Wednesday, July 30, 2008

హాస్యపు నిత్యజల్లు 'రామలింగయ్య అల్లు'


ఈ బొందిలో ప్రాణాలు వున్నంతవరకూ నటించాలన్నదే నా ధ్యేయం. నటించడంలోనే నాకు కావలసిన విశ్రాంతి లభిస్తుంది.
కాలం మారింది, కుర్రాళ్ళ భావాలకు, నా భావాలకు కుదరదు. అలాంటప్పుడు చిత్ర నిర్మాణంలో చెయ్యి పెట్టకుండా ఉండటమే మంచిది.
నేను మళ్ళీ పుట్టాను! నేనిప్పుడు కుర్రాన్నే!
చారిత్రిక సాహిత్య చరిత్రలో 'వికటకవి' తెనాలి రామలింగడు అందరికి సుపరిచితమే. అలాగే, మన తెలుగు చలన చిత్ర రంగంలో, అర్ధ శతాబ్దపు కాలం పాటు, నభూతో న భవిష్యత్ అన్నా నటన అన్నా పేరుతొ జీవించిన మహా కళాకారుడు. ఆయనే, అల్లు రామలింగయ్య. 'పుట్టిల్లు' చిత్రం ద్వారా రంగప్రవేశం చేసి, తిరుగులేని ప్రస్తానాని స్వయమ్గా నిర్మించుకున్న ప్రతిభావంతుడు. దాదాపు సహస్ర చిత్రాల్లో తన ప్రతిభను ప్రదర్శించి, సంప్రదాయపు సంఖ్యా - వెయ్యి నూట పదహారు చిత్రాలను చవి చూడలేకపోయినకళాకారుడు. పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య, పురస్కారాలను అందిపుచ్చుకున్న ఈ మహా నటరత్నం, గొప్ప ప్రతిభావంతమైన హోమియో వైద్యుడు అవడం చిత్రరంగంలో అనేకమంది స్నేహితులను అందించింది.
కొదుగు అల్లు అరవిందు గొప్ప నిర్మాత, మెగా నటుడు చిరంజీవి అల్లుడు, అల్లు అర్జున్ యువతరంగపు కథానాయకుడు, ప్రముఖ కాలనసిత్ర నిర్మాణ సంస్థ - ఈవన్నీ అల్లు వారి కృషి, సంకల్పం, పట్టుదల, చిత్రరంగంలో సంపాదించుకున్న పెద్దపేరు, పరువు అనే చెప్పాలి.
ఒక ప్రముఖ రచయిత అన్నట్లు - ఊరు పాలకొల్లు, హాస్యాల వీరమల్లు, వెయ్యి వైపే విల్లు, చిత్ర రంగడి కే చెల్లు'
ఆ మహా నతమహామనీషి - అల్లు రామలింగయ్య వర్ధంతి సందర్భంగా తెలుగు రథం ఘన నివాళిని సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం

Tuesday, July 29, 2008

రాజీపడని రావిశాస్త్రీయం

రాజీపడని రావిశాస్త్రీయ మధన కధనాలు
( 1922 - 1973 )
రావిశాస్త్రి జయంతి - 30 జూలై
సశాస్త్రీయ కధనశైలి
ఈ దేశపు ఈ కాలపు మేధావివర్గం చేత బ్రహ్మరధం పట్టించుకున్న రచయిత. ఆయన రచనలు చదివాక, చదవక ముందున్న స్థితిలో ఉండగలవాడు పరమజడుడై వుండాలి. ఈ రచయితలో ప్రచారగుణం పుష్కళంగా కనిపిస్తుంది. పాఠకుణ్ణి మెడబట్టుకుని నిలవేసే లక్షణకారి. శిల్పవైవిధ్యం, నూతనప్రయోగాలను సమర్ధవంతంగా చేయగలిగిన కధనశైలిని నిరంతరం అనుసరించిన రచయిత. వ్రాసిన ప్రతీ రచన, మధ్యతరగతి జీవన పునాదుల్ని కదిలించింది. ప్రతీ రచన డైనమైట్ గా భావించబచ్చు. ఈ రచయిత సౄష్టించినంతగా, మరే వర్తమాన రచయిత సాహిత్యాన్ని రాశిగా, వాసిగా, సౄష్టించలేదని మాత్రం చెప్పాలి.
అని, ఈ రచయితని, ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావుగారు విశ్లేషించారు.
ఆయన ఎవరో కాదు, వౄత్తిరీత్యా న్యాయవాదీ ప్రవౄత్తిరీత్యా రచయిత. రావిశాస్త్రి గా పిలవబడే, రాచకొండ విశ్వనాధశాస్త్రిగారు.
నిరంతరాన్వేషి - పరిపుష్టి 'రసనా ఆవిష్కర్త

ఆధునిక రచయితల్లో రావిశాస్త్రిగారిది సమున్నతస్థానం. ఈ సమున్నతస్థానాన్ని మరింతగా వివరించాలంటే, వాకాటి పాండురంగారావు గారి మాటల్లో, - మనసు ఆకాశం, ప్రశ్నలు నక్షత్రాలు, ఆ నక్షత్రాల మిణుగురు పురుగులునందుకుని, కిందకు దింపుకుని వాటి వెలుగుల సమాధానాలతో మొదట తనలోని చీకటిమూలలను వెలిగించుకుంటాడు - రచయిత అనే అన్వేషి. తనరచనావ్యాసాంగంలో, నిరంతర అన్వేషిగా, తనదైన సార్ధకత్వాన్ని నిరూపించుకున్న మహాకధకుడు - రావిశాస్త్రి. రసానుభూతానికి సాంకేతికపదాన్ని, రసన గా శ్రీశ్రీ నిర్ధారించాడు. రసనలేనిది సౄజనకాదు; సౄజనకానిది రచనకాదు. అన్వేషణతోపాటు, యువకుల తరానికి చెందిన తెలుగు కధానికా రచయితల్లో రావిశాస్త్రి రచనలే ఆశించిన 'రసనాను సమౄద్ధిగా ఆవిష్కరించగలిగాయి, అని మహాకవి శ్రీశ్రీ కితాబు యిచ్చాడంటే, రావిశాస్త్రిగారి సాహిత్యాన్ని కొలిచే తూనికరాళ్ళు లేనట్లే, ఆ కౄతులను ఆధ్యయనం చేసి, ఆ రసన ను అనుభూతి చెందుతూ, పలవరించవలసినదే. అందుకే, స్వార్ధంమీద, దౌష్ట్యంమీద పోరాటం నాటికీ, నేటికీ సాగుతూనే వుంది. తెలుగు నాట ఆ మూగవాని ప్రక్కన నిలబడి బడుగు మానిసికి అండగా రచనాశతఘ్నులను పేల్చిన మహాకవి శ్రీశ్రీ అయితే, మహాకధకుడు రావిశాస్త్రి అని తీర్మానించిన విశ్లేషకులు అనేకమంది. మహాకవి శ్రీశ్రీ సాహిత్య ప్రభావం, రావిశాస్త్రి పైన అపారం అని చెప్పాలి. శ్రీశ్రీ రచన, రుక్కులు లోని తొమ్మిదింటిని, కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, రొట్టెముక్క, అరటితొక్క, బల్లచెక్క, తలుపుగొళ్ళెం, హారతిపళ్ళెం, గుర్రపుకళ్ళెం, లను వొక్కక్క కధగా రూపకల్పన చేసి, కాదేదే కవితకనర్హం అన్న కవివాక్కును రుజువు చేశారు.
రావిశాస్త్రి జీవనప్రస్థానం

శ్రీకాకుళం జిల్లా, అనకాపల్లి దగ్గరగానున్న తుమ్మపాల గ్రామంలో నారాయణమూర్తి, సీతాలక్ష్మి దంపతులకు 1922 జూలై 30 న జన్మించారు. తండ్రి న్యాయవాది వౄత్తినే తనయుడు స్వీకరిస్తే, తల్లి సాహితీకారిణి. ఆ తల్లి సాహితీప్రభావం తనయుడికి సంక్రమించిందన్ని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆంధ్రవిశ్వకళాపరిషత్తు నుంచి తత్వశాస్త్రంలో బి.ఎ. (ఆనర్స్) పట్టభద్రుడై, మద్రాసు విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివి, తాతగారు శ్రీరామమూర్తి వద్ద న్యాయవాదవౄత్తిలో అనేక మెలకువలను, పట్టులను అవగతం చేసుకుని, 1950 నుంచి స్వంత వ్యవహారాల్ని ప్రారంభించాడు. తొలిదశలో కాంగ్రేసువాదిగాను, 1960 దశకం నుంచి మార్కిష్టు సిద్దాంతాలకు ప్రభావితుడయ్యాడు. 1947 నుంచి న్యాయవాద వౄత్తిని ప్రారంభించిన రావిశాస్త్రి ఉద్యోగరీత్యా శ్రీకాకుళం, విశాఖపట్నంలోని పల్లెప్రజల జనజీవితాల్ని కూలంకషగా పరిశీలించడం, పట్టణజీవితాల్లో వస్తున్న మార్పులను గమనించడం అలవోకగా జరిగాయి. రావిశాస్త్రి రచనల్లో ప్రముఖంగా ప్రస్తావించదగ్గ విషయం, మాండలీక పదప్రయోగాలు. అంతేకాక, అన్యాయం, దురాచారాలు విచ్చలవిడితనంగా పెరుగుతున్న సమాజ వాతావరణ నేపథ్యంలో తన రచనలను చిత్రించడం జరిగింది.
రచనల సమాహారం
కధలు, నవలలు, నాటికలు, నాటకాలు విస్తౄతంగా రచనలు చేయడం జారిగింది. 1952 లో ప్రయోగత్మకంగా వ్రాసిన 'అల్పజీవీ నవల బహుధా ప్రశంసలను అందుకుంది. చైతన్యస్రవంతి ప్రక్రియకు నాందీప్రస్తావనలను పలికిన జేంస్జాయిస్ విధానానికి, శ్రీకారం చుట్టిన చిట్టిబాబు రచయితతో పాటు వంతు పలికిన వారిలో రావిశాస్త్రి ప్రముఖులు. ప్రముఖ ప్రక్రియను అనుసరించిన కధ ప్రక్రియలో, కధాసాగరం, ఆరుసారాకధలు, రాచకొండ కధలు, ఆరుసారోకధలతో పాటు ఆరుచిత్రాలు కూడ చాలా పేరుతెచ్చాయి. ముళ్ళపూడి వెంకటరమణ, అప్పుమీద, ౠణానందలహరి వ్రాస్తె రావిశాస్త్రి బాకీ కధలు సమాజానికి అందించాడు. నాటకాల విషయాలకొస్తే, కలకంఠి, నిజం, తిరస్కౄతి, విషాదం, బహుళప్రచారాలు. వీటితోపాటు, రావిశాస్త్రి సాహితీయాత్రలో, తనను తాను ఆలోచనావిధానాన్ని రేకెత్తించిన రచన, గోవులొస్తునా జాగ్రత్త. అంత ప్రతిభావంతంగాను అవతరించింది. ఓ మంచివాడి కధ, రావిశాస్త్రీయం, సొమ్ములు పోనాయండి అన్న రచనలు రావిశాస్త్రిని మరోమెట్టుకు తీసుకువెళ్ళాయి. రాజుమహిషి, రత్తాలు-రాంబాబు రచనలు ఎందుకో అసంపూర్ణంగానే వుండిపోయాయి. చివరి రచనగా, యిల్లు నవలను వ్రాశాడు. మద్యపాన నిషేధ చట్టం అందించిన బహు పరిణామాలను గమనించి, ఆరుసారాకధలు ఒక పెనుమార్పును తెచ్చిపెట్టింది.
విశిష్ట పురస్కారాలకు తిరస్కౄతి
సన్మానాలకు, సత్కారాలకు పరుగులుతీస్తూ, ఆ దిశలో రచనలకు ఉపక్రమించే రచయితలున్న కలికాలంలో, 1983 లో ఆంధ్రవిశ్వవిద్యాలయపు కళాప్రపూర్ణ, అంతకు పూర్వం 1966లో అందుకున్న సాహిత్య అకాడమీ పురస్కారాన్నీ తిరిగి యిచ్చివేయడం చాలామందికి అర్ధం కాలేదు.
రచయిత అందించిన నటుడు
రావిశాస్త్రి రచయితే కాదు, నటుడు కూడ. నిజం నాటకంలోను, గురజాడ-కన్యాశుల్కం లోను, నటనను వొలకపోశాడు. 1962 లో నిజం నాటకం శతప్రదర్శనలు జరుపుకోవడం విశేషమే.
మూడు కధల బంగారం
రావిశాస్త్రిగారి ధర్మేతిహాసం గా వాసికెక్కిన, మూడు కధల బంగారం నవల పై విమర్శలు మరింత వన్నెను చేకూర్చాయి. అందులో, ముదిగొండ వీరభద్రయ్యను ప్రముఖంగా ప్రస్తావించాలి. విశిష్టస్థాయిలో, రావిశాస్త్రి నిర్మాణశిల్పం, కాలం, స్థలం, ఆత్మవిమఋర్శ, స్త్రీపురుషుల నడతలు, ప్రయోజనాత్మకతలు, అలంకారసౄష్టి లాంటి విషయాల్తో, వివరించబడిన తీరుతెన్నులు, ముదిగొండ వీరభద్రయ్యను మరోరచయితగా పరిగణింపబడ్డాడు.
ప్రశంసలతో ... రావిశాస్త్రి

ఈ సాహితీకారుణ్ణి ఎందరో సాహితీకారులు ప్రశంసల చిరుజల్లులతో, వర్షంతో, నింపారు. మచ్చుకు, కొన్ని --
సంకుచితమైన పరిధిలో దేంట్లేనూ ఇమడలేని వ్యక్తిత్వం కలవాడు రావిశాస్త్రి - పురాణం సుబ్రహ్మణ్య శర్మ.
శాస్త్రి అనతి కాలంలో చడీచప్పుడూ కాకుండా కధక సామ్రాజ్యంలో సింహాసనం ఎక్కికూర్చున్నాడూ నలభయ్యేళ్ళకైన శ్రీశ్రీ అలాగేవున్నాడు. - అబ్బూరి వరదారాజేస్వర ఋఅఒ.
బూజుని వెక్కిరించి దులిపిపారేసి కవనాన్ని మెచ్చుకునే పండితుడు. శ్రీకాళహస్తీస్వర శతకం, కమ్యూనిష్టు మేనిఫెశ్తో అని ఆంటాడు. ఎం. రామకోటి.
పదహారో శతాబ్దపు షేక్స్పియర్ పాత్రల లాగున, రావిశాస్త్రి పాత్రలు కూడా కలకాలం బతుకుతాయి. అప్పారావుగారి లాగే, చలంగాలాగే, ప్రపంచ సాహిత్యంలో గొప్ప రచయితలందరిలాగే ... బ్రహ్మల్లో కూడా మహాత్ములుంటారు. ఇస్మాయిల్.
రావిశాస్త్రికి సిద్ధాంతాల కన్న తనచుట్టూవున్న మనుషులు, వాళ్ళతో చనువు, వాళ్ళమీద చచ్చేటంత ఇష్టం, లేక వెటకారంతో కూడిన అయిష్టం ఎన్నో వున్నాయి. కధలలో కీలకమైన సంఘటనలు జీవితంలోంచి ఏరుకున్నవేగాని తాత్వక సూత్రాలకు అనుగుణంగా మలిచినవి కావు. - పాలగుమ్మి పద్మరాజు.
శ్రామికవర్గానికి, మధ్యతరగతి సమాజపు వ్యక్తులకు. వారి సమస్యలకు తన కధనాల ద్వారా, తనదైన శైలిలో పరిష్కారాలను సఫలీకౄతంగా అందించగలిగిన, రాచకొండ విశ్వనాధశాస్త్రి, 1993 నవంబరు న తన కలాన్ని, శ్వాసను కూడ విడిచాడు.

రచనలో నిజమైన సాఫీదనం, నైపుణ్యం ద్వారా వస్తుంది అని అంటాడు, అలెగ్జాండర్ పోప్. గొప్ప రచయితగా వుండటమూ, గొప్పగారాయటమూ రెండూ ఒకటికాదు అని ఒక కవి చెప్పాడు. కాని దీనికి విరుద్ధం మన రావిశాస్త్రి అని చెప్పాలి. తమ ఆత్మల అంతర్గత లోకాలను ఆవిష్కరించే రచయితలే సమాజానికి అవసరం అంటాడు టాల్ స్ఠాయి. కాని వారే యిప్పుడు కరువు, కాటకం వచ్చినట్లు, నల్లపూసలు అయిపోతున్నారు. రచనా సామర్ధ్యం భగవంతుడిచ్చిన వరం. ఆ వరం రావిశాస్త్రిగారిలో పుష్కలంగా వుండేది. మరింతలుగా రావిశాస్త్రి లాంటి రచయితలు పుట్టగొడుగుల్లా అవతరించాలి, ఈనాటి కలిసమాజంపై, ప్రభావ ప్రేరణలను అందించాలి. సమసమాజోద్ధరణకు కంకణం కట్టుకోవాలి. ఆ తరుణంకోసం, నేను సైతం అంటూ ... ముందుకు పదండి !!!
ప్రముఖ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి (రావిశాస్త్రి)గారి జయంతి సందర్భంగా తెలుగురధం ఘన నివాళిని సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.








నవరసాల మూర్తి - నారాయణరెడ్డి కీర్తి

రెడ్డిగారు ... రెడ్డిగారు - 'నారాయణామధ్య స్వసురూపం
నారాయణరెడ్డిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో - 29 జూలై 1931.
ఈ సాకారపు సల్లక్షణాకారం
చిరునామా
యింటిపేరు చైతన్యంఅక్షరాలు గవాక్షాలునడక (నా) తల్లికవిత (నా) చిరునామా.
తేజస్సు (నా) తపస్సుమార్పు (నా) తీర్పుఉదయం (నా) హౄదయం
కాలం అంచు పైనేఆరోహణం కావిస్తూదూరాలను దూసుకొచ్చిశిఖరాలూ-లోయల మధ్యమట్టి మనిషీ ఆకాశం తోదివ్వెల మువ్వలతోముఖాముఖీ జరిపారు భూమిక
జాతిరత్నం, విశ్వనాధ నాయకుడు,కర్పూర వసంతరాయలు, రామప్ప,అమరవీరుడు భగత్ సింగ్, మీరాబాయి,ముత్యాల కోకిల, గాంధీయం తో పాటుతరతరాల తెలుగు వెలుగుల్నిదౄక్పథ వ్యక్తిత్వాల్ని విరచించిజాతికి స్వాతంత్ర్యం ఉపిరన్నారు.
నాగార్జున సాగర జలపాతాలతోపాటుగదిలో సముద్ర మథనం చేయించారు
ౠతుచక్రం భూమిక తోవిశ్వగీతిని ఆలాపిస్తూపగలే వెన్నెల నే కాకవెన్నెలవాడనే సౄష్టించారు.
మంటల్లో మానవుణ్ణిమౄత్యువు నుంచి కాపాడిమరో హరివిల్లు ని సౄష్టించిమధ్యతరగతి మందహాస సహితమందార మకరందాలని అందించారు.
నా మాటలో ఏముందినా పాటలో ఏముందిఅన్న 'సినారే గేయాలు తేనెపాటలునాటికలు ఏనాటికైనా సాహితీపేటికలువచనాలైనా, నిర్వచనాలు, నిర్ద్వందాలు
ఆధునికత తో పాటుసంప్రదాయాల్ని, ప్రయోగాల్నికవితకు జోడించితెలుగు కవితకు లయాత్మకతనుప్రసాదించిన ప్రతిభామూర్తిసమీక్షణం సల్లక్షణం
భూగోళమంత మనిషి రెక్కలకిస్వప్నభంగం చేయించారుఅజంతా సుందరికి కూడనవ్వని పువ్వుని కానుకనిచ్చారు.
'విశ్వంభరా తత్వాన్ని ప్రకటించిప్రతీమనిషి చేత చిలకపలుకులతోమా వూరు మాట్లాడింది అనేలా చేయించిబహుముఖీన ప్రజ్ౙావంతులైనారు
ఒదిగి ఒదిగి ప్రతీ పదానముగ్ధమోహనతను పొదగటంలోనారాయణరెడ్డి గారి ప్రతిభకు జోహార్లు.
కలం సాక్షిగా సినారె కలంకలిసి నడిచే కలం బాణిబహుముఖ 'పరిణత వాణీఆశీస్సులందిస్తోంది గీర్వాణి.
హనుమాజీపేట ఉంగరాల జుట్టుగాడుహద్దుల్లేని హసముఖుడు సరసుడుఉర్దూమాధ్యమంలో చదువుకున్నవాడుతెలుగులో పండితాచార్యోత్తముడుకేంద్రసాహితీపురస్కార గ్రహీతుడుజ్ౙానపీఠాన్ని కదిపి కుదిపిన సర్వప్రజ్ౙావంతుడువిశ్వంభరాతత్వాన్ని విశ్లేషించిన విద్వన్మూరిమంతుడుసింగెరెడ్డి నారాయణరెడ్డి - కుదించబడ్డ 'సినారేరెడ్డి - రెడ్డి మధ్య నారాయణ స్వరూపుడు.
'విశ్వంభరా సందేశం
మనసుకు తొడుగు మనిషిమనిషికి ఉడుపు జగతిఇదే విశ్వంభరాతత్వంఇదే అనంత జీవిత సత్యం
మొదటి మాట
నేను పుట్టకముందేనెత్తిమీద నీలితెరకాళ్ళకింద ధూళిపొర
కొసమెరుపు
నీలితెరకు - ధూళిపొరకుమధ్య కాలంలోక్షణకాలపు, బుద్భుదప్రాయపుమానవ జీవిత ప్రస్థానం.
పై రెంటి మధ్య - భారతీయజ్ౙానపీఠం గుర్తించిన ప్రతిభాపాటవ సందేశసారాశం.నారాయణరెడ్డి గారి పుట్టినరోజు పండుగ - తెలుగువాణికి పండుగరోజు, తెలుగు సంస్కౄతికి పర్వదినం.
పద్మభూషణ్, భారత జ్ౙానపీఠ పురస్కార గ్రహీత -సింగిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి జీవన వ్యక్తిత్వ చిత్రణం
సింగిరెడ్డి సత్యనారాయణ రెడ్డి29 జూలై 1931 న - ప్రజోత్పత్తి, నిజాషాఢ పౌర్ణమి, బుధవారం, ఉదయం 4-5 గంటల మధ్య.హనుమాజీపేట, సిరిసిల్ల తాలూకా, కరీంనగర్ జిల్లా.
బుచ్చమ్మ - మల్లారెడ్డి దంపతులకు జన్మించారు.(సత్యం - బయలుదేరి కవిత్వంలో సౌందర్యంగా రూపుదాల్చింది. ఆయనలోని స్నేహశీలం, అభినివేశం, ప్రతిభ, విద్వత్తు, భాగ్యం, ఇవన్నీ ఆతని జాతక విశేషాలను నిజమని నిరూపిస్తున్నాయి. (తిరుమల శ్రీనివాశాచార్యులు)
హనుమాజీపేట (ప్రా.వి.), సిరిసిల్ల (మా.వి.), కరీంనగర్ (ఉ.వి.)1948 హెచ్.యస్.సి. - నైజాం రాష్ట్రానికి స్వాతంత్ర్యం రావాలని విద్యార్ధుల సత్యాగ్రహంలో పాల్గొన్నాడు.
సైనికులం, మేం సేవకులం, జాతీయభారత సైనికులం, స్వఛ్ఛంద భారత సేవకులం.
యింటర్ మీడియట్ - ఛాదర్ ఘాట్ కళాశాల, హైదరాబాద్. (1949)బి.ఎ. - ఆర్ట్స్ కాలేజీ (1952)యం.ఎ. - ఆర్ట్స్ కాలేజీ (1954)
1954-55 - సికింద్రాబాద్ ఆర్ట్స్ కాలేజీ - అసంపూర్ణ లెక్చరర్ ఉద్యోగం.1955 - పూర్తిస్థాయి ఆంధ్రోపన్యాసకులు.19158-59 - నిజాం కాలేజీ.1957-62 - పరిశోధన పట్టా - ఆచార్య ఖండవిల్లి లక్ష్మీరంజనం గారి పర్యవేక్షణ లో.1962-73 - ఉస్మానియా - తెలుగుశాఖ - రీడర్.1976 - ఆచార్య పదవి.50 వసంతాలకే అధికార భాషా సంఘం - అధ్యక్షులు.
పురస్కారాలు - రేఖామాత్రంగా
1965 - ౠతుచక్రం - ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ.1974 - మంటలూ-మానవడూ - కేంద్ర సాహిత్య అకాడమీ.1988 - భారతీయ జ్ౙానపీఠ పురస్కారం.మీరట్, ఆంధ్ర విశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్ పట్టాలు.1978 - కళాప్రపూర్ణ.1977 - పద్మశ్రీ.
1961 - గులేబకావళి కథ (చిత్రరంగం ప్రవేశం - యన్.టి.ఆర్. నిర్మాత)
నారాయాణరెడ్డి గారి - సాహితీ ప్రస్థానం
లలితగేయసాహితి - పూలపాటలు
గేయనాటికాసాహితి
నవ్వనిపువ్వు, అజంతాసుందరి, వెన్నెలవాడ, తరతరాల తెలుగు వెలుగు.
ఖండకావ్యసాహితి
జలపాతం, నారాయణరెడ్డి గేయాలు, దివ్వెల మువ్వలు, అక్షరాల గవాక్షాలు, మధ్యతరగతి మందహాసం, మరోహరివిల్లు, మంటలూ-మానవడూ, ముఖాముఖి, మనిషీ-చిలక, ఉదయం నా హౄదయం, మార్పు నా తీర్పు, తేజస్సు నా తపస్సు, ఇంటి పేరు చైతన్యం, మథనం, మౄత్యువునుంచి.
సుదీర్ఘ గీతికావ్యసాహితి - విశ్వగీతి, భూమిక.
కథాగేయకావ్యసాహితి
నాగార్జునసాగరం, స్వప్నభంగం, కర్పూరవసంతరాయలు, విశ్వనాథనాయకుడు, ౠతుచక్రం, జాతిరత్నం.
నాటికాసాహితి - రామప్ప, నారాయణరెడ్డి నాటికలు.
గేయసూక్తిసాహితి - సమదర్శనం.
వ్యాససాహితి - వ్యాసవాహిని, మావూరు మాట్లాడింది, సమీక్షణం.
పరిశోధన సాహితి - ఆధునికాంధ్ర కవిత్వం : సంప్రదాయములు, ప్రయోగములు.
అనుసౄజన సాహితి - గాంధీయం, మీరాబాయి, శిఖరాలూ లోయలు, ముత్యాలకోకిల.
వాఖ్యాన సాహితి - మందారమకరందాలు.
యత్రాసాహితి
ముచ్చటగా మూడు వారాలు, సోవియట్ రష్యాలో పదిరోజులు, పాశ్చాల్త్య దేశాల్లో 50 రోజులు.
చిత్రసాహితి
పగలేవెన్నెల (యువభారతి సంస్థ ప్రచురించిన చిత్రగీతాల సంకలనం లో - అనుక్రమణిక పొందుపరచిన తీరు యిలా వుంది:
ప్రణయవల్లరి, ప్రకౄతిసుందరి, మువ్వల రవళి - మోహన మురళి, నివాళి, వేదనాఝరి, సందేశ లహరి, నవ్వుల పందిరి, లేత జాబిలి, జానపద మాధురి, మిశ్రమంజరి, అని విభజించడంలోనే సాహితీమర్యాదలను సంతరించుకోవడం జరిగింది.
వచన కావ్య సాహితి - విశ్వంభర
నారాయణ రెడ్డిగారు, పై వరుస తర్వాత నేటి వరకూ రాస్తూనే వున్నారు, రాస్తూనే ముందుకు కదలుతున్నారు.
అందుకే సినారె మాటల్లోనే చెప్పాలంటే -
రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకేవరకు, పోతూపోతూ రాస్తాను వపవు వాడే వరకు.
నారాయణరెడ్డిగారి మనస్సు సదాసదాలోచనామయం - అని సినారె పై సాహితీమూర్తి గ్రంథం లో తిరుమల శ్రీనివాసాచార్యులు గారు.
పట్టింది బంగారం చేయటం, ప్రయోగంలో పరిణతిని ప్రకటించటం వారినైజం. వారి విశ్వంభర మానవతావాదకవితలో వెలువడిన మహాకావ్యం. సమకాలీనుల్లో శ్రీనాథుడు - నారాయణరెడ్డి అని అంటూ -
'ప్రకౄతిలోని చలనశీలానికి పరిణామం మనిషి, జగతిలోని భ్రమణగుణానికి ప్రతిరూపం మనిషీ అని కూడ ఆంటూ, ఆ మనిషికి పెట్టిన నగిషీ నారాయణరెడ్డి కవితాకౄషి.' అని ప్రముఖ సాహితీపండితులు, విమర్శకులు డా.జి.వి.సుబ్రహ్మణ్యం గారు ఒకప్పుడు అన్న భావాభిరామాలు సత్యసూనౄతాలు.
అందరి మహానుభావులు, ఈ ప్రతిభామూర్తిని కొనియాడినవారే!
నవరసాలమూర్తి నారాయణరెడ్డి కీర్తి - దాశరథి.
'నీవు సుకవి జాతికెల్ల నిండు గర్వకారణము, నీ సాహితి తెలుగమ్మకు నిత్యపచ్చతోరణం, నీ లేఖిని దౌష్ట్యముతో నిత్యము సేయును రణము. - వానమామలై వరదాచార్యులు.
'ఇతండహంకౄతిదూరజీవితం వలచినాచికొనె నాంధ్రజాతి మానసమునెల్లనితిని మెచ్చుట తెలుగు భారతినిమెచ్చుటని తలంతురు సత్యాధర్మాభిరతులూ - తెనుగులెంక తుమ్మల సీతారామమూర్తి.
'కవిరేవ విజానాతి...' - కవిని కవే అర్ధం చేసుకోగలడు అన్నది సత్యం.
నిద్రించదు జ్ౙానం - నీరసించదు తేజం
నారాయణ రెడ్డి వ్యక్తిత్వం (నారాయణరెడ్డి సాహితీమూర్తి - డా.తిరుమల శ్రీనివాసాచార్య గ్రంథం నుంచి)
వర్షించే మేఘంగలగలసాగే జలపాతంవికసించిన వసంతంఘోషించే సముద్రంభాసించే సూర్యేందు బింబాలుగళామెత్తే కలకంఠంపురివిప్పిన మయూరం.
పై అన్ని అంశాలను సముచిత నిష్పత్తిలో మిశ్రంచేసి ప్రాణంలా ఒక మూర్తిలో వేస్తే, ఆ మూర్తి ఎలా ఉంటాడో తెలుసా? నారాయణరెడ్డిలా ఉంటాడు. అందుకే అతనికి నవ్వని పువ్వుల భాషా, దివ్వెలమువ్వల ఘోషా తెలుసు. అంబుధిలోని రత్నాలనూ, అంబరం లోని హరివిల్లునూ అందుకునే పండితుడు, ప్రతిభావంతుడు, చైతన్యం, సౌజన్యం, నవత, మానవతా, సంప్రదాయం, ప్రయోగం, అతని వ్యక్తిత్వంలోని అనివార్యాలైనా అంశాలైనాయి. పల్లెలోపుట్టి భాగ్యనగరం చేరి అఖిలభారతదేశంలోనే కాదు, అంతర్జాతీయ కీర్తిని ఆర్జించినాడు, నారాయణరెడ్డి. ఇంతటి మహనీయవ్యక్తిత్వం అప్రయత్నంగా కలుగలేదు. దీనివెనుక అపారమైన కౄషి ఉంది. మొక్క మహావౄక్షం కావడానికి, చుక్క సుధాంశుబింబం కావడానికి, మొగ్గ పుష్పం కావడానికి, గుడిసె మేడ కావడానికి, శిల శిల్పం కావడానికి, ఎంతో శ్రమ, తపన, మథనం, సాహసం, ఎంతగానో అవసరం.
పై భావవ్యక్తీకరణం, మూడు దశాబ్దాల క్రితం నాటివి. మరి ఆ మహాప్రజ్ౙావంతుడిని విశ్లేషించడం, ఈనాటి ప్రతిభాపాటవాలకు, అక్షరాలేవి? పదాలెక్కడ? వాక్యాలు లభిస్తాయా? ఏమోమరి?!? నారాయణ రెడ్డి గారికి శతసహస్ర ప్రణామాలతో -
కొంపెల్ల శర్మ - తెలుగురథం.




Saturday, July 26, 2008

హేతువాద మార్గదర్శి 'గోరా' వర్ధంతి



హేతువాద మార్గదర్శి 'గోరా' ( 1902 - 1975 ) వర్ధంతి

భారతీయ నాస్తికవాద నేత, గోరా అని ప్రసిద్ధి చెందిన, గోపరాజు రామచంద్రరావు, 15 నవంబర్ 1902 న ఉన్నతకుల హిందూ కుటుంబంలో జన్మించారు. నాస్తికవాది అన్నవెంటనే, ఈ వ్యాసం చదవడం మానేసినవాళ్ళు కూడ వుంటారేమో!. గోరా తన ఆత్మకధ లో పేర్కొన్నట్లు, పరంపరగా వస్తున్న సంప్రదాయ, మూఢాచారాలు ప్రబలుతున్న కుటుంబం అని తానే చెప్పుకున్నారు. వౄక్షశాస్త్రంలో డిగ్రీ చదివి, మద్రాసు ప్రేసిడెన్సే కాలేజీలో అదే శాస్త్రంలో మాష్టర్ డిగ్రీలో ఉత్తీర్ణతను పొందారు. 1922 లో సరస్వతిని, ఆమె 10 ఏళ్ళ ప్రాయంలోనే వివాహం చేసుకున్నాడు. వారిద్దరి కుటుంబాలు, హిందూ సనాతన పద్ధతిలోని కుటుంబాలే. వీరిరువిరి కుటుంబాలు, బాల్యవివాహ నిరోధ చట్టం 1975 లో జరిగింది.

నాస్తికవాద ప్రచారం

తనకు నచ్చిన వాదాన్ని, అంటే నాస్తిక వాదాన్ని. ప్రచారం చేయడానికిజీవితాంతం శ్రమపడిన వ్యక్తి. 1940 లో గోరా ఆయన భార్య తో కలసి, నాస్తికకేంద్రం ను, కౄష్ణాజిల్లాలోని ఒక గ్రామంలో ప్రారంభించడం జగిరింది. దేశస్వాతంత్ర్యం సందర్భంగా, 1947 లో, కేంద్రాన్ని విజయవాడకు తరలించడం జరిగింది.
గోరా రచనలు

గోరా అనేక రచనలను వ్రాశారు. నాస్తికవాదం పై ప్రశ్నలు-జవాబులు, నాస్తికుని విశ్వయానం, గాంధీతో నాస్తికుడు, నాస్తికత ఆవశ్యకత, అనుకూల నాస్తికవాదం అన్నవి వ్రాశారు. 1949 నుంచే ప్రారంభించిన పత్రికావ్యాసం, నాస్తికత ఆంశంపై, వాటిని 1969 లో నాస్తికవాది అన్న మాసపత్రికలో ప్రచురించారు. వర్ణవ్యవస్థ, అంటరానితనంపై తన యుద్ధాన్ని ప్రకటించారు. కర్మసిద్ధాంతంపైనా, ఆధ్యాత్మకపరంగా తరచు అనుకునే కర్మ, ప్రాప్తం అనే విషయాలపై తనకున్న నిశ్చితాభిప్రాయాల్ని వెల్లడించడానికి ఏ మాత్రం వెనుకాడలేదు.

ఒక సిద్ధాంతపరమైన భావాలతో జీవితాంతం కౄషిసల్పిన 'గోరా' 1975, 26, జూలైన మరణించారు.

ఏ వాదమైనా, మానవసేవయే మాధవసేవయ పరమ పరమార్ధం

గోరా మరణాంతరం, నాస్తికకేంద్రాన్ని, ఆయన భార్య సరస్వతి పర్యవేక్షణలో, సలహాసంప్రదింపులు, కులాంతర వివాహాలు, వర్ణరహిత వివాహాల కోసం నిరంతర కౄషిని సలిపాడు. బాల్య వివాహాలని నిషేధించడానికి, వేశ్యావౄత్తిలో యిరుక్కుపోయినవారికి సహాయ సహకారాలు, పెళ్ళికాని తల్లులకు సహాయాలు, బీదవర్గపు మహిళలు, మూఢాచార నమ్మకాలపై కౄషిని సలిపారు. వీటికి నిదర్శనగా, మంటలపై నడకలు, యితర మూఢాచారాల్ని తొలగించే ప్రయత్నం జరిగింది. పెళ్ళికి ముందే సెక్స్ పై అవగాహనలు, కుటుంబనియంత్రణ, వీటితో పాటు ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టిన ఘనత గోరాదే.


2002 లో భారతప్రభుత్వం, తపాలాశాఖవారు, ప్రత్యేక తపాళబిళ్ళను 5 రూపాయల స్ఠాంపుని విడుదల చేశారు. గోరా 100 వ శతాబ్దపు జయంతి సందర్భంగా విడుదల చేశారు.

ప్రముఖ హేతువాద ప్రజ్ఞానమూర్తి గోపరాజు రామచంద్రరావు అన్న 'గోరా' గారికి సవినమ్రంగా నివాళిని సమర్పిస్తోంది - తెలుగురధం.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

Wednesday, July 23, 2008

జాను తెనుగు కవి తురంగం - గుర్రం జాషువా వర్ధంతి

జానుతెనుగు కవితురంగం - గుర్రం జాషువా వర్ధంతి - 24 జూలై
( 1895 - 1971 )
మధుర శ్రీనాధుడు

బ్రతుకు బాధల చేదును ఆస్వాదించి మధురమైన కవిత ద్వారా సంకుచిత మతాతీతమైన కవితలను వెలువరించినవాడు. ప్రజల నాలుకలయందు జీవించిన సుకవి. సంస్కార ప్రియుల హౄదయాల్లో జీవిస్తున్న వ్యక్తిత్వం. కవిత్వాన్ని అతని వ్యక్తిత్వంనుంచి విడదీసి చూడలేని అవిభాజ్యస్థితి. ఉభయత్రా కారకాలు. ఎన్నో బిరుదుల్లోకి, సుస్థిరత్వంగా నిలచిపోయినది, కవికోకిల. కవితాదౄక్పధం, భావకవితానిరసనం, నిసర్గశైలి, సంఘసంస్కరణం, అభ్యుదయభావన, ప్రత్యర్ధులధిక్కారం, మచ్చుకు కొన్నిమాత్రమే, అయినా, వెరసి, మధుర శ్రీనాధుడు. ఎవరనుకుంటున్నారా - నవయుగ కవిచక్రవర్తి, జానుతెనుగు కవితురంగం, గుర్రం జాషువా.
వినుకొండ నివాసి విలక్షణతవిష్ణుకుండినుల అకుంఠిత ధర్మనిష్ఠానిర్మాణ నిపుణతకు, చండప్రచండ పవనాలకు ప్రఖ్యాతమైన వినుకొండ ప్రాంతమది. వికసితబాల్యప్రాయంలో వడిగా అడుగులేస్తున్న బుడత. మండువేసవిగాడ్పులను శీతలపవనవీచికలుగా భావించి నడుస్తున్నా, అతని చక్షువులను వీక్షిస్తేమాత్రం కలవరిస్తున్న హౄదయవేదన వెల్లడవుతున్నది. 1895 సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ పుణ్యదంపతులకు జన్మించిన పుత్రరత్నం. కులప్రస్తావన కుతకుతలా ఉడుకుతున్న ఉన్మాదపు రోజులవి. పైగా, తల్లిదండ్రులు, వేర్వేరు కులాల ప్రతినిధులు. తండ్రి యాదవుడైన క్రైస్తవమతస్వీకర్త, తల్లి ఆది ఆంధ్రజాతి. ఈ రెండు విషయాలు కలసి రగిలిన నిప్పురవ్వల తూటాలుగా మారాయి. బాల్యంలోనే హౄదయాన్ని దహించెవేశాయి. పచ్చపచ్చని పైరుపొలాల మధ్య పరుగులెడుతూ గడపిన బాల్యం, చదువుకోసం వెళ్ళే బడి విషయానికొస్తే, కష్టాలకడలి రివ్వున తరంగాలై తాకింది. విద్వత్తులో మునిగిన వినుకొండ, విలక్షణమైన వికటంగా మారింది. అగ్రవర్ణతత్వం, అస్పౄశ్యతామనస్తత్వం రాజ్యమేలుతున్న కాలానికి ఎదురీది, పుత్రాశ్రువులను తుడిచి తనను తాను తమాయించుకున్న జనని సంకల్ప దీక్షాకంకణబద్ధురాలై, బాలుని పాదయాత్రతో మేధాయానం కావించింది. యిన్ని యిబ్బందులు, అవమానాలు ఎదురైనా, అన్నింటినీ దిగమింగుకుని, ఉన్నత పాఠశాల చదువు ముగించుకుని, ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేశారు. రాజమండ్రిలో మూకీ చిత్రాల వ్యాఖ్యాతగా, చింతామణి నాటకమండలిలో నాటకకర్తగా పనిచేసిన జాషువా, 1919-1928 కాలంలో గుంటూరులోని లూధరన్ చరి ఉపాధ్యాయ శిక్షణాసంస్థలో అధ్యాపక వౄత్తిని చేపట్టారు. 1928-42 లో గుంటూరు జిల్లా బోర్డు పాఠశాలల్లో తెలుగుపండితపదవిని నిర్వహించిన ఉభయభాషాప్రావీణ్యుడు. ఆ తర్వాత, జాతీయ యుద్ధ ప్రచారక సంఘంలో ప్రచారకులుగా, మద్రాసు ఆకాశవాణిలో నిర్మాతగాను ఉద్యోగం నిర్వహించారు. 1964లో ఆంధ్రప్రభుత్వం శాసనమండలి సభ్యత్వం కేటాయించింది. నిర్వహించే ఉద్యోగం ఏదైనా, జీవనసాధనంగానే భావించారు. జన్మత: కవి అయిన జాషువా, కవిగా కష్టతరమనుకున్న, జాషువా బడిపంతులు పదవిని ఎన్నుకున్నారు.
అవధానం కలిగించిన ప్రేరణవినుకొండలో జరిగిన సాహిత్యావధానంను గమనించి, అవధానిని ప్రశంసించాలని, బాలకవి పద్యాలతో వేదికనెక్కబోతే, అంటరానితనమని ఆడ్డుకొట్టడం, జాషువాని కౄంగదీసింది. అలా అవమానింపబడడం, జాషువాలో సంకల్పం సంతరించుకుంది. ఫలితంగా, 'నవ్యయుగోచితంబులై ఆకటి చిచ్చు లార్చు హౄదయ విదారక దయా కధాంశాలూ అని ప్రస్తావిస్తూ, విశ్వమానవ సౌభ్రాత్రత్వం, నిర్మలత్వం, నిర్జాతి సంఘస్థాపన కోసం కంకణబద్ధతని పాటించాడు. ఇంతై, బాలుడింతింతై, కవికోకిలై, నవయుగచక్రవర్తిగా, విశ్వనరుడైనాడు. అసమసమాజం బాకులు రువ్వినప్పుడు, అంటరానితనం విషాగ్నులు విసిరినప్పుడు, కటికదారిద్ర్యాన్ని అనుభవించవలసినప్పుడు, ఆవేదన గుండేల్లో కుతకుతలాడినప్పుడు, గుర్రంజాషువా గభాలున గుర్తుకు వస్తారు.
జాషువా కవిత్వంలో జానుతెనుగుమానవత్వం, హేతువాదమూలాధార కవనేతివౄత్తాలు, మధురోహలతో నిండినవి జాషువా ఖండకావ్యాలు. ఫిరదౌసి, గబ్బిలం, శ్మశానవాటికలాంటృఇ ఖండకౄతులు ఓంకౄతీ ప్రతిధ్వనిత ప్రతిఘటనలు. అవ్యక్తమధురిమ కుహూగీతాలాపనలు విశ్వాంతరాళాన మారుమ్రొతలా అన్నట్లు వుంటాయి ఆయన కౄతులు. సూటిగా, ధాటిగా, వాడిగా, రసావేశజీవనాడిగా, ప్రాణసదౄశంగా చేసిన కవనప్రయోగాలు. దైన్య, ప్రబోధ, నిర్వేద, క్రోధ, జదఘ, ఉగ్రత, చింత, అమర్షాదులను ప్రత్యక్షీకరించిన విధానాలు, కరుణ, వీరరసభరితాలు. మతవైషమ్య, అసస్పౄశ్యత, అంధ విశ్వాసం, దారిద్ర్యం, నిరసనలాంటి అంశాలను పునాదిగా సంఘసంస్కరణలను కూడ ప్రతిబింబించేలా కవిత్వం గోచరిస్తుంది. మహాత్మపధం, మహాబోధి దౄక్పధం, యుగోచిత ప్రగతి దౄష్టిలను దౄష్టిలో పెట్టుకుని నిజాభ్యుదభావకవితలను అల్లాడు జాషువా. ముంతాజ్ మహల్, కాందిశీకుడు, స్వప్నకధ, బాపూజీ, నేతాజీ, స్వయంవరం, ముషాఫర్లు, క్రీస్తుచరిత్రము, కొత్తలోకం, అవయము, అనసూయ, శివాజీ చరిత్రాది కావ్యఖండికలు దేశచరితావగాహనకు మచ్చుతునకలు. వీరాబాయి, తెరచాటు నాటకాలు, నా కఢ వెరసి రాశితోకూడిన వాసితనపు జానుతెనుగు కవితారసవంతాలు, జాషువా కలంనుంచి అందిన నజరాణాలు.రాజు మరణించె నొక తార రాలిపోయె, కవియు మరణించె నొక తార గగనమెక్కె, రాజు జీవించె రాతి విగ్రహములను, సుకవి జీవించి ప్రజల నాలుకలయందు, యని సుకవికి మరణమే లేదు అని చెప్పినతీరు అధ్బుతం.
అపర రవీంద్రశైలిరవీంద్రుని కవిత్వం గురించి చెప్పిన పద్యంలో, సహజరాజసం, కులుకుల పసందు, బిగువు, మెరుపులతోపాటు, మధురసమును కడుపును మాటుకున్నట్లు, ద్రాక్షఫలకుచ్చములయందములుకూడ గోచరిస్తున్నట్లుగాను, వరకవీంద్రుని కావ్యప్రపంచమందు ప్రతిపదంబున మదికి దర్శనమిస్తాయి అని సుందరంగా వర్ణించాడు. ఈ భావనే జాషువా కవితాదౄక్పధం కూడ గోచరిస్తుంది. కవితాస్వరూపానికి వర్ణాక్షరమాలగా భావించవచ్చు.
పద్యనిర్మాణపటిమ, పదాల అల్లిక లో ప్రత్యేకతలుజాషువాకు పద్యాన్ని చిత్రక పట్టడం తెలుసు. భావాన్ని చిత్ర చిత్రాలుగా కూర్చడమూ తెలుసు. సూటిగా, సెలయేటి ధాటిగా, వాడిగా, రసావేశజీవనాడిగా, కవితలు చెప్పడం రుచితో, అభిరుచితో ప్రత్యేకగుణాన్ని అలవరచుకున్నాడు. అతని కవిత్వానికి ఆవేశం జీవం. అసలు ఏకళకైనా రసావేశమే ప్రాణసదౄశ్యం అంటారు, ప్రముఖ కవి నారాయణరెడ్డెగారు. ఈ రసావేశం లేనివారు, బుర్రతో చూస్తారు, బుద్ధితో వ్రాస్తారు. కాని జాషువా అనుభూతితో చూస్తాడు. ఆవేశంతో వ్రాస్తాడు. ఆ ఆవేశాన్ని వెల్లువలా కాకుండా, పిల్లకాలువలా ప్రవహింపచేస్తాడు. ప్రణాళికాబద్ధంగా ప్రవహింపచేసే ఉత్తమకవిత్వాన్ని సౄష్టించబడగలుగుతుంది.
జాషువా రసావేశానికి, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, గబ్బిలం,శ్మశానవాటి ని ఉదాహరించవచ్చు. రసావేశంతో పాటు తమాషా, చమత్కార ప్రయోగాలను చేయడం, జాషువా ప్రత్యేకత. పగలు - అంటే దినమని, విరోధాలని, ఏకాయేకా - కా ఆంటే ఏకా ఒక్కడేకదా అని, లాంటివి అక్షరలక్షలు బహువర్ణితాలు.
జాషువా నవ్వులు నవ్యాలునవ్వును జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవౄత్తికిన్ దెవ్వెలు, కొన్ని నవ్వులెటుతేలవు, కొన్ని విషప్రయుక్తముల్, మువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు విశుద్ధమైన లేనవ్వులు సర్వదు:ఖదమనంబులు వ్యాధులకున్ మహౌధుల్, అంటాడు. అందుకే జంధ్యాల నవ్వలేకపోవడం ఒక రోగం అంటాడు.
శ్మశాన వాటిక - అనుభూతికి రసానుభూతికి ప్రతీకఇచ్చోట; నేసత్కవీంద్రుని కమ్మని కలము, నిప్పులలోకఋరగిపోయే అంటూ, రాజన్యుని అధికారముద్రిక, ఇల్లాలి నల్లపూసల సౌరు, చిత్రలేఖకుని కుంచి, ని చేరుస్తూ, చివరకు, ఇది మరణదూత తీష్ణము, అవని పాలించు భస్మ సింహాసనంబు అన్నాడు. ఈ భావనాపటిమ వేలకవులల్లో ఒకరిని చూడగలుగుతాము.
చివరికి ఎవ్వరేమన్ననండ్రు నాకేమి కొరత, అని ప్రత్యర్ధులను ధిక్కరించాడు అపర మధుర శ్రీనాధుడు.
కవులు వర్ణాతీతులు; వారి కవిత్వాలు వర్ణనాతీతాలు; ఈ జాబితాలో జాషువాని, ఆయన ఈ లోకంలోకి అందించిన భావవరప్రసాదగుళికలు జానుతెనుగుభరిత కవనఖండికలు, నిత్యస్మరణాలు, నిత్యపారాయణాలు.
సరిసములు లేని సన్మానాలు, సత్కారాలుకవిలో ప్రతిభాపాటవాలని బట్టి సన్మానాలు, సత్కారాలు వరకన్యకల్లా వస్తాయి. ఎన్ని కుల, జాత్యంహకారాలు, నిరసనలవెల్లువలు జాషువాపై ఆనాటి అసభ్యసమాజవర్గం ప్రయేగించినా, కనకాభిషేకాలు, గజారోహణాది సత్కారాలు, గండపెండేరాలు, అగణిత సన్మానగౌరవాలు దొరికాయి మన జాషువాకి. పద్మభూషణ, కళాప్రపూర్ణ, కవికోకిల, కవితా విశారద, నయయుగ కవిచక్రవర్తి బిరుదుల ప్రదానాలు చేయడం జరిగింది. అంటరానితనం, వెలివేయడం అన్నది జరిగినా, చివరకు ఆనాటి ప్రముఖాస్థానకవివర్యులు చెళ్ళపిళ్ళశాస్త్రీయ కరకమలాలతో గండపెండేరపు కీర్తి దిగ్దింగంతాలకు వ్యాప్తి చెందడం జరిగిందని మరువలేము; మరువరాదు. మహాకవులచే ప్రశంసించబడిన కవి మనకవి జాషువా. జాషువా, కవిత్వం ద్వారా తన పదునైన కలాన్ని ఉపయోగించాడని, తద్వారా జనితమైన వేదనావేశములను అనుభవించిన ఆయన శైలిలో వాటిని ప్రకటించడం జరిగిందన్న వాదన కూడ ఆనాడే బహుళ ప్రచారంలోనున్నట్లు పలు కవివర్యులు చెప్పడం జరిగింది. బహిష్కరణలు ఆనాడు సర్వసామాన్యం అనుకోవడం సబబు కాదని, ఆవేదనలకు,మనస్తాపాలకు కారణాలు అనేకం వుండవచ్చును అని, ఆ రోజుల్లోనే హరిజనులకు చాల గౌరవమర్యాదలు, సహవాస, సహపంక్తి వరుసలు కూడా పాటించారని, జాషువాతోటి సమకాలీన హితులు,కవులు అనేకులు తమ స్మౄతులను పలవరించిన సందర్భాలు అనేకం. జాషువా తాను కిరస్తాని మతాన్ని స్వీకరించినా, హిందూమతం, మతదేవతలను ఎన్నడూ విమర్శించలేదన్నది కూడ సత్యం.
విశ్వమానవ సౌభ్రాత్రత్వం, విశ్వశాంతి, మతవర్గరహిత సమ సమాజాన్ని కోరినవారిలో జాషువాను ప్రధమ పంక్తిలో గణించవలసిన ప్రతిభను తన కవిత్వం ద్వారా చూడగలగడమే సాక్ష్యం, సంకేతం.
మరణం లేని నిత్యనివాసి - గుర్రం జాషువాగిజిగాడి గూడు అల్లిక, సాలీడు వెలవేత, నెలబాలుడి వెన్నెలల విరజిమ్ములాటలు, ముక్తక ముత్కాఫలాల నీటి నిగనిగలు ఉన్నంతకాలం, గుర్రంవారి ప్రతి పద్యానికీ వెలుగే; ప్రతి పదానికీ మిగులే; గుర్రంవారు వ్రాసింది ఎంత? బాలికుల ప్రశ్న. అమరుకకవే: ఏక: శ్లోక: ప్రబంధ శతాయతే అన్నది సహౄదయ సూక్తితోను, 'ఏకపద్యం ప్రబంధ శతాయతే అన్న దేవులపల్లి కౄష్ణశాస్త్రివారి ఉవాచతో, జాషువాను భావిస్తూ, ఈ స్మౄతివ్యాసాన్ని ముగించడం ఔచిత్యమే కదా!
గుర్రం జాషువా కవిత్వం
సామాజిక స్పౄహలేని భావ కవిత్వం పై ఘాటు విమర్శ
కవి సమయంబు దప్పి, నుడికారపు సొంపును బాడుచేసి, నీవెవతుక కోసమో కుమిలి యేడ్చుచు జక్కని తెల్గుకైతకాయువులు గుదించి యేటికి కయోమయముం బొనరింతువీతు? నీకవనము పాడుగాను వెడగా! యిక నేనియు రమ్ముదారికిన్.
ప్రణయకవి యొకండు, పాషాణ కవి యొక్కడేడ్చు కవి యొకండు, నేకమగుచునొండొరులను జూచి యోదార్చుకొనుచున్నబాగుపడునె భావి భరత జాతి.
( వర్గస్ప్రుహ, హేతువాదం, రాజకీయ ఆర్ధిక దౄష్టి - జీవిత వేదనలోనుండి వికసించింది)
హరిజనుల దీనావస్థముసలివాడైన బ్రహ్మకు పుట్టినారునలువురు కుమారులట, విన్నాము కానిపసరమున కన్న హీను డభాగ్యుడైనఐదవ కులస్థుడెవ్వరమ్మా సవిత్రి? (భరతమాతను నిలదీసి ప్రశ్నించారు)
వర్ణవ్యవస్థ పై గర్హనఈ యభాగ్యుని రక్తంబు, నా హరించిఇనుప గజ్జెల తల్లి, జీవనము చేయుకొసరి బుసగొట్టు, నాతని గాలి సోకనాల్గు పడగల, హైందవ నాగరాజు.
గుర్రాలకు రెక్కలు గలవెర్రి యుగాల్ దాటిపోయె, విజ్ౙానంబున్బుర్ర గల గాంధి యుగమిదికర్రలు ఖడ్గంబు లేలగా లేవు ప్రజన్.
కలకల నవ్వెడు తాతయశిలయై, కలయై యనంత శిల్పంబునకున్బలమిచ్చి, మాయ యయ్యెన్కులమత తత్వములు పుంజుకొని తలయెత్తెన్.
జాషువా మార్గం కూడ గాంధీజీ అడుగుజాడ
ఆడినా మాట తప్పను, మహాత్ముని చెప్పులజాడలోన కాలాడ చరించెదన్, ప్రజల కన్నము బెట్టెద, వర్ణభేదపుంజీడ నణంచెదన్, గటిక చీకటి వాపెద, వెఋఋఇ నమ్మకాలూడని బాడ హస్తమున నూనెద శాతకళాకుఠారమున్.
నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి రూపు రేఖాకమనీయ వైఖరులు గాంచి భళీ భళి? యన్నవాడె మీదేకులమన్న ప్రశ్నవెలయించి చివాలున లేచుపోవుచోబాకున గ్రుమ్మినట్లగును పార్ధివచంద్ర! వచింప సిగ్గగున్.
భేష్! భేష్! మీ కవిత్వం అద్భుతం, మీది ఏ కులం? - నేను క్రైస్తవుణ్ణి. కవికిగాని, కళకుగాని కులమతాలున్నాయా?అయ్యయ్యో! వాణి అంటు పడ్డది.
పిరదౌసి (పరమేశ్వర స్మరణ)విత్తనంబున మహావౄక్షంబు నిమిడించి సౄష్టించి గారడీ చేయు వాడకడుపులో శిశివును గల్పించి పది నెలల్ మోయించి యూపిరి వోయు వాడసద్భక్త వరులకు సాక్షాత్కరించియు నున్నచో రెరిగింపకున్న వాడపొటమరింపక ముందె పుష్ప సంతతులకు వింతగా రంగులు వేయువాడచెలువ మొప్ప బుడమి సౄష్టించి మాకిచ్చిఅనుభవ వింపు డనుచు నాన తిచ్చినిలువ నీడలేక నిల్చిన కలవాడ!కడుపు నిండ నన్ను గన్నవాడ!
గోడ మీద గోడు - కవిత్వంముత్యముల కిక్కయైన సముద్రముననుబెక్కుమారులు ముంకలు వేసినాడభాగ్య హీనుడ ముత్యమ్ము బడయనైతివనధి నను మ్రింగ నోరు విచ్చినది తుదకు.
గబ్బిలంఆలయంబున నీవు వ్రేలాడువేళశివుని చెవి నీకు గొంత చేరువుగ నుండుమౌని ఖగరాజ్ౙి! పూజారి లేనివేళనిన్నవింపుము నాదు జీవిత చరిత్ర.
ముంతాజ్ మహల్ - భరతవాక్యం, ముగింపు
రాణి విడిచిపోయె రాజు నొంటరి జేసిరాజు విడిచిపోయె రాజ్య రమనురాజ్య రమయు విడిచె రాజుల బెక్కండ్రతాజి విడువలేదు రాజసంబు.
షాజహాన్ కు వీడ్కోలు చూపులతో ముంతాజ్
ఆవిరి యోడలో జలధియాన మొనర్చిడి బాటసారు లోభూవర రేవులందు దిగిపోయెద రించుక వెంకముందుగాఈ వసుధా పణంబు పనియెల్ల ముగించి స్వదేశగాములైపోవుచు వచ్చుచుండ్రు సతమున్ బ్రజలీ నరజన్మవర్తకుల్.
క్రీస్తు చరిత్ర (1965 - కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి)శరదించు ప్రతిమానమై కరుణతో జాజ్వల్యమానంబుగాపరమ ప్రేమ సుధారసంబొలుకు నీ బంగారు నెమ్మోము నెత్తురు ముద్దయ్యెనె తండ్రి! యధ్బుతపు శక్తుల్ గల్గు నీకెట్లు దుర్మరణ ప్రాప్తి ఘటిల్లె, నా యనుగు పుత్రా! మౄత్యుసంహారకా!
క్రీస్తు చరిత్ర కావ్యంపై, వి.వి.యల్. నరసింహారావు గారి ప్రశంసముదురు తమస్సులో ఇనుప ముండ్ల కిరీటము నెత్తి కెత్తి, నెన్నుదుట నయశ్శలాక దిగనొక్కి తనుంగని తిట్టిపోయు దుర్మకులను కాచి ప్రోవగ పరాత్పరు వేడెడు క్రీస్తు గాథ నీసదమల వాణి గుండెయలజాల్కొనె గుర్రము జాషువా కవీ!
శ్మశాన వాటి - భావబంధురం, కరుణరసాప్లావితం, వైరాగ్యభాసురం"యిచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలమ్ము నిప్పులలోన గఋరగిపోయె!యిచ్చోటనే భూములేలు రాజన్యుని యధికారముద్రిక లంతరించె!యిచ్చోటనే లేత యిల్లాలి నల్లపూసల సౌరు, గంగలో గలసిపోయె!యిచ్చోటనే నెట్టి పేరెన్నికం గనుగొన్న చిత్రలేఖకుని కుంచియ, నశించె! ఇది పిశాచులతో నిటలేక్షణుండుగజ్జె గదలించి యాడు రంగస్థలంబుఇది మరణదూత తీమౌక్ష్ణ దౄష్టులొలయనవని బాలించు భస్మ సింహాసనంబు."
"నివసించుటకు చిన్న నిలయమొక్కటి దక్క గడన సేయుట కాసపడను నేనుఆలుబిడ్డలకునై యాస్తిపాస్తులు గూర్ప పెడత్రోవలో పాదమిడను నేనునే నాచరించని నీతులు బోధించి రాని రాగము తీయలేను లేనుసంసార యాత్రకు చాలినంతకు మించి గ్రుడ్డి గవ్వయు గోరుకొనను నేను
కులమతాలు గీచుకొన్న గీతల జొచ్చిపంజరాన గట్టువడను నేనునిఖిలలోక మెట్లు నిర్ణయించిన, నాకుతరుగులేదు, విశ్వనరుడ నేను."
జాషువా చెప్పే తీరులోకూడా నవ్యతను సాధించారు.
రాత్రి ఒంటిగంట అని చెప్పిన తీరు -"ఒకటి రెండు మారు లురలి నేలకు జారెకాపలా జవాను కరకు కత్తిసురటి విసరు చేటి మరచి నిద్దురవోయెఖంగుమనుచు నొంటి గంట కొట్టె."
ఉపమానాన్ని లోకం నుండి తీసుకోవడం, తెలుగుతనాన్ని వ్యక్తం చేసే విధానం -"మగడు కొట్టిన, రోదించి మానుకొన్నపెద్ద గయ్యాళివలె వాన వెలసిపోయెమమత లుడిగిన సన్యాసి మనసువోలెగగనమండలమెల్ల నిష్కలుషమయ్యె."
పెంపుడు కుక్క జాకీ చనిపోయినప్పుడు -నోరు లేదు గాని చేరి నీ వొనరించుపనులలోన వింత భాష గలదూనీవు నేను దప్ప నితరు లెరుంగరుకనులతోడ నవ్వగలవు నీవు."
రసహౄదయాలను ఆకర్షించడం అంటే యిదేకదా.
చదువవచ్చు గ్రంథ సముదాయ మంతయుకౄతులలోని నెరసు లేరవచ్చురసము సౄష్టి చేయు పజ్ౙా విశేషంబుసాధనమున రాదు చదువు గాదు."
ఓర్వలేని ప్రతిపక్షులకు సమాధానం -'గవ్వకు సాటిరాని పలుగాకుల మూక లసూయ చేత నన్నె వ్విధి దూరినన్ ననువరించిన శారద లేచి పోవునే?ఇవ్వ సుధా స్థలింబొడమరే రసలుబ్ధులు? గంట మూనెదన్రవ్వలు రాల్చెదన్ గరగరల్ పచరించెద నాంధ్ర వాణికిన్."
వ్యాధులకు మహౌషధం నవ్వు - నవ్వులలోని రకాలను చెప్పిన తీరు -
"నవ్వును జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవౄత్తికిన్దివ్వెలు, కొన్ని నవ్వులెటు తేలవు, కొన్ని విష ప్రయుక్తముల్పువ్వులవోలె ప్రేమ రసమున్ వెలిగ్రక్కు విశుద్ధములైన లేనవ్వులు, సర్వ దు:ఖ దమనంబులు, వ్యాధులకున్ మహౌషధుల్."
మడమ త్రిప్పని యాంధ్ర పుత్రుడను నేనుగడన కెక్కిన యాంధ్ర పుత్రడను నేను.
"బహు దేశములను బేర్వడసి మీసము దీటు భరత ఖండంబు నా పాఠశాలస్తన యుగంబున గాన సాహిత్యములు గల్గు భాషావధూటి నా పంతులమ్మసాందీపని సమక్షమందు విద్య గడించు వనమాలి నా సహ పాఠకుండుభక్తి వైరాగ్య భావముల తావలమైనా భాగవతంబు నా బాలశిక్ష
గంటము ధరించి మోహానాక్షరము లెనయబ్రతిఫలించెడు నా మహోన్నత విభూతివ్రాసిస్కొందును దశ దిశా ఫలక పంక్తిగడన కెక్కిన యాంధ్ర పుత్రుడను నేను."
'జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అన్న సూక్తికి నిదర్శనమే కదా.అ
గుంటూరు సీమ గుణగణాలను వివరించిన తీరు -"పెట్టిన పేరు ముందడుగు వేయుటకెట్టి మహోద్యమంబులన్బెట్టిన పేరు మంజుల కవిత్వ పటుత్వరసైక పుష్టికిన్బెట్టిన పేరు గుండెగల వీరవరేణ్యజను: ప్రశస్తికిన్పెట్టిన పేరు గర్తపురి విద్యకు గానకళా ప్రసిద్ధికిన్."
"ఏస కొంచెము లేని హౄదయంగమంబైన సిసలైన తెలుగు రంజిల్లు చోటుకట్టులో బొట్టులో కడమ సీమల యందు నగ్ర తాంబూలంబు నందు చోటుకంటి కింపైని చక్కని యందగత్తియ లింటింట విద్యుతు లీను చోటుఆవల పల్నాడు, కొండవీ డివల నిలిచిజననమెత్తిన చిరుతబాలునకు గూడగురువులై వీర గాథలు గరవు చోటువీర భాషాభిరామ, గుంటూరుసీమ."
జన్మస్థలం - వినుకొండ"గౌడ డిండిమ భట్టుని కంఛు ఢక్కపగుల గొట్టించు కవిసార్వభౌమునిల్లుభాస్కరుని కత్తి మెరసిన ప్రధన భూమిశిరము నెరసిన వినుకొండ సీమ మాది."
చెళ్ళపిళ్ళ వారిచే గండపెండేర సత్కారం"చెళ పిళా సత్కవీశుడు, ప్రసిద్ధుడు, వీర శతావధాని, యాంధ్రుల శుభ రక్తనాళముల రూపము నెత్తిన బ్రాహ్మణుండు, నాపలుకుల రాణి పాదమును బంగరు గగ్గెరతో నలంకౄతుల్సలిపె, నికేమి కావలె ప్రశస్తి? కవిత్వ కళావధూటికిన్."
నవయుగ కవిచక్రవర్తి, దళితవర్గజ్వలస్ఫూర్తి, జానుతెనుగు కవితురంగం - మన గుర్రం జాషువా.
మధురకవి, అపరశ్రీనాథకవి అయిన గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా తెలుగురధం జానుతెనుగు నివాళులను గర్వంగా సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

Tuesday, July 22, 2008

మరపురాని మహామనీషి - లోకమాన్య బాలగంగాధర్ తిలక్


లోకమాన్య బాలగంగాధర్ తిలక్ మహాశయుని - మరపురాని మహామనీషి గా భావిస్తూ, ఆయన జయంతి సందర్భంగా ఆయన భావాలను పునశ్చరణ చేసుకునే ప్రయత్నంలో తెలుగురధం వ్యాసం ప్రచురించింది.


Monday, July 21, 2008

స్వరాజ్యమే నా జన్మహక్కు - 'బాల గంగాధర తిలక్' జయంతి

లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జయంతి - 23 జూలై ( 1856 - 1920 )
స్వరాజ్యం నా జన్మహక్కు - తిలక్
జాతీయ హిందూవాదం - తిలక్ కు వేదమే!
స్వరాజ్యం నా జన్మ హక్కు - దాన్ని సాధించి తీరుతాను అని శపధం పూని ఆ లక్ష్యాన్ని సాధించుకునే దిశలో ముందుకు సాగిన మహనీయుల్లో, బాల గంగాధర్ తిలక్ ని ప్రప్రధమంగా స్మరించి తీరాలి. ఈయన లోకమాన్య తిలక్ గా కూడ ప్రసిద్ధిచెందారు. భారతీయ జాతీయవాది, సామాజికవాది, స్వాతంత్ర్య సమరయోధులు అయిన తిలక్ భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రజాదరణ పొందిన మొట్టమొదటి అధినేతల్లో ఒకరు అని చెప్పాలి. అందుకే ఆయణ్ణి ఆ రోజుల్లో భారతదేశపు ఆందోళన స్థితిని ప్రకటించిన వర్గానికి పితామహుడని, సంపూర్ణస్వరాజ్యోద్యామనికి ప్రప్రధమ నాయకుడనీ చెప్పితీరాలి. అంతే కాకుండా హిందూ జాతీయవాదానికి కూడ విత్తనాల్ని నాటిన అధినేత అనే చెప్పాలి. తిలక్ భారతదేశచరిత్రావగాహన లో నిష్ణాతుడు, సంస్కౄతపండితుడు, గణిత, ఖగోళశాస్త్రాల్లోను, హిందూత్వంలోను, ఘటికుడు.
ఆధునిక భారతీయ విద్యావిధానానికి ఆద్యుడు
మహారాష్ట్రలోని రత్నగిరి దగ్గరగానున్న 'చిఖలీ గ్రామంలో 1856, జూలై, 23 న మధ్యతరగతి 'చిత్పవణ్ కుటుంబంలో జన్మించారు. బాల్యం నుంచి తిలక్ ది వేదాంతధోరణే. భారతదేశంలో, ఆధునికభావాలతో కాలేజీ విద్యను అభ్యసించిన మొదటితరం యువకవర్గపు ప్రతినిధిగా తిలక్ ను భావించాలి. పట్టభద్రచదువు తర్వాత, పూణేలోని ప్రైవేట్ పాఠశాలలోను, తర్వాత ఫెర్గూసన్ కాలేజీలో లెఖ్ఖల మాష్టారు ఉద్యోగం చేయడం, తర్వాత పత్రికా విలేఖరి గా ఉద్యోగం చేశాడు. ఆ రోజుల్లో పాశ్చాత్య విద్యావిధానం భారతీయ సంస్కౄతికి, విద్యార్ధులకు అవమానకరంగాను, అగౌరవంగాను, ఉన్నందున బాహాటంగా నిరసన ప్రకటించిన ధైర్యశాలి. అంతేకాక, భారతీయ యువతకు విద్యలో విలువలను పెంచే ఉద్ద్యేశ్యంతో డక్కన్ విద్యాసంస్థను స్థాపించాడు.
సంపూర్ణస్వరాజ్యం కోసం రాజకీయ పోరాటానికి నాంది
మరాఠీ భాషలో దినపత్రిక కేసరి (సింహం) స్థాపించడం, స్వల్పకాలంలో బహుళాదరణ చెందడం జరిగింది. వాక్కు స్వాతంత్ర్యం పై గల అణచివేతవిధానంపై నిరసన వ్యక్తం చేయడం, ప్రత్యేకంగా 1905 లో బెంగాలీ విభజనద్వారా తగ్గుతున్న భారతీయతకు, ప్రజకు, సంస్కౄతిపట్ల చూపుతున్న నిర్లక్ష్యవైఖరిపై యుద్ధాన్ని ప్రకటిస్తూ, భారతానికి స్వరాజ్యాన్ని అందించాలని బ్రిటిషుప్రభుత్వాన్ని నిలదీశాడు.
హిందూత్వం పై తిలక్ స్వతంత్ర ఆలోచనావిధానాలు
భారతీయ జాతీయ కాంగ్రేసు లో తిలక్ 1890 ల్లో చేరినా, ఆధునిక స్వేచ్చావాదవర్గంతో సంపూర్ణ స్వరాజ్య సాధన కోసం జరిపిన ఆలోచనావిధానాలపై అసమ్మతీయతను ప్రకటించాడు. 1891 లో ఆడపిల్లల పెళ్ళివయసుని 10 నుంచి 12 పెంచడంపై, విదేశీవిధానాన్ని అమలుచేయడంపట్ల, కాంగ్రేసు తదితర ఉదారవర్గం సమర్ధించడం, దీనికి భారతీయసంస్కౄతిలో కల్పించుకోవడం, వ్యక్తంచేసిన నిరసనతో, తిలక్ ను ఒక వితండ హిందూవివాదిగా గుర్తించడం జరిగింది. ఏమైనా, 1857 సిపాయిలకలహం తర్వాత, భారతదేశంపట్ల బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన మొదటి విప్లవాత్మక మార్పు అనిమాత్రం చెప్పాలి. హిందూమతసంస్కౄతిలో జోక్యం చేసుకున్నట్లు తిలక్ భావించడం జరిగింది.
బొంబే లో ప్లేగు వ్యాధి తెచ్చిన ముప్పు
బొంబాయిలో 1897 లో తాండవించిన ప్లేగు వ్యాధి, పూనాకు పాకుతుందని ఆందోళనతో ప్రభుత్వం తీసుకున్న నివారణ ప్రయత్నాలు శౄతిమించడం - వ్యాధి సోకని ప్రాంతాల్లోని కుటుంబాల్ని చెదరకొట్టడం, అనవసరంగా ఆవాసాల్ని మార్చడం, తరలింపుల్లో ప్రజల ఆస్తుల్ని దోచుకోవడం పట్ల పెరిగిన నిర్లిప్తత, పట్టించుకోని ప్రభుత్వ పరిపాలన పై దుమారాన్ని ప్రకటిస్తూ, కేసరి పత్రికలో వివాదాస్పదమైన వ్యాసాల్ని ప్రచురించడం, శత్రువుని సంహరించడంలో భగవద్గీతలోని భావాల్ని ఉదాహరించడం ద్వారా, ఎవరినీ తప్పుపట్టకూడదని చెప్పడం, ఆ మర్నాడు 27 జూన్ న పూనా సహాయక కలెక్టర్, బౄందాన్ని సంహరించడం జరిగింది. ఈ ఘటనకు, తిలక్ ప్రచారం ఉసికొల్పిందన్న నేరానికి, 18 నెల్ల జైలు శిక్షను అనుభవించాడు. విడుదల తర్వాత, జాతీయనాయకుడిగా తిలక్ కు కొత్తగా గుర్తింపు, 'స్వరాజ్యం నా జన్మహక్కు - దాన్ని సాధించి తీరుతానూ అన్న నినాదం ఈ సందర్భంగా అవతరించింది. ఈ నినాదమే, తిలక్ పేరుతోపాటు, అవిభాజ్యంగా వస్తూనేవుంది.
గోఖలే తో వాదోపవాదం
మరింతగా ఆధునిక భావాలున్న గోపాల కౄష్ణ గోఖలే తో తిలకు కు విబేధాలు రావడం, దీనికి ఆనాటి జాతీయ నాయకులు, బిపిన్ చంద్ర పాల్ (బెంగాల్), లాలా లజపతి రాయ్ (పంజాబ్) ల్ నుంచి సమర్ధన రావడంతో, ఈ త్రివేణీభావకూటమిని, 'లాల్-బాల్-పాళ్ అని పిలిచెడివారు. 1907 సూరత్ కాంగ్రేసు సమావేశం, గరం దళ్ (విప్లవకారులు - త్రివేణీకూటమి), నరం దళ్ (ఆధునికకారులు గా విడిపోవడం జరిగింది. ఈ విభజనకు తిలక్, గోఖలేలు, ఆందోళనతో, జాతీయోద్యమానికి విఘాతమని భావించారు. కాని, ఫిరోజ్ షా మెహతా సన్నిహితుడైన హెచ్.ఎ.వైద్య, ఈ కూటమి కాంగ్రేస్ శరీరంలో ఒక అంగవిహీనమని, దీనికి శస్త్రచికిత్సే శరణ్యమని చెప్పాడు. 1908 ఏప్రిల్ 30 న జరిగిన ముజఫరుపూర్ లో జిల్లాజడ్జిపై బాంబుని యిద్దరు బెంగాలీయువకులు విసరడం, ప్రమాదవశాత్తు, మహిళాప్రయాణికులు మరణించడం, పోలీసుల సోదాలపై కలకత్తాలో వినాశసామగ్రి దొరకడం జరగ్గా, ఈ పూర్తి కధనాన్ని తిలక్ తన కేసరి పత్రికలో సమర్ధించడం, సంపూర్ణ స్వరాజ్యాన్ని కోరడం పై, ప్రభుత్వం తిరిగి తిలక్ ను కష్టడీలోకి తీసుకుంది. అప్పటి యువనాయకుడు మహమ్మదు అలి జిన్నాని ప్రాతినిధ్యం వహించాలని తిలక్ కోరాడు. కాని, బ్రిటిష్ ప్రభుత్వం తిలక్ కు బర్మాలో ఆరేళ్ళు, 1914 వరకు జైల్లో పెట్టింది. జైలునుంచి విడుదల తర్వాత, తిలక్ 1916 లో తిరిగి కాంగ్రేసు లో జాతీయవాదులతో చేరడం, అఖిలభారత హోం రూల్ ఉద్యమంలో 1918 వరకూ అనిబెసెంట్, జిన్నాలకు సహాయం చేశాడు.
సర్వ మత, జాతులకి స్వరాజ్యంలో సమభాగస్వామ్యం
మరాఠా రాజకీయ సిద్దాంత ప్రచారక ప్రవక్తగా ప్రారంభం కావించిన తిలక్, విభజన తదుపరి బెంగాల్ జాతీయ నాయకుల సాన్నిహిత్యంతో, ప్రముఖ జాతీయనాయకుడిగా ఉన్నత శిఖరాల్ని అధిరోహించాడు. మరాఠా రాజకీయపాలన తరహాలో భారతీయస్వరాజ్యపరిపాలన కొనసాగుతుందా అన్న ప్రశ్నకి, 16-17 శతాబ్దాలకాలం లో నడచినా, తర్వాత మరాఠా తరహా 20 శ. లో సరితూగదని, నిజమైన ఫెడరల్ వ్యవస్థతో సంపూర్ణభారతస్వరాజ్య పరిపాలనలో, అన్ని మతాలకి, వర్గాలకి సమప్రాధాన్యత, భాగస్వామ్యం వహిస్తాయని, ఇటువంటి కూటమే భారతదేశాన్ని స్వరాజ్యంతో పరిరక్షించడం జరుగుతుందని తిలక్ నిస్సందేహంగా వివరించాడు.
కర్మయోగసహిత జ్ౙానయోగం పై సమర్ధన
ప్రాధమికంగా తిలక్ అద్వైత సిద్దాంతవాది అయినా, కేవలం జ్ౙానమే మానవునికి విముక్తినిస్తుంది అన్న ప్రాచీనాద్వైతవాదాన్ని త్రోసిరాజని, కర్మయోగసిద్దాంతం తో కూడిన జ్ౙానయోగం ఫలితాల్నిస్తుందని, రెండూ ఉభయతారకంగా ఆచరణకు రావాలని వక్కాణించాడు. తిలక్ ప్రతిపాదించిన సాంఘికసంస్కరణల్లో, ముఖ్యంగా - వివాహానికి కనీసవయసు, తాగుడుపై పూర్తి నిషేధంతోపాటు సరుకు దొరకకూడని పరిస్థితిని కల్పించాలన్న పట్టుదల, విద్యావిధానం, భారతీయ రాజకీయ ప్రస్థానం లో సూచించిన మార్పులు చాలా ప్రభావప్రేరణలు కలిగించాయి.
హింది జాతీయభాషగా తొలి ప్రతిపాదనలు
భారతీయ జాతీయ కాంగ్రేసు లో ప్రధమ నాయకుడిగా, దేవనాగరి లిపిలో వ్రాయబడే హిందీ భాషను ఏకైక జాతీయభాషగా ప్రతిపాదిస్తూ, మొట్టమొదటి నాయకుడు తిలక్ అని చాలామందికి తెలియని విషయం. ఈ వాదననే, తర్వాత మహాత్మాగాంధి సమర్ధించాడు. అయితే, తిలక్ ఆంగ్లభాషను మాత్రం భారతీయుల మేధస్సుల్లోంచి పూర్తిగా చెరపివేయాలన్న ప్రతిపాదనకు మాత్రం ఆచరణకు సాధ్యం కాలేదు. భారతీయపరిపాలన, సాంఘికజీవన విధానాల్లో, సమాచార, భావ ప్రకటన విధానాల్లో, జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో, ఆంగ్లం తిరుగులేని భాషామాధ్యమంగా తనదైన స్థానాన్ని పొందుతూనేవుంది. వసుధైకకుటుంబం భావనకు ఆంగ్లభాషామాధ్యమం అనివార్యం అన్న భావన అనేక దేశాలు ప్రపంచంలో గుర్తించాయి అన్నది నగ్నసత్యం. కాని, హిందీతో సహా భారతీయ భాషల వాడుకవిధానాలు మాత్రం తిలక్ ప్రతిపాదనల తర్వాత ఒక ఊపు, రూపు దిద్దుకున్నాయన్న విషయం కూడ నగ్నసత్యమే.
సార్వజనిక, సామూహిక గణపతి పూజలు - తిలక్ భావవాహినీప్రభావమే!!!
తొలుత అవిఘ్నమస్తు అని, తొండమునేకదంతమును తోరపుబొజ్జయున్ అని, శుక్లాంబరధం ... ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ హైందవేతిహాసస్ఫూర్తితో భారతీయులు వారివారి పూజామందిరాల్లో ప్రతినిత్యం సుప్రభాతవేళల్లో జరుపుకునే నిత్య ఆధ్యాత్మిక తొలిప్రార్ధనలకు, ఒక సామూహికమైన, సామాజికమైన, సార్వజనికతను ప్రసాదించిన ప్రప్రధమ ప్రతిభామూర్తి, నిస్సందేహంగా,బాల గంగాధర తిలక్ మహాశయుడే. మూడురోజుల ముచ్చట నుంచి, అయిదురోజులు, గణపతి నవరాత్రులు, మాసాంతంగానూ పూజోత్సవాల్ని సామాజికంగా, సామూహికంగా, భాద్రపద శుక్ల ( గణేశ ) చతుర్దశిగా ప్రారంభించేవి, అనంత చతుర్దశి (ఆగష్టు/సెప్టెంబరు నెలల్లో) ఒక అనివార్య సమావేశాలకి సదవకాశాన్నిచ్చింది. ముఖ్యంగా, నాయకులకు ప్రజలతో సంభాషణలు చేసుకోవడానికి వేదికలుగా మారాయి. శుభప్రారంభంగా, గ్వాలియర్ లో సర్దార్ ఖస్గివాలే ప్రోత్సాహంతో నిర్వహించిన పూజోత్సవాలు, సర్వోపయోగమని గ్రహించి, ఈ నూతనభావాల్ని 26 సెప్టెంబర్ 1893 లో తన కేసరి పత్రికలో సవివరంగా ప్రచురించడం జరిగింది. ఈ ఫక్కీలో, విదేశీ వస్తువుల్ని, సేవల్ని, బహిష్కరించమని చేసిన ప్రకటనలకు, పిలుపులకు, సద్స్ఫూర్తినివ్వడమే కాక, దేశీయత, దేశభక్తి, భారతీయప్రజల్లో నరనరాల్లో దూసుకుపోవడం అనూహ్య పరిణామం, పరిమాణం అని చెప్పాలి.
పిదపకాలం లో తిలక్
గాంధీ నిర్వహించిన అహింస, పౌరసహాయనిరాకరణ విధానాలపై, తిలక్ నుంచి విమర్శలు వచ్చేవి. ఒకానొక కాలంలో, తిలక్ ను అతివాదకునిగా భావించబడినా, తిలక్ చర్యల్లో కొంత మెరుగుతనం కనిపించేవి. ఉభయవర్గాల మధ్య సహౄద్భావ వాతావరణంలో సంభాషణలు భారతస్వరాజ్యానికి మరింత ప్రభావితమాధ్యమాలవుతాయని తిలక్ భావించాడు. అంతేకాక, భారతీయ చరిత్ర, సంస్కౄతి, హిందూతత్వం అంశాలపై తిలక్ ప్రచురించిన రచనలు మాత్రం ఒక నూతన సంప్రదాయాన్ని, సదాచారాన్ని, భారతీయుల్లో, భారతీయ నాగరికతకు, ప్రపంచంలో గర్వించదగ్గ దేశంగా భారతీయతావిధానాలకు దోహదమయ్యాయి. వీటిమూలంగానే, గాంధీకి ఆధ్యాత్మిక, రాజకీయ గురువుగా తిలకు ను అనేకులు సమంజసంగానే భావించారు. అయితే, జాతిపిత మాత్రం, తన రాజకీయ గురువుగా, తిలక్ సమకాలీకుడైన, గోపాలకౄష్ణ గోఖలే ను, ప్రకటించారు. దీనికి విరుద్ధంగా, తిలక్ 1920 లో మరణించినప్పుడు, బోంబే లోని దహనవాటికలో, 2 లక్షలకు పైగా ప్రజాసమూహంతో నున్న గాంధి, తిలక్ కు ఘననివాళిని అర్పిస్తూ, తిలక్ ను నవభారతనిర్మాత గా గాంధి ప్రకటించడం గమనించదగ్గ విషయం. బాలగంగాధర్ తిలక్ ని మాత్రం నేటికీ నవభారత నిర్మాత గానే కాకుండా, హిందూ జాతీయతానాయకునిగా భారతావని పరిగణిస్తూనేవుంది అన్నది సత్యం. హిందూరాజకీయవాదపు అంశంగా, భారతీయ విప్లవసంస్కర్తగా వినాయక్ దామోదర్ సావార్కర్ కు ఏకైక ఆదర్శమూర్తిగా తిలక్ ని మాత్రం చెప్పుకోవాలి.
తిలక్ మరపురాని సాహిత్యం
బాల గంగాధరుని ప్రతిభాతిలకానికి నిదర్శనంగా, 1903 లో, 'ఆర్కిటిక్ హోం యిన్ ది వేదాశ్ అన్న ఆంగ్లభాషారచనను ఆలోచనాత్మకంగా వ్రాయడం, ఆర్కిటిక్స్ లో వేదాల్నే రచించినట్లుగాను, ఆర్యులు దక్షిణానికి తర్వాతకాలంలో తీసుకువచ్చారని ఆయన వాదంగా తిలక్ చెప్పడం కూడ జరిగింది. ప్రముఖంగా, కర్మయోగం పై విశ్లేషణగా, భగవద్గీతను గీతారహస్యం గా, వేదోపనిషత్తులసారంగా వ్రాయడం, ఆ బౄహద్గ్రంధం నేటికీ హిందువులకు నిత్యపారాయణగ్రంధంగా ఆదరణీయంగానే భావించబడుతోంది. తిలక్ యితర రచనలను చెప్పాలంటే, హిందూ జీవనం-నైతికత-మతపరంపర, వేదసంహిత-వేదాంగజ్యోతిషాలు, యం.డి.విద్వాన్స్ సంపాదకీయంలో లోకమాన్య తిలక్ లేఖలు, రవీంద్రకుమార్ సంపాదకీయంలో గంగాధరుని పత్రరచనలు, తిలక్ పై వచ్చిన ఆరోపణల సారాంశ రచనలు ప్రముఖ ప్రభావాల్ని, ఉత్తేజితకరమైన ఆలోచనావిధానాల్ని రేకెత్తించాయన్నది నిజం.
లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఆగష్టు 1, 1920 న తన అంతిమ శ్వాసను విడిచారు.
బాలగంగాధరుడి పాత్ర, ప్రభావం, ప్రేరణ, భారతీయతకు పునాది, హిందూవాదానికి వేదసంహితసమానమని నిర్ద్వందంగా భావించవచ్చు అన్న భావన, సత్యం, శివం, సుందరం. పవిత్రభావనలు అన్ని దిశలనుంచి అవతరించాలన్నది తిలక్ విషయంలో ౠజువర్తనమయింది.
లోకమాన్య బాలగంగాధర తిలక్ మహనీయుడి జయంతి సందర్భంగా - తెలుగురధం - సహస్ర నమోవాకాలని సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.



దాశరధీ! కవితాంధ్ర పయోనిధీ!
దాశరథి జయంతి ( 1925 - 1987 )
కలం నా కంఠమాల - దాశరధి
కమ్మని నా తెలంగాణ తొమ్మిది జిల్లాలేనా? బహుళాంధ్రకు తెలంగాణ పర్యాయపదంకాదా?
నా తెలంగాణ కోటి రత్నాల వీణతరతరాల స్వప్నాల సుందర ఫలమ్ము స్వైరభారతభూమిఒక్కటే ముడి బిగించి పాడినాను మహాంధ్ర సౌభాగ్యగీతిముక్కలు ముక్కలై చెదరిపోయెనురా! మనజాతి హూణభూభుక్కుల రాజనీతికి కవుంగిళు లొడ్డిన రాజు చేతిలో చిక్కెను బంగరుతెల్గునేల
జండా ఒక్కటి మూడువన్నెలది; దేశంబొక్కటే భారతాఖండాసేతుహిమాచలోర్వర;కవీట్కాండంబులోనన్ రవీంద్రుండొక్కడే కవీంద్రు;డూర్జితజగద్యుద్ధాలలో శాంతికోదండోద్యద్విజయుండు గాంధి ఒకడే తల్లీ మహాభారతీ
అనాదిగా సాగుతోంది - అనంత సంగ్రామం అనాధునికీ ఆ గర్భ-శ్రీనాధునికీ మధ్యసేద్యం చేసే రైతుకు-భూమి లేదు పుట్ర లేదురైతుల రక్తం త్రాగే-జమీందార్ల కెస్టేట్లు ...కర్షకులు కార్మికులు - మధనపడే మేధావులుతమశ్రమలకు తగినఫలం - ఇమ్మంటే తిరుగుబాటుషావుకారు వడ్డీలకు - జమీందార్ల హింసలకువేగలేక ఆగలేక - తిరగబడెతె అతివాదం
రానున్నది యేది నిజం? అది వొకటే సోషలిజం!కలపండోయ్ భుజంభుజం - కదలండోయ్ గజంగజం
ఈ సమాజాన దోపిడికే నివాసమిందు నీకేమి లేదు; సహింపరాని వేదనయె కాని వేరు కంపింపబోదులే, చివాలున లేచి మళ్ళించు రధము
గతమే జీవిత మనుకుని వర్తమానమే వలదని, వెనక్కు నడిచే వారిని వెక్కిరించు కోర్కిలేదు.గతమంతా బూదికుప్ప కావాలి మనోజ్ణ భావి, తిగరుబడండని అరచే బిరుసువారి నిందింపను. ఇవి రెండూ ఒక కత్తికి అటూ ఇటూ రెండంచులు, నే మాత్రం రెండంచుల సాము చేయగలను లెండి.
తెలంగాణలోని కోటిధీరులగళ ధ్వనినే గాక, ఇలాగోళమందుండెడి ఎల్లరి శబ్దాన్ని నేను
గతాన్ని కాదనలేను వర్తమానం వద్దనబోను, భవిష్యత్తు వదలుకోను, కాలం నా కంఠమాల నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి
ఎవడైనా మానవుడే ఎందుకు ద్వేషించడాలు? రాక్షసినైనా మైత్రికి రానిత్తును భయం లేదు.
హౄదయం వినా నాదగ్గర ఏ వస్తువు లభింపదు, ఉదయం వినా నాకంటికి ఏ వస్తువు రుచింపదు.
తిమిరంతో ఘనసమరం జరిపిన బ్రతుకే అమరం, కవితాతేజోవలయం అవని శాంతి కదినిలయం.
అమ్మా! భారతీ! నేను మరోదేశాన్ని అనసరించి అనుకరించి అడుగు ముందుకు వేయలేను.
దాశరధి - సాహిత్యమే జీవితం - జీవితమే సాహిత్యం
"కాలోహ్యయం నిరవధి ర్విపులా చ పౄధ్వీ" అంటూ తన శ్లోకాన్ని ముగించిన ప్రముఖ కవి భవభూతి - ఈ అనంతమైన కాలంలో, ఈ విశాలమైన ప్రపంచంలో తన వంటి హౄదయం కలిగినవాడు ఎప్పుడైనా, ఎక్కడైనా పుట్టకపోతాడా? అని భవభూతి ఆలోచించే అన్నాడు. సాహిత్యానికి కొత్తపాతల పూతలు పులమడం అసాధ్యమనీ, స్వపర దేశ భేదములు లేవనీ భంగ్యంతరంగా ప్రవచించాడు. మనీషియైన మనిషి తన అనుభవాన్ని సువ్యక్తం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ ప్రయత్నం ఆ ప్రయత్నం సాహిత్య సౄష్టికి ప్రేరణాత్మకం, దోహదకారి అవుతుంది. తరతరాలకు ఆ సాహిత్యం జీవిత లక్ష్యాన్ని సంకేతిస్తూ ఉంటుంది. అజ్ణానంతో, దారిద్ర్యంతో, దుర్భరత్వంతో జాతి పోరాడుతున్నప్పుడల్లా ఆ ఉత్తమ సాహిత్యం కనువెలుగును ప్రసాదిస్తుంది. ధైర్యోత్సాహాలను ఇనుమడింప జేస్తుంది. దైనందిన జీవితాన్ని రసమయం చేస్తుంది. ప్రతి వ్యక్తిని సంస్కౄతి ప్రరిరక్షణకు ఉన్ముఖుణ్ణి చేస్తుంది.
పై భావాలకు సరిసములుగా భావించదగ్గ ఆంధ్రకవితాశరధి, పయోనిధి, దాశరధీ అని చెప్పాలి. దాశరధి యుగోచితాగ్రగామిత్వంతో సమకాలీన సాహిత్యోద్యమాలు కల్గించిన సంస్కారంతో శాశ్వతమైన శాంతిని పరికల్పించి పరిరక్షించడానికి ఆలోచనాలోచనాలతో తిమిరంతోసమరం జరిపిన సాహితీచిత్రకవనఘనాంబోధి - దాశరధి, కవితాపయోనిధి. అసలు పేరు దాశరధి కౄష్ణమాచార్యులు. మంచి కవిత్వం ఏభాషలో ఉంటే అదే నాభాష, మంచికవి ఎవరైతే అతడు నామిత్రుడు, నాకు ఉరుదూ, తెలుగూ రెండు కళ్ళు, ఈ రెండుకళ్ళతో అన్నిభాషలనీ చదవగలను, హౄదయం ఒకటైతే లోకమంతా ఒకటి - అన్న విశాలదౄక్పథం ఏర్పడటం విశేషం, మహాకవి కుండవలసిన మహనీయ గుణాల్లో మొదటిది అని పలువురి పండితుల భావనను దాశరధి పుణికిపుచ్చుకున్నవాడు. దాశరధి హృౠదయవాదానికి, అనుభూతికి తార్కాణం.
ఏకంలో అనేకం - వెరసి దాశరధి
స్వాతంత్ర్య సమర యోధులు, ఉపాధ్యాయుడు, పంచాయితీ ఇనస్పెక్టర్, ఆకాశవాణి ప్రయోక్తలుగా ఉద్యోగం నాణానికి ఒక పార్శ్వమయితే, మహాకవి, కధకుడు, నాటికాకర్త, అనువాదకుడు, నవలాకర్త, వ్యాసకర్త, చలనచిత్రగీతికా స్రష్ఠ, స్వీయచరిత్రకారుడు, బాలసాహిత్యనిర్మాత, తెలుగు గజల్ రుబాయీల ప్రయోక్త, మహావక్త, విద్వద్విమర్శకుడు, వివిధప్రక్రియల్లో ముప్ఫైదాకా గ్రంధాలరచయిత, అనేకులకు అంకితమివడ్డం, పుచ్చుకోవడం జరుపుకున్న కవనమూర్తి, రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీల విజేత, ప్రధానమంత్రి తామ్ర పత్ర సన్మాన గ్రహీత, ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి - ఎవరో, వేరెవరో కాదు, దాశరధి - యింటెపేరు ప్రతిభానామధేయంగా చెలామణి అయిన కౄష్ణమాచార్యులు.
విద్వద్వంశంలో జీవనప్రస్థానం
దాశరధి కౄష్ణమాచార్యులు, క్రోధన నామ సంవత్సరం శ్రావణశుక్ల విదియ, బుధవారం, 22 జూలై 1925 నాడు వరంగల్లు జిల్లాలోని మానుకోట (మహబూబాబాద్) తాలూకా, చినగూడూరు గ్రామంలో, వేంకటమ్మ, వేంకటాచార్యుల పుణ్య దంపతులకు జన్మించిన జ్యేష్టపుత్రుడు; ప్రముఖ సాహితీకారుడు దాశరధి రంగాచార్య, సోదరుడు. శ్రీవత్సగోత్ర శ్రీ వైష్ణవ సంప్రదాయ కుటుంబంలో పెరిగిన వాతావరణం, ప్రభావం అపారం. పండితవంశం, శుద్ధశ్రోత్రియ కుటుంబం. తండ్రి సంస్కౄతాంధ్రద్రావిడభాషా విశారదులు. ఉభయవేదాంత నిష్ణాతులు. సాహిత్య పారంగతులు. తమిళభాషలోని వైష్ణవమత వచనాల్ని ఆంధ్రీకరించడం, దాశరధి అన్న పత్రికను నడపడం, తల్లి కావ్యాలతో, ప్రబంధాలతో చక్కని పరిచయంతోపాటు మాతౄమూర్తి హౄదయం మానవతకూ ప్రేమకూ ఆప్యాయతకూ నిలయం, మాతామహులైన భట్టాచార్యుల పాండిత్యం, రామాయణ భారత, భాగవతాలను ఆంధ్రీకరించడం, యిత్యాది పాండితీవాతావారణంలో దాశరధి బాల్యం బహు ప్రేరణాత్మకంగా గడించింది. విశిష్టాద్వైత ప్రవక్తకులు శ్రీమద్రామానుజాచార్యులవారి ప్రధానాంతరంగిక శిష్యుడు, దాశరధి అన్న పేరుగల వ్యక్తి, ఆ గణంలో ప్రధముడు. మహావిద్వాంసుడు, రామానుజులవారిచే ఉపదేశం పొందిన భాగ్యవంతుడు, రామానుజుల పర్యటనలో తెలంగాణ సందర్శన సందర్భంలో, ప్రశిష్యుడు దాశరధి స్థిరనివాసం ఏర్పరచుకోవడం వల్ల చారిత్రకకధనం ప్రధానం సంతరించుకుంది. దాశరధిగారి పూర్వులు భద్రాచల నివాసులు, దాశరధి శతకకర్తలైన కంచర్ల గోపన్నవలె శ్రీరామభక్తులు కావడం వల్ల, వారి వంశానికి ధాశరధి పేరు వచ్చిందన్న భావన కూడ ప్రచారంలో వుంది. ఏది ఏమైనా, దాశరధి యింటి, వంశం పేరు.
విద్యాపర్వం
సాంప్రదాయకపద్ధతిలో తండ్రివద్ద సాగిన విద్యాబుద్ధులు, సంస్కౄత పంచకావ్యాలు, వైద్యగ్రంధాల్ని ఆపోశనం పట్టాడు. కావ్యాల్లోని గద్యలు, శ్లోకాలను ఆధ్యయనం చేస్తూ, వాటిలో గూఢార్ధాలను, అంతరార్ధాలను, గురువులు దాటవేసినా, తెలివిగా గ్రహించేవాడు. మచ్చుకు ఉదాహరణం : స్త్రీ యొక్క చూపుల వేడితో దహించుకు పోయిన వారికి మందేమిటో చెప్పండి వైద్యరాజా అని రోగి అడిగిన ప్రశ్నకు, గట్టిగా కౌగిలించుకోవడమేమో పథ్యం, యిక కషాయమంటారా, అధరచుంబనం అన్న వైద్యుని జవాబు, తెలిసీతెలియని దాశరధి వయసుకు మనసుకు పులకింతలు, చమత్కారాలని కలిగించేవి. చినగూడూరు లోని ప్రాధమిక పాఠశాలలో నాల్గవతరగతి, తర్వాత ఖమ్మం లో ఉర్దూలో చదువు జరిగింది. యిక్కడే కౄష్ణమాచార్యులు, దాశరధి గా మారిపోయారు. స్వాభిమానం, అర్ధించకూడదన్న ధౄడగుణం, ఏడవ తరగతి తోటి విద్యార్ధులకు వ్యాకరణం, ఉర్దూని బోధించి చక్కదిద్దుకున్న ఆర్ధికస్థితి ద్వారా, పుస్తకాలు, పత్రికలు కొనుక్కుని తీర్చుకున్న విద్యాతౄష్ణ, వినూత్న చైతన్యాన్ని పొందాడు. చదువుతోపాటు, సంస్కౄతాధ్యయనం, కేశవాచార్యశాస్త్రిగారి అంతేవాసితనంతో ఉపనిషత్తులకు వ్యాఖ్యానాల్లోంచి అనుమానాలు, సందేహాలద్వారా వచ్చే సమాధానాల ద్వారా ప్రభావితులవడం ద్వారా అబ్బిన పాండిత్యం. పద్యాలల్లడం జరిగేది. ఖమ్మంలో ఆనాటి బోధనాభాష అయిన ఉర్దూలో మెట్రిక్యులేషన్, భోపాల్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్మీడియట్ ను, ఆంగ్ల సాహిత్యం ప్రధానవిషయంగా హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంనుంచి బి.ఏ.ను పూర్తిచేశారు.
బహుమతి అందించిన క్రీడ పై మొదటి కవిత
చదువుతోపాటు క్రీడల్లోఆసక్తి, తత్ఫలితంగా గవర్నరు ద్వారా అందుకున్న ఆనాటి ఖరీదైన రాజా పెన్ను బహుమతి, ఆ పెన్నుతోనే కవితను - గోనెసంచి పరుగులపోటీ పై వ్రాయడం యిలా సాగింది.
గోనెసంచి పరుగులపోటి, భలేమంచి ఆటలపోటి, బొక్కబొర్లా పడ్డాడొకడు, ముక్కుపగిలి ఏడ్చాడొకడు, హాయ్ అల్లా అన్నాడొకడు, ఓ దేవుడా అన్నాడొకడు, ఏడ్చేవాడొకడైతే, నవ్వేవాడింకొకడు, అవమానం ఒకడికైతే, సమ్మానం ఇంకొక్కడికీ, గెలిచినోడు నవ్వాలా? ఓడినోడు ఏడ్వాలా? నేడు గెలుగు రేపోటమి, నేడోటమి రేపు గెలుపు, అదేరా జీవితం, మరి ఎందుకు ఏడవడం - అనగలగడం జీవితావగాహన చిన్నప్రాయంలోనే అబ్బడం అదౄష్టకరం. ఆనాటి తెలంగాణ పరిస్థితులు, దాశరధి చదువును ఆపేలా చేశాయి. సాంఘిక రాజకీయ వైజ్ణానిక పరిస్థితులే స్వాతంత్ర్యోద్యమంలో ప్రవేశింపచేశాయి.
ప్రభావిత సంఘటనలు
హైదరాబాదు స్వాతంత్ర్యోద్యమం, తెలంగాణాలో - గ్రంధాలయోద్యమం, ఆంధ్రోద్యమం, ఆణాగ్రంధమాల, పత్రికలు, నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ, హైదరాబాదు స్టేటు కాంగ్రేసు స్థాపన లాంటి సంస్థల, సంఘటనల పై ప్రభావప్రేరణలు, కమ్యూనిష్టు, రజాకార్లు, సోషలిష్టు వర్గాలు, ఆర్యసమాజ్, హైదరాబాదు స్టేటు కాంగ్రేసు తుదిపోరాటం, హైదరాబాదు సంస్థానవిముక్తి, ఆనాటి సాహిత్య వాతావరణం, యిత్యాది సంఘటనలు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను, ప్రభావితం చేయడం జరిగాయి. తెలంగాణా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం, కవి సమ్మేళనాల్లో 'ఓ పరాధీనమానవా! ఓ పరానిదాస్యము విదల్చలేని శాంతమ్ముమాని తలుపులను ముష్టి బంధాన కలచివైచి చొచ్చుకొనిపొమ్ము స్వాతంత్ర్య సురపురమ్మూ. 'ఓ నిజాము పిశాచమా! కానరాడు ... నా తెలంగాణ కోటిరత్నాలవీణా, 'ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను ... దిగిపొమ్మని దిగిపొమ్మని ఇదే మాట అనేస్తానూ జైలుజీవితాన్ని అనుభవిస్తూ, పళ్ళుతోముకోవడానికిచ్చిన బొగ్గుతో 'కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగెలను తెంపి అగ్నిలో దింపినావు, కారాధామమ్మున మౄతికౌగిలి కామించెడి వీరవరులు కలరిచ్చోటన్, జీవితమున ఒక వర్షం గడచిన వేళ దు:ఖించాలన్నది మరిచేస్తున్నారు, అని వ్రాసిన కవితలు దాశరధి పేరు ఆంధ్రసాహితీచరిత్ర వున్నంతకాలం, గుర్తుండి తీరుతుంది. అని చదివిన కవితలు బహుళ ప్రజాదరణ పొందాయి. హైదరాబదు స్వాతంత్ర్యసిద్ధి, దాశరధి విముక్తి, దాశరధి విశాలాంధ్రవాంచ, విశాలాంధ్ర అవతరణలు దాశరధి జీవితంలో ప్రముఖ సంఘటనలుగా భావించాలి. విశ్వచైతన్యానికి కొత్త వరవడిని ప్రసాదించిన దాశరధి ఆశించిన విశాలాంధ్రప్రదేశ్ కే ఆస్థానకవిగా తర్వాత నియపింపబడడం గొప్ప యాదౄచ్చికం. తెలుగుజాతి చైతన్యపతాకగా ప్రకాశించి, అనేక కావ్యాలు రచించి దాశరధి ప్రజాకవిగా, జాతీయకవిగా ప్రతిభాదర్శనమిచ్చాడు. గుండెను రెండుగా చీల్చే మొండితనం పనికిరాదు; మనసులనేకం చేసే మంచితనం కావాలి అన్న విశ్వచైతన్య భావవీచికలను అందజేస్తూ, విశాలవిశ్వానికి సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించాడు. పుట్టుకతోనే సహజపాండితీకవితాధారను పొందిన దాశరధి మహాంధ్రోదయం, అగ్నిధార నుండి నేత్రపర్వం వరకూ ముప్ఫై దాకా కవితాప్రచురణలు వచ్చాయి.
దాశరధి బహుముఖ సాహితీధారాప్రక్రియలు
కవిత్వంలో దాశరధి అభ్యుదయ, కాల్పనిక, జాతీయోద్యమ, నవ్యసంప్రదాయ రీతులకు ప్రాణం పోసిన మహాకవివర్యుడు. గీతాల విషయానికొస్తే, లలితగీతాలు, చలనచిత్రగీతాలు, నాటికల్లో వచన, గేయ పద్ధతుల్లో రచనలను చేశాడు. కధలు, బాలసాహిత్యం, నవల, వాఖ్యానం, వ్యాసాలు, అనువాదాలు, నిఘంటునిర్మాణ కౄషి, యాత్రాస్మౄతిగా స్వీయచరిత్ర ల పంధాలు త్రొక్కి బహుముఖసాహితీప్రక్రియ నిర్మాణ పధకుడు అన్న గౌరవం లభిచింది.
దాశరధి గజళ్ళు
అరబ్బీభాషలో జనించిన గజల్ కవితా ప్రక్రియ ఫారసీ, తుర్కీ, ఉర్దూ భాషలలోనికి వ్యాపించిన గజల్ శబ్దార్ధం, ప్రియురాలితో సల్లాపం అనే అర్ధాన్ని వివరిస్తూ, ఉర్దూ భాషావేత్త అయిన దాశరధి, కలకంఠులతో సరస సల్లాపం, ఇంతులతో మంతనాలు అని అనుభూతిపరంగా నిర్వచనం చెప్పారు. మంజరి, వల్లరి అన్న పేర్లతో ఖండికలు రచించాడు. గజళ్ళో తరచుగా చొప్పించే 'తఖల్లుశ్ (కలంపేరు)ను శరధి గా వాడారు. రమ్మంటె చాలుగానీ రాజ్యాలు విడిచిరానా, నీ చిన్ని నవ్వుకోసం స్వర్గాలు గడిచిరానా. ముళ్ళనీడల్లో పువ్వులున్నాయి, నాదు కన్నీట నవ్వులున్నాయి. యాత్ర నడిదారి ఆగిపోనేలా, నీలగగనాన దివ్వెలున్నాయి. ఒకనాడు హౄదయము మారుట, పగబూని 'శరధీని దూరుట, పగవాని ఇంటికి చేరుట, అవినీకు జ్ణాపకమున్నవా?
తెలుగులో మొదటి ప్రయోగం - దాశరధి రుబాయీలు
రుబాయీ ప్రక్రియను మొదట ఆంధ్రసాహితీజగతికి సుపచరిచయం చేసిన ఘనత దాశరధి దే అని ఘంటాపధంగా ఆయనే చెప్పుకున్నాడు. రుబా - అంటే అరబ్బీ భాషలో నాలుగు అని అర్ధం. నాలుగు పంక్తులు, నాలుగు భాగాలు. తన రుబాయీలను కవితాపుష్పకం, తిమిరంతో సమరం సంపుటాల్లో గోచరిస్తాయి. నిప్పులోంచి అప్పుడప్పుడు పొగ పుడుతుంది, నీళ్ళలోంచి విద్యుత్తును సెగ పుడుతుంది, ఈ దానవలోకంలో ఎన్నటికైనా, మానవులని పిలుగదగిన తెగ పుడుతుంది. వయసులాగ శాంతి కూడ వెళిపోతుంది, కమ్మనైన కధ కంచికి వెళిపోతుంది, ఎంత దారుణం శరధీ, ఈ లోకంలో, నరరుధిరమై నరునికి మధువయి పోతుంది. వైవిధ్యం, విస్తౄతి, సౌందర్యం, సందేశం లతో అలరించిన నాలుగు విషయాల్ని నాలుగుపాదాల్లో నాణ్యంగా నప్పించిన ఘనత దాశరధీదే.
బాలాదపి సుభాషితం
బాల్యంలో సంప్రదాయపరంగా సంస్కౄతకావ్యాల పఠన ప్రభావం, ఆస్థానకవిగా నియమించిన సందర్భంగా, రసద్దివ్య గోదావరీ కంఠహారే, లసద్భవ్య కౄష్ణానవౌఢ్యాహీరే, మహాంధ్రప్రజా మాతౄమూర్తే జయంతే, విశాలావనీవ్యాప్త కీర్తే! నమస్తే! అని మాతౄస్తవం చేశారు.
సంగీత సాహిత్య సరస సమ్మేళణ సలలిత గీతావళి
ఆంధ్ర మహాసభ కరుదెంచండీ జనులారా మీరు లాంటి లలితగీతాలను, పూలపాటలు, నవమంజరి, తేనెపాటలు, వలపుపాటలు, లలితగీతాల సంపుటాలు సుప్రసిద్ధాలు. లలితగీతాల్లో కూడ దాశరధి, లక్షణలక్ష్యాల్ని సాధించాడు. మధురగాయకుడు ఘంటశాల స్వరంతో రాణించిన గీతం - నారాణి, తలనిండ పూదండ దాలిచిన నారాణి, మొలక నవ్వులతోడ మురిపించబోకే, మాటల్లో మాటల్లో మరపించబోకే, అన్నది సజీవ గీతసంగీతలహరి.
చిత్రగీతావళి
అన్ని సాహితీ ప్రక్రియలు ఆస్థానకవిని ఆదరించాయి. ప్రత్యేకంగా దాశరధి చలనచిత్రాల్ని ప్రస్తావించాలి. వాగ్దానం, ఇద్దరుమిత్రులు చిత్రాలతో రంగప్రవేశం చేసిన దాశరధిని అనేక చిత్రగీతాలు వరించాయి. నా కంటిపాపలో నిలిచిపోరా,నీ వెంటలోకాలు గెలువనీరా (వాగ్దానం), ఖుషీఖుషీగా నవ్వుతూ, చలాకీమాటలు రువ్వుతూ (ఇద్దరుమిత్రులు) పాటలతో చిత్రప్రవేశం చేశిన దాశరధి మరి వెనుతిరిగి చూడవలసిన అవసరం రాలేదు. చిత్రాలలో ఖవాలీపాటలకు ప్రసిద్ధి దాశరధి. నవరసాలను తన చిత్రగీతాల్లో పొదగగలిగిన పాండిత్యం, ప్రతిభ రంగరించి దాశరధి రచనలను చేయడం జరిగింది.
బిరుదులు, సన్మానాలు
మహాకవి, దాశరధి కవిసింహ, అభ్యుదయ కవిచక్రవర్తి, యువకవిచక్రవర్తి, జాతీయోద్యమరధసారధి, కళాప్రపూర్ణ, డి.లిట్., ఆస్థానకవి, ఆంధ్రకవితాసారధి బిరుదులతోపాటు, ఎన్నో, మరెన్నో, సన్మానాలు, సత్కారాలు, దాశరధి ప్రతిభకు గీటురాళ్ళు. దాశరధిపై, ఆయన సాహిత్యంపై అనేకమంది పరిశోధనలను చేయడం, అన్యభాషలలోకి ఆయన రచనలను అనువాదం చేయడం కూడ జరిగింది. ఆయన ప్రతిభకు జోదుగా విదేశపర్యటనావకాశాలు రావడం, వాటిద్వారా విశ్వానికి సాహిత్యాన్ని ప్రచారం చేయడం జరిగింది.
దాశరధి తిరిగిరాని పయనం
1983 లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థానకవి పదవిని రద్దుచేయడం, 1987 లో రష్యా పర్యటన విశేషాలను సంకలనం చేసే ప్రయత్నంలో అనారోగ్యం చేయడం, క్రమేపీ ముదరడం, తగ్గుదశ పట్టడం జరిగినా, 1987 నవంబరు 5వ తేదేన శాశ్వతంగా కన్నుమూసి, దాశరధి తిరిగిరాని పయనం కావించారు.
భారతీయ సాహితీనిర్మాతల్లో ఒకరిగా పరిగణింపబడిన దాశరధిని, సాహితీవ్యక్తిత్వాన్ని, ప్రముఖ సాహితీవిమర్శకులు, డా.జి.వి.సుబ్రహ్మణ్యంగారు, అరలు లేని హౄదయం, అరమరలు లేని స్నేహం, స్వార్ధంలేని సౌజన్యం, దాశరధి వ్యక్తికి తరుగులేని సంపద. కులవర్గాలు లేని సమాజం, మతవైషమ్యాల్లేని మానవత,ఆయన సమాజానికిచ్చిన సందేశం; విశ్వశాంతి ఆయన లక్ష్యం; కవిత్వం ఆయన జీవితం. ఆధునిక సాహిత్యంలో విశ్వమానవ భావానికి దాశరధి కవిత ప్రతీక, అన్నారు. ఆమాట సత్యం, శివం, సుందరం.
దాశరధి కవితాసౌధం ఒక పుష్పకవిమానం. ఎన్ని సంప్రదాయాలైనా, ఎన్ని క్రొత్తదనాలైనా అందులో ఇమడగలవు; అది వ్ప్లవాలను ఆహ్వానిస్తుంది, విశ్వశాంతిని ఉద్భోదిస్తుంది. పుష్పకంలో ప్రయాణం - ఎందరు ప్రయాణించినా చోటుంటుంది; అన్నిభాషలవారు ఆనందలోకాలలోకి సంచారం చేయడానికి, మంచి హౄదయమే అర్హత టికెట్. డబ్బు లేదు. ఏకత్వం అనే పెట్రోలుతో ఎగురుతుంది. అది చెడితే కూలుతుంది. ఏకంగా వుందాం, విందాం కవిత, లోకాన్ని స్వర్గంచేసి విహరిద్దాం, అని పిలుపిచ్చాడు.
అందుకే దాశరధీ కవితా పయోనిధి. కవితాశరధీ. విశాలహౄదయత్వానికి, మనవతావాదానికి, విశ్వశాంతికాముకతకు, దాశరధి - వారధి.
మహాకవి దాశరథి జయంతి సందర్భంగా - తెలుగురధం శతసహస్ర కవితా నీరాజానాల్ని ప్రణామాలతో నినమ్రంగా సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

నటనారంగ వైభవమూర్తి
మానవుని సౄజనాత్మక ప్రతిభ సుందరరూపంలో వ్యక్తమయ్యేది కళల్లోనే అంటారు సంజీవదేవ్. అయితే కళను కళగా అర్ధం చేసుకున్న కళకారుడికి ఎప్పుడూ సంతోషం లేదు. కళాప్రతిభను ప్రదర్శించే కొద్దీ, యింకా సాధించవలసినది కనపడుతూనే వుంటుంది. ఆ తపనతోనే విషాదమునూ, ఆనందమునూ, అని అంటారు, ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్, తన ప్రముఖ నవల వెన్నెల్లో ఆడపిల్ల లో.
విద్యతోపాటు కళారాధన
మొదటి ప్రపంచయుద్ధం ముగుస్తున్న రోజులవి. అది ఆంధ్రప్రదేశ్, కౄష్ణాజిల్లా లోని నూజివీడు గ్రామం. ఆ రోజు జూలై 3, 1918. సామర్లకోట కోటేశ్వరరావు, లక్ష్మీ నరసాయమ్మ దంపతులకు పుత్రుడు కలిగిన ఆనందలహరిలో తేలియాడుతున్న రోజు. ఏడుకొండలవాని యిలవేల్పువల్ల, ఆ బాలునికి వెంకట రంగారావు అని పేరుపెట్టారు. అతని పేరు యస్.వి.రంగారావు. ఎవరీ రంగారావు అని వేరే ప్రశ్న అడగడం, సమాధానపరచుకోవడం అనవసరం అని నిర్ధారణతో యిక్కడ వివరణ యివ్వడంలేదు. అయితే కోటేశ్వరరావు ఎక్సైజ్ యినస్పెక్టర్ ఉద్యోగి. రంగారావు, పుష్కరప్రాయం కాకుండానే నాటకాలు, రంగస్థలంపై శ్రద్ధను చూపాడు. మద్రాసు పై చదువుకి పంపడం జరిగింది. డిగ్రీ చదువుతున్నా, మనసుమాత్రం నాటకాలు, నటన, సినీమాలతోనే ఆవౄత్తాలు కొట్టేది. చదువయ్యాక, అగ్నిమాపకశాఖలో అధికారహోదాలో ఉద్యోగం దొరికింది. అయితే ఆలోచనమాత్రం - పై చదువా లేక కళారంగంలోకి దూకడమా అన్నదే మీమాంస.
తొలిగా వరించి, వదలిన వరూధిని
బంధువు రామానంనందం పిలుపు మేరకు, ఉద్యోగం కూడ వదలి, తొలిచిత్రం వరూధుని (1946) ని అందుకునేందుకు చేరడం, నటనకు నాందీగా ప్రవరాఖ్యునిగా మారడం, పరాజయంతో నిరాశతో వెనుతిరగడం జరిగింది. అటువంటి చిత్రం వచ్చింది అన్న సంగతే, వెంటనే మర్చిపోవడంతో, ఏ నిర్మాత ముందుకు రాలేదు. జెంషెడ్పూర్ లో టాటా కంపెనీలో ఉద్యోగం చేరినా నాటకాలను మాత్రం మర్చిపోలేదు. 1947లో లీలావతితో వివాహం జరిగింది. తర్వాత, బి.ఎ.సుబ్బారావు నిర్మిస్తున్న పల్లెటూరుపిల్ల చిత్రంలో ఆహ్వానం వచ్చి ప్రయాణం అయితే, తండ్రి మరణించడం వల్ల అంత్యక్రియలు జరిపి, మద్రాసుకి పయనమయ్యాడు. ప్రతినాయక పాత్ర అయినా, ఆయన చేరుకునేసరికి దక్కకుండా పోయింది. జరిగినవన్నీ మంచికని అనుకోవడమే మనిషిపని అన్న ఆత్రేయగారి వాక్యాలు, రంగారావుకు పనికివచ్చాయి. ఫలితంగా, విజయాసంస్థ వారి పాతాళభైరవి లో అధ్బుతమైన నేపాళీమాంత్రికుని పాత్ర వెతుక్కుంటూ వరూధుని కన్న సుందరంగా వరించింది. ఈ పాత్రను రసభరితంగా పోషించడానికి, షేక్స్పియర్ - మర్చంట్ ఆఫ్ వెనిస్ నాటకం లోని షైలాక్ దుష్టపాత్ర శైలి బాగా ఉపయోగించింది అని ఆయనే స్వయంగా చెప్పారట.ఫలితంగా, ఒక ప్రతినాయక పాత్ర చేయి దాటిపోయినా, మరొక మహత్తర దుర్భిణీధారణపాత్రతో పాటు ఢింబకుడు కూడ లభ్యమయ్యాడు. ఆనాటి నుంచే, 'సాహసము సేయరా ఢింభకా' అన్న నానుడి తెలుగుప్రజల నోళ్ళ నిత్యనాట్యం చేసింది. ముందుగా షావుకారు, పల్లెటూరిపిల్ల, నవ్వితే నవరత్నాలు చిత్రాల్లో పాత్రలు విశిష్టమైనవైనా, అసలు మంత్రదండం మాత్రం పాతాళభైరవి తోనే లభించింది.
నిగ్రహం, ఆగ్రహం - వెరసి రంగరంగ వైభవ విగ్రహం
పోషించిన ప్రతీ పాత్రలో సజీవ వైవిధ్యం, వర్ణించనలవికాని నిగ్రహం, విన్నూత్నమైన అహంకారపూరిత సాధికారిత, ఆయన ప్రతిభావంత విగ్రహపాత్ర చుట్టూనే రప్పించుకుని, తిప్పించుకునే ప్రేక్షకుల నయనాలు, ఆచి తూచి కదలాడే కదలీకదలని కదలికలు, హావభావ గంభీర మేని మెలికలు, వాగర్ధావివసంపౄక్తౌ అన్నట్లు ఆయన చెప్పే మాట-అర్ధంల అవిభాజ్య సమ్మేళణం, క్రమశైలిలో, క్రమశిక్షణతో వదిలే సంభాషణాచతురవచోవిలాసశోభాకౄతులు, రంగారావులో మాత్రమే ప్రతీపాత్రలో కనిపించే కనువిందులు. సంతౄప్తి లేని సమరం, కళావేశం, నవరసాలసారాన్ని నాలుగు నిమిషాల్లో ప్రదర్శించగల ప్రతిభానటచక్రవర్తి, సవ్యసాచి, సామర్లకోట రంగారావు. ఆయన పాత్రకిచ్చిన సుదీర్షసమాసాల్ని, సంభాషల్ని, ఎన్నడూ చిన్నచూపు చూడలేదు. రంగారావుగారి నోటనాని, అవి మరింత పునీతమయ్యాయి - రాముడు తాకిన రాయి అహల్యగా రూపాంతరం చెంది ముక్తి,విముక్తి ని పొందడం జరిగాయి.
చిత్రాల వరస .. కొల్లేటి చాంతాడే కదా!
విద్యాధికుడు, కరుణార్ద్రపూరితుడు, మానవతాప్రేమికుడు, కళారాధకుడు అయిన సామర్లకోట వెంకటరంగడు, మరపురాని, మరువలేని, మరువకూడని, నటుడు, దర్శకుడు, నిర్మాత, ఏకంలో అనేకం.
అసాధారణాలు - సాంఘికచిత్రాలు
షావుకారు (సున్నపు రంగడు), పల్లెటూరి పిల్ల (తాత), పెళ్ళిచేసిచూడు (జమిందార్ వియ్యన్న), దేవదాసు (జమిందార్ నారాయణరావు), బంగారుపాప (కోటయ్య), మిస్సమ్మ (గోపాలం), సంతానం (రంగయ్య), తోడికోడళ్ళు (కుటుంబరావు), అప్పుచేసిపప్పుకూడు (దివాన్ బహదూర్ ముకుందరావు), పెళ్ళినాటిప్రమాణాలు (భీమసేనరావు), గుండమ్మకధ (రామభద్రయ్య), వెలుగునీడలు (రావుబహద్దూర్ వెంకట్రామయ్య), మురళీకౄష్ణ (మురళి తండ్రి పాత్ర), ప్రేమనగర్ (జమీందార్ పాత్ర), యిద్దరు అమ్మాయిలు (నారాయణరావు) - రంగారావుగారి నటనాజీవనపుస్తకంలో ప్రముఖ పుటలు.
సాంఘికేతరాలు - పరిపుష్టిత పౌరాణికాలు
పాతాళభైరవి (నేపాళమాంత్రికుడు), చంద్రహారం (ధూమకేతు), అనార్కలి (అక్బర్), వినాయకచవితి (నరకాసురుడు), సారంగధర (రాజరాజనరేంద్రుడు), మాయాబజార్ (ఘటోద్గజుడు), చెంచులక్ష్మి (రెండు భాగాల్లోను - హిరణ్యకశిపుడు), భూకైలాస్ (మాయాసుర), జయభేరి (విజయానంద రామగజపతి), మహాకవి కాళిదాసు (భోజరాజు), హరిశ్చంద్ర (హరిశ్చంద్ర మహారాజు), దీపావళి (నరకాసురుడు), పాండవవనవాసం (దుర్Yఓధన), శ్రీకాకుళాంధ్రమహావిష్ణువుకధ (సుచంద్రసేన మహారాజు), దక్షయజ్ణం (దక్షుడు), నర్తనశాల (కీచకుడు), బొబ్బిలియుద్ధం (తాండ్రపాపారాయుడు), భక్తప్రహ్లాద (హిరణ్యకశిపుడు), సంపూర్ణరామాయణం (రావణ), బాలభారతం (భీష్మ) లాంటి చిరస్మరణీయ పాత్రల్లో నటించిన, కాదుకాదు, జీవించిన, రంగారావుగారు తన నటనాపర్వాన్ని యశోదాకౄష్ణ (కంస) తో భరతవాక్యాన్ని పలికారు.
అల్లు లో మల్లు లాంటి పాత్రలు
ఒకసారి రైల్వే ఫ్లాట్క్ ఫార్మ్ పై ముక్కుపుటాలను తరచు ఎగరేసే విచిత్రవ్యక్తి కదలికలను గమనించి, తనదైన హాస్యాన్ని జోడించిన పెళ్ళిచేసిచూడు చిత్రంలోని దూపాటి వియ్యన్న, మార్క్ ట్వైన్ రచన ఆధారంగా, రాజు-పేద చిత్రంలో దుష్టులపన్నాగాన్ని కనిపెట్టడం, యువరాజు భవితపై కలతచెందడంలో భాషకు అందని భావవీచికల్ని అందించారు. సిలాస్ మేరినర్ రచన ఆధారంగా, బి.యన్.రెడ్డిగారు తీసిన బంగారుపాప లో త్రివేణీసంగమానుభూతుల్తో - అమాయకత్వం, ఆవేశం, శాంతం, మూర్తీభవించిన కోటయ్యగాను, శరత్ చంద్ర నవల నిషృకౄతి నవలాధారంగా తీసిన తోడికోడళ్ళు లో మతిమరుపు లాయర్ కుటుంబరావు పాత్రలో, నమ్మినబంటు చిత్రంలో సాత్వికభూమిక, లాంటి పాత్రలను ప్రపంచంలో సరితూగగల మహానటులను వేళ్ళమీద కూడ లెక్కించలేమేమో!
విశేషాలు, విశిష్టతలు
మొరటుతనం లేని గొప్పదనం వున్న రంగారావు క్రైం, యాక్షన్ చిత్రాలు - దెబ్బకు ఠా దొంగలముఠా, జగత్ కిలాడీలు, జగత్ జంత్రీలు, కత్తులరత్తయ్యలు వైవిధ్యభరితాలైతే, స్వీయ దర్శకత్వంలో చదరంగం, బాంధవ్యాలు - నంది పురస్కారం పొందగలిగిన చిత్రాలను నిర్మించడం సరదా అని చెప్పుకున్నారు. పంజరంలో పక్షులు నాటకంలో నటించడం కూడ విశేషమే అని చెప్పాలి. నాటి, నేటి మేటి కృరీడ - క్రికెట్ అంటే అమితాభిమానం, రవీంద్రుని కాబూలీవాలా పాత్ర వస్తే ఉచితంగా నటిస్తాననడం, పౄధ్వీరాజ్ కపూర్, సి.హెచ్.నారాయణరావు లంటే వల్లమాలిన అభిమానగౌరవాలు, మచ్చుకు చెప్పుకోతగ్గ ఆణిముత్యాలు.
సత్కారాలు, సన్మానాలు
జకార్తా ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవంలో నర్తనశాల లో కీచక పాత్రకు ఉత్తమ నట పురస్కారం, శాన్ సెబాష్టియన్ చిత్రోత్సవంలో నమ్మినబంటు లోని సాత్వికభూమికకు మరువలేని పురస్కారాలు, అందుకున్న రంగారావుగారు, మననటులు మహామహానటులు అనిపించక తప్పదు.
మార్గదర్శి, నటనాలయం, శబ్దకోశం
ఆయన నటన ఒక విశ్వవిద్యాలయం; పాత్రద్వారా చెప్పిన ప్రతీమాట సాధికారికమైన శిక్షణాభాగం; మార్గదర్శి; జ్ణానపధం; వాచికాభినయనం ఒక శబ్దకోశం; పాత్రలకు న్యాయం చేయడం, పాత్రలో జీవించడం, సర్వసాధారణాలు. యింక ప్రత్యేకతలను ఎలా వివరించాలో తెలియని తికమక, అయోమయ పరిస్థితి అని చెప్పాలి.
ఏదైనా, ఏమైనా, ఎనలేని నటనం
సాంఘికం, జానపదం, చారిత్రాత్మకం, పౌరాణికం, ఏదైనా, సరిసములు లేని ప్రతిభానటనాతరంగాలు, కరుణాంతరంగాలు, హౄదయవేదనలు, మనస్సుతో వాదనలు, ఆత్మాభిమానం, అహంకారం, అధికారం, సంపన్నత్వం, నిరుపేదతనం, ఏదైనా సరే, సర్వం ప్రతిభామయం, నటనామయం. దక్షిణభారత చలనచిత్ర పధంలో నవనవోన్మేషనటుడు, అధికుడు, అగ్రజుడు, అధిష్టాత, బలాఢ్యుడు, సామర్లకోట వెంకట రంగడు - అదే మన యశస్వి, యస్వీ. మనందరి యస్.వి.రంగారావు.

అసమాన నటశేముషితో సకలాంధ్రప్రజానీకాన్ని అలరించి, మురిపించిన, రంగారావుగారు, పుట్టిన నెల, జూలై, 18 న తనువు చాలించడం కూడ జరిగింది. ఆయన వ్యక్తిలోని కళకు, కళాభివ్యక్తీకరణానికి, జోహార్లు, నివాళీసహస్రాలు, సుస్మరణాక్షరలక్షలు సమర్పణ చేద్దాం.

నవరస నటనాసార్వభౌముడు యస్.వి.రంగారావు గారి జయంతి సందర్భంగా ఆ మహాఅనటసేఖరుని ప్రతిభాపాటవాలకు జోహార్లని అర్పిస్తూ, శతసహస్ర ప్రణామాల్ని తెలుగురధం సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

Wednesday, July 16, 2008

'దుర్గాబాయీ సేవాతత్పరత - శతజయంతి సమారోహాలు ( 1909 - 1981 )
వ్యక్తికాదు .. ఆమె ఒక సంస్థ
ఆమె ఒక వ్యక్తికాదు, రాణించినసంస్థ. వ్యక్తిగా ప్రతిభావతి. బాల్యంలోనే హిందీలో పాండిత్యఫలితంగా పాటలు, పద్యాలు, నాటికలు, కోలాటాలు, దేశభక్తిగేయాలు నిరంతరం చెప్పే బాలహిందీవిద్వాంసురాలు, వీణావాదనంలో దిట్ట. రంగవల్లులను, రంగులమయంగా ప్రదర్శించడం, నిరంతర పరిశ్రమ, కార్యదీక్ష, పట్టుదల, నిజాయతి లాంటి సల్లక్షణాల్ని సేవాకార్యక్రమాల్లో వినియోగించుకున్న మహిళామూర్తి, మూర్తీభవించిన మహిళామణి.
అలనాటి స్వతంత్ర పత్రికలో, ప్రముఖ సంపాదకుడు - ఖాసా సుబ్బారావుగారు 'దుర్గాబయీవ్యక్తిత్వాన్ని ని యిలా వివరించారు.
" దుర్గాబాయి విసుగు విరామంలేని మహిశి, తన సహచరులను కూడా తనలాగే విరామమెరుగని సేవాతత్పరులుగా ఆవేశపూరితులుగా చేయగల నాయకురాలామె. జీవితంలో ఓటమి వుంటుందమే అన్న భయం, ఆమెకు లేదు ... సహారా ఎడారిలో కూడ ఆమెకు చేయడానికి ఏదో సేవాకార్యక్రమం కనిపిస్తుంది."
దుర్గాబాయి 1909 జూలై 15న రాజమండ్రిలో జననం. తాతగారు మనోహరం పంతులు, సంఘ సంస్కరణాభిలాషి, వీరేశలింగం పంతులుగారికి చాలా అండగా వుండేవారు.
చెరగని ముద్ర వేసిన గాంధీజీ చిరునవ్వు1920లో గాంధి ఆంధ్ర పర్యటన అద్భుతమైన ప్రేరణ కలిగించడం, కాంగ్రేసు నిధికి, గాజులను అందించడం, స్ఫూర్తిమూలాన ఆమె హౄదయాన చెరగని ముద్ర వేసింది. హిందీ పాఠశాల నడవడం, విద్యార్ధినులలో ఆమె తల్లి కూడ వుండడం జరిగింది.
సంస్కరణలకు ఎన్నో సమస్యలుఆ కాలంలో వున్న భోగం మేళాలు, దేవదాసీల దుర్భరజీవితాలు, బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా వుండే ముస్లిం మహిళలు సంప్రదాయాలకు బానిసలై బతకడం మూలాన వెలుగుచూపాలన్న నిశ్చయతత్వం, స్త్రీలకొరకు ప్రత్యేక సభలు లాంటి అంశాలు, దుర్గాబాయి సంకల్పదీక్షాకంకణబద్ధతను మరింత బలపరచింది. విరాళాన్ని సేకరించడం, మహిళలకు ప్రత్యేక సభను నిర్వహించేందుకు ఏర్పాట్లను దుర్గాబాయే స్వయంగా చూసింది. మహిళలు, దేవదాసీలు,పరదాస్త్రీలే వచ్చిన సభలో చేసిన గాంధీ హిందీ ఉపన్యాసానికి, దుర్గాబాయి, ప్రతిభావంతమైన తెలుగు అనువాదాన్ని అందించి చాలా పేరు తెచ్చుకుంది. ఫలితంగా, గాంధితోపాటు దుర్గాబాయి కూడ పర్యటనలను చేయవలసివచ్చింది. ఉప్పుసత్యాగ్రహంలో దుర్గ నాయకురాలు, జైలుశిక్షను అనుభవించింది.
బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి మద్రాసు ఆంధ్ర మహిళా సభ వరకు
పట్టుదలతో ప్రైవేట్ చదువు, ఆంధ్రవిశ్వవిద్యాలయం లో సి.ఆర్.రెడ్డిగారిద్వారా మహిళలకు ప్రత్యేక సదుపాయాలను సాధించడం, మద్రాసులో న్యాయవిద్యను అభ్యసించి, సివిల్, క్రిమినల్ కేసులను చేబట్టి, బాగా పేరు సంపాదించారు. వకీలుపనిచేస్తూ, ఆంధ్ర మహిళా సభ భవన నిర్మాణానికి పూనుకోవడం జరిగింది.
ప్రతిభా సామర్ధ్యసేవలకు గుర్తింపు, రాణింపుదుర్గాబాయి ప్రతిభకు, సమర్ధతకు, వచ్చిన గుర్తింపు కు తార్కాణంగా, రాజ్యాంగసభ సభ్యురాలు, ఉద్దండులతో కలసి ప్రాధమిక హక్కులు, స్త్రీలకు ఆస్తిహక్కులులాంటి అంశాలను రాజ్యాంగంలో చేర్పించారు. 1950 నుంచి విస్తరించిన సాంఘికసేవారంగపుసేవలు, ప్లానింగు కమీషన్ సభ్యత్వం (1952), కేంద్ర సామాజికసంక్షేమసంస్థ అధ్యక్షురాలు(1953), రాణింపులు కాక మరి ఏమిటి?
చింతామణి తో జీవితబంధంమహామేధావి, కేంద్ర ఆర్ధికమంత్రి, డా. చింతామణి దేశ్క్ముఖ్ ని వివాహమాడడంలో ఆచరించిన అతి నిరాడంబరత్వమునకు ఆశ్చర్యాన్ని కలుగజేసింది. దేశ్ముఖుగారికి ప్రపంచ ఆర్ధిక సంస్థ లో వచ్చిన ఉద్యోగం, భారతదేశానికి గర్వకారణమవుతుందని నెహ్రూ భావించినా, దుర్గాబాయి సలహా మేరకు - 'అంత డబ్బు మనకెందుకు? మన దేశపు ప్రజల సేవ చేద్దాం. ఆ పదవి వద్దూ అని దంపతులు తీర్మానించుకోవడం, గర్వించదగ్గ ఆ పదవిని సంతోషంగా వదులుకోవడం, వారి జీవితంలో, భారతీయప్రజల హౄదయాల్లో చెరగని ముద్రగా మారింది.
సరిసములు లేని ఆంధ్ర మహిళాసభ సేవా కార్యకలాపాలుఆంధ్రమహిళాసభ సంస్థ తరఫునుంచి అందిస్తున్న సేవలు - మూడు పువ్వులు, ఆరు కాయలుగా - విస్తరించడం, నర్సింగ్ హోం, ఆర్దోపెడిక్ సెంటర్, శిశువిహార్, నర్సస్ హాస్టల్, మరెన్నో వైద్యశాల భవనాలు, దుర్గాబాయి సేకరించిన విరాళాలతో వెలిశాయి. ఈ సంస్థలనన్నిటికీ, దుర్గ మూలకారకురాలు. దేశ్ముఖ్ దంపతుల ఆస్తియావత్తుని, సేవాసంస్థల స్థాపనకు విరాళంగా యివ్వడం, దాంపత్యజీవితం సేవామయంగా సాగింది. లాయరుగా జమీందారుల కేసులన్నీ కోర్టులో వాదించి, గెలిచి వారినుంచి తీసుకున్న ద్రవ్యాన్ని అంధ్రమహిళాసభకు యిచ్చిన త్యాగమూర్తి శ్రీమతి దుర్గాబాయి.
చరమజీవితంలో కూడ సత్కారసన్మానాలు
వయోజన విద్యావ్యాప్తికి నెహ్రూ లిటరసీ సత్కారం (1971), భారతప్రభుత్వం 'పద్మవిభూషణా సత్కారం (1975) ఆమె అసమాన, నిస్వార్ధ సేవలకు గుర్తింపుగా చెప్పుకోవాలి.
సామాన్యవ్యక్తిగా కాక,మహోన్నత వ్యవస్థగా దేశ ప్రజలకు అజరామరమైన సేవలనందించిన దుర్గాబాయి దేశ్ముఖ్ 1981 మే, 9 న కన్నుమూశారు. అంధ్రమహిళాసభద్వారా అందిస్తున్న సేవాపరంపర, దుర్గాభాయి సంకల్పస్ఫూర్తి, నేటికి భారతీయ ప్రజలను, ప్రత్యేకంగా అంధ్రప్రజలను, సేవాసౌభాగ్యంలో ముంచెత్తుతూనేవుంది.
దేశంలో మహిళలు విద్యావంతులైతే సమాజం అభివౄద్ధి చెందుతుంది. ప్రముఖ సంఘసేవకురాలు దుర్గాభాయి దేశ్ ముఖ్ మహిళలు, పిల్లల అభివౄద్ధికి ఎనలేని సేవలు అందించారు. ఆంధ్రమహిళాసభ నిర్వహణలో 'దుర్గాబాయీ శతజయంతి ఉత్సవాలను జరుపుకోవడం ఆనందదాయకం. ప్రతిభాపాటవాలతో జాతీయఖ్యాతిని పొందిన దుర్గాభాయిని దేశ ప్రజ, ముఖ్యంగా మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి.
పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత - మొట్టమొదటి మహిళామణి దుర్గాభాయి కావడం మరింత సంతోషదాయకం.
దుర్గాభాయి దేశ్ ముఖ్ - శతజయంతి ఉత్సవాల సందర్భంగా - తెలుగురధం ఆ మహామతల్లికి నమోవాకములు సమర్పిస్తూ -
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

Tuesday, July 8, 2008

వ్యక్తిత్వ వికాసానికి బంగారు బాట పరచిన 'పూలబాట'

వ్యక్తిత్వ వికాసానికి బంగారు బాట
పూలబాట
ప్రచురణలు
'మీ జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు స్ఫూర్తినిచ్చే సలహాలు - ఆత్మీయ సూచనలు - ఒక సవినయ సమర్పణాగా 'మానవతా విలువలతో కూడిన వ్యక్తిత్వ వికాసం' అంశంగా తీసుకున్నారు - యిద్దరు ప్రజ్ౙావంతులు, అనుభవజ్ౙులు అయిన ఆచార్య వంగపల్లి విశ్వనాధం మరియు వేగేశ్న గోవిందరాజు, తమ పూలబాట ప్రచురణల ద్వారా. యువతకు, ప్రత్యేకంగా విద్యార్ధిలోకానికి ఒక దివ్యజ్యోతిప్రకాశం గా భావించదగ్గ కరదీపికలు అని చెప్పాలి. భాగ్యనగరం లో నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని విధంగా నడుస్తున్న 'యువభారతీ - సాహితీ సంస్కౄతిక సంస్థ స్ఫూర్తితో, గోరంత దీపం - కొండంత వెలుగు, మంచి పుస్తకం నీడన - మీ మనసెంతో చల్లన, అన్న భావానికి కార్యరూపాన్నిచ్చే దిశలో, కనీసం పది లక్షల ప్రతులు నేటి యువతరానికి అందించాలనే సదుద్దేశ్యంతో, సంత్సంకల్ప లక్ష్యంతో, ముందుకు సాగుతున్నారు - పూలబాట ప్రచురణల కార్యకర్తలు.

పూలబాట ప్రచురణ సంస్థ - ముచ్చటగా మూడు ప్రచురణలు తెలుగులో యువలోకానికి అందించిన తీరు వర్ణణాతీతం. వీటిలోని సారం చెప్పాలంటే అవి ఈ విధంగా వున్నాయి.
'మీ మార్గం - మీ గమ్యం' (కరదీపిక ప్రచురణ)

మానవతా విలువలతో కూడిన వ్యక్తిత్వ వికాసం - 'మీ మార్గం - మీ గమ్యం' అన్న కరదీపిక లో యిచ్చిన సందేశం - 'మీ జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు స్ఫూర్తినిచ్చే సలహాలు, ఆత్మీయ సూచనలు - ఒక సవినయ సమర్పణ చేశారు. 'మీరు ఉన్నతంగా ఎదగటానికి మీకు ప్రపంచం కావాలి, మీరు ఎదిగిన తరువాత ప్రపంచానికి మీరు కావాలీ - అందుకే, ప్రపంచం మీకోసం ఎదురుచేసేలా మీరు ఎదగాలీ అని యువతకు యిచ్చిన స్ఫూర్తిదాయకమైన సందేశం పుస్తకం కవరే ఆకర్షదాయకంగా, ఆలోచనాత్మకంగా వుంది అని చెప్పక తప్పదు. మంచి ప్రేరణాలే మంచి పునాదులవుతాయి, మంచి పునాదులు సత్ఫలితానిస్తాయి అని శుభారంభం చేస్తూ, విఘ్నేశ్వరుడినుంచి మనం పొందే ప్రేరణ ద్వారా అందించిన కరదీపికని చదివి, ఆచరణకు పూనుకుంటే, విజయాన్ని పొందటం సుసాధ్యం అవుతుంది, జీవితం ధన్యమౌతుంది అని ప్రచురణకర్తలు ఆశించినట్లుగానే ఫలితాలు రాక మానవు అని పుస్తకసారమే చెబుతోంది. విజయవంతమైన జీవితానికి, ఆత్మవిశ్వాసం పొంచుకోవటానికి, మంచి ఆలోచనలే మంచి జీవితానికి పునాది అని ప్రేరేపిస్తూ అందించిన 'పరిశీలించదగిన ఆలోచనలూ, ఆలోచనకు స్ఫూర్తినిచ్చే ఆణిముత్యాలు, వీటిని తీరికగా, దౄష్టి, మనసు కేంద్రీకరించి ప్రతీ యువలోకం, యువప్రతినిధి తప్పక చదివి, ఆచరణకు నోచుకొని, జీవితంలో సఫలీకౄతులవుతారని చెప్పక తప్పదు.
కొసమెరుపు

కొసమెరుపు గా, జీవితంలో విజయం సాధించడానికి - 'ఎది నాకై నేను చేసుకుంటున్న నా వాగ్దానం' అన్న సూచనలు పుస్తకానికి ఆకర్షణ అని చెప్పాలి.
అక్షరసేవ

అక్షరరూపంలో 'నారాయణ సేవా అని విన్నవించుకుంటూ, మంచి ఆలోచనలు సమాజానికి మేలు చేస్తాయి, మంచి పుస్తకాలనే చదువుతూ వుండాలి అని వివరిస్తూ - 'వొట్టి మాటలు కట్టిపెట్టి, గట్టి మేల్ తలాపెట్టడానికీ వారి వంతు కౄషి, ఉడతా భక్తిగా మనం చేస్తూండాలీ అని సందేశం యివ్వడం కూడ మరో ఆకర్షణ.
ప్రతిరోజు కొద్దిపాటి సమయాన్ని మంచి పుస్తకాలు చదవటానికి కేటాయించటం మరువరు కదా! అందరూ ఇలా కౄషి చేస్తే, అందరి జీవితాలలోను ఆనందం వెల్లివిరుస్తుంది.
విధిగా షరతులు
ముందుగా మంచి మనస్సు ఉండాలి. ప్రారంభించడానికి కొంచెం ధైర్యం, చొరవ కావాలి. కొనసాగించడానికి చాలా కౄషి కావాలి. పూర్తి చేయడానికి గట్టి పట్టుదల కావాలి.
మీ మంచి మనస్సుని మేల్కొలిపి ముందుకు సాగుతోపొండి - అన్న సందేశంతో, అందరి మంచిని కాంక్షిస్తూ - అందించిన ఈ ప్రచురణ ప్రతీ గౄహ గ్రంధాలయంలో ఉంచుకోవాల్సిన పుస్తకం అని చెప్పక తప్పదు.
'పూలబాటా ప్రచురణ సంస్థకు స్ఫూర్తినిచ్చిన యువభారతి సంస్థ సూక్తి.
'చుట్టూరా ఆవరించుకుని వున్న చీకటిని తిట్టుకుంటూ వూరికే కూర్చోవడం కంటే, ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నయినా వెలిగించడం మంచిది."
మరికొన్ని ఆలోచనలు :
పంచాక్షరి:
- దేశాన్ని అంటే దేశంలోని ప్రజలను, ప్రేమించేవాడు ఎప్పుడూ, తప్పుడు పనులు చేయడు.
- దేశాన్ని ప్రేమించడం, మంచిని పెంచడం - ఈ రెండు లక్షణాలూ, ఏ జాతికైనా, ఎప్పటికప్పుడు చేవను సంపాదించి పెడతాయి.
- నీకు చదువు వచ్చిందంటే, నీ గుండె దీపం వెలిగిందన్న మాట. దీపం మరొక దీపాన్ని వెలిగించినట్లే, గుండె మరో గుండెలో ధైర్యాన్ని నింపాలి. నీకు తెలిసిన జ్ౙానాన్ని ఇతరులకు పంచిపెట్టు. జ్ౙానం ఎంత ప్రసరిస్తే, దేశం అంత సుఖపడుతుంది.
- మన దేశం బాగుపడాలన్నా, మన బ్రతుకు బాగుపడాలన్నా, మనం చిన్నతనంలోనే మంచి అలవాట్లు, మంచి స్నేహం, మంచి మాటలు, మంచి నడవడి అలవరచుకోవాలి.
- రోజూ ప్రొద్దున్నే లేవగానే "నేను బాగా చదువుకొని నా దేశానికి సేవ చేస్తాను. భగవంతుడా! నాకు వివేకాన్ని ప్రసాదించు" అని ప్రార్ధించు.
నిరంత వ్యక్తిత్వ వికాస స్ఫూర్తికోసం - యువభారతి సంస్థ స్ఫూర్తితో, పూలబాట ప్రచురణ సంస్థ చేస్తున్న అక్షరభావజనం లో ప్రతీ వ్యక్తి భాగస్వామ్యం వహించాల్సిన తరుణం.
మంచి పుస్తకాలను నిరంతరం చదువుతూవుండే మంచి అలవాటు - మీకు బలంగా కలగాలనే ఆలోచనతో - లక్షలాఅదిమందికి ఈ పుస్తకం అందించాలన్న 'పూలబాటా సంకల్ప ప్రస్థానానికి ప్రతీ వ్యక్తి చేయూతనివ్వడం, కనీస కర్తవ్యం.
మరిన్ని వివరాలకోసం - సంప్రదించవలసిన చిరునామా:
ప్రతులకు :
శ్రీమతి వి.శ్రీదేవి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బిల్డింగ్, ఫ్లాట్ నెం. 405/బి., రాధాకౄష్ణ ఎస్టేట్స్, కె.పి.హెచ్.బి. కాలనీ, హైదరాబాద్ - 500072. (ఫోన్. 040-23055349. 9989185023/9963896823).
www.yuvabharathipoolabata.org
http:\\photos.yahoo.com/becomingbetterviswam
'పూలబాటా, 'యువభారతీ సంస్థలకు అభినందనలతో -
కొంపెల్ల శర్మ - తెలుగురధం.


Saturday, July 5, 2008

సాంప్రదాయ సంగీత రహదారి కూడలి - మంగళంపల్లి


సంప్రదాయ 'సంగీత రహదారీలో కూడలి 'బాలమురళీ
" జాతి తన చరిత్రలో బాలమురళీకౄష్ణ ను కనుగొనడం తరచుగా జరగదు " - స్వామి చిన్మయానంద
శంకరగుప్తం నుంచి షెవాలియార్ దాకా
...
కర్ణాటక సంప్రదాయ సంగీతపు ప్రస్థానంలో పద్మశ్రీ, పద్మభూషణ్, ప్రముఖ సంగీత విద్వాంసులు, వాగ్గేయకారుల జాబితాలోకి నిస్సందేహంగా చేరగలిగిన అర్హత, అధికారం తన ప్రతిభాపాటవాల ద్వారా సంపాదించుకున్న, 'మంగళంపల్లి బాల మురళీకౄష్ణాగారి ప్రయాణం 'శంకరగుప్తం' నుంచి 'షెవాలియాఋ వరకూ సాగుతూ, వడివడిగా దూసుకుపోతూ, తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఆస్థాన విద్వాంసులుగా పున:నియామకం చేయడం వరకూ వచ్చింది. ఈ ప్రస్థానానికి మలుపు మరెప్పుడో, మరెక్కడికో. కళాప్రతిభ ఎటు పయనం చేయిస్తే, కళాకారుడు ఆ దిశలో అనుసరించ వలసినదే తప్ప, కళాకారుడికి స్వేచ్చాస్వాతంత్ర్యాలు సన్నగిల్లుతాయి; కళకు అంకితమవ్వడమే ప్రధానం అవుతుంది. ఆ కళాంకితజీవనంలో, బాలమురళీకౄష్ణ గారి కళాజీవనయత్రలో సంగీత రసికులు ఎన్నెన్ని నవనవోన్మేష ప్రతిభాకలికితురాయిలు దర్శనమవుతాయో వేచిచూడాలి. నడచిన నవ్యపధం
సంగీత సౄష్టికారుడు, రాగనిర్ధారకుడు, వాగ్గేయకారుడు, సంప్రదాయ సంగీతకళాకారుడుగా సరిసములు లేని విశిష్ట ప్రతిభాపాటవాల్ని ప్రదర్శిస్తున్న మంగళంపల్లి, కర్ణాటక సంప్రదాయ సంగీతానికి ఆద్యులైన త్రిమూర్తులుగా చరిత్రలో నిలచిన త్యాగరాజు (1767), ముత్తుస్వామి దీక్షితార్ (1775), శ్యామశాస్త్రి (1763) (యాదౄచ్చికంగా ముగ్గురూ తిరువారూర్ జన్మస్థులు) ప్రసాదించిన శైలీ సంప్రదాయ పద్ధతుల్ని, పున:సౄష్టి యధాతధంగా గావించిన ఘనత బాలమురళిదే. కర్ణాటక సాంప్రదాయ తరానికి నిలచిన ప్రతినిధి నడచిన బాట కడు 'నవ్యతాను కూడ సాధించడం సంగీతచరిత్రలో ఒక మైలురాయి. సంప్రదాయ సంగీతయానం రహదారి ద్వారా సాగిపోతుంటే, ముఖ్య మజిలీ చేయవలసిన కూడలి, మంగళంపల్లి అని చెప్పవచ్చు. గతంలోని ఘనవారసుల్లాగే, బాలమురళి, సంప్రదాయ సంగీతశైలిని, ఆయనదైన ప్రత్యేక విధానంతో పరిరక్షించడం జరుగుతున్నది. త్రిమూర్తులకు సాధ్యమైన సంగీత విప్లవాత్మక ధోరణులను, ఆసాంతం కాపాడడమే కాకుండ, బాలమురళి తన స్వంత కౄతుల నిర్మాణం, ప్రసిద్ధ రత్నరాగాల్లో పొదిగి, అంతవరకూ రాని రాగాల పట్టీలు వేసి, వాటిలో కీర్తనలను రచించడం, తనకు తాను కొత్తరాగాలను సౄష్టించుకోవడం పట్ల మంగళంపల్లి గావించిన 'నవ్యపధం' నిజంగా కొత్తపుంతలు తొక్కింది. త్రిమూర్తుల కీర్తనలను పరిశోధించి, సాధనతో, పరిరక్షణకు పూనుకున్న సంగీతపునీత నవవ్యక్తిత్వం బాలమురళిగారిది. దివ్యనామ, ఉత్సవ సంప్రదాయ కీర్తనలను - త్యాగరాజ విరచితాలు - 90కి పైగా తానుగా, యితర విద్వాంసులతోపాటు గానం చేస్తూ, ప్రచారం నిరంతరంగా చేయడం జరిగింది. 'అభేరీ రాగంలో నిర్మించిన 'నగుమోమూ త్యాగరాజ కీర్తనకు సహజధోరణిని, పున:ప్రసాద సౄష్టిని, గావించిన ఘనత నిస్సందేహంగా బాలమురళీకౄష్ణదే అని సంగీతచరిత్ర చెప్పుతున్న నగ్నసత్యం. అన్యరాగంతో ఆ కీర్తన పాడి, రమారమి స్తబ్ధత్వదశకు చేరుకున్న తరుణంలో వారి కౄషి సంగీతపధంలో మరువలేని మైలురాయి. త్యాగరాజ కీర్తన 'వరలీల గానలోలా (శంకరాభరణ రాగం)తో పోల్చతగిన 'మంగళం' కౄతికి కూడ పునర్జన్మ ప్రాప్తి ప్రసాదించారు. కంచర్ల గోపన్న పేరున రచించిన రామదాసు కీర్తనలకు వాడుకలోని శౄతులకు కౌశలత్వాన్ని జోడించిన ఘనత కూడ ఈ విద్వన్మూర్తిదే అని వక్కాణించాలి.
అన్నమాచార్య కీర్తనలకు బాలమురళి స్వర, గాత్ర ప్రచారంఅన్నమాచార్య కీర్తనలకు సకల ప్రోత్సాహ, ప్రోద్బల ప్రచారాన్ని కలిగించిన ఘనకీర్తి కూడ యీ సంగీత సుసంపన్నకారుడిదే. ఆయన వాక్యాల్లో ప్రస్తుతిస్తే, 'అన్నమాచార్య కీర్తనల గురించి నాకు ప్రధమంగా 1950ల్లో శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, నా యింటికి వచ్చి,కొన్ని ఎంపిక చేసిన కీర్తనలను యిచ్చి, వాటిని స్వరపరచి, ప్రచారం చేయవలసినదని నన్ను ఆడగడం వల్ల అన్నమాచార్య కీర్తనలతో మొట్టమొదటి సాన్నిహిత్యం కలిగింది. ఆ రోజుల్లో ఆకాశవాణిలో పని చేస్తున్నప్పుడు, పది కీర్తనలను, స్వరపరచి, 'భక్తిరంజనీ కార్యక్రమంలో శుభోదయ తరుణాన గానం చేయగా ప్రసారం జరిగేది. అతివేగంగా పేరు పొందిన యీ కిర్తనలకు చేకూర్చిన స్వరశైలి నేటివరకు ఆ గుభాళింపు ఏమాత్రం తగ్గలేదు. గతం ఏభై సంవత్సరాలుగా ఎన్నో అన్నమాచార్య కీర్తనలను స్వరపరచడం జరిగింది. అన్నమయ్య పదకీర్తనా సాహిత్యాన్ని పరిశీలిస్తే, సులభతర సాహిత్యం, భాష ప్రయోగించినా, నేటి భాష వాడుక విధానంలో ఎన్నో పదాలు అదౄశ్యమయ్యాయి. కవితా విలువలున్న గొప్ప వాగ్గేయకారుడు అన్నమయ్య. అన్నమయ్య కీర్తనలకు, విసృతౄత వివరణలు, విశ్లేషణాత్మక వ్యాఖ్యానం, భావసౌందర్యం, వెల్లడించవలసిన అవసరం వుంది అన్న భావన వున్న వారిలో నేను ప్రధముడనూ అని అన్నారు. యీ అభిప్రాయాన్ని పరిశీలిస్తే, బాలమురళి దౄష్టిలో అన్నమయ్యకిచ్చిన ప్రత్యేకత ప్రశంసనీయమైన ఔచిత్యం. అనేక కీర్తనలకు ఆయన స్వంత శైలి, బాణీల్లో ప్రచారం చేసి పేరుపొందారు. బాలమురళిలో సంగీత మేధస్సుతో పాటు కవి హృౠదయం కూడ 'నాగబంధం' మాదిరి అవిభాజ్యంగా అలరిస్తూంటూంది. సంవాదం, వివాదం, ఏదైనా వాదానికి దారితీస్తాయి అన్నది సంగీతరంగానికి కూడ వర్తిస్తుంది. ఆయన రాగనిర్దేశ పద్ధతులకు అన్యభాష్యం గావించిన వారు కూడ దర్శనీయమైనారు. ప్రాచీనరాగాలకి కొత్తతరహా లో జీవింప చేయడానికి కౄషిసలిపి, సత్ఫలితాలని పొందారు. కొత్తరాగాలు సౄష్టించిన వాటికి కూడ మిశ్రమ స్పందన లభించిందన్నది మాత్రం నిర్వివాదాంశం. విమర్శలకు కారణాలు - రాగమునకు పంచ స్వరములు కనీసం వుండాలన్న ప్రాచీన శాస్త్రాంశానికి, నూతన వరవడిని కలిగిస్తూ - 'స, మ, పా లతోనే రాగసౄష్టి చేశారు అని సంగీత విమర్శకులు అడపా తడపా చెప్పుకున్న సందర్భములు లేకపోలేవు అని ఒక భావన. 'ఎన్ని రాగాలుండాలన్నది కాదు, ఎంత వీనులవిందుగా చెవులకు తాకాలీ అన్నది ఆయన ముఖ్యభావన అని తెలుస్తున్నది. మూడు స్వరములతో కూర్చిన రాగాలు చాలా శౄవణ సుభగత్వమును కలుగచేస్తున్నాయని చాలామంది సంప్రదాఅయ సంగీత ప్రేమికులు, రసికులు, తమ అభిప్రాయం కూడ వెలిబుచ్చడం జరిగింది.
మంగళంపల్లి జీవన మహాప్రస్థానం


ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా, అందులోనూ, కోనసీమ, కొనగా, కోనలోనున్నా, బహువిధాలుగా నిత్యం అలరారుతున్న సుసుపన్న సాహితీ, సంస్కౄతిక సీమ ఆ కోనసీమ. ఆ కొనసీమలోని రాజోలు తాలూకా, 'శంకరగుప్తం' లో జననం చేసాడు బాలమురళి. పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ పుణ్యదంపతులకు 1930 జూలై 6 న జన్మించిన మగబిడ్డకు 'మురళీకౄష్ణా అని ముద్దులమోహనకౄష్ణుడి పేరు పెట్టారు. కాని దుఋరదౄష్టవశాత్తూ, పురిటిపొత్తిళ్ళనుంచి బయటపడిన పక్షపురోజుల్లోనే తల్లిని పోగొట్టుకున్నాడు మురళీకౄష్ణ. అత్త సుబ్బమ్మ ప్రేమవాత్సల్యాలతో పెరిగాడు. రెండేళ్ళప్రాయంలో తండ్రి విజయవాడకు నివాసం మార్చారు. తండ్రి వేరే విద్యార్ధులకు సంగీతశిక్షణ యిచ్చే విధానంలోనుంచి, సంగీతంలో తొలి మెలకువలను మురళీకౄష్ణే స్వయంగా ఆకళింపు చేసుకున్నాడు. ఆంటే, తల్లివొడిని, కొంగుని పట్టుకుని తిరిగే పసిపిల్లల వయసులేనే సంగీతకళపై మక్కువను ఆకళలోని లోతును గ్రహించకుడానే ఆకళింపుచేసుకోవడం, వింతల్లో వింత, మనవిశ్వంలో ఎనిమిదవ వింత, విడ్డూరం అనే చెప్పాలి. ఈ విడ్డూరపు ఆసక్తిని గమనించి, తండ్రి గాయక సార్వభౌమ, పారుపల్లి రామకృౠష్ణయ్య పంతులు గారివద్ద సంగీతాభ్యాసానికి వినియోగించబడ్డాడు. సంగీతవిద్యలో అల్పకాలంలో అనల్పసోపానాలను అధిరోహించిన మురళీకౄష్ణ, ఐదేళ్ళప్పుడు, సంగీతకచేరీ చేస్తుండగా, పరవశించిన, ప్రముఖ హరికధావిద్వాంసులు ముసునూరి సత్యనారాయణగారు, బాలుని ప్రతిభను మెచ్చి, నువ్వు మురళీకౄష్ణవు కాదు, నేటినుంచి బాలమురళీకౄష్ణవు అని అన్నప్పటి క్షణంనుంచి, మంగళంపల్లి మురళీకౄష్ణ - మంగళంపల్లి బాలమురళీకౄష్ణ, గా మారిపోయారు. 1938 లో ఎనిమిదేళ్ళ బాలమురళి, విజయవాడలోని ఒక దేవాలయ ప్రాంగణంలో, బాలమురళి మొదటి సంగీతకచేరీని ప్రదర్శించారు. మురళీకౄష్ణ విద్యాభ్యాసం గురించి చెప్పక, బాలమురళి బాలకళాకారుడి గురించి చెప్పడం జరుగుతోంది; బాల కళాకారుడికి వరసగా కచేరీలకు ఆహ్వానం అందుతున్న వలన, తండ్రి హితులు, తన చిన్న కుమారుడిని, అంటే బాలమురళిని సంగీతానికే అంకితమవనివ్వమన్న సలహామేరకు, ఆరవ తరగతి వరకే లౌకిక విద్యకు స్వస్తి చెప్పి, విశ్వవిఖ్యాతకళారంగంలో అజరామరమైన సంగీతకళపైనే దౄష్టిని కేంద్రీకరింపచేశారు.బాలమురళి సంగీతకళాప్రస్థానంతండ్రి పట్టాభిరామయ్య సంగీత విద్వాంసుడేకాక, వేణువు, వైలన్, వీణలపై వీనులవిందుగా సంగీతాన్ని వినిపించేవారుట. తల్లి కూడ ప్రసిద్ధ వీణావాద్య కళాకారిణి. మరి బాలమురళిది, విశిష్ట గళ సంపద - సరస్సస్వరసురఝరీగమనాదముతో బాటు, వైలన్, వైయోలా, కంజీర, వీణ, మౄదంగ వాదనంలో కూడ నిష్టాతుడు. అవకాశం వస్తే, ఆయన గాత్రకచేరీకి, స్వయంగా సహకార సంగీత వాద్యములను చేకూర్చుకుని ఆయన రాగాలకు తాళ, లయలను కూడ అందించుకునే అర్హత, అధికారం, ఆయనకున్నాయన్నదాంట్లో అతిశయోక్తి లేదు, కాదు. సద్గురుత్వంలో, అష్టవర్షప్రాయుడు సమగ్ర సంగీతకచేరీని ప్రదర్శించిన బాలమురళి గానగంధర్వుడు కాక మరేమిటీ! అంతేకాదు, పదునాల్గేళ్ళకే, సంగీతశాస్త్రంలోని 72 సంపూర్ణ మేళకర్తరాగాలకు రచనలను చేయడం , ఫలితంగా, 'రాగాంగ రవళీని సౄష్టించడం జరగడం, సంగీతపరంగా అత్యద్భుతం అని చెప్పాలి. నిరంతరం జరిగిన ఈ సాధనలో, అనేక రచనాకౄతులను నిర్మాణం కావించి, రాగాలాపనాస్వర నిర్ధారణ ప్రక్రియలో గణనీయమైన స్థానాన్ని పొందగా, వాటిలో వర్ణములు, కౄతులు, జావళీలు, ఆధ్యాత్మక, దైవపరగీతములు, తిల్లానాలు, ఎన్నో ... మరెన్నో, సంప్రదాయ సంగీత వినువీధుల్లో నిత్యం, నిరతంరం వీరవిహారం చేస్తూనే వున్నాయి, వుంటాయి.నవ్యరాగసౄష్టి .. నవపధనిర్దేశకుడు, నిర్ధారకుడురమారమి 400 పైగా రాగరచనలను విరచించిన బాలమురళిగారు, అనేక నూతన రాగాలను కూడ సౄష్టించడం జరిగింది. వాటిలో ప్రముఖంగా తరచు పేర్కొనబడేవి - గణపతి, మహతి, సుముఖం, త్రిశక్తి, సర్వశ్రీ, ఓంకారీ, జనసమోదిని, మనోరమ, రోహిణి, వల్లభి, లవంగి, ప్రతిమధ్యమావతి, సుషమ, మొదలైనవి. అంతేకాకుండా, కేవలం, మూడు, నాలుగు స్వరాలతో, నూతన తాళవిధానంతో, తనదైన ప్రత్యేకతలను ప్రవేశపెట్టారు. మన సమాజం మూసపోసినతీరు అన్నదానికి యిది ఒక మచ్చుతునకైన ఉదాహరణ. సంస్కరణలు కావాలంటారు. మార్పులు జరుగకూడదు. ప్రయోగాలద్వారా వచ్చే ప్రయోజనాలను హర్షించడం అన్నది అహ్వానించరు. ఈ తరుణంలో, బాలమురళిగారి నూతన ప్రయోగాలపై, విమర్శలు రావడం కూడ జరిగింది. అయితే, హిందూస్తానీ సంగీత కళాకారులు, కాకలు తీరినవాళ్ళు - భీం సేన్ జోషీ, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, కిషోర్ అమాంకర్ లాంటి ఉద్దండులతో జూగల్బంది సంగీతకార్యక్రమాల్లో పాల్గొనడం, వాటిద్వారా అనుభవించిన బాలమురళి ప్రతిభకు వీరందరు హారతిపట్టారు. యింక భాషామాధ్యమాల గురించి ప్రస్తావించాలంటే, బాలమురళిగారి మాతౄభాష అయిన తెలుగులో కాకుండా, కన్నడ, తమిళం, సంస్కౄతంలో అత్యద్భుతప్రతిభతో గానం చేయడం జగద్విదితమే. త్రిమూర్తుల ప్రతిభపై అపార పరిశోధనసంగీత త్రిమూర్తుల మీద బాలమురళికున్న భక్తిప్రపత్తులు అగణితం. ముఖ్యంగా త్యాగరాజు విషయానికొస్తే, కేవలం దైవకౄప వల్ల రచనలు జరిగాయని కాకుండా - త్యాగరాజు కౄతులను రచించిన తీరుతెన్నులు, వివిధ అంశములపై విశిష్ట పరిశోధనాత్మక విశ్లేషణ గావించిన ఫలితంగా, కొత్త రాగాలను సౄష్టించడంలో కాని, మునిపెన్నడూ వరసకట్టని రాగాలకు నిర్దేశతను కలిగించడం, ముందు తరాలవాళ్ళు కూడ ఈ కార్యం చేబట్టబోరేమో అన్న ఆదుర్దా, అందోళణ, ఆత్రం,వెరసి బాలమురళిలో 'నవనవోన్మేష శైలీసహిత సంగీత విద్వాంసుడిని ప్రతిష్టింపచేసేలా ప్రేరణాప్రభావాలు ఆవరించాయి. ఆ ప్రేరణాత్మక ప్రజ్ణాన ప్రతిభా సంపత్తులు - ఆయన కర్ణాటక సంప్రదాయ సంగీత పధంలో అలవోకగా బహువిధ విజయాల్ని కైవసం చేసుకోగలిగాడు.
బాలమురళి సాహిత్య, సంగీత రచనావళిలో కొన్ని రసపుంతలు
బాలమురళి వారసత్వంగా వస్తున్న వాగ్గేయకార లక్షణాలను పూర్తిగా సంతరించుకున్న మంగళంపల్లి 72 మేళకర్త రాగాలలో, రాగానికి ఒక్కొక్క కౄతి చొప్పున వివరిస్తూ, 'జనకరాజకౄతిమంజరీ అనే సంగీత రాగలక్షణ గ్రంధరచనను చేశారు. సంస్కౄతాంధ్రములలోనే కాక, తమిళంలోనూ కీర్తనలను నిర్మించారు. స్వయంగా సౄజించిన 'మోహనాంగీ రాగంలో - నీనామమె నా జీవనము, సుధామధురం, అన్న కౄతిని రూపకతాళంలో స్వరపరచిన తీరు,మధుర మంజుల సురభిళమై సంగీత సాహిత్యాలలో కొనసాగుతూనేవుంది, వుంటుంది. ఎన్నో దేశ, విదేశ, విశ్వభరితంగా సంగీత కచేరేలను నిర్వహించి, సన్మాన సత్కారాలను పొందిన, పొందుతూన్న, బాలమురళి సంగీత సాహిత్య సౌరభాలను చవిచూడ్దానికి మచ్చుకు కొన్ని తునకలను సోదాహారణంగా వివరించాలంటే, ఎవరికైనా, ఏ సంగీత విద్వాంసులకైనా కత్తిమీద సాముగా పరిస్థితి ఎదురవుతుంది అన్నది నగ్నసత్యం. అయినా మచ్చుకు కొన్ని -
'గమనశ్రమా రాగం - చాపుతాళంలో - ఎన్నిమారులు నే విన్నవించిననూ, మిన్నకుండుట నీకు న్యాయమా, అన్న కౄతి వీనులవిందైన సొంపుతోపాటు, గజేంద్రమోక్ష కధ స్మరణకు వచ్చి, రసికులను అమితానంత పరచి, మానసికంగా కూడ ఆహ్లాదపరచేదనడం అనుభవశీలురు అనుకునే నిత్యసంభాషణం.
'సింహేంద్రమధ్యమారాగం - ఆదితాళం - 'మరకత సింహాసన నరసింహా, దురితచిత్త గజసింహ, పాపి, అన్నది బాలమురళి గానరవళి, తెలియని ఊహాలోకాల్లోకి ఓహో అనిపించేలా విహరింపచేసి, ఉల్లాసపరుస్తుంది.
కవితావెల్లువై ప్రవహించిన భావగీతం - కళ్యాణ రాగం - ఝంపెతాళం - సొగసు నీ సొమ్ము కళ్యాణి రాగిణి, వగలు విరజిమ్ము నా భావజాలమ్ములో, అన్న కౄతి భావం, భావన, భాష, సంగీతంతో త్రివేణీసంగమంచెంది, సంగీతరసహౄదయాల్ని రాగరంజితం చేసి, ఆనందాతిశయమై, రసస్ఫూర్తికి దోహదం చేస్తుంది - బాలమురళి మంగళరవళీసంగీతగానం అన్నది సహజోక్తి.
రవీంద్రసంగీత గీతాంజలి కి బాలమురళి సంగీత స్వరాంజలిఅనేక బహుమతులను పొందిన బ్రిటిష్ సంగీతబౄందంతో కలసి, బాలమురళి ఏకైక గళంతో రవీంద్రసంగీత గీతాల్ని, నోబెల్ బహుమతినందించిన గీతాంజలి గీతాలనాధారంగా, గానాన్ని ప్రదర్శించిన తీరు విశ్వవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టింది. ప్రపంచ ప్రఖ్యాత సంగీతదర్శకుడు డా.జోయల్ సంగీతం మరింత వన్నెను తెచ్చింది. సంస్కౄతంతో సహా, వివిధ భాషల్లో గానం చేసే సంగీతగాత్రశోభ, స్వరమాధుర్యాం, ఉచ్చారణాశైలాదులవల్ల ప్రభావితులై, అపరిమితానందభూతులై, వంగప్రజలు. సర్వసమగ్ర రవీంద్రసంగీత రచనల్ని, బాలమురళి గాత్రస్వరమాధ్యమంలో సుప్రతిష్ట చేసుకోవడం పట్ల, ఆయనసంగీతకళాప్రతిభపై వంగప్రజలకున్న అభిమానం, గౌరవం, వర్ణించడానికి మాటలను ఏ శబ్దకోశంలోంచి ఏరుకోవాలో మరి! మన ఆంధ్రప్రజలు తమ ఆత్మగౌరవాన్ని, సంస్కౄతీసంప్రదాయాల్ని సంగీతపరంగా ఎప్పుడు పరిరక్షించుకోవాలని ప్రణాలికలు వేయడానికి ఎప్పుడు సన్నాహం అవుతారో, ఆ ప్రయత్నాన్ని ఆచరణలోకి తెస్తారో, సర్వోత్కంఠభరిత నిరీక్షణ కాక మరేమిటి? కేవలం సంప్రదాయ కర్ణాటక సంగీతమే కాదు, ఫ్రెంచ్ భాషలో, జాజ్ సంగీతశాఖలోనూ తమ ప్రతిభను ప్రదర్శించారు. ప్రముఖ కర్ణాటక సంగీతవాద్య కళాకారుడైన టి.హెచ్. సుభాష్ చంద్రన్ తో మలేషియాలో ప్రదర్శన యివ్వడం కూడ యిందులో భాగమే.సంగీతం దివ్యౌషధంసంగీతం దివ్యౌషధం అన్న నానుడి, వేదోక్తపరమైనది. శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి: గానరస: ఫణి: - సంగీతానికి శిశువులు, పశువులు, ఆనందంతో, ఉక్కిరిబిక్కిరితో, తలలూపుతాయట. యిక ఆరోగ్యం విషయానికొస్తే, మ్యూజిక్ థెరఫి విధానం మరింత ప్రాధాన్యం వహించడం, ఈ పధంలో మన బాలమురళిగారు కూడ విశేషకౄషిని సల్పడం కూడ అందరికీ తెలిసున్నదే. ఈ సందర్భంగా, కచేరేలను నిర్వహించడం కూడ జరిగింది. మరింత కౄషి ఈ రంగంలో జరిగేందుకు, బాలమురళి, ప్రదర్శన కళలు, పరిశోధనాసంస్థను స్థాపించి, స్విడ్జర్లాండ్ లాంటి దేశాల్లో ప్రేరణను తెస్తున్నారు. యం.బి.కె.ట్రష్టు ద్వారా, కళ, సంస్కౄతి, సంగీత రంగాల్లో పరిశోధనలు మరింత విస్తౄతస్థాయిలో జరిగేందుకు దోహదపడడానికి కౄషిని చేస్తున్నారు. సంగీత, నౄత్య శిక్షణాసంస్థ, 'విపంచీ ని కళైమామణి సరస్వతి నిర్వాహణలో సేవాసంస్థ భాగంగా నడుస్తున్నది. ఈ సంస్థద్వారా, ఎందరో యువ, వర్ధమాన కళాకారులను వెలుగులోకి తేవడంలో బాలమురళి సేవలు ప్రశంసనీయం.
బాలమురళి ప్రతిభాగౌరవాలకి తార్కాణాలు
మంగళంపల్లి వారిని భారతదేశం, ఉత్తమ పురస్కారం, పద్మవిభూషణ్ తో సత్కరిస్తే, ఫ్రెంచి ప్రభుత్వం - షెవలియార్ డేస్ ఆర్ట్స్ ఎట్ డేస్ లెటర్స్ - అన్న సర్వోత్కౄష్ట పురస్కారంతో, ప్రప్రధమంగా ఆసియావాసి కళాకారుడిగా బాలమురళీకౄష్ణగారిని సన్మానించడం సంగీతకళకే గర్వకారణం. అంతేకాక, కేవలం 2006 లోనే ఏడు విశ్వవిద్యాలయాలనుంచి గౌరవ డాక్టరేట్ల బిరుదుల్ని, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయపు అధ్యక్ష్ పదవిని, అసంఖ్యాకమైన సంగీతపరంగా సత్కార సన్మాలని, ముఖ్యంగా మద్రాసు మ్యూజిక్ అకాడమీ వారి సంగీతకళానిధి పురస్కారాన్ని బాలమురళీకౄష్ణగారిని వరించాయంటే ఆయన ప్రతిభకు పట్టం కట్టినట్లే కదా. శ్రీరాజ-లక్ష్మి పురస్కారం, మానవ సేవా కేంద్రం సత్కారాన్ని పూజ్యులు శ్రీ గురూజీ విశ్వనాధ్ గారి చేతులమీదుగాను అందుకున్నారు. ఆయన స్వంతనగరమైన విజయవాడ మొదటి పౌరుడుగాను, ఒక వీధిని మంగళంపల్లివారి మార్గం గా ప్రకటించడం కూడ హర్షించదగ్గదే.
యింకా ఎన్నో, మరెన్నో, సత్కారాలు, బిరుదులుగానసుధాకర, గాయక శిఖామణి, సుర్ సింగార్, గీతకళాభారతి, సంగీతనాటక అకాడమీ పురస్కారం, సంగీత కళానిధి, పద్మశ్రీ, పద్మవిభూషణ్ లు ఒక తీరు అయితే, 1992 లో ప్రజ్ణానవంతుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆత్మగౌరవం పురస్కారం, మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి జాతీయసమైక్యత పురస్కారం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వాల ఆస్థానసంగీతకళాకారుడిగా నియామకం, శౄంగేరీపీఠం, చెన్నై-నంగనల్లూర్ లోని ఆంజనేయస్వామి దేవస్థానపు ఆస్థానవిద్వాంసుడుగా నియమింపబడ్డారు.
తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆస్థానసంగీతవిద్వాంసులుగా, మంగళంపల్లి పూర్వం నియమించడం, తిరిగి యిటీవలే పున:నియామకం జరగడం, స్వంతగడ్డపై మంగళంపల్లి వారికి లభించిన గౌరవం ఆనందదాయకం. మంగళంపల్లి వారికి కలియుగదేవుని శుభాశీస్సులు పుష్కళంగా లభించాలని అందరూ సామూహికంగా ఆ ఆదిదేవుని ప్రార్ధించాలి.
విశ్వసంగతకళాయానంబాలమురళిగారిని ఆహ్వానిస్తూ, ప్రపంచంలోని రమారమి అన్ని దేశాలు తన సుమధురసంగీతంతో తరింపచేయమని, అమెరికా, కెనడా, యుకె, యిటలీ, ఫ్రాన్స్, రష్యా, శ్రీలంక, మలేషియా, సింగపూర్, మిడిల్ ఈష్ట్ లాంటి దేశాలు కోరడం, వారి కోరిక తీర్చుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా, 26000 కు పైగా సంగీతకచేరీలను ప్రదర్శించారు అన్న శుభవార్త మనసుకు, చెవులకు, గుండెలకు తాకితే, హిమశైలశిఖరం పైకి అధిరోహించి సంగీతనౄత్యరూపకంలో భాగస్వామ్యం వహించినంత ఆనందానుభూతి కలుగుతోందంటే అతిశయోక్తి లేదు, కాదు. కేవలం సంగీత క్యాసట్ల ముద్రణాసంస్థ వరే 250కి పైగా విడుదల చేయడం కూడ హర్షదాయకం.బాలమురళిపై కవితాభిమానంసంగీతాభిమానులు, ప్రేమికులు, సంగీత కార్యక్రమాలను వీక్షించలేని పరిస్థితి వచ్చినప్పుడు, భౌతికంగా వారి ప్రేక్షకత్వం లేకపోయినా, వారి మనస్సు మాత్రం బాలమురళి సంగీత సభాస్థలిలో పరోక్షంగా అదౄశ్యసంచారం చేస్తూనే వుంటుంది. అటువంటి అవాంతర పరిస్థితిలో, ప్రముఖ నాట్యకళాకారదంపతులు - వసంతలక్ష్మి - నరసింహాచార్యుల ద్వయం బాలమురళిపై కవితాభిమానాన్ని ప్రకటించి, సందేశం పంపించడం పట్ల, మురళీకౄష్ణగాత్ర సౌందర్యాన్ని అనుభూతి చెందవలసినదే కాని, వర్ణనాతీతమని చెప్పాలి.ఆ సందేశం యిలా వుంది.''మంగళంపల్లి మహిమాన్వితంబయ్యె,మన సంగీతమున కెందు సాటి లేదనుచు, చిరుప్రాయమునాడె రచియించి పాడితివి, చెన్ను మీరగ మేళరాగమాలికను, అనగననగ రాగమతిశయిల్లుచునుండ, అతులమౌ తీపి నీ గళము నింపొంద, ఉన్న బిరుదుములన్ని నీ సొమ్మె కాగ, ఉలికిపడి ఘనులెల్ల దీనులైరి. బాలమురళివి నీకు ముదిమి లేదయ్య, భావి సంగీతంపు బాట నీదయ్య, ఆయురారోగ్యముల్ సిరిసంపదలతో నిన్ను, ఆనందముగ బ్రోచు ఆ నల్లనయ్యా'బాలమురళి గారి సంగీతకళాప్రాభవాన్ని నిలువుటద్దంలో చూపించాలంటే అనేక భావకవితలు వెల్లి విరుస్తాయి. సంగీత ప్రతిభాభావలహరి నిరంతరంగా ప్రవహిస్తూనే వుంటుంది. ఆ ప్రవాహాన్ని నిరోధించే, నియంత్రించే శక్తి,యుక్తి, ఈ ధరణి కొనసాగుతున్నంతకాలం అసాధ్యం.సంగీతకళ గురించి బాలమురళిగారి మాటల్లో చెప్పాలంటే ...
సంగీతం నాకు తెలియదు - సంగీతానికి నేను తెలుసును.
సంగీతంతో పాటు, సాహిత్యానికి, అర్ధానికి, భావానికి ప్రాధాన్యం యిస్తూ కౄతిని ఆలాపన చేయాలి. రాముని పై కౄతి, రామునే స్మరించగలగాలి, అన్యునిగాదు.
కర్ణాటక సంగీతాన్ని, దక్షితభారత సంగీతంగా పిలవాలి.
మా నాన్నగారు వైలన్ విద్వాంసులు. ఆయన పరికరాన్ని ఎప్పుడూ ముట్టుకోనిచ్చేవారు కాదు. ఆయన ఊళ్ళో లేనప్పుడు, మొట్టమొదటిసారిగా, పూర్తిగా వర్ణం ను ప్రదర్శించుకోగలిగాను. కేవలం ఆయన వాయించడంలో శ్రద్ధతో గమనించడం వల్ల ఆకళింపు చేసుకోగలిగాను.
ఏ వౄత్తిపైనైనా సరే, శ్రద్ధాభక్తులుండాలి. వంట సంగతి తీసుకోండి - స్వచ్చంగా, రుచిగా, సహితంగా వుండాలి. సంగీతం విషయంలో, స్వచ్చంగా, రసానుభూతంగా, ఉల్లాసభరితంగా, వర్ణం, కౄతి, తిల్లానా, ఏదైనా సరే, అందించాలి.
మురళీగానశైలి - మా గురువుగారి మాట - అందరి విద్వాంసుల గానశైలిని గమనించాలి; వినాలి; ఎవ్వరినీ అనుసరించకూడదు. బాలమురళి, బాలమురళిగానం లాగే వుండాలి. నా స్వరప్రస్తారాలు నా విధానంలోనే వుంటాయి. అందుకే నాశైలి - మురళీగానశైలి మాత్రమే.
సంప్రదాయం అన్న స్థిరవిధానం అంటూలేదు; మనం శరీరంపై వస్త్రాలు, నగలు ధరించినట్లే. మార్పు అవసరం; సహజం.
నా సంగీతం ఆశువుగా ఆ సమయంలో వచ్చేదే. ఎవరు ఈ విధానం పాటిస్తే, విజయం వారినే వరిస్తుంది అన్నది తథ్యం.
నా స్వర, గళ ప్రత్యేకత గురించి నేను ఏమీ చెప్పలేని పరిస్థితి. నా గళానికి నేను బాధ్యుడను కాదు. కచేరీకి వెళ్ళేటప్పుడు, నేను ఐసుక్రీముని యిష్టంగా తింటాను. నా యింట్లో ఎవ్వరూ, నేను పాడడం, కనీసం కూనిరాగాలు తీయడం చూడరు. నేను నా విద్యార్ధులకు శిక్షణ యిచ్చేటప్పుడు మాత్రం నా గొంతు వినే అవకాశం దొరకుతుంది. నా కచేరేల్లో వరసక్రమం గురించి నేను ఎటువంటి ప్రణాళికలను ఆలోచించను.
సంగీతం విశ్వభరితం. కాని మన మేళకర్తవిధానం ప్రపంచంలో అత్యంత పటిష్టమైనది. మన సంగీతంలో వేలాది రాగాలున్నాయి; అయినా, యింకా మరిన్ని శోధించడానికి అవకాశాలు మెండు.
ప్రతీ గాత్రసంగీత కళాకారుడు, కనీసం ఒక్క ప్రక్కవాద్యాన్నైనా నేర్చుకోవాలి. అప్పుడే, గాత్రం చేస్తున్నప్పుడు, తప్పులు తెలుస్తాయి. ప్రక్కవాద్యకళాకారుడు, సంగీతకచేరీబౄందంలో భాగంగానే భావించాలి.
అన్ని సంగీతపరికరాలతో నాకు అనుభవం వుంది. కచేరీలో వైలన్ వాద్యమే అనువైనది అన్న ఆచారానికి ప్రాధాన్యత ఏమిటి? ఏ స్థాయిలోనైనా పాడగలుగుతాను. ఉదాహరణకు, నేను హరిప్రసాదుతో 3, కిషోరీతో 51/2 శౄతితోను గాత్రం చేశాను.
సంప్రదాయానికి స్తబ్దత అన్నది లేదు; కాలానుగుణంగా మారుతుంది.
రసికులు, శ్రోతలు, అసలైన న్యాయనిర్ణేతలు; సంగీతం ఒక మహా సముద్రం; ఖచ్చితంగా యిది న్యాయం అని చెప్పలేము.
నీళ్ళలోని ధూళిని వేరుచేసి, స్వచ్చమైన నీటిని సరఫరా చేసే ప్రయత్నమే నాది.
సంగీతం ఏకం. ఉద్దేశ్యం, ప్రయోజనం వేరు వేరు. భక్తిసంగీతం, ఫ్రెంచి శ్రోతలముందు పాడినా, వారు పూర్తిగా తన్మయులవడం, ఉద్రేకంతో నాట్యంచేయడం, భావస్వాతంత్ర్యప్రకటన ప్రదర్శిస్తారు. భారతదేశంలో పరిస్థితి వేరుగా వుంటుంది. ఏ సంగీత ప్రక్రియను,శాఖను,నిరోధించనవసరం లేదు. ఫ్యూజన్ సంగీతం కూడ అటువంటిదే.
పాప్ సంగీతంలో త్యాగరాజకీర్తనలను పాడినా తప్పులేదు; కనీసం త్యాగరాజు ప్రపంచానికి ఈ రూపంలోనైనా పరిచయం అవుతాడు.
సంగీతకచేరే కేవలం ఆనందానికే కాదు; సమాజావసరాలకి, సహాయసహకారలకీ ఉపయోగించే విధానంలోనే కచేరీలు జరగాలి.
ఫ్రెంచిప్రభుత్వం, షెవలియార్ పురస్కారం - దక్షిణభారత సంగీతం, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపబడిందన్నడానికి గొప్ప సంకేతం, తార్కాణం. సంతోషదాయకం.
సంగేతకళానిధి - మంగళంపల్లి బాల మురళీకౄష్ణ గారి జన్మదినం - జూలై 6 - సందర్భంగా తెలుగురధం శతసహస్ర ప్రణామాల్ని సంగీత సరస్వతి సాక్ష్యంగా ప్రణామాల్ని సమర్పిస్తోంది.
ఈ వ్యాసం, బాలమురళి గారి స్వరపల్లవి - "సుస్వర సంగీతమే వరసుఖదాయి" అన్న భావనని మనసా వాచా కర్మణా తెలుగురధం విశ్వసిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.