తెలుగు కవితా సుమాలతో మహాత్మునికి అక్షర నివాళి
గాంధీజయంతి – 2 అక్టోబర్
గాంధీ జయంతి పుట్టినరోజు భారతీయులకు పవిత్రమైనది. పర్వదినం, పుణ్యతిధి. గుజరాత్, పోరుబందర్ లో 2 అక్టోబర్ 1869 జన్మించిన కరంచంద్ గాంధీ, తన చదువును స్వదేశంలో పూర్తిచేసుకుని, న్యాయవాదం లో చదువుకోసం యింగ్లండు ప్రయాణమయ్యాడు. చదువు పూర్తిచేసుకుని, బారిష్టర్ హోదాలో 1891 లో తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు. గాంధీ తన ఆత్మకధను “మై ఎక్స్పెరిమింట్స్ విత్ ట్రూత్” అన్న రచన నిత్య సత్య స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. సమాజోద్ధరణ కోసం పాటుపటిన నిష్కళ్మష కరుణామూర్తి. సమాజంలో మతసామరస్యతను, ప్రశాంతతను కోరిన ఈ మహాత్ముడు, మహామనీషి. ఆయన మహానుభావుకతకు, త్యాగనిరతకు నివాళులను సమర్పించాల్సిన ఘనతరుణం నేడు - ఆయన జయంతి, వర్ధంతుల సందర్భంగా మహాత్మునికి మహనీయమైన నివాళినివ్వడం భారతావనిలోనే యావత్ విశ్వం మన జాతిపితను స్మరణం చేసుకుంటూనే వుంది. 2 అక్టోబర్ (1869)న జయంతి మరియు జనవరి 30 (1948)న వర్థంతి. భారతదేశ ప్రజావాహిని స్వాతంత్ర్య సంబరాలు ఏడాది పూర్తి కాకుండానే, బానిస పరిపాలన నుంచి విముక్తి పొందడానికి తనదైన కృషిని నభూతో నభవిష్యత్ అన్నట్లు సేవలను అందించిన తీరుతెన్నులు కొంతమంది మతోన్మాద వ్యక్తులకు కన్నుకుట్టినట్లు అయింది. ఫలితంగా జాతిపిత, మహాత్మాగాంధి, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, వినాయక్ రాం గాడ్సే తుపాకీ గుళ్ళకు బలి అవడం, తుపాకీ గురిపెట్టే ముందు గాంధీకి ప్రణమిల్లడం, వెనువెంటనే మహాత్ముని పేల్చడం, ఒకే ఒక తుపాకీ గుండు దూసుకుపోవడం, జాతిపిత, 'హేరాం' అని నేలకి వొరిగిపోయాడు. విశ్వవ్యాప్తంగా, జనవరి 30 న ప్రతీ సంవత్సరం ఉదయం 11 గంటలకు జాతిపిత నివాళి నిమిత్తం రెండు నిమిషాలు మౌనం పాటించడం, భారతదేశం ప్రజలు యావత్తూ, జాతిపితకు ప్రకటించుకునే కనీస ఋణపూరిత సంస్కారం. యిలా, కొన్ని వేల ఏండ్లు చేసినా, గాంధీజీ మనకు అందించిన అప్పు తీరనే తీరదు. నిత్యం ఋణగ్రస్తులమే అన్నదాంట్లో విడ్డూరం లేదు. ఏది ఏమైనా, గాంధీజీ మరణం సమయంలో, వెలువడిన ఆఖరి పదం - 'హే రాం!' అన్నపదం నిత్య స్మరణీయంగా మారింది. మహాత్ముని జీవనసారాంశం దక్షిణాఫ్రికాలో ప్రారంభమైన గాంధీ రాజకీయ జీవితం, గత శతాబ్దపు ప్రారంభంలో, నిరాకరణోద్యమంతో శ్రీకారం చుట్టబడింది. 1916 లో భారతదేశం తిరిగి వచ్చి, జాతీయ స్వతంత్రోద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. గాంధీ నాయకత్వంలో, నేతృత్వంలో అనేక ఉద్యమాలు నిర్వహించబడ్డాయి. ముఖ్యమైనవి - నిరాకరణోద్యమం (1920), పౌరహక్కుల ఉల్లంఘనోద్యమం (1930), క్విట్ యిండియా ఉద్యమం (1942) గాంధీ జీవితాన్ని, నడతను వెన్నంటుతూ వున్నాయి అని చెప్పాలి. 1930 లో గాంధీజి, ఉప్పు సత్యాగ్రహం (దండి ప్రస్థానం)మరొక చారిత్రక ఘట్టం. హరిజనులోద్ధరణ కోసం పాటుపడ్దాడు. అప్పటివరకూ అంటరానివారుగా పరిగణింపబడుతున్న వారికి 'హరిజన’ నామధేయం కొత్త తరహా అనుభూతిని కలిగించింది. 'అంటరానితనం' భగవంతునిపై, సమాజంలో సాటి మనుషులపై ప్రకటించే పాపం అనే చెప్పాలి అని భావించాడు. 'భారతదేశ జాతిపిత’ అన్నది ఒకే ఒక మనిషికి దొరకిన వరప్రసాదం. అహింసా ధోరణిని అవలంబిస్తూ, సత్యవ్రతానికి జీవితాంతం ధారపోసి, ఆచరించిన సత్యవ్రతామూర్తి, మోహన్ దాస్. హిందు-ముస్లిముల సమైక్యత, సహకారం కోసం అహర్నిశలు శ్రమించిన శక్తిమానుడు. మనవాడే కాని అందరివాడు భారతీయుడైనా, ఆయనను మనవాడని చెప్పుకోవడం సంకుచితసమానం. ప్రపంచం తనవాడిగా ఏనాడో చేసుకుంది. ఆయన కరుణకు పర్యాయపదం. సత్యం, అహింసలతో ముక్తి సాధించిన మహాతపస్వి. మానవజాతి చరిత్రలో అత్యున్నత స్థానమలంకరించిన మహనీయుడు. నిరుపేద, బలహీన ప్రజలకు కొండంత ధైర్యమిచ్చిన దీనజనబాంధవుడు. తనకోసం కాక మనకోసం బ్రతికిన మహామనీషి. ఆయన గురించి ఎవరు, ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచ ప్రజల హృదయాల్లో ఆయన ప్రసాదించిన ఆశాజ్యోతి.జాతిపితకు తెలుగు కవితాంజలి
మానవజాతి వున్నంతవరకూ వెలుగుతూనే వుంటుంది. ఆయన అసలు మానవ మాత్రుడేనా అని గొప్ప అనుమానం రాకమానదు. ఆ మహానుభావుడి గురించి కవిత రాయని కవులు భారతదేశంలో వుండరు. ఆయన జయంతి దినోత్సవం సందర్భంగా, కొందరు ప్రముఖ తెలుగు కవుల కవితాసుమాల ద్వారా ప్రకటించిన స్మృతి నివాళి సారాంశాన్ని పునరుద్ఘాటించే చిరు ప్రయత్నం. ఆయన, ఆ మహామనీషి ఎవరో కాదు. ఆయనను - జాతిపిత, మహాత్ముడు, బాపూజీ, గాంధి అని పిలుస్తుంటారు. అసలు పేరు -'మోహన్ దాస్ కరంచంద్ గాంధీ’.
జాతిపితని తమ కవితల ద్వారా ఎంతోమంది ప్రముఖ కవులు గాంధీపట్ల తమ కవితాత్మను ఆవిష్కరించి,మహాత్మునికి అక్షరాంజలిని ప్రకటించారు. కవుల కవితల సారాంశాల సంక్షీప్తకరణం.
ఒక జయంతి చేయుటకంటే ఒక్క మాట నిజం పలుకుట మేలు. గుండె పవిత్రమగును. గాంధి, బుద్ధుడు, హరిజనులు సంతోషిస్తారు(1). అతడు సామాన్య వ్యక్తి. అతడసామాన్య వ్యక్తి. తృణంకన్నా తేలిక. మేరువుకంటే ధీరుడు. ఆగర్భ శ్రీమంతుడు. నిత్యదరిద్రనారాయణుడు. వయస్సు మీరిన బడుగు. వయస్సులేని విసువు. అన్యాయం సమక్షంలో అగ్రమహోదగ్రమూర్తి. చరాచర ప్రపంచానికి క్షమా మార్గదర్శి. అతడిప్పుడు లేడు. అతడెప్పుడూ వున్నాడు. అమరత్వం అందుకున్న అతనికి మా నుతులు(2). ఇతడు బాపూజీ. బోసినవ్వుల తపస్వి. భారత మహా స్వతంత్ర రణాంగణమున సర్వ సేనాని. సత్యాగ్రహ ప్రణేత. సర్వ సర్వంసహా పరిత్రాణ కీర్తి(3). మన గాంధీ గుణకంధి. మరికానబడడా! తానిచ్చినది భారత స్వరాజ్యము కాని, పుచ్చుకొన్నది మొక్కవోని స్వారాజ్యము!(4) కట్టుకున్నాడు మోకాలు తాకెడి రీతి అంగవస్త్రము. నేసినట్టిదానిని నాడు సన్యాసి పోల్కి తత్సమయంబునం దోచె. భరతఖండమునకు భయము లేదనిపించె. పరిశుద్ధమనిపించె బాపూజీ గాత్రంబు (5). ఆయన పేరు సత్యం. భారతీయ సముద్రగర్భంలో దొరకిన మానవముత్యం. ఆయన వూరు పోరుబందరు. ఊరిలోనే పోరున్నదని ఉలిక్కిపడ్డారు కొందరు. దారితప్పి చెట్టుకింద చేరిన బాటసారులకు ఎటు గమ్యమో అప్పుడు తెలిసింది. దాహంతో నాలుక పీక్కుపోతున్న పాంధులకు ఏ దిక్కు సరోవరమో అప్పుడు తెలిసింది(6). సత్యాహింసలు రాజకీయ రథానికి పూంచిన తొలిసారధి. ఊతకర్రతో ఊర్వారనే ఉర్రూతలూపిన సేవాచార్యుడు. చిరునవ్వుతో శాత్రవ హృదయ మాలిన్యాన్ని ప్రక్షాలించిన ఘనుడు. ప్రేమతో ప్రపంచాన్ని గెలిచిన ఘనుడు. విశ్వమానవ మహితాత్ముడు. గాంధీమహాత్ముడు(7). సేదగొన్న శ్రమజీవికి శరణం. పల్లెవాకిటికి పచ్చతోరణం. అంధ జగతికాశారుణ కిరణం. మరివేరెవ్వరు! మా బాపూజీ(8) కొల్లాయి గట్టితేనేమీ, మా గాంధీ కోమటై పుట్టితేనేమీ? వెన్నపూసా మనసు, కన్నతల్లీ ప్రేమ, పండంటి మోముపై బ్రహ్మ తేజస్సు, బోసి నోర్విప్పితే ముత్యాల తొలకలే, చిరునవ్వునవ్వితే వరహాలు వర్షమే, చకచక నడిస్తేనూ జగతి కంపించేనూ,పలుకు పలికితేనూ బ్రహ్మ వాక్కేనూ(9) అదెగో రాట్నము చేత దేశజులకు ఆహారంబు కల్పించి అభ్యుదయాపాదక సామరస్యమునకు ఆయుర్దాయమున్ పోసి, గాంధితాత ౠణమున్ విశ్వంబెటుల్ తీర్చునో(10)! రామమంత్రమ్ములో ఐక్యమై, మహర్షి యతడు, వాల్మీకి రామైక్యమందినాడు, తాత మంత్రంబులో ఐక్యమై తపంబు పండి, తేజస్సు నేనుగా పరిణమింతు(11) కత్తి కదల్చలేదు! విశిఖాలు విదల్చనులేదు గాండీవంబెత్తనులేదు! ఏ క్రియ జయించితివో నరమాంస పారణోన్మత్తుల? నీ ప్రభావములమానుషముల్ భవదీయ శంతిసంపత్తికి దోసిలొగ్గెను ప్రపంచము భారత భాగ్య దేవతా!(12) శిలువమీది ఏసు వీవె చిరంజీవి బాపూ! వషకషకపు సోక్రటీసు వీవు కావా బాపూ! కాళరాత్ర గర్భ దీప్తి కలి కౄతముగ సంధీకరున కంధి శాంతిపంధి కర్మవీర గాంధీ! జాతిపితా! కైమోడ్పులు చేతుమోయి నేడు, శ్రద్ధాంజలి ఘటించి నీ జయంతినాడు ప్రజా హృదయ ఫలకమ్మున ప్రత్యక్షమ్ముకమ్ముజ్, సత్య మార్గమనుసరించు శక్తిని మాకిమ్ము.(13) అల్ల ధర్మరాజును ఎరింగినట్టివాడు, తిక్కనార్యుని పుణ్యాన తెలుగువాడు, నీ అహింసను నీ నీతి నియమములను బట్టి అతడు నిను గుర్తుపట్టగలడు(14). సరసచేరిన సిద్దార్ధ శాక్యయోగి, తాను చెప్పని భక్తి తత్వమ్ము చెప్పి జాతి నడిపించి వావని సంతసించు, స్వర్గరాజ్యం నీ వేగు సమయమందు(15) భయంకర స్వార్ధాస్ఫాలితమై, సర్వదేశప్రజ సంక్షోభిస్తే, సత్యహింసల బోధన చేసీ, నిరంతరం మా హౄదంతరంలో ... (16) పాలసముద్రంలో నడచివచ్చిన రీతి, హిమాచలాగ్ర శౄంగాలు కరాలుసాచి మనకై అరుదెంచిన భాతి, శాంతి సత్యాలు మనుష్యరూపమును దాలిచి నేలకుడిగినట్లు గాంధీ లలితాత్ముడుజ్జ్వలమతిన్ భరతావనిపైన కాలిడెన్(17) అడవి స్మౄతి తప్పిపోయినట్టి బుద్ధదేవునకు పాలుపోసెనే దివ్యమాత, ఆ సుజాత నీ గొంతులో అమౄతరసము పోయెదేల నేడు అదౄష్టముగ మహాత్మా(18) మా భావములన్ సువాసనలు పైకొన విచ్చిన యీ కృతజ్ణతా ప్రావౄత పుష్పముల్ నీకిడుచుంటిమో అహింసావశ కర్మయోగి! మము పాకతమొప్ప నను గ్రహింపవే(19) దెక్కెరుంగక లేబవల్ దేవురించు, ప్రజకునేర్పితివి ఆత్మగౌరవ సమీక్ష, బాపూజీ స్రష్టనీవు నీ చూపుసోకి, ద్రష్టలైనారు కొందరీతరమువారు(20) హరి సౄజించె నరుని అచ్చమ్ము తనపోల్కి, నరుడు తన్నుబోలి హరి సౄజించె, ఇనుమి పైడిజేయు నీశ్వరుండే నేర్చు, కడలివోలె నెల్ల కడల నీశ్వరుండుండ, బిందువై వసించునందు నరుడు, కడలి బాసి బిందువడగారు నిక్కము, గాంధి పలుకు ధర్మగంధమొలుకు(21) శిల్పసూత్రార్ధాలు తెల్పు సౌందర్యాలు, స్వల్పమై మూర్తిలో దేశదేశాల ఆశాంతాల వెలిగిస్తూ, నీ బోసినవ్వులో నీ సౄష్టివాక్కులో నీ కన్నుజంటలో రేకలు తిరుగుతూ మహాత్మా!లోకమోహనమయ్యె హిమాలయోత్తుంగశౄంగం నీ బ్రతుక్(22) పాడితప్పి జనము పాడగుచున్నారు. నడపుదారి విడిచినారు. రకరకాల హింస రగులుచున్నది నేల, ఎవరితోడ విన్నవింపవలయు? నీవు లేవు సరియె నీ నీడయునులేదు, నీదు బోధలెల్ల నేల గలిసె, నిన్ను బొమ్మజేసి నిలుచుండబెట్టిరి, ఒక్క దిక్కు లేదు, మొక్కు లేదు, నీకివె జోతలు గాంధీ! నీకిదె కైమోడ్పు నిఖిల హౄత్ సంవర్తా, నీకు నమస్కారమిదె చేకొనుటకు నీవులేక చేవ్డ్వడితినయా(23) ఏడులు గడిచెను అయినా ఈ నాటికీ నీ పేరు తలచుకుంటే చాలు, మాభయాల చిమ్మచీకట్లలో నీ అభయహస్తపు మెరుపులు తళుక్కుమంటాయి, బాపు! తళుక్కుమంటాయి(24) జగతి మౌనమె సర్వార్ధ సాధకమగు నిడివి నీ మౌనమదినీకె యిడె ఫలంబు, కాని పరమౌషధంబు లంఘన మనుట వ్త్వదుపవాసాల నొరులకు కుదులు రుజలు(25) నీవుదయించినట్టిమహనీయ ముహూర్తము భారతీయ సుశ్రీవియదధ్వమందు బొలిచెన్నవ భాను మహోదయాభమై పావన తద్రుచివిశ్ఫురణ బ్రాకిన దాస్య తమస్సు విచ్చి మోదావహరాగరేఖలు దిగంతములన్ విలసిల్లె బెల్గుగా(26) కమ్మగా బతికితే గాంధియుగం మనిషి కడుపునిండా తింటే గాంధీజగం పరమార్ధమొక్కటే గాంధీమతం మనిషి భయము వదిలేయుటే గాంధీహితం భోగలోలత విడుటే గాంధీవిధం త్యాగరధమెక్కితే గాంధీపధం మనిషి మర్యాదయే గాంధీధనం మనిషి మారితే కోవెలగ గాంధీతనం తన కంఠమున దాచి హాలాహలం తలనుండి కురిపించి గంగాజలం మనిషి శివుడవుటయే గాంధీవరం బాపుననుసరిస్తే చాలుమనమందరం(27) నీవు పుట్టిన గిట్టిన తావులెపుడు, ధరణి శాశ్వత పుణ్యతీర్థంపులగు(28) ఓ మహాత్మా! ఓ! మహర్షీ! అని కవులచేత అనేకవిధాల కొనియాడబడిన మన జాతిపితని, బాపూని, జ్ణానపీఠపురస్కార గ్రహీత, ప్రముఖ కవిశేఖరుడు డా. సి.నారాయణరెడ్డిగారి భావనతో భరతవాక్యం పలకడం కడు సమంజసం.
హిమాద్రి ఎంత ఎత్తు? హేమాద్రి ఎవరి సొత్తు? మహాత్మా నీ స్వరూపం తుహినాద్రికి సంక్షిప్తరూపం బాపూ నీ చిత్తం ప్రపంచానికి దొరికిన విత్తం బాపూ నీ పుట్టిన రోజు భగవానుడు పుట్టినరోజు ఒక రాముడు పుట్టినరోజు, ఒక రహీము పుట్టినరోజు చావులేని పుట్టకలేని సత్యమూర్తి పుట్టినరోజు దాస్యంలో విలవిలలాడే ధర్మం తొడగొట్టినరోజు.
జాతిపిత మహాత్మాగాంధి, మోహన్ దాస్ కరంచంద్ పై కవితాసుమాలను పలవరించిన మహాకవుల వివరాలు :
1.
విశ్వనాధ సత్యనారాయణ
2.
శ్రీశ్రీ
3. పురిపండా అప్పలస్వామి
4. మధునాపంతుల
5. శివశంకరస్వామి
6. కుందుర్తి ఆంజనేయులు
7. బోయి బీమన్న
8. వేదుల సత్యనారాయణ శాస్త్రి
9. బసవరాజు అప్పారావు
10.గుర్రం ఝాషువా
11.పుట్టపర్తి నారాయణచార్యులు
12.జంధ్యాల పాపయ్యశాస్త్రి
13.మల్లవరపు విశ్వేశ్వరరావు
14.ఉత్పల సత్యనారాయణచార్యులు 15.పైడిపాటి సుబ్బరామశాస్త్రి
16.ఆరుద్ర
17.దాశరధి
18.రాయప్రోలు సుబ్బారావు
19.నాయని సుబ్బారావు
20.తుమ్మల
21.కాటూరి వెంకటేశ్వరరావు
22.అడవి బాపిరాజు
23.విద్వాన్ విశ్వం
24.కాళోజి
25.వానమామలై వరదాచార్యులు
26.దివాకర్ల వెంకటావధాని
27.దేవులపల్లి కృష్ణశాస్త్రి
28.వెంకటపార్వతీశకవులు
అర్చన :
‘అర్చన’ – కవితా సంపుటిని కొందరు ప్రముఖుల కవితా సుమాలతో కూర్చిన మాలికను గాంధీజీ స్మృతి చిహ్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సమాచార, పౌరసంబంధ, యాత్రిక శాఖవారు అక్టోబర్ 1971 లో ప్రచురించగా, అక్షరశిల్పి శీలావీర్రాజు గారు ముఖపత్ర చిత్రాలంకరణతోనూ , ఎ రహీం, ఎం సిద్దిఖి, పి ఆర్ రాజు ప్రతిలోపల చిత్రాలతోను రూపుదిద్దడం జరిగింది. ఆ ప్రచురణ ఆధారంగా ‘తెలుగు కవితా సుమాలతో మహాత్మునికి అక్షర నివాళి’ అన్న వ్యాసం సమకూర్చడమైనది.
గాంధీజయంతి సందర్భంగా ఆ మహానుభావుని అనుభవసూక్తుల్ని కూడ అవలోకించడం మన ధర్మం;
మానవులు మానవత్వంపై నమ్మకం కోల్పోకూడదు. సముద్రంలోని కొన్ని చుక్కల్లో కాలుష్యం చేరినంత మాత్రాన సముద్రమంతా కలుషితం కాదు. మానవత్వం కూడా ఒక సముద్రం వంటిది.
వినియోగదార్ల సంక్షేమం, రక్షణ వినియోగదారు మన చెంతకు వచ్చే అత్యంత ప్రధానమైన వ్యక్తి. ఆయన మన మీద ఆధారపడి లేరు. మనమే ఆయన మీద ఆధారపడి ఉన్నాం. ఆయన మన పనికి అంతరాయం కల్పించే వ్యక్తి కారు. ఆయన పని కోసమే ఉద్దేశించి వచ్చిన వ్యక్తి. ఆయన మన వ్యాపారానికి పరాయి వ్యక్తి కారు. మన వ్యాపారంలో భాగస్తుడే. ఆయనకు సేవ చేస్తూ సహాయం చేయడం లేదు. తనకు సేవచేయడానికి అవకాశం కల్పిస్తూ మనకు సహాయపడుతున్న వ్యక్తి.
భూమాత భూమాతకు అందరి అవసరాలను తీర్చే శక్తి ఉంది - అయితే అందరి దురాశలను మాత్రం కాదు.
స్త్రీ కి సమాన హక్కులు పురుషునితో సమాన మానసిక శక్తియుక్తులు ప్రసాదించబడిన స్త్రీ-పురుషుని కష్ట సుఖాలలో పాలు పంచుకునే సహధర్మచారిణి. ఆమె స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలలో అతనితో సమాన హక్కులు కలిగివుంది. ఒక స్త్రీ ఒక పురుషునితో సమానముగా, మానసిక స్థైర్యముకల సహచరిణి పురుషునితో సమానమైన స్వేఛ్ఛ మరియు స్వాతంత్ర్యములు కలిగియున్నది.
తిరిగే రాట్నం - జాతి ఊపిరికి చిహ్నం. అది ఆగిందా, సగం శ్వాస పోయిందన్నమాటే! ఆధిపత్యం - బానిసత్వం భయం వలన పొందే 'ఆధిపత్యం' కన్నా అభిమానం పొందే 'బానిసత్వం' మిన్న.
గాంధీజయంతి నాడు, అక్టోబర్ 2 రోజునే, 'అంతర్జాతీయ అహింసా దినోత్సవం' కూడ పాటిస్తున్నారు. " ఈ దేశంలో ప్రజ్వలించిన వెలుగు సాధారణమైనది కాదు ... వెయ్యి సంవత్సరాల తరువాత కూడా ఈ వెలుగు ఇంకా కనబడుతూనే ఉంటుంది, మరియు ప్రపంచం అంతా ఆ వెలుగును చూడగలదు." అన్న భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ భావం మాత్రం - సత్యం, శివం, సుందరం, అని చెప్పక తప్పదు. ప్రతీ భారతీయుడు మనోఫలకం పైనా, జాతిపిత కనీసం రోజుకు ఒకసారైనా ప్రతిబింబించని ఘడియ ఉండదేమో, బహుశ.
'నా జీవితమే నా సందేశం' అన్న మహాత్ముడు, జాతిపిత మనకు నిత్యం జీవన మార్గదర్శి. ఆయన జయంతి సందర్భంగా ప్రతీ వ్యక్తి నిత్యం ఆచరించవలసిన అగత్యంలో పడి ఉన్నాం అన్నది మాత్రం తథ్యం. మహాత్మాగాంధి, జాతిపిత జయంతి సందర్భంగా తెలుగురథం ఘన నివాళిని సమర్పిస్తోంది
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

