Monday, July 21, 2008




దాశరధీ! కవితాంధ్ర పయోనిధీ!
దాశరథి జయంతి ( 1925 - 1987 )
కలం నా కంఠమాల - దాశరధి
కమ్మని నా తెలంగాణ తొమ్మిది జిల్లాలేనా? బహుళాంధ్రకు తెలంగాణ పర్యాయపదంకాదా?
నా తెలంగాణ కోటి రత్నాల వీణతరతరాల స్వప్నాల సుందర ఫలమ్ము స్వైరభారతభూమిఒక్కటే ముడి బిగించి పాడినాను మహాంధ్ర సౌభాగ్యగీతిముక్కలు ముక్కలై చెదరిపోయెనురా! మనజాతి హూణభూభుక్కుల రాజనీతికి కవుంగిళు లొడ్డిన రాజు చేతిలో చిక్కెను బంగరుతెల్గునేల
జండా ఒక్కటి మూడువన్నెలది; దేశంబొక్కటే భారతాఖండాసేతుహిమాచలోర్వర;కవీట్కాండంబులోనన్ రవీంద్రుండొక్కడే కవీంద్రు;డూర్జితజగద్యుద్ధాలలో శాంతికోదండోద్యద్విజయుండు గాంధి ఒకడే తల్లీ మహాభారతీ
అనాదిగా సాగుతోంది - అనంత సంగ్రామం అనాధునికీ ఆ గర్భ-శ్రీనాధునికీ మధ్యసేద్యం చేసే రైతుకు-భూమి లేదు పుట్ర లేదురైతుల రక్తం త్రాగే-జమీందార్ల కెస్టేట్లు ...కర్షకులు కార్మికులు - మధనపడే మేధావులుతమశ్రమలకు తగినఫలం - ఇమ్మంటే తిరుగుబాటుషావుకారు వడ్డీలకు - జమీందార్ల హింసలకువేగలేక ఆగలేక - తిరగబడెతె అతివాదం
రానున్నది యేది నిజం? అది వొకటే సోషలిజం!కలపండోయ్ భుజంభుజం - కదలండోయ్ గజంగజం
ఈ సమాజాన దోపిడికే నివాసమిందు నీకేమి లేదు; సహింపరాని వేదనయె కాని వేరు కంపింపబోదులే, చివాలున లేచి మళ్ళించు రధము
గతమే జీవిత మనుకుని వర్తమానమే వలదని, వెనక్కు నడిచే వారిని వెక్కిరించు కోర్కిలేదు.గతమంతా బూదికుప్ప కావాలి మనోజ్ణ భావి, తిగరుబడండని అరచే బిరుసువారి నిందింపను. ఇవి రెండూ ఒక కత్తికి అటూ ఇటూ రెండంచులు, నే మాత్రం రెండంచుల సాము చేయగలను లెండి.
తెలంగాణలోని కోటిధీరులగళ ధ్వనినే గాక, ఇలాగోళమందుండెడి ఎల్లరి శబ్దాన్ని నేను
గతాన్ని కాదనలేను వర్తమానం వద్దనబోను, భవిష్యత్తు వదలుకోను, కాలం నా కంఠమాల నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి
ఎవడైనా మానవుడే ఎందుకు ద్వేషించడాలు? రాక్షసినైనా మైత్రికి రానిత్తును భయం లేదు.
హౄదయం వినా నాదగ్గర ఏ వస్తువు లభింపదు, ఉదయం వినా నాకంటికి ఏ వస్తువు రుచింపదు.
తిమిరంతో ఘనసమరం జరిపిన బ్రతుకే అమరం, కవితాతేజోవలయం అవని శాంతి కదినిలయం.
అమ్మా! భారతీ! నేను మరోదేశాన్ని అనసరించి అనుకరించి అడుగు ముందుకు వేయలేను.
దాశరధి - సాహిత్యమే జీవితం - జీవితమే సాహిత్యం
"కాలోహ్యయం నిరవధి ర్విపులా చ పౄధ్వీ" అంటూ తన శ్లోకాన్ని ముగించిన ప్రముఖ కవి భవభూతి - ఈ అనంతమైన కాలంలో, ఈ విశాలమైన ప్రపంచంలో తన వంటి హౄదయం కలిగినవాడు ఎప్పుడైనా, ఎక్కడైనా పుట్టకపోతాడా? అని భవభూతి ఆలోచించే అన్నాడు. సాహిత్యానికి కొత్తపాతల పూతలు పులమడం అసాధ్యమనీ, స్వపర దేశ భేదములు లేవనీ భంగ్యంతరంగా ప్రవచించాడు. మనీషియైన మనిషి తన అనుభవాన్ని సువ్యక్తం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ ప్రయత్నం ఆ ప్రయత్నం సాహిత్య సౄష్టికి ప్రేరణాత్మకం, దోహదకారి అవుతుంది. తరతరాలకు ఆ సాహిత్యం జీవిత లక్ష్యాన్ని సంకేతిస్తూ ఉంటుంది. అజ్ణానంతో, దారిద్ర్యంతో, దుర్భరత్వంతో జాతి పోరాడుతున్నప్పుడల్లా ఆ ఉత్తమ సాహిత్యం కనువెలుగును ప్రసాదిస్తుంది. ధైర్యోత్సాహాలను ఇనుమడింప జేస్తుంది. దైనందిన జీవితాన్ని రసమయం చేస్తుంది. ప్రతి వ్యక్తిని సంస్కౄతి ప్రరిరక్షణకు ఉన్ముఖుణ్ణి చేస్తుంది.
పై భావాలకు సరిసములుగా భావించదగ్గ ఆంధ్రకవితాశరధి, పయోనిధి, దాశరధీ అని చెప్పాలి. దాశరధి యుగోచితాగ్రగామిత్వంతో సమకాలీన సాహిత్యోద్యమాలు కల్గించిన సంస్కారంతో శాశ్వతమైన శాంతిని పరికల్పించి పరిరక్షించడానికి ఆలోచనాలోచనాలతో తిమిరంతోసమరం జరిపిన సాహితీచిత్రకవనఘనాంబోధి - దాశరధి, కవితాపయోనిధి. అసలు పేరు దాశరధి కౄష్ణమాచార్యులు. మంచి కవిత్వం ఏభాషలో ఉంటే అదే నాభాష, మంచికవి ఎవరైతే అతడు నామిత్రుడు, నాకు ఉరుదూ, తెలుగూ రెండు కళ్ళు, ఈ రెండుకళ్ళతో అన్నిభాషలనీ చదవగలను, హౄదయం ఒకటైతే లోకమంతా ఒకటి - అన్న విశాలదౄక్పథం ఏర్పడటం విశేషం, మహాకవి కుండవలసిన మహనీయ గుణాల్లో మొదటిది అని పలువురి పండితుల భావనను దాశరధి పుణికిపుచ్చుకున్నవాడు. దాశరధి హృౠదయవాదానికి, అనుభూతికి తార్కాణం.
ఏకంలో అనేకం - వెరసి దాశరధి
స్వాతంత్ర్య సమర యోధులు, ఉపాధ్యాయుడు, పంచాయితీ ఇనస్పెక్టర్, ఆకాశవాణి ప్రయోక్తలుగా ఉద్యోగం నాణానికి ఒక పార్శ్వమయితే, మహాకవి, కధకుడు, నాటికాకర్త, అనువాదకుడు, నవలాకర్త, వ్యాసకర్త, చలనచిత్రగీతికా స్రష్ఠ, స్వీయచరిత్రకారుడు, బాలసాహిత్యనిర్మాత, తెలుగు గజల్ రుబాయీల ప్రయోక్త, మహావక్త, విద్వద్విమర్శకుడు, వివిధప్రక్రియల్లో ముప్ఫైదాకా గ్రంధాలరచయిత, అనేకులకు అంకితమివడ్డం, పుచ్చుకోవడం జరుపుకున్న కవనమూర్తి, రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీల విజేత, ప్రధానమంత్రి తామ్ర పత్ర సన్మాన గ్రహీత, ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి - ఎవరో, వేరెవరో కాదు, దాశరధి - యింటెపేరు ప్రతిభానామధేయంగా చెలామణి అయిన కౄష్ణమాచార్యులు.
విద్వద్వంశంలో జీవనప్రస్థానం
దాశరధి కౄష్ణమాచార్యులు, క్రోధన నామ సంవత్సరం శ్రావణశుక్ల విదియ, బుధవారం, 22 జూలై 1925 నాడు వరంగల్లు జిల్లాలోని మానుకోట (మహబూబాబాద్) తాలూకా, చినగూడూరు గ్రామంలో, వేంకటమ్మ, వేంకటాచార్యుల పుణ్య దంపతులకు జన్మించిన జ్యేష్టపుత్రుడు; ప్రముఖ సాహితీకారుడు దాశరధి రంగాచార్య, సోదరుడు. శ్రీవత్సగోత్ర శ్రీ వైష్ణవ సంప్రదాయ కుటుంబంలో పెరిగిన వాతావరణం, ప్రభావం అపారం. పండితవంశం, శుద్ధశ్రోత్రియ కుటుంబం. తండ్రి సంస్కౄతాంధ్రద్రావిడభాషా విశారదులు. ఉభయవేదాంత నిష్ణాతులు. సాహిత్య పారంగతులు. తమిళభాషలోని వైష్ణవమత వచనాల్ని ఆంధ్రీకరించడం, దాశరధి అన్న పత్రికను నడపడం, తల్లి కావ్యాలతో, ప్రబంధాలతో చక్కని పరిచయంతోపాటు మాతౄమూర్తి హౄదయం మానవతకూ ప్రేమకూ ఆప్యాయతకూ నిలయం, మాతామహులైన భట్టాచార్యుల పాండిత్యం, రామాయణ భారత, భాగవతాలను ఆంధ్రీకరించడం, యిత్యాది పాండితీవాతావారణంలో దాశరధి బాల్యం బహు ప్రేరణాత్మకంగా గడించింది. విశిష్టాద్వైత ప్రవక్తకులు శ్రీమద్రామానుజాచార్యులవారి ప్రధానాంతరంగిక శిష్యుడు, దాశరధి అన్న పేరుగల వ్యక్తి, ఆ గణంలో ప్రధముడు. మహావిద్వాంసుడు, రామానుజులవారిచే ఉపదేశం పొందిన భాగ్యవంతుడు, రామానుజుల పర్యటనలో తెలంగాణ సందర్శన సందర్భంలో, ప్రశిష్యుడు దాశరధి స్థిరనివాసం ఏర్పరచుకోవడం వల్ల చారిత్రకకధనం ప్రధానం సంతరించుకుంది. దాశరధిగారి పూర్వులు భద్రాచల నివాసులు, దాశరధి శతకకర్తలైన కంచర్ల గోపన్నవలె శ్రీరామభక్తులు కావడం వల్ల, వారి వంశానికి ధాశరధి పేరు వచ్చిందన్న భావన కూడ ప్రచారంలో వుంది. ఏది ఏమైనా, దాశరధి యింటి, వంశం పేరు.
విద్యాపర్వం
సాంప్రదాయకపద్ధతిలో తండ్రివద్ద సాగిన విద్యాబుద్ధులు, సంస్కౄత పంచకావ్యాలు, వైద్యగ్రంధాల్ని ఆపోశనం పట్టాడు. కావ్యాల్లోని గద్యలు, శ్లోకాలను ఆధ్యయనం చేస్తూ, వాటిలో గూఢార్ధాలను, అంతరార్ధాలను, గురువులు దాటవేసినా, తెలివిగా గ్రహించేవాడు. మచ్చుకు ఉదాహరణం : స్త్రీ యొక్క చూపుల వేడితో దహించుకు పోయిన వారికి మందేమిటో చెప్పండి వైద్యరాజా అని రోగి అడిగిన ప్రశ్నకు, గట్టిగా కౌగిలించుకోవడమేమో పథ్యం, యిక కషాయమంటారా, అధరచుంబనం అన్న వైద్యుని జవాబు, తెలిసీతెలియని దాశరధి వయసుకు మనసుకు పులకింతలు, చమత్కారాలని కలిగించేవి. చినగూడూరు లోని ప్రాధమిక పాఠశాలలో నాల్గవతరగతి, తర్వాత ఖమ్మం లో ఉర్దూలో చదువు జరిగింది. యిక్కడే కౄష్ణమాచార్యులు, దాశరధి గా మారిపోయారు. స్వాభిమానం, అర్ధించకూడదన్న ధౄడగుణం, ఏడవ తరగతి తోటి విద్యార్ధులకు వ్యాకరణం, ఉర్దూని బోధించి చక్కదిద్దుకున్న ఆర్ధికస్థితి ద్వారా, పుస్తకాలు, పత్రికలు కొనుక్కుని తీర్చుకున్న విద్యాతౄష్ణ, వినూత్న చైతన్యాన్ని పొందాడు. చదువుతోపాటు, సంస్కౄతాధ్యయనం, కేశవాచార్యశాస్త్రిగారి అంతేవాసితనంతో ఉపనిషత్తులకు వ్యాఖ్యానాల్లోంచి అనుమానాలు, సందేహాలద్వారా వచ్చే సమాధానాల ద్వారా ప్రభావితులవడం ద్వారా అబ్బిన పాండిత్యం. పద్యాలల్లడం జరిగేది. ఖమ్మంలో ఆనాటి బోధనాభాష అయిన ఉర్దూలో మెట్రిక్యులేషన్, భోపాల్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్మీడియట్ ను, ఆంగ్ల సాహిత్యం ప్రధానవిషయంగా హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంనుంచి బి.ఏ.ను పూర్తిచేశారు.
బహుమతి అందించిన క్రీడ పై మొదటి కవిత
చదువుతోపాటు క్రీడల్లోఆసక్తి, తత్ఫలితంగా గవర్నరు ద్వారా అందుకున్న ఆనాటి ఖరీదైన రాజా పెన్ను బహుమతి, ఆ పెన్నుతోనే కవితను - గోనెసంచి పరుగులపోటీ పై వ్రాయడం యిలా సాగింది.
గోనెసంచి పరుగులపోటి, భలేమంచి ఆటలపోటి, బొక్కబొర్లా పడ్డాడొకడు, ముక్కుపగిలి ఏడ్చాడొకడు, హాయ్ అల్లా అన్నాడొకడు, ఓ దేవుడా అన్నాడొకడు, ఏడ్చేవాడొకడైతే, నవ్వేవాడింకొకడు, అవమానం ఒకడికైతే, సమ్మానం ఇంకొక్కడికీ, గెలిచినోడు నవ్వాలా? ఓడినోడు ఏడ్వాలా? నేడు గెలుగు రేపోటమి, నేడోటమి రేపు గెలుపు, అదేరా జీవితం, మరి ఎందుకు ఏడవడం - అనగలగడం జీవితావగాహన చిన్నప్రాయంలోనే అబ్బడం అదౄష్టకరం. ఆనాటి తెలంగాణ పరిస్థితులు, దాశరధి చదువును ఆపేలా చేశాయి. సాంఘిక రాజకీయ వైజ్ణానిక పరిస్థితులే స్వాతంత్ర్యోద్యమంలో ప్రవేశింపచేశాయి.
ప్రభావిత సంఘటనలు
హైదరాబాదు స్వాతంత్ర్యోద్యమం, తెలంగాణాలో - గ్రంధాలయోద్యమం, ఆంధ్రోద్యమం, ఆణాగ్రంధమాల, పత్రికలు, నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ, హైదరాబాదు స్టేటు కాంగ్రేసు స్థాపన లాంటి సంస్థల, సంఘటనల పై ప్రభావప్రేరణలు, కమ్యూనిష్టు, రజాకార్లు, సోషలిష్టు వర్గాలు, ఆర్యసమాజ్, హైదరాబాదు స్టేటు కాంగ్రేసు తుదిపోరాటం, హైదరాబాదు సంస్థానవిముక్తి, ఆనాటి సాహిత్య వాతావరణం, యిత్యాది సంఘటనలు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను, ప్రభావితం చేయడం జరిగాయి. తెలంగాణా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం, కవి సమ్మేళనాల్లో 'ఓ పరాధీనమానవా! ఓ పరానిదాస్యము విదల్చలేని శాంతమ్ముమాని తలుపులను ముష్టి బంధాన కలచివైచి చొచ్చుకొనిపొమ్ము స్వాతంత్ర్య సురపురమ్మూ. 'ఓ నిజాము పిశాచమా! కానరాడు ... నా తెలంగాణ కోటిరత్నాలవీణా, 'ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను ... దిగిపొమ్మని దిగిపొమ్మని ఇదే మాట అనేస్తానూ జైలుజీవితాన్ని అనుభవిస్తూ, పళ్ళుతోముకోవడానికిచ్చిన బొగ్గుతో 'కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగెలను తెంపి అగ్నిలో దింపినావు, కారాధామమ్మున మౄతికౌగిలి కామించెడి వీరవరులు కలరిచ్చోటన్, జీవితమున ఒక వర్షం గడచిన వేళ దు:ఖించాలన్నది మరిచేస్తున్నారు, అని వ్రాసిన కవితలు దాశరధి పేరు ఆంధ్రసాహితీచరిత్ర వున్నంతకాలం, గుర్తుండి తీరుతుంది. అని చదివిన కవితలు బహుళ ప్రజాదరణ పొందాయి. హైదరాబదు స్వాతంత్ర్యసిద్ధి, దాశరధి విముక్తి, దాశరధి విశాలాంధ్రవాంచ, విశాలాంధ్ర అవతరణలు దాశరధి జీవితంలో ప్రముఖ సంఘటనలుగా భావించాలి. విశ్వచైతన్యానికి కొత్త వరవడిని ప్రసాదించిన దాశరధి ఆశించిన విశాలాంధ్రప్రదేశ్ కే ఆస్థానకవిగా తర్వాత నియపింపబడడం గొప్ప యాదౄచ్చికం. తెలుగుజాతి చైతన్యపతాకగా ప్రకాశించి, అనేక కావ్యాలు రచించి దాశరధి ప్రజాకవిగా, జాతీయకవిగా ప్రతిభాదర్శనమిచ్చాడు. గుండెను రెండుగా చీల్చే మొండితనం పనికిరాదు; మనసులనేకం చేసే మంచితనం కావాలి అన్న విశ్వచైతన్య భావవీచికలను అందజేస్తూ, విశాలవిశ్వానికి సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించాడు. పుట్టుకతోనే సహజపాండితీకవితాధారను పొందిన దాశరధి మహాంధ్రోదయం, అగ్నిధార నుండి నేత్రపర్వం వరకూ ముప్ఫై దాకా కవితాప్రచురణలు వచ్చాయి.
దాశరధి బహుముఖ సాహితీధారాప్రక్రియలు
కవిత్వంలో దాశరధి అభ్యుదయ, కాల్పనిక, జాతీయోద్యమ, నవ్యసంప్రదాయ రీతులకు ప్రాణం పోసిన మహాకవివర్యుడు. గీతాల విషయానికొస్తే, లలితగీతాలు, చలనచిత్రగీతాలు, నాటికల్లో వచన, గేయ పద్ధతుల్లో రచనలను చేశాడు. కధలు, బాలసాహిత్యం, నవల, వాఖ్యానం, వ్యాసాలు, అనువాదాలు, నిఘంటునిర్మాణ కౄషి, యాత్రాస్మౄతిగా స్వీయచరిత్ర ల పంధాలు త్రొక్కి బహుముఖసాహితీప్రక్రియ నిర్మాణ పధకుడు అన్న గౌరవం లభిచింది.
దాశరధి గజళ్ళు
అరబ్బీభాషలో జనించిన గజల్ కవితా ప్రక్రియ ఫారసీ, తుర్కీ, ఉర్దూ భాషలలోనికి వ్యాపించిన గజల్ శబ్దార్ధం, ప్రియురాలితో సల్లాపం అనే అర్ధాన్ని వివరిస్తూ, ఉర్దూ భాషావేత్త అయిన దాశరధి, కలకంఠులతో సరస సల్లాపం, ఇంతులతో మంతనాలు అని అనుభూతిపరంగా నిర్వచనం చెప్పారు. మంజరి, వల్లరి అన్న పేర్లతో ఖండికలు రచించాడు. గజళ్ళో తరచుగా చొప్పించే 'తఖల్లుశ్ (కలంపేరు)ను శరధి గా వాడారు. రమ్మంటె చాలుగానీ రాజ్యాలు విడిచిరానా, నీ చిన్ని నవ్వుకోసం స్వర్గాలు గడిచిరానా. ముళ్ళనీడల్లో పువ్వులున్నాయి, నాదు కన్నీట నవ్వులున్నాయి. యాత్ర నడిదారి ఆగిపోనేలా, నీలగగనాన దివ్వెలున్నాయి. ఒకనాడు హౄదయము మారుట, పగబూని 'శరధీని దూరుట, పగవాని ఇంటికి చేరుట, అవినీకు జ్ణాపకమున్నవా?
తెలుగులో మొదటి ప్రయోగం - దాశరధి రుబాయీలు
రుబాయీ ప్రక్రియను మొదట ఆంధ్రసాహితీజగతికి సుపచరిచయం చేసిన ఘనత దాశరధి దే అని ఘంటాపధంగా ఆయనే చెప్పుకున్నాడు. రుబా - అంటే అరబ్బీ భాషలో నాలుగు అని అర్ధం. నాలుగు పంక్తులు, నాలుగు భాగాలు. తన రుబాయీలను కవితాపుష్పకం, తిమిరంతో సమరం సంపుటాల్లో గోచరిస్తాయి. నిప్పులోంచి అప్పుడప్పుడు పొగ పుడుతుంది, నీళ్ళలోంచి విద్యుత్తును సెగ పుడుతుంది, ఈ దానవలోకంలో ఎన్నటికైనా, మానవులని పిలుగదగిన తెగ పుడుతుంది. వయసులాగ శాంతి కూడ వెళిపోతుంది, కమ్మనైన కధ కంచికి వెళిపోతుంది, ఎంత దారుణం శరధీ, ఈ లోకంలో, నరరుధిరమై నరునికి మధువయి పోతుంది. వైవిధ్యం, విస్తౄతి, సౌందర్యం, సందేశం లతో అలరించిన నాలుగు విషయాల్ని నాలుగుపాదాల్లో నాణ్యంగా నప్పించిన ఘనత దాశరధీదే.
బాలాదపి సుభాషితం
బాల్యంలో సంప్రదాయపరంగా సంస్కౄతకావ్యాల పఠన ప్రభావం, ఆస్థానకవిగా నియమించిన సందర్భంగా, రసద్దివ్య గోదావరీ కంఠహారే, లసద్భవ్య కౄష్ణానవౌఢ్యాహీరే, మహాంధ్రప్రజా మాతౄమూర్తే జయంతే, విశాలావనీవ్యాప్త కీర్తే! నమస్తే! అని మాతౄస్తవం చేశారు.
సంగీత సాహిత్య సరస సమ్మేళణ సలలిత గీతావళి
ఆంధ్ర మహాసభ కరుదెంచండీ జనులారా మీరు లాంటి లలితగీతాలను, పూలపాటలు, నవమంజరి, తేనెపాటలు, వలపుపాటలు, లలితగీతాల సంపుటాలు సుప్రసిద్ధాలు. లలితగీతాల్లో కూడ దాశరధి, లక్షణలక్ష్యాల్ని సాధించాడు. మధురగాయకుడు ఘంటశాల స్వరంతో రాణించిన గీతం - నారాణి, తలనిండ పూదండ దాలిచిన నారాణి, మొలక నవ్వులతోడ మురిపించబోకే, మాటల్లో మాటల్లో మరపించబోకే, అన్నది సజీవ గీతసంగీతలహరి.
చిత్రగీతావళి
అన్ని సాహితీ ప్రక్రియలు ఆస్థానకవిని ఆదరించాయి. ప్రత్యేకంగా దాశరధి చలనచిత్రాల్ని ప్రస్తావించాలి. వాగ్దానం, ఇద్దరుమిత్రులు చిత్రాలతో రంగప్రవేశం చేసిన దాశరధిని అనేక చిత్రగీతాలు వరించాయి. నా కంటిపాపలో నిలిచిపోరా,నీ వెంటలోకాలు గెలువనీరా (వాగ్దానం), ఖుషీఖుషీగా నవ్వుతూ, చలాకీమాటలు రువ్వుతూ (ఇద్దరుమిత్రులు) పాటలతో చిత్రప్రవేశం చేశిన దాశరధి మరి వెనుతిరిగి చూడవలసిన అవసరం రాలేదు. చిత్రాలలో ఖవాలీపాటలకు ప్రసిద్ధి దాశరధి. నవరసాలను తన చిత్రగీతాల్లో పొదగగలిగిన పాండిత్యం, ప్రతిభ రంగరించి దాశరధి రచనలను చేయడం జరిగింది.
బిరుదులు, సన్మానాలు
మహాకవి, దాశరధి కవిసింహ, అభ్యుదయ కవిచక్రవర్తి, యువకవిచక్రవర్తి, జాతీయోద్యమరధసారధి, కళాప్రపూర్ణ, డి.లిట్., ఆస్థానకవి, ఆంధ్రకవితాసారధి బిరుదులతోపాటు, ఎన్నో, మరెన్నో, సన్మానాలు, సత్కారాలు, దాశరధి ప్రతిభకు గీటురాళ్ళు. దాశరధిపై, ఆయన సాహిత్యంపై అనేకమంది పరిశోధనలను చేయడం, అన్యభాషలలోకి ఆయన రచనలను అనువాదం చేయడం కూడ జరిగింది. ఆయన ప్రతిభకు జోదుగా విదేశపర్యటనావకాశాలు రావడం, వాటిద్వారా విశ్వానికి సాహిత్యాన్ని ప్రచారం చేయడం జరిగింది.
దాశరధి తిరిగిరాని పయనం
1983 లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్థానకవి పదవిని రద్దుచేయడం, 1987 లో రష్యా పర్యటన విశేషాలను సంకలనం చేసే ప్రయత్నంలో అనారోగ్యం చేయడం, క్రమేపీ ముదరడం, తగ్గుదశ పట్టడం జరిగినా, 1987 నవంబరు 5వ తేదేన శాశ్వతంగా కన్నుమూసి, దాశరధి తిరిగిరాని పయనం కావించారు.
భారతీయ సాహితీనిర్మాతల్లో ఒకరిగా పరిగణింపబడిన దాశరధిని, సాహితీవ్యక్తిత్వాన్ని, ప్రముఖ సాహితీవిమర్శకులు, డా.జి.వి.సుబ్రహ్మణ్యంగారు, అరలు లేని హౄదయం, అరమరలు లేని స్నేహం, స్వార్ధంలేని సౌజన్యం, దాశరధి వ్యక్తికి తరుగులేని సంపద. కులవర్గాలు లేని సమాజం, మతవైషమ్యాల్లేని మానవత,ఆయన సమాజానికిచ్చిన సందేశం; విశ్వశాంతి ఆయన లక్ష్యం; కవిత్వం ఆయన జీవితం. ఆధునిక సాహిత్యంలో విశ్వమానవ భావానికి దాశరధి కవిత ప్రతీక, అన్నారు. ఆమాట సత్యం, శివం, సుందరం.
దాశరధి కవితాసౌధం ఒక పుష్పకవిమానం. ఎన్ని సంప్రదాయాలైనా, ఎన్ని క్రొత్తదనాలైనా అందులో ఇమడగలవు; అది వ్ప్లవాలను ఆహ్వానిస్తుంది, విశ్వశాంతిని ఉద్భోదిస్తుంది. పుష్పకంలో ప్రయాణం - ఎందరు ప్రయాణించినా చోటుంటుంది; అన్నిభాషలవారు ఆనందలోకాలలోకి సంచారం చేయడానికి, మంచి హౄదయమే అర్హత టికెట్. డబ్బు లేదు. ఏకత్వం అనే పెట్రోలుతో ఎగురుతుంది. అది చెడితే కూలుతుంది. ఏకంగా వుందాం, విందాం కవిత, లోకాన్ని స్వర్గంచేసి విహరిద్దాం, అని పిలుపిచ్చాడు.
అందుకే దాశరధీ కవితా పయోనిధి. కవితాశరధీ. విశాలహౄదయత్వానికి, మనవతావాదానికి, విశ్వశాంతికాముకతకు, దాశరధి - వారధి.
మహాకవి దాశరథి జయంతి సందర్భంగా - తెలుగురధం శతసహస్ర కవితా నీరాజానాల్ని ప్రణామాలతో నినమ్రంగా సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

No comments: