Tuesday, November 25, 2008

'ఫిడేళ్ వాదనకళకు సార్ధక నిర్దేశకుడు - 'ద్వారం నాయుడూ (1893 - 1964)


ఫిడేల్ వాదనకళకు సార్ధక నిర్దేశకుడు - 'ద్వారం నాయుడూ (1893 - 1964)


వాయులీనం లో విలీనమైన 'ద్వారం'
ఫిడేల్, వైలెన్, వాయులీనం. ఈ పదాలు సాధారణంగా అర్ధంకానివి. పదాలు వేరైనా, వాటి అర్ధం, పరమార్ధం, ఒక్కటే. లలితకళల్లో, అజరామరమైన భాగంగా విరాజిల్లే సంగీతం. అందులోనూ వాద్యసంగీత విభాగం. వాయులీనం. దానినే, ఫిడేల్, వైలెన్ అని పిలవడం పరిపాటి. సంగీత కళకు, కళాకారులకు మధ్య వారధిలా చెలామణి అవుతున్న పరికరం. ఎందరో కళాకారుల చేతుల్లో ఒదిగిపోయి, వినయంగా తన్నుతానే సమర్పించుకున్న సంగీత పరికరం. అటువంటి కళాకారుల్లో, ప్రముఖులు, ప్రప్రధములు - 'ఫిడేళ్ నాయుడుగారు. ఆయనే 'ద్వారం' నాయుడుగారు. ఆయన, ఎవరో, వేరెవరో కాదు - ద్వారం వెంకటస్వామి నాయుడు గారు.
'ద్వారం' ప్రపంచానికే ముద్దుపేరు
సంగీత కళాజగతి కి ముద్దు పేరు 'ద్వారం'. సంగీత కచేరీ వేదిక పైన ప్రక్కనే స్థానం, సహవాద్యకారులుగా చెలామణి అవుతున్న దశనుంచి దిశానిర్దేశం కావించి, పరిపూర్ణ వాయులీన (వైలన్ లేక ఫిడేల్) సంగీత వాద్య పరికరానికి, మూగవోయిన పనిముట్టుని 'మెలోడీ ఫీస్ట్' గా మార్చడానికి కంకణం కట్టుకుని, కౄషిని సాధించిన ఘనత కేవలం ద్వారం నాయుడి గారి కళాజీవన ప్రస్థానం లో మరువలేని, మరింక మార్చలేని మైలురాళ్ళు. 20వ శ. చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుల్లో ప్రధమగణంలో వినుతికెక్కిన ద్వారం వెంకటస్వామి నాయుడు గారు 8 నవంబర్ 1893 న బెంగుళూరులో దీపావళి రోజున కళ్ళు తెరవడంతో సంగీతజగతిలో మరింతగా కాంతి, వెలుగు చోటుచేసుకున్నాయి. తండ్రి వెంకటరాయుడు, ఆర్మీ లో కమీషన్ అధికారిగా ఉద్యోగం చేయడం, ఆయన ఉద్యోగ విరమణ తర్వాత విశాఖపట్నంకు వలసవెళ్ళారు. అనకాపల్లి దగ్గరలోని కాసింకోట వద్ద స్థిరపడ్డారు. అన్న వద్ద వైలన్ విద్యను అభ్యసించిన ద్వారం తండ్రికి కూడ ఈ వైలన్ విద్యలో అభినివేశం వుండడం విశేషం. తాత పేరును సార్ధక నామధేయం చేసుకున్న వెంకటస్వామి నాయుడు గారు, తన అన్నగారు వెంకటకౄష్ణయ్య, తాత దగ్గర వైలన్ నేర్చుకుంటున్న సమయంలో, మన నాయుడుగారు కూడ అన్నగారి వైలన్ ను కోరిక మేరకు రహస్యంగా కదిలించేవారట. ఫలితంగా, ఆరేళ్ళకే తమ్ముడిని వైలన్ విద్యలో పెట్టవలసివచ్చింది. దీనికి కారణాలు - తన వైలన్ ను ఏం చేస్తాడో అని అన్నకు భయం, నాయుడుగారికి కలుగుతున్న అమితమైన శ్రద్ధాసక్తులు. అంతేకాక, ముఖ్యంగా, నాయుడుగారికి చిన్నప్పుడు చూపులో కొంచెం సమస్య వున్న కారణంగా చదవడం, వ్రాయడం సమస్యగా మారుతున్న వైనంలో, సంగీతం పై దౄష్టి మరల్చవలసి వచ్చింది. ప్రాధమిక శిక్షణ తర్వాత, ప్రముఖులు పండిత సంగమేశ్వరశాస్త్రిగారి వద్ద నాయుడుగారు వైలన్ వాదనంలో నిష్ణాతులు అవ్వడం జరిగింది. అందుకే నాయుడుగారు తరచుగా నల్లరంగు కళ్ళజోడు ధరించేవారు.
ఫిడేల్, వైలన్
నాయుడుగారు 14వ ఏటనుంచే వైలన్ తో తాదాత్మ్యం పొందడం, ప్రముఖ సంగీత విశ్లేషకుడు మారేపల్లి రామచంద్రరావు ద్వారం వైలన్ ప్రతిభను గమనించి, డైమండ్ ఉంగరాన్ని కానుకగా యివ్వడమే కాక, ద్వారం వారిని 'ఫిడేల్ నాయుడూ అని బిరుదుని యిచ్చేరట. వైలన్ నే ఫిడేల్ అని పిలుస్తారని చాలా మందికి తెలియని విషయం. ఫిడేల్ అంటే 'ఫిడులా' అని జర్మనీ దేశపు పదంనుంచి ఫిడేల్ అని రూపాంతరం చెంది నాయుడుగారి దగ్గరకు చేరుకుంది. అప్పటినుంచి, ఫిడేల్, ఆంధ్రదేశపు సంగీతజగతితో మమైకం అయింది.
వైలన్ పుట్టు పూర్వోత్తరాలు
సంగీత వాద్య పరికరమే కొత్తగా అనిపించే, వైలన్, 17శ. మధ్యకాలంలో వాయులీన పరికరాలకు ప్రాణంపోసే పాశ్చాత్యుల పుణ్యమా అని, కర్నాటక సంగీత సంప్రదాయంలో అన్యాపదేశంగా ప్రవేశించి, తిష్ఠ వేసుకుంది. మొదటిసారిగా, 'వడివేలూ అన్న విద్వాంసుడు, ప్రముఖ సంగీత వాగ్గేయకారుడు శ్రీ ముత్తుస్వామి దీక్షితులవారి కీర్తనలని వైలన్ పై అందించగా, దీక్షితులవారి సోదరుడు బాలు (1786-1859) దక్షిణభారత సంగీత వినువీధుల్లోకి వైలన్ ను తీసుకొచ్చిన ఘనత మనకు అలవడిన సంప్రదాయం. తర్వాత, 19శ. ఆఖరి పాదంలో, కర్నాటక సంగీతధోరణుల్లో, వైలన్ తో సంపూర్ణ ఏకైక వ్యక్తితో కచేరీ చేయడం ప్రారంభం అవడం, దీనికి తిరుకొడికవల్ కౄష్ణ అయ్యర్, గోవిందస్వామి పిళ్ళైలు రంగ్రప్రవేశం చేశారని సంగీత చరిత్ర చెబుతున్న కధనాలు.
వీణ, వేణువు, నాదస్వరం తో వైలన్ ను చేర్చిన ఘనత
వాద్యసంగీతజగతిలో అంతవరకూ నిత్యనూతనంగా అలరించిన, వీణ, వేణువు, నాదస్వరం ల ఘనమైన వరసలో వైలన్ ను నిలబెట్టిన ఘనత మాత్రం మన 'ఫిడేళ్ ద్వారం నాయుడుగారే అన్నది మాత్రం సత్యం. వీటికి వైలన్, వాయులీన ప్రక్రియ ఏమాత్రం తీసిపోదని కూడ నిరూపించిన నిష్ణాతవిద్వాంసుడు - ద్వారం నాయుడు.
ద్వారం గురించి ప్రముఖుల కౄషి, ప్రశంసలు
నాయుడుగారి ప్రతిభను చిత్రించిన రవివర్మ
పాశ్ఛాత్య, భారతీయ సంగీత మెలకువలను ఆకళింపుచేసుకున్న నాయుడుగారి వైలన్ పరికరాన్ని కచేరీలో నియంత్రించే విధివిధానాలు, నాయుడుగారి భంగిమ, చేతివేళ్ళతో తంత్రిణీస్వరలక్షణాలన్నింటినీ, ప్రముఖ చిత్రకారుడు రవివర్మ తనదైన ప్రత్యేకమైన శైలిలో నాయుడుగారి కచేరీ చేసున్నట్లు చిత్రం విశ్వవ్యాప్తంగా ఆశ్చర్యానందభూతుల్ని చేసింది. రవివర్మ చిత్రంలో నాయుడుగారి మనోధర్మ సంగీత లక్ష్యలక్షణాల్ని ప్రతిభావంతంగా ప్రదర్శించారు అన్నది మహామహుల అభిప్రాయంగా నేటికీ వినవస్తుంది.
ప్రముఖ సంగీతవిద్వాంసుల మెచ్చుకోళ్ళు
ద్వారం నాయుడుగారి కళాప్రతిభను కొనియాడుతూ, వివిధరంగాల్లోని ప్రముఖులు ప్రశంసలను చెప్పడం కూడ జరిగింది. అందులో, ప్రముఖ సంగీతవిద్వాంసులు - టి.యల్. వెంకట్రామ అయ్యర్, టి.వి.సుబ్బారావు, పి.సాంబమూర్తి, అరియకూడి రామానుజ అయ్యర్ (సంగీత కచేరీ సంప్రదాయానికి విధులు నిర్ణయించినవారు), తిరుకొడికవల్, ఆఖరున చెప్పుతున్నా, మొదటగా ప్రస్తావించదగిన ప్రముఖ సంగీత కళాకారుడు - శ్రీ సెమ్మనగుడి శ్రీనివాస అయ్యర్ గారు లాంటి ప్రభౄతులు ద్వారంవారి ప్రతిభను వేనోళ్ళ కొనియాడడం ఆ రోజుల్లో సర్వసామాన్యం.
ప్రముఖ కవులనుంచి అనుభూతులు
సంగీత విద్వాంసులతోపాటు, ప్రముఖ ఆంధ్రులు, కవులు కూడ తమ కవిత్వంలో ద్వారం వారిని మరవలేదు. వారిలో, చెళ్ళపిళ్ళ, విశ్వనాధ, బాలాంత్రపు రజనీకాంతరావు, గుర్రం ఝాషువా, గుంటూరు శేషేంద్రశర్మలను మరువలేం. సమాజంలోని అన్నివర్గాల ప్రతినిధులనుంచి ద్వారం నాయుడు గారు పొగడ్తలను అందుకున్నారు.
ప్రపంచ వైలన్ విద్వాంసుడు 'యెహుది మెనుహిణ్కి శౄంగభంగం
ప్రతిభ వున్న చోట అధికారంతోపాటు అహంకారం కూడ అధికమైన కళాకారులను ఆవరిస్తాయి అంటారు. ప్రపంచ ప్రఖ్యాత వైలన్ విద్వాంసుడు, 'యెహుది మెనుహిణ్ ఒక సన్నివేశంలో తన వైలన్ పరికరాన్ని, ద్వారం వారికి చూపించడానికి కూడ అంగీకరించలేదట. కాని, నాయుడుగారి వైలన్ వాదన ప్రభంజనం గమనించాక, ఈ మహానుభావుడు ఆశ్చర్యపోవడమే కాక, చివరికి ఆయన ఘనపరికరాన్ని నాయుడుగారికిచ్చి, వాయించమని వినయప్రకటన చేశాడట. అంతాకాక, ద్వారంవారిని ఆహ్వానించాడట. అదండీ, మన తెలుగు వెలుగు, తెలుగు తేజం తెలుగుదనం!
గురుదేవ్ రవీంద్రుడు కలిపిన స్వరగళం
ద్వారం నాయుడుగారి వైలన్ వాద్య కచేరీని కొద్ది నిముషాలే చూడగలగను అన్న గురుదేవులు రవీంద్రనాధ్ ఠాగూర్, అన్ని ముఖ్యకార్యక్రమాలను అనుకున్నవి మరచిపోయి, పూర్తి కచేరి వినడమే కాక, నాయుడుగారి కీర్తనలకు రవీంద్రుడు స్వరం, గళం కలిపి గానం చేయడం సంగీతచరిత్రలో ప్రముఖ సంఘటనగా నిలచిపోయింది.
నిలయవిద్వాంసుల కార్యక్రమాల్లో నాయుడుగారి వైలన్ వాద్యమే ఎప్పుడూ!
ఆ రోజుల్లో ఆకాశవాణి కార్యక్రమాల్లో, ద్వారం నాయుడుగారి వైలన్ కచేరీలు కోకొల్లలుగా వచ్చేవి; అంతేకాక, ప్రకటించిన కార్యక్రమాలకు అంతరాయం వచ్చిన సందర్భాల్లో, నాయుడుగారి కచేరీయే తరచుగా ప్రసారం చేసేవారట. అలాగే, కాకినాడ సరస్వతీసంగీతసభ కార్యక్రమానికి, అనుకున్నట్లుగా, గురువౄద్ధుడు, గోవిందస్వామి పిళ్ళై రాలేని పరిస్థితిలో, యువకుడు ద్వారం వారి వైలన్ కచేరీ పెట్టాలని సలహా యిచ్చారట. వయోభేదం అడ్డురాదన్న మాటకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
సంగీతకళాశాలకు వన్నెలు
ప్రముఖ హరిదాస పితామహులు ఆదిభట్ల నారాయణదాసుగారు విజయనగరం సంగీత కళాశాల మహామహోపాధ్యాయులుగా వున్నప్పుడు, ద్వారం వారిని కేవలం 25 ఏళ్ళకే (1919 లో), విద్యార్ధిగా పరీక్షకు వచ్చినప్పుడు చూపించిన ప్రతిభ నేరుగా వైలన్ శిక్షణ విభాగానికి అధిపతిగా నియామకానికి దారితీసింది. అంతేకాక, ఆదిభట్ల వారి తర్వాత, ద్వారం వారే విజయనగరం కళాశాల స్థానాన్ని 1936 లో ఆక్రమించారు అన్నది ద్వారం వారి ఘనప్రతిభ వెల్లడయింది.
ప్రతిభాపురస్కారాలతో ద్వారం విశిష్ట ప్రక్రియలు
ద్వారం వారిని వరించిన బిరుదులు, పురస్కారాలు, సన్మానాలు, అగణితాలు.
1938 లో వైలన్ సోలో ప్రదర్శన, తమిళనాడులోని వెల్లూలు లో యిచ్చారు.1952 లో అంధుల సహాయసంస్థకు నిధులను చేకూర్చేందుకు, డిల్లీలోని జాతీయ శాస్త్రీయ సంస్థ లో ప్రదర్శన యిచ్చారు.
న్యాయవాది పి.వి.రాజమన్నార్ యింట్లో ప్రముఖ అంతర్జాతీయ వైలన్ విద్వాంసుడు యేహుది మెనుహిన్ ఆశ్చర్యం మేరకు ద్వారం వారి కచేరీ జరిగింది.కర్నాటక సంగీత కచేరీ కార్యక్రమాల్లో వైలన్ ను వాడవచ్చు అన్న భావకుల్లో ద్వారం ప్రధములు అని చెప్పుకోగలిగిన ఘనత.సంగీతకళ పై ద్వారం ఎన్నో వ్యాసాలు - 'తంబూర వింతలు, విశేషాలూ అన్నది మచ్చుతునక.
సంగీత కళానిధి (1941 - మద్రాసు మ్యూజిక్ అకాడమీ); కళాప్రపూర్ణ (1950 - ఆంధ్రవిశ్వవిద్యాలయం);సంగీత నాటక అకాడమీ, లలితకళలు (1953); పద్మశ్రీ (1957 - భారతప్రభుత్వం); ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన సంగీత కళాకారుడుగా నియామకం (ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీ, ఉపాధ్యక్షులు).రాజలక్ష్మీ పురస్కారం (1992 - నాయుడు స్మారక సంస్థ, చెన్నై);శతజయంతి 1993 - భారతప్రభుత్వంవారి స్మారకచిహ్నంగా నాయుడుగారి తపాలాబిళ్ళ.
ద్వారం సలహాలు
విద్యార్ధులకు, వర్ధమాన కళాకారులకు, కనీసం ఒక్కరోజైనా సరే సాధన తప్పకూడదు అని సలహా చెప్పారు. ఒక్కరోజు తప్పితే - ఎవరి తప్పులు వారికే తెలుస్తాయి, రెండురోజులు అయితే - ప్రేక్షకులు, రసికులు కూడ తెలుసుకునే తప్పులు అని విభజించారు. నాయుడుగారు సంగీతం ఒక 'శ్రవణ తపస్సూ అని వర్ణించారు.
ద్వారం నాయుడు గారి స్మారక సంస్థలు
చెన్నైలో స్మారకసంస్థ, విశాఖపట్నంలో స్మారక కళాక్షేత్రం తో పాటు, విశాఖపట్నం, చెన్నైలో నాయుడుగారి విగ్రహాలు ఆయన ప్రతిభకు తార్కాణాలు, నిదర్శనాలు.
'ద్వారం' వారిపై ప్రముఖుల అభిప్రాయాలు
దేశాన్ని వైలన్ వాద్యంలో ముంచెత్తి, సంగీత నాదాన్ని అందంతో, ఆనందంతో అందజేసిన మహావిద్వాంసుడు; సంస్కౄతీ పునరుద్ధరణ సమయంలో 'ద్వారం' లేని సంగీత ప్రపంచాన్ని ఆలోచించడం కష్టతరం. (కళాక్షేత్ర, వ్యవస్థాపకురాలు, ప్రముఖ నాట్యకళాకారిణి - రుక్మిణీదేవి అరండలే)
ఆకాశవాణి లో ద్వారం కచేరి విని ప్రభావితమైన సంఘటన - నా జీవితంలో ఒక అమోఘమైన మైలురాయి. (నూకల సత్యనారాయణ, ప్రముఖ సంగీత విద్వాంసులు)
వైలన్ విద్వాంసుడిగానే 'నూకలా ప్రస్థానాన్ని ప్రారంభించి, ప్రముఖ గాత్ర సంగీత ప్రతిభావిద్వాంసులుగా నిలిచారన్నది జగద్వితిమే.
కర్ణాటక సంగీత సంప్రదాయ ధోరణి లో ఆచరించే ఒక 'ప్రోటకాళ్(సదాచారం) ప్రకారం, సహవాద్య సంగీత కళాకారుడే, గాత్ర సంగీత కళాకారుడి వద్దకు వెళ్ళడం ఆనవాయితీ. అయితే, ద్వారం వారి వద్దకు సుప్రసిద్ధ గాత్ర సంగీత విద్వాంసులు తమంత తామే స్వయంగా వచ్చి పలకరించే విధానాన్ని బట్టి, ద్వారం వారి ప్రతిభ, గౌరవం, మర్యాద, వర్ణనాతీతమైనే చెప్పాలి; కళాకారుడికి సాధనాభ్యాసాలు నిత్యావసరం అన్న సూత్రాన్ని, మనసావాచాకర్మణా, నమ్మి, మనోధర్మ ప్రవౄత్తిని ఆచరించిన కళాకారుల్లో ప్రముఖులు ద్వారం నాయుడుగారు. ఒకసారి విజయవాడ కచేరీకి వచ్చి, 'మహిమ తెలియ తరమా' అన్న కౄతి పల్లవి సరిగ్గా కుదురుట లేదని, అభిప్రాయాలను అల్పస్థాయి కళాకారులను కూడ సంప్రదించడం జరిగేది. (ప్రముఖ సంగీత విశ్లేషకులు - టి.ఆర్.సుబ్రహ్మణ్యం).
నాయుడు గారి నిరాడంబరత
యింత పేరు ఎలా తెచ్చుకున్నారు అని ద్వారం వారిని అడిగితే, 'ఎట్లా వాయించాలో నాకు తెలియదు; ఏదో వాయించాను; బాగుందో, లేదో, నాకు తెలియదు" అని తరచు ద్వారంవారు సమాధానం చెప్పడం వారి నిరాడంబరతా వ్యక్తిత్వానికి, హౄదయవైశాల్యతకి, మానవతకి నిదర్శనం అని పలువురి భావన.
ద్వారం ప్రియరాగాలు
ద్వారం నాయుడు గారిని, వారి ప్రియసంగీత రాగాలు ఏమిటని అడిగితే, తరచుగా వచ్చే రాగాలు - కాపీ, బేహాగ్, నళినకాంతి రాగాల్లో సుదీర్ఘమైన 'కరవై'లతో ప్రదర్శించే రాగాలు అని చెప్పడం, భక్తులు దైవప్రార్ధనలో మునిగిపోయి పరిసరాలను మరపించి రాగదేవతను ప్రత్యక్ష దౄశ్యం కలిగించే అనుభవం తరచుగా అయేదిట. 'ఖమాశ్, 'నీలాంబరీ లాంటి రక్తి రాగాలను అందించడంలో అధ్బుత కౌశలత్వం, విశిష్ట సౌందర్య నాదాలుద్భవించేవట. ద్వారం వారు, విజయనగర సంగీత కళాశాల నిర్వాహకత్వంలో అధిక విద్యార్ధులు వైలన్ విభాగంలోనే, గాత్ర సంగీతభాగంలో కన్న, అభ్యసించేందుకు సంసిద్ధత ప్రదర్శించేవారని, అందరూ, ఎప్పూడూ, ఈనాటికీ, అనుకునే మాట.
ఆంధ్ర సంగీత జగతి చేసుకున్న పుణ్యం
సంగీతకళానిధి గా విశ్వవిఖ్యాతమైన ప్రతిభను తెచ్చుకున్న ద్వారం వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ సంగీతప్రియులు చాలా అదౄష్టవంతులని, దక్షిణ, అఖిల భారత సంగీత కార్యక్రమాల్లో ప్రాతినిథ్యం వహించిన వారిలో ద్వారం వారు ప్రధముల్లో ప్రధములు అని చెప్పాలి. కళాకారుడికి వుత్పన్నమయ్యే ప్రతిభాపాటవాలు విశిష్టమై, విశ్వవ్యాప్తమైతే, తోటి వర్ధమాన కళాకారుల ప్రశంసలు కూడ తప్పక లభిస్తాయి అన్నది ద్వారం వారి విషయంలో నిజం అయి కూర్చుంది. అదే వారికీ, వారి సహకళాకారులకీ సౌభాగ్యం.
విశ్వసంగీతజగతి ద్వారాలు తెరుచుకున్నప్పుడల్లా, ద్వారం వెంకటస్వామి నాయుడుగారు, వారితోపాటు, వారి మాంత్రిక వైలన్ వాదనవైభవం లేనిదే ద్వారాలు తెరచుకోవు అన్నదాంట్లో ఆశ్చర్యం, అతిశయోక్తి లేదు.
ద్వారం వారి జయంతి, వర్ధంతి నవంబర్ నెలలోనే సాధారణంగా జరగడం యాదౄఛ్ఛికం. నవంబర్ 8 వారి జయంతి అయితే, నవంబర్ 25 న వారు మహాభినిష్క్రమణం చెందారు.
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి: అన్న నానుడి, బహుశ ద్వారం వారి వాయులీనవాదన సౌరభం విన్న తర్వాత వచ్చినది కావచ్చు.
గురజాడ పదానికి ద్వారం స్వరం
'దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా' అన్న దేశభక్తి గీతానికి ప్రముఖ కవి గురజాడ సాహిత్యరచన కావిస్తే, ఆ గీతానికి స్వరరచన చేసింది మన ద్వారం నాయుడు గారే. గురజాడ శత వార్షిక సంఘం, హైదరాబాద్ సంచిక వారు ప్రచురించారు. సింధుభైరవి రాగం - మిశ్రచాపు తాళం (హనుమత్తోడి రాగ జన్యం) లో నడచిన వైనం ఆ నాడు యావద్భారతాన్ని పులకాంకితుల్ని చేసింది.
ద్వారం వారికి, వర్ధంతి సందర్భంగా తెలుగురథం కళానివాళిని వినమ్రంగా సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగు రథం.

Saturday, November 22, 2008

సత్యసాయిబాబా జన్మదినోత్సవం - సహస్రచంద్ర దర్శన దినోత్సవం


'నన్నొక మిత్రునివలె స్వీకరించండీ - సత్యసాయిబాబా



సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న, విద్యలన్నియు నేర్చి విలువ సున్నసత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న, దాన ధర్మాల సార్ధకత సున్నసత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న, బహుళ సత్కార్యలాభంబు సున్నసత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్న, పదవుల నేలిన ఫలము సున్న. - శ్రీ సత్యసాయిబాబా
మానవతాగుణాలైన - సత్యం, ధర్మం, శాంతి, ప్రేమలను నాలిగింటినీ సమతులనం చేసి, అమౄతవాక్కులను అందించారంటే, అది సామాన్య మానవునికి దుర్లభమైన విషయం.
జీవితం ఒక సవాలు - దానిని ఎదుర్కో, జీవితం ఒక అనురాగం - దానిని అనుభవించు, జీవితం ఒక కల - సాధించి ఫలింపజేసుకో, జీవితం ఒక ఆట - తెలుసుకొని క్రీడించు.
జీవితం - దౄశ్యానికి, అదౄశ్యానికి మధ్య వారధిలాంటృఇది అని జీవితానికి యిచ్చిన నిర్వచనాలు.
మానవుడి రూపాన మహనీయుడు, మాధవుడు - నిత్య 'సత్యా రత్నాకరుడు. మనిషి - మనీషి మధ్య 'సత్యసాయీ.
ఆస్తికత - నాస్తికత మధ్య మన వేదవాదాలు
తనను తాను తెలుసుకోగలిగిన ప్రతీ మనిషీ దేవుడే! నాలో ఈస్వేరు డున్నాడు; ఆ ఈశ్వేరుడే అన్ని సేయిస్తాడు; సేయించే పన్లన్నీ నాలో ఈస్వెరుడే సేస్తాడు అని రావిశాస్త్రిగారు 'పాపీ అన్న రచనలో చెప్పడం జరిగింది. దేవుడెక్కడో లేడు, మనందరి నివేదనలకోసం మనలోనే దాక్కున్నాడు. ఆశ, అసూయా అనేవి లేకపోతే మనిషి భగవంతుడు అవుతాడు. ఇందుగల డందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపహతుం డెందందు వెదకి చూచిన నందందే గలడు అని పోతనగారు సెలవిచ్చారు. కాని, ఓ సందర్భంలో ఆయనకు కూడ, కించిత్తు సందేహం వచ్చింది - కల డందురు దీనులయెడ, కలడందురు పరమయోగిగుణముల పాలం గలడందురన్ని దిశలను, గలడు గలండనెడువాడు గలడో లేడో' అని ఆ భాగవతంలోనే సుసందేహాన్ని అంకురించాడు. ఏమైనా, మనుషులు నిమిత్తమాత్రులు, మానవాతతీత శక్తి ఆడించే నాటకంలో పాత్రలు. ఏదైనా, ప్రపంచంలో ఎంతమంది ఆస్తికులున్నారో అంతమంది భగవంతుళ్ళున్నారు; ఒకరి భగవంతుడిలో ఒకరు తప్పు పట్టడానికి లేదు. మామూలు మనుషులు మనుష్యులను నమ్ముకుంటారు; భక్తుడు దేవుణ్ణి తప్ప నమ్మలేడు - అని అన్నారు ప్రముఖ రచయిత కొడవటిగంటివారు.
ఈ రోజు భారతదేశంలో ప్రజలు - దేవుళ్ళు, దైవబలం, దైవభీతి, ఆస్థికత, నాస్తికత చుట్టూ -తమ దైనిక జీవితాన్ని గడుపుతున్నారు. ఎవరి స్థాయిలో వారి జీవితానికి అర్ధాన్ని, పరమార్ధాన్ని పొందడానికి తాపత్రయపడుతున్నారన్నది వాస్తవం. వీరి స్థాయిని, స్థానాన్ని కొలవడానికి, తూచడానికి త్రాసులు, తరాజులు కూడ వారే తయారు చేసుకుంటున్నారు. వారి ప్రమాణాలను వారే నిర్ధారించుకుంటున్నారు. విశ్వస్థాయిలో ఒక ప్రమాణత, ప్రమాణత రెంటినీ కోల్పోతున్న చిత్రాతిచిత్రమైన పరిస్థితుల్లో కూరుకుపోతున్నాం.
దేవుడు - మనిషి మధ్య అనాదిగా సాగుతున్న ప్రయాణం రైలులో అనుకుంటే, ఆ రైలుబండి ఏ పట్టాలపైన నడుస్తుందో ఎవ్వరికీ తెలియని పరిస్థితిలో వున్నాం. అంటే - మనకు రైల్వేవారు తరచుగా చెప్పే - బ్రాడ్, మీటర్, నేరో గేజ్ లాగా రకరకాలుగా నడుస్తున్న చరిత్రగా మారిపోతున్న వైనం. మతాలు గతులు తప్పుతున్నాయి. మేధలకు మతులు పోతున్నాయి. మతకారులు కేవలం వేషభాషల్లోనే నీతిచంద్రికలను వల్లెవేస్తున్నారు. ఆచరణల్లో అదౄశ్యగోచరమవుతున్నారు.
నిత్య సత్య సందర్శనమూర్తి
పతనం చెందిన మానసిక స్థితినుంచి, మానవత్వాన్ని ఉద్ధరించి, మానవునికి సౄష్టిలో సంక్రమించిన మహోన్నతిని మరల ప్రాప్తింపజేయుటకొరకే అన్నట్లు, శాంతి ఆనందాలనూ, సుఖసంతోషాలనూ మరల మానవలోకానికి అందించటం కొరకే అన్నట్లు ఒక అవతారమూర్తి అవతరించాడు. మానవాకారంలో దర్శనం యిచ్చే మహనీయుడు. దేవునికి మరోపేరు భగవాన్. నిత్యశ్రీమంతుడు. సత్యసంపన్నుడు.
అత్యంత ఆధునికమైన యోచన, ఆలోచనావిధానం. ప్రపంచాన్ని ప్రభావపరుస్తున్న ప్రణవమూర్తి. ఒక మానవతామూర్తి. మహాపురుషుడు. అవతారచక్రవర్తి. పరంపరాగతమైన సంప్రదాయపు పుట్టుక. విశిష్టమైన ఆలోచనావిధానం. నేటి మానవుని దు:ఖానికీ, అశాంతికీ, అసమానతలకూ మూలకారణాలను మహామేధావులంతా తమతమ అణ్వేషణలో విఫలమవుతుండగా, మనిషిలోని మానవతా సుగుణాలు అధ:పతనంలోనే వున్న కారణం అని చెప్పిన సమన్వయమూర్తి. మానవతా విలువలన్నీ అంతరించి పోతున్న తరుణంలో ఆ విలువల్ని మానవునిలో పున:ప్రతిష్ఠ కావించిన కారుణ్యమూర్తి. నిజమైన ఆధునికతకు నిదర్శనం. ఆయన సందేశాల్ని, విశ్లేషణల్నీ ప్రపంచ భాషలన్నింటిలో ప్రచురించబడిన ఘనత ఈయనది. ఏమిటి ఈ ఆలోచనావిధానం? ఎందుకీ ఆలోచనావిధానం? అన్న ప్రశ్నలకు ఎంతమాత్రం సమాధానం దొరకని పరిస్థితిని కల్పించిన మహావ్యక్తి, మహాపురుషుడు, సంపూర్ణమానవమాత్రుడు - ఎవరో కాదు, ఆయనే, భగవాన్ గా కోట్లాది భక్తిలచే నిత్యం, క్షణం క్షణం కొనియాడబడే మార్గదర్శి, శ్రీ సత్యసాయిబాబాగారు.
'రత్నాకరా వంశ ప్రాభవం
దుర్భర క్షామానికి మారుపేరు ఆ ప్రాంతం. అలనాటి రాయలసామ్రాజ్యభాగపు అనంతరపురం జిల్లాలోని పుట్టపర్తి అనబడే కుగ్రామంలో పెద్ద వెంకప్ప రాజు - ఈశ్వరమ్మ పుణ్యదంపతులకు పున్నామ నరకం నుంచి మోక్షం కలిగిందని సంతోషంతో కదలాడుతున్న క్షణాలు. ఆ రోజు 1926, నవంబర్ 23. విష్ణ్వాంశసంభూతుడైన శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం చేసుకుంటున్న తరుణంలో జన్మనిచ్చినందులకు ఆ దంపతులు ఆ బిడ్డకు 'సత్యనారాయణరాజూ అని సార్ధకనామం చేశారు. సాధారణత అనుకోకుండా జరిగే స్థితి. అదే అసాధారణత అయితే, నమ్మశక్యంకానివి జరుగుతాయి. అదే జరిగింది. మన రాజు భూమ్మీద పడగానే, సప్తస్వరసహిత సంగీతవాద్యవిశేషనాదఝరి అవతరించిందట. వారిది రత్నాకర వంశంలోని కుటుంబం. ఫలితంగా, రత్నాకర సత్యనారాయణరాజు. అంతేకాదు, తల్లికి కలలో దేవుడు కనిపించడం, గర్భవతి కావడం, ఒక నీలకాంతిస్వరూపం ఆమెలో ప్రవేశించగా ఆమె మూర్ఛిల్లడంతోపాటు, బాలుడు జన్మించిన వెంటనే, పక్కబట్టల్లో, యింటి ఆవరణలో, సర్పదర్శనం లాంటి ప్రత్యేక కధనాలను కూడ మనం సాయి జీవితచరిత్రలో దర్షనం అవుతాయి. ఈ కధనాలకు పూర్వాపరాలు కూడ కనిపిస్తాయి. అటుయిటు సవరణలూ కనిపిస్తాయి. రత్నాకరుడి జన్మ విషయంలో బహుకధనాలు మనకు గోచరిస్తాయి. ఏదిఏమైనా, సాధారణం మాత్రం కాదని చెప్పగలిగే స్థితి.
బుక్కపట్నం చారిత్రాత్మక కధనం
బుక్కపట్నం గ్రామంలో చదువుని ప్రారంభించిన రాజు, తన ఎనిమిదేళ్ళ ప్రాయంలోనే - నాటకం, సంగీతం, కవిత్వం, నటనాది కళల్లో ప్రావీణ్యం సంపాదించి గ్రామంలో తనదైన ప్రతిభను ప్రదర్శించి గుర్తింపు పొందాడని ఆయన జీవితవిశేషాల్లో కనిపిస్తాయి. తర్వాత, ఉరవకొండకు చదువు నిమిత్తం మారడం జరగింది. ఆ రోజు రాజుకు 14 ఏళ్ళ ప్రాయం. 1940 మార్చ్ 8 రోజు. పాములకు, తేళ్ళకు, ప్రసిద్ధమైనది ఉరవకొండ ప్రాంతం. నల్లతేలు కుట్టిందన్నారు. అపస్మారకంలో పడడం కూడ జరిగిందట. తిరిగి మెలకువ వచ్చాక ఆరోజు సాయంత్రం రాజు ప్రవర్తన వింతగా వుందని అందరు గమనించడం జరిగింది. తిండి తినకపోవడం, సుదీర్ఘకాలంపాటు మౌనాన్ని పాటించడం, ఆధ్యాత్మిక శ్లోకాల్ని చదవడం, హిందూ ధర్మశాస్త్రోల్లోని విషయాల్ని చెప్పడం జరగ్గా, తల్లిదండ్రులు కంగారు పడడం జరిగిందన్నది కూడ చారిత్రాత్మక కధనాలే. కుటుబం వత్తిడితో రాజు ఉరవకొండకు వెనుతిరగడం అదే నెల జూన్ లో జరిగిందట. రాజు తనంతట తానే శిరిడి లోని సాయిబాబా ఫకీర్ కు తర్వాత అవతారమని చెప్పుకొనడం జరిగింది. సత్యసాయిబాబా చరిత్ర గ్రంధకర్త కస్తూరి నారాయణ అందించిన వివరాల ప్రకారం, 20 అక్టోబర్ 1940 నాడు, తన 14వ ఏట పుస్తకాలకి, చదువుకి స్వస్తి చెప్పడం, కుటుంబంనుంచి తన నిష్క్రమణ చేయడం జరిగింది.
సత్యసాయిబాబా ప్రారంభ సందేశం
తనదైన తొలిమాటలు - 'నా భక్తులు నన్ను పిలుస్తున్నారు - నా విధి నాకుందీ అని ప్రకటించి, మూడు రోజులపాటు, ఒక తోటలోని చెట్టుకింద గడపడం, గుమిగూడిన ప్రజలకు భక్తిగీతాలు, భజనలు అందించాడట. ఈ సంఘటన నుంచే భగవాన్ సత్యసాయిబాబా గా అవతారం తీసుకున్నట్లు కస్తూరి కధనంగా గోచరిస్తుంది. ఆప్పటినుంచి, సత్యసాయిబాబా ఆధ్వర్యంలో ఆధ్యాత్మక, మానవీయత, సేవాతత్పరత, త్రివేణీ సంగమమై, సమీకరణం జరిగిందన్నది మాత్రం సత్యం, శివం, సుందరం. ఆనాటినుంచీ నేటివరకూ తిరుగులేని, తిరిగిరాని జీవితాన్ని సాగిస్తూ, కోట్లాదిప్రజలకు విశ్వవ్యాప్తంగా భగవాన్ గా, మహాపురుషుడుగా, అవతారమూర్తిగా, అపరభగవంతుడుగా విరాజిల్లుతున్నాడు. 1942 సంవత్సరం బుక్కపట్నం పాఠశాల వివరాల్లో సత్యసాయి వివరాలు కనిపిస్తాయి. 1944 లో తన గ్రామంలో జరిగిన మందిరనిర్మాణం, యిప్పుడు పాతమందిరంగా పిలుస్తారు. ప్రశాంతినిలయంగా పుట్టపర్తిలో 1948 నుంచి ఒక అంతర్జాతీయ విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక ప్రాంగణంగా అలరిస్తూనే వుంది. కుగ్రామం అయిన పుట్టపర్తి, భూనభోంతరాళంలో ఏకైక గుర్తింపు ప్రాంతం, పుణ్యస్థలి - ప్రశాంతినిలయం - నిలయవిలసిత భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అన్నది నిజం, వాస్తవం, సత్యం.
సత్యసాయి జీవనగమనంలో మలుపులు, మెరుపులు
శాఖాహారి, జంతుహింసకు వ్యతిరేకి, బీదలపై అపార సానుభూతి, పెద్దలు, వికలాంగులపై కరుణాదౄష్టితో మెలగే సత్యసాయి ఆశువుగా భజనలను రచించి, స్వరపరచి, గానం చేయడం ఎనిమిదవ ఏటనుంచే ప్రారంభమైందని చరిత్ర వివరిస్తోంది.
1958 లో సత్యసాయి భక్తులకోసం 'సనాతన సారధీ ప్రచార పత్రిక విడుదల జరిగింది. 1960 నుంచి పాశాత్యదేశ భక్తులను కూడ అమితంగా ఆకర్షించింది. యింతవరకూ, విశ్వవ్యాప్తంగా భక్తులు ప్రశాంతి నిలయాన్ని సందర్శించడమే కాని, సత్యసాయి ఒకేసారి ఉత్తర-తూర్పు ఆఫ్రికాని 1968లో యాత్ర చేశారు. రత్నాకర సత్యనారాయణ రాజు అనే పేరుగల సత్యసాయిబాబాకు యిద్దరు సోదరులు - శేషమరాజు(పెద్ద), జానకిరామయ్య(చనిపోయిన తమ్ముడు).
2003 లో శరీరానికి తుంటిపై ప్రమాదం. 2005 నుంచి చక్రాల సైకిలును వాడడం జరుగుతుంది.
'సత్యసాయి సంభాషణలూ (1:31:198) (29.9.1960) ప్రకటన ప్రకారం, సత్యసాయి యింకా 59 సంవత్సరాలు జీవించడం జరుగుతుందని చెప్పడంకూడ జరిగింది.
ఆడ ఏనుగు - సాయిగీత - చిన్నప్పటినుంచి తన జీవితాన్ని సత్యసాయి సన్నిధిలోనే గడిపి, ఈ మధ్యనే చనిపోయింది. ప్రస్తుతం, సత్యగీత అనే ఏనుగు ఆ స్థానాన్ని ఆక్రమించింది.
విశ్వాస వాస్తవాలమధ్య సత్యసాయి ప్రచారోద్యమం
సర్వసంప్రదాయసేవాస్థలిగా పుట్టపర్తిలోని ప్రశాంతినిలయం విరాజిల్లింది. చైతన్యజ్యోతి (విశ్వవిద్యాలయం), ఆధ్యాత్మిక సంగ్రహాలయం, ప్లానిటోరియం, రైల్వేకూడలి, సుందర ప్రకౄత సమగ్ర క్రీడాస్థలి, పరిపాలనాప్రాంగణం, ఎయిర్ పోర్ట్, సమాజావసర సేవల రూపాన మౌలిక సదుపాయాలు, వెరసి పుట్టపర్తి-ప్రశాంతనిలయం ప్రముఖ అంతర్జాతీయ కేంద్రంగా భాసిల్లుతోంది.
అగ్రజులు, అగ్రశ్రేణుల భక్తశిఖామణి బౄందాలతో నిత్యం విరాజిల్లే ప్రశాంతి నిలయం.ఈ సమూహం మధ్య సత్యసాయి ఆశీర్వచనాలు, అభినందనలు, దర్శనాదర్శనాలు, కానుకలు, బహుమతులు, ప్రాప్తాప్రాప్తాల మధ్య ఆశ-నిరాశల మధ్య భక్తజనసమూహం.
ప్రముఖులైన నాయకులు, అధినాయకులు, అతిరధుల మధ్య, ఒక మిలియన్ జనాభాతో 180 దేశాలనుంచి ప్రతినిధులమధ్య తన 83 వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సహస్రచంద్రదినోత్సవం - వేయి పున్నమిల దర్శనభాగ్య సందర్భంగా ఈ ఏడు జన్మదినోత్సవానికి చాలా ప్రధాన్యతతో సన్నాహాలు జరుతున్నాయి.
ప్రశాంతి నిలయం, బౄందావనం (కడుగొడి - బెంగుళూరు దగ్గరగా), సాయి శౄతి కుటీరం (కొడైకెనాల్, తమిళనాడు) సత్యసాయి నివాస ప్రాంతాలు.
ధర్మక్షేత్ర-సత్యం (ముంబాయి), శివం (హైదరాబాద్), సుందరం (చెన్నై), మూడు ముఖ్య సందర్శక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. సత్యసాయి ఆత్మకధ కూడ సత్యం-శివం-సుందరం' అవడం యదౄచ్ఛికం.
నిత్య దర్శనం, పూజలు, వ్రతాలు, ప్రత్యేక పండుగలు, ఉత్సవాలు, సత్యసాయి జన్మదినం, భక్తుల రాకకు ప్రోద్బలాలు, ప్రేరణలు, ప్రోత్సాహకాలు.
మహత్యాలు ఉన్నచోట విమర్శలు, ఎదురాటలు, ఎదురీతలు తప్పనివి, అవే సత్యసాయిని కూడ వరించాయి. రెండు ధోరణులూ, సవ్యసాచిగా, సమాంతరంగా సత్యసాయితోపాటు, సహజీవనం చేస్తున్నాయి.
మతబోధకులుగా, ప్రచారకర్తగా, గురువుగా, భగవాన్ గా, సేవాతత్పరుడుగా, సమాజసేవాపరాయణుడిగా, రత్నాకర సత్యనారాయణ రాజు అనే వ్యక్తి - భగవాన్ సత్యసాయిబాబా గా - ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక చరిత్రలో సువర్ణాక్షరాలతో తనదైన అధ్యాయాలను సంపుటీకరించుకున్నారన్నది మాత్రం నిస్సందేహం. సంశయంలేని సత్యం.
ప్రశాంతి నిలయం నుంచి వినబడే వేదఘోషతోపాటు, అన్యతరహా ఘోషలు కూడ ప్రతిధ్వనిస్తున్నాయి; కాని, అవి నిరంతరం ప్రశాంతనిలయంలోకి చొచ్చుకుపోతున్నాయో లేదో, చెప్పలేని స్థితిగతులు.
ప్రచారం, బోధలు, రచనలు, ప్రచురణలు
సత్యసాయి చెప్పిన ప్రతి మాట, బాట సాక్షీకరింపబడుతోంది. చరిత్రలో భాగంగా నిర్మితమవుతోంది. స్థలపురాణం రోజురోజుకూ మరో యితిహాసంగా మారుతోంది. భారతావనిలో భావితనానికి ఒక మలుపుని, మెరుపుని ప్రసాదిస్తున్నాయి. రామకధరసవాహిని ప్రవహిస్తోంది. భజనలు అభంగధోరణిలో సాగుతున్నాయి. విద్య, వైద్య, సమాజావసర రంగాల్లో సకలోచితసదుపాయాలు కలిగిస్తున్నారు. మానవతా విలువలను ప్రదర్శించే వలువలను నిర్మాణంచేసి, ప్రజకు అందిస్తున్నారు. సత్యం, ధర్మం, అహింస, ప్రేమ, శాంతి పంచ వేదాలుగా వేదఘోషతో ప్రవచనలు కావింపబడుతున్నాయి.
దేహశుద్దిలేని తెల్లని బట్టలు, భావశుద్ధిలేని దైవపూజ, పాకశుద్ధిలేని బంగారుపీటలు, వాక్కుశుద్ధిలేని శ్లోకపఠనం, నేటి నాగరికులు పాటించు పద్ధతి - అని సత్యసాయి నిత్యం బోధిస్తూంటారు.
మానవతే కులం, ప్రేమయే మతం, హౄదయవాదమే భాష, నిత్యసత్యసందర్శనమూర్తే భగవంతుడు అన్నది సత్యసాయి మంత్రం, సూత్రం.
సత్యసాయి పథంలో ముందుకు నడుస్తూ, తమ నడకల్ని, నడతల్ని, సరిదిద్దుకుంటూ మార్గదర్శకంలో ఎన్నో భక్తులు, సంస్థలు, తమతమ కార్యాలను నిర్వహించుకునే క్రమంలో నిమగ్నమయ్యారు.
ప్రశంసలతోపాటు, విమర్శనలను సరిసమంగా సత్యసాయి ఎదుర్కుంటున్నారు. సమాధానాలు చెప్పవలసిన చోట చెప్పుతున్నారు. అవసరం లేదనుకున్న సందర్భాల్లో వాటిని యధాతధంగా వదిలేస్తున్నారు.
ఉపశౄతి
పుట్టపర్తి సత్యసాయిబాబాను సర్వధర్మ సమభావనకు, అధ్యాత్మికపరమైన విశ్వజనీనస్ఫూర్తికి మారుపేరుగా విరాజిల్లుతున్నారు.
నవంబర్ 23 న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి జన్మదినోత్సవం సందర్భంగా, తెలుగు రథం నుంచి అభినందనల్ని తెలుపుకుంటూ, ఆశీర్వచనాల్ని కూడ తెలుగురథం ఆశిస్తోంది.
శుభం భూయాత్. ఓం. శాంతి:
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

Thursday, November 20, 2008

సర్, భారతరత్న, శాస్త్రవేత్త 'రామన్'


భారతరత్న - సి.వి.రామన్ - సాటిలేని శాస్త్రవేత్త

( 1888 - 1970 )
ధైర్యశాలి భావాలు
రాజకీయవాదులు విజ్ౙానరంగంలోకి ప్రవేశింపకూడదు
.
ప్రతీ ఏట జరిగే యిండియన్ సైన్స్ కాంగ్రేసు మహాసభలను భారతీయ ప్రధానులు, నెహ్రూ, యిందిరాగాంధీలు ప్రారంభించడం నచ్చని వ్యవహారం, సముచితం కాదు.
రాజీపడని రామన్ విజ్ౙాన పరిశోధనారంగానికి నిరంతర 'రామన్ ఎఫెక్ట్'
ఘనచరితస్థలం - జన్మస్థలం
సారవంతమైన కావేరీ డెల్టాప్రాంతానికి ప్రసిద్ధి చెందిన ఆ జిల్లాకు మూడు తలల రాక్షసుడి పేరు (త్రిశిర) నుంచి వచ్చింది. జిల్లా చరిత్ర రాజకీయ పరమైన పల్లవులు, చోళులు, నాయకరాజులు మరియు చివరగా రవి అస్తమించని తెల్లదొరల పరిపాలనాధోరణుల ప్రభావాలకు గురై బయట పడిన ప్రాంతం - తిరుచిరాపల్లి, క్రమేనా, తిరుచ్చి, త్రిచి గా కుచించుకుపోయింది. ప్రసిద్ధ శ్రీరంగనాధుడు (10 శ.), మ్యూజియం, జంబుకేశ్వరాలయం, రాక్ ఫోర్ట్, ప్రసిద్ధమైన చర్చిలు, సైంట్ జోసెఫ్ కాలేజీతోపాటు కల్లనై డాం (గ్రాండ్ ఆనకట్ట), 7వ శ. నాటి శివాలయం, శిత్తనవసల్ వద్ద జైన్ గుహాలయాలతో ప్రసిద్ధిపొందిన తిరుచిరాపల్లికి చారిత్రాత్మక, వైజ్ౙానిక పరంగా మరొక మైలురాయి - సర్.సి.వి.రామన్ ఈ గడ్డపై పుట్టడం భారతావని చేసుకున్న సుకౄతం. ఆ ధరణి చేసుకున్న పునీతవైనం వర్ణనాతీతం.
రామన్ కుటుంబ నేపథ్యం
చంద్రశేఖర్ అయ్యర్, పర్వతీ అమ్మాళ్ మధ్యతరగతి కుటుంబ దంపతులకు తమిళనాడు, తిరుచిరాపల్లి జిల్లా, అయ్యన్ పెటాయ్ గ్రామంలో 7 నవంబర్ 1888 న జన్మించారు. వ్యవసాయంతో ముఖ్యజీవనం చేసుకునే ఈ కుటుంబం, తండ్రి తిరుచిరాపల్లి హైస్కూల్ లో ఉపాధ్యాయకత్వం, విశాఖపట్నం లో భౌతికశాస్త్రంలో ఆచార్యపదవి, వీటితోపాటు, కళలైన, జ్యోతిషం, వీణ, వాయులీనవాదనంలో నైపుణ్యాలను కూడ సంపాదించడం బహుముఖప్రతిభకు ఉదాహరణం. తల్లి పార్వతీ అమ్మాళ్ తండ్రి కూడ గొప్ప సంస్కౄతపండితుడు.
రామన్ వ్యక్తిత్వ దర్పణం
వాల్టేర్ కాలేజీ లో యింటర్మీడియట్ చదివి, మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఎ. కై చేరిన రామన్, మొదటిరోజునే ఆంగ్లభాష ఆచార్య, యిలియట్, ప్రియశిష్యులలో ఒకడు అయ్యాడు. అనిబిసెంట్ ఉపన్యాసాలతో ఆకర్షితుడయ్యాడు. హిందూపురాణాలు - వ్యాసానికి ప్రధమపురస్కారం, బి.ఎ. లో ఎలిఫిన్ స్టన్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఎం.ఎ. పదార్ధవిజ్ణానశాస్త్రం, ధ్వనిశాస్త్రంలో ప్రయోగాలు, ఎవ్వరూ కనుగొనని లక్షణాలు అవ్వడంవల్ల, ఆచార్య జోన్స్, రేలేల ప్రశంసలను అందుకున్న ఏకైక వ్యక్తి. వేదాంతపత్రిక,లండన్ లో వ్యాసం ప్రచురణ, మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ. భౌతికశాస్త్రశాఖ చరిత్రలోనే ప్రధమశ్రేణి విద్యార్ధిగా సువర్ణాక్షరాలతో నిలచిపోయాడు. శారీరక దుర్బలత్వం, పరిశోధనకు అనుకూలించని శరీరం, వాతావరణం అని వైద్యులు అభిప్రాయాన్ని చెప్పినా, త్రోసిరాజని, రాజీపడని, నిరంతర పరిశోధనాపరుడు. 18 ఏళ్ళకే ఉద్యోగం సంపాదించిన రామన్, లోకసుందరి తో శాఖాంతర వివాహాన్ని చేసుకున్నాడు. వివాహమయినా, మనసంతా పరిశోధనలతోనే మునిగిపోయింది. కలకత్తా ట్రాం బండి రామన్ దశ, దిశలను నిర్దేశించింది. 'ది యిండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్శ్కు కార్యదర్శి మహేంద్రలాల్ సర్కార్ తో పరిచయం అయింది. రామన్ ప్రతిభకు గుర్తింపు, స్వతంత్ర ప్రయోగాలకి, ప్రత్యేక సౌకర్యం లభ్యం, రామన్ రాకతో సంస్థ ప్రతిష్ఠ పెరిగింది. కలకత్తా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు అశుతోష్ ముఖర్జీ ఆదరణకు గురయ్యాడు. 1915 లో భౌతికశాస్త్రంలో ఆచార్యపీఠం స్థాపనకు సర్ తారకనాధ్ పాలిట్ భూరివిరాళం యివ్వడం, ఆయన దౄష్టి రామన్ పై పడడం కూడ జరిగింది. అంతేకాక, పదవికి నిర్ధారిత నిబంధనలను సడలించి, రామన్ ని ఎన్నుకోవడం, ఆచార్యపదవిని చేపట్టడం జరిగింది.
రామన్ ప్రతిభకు కలికితురాయిలు
రామన్ ప్రతిభ వరించిన పదవులు, అధికారాలు ఎన్నో, మరెన్నో. భారతీయ శాస్త్రజ్ౙుల సంఘం, కార్యదర్శి(1919), బ్రిటిష్ విశ్వవిద్యాలయకాంగ్రెసు సభకు భారతీయప్రతినిధి (1922), కెనడా శాస్త్రీయ కాంగ్రెసు కు విశేషభారతీయప్రాతినిధ్యంలో, అనేకదేశాల్లో ప్రసంగాలు, రాయల్ సొసైటీ ఫెలోషిప్ సత్కారం, భారతీయ సైన్స్ కాంగ్రేసు స్థాపన (1924), నిరంతర పరిశోధన ఫలితంగా రష్యన్ సైన్స్ అకాడమీ ఆహ్వానం (1925), 'రామన్ ఎఫెక్ట్' పై ఆసియాఖండం నుంచి సత్కారం అందుకున్న మొట్టమొదటి శాస్త్రవేత్తగా నోబెల్ బహుమానం (1928), 15 సం. కలకత్తా విశ్వవిద్యాలయంలో అపూర్వ కౄషి, యిండియన్ యినిస్ట్యూట్ ఆఫ్ సైన్స్, డైరక్టర్ గా చేరడం, యిండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అవతరణ (1934), రామన్ స్వంత సంస్థ, రామన్ పరిశోధనాసంస్థ ప్రారంభం (1948), ప్రముఖ ఘట్టాలుగా చెప్పక తప్పదు.
రామన్ పరిశోధనాసంస్థ నుంచి ప్రముఖ శిష్యగణం
రామన్ పరిశోధనాసంస్థ నుంచి ఉద్భవించిన రామన్ ప్రముఖ శిష్యగణంలో, ముఖ్యంగా చెప్పవలసిన వారు - డా. హోమీ జె. బాబా, డా. సూరి భగవంతం, డా. విక్రం సారాభాయ్, డా.రామశేషన్ లను ప్రస్తావించకుండ రామన్ వ్యక్తిత్వం అసంపూర్ణమే.
సర్, భారతరత్న రామన్
స్వతంత్ర భారతావనిలో శాస్త్రీయ పరిశోధనారంగంలో కొత్త అధ్యాయం - విశ్వవ్యాప్త రామన్ కీర్తి - బ్రిటిష్ ప్రభుత్వం సత్కరించిన 'సఋ బిరుదుతోపాటు, ఎన్నో విశ్వవిద్యాలయాలు అందించిన గౌరవ డాక్టరేట్. 1954 లో భారతప్రభుత్వం అందించిన అత్యుత్తమ పురస్కారం 'భారతరత్నా సాటిలేనిది.
రామన్ నిర్మొహమాటం లేని ధైర్యశాలి
- ఎవ్వరికీ జంకని ధైర్యశాలి, స్వతంత్ర భావప్రకటనకు ఎన్నడూ వెనుకాడలేదు. రాజకీయవాదులు వైజ్ౙానికరంగంలో ప్రవేశించరాదు అన్న అభిప్రాయాన్ని నిష్కర్షగా ప్రకటించాడు.
- ప్రతీ ఏట జరిగే, భారతీయ సైన్స్ కాంగ్రేసు మహాసభలకు భారత ప్రధానులు, నెహ్రూ, యిందిరాగాంధి ప్రారంభించడం సముచితం కాదని రామన్ నిశ్చితాభిప్రాయాన్ని ప్రకటించాడు.
శాస్త్రీయ పరిశోధనాభరిత జీవితంలో - మరువరాని 'రామణ్ మెరుపులు
రామన్ శాస్త్రం-కళలపై పరిశోధనలో సన్మిశ్రమాలు
సంగీతశాస్త్రములో విశిష్టప్రవేశం - మౄదంగ వాదనంపై, శబ్దతరంగాలపై సాగిన ప్రయోగాలు - ఫొటోగ్రఫీ, రబ్బర్, ప్లాష్టిక్ పరిశ్రమలకు మంచి తోడ్పాటు అయిన రామన్ పరిశోధనల గురించి మరువరాని, మరువలేని మెరుపులు.
రామన్ - కొసమెరుపులు
1. బెంగుళూర్ లోని ఒక బ్యాంకర్ వద్ద రామన్ 75 వేలు వుంచడం, తర్వాత దివాలా అవడం తెలుసుకొని, 'నోబెల్ బహుమతి గ్రహీతకీ టోపీ పెట్టిన బ్యాంకర్ కు నోబెల్ పారితోషికం యివ్వడం సబబూ అన్న హాస్య చతురుడు.
2. కార్యసాధకులకు హంగులు, హార్భాటాలు అనవసరం. నోబెల్ బహుమతి కొరకు సాగించిన ప్రయోగానికి పెట్టుబడి కేవలం 200 రూపాయలే అన్న రికామీ వ్యక్తిత్వం, రామన్ ది.
3. జాతీయ పరిశోధనాలయాలపై - అనవసర/విపరీత ధనవ్యయం చేయడం సరిపడని పనిగా భావించాడు. ప్రయోగశాలల్లో శాస్త్రీయ పరిశోధనా పరికరాలను నిక్షేపం చేసెందుకుకే నిర్మీచారని - రామన్ వాదన.
4. ఎంత గొప్ప శాస్త్రజ్ౙుడో, అంత గొప్ప వక్త. క్లిష్ట శాస్త్రీయ విషయాల్ని జనరంజకంగా ఉపన్యాసం చేయగలిగిన మహామేధావి, మానవతావాది, శాస్త్రజ్ౙుల పరిశోధనలు ప్రపంచ ప్రజల సంక్షేమానికి వినియోగపడాలని చాటిచెప్పిన మహనీయుడు, మన రామన్.
5. జీవితమంతా శాస్త్రీయ పరిశోధనలోనే గడపడం - భారత దేశ కీర్తి పతాకాన్ని దిగ్దింతాలకు రెపరెపలాడించిన వైజ్ణానిక విశ్వభరిత విద్వన్మూర్తి - సర్, భారతరత్న, రామన్.
ఈ విశ్వాంతరాళంలో శాస్త్రం ఉన్నంతకాలం పరిశోధనలు, ప్రయోగాలు. యివి వున్నంతకాలం రామన్ కీర్తిని గణించడం, గుణించడం జరుగుతూనే వుంటుంది.
రామన్ జనన మరణాలు ఒకే నెలలో జరగడం యాదౄఛ్ఛికం. 1888 నవంబర్ 7 న జన్మిస్తే, 1970 నవంబర్ 21 నే కీర్తిశేషులయ్యారు రామన్.
ఆ మహనీయుని వ్యక్తిత్వానికి, ప్రతిభకు, ఈ సందర్భంగా తెలుగురథం నీరాజాలని అర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

Tuesday, November 18, 2008

ఏకైక మహిళా ప్రధాని - ఇందిరా గాంధి జయంతి


ఏకైక మహిళా ప్రధాని - ఇందిరాగాంధీ జయంతి


సాహసం అనేది లేకుండా మనిషి యింక ఏ యితర సద్గుణాలనీ ఆచరణలోకి తెచ్చుకోలేడు - యిందిరాగాంధి.
కుటుంబరాజకీయాలకి పరాకాష్ఠ
"రెండురకాల వ్యక్తులు రాజకీయాలలో గొప్పగా రాణిస్తారు; ప్రవర్తన లేకపోయినా ప్రతిభ వున్నవారు, ప్రతిభలేకపోయినా పైవారి క్రింద అణగిమణగి వుండేవారు" అని 'వె డెల్ ఫిలిప్శ్ అని ఓ ప్రబుద్ధుడు నిర్వచించాడు. ఈయనికి భారతదేశ రాజకీయాల గురించి అవగాహన వుందే లేదో తెలియదు కాని, యించుమించు మన రాజకీయాలని చూచాయగా చెప్పకనే చెప్పాడు. అటువంటి మనదేశపు రాజకీయవ్యవస్థలో మొట్టమొదట ప్రస్తావించవలసినది, తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూనే అని చెప్పాలి. ఆయన సుపుత్రిక, భారతదేశపు మూడవ ప్రధాని - యిందిరాగాంధి. ఆ తర్వాత ఆమె ప్రియ తనయుడు రాజీవగాంధి. కొంచెం విరామం వచ్చినా, ఈయన తల్లి సోనియాగాంధి పాత్రపై వాదోపవాదాలు వచ్చినా, ప్రస్తుతం మాత్రం ఈ విదేశీవనిత హయాంలోనే దేశం నడుస్తోంది అన్నదాంట్లో ఏమాత్రం సంశయం, సందేశం రానేరాదు. యిది సరిపోక, నెహ్రూ కుటుంబ నేటితరం నాయకుడు రాహుల్ గాంధీ కూడ రాజకీయ రంగప్రవేశం చేసి, తనదైన శైలిలో చురుగ్గా అడుగులు వడివడిగా ముందుకు వేసి, వచ్చీరానట్లు రాజకీయ వైకుంఠపాళీలో నిచ్చెనల్ని ఎక్కేసేందుకు సామగ్రిని తయారుచేసుకుంటున్నాడు. సంక్షిప్తంగా మన భారతీయ రాజకీయ ఆధునిక చరిత్రని అధికకాలం ఒకేఒక కుటుంబం నిర్ధారించినదనే చెప్పాలి. యిందులో సగభాగం, భారం మహిళానిర్దేశకత, దర్శకత్వం వహించడం అన్నది కూడ సత్యంగానే చెప్పాలి. నేటివరకూ, మన భరతదేశాన్ని పరిపాలించిన ఏకైక మహిళాప్రధాని మాత్రం 'యిందిరాగాంధీ.
జగమెరిగిన జాణ
కొందరు ప్రపంచంలోంచి పుట్టుకొస్తారు. మరికొందరు ప్రపంచం కోసం పుడ్తారు. యింకొందరు ప్రపంచపు చివరిటంచులవరకు పయనిస్తారు. అయితే ఈ మూడు విధానాలని ముప్పేటగా రంగరించుకుని కొందరు దర్శనమవుతారు. ఈ కోవలో గణనీయమైన అగ్రగణ్యులు కోటికొక్కరు, యుగానిక్కొరు మనకు దర్శనీయమవుతారు. సంభవామి యుగేయుగే అని శ్రీకౄష్ణుడన్నట్లు మనకు వరప్రసాదాలు లభ్యమవుతాయి. మన దేశచరిత్రలో అటువంటి అరుదైన ఆణిముత్యం, జగమెరిగిన జాణ - యిందిరా ప్రియదర్శని; అందరికీ చిరపరిచితురాలైన - యిందిరాగాంధి. మన భారతదేశానికి మొదటి మహిళా ప్రధాని. మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకి ప్రియతనయ. ఈమె తనదైన చురుకు, ఉరుకులతో దేశాన్ని ఒక చిన్నతరహా పాఠశాలలా, తాను ఒక ముఖ్య ఉపాధ్యాయురాలుగా ప్రజలకూ, తోటి ఉపాధ్యాయులకూ కూడ నవరసాలతో పాఠాలను నేర్పించిన నెలత - యిందిరా ప్రియదర్శిని.
గడచిన తొమ్మిది దశాబ్దాలు
దేశాన్ని ముందుకు నడిపించిన మహామనీషి. అభివౄద్ధికి ఆనవాలు. ధైర్యానికి కితాబు. సాహసానికి మారుపేరు. ఎక్కడ అడిగిడినా విజయేందిరగానే చెలామణీ అయింది. ఆమె పుట్టినప్పుడు పెట్టిన పేరు - యిందిరా ప్రియదర్శని. విశ్వరాజకీయ చిత్రపటంలో భారతావనికి పరమపదసోపాన స్థానాన్ని కలగజేసిన ప్రతిభామూర్తి. అభివౄద్ధి చెందుతున్న, వెనుకబడిన, బలహీన రాజ్యాలకి ప్రత్యేక పరిగణనలుండాలని పట్టుపట్టిన ఆదర్శమూర్తి. ప్రపంచశాంతికై కౄషి సలిపిన ప్రమధగణ ప్రతినిధి.
భారతదేశపు అతిపెద్ద రాష్ట్రం, ఉత్తరపదేశ్ లోని త్రివేణీ సంగమస్థలి అయిన అలహాబాదు నగరంలో, సుసంపన్నకుటుంబంలో జన్మించిన యిందిరా ప్రియదర్శని 19 నవంబరు 1817 న జన్మించింది - యిందిరా ప్రియదర్శని జవహర్ లాల్, కమలాభాయి లకు ఏకైక సంతానం. అందుకే గారాలపట్టి. యిందిరా విద్యాభ్యాసం - పూనా, శాంతినికేతన్, స్విడ్జర్లాండ్, యింగ్లండు లో జరిగింది. పదమూడేళ్ళకు 'వానరసేనా ను స్థాపించడం, ఈ సేన ద్వారా దేశంలోని ప్రముఖ యువతను సంఘటితం చేసి, దేశ స్వాతంత్ర్య సమరానికి సన్నిధ్ధులయ్యే వేదికకు శ్రీకారం చుట్టింది.
తిరుగులేని, తిరిగిరాని ప్రస్థానం
1942 దేశ స్వాతంత్ర్యచరిత్రలో చిరస్థాయి సంఘటన 'క్వీట్ యిండియా అయితే, అదే సంవత్సరం యిందిర ఫిరోజ్ గాంధిని వివాహమాడింది. రాజీవ్, సంజయలు కొడుకుల తల్లి, మాతౄత్వానికి చిహ్నాలు. పదవిలో ఉండగానే చిన్నకొడుకు సంజయగాంధి ని జోరు రాజకీయజోక్యధోరణిని ఆపలేకపోయి, 'అత్యవసర పరిస్థితీ పేరున దేశాన్ని కొరడాతో ఝళిపించి, భయభ్రాంతులతో పరిపాలించడానికి ముఖ్య హేతువు ఈ ప్రబుద్ధుడు. అయితే విధి నిర్ణయానికి, 1980 లో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించి పుత్రశోకానికి గురయింది. ఈ అనూహ్య పరిణామం యిందిరకు వ్యక్తిగతంగా, రాజకీయంగా క్రుంగదీసిందనే చెప్పాలి. ఏదో తెలియని ఆవేశం, అనాలోచిత నిర్ణయాలను తనదైన మంకుపట్టు పద్ధతులతో రాజకీయాన్ని, దేశాన్ని తన కొంగుచాటుగా, కొంగుముడితోనూ నడుపవచ్చు అనుకుని తిరుగులేని వడివడి అడుగులు కాకుండా అంగలు వేసుకుంటూ ప్రస్థానం చేసిన వైనాలు, రాజకీయం నుంచి ఉగ్రరాజకీయం వరకూ తనకు తాను తెలియకుండ సాగిపోవడం జరిగింది. ప్రోత్సహించిన ఉగ్రవాదం, పాముకు పాలు పోసి విషపు కోరలను నిశితం చేసినట్లుగా మారి, మనం పెంచిన విషనాగుకోరలే మనల్ని కాటువేసేలే చేసుకున్న రీతుల్లో రాజకీయాన్ని రక్కసిలా నడిపించింది. బలిదానం కావించుకుంది. రాజకీయాలంటే ఏమాత్రం ఆసక్తిలేకుండ, విదేశాల్లో చదువుకుంటూ, ప్రేమవివాహం ద్వారా విదేశీవనితను వివాహమాడి, 'పైలట్' వౄత్తిని నైపుణ్యంతో నిర్వహించుకుంటూ ప్రశాంత జీవితాన్ని గడుపుకుందాం అనుకుంటున్న పరిస్థితుల్లో, దేశరజకీయ రధసారధ్యానికి నాయకత్వం వహించవలసి వచ్చింది. అయిష్టంగా స్వీకరించినా, రాజకీయంలో యువతని, యుక్తుల్ని, నూతనభావాలతో సమసమాజాన్ని మరింత సుఖవంతంగా నడిపించాలన్న నిష్కళంకంగా కొత్తకొత్త ప్రణాళికలు, పధకాలను, సమాచార, సాంకేతిక రంగాలను విశ్వవ్యాప్తం చేసుకుంటూ, దేశాన్ని ప్రపంచచిత్రపటానికి సునాయాసంగా అతికించి, భారతదేశం అంటే ఏమిటో బయస్కోపు ద్వారా చూపించిన ఘనత మాత్రం రాజీవ్ గాంధీదే అని ముక్తకంఠంగా చెప్పవచ్చు. అయితే, తల్లిని పొట్టపెట్టుకున్న కుటిల ఉగ్రవాద రాజకీయం తెలియని రంగులు పులుముకుని, తిరిగి భారతదేశ ప్రధానిని కోల్పోయిన దురదౄష్టకరమైన రాజకీయ ప్రస్థానం మనది.
యిందిర జయాపజయ సంకేతాలు
తండ్రి జవహర్ లాల్ నెహ్రూ తరవాత, లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో పదవిని నిర్వహిస్తూ, వెంటనే దేశపు రాజకీయరధసారధ్యాన్ని చేపట్టిన యిందిర తన యాత్రలో తిరిగి వెనుకకు చూడలేదు. చూడవలసివచ్చినా, వెనుకకు తిరుగలేదు. యీ పద్ధతిలో, అంతేకాక, అత్యంత ప్రతిభావంతంగా, ప్రకాశవంతంగా ప్రధాని పదవిని నిర్వహించారు. ముదుసలి రాజకీయాలను విశ్రాంతిమందిరాల్లోకి నెట్టివేసి, రధాన్ని తనదైన వేగంతో నడిపించారు. భారతదేశపు మూడవ ప్రధాని, తొలి మహిళాప్రధానిగా, 24 జనవరి 1966 న పదవీబాధ్యతలను స్వీకరించి, చివరి మజిలీని 1977 వరకూ నిరాఘాటంగా నడిపించిన ఘనత మాత్రం యిందిరదే అని చెప్పాలి. 1975 లో ఆమె లోక్ సభ ఎన్నికలు చెల్లవని కోర్టు తీర్పు యివ్వడం, అహం, అధికారం, ఆభిజాత్యం రంగరించిన రసరాట్టు ఆనాటి రాజకీయరణానికి మందు అనుకుని రంగరించి, అరగదీసి అదిమిన లేహ్యం కొత్త రోగాలని తెచ్చి రాజకీయాన్ని మరింత అనారోగ్యంగా తయారు కావడానికి పూర్తి బాధ్యత ఆమెదే అని అనిపించేలా అధికారాన్ని తనకు తెలియకుండా, తన హితులు, సన్నిహితులుగా చిన్న చితక నాయకుల్ని చేరదీసి, వారివల్లే రాజకీయ అస్త్రాల్ని సంధింపచేసుకుని, వాటినే తిరిగి ఎదుర్కొంటూ, ఘోర అపజయాన్ని స్వీకరించక తప్పలేదు. బలీయమైన విధిరాతకు రాజకీయం మినహాయింపు కాదు అని రుజువుచేసుకుంది. ఫలితంగా, 1977 ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదు. రాజకీయ పులిజూదంలో రంకెలు, గంతులు తప్పవని నిరూపిస్తూ, 1980 లో జయపతాకాన్ని విజయేందిర దేశపు రాజకీయ వినువీధుల్లో రెపరెపలాడించింది. తిరుగులేని రాజకీయాన్ని మరింత తిరుగుబాటుతనాన్ని తెలియకుండ ప్రోత్సహించుకుంటూ కదపిన రాజకీయ చదరంగపు పావులు - నలుపు, తెలుపు రంగుల మిశ్రమై రాజకీయం కలగాపులగంగా మారి, వివర్ణమై, పాలిపోయి, పేడిలా మారి, ఆ మాయలమారి సూదంటురాయి తన గుండెలోకే దూసుకుపోయింది. ఫలితంగా, తన వ్యక్తిగత రక్షకభటుడి తుపాకీయే ఈ దేశపు ప్రధానమంత్రిణి ని నిర్దయగా, నిర్దాక్షిణ్యంగా హతమయ్యేలా చేసింది కుటిల కుతంత్ర రాజకీయం. బలిదానం చేసుకుంది.
యిందిర పరిపాలనలో ధ్రువ నక్షత్రాలు
నాటినుంచి, నేటివరకూ, యిందిర తీసుకున్న ఆర్ధిక, సామాజిక, రాజకీయ, పరిపాలనా విధానాలు, నిర్ణయాలు, రవంత సవ్వడిని, అలజడిని లేవదీసినా, మార్పును మాత్రం తీసుకువచ్చాయి అన్నదాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. మచ్చుకు - బాంకుల జాతీయకరణ, బంగ్లాదేశ్ కు విముక్తి, ప్రాముఖ్యతను సంతరించుకున్న 20-సూత్రాల పధకం, 'గరీబీ హటావో' అన్న నినాదం బీదరికాన్ని ఎంత తగ్గించింది అన్న ప్రశ్న వేయకుంటే, రష్యారాజ్య పరిపాలనా విధానాన్ని అనుకరించిన తీరుమాత్రం అనూహ్యం. రాజభరణాలను రద్దుచేయడం లాంటివి ఎన్నో నిర్ణయాలు యిందిరను వైకుంఠపాళీలో నిచ్చెనలను ఎక్కేందుకు పరికరాలుగా వినియోగించుకుంది.
అమౄతసరోవరం తెచ్చెన ముప్పు
పవిత్ర దేవాలయం అమౄతసర్ ప్రాంగణంలోనుంచి ఉగ్రవాద వలస కేంద్రాని తరిమివేయాలన్న తీవ్రతలంపుతో 'ఆపరేషన్ బ్లూస్టాఋ చర్య ద్వారా, ఉగ్రవాదాన్ని అణచాలన్న ప్రయత్నం సబబైనా, జరిగిన తీరుమాత్రం రాజకీయ శత్రుత్వాన్ని రగులుకొలిపింది. ఆ తీక్షణచర్యపై పగపూని, చివరి కపటచర్యగా, యిందిరగాంధిని తన అధికారిక నివాసంలోనే, తన స్వంత రక్షకభటుడి చేతులమీదుగానే, హతమార్చడం జరిగింది. ఈ దుర:కార, దుర్వినీతి, దుష్ట రాజకీయం తన పగను నెరవేర్చుకుంది. జాతికి మచ్చమాత్రం చిరస్థాయిగా నిలచిపోయింది.
సరిగ్గా, ఈ రోజే, 31, అక్టోబర్ 1984 న దేశపు ఏకైక మహిళా ప్రధానమంత్రి - యిందిరాగాంధి తన తుదిశ్వాసను విడిచింది. జాతిరత్నం, మహామనీషి, మణిమకుటసమానం, సరిసములులేని వ్యక్తిత్వం, వెరసి యిందిరా ప్రియదర్శిని గాంధి, మహాభినిష్క్రమణం కావించింది.
భారతదేశం మరో మహిళా ప్రధానమంత్రి కోసం ఎదురుతెన్నులు చూస్తూంది. కలలు ఫలిస్తాయో, లేదో, కాలధర్మం, కాలనిర్ణయం చేసే విధిలిఖితం పై ఆధారపడింది అన్నది సత్యం.
యిందిరాగాంధి భావ లహరి
కలసి మెలసి జీవించే మానవాళి మనుగడ వికాసంలోనిసహజ పరిణామమే - అంతర్జాతీయ స్థాయిలో సైతం దశదిశల నుంచి లభించే సంపూర్ణ సహకారం.
ప్రజా ప్రభుత్వ పద్ధతిలో నడిచే సమాజంలో మనలని మనం క్రమశిక్షణతో నడిపించుకోవడం, అన్నిటినీ మించిన యుక్తి అవుతుంది.
జీవితం ఓ అధ్బుతమైన లక్ష్యానికి అంకితం అయినప్పుడే దాని సార్ధక్యం పెరుగుతుంది; అలా అంకితం అవటంలో చక్కటి జ్ౙానంతోపాటు సరైన న్యాయమూ ఉండాలి.
యిందిరాగాంధి జయంతి (19 నవంబర్) సందర్భంగా - తెలుగు రథం ఘననివాళులను సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగు రథం.

Friday, November 14, 2008

భూదానోద్యమ నిర్మాత - ఆచార్య వినోభా భావే


ఆచార్య వినోబా భావే - వర్ధంతి - 15 నవంబర్


'జై జగత్! నా కార్యకలాపాలన్నీ విశ్వమానవుల హౄదయసంగమం కొరకు తపనే'
'చిత్ పవణ్ బ్రాహ్మణ వంశీయుడు
అందరికీ 'ఆచార్యాగా సుపరిచితుడు. ఆయన పేరు వినాయక్ నరహరి భావే. వినోబా భావే గా సుప్రసిద్దుడు. మహారాష్ట్రలో గగోడే లో 11 సెప్టెంబర్ 1895 న సంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. మహారాష్ట్రలో 'చిత్ పవణ్ బ్రాహ్మణ వంశీయుడైన వినోబా చిరుప్రాయంనుంచే భగవద్గీత పై అపార ప్రభావం పొందినవాడు.
స్వాతంత్ర్య సమరంలోకి ...
మహాత్మాగాంధీతోటి స్వాతంత్ర్య సమరంలోకి దూకిన వ్యక్తి. తెల్లదొరలతోటి సమరం మూలాన, 1932 లో వినోబాను జైల్లో పెట్టారు. కాని మన వినోబా జైలులో ఉబుసుపోక, భగవద్గీతపై తనదైన భాష్యాన్ని తోటి ఖైదీలకు, మాతౄభాషైన మరాఠీలో వివరించేవాడట. ఆ ఉపన్యాస భావలహరి తర్వాత 'ఉపన్యాసగీతా గా ప్రచురించడం, అన్ని దేశీయభాషల్లోకి, కొన్ని విదీశీభాషల్లోకి, తర్జుమా కావడం జరిగినదాన్ని బట్టి వినోబా విద్వత్తు వెల్లడవుతుంది. మిగతా కార్యక్రమాల్ని, దినచర్యని పక్కకి నెట్టినా, గీతోపన్యాసాలద్వారా, మంచి అనిర్వచీయనీయమైన అనుభూతి ఆవహించింది అని వినోబా చాలాసార్లు చెప్పారు. ఆయన సత్యనిష్ఠా తత్పరతకు సంతోషించి, గాంధీ, సత్యాగ్రహానికి ఎన్నుకున్న మొదటి వ్యక్తి వినోబా అన్నది ఆనాడు ఆశ్చర్యం కలిగించింది. ఆనాడు క్విట్ యిండియా ఉద్యమంలో కూడ పాల్గొన్న ప్రముఖుడు.
సర్వోదయ, భూదానం, గోరక్షణ - జీవన నేస్తాలు
వినోబా అన్ని మతాల సత్యసారాన్ని ఆధ్యయనం చేసి అర్ధంచేసుకున్న మేధావి. 'ఓం తట్ అన్న పారాయణ అన్నిమతాలకు అన్వయించేలా ధ్యానం చేశేవారు. పైగా బహుభాషాప్రావీణ్యుడు. కన్నడ భాషాలిపిని విశ్వభాషాలిపులకు మహారాణి అని పొగడేవారు. భారతదేశంలోని పల్లెలలో జీవించే సగటుజీవి అనుభవించే కష్ఠాలకు సమస్యలను అన్వేషించడంలో చాలా కౄషిని సలిపారు. కొన్నింటికి ఆధ్యాత్మిక ధోరణి సమంజసం అని కూడ భావించారు. ఈ ధోరణి క్రమేణా 'సర్వోదయా ఉద్యమానికి దారితీసింది. వినోబా భావేతో మమైకం చెందిన మరొక మహత్తర కార్యక్రమం - భూదానోద్యమం. ఈ నూతన తరహాలో నడచిన ఈ భూదానోద్యమ ప్రచారంలో భాగంగా, దేశం నలుమూలలు పాదయాత్ర చేశాడు. ప్రతీ భూకామందుని వ్యక్తిగతంగా, తనను కొడుకుగా భావించి, కొంతైనా భూమిని యివ్వాలని ప్రార్ధించాడు. అలా సేకరించిన భూమిని పేదలకు దానం ద్వారా పంచి పెట్టాడు. అహింస, ప్రేమలను మేళవించిన విధానం ఆయన తత్వం. వినోబా అంటే వెంటనే స్ఫురించే అంశం - గోహత్య విధాన నిర్మూలనం.
ఆయనొక ఆశ్రమవాసి!
వినోబా తన జీవిత చరమాంకం, మహారాష్ట్రలోని 'పౌనాఋ లో నిర్మించుకున్న ఆశ్రమ వాతావరణంలో గడిపాడు. యిందిరాగాంధి విధించిన అత్యవసర పరిస్థితిని సమర్ధించిన వారిలో వినోబా ఒకరు కావడం, ఆ కాలాన్ని 'అనుశాసన పర్వం'గా అభివర్ణించి, క్రమశిక్షణకు సరియైన సమయం అని వ్యాఖ్యానించారు.
విమర్శల మధ్య వినోబా
విద్వత్తు ఉన్నచోట వివాదం, అసూయలు జనిస్తాయి. 'అర్కంలేని అతి గాంధీవాదం'వినోబాదిఅని ప్రముఖ సాహితీవేత్త వి.యస్.నాయిపాల్ విమర్శించాడు. కాని, భారతీయ ఆర్ధిక, రాజకీయవిధానంతో భాగస్వామ్యం పొందని నాయిపాల్ నుంచి యిటువంటి విమర్శలు రావడం చాలా విడ్డూరం అని ప్రతి విమర్శలు రావడం కూడ జరిగాయి.
ప్రతిభకు పురస్కారాలు
1958 లో వినోబాకు 'సామాజిక నాయకత్వం'పై భారతీయ రామన్ మెగ్సయ్సాయ్ పురస్కారం మొట్టమొదటి స్వీకర్త వినోబా కావడం మనదేశానికి గర్వనీయం. 1983 లో భారతరత్న బిరుదుని వినోబా మరణాంతరం వెంటనే బహూకరించారు.
వినోబా భావాలు
విప్లవాలకు ఆధ్యాత్మికభావాలే మూలం; మానవుల హౄదయాలని, మనస్సులని ఏకీకౄతం చేయడానికే నా కార్యక్రమాలపై దౄష్టి పెట్టడం జరిగింది.
ప్రశాంతత అనేది మానసికం, ఆధ్యాత్మకం. ఈ ధోరణులనుంచే మానవుల వ్యక్తిగత జీవితాల్లో ప్రవేశిస్తాయి. ప్రపంచగమనం వీటిపైనే ఆధారపడింది.
జై జగత్! విశ్వానికి విజయం!
బీదప్రజల హౄదయాలను సుసంపన్నంగాను, సంపన్నప్రజల హౄదయాలను బీదతనంతోను భగవంతుడు సౄష్టించడం విడ్డూరం, ఆశ్చర్యకరం.
ప్రజాశక్తి, ప్రజాబలం సంకల్పంగా సాధించాలి. హింసాయుత, బలవంతపు అధికారిక రాజ్యపాలనం ఆహ్వానించదగ్గది కాదు.
ఏ దేశమైనా, సైన్యం, యుద్ధసామగ్రి బలంతో కాక, నైతినబలంతో సమర్ధించుకోవాలి.
పాతపడిన యుద్ధసామగ్రితో కొత్త యుద్ధాలు చేయగలగడం అసాధ్యం.
ప్రభుత్వాల తప్పిదాలపై విమర్శించ వలసిన పని నాకు లేదు. మంచి పనులని అనుకున్నవాటిపై నా విమర్శ ఉంటుంది.
విప్లవవాదాన్ని ప్రభుత్వమే ప్రచారం చేస్తుంది అన్న భావం, భావన ఎన్నటికీ రానీయకూడదు.
అహింసా విధానాలపై నిదానధోరణిని అవలబించకూడదు. అహింసామార్గం ద్వారా, అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే, కాలయాపన, జాప్యం శతౄవులు అనే అనుకోవాలి. పట్టు ఎంతమాత్రం సడలకూడదు. మెతకదనం, పసలేని, ప్రభావంలేని అహింసావిధానాలను అవలంబించినందువల్ల ప్రస్తుత స్తబ్ధత కొనసాగే ప్రమాదంతోపాటు, పెరుగుదల, అభివౄద్ధి చతికిలబడతాయి. చివరకు పరాజయం, నిరాశ తప్పవు.
సమాజసేవ, అహింసామార్గం, గోరక్షణ, ఆధ్యాత్మకధోరణి, కుష్టివ్యాధిగ్రస్థులకు సహాయసహకారాలు, భూదానోద్యమం, యిలా ఎన్నో సేవలను అందించిన వినోబా భావే వివాదం లేని పరమాచార్యులు. భారతదేశానికి ప్రధానాచార్యులలో ఒకరు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఆచార్య వినోబా భావే 1982 నవంబర్ 15 న, చివరి రోజుల్లో ఆహారం, నీరు తీసుకోడానికి నిరాకరించి, 'సల్లేఖనం' గా భావించగా, కీర్తిశేషులైనారు.
వినోబా భావే మహానుభావ భావపరంపరకు, నేటివరకు చెరగని ముద్రవేసిన ఈ మహనీయునికి తెలుగురథం నీరాజనాల్ని సమర్పించుకుంటోంది.
తెలుగురథం - కొంపెల్ల శర్మ

హేతువాద ప్రచారక 'గోరా' జయంతి


గోరా ( 1902 - 1975 ) జయంతి


భారతీయ నాస్తికవాద నేత, గోరా అని ప్రసిద్ధి చెందిన, గోపరాజు రామచంద్రరావు, 15 నవంబర్ 1902 న ఉన్నతకుల హిందూ కుటుంబంలో జన్మించారు. నాస్తికవాది అన్నవెంటనే, ఈ వ్యాసం చదవడం మానేసినవాళ్ళు కూడ వుంటారేమో!. గోరా తన ఆత్మకధ లో పేర్కొన్నట్లు, పరంపరగా వస్తున్న సంప్రదాయ, మూఢాచారాలు ప్రబలుతున్న కుటుంబం అని తానే చెప్పుకున్నారు. నాస్తికుడిగా,నాస్తికవాద ప్రచారానికి విశేష కౄషి చేసిన మహనీయుడిగా తెలుగు వారందరికీ సుపరిచితులు. ఆస్తికత, హేతువాద విరుద్ధమంటారు. నేటి సమాజంలో అగ్ర - నిమ్న జాతులనే వర్గ భేదాలు, అంధ విశ్వాసాలు పెచ్చు పెరిగిపోవడానికి, ఆస్తికతే ప్రధాన కారణమని గోరా విశ్వసించారు.
వౄక్షశాస్త్రంలో డిగ్రీ చదివి, మద్రాసు ప్రేసిడెన్సీ కాలేజీలో అదే శాస్త్రంలో మాష్టర్ డిగ్రీలో ఉత్తీర్ణతను పొందారు. గోరా ఆంధ్రరాష్ట్రంలో, పలు కళాశాలల్లో, శ్రీలంకలో కొంతకాలం అధ్యాపకులుగా వౄత్తిని నిర్వహించారు. 1922 లో సరస్వతిని, ఆమె 10 ఏళ్ళ ప్రాయంలోనే వివాహం చేసుకున్నాడు. వారిద్దరి కుటుంబాలు, హిందూ సనాతన పద్ధతిలోని కుటుంబాలే. వీరిరువిరి కుటుంబాలు, బాల్యవివాహ నిరోధ చట్టం 1975 లో జరిగింది.
నాస్తికవాద ప్రచారం
తనకు నచ్చిన వాదాన్ని, అంటే నాస్తిక వాదాన్ని. ప్రచారం చేయడానికిజీవితాంతం శ్రమపడిన వ్యక్తి. 1940 లో గోరా ఆయన భార్య తో కలసి, నాస్తికకేంద్రం ను, కౄష్ణాజిల్లాలోని ఒక గ్రామంలో ప్రారంభించడం జగిరింది. 1040 ప్రాంతంలో విజయవాడ కేంద్రంగా తాను నమ్మిన సిద్ధాంతాల ప్రచారాన్ని చేపట్టాౠ. ఆ కాలంలోని భారత స్వాతంత్ర్య సంగ్రామంగ్లో క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాల్లో పాల్గొని ఆలీపురంతదితర జైళ్ళలో కఠిన శిక్షల్ని అనుభవించారు. దేశస్వాతంత్ర్యం సందర్భంగా, 1947 లో, కేంద్రాన్ని విజయవాడకు తరలించడం జరిగింది. సోషలిస్టు భావాలకు అనుగుణంగా మానవులందరూ సమానమనే భావం సమాజంలో నెలకొనాలంటే నాస్తికవాదం వల్ల మాత్రమే సుసాధ్యమని ఆయన భావించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నాస్తికవాద ప్రచారంలో తన జీవితాంతం అకుంఠిత దీక్షతో కౄషి సలిపిన, గోరా, 'ఎథీస్టూ అనే ఆంగ్ల మాసపత్రికను నడిపారు. గోరా రచించిన 'పాజిటివ్ ఎథీస్టూ అనే గ్రంథంలో నాస్తిక భావాలను, హేతువాదాన్ని వివరంగా పొందుపరచారు. గోరా చేపట్టిన పలు సంఘ సంస్కరణ కార్యక్రమాలని గాంధీజీ కూడ హర్షించాడని, అభినందించారని ఎప్పుడూ ఆయన అభిమానులు చెప్పుతూంటారు. గాంధీజీ సర్వోదయ కార్యక్రమం కూడ గోరా కునచ్చిందని, సర్వోదయ కార్యకర్తగా తన జీవితాంతం గడిపారననడంలో ఏ సందేహం లేదు, రాదు.
గోరా రచనలు
గోరా వ్రాసిన రచనల్లో ప్రథానంగా, నాస్తికవాదం పై ప్రశ్నలు-జవాబులు, నాస్తికుని విశ్వయానం, గాంధీతో నాస్తికుడు, నాస్తికత ఆవశ్యకత, అనుకూల నాస్తికవాదం అన్నవి వ్రాశారు. 1949 నుంచే ప్రారంభించిన పత్రికావ్యాసం, నాస్తికత ఆంశంపై, వాటిని 1969 లో నాస్తికవాది అన్న మాసపత్రికలో ప్రచురించారు. వర్ణవ్యవస్థ, అంటరానితనంపై తన యుద్ధాన్ని ప్రకటించారు. కర్మసిద్ధాంతంపైనా, ఆధ్యాత్మకపరంగా తరచు అనుకునే కర్మ, ప్రాప్తం అనే విషయాలపై తనకున్న నిశ్చితాభిప్రాయాల్ని వెల్లడించడానికి ఏ మాత్రం వెనుకాడలేదు.
గోరా గొప్ప సంఘసంస్కర్త కావడమే కాక, కుల, మత రహిత సమసమాజ నిర్మాణానికై తాను చేపట్టిన ఉద్యమానికి తానే ఆదర్శంగా నిలవాలని, తన కుమారులకు, కుమార్తెలకు కులాంతర వివాహాలు, నిరాడంబరంగా నిర్వహించిన ఘనాపాటి. అంటరానితనం నిర్మూలనపై కూడ విశేష కౄషి చేశారు.
1970 లో బోస్టన్ లో,1974 లో హాలండ్ లోని ఆంసటర్ డంలో జరిగిన అంతర్జాతీయ హ్యూమనిస్ట్ సమావేశంలో గోరా పాల్గొన్నారు. తెలుగు వారపత్రిక 'సంఘం'ను స్థాపించి తద్వారా తన ఆశయాలను, లక్ష్యాలను విశేషంగా ప్రజల్లో ప్రచారం నిర్వహించారు.
ఒక సిద్ధాంతపరమైన భావాలతో జీవితాంతం కౄషిసల్పిన 'గోరా' 1975, 26, జూలైన మరణించారు.
ఏ వాదమైనా, మానవసేవయే మాధవసేవయ పరమ పరమార్ధం అని నమ్మి ఆచరించిన మహానుభావుడు, గోరా.
గోరా మరణాంతరం, నాస్తికకేంద్రాన్ని, ఆయన భార్య సరస్వతి పర్యవేక్షణలో, సలహాసంప్రదింపులు, కులాంతర వివాహాలు, వర్ణరహిత వివాహాల కోసం నిరంతర కౄషిని సలిపాడు. బాల్య వివాహాలని నిషేధించడానికి, వేశ్యావౄత్తిలో యిరుక్కుపోయినవారికి సహాయ సహకారాలు, పెళ్ళికాని తల్లులకు సహాయాలు, బీదవర్గపు మహిళలు, మూఢాచార నమ్మకాలపై కౄషిని సలిపారు. వీటికి నిదర్శనగా, మంటలపై నడకలు, యితర మూఢాచారాల్ని తొలగించే ప్రయత్నం జరిగింది. పెళ్ళికి ముందే సెక్స్ పై అవగాహనలు, కుటుంబనియంత్రణ, వీటితో పాటు ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టిన ఘనత గోరాదే.
2002 లో భారతప్రభుత్వం, తపాలాశాఖవారు, ప్రత్యేక తపాళబిళ్ళను 5 రూపాయల స్ఠాంపుని విడుదల చేశారు. గోరా 100 వ శతాబ్దపు జయంతి సందర్భంగా విడుదల చేశారు.
నాస్తికవాద ప్రచారకుడు, సంఘసంస్కర్త అయిన గోపరాజు రామచంద్రరావు (గోరా) జయంతి సందర్భంగా తెలుగురథం ఘననివాళిని సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

Thursday, November 13, 2008

చాచా నెహ్రూ జయంతి - జవహరునికి జగతి నిత్య నివాళి



జవహరునికి జగతి నిత్యనివాళి



సుదీర్ఘజీవనప్రస్థానం ( 14 నవంబర్ 1889 - మే 27, 1964 )రాజకీయ రారాజు. భారతీయ జాతీయ కాంగ్రెస్ కి రాజీలేని రాజకీయనేత. భారతస్వాతంత్ర్యసమరంలో ప్రధానపాత్ర వహించిన ప్రజ్ణాని. స్వతంత్రభారతావనికి ప్రప్రధమ ప్రధానమంత్రి. ప్రపంచచయుద్ధం తర్వాతకాలంలో అంతర్జాతీయ రాజకీయాల్లో అందరినీ అవాక్కయేలాచేసిన అఖండుడు, అలీనవిధాన స్థాపకుల్లో ఆద్యుడు, విద్వన్మూర్తి - పండిట్ గా ప్రఖ్యాతుడు, చివరైనా, ముందువరసలో చెప్పవలసిన చారిత్రాత్మక అంశాలను విశ్వపరిణామంలో గ్రంధస్తం చేసి - భారతీయదర్శనాన్వేషణం, విశ్వచరితావలోకనాసారం, స్వీయచరిత్ర, సాహిత్యత్రయాన్ని సౄష్టించిన అధ్బుత రచయిత, నెహ్రూ-గాంధి కుటుంబానికి వారధి, భారతీయ రాజకీయప్రాస్థానంలో అపరచతురుడుగా రాణింపులు అందుకున్నవాడు, మోతీలాల్ కు ప్రియతనయుడు, యిందిరాగాంధికి తండ్రి, రాజీవగాంధికి తాత, రాహుల్ గాంధికి ముత్తాత, నెహ్రూవంశపరంపరకు మధ్యవారధి - మరెవరోకాదు - పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, పిల్లలకు చాచాజీ, ఎర్రగులాబితో ఆజన్మాంతం అవిభాజ్యనేస్తం.
దేశస్వాతంత్ర్యసమరంలో ప్రధానపాత్ర వహించిన కుటుంబంమనిషి ఓ అధ్బుతమైన లక్ష్యాన్నినిర్దేశించుకుని, ఆ లక్ష్యసాధన కోసం నిరంతరం నిరాటంకంగా నిజాయితీతో కౄషి చేసుకుంటూ ముందుకు సాగితే, అది అన్నిటినీ మించిన ఆనందానికి నాంది అవుతుంది. ఆ సమయంలో సుఖశాంతులు మనిషి చరణాల వద్ద సదా సంసింద్ధంగా వుంటుంటాయి. పైగా అలాటి మనిషికి తాను అనుకున్నది సాధించడం అనే ఆత్మ సంతౄప్తి కూడా పుష్కలంగా లభిస్తుంటుంది. మనసు నిండా నిజాయితీ పెల్లుబుకుతుండాలే గాని, అటువంటి మనిషి తక్కిన ఎంతో మంది కన్నా మిన్నగా దేశానికి సేవలు అందించగలుగుతాడు. ఈ భావపరంపరతోనే, ఒక ప్రముఖ, సుసంపన్న, సంస్కౄతీపరంపరలను పుణికిపుచ్చుకున్న త్యాగధారను అర్పించి, భారతదేశాన్ని బానిసత్వపు కోరలు, సంకెళ్ళనుంచి విముక్తి కావించడానికి చేసిన సేవలను ప్రస్తావించాలంటే, ఈ కుటుంబాన్ని ప్రప్రధమంగా పేర్కొనవలసిందే. ఆ కుటుంబం వంశానుగతంగా దేశానికి సేవలను నిత్య, సత్య, సత్వరధోరణుల్లో తనదైన శైలిలో చెరగని ముద్రలను వేయగలిగిన కుటుంబం అది. ఆ కుటుంబంలో ప్రస్తావించతగ్గ వ్యక్తి మోతీలాల్ నెహ్రూ. ఈ మహానుభావుని దేశభక్తిసేవలు వంశానుగతంగా, క్రమంగా, జవహర్ లాల్ నెహ్రూ, యిందిరాగాంధి, రాజీవగాంధి, సోనియాగాంధి, ప్రస్తుతం యువతరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధి, ప్రియంక, లను ముఖ్యంగా ప్రస్తావించాలి. మనదేశస్వాతంత్ర్యానికి పూర్వాపరదశల్లో ప్రముఖ పాత్ర వహించిన ఈ కుటుంబం మధ్యతర ప్రతినిధిగా భారతీయదేశ తొలి ప్రధానమంత్రి, జవహర్ లాల్ నెహ్రూ ని స్మరించకుండా, జరగనిపని. యదార్ధం యీనాటి వాస్తవమయితే, ఆదర్శం రేపటి వాస్తవం అన్న సూక్తి ఈ కుటుంబానికి సంపూర్ణంగా అన్వయం అవుతుంది. పూలలో సుగంధాలు ఎంత దాచినా దాగవు. మనుషుల్లోని యోగ్యతలూ అంతే. అవి దాచినా దాగని వస్తువులు. ఈ భావన కూడా ఈ కుటుంబానికి మనసావాచాకర్మణా వర్తిస్తుంది.
ఆణిముత్యం జవహరుడుపరమపావన గంగానదీతటప్రదేశం, త్రివేణీసంగమపుణ్యస్థలి, ఉత్తరప్రదేశంలోని ప్రముఖ నగరం, అలహాబాదుకి తరలివచ్చిన కాశ్మీరుప్రాంతంలోని పరంపరగా వస్తున్న హిందూశాఖ, సరస్వతి బ్రాహ్మణకుటుంబం మోతీలాల్ నెహ్రూ - స్వరూపరాణి దంపతులకు పుత్రసంతానభాగ్యఫలంగా 14 నవంబర్ 1889 రోజు పుణ్యతిధి, దంపతుల్ని పున్నామనరకంనుంచి విముక్తి చేయబడ్దారు అన్న భావన ప్రతిబింబించిన సమయం అది. ఆ ముద్దులబిడ్డకు సార్ధకనామధేయం - ముత్యం, వజ్రం, వైఢూర్యం ముప్పేటతో కలగలిపినట్లు, 'జవహర్ లాళ్ అని పేరుపెట్టారు. ప్రతిభాశాలి, సుసంపన్నశీలి, న్యాయవాది మోతీలాల్ కు మరింత సిరిసంపదల్ని అందించిన ఆనందడోలికల్లో ముంచెత్తిన శిశువు. న్యాయవాదంతోపాటు, భారతదేశంలో అప్పటి అతిపెద్ద రాజకీయసంస్థ - భారతీయ జాతీయ కాంగ్రెశ్ లో అతిచురుగ్గా పాలుపంచుకునేవాడు. నెహ్రూకి ప్రియసోదరీమణులైన విజయలక్షి, కౄష్ణలతో ఆ కుటుంబం మహారాజప్రాకారం 'ఆనందభవనం' లో ఆంగ్లేయుల సదాచారాలు, సంస్కౄతి,వేషభాషలతో జీవనంగావించేవారు. ఆంగ్లం, హిందీలతోపాటు స్వచ్చమైన ఆంగ్లం కూడ పరిభాషలుగా చలామణి అయ్యేవి. నివాసంలోనే విద్యతోపాటు, ప్రముఖ విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం చేసిన నెహ్రూ 15వ ఏట ప్రకౄతిశాస్త్రం ఆధ్యయనం చేసేందుకు, యింగ్లండు, ట్రినిటి సంస్థలో, న్యాయశాస్త్రంలో మిడిల్ టెంపుల్, లండన్ లో చదువులు సాగించాడు. లండన్ లోని రంగస్థలం, ప్రదర్శనశాలలు, ఒపేరాహౌస్ పర్యటనలు, యూరోపు లో సెలవుల్లో తరచు విహారయాత్రలు చేయడం జరిగింది. ఒకవిధమైన ఆకర్షణ, స్ఫురద్రూపి, కలుపుకోరుదనం, చురుకైన తెలివైన యువకుడుగా నెహ్రూని పలుమంది పరిశీలనతో భావించేవారు. దీనికితోడుగా, భారతీయ విద్యార్ధి బౄందంలో రాజకీయ కార్యకలాపాల్లో కూడ పాల్గొనేవాడు. స్వామ్య, స్వేచ్చావాదాల్లో ఆకర్షితుడై, యూరోప్ లోని రాజకీయ, ఆర్ధికరంగాల్లో ప్రేరణకు గురయ్యాడు.
స్వదేశానికి రాక - స్యయంకౄషితో వ్యక్తిత్వనిర్మాణత
స్వదేశానికి రాకతో 27ఏళ్ళ యువప్రాయంతో, నెహ్రూకి ఫిబ్రవరి 8, 1916 న పదహారేళ్ళప్రాయంగల కమలా కౌల్ తో వివాహం జరగడం, తొలిదఫా దాంపత్యం విభిన్న సంస్కౄతీసంప్రదాయ ధోరణిలో కొనసాగుతున్నా, మరుసటి ఏటే, ఆడపిల్ల, ఏకైకసంతానం, 'యిందిరాప్రియదర్శనీ కలగటంతో - భావిభారతరాజకీయభాగ్యదర్శకురాలు అవతరించిదని ఆనాటి జ్యోతిష్కులకు కూడా తోచనట్లే జన్మించింది. న్యాయవాద వౄత్తిలో సుస్థిరంగా కొనసాగే ప్రయత్నాలు చేసుకున్నా, మనసుమాత్రం, ప్రపంచయుద్ధం తదుపరిదశలో తలేత్తిన వేర్పాటుధోరణి నేపథ్యంలో మార్పుచెందే భారతీయ రాజకీయజీవనం వైపే, మొగ్గుచూపింది. ఫలితంగా, సంకల్పదీక్షాకంకణబద్ధతతో లక్నో లో జరిగిన 1916 కీలక కాంగ్రెస్ సమావేశం ఆధునిక, తీవ్రభావశక్తులవిభాగాలన్ని ఏకీకౄతమయ్యాయి. భారతరాజకీయవేత్తలందరూ ముక్తకంఠంతో స్వదేశీపరిపాలన, భారతదేశానికి సర్వస్వతంత్రతను నొక్కి వక్కాణించారు. తండ్రితో సహా, తెల్లసంస్కౄతినేపథ్యంలో వున్న కాంగ్రెసు రాజకీయవేత్తలపై నెహ్రూకి అధికంగానే నిరాశ, నిరాసక్తి కలుగుతున్న తరుణంలో, మదిలో భావాలు మారుతూండడంతో పాటు, మస్తిష్కంలో అలలు, అలజడులు కదలాడాయి. భారతీయ కాంగ్రెసుకి, భారతదేశానికి కూడ భావినేత అని పలువురి భావనగా ప్రకటనలు వస్తున్నా, మహాత్మాగాంధి రాజకీయోద్యమంలో కాలిడిన తర్వాతే, నెహ్రూ రాజకీయజీవితానికి ఒక రూపు, ఊపు సంతరించుకున్నాయి.
గాంధి గురుతత్వప్రేరణ - నెహ్రూ యువనాయకత్వం
గాంధివాదానికి, నాయకత్వానికి ప్రభావితుడై, ఆకర్షితుడైనాడు నెహ్రూ. భారతదేశం ఉద్యోగులకు వకాల్తా తీసుకున్న దక్షిణాఫ్రికా న్యాయవాదిగా గాంధికి చాలా గుర్తింపు వచ్చింది. భారతదేశానికి తిరిగివచ్చి, గాంధి ఉద్యోగులను, రైతులను సమావేశపరచి, చంపరన్, ఖేద ప్రాంతాల్లో తెల్లదొరలు అమలుపరుస్తున్న పన్ను విధానాలపై వ్యతిరేకతను ప్రకటించడంలో వరుసగా ప్రదర్శనలను నిర్వహించడంలో ప్రముఖపాత్రను వహించాడు. వ్యతిరేకోద్యమంలో భారతీయ విశిష్టశైలిలో నిర్మాణం చేసుకున్న హింసరహితవిధానసహిత సామూహికనిరాకరణోద్యమానికి - అహింసాసత్యాగ్రహం - సంపూర్ణ అహింసాధోరణిలో నూతన ప్రక్రియను రూపొందించడంలో గాంధి ఒక కొత్త వొరవడి ప్రారంభించాడు. అంతవరకు, తెల్లదొరల పరిపాలనపై వ్యతిరేకధోరణులను ప్రకటించే పలువిధానాలు అవలంబించడానికి బదులుగా, గాంధీజీ ఒక సమైక్య వ్యతిరేకవిధానానికి రూపకల్పన కలిగించడం, భారతీయులను ఒక్క త్రాటిపై నిలబెట్టింది. ఈ తరుణంలో నెహ్రూ గాంధీని కలవడం, ఆయన వాదాలని, భావాలని ఆకళింపుచేసుకోవడం, చంపరన్ ఉద్యమంలో గాంధికి సహాయసహకారాలను అందించడంలో నెహ్రూ ముందుకురావడం అనూహ్య పరిణామంగా భావించబడింది. గాంధి అనుసరణలో భాగంగా నెహ్రూ తో తనపూర్తికుటుంబం, పాశ్చాత్యధోరణులు, వస్త్రధారణ, సుసంపన్నజీవనవిధానాలు, ఆస్థిపాస్థులపై తగ్గించుకున్న మమకారం, ఖాదీవస్త్రధారణను పూర్తిగా అమలుపరచడం లాంటి విధానాలతో, నెహ్రూకుటుంబం పూర్తిగా గాంధికి ధౄఢసహకారాన్నివ్వడం జరిగింది. అదే ప్రేరణతో, గాంధితో పాటు నిత్యం భగవద్గీత పారాయణం, యోగభ్యాసం పాటించేవారు. గాంధితో పాటు తన దినచర్య, పర్యటనల్లో వెనువెంటే వెంటాడడమే కాకుండా, నెహ్రూ తన వ్యక్తిగత జీవనవిధానంలో కూడ సలహాసంప్రదింపులను అర్ధించేవారు. 1919లో రౌలత్ చట్టాలపైనా, ఖిలాఫత్ వుద్యమానికై, గాంధితోపాటు భారతదేశంలో గ్రామగ్రామాలు తిరిగి, భారతీయకాంగ్రేస్ లో యువసభ్యులను స్వీకరించే కార్యక్రమంలో భాగంగా, అమోఘమైన రాజకీయోపన్యాసాలనివ్వడంలో ఘనాపాటిగా నెహ్రూ చాలా పేరుప్రతిష్టలను తెచ్చుకున్నాడు. ఈ వేదికలపైనే, హిందూ-మసలమాన్ ల ఐక్యత, విద్యావిధానం, స్వయంశక్తి, సాంఘికదురాచాలనిర్మూలనాంశాలు - అంటరానితనం, బీదరికం, అవగాహనారాహిత్యం, నిరుద్యోగ సమస్యలను కూలంకషతో చర్చించేవారు. ఆనాటికి సభలను ప్రతిభావంతంగా నిర్వహించే శక్తిసామర్ధ్యాలతోపాటు, అపర వుపన్యాసకేసరి అన్న పేరుతో, ఉత్తరభారతానికి తిరుగులేని, ప్రశ్నించలేని, సమాధానపరచనక్కరలేని రాజకీయప్రతిభానాయకునిగా నెహ్రూని అభివర్ణించేవారు. ప్రముఖంగా, ఉమ్మడిప్రాంతాలతోపాటు, బీహారు, మధ్యప్రాంతాల్లోని ప్రజలనాల్కలపై నిత్యస్మరణీయమంత్రంగా నెహ్రూ పేరే చెప్పుకునేవారు. సామాజికన్యాయంకోసం ఆరాటం, సమానతకై పోరాటం, నెహ్రూకున్న యువకభావాలు, చొరవ, భారతీయ ముసలమానులను, మహిళలను, యితరమతవాదులను కూడ సమానంగా ఆకర్షింపబడేవి. తనతండ్రి, గాంధిలతోపాటు, పెద్దనాయకులతోపాటు, తనని, తల్లిని బందీలనుచేయడంలాంటి విషయాల్లో, నెహ్రూ పాత్ర చాలా బాధ్యతాయుతంగా పరిణమించింది. హింసాత్మక సామూహిక ఉద్యమాల్లో చౌరిచౌరాలో 1922, ఫిబ్రవరి 4 న 22మంది పోలీసులు చంపబడ్డకారణంగా, గాంధి ఉద్యమానికి కొంత విరామం ప్రకటించడంపట్ల నెహ్రూతండ్రి మోతీలాల్ తోపాటు కొంతమంది కలసి కొత్తగా స్వరాజ్ పార్తీని స్థాపించినా కూడా, నెహ్రూమాత్రం బహిరంగంగా గాంధికి చేయూతనిచ్చాడు. ఈ పరిణామం, జాతీయోద్యమంలో కొంత ఊపు తగ్గడం, స్థానిక పరిపాలన, సాంఘికసమస్యలపై దౄష్టి మరల్చడంలో భాగంగా, నెహ్రూ 1924లో అలహాబాదు స్థానికసంస్థకు అధ్యక్షుడుగా ఎన్నికవడం, నగరముఖ్యపరిపాలకుడిగా రెండేళ్ళు వ్యవహరించాడు. యింట్లోని సమస్యలపోరున్న తరుణంలోకూడ, కమల నెహ్రూతోపాటు ప్రయాణాలు, సభల్లోపాల్గొని ఉపన్యసించడం, అమె స్వగ్రామంనుంచి కూడ జాతీయోద్యమంలో ప్రాతినిధ్యం వహించమని కోరడం జరిగేది. వివాహప్రారంభంలోని దాంపత్యముసలం, క్రమేపీ అన్యోన్యతను పెంచడం, ప్రియపుత్రిక యిందిరకు కూడ ప్రేమాభిమానాల్ని అందివ్వడం జరిగింది. 1926లో నెహ్రూ స్వయంకుటుంబం, కమల వైద్యం నిమిత్తం యూరోప్ తో పాటు, యింగ్లాండ్, స్విడ్జర్ లాండ్, ఫ్రాన్స్, జర్మని విదేశయాత్రలు చేస్తూ, అధికారదాహం, పదవీవ్యామోహం, నిరంకుశత్వం, గర్వం, దర్పం తోపాటు, అపాయాన్ని కలిగించగల సామ్రాజ్యవాదం పై వ్యతిరేకతను నిస్సంకోచంగా ప్రకటించడం జరిగింది. సోవియట్ Yఊనియన్ పర్యటనలో సైనికదళాధిపత్యపు ఆర్ధికవ్యవస్థపై నెహ్రూకి ప్రేరణ కలిగించినా, స్టాలిన్ పరిపాలన - నిరంకుశత్వ, నియంతౄత్వ, సంపూర్ణాధికారసహిత ఏకాధిపత్యవాదంపై మాత్రం తీవ్ర అసంతౄప్తి అవహించింది.
యువ, స్థానికనాయకత్వం నుంచి పటేల్ ని ఢీకొన్న జాతీయనేత వరకు
1929లో అఖిలభారతీయ ట్రేడ్ యూనియన్లకాంగ్రెస్ కి అధ్యక్షుడుగా నెహ్రూ ఎన్నిక, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లిద్దరు అతిప్రాముఖ్య యువనాయకులుగా రాజకీయస్వాతంత్ర్యమే భారతావనికి శఋరణ్యమని ప్రకటించారు. 1927లో బ్రుస్సెల్స్ లో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నెహ్రూకి లీగ్ సభ్యత్వంతోపాటు, 1928లో బ్రిటిష్ పరిపాలనలో భాగంగానే, భారతదేశానికి ప్రత్యేకగుర్తింపు యివ్వాలన్న నెహ్రూతండ్రే 'నెహ్రూనివేదికా అన్నదానికే నెహ్రూ వ్యతిరేకతావిమర్శలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. నెహ్రూ, బోసుల సమూల సంస్కరణవాదం, తీవ్రధోరణుల్లో, 1928లో జరిగిన గౌహతి కాంగ్రెసు సభల్లో తలెత్తాయి. తస్మాత్ జాగ్రత్త! అన్న ధోరణిలో సామూహిక ఉద్యమంవైపు పయనిస్తామని బ్రిటిష్ ప్రభాత్వానికి సవాళ్ళను విసరాలన్న వీరి ప్రతిపాదనలకు అనేక యువకుల హౄదయాలను ఆకట్టుకున్నాయి. ఈ విషయానికి గాంధిజీ ప్రతిపాదించిన రెండేళ్ళ గడువుకై వేచిచూడాలని, సంపూర్ణస్వాతంత్ర్యం రానిదశలో, సంపూర్ణ సమగ్రస్థాయిలో జాతీయోద్యమం చేపట్టాలన్న సలహాకు, నెహ్రూ,బోసులు పట్టుపట్టి, ఏడాది గడువుకు తగ్గించడం కూడ వీరి యువప్రతిభకు తార్కాణం. గడువులు ఎప్పుడోకాని గడప దాటవు, దాటాలని ప్రయత్నాలు జరిగినా, ఎన్నో శక్తులు అడ్డుకుంటాయి. విఫలమైన చర్చలు 1929 డిసెంబరు 29 లాహోర్ కాంగ్రెసు సమావేశానికి దారితీయడం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకశక్తులసంఘటనస్థలిగా మారడం, స్వతంత్ర్యప్రతిపాదనల్లో భాగంగా గాంధీ ప్రోత్సాహంతో, నెహ్రూని అధ్యక్షుడిగా సమావేశం ఎన్నుకోవడం జరిగింది. భారతదేశపు సామాన్యప్రజానీకం, అల్పసంఖ్యాకవర్గప్రజలు, మహిళలు, యువవాహిని, గాంధిపట్ల అత్యంతాకర్షితులైనాకూడా, తీసుకున్న నిర్ణయంపట్ల, నెహ్రూతోసహా, పలువురి కాంగ్రెసువాదులు, రాజకీయపరిశీలకులు, విశ్లేషకులు ఆశ్చర్యం ప్రకటించకపోలేదు. ఈ ఆశ్చర్యంలో భాగంగా, మరింతమంది, గాంధికాని, బర్దోలి సత్యాగ్రహనాయకుడు సర్దార్ వల్లభాయిపటేల్ కాని కాంగ్రేసు అధ్యక్షపదవిని చేపట్టి, సంపూర్ణస్వరాజ్యోద్యమానికి పున:ప్రారంభాంకితంచేస్తూ శుభారంభం చేయాలని పట్టుపట్టారు. యిక్కడే భారతీయ రాజకీయ చరిత్రలో అనూహ్యమైన మలుపు తిరిగింది. అనేకమంది కాంగ్రెసువాదులు, నెహ్రూని వరించిన అధ్యక్షపీఠం, అనుభవంలేని వ్యక్తి ఆధ్వర్యంలో అతిపెద్దభారతీయరాజకీయవ్యవస్థ పగ్గాలని నడిపించడం, ఆవిద్యలో రాణించడం కష్టతరమని భావించడంతోపాటు, నెహ్రూకూడ యిదేవరసపలకడం, స్వయంప్రతిభను విశ్లేషించుకోవడమో, రాజకీయ చతురతో అంతుపట్టలేదనేది పరమసత్యం. నెహ్రూ తన ప్రకటనలో 'నిర్ణయం ఆవేశం, కోపం రప్పించాయి; కాని సమావేశం అందించిన పదవి నిస్పౄహ కలిగించకపోయినా, ఈ బరువుబాధ్యతలకు తన ప్రవేశం ముఖ్యద్వారం ద్వారా జరగలేదని, కనీసం ప్రక్కద్వారం కూడ ప్రవేశం జరగలేదని, ఒక్కసారి హుటాహుటిని రంగంలోకి దూకి బోనులో ప్రవేశించి భయభ్రాంతులమూలాన ప్రజలను అంగీకరించేలా చేసినట్లు భావిస్తున్నానూ అని తత్కాలప్రకటన చేశారు నెహ్రూ. ప్రకటన ఏదైనా, గాంధీ ప్రోద్బలంతో, నెహ్రూ కాంగ్రెసు అధ్యక్షపీఠంలో ఆసీనులయ్యారు. కాని ఈ చతురతతోకూడిన చారిత్రాత్మక ఘటన ద్వారా బయటపడిన విషయం, నెహ్రూ, పటేల్ రెండు విభిన్న ధోరణులు, శక్తులు, ఉత్తర, దక్షిణ ధృరువాలని, ధౄవాలు ఎన్నడూ కలవవు అనికూడ నిరూపణ అయ్యింది.
నాటినుంచి నేటికీ కొనసాగుతున్న విమర్శధోరణి
వల్లభాయి పటేల్ కాంగ్రేసునాయకత్వానికి నెహ్రూ ససేమిరా వలదన్న నెహ్రూధోరణిని ఎంతోమంది విమర్శించారు. చరిత్రలో నిష్ణాతుల కధనం ప్రకారం, సలహాలను కాదని, ద్వితీయనాయకునిగా రాజీపడని నెహ్రూ, కాంగ్రేసు విభజన పై తనవంతు అపాయాన్ని ప్రకటించాడని పెద్దల ఉవాచ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రకాంగ్రెసుసమితి వాదన ప్రకారం నెహ్రూ కన్న పటేలో ప్రతిభాశక్తులు మెండన్న భావాన్ని కేంద్రకాంగ్రేస్ సమితి అంగీకరించకపోవడం కూడ ఆశ్చర్యం. అంతేకాక, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, జె.ఆర్.డి.టాటా, మరియు ఆయన సమకాలీనప్రముఖులు, భారతదేశానికున్న సమస్యలను పరిష్కరించడంలో, నెహ్రూ కన్న పటేల్ సఫలీకౄతుడు, విజయుడు అయ్యేవాడని అభిప్రాయపడి, సలహామేరకు కూడ ఖాతరుచేయని పరిస్థితి ఆనాటిది. నెహ్రూ సోషలిజవాదం, అసమర్ధపరిపాలన, స్వచ్చందపారిశ్రామిక, ఉత్పత్తివిధానాల్లో లోపభూయిష్టవ్యవస్థ, బీదరికపుస్థితిగతుల్నించి పైకి తీసుకురాలేని దుర్గతి, అన్నింటికి సరిపడనికొద్దితనాలు, కనీసావసరాలతో జీవనానికి కూడ నోచుకోని గడ్డు పరిస్థితి నుంచి, పటేల్ బయటపడే ప్రణాళికలు, ఆచరణలు, కనీసజీవనానికి కావలసిన అవసరసదుపాయాలు, శక్తియుక్తులతో విజయం సాధించేవాడని నేటికీ అనేకమంది అంగీకరిస్తున్న వాదవేదంగా భావించబడుతోంది. చరిత్రకారులు, జాతీయహిందూవాదకులు, భారతీయముస్లిములను, లౌకికవిధానాలను తనదైన శైలిలోనే నిర్ధారించుకుని, సమర్ధించడం జరిగిందని వాదించారు. గోడమీదపిల్లివాటంలా విదేశీవిధానం, సోవియట్, యితర సోషలిజపురాజ్యాల పట్ల ఆపేక్ష వున్నందువల్లనే, కపటమిధ్యతో కూడిందని, భారతదేశభద్రతారక్షణలకొరకు కావలసిన కనీస సైన్యావసరాల్ని అంచనాకూడా వేయలేకపోవడం, యిరుగుపొరుగుశతౄదేశాలైన చైనా, పాకిస్తానులవల్ల పొంచివున్న ప్రమాదపు సూచనలనుగూడ పసిగట్టలేకపోవడం, నెహ్రూనాయకత్వం, అతని పరిపాలనావిధానం వల్ల సంతరించిన కష్టనిష్టూరాలని పలువురి ఖచ్చితాభిప్రాయం. అంతేకాకుండ, నెహ్రూ తన సుస్ఫష్టప్రతిభను కనబరిచిన విదేశాంగశాఖను నడిపిస్తూ, పటేల్ ను ప్రధానమంత్రిగా అంగీకరించిన పక్షంలో, భారతదేశంలో ఎదురవుతున్న 21వ శతాబ్దపు కష్టాలకడలితరంగాలు తాకిడి చేసేవుకావని, మరి పలువురి భావన అన్నది కూడ చరిత్ర ఘోషించింది.
తనతోబాటు ఎర్రగులాబి - భార్య కమల సంకేతంజైలునుంచి విడుదలై, అనారోగ్యంతో మంచం పట్టిన భార్య కమలను చూడడానికి 1935 లో తిరిగి యూరోప్ పయనం, స్వాతంత్ర్యసమరదీక్షాకంకణం, భార్యకువైద్యసహాయం, అదేపనిగా ప్రయాణాలు చేయవలసిరావడం, చివరికి 1938 లో భార్యావియోగం అనివార్యమయింది. ఎడబాటుతనం క్షణంక్షణం వెంటాడుతున్నా, సహధర్మచారిణి అనుస్మరణసంకేతంగా, ఎర్రగులాబీపువ్వుని ప్రతినిత్యం తన చాతికి చేర్చుకోవడం ఆయన ఏరోజూ మరచిపోలేదు. అవినాభావ, జన్మజన్మలసంబంధమంటే అదే కాబోలు. జాతీయనాయకురాలుగా, కమల, నెహ్రూతోపాటు నేటివరకూ అవిభాజ్యంగానే గుర్తింపబడుతున్నారు.
క్విట్ యిండియారెండవ ప్రపంచయుద్ధం మూలాన పరిణామాలు, గాంధి, నెహ్రూ, పటేల్, బోస్, మౌలానా ఆజాద్, రాజగోపాలాచారి, మధ్య స్వాతంత్ర్యసాధనాప్రణాళికలు గుజ్జనగూళ్ళు ఆటలు ఆడాయి. పైకి ఐక్యతాచాయలు కనిపుస్తున్నాయి. చిట్టచివరికి, కాంగ్రెసునేతలందరు కలసి ముక్తకంఠంతో, తెల్లదొరలను భారతదేశనుంచి తరలిపోవాలని, 'క్విట్ యిండియా' నినాదాన్ని ప్రకటింఛారు. నెహ్రూ తన పర్యటనలో, తనతోపాటు, కాంగ్రెసుకమిటీని ఆగష్టు 9, 1942 న బంధించి, సర్వభద్రతలు కలిగిన, అహమ్మదునగర్ కోటలోని జైలులో పెట్టారు. నెహ్రూని తన సభ్యులతో, జూన్ 1945 వరకు కలవకుండ చేయడం ప్రత్యేకత. నెహ్రూ కుమార్తె యిందిరాగాంధి, ఆమె భర్త ఫిరోజ్ గాంధిని కొన్ని నెలలు జైలులో వుంచారు. ఈ సమయం లో, 1944 లో నెహ్రూకి మనవడు, రాజీవ్ గాంధి జన్మించాడు. మొదటిసారి నెహ్రూ తాతకి ఎదిగాడు.
నెహ్రూ - పటేల్ మధ్య పోటీ-భేటీలతో ప్రప్రధమ ప్రధానమంత్రిత్వం - పంతం నెగ్గించుకున్న నెహ్రూ
మొదటిసారి, తెల్లదొరల పరిపాలనాప్రభుత్వం, భారతదేశానికి అధికారం యివ్వాలని ఆలోచన చేయడంతో, బ్రిటిష్ కేబినెట్, నెహ్రూసైన్యాన్ని విడుదలచేయడం జరిగింది. కాంగ్రెసు అధ్యక్షపదవికై ఎన్నికలు, అధికారం ఎన్నిక కాబడిన వ్యక్తిని వరిస్తుందన్న నేపథ్యంలో రాజకీయపావులు కదలడం, 11 కాంగ్రెసు రాజ్యాల్లో పటేల్ కు పట్టం కట్టాగా, కేవలం కాంగ్రెసు పరిపాలనాసంఘం మాత్రం నెహ్రూని ఎన్నుకుంది. అప్పటికే పసికట్టిన నెహ్రూ రెండవసంఖ్యకు ససేమిరా అనడం, ప్రతిభతోసంబంధంలేకుండ, విస్తౄతస్థాయిప్రచారకుడుగా నెహ్రూకున్న స్థానాన్ని దౄష్టిలోపెట్టుకుని, గాంధి, పటేల్ ను పోటీనుంచి విరమించమని అభ్యర్ధించడం, దానికి పటేల్ వెంటనే అంగీకారం చెప్పడం, చరిత్రలో చతురకతలు, వ్యాకరణభాషలో కచటతపలు గా నిలచిపోయాయి. గాంధి నెహ్రూని సమర్ధించడం, పటేల్ ని వేరు చేయడం, గాంధి మహాత్ముడే కావచ్చు, రాజకీయానికి అతీతుడు మాత్రం కాదు అని కూడ పలువులు భావించిన ఘటన. నెహ్రూ ఎన్నికమాత్రం, కాంగ్రెసుపక్షంలోనే, అనేకమందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. నేటికాలంవరకు, యిది వివాద, వితండవాదంగా కొనసాగుతూనే వుంటుంది బహుశ. ముందుముందు కాలంలో కూడ, నెహ్రూకుటుంబం చురుకురాజకీయవౄత్తిలో వున్నంతకాలం, ఈ విషయవిశ్లేషణలు నడుస్తూనే వుంటాయి. తక్షణప్రభుత్వానికి నెహ్రూ నాయకత్వం వహించడం, మతాలమధ్య అల్లకల్లోలాలు, రాజకీయసంక్షోభం ముహమ్మద్ అలి జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్ వ్యతిరేకత, ముస్లిములకు ప్రత్యేకదేశం పై మంకుపట్టు, అనివార్యస్థితిలో, పాకిస్తాను ఏర్పాటవడం జరిగిపోయాయి. చివరికి తెల్లదొరలు తమ కుతంత్రాన్ని ప్రదర్శించారు. వారి ప్రతిపాదనని, అయిష్టంగా అంగీకరించవలసివచ్చింది. జూన్ 3, 1947 న వెలువ్వడ ప్రకటన ప్రకారం, ఆగష్టు 15, 1947 న నెహ్రూ భారతప్రధానిగా పదవీస్వీకారం, తన ప్రారంభోపన్యాసాన్నివ్వడం జరిగిపోయాయి.
"విశ్వం యావత్తు తన నిద్రావస్థలో మునిగిపోవగా, భారతదేశం మేలుకొలుపుకి పూనుకుంది. జాగౄతీపధంలో, జీవితాన్ని, స్వాతంత్ర్యాన్ని అనుభవించడానికి ముందుకి ప్రస్థానం సాగిన తరుణం. అది ఒకే ఒక ఆడుగు. కాని చరిత్రలో ఎప్పుడో వేయవలసిన అడుగు. ప్రాచీనత నుంచి నవీనత వైపు అడుగు. ఒక దేశం, ప్రజలు, పరాయితనుంచి అనుభవించిన బనిసత్వపు సంకెళ్ళనుంచి విముక్తిపొంది, ఊపిరి తీస్తూ అడుగు, భావాన్ని ప్రకటించలేని భావన, భావుకత. చందోబంధం నుంచి విముక్తిచెంది, సర్వస్వతంత్ర వచన కవితలా విహారం చేసిన మనసు ప్రతీ పౌరుడిది. భారతదేశానికి సేవలనందించే, మానవసేవయే మాధవసేవయే అన్న భావనతో, ప్రతిజ్ణాపూర్వకంగా, ఆత్మసాక్షీభూతంగా, ప్రమాణసహితంగా, ముందుకు వేసే అడుగు, 'పదండి ముందుకు, పదండి ముందుకు ... హరోం హరోం హర హరా అన్న మహాకవి శ్రీశ్రీ భావంతో, ముందుకు వేసే అడుగు అని నిర్ధారణతో ముందుకు వేసిన అడుగు."
నెహ్రూ - పటేల్ మధ్య ఆరని అగ్నిగుండం
స్వాతంత్ర్యం తెచ్చిన సంతసంతో బాటు సంక్షోభం కూడ ఎదురైంది. మతకలహాలద్వారా మడతపేచీలు పంజాబు, డిల్లీ, బెంగాల్ లో ముఖ్యంగా ఎక్కువయ్యాయి. భారత-పాకీస్తాను ప్రతినిధుల ఉమ్మడియాత్రలు, మౌలానా ఆజాద్ తోపాటు, ముస్లిం సోదరులు భారతదేశంలోనే నివాసం కొనసాగించడానికి నెహ్రూ చర్యలు చేపట్టాడు. వాతావరణం నెహ్రూని చాలా యిబ్బందిపెట్టడం, రెండు దేశాలమధ్య యుద్ధం విరమింపచేయాలని ఐక్యరాజ్యసమితిని అర్ధించడం, భయాందోళనలు మరింత అధికమవుతాయని, హైదరాబాదు రాష్ట్రం కలుపుకునేందుకు సంసిద్ధతను ప్రకటించకపోవడం, కాష్మీరు సమస్య, పాకీస్తానుతో సంబంధాలపై పటేల్ తో వివాదం, కాష్మీరు విధానంపై తనపరిధిలోనే నిర్ణయం తీసుకున్న నెహ్రూ తనశాఖపై, శాఖాధికారులని సంప్రదించకుండ నిర్లక్ష్యధోరణిపట్ల వ్యవహరించిన తీరుపై పటేల్ బాహాటంగా ప్రకటన, మరింత వివాదానికి దారి తీసింది. రాష్ట్రాల సమైక్యతపై తననుకాని, కాంగ్రెసుతోకాని సంప్రదింపులు లేకుండ తీసుకున్న పటేల్ నిర్ణయాలపై, నెహ్రూకి అహం, అధికారం ఆవహించి, పటేల్ పై తీవ్రకోపం వచ్చిందని పలువురి భావన. తాను నిర్వహిస్తున్న విధులనుంచి విముక్తి చేయమని, పటేల్ గాంధిని అర్ధించిన సన్నివేశంలో, నెహ్రూకున్న చురుకుతనం, ప్రచారం తనకు లేవని, అభిప్రాయభేదాలు, వాటిప్రకటనలు, భారతదేశాన్ని గాయపరుస్తాయని, పటేల్ సాహసోపేతంగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. గాంధి ఎంతో చాకచక్యంగా, వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, ఎట్టకేలకు, పటేల్ కు అయిష్టం అని తెలిసినా కూడా, జనవరి 30, 1948 న ప్రభుత్వాన్ని వదలవద్దని పటేల్ ని అర్ధించడమే కాకుండా, నెహ్రూ ప్రభుత్వంలో కొనసాగమని, ఉమ్మడి నాయకత్వంలో సాగమని చెప్పడం జరిగింది. సర్వస్వతంత్ర భారతదేశానికి పటేల్, నెహ్రూ ల ఉమ్మడి నాయకత్వం, దురదౄష్టకరమైన అవసరమన్నది తన అభిప్రాయమని గాంధి ప్రకటించారు. యాదౄచ్చికంగా, గాంధి ఈ రోజునే, హత్యచేయబడ్డారు. గాంధి పిలుపు మేరకు, ఈ దుర్ఘటనను దౄష్టిలో పెట్టుకుని, నెహ్రూ-పటేలు లు గాఢాలింగనం చేసుకుని, జాతినుద్దేశించి ప్రసంగించారు. గాంధి హత్యకు, పటేల్ గౄహమంత్రిత్వశాఖ పనితీరులో లోపం అని గుసగుసలు రావడం, పటేల్ రాజీనామాకు పట్టుపట్టడం, నెహ్రూ నిరాకరణ, ఈ సందర్భంలో, మూడుదశాబ్దాలుగా స్వాతంత్ర్యసమరానికై కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని నెహ్రూ గుర్తుచేయడం, ప్రత్యేకంగా గాంధి మరణాంతరం, మనస్పర్ధలు కూడవని నెహ్రూ చెప్పడం, దానికి పటేల్ చలించి, వ్యక్తిగతంగా, బహిరంగంగా, నెహ్రూ నాయకత్వానికి సమర్ధతను ప్రకటించాడు. భిన్నత్వంలో ఏకత్వం, భారతదేశపు సంస్కౄతీసంప్రదాయ ధోరణులకు పునాదులు నెహ్రూ-పటేల్ ల సన్నిహిత్వంతో పాటు సంగ్రామం కూడా అందుకున్నాయి. టిబెట్, గోవా వివాదాల్లో నెహ్రూ పటేల్ తో ఏకీభవించలేదు. దేశపు తొలి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడ, రాజేంద్రప్రసాదు - రాజగోపాలాచారిల అభ్యర్ధుల వివాదం కారణంగా, జీవాత్రం కౄపలానీ కీ తన రాష్ట్రంలో ఒక్క ఓటు కూడ రాని పరిస్థితి వచ్చింది. నెహ్రూ చెప్పిందే వేదం, ఆ వాదమే కాంగ్రెసు మాట అన్న పరిస్థితి కాదని నెహ్రూ గుర్తించక తప్పలేదని పటేల్ భావించాడు. అయినా, నెహ్రూ కి కాంగ్రెసు లో బలం లేదని రాజీనామా చేయదలిస్తే, పటేలు మాత్రమే నెహ్రూని వద్దని వారించాడు. అది అందరు గ్రహించిన పటేల్ గొప్పదనం. నెహ్రూ మనస్సాక్షి అంగీకరించిన సత్యం. "సంస్కౄతికి మనం ఎటువంటి నిర్వచనాలు యిచ్చుకున్నా, అసలు సంస్కౄతిని వ్యక్తుల వరకో, సమూహాల వరకో లేదా దేశం సరిహద్దుల వరకో పరిమితం చేయడం మాత్రం - మనిషి చేస్తున్న ఎంతో పెద్ద పొరపాటూ అన్న నెహ్రూమాటనే యిక్కడ ప్రస్తావించక తప్పదు. కలసిమెలసి జీవించాడానికి బదులుగా చెయ్యగలిగింది - పరస్పర సంపూఋర్ణ నివాశమే అన్నట్లు, వీరిద్దరి మధ్యన ఒక చిన్నవినాశమే అంకురించింది. ఎన్నికలంటే, తరతమ భేదాలు లేకుండా ప్రజలందరికీ రాజకీయ పరిజ్ణానం పంచిపెట్టే విశ్వవిద్యాలయాలు అన్న నెహ్రూ సూక్తి ప్రజలకే సలహా కాని, ఆచరణకు కాదన్నది కూడ సత్యం.
భారతదేశానికి నాయకుడు, నావికుడు, నెహ్రూ నేస్వాతంత్ర్యం, సంతోషాన్ని, సమరాన్ని తెచ్చినా, తరువాతి కాలంలో, నెహ్రూ తన ప్రియపుత్రిక యిందిర పై ఆధారపడడం, వ్యక్తిగతవిషయాలు ఆవిడ స్వయంగా చూసుకోవడం, నెహ్రూ తన జీవితంలో నిత్యవిషయాలువా మారాయి. 1950లో పటేల్ మరణం తర్వాత, నెహ్రూ మకుటంలేని మహారాజుగా గుర్తింపు తెచ్చుకున్నాడన్నది వాస్తవం. 1952 ఎన్నికల్లో, నెహ్రూకి అత్యధిక బలం, అల్లుడు ఫిరోజ్ గాంధి కూడ ఎన్నికవడం, నెహ్రూ అధికారనివాసంలోకి యిందిర మారడం, నెహ్రూఅధికారాన్ని, అల్లుడు విమర్శించడం, యిందిర అతణ్ణి కాదని తండ్రిని చేరడం, అన్ని జరిగిపోయాయి. నెహ్రూతోపాటు, అధికారికంగా చేదోడుగా సహాయం చేసినది మాత్రం యిందిర అన్నదాంట్లో సందేహం లేదు. ఈ సపర్యలే, యిందిరను ఎదురులేని నాయకురాలుగానే కాకుండా, దేశపు ప్రధానమంత్రిగా మార్చాయి. తండ్రితోపాటు, తనయేందిర కూడ, విశ్వయానం చేసి విఖ్యాతగా మారింది. తండ్రి పోలికలున్న పుత్రికను పితౄముఖి ధన్య అన్న నానుడిని సార్ధకం చేసుకుండి.
నెహ్రూ ఆర్ధిక విధానాలు - పంచవర్షప్రణాళికలునెహ్రూ తనదైన 'సోషలిజపు విజణ్ సమాజవాదాన్ని, భారతదేశానికి అనువుగా భావించి మలుచుకొని, భారతీయ ప్రణాళికావ్యవస్థని స్థాపించడం, మొదటి ప్రణాళికలో భాగంగా, 1951లో వ్యవసాయ, పరిశ్రమలరంగాల్లో ప్రభుత్వపెట్టుబడులతో, మనదైన ప్రణాళికకు అంకురార్పణ చేశాడు. భారీపరిశ్రమలు, వ్యవసాయగ్రామీణాభివౄద్ధి, సమాజాభివౄద్ధిపధకం, గ్రామీణ, కుటీర పరిశ్రమలు, బహుళార్ధసాధకప్రణాళికలు, యింధనోత్పత్తి, అణూత్పత్తి, నెహ్రూ విధానాల్లో తలమానికాలు అని చెప్పకతప్పదు. కాని, నెహ్రూ ప్రధానిమంత్రిగా వున్నంతకాలం, అభివౄద్ధితోపాటు ఆహారధాన్యాలకొరత, పారిశ్రామికవిధానం, రాష్ట్రప్రణాళికలు, ఉత్పత్తిని, నాణ్యతను, లాభాసాటితనాన్ని, కొంత కుంటుపడేలా చేసినా, ఆర్ధికవ్యవస్థలో మెరుగు కనిపించినా, జనాభాసమస్య, బీదరికపుసమస్యలను వెన్నంటినా, నెహ్రూ నాయకత్వానికి వచ్చిన ప్రతిభ, ప్రచారం ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి. నీరు, యింధనం, ఆరోగ్యం, రహదారులు, మౌలికసదుపాయాలు, గ్రామీణప్రజలకు, వారి అవసరాలకు అక్కరకు వచ్చాయి. రాజకీయంలో నీతి వేరు, రాజనీతి వేరు. అదే జరిగింది నెహ్రూ నాయకత్వంలో. ఫలితంగా, కొంతమంది మంత్రులపై అవినీతి ఆరోపణలు - కె.డి. మాలవ్య, ట్.టి. కౄష్ణమాచారిల రాజీనామాకు దారితీసింది.
రాజకీయ, సాంఘిక విప్లవపంధాప్రాధమికవిద్య భావిభారతదేశాభివౄద్ధికి అవశ్యమని భావించాడు. నేడు దేశమంతా నమూనాలు వెలసినవాటిల్లో - అఖిలభారతీయస్థాయిలో, వైద్యసంస్థ, సాంకేతికసంస్థ, పరిపాలానసంస్థల స్థాపనకు ఆద్యుడు, కారణభూతుడు. దేశస్థాయిలో అందరి పిల్లలకు ప్రాధమిక విద్యను ఖచ్చితంగాను, ఉచితంగాను, అందించేలా, ప్రణాళికల్లో ప్రస్తావన, పాఠశాలభవనాలనిర్మాణం, ఆహారసదుపాయాలు, వయోజనవిద్యాకేంద్రాలు, గ్రామీణప్రాంతాల్లో సదుపాయాలను కల్పించాడు.
ముగింపుదశ1957 ఎన్నికల్లో విజయం సాధించినా, నెహ్రూ ప్రభుత్వంపై సమస్యలు, విమర్శలు, అంత:కలహాలు, వెన్నుపోటులు, ముఠాకోరుతగాదాలు, విసిగివేసారి పోయాడు. ఆయన పుత్రికను కాంగ్రెసు అధ్యక్షురాలుగా 1959లో ఎన్నికవడం కూడ విమర్శరావడం, పేరురావడంతోపాటు, ప్రతిష్టకూడ దెబ్బతిన్నది. 1962 ఎన్నికల్లో నెహ్రూ విజయాన్ని, నిరాశను కూడ అనుభవించాడు. భారతీయ జనసంఘ్, స్వతంత్ర, కమ్యూనిష్టు పక్షాలకు గుర్తింపులు వచ్చాయి. విదేశాలు మనదేశభాగాల్ని ఆక్రమించడం, సైన్యపుసమస్యలవల్ల, రక్షణమంత్రిని తప్పించడం, అమెరికా సహాయాన్ని అర్ధించడం కూడ జరిగింది. యిన్ని చికాకుల మధ్య ఆరోగ్యం దెబ్బతినడం, 1963లో కాశ్మీరులో విశ్రాంతి తీసుకోవడం, 1964లో వెనక్కి రావడంతో, మే 27, 1964 ఉదయపు ఘడియల్లో, తీవ్ర అనారోగ్యంతోపాటు గుండెపోటురావడం, అంతిమశ్వాసను వదలడం జరిగింది. హిందూశాస్త్రవిధానాలతో, నెహ్రూ అంత్యక్రియలు, యమునాతీరపు శాంతివనంలో, వేలాది ప్రజల సమక్షంలో డిల్లీనగరం వీధులునిండగా, శ్మశానవాటిక నిండిపోవడం, నెహ్రూ వ్యక్తిత్వప్రతిభాపాటవానికి సంకేతం, తార్కాణం.
నెహ్రూ పేరుతో ఎన్నో, మరెన్నోనెహ్రూ పేరు చెబితే, వెంటనే స్మరణకు వచ్చేవి, ఎర్రగులాబి, బాలలదినోత్సవం (నవంబరు 14 - నెహ్రూ పుట్టినరోజున), చాచా నెహ్రూ అన్న పిల్లలు పిలిచే ముద్దుపేరు, గాంధిటోపీ, జోధుపూరు కోటు, ఆయన వస్త్రధారణ, నడక, నడత, మాట తీరుతెన్నులు, ఆయన శైలి, ప్రత్యేకతలు, ఆయనవే. రిచర్డ్ అటెంబరో నిర్మించిన గాంధి చిత్రంలో నెహ్రూ పాత్ర (రోషన్ సేథ్)(1982), కేతన్ మెహతా - సర్దార్ లో నెహ్రూ (బెంజమిన్ జిలానీ), జమిల్ డెహ్లావి చిత్రం జిన్నా - నెహ్రూ పాత్ర (రాబర్ట్ అష్బీ), మరువలేని చిత్రవిచిత్రాలు. జవహర్ లాల్ పేరున, విశ్వవిద్యాలయం, ఓడరేవు, డిల్లీలోని నివాసం, స్మారకమందిరం, ప్రదర్శనశాల, కుటుంబనివాసాలైన ఆనందభవనం, స్వరాజ్యభవనం, నెహ్రూ మరియు ఆయన కుటుంబ సంస్మరణార్ధం కేటాయించడం, 1951లో నోబెల్ శాంతి పురస్కారం, అమెరికామిత్రసేవాసంఘం పురస్కారం, ది లాస్ట్ వైస్రాయి అన్న దూరదర్శన్ నాటకంలో, యియాన్ రిచర్డ్ సన్ ప్రతిభానటన, నెహ్రూ వ్యక్తిత్వ ప్రత్యేకతలకు నిదర్శనం.

భారతీయ రాజకీయ ప్రస్థానచరిత్ర నడుస్తున్నంతకాలం, నెహ్రూకుటుంబం దేశానికి చేసిన సేవాపరంపరలను మరచిపోవడం జరగనిపని. భారతదేశ పరిపాలనా వ్యవస్థలో చెరగని ముద్ర వేసిన ప్రధముల్లో, జవహరుడు ప్రప్రధముడు. జవహరుడు నిజంగా ఆణిముత్యం, వజ్రం, వైఢూర్యం. కలగలిపి జవహరుడు. జవహరునికి లాల్ సలాం. ఆయన ఆత్మకు నివాళి ఈ రోజున సమర్పించడం మన విధి, కర్తవ్యం.
జవహరునికి తెలుగురథం ఘన నివాళిని సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.




చాచా నెహ్రూ పుట్టినరోజు - బాలల దినోత్సవం



బాలల దినోత్సవం



మనదేశంలో - 14 నవంబరునభారతదేశపు తొలిప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన - 14 నవంబరు న జరుపుకోవడం సదాచారంగా వస్తున్నది. పిల్లలంటే ఆయనకు పంచప్రాణాలు, ఎప్పుడూ పిల్లలతో సరదాగా గడపడం, పిల్లలకు కూడ అంతకన్న అధిక సంతోషంగా గడిపేవారు. 1963 లో ఆయన మరణాంతరం, చాచా నెహ్రూ పుట్టినరోజు సంబరాలతో పిల్లలకు కూడ పండగ జరుపుకోవడం భారతీయసంప్రదాయం.
బాలలు దేవుని ప్రతిరూపాలుహైందవ ధర్మసంస్కౄతీపరంపరలో మానవజన్మకు సార్ధకమైనవి చతురావస్థలు - బాల్య, యౌవన, కౌమార, వార్ధక్య దశలు. మానవుడి జీవితంలో మధురాతిమధురమైనది బాల్యదశ. బాలల గురించి అల్పంలో అనల్ప భావనను వర్ణించాలంటే, మహాకవి శ్రీశ్రీ, ఒక బాలలసంవత్సరం రోజున ఆయన వర్ణించిన కవితను - బాలలే విజ్ణాన కేతువులు, నేడు రేపుల మధ్య సేతువులు, చంద్రబంధుర సుధాశీతువులు, మానవత్వ వికాస హేతువులు, అన్న భావన అపూర్వమనే చెప్పాలి. కవిత్రయంలో మధ్యకవి, తిక్కన, మహాభారతం, ఉద్యోగపర్వంలో, తొలి తొలి గోరికొనన్ బాలునికి దగుం బాడిమెయిన్ అంటాడు. నేటి బాలలే రేపటి పౌరులు. దేశభవిష్యత్తు వారిమీద ఆధారపడింది. పిన్నలను తీర్చిదిద్దడం పెద్దల కర్తవ్యం. చిన్నప్పుడే బాలలు తమ వ్యక్తిత్వాలను రూపొందించుకునే వాతావరణాన్ని, ప్రోత్సాహాన్ని సమాజం కల్పించాలి. బాలల్లో ఉన్న కళలూ తెలివితేటలూ నిర్మాణాత్మకంగా దేశానికి ఉపయోగపడేటట్లు అవకాశాలు రూపొందించాలి. అన్ని రంగాల్లోవలనే, బాలలలోని సౄజనాత్మకశక్తినీ, కళాతౄష్ణనూ, ప్రతిభావికాసాలనూ పరిపోషించటానికి విశ్వవ్యాప్తంగా ముందంజ వేయాలి. చదువుతోపాటు బాలల సాహిత్య సాంస్కౄతిక కళావికాసాలకు కౄషిచేసే సంస్థలూ, పత్రికలూ ఎన్నో ఉన్నాయి. ఆ రంగాలలో వ్యష్టిగా జరుగుతున్న కౄషిని సమీకరించి సమిష్టిగా సమాజానికుపయోగపడే విధంగా, మరింత విస్తౄత ప్రాతిపదికతో కార్యక్రమాల్ని చేపట్టి బాలల సర్వతోముఖ వికాసానికి తోడ్పడే వ్యవస్థ నొకదానిని సుస్థిరంగా ఏర్పాటు చేయడానికి మరింత సంకల్పం, దీక్ష వహించాలి. బాలల అకాడమీలు, బాలసదనాలు, మరింత అర్ధవంతంగా, సార్ధకతను పెంపొందించేలా, కార్యకలాపాలు నిర్వహించి, బాలల విజ్ణాన, వినోద, వికాసాలకు మరింత సహాయపడాలి.
బాలల అకాడమీ ప్రప్రధమం మన తెలుగుసీమదే!
అఖిలభారతదేశంలో బాలల అకాడమీ ని స్థాపించిన గౌరవం మొదటి సారి మన రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్ కే దక్కింది. అందుకు మనల్ని మనమే అభినందించుకోవచ్చు. మనం ఈ మధ్య కాలంలోనే తరచు కనీసం చర్చించుకుంటున్న ఆత్మగౌరవం పదాన్ని కనీసం యిటువంటి ప్రయత్నాలకు అన్వయించుకోవచ్చు. కాని మన పూర్వీకులు అన్నట్లు, అంధ్రులకు ఆలోచన కన్న ఆవేశం ఎక్కువ. ఆరంభశూరులు, వెంటనే చతికిలబడతారు, లేదా నత్తనడక నడుస్తారు. బాలలలో నిత్యనూతన వికాసాన్ని కలిగించే కార్యక్రమాలను చేపట్టాలి. వాటిల్లో బాలల ప్రత్యక్ష ప్రమేయాన్ని కలిగించాలి. జాతి నిర్మాణ కార్యక్రమాల్లో తాము చిన్నప్పటినుంచీ పాల్గొంటున్నామన్న ఆత్మవిశ్వాసాన్ని బాలలలో కలిగించాలి. నడుస్తున్న చరిత్రలో వారుకూడా భాగస్వాములు కావాలి. చదువుతున్న పుస్తకాలెంత విజ్ణానాన్ని యిస్తాయో చూస్తున్న సమకాలీన సమాజం కూడా అంత విజ్ణానాన్నిస్తుంది, యిస్తోంది అన్న భావనను అందరూ గ్రహించి, దోహదపడాలి. బాలలు గతంలోనుంచి గొప్పతనాన్ని గ్రహించాలి. వర్తమానంలోనుంచి సత్తువను పెంచుకోవాలి. భవిష్యత్తుకు కావలసిన ముందుచూపును అలవరచుకోవాలి. అన్ని రంగాల్లో నాయకత్వాన్ని వహించే సమగ్ర వ్యక్తిత్వాలను పిన్న వయసులోనే సాధించాలి. అటువంటి అవకాశాలను కల్పించే సంకల్పంలో ప్రభుత్వాలు బాలల అకాడమీలను, సదనాల్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్ళాలి. బాలల సమస్యల్ని చర్చించుకోవటానికీ, నిర్మాణాత్మకమైన కార్యక్రమాల్ని బాలల సలహాసంప్రదింపులతో, రూపొందించుకోవడానికి, బాలల కాళాసాహిత్య ప్రతిభలను ప్రదర్శింపచేయడానికీ, సభలను, సమావేశాలను తరచుగా, సక్రమంగా నిర్వహించుకోవాలి. పాఠశాలల్లో బాలబాలికలను సంఘాలుగా ఏర్పాటు చేయించి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామపెద్దల సహాయసహకారాలతో, లలితకళలపైన, క్రీడలపైన, వినోదోల్లాసభరిత కార్యక్రమాలను నిర్వహించి, ప్రతిభావంతులకు బహుమతులు, ప్రోత్సాహాలు అందజేయాలి.
బాలభారతీయంఫలించిన స్వప్నాలకి ఆకౄతులు కలకలలాడే పిల్లలు. వాళ్ళ ఉజ్జ్వల భవిష్యత్తు జాతి భవిష్యత్తు బాల్యంలోనే వాళ్ళ ఆలోచనలకు పదును, హౄదయాలకు వికాసోల్లాసాలు అవసరం. వయోమర్యాదలకు అనుగుణంగా సాహితీకళారంగాల్లో కౄషి విదేశాల్లో విజయవంతంగా శతాబ్దాలుగా సాగుతున్నది. పండితులు, నాగరికులు వయస్తారతమ్యంతో నిమిత్తం లేకుండా బరువైన ప్రౌఢసాహిత్యాన్ని తమ పిల్లలకు కధలతోనూ, పొడుపుకధలతోనూ, పాటలతోనూ, ఆటలతోనూ అలరిస్తూ బాలసాహిత్యంలో మెదళ్ళకు పదునుపెట్టే విజ్ణానంతో పాలు తక్కువ. ఈ కాలంలో వినోదంతో పాటు వైజ్ణానిక, సాంకేతిక దౄష్టి, పరిసరాలను గురించిన పరిజ్ణానం అత్యావశ్యకం. బాల్యముననున్న గుణములు వయస్సు ముదిరినను పోవు; బాల్యయవ్వనాలని బేఖాతరుగా తిరిగిన వాళ్ళూ ఎంతటి ఇంటబుట్టినా కౌమార వార్ధక్యాలలో కష్టపడక తప్పదు అన్న నగ్నసత్యాన్ని బాలలబాషలో తెలియజేయాలి. చిన్నపిల్లలస్థాయినుంచీ బాల్యస్నేహం గురించి వారి హౄదయాల్లో నాటుకునేట్లు వివరించాలి. చిన్నపిల్లల స్నేహం బీరకాయ పీచులాంటివి; అవి అతి విచిత్రంగా ఒక వీధినుండి ఇంకోవీధికి, ఒక పేటనుండి ఇంకో పేటకూ విస్తరిస్తాయి అని అంటారు, కొడవటిగంటివారి ప్రముఖ నవల చదువు లో.
బాలలు, పిల్లలు ... వీరి దృౠష్టిలో ?ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావుగారు బాలలకధల్ని సౄష్టించిన అతివౄద్ధుల్లో ప్రముఖులు. సత్యం, శివం, సుందరం అని గర్వంతో చెప్పగల, అన్నివయసులవారు ఎల్లపుడూ చదివే పెద్దలపాఠకులుకూడ ఆదరించే చందమామ పత్రికలో, ప్రముఖ బాలలకధలను అందించిన వీరు, బాలల గురించి చాలా మంచి అభిప్రాయాలు చెప్పారు. తల్లిదండ్రులు ఎంత మంచివాళ్ళయినా వాళ్ళకెటువంటి సదుద్దేశాలున్నా, కొన్ని కొన్ని విషయాల్లో పిల్లల జీవితం గురించి వాళ్ళ నిర్ణయాలు చెయ్యలేరు. చిన్నపిల్ల విశ్వాసాలు పెద్దవాళ్ళ విశ్వాసాలంత జ్ణానయుతంగా ఉండవుగాని, అంత మూఢంగా కూడా వుండవు. కొందరు పిల్లలకు బొమ్మలు ఎట్లా కావాలో, కొందరు పెద్దలకు కూడా పిల్లలు అట్లాగే కావాలి ఆడుకోవడానికి. పెద్దవాళ్ళను అంచనాకట్టే శక్తి పిల్లలకు అపారంగా వుంటుంది. పిల్లల ఉద్రేకాలను కూడా పాటించడంవల్ల జీవితం బాగుపడుతుందేకాని చెడిపోదు. చిన్నపిల్లలకు రుచిలోగాని, అభిరుచిలోగాని వ్యత్యాసాలు తెలియవు, పట్టవు కూడా. చేరదేసిన వారిని పాకులాడతారు పిల్లలు. అందువల్లనే, ప్రధమ శైశవదశలో, పిల్లలు కొందమంది పెద్దవాళ్ళదగ్గరికే వెళ్ళడం, మిగతావారిదగ్గరకు, వారిలో ఏ భూతాన్ని చూస్తారో తెలియదు కాని, ఎంతమాత్రమూ వారిదరికి చేరరు. మనకు తెలియని తేడా, పిల్లలకు వారి భాషలో, భావనలో తెలిసితీరుతుంది.
బాల్యం అమూల్యం - పిల్లదనాలే గొప్పదనాలునేటి బాలలే రేపటి పౌరులు. శిశువుల చిరునవ్వు ముందు పశువు కొమ్ము వంచునులే అంటారు సినారె. కేవలం చిరునవ్వేమిటి, అసలు బ్రతుక్కి ఆనందపు పొలిమేర పసితనంకాక మరేముంది చెప్పండి అని దాశరధి సూటిగా, గ్రుచ్చిమరీ ప్రశ్నించారు. బిడ్డలకు వర్ణమాల నేర్పుటకు ముందు ముఖత: ఎన్నియో విషయములను నేర్పవలసియుండును. వ్రాత నేర్పకపూర్వమే వారికి చదువుట నేర్పవలెను అన్ని బాలనీతిచంద్రికను వివరించారు, జాతిపిత, మహాత్ముడు, ముసిముసి బోసిబోసి నవ్వుల నాణ్యమైన నజరానా. ప్రపంచంలో పుట్టిన ప్రతి శిశువూ అంతకు ముందు పుట్టిన దానికన్నా గొప్పగా వుంటుంది. బాల్యంలో వున్నంతటి స్వచ్చమైన సంతోషమూ, తాత్కాలికమైన విచారమూ మరెక్కడైనా వుంటాయా! బాల్యంలో ఒకానొక ప్రత్యేక క్షణం వుంటుంది. ఆ క్షణం తలుపులు తెరుచుకుని భవిష్యత్తు లోపలికి అడుగుపెడుతుంది. బాలుడు కేవలం బాలుడేకాదు, వ్యక్తికి తండ్రి అని వర్డ్స్క్ వర్త్.పుట్టుకతోనే పిల్లల విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది. పిల్లల్ని బాగుచేయాలంటే వాళ్ళను సంతోషపెట్టడమే ఉత్తమ పద్ధతి. పిల్లలు పెరిగి పెద్దవారై మనల్ని కించపరచినా వారిని మనలో భాగంగానే చూస్తాం. ఉదయం రోజును ప్రతిబింబించినట్టు బాల్యం మనిషిని ప్రతిబింబిస్తుంది. అన్నింటినీ ఆమోదించే వయసు బాల్యం అంటాడు, ప్రముఖ కవి ముల్క్ రాజ్ ఆనంద్. మనకు విశ్వంలోని వింతల మాదిరి పిల్లల కన్నులో ఏడు వింతలు కాదు ఏడు లక్షల వింతలున్నాయన్న అద్భుతభావనని చక్కగా వెలిబుచ్చాడు, వాల్ట్ స్ట్రెయిటిఫ్ అన్న కవి. దేవ్వుడికి మనిషిమీద ఇంకా ఆశ పోలేదనే సందేశంతో ప్రతి పిల్లవాడూ ఈ భూమ్మీదకొస్తాడు, అంటాడు ఠాగూర్. మనం తరచు గమనిస్తూంటాము, పెద్దవాళ్ళ మాటలతో పిల్లలూ, వయసు మీదపడుతున్నా పిన్నచేష్టల్లా కనిపించే వౄద్ధచేతలు. అందుకే, పిల్లలు పెరిగి పెద్దవారై మనల్ని కించపరచినా వారిని మనలో భాగంగానే చూస్తాం. పిల్లలే రేపటి ఆశలు; వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించు; వాళ్ళకన్నా గొప్పవాడినని అనుకోకు; నిజానికి నువ్వు కావుకూడా అని అంటాడు రాబర్ట్ హెన్రీ. అందుకే, కరుణామయుడు క్రీస్తు, తన సందేశంలో, "నేను చిన్నపిల్లాడిగా వున్నప్పుడు చిన్నపిల్లాడిలానే ఆలోచించాను; చిన్నపిల్లాడిలానే అర్ధం చేసుకున్నాను; చిన్నపిల్లాడిలానే ప్రవర్తించాను; పెద్దయ్యాక చిన్న తరహా పనులు మానేశాను. ఈ భావనాపరంపరను అందరూ అర్ధంచేసుకుని, ముఖ్యంగా తల్లిదండ్రులు, ప్రవర్తిస్తే, పిల్లలకు, పెద్దలకు మధ్య అవగాహనారాహిత్యధోరణి, అయేమయదుస్థితి, వార్ధక్యచాందసప్రవౄత్తి, పుట్టినప్పటి బుద్ధి పుడకలతోనే కాని పోదు అన్న ప్రవర్తన, తరం మారుతున్నా మనమే గత్యంతరం అన్న భావన మాసిపోనంతకాలం పెద్దరికాలు యిలా చెలామణీ అవుతునేవుంటాయి. చిచ్చరపిడుగుల్లాంటి పిల్లలు చేయలేని పనులు లేనేలేవు. వారు పెద్దవాళ్ళమాట విననన్నా ఈ వౄద్ధతరం చేసేదె ఏమీలేదు. చరమదశలో మరింత ఆవేదనలు, ఆందోళనలు కూడపెట్టుకుని, అంతంతమాత్రంగా వున్న ఆరోగ్యాన్ని మరింత తగ్గించుకోవడమే కాదు. పెద్దతనానికి ఒక ప్రవేశపరీక్ష పెట్టి అర్హతను నిర్ణయించాలి. ఆ సమయం రాకమానదు. అందుకే బాల్యం, వయ్యనానికుండే లక్ష్యాలే మానవజాతి లక్ష్యాలు అన్నాడు ఓ కవి. బాల్యం అన్న సామ్రాజ్యంలో మరణాలు వుండవు అంటాడు లాంగ్ ఫెలో. తెల్లకాగితం లాంటి పిల్లల మనసుని అర్ధం చేసుకోవాలి. అల్లరి, కోతిచేష్టలు చేసినా పిల్లలు, మనిషి కోతిలోంచి పుట్టిన సంగతి ప్రతి చేష్టలో ప్రత్యక్షం చేస్తారు మన పిల్లలు. పిల్లలు తమకి అన్నం పెట్టేవారికన్న మిఠాయి కొనిపెట్టి తమతో ఆడుకునేవారిమీద యెక్కువ ప్రేమ చూపుతారని, బిడ్డలశిక్షణ అని అనూహ్యమైన కరదీపికను రచించిన చలం తన మ్యూజింగ్స్ లో అంటాడు. పిల్లలకు నా,నీ సొమ్మని భేదాలుండవు, అంతా తమ స్వంతంగా వాడుకుంటారు. అందుకే, పిల్లలు ఎవరింటికెళ్ళినా, వాళ్ళకు నచ్చినవి ఏమైనా కనిపిస్తే, అమాంతం వాటిని స్వంతం చేసేసుకుంటారు. పిల్లలు ఒక్కోసారి ప్రదర్శించే ఉద్రేకాలు కూడ వారి జీవితం బాగుపడుతుందే కాని నిరర్ధకం కావు. పిల్లలలో కొంతమంది భిన్నులు కూడా వుంటారు. పిల్లలంత మోసగాండ్రు పెద్దవారు కారు సుమా అని అంటారు, సాక్షి రచయిత పానుగంటి వారు. తల్లిదండ్రులు ఎంత మంచివాళ్ళయినా, వాళ్ళకెటువంటి సదుద్దేశాలున్నా కొన్నికొన్ని విషయాల్లో పిల్లల జీవితం గురించి వాళ్ళ నిర్ణయాలు చెయ్యలేరు అని కూడా కొడవటిగంటి వారు అన్నారు. పిల్లలను భరించలేకపోతున్నామనే తల్లిదండ్రులు అసంఖ్యాకం. పుట్టేంతవరకూ ఆరాటం. పుట్టాకా మొదటి దశలో పరిష్వంగసుఖసారం. కాస్త తెలివి, చురుకుతనం వస్తే, అల్లరి పిడుగుని భరించలేనితనం. అదే పిల్లలు అతిగా ప్రవర్తిస్తే, తప్పుదారులు పట్టితే, పెద్దయ్యాక తల్లిదండ్రులమాటని ఖాతరు చేయనంతగా ప్రవర్తిస్తే, ఆవేదన, తిరిగి ఆరాటం. కనుక, ఆరాటం నుంచి ఆరాటం వరకు తల్లిదండ్రుల పాత్ర అని చెప్పాలి. ఓషధులే తండ్రులుగా, రసవిషాలు తల్లులుగా, తయారవుతున్నారు శిశువులు అంటాడు బైరాగి.
అవస్థాబాల్యంఎదగడానికెందుకురా తొందర, ఎదర వయసంతా చిందర వందర అన్నాడో చిత్రకవి. బాల్యం నుంచే అవస్థలు, భరించలేని చదువులు, పుస్తకాల బరువులు, యింట్లో తల్లిదండ్రుల దరువులు, వెరసి ప్రేమాభిమానకరువులు. బ్రతకలేని, పూట గడవని కుటుంబాల్లో, పిల్లలే పనులకు వలసలు. సంపాదన మాట ఎలా వున్నా, పసితనంలోనే పనులభారం అమానుషం. ఎన్ని బాలకార్మికచట్టాలు వచ్చినా కంటితుడుపే. చట్టాలు కట్టలు కట్టలే తప్ప, పిల్లలకు పనికిమాలిన శాసనాలు. పిల్లల మనసులను భావాలాను రెచ్చగొట్టే విధానాలు యింతలు, మరింతలు అయితే, బాలలు హత్యలు చేయక మానతారా, జైళ్ళకు వెళ్ళి గడుపుతూ చదవక మానతారా. బాల్య వివాహాల నుంచి బయటపడినా, అవస్థాబాల్యం నుంచి బయటకు రాలేని దుస్థితి, అయోమయం లో కూరుకుపోయాము. ఆధునికత, నవీనభావుకత, మన నడకను, నడతను వక్రీకరించబడుతూ, నాణ్యత, నీతి పర్వాలకు భరతవాక్యాలను పలికిస్తున్నాయి. ప్రస్తుతకాలం, కేవలం పది వసంతాలకే బాల్యం పూర్తవుతోంది. ప్రాచీనకాలం, పుర్ణాయువు ద్విశతవసంతాలుగా చెలామణి అయినప్పుడు, బాల్యం మూడు పదులప్రాయం వరకూ గుర్తింపబడేది. నేటి బాల్యం బాల్యంగా ఎప్పుడూ రాణించడంలేదు. బాల్యావస్థని గ్రహించి అనుభూతి చెందేలోపున, దురవస్థగా మారి దుస్థితిపాలవుతోంది. కన్నలకు కష్టాలకడలి రివ్వురివ్వున వస్తోంది. బాలారిష్టాలకు బాలలే గురవుతున్నారు అప్రమేయంగా. నవమాసాల అంతర్జీవనం మాతౄగర్భంలో ఒజ్జగిలి గడిపి, పున్నామ నరక విముక్తికోసం పోరాటమే కనిపిస్తోంది. అయినా, తల్లి గర్భంలో అసౌకర్యంతో ఒదిగున్నా, నునువెచ్చని రక్తస్పర్శ నవలోకంలోకి నరింపచేస్తోంది, ప్రేమాభిమానబంధమై కలకాలం నిలుస్తోంది. ఆ బంధమే మాతౄ, పితౄ దేవోభవ రూపాన జననీజనకులకు గురుభారయోగమౌతోంది. ఓం నమశ్శివాయ అంటూ విద్యాభ్యాసం ప్రారంభించిన వెంటనే విద్యార్జన యజ్ణంలో సమిధలై విన్నూత్న ఘర్షణలకు లోనై, నిరాశానిస్పౄహలతో నిర్జీవులవుతున్నారు, మన శిశువులు, బాలమహేశ్వరులు, కుర్రలు, సుందరీబాలలు, రమణీమణులు, బాలగణపతులు, మన కుమారస్వాములు. నమ్మక వాస్తవాలమధ్య నలిగిపోతున్న మన శిశూదయావస్థలు. జన్మనిచ్చినంతమాత్రాన వారిని శాశించి, హింసించే అధికారం, హక్కులు లేనేలేవు, రావు, రాకూడదు. పిల్లలను నిత్య నరకప్రాయం చేయకండి. వారి మానాన వారిని వదలాడి, మెదలండి. వారి ఆశల అభిరుచుల చాయలనే కదలాడి కేవలం ఆర్ధికసాయం చేసే సువిధలవ్వండి. కడు హార్దికంగా మెలగవలసిన తల్లిదండ్రులైన వ్యక్తులని మరువకండి. పాపం, భూమిమీద పడినంతనే అఖండభారాలు, వెంట వెంటనే వీడిని పెద్దను చేసే రెండవప్రసవాలు. లేదా బారెడు ఎడాలు. చిన్నవాడినే పెద్దవాడిని చేసే హోదాలు, లేదా పంచవర్షప్రణాలికలు. చంటాడికి తోడులేని కడువంటరితనాలు. బాలజీవితాలకు మరింత జీవన్ టోను నివ్వండి. పెద్దరికపు గద్దెలెక్కి, అర్ధంలేని ఆజ్ణలనివ్వకండి. వారి మానాన వారిని వదలక అవమానాలపాలు కాకండి. తల్లిదండ్రులారా, గురువులారా, యిరుగుపొరుగు పెద్దలారా, అవసానదశలో అపహాస్యాన్ని ఆహ్వానించకండి. ఆబాల గోపాలాన్ని ఆనందడోలికల్లో ముంచండి. సుఖానుభూతుల్లో తిరిగి తిరిగి తేలియాడెంచండి. ఆనందోబ్రహ్మ అన్న సూత్రంతో బాలచిదానందమూర్తులను భావిభారతపౌరులని మరువక, భాగ్యవంతుల్ని, ప్రేమాభిమానభరితసుసంపన్నులని కావించండి. శతమానం భవతి అని మనసా వాచా కర్మణా ఆశీర్వచనాక్షతల్ని వారి శిశుశిరస్సులపై పేర్చండి. భావితరపు ప్రతినిధులని, భావిభారతీయతకు కర్త, కర్మ, క్రియ, నేటి శిశువులు, బాలలు అని మరవకండి. నిత్యం ఈ భావనే సదా స్మరించంది. సుఖపడండి. మీ పిల్లల్ని సుఖపెట్టండి. సత్యం, శివం, సుందరం అన్న తత్వాన్ని ఆచరించండి. బాలలకు ప్రత్యేకంగా వేదోపనిషత్తులను సౄష్టించండి. బాలరామాయణాలు, బాలభారతాల్ని నిజంగా రచించండి. బాలప్రబంధరత్నావళి కి పుటల్ని పేర్చండి. ఆ దిశలో దశలో తరలండి, తరలిరండి, దండిగా, దండిగా.
విశ్వబాలలకు ఓ ప్రత్యేక దినోత్సవంపలు దేశాలు, అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని, ల్ జూన్ న జరుపుకోవడం సంప్రదాయంగా వస్తున్నది. జెనీవా - స్విట్జిర్లాండ్ లో 1925 లో బాలల సంక్షేమాన్ని దౄష్టిలో పెట్టుకుని ప్రపంచస్థాయి సమావేశం జరిగింది. జూన్ 1 రోజునే ఎందుకు ఎన్నుకున్నారో యిదమిద్ధంగా తెలియకపోయినా, శాన్ ఫ్రాన్సిస్కో లోని చైనా రాయబారి కార్యాలయం చైనా దేశపు అనాధ పిల్లలకోసం 1925 లోనే డ్రాగన్ పడవల ఉత్సవాన్ని జరపడం, అదేరోజు జూన్ 1 న బాలలకోసం సమావేశం జరపడం యాదౄచ్చకంగా జరిగిపోయాయి. యిదేరోజు అంతర్జాతీయ బాలల సంవత్సరం అనేక దేశాలు జరుపుతుండగా, పశ్చిమప్రాంతపు కమ్యునిష్టు దేశాలు వేర్వేరు తేదీన జరుపుకోవడం, కొంచెం అవగాహన పెరగడం, జూన్ 1న జరుపుకునే ఆచారం కమ్యూనిష్టు దేశాల సంప్రదాయమని కూడ పేరు వచ్చింది. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో అమెరికాలోని కొన్ని రాజ్యాలు, జూన్ 1న జరుపుకోవడం సంతోషించతగ్గది.
నెహ్రూ జయంతి సందర్భంగా, చాచా నెహ్రూ అని ముద్దుగా పిలుచుకునే బాలలకు ప్రత్యేకంగా దినోత్సవం జరుపుకునే సత్సంప్రదాయంలో, నెహ్రూకి ఘన నివాళిని సమర్పించుకుంటూ, నెహ్రూ కలల ప్రపంచం బాలలకు శుభాశీస్సుల్ని, అభినందనల్ని తెలుగురథం అందజేస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

Tuesday, November 11, 2008

రాజీపడని రావిసాస్త్రీయ మధన కథనాలు

రాజీపడని రావిశాస్త్రీయ మధన కధనాలు
( 1922 - 1973 )
రావిశాస్త్రి వర్ధంతి - 10 నవంబర్
సశాస్త్రీయ కధనశైలి
ఈ దేశపు ఈ కాలపు మేధావివర్గం చేత బ్రహ్మరధం పట్టించుకున్న రచయిత. ఆయన రచనలు చదివాక, చదవక ముందున్న స్థితిలో ఉండగలవాడు పరమజడుడై వుండాలి. ఈ రచయితలో ప్రచారగుణం పుష్కళంగా కనిపిస్తుంది. పాఠకుణ్ణి మెడబట్టుకుని నిలవేసే లక్షణకారి. శిల్పవైవిధ్యం, నూతనప్రయోగాలను సమర్ధవంతంగా చేయగలిగిన కధనశైలిని నిరంతరం అనుసరించిన రచయిత. వ్రాసిన ప్రతీ రచన, మధ్యతరగతి జీవన పునాదుల్ని కదిలించింది. ప్రతీ రచన డైనమైట్ గా భావించబచ్చు. ఈ రచయిత సౄష్టించినంతగా, మరే వర్తమాన రచయిత సాహిత్యాన్ని రాశిగా, వాసిగా, సౄష్టించలేదని మాత్రం చెప్పాలి.
అని, ఈ రచయితని, ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావుగారు విశ్లేషించారు.
ఆయన ఎవరో కాదు, వౄత్తిరీత్యా న్యాయవాదీ ప్రవౄత్తిరీత్యా రచయిత. రావిశాస్త్రి గా పిలవబడే, రాచకొండ విశ్వనాధశాస్త్రిగారు.
నిరంతరాన్వేషి - పరిపుష్టి 'రసనా ఆవిష్కర్త
ఆధునిక రచయితల్లో రావిశాస్త్రిగారిది సమున్నతస్థానం. ఈ సమున్నతస్థానాన్ని మరింతగా వివరించాలంటే, వాకాటి పాండురంగారావు గారి మాటల్లో, - మనసు ఆకాశం, ప్రశ్నలు నక్షత్రాలు, ఆ నక్షత్రాల మిణుగురు పురుగులునందుకుని, కిందకు దింపుకుని వాటి వెలుగుల సమాధానాలతో మొదట తనలోని చీకటిమూలలను వెలిగించుకుంటాడు - రచయిత అనే అన్వేషి. తనరచనావ్యాసాంగంలో, నిరంతర అన్వేషిగా, తనదైన సార్ధకత్వాన్ని నిరూపించుకున్న మహాకధకుడు - రావిశాస్త్రి. రసానుభూతానికి సాంకేతికపదాన్ని, రసన గా శ్రీశ్రీ నిర్ధారించాడు. రసనలేనిది సౄజనకాదు; సౄజనకానిది రచనకాదు. అన్వేషణతోపాటు, యువకుల తరానికి చెందిన తెలుగు కధానికా రచయితల్లో రావిశాస్త్రి రచనలే ఆశించిన 'రసనాను సమౄద్ధిగా ఆవిష్కరించగలిగాయి, అని మహాకవి శ్రీశ్రీ కితాబు యిచ్చాడంటే, రావిశాస్త్రిగారి సాహిత్యాన్ని కొలిచే తూనికరాళ్ళు లేనట్లే, ఆ కౄతులను ఆధ్యయనం చేసి, ఆ రసన ను అనుభూతి చెందుతూ, పలవరించవలసినదే. అందుకే, స్వార్ధంమీద, దౌష్ట్యంమీద పోరాటం నాటికీ, నేటికీ సాగుతూనే వుంది. తెలుగు నాట ఆ మూగవాని ప్రక్కన నిలబడి బడుగు మానిసికి అండగా రచనాశతఘ్నులను పేల్చిన మహాకవి శ్రీశ్రీ అయితే, మహాకధకుడు రావిశాస్త్రి అని తీర్మానించిన విశ్లేషకులు అనేకమంది. మహాకవి శ్రీశ్రీ సాహిత్య ప్రభావం, రావిశాస్త్రి పైన అపారం అని చెప్పాలి. శ్రీశ్రీ రచన, రుక్కులు లోని తొమ్మిదింటిని, కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, రొట్టెముక్క, అరటితొక్క, బల్లచెక్క, తలుపుగొళ్ళెం, హారతిపళ్ళెం, గుర్రపుకళ్ళెం, లను వొక్కక్క కధగా రూపకల్పన చేసి, కాదేదే కవితకనర్హం అన్న కవివాక్కును రుజువు చేశారు.
రావిశాస్త్రి జీవనప్రస్థానం
శ్రీకాకుళం జిల్లా, అనకాపల్లి దగ్గరగానున్న తుమ్మపాల గ్రామంలో నారాయణమూర్తి, సీతాలక్ష్మి దంపతులకు 1922 జూలై 30 న జన్మించారు. తండ్రి న్యాయవాది వౄత్తినే తనయుడు స్వీకరిస్తే, తల్లి సాహితీకారిణి. ఆ తల్లి సాహితీప్రభావం తనయుడికి సంక్రమించిందన్ని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆంధ్రవిశ్వకళాపరిషత్తు నుంచి తత్వశాస్త్రంలో బి.ఎ. (ఆనర్స్) పట్టభద్రుడై, మద్రాసు విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివి, తాతగారు శ్రీరామమూర్తి వద్ద న్యాయవాదవౄత్తిలో అనేక మెలకువలను, పట్టులను అవగతం చేసుకుని, 1950 నుంచి స్వంత వ్యవహారాల్ని ప్రారంభించాడు. తొలిదశలో కాంగ్రేసువాదిగాను, 1960 దశకం నుంచి మార్కిష్టు సిద్దాంతాలకు ప్రభావితుడయ్యాడు. 1947 నుంచి న్యాయవాద వౄత్తిని ప్రారంభించిన రావిశాస్త్రి ఉద్యోగరీత్యా శ్రీకాకుళం, విశాఖపట్నంలోని పల్లెప్రజల జనజీవితాల్ని కూలంకషగా పరిశీలించడం, పట్టణజీవితాల్లో వస్తున్న మార్పులను గమనించడం అలవోకగా జరిగాయి. రావిశాస్త్రి రచనల్లో ప్రముఖంగా ప్రస్తావించదగ్గ విషయం, మాండలీక పదప్రయోగాలు. అంతేకాక, అన్యాయం, దురాచారాలు విచ్చలవిడితనంగా పెరుగుతున్న సమాజ వాతావరణ నేపథ్యంలో తన రచనలను చిత్రించడం జరిగింది.
రచనల సమాహారం
కధలు, నవలలు, నాటికలు, నాటకాలు విస్తౄతంగా రచనలు చేయడం జారిగింది. 1952 లో ప్రయోగత్మకంగా వ్రాసిన 'అల్పజీవీ నవల బహుధా ప్రశంసలను అందుకుంది. చైతన్యస్రవంతి ప్రక్రియకు నాందీప్రస్తావనలను పలికిన జేంస్జాయిస్ విధానానికి, శ్రీకారం చుట్టిన చిట్టిబాబు రచయితతో పాటు వంతు పలికిన వారిలో రావిశాస్త్రి ప్రముఖులు. ప్రముఖ ప్రక్రియను అనుసరించిన కధ ప్రక్రియలో, కధాసాగరం, ఆరుసారాకధలు, రాచకొండ కధలు, ఆరుసారోకధలతో పాటు ఆరుచిత్రాలు కూడ చాలా పేరుతెచ్చాయి. ముళ్ళపూడి వెంకటరమణ, అప్పుమీద, ౠణానందలహరి వ్రాస్తె రావిశాస్త్రి బాకీ కధలు సమాజానికి అందించాడు. నాటకాల విషయాలకొస్తే, కలకంఠి, నిజం, తిరస్కౄతి, విషాదం, బహుళప్రచారాలు. వీటితోపాటు, రావిశాస్త్రి సాహితీయాత్రలో, తనను తాను ఆలోచనావిధానాన్ని రేకెత్తించిన రచన, గోవులొస్తునా జాగ్రత్త. అంత ప్రతిభావంతంగాను అవతరించింది. ఓ మంచివాడి కధ, రావిశాస్త్రీయం, సొమ్ములు పోనాయండి అన్న రచనలు రావిశాస్త్రిని మరోమెట్టుకు తీసుకువెళ్ళాయి. రాజుమహిషి, రత్తాలు-రాంబాబు రచనలు ఎందుకో అసంపూర్ణంగానే వుండిపోయాయి. చివరి రచనగా, యిల్లు నవలను వ్రాశాడు. మద్యపాన నిషేధ చట్టం అందించిన బహు పరిణామాలను గమనించి, ఆరుసారాకధలు ఒక పెనుమార్పును తెచ్చిపెట్టింది.
విశిష్ట పురస్కారాలకు తిరస్కౄతి
సన్మానాలకు, సత్కారాలకు పరుగులుతీస్తూ, ఆ దిశలో రచనలకు ఉపక్రమించే రచయితలున్న కలికాలంలో, 1983 లో ఆంధ్రవిశ్వవిద్యాలయపు కళాప్రపూర్ణ, అంతకు పూర్వం 1966లో అందుకున్న సాహిత్య అకాడమీ పురస్కారాన్నీ తిరిగి యిచ్చివేయడం చాలామందికి అర్ధం కాలేదు.
రచయిత అందించిన నటుడు
రావిశాస్త్రి రచయితే కాదు, నటుడు కూడ. నిజం నాటకంలోను, గురజాడ-కన్యాశుల్కం లోను, నటనను వొలకపోశాడు. 1962 లో నిజం నాటకం శతప్రదర్శనలు జరుపుకోవడం విశేషమే.
మూడు కధల బంగారం
రావిశాస్త్రిగారి ధర్మేతిహాసం గా వాసికెక్కిన, మూడు కధల బంగారం నవల పై విమర్శలు మరింత వన్నెను చేకూర్చాయి. అందులో, ముదిగొండ వీరభద్రయ్యను ప్రముఖంగా ప్రస్తావించాలి. విశిష్టస్థాయిలో, రావిశాస్త్రి నిర్మాణశిల్పం, కాలం, స్థలం, ఆత్మవిమఋర్శ, స్త్రీపురుషుల నడతలు, ప్రయోజనాత్మకతలు, అలంకారసౄష్టి లాంటి విషయాల్తో, వివరించబడిన తీరుతెన్నులు, ముదిగొండ వీరభద్రయ్యను మరోరచయితగా పరిగణింపబడ్డాడు.
ప్రశంసలతో ... రావిశాస్త్రి
ఈ సాహితీకారుణ్ణి ఎందరో సాహితీకారులు ప్రశంసల చిరుజల్లులతో, వర్షంతో, నింపారు. మచ్చుకు, కొన్ని ---
సంకుచితమైన పరిధిలో దేంట్లేనూ ఇమడలేని వ్యక్తిత్వం కలవాడు రావిశాస్త్రి - పురాణం సుబ్రహ్మణ్య శర్మ.
శాస్త్రి అనతి కాలంలో చడీచప్పుడూ కాకుండా కధక సామ్రాజ్యంలో సింహాసనం ఎక్కికూర్చున్నాడూ నలభయ్యేళ్ళకైన శ్రీశ్రీ అలాగేవున్నాడు. - అబ్బూరి వరదారాజేస్వర ఋఅఒ.
బూజుని వెక్కిరించి దులిపిపారేసి కవనాన్ని మెచ్చుకునే పండితుడు. శ్రీకాళహస్తీస్వర శతకం, కమ్యూనిష్టు మేనిఫెశ్తో అని ఆంటాడు. ఎం. రామకోటి.
పదహారో శతాబ్దపు షేక్స్పియర్ పాత్రల లాగున, రావిశాస్త్రి పాత్రలు కూడా కలకాలం బతుకుతాయి. అప్పారావుగారి లాగే, చలంగాలాగే, ప్రపంచ సాహిత్యంలో గొప్ప రచయితలందరిలాగే ... బ్రహ్మల్లో కూడా మహాత్ములుంటారు. ఇస్మాయిల్.
రావిశాస్త్రికి సిద్ధాంతాల కన్న తనచుట్టూవున్న మనుషులు, వాళ్ళతో చనువు, వాళ్ళమీద చచ్చేటంత ఇష్టం, లేక వెటకారంతో కూడిన అయిష్టం ఎన్నో వున్నాయి. కధలలో కీలకమైన సంఘటనలు జీవితంలోంచి ఏరుకున్నవేగాని తాత్వక సూత్రాలకు అనుగుణంగా మలిచినవి కావు. - పాలగుమ్మి పద్మరాజు.
శ్రామికవర్గానికి, మధ్యతరగతి సమాజపు వ్యక్తులకు. వారి సమస్యలకు తన కధనాల ద్వారా, తనదైన శైలిలో పరిష్కారాలను సఫలీకౄతంగా అందించగలిగిన, రాచకొండ విశ్వనాధశాస్త్రి, 1993 నవంబరు 10 న తన కలాన్ని, శ్వాసను కూడ విడిచాడు.
రచనలో నిజమైన సాఫీదనం, నైపుణ్యం ద్వారా వస్తుంది అని అంటాడు, అలెగ్జాండర్ పోప్. గొప్ప రచయితగా వుండటమూ, గొప్పగారాయటమూ రెండూ ఒకటికాదు అని ఒక కవి చెప్పాడు. కాని దీనికి విరుద్ధం మన రావిశాస్త్రి అని చెప్పాలి. తమ ఆత్మల అంతర్గత లోకాలను ఆవిష్కరించే రచయితలే సమాజానికి అవసరం అంటాడు టాల్ స్ఠాయి. కాని వారే యిప్పుడు కరువు, కాటకం వచ్చినట్లు, నల్లపూసలు అయిపోతున్నారు. రచనా సామర్ధ్యం భగవంతుడిచ్చిన వరం. ఆ వరం రావిశాస్త్రిగారిలో పుష్కలంగా వుండేది. మరింతలుగా రావిశాస్త్రి లాంటి రచయితలు పుట్టగొడుగుల్లా అవతరించాలి, ఈనాటి కలిసమాజంపై, ప్రభావ ప్రేరణలను అందించాలి. సమసమాజోద్ధరణకు కంకణం కట్టుకోవాలి. ఆ తరుణంకోసం, నేను సైతం అంటూ ... ముందుకు పదండి !!! ప్రముఖ కవి రాచకొండ విశ్వనాథ శాస్త్రి (రావిశాస్త్రి) వర్ధంతి సందర్భంగా తెలుగురథం సాహితీనివాళిని సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగు రథం.