Tuesday, November 11, 2008

రాజీపడని రావిసాస్త్రీయ మధన కథనాలు

రాజీపడని రావిశాస్త్రీయ మధన కధనాలు
( 1922 - 1973 )
రావిశాస్త్రి వర్ధంతి - 10 నవంబర్
సశాస్త్రీయ కధనశైలి
ఈ దేశపు ఈ కాలపు మేధావివర్గం చేత బ్రహ్మరధం పట్టించుకున్న రచయిత. ఆయన రచనలు చదివాక, చదవక ముందున్న స్థితిలో ఉండగలవాడు పరమజడుడై వుండాలి. ఈ రచయితలో ప్రచారగుణం పుష్కళంగా కనిపిస్తుంది. పాఠకుణ్ణి మెడబట్టుకుని నిలవేసే లక్షణకారి. శిల్పవైవిధ్యం, నూతనప్రయోగాలను సమర్ధవంతంగా చేయగలిగిన కధనశైలిని నిరంతరం అనుసరించిన రచయిత. వ్రాసిన ప్రతీ రచన, మధ్యతరగతి జీవన పునాదుల్ని కదిలించింది. ప్రతీ రచన డైనమైట్ గా భావించబచ్చు. ఈ రచయిత సౄష్టించినంతగా, మరే వర్తమాన రచయిత సాహిత్యాన్ని రాశిగా, వాసిగా, సౄష్టించలేదని మాత్రం చెప్పాలి.
అని, ఈ రచయితని, ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావుగారు విశ్లేషించారు.
ఆయన ఎవరో కాదు, వౄత్తిరీత్యా న్యాయవాదీ ప్రవౄత్తిరీత్యా రచయిత. రావిశాస్త్రి గా పిలవబడే, రాచకొండ విశ్వనాధశాస్త్రిగారు.
నిరంతరాన్వేషి - పరిపుష్టి 'రసనా ఆవిష్కర్త
ఆధునిక రచయితల్లో రావిశాస్త్రిగారిది సమున్నతస్థానం. ఈ సమున్నతస్థానాన్ని మరింతగా వివరించాలంటే, వాకాటి పాండురంగారావు గారి మాటల్లో, - మనసు ఆకాశం, ప్రశ్నలు నక్షత్రాలు, ఆ నక్షత్రాల మిణుగురు పురుగులునందుకుని, కిందకు దింపుకుని వాటి వెలుగుల సమాధానాలతో మొదట తనలోని చీకటిమూలలను వెలిగించుకుంటాడు - రచయిత అనే అన్వేషి. తనరచనావ్యాసాంగంలో, నిరంతర అన్వేషిగా, తనదైన సార్ధకత్వాన్ని నిరూపించుకున్న మహాకధకుడు - రావిశాస్త్రి. రసానుభూతానికి సాంకేతికపదాన్ని, రసన గా శ్రీశ్రీ నిర్ధారించాడు. రసనలేనిది సౄజనకాదు; సౄజనకానిది రచనకాదు. అన్వేషణతోపాటు, యువకుల తరానికి చెందిన తెలుగు కధానికా రచయితల్లో రావిశాస్త్రి రచనలే ఆశించిన 'రసనాను సమౄద్ధిగా ఆవిష్కరించగలిగాయి, అని మహాకవి శ్రీశ్రీ కితాబు యిచ్చాడంటే, రావిశాస్త్రిగారి సాహిత్యాన్ని కొలిచే తూనికరాళ్ళు లేనట్లే, ఆ కౄతులను ఆధ్యయనం చేసి, ఆ రసన ను అనుభూతి చెందుతూ, పలవరించవలసినదే. అందుకే, స్వార్ధంమీద, దౌష్ట్యంమీద పోరాటం నాటికీ, నేటికీ సాగుతూనే వుంది. తెలుగు నాట ఆ మూగవాని ప్రక్కన నిలబడి బడుగు మానిసికి అండగా రచనాశతఘ్నులను పేల్చిన మహాకవి శ్రీశ్రీ అయితే, మహాకధకుడు రావిశాస్త్రి అని తీర్మానించిన విశ్లేషకులు అనేకమంది. మహాకవి శ్రీశ్రీ సాహిత్య ప్రభావం, రావిశాస్త్రి పైన అపారం అని చెప్పాలి. శ్రీశ్రీ రచన, రుక్కులు లోని తొమ్మిదింటిని, కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, రొట్టెముక్క, అరటితొక్క, బల్లచెక్క, తలుపుగొళ్ళెం, హారతిపళ్ళెం, గుర్రపుకళ్ళెం, లను వొక్కక్క కధగా రూపకల్పన చేసి, కాదేదే కవితకనర్హం అన్న కవివాక్కును రుజువు చేశారు.
రావిశాస్త్రి జీవనప్రస్థానం
శ్రీకాకుళం జిల్లా, అనకాపల్లి దగ్గరగానున్న తుమ్మపాల గ్రామంలో నారాయణమూర్తి, సీతాలక్ష్మి దంపతులకు 1922 జూలై 30 న జన్మించారు. తండ్రి న్యాయవాది వౄత్తినే తనయుడు స్వీకరిస్తే, తల్లి సాహితీకారిణి. ఆ తల్లి సాహితీప్రభావం తనయుడికి సంక్రమించిందన్ని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆంధ్రవిశ్వకళాపరిషత్తు నుంచి తత్వశాస్త్రంలో బి.ఎ. (ఆనర్స్) పట్టభద్రుడై, మద్రాసు విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివి, తాతగారు శ్రీరామమూర్తి వద్ద న్యాయవాదవౄత్తిలో అనేక మెలకువలను, పట్టులను అవగతం చేసుకుని, 1950 నుంచి స్వంత వ్యవహారాల్ని ప్రారంభించాడు. తొలిదశలో కాంగ్రేసువాదిగాను, 1960 దశకం నుంచి మార్కిష్టు సిద్దాంతాలకు ప్రభావితుడయ్యాడు. 1947 నుంచి న్యాయవాద వౄత్తిని ప్రారంభించిన రావిశాస్త్రి ఉద్యోగరీత్యా శ్రీకాకుళం, విశాఖపట్నంలోని పల్లెప్రజల జనజీవితాల్ని కూలంకషగా పరిశీలించడం, పట్టణజీవితాల్లో వస్తున్న మార్పులను గమనించడం అలవోకగా జరిగాయి. రావిశాస్త్రి రచనల్లో ప్రముఖంగా ప్రస్తావించదగ్గ విషయం, మాండలీక పదప్రయోగాలు. అంతేకాక, అన్యాయం, దురాచారాలు విచ్చలవిడితనంగా పెరుగుతున్న సమాజ వాతావరణ నేపథ్యంలో తన రచనలను చిత్రించడం జరిగింది.
రచనల సమాహారం
కధలు, నవలలు, నాటికలు, నాటకాలు విస్తౄతంగా రచనలు చేయడం జారిగింది. 1952 లో ప్రయోగత్మకంగా వ్రాసిన 'అల్పజీవీ నవల బహుధా ప్రశంసలను అందుకుంది. చైతన్యస్రవంతి ప్రక్రియకు నాందీప్రస్తావనలను పలికిన జేంస్జాయిస్ విధానానికి, శ్రీకారం చుట్టిన చిట్టిబాబు రచయితతో పాటు వంతు పలికిన వారిలో రావిశాస్త్రి ప్రముఖులు. ప్రముఖ ప్రక్రియను అనుసరించిన కధ ప్రక్రియలో, కధాసాగరం, ఆరుసారాకధలు, రాచకొండ కధలు, ఆరుసారోకధలతో పాటు ఆరుచిత్రాలు కూడ చాలా పేరుతెచ్చాయి. ముళ్ళపూడి వెంకటరమణ, అప్పుమీద, ౠణానందలహరి వ్రాస్తె రావిశాస్త్రి బాకీ కధలు సమాజానికి అందించాడు. నాటకాల విషయాలకొస్తే, కలకంఠి, నిజం, తిరస్కౄతి, విషాదం, బహుళప్రచారాలు. వీటితోపాటు, రావిశాస్త్రి సాహితీయాత్రలో, తనను తాను ఆలోచనావిధానాన్ని రేకెత్తించిన రచన, గోవులొస్తునా జాగ్రత్త. అంత ప్రతిభావంతంగాను అవతరించింది. ఓ మంచివాడి కధ, రావిశాస్త్రీయం, సొమ్ములు పోనాయండి అన్న రచనలు రావిశాస్త్రిని మరోమెట్టుకు తీసుకువెళ్ళాయి. రాజుమహిషి, రత్తాలు-రాంబాబు రచనలు ఎందుకో అసంపూర్ణంగానే వుండిపోయాయి. చివరి రచనగా, యిల్లు నవలను వ్రాశాడు. మద్యపాన నిషేధ చట్టం అందించిన బహు పరిణామాలను గమనించి, ఆరుసారాకధలు ఒక పెనుమార్పును తెచ్చిపెట్టింది.
విశిష్ట పురస్కారాలకు తిరస్కౄతి
సన్మానాలకు, సత్కారాలకు పరుగులుతీస్తూ, ఆ దిశలో రచనలకు ఉపక్రమించే రచయితలున్న కలికాలంలో, 1983 లో ఆంధ్రవిశ్వవిద్యాలయపు కళాప్రపూర్ణ, అంతకు పూర్వం 1966లో అందుకున్న సాహిత్య అకాడమీ పురస్కారాన్నీ తిరిగి యిచ్చివేయడం చాలామందికి అర్ధం కాలేదు.
రచయిత అందించిన నటుడు
రావిశాస్త్రి రచయితే కాదు, నటుడు కూడ. నిజం నాటకంలోను, గురజాడ-కన్యాశుల్కం లోను, నటనను వొలకపోశాడు. 1962 లో నిజం నాటకం శతప్రదర్శనలు జరుపుకోవడం విశేషమే.
మూడు కధల బంగారం
రావిశాస్త్రిగారి ధర్మేతిహాసం గా వాసికెక్కిన, మూడు కధల బంగారం నవల పై విమర్శలు మరింత వన్నెను చేకూర్చాయి. అందులో, ముదిగొండ వీరభద్రయ్యను ప్రముఖంగా ప్రస్తావించాలి. విశిష్టస్థాయిలో, రావిశాస్త్రి నిర్మాణశిల్పం, కాలం, స్థలం, ఆత్మవిమఋర్శ, స్త్రీపురుషుల నడతలు, ప్రయోజనాత్మకతలు, అలంకారసౄష్టి లాంటి విషయాల్తో, వివరించబడిన తీరుతెన్నులు, ముదిగొండ వీరభద్రయ్యను మరోరచయితగా పరిగణింపబడ్డాడు.
ప్రశంసలతో ... రావిశాస్త్రి
ఈ సాహితీకారుణ్ణి ఎందరో సాహితీకారులు ప్రశంసల చిరుజల్లులతో, వర్షంతో, నింపారు. మచ్చుకు, కొన్ని ---
సంకుచితమైన పరిధిలో దేంట్లేనూ ఇమడలేని వ్యక్తిత్వం కలవాడు రావిశాస్త్రి - పురాణం సుబ్రహ్మణ్య శర్మ.
శాస్త్రి అనతి కాలంలో చడీచప్పుడూ కాకుండా కధక సామ్రాజ్యంలో సింహాసనం ఎక్కికూర్చున్నాడూ నలభయ్యేళ్ళకైన శ్రీశ్రీ అలాగేవున్నాడు. - అబ్బూరి వరదారాజేస్వర ఋఅఒ.
బూజుని వెక్కిరించి దులిపిపారేసి కవనాన్ని మెచ్చుకునే పండితుడు. శ్రీకాళహస్తీస్వర శతకం, కమ్యూనిష్టు మేనిఫెశ్తో అని ఆంటాడు. ఎం. రామకోటి.
పదహారో శతాబ్దపు షేక్స్పియర్ పాత్రల లాగున, రావిశాస్త్రి పాత్రలు కూడా కలకాలం బతుకుతాయి. అప్పారావుగారి లాగే, చలంగాలాగే, ప్రపంచ సాహిత్యంలో గొప్ప రచయితలందరిలాగే ... బ్రహ్మల్లో కూడా మహాత్ములుంటారు. ఇస్మాయిల్.
రావిశాస్త్రికి సిద్ధాంతాల కన్న తనచుట్టూవున్న మనుషులు, వాళ్ళతో చనువు, వాళ్ళమీద చచ్చేటంత ఇష్టం, లేక వెటకారంతో కూడిన అయిష్టం ఎన్నో వున్నాయి. కధలలో కీలకమైన సంఘటనలు జీవితంలోంచి ఏరుకున్నవేగాని తాత్వక సూత్రాలకు అనుగుణంగా మలిచినవి కావు. - పాలగుమ్మి పద్మరాజు.
శ్రామికవర్గానికి, మధ్యతరగతి సమాజపు వ్యక్తులకు. వారి సమస్యలకు తన కధనాల ద్వారా, తనదైన శైలిలో పరిష్కారాలను సఫలీకౄతంగా అందించగలిగిన, రాచకొండ విశ్వనాధశాస్త్రి, 1993 నవంబరు 10 న తన కలాన్ని, శ్వాసను కూడ విడిచాడు.
రచనలో నిజమైన సాఫీదనం, నైపుణ్యం ద్వారా వస్తుంది అని అంటాడు, అలెగ్జాండర్ పోప్. గొప్ప రచయితగా వుండటమూ, గొప్పగారాయటమూ రెండూ ఒకటికాదు అని ఒక కవి చెప్పాడు. కాని దీనికి విరుద్ధం మన రావిశాస్త్రి అని చెప్పాలి. తమ ఆత్మల అంతర్గత లోకాలను ఆవిష్కరించే రచయితలే సమాజానికి అవసరం అంటాడు టాల్ స్ఠాయి. కాని వారే యిప్పుడు కరువు, కాటకం వచ్చినట్లు, నల్లపూసలు అయిపోతున్నారు. రచనా సామర్ధ్యం భగవంతుడిచ్చిన వరం. ఆ వరం రావిశాస్త్రిగారిలో పుష్కలంగా వుండేది. మరింతలుగా రావిశాస్త్రి లాంటి రచయితలు పుట్టగొడుగుల్లా అవతరించాలి, ఈనాటి కలిసమాజంపై, ప్రభావ ప్రేరణలను అందించాలి. సమసమాజోద్ధరణకు కంకణం కట్టుకోవాలి. ఆ తరుణంకోసం, నేను సైతం అంటూ ... ముందుకు పదండి !!! ప్రముఖ కవి రాచకొండ విశ్వనాథ శాస్త్రి (రావిశాస్త్రి) వర్ధంతి సందర్భంగా తెలుగురథం సాహితీనివాళిని సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగు రథం.













1 comment:

Rajendra Devarapalli said...

శ్రీకాకుళం జిల్లా, అనకాపల్లి దగ్గరగానున్న తుమ్మపాల గ్రామంలో... అది విశాఖపట్నం జిల్లా శర్మ గారు