Friday, January 30, 2009

విశ్వ మానవ మహితాత్ముడు - మహాత్మాగాంధి



కవితా సుమాలతో మహాత్మునికి స్మృతి నివాళి (1869 - 1948 )

గాంధీ వర్ధంతి - జనవరి 30 - 'హే రాం!
ఆరు దశాబ్దాల పైగా ఆరని భావాగ్ని యింకా రగులుతూనేవుంది
.

పుట్టినరోజు భారతీయులకు పుణ్యతిధి
గుజరాత్, పోరుబందర్ లో 2 అక్టోబర్ 1869 జన్మించిన కరంచంద్ గాంధీ, తన చదువును స్వదేశంలో పూర్తిచేసుకుని, న్యాయవాదం లో చదువుకోసం యింగ్లండు ప్రయాణమయ్యాడు. చదువు పూర్తిచేసుకుని, బారిష్టర్ హోదాలో 1891 లో తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు. గాంధీ తన 'ఆత్మకధాను 'మై ఎక్స్పెరిమింట్స్ విత్ ట్రూఠ్ అన్న రచన నిత్య సత్య స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. సమాజోద్ధరణ కోసం పాటుపటిన నిష్కళ్మష కరుణామూర్తి. సమాజంలో మతసామరస్యతను, ప్రశాంతతను కోరిన ఈ మహాత్ముడు, తానే ఒక మతదురహంకారి, నాధూరాం గాడ్సే ఘాతుకానిని గురయి, తుపాకీ గుండి తన గుండెలో దూసుకుపోగా, హేరాం' అని నేలకొరిగిపోయాడు, మన జాతిపిత, మహాత్ముడు. మోహనదాసు కరంచంద్ గాంధీ.
ఆయన మహానుభావుకతకు, త్యాగనిరతకు నివాళులను సమర్పించాల్సిన ఘనతరుణం నేడు. మహాత్మునికి మహనీయమైన నివాళి.
ఆ రోజు 1948, జనవరి 30. భారతదేశ ప్రజావాహిని స్వాతంత్ర్య సంబరాలు ఏడాది పూర్తి కాకుండానే, బానిస పరిపాలన నుంచి విముక్తి పొందడానికి తనదైన కౄషిని నభూతో నభవిష్యత్ అన్నట్లు సేవలను అందించిన తీరుతెన్నులు కొంతమంది మతోన్మాద వ్యక్తులకు కన్నుకుట్టినట్లు అయింది. ఫలితంగా జాతిపిత, మహాత్మాగాంధి, మోహన్ దార్ కరంచంద్ గాంధీ, వినాయక్ రాం గాడ్సే తుపాకీ గుళ్ళకు బలి అవడం, తుపాకీ గురిపెట్టే ముందు గాంధీకి ప్రణమిల్లడం, వెనువెంటనే మహాత్ముని పేల్చడం, ఒకే ఒక తుపాకీ గుండు దూసుకుపోతకు, జాతిపిత, 'హేరాం' అని నేలకి వొరిగిపోయాడు. విశ్వవ్యాప్తంగా, జనవరి 30 న ప్రతీ సంవత్సరం ఉదయం 11 గంటలకు జాతిపిత నివాళి నిమిత్తం రెండు నిమిషాలు మౌనం పాటించడం, భారతదేశం ప్రజలు యావత్తూ, జాతిపితకు ప్రకటించుకునే కనీస ౠణం. యిలా, కొన్ని వేల ఏండ్లు చేసినా, గాంధీజీ మనకు అందించిన అప్పు తీరనే తీరదు. నిత్యం ౠణగ్రస్తులమే అన్నదాంట్లో విడ్డూరం లేదు. ఏది ఏమైనా, గాంధీజీ మరణం సమయంలో, వెలువడిన ఆఖరి పదం - 'హే రాం!' అన్నపదం నేటితో ఆరుపదుల వసంతాలను పూర్తిచేసుకొంటున్నది. హే రాం కు షష్టిపూర్తి అన్న భావం మాత్రం సత్యం.
మహాత్ముని జీవనసారాంశం
దక్షిణాఫ్రికాలో ప్రారంభమైన గాంధీ రాజకీయ జీవితం, గత శతాబ్దపు ప్రారంభంలో, నిరాకరణోద్యమంతో శ్రీకారం చుట్టబడింది. 1916 లో భారతదేశం తిరిగి వచ్చి, జాతీయ స్వతంత్రోద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. గాంధీ నాయకత్వంలో, నేతౄత్వంలో అనేక ఉద్యమాలు నిర్వహించబడ్డాయి. ముఖ్యమైనవి - నిరాకరణోద్యమం (1920), పౌరహక్కుల ఉల్లంఘనోద్యమం (1930), క్విట్ యిండియా ఉద్యమం (1942) గాంధీ జీవితాన్ని, నడతను వెన్నంటుతూ వున్నాయి అని చెప్పాలి. 1930 లో గాంధీజి, ఉప్పు సత్యాగ్రహం (దండి ప్రస్థానం). హరిజనులోద్ధరణ కోసం పాటుపడ్దాడు. అప్పటివరకూ అంటరానివారు గా పరిగణింపబడుతున్న వారికి 'హరిజనా నామధేయం కొత్త తరహా అనుభూతిని చెందుతారు. 'అంటరానితనం' భగవంతునిపై, సమాజంలో సాటి మనుషులపై ప్రకటించే పాపం అనే చెప్పాలి అని భావించాడు. 'భారతదేశ జాతిపితా అన్నది ఒకే ఒక మనిషికి దొరకిన వరప్రసాదం. అహింసా ధోరణిని అవలంబిస్తూ, సత్యవ్రతానికి జీవితాంతం ధారపోసి, ఆచరించిన సత్యవ్రతామూర్తి, మోహన్ దాస్. హిందు-ముస్లిముల సమైక్యత, సహకారం కోసం అహర్నిశలు శ్రమించిన శక్తిమానుడు.
మనవాడే కాని అందరివాడు
భారతీయుడైనా, ఆయనను మనవాడని చెప్పుకోవడం సంకుచితసమానం. ప్రపంచం తనవాడిగా ఏనాడో చేసుకుంది. ఆయన కరుణకు పర్యాయపదం. సత్యం, అహింసలతో ముక్తి సాధించిన మహాతపస్వి. మానవజాతి చరిత్రలో అత్యున్నత స్థానమలంకరించిన మహనీయుడు. నిరుపేద, బలహీన ప్రజలకు కొండంత ధైర్యమిచ్చిన దీనజనబాంధవుడు. తనకోసం కాక మనకోసం బ్రతికిన మహామనీషి. ఆయన గురించి ఎవరు, ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచ ప్రజల హౄదయాల్లో ఆయన ప్రసాదించిన ఆశాజ్యోతి. మానవజాతి వున్నంతవరకూ వెలుగుతూనే వుంటుంది. ఆయన అసలు మానవ మాత్రుడేనా అని గొప్ప అనుమానం రాకమానదు. ఆ మహానుభావుడి గురించి కవిత రాయని కవులు భారతదేశంలో వుండరు. ఆయన జయంతి దినోత్సవం సందర్భంగా, కొందరు ప్రముఖుల కవితాసుమాల ద్వారా ప్రకటించిన స్మౄతి నివాళి సారాంశాన్ని చెప్పే చిరు ప్రయత్నం.
ఆయన, ఆ మహామనీషి ఎవరో కాదు. ఆయనను - జాతిపిత, మహాత్ముడు, బాపూజీ, గాంధి అని పిలుస్తుంటారు. అసలు పేరు - 'మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.
ఒక జయంతిని చేయుటకంటే ఒక్క మాట నిజం పలుకుట మేలు. గుండె పవిత్రమగును. గాంధి, బుద్ధుడు, హరిజనులు సంతోషిస్తారు(1).
అతడు సామాన్య వ్యక్తి. అతడసామాన్య వ్యక్తి. తౄణంకన్నా తేలిక. మేరువుకంటే ధీరుడు. ఆగర్భ శ్రీమంతుడు. నిత్యదరిద్రనారాయణుడు. వయస్సు మీరిన బడుగు. వయస్సులేని విసువు. అన్యాయం సమక్షంలో అగ్రమహోదగ్రమూర్తి. చరాచర ప్రపంచానికి క్షమా మార్గదర్శి. అతడిప్పుడు లేడు. అతడెప్పుడూ వున్నాడు. అమరత్వం అందుకున్న అతనికి మా నుతులు(2).
ఇతడు బాపూజీ. బోసినవ్వుల తపస్వి. భారత మహా స్వతంత్ర రణాంగణ్మున సర్వ సేనాని. సత్యాగ్రహ ప్రణేత. సర్వ సర్వంసహా పరిత్రాణ కీర్తి(3).
మన గాంధీ గుణకంధి. మరికానబడడా! తానిచ్చినది భారత స్వరాజ్యము కాని, పుచ్చుకొన్నది మొక్కవోని స్వారాజ్యము!(4)
కట్టుకున్నాడు మోకాలు తాకెడి రీతి అంగవస్త్రము. నేసినట్టిదానిని నాడు సన్యాసిపోల్కి తత్సమయంబునం దోచె. భరతఖండమునకు భయము లేదనిపించె. పరిశుద్ధమనిపించె బాపూజీ గాత్రంబు (5).
ఆయన పేరు సత్యం. భారతీయ సముద్రగర్భంలో దొరకిన మానవముత్యం. ఆయన వూరు పోరుబందరు. ఊరిలోనే పోరున్నదని ఉలిక్కిపడ్డారు కొందరు. దారితప్పి చెట్టుకింద చేరిన బాటసారులకు ఎటు గమ్యమో అప్పుడు తెలిసింది. దాహంతో నాలుక పీక్కుపోతున్న పాంధులకు ఏ దిక్కు సరోవరమో అప్పుడు తెలిసింది(6).
సత్యాహింసలు రాజకీయ రధానికి పూంచిన తొలిసారధి. ఊతకర్రతో ఊర్వారనే ఉర్రూతలూపిన సేవాచార్యుడు. చిరునవ్వుతో శాత్రవ హౄదయ మాలిన్యాన్ని ప్రక్షాలించిన ఘనుడు. ప్రేమతో ప్రపంచాన్ని గెలిచిన ఘనుడు. విశ్వమానవ మహితాత్ముడు. గాంధీమహాత్ముడు(7).
సేదగొన్న శ్రమజీవికి శరణం. పల్లెవాకిటికి పచ్చతోరణం. అంధ జగతికాశారుణ కిరణం. మరివేరెవ్వరు! మా బాపూజీ(8)
కొల్లాయి గట్టితేనేమీ, మా గాంధీ కోమటై పుట్టితేనేమీ? వెన్నపూసా మనసు, కన్నతల్లీ ప్రేమ, పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు, బోసి నోర్విప్పితే ముత్యాల తొలకలే, చిరునవ్వునవ్వితే వరహాలు వర్షమే, చకచక నడిస్తేనూ జగతి కంపించేనూ,పలుకు పలికితేనూ బ్రహ్మ వాక్కేనూ(9)
అదెగో రాట్నము చేత దేశజులకు ఆహారంబు కల్పించి అభ్యుదయాపాదక సామరస్యమునకు ఆయుర్దాయమున్ పోసి, గాంధితాత ౠణమున్ విశ్వంబెటుల్ తీర్చునో(10)!
రామమంత్రమ్ములో ఐక్యమై, మహర్షి యతడు, వాల్మీకి రామైక్యమందినాడు, తాత మంత్రంబులో ఐక్యమై తపంబు పండి, తేజస్సు నేనుగా పరిణమింతు(11)
కత్తి కదల్చలేదు! విశిఖాలు విదల్చనులేదు గాండీవంబెత్తనులేదు! ఏ క్రియ జయించితివో నరమాంస పారణోన్మత్తుల? నీ ప్రభావములమానుషముల్ భవదీయ శంతిసంపత్తికి దోసిలొగ్గెను ప్రపంచము భారత భాగ్య దేవతా!(12)
శిలువమీది ఏసు వీవె చిరంజీవి బాపూ! వషకషకపు సోక్రటీసు వీవు కావా బాపూ! కాళరాత్ర గర్భ దీప్తి కలి కౄతముగ సంధీకరున కంధి శాంతిపంధి కర్మవీర గాంధీ! జాతిపితా! కైమోడ్పులు చేతుమోయి నేడు, శ్రద్ధాంజలి ఘటించి నీ జయంతినాడు ప్రజా హృదయ ఫలకమ్మున ప్రత్యక్షమ్ముకమ్ముజ్, సత్య మార్గమనుసరించు శక్తిని మాకిమ్ము.(13)
అల్ల ధర్మరాజును ఎరింగినట్టివాడు, తిక్కనార్యుని పుణ్యాన తెలుగువాడు, నీ అహింసను నీ నీతి నియమములను బట్టి అతడు నిను గుర్తుపట్టగలడు(14).
సరసచేరిన సిద్దార్ధ శాక్యయోగి, తాను చెప్పని భక్తి తత్వమ్ము చెప్పి జాతి నడిపించి వావని సంతసించు, స్వర్గరాజ్యం నీ వేగు సమయమందు(15)
భయంకర స్వార్ధాస్ఫాలితమై, సర్వదేశప్రజ సంక్షోభిస్తే, సత్యహింసల బోధన చేసీ, నిరంతరం మా హౄదంతరంలో ... (16)
పాలసముద్రంలో నడచివచ్చిన రీతి, హిమాచలాగ్ర శౄంగాలు కరాలుసాచి మనకై అరుదెంచిన భాతి, శాంతి సత్యాలు మనుష్యరూపమును దాలిచి నేలకుడిగినట్లు గాంధీ లలితాత్ముడుజ్జ్వలమతిన్ భరతావనిపైన కాలిడెన్(17)
అడవి స్మౄతి తప్పిపోయినట్టి బుద్ధదేవునకు పాలుపోసెనే దివ్యమాత, ఆ సుజాత నీ గొంతులో అమౄతరసము పోయెదేల నేడు అదౄష్టముగ మహాత్మా(18)
మా భావములన్ సువాసనలు పైకొన విచ్చిన యీ కౄతజ్ణతా ప్రావౄత పుష్పముల్ నీకిడుచుంటిమో అహింసావశ కర్మయోగి! మము పాకతమొప్ప నను గ్రహింపవే(19)
దెక్కెరుంగక లేబవల్ దేవురించు, ప్రజకునేర్పితివి ఆత్మగౌరవ సమీక్ష, బాపూజీ స్రష్టనీవు నీ చూపుసోకి, ద్రష్టలైనారు కొందరీతరమువారు(20)
హరి సౄజించె నరుని అచ్చమ్ము తనపోల్కి, నరుడు తన్నుబోలి హరి సౄజించె, ఇనుమి పైడిజేయు నీశ్వరుండే నేర్చు, కడలివోలె నెల్ల కడల నీశ్వరుండుండ, బిందువై వసించునందు నరుడు, కడలి బాసి బిందువడగారు నిక్కము, గాంధి పలుకు ధర్మగంధమొలుకు(21)
శిల్పసూత్రార్ధాలు తెల్పు సౌందర్యాలు, స్వల్పమై మూర్తిలో దేశదేశాల ఆశాంతాల వెలిగిస్తూ, నీ బోసినవ్వులో నీ సౄష్టివాక్కులో నీ కన్నుజంటలో రేకలు తిరుగుతూ మహాత్మా!లోకమోహనమయ్యె హిమాలయోత్తుంగశౄంగం నీ బ్రతుక్(22)
పాడితప్పి జనము పాడగుచున్నారు. నడపుదారి విడిచినారు. రకరకాల హింస రగులుచున్నది నేల, ఎవరితోడ విన్నవింపవలయు? నీవు లేవు సరియె నీ నీడయునులేదు, నీదు బోధలెల్ల నేల గలిసె, నిన్ను బొమ్మజేసి నిలుచుండబెట్టిరి, ఒక్క దిక్కు లేదు, మొక్కు లేదు, నీకివె జోతలు గాంధీ! నీకిదె కైమోడ్పు నిఖిల హౄత్ సంవర్తా, నీకు నమస్కారమిదె చేకొనుటకు నీవులేక చేవ్డ్వడితినయా(23)
ఏడులు గడిచెను అయినా ఈ నాటికీ నీ పేరు తలచుకుంటే చాలు, మాభయాల చిమ్మచీకట్లలో నీ అభయహస్తపు మెరుపులు తళుక్కుమంటాయి, బాపు! తళుక్కుమంటాయి(24)
జగతి మౌనమె సర్వార్ధ సాధకమగు నిడివి నీ మౌనమదినీకె యిడె ఫలంబు, కాని పరమౌషధంబు లంఘన మనుట వ్త్వదుపవాసాల నొరులకు కుదులు రుజలు(25)
నీవుదయించినట్టిమహనీయ ముహూర్తము భారతీయ సుశ్రీవియదధ్వమందు బొలిచెన్నవ భాను మహోదయాభమై పావన తద్రుచివిశ్ఫురణ బ్రాకిన దాస్య తమస్సు విచ్చి మోదావహరాగరేఖలు దిగంతములన్ విలసిల్లె బెల్గుగా(26)
కమ్మగా బతికితే గాంధియుగంమనిషి కడుపునిండా తింటే గాంధీజగంపరమార్ధమొక్కటే గాంధీమతంమనిషి భయము వదిలేయుటే గాంధీహితంభోగలోలత విడుటే గాంధీవిధంత్యాగరధమెక్కితే గాంధీపధంమనిషి మర్యాదయే గాంధీధనంమనిషి మారితే కోవెలగ గాంధీతనంతన కంఠమున దాచి హాలాహలంతలనుండి కురిపించి గంగాజలంమనిషి శివుడవుటయే గాంధీవరంబాపుననుసరిస్తే చాలుమనమందరం(27)
నీవు పుట్టిన గిట్టిన తావులెపుడు, ధరణి శాశ్వత పుణ్యతీర్థంపులగు(28)
ఓ మహాత్మా! ఓ! మహర్షీ! అని కవులచేత అనేకవిధాల కొనియాడబడిన మన జాతిపితని, బాపూని, జ్ణానపీఠపురస్కార గ్రహీత, ప్రముఖ కవిశేఖరుడు డా. సి.నారాయణరెడ్డిగారి భావనతో భరతవాక్యం పలకడం కడు సమంజసం.
హిమాద్రి ఎంత ఎత్తు? హేమాద్రి ఎవరి సొత్తు?మహాత్మా నీ స్వరూపం తుహినాద్రికి సంక్షిప్తరూపంబాపూ నీ చిత్తం ప్రపంచానికి దొరికిన విత్తంబాపూ నీ పుట్టిన రోజు భగవానుడు పుట్టినరోజుఒక రాముడు పుట్టినరోజు, ఒక రహీము పుట్టినరోజుచావులేని పుట్టకలేని సత్యమూర్తి పుట్టినరోజుదాస్యంలో విలవిలలాడే ధర్మం తొడగొట్టినరోజు.
జాతిపిత మహాత్మాగాంధి, మోహన్ దాస్ కరంచంద్ పై కవితాసుమాలను పలవరించిన మహాకవుల వివరాలు :
1. విశ్వనాధ సత్యనారాయణ 2. శ్రీశ్రీ3. పురిపండా అప్పలస్వామి4. మధునాపంతుల5. శివశంకరస్వామి6. కుందుర్తి ఆంజనేయులు7. బోయి బీమన్న8. వేదుల సత్యనారాయణ శాస్త్రి9. బసవరాజు అప్పారావు10.గుర్రం ఝాషువా 11.పుట్టపర్తి నారాయణచార్యులు12.జంధ్యాల పాపయ్యశాస్త్రి13.మల్లవరపు విశ్వేశ్వరరావు14.ఉత్పల సత్యనారాయణచార్యులు15.పైడిపాటి సుబ్బరామశాస్త్రి16.ఆరుద్ర17.దాశరధి18.రాయప్రోలు సుబ్బారావు19.నాయని సుబ్బారావు20.తుమ్మల21.కాటూరి వెంకటేశ్వరరావు 22.అడవి బాపిరాజు23.విద్వాన్ విశ్వం24.కాళోజి25.వానమామలై వరదాచార్యులు26.దివాకర్ల వెంకటావధాని27.దేవులపల్లి కౄష్ణశాస్త్రి28.వెన్కతపార్వతీశకవులు
మహాత్ముడి వర్థంతి సందర్భంగా తెలుగురధం ఘన నివాళి సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

Tuesday, January 20, 2009

అన్నమయ్య - లక్షగళ సంకీర్తనార్చన - సిలికానాంధ్ర


సిలికానాంధ్ర, తిరుమల తిరుపతి దేవస్థానములు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,సాంస్కౄతిక శాఖసంయుక్త ఆధ్వర్యంలో


అంతర్జాతీయ అన్నమాచార్య 601వ జయంత్యుత్సవం
లక్షగళ సంకీర్తనార్చన
ఆదివారం, మే 10, 2009, సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్

సిలికానాంధ్ర తెలుగు, సాహితీ, సాంస్కౄతిక సంప్రదాయ స్ఫూర్తితో గత 7 సంవత్సరాలుగా అమెరికాలోనూ, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో అచ్చమైన తెలుగుదనం ప్రతిబింబించే అనేక కార్యక్రమాలని చేపడుతోంది. ఈ కార్యక్రమాల్లో వందలాది మంది యువతీ యువకులు పాల్గొని తెలుగు సంస్కౄతి గొప్పతనాన్ని చాటుతున్నారు.
600ల ఏళ్ళనాడు తెలుగు నాట జన్మించి తిరుమల శ్రీ వేంకటేశ్వరుని తన వేలాది కీర్తనలతో అర్చించి తరించిన ధన్య చరితుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు. ప్రతి ఏటా అన్నమయ్య జయంతి ఉత్సవాన్ని సిలికానాంధ్ర అపూర్వమైన రీతిలో నిర్వహిస్తున్నది. అన్నమయ్య జయంతిని ఒకసారి రాష్ట్రమంతటా, మరోసారి దేశమంతటా, ఇంకొకసారి ప్రపంచమంతటా ఒకేరోజున ఒకే రీతిలో నిర్వహించి, అన్నమయ్య సంకీర్తనా వైభవాన్ని చాటిచెప్పింది. ఇప్పుడు అన్నమయ్య 601వ జయంతిని ప్రపంచ చరిత్రలో మునుపెన్నడూ జరగని రీతిలో నిర్వహించ తలపెట్టింది.
లక్షమంది గాయనీ గాయకులు చిన్నా పెద్దా తేడా లేకుండా యువత ప్రధానపాత్ర వహించి అన్నమయ్య సప్తగిరి సంకీర్తనలు -
1. భావములోన 2. బ్రహ్మకడిగిన పాదము 3. ఎంతమాత్రమున 4. పొడగంటిమయ్య 5. కొండలలో నెలకొన్న 6. నారాయణతే నమో నమో 7. ముద్దుగారె యశోద
ఏకకాలంలో, ఏకస్వరంగా ఆలపించి గిన్నిస్ ప్రపంచ రికార్డు నెలకొల్పబోతున్నారు.
ఆదివారం మే 10, 2009 నాడు జరిగే ఈ "లక్షగళ సంకీర్తనార్చన" కు సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ వేదిక కానుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని చూసి రికార్డు నమోదు చేయబోతున్నారు. అన్నమయ్య సంకీర్తనావైభవాన్ని ప్రపంచ వేదికపై చాటిచెప్పే ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా గాయనీ గాయకులను మనసారా ఆహ్వానిస్తున్నాము. ఇందులో పాల్గొనదలచిన వారు 100/- రూపాయలు తమ దగ్గరలోని ఆంధ్రాబ్యాంక్ సాఖలో చెల్లించి తమ అపేరును నమోదు చేసుకోగలరు. లక్షగళ సంకీర్తనార్చనలో నమోదు చేసుకొని పాల్గొను గాయనీ గాయకులకు రైల్వే కన్సెషన్ ఇవ్వబడుతుంది. ఈ అపూర్వమైన కార్యక్రమ వివరాలు మీ బంధుమిత్రులందరికీ తెలియపరచి ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించండి.
మరిన్ని వివరాలకు :మొబైల్ : 99892 95939. లాండ్ లైన్ : 040 - 2717 1876. ఈ-మైయిల్:
సందేహాలకు, సంప్రదించవలసిన చిరునామా:సిలికానాంధ్ర, ఫ్లాట్ నెం. 203, శ్రీ హర్ష రెసెడెన్సీ, రోడ్ ణొ.6, హబ్సిగుడా, హైదరాబాద్-500 007.
మీరు తెలుగురథం నిర్వాహకులను కూడ సంప్రదించవచ్చును.
కొంపెల్ల శర్మ, అధ్యక్షులు, తెలుగురథం.

ఫోన్: +91 40 65975574/2768 5351. మొబైల్: +91 97017 31333. +91 90007 31333.

Monday, January 19, 2009

విశ్వ విఖ్యాత సార్వభౌమ - నందమూరి తారకరామ



విశ్వవిఖ్యాత సార్వభౌమ - నందమూరి తారకరామ


(మే 28, 1923 - 18 జనవరి, 1996)
'ఆంధ్రజాతికెవడు - ఆత్మగౌరవముద్ర, ఆనవాలు తెచ్చినట్టి ఘనుడు! మేటి నాయకుండు - మేధావి - తేజస్వి రామారావు తెలుగు సీమలోన, యావదాంధ్రమునకు - జీవత్ పతాకమై, తెలుగు వెలుగు సర్వదిశల నింపి, నట వరుండు బ్రదికె నవ్యాంధ్ర భోజుండు రామారావు సార్వభౌముడగుచూ అని ప్రముఖ కవి నండూరి రామకౄష్ణమాచార్య, నందమూరి తారకరామారావుగారి గురించి, 'దేశభాషలందు తెలుగు లెస్సా అన్న తెలుగు సంస్కౄతీ, సాహిత్య, సమగ్ర, సంక్షిప్త సంకలనం, అన్నగ్రంధంలో వివరించారు.
అందరికీ మార్గదర్శిరాజీ పడని సైనికుడు, నట, రాజకీయ సార్వభౌముడు. ఆయన మార్గం అనితరసాధ్యం. ప్రపంచంలోనే ఒక అపురూపమైన వ్యక్తిత్వాన్ని, గుర్తింపును పొందిన మొదటి తెలుగువాడు అని చెప్పక తప్పదు. తెలుగువాడికి మదరాసి, లేక దక్షిణాదివాడు అనే ముద్ర వుండేది. దానిని పోగొట్టి ఆంధ్రావనిలో ప్రతి తెలుగువ్యక్తికి తెలుగువాడికి గౌరవాన్ని, ప్రత్యేకతను, వాడిని, వేడిని, తీసుకువచ్చిన ఘనత నిస్సందేహంగా ఆయనదే. క్రమశిక్షణకు, కౄషికి, దీక్షకు,మారుపేరుగా పేర్కొనక తప్పదు. నిరంతరం ఆయన కౄషీవలుడే. ప్రజలు ఎప్పుడు ఆపదలో వున్నా, విపత్కర పరిస్థితులలో వున్నా ముందుకొచ్చి ఆపన్నులను ఆదుకున్న మానవతామూర్తి. ఎప్పుడు ఏ సందర్భంలోనైనా తన సహాయం అవసరమనుకుంటే ముందుండి నాయకత్వం వహించేవారు. నాలుగు దశాబ్దాల కళాసేవ తర్వాత, ఆయన మనసు ప్రజాసేవవైపు మొగ్గింది. తిరుగులేని కళాకారుడిగా తనను యింత స్థితికి తీసుకువచ్చిన తెలుగు ప్రజానీకానికి సేవ చెయ్యాలనే నిర్ణయం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మెరుపులా వచ్చిందని చెప్పవచ్చు. తెలుగు మహానుభావుల చరిత్రకు చిత్రరూపం లో వారి పాత్రలోనటిస్తూ, లీనమవుతూ జీవిస్తున్నప్పుడు, ఈ నిర్ణయం నిఖార్సుగా తీసుకోవడానికి అనువైన బీజాలు పడ్డాయని చెప్పవచ్చు. నటనలో నటసార్వభౌముడు, రాజకీయరంగంలో విశ్వవిఖ్యాతుడు గా విరాజిల్లిన కొదమసింహం, బొబ్బిలిపులి. ఆయన ఒక సుడిగాలి. వెరసి ఆయన అతిస్వల్ప కాలంలో ప్రపంచం దౄష్టిలోకి వచ్చారు. అందరూ చెప్పుకునే అహం, వారికి ఆత్మగౌరవం. ఆయన కోపం, ప్రక్షాళనగా మారుతుంది. ఆయన ఆవేశం, దానిపేరు చైతన్యంగా రూపుదిద్దుకుంటుంది. ఆయన పట్టుదలకు అసంఖ్యాక తార్కాణాలతో, ఒక బౄహద్గ్రంధం అవుతుంది. ఆయన మాట ఒక శ్లోకం. ఆయన పర్యటన ఒక దుమారం. ఆయన నిర్ణయాలు, రేపిన పలు సంచలనాలు. ఆయన ఆలోచనలు, విప్లవాలుగా పల్లవిస్తాయి. ఆయన ప్రతిచర్య ఒక ప్రయోగంగా రసాయనప్రక్రియగా మారుతుంది. అందుకే ఆయన విశ్వవిఖ్యాతుడు. నటనాసార్వభౌముడు. రాజకీయరారాజు. వెరసి, ఆయన విశ్వవిఖ్యాత నట రాజకీయ సార్వభౌముడు. ఆయనపేరు - నందమూరి తారక రామారావు. ఆంగ్లంలో యన్.టి.రామారావు. క్లుప్తంగా, యన్.టి.ఆర్. ఆంధ్రగ్రామీణప్రజలకు, చిత్రప్రేమికులకు నందమూరి అభిమానులకు యంటీవోడు. యిది ఈయన పరిచయం.
నిమ్మకూరు నిప్పు1942-44 మధ్యన ఆంధ్ర నాటక పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో నాటకాలు జరుగుతున్నాయి. ప్రజా నాట్యమండలి, నేషనల్ ఆర్ట్ థియేటర్స్ తరఫున పోటీలు జరుగుతున్నాయి. వాటిల్లో ప్రదర్శించిన 'చేసినపాపం' అన్న పౌరాణిక నాటకంలో ఒక అందమైన యువకుడు అభినయిస్తున్నాడు? ఎవరీతను అనుకున్నారు అందరు. అతనే నందమూరి తారక రామారావు. కౄష్ణాజిల్లా, నిమ్మకూరు గ్రామంలో 28 మే 1923 న జన్మించారు. ఆంధ్ర క్రీష్టియన్ కాలేజీ, గుంటూరు నుంచి పట్టభద్రుడు. సబ్-రిజిస్టారుగా కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన, రామారావు, కవిసామ్రాట్, జ్ణానపీఠం సన్మానం పొందిన విశ్వనాధ సత్యనారాయణగారికి ప్రియశిష్యుడు. బసవరామతారకం ను వివాహమాడిన ఈయనకు 12 మంది సంతానం. ఈ నేపథ్యంలో ఈయన కుటుంబనియంత్రణ విధానం పై వ్యతిరేకంగా 'తాతమ్మకలా చిత్రం తీయడం, దానికి ఉత్తమకధాచిత్రంగా ప్రభుత్వంనుంచి ప్రశంసాబహుమతులను అందుకోవడం విశేషం, వింత అని చెప్పాలి. పెద్దకొడుకు రామకౄష్ణ మరణించిన తర్వాత, అతని పేరున, స్వంత చలనచిత్రసంస్థను ప్రారంభించాడు. 1949లో మనదేశం చిత్రంతో చలనచిత్ర రంగప్రవేశం చేశాడు.
నందమూరి నటనాపర్వంనందమూరి చిత్రాభిమానులకు నటసార్వభౌమ అనే పిలుచుకుంటారు. పౌరాణికపాత్రలకు ఆయన పేరునే మొదటి గుణికం చేయాలి. దక్షిణభారతచిత్రాల్లో తెలుగు చిత్రాలకు వచ్చిన ప్రాధాన్యతకు కారకులను చెప్పాలంటే, ఈయనను ప్రప్రధమంగా పేర్కొనాలి. ప్రముఖ నిర్మాత, విజయసంస్థనేత బి.నాగిరెడ్డి సౄష్టించిన కౄష్ణుడు పాత్ర (మాయాబజార్), ఆయన చలనచిత్రజీవితంలో మొదటిదశలోనే ఒక మైలురాయి అని చెప్పాలి. విష్ణువు దశావతారాల్లోని, రామ, రావణ, కౄష్ణ, అర్జున, కర్ణ, భీమ, దుర్యోధనాది పౌరాణిక పాత్రలు ఆయన ముఖవర్చస్సుని పూర్తిగా మార్చివేశాయి. ఆ అవతారామూర్తుల రూపం, నందమూరిలాగానే వుంటాయన్న విశ్వాసం, సిద్ధాంతం నిర్మించుకున్న జాతి, తరం, కేవలం ఆంధ్రసీమలోనే కాదు, యితరరాష్ట్రాల్లోకూడ, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకలో, చాలా ఎక్కువగా చూస్తూంటాము. తెలుగు చలన చిత్రపరిశ్రమలో ఆయన అందించిన వరప్రసాదంగా భావించే స్థానాన్ని వర్ణించాలంటే, 1950-65 మధ్య కాలం స్వర్ణయుగం అని చెప్పాలి. విశ్లేషకుల భావన ప్రకారం, తెలుగుదేశంలో ప్రాముఖ్యమైన పౌరాణికచిత్రాలను నిర్మిస్తే, తమిళ, హిందీ చలనచిత్ర పరిశ్రమలు ప్రభావితమైన సాంఘికయితివౄత్తచిత్రాలను అందించింది. రామారావు దక్షిణభారతచిత్రాల్లో ప్రముఖస్థానం పొందాడు అన్నది నిర్వివాదాంశం. తెలుగుసీమ కూడ ఒకప్పుడు అంతర్భాగంగా వున్న తమిళనాడు చిత్రపరిశ్రమలో అధ్బుతనటనాకౌశలం ప్రదర్శించడంలో శివాజీగణేశన్, సామాన్య ప్రజానీకానికి ప్రేరణగా, వ్యాపారాత్మకంగా, నటనలోనూ పేరుతెచ్చుకున్న మెగాస్టార్ యం.జి.రామచంద్రన్,లు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి పంధాలో సమతులనం చేసుకున్న పద్ధతిలో తనదైన నటనాపధాన్ని, స్వీయపంథాన్ని నిర్మించుకున్నాడు రామారావు. శివాజీయే చెయ్యగలడన్న పౌరాణికాలు, యం.జి.ఆర్. మాత్రమే నప్పగలడన్న వ్యాపారధోరణిలోని జానపదచిత్రాలు, రెంటినీ సవ్యసాచిలా ప్రతిభావంతంగా రాణించగల నటనాసామర్ధ్యంగల నటుడు ఒకే ఒక్కడు, అతడే, తారకరాముడు.
ఒకే ఒక కౄష్ణుడు, ఆయనే రాముడునందమూరి నటనలో ప్రత్యేకంగా 'నభూతో నభవిష్యతీ అంటే నందమూరే అన్నట్లు రాణించిన పాత్ర, కౄష్ణుడు. తెలుగు చిత్రాల్లోనే కాకుండా, తమిళ, కన్నడ చిత్రాల్లో కూడ, కౄష్ణుడిపాత్ర మాత్రం రామారావునే వరించేది. మిగతా, కర్ణ, అర్జున, భీమాది పాత్రలు, యం.జి.ఆర్., శివాజీ, రాజ్ కుమార్ లు నటించేవారు. ఈ కౄష్ణపాత్ర మాత్రం నందమూరి నటనాజీవితానికి ఒక అర్ధం, పరమార్ధం, ప్రసాదించాయి అన్నదాంట్లో ఆశ్చర్యం లేనేలేదు. కౄష్ణుడిపాత్రతో పాటు, రామ, భీమ, దుర్యోధన, కర్ణ, రావణాసుర, యమ, అర్జున, శివ, విశ్వామిత్ర, వేంకటేశ్వర, లాంటి పౌరాణిక పాత్రలను పాత్రలే ఆయన, ఆయనే పాత్రలు అన్న పంథాలో నటననుప్రదర్శించారు. అలాగే, చారిత్రకాలైన, శ్రీనాధుడు, ఆశోక, వివేకానంద, పోతులూరి వీరబ్రహ్మం, పాపారాయడు, సలీం, చాణక్య, తిమ్మరుసు, శ్రీకౄష్ణదేవరాయలు, పాత్రలు బహుళ ప్రజాదారణకు నోచుకున్నాయి. యివికాక, ఎన్నో జానపదాలు, సాంఘికాలు, కుటుంబయితివౄత్తాలు, అన్నీ కలిపి, 280 కి పైగా చిత్రాల్లో తన ప్రతిభను ప్రదర్శించారు.
వైవిధ్యాలు, నందమూరి నటనాపాత్రలురామారావు నటించిన, కాదు, జీవించిన ముఖ్యమైన పాత్రలను క్రోడీకరించాలంటే, ప్రప్రధమంగా, శ్రీకౄష్ణ పాత్రలో - మాయాబజార్, శ్రీకౄష్ణార్జునయుద్ధం, శ్రీకౄష్ణరాయబారం, శ్రీకౄష్ణసత్య, కర్ణ చిత్రాల్లో నటనావైదుష్యాన్ని ప్రస్తావించాలి. లవకుశ (శ్రీరామ), భీష్మ (భీష్మ), భూకైలాస్ (రావణ), నర్తనశాల (అర్జున, బౄహన్నల), పాండవవనవాసం (భీమ), శ్రీవేంకటేశ్వర మాహాత్మ్యం (శ్రీ వేంకటేశ్వర), మహామంత్రి తిమ్మరుసు (శ్రీకౄష్ణదేవరాయలు), దానవీరశూరకర్ణ (దుర్యోధన, శ్రీకౄష్ణ, కర్ణ), అయిదు పాత్రలతో విరాటపర్వం, ముఖ్యంగా చెప్పాలి. మరింత ప్రత్యేకతలున్న జానపదచిత్రాలు - జగదేవవీరునికథ, పాతాళభైరవి, భట్టివిక్రమార్క చెప్పుకోతగ్గవి. సాంఘికయితివౄత్తాలైన - మల్లీశ్వరి, కన్యాశుల్కం, గుండమ్మకథ, మిస్సమ్మ, రక్తసంబంధం, రాముడు-భీముడు, అడవిరాముడు, వేటగాడు, గజదొంగ, డ్రైవర్ రాముడు, సర్దార్ పాపారాయుడు, కొండవీటిసింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి, ప్రస్తావించకతప్పదు. ప్రత్యేకశైలిలో అవతరించిన పాత్రలు - బడిపంతులు, రాజు-పేద, ఆత్మబంధువు, చిరంజీవులు, లాంటివి ఎన్నో ప్రస్తావించాలి. గుడిగంటలు చిత్రంలో ప్రతినాయకుని పాత్రలో తాదాత్మ్యం చెంది నటించడం, (జన్మమెత్తితిరా, అనుభవించితిరా), అన్నాచెల్లెళ్ళ అనురాగ పాత్రలకు అప్పటికీ, యిప్పటికీ, అద్దం పట్టినచిత్రం, రక్తసంబంధం, కన్యాశుల్కం లో గిరీశం పాత్రలో నటన కాకుండా జీవించడం, కేవలం ఉదాహరణలు మాత్రమే.
నందమూరి నటుడే కాదు - దర్శకుడు, నిర్మాత.స్వంతచిత్రం మొదటిసారి సీతారామకళ్యాణం(1961) నుంచి, వరసగా, గుళేబకావళికధ, శ్రీకౄష్ణపాండవీయం, వరకట్నం, తల్లా పెళ్ళామా, తాతమ్మకల, దానవీరశూరకర్ణ, చణక్యచంద్రగుప్త, శ్రీరామపట్టాభిషేకం, అక్బర్ సలీం అనార్కలి, శ్రీతిరుపతి వేంకటేశ్వరకళ్యాణం, శ్రీమద్విరాటపర్వం, చండశాసనుడు, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక్ చిత్రాల్లో, తన అద్భుతదర్శకప్రతిభను ప్రదర్శించి ఎప్పటికీ మదిలో నిలచిపోయేలా వాటిని మలిచారు. గుళేబకావళికధ చిత్రానికి, ప్రముఖకవి సి.నారాయణరెడ్డిగారిని, చిత్రసీమకు పరిచయం చేసిన ఘనత రామారావుకే దక్కుతుంది. నన్నుదోచుకుందువటే, వన్నెలదొరసాని, అని తనమధురకలంతో చిత్రసీమలో కాలిడిన సినారె వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. అలాగే, ప్రముఖ హిందీచిత్రగాయకుడు, మహమ్మదురఫి ని తెలుగుచిత్రసీమకు (భలేతమ్ముడు, అక్బర్ సలీం అనార్కలి) పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే. అంతేకాక, చిత్రసీమలోని అందరికీ ఆయన స్ఫూర్తి, ప్రభావితం, ప్రేరణాత్మకం, మార్గదర్శి, ఆయన బాటలో నడచిన వారు ఎందరో, మరెందరో, మహానుభావులుగా, తదుపరి గుర్తింపు తెచ్చుకుని, వారు కౄతజ్ౙతని ప్రతినిత్యం చెప్పుకుంటుంటారు. కొండవీటివెంకటకవి లాంటి ప్రతిభాకవిని చిత్రసీమకు పరిచయం చేసిన ఘనత కూడ నందమూరిదే. రామారావు నిర్మించిన, దర్శకుణ్ణి ప్రకటించకపోయినా, ఆయన చిత్రం సీతారామకాళ్యాణం కు ఆయనే దర్శకత్వం వహించినా, ఎక్కడా ఆయన పేరు మనకు కనిపించదు. కేవలం, నిర్మాత, త్రివిక్రమరావు (సోదరుడు) అనిమాత్రం ప్రకటించడం విశేషం. సినీమాకు ఆయనే దర్శకుడన్నది అందరికీ తెలిసినదే. ఈ చిత్రంలో రావణాసురుని, కాదు, రావణబ్రహ్మ, పాత్ర గురించి, గొప్ప పరిశోధనచేశారు నందమూరి. విదేశాల్లో గొప్ప పేరు పొందింది. యింక ఈ చిత్రంలో సీత పాత్రని 'గీతాంజలీ చేత అభినయించిన తీరు సీత అంటే యిలాగే అని పలువురుకి అనిపించింది. ఈయన నిర్మించిన ఉమ్మడికుటుంబం, సర్వకాలానికి ప్రాతినిధ్యం వహించే కుటుంబస్థితిగతుల్ని, కుహనా బాబాల లీలల్ని (ఓం సచ్చిదానంద, శ్రీసర్వం గోవిందా), పరోక్షంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ప్రారంభంగా 'కర్టెన్ రైజఋ గా, అసలు కధను అందరూ గమనించాలన్న ఉద్దీశ్యంతో, యమధర్మరాజు, సతీసావిత్రిల సంగీతరూపకం, బహుళప్రజాదరణకు నోచుకోవడంలో రామారావు ప్రతిభ తేటతెల్లమవుతుంది. నందమూరి చిత్రంగా, తాతమ్మకల, చిన్నకుటుంబం - చింతలు లేని కుటుంబం అన్న ప్రభుత్వ నినాదానికి వ్యతిరేకంగా, దేవుడిచ్చిన సంతానాన్ని నిరోధించకూడదన్న ఆలోచనతో, మహానుభావులందరూ అధికసంతానంలో భాగమని, సోదాహరణంగా, వివరించిన చిత్రానికి ప్రభుత్వ బహుమతి లభించడం కూడ మరచిపోలేని కధనం. దానవీరశూరకర్ణ, ఒక ప్రత్యేక వరవడితో తీసిన చిత్రం. ఆయన చిత్రాల్లో, కధకు, పాటలకు, సంగీతానికి, మాటలకు, అర్ధాలే కాకుండా, అంతరార్ధాలు, ప్రాసలు, అనుప్రాసలు, భాయయుక్తంగా, కవిహౄదయం కొండవీటి వెంకటకవి సంభాషణల్లోనే కాక, రామారావు మాటల్ని, భావాల్ని పలికినతీరు నిత్య స్మరణీయం అని వెల్లడవుతూంటుంది. సినారె లాంటి కవులు రామారావు చిత్రాలకు ప్రాణాలు పోశారన్నది సత్యం.
చిత్రపరిశ్రమ లో విశిష్టవ్యక్తిత్వంవైవిధ్యమున్న పాత్రలను నటించిన ఘనత నందమూరిదైతే, జానపద, సాంఘిక చిత్రాల్లో ఆయన నటన మోతాదు కొంచెం ఎక్కువనే అభిపాయాన్ని విశ్లేషకులు చెప్పడం కూడ జరిగింది. ఈ చిన్న విమర్శ చిన్న తుంపరలాంటిది. తుంపర,మహాసముద్రం ముందు ఏపాటిది? ఆయన ఏ పాత్ర ధరించినా, ఆ పాత్రను క్షుణ్ణంగా అర్ధం చేసుకుని నటించడం, పాత్ర స్వరూప స్వభావాలను బట్టి మానసికంగానే కాక శారీరకంగా కూడా ఆ పాత్రలో ఇమడటానికి ప్రయత్నించడం (భీమ పాత్రలో బాగా తిని కండలు పెంచడం), పేదవాడిపాత్ర కు తిండి మానేసి బక్కగా మారే ప్రయత్నం, ఏకాగ్రతతో పాత్రలో లీనమై నటించడం, క్రమశిక్షణ కలిగిన సైనికుడుగా ప్రవర్తించడం, కొన్ని పాత్రల్లో ఆవహించి, పరకాయప్రవేశం చేసి నటిస్తున్నారా అన్న భావనలు, నిర్మాత, దర్శకుడు అయినాకూడ, సాటి దర్శక నిర్మాతలకు యిచ్చిన గౌరవ మర్యాదలను చెప్పలేమని చిత్రసీమ మొత్తం పలవరిస్తూనే వుంటుంది. దర్శకునికి యిచ్చిన విలువలు, నిర్మాత క్షేమాన్ని సదా కాంక్షించడం, పచ్చగా వుంటేనే చిత్రరంగం కళకళలాడుతుంది అన్న ఖచ్చితమైన అభిప్రాయం, ఇలా ఎన్నో విశిష్ట విధానాలని, శైలిని పాటించిన ప్రజ్ౙానాభినయ వైభవమూర్తి.
కళాసేవ నుంచి రాజకీయానికిప్రేరణకు కారణం ఏమిటి? కారణాలు అనేకం కావచ్చు. కొన్ని కారణాలకు మాటలు వుండచ్చు, లేకపోవచ్చు, వున్నా నోటినుంచి మాటలు రాకపోవచ్చు, కేవలం అనుభూతులే ప్రేరణకు దారితీస్తాయి. ఈ పంధాలోనే కలిగిన ప్రేరణ, నందమూరిని కళాసేవ నుంచి రాజకీయరంగానికి మరలిరావడం జరిగింది. ఒక సమావేశంలో, ప్రజల్లోని ఒక సామాన్యుడు, అభిమాని అడిగిన ప్రశ్న, అయ్యా, మేము మిమ్మల్ని దేవుడిలాగ ఆదరించాము; కాని మీరు మాకు ఏమి చేశారు? అన్న ప్రశ్న నందమూరి హౄదయంలోకి సూటిగా గుచ్చుకుంది. నరనరాల్లోకి ప్రవేశించింది. రక్తప్రసరణలో భాగంగా మారింది. ఆలోచనగానూ మారింది. ఆలోచనకు ఆచరణయోగం కలిగింది. ఫలితంగా, 29 మార్చి 1982 న 'తెలుగుదేశం' ఆవిర్భావం అంధ్రసీమ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడింది. తెలుగుదేశం ప్రారంభం వెనుక, కేవలం రాజకీయప్రవేశ లక్ష్యమే కాదు. తరతరాలుగా తెలుగువాడికి దక్కుతున్న గౌరవం, మర్యాదలను బేరీజు వేసుకుని, తెలుగువాడి ఆత్మగౌరవం ఒక అంతస్సూత్రంగా ఆవిష్కరించబడింది. జాతీయస్థాయిలో తెలుగువారికి గుర్తింపు తెచ్చి, వారి మర్యాదను పెంచిన నాయకుడు నందమూరి తారక రామారావు. తెలుగుదేశాన్ని స్థాపించిన కేవలం 9 నెలలుగా రాష్ట్రం నాలుగు చెరగులా పర్యటించి ప్రజాభిమానంతో ఎన్నికల పోరాటంలో అఖండ విజయాన్ని సాధించి, ఒక చరిత్రను సౄష్టించారు. ఆయన ప్రచారవాహనానికి చైతన్యరధం అని నామకరణం చేసి, 9 నెలల్లో, 18 వేల కి.మీ. సుడిగాలిలా పర్యటించాడు. దినచర్యలు, కాలకౄత్యాలు, అన్ని రహదారిలోనే, చైతన్యరధం ప్రక్కనే. ఆయన పర్యటన పూర్తిచేసుకునే, యింటిముఖం పట్టాడు. మరొక ముఖ్య విషయం, రాజకీయంగా ఎన్నో ఏళ్ళుగా ప్రబలుతున్న విధానం - ఢిల్లీ నుండి నిర్ణయాలు హైదరాబాదు అందటం మానిపించి, హైదరాబాదు నుండి ఢిల్లీలో ప్రభుత్వాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించిన వ్యక్తి నందమూరి. కొన్ని దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీని, కేవలం తాను పార్టీ ఏర్పరచిన ఏడాది లోపునే మట్టికరిపించిన కళావంతుడైన రాజకీయవేత్త ఆయన. ఆయనలోని కళాకారుడు కేవలం నటనకేకాదు. రాజకీయాన్ని కూడ కళాత్మకంగా నడిపించగలడు అని నిరూపించిన మహానుభావుడు. ఫలితంగా, 202 సీట్లు సాధించి, జనవరి 9, 1983 న తారకరాముడు రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఆయన చిత్రాలు మాదిరి, రాజకీయల్లోకి ఆయన ప్రవేశం, ప్రచార పర్యటన, ఎన్నికల్లో గెలవడం, శాసనసభలో ప్రవేశించడం, అన్ని చిత్రంలానే విచిత్రంగా జరిగిపోయాయి. ఆయనతోపాటు గెలిచిన వాళ్ళు ఎక్కువగా, అనుభవం లేనివారే. ఒక్క నందమూరే వారిని సముదాయించ వలసివచ్చింది. ముఖ్య కారణాలైన, ఎక్కువకాలంగా కాంగ్రెసు కి ప్రత్యామ్నాయం లేకపోవడం, అభివౄద్ధి అనుకున్నంతగా రాకపోతూండడం, నిరుద్యోగం, ఒకే రాజకీయ పక్షం, కులం సుదీర్ఘకాలం అధికారంలో వుండడం, యీవన్ని, తెలుగుదేశానికి దారితీసాయి. ప్రముఖ దిన పత్రిక ఈనాడు అధిపతి చేకూరి రామోజీరావు అండదండలు, తానే స్వయంగా గుడివాడనుంచి పోటీచేయడం, ఆనాటి ప్రముఖఘట్టాలు. ఎన్నికలు మొదటిసారి గెలిచాక, ఆయన స్వామి వివేకానంద రూపంలో ప్రత్యక్షమయి, ప్రభుత్వాన్ని ఆదర్శభావాలతో నడపడం ప్రారంభించినా, అవి అనుకున్నంత ప్రభావాన్ని, ఫలితాల్ని యివ్వలేకపోయాయి. తెలుగుదేశంలో కూడ, క్రమేపీ రాజకీయాలు ప్రవేశించడం, నాదెండ్ల భాస్కరరావు రాజకీయ కుతంత్రానికి ఆయన అనుభవించిన శౄంగభంగం, ఎన్నికలను కొత్తగా 1985 లో జరిపించారు. రామారావు తీసుకున్న ముఖ్య పొదుపు చర్యల్లో భాగంగా, కౌన్సిల్ ను రద్దు చేయడం, 1989లో పొందిన అపార అనుభవం, యిద్దరు అల్లుళ్ళు, చంద్రబాబునాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావులను ఆయన చేరదీయడం జరిగింది. విద్యారంగంలో రామారావు తెచ్చిన మార్పులు ఎన్నో, మొత్తం సిలబస్ లను మార్చడం, యింజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, లా, యం.బి.ఎ. తరగతులకు ప్రవేశపరీక్షను ప్రవేశపెట్టినది ఆయనే. హిందీలో అంత ప్రావీణ్యం లేకపోయినా, హర్యానాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఏకధాటిని 45 ని. పాటు ప్రసంగం చేసి, ప్రసంగాన్ని బట్టీయం చేశానని ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరచారు. ఆయన జ్ౙాపకశక్తికి ఆయన పౌరాణిక చిత్రాల్లోని సుదీర్ఘసంభాషణలే తార్కాణం. సుస్పష్ట ఉచ్చారణ, స్వచ్చమైన భావప్రకటన, హావభావాలు, ఆయనకు వెన్నతోపెట్టినవిద్యయే కదా. 1989లో ఎన్నికల్లో పరాజయం పొందినా, ఆయన ప్రతిభను జాతీయస్థాయికి తీసుకువెళ్ళి, ప్రాంతీయపక్షాలని ఏకత్రాటిపై తేగలిగారు. జనతాదళ్ లాగున, కేంద్రస్థాయిలో నేషనల్ ఫ్రంట్ ని స్థాపించారు. కాంగ్రేసుకు ప్రాంతీయస్థాయిలో వేరే ఏమిటి అన్న ఆలోచనకు రామారావే సమాధానం చెప్పగలిగారు. 1994 లో తిరిగి పదవిలోకి వచ్చినప్పుడు, రెండురూపాయలకు కిలో బియ్యం, తాగుడువ్యవస్థనుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలన్న సంకల్పంతో చర్యలు, ప్రభుత్వానికి పెనుభారం అయినా తన అలోచనలో మార్పు రానీయలేదు.
1989 నుండి 94 వరకూ ప్రతిపక్షంలో వున్న నందమూరి 1994 డిసంబర్, 12 న తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. 1983, 84, 85, 94 లలో మొత్తం అయిదు సార్లు మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆయనదే. 1995లో శాసనసభ్యుల తిరుగుబాటు వలన రామారావు పదవి కోల్పోయారు. ఆయన రాష్ట్ర రాజకీయాలే కాక కేంద్ర రాజకీయాలను సైతం ప్రభావితం చేశారు. కాంగ్రేసు వ్యతిరేక పార్టీలన్నిటినీ నేషనల్ ఫ్రంట్ క్రింద ఏకం చేశారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. తెలుగు భాషాభివౄద్ధికి అవిరళకౄషి చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం ఆయన కలలకు ప్రతిరూపమే.
బాధల పర్వం - ఆఖరిదశలో కష్ట పరంపరలుక్రమేపీ తెలుగుదేశంలో కష్టాల కడలి కదలింది. పార్టీలో సమస్యలు అంకురించాయి. అల్లుడు, చంద్రబాబు, జామాత, ఒక్కసారి దశమగ్రహంలా విజౄభించాడు. రామారావుకు అన్ని సమస్యలను ఒక్కసారి బాణంలా విసిరాడు. తిరుగుబాటు బావుటాని ఎగరవేశాడు. తెలుగుదేశం రెండు ముక్కలైంది. రామారావు ప్రజల్లోకి న్యాయానికి పోయినా, ఆఖరుకు చంద్రబాబు వైపుకే కడలి కదలింది. టాంకుబండ్ వద్ద రామారావు నిరహారదీక్ష జరపడం కూడ నాటకీయంగానే జరిగిందని అందరూ అభిప్రాయపడ్డారు. యిదే రామారావు రాజకీయనాయకునిగా చరమఘట్టం అని భావించవచ్చు.
కధకు, కధనానికి ముగింపు
నందమూరి తారక రామారావు జీవితంలోని ముఖ్యపర్వాలైన, నటన రాజకీయంగా ముగియలేదు. కాని రాజకీయం మాత్రం నాటకీయంగానే ముగిసింది. అధికారం చేజారడం, తర్వాత ఘటనలు, సినీమాలో అంతిమఘట్టాలుగానే జరిగాయి. నటనలో అమితాభిమానాన్ని పెంపొందించుకొని, తన పరిశోధనాంశం కూడ, నందమూరినే ఎన్నుకుని, ఆయన సాన్నిహిత్యంలోనే తన జీవితాన్ని గడపడానికి వచ్చి, రామారావునే వివాహమాడిన లక్ష్మీపార్వతి, నందమూరి జీవనచిత్రంలో ఆఖరిపాత్ర అనే చెప్పాలి. జరిగిన సంఘటనలకు ఆమె కూడ చాలవరకు బాధ్యురాలని పలువురి భావన. ఆమె రామారావు జీవితంలోకి ప్రవేశించాక, ఆయనలో చాలా మార్పులు, కుటుంబంలో కూడ కుతకుతలు, దూసుకువచ్చిన అనారోగ్యం, వెరసి, ఆయన తుది ఘడియలు ప్రవేశించాయి. రామారావు తన తుది శ్వాసని, జనవరి 18, 1996 న విడిచారు. లక్షలాది మంది ప్రజాసమూహం ఆ సార్వభౌమునికి నివాళి అర్పించేందుకు వరసలు కట్టి ఆయనను రాజలాంఛనాలతో సాగనంపారు. ఘననివాళ్ళను సమర్పించారు.
ఏ చిక్కులూ, యే యిబ్బందులూ లేకుండా యీ ప్రప్రంచంలో సుఖంగా బతకాలంటే కొంత నటన అవసరం అంటారు. రంగస్థలంపై, చిత్రాల్లో నటించగలవాళ్ళూ జీవితంలో నటించలేరు; జీవితంలో నటించగలవాళ్ళు చిత్రరంగస్థలాల్లో రాణించలేరు; జీవితంలో నటించగలవాళ్ళు లౌక్యులు; తమ వౄత్తుల్లో రాణించగలవాళ్ళు నటులు. నటన జీవనోపాధి అయితే పరవాలేదు; కాని ప్రాణాలతో చెలగాటం కాకూడదు. ఏది ఏమైనా జీవితంలో బతక నేర్చినవాడు ఉత్తమనటుడు.
రాజకీయమనేది మన బ్రతుకులకు ఊపిరిలాంటిది అంటాడు శ్రీశ్రీ. అయినా, రాజకీయాల్లో పెద్దపాము చిన్న పాముల్ని నిర్దాక్షిణ్యంగా మింగటంద్వారానే పైకి ఎగబాకుతుంది. జనాలకు వాగ్దానాలు చేయడం, రాజకీయనాయకుని ప్రధాన కర్తవ్యం; అది తిరిగి తీర్చకపోవడమన్నది వారి సహజ లక్షణం. ఒకసారి గొడవొచ్చి విడిపోయాక అప్పటివరకూ కలిసి పనిచేసినవారిమీద బురదజల్లటాన్నే 'రాజకీయం' అంటాడు యండమూరి వీరేంద్రనాధ్. రాజకీయాల్లో ప్రత్యర్ధుల్ని మిగల్చకూడదు. పై వాళ్ళని నమ్మకపోవడం, కిందివాళ్ళను నమ్మకపోవడం, అదే రాజనీతి. అసలైన అబద్ధాలకంతులెరిగి అరచేతిలో స్వర్గం చూపువాడే ఆరితేరిన అసలు రాజకీయవేత్త. రాజకీయవేత్తలు కొలంబసులా తయారవుతున్నారు. ఎక్కడ బయలుదేరతారో తెలియదు; ఎక్కడికి వెళ్ళాలో తెలియదు; ఎటు చేరతారో తెలియదు. పైగా కొలంబసులాగే డబ్బు కూడా వీళ్ళది కాదు, అని అంటారు శ్రీరమణ.
అల్లుడ్ని నమ్ముకున్న రాజకీయనాయకుడుగాని, కొడుకుని నమ్ముకున్న రాజకీయనాయకుడుగాని లోకంలో ఎప్పుడైనా బాగుపడ్డాడా? అని పతంజలి అన్యాపదేశంగా, యదార్ధాన్ని చెప్పకనే చెప్పారు. అల్లుడికి అల్లుడు వచ్చి, రాజకీయంలో జోక్యం చేసుకుంటేనేగాని, తెలియదు. అల్లుడులేనివాడికి, రాజకీయం వేరేలా దెబ్బతీస్తుంది.
నందమూరి తారకరామారావు తన నటనద్వారా, రాజకీయాలద్వారా, అందించిన సందేశాలు, ఆలోచనలు, భావాలు, ఆయన స్థాపించిన తెలుగుదేశంద్వారా నెరవేరుతాయని ఆశిద్దాం. మహానాడుల్లో తీసుకుంటున్న మహానిర్ణయాలు, వాటి మహత్వపూర్ణత, ఎంతవరకూ ఆచరిస్తున్నారో ప్రజలకు, వారు నమ్ముకున్న తెలుగుదేశం, నాయకత్వం వారి నిర్వాకం ఏమిటో వారివారి విచక్షణకు వదిలివేయడమే. నచ్చితే ప్రజలు మెచ్చుకుని అధికారం అందించడం, నొచ్చితే గద్దెనుంచి దింపివేయడం, రాజకీయంలో అంతర్భాగమే కదా.
జనవరి 18 న నందమూరి తారకరామారావు గారి వర్ధంతి సందర్భంగా ఘననివాళిని సమర్పించాల్సిన ఘనతరుణం ఈనాడే. తెలుగువాడికి, తెలుగువేడికి సాక్ష్యంగా, నిదర్శనంగా మనకు నిత్యదర్శనం కావించే నందమూరి భావాభిరామానికి ధన్యవాదాలను సమర్పించుకోవాల్సిన తరుణం.
మరో నందమూరి కొరకు నిరీక్షణ చేద్దాం. మనకు ఆ, అదే నందమూరి తారకరాముడు లభించడం బహు కష్టతరం, క్లిష్టసమం. అయినా నిరీక్షిద్దాం.
కళారాజకీయ రంగాల్లో, మన తెలుగు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తెలుగుబిడ్డ నందమూరి ఆత్మకు ఘన నివాళిని తెలుగురథం సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

Tuesday, January 13, 2009

కదలివచ్చెను 'మకర సంక్రాంతి' లక్ష్మి హేమంతవీధి




కదలివచ్చెను 'మకర' సంక్రాంతి లక్ష్మీ హేమంతవీధి!


మానవజీవితంలో పండుగల ప్రాశస్త్యం



అన్ని రోజులెట్టివో, పండుగరోజు లట్టివే. ఒకరోజు పండుగరోజు కావడానికి దానికి మనం ఆపాదించుకునే ప్రత్యేకతే కారణం, దానికి మనం సమకూర్చుకునే వైశిష్ట్యమే కారణం. పండుగలన్నీ సంవత్సరాని కొకసారి చొప్పున తిరిగి, తిరిగి వచ్చేవే. అంతమాత్రం చేత వాటి అర్ధం తగ్గదు; అందం తగ్గదు; ఆనందం తగ్గదు. ప్రతి సంవత్సరం వచ్చేది కనుక, వసంతం విలాసం, పూర్ణిమ శోభ తగ్గదు సరికదా, ప్రకౄతి విలాసాలలోని నిత్యనూతనత్వం జాతీయ పర్వదినాల్లో కూడ వుంటుంది. భారతదేశపు సంస్కౄతీసంపదలను ప్రతిబింబించే పండుగల్లో ప్రధానంగా - ఉగాది, శ్రీరామనవమి, కౄష్ణాష్టమి, వినాయకచవితి, దసరా, దీపావళి, సంక్రాంతి, శివరాత్రిలతోపాటు ఎన్నో, మరెన్నో చెప్పుకోవాలి. మన ప్రధాన పర్వదినాలకు ప్రకౄతివిలాసాలతో సన్నిహిత సంబంధం ఉన్నది కూడా. తన కడుపు పంటతో మన గరిసెలను, గాదెలను బంగారు రాజనాలతో నింపివేసే ధాన్యలక్ష్మికి మన మెత్తే నివ్వ్వాళి - సంక్రాంతి. ఆంగ్లసంవత్సరపు కాలండర్ లో మనకు జనవరి 1 నాడు జరుపుకొనే నూతనసంవత్సరం తర్వాత, వెనువెంటనే వచ్చేది 'సంక్రాంతీ పండుగనే విశేషంగా చెప్పుకోవాలి.



సంక్రాంతి వైభవం



మన తెలుగువాళ్ళకు పెద్దపండుగగా స్థిరపడిపోయిన పండుగ - సంక్రాంతి. నవ్యాంధ్రకవి శ్రీ రాయప్రూల్ సుబ్బారావుగారి పలుకులలో తిరిగి మనకు - "వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి - వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతీ అని ఎంత సహజంగా చెప్పారో! ఊకబంతి, పోకబంతి, రేకబంతి, ముద్దబంతి - ఇలాగే మరెన్నో రకాల బంతిపూల పసిడి కాంతులను విరజిమ్ముకుంటూ "పచ్చ సంక్రాంతి" వచ్చింది; సీమసీమ, ఊరూరు, వాడవాడ కొత్త పంటలతో తొలుకాడుతుండగా "లచ్చి సంక్రాంతి" వచ్చింది. ఇంత ఫ్వైభవంతో వచ్చిన ఈ సంక్రాంతిలక్ష్మికి స్వాగతంగానే మన వాకిళ్ళలో ముగ్గులు, ఆ ముగ్గులమధ్య గొబ్బెమ్మలు, ఆమెకు ఆహ్వానంగానే మన మండిగాలకు పసుపుకుంకాలు, వాటికి మరింత శోభకోసం బంతుపూదండలు, ఆమె పేరుతో బొమ్మల కొలువులు,ఆ కొలువులకు చుట్టపక్కాలకు పిలుపులు.



'సంక్రాంతీ సాహిత్యంలో తొలి ప్రస్తావన


'తత్ర మేషాదిషు ద్వాదశరాశిషు క్రమేణ సంచరత: సూర్యస్య పూర్వస్మా ద్రాశే ఉత్తరాశౌ సంక్రమణ ప్రవేశ: సంక్రాంతి:" అని జయసింహ కల్పద్రుపమున సంక్రాంతి పదం కనిపిస్తుందని 'హిందువుల పండుగలు - పర్వములూ అన్న వ్యాసపరంపరలో 'మకరసంక్రాంతీ లో వివరించారు. శ్రీనాధుడు 'పెనుబందువూ అన్నాడు. చలికాలం వస్తుంది కనక, శివరాత్రిమాహాత్మ్యం లో సంక్రాంతి ని చక్కగా వివరించాడు.
"ఇండ్ల మొదలను నీ రెండు నీదికలను, అనుగుతమ్ముడు, అన్నయు ఆటలాడు, అత్తయును కోడలును కుమ్ములాడు, కుమ్ముగాచు చోటికి మకరసంక్రాంతివేళా అన్నాడు.
యింత పెద్దపండుగను, ప్రాచీనకవులు ఎక్కువగా ప్రస్తావించకపోవడానికి మాత్రం కారణాలు గోచరించవు, ఎందుకనో.
మార్గశిర పుష్యమాసాల్లో వచ్చేది సంక్రాంతి పండుగ. సంక్రాంతి లేక సంక్రమణం అంటే చేరుట, మారుట అని అర్ధం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. నిజంగా, సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులుంటాయి. అయినా, పుష్యమాసంలో హేమంతౠతువులో శీతగాలులు వీస్తూ మంచుకురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే 'మకరసంక్రాంతీకి ఎంతో ప్రాముఖ్యం, ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకరసంక్రాంతి రోజున, అంటే జనవరి 14 న సూర్యుడు ఉత్తరాయణ పథంలో ప్రవేశిస్తాడు. దక్షిణాయన పర్వం నుంచి నిష్క్రమిస్తాడు. ఈ రోజునుంచి స్వర్గద్వారాలు తెఋరచివుంటాయని పురాణాలు ఘోషిస్తున్నాయి.


విశ్వావ్యాప్తంగా 'సంక్రాంతీ విధానాలు


సంక్రాంతి - అనే పేరుతో పిలవక పోయినా, ప్రతి దేశం, ప్రతి జాతి చేసుకొంటున్నట్టిదే ఈ పండుగ. దున్ని, విత్తి, పైరు చేయడాన్ని మానవుడు ఏనాడు నేర్చుకొన్నాడో, తన కష్టాన్ని మెచ్చి భూదేవి పంటరూపంలో తనకు బంగరు వరాలిస్తుందని ఏనాడు తెలుసుకొన్నాడో ఆనాడే దేశదేశాలలోఈ పండుగ ఏ పేరుతోనో ఒక పేరుతో పుట్టింది. కోతకోసి,కుప్ప వేసి, కళ్ళం చేసి, పంట నూర్చి, గింజలను ఇంటికి తెచ్చుకొనడం జరిగినంత కాలం ఈ పండుగ జరుగుతూనే వుంటుంది.



విదేశాల్లో సంక్రాంతి పండుగలు


మకరరాశి జలచర స్థలచరముల ద్వందరూపంగా భావించబడింది. ఈ జంతువు శరీరం పైభాగం బంగారు కొమ్ములతో మేక ఆకారంగాను, కిందభాగం మొసలి ఆకారంగాను దర్శనం యిస్తుంది. యిదే వరసలే, గ్రీకులు పై శరీరభాగాన్ని మేకగాను, వెనుకసగభాగం చేప ఆకారంగాను భావించడం, ఈ భావనకు కొన్ని గ్రీకుగాధలు కూడ చెప్పుకుంటారు. గ్రీకు గాధలను బేకన్ దేవత, టైఫన్ మహాభూతముల కధనం ప్రకారం వింతమేక ఆకాశాన మకరరాశిలో నిలిచిపోయినట్లు గోచరిస్తుంది. పాన్ దేవత నైలునదిలో పడిపోవడం, ఒక మునకపాటుకి లేవడంతో మేకరూపం వచ్చింది అన్న కధనాల్ని బట్టి, గ్రీకు, లాటిన్ గాధలలో మకరరాశిని జాలాధిదేవతగా పేర్కొన్నారు. వర్షప్రసాదితమైనది, తుఫాన్ రాకను తెలిపేది - మకరం. ఈజిప్టు సంస్కౄతీ పరంపరలో మకరరాశిని 'నం' అనే జలాధిదేవతకు, సూర్యుని మకరరాశి ప్రవేశానికి, నైలునది పొంగటానికి, సమన్వయాన్ని చేసుకుంటారు. నైలునదీ ప్రాంతాల్లో తుఫానులు మకరరాశిలో సూర్యుడు ప్రవేశించడంతో ప్రారంభమవుతాయని శాస్త్రీయం.



మన మకరసంక్రాంతి ప్రాశస్త్యం


ద్వాదశరాశుల దివ్యయాత్రను కావించే దివాకరునికి ప్రధాన ఘట్టాలుగా, మేష, కటక, తుల, మకర సంక్రమణాల్ని పేర్కొంటారు. సూర్యుడు ఈ దశలను చేరుకోగానే, ప్రకౄతి పులకించి పలువిధాల విలాసవంతమవుతుంది. ఆ విశిష్టవిలాససమన్వయమే మకరసంక్రాంతి. తొలకరి, దానివల్ల మెట్టపైర్లు, మాగాణిపంటలు కార్తీక మార్గశిరాల్లో కాపుకురావడం, కలకలలు, కనులపండువలు గోచరిస్తాయి. పొలాల్లో వరివేలు, చేమంతి, బంతిపూలతో చెందే బంగారుకాంతులు, పశుగణాభివౄద్ధి, కర్షకులు మురిసిపోవడంతో ఈ సస్యసమౄద్ధిని చూసి, గీతలో కౄష్ణుడు 'మాసానాం మార్గశీర్షోహం' అని ప్రాధాన్యతను విన్నవించాడు. ఈ మార్గశిర సమాప్తంతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం దేవతలకు ముఖ్యంతో ఉత్తమకాలంగా విశ్వసించబడుతోంది. దక్షిణాయనకాలం వానలు, వల్లప్పలు, బురదలు, చీకట్లు,మబ్బులతో తబ్బిబ్బవితే, ఉత్తరాయణంలో గాదెలునిండిన పంటలు, గరిసెలు, ధాన్యాలు, ఆరోగ్యైశ్వర్యాల సహితమైన ఉత్తమకాలంగా, సుఖమయంగా భావిస్తూంటారు. ఉత్తరాయణకాలంలో గతించిన ఉత్తమగతులు ప్రాప్తిస్తాయని, భీష్ముని నిర్యాణం, శౄతి, స్మౄతి, ఇతిహాస పురాణాల్లో ఉత్తరాయణ పుణ్యకాల ప్రాశస్త్యాన్ని వివరించడం జరిగింది.



మన సంవత్సరాది సంక్రాంతియే అనుకోవచ్చు


మనం చాంద్రాయనశైలిలో జరుపుకునే సంవత్సరాదిని చైత్ర శుద్ధ పాడ్యమిని పరిగణిస్తున్నా, ఒక విధంగా మకరసంక్రాంతి రోజు సంవత్సరాదిగా పరిగణించడానికి అనువైన విషయాలు అధికంగా గోచరిస్తాయి అని కూడ పండితులు భావించారు. ప్రకౄతియందు గోచరించే ప్రధానమైన మార్పులు మకరసంక్రమణం నుంచే సత్యంగా ప్రారంభమవుతాయని, చైత్రశుద్ధపాడ్యమి రోజుకి పరిపక్వతను పొందుతాయి. శీతవాతాల తగ్గుదల, పాడిపంటలతో నవనవోన్మేషిత జీవనశైలికి శ్రీకారం చుట్టడం, సంక్రాంతి పురుషుణ్ణి 'సంకురుమయ్యా వీక్షణం సంవత్సరం మొత్తం కలుగుతుందని, దేశం సస్యశ్యామలంగా ఏడాది ప్రభావంగా వుంటుందని, భావిస్తారు.



మూడురోజుల ముచ్చట్లు మన సంక్రాంతులు


ప్రాచీనాచారాలకు ప్రతీకగా జరుపుకునే సంక్రాంతి మూడురోజులుగా - భోగి, సంక్రాంతి, కనుము, అంతేకాక, నాల్గవరోజు ముక్కనుము అనికూడ జరుపుకుంటారు.
మొదటిరోజు - భోగిపంటసంపదను తస్కరించకుండ పహారా చేసే చీకటి చలి సమయాన కల్పించుకునే కాంతులవింతలు, మంటలమధ్య, ప్రదక్షణాలు, భజనలమధ్య కాలయాపనలు ప్రాధాన్యం వహించాయి. పాతబడిన వస్తువులు కూడ అగ్నిహోత్రంపాలవుతాయి. భోగి - 'భుజ్' అన్న పదం యింద్రుని ప్రీతికి జరుపుకునే పండుగగాను, పోగు, పొంగులనుంది పుట్టిన 'భోగీగాను, ఉత్తరదేశాన 'లోడీగాను, మంటలు పీడవదలినట్లుగాను, నూతనజీవితారంభంగాను విశ్వసించడం కూడ కద్దు. పంటల తండులాలు, కూరగాయలతో పాలుపోసి, పొంగళ్ళు - పులగం వండుకుంటారు. యిది అనాది దినుసు అనే చెప్పాలి. పిల్లలకు భోగిపండ్లు పోయడం ద్వారా దౄష్టిని పోగట్టడం కూడ విశేషంగా చెప్పాలి.
రెండవరోజు - సంక్రాంతిసూర్యుడు మకరరాశిలో ప్రవేశంచేసే రోజు. మకరరాశ్యాధిపతి 'శనీ వాతప్రధానగ్రహమని, వాత నివారణ కోసం తైలస్నానం, నువ్వులు, బెల్లం, గుమ్మడిదానం యిస్తారు. ఉన్నవారు, లేనివారు సమంగా దానం యివ్వడం కూడ జరుగుతుంది. 'నాస్తీ అన్న మాటలేకుండా దానం చేయాలని ధర్మ పరంపర వివరిస్తోంది. స్త్రీలు మాంగళ్యాభివౄద్ధికై కుంకుమ, సుగంధద్రవ్యాలు, బెల్లం, పువ్వులు, వస్తాలు దానం యివ్వాలని కూడ అంటారు. తిల వస్త్రదానాదులవల్ల రోగవిముక్తి, నల్లనూవులతో స్నానం చేసి నువ్వులదానం, శివాలయంలో నువ్వులనూనెతో దీపం పెట్టడం కూడ ఆచారమే. పిల్లలు పెద్దలకు నమస్కరించడం ముఖ్యభాగంగా చెలామణి అవడం, 'మొక్కుల పండుగా గా సంక్రాంతిని భావిస్తారు. కుటుంబపరంగా కూడ, సుఖ సంతోష సరస సల్లాప సహిత సమావేశాలు, కొత్తదంపతుల సంక్రాంతి సత్కారాలు ఈ పండుగలో అనివార్యాలు. కొత్తసంవత్సరం జనవరిలో జరుపుకున్న వెంటనే మనసంస్కౄతిని ప్రతిబింబించే సంక్రాంతి పండుగ సరిసములులేని పర్వోత్సవసమాహారం.
మూడవరోజు - కనుమకనుమ పూర్తిగా కర్షకుల పర్వదినోత్సవాల మయమే. పశువులను గౌరవించడం గోధనం దేశధనంగా వస్తున్న భావన, పశువులను సొమ్ములుగా పిలుచుకోవడం సదాచారసంపన్నతకు మారుపేరు అయింది. గ్రామాల్లో పశుబలి, పశువుల కొట్టాల్లో పాలపొంగలి తయారీలో 'పాలపొంగలి పసుల పొంగలీ అని కేరింతలు, దేవతానైవేద్యం తర్వాత దాన్ని పొలాల్లో జల్లడం - పొంగలి మెతుకులు - 'పొలిచల్లడం' వల్లన పంట పొల్లుపోక, గింజ రాలుబడి పెరుగుతుందనే విశ్వాసం అధికం. దిష్టితో గుమ్మడికాయను పగలకొట్టడం కూడ ఆచరిస్తారు. ముందున్నది ముసర్ల పండగ (పొలాలలో పొలి అన్నపు మెతుకులు) నాడు మిడిసిపాటుతనం వెల్లడవుతుందనే గుర్తుచేయడం కనిపిస్తుంది. పశువుల సంబరాల్లో భాగంగా, అలంకరణలు, రంగుపూతలు, గంటలుకట్టడం చాలా హడావుడిగా జరుగుతాయి. భూమాతను అభ్యర్ధించడం, కౄషిచేయడం, కోడెలను, ఆవులను ఆదరించడంలాంటి చర్యలు కౄతజ్ౙతాసంకేతాలు అనే చెప్పాలి. గంగిరెద్దాటలు, డూడూ డూడూ బసవన్నా అంటూ సన్నాయిమేళాల మధ్య మాటలు, ఎద్దుతల ఊపులాటలు, భావిధోరణి చెప్పించడం గౌరవచర్యలు. ఎడ్లపోటీలు, కోడిపందాలు, గొర్రెపొట్టేళ్ళ కుమ్ములాట ఊరేగింపులు, సరదాల మధ్య ప్రాణభయం కూడ కలుగుతాయి. విజేతలకు కన్యాస్వయంవరాలు కూడ జరిగేవట. తమిళనాడులోని మధుర, తిరునల్వేలి ప్రాంతాల్లో, ఎడ్లకొమ్ములకు నగనాణ్యాలు, వస్తాలు కట్టి పరుగులెట్టించడం, చప్పట్ల తప్పెట్ల మధ్య వేగం పుంజుకోవడం, ప్రమాదాలు జరుగుతున్నా, కట్టినవాటిని విప్పే ప్రయత్నంలో తీవ్రతరపోటీలు మరింత వెర్రితనం ముదరడం వలన, న్యాయస్థానం కూడ జోక్యం చేసుకున్న వెర్రిధోరణులు కూడ గమనిస్తాం. ప్రజల తీవ్ర అభ్యంతరధోరణులు కూడ గమనిస్తున్నాం. ఆచారాలు అవాంతరాలకు దారితీయరాదు అన్న స్పౄహలోపిస్తున్న కలికాలంలో సంక్రాంతి జరుపుకుంటున్నాం.
మూన్నాళ్ళ తర్వాత ముక్కనుమమూడవరోజైన కనుమ తర్వాత జరుపుకునే పండుగ ముక్కనుమ కూడ చాలాచోట్ల ఆచారంగా వస్తోంది. స్త్రీలు ఆచరించే శ్రావణ మంగళ గౌరీవ్రతం, సంక్రాంతి బొమ్మలకొలువులు, పుట్టింటిని క్షేమాభివౄద్ధిని కోరి 'కాకి పిడచ పెట్టడం' కూడ ఆచారమే.
బలి కధనంబలిచక్రవర్తి రాజ్యపు ఆబాలగోపాలం స్మరణలతో ఉత్సవాలు, దక్షిణాయనంలో పాతాళానికెళ్ళి తిరిగి రావడంపై ప్రార్ధించడంలో నరకచతుర్దశి రోజున బలికి రాజ్యం కోరగా, సూర్యుడు బలిని వదలి మరల అగుపడు గాక అని కోరిన పిదప సంక్రాంతినాడు బలిస్మరణం జరుగుతుంది. దీన్ని బట్టి మకరసంక్రమణం సూర్యారాధ్యోత్సవం గా తెలుస్తుంది.
ప్రముఖ తెలుగుకవి - తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారి కవిత - 'సంక్రాంతీ అందచందాలని వివరించిన తీరుకి మచ్చుతునక.
కదలి వచ్చెను భాగ్యాల కడలిపోలి, మకర సంక్రాంతిలక్ష్మి హేమంతవీధి.
మధుర మధురానురాగసామ్రాజ్యపీఠి, జగము కొలువుండె మకరధ్వజంబు నెత్తి.
యింక పండుగనాడు ఎదురయ్యే భోజన భక్ష్యాదుల గురించి -
లేగటిపాలలో క్రాగి మాగిన తీయ తీయ కప్పురభోగి పాయసంబుచవులూరు కరివేపచివురాకుతో గమగమలాడు పైరవంకాయకూరతరుణకుస్తుంబరీదళమైత్రిమై నాల్క త్రుప్పుడుల్చెడు నక్కదోసబజ్జిక్రొత్తబెల్లపుదోడికోడలై మరిగిన ముదురుగుమ్మడిపండు ముదురుపులుసుజిడ్డు దేరిన వెన్నెల గడ్డపెరుగు, గరగరికజాటు ముంగారు చెరకురసముసంతరించితి విందుభోజనము సేయ, రండురండని పిలిచె సంక్రమణలక్ష్మి.
పైవిధంగా వడ్డించిన విస్తరి మనందరిముందు తయారు చేశారు, మన ప్రాచీనులు, పురాణీకులు, ఐతిహాసికులు, కవిఘనులు. ఆహారాన్ని ఆరగిద్దాం, ఆచారాల్ని ఆచరిద్దాం. జాతీయతని జారవిడవకుండ, సదాచారాన్ని సగౌరవంగా పాటిద్దాం. మకరసంక్రమణలక్ష్మికి మదిలో అర్చనలు చేద్దాం.
రావమ్మా మహలక్ష్మీ రావమ్మా, కౄష్ణార్పణం అంటూ పలవరిద్దాం. పండుగను పర్వదినంలా జరుపుకుందాం.
మకరసంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు, శతసహస్రాలు. శతధావిన్నపాలు. ఓం తత్సత్
.


తెలుగురధం - అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.


కొంపెల్ల శర్మ అ- తెలుగురధం.

Monday, January 12, 2009

వివేక విశ్వజనీన వాణి - యువజనోత్సవాలు



స్వామి వివేకానంద - వివేకవాణి విశ్వజనీనం


"కొందరు చిరంజీవులు. గొప్పవారి జీవితాలు అందరికీ దర్పణాలు. నిజజీవితానికి నిదర్శనాలు. ఇహలోకం వీడినా కాలమనే యిసుకతిన్నెలపై తమ చిహ్నాలను ముద్రిస్తారు" అన్నాడు ప్రముఖ రచయిత, హెచ్. డబ్ల్యు.లాంగ్ ఫెలో. నాదబ్రహ్మ త్యాగరాజు కూడ అన్నాడు - ఎందరో మహానుభావులు, అని. కొంచెం విశాలదృౠక్పధం, హౄదయవైశాల్యం ఉన్న మానవతావాదులకు అందరూ మహానుభావులే అని భావించడం తరచు జరుగుతూంది. కొద్దిమంది మాత్రమే, అందరికీ మహానుభావులుగాను, మహామనీషులుగాను, యుగకర్తగాను భావించడం, అలాగే అవతరించడం, సమాజానికి తమదైన విలువైన సేవలను అందించి తమ సార్ధకజీవితాన్ని మనముందు చిత్రఫలకంలా ప్రతిష్ఠించి మనముందు భౌతికంగా అదౄశ్యమైనా, మన హౄదయాల్లో, మనసుల్లో, నిత్యం సంచరిస్తూనే వుంటారు. అటువంటి శ్రేణి వ్యక్తుల్లో, తిరుగులేని, ఎదురులేని, వ్యక్తి - స్వామి వివేకానంద. వివేకానందుని జీవితం, అనుభవం, సందేశం, భారతదేశపు సామాజిక సాంస్కౄతిక పునరుజ్జీవనానికి నిత్యం దోహదం అవుతుంది అన్న భావన - సత్యం, శివం, సుందరం. భారతావనికి ఆధ్యాత్మిక జ్ౙానప్రదాత, వివేకానందుడు. ప్రణామాస్త్రాన్ని అందించి అందరినీ వశపరచుకొనే పరమయోగులు శ్రీ రామకౄష్ణ పరమహంసకు ఏకలవ్య అంతేవాసి - వివేకానంద. ప్రముఖ కవి నారాయణరెడ్డిగారు అన్నట్లు - వివేకానందుల వారిది విశ్వజనీనవాణి. ఆత్మజ్ౙాన గోవిందులు, వివేకానందులు.
వివేకానంద - పేరు వెనుక ద్ఫాగిన రహస్యంజన్మత: నరేంద్రనాధ్ దత్త అన్న పేరుగల వివేకానందుడికి పేరు వచ్చిన సమయ సందర్భం అపూర్వం. ఆ కధనం యిలా సాగింది.
హైదరాబాదునుండి మద్రాసుకి తిరిగి వెళ్ళిన నరేంద్రుడు చికాగో ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లను చేసుకొనే సందర్భం. ఇంతలో క్షేత్రమహారాజు అజిత్ సింగ్ నుండి ఒక వర్తమానం వచ్చింది. తనకు కొడుకు పుట్టాడని, నామకరణ మహోత్సవానికి వచ్చి వెళ్ళాలని దాని సారాంశం. స్వామి కాదనలేక, ఎట్లో తీరిక చేసుకుని వెళ్ళాడు. మహారాజు ఎంతో ఆప్యాయంగా స్వాగతంతో ఆదరించాడు. అతడు వివేకానందులకు చాలా త్వరగా ఏర్పడిన మిత్రుడేకాక, మిక్కిలి ఆప్తుడైన శిష్యులలో కూడ ఒకరు. చికాగో వెళ్ళడానికి కావలసిన వనరులను సమకూర్చి పెట్టుదునని స్వామికి మాటయిచ్చిన మహారాజతడు. బొంబాయిలో స్వామికి వీడ్కోలు చెప్పడానికి తన అంతరంగిక కార్యదర్శిని కూడ అచటికిపంపెను. ఈ క్షేత్రపట్టణమున మహారాజు యింటనే అతనికోరికపై స్వామి వివాకానంద నామాన్ని స్వీకరించడంజరిగింది. ఇది 1893 మే నెలలో జరిగిన విశేషం. శ్రీ శంకర భగవత్పాదుల వారి 'వివేక చుడామణీ గ్రంధనామమందలి 'వివేకా శబ్దమే స్వామియొక్క వివేకానంద నామధేయానికి మూలం అని చెప్పాలి. అప్పటివరకు వివిధ పేర్లతో వ్యవహరింపబడుచూ ప్రఛ్ఛన్నముగ భారతదేశ పరిక్రమణము చేసిన స్వామి ఆది మొదలుకొని వివేకానంద నామంతో జగత్ప్రసిద్ధుడైనాడు. చికాగో మత మహాసభలో గుప్పుమని గుబాళించిన యీ యీ పేరు లోగడ పూనాలో తన యింట తనతో పాటు కొన్ని రోజులు గడపిన వ్యక్తిగల యీ పేరును పోల్చుకొని తిలక్ వంటి మహనీయుడు సైతం 'ఈతడా వివేకానందుడూ! అని ఆశ్చర్యచకితుడయ్యాడు.
వివేకానందుని గురించి ప్రముఖుల మాటల్లో -వివేకానంద వాణి విశ్వజనీనం. అది వేదాంత హౄదయ నిలయం నిత్య నవీనం. - డా.సి.నారాయణ రెడ్డి.కళ్ళు మూసుకున్నా కనిపిస్తున్నాడు, చెవులు మూసుకున్నా వినిపిస్తున్నాడు. - డా. జె.బాపురెడ్డి.వివేకానందస్వామి నేడు జీవించివున్నట్లైతేనే నాయనపాద సన్నిధిలొ ఉండేవాణ్ణి. నేను అతిశయమేమి చెప్పనట్లైతే, ఆధునిక భారతం ఆయన సౄష్టి. - నేతాజీ, సుభాష్ చంద్రబోస్.భారత దేశాన్ని గూర్చి తెలుసుకోవాలంటే వివేకానందుని ఆధ్యయనం చేయండి. ఆయన విధానంలో అంతానిర్మాణాత్మకమే గాని,వ్యతిరేక భావాలకు తావులేదు. - విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్.వివేకానందస్వామి రచనలు నేను క్షుణ్ణంగా ఆధ్యయనం చేశాను. నా దేశమంటే నాకు గల ప్రేమ, ఆయన రచనలు మననం చేసుకున్న ఫలితంగా సహస్రాధికంగా వౄద్ధి చెందింది. నాకు దేశంపట్ల ప్రేమను ప్రసాదించింది వివేకానందుడు. - గాంధీ.ఈనాడు వివేకానందుని సందేశం అక్షర రూపంలో చదువుతున్నంత మాతముననే ఒడలు జలదరిస్తుంది. విద్యుదాఘాతమువలె ఆయన వచనాలు నన్ను కుదిపివేస్తాయి. అట్లాంటి దివ్యవాణిని, ఆయన ముఖత: వినియున్న శ్రోతలు ఎంతటి అనుభూతి పొందియుండిరో! - నోబెల్ బహుమతి గ్రహీత, సుప్రసిద్ధ ఫ్రెంచి నవలా రచయిత, రోమారోలా.
ఇందరిని ప్రభావితం చేసిన స్వామి వివేకానందుల అసామాన్య వ్యక్తిత్వం భారతీయ యువతను కూడా జాగౄతం చేసింది. నేతాజీ, గాంధీజీ తదితరులు కూడా తమ యౌవనంలోనే వివేకానందుల నిర్మాణాత్మక సాహిత్య ప్రభావానికి వశమైపోయారు. మరి అలాంటి వివేకానందులు యువత కిచ్చిన సందేశసారాన్నిబట్టి చూస్తే, కారుచీకటిలో కాంతిరేఖలా గోచరిస్తాడు వివేకానందుడు. హిందూత్వం భారతీయాత్మ అని, జీవసేవే దేవసేవ అని, ప్రత్యేకంగా యువతని ఉద్దేశించి, వికారాలు విడనాడండి, చైతన్యమూర్తులు కావాలి, మాతౄదేవత పూజారులు కావాలి, భారతీయ హౄదయ వైశాల్యాన్ని గమనించాలి, ధర్మరక్షకులు కావాలి, అజ్ౙానం తొలగాలి, దురాచారాలు దూరం కావాలి అని బోధిస్తూ, భారతీయాదర్శాలని, వ్యవస్థీకౄత యువశక్తి నిర్మాణావశ్యకతని వక్కాణిస్తూ, నవభారత నిర్మాణావశ్యకతని ఆకళింపు చేసుకోవాలని ప్రవక్త ప్రభోధం చేశారు.
వివేకానంద జన్మదినం - జాతీయ యువజనోత్సవాల సందర్భంగా (జనవరి 12), నవభారత యుగకర్త పై ఈ చిరుభావనాధారని, మహా వక్త, సురేంద్రనాధ్ బెనర్జీ మాటల్లో ముగించడం సమంజసం.
ఎక్కడి పాశ్చాత్య దేశాలు! ఎక్కడ సనాతన ధర్మం! సనాతన ధర్మ సందేశాన్ని పాశ్చాత్యులకు అనర్గళంగా చాటి చెప్పిన వివేకానంద యతివరేణ్యునికి వినయంతో కౄతజ్ౙతాంజలి సమర్పించకుండా ఉండలేము. - మహావక్త, సురేంద్రనాధ్ బెనర్జీ.
భారతదేశపు భూమియే నా అత్యున్నత స్వర్గము. భారతదేశపు శ్రేయమే నా శ్రేయము. - స్వామి వివేకానంద.
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా భారతదేశంలో 'జాతీయ యువజనోత్సవాలను జరుపుకోవడం వార్షీకపు సంప్రదాయం. ఈ రోజు యువకులకు, యువశక్తికి ఒకరకమైన చైతన్యస్ఫూర్తి, ప్రేరణాత్మకమైన ప్రభావం అని చెప్పక తప్పదు.
వివేకానంద వివేకప్రస్థానానికి తెలుగురథం ప్రణామాలని సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

Saturday, January 10, 2009

సంగీత సుస్వరదాసు - జేసుదాసు


పద్మభూషణ్ సంగీతసుస్వరదాస్ కె.జె.ఏసుదాస్

అనుభవాస్వాదం, మధుర బానిసత్వంబహుభాషలలో సంగీతప్రియత్వం కలిగిస్తున్న ఏసుదాస్, 'దేవుడే యిచ్చాడు వీధి ఒకటీ, 'గాలివానలో వాననీటిలో పడవ ప్రయాణం' లాంటి మధుర గాత్రస్వరంతో తెలుగు సినీమా గీతాభిమానుల్ని చిరస్మరణీయమైన సంగీతయానం చేయిస్తున్న ఏసుదాసు చిత్రగీతాల్ని,శాస్త్రీయసంగీతాన్ని మరచిపోవడం అన్న ప్రశ్నే వుండదు, వుండకూడదు. ఆయన ఎన్ని పాటలు పాడాడన్నది కాదు, ప్రజాదరణ ప్రజాదరణ పొందినవి ఎన్ని అన్న ప్రశ్నే రాని ప్రతిభ. ప్రతీ పాట, ఒక సంగీత మధురస్వర సహిత గీతాప్రవచనమే అంటే అతిశయోక్తి కాదు, లేదు. ఆయన స్వరానికి, గీతాలాపనలో ఒక విధి, విధానపూరితమైన బద్దతను నిరంతరం పాటిస్తున్నట్లు కనిపిస్తే, అభిమానులకు మాత్రం జేసుదాసు సంగీతకళం పట్ల అనుభవాస్వాదపూరిత మధురబానిసత్వం అని చెప్పవచ్చు.
వీడని ప్రతిభాప్రాతినిథ్యంకట్టాస్సెరి జోసెఫ్ ఏసుదాస్ జనవరి 10, 1940 న్ ఫోర్ట్ కొచ్చిన్ లో జన్మించిన, ఈయన తండ్రి అగశ్టైన్ జోసెఫ్ చాలా ప్రసిద్ధ గాయకుడు,నాటక కళాకారుడు. నలుగురు కుమారులు, కుమార్తె వున్న కుటుంబంలో ఏసుదాసు పెద్దకుమారుడు. అతిచిన్న ప్రాయంలోనే, తండ్రిద్వారా సంగీతాభ్యాసం ప్రారంభించడం, అయిదేళ్ళలోపే, కర్ణాటక సంగీత ప్రాధమిక సూత్రాలని క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నాడు. తండ్రితో పాటు, 12వ ఏటనే ఎర్నాకుళంలో సంగీతకచేరీలో పాల్గొన్నాడు. పళ్ళురుతిలోని సెబస్టియన్ స్కూలు నుంచి, ఉత్తమగాయకునిగా, అనేక సంవత్సరాలు ఏసుదాసే ప్రాతినిథ్యం వహించాడు. ఆర్.యల్.వి. మ్యూజిక్ అకాడమీలో సంగీతాభ్యాసం చేసిన ఈ దాసుకు శాస్త్రీయసంగీతంలో గట్టి పునాదుల్ని నిర్మించుకున్నాడు.
సంగీతానికి 'గళస్వరం' ఘన భాగస్వామ్యంసంగీతంలో ముఖ్యపాత్ర వహించే 'గళస్వరం' గురించి, "అది భగవద్ప్రసాదమని, మంచిస్వరం సంప్రాప్తమైతే, ఆ గళస్వర సమన్వయతని బహుజాగ్రత్తగా కాపాడుకోవాలని, ఈ విషయంలో అవలంబించే మంచి అలవాట్లను నిరంతరం పాటించడం వలన, గళస్వరపేటికను భద్రపరచుకోవడం జరుగుతూందీ అని ఒక సందర్భంలో వివరించారు. ఆలాపించే ప్రతీఅంశం, సంగీతశాస్త్రీయావగాహనతో, దైవసంకల్పంగా భావించి గానంచేయడం మూలాన, తన వౄత్తికి సార్ధకతను సంపాదించుకోగలుగుతున్నానని కూడ అనడం జరిగింది.
గాయకుడికి ఎనలేని బాధ్యతలుకళాకారుడికి కళాసేవపట్ల చాలా అనిర్వచనీయమైన బాధ్యతలుంటాయని, సంగీతదర్శకులు చేసే మార్పులన్నింటినీ తక్షణమే తన శక్తిసామర్ధ్య శైలీవిన్యాసాలతో ఆకళింపు చేసుకుని, తనదైన భాగస్వామ్యంతో పున:దర్శనం, పున:ప్రతిష్ఠ ఒక బాధ్యతగా భావించి, నిర్వర్తించడం జరుగుతుందని తన సుదీర్ఘానుభవాన్ని తనదైన శైలిలో తెలియపరచారు.
శాస్త్రీయత నుంచి లలితానికి తరచు బదలీలు సాధ్యం కాకపోవచ్చు
బాధ్యతాపూర్వకమైన నిర్వహణాప్రయత్నం నిష్ణాతపూర్వకంగా సాధించలేనివారు, శాస్త్రీయశైలినుంచి లలితసంగీతానికి, లలితంనుంచి శాస్త్రీయానికి తరచు దాటులు వేయడం సంగీత కళాకారునికి సాధ్యపడకపోవచ్చు. భాషలు వేరైనా, భావం ఏకమే, ప్రాధమిక సంగీతపర సూత్రాల్లో వేరువేరు దారులు గమ్యాలు లేనేలేవని, గాయకవౄత్తిలోని వ్యక్తి ఒక ప్రత్యేక స్వరకంపనాన్ని సౄష్టించుకుని, గ్రహించుకుని, ఆచరిస్తూపోవాలని, ఈ ప్రయత్నంలో సార్ధకమైతే, కళాకారుడికి ప్రదర్శించే కళపట్ల విజయం సాధించినట్లేనని తన విశ్వాసాత్మకమైన భావనని ప్రకటించారు. విశ్వాసం, భావం మిళితమైతే నిరంతరం విజయం వెంటనే వుంటుందని కూడ తెలిపారు.
సంగీతశిక్షణ పాఠ్యాంశాలుగా ప్రాధాన్యతసాధారణ చదువులోనే సంగీత పాఠ్యాంశాలు అంతర్లీనంగా అభ్యసింపబడాలని, ఈ పంథాలో అంత ప్రాధాన్యత, శ్రద్ధ ప్రకటించడం జరగడం లేదని, దీనికి అధికారాన్ని అనుభవించే కళాకారుల బాధ్యత కూడ వుందని, ఈ విషమసంస్కౄతినుంచి ప్రభుత్వాలు, అధికారులు, కళాకారులు, కళాసంస్థలు మూకుమ్మడిగా కౄషిని చేసి ఫలితాలను సాధించాలని, ఎప్పుడో తమిళ సంగీత మహాసభలో అధ్యక్షోపన్యాసంలో పేర్కొనడం గమనార్హం.
సంగీతం, గీతం, గాత్రం - ముప్పేట కలయికసంగీతం, గీతం, గాత్రం - మూడింటి ముప్పేటముడివేసి, అన్యులకు అంత సాధారణంగా ఆ ముడిని విప్పలేని ప్రతిభాపాండిత్యాలతో, భారతదేశపు సంగీతచిత్రప్రేక్షలచేత కేరింతలు, జేజేలు (కేజేలు) పలికింపచేసుకునే గానగంధర్వమూర్తి, జేసుదాసుగారి జన్మదినం సందర్భంగా, శుభాకాంక్షలను, అభినందనలని, తెలియజేసుకుంటూ - మహాకళాకారుడికి వినమ్రపూరిత ప్రణామాలు సమర్పించుకుంటూ - ఒక సంగీత పరిచయం లేని జీవుడు.
కొంపెల్ల శర్మ - తెలురురధం.

Monday, January 5, 2009

నాదబ్రహ్మయోగి - కాకర్ల త్యాగరాజు వర్థంతి


నాదబ్రహ్మయోగి - 'కాకర్ల త్యాగరాజూ వర్థంతి - 6 జనవరి 1847 ( 1767 - 1847 )


శ్రీరామచంద్ర చరణార్చక భక్తశ్రేష్ట! బహురమ్య భావరస సంయుత గీతకర్త! వేదాంత తత్త్వ బహుళార్ధ వివేకమూర్తి! శ్రీ త్యాగరాజ గురుదేవ, నమో, నమస్తే!
తెనుగుజగతిలో భక్తి, ధ్యాన, ముక్తి, భవబంధురభావ సామ్రాజ్యాలని పరిపాలించిన ప్రసిద్ధులలో సరిసములు లేని మున్మూర్తుల రాజులు - త్యాగరాజు, పోతరాజు, గోపరాజు - కౄతులు, భాగవధకధామౄతం, కీర్తనల ద్వారా రసానంద, అమౄతోపమాన, భావచైతన్యస్ఫూర్తికరంగా అందించిన మహావరప్రసాదాలు.
త్రివేణీ సంగమం గా సాహిత్యం, సంగీతం, గానం తో వాగ్గేయకారకత్వం
మానవుని కళాత్మక చైతన్యానికి భాషతో పాటు సంగీత నౄత్యాలు అందమైన ప్రతీకలు. సంగీతం లేని భాష లేదు. నౄత్యం లేని నాగరికత లేదు. లయాన్వితంగా వెలువడిన భాషకు శ్రవణతర్పణ గుణం వుంటుంది. చెవులకు ఇంపులేని భావానికి, భాషకూ ఆకర్షణ లేదు. కనుకనే సంగీతాత్మకమైన భావమే కవిత్వమన్న భావనకు ప్రాచుర్యం లభించింది. తెలుగుకవిని రాగమధురిమలతో సుసంపన్నం చేసిన మహనీయుల జీవితం ధన్యతనుపొందింది. కవితలల్లి, వాటిని రాగబద్ధం చేసి పాడగలిగే ప్రతిభామూర్తులే వాగ్గేయకారులు. మన తెలుగుజగతిలో పలువులు వాగ్గేయకారులు అవతరించి - సంగీత, సాహిత్య, భక్తితత్వాలను మూర్తీభవించిన త్రివేణీసంగమాలై ప్రభవిల్లారు. సంగీత, సాహిత్యాల సమ్మేళన రూపాలైన పదకర్తల్నే వాగ్గేయకారులని, వాక్కు (సాహిత్యము_, గేయం (సంగీతము), రెంటినీ చేయగల సమర్ధుడు వాగ్గేయకారుడు. ఈ వాగ్గేయాల్నే మాతువు, ధాతువు అనడం సంగీత పరిభాష. ప్రాచీనకాలంలో, అన్నమయ్య, క్షేత్రయ్య, నారాయణ తీర్ధులు, రామదాసు, సారంగపాణి, పోతులూరి వీరబ్రహ్మం, మునిపల్లె సుబ్రహ్మణ్యకవి, త్యాగరాజు, మంగళంపల్లి బాలమురళీకౄష్ణ వంటివారిని ప్రధమగణనంలో తప్పక ప్రస్తావించాలి. ప్రస్తుతతరపు ప్రతినిధులుగా శ్రీ మంగళంపల్లి బాలమురళికౄష్ణ ను కూడ ప్రస్తావించాలి.
నాదోపాసన పరంపర లో 'మూర్తిత్రయం'వేదపరమార్ధాల్ని లోకమునకు అనుగ్రహించిన తేజోమూర్తి నారదుడి దివ్యానుగ్రహముతో వ్యాసుని గాంధర్వవేదము (సంగీతం)నకు, 'వ్యాసకటకమూ అను నిబంధన గ్రంధమును స్మరించెనని ప్రమాణము. 'నారద కటకమూనకు స్వరార్ణవమను సంకేతం కలదు. 'హనుమత్కటకమూ ఔత్తరాహ సంగీతమునకు మార్గదర్శకమని సంగీత శాస్త్రమర్యాదను పెద్దలు నిర్ణయించారని చెబుతారు. పండిత వర్గములు, సంప్రదాయ సౄష్టలు తర్వాత, క్రమంగా, సన్నిహితులు సదాశివబ్రహ్మేంద్ర, నారాయణతీర్థ, రామదాసాదులు అర్వాచీనంగా ప్రసిద్దులైన వాగ్గేయకారులు. ఆ తర్వాత దక్షిణభారతమున తంజాపుర మండలము, శ్రీ త్యాగరాజేశ్వర క్షేత్రము తిరువారూర్ అను పుణ్యక్షేత్రమున, రెండు సంవత్సరాలలోపు తారతమ్యంతో అవతరించిన సంగీత త్రిమూర్తులుగా ప్రసిద్ధులు, వాగ్గేయకారులు - శ్రీ శ్యామశాస్త్రి (1763), శ్రీ ముత్తుసామి దీక్షితులు (1775), శ్రీ త్యాగరాజబ్రహ్మము (1767) లకు వేరే సపరిచయం అనవసరం.
మన త్యాగరాజుత్యాగయ్య నాదోపాసనలో ముక్తిపొంది భక్తుల కందరికి దారి చూపిన మహా వాగ్గేయకారసత్తముడు. అన్నమాచార్యుని ఆధ్యాత్మిక సంపద, పురందరదాసు సంగీత స్ఫూర్తి, రామదాసు భజనరీతి పుంజీభూతం గావించుకొని, సంగీత సామ్రాజ్యానికి అధినేతౄత్వం వహించిన మహానుభావుడు, త్యాగయ్య. త్యాగయ్య శహభూపాలుని ఆస్థాన వాగ్గేయకారుడై ప్రసిద్ధి కెక్కిన గిరిరాజ కవికి స్వయాన పౌత్రుడు. గిరిరాజ పుత్రులలో కనిష్టుదు రామబ్రహ్మం. రామబ్రహ్మం పుత్రుల్లో కనిష్టుడు త్యాగయ్య. 1600 ప్రాంతంలో కాకర్ల ( కంభం మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్) నుంచి తంజావూర్ జిల్లా తమిళనాడు కి వెళ్ళి స్థిరపడ్డ ములికినాటి ఆంధ్ర బ్రాహ్మణ వంశం. సీతమ్మ - రామబ్రహం దంపతులకు 4 మే 1767 న త్యాగయ్య జన్మించాడు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శరభోజీ ఆదరంలో ఉండేవాడు. తాత గిరిరాజకవి మహావాగ్గేయకారుడు. మాతామహుడు వీణ కాళహస్తయ్య ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు. తల్లి పురందరదాసాదుల కీర్తనలను పాడుకొంటూ ఉండేది. సంగీతం త్యాగయ్యకు ఉగ్గుబాలతోనే అబ్బింది. సంస్కౄతాంధ్రాలలో పాండిత్యం గడించాడు. శొంఠి వెంకటరమణయ్య వద్ద ఏడాదిలోపునే సంగీతంలో ప్రావ్విణ్యాన్ని సంపాదించాడు.
శ్రీరామదర్శనభాగ్యం - ఆశువుగా 'అఠాణారాగ కౄతీ గానంరామకౄష్ణానందస్వామి, సన్యాసి, నారదోపాస్తి మంత్రాన్ని త్యాగయ్య కుపదేశించాడు. నారదుడు యతివేషంలో వచ్చి స్వరార్ణవమనే సంగీత గ్రంధాన్నిచ్చి, సమస్త సందేహాలు తీరిపోతాయని ఆశీర్వదించి వెళ్ళాడు అని విశ్వాసం. తన గురువైన నారదుని అనేక విధాల ఎన్నో కీర్తనల్లోస్తుతించాడు. గురువు ఆదేశానుసారం 96 కోట్లు రామతారకమంత్ర పఠనంతో శ్రీరాముడు సలక్ష్మణసమేతుడై దర్శనమివ్వడం, ఆ అనుభూతిలో, 'ఏల నీ దయరాదు పరాకు చేసేవేలా (ఆఠాణా రాగం) అని ఆశువుగా కీర్తనను రచించి గానం చేశాడుట. రామదర్శనసాక్ష్యంగా, రచించిన అనేక కౄతులు సాక్షీభూతంగా దర్శనమిస్తాయి. 'అలకలల్లాడగగని ఆ రామణ్ముని యెటు పొంగెనో' అన్నది ఉదాహరణం. రాజాశ్రయాన్ని తిరస్కరించి, నిత్య రామసంకీర్తన ఆచరణ, ఉత్తమవాగ్గేయకారుడిగా దేశవ్యాప్తంగా వచ్చిన కీర్తి, సంగీతసభలు, సన్మానాలు విరివిగా చేసేవారట. తంజావూరు ప్రభువు కానుకలను కూడ తిరస్కరించాడు. ఆవేశంలో 'నిధి చాల సుఖమో - రాముని సన్నిధి సేవా సుఖమా' అని గానం చేశారు. తిరువాంకూర్ ప్రభువు స్వాతి తిరునాళ్ళు ఆహ్వానాన్ని తిరస్కరించడం, 'పదవినీ సద్భక్తియుగల్గుటే' అని, త్యగయ్య పూజించే రామ పంచాయతన విగ్రహాన్ని కావేరెలో పడవేసి, 'ఎందు దాగినాడో?' అన్న కౄతిద్వారా తన ఎదలోని రొదను తెలిపాడు. రాముడు స్వప్నంలోకి రావడం, కావేరి నుంచి విగ్రహాన్ని తెచ్చుకొని పూజచేయడం ప్రారంభమైంది. తిరువొత్తియూరు, కోవూరు, నాగలాపురం, తిరుపతి, పుత్తూరు, కంచి, వాలాజపేట, శ్రీరంగం, నాగపట్టణం, ఘటికాచలాది పుణ్యక్షేత్రాల్ని సందర్శించి ఆయా దేవతల ఉపముద్రతోటి అనేక కౄతులను సమకూర్చాడు.
సంకీర్తన నుంచి కౄతి వరకు భక్తి, ధ్యాన కవిత ప్రస్థానంఅన్నమాచార్యుల సంకీర్తనగాను, ఆధ్యాత్మికపరంగాను అవతరించిన కీర్తన, రామదాసు, నారాయణతీర్థులు, సుబ్రహ్మణ్యకవి వంటి వాగ్గేయకారులచే భజన, ఆధ్యాత్మన కీర్తనగాను, ధాతుకల్పనతో నూతనమార్గాన్ని అనుసరించి, మరొక నూతనరూపంలో, త్యాగరాజు నాటికి 'కౄతీ అనే పేరు వహించి పరిపక్వం పొందింది. కౄతులు దశలో రాగాలస్వరూపంలో కూడ చాల మార్పులు సంభవించి, రాగస్వరూపదర్శనానికి త్యాగరాజ కౄతులు దర్పణాలై విరాజిల్లాయి. ఏది ఏమైనా, పదం, కీర్తన, కౄతి రూపాలు త్రివేణీసంగమమై, ముప్పేటన అల్లుకుపోయాయి. ఈఆధునిక సాహిత్య-సంగీతకళా సంస్కౄతిలో విభజించడం జరగని పని. పేరులోనే పెన్నిధి అన్నది వర్తించకపోయినా, ఏప్రక్రియ అయినా, సంగీతనిధి అని చెప్పక తప్పదు. 'సాహిత్యంలో అంతరార్ధాన్ని మరింత ప్రస్ఫుటం చేయడానికి రాగసంచారంలోని ప్రత్యేకప్రయోగాల ద్వారా రాగభావాన్ని సాహిత్య భావంతో రంగరించి విస్తరించడానికి సంగతుల ప్రయోగం విరివిగా జరిగి త్యాగరాజకౄతులకు ప్రత్యేక స్వరూపాన్నిచ్చింది. ఈ సంగతుల విస్తరణనే ధాతుకల్పన దక్షతగా విజ్ణులు భావించారూ అని తెలుగు వాగ్గేయకారులపై విశ్లేషణ చేస్తూ డా. యస్.గంగప్ప గారు వివరించారు.
త్యాగరాజకౄతుల ముత్యాలసమాహారమాలిక - 'త్యాగబ్రహ్మోపనిషత్తూ'త్యాగరాజ స్వామి వ్యక్తిత్వంలో మూడు గుణాలు ప్రధానంగా - నాదబ్రహ్మోపాసన శక్తి, భక్తిజ్ణాన పరీపాకం, కవితాలాలిత్యం అయితే, వారికి సంగీతం మేద ఉన్న అధికరక్తి, సాహిత్యంమీద గౌణభక్తి పుష్కలమైతే, సాహిత్యాపాసకులు త్యాగరాజ కౄతులలోని సాహిత్య రసికత్వాన్ని, సంగీత సంయోజన సౌలభ్యాన్నీ సమీక్షించి భక్తిరససిద్ధిని సాధించుకుంటారూ అని ప్రముఖ సాహితీవిమర్శనచక్రవర్తి డా.జి.వి.సుబ్రహ్మణ్యంగారు 'త్యాగరాజస్వామి భక్తికవితావైభవం' అన్న సుదీర్ఘవ్యాసానికి ఆముఖం - కృౠతి-సుకౄతీ ద్వారా తెలియపరుస్తూ, 'కౄతులలోని రాగాన్ని ఆలపిస్తే కలిగేది గానరసం; కౄతులలోని సాహిత్యాన్ని సమాలోచిస్తే కలిగేది సాహిత్యరసం' రసద్వయాన్ని మరింత రసభరితంగా ప్రవచించారు. త్యాగరాజు కౄతులకు 'త్యాగబ్రహ్మోపనిషత్తూ అనే ప్రసిద్ధికలగడం, 2400 కీర్తనలను రచించినట్లు సమాచారం. అయితే, నేటికి కేవలం 500 పై చిలుకుగానే లభించడం, సంగీతస్వరాలతో ప్రచారంలో ఉండడం గమనిస్తాం. త్యాగయ్య 72 మేళకర్తరాగాలలోనూ కౄతులు రచించాడు. బహువిధ కౄతులతోపాటు, ప్రహ్లాదభక్తివిజయం, నౌకాచరిత్రము, సీతారామ విజయము అన్న సంగీతరూపకాలైనా, వీటిని, ప్రబంధాలని, నౄత్యనాటికలుగాను ప్రఖ్యాతమైనాయి. త్యాగరాజకౄతుల్ని బహుక్లుప్తంగా క్రోడీకరించాలంటే, పామరభాషలో, చక్కని కౄతిరచనలు, వర్ణనలు, భక్తిరచనలు, నీతివైరాగ్యరచనలు అని చెప్పవచ్చునేమో.
ఘనరాగ పంచరత్న కీర్తనలు - ప్రత్యేక శైలీసంప్రదాయాలుత్యాగరాజు రచించిన కౄతులు,కీర్తనలలో దేని ప్రత్యేకత దానిదే. త్యాగయ్య కీర్తనలన్నీ భక్తి ప్రపూరితాలు. రస, స్వర, మధుభరితగుళికలు. అయితే, ప్రత్యేకశోభతో రాణించే మణిప్రకాశంలా, ఘనంగా ప్రస్తావించతగ్గ, ఉత్తమోత్తమస్థానార్హాలుగా, 'త్యాగరాజు ఘనరాగ పంచరత్నా కీర్తనలను విశేషంగా వివరించాలి. ఈ పంచరత్న కీర్తనలుగా నిరంతరం చెప్పబడే వాటిలో, స్వరాలబిగి, కూర్పు, సంగీతంలో ఉదాత్తతల్లో వాటి మహత్త్వత బహుధా ఉగ్గడింపబడ్డాయి. కర్ణాటకసంగీతజగతిలో జ్ణానులు, విజ్ణానులు, ప్రజ్ణానులు, స్వామివారి ఆరాధనాక్రమంలో పునీతంగా, పులకరింతలతో, అనుభవిస్తూ,పలవరించే భక్తిపరంపర వర్ణనాతీతం. ముక్తకంఠాలతో, భక్తిభావం వెల్లివిరిసేలా గానం చేయడం విధిగా విధిని పాటిస్తూ, సద్విధిగా భావిస్తూ ఆచరిస్తారు. సంగీతపు విలువలు, కీర్తనలనాణ్యత, సంగీతసాహితీవిద్వత్తులోకానికి, తద్వారా రసికులకు సుపరిచితాలు. చరణాలు అధికం, సుదీర్ఘమైన కూర్పు, శబ్దాలసంతరిఫులో విశిష్టత, భావప్రసారంలో నైపుణ్యం, మొదలైన ప్రత్యేక నైజాలు, శైలీసంపదల్ని కలిగివుండడం కారణాన, సార్ధకనామధేయంగా 'ఘనరాగకీర్తనాలని భావించడం సర్వోచితం. కీర్తనయావత్తు అవగతమే కాకుండ, త్యాగరాజులవారు భక్తిబోధనామౄతధారను వీటిలో ప్రవేశపెట్టడం జరిగింది. పంచరత్నకీర్తనలను ఏకైక ప్రయోజనసూత్రంతో బంధించి, ఘనరత్నకీర్తనామాలగా సంతరించి, సంఘటించిన తీరుతెన్నుల్లో, ఒక పద్ధతి, క్రమం, సంపుటీకరణం సుస్పష్టత కనిపిస్తుంది.
ఘనరాగ పంచరత్న కీర్తనలు'యిరువదిరెండు శ్రుతుల కలయికకు ఆస్కారములు కావడంచేతనూ, వీణలో యీ రాగాలని గానంచేసేటప్పుడు తానవిస్తరణకి ఎంతో అవకాశం ఉండడంచేతనూ, వీటిని ఘనరాగాలని, మంగళప్రదములై సుస్వనశోభితములైన రాగశ్రీలుగా సంప్రదాయంగా భావించడం జరుగుతుందీ అని ఘనరాగాల గురించి నిర్వచనాన్ని 'త్యాగరాజస్వామి భక్తికవితావైభవం' అన్న వ్యాసంలో ఆకెళ్ళ అచ్యుతరామం గారు విశదీకరించారు. ఈ పంచరత్న కీర్తనలు యిలా వున్నాయి.
1. 'జగదానంద కారక; (నాట రాగం) 2. 'కనకన రుచిరా' (వరాళి రాగం) 3. 'దుడుకుగల నన్ను ...' (గౌళ రాగం) 4. 'సాధించెనే, మనసా' (ఆరభి రాగం) మరియు 5. ఎందరో మహానుభావులు (శ్రీ రాగం). వీటిని సవివరణాత్మకతకు ప్రత్యేక వ్యాసమే, అన్యధాశరణం నాస్తి.యింతటి పరమోత్కౄష్టతను నింపుకొన్న వీటిని, పంచారామాలుగా, ఈ పంచరత్నకీర్తనలను భావించడంలో ఆశ్చర్యం లేదు. ప్రముఖ త్యాగరాజ సంగీతజ్ణులైన టి.వి.సుబ్బారావుగారు, పంచరత్నకీర్తనావైశిష్టతను, క్లుప్తంగా వివరించారు. "భగవంతుడు మానవునకు ప్రసాదించిన మహాభాగ్యాలలో అత్యమూల్యమైనదీ, అతణ్ణి 'ఉద్ధరించేదే' యేదీ అంటే సంస్కౄతీ, సంస్కారమూ అన్న జవాబు తట్టుతుంది. ఆ సంస్కౄతీ మహానుభూతులకు కారకమైన వాటిలో మణిపూసలాగా సర్వోత్కౄష్టమైనది - సంగీతజ్ణానము, భక్తి. ఈ సంప్రదాయంలో అత్యుత్తమమైనది - కర్ణాటక కృౠతి, సంప్రదాయ సంగీతం. వీటిలో, ఉత్తమోత్తమ వాగ్గేయకారులెవరంటే, సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారన్నది రూఢి అవుతుంది. ఆ త్యాగరాజ స్వామివారి రచనల్లో అత్యంత ప్రభాసమానములై, ఉత్తమోత్తమంగా శోభించే కౄతులేవీ అంటే, అవి ఈ ఘనరాగపంచరత్నకీర్తనలే అనడం నిర్వివాదాంశం' అని సత్యప్రకటన చేశారు. ఈ కధనం, 'కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు శకుంతలం - చతుర్ధాంకం, శ్లోకచతుష్టయం' అన్న పంథాలో వుంది. సంస్కౄతీ మహద్భాగ్యాలు వెతుక్కూంటూ పయనం చేస్తే, సందేహం లేని జవాబు ఈ పంచరత్నాలు, ఘనరాగసహితకీర్తనలు, సర్వసౌభాగ్యనిధులు.
మంగళవచనాలు
త్యాగరాజకౄతిలోనే ఈ నాదబ్రహ్మ గురించి మంగళం 'నీ నామరూపములకు మంగళం, నిత్య శుభమంగళం' అని సమాప్తం చేయడం, భారతీయకళాసంస్కౄతీవైభవానికి నీరాజనం
.
మరణం పై స్వీయ విశ్లేషణతన మరణం తానే కనుగొన్న కొద్దిమంది మహాపురుషుల్లో త్యాగరాజు ఒకరు. ఆయన కేవలం పది రోజుల్లోనే మౄత్యువు సమీపిస్తుందని గ్రహించి, "గిరిపై నెలకొన్న రాముని గురితప్పక కంటీ అని కీర్తన చెప్పడం కూడ కడు విశేషమే. శ్రేరాముడు స్వప్నంలో కంపించి, 'పది పూటలలో గాచెదననీ అభయమివ్వడం, అలాగే, జనవరి 6వ తేదీ 1847 న సిష్యులందరూ అఖండ దివ్యనామ సంకీర్తనం చేస్తుండగా నాద బ్రహ్మానంద దీక్షానామంతో త్యాగబ్రహ్మ తనువు చాలించిన వైనం కూడ మరువలేని ఘటన.
తమిళనాడు లోని తిరువాయూరులో కావేరీ నదీతీరాన నిర్మించిన త్యాగయ్య సమాథి ప్రాంతంలో బౄందావనం నిర్మించడం, ప్రతీ సంవత్సరం త్యాగరాజు శరీరం చాలించిన రోజు - పుష్య బహుళ పంచమి నాడు 'త్యాగరాజారాధనోత్సవాలూ ఐదు రోజులపాటు జరుపుకోవడం ఘన సంప్రదాయంగా నడుస్తూనే వుంది.
తెలుగు భాష వున్నంత వరకూ త్యాగరాజు ప్రతిభ, సంగీతం వున్నంత వరకూ ఘన రాగ పంచరత్న కీర్తనలు, యితర మధురమైన కీర్తనలతో పాటు నిత్యం స్మరణకు వస్తూంటూనే వుంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు, రాదు.
మచ్చుకు కొన్ని త్యాగరాజ కీర్తనలు :ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు.

చల్లని రామునిపై పూలు.

సీతా కళ్యాణమే వైభోగమే.

కొలువై యున్నాడే కోదండపాణి.

నేనెందు వెదుకుదురా హరి.

ఎందుదాగినాడో శ్రీరాముడు. మరుగేలరా రాఘవా.

రారా మాయింటిదాకా - రామా.

మమత బంధనయుత నరస్తుతి సుఖమా?త్యాగరాజనుతుని కీర్తన సుఖమా?

భక్తి భిక్షమీయవే రామా.

శోభిల్లు సప్త స్వర సుందరుల.

రాగ సుధారస పానము జేసి.

రాగ రత్న మాలికలచే రంజిల్లునట.

మేను జూచి పోసపోకే మనసా.

మాయా మయ మగు చాన.

ఒకసారి జూడగరాదా.

ఎన్నడు జూతునో.

సీతమ్మ మాయమ్మ.

సామజవరగమన సాధుహౄత్సార సాబ్జపాల కాలాతీత విఖ్యాత సామని గసజ సుధామయి గాన విలక్షణ గుణశీల. తెరతీయగరాదా,

తిరుపతి వెంకటరమణా, నాలోని మదమత్సరమను తెరతీయగరాదా.

తేజోమయ విగ్రహమును ధ్యానించేవారికి నవగ్రహ బలమేమి, శ్రీరామానుగ్రహ బలమే బలం.

మనసా శ్రీరామచంద్రుని మరువకే.

దయజూచుటకిది వేళరా దాశరథీ,

మును నీవనతిచ్చిన పనులు ఆసగొనినే.


ఆధ్యాత్మిక తత్త్వవేత్త, నాదోపాసకుడు, సంగీత మార్గాన ఆధ్యాత్మిక సత్యం సాధించిన సంగీతయోగి, సంగీతవేత్త, సంస్కర్త, మహాభక్తుడు, వేదాంత సత్యాలను తన కౄతులలో సులభంగా అర్థమయ్యేలా తెలియజెప్పిన తాత్త్విక సంగీత కళానిథి - అయిన కాకర్ల త్యాగరాజు వర్థంతి - 1847 జనవరి 6 భారతీయ కళాసంగీత జగతికి మరో పుణ్యతిథి, స్మరణం చేసుకోవడం విధిగా విధి అని భావించుకోవాలి.
మహాభక్తుడు, సంగీతకళానిథి అయిన త్యాగరాజు వర్థంతి సందర్భంగా - తెలుగురథం శతసహస్ర ప్రణామాలని సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.


Friday, January 2, 2009

హరికథా పితామహ - ఆదిభట్ల నారాయణదాసు గారు - వర్థంతి


హారికధాపితామహ - 'ఆదిభట్లా నారాయణదాసుగారు ( 1864 - 1945 )


వికాస వినోద విజ్ణానానికి కధనాలు
మానవుని మనోవికాసమునకు విజ్ౙానముతోపాటు వినోదముకూడ అవసరం. సాధారణంగా వాగ్రూపంలో కధనం చేసే విధాననైపుణ్యమే పూర్వం కధకునితోపాటు అంతరించేది.ఆదిలో అన్ని మానవ సంఘాలలో కధాకధనం నృౠత్యగీతవాద్యాలతో ముప్పేటగా ముచ్చటగా అలరారేది. నాగరికత పెరుగుతూ వచ్చాక, ఈ ముప్పేటముడినుంచి గీతం దూరమవడం. పురాణపఠనం, పురాణశ్రవణం వచ్చాక, నౄత్యవాద్యాల ప్రమేయం లేకుండానే గీతాలతో, వ్యాఖ్యానంతో కధనాన్ని వివరించడం బహుళ ప్రచార సాధనమైనది. జ్ౙాననిధుల కళాప్రక్రియల్లో ప్రఖ్యాతమైన జక్కులు, జంగములు, కధనాలను ప్రస్తుతించడం, యక్షగానాలు, వీధిభాగవతాలు, గుంపులు, వేదికలపై ప్రదర్శించిన వాటిలో పాటలు, పద్యాలు చేర్చనిదే ఆకొట్టుకొనడం జరగలేదు. పురాణాలు, యితిహాసాలు, ప్రబంధాలు, చరిత్రలు, స్వీయచరిత్రలు, గాధలు అన్ని కళాప్రక్రియలు నేపథ్యాలుగా మారాయి. యిలా వాగ్రూపంగా ప్రచారమయిన కళామాధ్యమాలు, క్రమేపీ గ్రంధస్థమవడం ప్రారంభమయ్యాయి.
కధలకు తలమానికం హరికధ
సంగీత సాహిత్యాలు రమారమి సమమైనపాళ్ళలో మేళవింపబడి నవరసభరితంగా భక్తిని, నీతిని, వైరాగ్యమును, సమకూర్చి శ్రోతల మానసికగ్లానిని ప్రేరేపించి పరమానందము కూర్చు ప్రక్రియలు అనేకం. ఆ ప్రక్రియల్లో ప్రముఖంగా చెప్పదగినది, హరికధ. దీనికి పూర్వం యక్షగానం (కన్నడిగులు), కాలక్షేపం (తమిళులు), అభంగ్ (మహారాష్ట్రులు), సరే యిక మన తెలుగువారు 'హరికధా అని పిలవడం సంప్రదాయంగా వస్తూంది. హరికధ మనకు మహారాష్ట్రుల నుండి దిగుమతి అయిందని, తమిళులకు, కర్ణాటకులకు, తెలుగువారికి ఈ ప్రక్రియ సరిసమానమే అని, ప్రబంధకవిత్వంలోని రుచి వాగ్గేయకారుల వడ్డనతో హరికధతో విందులు చేయడం మొదలైనది అని ఆరుద్రగారి అభిప్రాయం. ఐతిహాసకాలంలో కుశలవుల రామాయణగానం ఈ కోవకే చెందినది. అయితే యక్షగానం లో ఎక్కువమంది వుంటారు. ఏకవ్యక్తికమై బహుపాత్రాభినయంతో ప్రస్తుతించే సంగీత సాహితీకధనోపన్యాసం గా అభివర్ణించవచ్చును. అట్టి కధాగానం చేసేవారిని భాగవతులని, హరిదాసులని, పిలవడం కూడ ఆనవాయితీగా వచ్చింది. భగవద్భక్తి కలవారిని భాగవతులుగా, హరివిషయక జ్ౙానులను హరిదాసులుగా చెలామణి అయ్యారు. తెలుగునేలపై హరికధకు ప్రాచుర్యాన్ని తెచ్చినవారు - ఆదిభట్ల నారాయణదాసు గారు అన్నది ఏకాభిప్రాయం. వారికి ముందుకాలంలో కూడ హరికధ ఉందా, లేదా అంటే, ఈ ప్రక్రియ ఎన్నోరూపాల్లో వుండవచ్చు కాని, హరికధ అంటే మనకు గుర్తువచ్చేవ్యక్తి మాత్రం ఆదిభట్ల నారాయణదాసుగారు మాత్రమే.
ఆదిభట్లవారి జీవనకధనం
ఆంధ్రదేశంలో హరికధావిధానమునకు మూలపురుషులు ఆదిభట్లవారు. వీరు హరికధాపిథామహ అని సార్ధకబిరుదుని అందుకున్నారు. వీరి సంప్రదాయములో కధాగానమున నౄత్యము విశిష్టస్థానాన్ని సంతరించుకుంది. శ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు, వెంకటచైనులు - లక్ష్మి నరసమాంబ దంపతులకు ప్రియతనయుడైన ఆదిభట్లవారు విజయనగరం జిల్లాలోని అజ్జాడ గ్రామంలో ఆగష్టు 31, 1864 న జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు సూర్యనారాయణ, యింట్లో అందరికీ సూరన్న అని, చిన్నసూరి అని పిలిచెడివారట. తండ్రి సంస్కౄతాంధ్రవిద్వాంసులు, పౌరాణికులు. తల్లికి పురాణేతిహాసాల్లో సద్పరిచయం. ఆమెను పురాణాల నరసమ్మ అని పిలిచేవారట. తల్లిదంద్రుల పురాణ పఠనం, పరిచయాల సంగమవిజ్ౙానం చిన్నసూరిని చిన్నప్పుడే పెద్దతరహాగానే మానసికంగా తీర్చిదిద్దాయి అని చెప్పాలి. చిన్నాతనంలోనే తలిదగ్గర భారత భాగవతాది పురాణాలు నేర్చిన దాసు, 'గుంపా అనే శివక్షేత్రంలో తిరునాళ్ళు జరిగాయి. తల్లితో వెళ్ళిన పసికూనకు ఒక పుస్తకాల దుకాణంలో పోతన భాగవతం బొమ్మల పుస్తకం ఆకర్షించగా, వ్యాపారిని అడగడం, వాడు తిరిగి, 'పసివాడివి నీకు భాగవతం ఎందుకయ్యా" అని వెటకరించడం ఒకేసారి జరిగాయట. వ్యాపారి పెట్టిన పరీక్షలో - ఒక ఘట్టం చదవమంటే, అనర్గళపు ఆధ్యయాన్ని చూసి నెవ్వరపోవడం వ్యాపారి వంతు అయింది. అంతేకాదు, భాగవతం పుస్తకంతో పాటు, ఆ రోజుల్లో, అయిదు రూపాయల పారితోషికం యిచ్చాడుట మన దాసుగారికి. బొబ్బిలి ఆస్థానవిద్వాంసులు వాసా సాంబయ్యగారివద్ద వీణను పదేళ్ళప్రాయంలో మీటారు. అంతేకాక సంగీతంకూడ అభ్యసించారు. ఆనాట విజయనగరంలో మహభిత్ ఖాన్ లాంటి హిందూస్థానీసంగీతవిద్వాంసుల గానామౄతాన్ని ఆస్వాదించేవారు దాసుగారు. ఆదిభట్లవారిలో తెలియకుండానే నిండైన హరికధాకళాకారుడు తయారయ్యాడు. మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణతని పొంది, ఎఫ్.ఎ. పరీక్షలో ఉత్తీర్ణులు కాకపోవడంతో చదువుకు స్వస్తి చెప్పడం జరిగినా, పారసీకం, అరబ్బీ, ఉర్దూ, సంస్కౄతం, ఇంగ్లీషు భాషలలో ప్రావీణ్యం సంపాదించిన వైనం కడు ప్రశంసనీయం. ఆయన తెలుగు, ఇంగ్లీషు, సంస్కౄత భాషల్లో కవితలు, రచనలు చేశారు కూడా. తమ 19వ ఏట మెట్రిక్ చదువుతూ, 1883 లోనే మొట్టమొదట విజయనగరంలో విన్న హరికధ - మద్రాసునుంచి కుప్పుస్వామి భాగవతార్ అనే ఆయన చెప్పడం, వినడం, సంగీతనౄత్యసాహిత్యాలు ఏకానుసంథానం అయ్యే ఈ కళాప్రదర్శన పట్ల ఆదిభట్ల సూర్యనారాయణగారు ఆకర్షితులయ్యారు.
ఆదిభట్ల సూర్యుని హరికధ రంగప్రవేశం
దాసుగారు కేవలం హరికధకులేకాదు, అష్టభాషాప్రవీణులు, పుంభావసరస్వతిగా కొనియాడబడినవారు. ఈయన హరికధారంగప్రవేశాన్ని, ఆరుద్రగారు తన సమగ్రాంధ్రసాహిత్యంలో వివరించిన కధనసారాంశం యిలా వుంది.
కుప్పుస్వామివారు చెప్పిన ధ్రువచరిత్ర కధనే చెప్పడానికి ప్రయత్నాలు చేశారు. కొన్ని సొంతగీతాలు రాసుకొని విశాఖపట్నంవాసుడైన ధూళిపాళ కౄష్ణయ్య పద్యాలను, ఆంధ్రభాగవతంలోని పద్యాలను, పంచతంత్రంలోని పిట్టకధలను పేర్చుకుని, కధను, కధనాన్ని తయారుచేసుకుని, సోదరుడి పేరన్న పక్కపాటతో, మరొక సోదరుడు సీతారామయ్య ప్రేక్షకుడుగా కధను చెప్పారు. అంతే తమ్ముని కాళ్ళకు గజ్జెలు అలంకరించబడ్డాయి. వేణుగోపాలస్వామి మఠములో ఆదిభట్లవారు తన మొదటి హరికధనాన్ని ప్రస్తుతించారు. నాటినుంచి ఆయన హరిదాసు.
ఫలితంగా, నారాయణకధలను హరికధల రూపంలో అందించినందులకు (సూర్య)నారాయణదాసు అయ్యారు. యింటిపేరుతో ఆదిభట్లతో సూర్య కనుమరుగై నారాయణదాసుగా మారారు. హరికధాపితామహుడు గా విశ్వవ్యాప్తంగా పేరుతెచ్చుకున్నారు.
బరంపురంలో మొదలయి, ఎన్నో సంస్థానాల్లో జరిగిన సన్మాన కార్యక్రమాలకు తోడుగా, మైసూరు వెళ్ళినఫ్ఫుడు, పండితులెందరో ఆసీనులైన కార్యక్రమంలో ఆదిభట్లవారు వీణ వాయించడానికి, ఈయన అన్నగారు సంగీతనిష్ణాతుడు పాటపాడుటకు ఏర్పాట్లు చేసినా, రక్తికట్టకపోయిన మూలంగా, నారాయణదాసుగారు తాను పాటపాడెదనని, అన్నగార్ని వీణ వాయించమని, గాత్రారంభం చేయగా, ఆ హరికథాగానామౄతఝరి మైసూరు మహారాజుని పరవశింపచేసి, ఆదిభట్లవారిని అభినందించి, బహుమానాలతో సత్కరించారట. ఈ వార్తను పరిశీలించి, విజయనగరం మహారాజు ఆనందగజపతి శ్రీ ఆదిభట్లను ఆస్థాన విద్వాంసునిగా నియమించిన తీరు అనేక అధ్బుతాల్లో ఒకటి మాత్రమే.
హరికథా పితామహ, వాగ్గేయకారుడు, సంగీత కళానిథి అయిన శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారు 1945 జనవరి 3వ తేదీన మనలని భౌతికంగా వీడినా, ఆ మహానుభావుడి సంగీతకళాసౄష్టి మాత్రం మనలని ఎన్నటికీ వీడదు అనే చెప్పాలి. ఆ హరికథామూర్తి నిర్యాణం చెందిన రోజు, కర్ణాటక సంగీత విద్వత్రయంలో ప్రముఖుడు అయిన త్యాగరాజు ది జయంతి అవడం కూడ విశేషమే కదా మరి.
అజ్జాడ ఆదిభట్ల సూర్యనారాయణ అనబడే, శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారు, హరికథా పితామహుల వర్థంతి సందర్భంగా, ఆధ్యాత్మిక, సంగీతకళానిథికి నివాళిని - తెలుగురథం కడు వినమ్రతతో, సమర్పించుకుంటోంది.

కొంపెల్ల శర్మ - తెలుగురథం.


అభ్యుదయ కవితా యుగ ప్రయోక్త - మహాకవి శ్రీ శ్రీ జయంతి


శ్రీరంగం శ్రీనివాసరావు (1910 - 1983) - 2 జనవరి - జయంతి


శ్రీశ్రీ జీవనప్రస్థానం ... యిదిగో ... యిలా ...అది 1910 వ సంవత్సరం. ఈ ఏట మువ్వింతలు జరిగాయట. ఒకటి తోకచుక్క పొడవడం; రెండు గురజాడ అప్పారావు గారు ముత్యాలసరాలు రచనచేయడం; యిక మూడవది మహాకవి శ్రీశ్రీగా ముందు ప్రపంచానికి సుపరిచితులైన శ్రీరంగం శ్రీనివాసరావుగారు జన్మించడం. శ్రమైక జీవన సౌందర్యానికి, సమానమైనది లేనేలేదోయ్ అన్న ప్రజాకవి, విప్లవకవి, మహాకవి, మహాప్రస్థానం నుంచి మరోప్రస్థానం వరకు తనదైన శైలిలో ప్రపంచంలో మరోప్రపంచాన్ని సౄష్టించిన, ఈయన జీవనప్రస్థానం యిలా సాగిపోయింది.
1910 జనవరి 2 న విశాఖపట్టణంలో శ్రీ వెంకట రమణయ్య, శ్రీమతి అప్పన్నకొండ లకు జన్మించిన శ్రీశ్రీ, పుట్టిన ఏడాదికే తల్లిని పోగొట్టుకున్నాడు. ఎవియన్ కాలేజీలో లెక్కలమాష్టారుగా తండ్రి పనిచేయడం, అక్కడే శ్రీశ్రీ చదువుకున్నాడు. 1925లో చదువుతోబాటు వెంకటరమణమ్మతో వివాహం, యింటర్మీడియట్ చదువు 1928 లోను, 1928లో మద్రాసు కాలేజీలో, బి.ఎ. జంతుశాస్త్రం లో చేరినా, 63 రోజుల టైఫాయిడ్ జ్వరం వలన, 1931 లోనే పూర్తిచేయడం జరిగింది. చదువుకున్న కాలేజీలోనే డిమాన్సేట్రర్ గా పనిచేస్తూ కప్పలమాస్టారు గా పేరు తెచ్చుకున్నారు. 1938లో మద్రాసులోని ఆంధ్రప్రభలో ఉపసంపాదకునిగాను, 1942లో డిల్లీ ఆకాశవాణిలోనూ, 1943లో లక్నోలో మిలటరీలో లేబరేటర్ అసిస్టెంట్ గానూ ఉద్యోగపర్వాన్ని నిర్వహించారు. 1945లో తండ్రి మరణం జరగ్గా, 1946లో నిజాం నవాబుగారి రిఫార్మ్ సెక్రటేరియట్ లోను, 1946-49లో ఆనందవాణిలో ఉద్యోగాన్ని కొనసాగించారు. 1947లో మద్రాసులో రాయపేటలో మకాం వున్న శ్రీశ్రీకి గుర్రపుపందాల సరదా జోరుగా వుండేది. 1949లో చుట్తాలమ్మాయిని 'లెనినా అన్న పేరుపెట్టుకుని అభిమానపుత్రికగా పెంచుకోవడం జరిగింది. 1950లో నళినికుమార్ తో స్నేహం, 1954లో హెల్సెంకీలో జరిగిన ప్రపంచశాంతి మహాసభకు ప్రతినిధిగాను, రష్యా, పారిస్, లండన్ పర్యటన చేశాడు. 1856లో ఉపద్రష్ట సరోజినితో వివాహం అవగా, కూతురు (1959), కొడుకు (1962) గలగడం, 1967లో రెండవసారి రష్యా ప్రయాణం, 1970లో విశాఖపట్టణంలో షష్టిపూర్తి ఉత్సవాలు జరిగాయి. ఈ దశలో శ్రీశ్రీ చలంగారిని కలుసుకోవడం ప్రముఖ ఘట్టంగా భావించారు. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా శ్రీశ్రీని అరెష్ట్ చేసి, విడుదల చేయడం జరిగింది. 1976లో చైనాయాత్ర జరిపారు. 1979లో శ్రీ రాజాలక్ష్మీ ఫౌండేషన్ వారి మొదటి అవార్డుని, పదివేల నగదు బహుమతిని పొందడం జరగ్గా, 1980లో కాకినాడలో స్పతి పూర్తిసభ నిర్వహించారు. ఈ సమయాన్నే, పురిపండావరితో లండన్ ప్రయాణం జరిగింది. 1981లో శ్రీమతితో అమెరికా ప్రయాణం చేశారు. 1982లో అభిమానుల ఆర్ధికసహాయంతో కోర్టుకేసుని పోరాడారు. సుదీర్ఘ సాహితీజీవనం, నిజజీవనం జరుపుకున్న శ్రీశ్రీ 1983 జూన్ 15 న ఈ భౌతికజగత్తుని వదలి మరోప్రపంచంలోకి వెళ్ళిపోయారు.
శ్రీశ్రీ సాహితీపర్వం ... యుగంగా మారిన వైనం
మానవజాతిని ఉద్ధరించడానికి కొత్తమతాన్ని కనిపెట్టిన ప్రవక్త. ప్రపంచపు సరిహద్దుల్ని వూగించాలని ప్రయత్నించిన అతని హౄదయోద్రేకాన్ని వర్ణించడం అసాధ్యమైన పని. నెత్తురూ, కన్నీళ్ళు కలిపి కొత్త మందును తయారుచేశాడు. హౄదయం ఎల్లా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్నివ్వడం అతనికే తెలుసు. మాటల్ని కత్తులూ, యీటెలూ, మంటలుగా మార్చడం అతనెకే చేతనవును. పద్యాలు చదువుతూంటే, యివి మాటలుకావు, అక్షరాలు కావు - ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు - అతని హౄదయంలోంచి మన హౄదయంలోకి నేరుగా పంపిన ఉత్సాహాలు, నెత్తులుకాలవ అనిపిస్తుంది. ఏ లోకంలో అన్యాయాలు, అధికారాలు, ఏడుపులు, క్షామాలు, యాచకాలు, క్షుద్రకవిత్వాలు, శిక్షణలు, అవినీతిపర్వాల్లాంటివి స్వప్నలోకంలో వీక్షణం చేస్తూనేవున్నాడు. దేవుడు, అధికారాలు, పాతర్లు, సౌఖ్యాలు, నీతులు, స్వర్గం, మర్యాదలు, మూటకట్టుకుని కులికే ఎంతోమందికి అర్ధంకాని బాధ, మరణం, దరిద్రం, అవిశ్వాసం, అశాంతి, యివన్నీ అర్ధంకాక గట్టిగా సౄష్టినే ప్రశ్నించిన యువకుల లక్ష కంఠాల్ని ఏకం చేసి పలికిన ప్రజాపక్షపాతి. ఈ మాటలు, వర్ణనలు, ఈ వ్యాసరచయితవి అనుకునే ప్రమాదం వుంది. ఆ యిబ్బందేమీలేదు. శ్రీశ్రీ మహాప్రస్థానం కు యోగ్యతాపత్రంను అందించిన చలం శ్రీశ్రీ గురించి, ఆయన కవిత్వం గురించి అనుభవించి పలవరించిన అచంచలభావాలు. బాధతో అన్నా బోధవాచకాలు - తెలుగువాడి జాతీయధనం ఓర్వలేనితనం; అసలు సిసలైన తెలుగు వాడికి పొరిగింటి పుల్లకూరే నచ్చుతుంది అన్న నిర్మొహమాటం పడని నిజవాది.
శ్రీశ్రీ రచనాపరంపరమహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానంతో మహాయోగం పొందినా, అంతకు ముందుగా ప్రభవ, వారం వారం, సంపంగితోట అన్న రచనలు వ్రాశాడు. ఆయన కలం ఆగని వాడితనంతో, వేడితనంతో, అమ్మ, మీమీ, మరోప్రపంచం, త్రీచీర్స్ ఫర్ మేన్, చరమరాత్రి, మానవుడిపాట్లు, సౌదామిని, గురజాడ, మూడు ఏభైలు, మహాప్రస్థానం తర్వాత అంతటి పేరును తెచ్చిన ఖడ్గసౄష్టి, వ్యూస్ అండ్ రివ్యూస్, అయిదు సంపుటాల శ్రీశ్రీసాహిత్యం, మిన్నేలని, రెక్క విప్పిన రెవల్యూషన్, వ్యాసక్రీడలు, మరోమూడు ఏభైలు, చినయానం, మహాప్రస్థానం తర్వాత మరోమలుపుని తెచ్చిన మరోప్రస్థానం, పాడవోయి భారతీయుడా (శ్రీశ్రీ చిత్రగీతాలు), న్యూ ఫ్రంటీర్స్, అనంతం, ప్ర-జ, రచనలను అందించిన అమరకవి. అనంతం (ఆత్మకధ), ప్ర-జ రచనలను ఆయన మరణం తర్వాత ప్రచురించడం జరిగింది. శ్రీశ్రీ నిజంగానే భారతీయసాహితీకారుల్లో అగ్రగణ్యుడు. అందుకనే, భారతీయ సాహితీనిర్మాతలు అన్న శీర్షికన శ్రీశ్రీ వ్యక్తిత్వంపై సుదీర్ఘవ్యాసాన్ని ప్రముఖ సాహితీవేత్త బూదరాజు రాధకౄష్ణ, కేంద్రసాహిత్య అకాడమీ వారు ఈ రచనకు 2006 లోనే మూడవ ముద్రణనిచ్చారు.
శ్రీశ్రీ గురించి కధనకుతూహలంశ్రీవాణి తో నూతన వరవడితో ప్రారంభించిన తెలుగు సాహిత్యం శ్రీశ్రీవాణితో మరోమలుపు తిరిగి అక్కడ ఒక యుగంపాటు నిలిచిపోయింది. అదే శ్రీశ్రీ యుగం. అంతకుముందు, విశ్వనాధ సత్యనారాయణ గారు నిర్మాణం చేసుకున్న పధంలో ఒక యుగం నిలచిపోయింది. శ్రీశ్రీ, విశ్వనాధలు జంటకవులు కాకపోయినా, యిద్దరూ చెరొక యుగానికి ప్రాతినిధ్యం వహించడం తెలుగు సాహితీవాణికే గర్వకారణమయినది.
శ్రీశ్రీని నూత్న కవితా భగీరధుడుగా డా. దివాకర్ల వెంకటావధానిగారు కితాబునిచ్చారు. సాహితీమార్క్స్ గా రాచకొండ విశ్వనాధశాస్త్రిగారు సెలవిచ్చారు. మానవత్వంలోప్రవహించే నది అని డా.నాయని కౄష్ణకుమారి అని అన్నారు. ఆరని విప్లవ జ్Yఓతి, పధ నిర్దేశకుడు, శ్రీశ్రీది మనిషితనం అని, ఆధునిక సాహితీ చరిత్రకు 'గురుజాడలుగా, గురజాడ-చలం-శ్రీశ్రీ ని వర్ణించడం, కవి-మనిషి-వ్యక్తిగా శ్రీశ్రీకి త్రివేణీసంగమసత్కారాలతో వేనోళ్ళ కొనియాడారు. ఒకప్పుడు సాహిత్యం భోగవస్తువు; ఈ నాడది ఉపయోగ వస్తువు కావాలి అని తన నినాదాన్ని ప్రకటించాడు శ్రీశ్రీ. ప్రజలభాషల్ సన్నగా సంగీతం సాహిత్యంలో వినిపించిన కాలాన్ని తానే స్వయంగా నిర్మించుకున్నాడు శ్రీశ్రీ. సాహిత్య జగత్తులో మనిషి మేల్కొన్న తరుణమది. నేను సైతం ప్రపంచాగ్నికి, విశ్వసౄష్టికి, భవనఘోషకు ... అంటూ సొంతగొంతుకతో జయభేరి మ్రోగించిన మొదటిగేయాన్ని విరచించిన విద్వాంసుడు. శ్రీశ్రీ కవితా జీవితం ఒక మహాస్రవంతి; మహాకవిని చేసింది. అభ్యుదాయాంధ్ర కవిత్వయుగకర్త శ్రీశ్రీ, ప్రజాకవి, సమాజ చైతన్యాన్ని మేల్కొల్పి, దానిలోని వేడిరక్తాన్ని ఉడికించి,కవితను ప్రజావాణిగా పలికించి, ప్రపంచ పీడితజన బాధామయగీతాన్ని హృద్గీతగా పొంగించి, జీవితానికీ, సాహిత్యానికీ మంగళ సంవిధానాన్ని సాధించి,పండిత పామరజనరంజకమైన కవితాస్రవంతిని తెలుగునాట క్రొత్తతియందనాలతోపారించి, అభ్యుదయపధాన్ని చూపించిన శ్రీశ్రీ ఆధునికాంధ్ర సాహిత్య రధసారధి. ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారన్నట్లు, తిక్కన్న, వేమన్న, గురుజాడలు శ్రీశ్రీలో కొత్తరూపం తాల్చారు. తెలుగువారికి - తెలుగువాణికి ఒక అంతర్జాతీయకవిని సమర్పించారు. అందుకే, నిజంగా నేను, ప్రజల కవిన్నేను, ఎంచేతంటేను, వాళ్ళను చదివేను, చదివించే రాసేను అని తానే చెప్పాడు. ప్రజలను చదివినవాడూ, చదివింది వ్రాసినవాడూ ప్రజాకవి, దానికి మారుపేరు శ్రీశ్రీ అనికూడ అచార్యులు వివరించారు. నా రచనలలో లోకం ప్రతిఫలించి, నా తపస్సు ఫలించి, నా గీతం గుండెలలో మూర్ణిల్లగ, నా జాతి జనులు పాడుకొనే మంత్రంగా మ్రోగించాలి అని తన ప్రణాళికను సుస్పష్టంగా విశదపరచారు. వ్యదారజీవిత యదార్ధదౄశ్యం పునాదిగా ఇక జనించబోయే భావివేదముల జీవనాదముల జగత్తుకంతా చవులిస్తానోయ్ అని ప్రతిజ్ణ చేసిన శ్రీశ్రీ తనవాదాన్ని వేదంగా పేర్కొన్నాడు. విప్లవ కవిత పాడేడప్పుడు కూడ, నా వినుతించే, నా విరుతించే, నా వినిపించే నవీనగీతికి, భావం, భాగ్యం, ప్రాణం,ప్రణవం అని, చివరకు మిగిలేది సర్వనాద మూలబిందువైన ౠతం, అదే ప్రణవం అని ప్రవచనం చెప్పాడు. శ్రీశ్రీ ని సారాంశంగా ఒకే ఒక వాక్యం చెప్పాలంటే, ఆలోచన నా ఉనికికి సూచన అనే చెప్పాలి. ఆలోచన ఉన్నస్థితిలో అసంతౄప్తిని కలిగించి, ప్రశ్నించడం నేర్పుతుంది. ప్రశ్నించడం అన్వేషణకు కారణమౌతుంది. అభ్యుదయానికిప్రేరణ అవుతుంది. ప్రగతికి పునాది అవుతుంది. సరిగ్గా, సమంగా, శ్రీశ్రీ విషయంలే యిదే జరిగింది. శ్రీశ్రీ కి మరణం లేదు. మహాకవి ప్రతినిత్యం మన మనసుల్లో, నిత్యకౄత్యాల్లో, ఆలోచనల్లో, ఎదో రూపాన, మసలుతూనే వుంటాడు. జననమరణాల మధ్య జీవితం ఒక విరామసంకేతం. శ్రీశ్రీ మనకు స్వల్ప విరామం ప్రసాదించాడు. త్వరలో శ్రీశ్రీ మరల అవతారమెత్తుతాడు. లేదా కనీసం మరోశ్రీశ్రీని అవతరింపచేస్తాడు. మరో మహాప్రస్థానాన్ని తప్పక అందిస్తాడు. మనం మాత్రం మరో చలాన్ని సిద్ధం చేసుకోవాలి, యోగ్యతాపత్రం అందించడానికి. యిరువురూ కలసి వస్తారేమో ఎవరికెరుక!?!?
అభ్యుదయ కవితాయుగ ప్రయోక్త, సమసమాజ సంస్థాపన ప్రవక్త, మహాప్రస్థానం సౄష్టికర్త, మహాకవి అయిన శ్రీశ్రీ జయంతి సందర్భంగా - తెలుగురథం సాహితీనివాళిని సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.