాయి. ఆయన చివరి శ్వాస వరకూ వాటిని చెక్కుచెదరనీయలేదు. వాటి సమక్షంలోనే ఆయన ప్రాణం వదిలాదు. నార్ల వారికి నిజ నేస్తాలు - పుస్తకాలు, నేస్తాలు. నార్ల మరణం తర్వాత, భార్య సులోచన చాలాకాలం నిర్వహించి, చివరకు అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి భూరి విరాళంగా అందజేయడం తెలుగుకళ్ళు చేసుకున్న పుణ్యం. తెలుగు మేధ అందుకున్న మరింత తేజోకాంతిమయం. హైదరాబాదులో ప్రతీ ఏట, నార్ల పేరట స్మారక ఉపన్యాసాలు, సభాసమావేశాలు జరగడం పరిపాటి.
నార్ల వెంకటేశ్వరరావు గారికి నిజమైన స్మౄతినివాళి, తనకు ప్రేమాభిమానపాత్రమైన పత్రికారంగంలోని సంపాదకునిగా, రచయితగా, వెలిబుచ్చిన కొన్ని మచ్చుకైన అభిప్రాయాలను పున:శ్చరణ చేసుకోవడం కన్నా, ఆయన ఆత్మకు శాంతి లేదు, రాదు.
'నార్లావారి సునాదాలు
అనంత కోటి ముక్కలుగా చీలుతున్న ఈ భూగోళం మీద మనుషులందర్నీ కలిపే మార్గం ఒకటుంది. అదే వార్తావాహిని.
ప్రజల సరసన నిలచి ప్రధనమ్ము నడుపుట పరమ ధర్మమోయి పత్రికలకు.
ప్రభుత వక్రమౌను పత్రికలేకున్న
వేగం జర్నలిష్టుల వేదం.
పత్రికయె నియంత పక్కలో బల్లెమ్ము పత్రికయె ప్రజాళి పట్టుగొమ్మ.
వేయి ప్రశ్నలుండు విజ్ౙానవేత్తకు ప్రశ్నలుండబోవు పామరునకు విజ్ౙుడౌను నరుడు జిజ్ౙాస.
వార్త పక్షాన వదంతిపై యుద్ధం, స్వాతంత్ర్యం పక్షాన నిరంకుశంపై యుద్దం. న్యాయం పక్షాన అన్యాయం పై యుద్ధం.
వార్తనేక మౌను ప్రాక్పశ్చమమ్ములు వార్తవలన స్వేఛ్ఛ పరిధి పెరుగు వార్త లేక వసుధ వర్ధిల్లనేరదు.
పదవినున్నవారు మదమ్మత్తులైనచో పట్టి పీకనట్టి పత్రికేల? తోకముడుచు పులని లోకమ్ము నమ్మదా?
పత్రికా రచయిత ప్రతిహారిగా నిల్వ అవని నిద్రపోవు నాదమరచి అతడు నిద్రపోవగతియించు భద్రత.
వర్తమాన జగతి పరివర్తనాలపై స్వేచ్ఛతోడ వ్యాఖ్య సేయనట్టి ఎడిటరెందుకోయి ఏటిలో గలుపనా.
పత్రికొక్కటున్న పదివేల సైన్యము.
పత్రికా రచనను పడుపు వౄత్తిగా మార్చు వెధవకంటే పచ్చి వేశ్య మేలు తనువు నమ్ము వేశ్య, మనసును కాదురా!
నార్లవారి శతజయంతి ఉత్సవాలు త్వరలో ... 1808 - 1908
ప్రతిభామూర్తి జయంతి, వర్ధంతి సాధారణమే. కాని, శతజయంతి నిజంగా, శతధా, సహస్రధా, జరుపుకోవడం, సర్వదా హర్షనీయం. నార్ల వారి ఆశయాలు, ఆశలు, ఈ ఏడాదిపాటు సింహావలోకనం చేసుకుని, అమలుపాటి కార్యక్రమాల్ని ప్రణాలికాబద్ధంగా విజయవంతంగా ఆచరణకు నోచుకుంటే, అంతకన్న అర్ధం, పరమార్ధం, లేవు, రావు.
'నార్లా జయంతి సందర్భంగా, తెలుగు రథం నుంచి ఘననివాళిని సమర్పించుకుంటూ ...
కొంపెల్ల శర్మ - తెలుగురథం.