
ప్రప్రంచ కర్షక ఉద్యమ నేత - ఆచార్య యన్. జి. రంగా జయంతి (1900 - 1996)
కర్షకవర్గ చైతన్య స్ఫూర్తిదాత
ఆయనకు ప్రధమస్థానం రాలేదు; ద్వితీయస్థానం పనికిరాలేదు ఆయనకు. అతి సూక్ష్మంగా, రెండు వాక్యాల్లో రాజకీయావస్థను విశ్లేషకులచేత చిత్రించబడ్డవారు.
ప్రపంచ కర్షకులారా ఏకంకండు! అన్న నినాదానికి రూపశిల్పి. మహాత్ముని సంపూర్ణాశీస్సులను పొందిన బహుకొద్దిమంది వ్యక్తుల్లో ప్రధమాగ్రగణ్యుడు. రైతు కూలీలకోసం ప్రత్యేకంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మహామనీషి.రైతుకూలీలరాజ్యన్స్థాపనకోసం మహాత్మునితో సుదీర్ఘచర్చలను జరపడమే కాక, సంభాషణలసారాన్ని, 'బాపూ ఆశీస్సులూ అని గ్రంధస్థం చేసిన వ్యక్తి. గాంధీజీ స్వతంత్ర్యోద్యమంలో భాగంగా 1933 లో ప్రకటించిన క్లారియన్ పిలుపునందుకుని భాగస్వామ్యం వహించిన ఘనుడు. 1936లో కిసాన్ కాంగ్రేస్ పార్టీని స్థాపించిన ధైర్యశాలి. భారతీయ పార్లమెంటు ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని స్థాపించుకోగలిగిన ప్రతిభాశాలిసంపన్నుడు. ఆరు దశాబ్దాలకాలం ప్రజాసేవ చేసిన ప్రజ్ణామూర్తి. తలమానికమైన సేవలనందించినందుకు ప్రపంచఘనతలు చాటిచెప్పే గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రెకార్డ్స్ పుటల్లోకి ఎక్కిన పుణ్యమూర్తి. ఆయనే గోగినేని రంగనాయకులు గా పేరున్న సుప్రసిద్ధులు, ఆనాటి శతాబ్దపు కురువౄద్దరాజకీయ దురంధులు, యన్. జి. రంగా.
నిడుబ్రోలు నుంచి ఆక్స్ ఫర్డ్ మీదుగా చెన్నై ప్రవేశం
7 నవంబర్ 1900 న ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాలోని నిడుబ్రోలు గ్రామంలో జన్మించిన గోగినేని రంగనాయకులు అన్న పేరు గల యన్.జి.రంగా, స్వగ్రామంలోనే ప్రాధమిక విద్యను అభ్యసించి. గుంటూరులోని ఆంధ్ర-క్రిష్టియన్ కాలేజీలో పట్టభద్రులవగా, 1926లో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో, ఆర్ధికశాస్త్రంలో బి.లిట్. ను చదవుకున్న రంగా, మద్రాసులోని పచయప్ప కాలేజీలో ఆర్ధికశాస్త్రంలో ఆచార్యపదవిగా బహుళరాణింపుపొందిన ప్రముఖుడు.
ఆరుదశాబ్దాల రాజకీయప్రస్థానం
గాంధీజీ పిలుపునందుకుని, ఆయన శిష్యరికంలో స్వాతంత్ర్యోద్యమంలో చేరిన రంగా రాజకీయ ప్రవేశం చేసి, భారతీయ రెండవ లోక్ సభకు, తెనాలి నియోజకవర్గానికి ప్రతిభాప్రాతినిధ్యం వహించిన రాజకీయవిదురుడు గోగినేని. 1957-62 నుంచి 1989-1991 వరకు, కొద్ది కాలం తప్పితే, నిరాఘాటంగా, రాజకీయప్రతినిధిగా రాణించిన రైతుబంధు, రాజకీయరారాజు, రంగనాయకులు. తెనాలి, చిత్తూర్, శ్రీకాకుళం, గుంటూరు నియోజకవర్గాల్లోని ప్రజాసమస్యలను, రైతుసమస్యలను తన సమస్యలుగా తీసుకుని వాటికోసం నిరంతరం పోరాటం చేసినవారు రంగా. అర్ధశతాబ్దకాలంపాటు భారతదేశ పార్లమెంటు ద్వారా సేవలనందించిన ఘనతకు ప్రపంచచరిత్రపుటల్లోకి ఎక్కిన వ్యక్తి యన్.జి.రంగా. గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి చొరబడిన చతురుడు.
కాంగ్రేసు నుంచి స్వతంత్ర పక్షం ద్వారా కాంగ్రేసుకు
తొలిసారిగా కాంగ్రేసు ప్రతినిధిగా ఎన్నికైన, రంగా, కాంగ్రేసుని వీడి, స్వంతంగా భారత్ కౄషక్ లోక్ పార్టీని, సహకారవ్యవసాయానికి ఒక రూపకల్పన వహించిన రాజాజీతో స్వతంత్ర పార్టీని స్థాపించి, స్థాపకాధ్యక్షుడుగా ఎన్నికైన రంగా, దశాబ్దకాలంపాటు అదే పదవిలో రాణించాడు. 1962 లో జరిగిన ఎన్నికల్లో పార్టీ పక్షాన 25 స్థానాలు గెలవడమే కాక సమర్ధప్రతిపక్షంగా వ్యవహరించింది. స్వతంత్ర పార్టీ తరఫున చిత్తూరు (1962-67), శ్రీకాకుళం (1967-70) నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా ప్రజాసేవలనందించిన రంగా, తిరిగి కాంగ్రేసు లోకి 1972 లో యిందిరాగాంధి నాయకత్వంలోని పాఋర్టీలోకి పరకాయప్రవేశం చేశారు. పాఋర్టీఫిరాయింపులవల్ల ప్రభావం పొందని ప్రముఖ రాజకీయవేత్తగా రంగా, 7,8,9 లోక్ సభలకు ప్రాతినిధ్యం వహించారు.
రైతు సేవలే పరమార్ధలక్ష్యం - కర్షకవాదమే వేదంగా ...
రైతుబంధు, కర్షకమిత్ర గా ప్రఖ్యాతవహించిన గోగినేని రంగనాయకులుగారు ఆయన కర్షకవాదపరంపరని, కర్షకవేదంగా 'క్రెడో అఫ్ వరల్డ్ పేజెంట్రీ' అన్న ప్రచురణని తెలుగులో 'కర్షకవేదం' గా డా. జక్కంపూడి సీతారామారావు తెలుగు అనువాదంలో, రంగా శతజయంతి ప్రచురణగా 2000-2001 లో ప్రచురించడం పట్ల ఆ కర్షకవేదంలో వున్న విషయప్రాశస్త్యం గురించి వేరే చెప్పనక్కరలేదు.
అంతర్జాతీయ పరంగా రైతు సేవలు
అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య స్థాపకుల్లో ప్రధముడు, ప్రముఖుడు, 1946 లో కోపెంహజెన్ లో జరిగిన ఆహార వ్యవసాయ సంస్థ సభల్లో భారతీయ ప్రతినిధిగాను, 1948 లో సాన్ ఫ్రాన్సిస్కో లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సంస్థ సభల్లోను, 1952 లో ఒట్టావా లో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొనడం, 1952 లో న్యూయార్క్ లో జరిగిన అంతర్జాతీయ రైతు సంఘం లో ప్రాతినిధ్యం, 1955 లో టోక్యో లో జరిగిన ప్రపంచ ప్రభుత్వ ఆసియన్ కాంగ్రేస్ సమావేశాల్లోను, తన ప్రతిభాప్రాతినిధ్యాన్ని అందించి భారతీయతకు, రాజకీయానికి, రైతులసమస్యలను, సంక్షేమాన్ని నొక్కి వక్కాణించిన ప్రతిభామూర్తి రంగనాయకులు.
సన్మాన సత్కారాలు
ఆరు దశాబ్దాలకాలంపాటు, 1930 నుంచి 1991 వరకు వివిధ దశల్లో సేవలనందించిన ఘనత కేవలం రంగా కే చెందడం మూలాన, ఆయన పేరుప్రఖ్యాతులు, గిన్నీస్ బుక్ లోకి ఎక్కించబడ్దాయి. ఈయన విశిష్టసేవలకు తార్కాణంగా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ను 'ఆచార్య యన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం'గా మార్చి రంగా రైతుబంధువుగా సేవలకు సార్ధకతను తేవడం జరిగింది. భారతీయ వ్యవసాయ పరిశోధనామండలి లో 2001 నుంచి యన్.జి.రంగా వ్యవసాయరంగంలో రైతు పురస్కారాన్ని ప్రవేశపెట్టడం కూడ జరిగింది. రంగా చిరస్మరణీయ సేవలకు గుర్తింపుగా భారతీయ తపాలాశాఖ వారు, జనవరి 2001 లో స్మారక తపాళాబిళ్ళను విడుదల చేశారు.
పార్లమెంటు ప్రవేశంలోనే రంగా విగ్రహం ప్రత్యక్షం
లోక్ సభ ప్రాంగణంలోని 4 వ గేటు దగ్గరగా ఆచార్య రంగా విగ్రహాన్ని స్థాపించడం, అందరికీ ప్రత్యక్షమవుతుంది. కేంద్ర శాసనసభ, రాష్ట్ర స్థాపక శాసనసభ, తాత్కాలిక పార్లమెంటు, రాజ్యసభ, లోక్ సభ ల్లో 50 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహించడం వహించిన రంగా, అంటరానితనాన్ని, పరదా విధానాన్ని, వ్యతిరేకించిన రంగా, తన స్వగ్రామం నిడుబ్రోలులో భారతీయ రైతు సంస్థను స్థాపించాడు. డి.శంకర్ సోదరుల శిల్పచాతుర్యంతో రూపుదిద్దుకున్న ఢిల్లీ పార్లమెంటు లో స్థాపించిన రంగా విగ్రహాన్ని 27 జూలై 1998 న ఆనాటి ఉపరాష్ట్రపతి కౄష్ణకాంత్ చేతులమీదుగా ఆవిష్కరించబడిన విగ్రహం ఆంధ్రప్రదేశం ప్రభుత్వం బహూకరించడం జరిగింది. కర్షకవేదం గ్రంధాన్ని కూడ కౄష్ణకాంత్ విడుదలచేయడం విశేషం.
కర్షకవేదం తనదైన వాదంగా ...
ప్రపంచ కర్షక జీవన విధానాన్ని, వ్యవసాయక విధానాలను, దశాబ్దాల క్రితమే శోధించి, మధించి, విశ్లేషించి, అర్ధశతాబ్దం క్రితమే భవితను ఈ నాడు జరుగుతున్న తీరులోనే ఊహించి చెప్పిన ఆచార్య రంగాగారి 'క్రిడో ఆఫ్ పెజెంట్రీ' ని నిజ కర్షవేదమే! వ్యవసాయం అంటే ఇష్టం, కర్షకులంటే మరీ ఇష్టం, హాలిక జయశ్రేయం వారి నిరంతర ఆలోచనాలోచనం. అమ్మలోని లాలన, నాన్నలోని పాలన, గురువులోని బోధన, యోగిలోని సాధనలతో అనేకమందికి మార్గదర్శిగా తన భావాల్ని చవిచూపించి, తీర్చిదిద్దిన మహామనీషి రంగా. నిజంగా అక్షరాలకందనిది, మాటలకు చాలనిది, అన్నీ తానైన సర్వులకు హితుడు, కర్షకచంద్రుడు, రంగాగారి మాట పెక్కుమందికి రాచబాట. ఎంతోమందికి ఆరాధ్యదైవం. నిండు మనంబు నవ్యనవనీత సమానం అన్నట్లు పరిమళించే మానవత్వం, గుబాళించే మంచితనం రంగాగారిది. కర్షకవేదం లో, రైతులు-చేతివౄత్తులవారిపట్ల సాంఘికన్యాయం, కీలక సేవాసూత్రాలు, వత్తిడి ఉత్పత్తి, యుద్దప్రభావం, ఆర్ధిక సంక్షోభం, పెట్టుబడిదారీ పిడికిలి మరియు దోపిడీ వ్యవస్థకు ప్రభుత్వాల మద్దతు - గ్రామీణ ఆర్ధికత, పీల్చుకుని తినే వ్యవసాయ వ్యయాది వ్యవహారాలు, పరిశ్రమలో మాంద్యత, సామ్రాజ్యవాదదోపిడీవిధానాలు, ప్రజలు, రైతుల వలస విధానాలు, ప్రపంచ విఫణి, అంతర్జాతీయ వర్తకం, జాతీయ ధరల విధానాలు, జాతీయ స్వయం సమౄద్ధి ఆర్ధికవిధానం, రైతులను స్వాహాచేయలేవని కాపిటలిజం, కమ్యూనిజ వ్యవస్థలపై చెణుకులు, చురకలు, రైతులకు సంఘికన్యాయం జరగాలనే సంకల్పంలో గ్రామ కామన్వెల్తుల స్థాపనకు సలహాలు, ఆధుని రైతు ఆవిర్భావ స్థితిగతులు, విప్లవపథంలో రైతులు, కళాకారులు, వ్యవసాయ రక్షణ విధానాల్లాంటి విషయాలపై కూలంకషగా చర్చించడం,ఈ కర్షకవేదం లో జరిగింది.
ప్రజాస్వామ్యమంటే, రైతుల, చేతివౄత్తుల, కార్మికుల, బుద్ధిజీవుల ప్రజాస్వామ్యప్రభుత్వమని, అదే కిసాన్ మజ్దూర్ ప్రజారాజ్ అన్న తన ఆదర్శాన్ని మహాత్మాగాంధీ ఆశీర్వదించారు. సామ్యవాద సహకార కామన్వెల్తుకు మహాత్ముడందించిన బహుమానం. మహాత్ముని ఆదర్శాలను రైతులకన్వయించి విశ్లేషించిన గ్రంధం - కర్షకవేదం. స్వాతంత్ర్యం, స్వేచ్చ, అభివౄద్ధి, సమానన్యాయం గల నవసమాజం ఏర్పడుతుందన్న ఆశావాది. వికేంద్రీకౄత సహకార ప్రజాస్వామ్యసమాజంపై విశ్వాసం కల వ్యక్తి. సాంఘిక - ఆర్ధికన్యాయాలకు రైతులు, చేతివౄత్తులవారు పెట్టని కోటలు, అయినా ఆధునిక పాలకులు వీరిని పట్టించుకోవటంలేదు అన్న ఆవేదనని ఆనాడే వ్యక్తం చేసిన వ్యవహారకర్త. వ్యవసాయేతర ప్రజ రైతులను ఆదుకోవాలన్న భావనను ప్రచారం చేసిన ఘనుడు.
సర్వేజనా:స్సుఖినోభవంతు: అన్న నినాదాన్ని, సూక్తిని భారతదేశంలోని రైతుబంధువర్గానికి ఒక ప్రత్యేక సందేశాన్ని అందించిన కర్షకమిత్ర, రైతుబాంధవుడు, కిసాన్ రధసారధి - గోగినేని రంగనాయకులు అనబడే యన్.జి.రంగాగారు. రంగాగారు ఆశించిన పథంలో, మన దేశం రైతులను నడపడంలో, నడిపిడించడంలో ప్రస్తుత నాయకత్వం నడుంకట్టాలి. సమరదీక్షాకంకణబద్ధులై ముందుకు నడవాలి. రైతుదే రాజ్యం, రామరాజ్యంగా విలసిల్లాలి. భావిభారతసీమ రైతుపరంగా సుసంపన్నం కావాలి. రంగాగారి ఆత్మ శాంతించేటట్లు మన రైతులకు చేయూతనివ్వాలి. దీనికి మన నాయకులు, ప్రజాస్వామ్యరక్షకులు, ప్రభుత్వాలు నిరంతరంకృషి చేయాలి.
కర్షక వర్గపు దేవుడు అయిన అచార్య యన్.జి.రంగా గారి జయంతి సందర్భంగా తెలుగురథం కర్షక వర్గం తరఫుల ఘన నివాళిని సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.
3 comments:
నా చిన్నప్పుడు రంగా గారి స్వతంత్రపార్టీ గురించి వినడమే కాకుండా ఆ పార్టీ తరఫున ప్రచారం కూడా చేసినట్లు లీలగా గుర్తుకొస్తూందిప్పుడు.
well written about Rangaji.
The present generation may not know much about Ranga garu, but everyody has to read about him and follow his teachings.He sacrificed his wealth and life for the welfare and uplift of farmers and agriculture workers. He did not get enough recognition during his life time, ofcours he never expected or anticipated.
He was never addressed by anybody as 'Ranga', it has always been "Ranga garu" or "poojya Rnagaji"only.
కొంపెల్ల శర్మ గారికి,
ఆచార్యుని గురించి సమగ్రంగా వివరించినందుకు ధన్యవాదాలు..
Post a Comment