Monday, January 12, 2009

వివేక విశ్వజనీన వాణి - యువజనోత్సవాలు



స్వామి వివేకానంద - వివేకవాణి విశ్వజనీనం


"కొందరు చిరంజీవులు. గొప్పవారి జీవితాలు అందరికీ దర్పణాలు. నిజజీవితానికి నిదర్శనాలు. ఇహలోకం వీడినా కాలమనే యిసుకతిన్నెలపై తమ చిహ్నాలను ముద్రిస్తారు" అన్నాడు ప్రముఖ రచయిత, హెచ్. డబ్ల్యు.లాంగ్ ఫెలో. నాదబ్రహ్మ త్యాగరాజు కూడ అన్నాడు - ఎందరో మహానుభావులు, అని. కొంచెం విశాలదృౠక్పధం, హౄదయవైశాల్యం ఉన్న మానవతావాదులకు అందరూ మహానుభావులే అని భావించడం తరచు జరుగుతూంది. కొద్దిమంది మాత్రమే, అందరికీ మహానుభావులుగాను, మహామనీషులుగాను, యుగకర్తగాను భావించడం, అలాగే అవతరించడం, సమాజానికి తమదైన విలువైన సేవలను అందించి తమ సార్ధకజీవితాన్ని మనముందు చిత్రఫలకంలా ప్రతిష్ఠించి మనముందు భౌతికంగా అదౄశ్యమైనా, మన హౄదయాల్లో, మనసుల్లో, నిత్యం సంచరిస్తూనే వుంటారు. అటువంటి శ్రేణి వ్యక్తుల్లో, తిరుగులేని, ఎదురులేని, వ్యక్తి - స్వామి వివేకానంద. వివేకానందుని జీవితం, అనుభవం, సందేశం, భారతదేశపు సామాజిక సాంస్కౄతిక పునరుజ్జీవనానికి నిత్యం దోహదం అవుతుంది అన్న భావన - సత్యం, శివం, సుందరం. భారతావనికి ఆధ్యాత్మిక జ్ౙానప్రదాత, వివేకానందుడు. ప్రణామాస్త్రాన్ని అందించి అందరినీ వశపరచుకొనే పరమయోగులు శ్రీ రామకౄష్ణ పరమహంసకు ఏకలవ్య అంతేవాసి - వివేకానంద. ప్రముఖ కవి నారాయణరెడ్డిగారు అన్నట్లు - వివేకానందుల వారిది విశ్వజనీనవాణి. ఆత్మజ్ౙాన గోవిందులు, వివేకానందులు.
వివేకానంద - పేరు వెనుక ద్ఫాగిన రహస్యంజన్మత: నరేంద్రనాధ్ దత్త అన్న పేరుగల వివేకానందుడికి పేరు వచ్చిన సమయ సందర్భం అపూర్వం. ఆ కధనం యిలా సాగింది.
హైదరాబాదునుండి మద్రాసుకి తిరిగి వెళ్ళిన నరేంద్రుడు చికాగో ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లను చేసుకొనే సందర్భం. ఇంతలో క్షేత్రమహారాజు అజిత్ సింగ్ నుండి ఒక వర్తమానం వచ్చింది. తనకు కొడుకు పుట్టాడని, నామకరణ మహోత్సవానికి వచ్చి వెళ్ళాలని దాని సారాంశం. స్వామి కాదనలేక, ఎట్లో తీరిక చేసుకుని వెళ్ళాడు. మహారాజు ఎంతో ఆప్యాయంగా స్వాగతంతో ఆదరించాడు. అతడు వివేకానందులకు చాలా త్వరగా ఏర్పడిన మిత్రుడేకాక, మిక్కిలి ఆప్తుడైన శిష్యులలో కూడ ఒకరు. చికాగో వెళ్ళడానికి కావలసిన వనరులను సమకూర్చి పెట్టుదునని స్వామికి మాటయిచ్చిన మహారాజతడు. బొంబాయిలో స్వామికి వీడ్కోలు చెప్పడానికి తన అంతరంగిక కార్యదర్శిని కూడ అచటికిపంపెను. ఈ క్షేత్రపట్టణమున మహారాజు యింటనే అతనికోరికపై స్వామి వివాకానంద నామాన్ని స్వీకరించడంజరిగింది. ఇది 1893 మే నెలలో జరిగిన విశేషం. శ్రీ శంకర భగవత్పాదుల వారి 'వివేక చుడామణీ గ్రంధనామమందలి 'వివేకా శబ్దమే స్వామియొక్క వివేకానంద నామధేయానికి మూలం అని చెప్పాలి. అప్పటివరకు వివిధ పేర్లతో వ్యవహరింపబడుచూ ప్రఛ్ఛన్నముగ భారతదేశ పరిక్రమణము చేసిన స్వామి ఆది మొదలుకొని వివేకానంద నామంతో జగత్ప్రసిద్ధుడైనాడు. చికాగో మత మహాసభలో గుప్పుమని గుబాళించిన యీ యీ పేరు లోగడ పూనాలో తన యింట తనతో పాటు కొన్ని రోజులు గడపిన వ్యక్తిగల యీ పేరును పోల్చుకొని తిలక్ వంటి మహనీయుడు సైతం 'ఈతడా వివేకానందుడూ! అని ఆశ్చర్యచకితుడయ్యాడు.
వివేకానందుని గురించి ప్రముఖుల మాటల్లో -వివేకానంద వాణి విశ్వజనీనం. అది వేదాంత హౄదయ నిలయం నిత్య నవీనం. - డా.సి.నారాయణ రెడ్డి.కళ్ళు మూసుకున్నా కనిపిస్తున్నాడు, చెవులు మూసుకున్నా వినిపిస్తున్నాడు. - డా. జె.బాపురెడ్డి.వివేకానందస్వామి నేడు జీవించివున్నట్లైతేనే నాయనపాద సన్నిధిలొ ఉండేవాణ్ణి. నేను అతిశయమేమి చెప్పనట్లైతే, ఆధునిక భారతం ఆయన సౄష్టి. - నేతాజీ, సుభాష్ చంద్రబోస్.భారత దేశాన్ని గూర్చి తెలుసుకోవాలంటే వివేకానందుని ఆధ్యయనం చేయండి. ఆయన విధానంలో అంతానిర్మాణాత్మకమే గాని,వ్యతిరేక భావాలకు తావులేదు. - విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్.వివేకానందస్వామి రచనలు నేను క్షుణ్ణంగా ఆధ్యయనం చేశాను. నా దేశమంటే నాకు గల ప్రేమ, ఆయన రచనలు మననం చేసుకున్న ఫలితంగా సహస్రాధికంగా వౄద్ధి చెందింది. నాకు దేశంపట్ల ప్రేమను ప్రసాదించింది వివేకానందుడు. - గాంధీ.ఈనాడు వివేకానందుని సందేశం అక్షర రూపంలో చదువుతున్నంత మాతముననే ఒడలు జలదరిస్తుంది. విద్యుదాఘాతమువలె ఆయన వచనాలు నన్ను కుదిపివేస్తాయి. అట్లాంటి దివ్యవాణిని, ఆయన ముఖత: వినియున్న శ్రోతలు ఎంతటి అనుభూతి పొందియుండిరో! - నోబెల్ బహుమతి గ్రహీత, సుప్రసిద్ధ ఫ్రెంచి నవలా రచయిత, రోమారోలా.
ఇందరిని ప్రభావితం చేసిన స్వామి వివేకానందుల అసామాన్య వ్యక్తిత్వం భారతీయ యువతను కూడా జాగౄతం చేసింది. నేతాజీ, గాంధీజీ తదితరులు కూడా తమ యౌవనంలోనే వివేకానందుల నిర్మాణాత్మక సాహిత్య ప్రభావానికి వశమైపోయారు. మరి అలాంటి వివేకానందులు యువత కిచ్చిన సందేశసారాన్నిబట్టి చూస్తే, కారుచీకటిలో కాంతిరేఖలా గోచరిస్తాడు వివేకానందుడు. హిందూత్వం భారతీయాత్మ అని, జీవసేవే దేవసేవ అని, ప్రత్యేకంగా యువతని ఉద్దేశించి, వికారాలు విడనాడండి, చైతన్యమూర్తులు కావాలి, మాతౄదేవత పూజారులు కావాలి, భారతీయ హౄదయ వైశాల్యాన్ని గమనించాలి, ధర్మరక్షకులు కావాలి, అజ్ౙానం తొలగాలి, దురాచారాలు దూరం కావాలి అని బోధిస్తూ, భారతీయాదర్శాలని, వ్యవస్థీకౄత యువశక్తి నిర్మాణావశ్యకతని వక్కాణిస్తూ, నవభారత నిర్మాణావశ్యకతని ఆకళింపు చేసుకోవాలని ప్రవక్త ప్రభోధం చేశారు.
వివేకానంద జన్మదినం - జాతీయ యువజనోత్సవాల సందర్భంగా (జనవరి 12), నవభారత యుగకర్త పై ఈ చిరుభావనాధారని, మహా వక్త, సురేంద్రనాధ్ బెనర్జీ మాటల్లో ముగించడం సమంజసం.
ఎక్కడి పాశ్చాత్య దేశాలు! ఎక్కడ సనాతన ధర్మం! సనాతన ధర్మ సందేశాన్ని పాశ్చాత్యులకు అనర్గళంగా చాటి చెప్పిన వివేకానంద యతివరేణ్యునికి వినయంతో కౄతజ్ౙతాంజలి సమర్పించకుండా ఉండలేము. - మహావక్త, సురేంద్రనాధ్ బెనర్జీ.
భారతదేశపు భూమియే నా అత్యున్నత స్వర్గము. భారతదేశపు శ్రేయమే నా శ్రేయము. - స్వామి వివేకానంద.
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా భారతదేశంలో 'జాతీయ యువజనోత్సవాలను జరుపుకోవడం వార్షీకపు సంప్రదాయం. ఈ రోజు యువకులకు, యువశక్తికి ఒకరకమైన చైతన్యస్ఫూర్తి, ప్రేరణాత్మకమైన ప్రభావం అని చెప్పక తప్పదు.
వివేకానంద వివేకప్రస్థానానికి తెలుగురథం ప్రణామాలని సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

No comments: