Saturday, December 27, 2008

రాజ వాగ్గేయకారుడు - స్వాతి తిరునాళ్ వర్థంతి.


అభినవ త్యాగరాజు, పద్మనాభదాసుడు, రాజవాగ్గేయకారుడు - స్వాతి తిరునాళ్

పుట్టుకతోనే మహారాజ యోగభోగాలు


ఆ రోజు 5వ మేష, 988, మలయాళ శకంగా వచ్చిన తేదీ. మనందరి పరిభాషలో చెప్పాలంటే, తేదీ 16 ఏప్రిల్ 1813. స్వాతి నక్షత్రాన జననం. 'గర్భ శ్రీమాన్ శ్రీరామవర్మ కులశేఖర పెరుమాళ్ మహారాజా', జన్మ నక్షత్రం తెలియక పోతే, పోలిక చెప్పలేని పేరు. సదాచార, సత్సంప్రదాయాల ట్రావంకోర్ రాజకుటుంబ వారసుడు ఆవిర్భవించాడు. సంప్రదాయ కర్ణాటక సంగీత కుటుంబంలో మరొక ఆణిముత్యం, ధౄవతార జనించిన సంఘటన. వారసత్వం లేకుండ వున్న పరిస్థితిలో, స్వాతి తిరునాళ్ తల్లి మహారాణి, సేతు లక్ష్మిబాయి అధికారం స్వీకరించిన, రెండేళ్ళకే - జన్మించిన సమయం. పుట్టుకతోనే మహారాజు యోగం లభించిన వైనం. ఆగర్భ మహారాజు అని చెప్పాలి కదా. సంగీత త్రిమూర్తులతోపాటు, అరుణాచల కవిరాయ, గోపాలకౄష్ణ భారతి ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్న కాలమది.
తిరునాళ్ పిన్నప్రాయంలోనే అధిక భాషలు నేర్చుకునే వుత్సాహం చూపించాడుట. విశిష్టశైలిలో సంగీత, సాహిత్యాలను సన్మిశ్రం చేయగలిగిన ప్రతిభాశాలి. 16 వ ఏటనే రాజ్యాధిపత్యాన్ని స్వీకరించి, సమర్థనీయ పరిపాలనాధికారాల్ని నిర్వహించడంలో వన్నెకెక్కిన విశిష్టమూర్తి.

స్వాతి తిరునాళ్ ముందు కాలంలో, కేరళ రాజ్య సంగీతస్థాయి, ముఖ్యంగా "అట్టకథలు" అనే కీర్తనలను ఆయన పూర్వకుటుంబీకులు, అశ్వతి తిరునాళ్, రచించారు. అంతకు పూర్వం, కథకళి శైలి సంగీత, నౄత్య కళలతోనే సాహిత్య, సంగీతాల్ని నియంత్రించుకోవడం జరిగిందని అనిపించిన వైనాలు.

కర్ణాటక సంగీతజ్ౙానం, కేరళ సంగీత సంప్రదాయ ప్రక్రియల్లోకి అన్వయించినా, 'కథకళీ వైపు ఆయన సంగీతప్రస్థానం సాగలేదు. ఎందరో విద్వాంసులు, సాహితీకారులు, మహారాజు ఆశ్రయాన్ని పొందిన దాన్ని బట్టి, తిరునాళ్ వహించిన శ్రద్ధాసక్తులు అందరినీ ఆశ్చర్యపరచాయి.

'హరికథా ప్రక్రియకు ప్రాముఖ్య, ప్రాభవాలు కేరళలో కలిగించిన ఖ్యాతి స్వాతి కే దక్కినది. స్వయంగా రూపొందించిన 'కుచేలోపాఖ్యానం', 'అజమిలోపాఖ్యానం', సంస్కౄతంలో రచించాడు. మహారాష్ట్రలో రూపుదిద్దుకున్న 19 వ శతాబ్ది చివరినాటికి కర్ణాటక సంగీత చాయలను తాకింది. తంజావూర్ రాజాశ్రయం పొందిన 'అనంత పద్మనాభ గోస్వామీ ని, తిరునాళ్ ఆహ్వానించి, గురువుగా స్వీకరించి, హరికథా కార్యక్రమాలని నిర్వహించేలా ఏర్పాట్లు చేశాడు. తిరునాళ్, 'ఉత్సవ ప్రబంధం' అన్న హరికథను కూడ రచించాడు.

'సోపాన సంప్రదాయా సంగీతం కేరళలో బాగా ఆదరణ పొందుతుండగా, హిందూస్థానీ సంగీత చాయలు రవంత కూడ సోకని పరిస్థితి. ప్రముఖ విద్వాంసుడైన తంజావూర్ రంగ అయ్యంగార్, ఆస్థాన కళాకారుడిగా నియమించాడు. తదుపరి, తిరునాళ్ ఆస్థానంలో ప్రముఖ వైణిక విద్వాంసుడు, రఘ్నాథ రాయర్, సారంగి విద్వాంసుడైన చింతామణి భాగవతార్ కూడ ప్రవేశించడం జరిగింది.

స్వాతి తిరునాళ్ సంగీత కౄతుల గురించి, విస్తౄత పరిశోధనలను జరపవలసిన అవసరం ఎంతైనా వుంది. 600 కౄతులను సేకరించి, గతంలో ప్రచురించబడ్డాయి. కౄతులు ముఖ్యంగా సంస్కౄతం, మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో లభ్యంకావడం ఆనందకరమైన విషయం. ప్రముఖ 'మణిప్రవాళా శైలిగా సంస్కౄత - మలయాళ భాషల్లో కలిపి రచించడమే కాక, ప్రముఖ రాగాల్లో, హిందూస్తానీ సంగీతపు రాగాలు కూడ కలిపి, ఎప్పుడూ వినని రాగాలకు ప్రచార,ప్రాశస్త్య గౌరవాలు కల్పించిడం పట్ల వాగ్గేయకారుడి విశిష్టత వెల్లడైంది.
తిరునాళ్ రచించిన సంగీత సాహిత్య కౄతులను - కీర్తన, పదం, వర్ణం, తిల్లానా, ప్రబంధములుగా విభజించవచ్చు.

ఆయన రచించిన 'నవరత్నమాలికా, 'నవవిధ భక్తి మంజరీ పేరున 300 కి పైగా కౄతులను చెప్పుకోవలసిన ప్రత్యేకత సంతరించుకున్నాయి అని సంగీత విద్వన్మూర్తులు చెప్పడం జరిగింది. పదవర్ణాలు ప్రత్యేకంగా, సంగీతపరంగా చెప్పుకునే 'రిథం' నుంచి వచ్చే హావ, భావ విన్యాసం, విశిష్టమైన ప్రకాశవంతమైన ప్రక్రియాసారంగా చెప్పుకోవాలి.
స్వాతి తిరునాళ్, వాగ్గేయకారుడు, ఆయన పూర్వ సంగీత విద్వాంసుల్లాగే, 'పద్మనాభా భక్త సేవా పరాయణుడు. ఆయన పదరచన , 'పన్నగేంద్ర శయనా ఎనిమిది చరణాలతో నాయిక ఉదయం నుంచి రాత్రి వరకు పొందిన వివిధానుభూతుల్ని, అనువైన రాగాల్లో సౄష్టించడం జరిగిన తీరు అనేక మన్ననలను పొందింది. వర్ణాల్లోకి వస్తే, 'స్వామిని రమ్మనవే, 'యిందుముఖి నీ సమయా కౄతులు తిరునాళ్ ప్రతిభకు నిదర్శనంగా నిలచి పోయాయి. తిల్లానాలను కూడ రచించడం జరిగింది.
అత్యంత ప్రతిభ ఆవరించిన జీవంపై ఆయువుకు కూడ అసూయేమో మరి. అందుకే, యింత ప్రతిభావంత రాజవాగ్గేయ కళాకారుడికి 34 వ ఏటనే ఆయువు నిండింది. స్వల్పకాలంలో అనల్ప సంగీతసౄష్టిని కావించి, అసమాన ప్రతిభాపాటవాలని పొంది, కీర్తిప్రతిష్ఠాలు సంపాదించిన స్వాతి తిరునాళ్ కు 'అభినవ త్యాగరాజూ బిరుదు కడు సమంజసమే కాక, ఆయనకు సరిసముల్ని ఎన్నిక చేయడం సులభతరమైన పనికాదని పలువుగు అభిప్రాయపడడం కూడ సమంజసమే.
స్వాతి తిరునాళ్ ప్రసిద్ధ కౄతులు, రాగాలు


'పరిపాహి గణాధిపా' (సావేరి), 'రాసవిలాసా (కాంభోజి), 'సారసాక్షా (పంతువరాళి), 'జగదీశ సదా (నాటకురింజి), 'కారణం వినా కార్యం' (కాంభోజి), 'స్మర హరిహరి పాదారవిందం' (సామ), 'భావయామి రఘురామం (సామ), 'భావయే శ్రీ గోపాలం' (పున్నాగవరాళి), 'చలమేలా (శంకరాభరణం), 'సరసిజనాభా (కాంభోజి), 'సుమసాయకా (కాపి), 'అలరసార పరితాపం' (సురటి), 'రామచంద్ర ప్రభూ (సింధుభైరవి), 'ఛలియే కుంజననో' (బౄందావన సారంగ), ప్రఖ్యాతి పొందిన వాటిలో మచ్చుతునకలు, ఉదాహరణకు మాత్రమే అని చెప్పాలి. స్వాతి తిరునాళ్ రచించిన యితరములైన వాటిలో, 'పద్మనాభ శతకం', 'శ్యనందూర పురవర్ణన ప్రబంధం), 'భక్తిమంజరీ, ఆయనకున్న సంస్కౄత భాషాపటిమకు ప్రత్యక్ష నిదర్శనాలు.
అభినవ త్యాగరాజు, పద్మనాభదాసుడు, రాజవాగ్గేయకారుడు గా కీర్తింపబడిన స్వాతి తిరునాళ్ 25 డిసంబర్ 1846 న కీర్తిశేషులైనా, సంగీతకళా జగతిలో నిత్యనూతనంగా కొనియాడబడే విశిష్ట సంగీతకళాకారుడుగా భావించడం జరుగుతూనేవుంది.
స్వాతి తిరునాళ్ కు తెలుగురథం ఘననివాళి ని సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

No comments: