Sunday, September 28, 2008

జానుతెనుగు కవి తురంగం - గుర్రం జాషువా జయంతి




జానుతెనుగు కవితురంగం - గుర్రం జాషువా జయంతి - 28 సెప్టెంబర్



( 1895 - 1971 )
మధుర శ్రీనాధుడు
బ్రతుకు బాధల చేదును ఆస్వాదించి మధురమైన కవిత ద్వారా సంకుచిత మతాతీతమైన కవితలను వెలువరించినవాడు. ప్రజల నాలుకలయందు జీవించిన సుకవి. సంస్కార ప్రియుల హౄదయాల్లో జీవిస్తున్న వ్యక్తిత్వం. కవిత్వాన్ని అతని వ్యక్తిత్వంనుంచి విడదీసి చూడలేని అవిభాజ్యస్థితి. ఉభయత్రా కారకాలు. ఎన్నో బిరుదుల్లోకి, సుస్థిరత్వంగా నిలచిపోయినది, కవికోకిల. కవితాదౄక్పధం, భావకవితానిరసనం, నిసర్గశైలి, సంఘసంస్కరణం, అభ్యుదయభావన, ప్రత్యర్ధులధిక్కారం, మచ్చుకు కొన్నిమాత్రమే, అయినా, వెరసి, మధుర శ్రీనాధుడు. ఎవరనుకుంటున్నారా - నవయుగ కవిచక్రవర్తి, జానుతెనుగు కవితురంగం, గుర్రం జాషువా.
వినుకొండ నివాసి విలక్షణతవిష్ణుకుండినుల అకుంఠిత ధర్మనిష్ఠానిర్మాణ నిపుణతకు, చండప్రచండ పవనాలకు ప్రఖ్యాతమైన వినుకొండ ప్రాంతమది. వికసితబాల్యప్రాయంలో వడిగా అడుగులేస్తున్న బుడత. మండువేసవిగాడ్పులను శీతలపవనవీచికలుగా భావించి నడుస్తున్నా, అతని చక్షువులను వీక్షిస్తేమాత్రం కలవరిస్తున్న హౄదయవేదన వెల్లడవుతున్నది. 1895 సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ పుణ్యదంపతులకు జన్మించిన పుత్రరత్నం. కులప్రస్తావన కుతకుతలా ఉడుకుతున్న ఉన్మాదపు రోజులవి. పైగా, తల్లిదండ్రులు, వేర్వేరు కులాల ప్రతినిధులు. తండ్రి యాదవుడైన క్రైస్తవమతస్వీకర్త, తల్లి ఆది ఆంధ్రజాతి. ఈ రెండు విషయాలు కలసి రగిలిన నిప్పురవ్వల తూటాలుగా మారాయి. బాల్యంలోనే హౄదయాన్ని దహించెవేశాయి. పచ్చపచ్చని పైరుపొలాల మధ్య పరుగులెడుతూ గడపిన బాల్యం, చదువుకోసం వెళ్ళే బడి విషయానికొస్తే, కష్టాలకడలి రివ్వున తరంగాలై తాకింది. విద్వత్తులో మునిగిన వినుకొండ, విలక్షణమైన వికటంగా మారింది. అగ్రవర్ణతత్వం, అస్పౄశ్యతామనస్తత్వం రాజ్యమేలుతున్న కాలానికి ఎదురీది, పుత్రాశ్రువులను తుడిచి తనను తాను తమాయించుకున్న జనని సంకల్ప దీక్షాకంకణబద్ధురాలై, బాలుని పాదయాత్రతో మేధాయానం కావించింది. యిన్ని యిబ్బందులు, అవమానాలు ఎదురైనా, అన్నింటినీ దిగమింగుకుని, ఉన్నత పాఠశాల చదువు ముగించుకుని, ఉపాధ్యాయ శిక్షణ పూర్తిచేశారు. రాజమండ్రిలో మూకీ చిత్రాల వ్యాఖ్యాతగా, చింతామణి నాటకమండలిలో నాటకకర్తగా పనిచేసిన జాషువా, 1919-1928 కాలంలో గుంటూరులోని లూధరన్ చరి ఉపాధ్యాయ శిక్షణాసంస్థలో అధ్యాపక వౄత్తిని చేపట్టారు. 1928-42 లో గుంటూరు జిల్లా బోర్డు పాఠశాలల్లో తెలుగుపండితపదవిని నిర్వహించిన ఉభయభాషాప్రావీణ్యుడు. ఆ తర్వాత, జాతీయ యుద్ధ ప్రచారక సంఘంలో ప్రచారకులుగా, మద్రాసు ఆకాశవాణిలో నిర్మాతగాను ఉద్యోగం నిర్వహించారు. 1964లో ఆంధ్రప్రభుత్వం శాసనమండలి సభ్యత్వం కేటాయించింది. నిర్వహించే ఉద్యోగం ఏదైనా, జీవనసాధనంగానే భావించారు. జన్మత: కవి అయిన జాషువా, కవిగా కష్టతరమనుకున్న, జాషువా బడిపంతులు పదవిని ఎన్నుకున్నారు.
అవధానం కలిగించిన ప్రేరణవినుకొండలో జరిగిన సాహిత్యావధానంను గమనించి, అవధానిని ప్రశంసించాలని, బాలకవి పద్యాలతో వేదికనెక్కబోతే, అంటరానితనమని ఆడ్డుకొట్టడం, జాషువాని కౄంగదీసింది. అలా అవమానింపబడడం, జాషువాలో సంకల్పం సంతరించుకుంది. ఫలితంగా, 'నవ్యయుగోచితంబులై ఆకటి చిచ్చు లార్చు హౄదయ విదారక దయా కధాంశాలూ అని ప్రస్తావిస్తూ, విశ్వమానవ సౌభ్రాత్రత్వం, నిర్మలత్వం, నిర్జాతి సంఘస్థాపన కోసం కంకణబద్ధతని పాటించాడు. ఇంతై, బాలుడింతింతై, కవికోకిలై, నవయుగచక్రవర్తిగా, విశ్వనరుడైనాడు. అసమసమాజం బాకులు రువ్వినప్పుడు, అంటరానితనం విషాగ్నులు విసిరినప్పుడు, కటికదారిద్ర్యాన్ని అనుభవించవలసినప్పుడు, ఆవేదన గుండేల్లో కుతకుతలాడినప్పుడు, గుర్రంజాషువా గభాలున గుర్తుకు వస్తారు.
జాషువా కవిత్వంలో జానుతెనుగుమానవత్వం, హేతువాదమూలాధార కవనేతివౄత్తాలు, మధురోహలతో నిండినవి జాషువా ఖండకావ్యాలు. ఫిరదౌసి, గబ్బిలం, శ్మశానవాటికలాంటృఇ ఖండకౄతులు ఓంకౄతీ ప్రతిధ్వనిత ప్రతిఘటనలు. అవ్యక్తమధురిమ కుహూగీతాలాపనలు విశ్వాంతరాళాన మారుమ్రొతలా అన్నట్లు వుంటాయి ఆయన కౄతులు. సూటిగా, ధాటిగా, వాడిగా, రసావేశజీవనాడిగా, ప్రాణసదౄశంగా చేసిన కవనప్రయోగాలు. దైన్య, ప్రబోధ, నిర్వేద, క్రోధ, జదఘ, ఉగ్రత, చింత, అమర్షాదులను ప్రత్యక్షీకరించిన విధానాలు, కరుణ, వీరరసభరితాలు. మతవైషమ్య, అసస్పౄశ్యత, అంధ విశ్వాసం, దారిద్ర్యం, నిరసనలాంటి అంశాలను పునాదిగా సంఘసంస్కరణలను కూడ ప్రతిబింబించేలా కవిత్వం గోచరిస్తుంది. మహాత్మపధం, మహాబోధి దౄక్పధం, యుగోచిత ప్రగతి దౄష్టిలను దౄష్టిలో పెట్టుకుని నిజాభ్యుదభావకవితలను అల్లాడు జాషువా. ముంతాజ్ మహల్, కాందిశీకుడు, స్వప్నకధ, బాపూజీ, నేతాజీ, స్వయంవరం, ముషాఫర్లు, క్రీస్తుచరిత్రము, కొత్తలోకం, అవయము, అనసూయ, శివాజీ చరిత్రాది కావ్యఖండికలు దేశచరితావగాహనకు మచ్చుతునకలు. వీరాబాయి, తెరచాటు నాటకాలు, నా కఢ వెరసి రాశితోకూడిన వాసితనపు జానుతెనుగు కవితారసవంతాలు, జాషువా కలంనుంచి అందిన నజరాణాలు.
రాజు మరణించె నొక తార రాలిపోయె, కవియు మరణించె నొక తార గగనమెక్కె, రాజు జీవించె రాతి విగ్రహములను, సుకవి జీవించి ప్రజల నాలుకలయందు, యని సుకవికి మరణమే లేదు అని చెప్పినతీరు అధ్బుతం.
అపర రవీంద్రశైలిరవీంద్రుని కవిత్వం గురించి చెప్పిన పద్యంలో, సహజరాజసం, కులుకుల పసందు, బిగువు, మెరుపులతోపాటు, మధురసమును కడుపును మాటుకున్నట్లు, ద్రాక్షఫలకుచ్చములయందములుకూడ గోచరిస్తున్నట్లుగాను, వరకవీంద్రుని కావ్యప్రపంచమందు ప్రతిపదంబున మదికి దర్శనమిస్తాయి అని సుందరంగా వర్ణించాడు. ఈ భావనే జాషువా కవితాదౄక్పధం కూడ గోచరిస్తుంది. కవితాస్వరూపానికి వర్ణాక్షరమాలగా భావించవచ్చు.
పద్యనిర్మాణపటిమ, పదాల అల్లిక లో ప్రత్యేకతలుజాషువాకు పద్యాన్ని చిత్రక పట్టడం తెలుసు. భావాన్ని చిత్ర చిత్రాలుగా కూర్చడమూ తెలుసు. సూటిగా, సెలయేటి ధాటిగా, వాడిగా, రసావేశజీవనాడిగా, కవితలు చెప్పడం రుచితో, అభిరుచితో ప్రత్యేకగుణాన్ని అలవరచుకున్నాడు. అతని కవిత్వానికి ఆవేశం జీవం. అసలు ఏకళకైనా రసావేశమే ప్రాణసదౄశ్యం అంటారు, ప్రముఖ కవి నారాయణరెడ్డెగారు. ఈ రసావేశం లేనివారు, బుర్రతో చూస్తారు, బుద్ధితో వ్రాస్తారు. కాని జాషువా అనుభూతితో చూస్తాడు. ఆవేశంతో వ్రాస్తాడు. ఆ ఆవేశాన్ని వెల్లువలా కాకుండా, పిల్లకాలువలా ప్రవహింపచేస్తాడు. ప్రణాళికాబద్ధంగా ప్రవహింపచేసే ఉత్తమకవిత్వాన్ని సౄష్టించబడగలుగుతుంది.
జాషువా రసావేశానికి, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, గబ్బిలం,శ్మశానవాటి ని ఉదాహరించవచ్చు. రసావేశంతో పాటు తమాషా, చమత్కార ప్రయోగాలను చేయడం, జాషువా ప్రత్యేకత. పగలు - అంటే దినమని, విరోధాలని, ఏకాయేకా - కా ఆంటే ఏకా ఒక్కడేకదా అని, లాంటివి అక్షరలక్షలు బహువర్ణితాలు.
జాషువా నవ్వులు నవ్యాలునవ్వును జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవౄత్తికిన్ దెవ్వెలు, కొన్ని నవ్వులెటుతేలవు, కొన్ని విషప్రయుక్తముల్, మువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు విశుద్ధమైన లేనవ్వులు సర్వదు:ఖదమనంబులు వ్యాధులకున్ మహౌధుల్, అంటాడు. అందుకే జంధ్యాల నవ్వలేకపోవడం ఒక రోగం అంటాడు.
శ్మశాన వాటిక - అనుభూతికి రసానుభూతికి ప్రతీకఇచ్చోట; నేసత్కవీంద్రుని కమ్మని కలము, నిప్పులలోకఋరగిపోయే అంటూ, రాజన్యుని అధికారముద్రిక, ఇల్లాలి నల్లపూసల సౌరు, చిత్రలేఖకుని కుంచి, ని చేరుస్తూ, చివరకు, ఇది మరణదూత తీష్ణము, అవని పాలించు భస్మ సింహాసనంబు అన్నాడు. ఈ భావనాపటిమ వేలకవులల్లో ఒకరిని చూడగలుగుతాము.
చివరికి ఎవ్వరేమన్ననండ్రు నాకేమి కొరత, అని ప్రత్యర్ధులను ధిక్కరించాడు అపర మధుర శ్రీనాధుడు.
కవులు వర్ణాతీతులు; వారి కవిత్వాలు వర్ణనాతీతాలు; ఈ జాబితాలో జాషువాని, ఆయన ఈ లోకంలోకి అందించిన భావవరప్రసాదగుళికలు జానుతెనుగుభరిత కవనఖండికలు, నిత్యస్మరణాలు, నిత్యపారాయణాలు.
సరిసములు లేని సన్మానాలు, సత్కారాలుకవిలో ప్రతిభాపాటవాలని బట్టి సన్మానాలు, సత్కారాలు వరకన్యకల్లా వస్తాయి. ఎన్ని కుల, జాత్యంహకారాలు, నిరసనలవెల్లువలు జాషువాపై ఆనాటి అసభ్యసమాజవర్గం ప్రయేగించినా, కనకాభిషేకాలు, గజారోహణాది సత్కారాలు, గండపెండేరాలు, అగణిత సన్మానగౌరవాలు దొరికాయి మన జాషువాకి. పద్మభూషణ, కళాప్రపూర్ణ, కవికోకిల, కవితా విశారద, నయయుగ కవిచక్రవర్తి బిరుదుల ప్రదానాలు చేయడం జరిగింది. అంటరానితనం, వెలివేయడం అన్నది జరిగినా, చివరకు ఆనాటి ప్రముఖాస్థానకవివర్యులు చెళ్ళపిళ్ళశాస్త్రీయ కరకమలాలతో గండపెండేరపు కీర్తి దిగ్దింగంతాలకు వ్యాప్తి చెందడం జరిగిందని మరువలేము; మరువరాదు. మహాకవులచే ప్రశంసించబడిన కవి మనకవి జాషువా. జాషువా, కవిత్వం ద్వారా తన పదునైన కలాన్ని ఉపయోగించాడని, తద్వారా జనితమైన వేదనావేశములను అనుభవించిన ఆయన శైలిలో వాటిని ప్రకటించడం జరిగిందన్న వాదన కూడ ఆనాడే బహుళ ప్రచారంలోనున్నట్లు పలు కవివర్యులు చెప్పడం జరిగింది. బహిష్కరణలు ఆనాడు సర్వసామాన్యం అనుకోవడం సబబు కాదని, ఆవేదనలకు,మనస్తాపాలకు కారణాలు అనేకం వుండవచ్చును అని, ఆ రోజుల్లోనే హరిజనులకు చాల గౌరవమర్యాదలు, సహవాస, సహపంక్తి వరుసలు కూడా పాటించారని, జాషువాతోటి సమకాలీన హితులు,కవులు అనేకులు తమ స్మౄతులను పలవరించిన సందర్భాలు అనేకం. జాషువా తాను కిరస్తాని మతాన్ని స్వీకరించినా, హిందూమతం, మతదేవతలను ఎన్నడూ విమర్శించలేదన్నది కూడ సత్యం.
విశ్వమానవ సౌభ్రాత్రత్వం, విశ్వశాంతి, మతవర్గరహిత సమ సమాజాన్ని కోరినవారిలో జాషువాను ప్రధమ పంక్తిలో గణించవలసిన ప్రతిభను తన కవిత్వం ద్వారా చూడగలగడమే సాక్ష్యం, సంకేతం.
మరణం లేని నిత్యనివాసి - గుర్రం జాషువాగిజిగాడి గూడు అల్లిక, సాలీడు వెలవేత, నెలబాలుడి వెన్నెలల విరజిమ్ములాటలు, ముక్తక ముత్కాఫలాల నీటి నిగనిగలు ఉన్నంతకాలం, గుర్రంవారి ప్రతి పద్యానికీ వెలుగే; ప్రతి పదానికీ మిగులే; గుర్రంవారు వ్రాసింది ఎంత? బాలికుల ప్రశ్న. అమరుకకవే: ఏక: శ్లోక: ప్రబంధ శతాయతే అన్నది సహౄదయ సూక్తితోను, 'ఏకపద్యం ప్రబంధ శతాయతే అన్న దేవులపల్లి కౄష్ణశాస్త్రివారి ఉవాచతో, జాషువాను భావిస్తూ, ఈ స్మౄతివ్యాసాన్ని ముగించడం ఔచిత్యమే కదా!
నవయుగ కవిచక్రవర్తి, దళితవర్గజ్వలస్ఫూర్తి, జానుతెనుగు కవితురంగం - మన గుర్రం జాషువా కలంనుంచి జాలువారిన 'క్రీస్తుచరితం' అన్న కవితారచనకు కేంద్రసాహిత్య పురస్కారం లభించడం మన సాహితీప్రేమికులకు మరువరాని, మరువలేని అనుభూతి.
గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా తెలుగురథం సాహితీ నివాళ్ళను ఘనాతిఘనంగా సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

నాడు - ఈనాడు - సెప్టెంబర్ ౨౫-27

నాడు - ఈనాడు ప్రత్యేకతలు
నాడు - ఈనాడు 25-27
సెప్టెంబర్ 25
1939 - జననం - ప్రముఖ భారతీయ నటుడు, నిర్మాత, దర్శకుడు ఫిరోజ్ ఖాన్.1986 - మరణం - భారతీయ కమ్యూనిష్ట్ నాయకుడు, దర్శన్ సింగ్ మరణం.1958 - మరణం - ప్రముఖ రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ వర్ధంతి.
సెప్టెంబర్ 26
1820 - జననం - ప్రముఖ సంఘసేవకుడు ఈశ్వర చంద్ర విద్యాసాగర్1867 - జననం - ప్రముఖ రచయిత, కవి, హాస్యచక్రవర్తి చిలకమర్తి లక్ష్మీనరసింహం.1888 - జననం - అమెరికాలో జన్మించిన బ్రిటిష్ రచయిత, కవి, నోబెల్ పురస్కార గ్రహీత టి.యస్. యిలియట్ (1888-1965)1923 - జననం - ప్రముఖ చలనచిత్ర నటుడు, నిర్మాత, దర్శకుడు - దేవానంద్.1932 - జననం - భారతీయ ప్రథాని, ప్రముఖ ఆర్ధికవేత్త, డా.మన్ మోహన్ సింగ్.
1763 - మరణం - ప్రముఖ ఆంగ్ల రచయిత, కవి జాన్ బైరన్ (1692-1763)
సెప్టెంబర్ 27
1999 - సంఘటన - ప్రముఖ వెబ్ సైట్ 'గూగుళ్ ప్రారంభం.
1932 - జననం - ప్రముఖ భారతీయ దర్శకుడు, నిర్మాత, యాష్ చోప్రా.1981 - జననం - ప్రముఖ భారతీయ క్రికెట్ క్రీడాకారుడు, లక్ష్మీపతి బాలాజీ.
1660 - మరణం - ప్రముఖ ఫ్రెంచ్ సనాతన తత్త్వవేత్త,విన్సెంట్ డె పాల్ (1580-1660)1972 - మరణం - ప్రముఖ భారతీయ గణాంకమూర్తి, యస్.ఆర్. రంగనాథన్. (1892-1872)
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

Saturday, September 27, 2008

ప్రపంచ పుత్రికల దినోత్సవం - సెప్టెంబర్ 28


అంతర్జాతీయ 'పుత్రికాల దినోత్సవం - 28 సెప్టెంబర్



తల్లిదండ్రులు ధనస్సులు - ధనస్సులు సారించే బాణాలు పిల్లలు
భారతీయ హైందవసంస్కౄతి నేర్పిన పాఠం - త్రిమూర్తులను గౌరవించి, ఆరాధించాలి. వారు తల్లి, తండ్రి, ఆచార్యుడు. తల్లిదండ్రులు ధనస్సులు. ఆ ధనస్సులు సారించే బాణాలు పిల్లలు. సంఘంలో మనుగడ సాగించే ప్రతివ్యక్తికి ఒక స్థాయిలో గౌరవ ప్రతిపత్తి ఉంటుంది. అది ఆ వ్యక్తి ఆక్రమించిన స్థానాన్నిబట్టి, నిర్వహించే పాత్రనుబట్టి ఉంటుంది. "ప్రపంచంలో పుట్టిన ప్రతి శిశువూ అంతకు ముందు పుట్టిన దానికన్నా గొప్పగా వుంటుంది; బాల్యంలో ఒకానొక ప్రత్యేక క్షణం వుంటుంది; ఆ క్షణం తలుపులు తెరుచుకుని భవిష్యత్తు లోపలికి అడుగు పెడుతుంది" - అని అంటాడు ప్రముఖ రచయిత చార్లెస్ డికెన్స్.
పిల్లలకు ప్రతిపాదిత సంస్కారంమన భరతభూమి వేదభూమి. వ్యక్తి మనుగడలో, ప్రత్యేకంగా, బాల్యంలో, ఉపనయనం ప్రధానంగా ఎంచబడింది. ఉపనయనం ఆనాడు ఏడవ ఏటనే చేసేవారట. ఉపనయనం జీవితంలో ప్రధానమైన ఘట్టం. వేదకాలంలో ఈ ఉపనయనం బాలురకెంత ప్రధానమైనదో, బాలికలకంత ప్రధానమైనదిగా భావించబడ్డది. ఉపనయనమూ, వేదాధ్యయనమూ, బాలికలకు తగిన వరులను సమకూర్చటంలో విధిగా సహకరించేది. ౠషులచేత వ్రాయబడిన ధర్మశాస్త్ర గ్రంధాలకే స్మౄతులని పేరు. ఆ స్మౄతి కాలంలో కూడ స్త్రీలకు గౌరవ ప్రతిపత్తికి లోపం రాలేదు.
కుమారుడు - కుమార్తె, పుత్రుడు - పుత్రిక మధ్య అంతరాలుఅన్నదమ్ములుగల కుమార్తెకంటే వారు లేని కుమార్తె వలన పితౄవంశానికి అధికలాభం కలుగుతుందని విశ్వసించబడ్డ సంస్కౄతి మన భారతీయ హైందవ సంస్కౄతి. కుమారుడేవిధంగా వంశవర్ధనుడవుచున్నాడో, కుమార్తె కూడ ఆ విధంగానే వంశవర్ధని కాగలదన్న నమ్మకం ఉండేది. అందుకే ఆమెను 'పుత్రికా అన్నపేరు వచ్చింది. అన్నదమ్ములుగల కుమార్తెకు 'పుత్రికా అన్న పదం ఎక్కడా వాడలేదు అని చెప్తారు. అభాత్రుదుహిత తన పుత్రునిద్వారా తన తండ్రిని పున్నామ నరకం నుండి రక్షించుచున్నది. కనుక ఆమెకు పుత్ర ధర్మంగా 'పుత్రికా అన్నపేరు అన్వర్ధమవుతూంది.
ఆడపిల్ల తండ్రి పుణ్యాత్ముడు
"అపుత్రోనేక విధినా సుతాం కుర్వీత పుత్రికాం" అని మనుస్మౄతిలో చెప్పబడి ఉన్నదంటారు. పుత్రులు లేనివారు ఈ విధానం చేత కుమార్తెను పుత్రికగా చేసుకొన వలనని దీని తాత్పర్యం. ఇటువంటి పుత్రికల వలనె తండ్రి వంశం వౄద్ధి అయ్యేది. ఈ విధంగా పూర్వం అనేకులు వంశాభివౄద్ధి చేసుకున్నారు. ఆ కాలంలో ఆడపిల్ల కలవాడు పుణ్యాత్ముడనే స్మౄతుల అభిప్రాయం.
కన్యాదాన ఫలితంషోడశదానాలలో గొప్పదానం కన్యాదానమాత్రంచేత తండ్రితోపాటు అతడి పితౄదేవతలు కూడ తరించుతున్నారని -
"నా స్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా" - బ్రహ్మలోక కాంక్షతో విష్ణుస్వరూపుడవగు నీకు కన్యనర్పించుచున్నాను.
"త్వద్దానాన్మోక్ష మా ప్ను యాం" - ఓ కన్యా! నిన్ను దానం చేయుటచేత మోక్షం పొందగలను.
"కన్యా మి మాం ప్రదాస్యామి పిత్రూణాం తారణాయవై" - పితౄదేవతలు తరించుటకై ఈకన్యను దానం చేయుచున్నాను,
సంవర్తస్మౄతిలో కూడ కన్యాదానానికి వచ్చే ఫలం గురించి విపులంగా చెప్పబడిందని అంటారు.
కుమార్తె తన తండ్రికి అతడి వంశానికి ఎంత మహోపకారి కాగలడో ఈ అధారాలని బట్టి స్పష్ఠం అవుతోంది. స్మౄతికారులు స్త్రీ సంతతి కెంత ప్రాశస్త్యం కల్పించి గౌరవించారో సుస్ఫష్ఠమవుతోంది.
కుమార్తె కేవలం తానేకాక తనసంతతిద్వారా కూడ పితౄవంశానికి మహోపకౄతి సలుపుతూంది. దౌహిత్రుని వలన కూడ మాతామహుని వంశం తరించుతుందని, దౌహిత్రుడంటే పితౄదేవతలకెంతో ప్రీతియట. అదండీ అడపిల్ల, ఆడపిల్ల సంతతి వల్ల కూడ మనకు ఫలితం, లాభం యిప్పుడు విశదమయ్యాయి.
మారుతున్న సంతానధోరణులు - తగ్గుతున్న ఆడపిల్లలుప్రాచీనకాలంలో ఎంతమంది పిల్లలుంటే కుటుంబంలో అంత సిరిసంపదలతోపాటు ఉమ్మడి కుటుంబానికి ఒక అర్ధం, పరమార్ధం ఉండేవి. అష్టగర్భసంజాత నుంచి అష్టైశ్వర్యాలు అన్న విశ్వాసం నుంచి క్రమేపీ యుగధర్మమో, ప్రత్యేకంగా కలియుగధర్మమో కాని, 'చిన్నకుంటుంబం చింతలులేని కుటుంబం' నుంచి 'మేమిద్దరం - మాకిద్దరూ, ఒంటికాయ సొంఠికొమ్ములా తోడులేని ఏకైక సంతానం చెలామణి అవుతున్న కాలప్రవాహంలో ఈదులాడుతున్నాం. మరికొంత తీవ్రతర భావనతో, ఒక్కడైనా పక్కాగా పెంచాలి అన్న, అంతకన్న ఎక్కువైతే ముందుముందు పెంచడం జరగని పని అన్న ధోరణి ఎక్కువైన వాతావరణంలో ఉన్నాం. ఆడ,మగ పిల్లలను గణిత లేఖాంక మూల్యాలతో పోల్చుకుని, లాభనష్టాల బేరీజులు వేసుకునే దుస్థితిలో దున్నుకుంటున్నాం. ఫలితంగా, అందాల భరిణ, కుటుంబానికి అందం, ఆనందం, అదౄష్టం, మాయింటి మహాలక్ష్మి, మాయింటి ఆడపడుచు అన్న శుభసర్వమంగళప్రద వచనాలు కరువైతున్న కలికాలపురోజుల్లో కదంతొక్కుతున్నాం. ఫలితంగా, ఆడాపిల్ల బరువు, బాధ్యత అన్న భావనతో, వద్దనుకోవడం, మనచేతిలోలేని పరిస్థితిలో దూషణ భూషణ తిరస్కారాలతో, అవమానింపబడుతూ, కుటుంబంలో, సమాజంలో, ఆడపిల్ల పెరగడం జరుగుతున్నా, ఆమెకు మాత్రం సమాజంలో భాగం అన్న భావం కించిత్తైనా లేని, రాలేని భావంలోకి నెట్టబడుతున్నారు. గర్భసూచనతో, లింగనిర్ధారణ కూడ చేసుకోగలిగే సాంకేతిక పరిజ్ణానం మనపాలిట శాపంగా మారుతోందన్న వాదనలో అతిశయోక్తి లేదు. గర్భవిఛ్చిన్నతకు కూడ సంసిద్ధమవుతున్నారంటే అంతకంటే దారుణపరిస్థితి వేరేముంటుంది? ఈ నేపథ్యంలో మనం అంతర్జాతీయ 'పుత్రికాల దినోత్సవాలను సెప్టెంబర్ 28 న జరుపుకుంటున్నాం.
అంతర్జాతీయ 'పుత్రికాల దినోత్సవం
పిల్లల హక్కుల విషయంలో ఐక్యరాజ్యసమితివారు నాలుగు ప్రాధమిక హక్కులను పొందితీరాలని తీర్మానించారు. అవి - బతకడం, అభివౄద్ధి, పరిరక్షణ, భాగస్వామ్యం - అని స్పష్ఠపరచారు. ఈ ప్రతిపాదనల్ని, వాటిద్వారా ఉత్పన్నమైన అమలుపత్రాలకు అంగీకారం తెలిపిన మాట అందరకూ తెలిసిన విషయామే. ఈ అమలు విధానాలు - మగ, ఆడ పిల్లలకు వర్తిస్తుందికదా! కాని వాస్తవంగా జరుగుతున్న వైనం దారుణం, అమానుషం. మగపిల్లవాడిని మహారాజుగా అందలం ఎక్కిస్తున్నారు. అయితే ఆడపిల్ల విషయంలో యింటిపాలిట శాపంగాను, కుటుంబభారంగాను అధికభాగం భావిస్తున్నారు. ఫలితంగా గర్భదశలో లింగవివక్షతతో విఛ్చిన్నం చేసుకోవడం, లేదా, ప్రసవానంతరం, ఆడపిల్ల అని హతమార్చడం లేదా ఎక్కడో విడచిపెట్టడం< లాంటి దారుణమైన పనులను చేబడుతున్నారు. గ్రహస్థితి అనుకున్నా, ఎలాగో ఆడపిల్లను భరిద్దాం అనుకుంటూ, తల్లిదండ్రులు పరోక్షంగా, అసంకల్పితంగా, ఆరోగ్య, వైద్యవిధానాల్లో - టీకాలు, పోషకాహారం, మాంసకౄత్తులు, అక్షరాస్యత, విద్య, యిలాంటి సదుపాయాలను కల్పించడంలో, మగపిల్లల కన్న ఆడపిల్లలకు చిన్నచూపు చూస్తున్నారు. ఒక్కొక్కసారి, చూపునే తప్పిస్తున్నారు. ఎలాగయినా, పెళ్ళిచేసుకుని ఒక అయ్యతో వెళ్ళిపోతుంది కదా అని చులకన భావం అధికంగా వున్న రోజుల్లో గడుపుతున్నాం. ప్రస్తుతం ఆడపిల్లల శాతం ఆడశిశుహత్యలు దశాబ్దకాలంగా అధికమయ్యాయి అని గణాంకాలు తెలుపుతున్నాయి. మన దేశ జనాభా గణాంకాల ప్రకారం - ప్రతీ 1000 మంది మగపిల్లలకు - ఆడపిల్లలు - 976 (1960) నుంచి 927 (2001) కు తగ్గాఆరు. మన రాష్ట్రాల్లో పరిస్థితి కేవలం ఐదు రాష్ట్రాల్లోనే - ఆంధ్రప్రదేశ్(978), ఛత్తీస్ ఘర్ (990), కేరళ (1058), మణిపూర్ (978), తమిళనాడు (986), పుదుచ్చెరి (1001) గా దేశ సరసరి మహిళా జనాభాకు అధికంగా అంచనాలు కనిపిస్తున్నాయి. కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల్లో 1000 మంది మగాళ్ళకు అధికంగానే స్త్రీలు ఉన్నారని నిర్ధారణ అయింది. అత్యధిక రాష్ట్రాల్లో - అరుణాచలప్రదేశ్ (901), అస్సాం (932), బీహార్ (921), గోవా (960), గుజరాత్ (921), హర్యానా (861), హిమాచలప్రదేశ్ (970), జమ్మూ-కాశ్మీర్ (900), జార్ఖండ్ (941), కర్ణాటక (964), మధ్యప్రదేశ్ (920), మహారాష్ట్ర (922), మేఘాలయ (975), మిజోరాం (938), నాగాలాండ్ (908), ఒరిస్సా (972), పంజాబ్ (874), రాజస్థాన్ (922), సిక్కిం (875), త్రిపుర (950), ఉత్తారాంచల్ (964), ఉత్తరప్రదేశ్ (878), పశ్చిమబెంగాల్ (934), ఢిల్లీ (821), అండమాన్/నికోబార్ (846), ఛంఢీఘర్ (773), దాద్రా/నగర్ హవేలీ (811), డామన్/డియు709), లక్షద్వీపాలు (947), దేశ సరాసరి స్త్రీల జనాభాకన్న అల్పంగానే వుంది. అందుకే, ఈమధ్య పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం, హర్యానా ప్రాంతాల్లోంచి మగవాళ్ళు, కేరళకు వలసవచ్చి, అక్కడ అమ్మాయిలను వివాహమాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని వ్యాసాలు కూడ వచ్చాయి. దర్శనమవుతున్న విచక్షణలు లింగ విచక్షణ వల్ల, ప్రతి ఆరవ ఆడపిల్ల హత్యకు గురవుతోంది.నాలుగేళ్ళు వయసులోనున్న మగపిల్లల కన్న ఆడపిల్లల్లో మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి.5-9 వయసు గల ఆడపిల్లల్లో 53% నిరక్షరాస్యులుగా కనిపిస్తున్నారు. ప్రముఖ స్వఛ్చందసంస్థ - 'క్రై'( 'సి.ఆర్.వై' - ఛైల్డ్ రిలీఫ్ అండ్ యు ) జరిపిన పరిశోధనలో వెల్లడయిన అసంమజసాలు, జరగకూడనివి, నివారించదగ్గవి - వెరసి, దారుతాతిదారుణాలు. పిల్లల సహాయక సంస్థ కార్యక్రమాలు ఈ పరిస్థితినుంచి అతి త్వరలో, వీలైనంతమటుక్కి, బయటకు పడేయాలన్న తపనతో, 157 సూక్ష్మసంస్థలతో, 16 రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు 'క్రై'జరుగుతున్నాయి. భారతదేశంలో అమలుచేస్తున్న ఈ స్వఛ్చంద స్వంస్థ ఆశ, ఆశయాల ప్రకారం - దేశం, రాష్ట్ర పరిధుల్లో ప్రతీ ఆడశిశువు హక్కులు ఉండాలి, ఉంటాయి, పొందాలి. ఈ ఆశయసాధనకు, ప్రతీవ్యక్తి కంకణం కట్టుకుని, ఆశయసిద్ధికై కౄషి సలపాలని, ప్రభుత్వేతర సంస్థలన్నీ కలసికట్టుగా, ప్రభుత్వాలకు చేయూతనివ్వాలన్న విషయాన్ని అందరూ గమనించాలి. ఆ దిశలో అడుగు ముందుకు వేయాలి. అనుకున్న ఫలితాలను త్వరితగతిని సాధించాలి. సమసమాజంలో హక్కులతోపాటు, విధులను ఆచరించడానికి సమభాగం, సమశాతం ప్రజ అందుబాటులో ఉండాలి. పురుషుడు తన ఆలోచనా సరళిని సంస్కరించుకుని - స్త్రీని కూడా కలుపుకొని ముందుకు సాగిననాడే మానవాళికి నిజమైన అభివౄద్ధి. ఒక్క పురుషుడి అభివౄద్ధి అది ఒక అభివౄద్ధికాదు. ఆ విధంగానే, స్త్రీ తనకు అధికారాలూ - గౌరవమూ చట్టాలద్వారా సంపాదించాలనీ మాతౄస్వామ్యం రావాలనీ ఆందోళనచేసుకుంటూ సంపాదించిన అభివౄద్ధి అసమగ్రమవుతుంది. స్త్రీ పురుషులిద్దరూ, సామరస్యంతో సమిష్టిగా సాధించిన అభివౄద్ధే సర్వతోముఖమైన అభివౄద్ధి. అది భావి తరాలకు అమౄతం కాగలదు. అంతంకాదు ఆరంభం అన్నట్లు - అర్ధనారీశ్వరతత్వమే అర్ధవంతమైంది, సమర్ధవంతమైంది. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవతా:యత్రై తాస్తు నపూజ్యంతేసర్వస్త త్రా ఫలా: క్రియా: ఎక్కడ స్త్రీలు పూజింపబడతోరో అక్కడ దేవతలు క్రీడిస్తారు. ఎక్కడ పూజింపబడరో అక్కడ అన్ని కార్యములు నిష్పలములు - అన్నది భారతీయుల ఆదర్శం. ఫ్రెంచి రచయిత అయిన లూయిస్ జాకానియట్ భారతదేశాన్ని గురించి వ్రాస్తూ - సంఘంలోనూ, కుటుంబంలోనూ, అత్యున్నతమైన స్థానం స్త్రీలకు కల్పించిన భారతీయుల నాగరికత సంస్కౄతి అతి ప్రాచీనమైంది. హిందూమతంలో వేదాలు కల్పించినట్లు, మరే మతంలోను స్త్రీలకు ఉన్నతస్థానం కల్పింపబడలేదు. వారి నాగరికత, సంస్కౄతి జ్యూస్ నాగరికత, సంస్కౄతులకంటే పురాతనమైందీ అని ముగించాడు. శుభంభూయాత్. ప్రపంచ పుత్రికల దినోత్సవం సందర్భంగా, విశ్వంలోని ప్రతీ పుత్రికకు, పుత్రికని కన్న తల్లికీ తెలుగురథం శుభాకాంక్షలను, అభినందనలనీ తెలుపుకుంటోంది. కొంపెల్లశర్మ - తెలుగురథం.

Friday, September 26, 2008

బహు చమత్కారభాషి 'చిలకమర్తి' జయంతి

చిలకమర్తి లక్ష్మీనరసింహం ( 1867 - 1946 ) జయంతి - 26 సెప్టెంబర్
చిలకమర్తివారి ప్రతిభాపర్వం
తన ప్రజ్ౙాచక్షువులతో లోకాన్ని సందర్శించి పండిత పామరులకు అందుబాటులో ఉండే శైలిలో రచనలు సాగించి తెలుగు పఠితలోకానికి వినోదాన్నీ ప్రసాదించిన మహనీయుడు. ఆయన చారిత్రక, సాంఘిక పౌరాణిక నవలలు, జీవిత చరిత్రలు, స్వతంత్ర, అనువాద నాటకాలు, స్వీయచరిత్ర, ఆశుపద్యాలు, తెలుగువాళ్ళకు ఆవశ్యపఠనీయాలయ్యాయి. సంఘసంస్కరణోద్యమంలో కందుకూరివారికి బాసటగా నిలిచిన ప్రజాసేవాపరాయణుడు. వీరి పేరు వినగానే, వెంటనే స్ఫురించేవి - నీవు చెప్పిన విద్యయే నీరజాక్ష, ముదితల్ నేర్వగరాని విదకలదే ముద్దార నేర్పించినన్, భరతఖండంబు చక్కని పాడియావు, వంటి పద్యోక్తులు, సామెతలు సంపాదించుకున్న ప్రాచుర్యాన్ని అందుకో జాలినవి. ఆయన భాషలోని సారళ్యం గురించి అనుభూతి చెందవలసినదే కాని వర్ణించలేము. ఆ మహానుభావుని రచనలు చదువనివాడు, అధునిక ఆంధ్ర సాహిత్యోద్యానవనంలో ఒక విరబూచిన అరుదైన ప్రసూనవల్లరిని చూడలేనివాడై, ఆఘ్రాణించని వాడుగా చరిత్రలో చిరస్థాయిగా స్థాపితమవుతాడు. ఆయన పేరు శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు.
జీవన్విద్యోద్యోగపర్వాలు
పశ్చిమగోదావరిజిల్లా, పెరవలి మండలంలోని ఖండవిల్లి గ్రామంలో వెంకన్న, రత్నమ్మ పుణ్యదంపతులకు 1867 సెప్టెంబర్ 26 న జన్మించిన చిలకమర్తివారు ఒక బ్రాహ్మణకుటుంబంలో జన్మిచారు. వీరవాసరం, నరసాపురంలో ప్రాధమికవిద్య, రాజమండ్రి హైస్కూలులో పట్టంచేబూనడం, 1889లో ఆర్యపాఠశాలలో ఉపాధ్యాయపదవి, యిన్నీసుపేట, మున్సిపల్ స్కూళ్ళలో విద్యాబోధన సాగించారు. తర్వాత సరస్వతి పత్రికాసంపాదకునిగా చేసి, ఉద్యోగానికి స్వస్తిచెప్పి, ఆపైన హిందూ సెకండరీ పాఠశాలను స్థాపించి, తొమ్మిదేళ్ళు నడిపిన తదుపరి, ఈ సంస్థని వీరేశలింగం హైస్కూలుగా మార్చబడింది. దురదౄష్టవశాత్తు 30 ఏళ్ళకే రేచీకటి వ్యాధికి గురైనాకూడా, ఆ అవరోధాన్ని త్రోసిరాజని, తన రచనలను కొనసాగించడంలో చిలకమర్తిగారికున్న పట్టుదలను, ప్రతిభను కొనియాడక తప్పదు.
వైవిధ్యభరిత ప్రతిభారంగాలు
నరసింహంగారు ప్రముఖ కవి, రచయిత, నాటకకర్త, పాత్రికేయుడు, సంఘసంస్కరణవాది, విద్యావేత్త. తెలుగుసాహిత్యాభివౄద్ధికీ, తెలుగుసీమలో ఆధునికభావవికాసానికీ, సేవలనందించిన ప్రముఖుల్లో చిలకమర్తివారు ప్రధమగణంలోకి వస్తారు. కేవలం యిరవైరెండేళ్ళ ప్రాయంలోనే రచించిన గయోపాఖ్యానం నాటకం తెలుగుసాహిత్యంలో కనీ వినీ ఎరుగని విషయం. అంతేకాక, ఈ నాటకంలో, టంగుటూరి ప్రకాశం పంతులుగారు, అర్జునుడి వేషం వేయడం అంతకన్న ప్రాధాన్యత సంతరించుకుంది. 1908లో ముద్రణాలయాన్ని స్థాపించడం, 1916లో గణపతి, రాజరత్నం వంటివి ప్రచురించారు. పాఠశాలలోనున్నప్పుడే పద్యరచనలను ప్రారంభించడం, వరుసగా అనేక రచనలను వ్రాయడం జరిగింది. మొదటి నాటకంగా వ్రాసిన కీచకవధ, ద్రౌపదీపరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామజననం, సీతాకళ్యాణం, పారిజాతాపహరణం లాంటి నాటికలను, రామచంద్రవిజయం, హేమలత, అహల్యాభాయి, సుధాశరశ్చంద్రం లాంటి ముఖ్య నవలలను రచించారు. సరస్వతి పత్రిక సంపాదకులుగా ఉన్నప్పుడు, సౌందర్యతిలకం, పార్వతీపరిణయం రచించారు. యివికాక ఎన్నో రచనలను వ్రాశారు. చిలకమర్తివారి రచనలను మొత్తంగా ప్రచురణకావడం, 1943లో ఆంధ్రవిశ్వవిద్యాలయంవారు కళాప్రపూర్ణ సత్కారంతో సన్మానించడం జరిగింది.
సాహిత్యంతోపాటు, సంస్కరణాభిలాష
ఉపాధ్యాయకత్వం, పత్రికాసంపాదకత్వం, రచనావ్యాసాంగాలతోపాటు, చిలకమర్తివారిలో నిస్కళ్మష మనోప్రవౄత్తితో నడిపించిన పధంగా సంఘసంస్కరణ కార్యక్రమం చెప్పుకోదగ్గ అంకం. మొదటితరం సంస్కరణవేత్తగా 1909లో సంఘంలో వెనుకబడిన వర్గప్రజలకోసం పాఠశాలను స్థాపించడమే కాక, పుష్కరపైకాలం నడపడంతోపాటు, బ్రహ్మసమాజం, హితకారిణీసమాజం వంటి సంస్కరణాధ్యేయంగల సంస్థలతో పాలుపంచుకున్న కార్యక్రమాలు, దేశమాత అనే వారపత్రికద్వారా తెల్లవారి పరిపాలనకు వ్యతిరేకంగా వ్యాసాంగం కావించడం కూడ జరిపారు. యితర ప్రత్యేక వ్యవహారాలు
మొదటినాటకం కీచకవధను 1889 జూన్ 15న ప్రదర్శించి మెప్పుపొందడం జరిగింది. కలకత్తా బ్రహ్మసమాజం నాయకుడు పండిట్ శివానందశాస్త్రి, చిలకమర్తివారిని స్థానిక షేక్స్ పియర్ అని ప్రశంసించేవారు. అనేకమార్లు ప్రదర్శించబడిన గయోపాఖ్యానం నాటకం వసూళ్ళుగా లక్షకుపైగా టిక్కట్లు అమ్ముడుపోవడం, యిప్పటివరకూ కూడ రికార్డు అనే చెబుతారు. 1894లో ఆయన వ్రాసిన రామచంద్రవిజయం సామాజిక నవలకు న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతిని గెలవడం కూడ ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. చిలకమర్తివారు స్వల్పకాలం అవధానప్రక్రియలో కూడ తన ప్రతిభను ప్రదర్శించారు. చిలకమర్తివారు సంకల్పించిన హరిజనోద్ధరణ కార్యక్రమం, మహాత్మాగాంధి దక్షిణాఫ్రికానుంచి భారతదేశం చేరుకోకముందే, ప్రత్యేకంగా పాఠశాలను స్థాపించడం చాలా గొప్పవిషయం అనే చెప్పాలి. నరశింహంగారి గ్రహణ, ధారణ శక్తులు అమోఘం, అద్భుతం అని పలువులు విశ్లేషించారు. మంచి వక్తగా శ్రోతలను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం బాగా పరిపాటి. యివి చాలక, చిలకమర్తివారు భారత జాతీయ కాంగ్రేసు కార్యకలాపాల్లో చురుగ్గా పోల్గొనేవారు.
చిలకమర్తివారి సాహిత్య ప్రతిభోదాహరణాలు
భరతఖండం చక్కని పాడియావు
చిలకమర్తివారి పేరు వెంటనే, అనేక నోళ్ళళ్ళో నానిన పద్యం - భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడవై ఏడుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు, పితుకుచున్నారు మూతులు బిగియగట్టి - అన్న పద్యం చరివినదే చదవడం, ఎందరో కంఠోపాఠం చేయడం, కౄష్ణానదీ వంతెన గోడలమీద పెన్సిళ్ళతో చెక్కబడడం, ఆనాటి గోదావరి సాహితీసభాపర్వాల్లోని పద్యాలతోబాటు హరికధల్లోకికూడ చేరిపోయింది. 1905లో బెంగాలు విభజన సందర్భంగా, బ్రహ్మమత ప్రచారకుడైన బిపిన్ చంద్రపాల్ రాజమండ్రిలో చేసిన ఆంగ్లోపన్యాసాలకు చిలకమర్తివారి ఆంధ్రానువాదాలకు ముగింపు పద్యంగా - ఈగ వ్రాలినగాని వేగ జారెడునట్లు - అన్న పద్యం, ప్రత్యేకంగా, చెవుల సందున గిరజాలు చిందులాడ, మొగము మీదను జిరునవ్వు మొలకలెత్తి, టంగుటూరి ప్రకాశము రంగు మెరియు, ధవళగిరితీర్ధమునకు తరలివచ్చె - అన్న వాక్యాలు, చిలకమర్తి, టంగుటూరి ప్రకాశం, తిరునాళ్ళకు ధవళేశ్వరం వెళ్ళినప్పుడు చెప్పిన పద్యం శాశ్వతంగా సాహిత్యచరిత్రలో స్థానం సంపాదించుకున్నట్టి ఘనత ఆయనదే. చిలకమర్తివారి పకోడీ పద్యాలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కోడికి బదులు పకోడీ తినమని బ్రాహ్మణులకు బ్రహ్మ వరమిచ్చాడని, లక్ష్మణుడు మూర్చకు మారుతికి పకోడీ వుందని తెలియక సంజీవని కోసం పరిగెత్తాడని, చమత్కారంగా హాస్యంగా రచన చేశారు. కందం చెప్పినవాడే కవి అన్న వాడుకను సార్ధకం చేశారు. సాధారణంగా వాడుకలో చెప్పే, ఆసేతు హిమాచలం అన్న ప్రయోగాన్ని, తుహినాద్రి మొదలు సేతువుదాల అని పైనుంచి క్రిందికి వరస చెప్పటం చిలకమర్తిశైలి చమత్కారం అనే చెప్పాలి. దీపంకింద నీడ, గులాబికిముళ్ళు, చందమామకిమచ్చ, చల్లని వానకిపిడుగు లాంటి ఉపమానాలు మాత్రం దొరతనానికి తగునా అని ప్రశ్నించారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం మార్గాన - అధికార భూతాలు అడెగే లంచం, మునసబు కరణాల ముడుపులు, యజమానులకు పంటలో అర్ధభాగం, పైకమిచ్చినవానికి వడ్డీలు, యిచ్చుకునే కాపుకి మిగిలిందేమిటి అని కూడ ప్రశ్నించారు. 1897 లో విక్టోరియారాణి వజ్రోత్సవం, అరవయ్యేళ్ళ పరిపాలన సందర్భంలో, రాజమండ్రిలో జరిగిన సభలో, చిలకమర్తివారు అనేక సీసపద్యాలు సిద్దహస్తత్వంతో చదవడం, పైగా పాదాల చివర, జోలపాట, చిత్తజల్లు, కందపెరడు, విల్లిపిడుగు పదప్రయోగాలు అంతరార్ధాలు చక్కగా గోచరిస్తాయి. తనదేహము, తనగేహము, తన కాలము తన భవమ్ము తన విద్యజగజ్జనులకు వినియేగించిన ఘనుడిగా వీరేశలింగం మరణించినప్పుడు చెప్పిన పద్యం కడు సార్ధకమైంది. పోతనగారు చెప్పిన పద్యం, మన సారధి మన సరిచుఘు మన నెయ్యము అన్నరీతిలో, చిలకమర్తివారిస్నేహం కందుకూరివారిపట్ల వున్న భవం వ్యక్తమవుతోంది. చిలకమర్తివారి గీతమంజరి పద్యాలు వేమనవిలా, పంచతంత్రకధల్లాగ, దీనకల్పద్రుమ అనే మకుటంతో 200 పై చిలుకు పద్యాలను మనోరమ పత్రికలో ప్రచురించడం, భక్తిరసప్రధానమైన రచనగా ఎదపలికినపుడు మ్రోగే భక్తిపరంపరగా పేర్కొనబడ్డాయి. రాతిబొమ్మకేల రంగైన వలువలు, గుళ్ళు గోపురాలు కుంభములను, కూడు గుడ్డ తానుకోరునా దేవుడు అని వేమనకు సరిపోలిక అయింది. పద్యరచనా చమత్కారంతోనే నాటకరంగాన్ని వశపరచుకోవడం, ఆశుకవితలు, శతకపద్యాలు, నాటకపద్యాలు ఏవైనా, చిలకమర్తివారి చేతపడి, నోటపడి, ధన్యమైనాయన్నదాంట్లో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు. చిలకమర్తివారిని కవిగా పరిచయం చేసింది, వారు వివిధ సభల్లో చదివిన పద్యాలనే చెబుతారు. వేదం వెంకటరాయ శాస్త్రిగారి సన్మానసభలో చిలకమర్తివారు పద్యాలు చదవడం, మెచ్చుకోవడం, తర్వాత ఆశుపద్యాలు, నాటకకర్తగా, నవలారచయితగా, ప్రహసనకర్తగా, ప్రసిద్ధికెక్కిన చిలకమర్తివరి కవితావైభవం తెలుగు సాహిత్యంలో సముచితస్థానాన్ని సగౌరవంగా సంపాదించడం ఆయన ప్రతిభకు సహజతార్కాణాలు.
చిలకమర్తివారి స్వీయచరిత్ర
చిలకమర్తివారి స్వీయచరిత్ర వీరేశలింగంవారి చరిత్రకు అనుబంధం వుందనిపిస్తుందంటారు. తిలక్ నిర్యాణం నుంచి స్వాతంత్రోదయం వరకు సామాజిక పరివర్తనను చిలకమర్తి వారి స్వీయచరిత్ర ప్రతిబింబించింది. ఆనాటి సాహిత్యం, సంస్కౄతి, నాటకసమాజాలు, పాఠశాలలు, పత్రికలు, సంఘసంస్కరణ కార్యక్రమాలు, విస్తారంగా వివరించబడ్డాయి. దళితజాతులవారికి రాత్రి పాఠశాలలు, నిమ్యజాత్యుద్ధరణకోసం రామమోహనరాయల పేరున పాఠశాల నిర్వహణ, గయోపాఖ్యానం, చింతామణి నవలల పోటీలో వరసగా బహుమతులు గెల్చుకోవడం, 1893లో గోదావరిజిల్లాలో ప్రవేశించిన మొదటి రైలుబండి, 1895 లో గోదావరి మహాసభల్లో చదివిన పద్యాలు, ఆబాలగోపాలానికి రసనాగ్రాలపై నర్తించేవి.
భరతవాక్యం చిలకమర్తివారి పద్యంలోనే !!!
రాజభక్తి, దేశాభిమానం, జాలి, విధి, అంటూ పద్యాలను చెప్పి పాఠకుల్ని, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం, ఆనాటి సభాసదుల్ని మంత్రముగ్ధుల్ని చేసినట్లు కదలకుండా చేయడం చిలకమర్తివారి పద్యరచనా రహస్యాలలో ముఖ్యమైనవి. అయితే, చివర్లో, నాటక లక్షణశాస్త్ర ఫక్కీలో, 'చిలకమర్తివారు, గౌతమా మండల సభకు ఖ్యాతి మెరయ, పూర్ణ భక్తి సమర్పించె పుష్పమాల, వసుధ వీరవాసరపుర వాసియైన, చిలకమర్తి లక్ష్మీనరసింహమూర్తీ అనే నాటకభరతవాక్యం లాంటి పద్యపుష్పమాలను సమర్పించి గోదావరీమండంలంలో ప్రముఖస్థానాన్ని, ప్రఖ్యాతతను పొందారు. ఈ భరతవాక్యంతోనే ఈ వ్యాసం పరిసమాప్తిచేయడం ఔచిత్యం, సమంజసం.
ప్రముఖ సాహితీవంతుడు, తెలుగుసీమను వీడి జూన్ 17, 1946 రోజున మనకు భౌతికంగా ఎడబాటు తెచ్చినా, చిలకమర్తివారు మాత్రం తెలుగుహౄదయాల్లో మాత్రం ఆత్మగౌరవాన్ని నిరంతరం నింపుతూ చిరస్థాయిగా సుప్రతిష్ఠులయ్యారు అన్నది మాత్రం సత్య, శివ, సుందర భావసమగ్రం.
బహు చమత్కారభాషి, కళాప్రపూర్ణ, హితకారిణీ సంఘసంస్కర్త అయిన శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి జయంతి సందర్భంగా తెలుగురథం ఘన నివాళిని సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

Wednesday, September 24, 2008

నాడు - ఈనాడు - సెప్టెంబర్ 24

నాడు - ఈనాడు - 24 సెప్టెంబర్ ప్రత్యేకతలు
నాడు - ఈనాడు
సెప్టెంబర్ 24 ప్రత్యేకతలు
సంఘటన/ఘటన
పుత్రిక దినోత్సవం
ప్రపంచ హౄదయ దినోత్సవం
ప్రపంచ సుదీర్ఘ చుంబన (ముద్దుల) దినోత్సవం
722 - ప్రోఫెట్ మహమ్మద్ మక్కా నుంచి మదీనా వరకు చేసిన యాత్రకు ముగింపు.1947 - ప్రసిద్ధ 'హోండా' మోటారు కంపెనీ స్థాపన
జననం
1534 - నాల్గవ సిక్కు మతగురువు, రాం దాస్ (1534 - 1581)1925 - ప్రసిద్ధ వైద్య శాస్త్రజ్ౙుడు, ఔతార్ సింగ్ పెయింటల్ (1925 - 2004)1950 - ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు, మొహీందర్ అమర్ నాథ్.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

Tuesday, September 23, 2008

ప్రపంచ పుత్రికల దినోత్సవం - సెప్టంబర్-24

అంతర్జాతీయ 'పుత్రికాల దినోత్సవం - 24 సెప్టెంబర్
తల్లిదండ్రులు ధనస్సులు - ధనస్సులు సారించే బాణాలు పిల్లలు
భారతీయ హైందవసంస్కౄతి నేర్పిన పాఠం - త్రిమూర్తులను గౌరవించి, ఆరాధించాలి. వారు తల్లి, తండ్రి, ఆచార్యుడు. తల్లిదండ్రులు ధనస్సులు. ఆ ధనస్సులు సారించే బాణాలు పిల్లలు. సంఘంలో మనుగడ సాగించే ప్రతివ్యక్తికి ఒక స్థాయిలో గౌరవ ప్రతిపత్తి ఉంటుంది. అది ఆ వ్యక్తి ఆక్రమించిన స్థానాన్నిబట్టి, నిర్వహించే పాత్రనుబట్టి ఉంటుంది. "ప్రపంచంలో పుట్టిన ప్రతి శిశువూ అంతకు ముందు పుట్టిన దానికన్నా గొప్పగా వుంటుంది; బాల్యంలో ఒకానొక ప్రత్యేక క్షణం వుంటుంది; ఆ క్షణం తలుపులు తెరుచుకుని భవిష్యత్తు లోపలికి అడుగు పెడుతుంది" - అని అంటాడు ప్రముఖ రచయిత చార్లెస్ డికెన్స్.
పిల్లలకు ప్రతిపాదిత సంస్కారం
మన భరతభూమి వేదభూమి. వ్యక్తి మనుగడలో, ప్రత్యేకంగా, బాల్యంలో, ఉపనయనం ప్రధానంగా ఎంచబడింది. ఉపనయనం ఆనాడు ఏడవ ఏటనే చేసేవారట. ఉపనయనం జీవితంలో ప్రధానమైన ఘట్టం. వేదకాలంలో ఈ ఉపనయనం బాలురకెంత ప్రధానమైనదో, బాలికలకంత ప్రధానమైనదిగా భావించబడ్డది. ఉపనయనమూ, వేదాధ్యయనమూ, బాలికలకు తగిన వరులను సమకూర్చటంలో విధిగా సహకరించేది. ౠషులచేత వ్రాయబడిన ధర్మశాస్త్ర గ్రంధాలకే స్మౄతులని పేరు. ఆ స్మౄతి కాలంలో కూడ స్త్రీలకు గౌరవ ప్రతిపత్తికి లోపం రాలేదు.
కుమారుడు - కుమార్తె, పుత్రుడు - పుత్రిక మధ్య అంతరాలు
అన్నదమ్ములుగల కుమార్తెకంటే వారు లేని కుమార్తె వలన పితౄవంశానికి అధికలాభం కలుగుతుందని విశ్వసించబడ్డ సంస్కౄతి మన భారతీయ హైందవ సంస్కౄతి. కుమారుడేవిధంగా వంశవర్ధనుడవుచున్నాడో, కుమార్తె కూడ ఆ విధంగానే వంశవర్ధని కాగలదన్న నమ్మకం ఉండేది. అందుకే ఆమెను 'పుత్రికా అన్నపేరు వచ్చింది. అన్నదమ్ములుగల కుమార్తెకు 'పుత్రికా అన్న పదం ఎక్కడా వాడలేదు అని చెప్తారు. అభాత్రుదుహిత తన పుత్రునిద్వారా తన తండ్రిని పున్నామ నరకం నుండి రక్షించుచున్నది. కనుక ఆమెకు పుత్ర ధర్మంగా 'పుత్రికా అన్నపేరు అన్వర్ధమవుతూంది.
ఆడపిల్ల తండ్రి పుణ్యాత్ముడు
"అపుత్రోనేక విధినా సుతాం కుర్వీత పుత్రికాం" అని మనుస్మౄతిలో చెప్పబడి ఉన్నదంటారు. పుత్రులు లేనివారు ఈ విధానం చేత కుమార్తెను పుత్రికగా చేసుకొన వలనని దీని తాత్పర్యం. ఇటువంటి పుత్రికల వలనె తండ్రి వంశం వౄద్ధి అయ్యేది. ఈ విధంగా పూర్వం అనేకులు వంశాభివౄద్ధి చేసుకున్నారు. ఆ కాలంలో ఆడపిల్ల కలవాడు పుణ్యాత్ముడనే స్మౄతుల అభిప్రాయం.
కన్యాదాన ఫలితం
షోడశదానాలలో గొప్పదానం కన్యాదానమాత్రంచేత తండ్రితోపాటు అతడి పితౄదేవతలు కూడ తరించుతున్నారని -
"నా స్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా" - బ్రహ్మలోక కాంక్షతో విష్ణుస్వరూపుడవగు నీకు కన్యనర్పించుచున్నాను.
"త్వద్దానాన్మోక్ష మా ప్ను యాం" - ఓ కన్యా! నిన్ను దానం చేయుటచేత మోక్షం పొందగలను.
"కన్యా మి మాం ప్రదాస్యామి పిత్రూణాం తారణాయవై" - పితౄదేవతలు తరించుటకై ఈకన్యను దానం చేయుచున్నాను,
సంవర్తస్మౄతిలో కూడ కన్యాదానానికి వచ్చే ఫలం గురించి విపులంగా చెప్పబడిందని అంటారు.
కుమార్తె తన తండ్రికి అతడి వంశానికి ఎంత మహోపకారి కాగలడో ఈ అధారాలని బట్టి స్పష్ఠం అవుతోంది. స్మౄతికారులు స్త్రీ సంతతి కెంత ప్రాశస్త్యం కల్పించి గౌరవించారో సుస్ఫష్ఠమవుతోంది.
కుమార్తె కేవలం తానేకాక తనసంతతిద్వారా కూడ పితౄవంశానికి మహోపకౄతి సలుపుతూంది. దౌహిత్రుని వలన కూడ మాతామహుని వంశం తరించుతుందని, దౌహిత్రుడంటే పితౄదేవతలకెంతో ప్రీతియట. అదండీ అడపిల్ల, ఆడపిల్ల సంతతి వల్ల కూడ మనకు ఫలితం, లాభం యిప్పుడు విశదమయ్యాయి.
మారుతున్న సంతానధోరణులు - తగ్గుతున్న ఆడపిల్లలు
ప్రాచీనకాలంలో ఎంతమంది పిల్లలుంటే కుటుంబంలో అంత సిరిసంపదలతోపాటు ఉమ్మడి కుటుంబానికి ఒక అర్ధం, పరమార్ధం ఉండేవి. అష్టగర్భసంజాత నుంచి అష్టైశ్వర్యాలు అన్న విశ్వాసం నుంచి క్రమేపీ యుగధర్మమో, ప్రత్యేకంగా కలియుగధర్మమో కాని, 'చిన్నకుంటుంబం చింతలులేని కుటుంబం' నుంచి 'మేమిద్దరం - మాకిద్దరూ, ఒంటికాయ సొంఠికొమ్ములా తోడులేని ఏకైక సంతానం చెలామణి అవుతున్న కాలప్రవాహంలో ఈదులాడుతున్నాం. మరికొంత తీవ్రతర భావనతో, ఒక్కడైనా పక్కాగా పెంచాలి అన్న, అంతకన్న ఎక్కువైతే ముందుముందు పెంచడం జరగని పని అన్న ధోరణి ఎక్కువైన వాతావరణంలో ఉన్నాం. ఆడ,మగ పిల్లలను గణిత లేఖాంక మూల్యాలతో పోల్చుకుని, లాభనష్టాల బేరీజులు వేసుకునే దుస్థితిలో దున్నుకుంటున్నాం. ఫలితంగా, అందాల భరిణ, కుటుంబానికి అందం, ఆనందం, అదౄష్టం, మాయింటి మహాలక్ష్మి, మాయింటి ఆడపడుచు అన్న శుభసర్వమంగళప్రద వచనాలు కరువైతున్న కలికాలపురోజుల్లో కదంతొక్కుతున్నాం. ఫలితంగా, ఆడాపిల్ల బరువు, బాధ్యత అన్న భావనతో, వద్దనుకోవడం, మనచేతిలోలేని పరిస్థితిలో దూషణ భూషణ తిరస్కారాలతో, అవమానింపబడుతూ, కుటుంబంలో, సమాజంలో, ఆడపిల్ల పెరగడం జరుగుతున్నా, ఆమెకు మాత్రం సమాజంలో భాగం అన్న భావం కించిత్తైనా లేని, రాలేని భావంలోకి నెట్టబడుతున్నారు. గర్భసూచనతో, లింగనిర్ధారణ కూడ చేసుకోగలిగే సాంకేతిక పరిజ్ణానం మనపాలిట శాపంగా మారుతోందన్న వాదనలో అతిశయోక్తి లేదు. గర్భవిఛ్చిన్నతకు కూడ సంసిద్ధమవుతున్నారంటే అంతకంటే దారుణపరిస్థితి వేరేముంటుంది? ఈ నేపథ్యంలో మనం అంతర్జాతీయ 'పుత్రికాల దినోత్సవాలను సెప్టెంబర్ 24 న జరుపుకుంటున్నాం.
అంతర్జాతీయ 'పుత్రికాల దినోత్సవం
పిల్లల హక్కుల విషయంలో ఐక్యరాజ్యసమితివారు నాలుగు ప్రాధమిక హక్కులను పొందితీరాలని తీర్మానించారు. అవి - బతకడం, అభివౄద్ధి, పరిరక్షణ, భాగస్వామ్యం - అని స్పష్ఠపరచారు. ఈ ప్రతిపాదనల్ని, వాటిద్వారా ఉత్పన్నమైన అమలుపత్రాలకు అంగీకారం తెలిపిన మాట అందరకూ తెలిసిన విషయామే. ఈ అమలు విధానాలు - మగ, ఆడ పిల్లలకు వర్తిస్తుందికదా! కాని వాస్తవంగా జరుగుతున్న వైనం దారుణం, అమానుషం. మగపిల్లవాడిని మహారాజుగా అందలం ఎక్కిస్తున్నారు. అయితే ఆడపిల్ల విషయంలో యింటిపాలిట శాపంగాను, కుటుంబభారంగాను అధికభాగం భావిస్తున్నారు. ఫలితంగా గర్భదశలో లింగవివక్షతతో విఛ్చిన్నం చేసుకోవడం, లేదా, ప్రసవానంతరం, ఆడపిల్ల అని హతమార్చడం లేదా ఎక్కడో విడచిపెట్టడం< లాంటి దారుణమైన పనులను చేబడుతున్నారు. గ్రహస్థితి అనుకున్నా, ఎలాగో ఆడపిల్లను భరిద్దాం అనుకుంటూ, తల్లిదండ్రులు పరోక్షంగా, అసంకల్పితంగా, ఆరోగ్య, వైద్యవిధానాల్లో - టీకాలు, పోషకాహారం, మాంసకౄత్తులు, అక్షరాస్యత, విద్య, యిలాంటి సదుపాయాలను కల్పించడంలో, మగపిల్లల కన్న ఆడపిల్లలకు చిన్నచూపు చూస్తున్నారు. ఒక్కొక్కసారి, చూపునే తప్పిస్తున్నారు. ఎలాగయినా, పెళ్ళిచేసుకుని ఒక అయ్యతో వెళ్ళిపోతుంది కదా అని చులకన భావం అధికంగా వున్న రోజుల్లో గడుపుతున్నాం.
ప్రస్తుతం ఆడపిల్లల శాతం
ఆడశిశుహత్యలు దశాబ్దకాలంగా అధికమయ్యాయి అని గణాంకాలు తెలుపుతున్నాయి. మన దేశ జనాభా గణాంకాల ప్రకారం - ప్రతీ 1000 మంది మగపిల్లలకు - ఆడపిల్లలు - 976 (1960) నుంచి 927 (2001) కు తగ్గాఆరు.
మన రాష్ట్రాల్లో పరిస్థితి కేవలం ఐదు రాష్ట్రాల్లోనే - ఆంధ్రప్రదేశ్(978), ఛత్తీస్ ఘర్ (990), కేరళ (1058), మణిపూర్ (978), తమిళనాడు (986), పుదుచ్చెరి (1001) గా దేశ సరసరి మహిళా జనాభాకు అధికంగా అంచనాలు కనిపిస్తున్నాయి. కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల్లో 1000 మంది మగాళ్ళకు అధికంగానే స్త్రీలు ఉన్నారని నిర్ధారణ అయింది.
అత్యధిక రాష్ట్రాల్లో - అరుణాచలప్రదేశ్ (901), అస్సాం (932), బీహార్ (921), గోవా (960), గుజరాత్ (921), హర్యానా (861), హిమాచలప్రదేశ్ (970), జమ్మూ-కాశ్మీర్ (900), జార్ఖండ్ (941), కర్ణాటక (964), మధ్యప్రదేశ్ (920), మహారాష్ట్ర (922), మేఘాలయ (975), మిజోరాం (938), నాగాలాండ్ (908), ఒరిస్సా (972), పంజాబ్ (874), రాజస్థాన్ (922), సిక్కిం (875), త్రిపుర (950), ఉత్తారాంచల్ (964), ఉత్తరప్రదేశ్ (878), పశ్చిమబెంగాల్ (934), ఢిల్లీ (821), అండమాన్/నికోబార్ (846), ఛంఢీఘర్ (773), దాద్రా/నగర్ హవేలీ (811), డామన్/డియు709), లక్షద్వీపాలు (947), దేశ సరాసరి స్త్రీల జనాభాకన్న అల్పంగానే వుంది. అందుకే, ఈమధ్య పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం, హర్యానా ప్రాంతాల్లోంచి మగవాళ్ళు, కేరళకు వలసవచ్చి, అక్కడ అమ్మాయిలను వివాహమాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని వ్యాసాలు కూడ వచ్చాయి. దర్శనమవుతున్న విచక్షణలు
లింగ విచక్షణ వల్ల, ప్రతి ఆరవ ఆడపిల్ల హత్యకు గురవుతోంది.నాలుగేళ్ళు వయసులోనున్న మగపిల్లల కన్న ఆడపిల్లల్లో మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి.5-9 వయసు గల ఆడపిల్లల్లో 53% నిరక్షరాస్యులుగా కనిపిస్తున్నారు.
ప్రముఖ స్వఛ్చందసంస్థ - 'క్రై'( 'సి.ఆర్.వై' - ఛైల్డ్ రిలీఫ్ అండ్ యు ) జరిపిన పరిశోధనలో వెల్లడయిన అసంమజసాలు, జరగకూడనివి, నివారించదగ్గవి - వెరసి, దారుతాతిదారుణాలు.
పిల్లల సహాయక సంస్థ కార్యక్రమాలు
ఈ పరిస్థితినుంచి అతి త్వరలో, వీలైనంతమటుక్కి, బయటకు పడేయాలన్న తపనతో, 157 సూక్ష్మసంస్థలతో, 16 రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు 'క్రై'జరుగుతున్నాయి. భారతదేశంలో అమలుచేస్తున్న ఈ స్వఛ్చంద స్వంస్థ ఆశ, ఆశయాల ప్రకారం - దేశం, రాష్ట్ర పరిధుల్లో ప్రతీ ఆడశిశువు హక్కులు ఉండాలి, ఉంటాయి, పొందాలి. ఈ ఆశయసాధనకు, ప్రతీవ్యక్తి కంకణం కట్టుకుని, ఆశయసిద్ధికై కౄషి సలపాలని, ప్రభుత్వేతర సంస్థలన్నీ కలసికట్టుగా, ప్రభుత్వాలకు చేయూతనివ్వాలన్న విషయాన్ని అందరూ గమనించాలి. ఆ దిశలో అడుగు ముందుకు వేయాలి. అనుకున్న ఫలితాలను త్వరితగతిని సాధించాలి.
సమసమాజంలో హక్కులతోపాటు, విధులను ఆచరించడానికి సమభాగం, సమశాతం ప్రజ అందుబాటులో ఉండాలి. పురుషుడు తన ఆలోచనా సరళిని సంస్కరించుకుని - స్త్రీని కూడా కలుపుకొని ముందుకు సాగిననాడే మానవాళికి నిజమైన అభివౄద్ధి. ఒక్క పురుషుడి అభివౄద్ధి అది ఒక అభివౄద్ధికాదు. ఆ విధంగానే, స్త్రీ తనకు అధికారాలూ - గౌరవమూ చట్టాలద్వారా సంపాదించాలనీ మాతౄస్వామ్యం రావాలనీ ఆందోళనచేసుకుంటూ సంపాదించిన అభివౄద్ధి అసమగ్రమవుతుంది. స్త్రీ పురుషులిద్దరూ, సామరస్యంతో సమిష్టిగా సాధించిన అభివౄద్ధే సర్వతోముఖమైన అభివౄద్ధి. అది భావి తరాలకు అమౄతం కాగలదు. అంతంకాదు ఆరంభం అన్నట్లు - అర్ధనారీశ్వరతత్వమే అర్ధవంతమైంది, సమర్ధవంతమైంది.
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవతా:యత్రై తాస్తు నపూజ్యంతేసర్వస్త త్రా ఫలా: క్రియా:
ఎక్కడ స్త్రీలు పూజింపబడతోరో అక్కడ దేవతలు క్రీడిస్తారు. ఎక్కడ పూజింపబడరో అక్కడ అన్ని కార్యములు నిష్పలములు - అన్నది భారతీయుల ఆదర్శం.
ఫ్రెంచి రచయిత అయిన లూయిస్ జాకానియట్ భారతదేశాన్ని గురించి వ్రాస్తూ - సంఘంలోనూ, కుటుంబంలోనూ, అత్యున్నతమైన స్థానం స్త్రీలకు కల్పించిన భారతీయుల నాగరికత సంస్కౄతి అతి ప్రాచీనమైంది. హిందూమతంలో వేదాలు కల్పించినట్లు, మరే మతంలోను స్త్రీలకు ఉన్నతస్థానం కల్పింపబడలేదు. వారి నాగరికత, సంస్కౄతి జ్యూస్ నాగరికత, సంస్కౄతులకంటే పురాతనమైందీ అని ముగించాడు.
శుభంభూయాత్. ప్రపంచ పుత్రికల దినోత్సవం సందర్భంగా, విశ్వంలోని ప్రతీ పుత్రికకు, పుత్రికని కన్న తల్లికీ తెలుగురథం శుభాకాంక్షలను, అభినందనలనీ తెలుపుకుంటోంది.
కొంపెల్లశర్మ - తెలుగురథం.

నాడు - ఈనాడు - ప్రత్యేకతలు - సెప్టెంబర్ 23

నాడు - ఈనాడు - 20-23 ప్రత్యేకతలు
సెప్టెంబర్ 20 ప్రత్యేకతలు
ఘటన/సంఘటన
1857 - ఈష్ట్ యిండియా మద్దత్తుదారులచే 'ఢిల్లీ' కైవసం.
జననం
1911 - భారతీయ ఆధ్యాత్మిక గురువు, శ్రీరామ ఆచార్య శర్మ (1911-1991)
1924 - ప్రముఖ తెలుగుచిత్ర నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత అక్కినేని నాగేశ్వర రావు
1934 - ప్రముఖ ఇటలీదేశ నటీమణి - సోఫియా లారెన్.
మరణం
1933 - మహిళా హక్కులపై కౄషి సలిపిన ప్రముఖ వ్యక్తి, అనిబెసెంట్ (1847 - 1933)
సెప్టెంబర్ 21 ప్రత్యేకతలు
ఘటన/సంఘటన
అంతర్జాతీయ శాంతి దినోత్సవం
1995 - హిందూదైవం, వినాయకుడు పాలు తాగుతున్నాడు అయి భక్తులు అచంచల భక్తివిశ్వాసాలను ప్రకటించి, ప్రత్యేక పూజలను దేశం వ్యాప్తంగా జరిపారు.
2004 - మార్కిస్ట్-లెనినిస్ట్ మరియు పీపిల్స్ వార్ మరియు మావోయీల భారతీయ కమ్యూనిష్ట్ పార్టీ శాఖలు, కమ్యూనిష్ట్ పార్టీ ఆఫ్ యిండియా (సి.పి.ఐ._ - మావోయిష్ట్) సంస్థగా అవతరణ.
జననం
1861 - ప్రముఖ కవి, నాటకకర్త, గురజాడ అప్పారావు జయంతి (1861 - 1915)
1902 - సర్ అల్లెన్ వేన్, పెంగ్విన్ పుస్తక ప్రచురణ సంస్థ బ్రిటిష్ వ్యవస్థాపకులు. (1902 - 1970)
1980 - హిందీ చలనచిత్ర నటి - కరీనాకపూర్.
1981 - దక్షిణభారతీయ నటి రిమీసేన్.
సెప్టెంబర్ 22 ప్రత్యేకతలు
ఘటన/సంఘటన
1499 - స్విట్జర్లాండ్ స్వతంత్రదేశం
1888 - నేషనల్ జియోగ్రఫిక్ మాగజైన్ ప్రచురణ
1896 - తాత కింగ్ జార్జ్-2 ని అత్యధిక కాలంపాటు నింరకుశ పరిపాలనుంచి, బ్రిటిష్ చారిత్రాత్మక సంఘటనగా విక్టోరియా మహారాణి కైవసం.
1965 - భారత - పాకీస్తాన్ యుద్ధం (1965) - రెండవ కాశ్మీర్ యుద్ధం పై ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంలో సమాప్తం.
2006 - యింటర్నెట్ వినియోగం పై అవగాహన - 'వన్ వెబ్ డే' గా ప్రకటన.
మరణం
1539 - సిక్కుమత గురువు - గురునానక్ (1469 - 1539)
1952 - ప్రముఖ కవి, చిత్రకళాకారుడు అడవి బాపిరాజు (బాపి బావ) (1895 - 1952)
సెప్టెంబర్ 23 ప్రత్యేకతలు
ఘటన/సంఘటన
1803 - రెండవ ఆంగ్ల - మరాఠ యుద్ధం (అస్సై యుద్ధం)
1846 - గ్రహం - నెప్ట్యూన్ ని ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త అర్బైన్ జీన్ జోసెఫ్ లి వారియల్)
2002`- వెబ్ శోధనా వేదిక - మొజిల్లా ఫైర్ ఫాక్స్ (1) విడుదల.
జననం
1902 - ప్రముఖ కవి, నాటక కళాకారుడు, స్థానం నరసింహారావు (1902 - 1971)
1922 - ప్రముఖ కర్నాటక సంగీత వీణ కళాకారుడు ఈమని శంకరశాస్త్రి (1922 - 1987)
1943 - ప్రముఖ నటీమణి తనూజ (నేటి హిందీ చిత్ర కథానాయకి కాజోల్ కు తల్లి)
1957 - ప్రముఖ హిందీచిత్ర గాయకుడు కుమార్ షానో
1971 - ప్రముఖ పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడు, మోయిన్ ఖాన్.
మరణం
1939 - ప్రముఖ మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ (1856 - 1939)
కొంపెల్ల శర్మ - తెలుగురధం.

Sunday, September 21, 2008

ప్రపంచ శాంతి దినోత్సవం - శాంతి కై విశ్వవ్యాప్తి కృషి

ప్రపంచ శాంతి దినోత్సవం - సెప్టెంబర్ 21
శాంతి ప్రస్తావనలు
'హర్మ్యమందు (మిద్దిల్లు) శోకమున నడలుకంటే, శాంతిదాయక కాననస్థలమెమేలూ - అంటారు కవికోకిల దువ్వూరి రామిరెడ్డిగారు. కవికోకిలవి కమనీయ వాక్కులేకాక సత్యవాక్కులుకూడా.
శాంతమిద మాశ్రమపదం - కణ్వాశ్రమంలో అడుగిడుతూంటేనే శాంతి వాతావరణం గోచరించిందట దుష్యంతునికి.
భక్తప్రహ్లాదుడే మున్ను వసుధపైన నారసింహాకౄతిని శాంతిని కోరినాడు అని ఆకలిమంట అన్న రచనలో వేదాంతకవి ప్రస్తుతించాడు.
ఏ భాషలో భాషించినా శాంతి ఛందోవ్యాకరణం ఒక్కటే సుమా. పోరు మంచికాదు ధరణిలో అణువైనా అన్నది కూడ సత్యం.
దాంతునకైన, వేదాంతునకైనా శాంతము లేక సౌఖ్యమూ లేదు అన్నాడు స్వరబ్రహ్మ త్యాగరాజు.
ప్రపంచధోరణుల్లో శాంతి సందేహాలంకారమైతే, కామక్రోధసహిత రాగాహంకారాలు స్వభావోక్తిపరమయ్యాయి.
శాంతి-సమరం పోట్లాడుకునే కవలలు
ద్రవ్యానికి లొంగ్ఫనిది, సాధనతోనే సంప్రాప్తించేది, ప్రియాతిప్రియమైన అంగడిసరకు, అత్యంత విలువైనది, భారతీయ సనాతన సాంప్రదాయ వాంగ్మయంలో మోక్షద్వారానికి 'శమం' ప్రధమద్వారపాలకీయం చేస్తుంది. శమం వినా శాంతి ప్రస్తావన లేదు, రాదు. ప్రశాంతి మాటలు వేరేల? శాంతిలోపం శతౄత్వానికి దారితీస్తోంది. శతౄత్వం సమరానికి నాంది, ప్రస్తావనలే పర్వాలు. ఆషామాషి శతౄత్వాలకైతే పరవాలేదుకాని, శాత్రవుడు కంటకుడు, తనంతటవాడై సమజోడైతే, కంటికి నిదురరాదు, రతికేళి రుచించదు, శతౄవు కొరకు రగిల్చిన అగ్నికణాలు యితరుల్ని కణాలుగా కాల్చినా నీరు కార్చలేవు. సరిసములైన శతౄవుల వర్ణన అతీతమే మరి. గగనం గగనాకారం, సాగరం సాగరోపమ: అన్న సూక్తి వర్తిస్తుంది. మనోవికారాలే తప్ప రాజ్యాలు సామ్రాజ్యాధిపతులు నిత్యం పోరాడాల్సిన శతౄవులు కానేకారు. వర్గ, జాతి, రాజ్య, రాజకీయ వైరుధ్యపు పోరాట పరిష్కార ప్రయత్నాల్లో యుద్ధం, అశాంతి, అకారణంగా అనివార్యమవుతున్నాయి. సాయుధబలం కన్నా నైతికబలం విజయానికి సహాయకారి అన్నది కూడ నిజమే. ముందు నుయ్యి, వెనుకగొయ్యి మాదిరి యుద్ధం వినా అవశ్యమరణం, యుద్ధసహిత జీవన సంశయాస్పదం అని చెప్పాలి. ఎంత శాంతి యజ్ౙ యగాదులాచరించినా, శాంతికపోతాల్ని గగనసీమల్లోకి వదలినా, సత్యాగ్రహాలు, నిగ్రహం కోల్పోయాక, ప్రయోజనరహిత ప్రజ్ౙాన ప్రక్రియలుగా అవతరిస్తాయి.
వ్యక్తి నుంచి ప్రపంచం వరకూ ...
ప్రపంచశాంతి కన్నా, వ్యక్తి మారనిది ఏ శాంతీ నిలవదు. తన అశాంతిలో ప్రపంచశాంతిని కాలదన్నుకుంటాడు. అందుకే, రెండు యుద్ధాల మధ్య వ్యవధి శాంతి అన్న కవివాక్కు ప్రభావాన్ని రేకెత్తే భావమనే చెప్పాలి. అందుకే శాంతి యివ్వవలసింది కానీ, పుచ్చుకోవలసినది కాదు అని అంటాడు బోయి బీమన్న కవి, విశ్వశాంతి అన్న రచనలో. ఆకలిదప్పులు తీరాలి, కామవాంఛలు తీరాలి, తోటిమానవునితోపాటు తనకు న్యాయం జరుగుతోందనే ఆత్మతౄప్తి ఏర్పడాలి, నలుగురితోపాటు తనకూ సుఖశాంతులున్నాయనే పరితౄప్తితో దు:ఖోపశమనం కలగాలి, అంతదాకా ఈ భూగోళంమీద శాంతి సిద్ధించుతుందనుకోవటం పిచ్చివాడికలవరింపు - అంటాడు ప్రముఖ రచన చంఘీజ్ ఖాన్ రచనలో తెన్నేటిసూరి.
మానవీయతకు వెన్నెముక మానవీయతకు వెన్నెముక, సాధనకు శ్వాసవంటిది శాంతి. కామక్రోధరాహిత్యాన్ని వికసింపజేసి సాధించేది ప్రశాంతి. శాంతిసాధన, ఆత్మవివేచనాత్మక కళారాధన, ఆద్యంతాలు లేని నిష్కళంకమూర్తి. సర్వకాల శక్త్యానుభవాల్లో ఆత్మానుభూతి అనివార్యం. ధన, విద్య, గుణ, బలాల్లో కూడ శాంతి కరువైపోతోంది. ప్రేమత్యాగాలు పెంపొందించుకుంటేనే శాంతికవాటాలు తెరుచుకుంటూ వస్తుంది. శతౄత్వాన్ని సత్యంగా ఎదుర్కోవాలి. శాంతి పర్వాన్ని సమరాధ్యాయానికి జోడించాల్సిన సమయం ఆసన్నమైంది. నిరంకుశపు దుష్కరాల్ని బాహాటంగా ప్రకటించాలి. ప్రస్తుతం దారుణాతిదారుణంగా రెచ్చిపోతున్న అమెరికాసామ్రాజ్యపు అమానుషపు చర్యల్ని నిజంగా నిరసిస్తూ సామ్రాజ్యాన్ని సమూల బహిష్కరణ కావించాలి. శిశుభాషలో కటిఫ్ చేసేసి, జట్టుకి పచ్చి కొట్టేయాలి. ప్రతీ భారతీయ పౌరుడు అందుకొన్న అమెరికా వీసాలను ఆగ్రహావేశాలతో విసరివేయాలి. ఆ తరుణం ఆసన్నమవుతుందా? ఆత్మాభిమానాన్ని ఆవగింజంతైనా పదిలపరచుకొని, త్వరితగతిని స్వర్ణాంధ్రభారతానికి తిరుగు ప్రయాణం కావించాలి. అధ్యాయాన్ని ప్రారంభించి, ముగింపుకు శుభారంభం చేయాలి. నవీన ప్రపంచీకరణ, సరళీకౄత నాయకత్వపు కుహనాపథాలకు దొంగ సలాములు మానాలి. ప్రస్తుతం వీస్తున్న అణు ఒప్పొందం పై వివాదపు గాలి, అమెరికా వెలగబెట్టిన రహస్యపు ఒప్పందపు పత్రాలు ఒక ఉదాహరణ అనే చెప్పాలి. భారతదేశం యిటువంటి పరువుతక్కువ ధోరణులకు భరతవాక్యం పలకాలి. వాణిజ్యపు విపణివీధులకు వావివరుసల్ని ప్రకటించాలి. వేదోపనిషత్తుల ప్రవచనస్వరాలను స్వరాలాపనం చేస్తూ శాంతిసూక్తుల్ని శ్రావ్యపఠనం కావించాలి. ప్రపంచం యావత్తూ ప్రశాంతిమయంగా మారాలని, ప్రసన్న మనస్కులై చిత్తశుద్ధితో చిదానందంగా యావజ్జగత్ప్రజానీకం ప్రశాంతమూర్తులై ప్రభవిల్లాలని ప్రార్ధనా తరంగాలని ప్రవహింపజేయాలి.
నాకు శాంతి కావాలి
'నాకు శాంతి కావాలీ అని ప్రతీ పౌరుడూ ఏదో దశలో భావించడం జరుగుతుంది. నాకు - అహంకారపూరితమైనది. కావాలి - కాముకతకు ప్రతిబింబం కవాటాల మధ్య రెంటికీ నడుమ శాంతి కపోతం రెపరెపలాడుతుంది. యుద్ధంలో వెనుకంజ వేయడం బుద్ధిహీనత. అనివార్యయుద్ధం అంటూవుండదు. యుద్ధం వచ్చింది అంటూవుండదు. యుద్ధం వచ్చింది అంటే మానవమేధస్సు విఫలమైంది అని చెప్పాలి. ఈ భావననే ప్రముఖ ఆంగ్ల రచయిత టి. యస్. యిలియట్ - హోల్డర్స్ హాక్స్లీ - అన్న రచనలో : 'శాంతి, ప్రశాంతి, మిగిలింది అశాంతీ, అంటాడు.
నేను సైతం ప్రపంచశాంతికై ...
దేశాలు యుద్ధాల్లో పుట్టాయి. సామ్రాజ్యాలు శాంతిలో ఆవిర్భవించాయి. యుద్ధం రాజకీయాల కొనసాగింపు, రాజకీయం యుద్ధానికి కొనసాగింపు. యుద్ధాల ద్వారా యుద్ధాలను ఆపలేని వాస్తవం. ఈ పరిస్థితుల్లో ప్రపంచ పరిధికి అర్ధం మారుతున్నా, విశ్వం - వినాశక విషయానికి వేరే అర్ధరూపకత, వేరే భావసౌందర్యత భాసిస్తోంది. అందరూ యోధులే జీవితసమరంలో. కొందరు అగ్రసరులు, కొందరులు అనుసరులు. ఈ రంగ, రణరంగ, రణగొణ ధ్వనులమధ్య శాంతికై తపన, ప్రపంచశాంతికై శాంతి కాముకుల పవిత్ర యత్నంలో, నేను సైతం ...ప్రపంచశాంతికి ... అన్నట్లు సంకల్పదీక్షాకంకణ బద్ధుడను అని ప్రతీవ్యక్తి భావించి, ఆచరణకు నోచుకోవాలి.
ఏది ఏమైనా, శ్రీశ్రీ ప్రహేళికలో గడికి సహాయవర్ణాన్ని చెప్పినట్లు - ఓరీతులువా! పద్ధతులు మార్చు - అన్న వివాదపువిన్యాసాలమధ్య నిలిచేది నేటి నినాదం.
సత్యం - ధర్మం - ప్రేమ - శాంతి, ఒకభాగం ఆచరణ, యింకొక భాగానికి దారితీస్తుంది.
అంతర్జాతీయ/ప్రపంచ శాంతి దినోత్సవం - 21 సెప్టెంబర్
అంతర్జాతీయ, ప్రపంచస్థాయిలో వివిధ దేశాలమధ్య సహౄధ్బావ వాతావరణం, అహింస, శాంతి, సౌజన్యతాది భావాల సాధనకోసం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయస్థాయిలో, ప్రపంచశాతిదినోత్సవాన్ని నిర్వహించడం రివాజుగా మారింది. అంతర్జాతీయ సాధారణ సమితి చొరవ మేరకు 1981 నుంచి సెప్టెంబర్ నెలలో మూడవ మంగళవారం రోజున జరుపుకోవడం ప్రారంభించారు. జిరిమీజెల్లీ, పీస్ వండే సంయుక్త ప్రచారం మూలాన, 2002 నుంచి సెప్టెంబర్ 21 న జరుపుకుంటున్నారు. ఆ రోజు జరుపుకునే సంబరాల్లో శాంతి ఆచరణ, యుద్ధవిరమణ కొరకై తగు చర్యలు ప్రారంభమవుతాయి. అయితే, 1995 లో అరవైకి పైగా దేశాల్లోని ప్రజలు విరాళంగా ఇచ్చిన నాణేలతో ఒక పెద్ద గంటను తయారుచేసి ఐక్యరాజ్యసమితి పరిధిలోని జపాన్ కార్యాలయంలో వుంచేందుకు బహూకరించారు. న్యూయార్క్ లోని ఈ కేంద్రకార్యాలయపు ప్రాంగణంలోని వెష్ట్ కోర్ట్ గార్డెన్ లోని గార్డెన్లో ప్రతీ ఏట శాంతి దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు ఈ గంట ఆవరణలో శాంతి ఉత్సవాల్ని నిర్వహించడం జరుగుతోంది. ఏడాదికి వందలవేలకోట్లు తూటాలు తయారవడం జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచంలోని ప్రతీ మనిషిని రెండేసి పర్యాయాలు కాల్చడానికి సరిపడే సామగ్రిని సౄష్టిస్తున్నారని కూడ విశ్లేషకుల వాదనలు. ఏదేశం ఎంతెంత మందుగుండు సామగ్రిని ఎగుమతి చేసుకోవడంలో నిర్ధారణకు వచ్చేందుకు స్వఛ్చందసంస్థలచే సమాచారపరిశోధన కూడ చేయించడం జరిగింది.
ప్రపంచ శాంతి పురస్కారాలు
ప్రపంచవ్యాప్తంగా శాంతిసాధనలో అవిరళకౄషిని సలిపి, ఫలితాలతోపాటు గుర్తింపులను పొందిన ప్రముఖులకు పురస్కారాలను అందజేయడం ప్రారంభమైంది.
నోబెల్ శాంతి పురస్కారం
1901 లో ప్రారంభమైన నోబెల్ శాంతి పురస్కారాన్ని జీన్ హెన్రీడ్ డురాంట్ (స్విడ్జర్లాండ్), ఫ్రెడరిక్ పాసీ (ఫ్రాన్స్)లకు దక్కగా, 2006 లో బంగ్లాదేశ్ లో సూక్ష్మ పరపతి, ఆర్ధికరంగంలో విశేషకౄషిని సలిపిన బంగ్లాదేశ్ గ్రామీణబాంక్ అధినేత - మహమ్మద్ యూనస్ కు దక్కడం విశ్వవ్యాప్తంగా చెలరేగిపోతున్న బీదజనావళికి అంకితంగా భావించవచ్చు. 1979 లో నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రముఖ సేవకురాలు మదర్ తెరిస్సా ను వరించడం మనదేశానికి గర్వకారణం.
లెనిన్ శాంతి పురస్కారం
1950 లో ప్రారంభమైన లెనిన్ శాంతి పురస్కారాన్ని ప్రధమంగా ఫ్రెడరిక్ జోలియట్ క్యూరీకి అందిస్తే, 1990 లో ప్రకటించిన లెనిన్ పురస్కారం నెల్సన్ మండేలాకు లభించడం ఒక సంగతైతే, దక్షిణాఫ్రికా లో అనుభవించిన జైలుశిక్ష మూలాన 2002 లోనే అందించారు.
2008 ఉత్సవాలు - యోగసాధన ద్వారా శాంతి సాధన
ప్రపంచ/అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఈసారి, అంటే 2008 సంవత్సరం, ప్రతీ మానవ కుటుంబం శాంతి వర్గానికి ప్రతినిథి కావాలని, ఈ సందేశం ద్వారా శాంతిసాధనం కావించాలని తీవ్రప్రయత్నాలు ముమ్మరంగా జరుపుకునే పండగ వాతావరణంలోకి ప్రవేశిస్తున్నాం. ప్రపంచ మానవాళి, వివాదం, బీదతనం, ఆకలి, మానవ హక్కుల రక్షణ, సాధన యిత్యాదీంశాలపై కౄషి చేసి, వాటిని త్వరలో నిర్మూలించే దిశదశల్లో కౄషి చేయాలి అన్నది ఐక్యరాజ్యసమితి సందేశం అందించింది. ప్రపంచ శాంతి విషయాన్ని దత్తత తీసుకుని అరవై ఏళ్ళు పూర్తికావడం మరో విశేషం. అయితే, అంతర్జాతీయ స్థాయిలో శాంతిసాధనలో జరిగిన కౄషి, ఫలితాలను సాధించిన వైనాల సంగతి, అమలుదారుల విజ్ౙతకే వదలాలి మరి. ఏది ఏమైనా, మానవహక్కుల సాధనకై, విశ్వవ్యాప్తిగా తీవ్రమైన కౄషి జరగవలసింది అని మాత్రం ఘంటాపథంగా చెప్పవచ్చు.
ఆదిమధ్యాంతసహితం శాంతి
స్వేఛ్చలోనే ఏదో శాంతి, బాధలున్నా సరే, బానిసత్వంలోనే ఏదో అశాంతి బాధ లేకపోయినా సరే - అని చాలా చమత్కార భావగర్భితంగా, మ్యూజింగ్స్ లో విప్లవకవి చలం అన్నారు. అంతేకాదు, వుత్త సరదాలేని సుఖంలో బతకడమే చాతనైతే ఎన్నడో శాంతిలో స్థిరపడిపోయి వుండును మానవజీవితం అని కూడ అంటాడు చలం. డబ్బుతో శాంతిని కొనుక్కోలేం కదా అని ఏదో తెలియని విషయం చెప్పినట్లు చెబుతారు కొందరు.
శాంతినికేతన్ లో వుండే శాంతి చిత్తశాంతి - శాంతి ఉద్యమాల్లోని శాంతి రాజకీయశాంతి - అని నీలితెరలు రచనలో సూర్యారావు చిత్తం-రాజకీయం మధ్య శాంతిని యిరికించారు.
పట్టణాల్లో ప్రశాంతత విషయం ఎలావున్నా, గ్రామీణ ప్రశాంతత మురిగినీటి నిశ్చలత్వం లాంటిది అని, బంకోలా - సుబ్రహ్మణ్యశర్మ చెణుకులు విసిరారు.
ఏది ఏమైనా, ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థితిగతుల్ని మాత్రం ప్రతికూల, అనుకూల స్పందనలతో తులనాత్మకమైన బేరీజులు వేసుకోవాలి.
లేదు లేదు ప్రశాంతి భువిలో, లేదులేదు ప్రశాంతి దివిలో, అధినొందుచు దాసుడొక్కండడలునన్నాళ్ళూ - అని వ్రేల్చుడీ లో కాశీవిశ్వనాధ్ గారు దుర్భిణీ వేసి చూసినా ఆయనకు శాంతి అలభ్యం, అగోచరం.
శాంతి క్రాంతి వలన వస్తుంది. నవయుగ సంక్రాంతి వలన వస్తుంది. (వియత్ నాం - బైరాగి).
శాంతి మంత్రం
వేదోపనిషత్తుసారమైన శ్రీశాంతిమంత్రం కూడ మనకు రక్షణ కల్పిస్తోంది.
ఓం సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహై తేజ స్వినావధితమస్తు మావిద్విషావహై.
ఓం శాంతి: శాంతి: శాంతి:
ఈ సందర్భంగా మన ప్రపంచం, ధరణి, విశ్వం, జగతి ప్రశాంతినిలయంగా సత్వర, సత్య, నిత్యంగా విరాజిల్లాలని ఆ ధరణీమాతకు ప్రార్ధిస్తూ ప్రపంచ శాంతి దినోత్సవం అర్ధవంతంగా జరుపుకోవాలని, విశ్వమానవాళిని ప్రార్ధించడం సముచితం.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

తెలుగుకథ కు శతమానం భవతి

మన తెలుగుకథ కు నిండునూరేళ్ళ పండగ

సాహిత్యంలో ఏ ప్రక్రియా చేయలేని సేవ 'కథా చేసింది. - గోపీచంద్.ఓ కొత్త కథను చదవడమంటే ఓ కొత్త వ్యక్తిని పరిచయం చేసుకున్నట్లే. - కొడవటిగంటి.
కథ, కథానిక, గల్పిక - అవిభాజ్య సాహిత్య ప్రక్రియ


వరద ప్రసాదించిన పుణ్యం
పొలాల్లో ఒండలిమట్టి పేరిపోవడం
సారవంతం, పుష్కలపంటలు.
తెల్లదొరల బానిస పాలన ఫలితం
అల్లులో మల్లు, గుడ్డిలో మెల్ల
దేశాన్ని ముంచెత్తినా, వరదలా
'సాహితీలక్ష్మీకి వొనగూడిన మేలు.
ప్రక్రియ వైదేశికమైనా,
జనజీవన చిత్రణకుదోహదకరం, ఉపయోగకరం.
మూఢగాఢఛాందస రుగ్మతలకు
సరికొత్త ఔషధం గురజాడ బాట
తెలుగు సంస్కౄతీసంప్రదాయ పరంపరకు
'కథనం తొక్కిన రాజబాట 'దిద్దుబాటూ.
కౄష్ణా, భారతి, సాహితి, వినోదిని పత్రికలు
బీజాన్ని మొలకచేసిన ఘనతలో ముఖ్యాంశం
పూడిపెద్ది, వేలూరి, రాయసం, శ్రీపాద లకౄషి
నిత్యస్మరణీయం, తలమానికం.
భారతి రజతోత్సవాలు కథానికకు నీరాజనం
పాలగుమ్మి, చలం, కరుణకుమార, కొడవటిగంటి
మల్లాది లతో పుష్పప్రసూనపరిమళ వికసితమయింది.
అస్తమించిన రవిసామ్రాజ్యపు తిరుగు ప్రయాణం
దిగిపోయిన కొండంత భారం, ఊపిరికి ఉపశమనం
స్వేఛ్ఛాస్వాతంత్ర్య భారతి సౌందర్యపు ధైర్యపునడకలు
భావవిప్లవానికి, సాహితీసౌందర్యానికి దారితీసాయి
కవికొండల 'జమీందారు కథా ఒక గెలుపు తెచ్చిన మలుపు
తెలుగువాడి ఆశయ ఆశాకిరణపు ఆంధ్రరాజ్యం
జాతీయావేశం కలిగించిన అంతరంగ మథనం
మునిపల్లె రాజు 'వీరకుంకుమా పెట్టిన ఆశావాద దీక్షా తిలకం
తెలుగువాడి ఆవేశంతోపాటు, ఆలోచనాంతరవిమర్శలకు ఫలితం
రావిశాస్త్రి 'గుంటూరూ కథనం చిత్రించిన ప్రాంతీయతావ్యామోహ సంకేతం
ప్రకౄతి సౌందర్య భీభత్సపు అవాంతరాలు యితివౄత్తాలయ్యాయి
పాలగుమ్మి - 'పడవ ప్రయాణం' సంకేతపు దుమారం లేపిన
అంతర్జాతీయ ఖ్యాతి, అదే రీతిరివాజుల్లో -
ప్రస్తావనార్హత - జమదగ్ని (మరపురాని ఆ వూరు) కథనం
బుచ్చిబాబు కలం నడిపిన అధ్బుతకథనం - 'అరకులోయలో కూలిన శిఖరం'
మన నదీనదాలూ కథలుగా పరివర్తనం
పెద్దిభొట్ల - 'నీళ్ళూ' ప్రవాహంతో సభా, గోఖలే, ఇనాక్,
పోతరాజులాంటి కథకులు నేను సైతం అని
కథనామౄతాన్ని చిలికించడం, సౄజన, వేకువ పత్రికల కథాపర సేవలు.
ముణిమాణిక్యం, కెరా, ఇఛ్ఛాపురపు, వట్టికొండ, కళ్యాణజగన్నాథ్,
కొమ్మూరి, పురాణం కథలు, కథనేతివౄత్తాలు
కడు రమణీయాలు, రసరమ్య సుథాగుళికలు
కొనగళ్ళ, బలివాడ, పరిమళా, కలువకొలను, అచ్యుతవల్లి,
ముళ్ళపూడిరమణ, కారా, మంచిరాజు, వసుంధరల
కథలు - సంశోధనలు, రోదనలు, వ్యధలు.
తెలుగు సంస్కౄత, సంప్రదాయ, సదాచార సుసంపన్నతకి దర్పణకథనం
కథ, కథానిక, చిన్నకథ, గల్పికలతో పాటు, నవలికను కూడ చెప్పుకోవచ్చేమో
పేరులోనే పెన్నిథి అన్న ధోరణికన్నా,
సాహితీప్రక్రియ దశ దిశలని నిర్దేశించాలి
నిర్మాణశిల్పం, వాస్తవికత, మనోవిశ్లేషణ, సాంఘిక విలువలు
కళాప్రయోజనాలు ముఖ్యంవస్తువైనా, విస్తౄతమైనా,
యితివౄత్తమైనా, తర్వాతే, తదుపరి అంశాలే కథకు మరి.
జీవితమంత లోతైనదీ, జనజీవనమంత విస్తౄతమైనదీ,
కథ, కథానిక, గల్పిక ప్రక్రియలు కథ నడిపించిన కథనపు తీరు కడుదూరం;
ఎందరిదో సహజీవనయానం, నడకతో కథాబాంధవ్యం
తొలినాటి సాగరాంధ్ర, ఉత్తరాంధ్ర, సీమ, తెలంగాణాలతోపాటు
దళిత, విప్లవ, మహిళావర్గాలు కథకూ, కథనానికీ,
ప్రాంతీయత, భాషయాసలు యాధౄఛ్ఛికమవ్వాలి కాని
వేర్పాటుతత్వం శోచనీయం అదే జరిగితే,
నడకను, నడతను తీర్చిదిద్దుకోబేతే,
అసలు సిసలైన 'దిద్దుబాటూకే నగుబాటుతనం.
కథనం - అంతర్మథనానికి అవుతుంది బీజం;
రజరుణరోగ తీవ్రతకు దారితీస్తే అనర్ధక కథనం
అదే జరిగితే, విచారకరం, విషాదకరం, విమర్శనాత్మకం,
వివేకరహితం, ప్రయోజనరహిత ప్రయోగం.

కథ, కథానికల పై ప్రముఖుల అభిప్రాయాలు

ఏ కథ కొంతకాలం తర్వాత అలాగే వుండదు; అంతేకాదు, చదివేవాళ్ళు కూడా అదే విశ్లేషకులు కారు. (జార్జ్ ఇలియట్.)
మానవ కథ యిప్పటికీ పెళ్ళికూతురే! (హారీ గోల్డ్)మంచికథలోని సజీవత్వం కథ చెప్పేవాడికి వెచ్చదనాన్నిస్తుంది; అదే వినేవాడికి చేరుతుంది. (విట్ బర్నెట్)రెండుసార్లు చెప్పిన కథ ఎంత విసుగు. (హోమర్.)
సాహిత్యంలో ఏ ప్రక్రియా చేయలేని సేవ కథ చేసింది. (గోపీచంద్).ఓకత్త కథను చదవడమంటే ఓ కొత్త వ్యక్తిని పరిచయం చేసుకున్నట్లే. (కొడవటిగంటి.)
మంచి ఆనందపు ముగింపు, చెడుకి భాధాకర ముగింపు; అదే కథకు సరైన ముగింపు. (ఆస్కార్ వైల్డ్).సాహిత్యం ఖరీదైనది; కాలక్షేప కథ అవసరం. (చస్టర్టన్)మనిషికవితామయ జంతువు; కథను ఆనందిస్తాడు.
'కథా ప్రతిభా పురస్కారాలు
ప్రస్తుతపు అనివార్యపు కొలమానత - సాహితీభారతి పురస్కారం.
1955 - 81 మథ్య కాలంలో 'కథాకు గుర్తించని వాస్తవం.


1982 - స్వర్ణకమలాలు - ఇల్లిందల సరస్వతీదేవి) (మొదటిసారిగా)
1985 - గాలివాన - పాలగుమ్మి పద్మరాజు
1991 - ఇట్లు మీ విధేయుడు - భమిడిపాటి రామగోపాలం.
1993 - మధురాంతకం రాజారాం కథలు - మథురాంతకం రాజారాం.
1995 - యజ్ౙం తో తొమ్మిది - కాళీపట్నం రామారావు
1996 - కేతు విశ్వనాథరెడ్డి కథలు - కేతు విశ్వనాథ రెడ్డి
1998 - అలివాడ కాంతారావు కథలు - బలివాడ కాంతారావు
2005 - తనమార్గం - అబ్బూరి ఛాయాదేవి.
2006 - ఆస్థిత్వ నదం ఆవలితీరాన - మునిపల్లె రాజు.
(నవరత్నాలు)
అనువాద పురస్కారాలు
2005 - మాస్తి చిన్న కథలు - జి.యస్. మోహన్. (కన్నడం - సన్నకథెగళు - మాస్తి వెంకటేశ అయ్యంగార్.)
తెలుగు జ్ౙానపీఠం
1. విశ్వనాథ - కథకు కూడ అధ్బుతమైన ప్రతిభను తనదైన శైలిలో జోడించారు.
2. సి.నారాయణరెడ్డి - కథని తనదైన శైలిలో 'కథనకవనం', 'కథాకవనం' చేయించిన సంగతి విదితమే.
కథాభారతికి, తెలుగుకథకు శుభాకాంక్షలు. కథ మనందరి జీవనకథాప్రస్థానంలో ప్రముఖపాత్ర వహిస్తూ, మనజీవితానికి, మనోల్లాసవికాసాభ్యుదయానికి దోహదకారి అవుతుందనీ, ఆశ, ఆకాంక్ష.
శ్రీ వేదగిరి, సాధన సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో - వీరవిహారం చేయించిన 'కథానిక సదస్సూల నిర్వహణ సందర్భంగా, అన్ని జిల్లాలలో కథానిక సదస్సుల్ని పూర్తి చేసుకుని, భాగ్యనగరం, హైదరాబాద్ లో, గురజాడ వారి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న నేటి సదస్సు, ముగింపు కానే కాదు, నేటినుంచి కథాయజ్ౙం కు అందరూ కావలసిన సమిధలను, హవిస్సును సమకూర్చే దశదిశల్లో, ప్రతీ సాహితీపిపాసి, నేను సైతం అంటూ చేయూతని, ఆర్ధికంగా, హార్దికంగా సహాయసహకారాలను అందించాలని సవినయంగా ప్రస్తావించుకుంటూ - పున: నమస్కారాలు తెలుపుకుంటూ - సెలవు.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

Saturday, September 20, 2008

నటసామ్రాట్ అక్కినేని పుట్టినరోజు




'నటసామ్రాట్' - సెప్టెంబర్ 20 - పుట్టినరోజు
జీవిత ప్రతిబింబమే సజీవకళ. సహజత్వానికి అతి దగ్గరగానూ, అసహజత్వానికి అతి దూరంగానూ, ఉండేదే నిజమైన కళ. - అక్కినేని. (అక్కినేని - ఆలోచనలు. 'అ-ఆ'లు నుంచి)
నటనే వౄత్తి - నటనే జీవితం - మారు పేరు నాగేశ్వరం
జీవితంలో నటన వౄత్తిగా తీసుకునేవాడొకప్పుడు మానవుడు - నటనే జీవితంగా జీవిస్తున్నాడు యిప్పుడు. మంచి చెడ్డల ప్రదర్శనే నిత్య జీవితం - జీవిత ప్రతిబింబమే కళ. సహజత్వానికి అతి దగ్గరగానూ - అసహజత్వానికి అతి దూరంగానూ - ఉండేదే నిజమైన కళ.
అరజీవితం - అర్ధవంతజీవితం
నేనింకా సగం జీవితాన్ని కూడా అనుభవించలేదు. ఎక్కాల్సిన మెట్లెన్నో ఉన్నాఅయి. తెరవాల్సిన తలుపులెన్నో ఉన్నాయి అని 'నేనూ - నా జీవితం' అని అర్ధశతాబ్దపు వయసు కూడ నిండకుండా తన జీవితచరిత్రను ప్రచురించడం ఈ వ్యక్తి జీవితానికి ఒక నూతనాధ్యాయమే అని చెప్పాలి. తన వౄత్తిలో కళాకారుడిగా తెచ్చుకున్న రాణింపుకు జరుగుతున్న రజతోత్సవాల సందర్భంగా ప్రచురించిన తన జీవితచరిత్రను అంకితం యిస్తూ - నన్ను కన్నతల్లికి, పెంచిపెద్దజేసిన కళామతల్లికి, అభిమానించి ఆదరిస్తున్న ప్రేక్షకలోకానికి, కౄతజ్ణతాభివందనలతో, 8 మే 1969 రోజున ప్రకటించిన వినయ వివేక మానసోన్నతసపూరిత సంపన్నత నేటికీ చెక్కుచెదరకపోవడమే కాకుండా, యింతింతై, రోజురోజుకు పెరుగుతూనేవున్నాయి.
నరసుకౄతం
ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము, నరుడు వరుడౌట ఎంతొ దుష్కరమ్ము సుమ్ము, అన్న జీవితసత్యాన్ని ప్రకటించిన అమరకవి గాలీబ్ గీతాలను మధురాతిమధురంగా నిత్యం మదిలో మెదిలేట్టు రచించిన దాశరది వాక్యాలను విశ్వసించిన విశిష్ఠవ్యక్తి, నటనకు విధివిధానాలను వివరించిన విద్వన్మూర్తి. ఆయన, ఆ మహానుభావుడు ఎవరో కాదు, ఆయనే అక్కినేని నాగేశ్వరరావుగారు.
నాగేశ్వర నటాగ్రణి
ఆయన 'నేనూ - నా జీవితం' అన్న రచన విడుదల సందర్భంగా, ఆనాటి భారతదేశాధ్యక్షులు వరాహగిరి వెంకటగిరి సతీమణి సరస్వతీభాయి గిరి, నాగేశ్వరునికి ప్రేమకానుకగా యిలా పలవరించారు.
అతడక్కినేని, ధీనిధి, అతులిత ప్రతిభాసమేతుడమౄతహౄదయుడౌ; అతడే నాగేశ్వరుడన, అతిధీరుడు, నటులయందు అగ్రణి అతడే' అని కడు ఔచిత్యంగా, సమంజసంగా అందమైన కందపద్యంలో కుదించారు.
నాగేశ్వర జీవనప్రస్థానం
అంధ్రప్రదేశ్ లోని కౄష్ణాజిల్లా, గుడివాడ తాలూకాలోని వెంకట్రాఘవపురంలో అక్కినేని వెంకటరత్నం - పున్నమ్మ పుణ్యదంపతులకు పుత్రోదయం కలిగిన రోజు, 1924 సెప్టెంబర్ 20 వ తేది. నలుగురు మగపిల్లల తర్వాత యిక ఆడపిల్ల వంతే అని అనుకుంటుంటే, మన కధానాయకుడు ఈ భూమ్మీదపడ్డాడు. తల్లికి తీరని కోరికని ఈయనగారికి ఆడపిల్లగానే పెంచిందట ఆ తల్లి - జడవేసి, పూలుపెట్టి, ముస్తాబు చేసి. ఈ [ప్రభావమే, నాటకాల్లోనూ ఆడవేషాలే వరించాయట. ఎక్కువగా చదువుకోకపోయినా, సమగ్రవంతమైన సంస్కారాన్ని అలవరచుకున్న సుసంపన్న కుటుంబ వారసుడు. ఆయన నటించిన నాటకాలు - చంద్రమతి, సారంగధరలో కమల, కనకతారలో తార, విప్రనారాయణలో దేవదేవి, ఆశాజ్యోతిలో స్నేహలత, సత్యాన్వేషణలో మేరీ, తెలుగుతల్లిలో భారతి పాత్రలను ప్రతిభావంతంగా పోషించి నటనకు భాష్యాన్ని ప్రవచించారు. దుక్కిపాటిమధుసూధనరావుగారి నిర్వహణతో నడిచే 'ఎక్సిల్షియఋ నాటక సమాజంలో అక్కినేని కధానాయిక. కష్ఠకాయం చేసుకునే రైతుకుటుంబంలో, యింట్లో పనిపాటలతోపాటు మూడుమైళ్ళు దూరంలోనున్న పాఠశాలకు వెళ్ళి చదువును శ్రద్ధగా చదువుకున్నా, ఆయన కోరిక మేరకు పట్టభద్రుడవ్వలేకపోయారు. నటనలో రాణిస్తున్న అక్కినేనిని ఆ వౄత్తిలోనే ప్రోత్సహించేందుకు కుటుంబం నిర్ణయించింది.
నిరాశపరచిన రైతుబిడ్డ
కాలం అలా నడుస్తుంటే, రైతుబిడ్డ సినీమాద్వారా గూడవల్లి రామబ్రహ్మంగారు నిరాశపరచినా, పి.పుల్లయ్యగారి ధర్మపత్నిలో చిన్నవేషం లభించినా, ప్రసన్నవదనాన్ని చాలాక్లోజప్ లో చూపించడం ఆనాట అద్వితీయమట. 10 జనవరి 1941 న విడుదల అవగా, మూడేళ్ళు మాత్రం మరెవరూ పలకరించలేదట. 1944 నుంచి అక్కినేని నటనారధం కదంతొక్కింది. శ్రీసీతారామజననం, మాయాలోకం, ముగ్గురు మరాటీలు, పల్నాటియుద్ధం, రత్నమాల, బాలరాజు, కీలుగుర్రం, రక్షరేఖ, లైలామజ్ఞూ, శ్రీలక్ష్మమ్మ కధ, పల్లెటూరిపిల్ల, పరమానందయ్య శిష్యులు, స్వప్నసుందరి, సంసారం, కలసి అక్కినేని రధం దశాబ్దకాలం నడచింది.
తెలుగు తో పాటు తమిళచిత్రరాజాల్లోనూ ప్రతిభానటనం
రెండవ దశకంలో తిలోత్తమ తో ప్రారంభమైతే, మాయమాలై, సౌదామిని, ఓర్ ఇరవు, స్త్రీ సాగసం, మాయక్కారి, కాదల్, పూంగోదై, పెట్రతాయ్, దేవదాస్, మాదర్కుల మాణిక్కం, ఎంగళ్ వీట్టు మహాలక్ష్మి, అల్లాఉద్దీన్, చెంచులక్ష్మి, మంజల్ మగిమై, అదిశయప్పెణ్, కళ్యాణవరిశు లాంటి ఎన్నో తమిళచిత్రాల్లో తన ప్రతిభను ప్రదర్శించారు.
జోరుగా, హుషారుగా ... తెలుగుచిత్రాల పరంపర
అక్కినేనికి కలికితురాయి అనిపించిన చిత్రాలు కోకొల్లలు అయితే, ప్రభుత్వపరంగా ప్రశంసలనందుకున్నది - విప్రనారాయణ(1954 - ప్రాంతీయ ప్రశంసాచిత్రం) అయితే, అర్ధాంది, తెనాలి రామకౄష్ణ, తోడికోడళ్ళు, పెళ్ళినాటి ప్రమాణాలు, మాంగల్యబలం, జయభేరి, నమ్మినబంటు, మహాకవి కాళిదాసు, భార్యాభర్తలు, మూగమనసులు, అమరశిల్పిజక్కన, డాక్టర్ చక్రవర్తి, అంతస్థులు, మనుషులు మమతలు, ఆత్మగౌరవం, ఆస్తిపరులు, సుడిగుండాలు ప్రముఖంగా చెప్పుకోకుండా వుండలేని పరిస్థితి. తెలుగు, తమిళ భాషల్లో తన ప్రతిభను ప్రదర్శించిన అక్కినేని, హిందీభాషలో కేవలం ఒకేఒక చిత్రం - సువర్ణసుందరి (1958). సుడిగుండాలు, మరోప్రపంచం, స్వంతచిత్రాలయితే, ఆర్ధికంగా లాభించకపోయినా, హార్ధికంగా, ఆలోచనాత్మకంగా విప్లవగాలుల్ని విసిరింది. ఈ విధంగా 1944 మే 8 న ప్రారంభమైన సినీమా నట జీవితంలో ఒక్కొక్క మైలురాయిగా ఒక్కొక్క పాత్ర నిలబడిపోయింది అని ఆయనే చెప్పుకోగలిగిన ఆత్మవిశ్వాసం ఆయన వౄత్తిపైన. కవిసార్వభౌముడు శ్రీ శ్రీపాద కౄష్ణమూర్తి శాస్త్రిగారు, రాజమండ్రి నగరపు పౌరజనసాక్షిగా దీవించడం, బెజవాడలో బెజవాడ గోపాలరెడ్డిగారి సమక్షంలో నటసామ్రాట్టుగా సత్కారం పొందిననాడు పొంగిపోకపోయినా, పదిమైళ్ళు ఈది పందెం గెలుచుకున్నప్పుడుండే అనుభూతి ఒకటి కలిగింది అన్ని తన స్వభాషణంలో చెప్పుకున్నారు. అంతేకాక, సత్కారసన్మానాలు తన బాధ్యతను మరింతగా పెంచాయని చెప్పుకున్న ఘనుడు.
సకుటుంబ సపరివార సమేత కధనం
మళ్ళీ సరస్వతి గిరిగారి మాటల్లో చెప్పాలంటే - అన్నపూర్ణయే నీకు అర్ధాంగెయయ్యె, అఖిలసద్గుణఖనియని అవనిమెచ్చె; అన్నగతప్రాణులైన ఆంధ్రావళికని అలమటింతలు పోద్రోలు అన్నపూర్ణ - అని ఔచిత్యకవనం చేశారు. అటువంటి సద్గుణఖని అన్నపూర్ణని అక్కినేని 18 ఫిబ్రవరి 1949 న వివాహం చేసుకున్నారు. పంచరత్నాలు పిల్లలు. నేడు మనం యువనాయకుడు అక్కినేని నాగార్జున ప్రతిభను కనులారా చూస్తూనేవున్నాం. అచట పుట్టిన చిగురుకొమ్మైన చేవ, అన్న మాదిరి అక్కినేని వంశంలో అధ్బుతాలు చాలా సాధారణంగా, అవ్యక్తంగా జరిగిపోతాయి. నాగార్జున భార్య అమల కూడ కళాకారిణి, అభినేత్రి, ప్రాణికోటిసముదాయానికి ఆమె చేస్తున్న సేవలు అజరామరం. వెంకట్ వ్యాపారదక్షుడు.
ప్రతిభాకిరీటాలు
నటసామ్రాట్ గా తొలి సన్మానాన్ని పొందిన మన అక్కినేనికి వరసగా - పద్మశ్రీ, పద్మభూషణ్, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తింపుగా రఘుపతి వెంకటరత్నం పురస్కారం(1989), భారతదేశ చలనచిత్రపరిశ్రమకు అగణిత సేవలనందించినందుకు దాదాసాహెబ్ ఫాల్కే (1990) పొందడం, అన్నపూర్ణ సంస్థద్వారా చలనచిత్రాలను నిర్మించడం, అన్ని హంగులతో అన్నపూర్ణ సినీ స్టూడియోని నిర్వహించడం చిత్రకళామతల్లికి అందిస్తున్న నీరాజనాల్లో ముఖ్యాంశాలు. యింకా, నేటి అక్కినేని సంధ్యాజీవనశైలిని గమనిస్తే, ఆయన ప్రతినిత్యం ఏదో కళావేదికపై కూర్చొని సరససాలోచనాత్మక సందేశభరితమైన సంభాషణలతో సాయంసంధ్యని శుభమంగళసంధ్యగా మార్చివేయడం తన ప్రతిభకు నిదర్శనంగానే భావించాలి.
అక్కినేని - ఆలోచనలు
అక్కినేని తన చలనచిత్ర రజతోత్సవ కధనాన్ని రచించడం ఒక ఎత్తైతే, ఆయనలోని ఆలోచనాపరుడు నిత్యం తచ్చాడుతూనేవుంటాడు. మనసు మధనపడడం, గుండెలోని గుబులుపోవడం ద్వారా కలిగే ఆలోచనలని 'అ ఆ"లు అని అల్పకవితల్లో అనల్పతను, అనల్పార్ధరచనను సౄష్టించారు.
అక్కినేని ఆలోచనాలోచనాలు యిలా సాగాయి.
కాలం, కలికాలం అనుకుంటాం అప్పుడప్పుడు, తోకలు లేని కోతిమూకల కాలం అనుకోవాలి ఇప్పుడిప్పుడు.
నిజమాడినవాడు నిప్పులాంటివాడనుకుంటాం అప్పుడప్పుడు, అబద్ధమాడినవాడు అదౄష్టవంతుడు అనుకోవాలి అప్పుడప్పుడు.
భావానికి సరైన తాత్పర్యం చెప్పేవాణ్ణి పండితుడు అనుకుంటాం అప్పుడప్పుడు, శబ్దానికే విపరీతార్ధం తీసేవాణ్ణి ప్రకాండుడు అనుకుంటున్నాం ఇప్పుడిప్పుడు.
నీవు లేని నేను నేను కాదనుకునేవాడొకప్పుడు మానవుడు, నేను లేని నీవు నీవే కాదంటున్నాడు యిప్పుడు.
మంచిని చెప్పేవాడిని మార్గదర్శి అనుకునేవాడొకప్పుడు మానవుడు, చెడును బోధించేవాడిని స్నేహితుదనుకుంటున్నాడిప్పుడు.
భగవంతుడిని భక్తితో ఆరాధించేవాడొకప్పుడు మానవుడు, భగవంతుడనే బొమ్మతో బేరలాడుతున్నాడిప్పుడు.
నిజం చాటడానికని బ్రతక ప్రయత్నించకు, నిజాయితీగా బ్రతకడానికే నిజంగా ప్రయత్నించు.
చచ్చి సాధించే దేముంది గనక చావడానికి, పుట్టుక పరమార్ధం తెలుసుకుంటేనే నిజమైన బ్రతుకు.
బ్రతికి బావుకునేది లేదని చావబోకు, చచ్చి సాధించేది లేదని బ్రతకబోకు, బ్రతికి జీవితాన్ని సాధించు, చనిపోయి కలకాలం జీవించు.
కంటిని కాపాడడానికి రెప్ప పుట్టింది, రెప్పను మూసెపెడితే కన్ను మూత పడుతుంది, మూసిన కళ్ళతో మూడడుగులు ముందుకు వేస్తే మూతిపళ్ళు నాలుగూ వూడతాయి.
డబ్బు సంపాదించడమంటే నాకు గౌరవం, ఖర్చుచేయడమంటే మిత గౌరవం, సద్వినియోగం చేయడమంటే అతి గౌరవం.
జీవించడం తెలియకపోయినా, జీవితమంటే ఏమిటో తెలియాలి. జీవితమంటే ఏమిటో తెలియకపోతే, జీవించడమంటూ అసలే తెలియదు.
జీవితమంటే సప్తవ్యసనాల పుట్ట, ఒక్క వ్యసనానికి లొంగిపోయేవాడు వట్టి మానవుడు, సప్త వ్యసనాలకి లొంగనివాడు మానవాతీతుడు, జీవితాన్ని తరిచి చూచేవాడే నిజమైన మానవుడు.
యింతటి వేదసమసారాన్ని, వేదాంతధోరణిని, కౌమారదశలోనే ఆవరించిందంటే, మానవునికి పరిపక్వత దశని దాటుకుంటూ పరిపూర్ణతస్థితికి చేసుకునే సుగమప్రయత్నం. అటువంటి సప్రయత్నంలో అక్కినేని వంటి అనల్పుడికి సుసాధ్యం కాకపోవడం అంటూ వుండదు.
ఎన్నో సాంఘిక, కుటుంబ, సందేశాత్మక చిత్రాలతో పాటు, శ్రీ సీతారామజననంతో శ్రీకారం చుట్టి, భూకైలాస్, విప్రనారాయణ, మహాకవి కాళిదాసు, భక్తజయదేవ, కౄష్ణార్జునయుద్ధం, అమరశిల్పిజక్కన, వసంతసేన, రహస్యం, భక్తతూకారం, మహాకవి క్షేత్రయ్య, చాణక్యశపధం లాంటి చిత్రాలు ఎన్నో సంస్మరణీయాలైనవి, భక్తరామదాసు లో కబీరు గా జీవించారు.
నటనం గురించి, ఈ నటసామ్రాట్ నిత్యం తారకమంత్రంలా జపంచేసి ఆయన తరించి, చిత్రజగతిని అచంద్రతారార్కం తరింపజేస్తూనే వుంటారన్న భావన సత్యం, శివం, సుందరం.
మహనీయుల జీవితాలు బోధించును అనవరతంమనమూ మనజీవితాలను చేయగలం మహోన్నతంవీడెదము కాలపు తడి యిసుకల తీరముపైమనదు అడుగుజాడలను పోవుచు ధీరులమై
అన్న అమెరికన్ కవి హెచ్.డబ్లియు. లాంగ్ ఫెలో అన్న కవిభావంతో అక్కినేని నటనాప్రతిభాప్రభకు ప్రణామాలు అర్పిస్తూ, ఆ మహానుభావుణ్ణి భగవంతుడు ఆయురారోగ్యైశ్వర్యసంపన్నతని ప్రసాదించమని సామూహిక ప్రార్ధనలను చేద్దాం.
సెప్టెంబర్ 20 న జరుపుకుంటున్న 85వ పుట్టినరోజు సందర్భంగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుగారికి - 'తెలుగురథం' జన్మదిన శుభాకాంక్షలను అందిస్తున్నాం. ఆ భగవంతుడు ఆయురారోగ్యాలని ప్రసాదించాలని కోరుకుంటున్నాం.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

Friday, September 19, 2008

నాడు - ఈనాడు - సెప్టెంబర్ 19

19 సెప్టెంబర్ ప్రత్యేకతలు - నాడు - ఈనాడు
సంఘటనలు
1996 - అమెరికా అధ్యక్షుడు, జార్జి వాషింగ్టన్, పదవీ విరమణ సందర్భంలో చేసిన ప్రసంగ వ్యాసాన్ని, దేశంలోని ప్రజలందరికీ, తనవైపు నుంచి బహిరంగ ఉత్తరంగా అందించారు.
1893 - న్యూజిలాండ్ దేశంలో మహిళలకు ఓటు హక్కు వినియోగ సదుపాయాన్ని అందజేశారు.
1957 - మొట్టమొదటగా, అమెరికా దేశం అణుబాంబు ప్రయోగాన్ని భూగర్భంలో చేశారు.
1959 - నికిత కౄశ్చేవ్ ని 'డిస్నీలాండ్' సందర్శనకు అనుమతి యివ్వకుండా బహిష్కరించారట.
జననం
1887 - ప్రముఖ తెలుగుకవి, పండితుడు, విమర్శకుడు, పత్రికాకారుడు, నాటకకర్త, పద్మభూషణ్, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత (1971 - మనుచరిత్ర - హౄదయోల్లాస వ్యాఖ్య), తాతాజీ, ఆంధ్ర విశారద, శ్రీ తాపీ ధర్మారావు.
1911 - ప్రముఖ కవి, రచయిత, సామాజిక చైతన్యత పై కౄషి సల్పిన వ్యక్తి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత (1975 - గుడిసెలు కాలిపోతున్నాయి), శ్రీ బోయి భీమన్న
.
1977 - ప్రముఖ భారతీయ క్రికెట్ క్రీడాకారుడు - ఆకాష్ చోప్రా.
మరణం
1936 - భారతీయ సంగీతకారుడు, విష్ణునారాయణ్ భట్కండే.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

Thursday, September 18, 2008

తాతాజీ - ఆంధ్ర విశారద తాపీ ధర్మారావు జయంతి

'ఆంధ్ర విశారదా తాపీ ధర్మారావు కి నివాళి (19.9.1887 - 8.5.1973)
ప్రముఖుల మధ్య ప్రముఖుడు తాపీ ధర్మారావుగారు

ప్రముఖ సాహితీపరిశోధకుడు, సమగ్రాంధ్రసాహిత్యాన్ని రచించిన ఆరుద్ర, ఆంధ్రసాహితీచరిత్రను యుగాలుగా విభజిస్తూ, జమిందారీ నవ్యసాహితీయుగాన్ని విస్తారంగా వివరించడం జరిగింది. ఈ జమిందారీ వ్యవస్థలో కొంతమంది జమీందారుల వారసులు మైనర్లుగా ఉన్నప్పుడు, వారిని కళాశాలల్లో పాశ్చాత్య బోధకుల పర్యవేక్షణలో చదివించే భాగంగా, కొందరు సుప్రసిద్ధ సాహితీవేత్తలు అధ్యాపకులుగా కూడ పనిచేసేవారు. అందులో తాపీ ధర్మారావుగారు ఒకరు. ఈయన ఊర్కాడు, చుండి,దక్షిణ వల్లూరు, మందస, టెక్కలి, మరిన్ని జమీందారీ పిల్లలకు దశాబ్దకాలం బోధన చెసేవారు. సంఘసంస్కరణకాలంలో, వీరేశలింగంగారి రచనలను పుస్తకాల వ్యాపారి కేటలాగు లాగ వర్ణించారు తాపీవారు. 1905లో పర్లాకిమిడి కాలేజీలో ఎప్ఫే చదువుకొన్న తాపీ ధర్మారావుగారు గిడుగు వారి గురించి, కాలేజీ గురించి, తన ఆత్మకధ 'రాలూ-రప్పలూ' లో విపులంగా చెప్పడం పట్ల, ధర్మారావు గారికి గిడుగు పై వున్న సదభిప్రాయం చెప్పకనే చెప్పారు. కనీసపు సౌకర్యాలూ, చక్కగా పాఠాలు చెప్పే అధ్యాపకులూ ఉన్నందువల్ల పర్లాకిమిడి కాలేజీలో చాలా ప్రతిభావంతులైన విద్యార్ధులు, ధర్మారావుగారితోసహా, చేరడం, ఉత్తరోత్తరా సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు అని ఆరుద్రగారు అభిప్రాయపడ్డారు.
గిడుగువారి గురుత్వం

గిడుగువారి దగ్గర ఆధ్యయనం చేస్తున్నా కూడ, భాషాతత్వం నేర్చుకోకపోవడం వల్ల, వారి శిష్యుల్లో కొందరు గ్రాంధిక వాదులుగానే వుండిపోయారు. భాషాతత్త్వాన్ని గిడుగు వారే బాగా ఆలోచించని కాలంలో, 1905 లో ధర్మారావుగారు చదవడం, గురుశిష్యులు ఎడమొగం పెడమొగం పెట్టుకోవడం, రాజీప్రయత్నంగా గురువుకు నచ్చే దిశలో నుదుటన నిలువుబొట్టు పెట్టుకోవడం, ధర్మారావు గారి కుశాగ్రబుద్ధి గిడుగువారిని ఆనర్స్ తో మెప్పించి ప్రియశిష్యులయ్యారు. వాడుకభాషావాదాన్ని ప్రారంభించడానికి ధర్మారావుగారు 1908 లో మద్రాసు పచ్చయప్ప కాలేజీ విద్యార్ధిగా బి.ఎ. చదువుకొన్నారు. భాషాతత్త్వం గురించి అవగాహన లేక మిగతా గ్రాంధికవాదుల ధోరణి అలవర్చుకొని, 1910 లో 'గ్రాంధికభాషావాదం' పై పద్యం రచించి, గ్రామ్యమను నిక్కపు పాదరసమును గూర్చి వన్నెల కనకపు తెలుగు నీరసమౌనట్లు చేయకుండ వుండమని కోరారు. బరంపురం లో ధర్మారావుగారు స్నేహితులతో వేగుజుక్క గ్రంధమాల ద్వారా, రచనలలో గ్రాంధికమే వ్రాసేవారు.
గ్రాంధికవాదానికి కారణాలు

అందరూ ఔనన్నది కాదనాలన్న ఆశ, వాదాన్ని బలపరుస్తున్న వారందరూ బ్రాహ్మణులు కావడం, తాను తక్కువకాదన్న గూడుకట్టుకున్న అభిమానం, భాషావివాదంలో గ్రాంధికభాషనే సమర్ధిస్తూ, వారితోనే వుంటూ వారిని మించవచ్చన్న అభిప్రాయం లేకపోలేదు అని, తాపీ ధర్మారావు జీవితం-రచనలు పై పరిశోధన చేసిన ఏటుకూరి ప్రసాదు తన పరిశోధనాభిప్రాయంగా చెప్పడం జరిగింది. దాదాపు రెండున్నర దశాబ్దాల కాలంపాటు గ్రాంధికాన్ని అభిమానించి వాడుకభాషను ఎదిరించడం, భావకవిత్వాన్ని ఎద్దేవాచేయడం జరిగినా, వర్గస్వభావాలతో ప్రపంచ సాహిత్య పరిణామాల ద్వారా అవగాహన కావడం వల్ల, భాషాతత్త్వాన్ని అవగాహన చేసుకుని, వ్యావహారిక భాషావాదపు ఉప్పెనలో తడిసి 1936 లో తాపీ ధర్మారావుగారు ఎట్టకేలకు తమ కలానికున్న 'పాతపాళీ'ని మార్చి 'కొత్తపాళీ'ని వినియోగించారు, అందరికన్న మిన్నగా వాడుక భాషాప్రచారరధయాత్రలో భాగస్వామ్యం వహించారు.
పత్రికభాషగా వ్యవహారికం

1936లో జనవాణి పత్రికకు సంపాదకత్వం, వ్యవహారికాన్ని పత్రికాభాషగా ప్రవేశపెట్టడం, వీరగ్రాంధికవాదాన్నుంచి మన:ఫూర్వక వ్యవహారికోద్యమానికి సహకార, భాగస్వామ్యం వహించడమే కాక, ఉద్యమవ్యవస్థాపకులైన గిడుగువారికి లేఖలద్వారా తన మనోపరివర్తనాన్ని తెలియచేసుకున్నారని కూడ పరిశోధకులు వివరించడం, తాపీవారి ప్రతిభాపాటవాల్ని స్పష్టీకరించడం జరిగింది.
వ్యవహారిక భాషాభ్యుదయోద్యమానికి, ఆంధ్రసాహిత్యానికి విశిష్ట సేవలను ధర్మారావుగారు అందించిన తీరుతెన్నులు ఆధునికయుగానికి మరువలేని సంఘటనలుగా నేటికీ భావించబడుతున్నాయి.
బహుముఖ సాహితీవ్యాసాంగం

తాపీధర్మారావుగారు, బహుముఖసాహితీప్రక్రియలను ప్రవేశపెట్టి, పరిశోధనాత్మకాంశాలపై రచనలను చేశారు. ప్రముఖ రచనలైన, 'పెళ్ళీ - దాని పుట్టుపూర్వోత్తరాలూ, 'దేవాలయాలమీద బూతుబొమ్మలెందుకు?', 'పాతపాళీ', 'కొత్తపాళీ' లతో బాటు, ఆత్మకధనంగా 'రాలూ-రప్పలూ' ప్రత్యేకంగా ప్రస్తావించి తీరాలి. తెలుగునాట పత్రికా రచనలో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టి పత్రికల రూపురేఖల్ని మార్చి, సినీమారంగంలో ప్రజల భాషను ప్రవేశపెట్టి, అనేక సాంఘిక సాంప్రదాయాలు, ఆచారాలను గురించి విశిష్టమైన పరిశోధనలు చేసి, తెలుగుజాతికి ఎంతో విజ్ౙానాన్నందించిన అమూల్యమైన జీవితానుభవాల విశిష్ట సంకలనాన్ని, తన ఆత్మ చరిత్రాత్మక స్వీయకధ ద్వారా ఆంధ్రసాహితీజగతికి అందించారు. వేగుచుక్క గ్రంధమాల స్థాపన మొదలుకొని జీవితాంతం నిర్వివామంగా సాహిత్యకౄషిని కొనసాగించిన జ్ౙానవౄద్ధులు, బహుముఖప్రజ్ౙాశాలి, కవి, పండితుడు, విమర్శకుడు, నాటకకర్త,అభ్యుదయ రచయితల ఉద్యమ స్థాపకులు, హేతువాది, చిత్రసీమలోకూడ తనదైన ప్రతిభను, కధ, మాటలు, పాటలు, దర్శకత్వ రంగాల్లో ప్రదర్శించిన ఘనుడు, ఘనాపాటి. సుపుత్రుడు చాణక్య కూడ తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నవాడు కూడ. చేమకూర వెంకటకవి రచించిన 'విజయవిలాసం' ప్రబంధకావ్యానికి, 'హౄదయోల్లాసవ్యాఖ్యానం'ను విరచించిన తాపీవారి గ్రంధం బహుళప్రాచుర్యాన్ని, ప్రాముఖ్యతను సంతరించుకోవడమే కాక, కేంద్రసాహిత్య అకాడమీ వారి పురస్కారం పొందడం ఆయన ప్రతిభాసోపానానికి సంకేతనిదర్శనం.
తాపీధర్మారావుగారు, 8 మే 1973 న సాహితీబంధువుల్ని దు:ఖసాగరంలో ముంచెత్తి, కీర్తిశేషులయ్యారు. సాహితీవ్యాసాంగం ఈ తెలుగునేలపై వున్నంతకాలం, తాపీ ధర్మారావు గారి సాహితీసుగతుని సంగతుల్ని మరచిపోవడం జరగని, జరగకూడని పనిగా భావించడం సబబు. సాహితీప్రేమికులకు తాపీవారి ఆశీస్సులు నిత్యం లభిస్తూనేవుంటాయి.
'తాతాజీ' తాపీ
తాపీ వారు 'తాతాజీ'గా సుపరిచితులు. స్వేఛ్ఛాప్రియులు, స్వతంత్ర భావాలను పుణికిపుచ్చుకున్న వ్యక్తి అవడం తన జీవితంలో ఎన్నో రకాల ఇక్కట్లకు గురైనట్లు ఆయన పేర్కొనడం గమనార్హం. 'ఆంధ్రులకొక మనవీ అన్న తొలి రచన (1911), భారత జాతీయ భావాలను వెదజల్లుతూ సమకాలీన రాజకీయాలకు అద్దంపడుతూ, కొంటెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడలాంటి పత్రికలను నిర్వహించిన నిష్ణాతుడు. విలాసార్జునం, అవన్నీ కన్నీళ్ళేనా! లాంటి నాటకాలను కూడ రచించారు. శౄంగెరీ పీఠాథిపతి చేతులమీదుగా, 'ఆంధ్ర విశారదా సత్కారాన్ని, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యత్వం, తాపీ వారి ప్రతిభాసిగలో మరుసౌరభాలే.
తాతాజీ, ఆంధ్ర విశారద, శ్రీ తాపీ ధర్మారావు గారి జయంతి సందర్భంగా తెలుగురథం - శతసహస్ర నివాళులను వినమ్రంగా సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

నాడు - ఈనాడు

నాడు - ఈనాడు
18 సెప్టెంబర్ ప్రత్యేకతలు
సంఘటన
1809 - లండన్ లో 'రాయల్ ఓపెరా హౌశ్ ప్రారంభం.
1919 - నెదర్లాండ్స్ దేశంలో మహిళలకు ఓటుహక్కుని కల్పించారు.
జననం
1709 - ప్రముఖ ఆంగ్ల రచయిత, నిఘంటుకారుడు - శాముల్ జాన్సన్ (1709 - 1784)
1950 - ప్రముఖ భారతీయ నటీమణి, సంఘసేవకురాలు - షబనా ఆజ్మీ (ప్రసిద్ధ రచయిత జావేద్ అక్తర్ సతీమణి)
మరణం
1806 - మొట్టమొదటిగా కనుగొన్న 8 అడుగుల ఎత్తున్న ఆజానుభాహువు - పాట్రిక్ కాటర్ ఓబ్రీన్ (1760 0 1806) (బ్రిస్టల్/ఐరిష్ ఆజానుభాహువు అని పేరు)
1878 - ప్రముఖ భారతీయ హేతువాది - అబ్రహాం థామాస్ కోవూర్ (1898 - 1978). భారత, శ్రీలంక దేశాల్లోని వివిధ స్వామీజీ భగవానుల అక్రమాలని బట్టబయలు చేసిన ఘనుడు. సత్యసాయిబాబాని దర్శించి (1976), పరీక్షకు సవాలు విసిరినా, బాబా అంగీకరించకపోవడం విశేషంగా ప్రస్తావించబడింది. కోవూర్ బాబా ఆశ్రమానికి వచ్చే సమయానికి, బాబా వేరే ఆశ్రమానికి వెళ్ళిపోవడం జరిగేదట.

Wednesday, September 17, 2008

తెలంగాణ విమోచన దినోత్సవం - సెప్టెంబర్ 17

తెలంగాణా విమోచన దినోత్సవం - 17 సెప్టెంబర్
మన పాలకుల క్రమాలు
చారిత్రాత్మకంగా ఆలోచిస్తే, మన పాలకుల్ని విభజించాలంటే ఈ విధంగా చెప్పుకోవచ్చు:
శాతవాహనులు (2 - 7 శతాబ్దం)చాళుక్యులు (7 - 10 శ.)కాకతీయులు (11 - 14 శ.)విజయనగరరాజులు (16 - 18 శ.)నిజాం ప్రభువులు (18 - 20 శ.)
నిజాం పరిపాలన
హైదరాబాదు రాజ్యం పాలకుల పాలనాక్రమం పరిశీలిస్తే, ఖమరుద్దీన్ చిన్ ఖిలిజ్ ఖాన్ అసఫ్ ఝా (నిజాం-1) (1724-1748) నుంచి ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ ఝా (నిజాం-7)(1911-1949) వరకూ, మొత్తం ఏడుగురు నిజాం నవాబులు హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించారు.
హైదరాబాద్ రాష్ట్రం ఆవిర్భావం
1946 - 1948 మధ్యకాలంలో హైదరాబాద్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు నేపథ్యం చెప్పుకోవాలంటే - రజాకార్ల దౌష్ట్యం, హైదరాబాదు పై పోలీసు చర్యలను ముఖ్యంగా ప్రస్తావించుకోవాలి. హైదరాబాదుకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆశిస్తూ, ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాం ప్రతిపాదించాడు. ఇత్తెహాదుల్ ముస్లిమీను, దాని సైనిక విభాగమైన రజాకార్ల కు చెందిన ఖాసిం రజ్వి ద్వారా దీన్ని సాధించాలని నిజాం ప్రయత్నించాడు. రాష్ట్రానికి చెందిన ప్రజలు ఎక్కువగా భారతదేశంలో విలీనమవాలని ఉద్యమం చేపట్టారు. ఈ దిశలో, స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో కాంగ్రేసు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రేసుని నిజాం నిషేధించిన మూలాన, ఉద్యమకారులు యితర ప్రదేశాలైన, విజయవాడ, బొంబాయి నుంచి ఉద్యమాన్ని నడింపించారు. రజాకార్ల దాడులను ఎదుర్కోవడానికి కమ్యూనిష్టులు గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేయడం గమనార్హం. భారతదేశం, నిజాం మధ్య చర్యలు విఫలమవడం, భారతదేశంలో విలీనానికి నిజాం ససేమిరా అంగీకరించకపోవడం, మజ్లిస్ మరియు రజాకార్ల కార్యకలాపాలు శాంతి సామరస్యాలకి భంగకరంగా పరిణమించాయి. నిజాం తన సైన్యంతో భారతదేశాన్ని ఢీ కొట్టేందుకు సిద్ధం అయ్యాడు. నిజాం చేపట్టిన చర్యలకు తోడు రజాకార్ల హింస, హైదరాబాదు పై పోలీసు చర్యకు కేంద్ర ప్రభుత్వం నడుంకట్టి, 1948 సెప్టెంబర్ 13 న హైదారాబాదు పై పోలీసు చర్యని - 'ఆపరేషన్ పోలో' అని జరిగింది. మేజర్ జె.యస్. చౌదరి నాయకత్వంలో భారతసైనం మూడు వైపులనుంచి హైదరాబాదును ముట్టడి చేసింది. హైదరాబాదును భారతసైన్యం 1948 సెప్టెంబర్ 17 నాడు భారతదేశంలో విలీనం అయిపోయింది. సెప్టెంబర్ 18 న నిజాం లొంగిపోయాడు. తెలంగాణాకు స్వాతంత్ర్యం వచ్చింది. ఐదు రోజులపాటు జరిగిన పోలీసు చర్యలో వేలాదిమంది రజాకార్లు హతమవడం, బందీలవడం జరిగింది. నిజాం సైనికులు అధికంగా ప్రాణాలు కోల్పోయారు. నిజాం ప్రధానమంత్రి మీర్ లాయిజ్ ఆలీ, రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ అరెస్టయి జైలుజీవితం గడపవలసివచ్చింది. భద్రతాసమితిలో నిజాం ఫిర్యాదుని ఉపసంహరించుకోవడం, హైదరాబాదుని భారతదేశంలో విలీనం చేసినట్లు ప్రకటన చేయడం, మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి హైదరాబాదు సైనిక గవర్నరుగా నియమితులయ్యారు. 1950 లో సీనియరు ప్రభుత్వ అధికారిని ముఖ్యమంత్రిగా నియమించడం, నిజామును రాజ్ ప్రముఖ్ గా ప్రకటించడం జరిగింది. 1952 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటిగా ఎన్నికైన ప్రభుత్వానికి బూర్గుల రామకౄష్ణరావు ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావడం జరిగింది. ఆయన ప్రత్యేక తెలంగాణా రాష్ట్రానికి సముఖంగా లేరని, విశాలాంధ్రప్రదేశ్ కు ఆయన రాజనీతే దారితీసిందని, నేటికీ తెలంగాణా ప్రజలు ఆయనపై అక్కసుని వెలిబుచ్చుకుంటారు. నిజాం పరిపాలన, హైదరాబాదు రాష్ట్రం అలా, అంధ్రప్రదేశ్ లో భాగంగా మారిపోయాయి.
సెప్టెంబర్ 17 - తెలంగాణా విమోచన దినోత్సవం
నిరంకుశమైన నిజాం పరిపాలన అంతం కావాలని కోరుకున్నారు. కనుకఆ దినాన్ని ప్రజలు పండుగ గానే జరుపుకున్నారు. విముక్తి దినంగాను, తెలంగాణా చరిత్రలో అత్యంత కీలకమైన దినంగాను పరిగణిస్తున్నారు. అయితే, విముక్తి దినాన్ని అధికారికంగా ప్రభుత్వం ఏనాడూ నిర్వహించకపోవడం, తెలంగాణా ప్రజల్లో నేటికీ అలకతోనూ, కినుకుని ప్రదర్శించడం జరుగుతూనే వుంది. ఈ రోజు విముక్తిదినంగా కనుక జరుపుకోగలిగితే ఈ ప్రాంత చరిత్ర సక్రమంగా గ్రంథస్థమయ్యేది, వెలుగులోకి వచ్చేది అన్న మీమాంస కూడ వినిపిస్తోంది.
తెలంగాణా స్వరూపం
దక్కను పీఠభూమిపై తూర్పు కనుమలకు పశ్చిమంగా ఉన్న ప్రాంతం, ప్రస్తుత తెలంగాణా లో - మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాదు, మెదక్, హైదరాబాదు అను జిల్లాలున్నాయి. స్వాతంత్ర్యానంతరం, వరంగల్లు నుండి, గోదావరి జిల్లాలనుండి భద్రాచలం, దండకారణ్యం వేరుచేసి ఖమ్మం రాజధానిగా ఖమ్మం జిల్లా ఏర్పడింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా, తెలంగాణాలో భాగం. 1956 లో భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్విభజన ద్వారా మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడు వారితో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆవిర్భవించింది.
ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమాల పరంపర
ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమాలు క్రమంగా వస్తూనే వున్నాయి, కనుమరుగవుతూనే వున్నాయి. 1969 లో మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణా ప్రజా సమితి ద్వారా, తెలంగాణ సాధన సమితి ని నరేంద్ర ఆధ్వర్యంలోను, తర్వాత 2001లో కె.చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణా రాష్ట్ర సమితి ద్వారాను, యిప్పటివరకూ తెలుగుదేశంలో వున్న దేవేందర్ గౌడ్, ప్రముఖ నటి విజయశాంతి తెలంగాణా తల్లి ద్వారాను, అనేకమంది నాయకులు అనేకమైన వ్యూహాలతో, పదవీ వ్యామోహాలతో, కులమత భేదాలతో ఎవరి శైలిలో, వారివారి ప్రణాళికలద్వారా, ప్రత్యేక తెలంగాణా కోసం ఉద్యమాలు నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వపు వైఖరి పాము చావక - కర్రా విరగక అన్న చందాన సరిసమమైన రాజకీయక్రీడలను రచించుకుంటూ విన్యాసయానం గావిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా మాత్రం నేటి వరకూ తెలిసీ తెలియనట్లు దాగుడుబూచులాట జరుగుతోంది. నా తెలంగాణా కోటి రత్నాల వీణ
నా తెలంగాణా కోటి రత్నాల వీణ అని కవిత ద్వారా పలవరించిన దాశరధి లాంటి కవుల కల నెరవేరుతోందే లేదో అని అఖిల ప్రజావని ఆశతో ఎదురుచూస్తోంది.
తెలంగాణా విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణా ప్రజావళికి శుభాకాంక్షలను తెలియజేస్తోంది - తెలుగురధం.
కొంపెల్లశర్మ - తెలుగురథం.

నాడు - ఈనాడు

నాడు - ఈనాడు
సెప్టెంబర్ 13 ప్రత్యేకతలు

సంఘటన
1922 - ప్రపంచంలో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రత లిబియా దేశంలోని 'ఆల్ ఆజీజియా' లో నమోదు అయింది. (57.7 సెం./135.9 ఫా. డిగ్రీలు).
1980 - ప్రముఖ భారతీయ క్రికెట్ క్రీడాకారుడు - వీరెన్ రస్కిణా - జననం.
సెప్టెంబర్ 14 ప్రత్యేకతలు
సంఘటన
1960 - పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ప్రారంభం.
జననం
1963 - భారతీయ క్రికెట్ క్రీడాకారుడు - రణబీర్ సింగ్.
వర్ధంతి
1989 - ప్రముఖ రచయిత, కవి, నటుడు, నిర్మాత, దర్శకుడు - ఆచార్య ఆత్రేయ మరణం.
సెప్టెంబర్ 15 ప్రత్యేకతలు
సంఘటన
1883 - బోంబే ప్రకౄతి చరిత్ర సంఘం, ముంబైలో ప్రారంభం.
జననం
1254 - యిటాలియన్ దేశవాసి, అన్వేషకుడు - మార్కోపోలో.
1860 - ప్రముఖ యింజనీర్, సర్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1860 - 1962)
1876 - ప్రముఖ బెంగాలీ రచయిత, శరత్ చంద్ర ఛటోపాధ్యాయ (1876 - 1938)
1890 - ప్రముఖ ఆంగ్ల రచయిత - అగతా క్రిష్టీ (1890 - 1976)
1909 - ప్రముఖ రాజకీయవేత్త, తమిళనాడు పూర్వ ముఖ్యమంత్రి, సి.యన్. అన్నాదురై.
16 సెప్టెంబర్ ప్రత్యేకతలు
సంఘటన
1887 - 'సాఫ్ట్ బాళ్ ఆట మొదటిసారిగా చికాగో లోని యిల్లినోయిస్ ప్రాంతంలో ఆడారు.
1963 - నూతనంగా మలేషియా ఆవిర్భావం.
1970 - పలాస్తీనా విముక్త సంఘం, నలుగురు విమానయాత్రికులతో సహా చేసిన ఉగ్రవాద చర్య ఫలితంగా, జోర్డాన్ హుస్సైన్ రాజు సైనిక పాలన విధించడం, ఫలితంగా, 'బ్లాక్ సెప్టెంబర్ సమాంతర విమాన దళాలనూ ప్రారంభించబడ్డాయి.
ప్రపంచ న్యాయ దినోత్సవం.
జననం
1916 - ప్రముఖ సంగీత విదుషీమణి - భారతరత్న, సంగీత కళానిథి - యం.యస్. సుబ్బులక్ష్మి జయంతి. (1916 - 2004)
17 సెప్టెంబర్ ప్రత్యేకతలు
సంఘటన
మొట్టమొదటిగా - భారతదేశంలో ప్రాచీన భాషగా దక్షిణ భారత ద్రవిడభాష - 'తమిళం' ను ప్రకటించబడింది.
జననం
1879 - ప్రముఖ సంఘసంస్కర్త, రాజకీయవేత్త - పెరియార్ యి.వి.రామస్వామి (తమిళనాడు) (1879 - 1973)
1930 - ప్రముఖ వైలన్ విద్వాంసుడు - 'లాల్గుడీ జయరామన్ పుట్టినరోజు. (తమిళనాడు)
1950 - ప్రముఖ రాజకీయవేత్త, గుజరాత్ ముఖ్యమంత్రి - నరేంద్ర మోదీ పుట్టినరోజు.

Tuesday, September 16, 2008

ప్రపంచ 'న్యాయ' దినోత్సవం

ప్రపంచ న్యాయ దినోత్సవం - 16 సెప్టెంబర్
న్యాయాన్ని నమ్ముకోవడం న్యాయమే కదా!
ప్రపంచవ్యాప్తంగా న్యాయానికి ఒక పండగ. అది జరిగితే సంబరాలు జరుపుకోవడం. ఏకారణాలవల్లనైనా న్యాయం జరక్కపోయినా, దర్శనం కాకపోయినా, వాదోపవాదాలు, నినాదాలు, ఉద్యమాలు, అన్యాయంపై భావప్రకటనలు, నిరసనలు, వేనకువేలవిధాలు. అందుకే, ప్రపంచం నాశనమైనా న్యాయం జరగవలసిందే అని అంటాడు చక్రవరి ఫెర్టినాండ్. ఏది న్యాయం ? ఏది అన్యాయం ? అని ప్రశ్నను, వివిధ కోణాలనుంచి బేరీజు వేసుకొంటేగాని, సమాధానం దొరకదు. న్యాయవవస్థ పనితీరుని విశ్లేషించే అర్హత, అధికారం ఎవరికున్నాయి అని ప్రశ్నించుకుంటే కూడ జవాబు అగమ్యగోచరంగా కనిపిస్తుంది. సమసమాజంలో పరిస్థితి అనువుగానే వుంటుంది కాని అది ఈ కలికాలంలో అది సాధ్యమా! యిప్పుడేకాదు, ఎల్లవేళలా ఈ న్యాయాన్యాయాల సమస్యలు, చర్చలు నిరంతరం కొనసాగుతూనే వున్నాయన్నది సత్యం. కొన్నివేళల్లో తప్పిపోయినా, న్యాయమే అక్కరకు వస్తుంది అని కందుకూరి ఒక సందర్భంలో భరోసా యిచ్చారు. న్యాయమనేది అదౄశ్యమవకూడదని న్యాయం పోతే అన్నీ తంటాలే వస్తవి, అందరితోనూ విరోధాలు వస్తాయి అన్నారు వారే ప్రముఖ రచన హాస్యసంజీవనిలో. న్యాయం పై చాలా మందికి అపారమైన నమ్మకాలుంటాయి. ఈ భావాన్నే, న్యాయమైన సొమ్ము నట్టేటిలో పారవేసినా పోదు అంటారు చెళ్ళపిళ్ళవారు తన కధలు-గాధలు లో.
న్యాయాన్యాయాలు నిర్ణయించే చట్టాల తీరుతెన్నులు
మనకున్న మొదటి చట్టాన్ని మన రాజ్యాంగం అనే చెప్పుకోవాలి. యిటీవలే భారతావని స్వాతంత్ర్హ్య జీవనకాలానికి షష్టిపూర్తి జరుపుకుంది. గడచిన అరవైయేళ్ళ ప్రాయంలో మన రాజ్యాంగపు సవరణలు అంతకన్న అధికం కదా. దీన్నిబట్టే సులభంగా చెప్పుకోవచ్చు - జనసామాన్యానికి అందించే పరిపాలనాయంత్రాంగపు విధానాల్లో, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది ధర్మం, ఏది అధర్మం అని తేల్చుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. అందుకే, చట్టం పేదవాళ్ళను కాల్చుకుతింటుంది; ధనికులు మాత్రం చట్టాన్ని పాలిస్తారు అని నిర్ద్వందంగా చెప్పాడు గోల్డ్ స్మిత్. ఈ అసంమజసపు ధోరణితోపాటు, మన న్యాయవ్యవస్థ, చట్టపరిధి, పరిణామం మన జీవితాల్లాగ క్షణికాలు. చట్టం పొద్దున ఉన్నట్లు రాత్రి వుండదు అంటారు. అంతేకాదు, చట్టాల్నిఫ్ తయారు చేయడం కన్నా అమలుపరచటం ముఖ్యమని తరచు జనావని గొల్లు పెడుతున్నా, పట్టించుకున్న నాధుడు కానరాడు. అనవసరమైన చట్టాలు అవసరమైన చట్టాలను బలహీనపరుస్తున్నాయి. ఉదాహరణకు, తీవ్రవాదానికి, ఈ విపరీతధోరణిని నిర్మూలించేందుకు అందుబాటులోనున్నవి, వాటిని అమలుపరచటంలోని చట్టాల సత్తాని విశ్లేషించలేని దుస్థితిలో వున్నాం. సగటు మానవుడు, తన ప్రాణాన్ని గుప్పెట్లో ముడుచుకొని జీవనం చేస్తున్నాడు. అదే తీరులో, సమాచార చట్టం భారతదేశంలో ప్రవేశించినా, ఆ మహమ్మారిల ఉన్న భూతపు చట్టాన్ని అమలుపరచడంలో మన నేతలు నీళ్ళు కారుస్తున్నారు. అర్ధరహిత మినహాయింపులు, పైకి చెప్పని నిర్లక్ష్య ధోరణులు అవలింబిస్తూ, సమాచార చట్టాన్ని అమలుపరుస్తున్నాట్లా, మైల పరుస్తున్నట్లా అని సందేహాలు, అనుమానాలు ఆవిర్భవించడం సహజం కదా. అందుకే, చట్టాలను తయారుచేసేది అతిక్రమించడానికే అన్న క్రిస్టఫర్ నార్త్ భావానికి సరైన ప్రస్తుత ఉదాహరణ - సమాచార హక్కు చట్టం అమలుచేస్తున్న కుహనా పద్ధతిని బట్టి చూస్తే, యించుమించు సమాచార హక్కుల చట్టం రాని పూర్వం స్థితే అని చెప్పాలి. ఏదో అవసరం అనుకుని, పదవి, బలం వున్నాయి కదా అని చట్టాలను యుద్ధప్రాతిపదిక పై రూపొందించి, అంతకన్న వాయువేగంతో మూలనపడవేయడాలు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. 33 శాతం పార్లమెంటులో మహిళలకు కేటాయింపు విషయంలో యిదమిథ్థంగా మార్చుకోలేని చట్టం ఎక్కడ కునుకు తీస్తోందో మరి, వెదకండి. అసలు మన మహిళానేతలకైనా ఈ చట్టంపై శ్రద్ధ వుందా అని అనుమానాలు రేకెత్తిన సంఘటనలు లేకపోలేవు. మరి మహిళా సాధికారత విషయం ఏమైపోయిందో! యిలాంటి మనోబలం, సంకల్పం లేని చట్టాలు - బాలకార్మిక నిర్మూలన చట్టం, నిరక్షరాస్యతను నిర్మూలించే చట్టం, ప్రతీయేట మననం చేసుకుంటున్న గ్రామీణాభివౄద్ధి పధకాలు, మహిళా సాధికారత, లింగ వివక్షత, ఎన్నో, మరెన్నో. మరో విషయం, చట్టాలను తయారుచేసేది వాటిని అతిక్రమించడానికే అని తరచు అనిపిస్తుంది. విద్రోహచర్యలకై యిచ్చే శిక్షల విషయంలో, ఒక న్యాయస్థానం శిక్షిస్తే, మరొక న్యాయస్థానం వెనువెంటనే పూర్తిగా వ్యతిరేకంగా నిర్ధారిస్తుంది. ఈ ధోరణికి ఏకంగా న్యాయవ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతూండడమేకాక, నమ్మకం నశిస్తూంటుంది. చట్టంలేనిచోట నియంతౄత్వం మొదలవుతుంది అన్న విలియం పిట్ ధోరణి నిజం కాదేమో అనిపిస్తుందీ మన దేశంలో చట్టం లేని అవాంతర పరిస్థితుల కన్నా, చట్టం వున్న యిబ్బందులే ఎక్కువ అని అనుకోవలసివస్తోంది.
ప్రపంచ న్యాయ దినోత్సవం
న్యాయం యింకా వుంది అని చెప్పుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా రోజు కేటాయింపులు, ఆ సందర్భాన పలవరింతలు, పలకరింతలు, ఆషామాషీగా నడుస్తున్నాయి. సెప్టెంబర్ 16 న ప్రపంచ న్యాయ దినోత్సవం జరుపుకోవడం అనేక అలవాట్లలో సంప్రదాయంగా వస్తున్న ఒక ధోరణి.
న్యాయంపై న్యాయమూర్తులు
న్యాయమూర్తులుగారూ! మీరు బహుమంచివారే! అధర్మ నిధనంలో యమరాజంతటివారు, అని కుట్ర అన్న రచనలో రచయిత శివసాగర్ తన భావాన్ని వ్యక్తపరచారు. మన న్యాయమూర్తులు, అధిష్ఠాన సింహాసనాసీతులు అయినా, న్యాయం విషయంలో నటనాపర్వంలో పునీతులు. మన న్యాయస్థానాలు, న్యాయమూర్తులు కలసి ఉమ్మడిగా సమాజానికి చట్టం, న్యాయం, రాజ్యాంగ మాధ్యమాల ద్వారా, హెచ్చుతగ్గుల్ని తొలగిపోయేలా చేయడం, తద్వారా సమభావం, సామ్యవాదం అందించేలా అవిరళకౄషిని చేయవలసిన తరుణం నిత్య, సత్య, సత్వరంగా జరగాలి అన్నదాంట్లో సందేహం, సంశయం లేనే లేవు, రానేరాకూడదు. అందుకే హెచ్చుతగ్గులున్నచోట చచ్చిపోవు సమభావం, సమభావం లేనిచోట సామ్యవాదముత్తమాట అంటాడు. ఈ కవివాక్కు ఈనాడు సంపూర్ణంగా వర్తిస్తుంది అని చెప్పాలి. యిటీవలే షష్టిపూర్తి సంబరాలను జరుపుకుని, ఆరు దశాబ్దాల స్వేఛ్ఛాగాలుల్ని పీల్చుకుంటున్న తరుణంలో మన భారతావనిలో సగటు మానవునికి రావలసిన న్యాయం ఎంత నిజంగా, ఎంత త్వరితగతిని లభిస్తోందో మనకున్న న్యాయస్థానాల అధిపతులు, న్యాయ యంత్రాంగ మంత్రాంగ శాఖలు, వీటి అధిపతులు, న్యాయపతులు, యిరుపక్షాల తమతమ వౄత్తులద్వారా ఎంతెంత న్యాయం చేస్తున్నారో వారి ఆత్మసాక్షే వారిని సమాధానపరచాలి. అందుకే, న్యాయం జరగడం ఆలస్యమైతే, అన్యాయం జరిగినట్లే నిర్ధారించాలి అని చెప్పిన నానుడిలో సత్యం కాక వేరే ఏమీలేదు. న్యాయస్థానాలు తమ ఎట్టకేలకు నిర్ణయాలను జారీచేసినా, వాటిని ఆచరించడంలో జరుగుతున్న జాప్యం కూడ దారుణంగానే వుంది.
మన న్యాయవ్యవస్థలో లోపిస్తున్న సమన్వయ దౄక్పథం
సమన్వయ దౄక్పథం అంటే - ముందుచూపు కోల్పోయిన గతదౄష్టి గానీ, వెనుకచూపును నిరసించిన భవిష్యదౄష్టిని గానీ మానవపురోభివౄద్ధికి దోహదకారులు కాలేవు అన్న అభిప్రాయం బలపడ్డమే అన్నది మన న్యాయవ్యవస్థకు ఖచ్చితంగా వర్తిస్తుంది. అందుకే తిక్కన, మహాభారతం లో - చెడబారినదైన అవస్థ అంటాడు. యిలా సాగింది.
సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచేపారము పొందలేక చెడబారినదైన అవస్థ, దక్షులెవ్వారలుపేక్ష సేతురది వారల చేటగుగాని ధర్మనిస్థారకమయ్యు సత్యశుభదాయకమయ్యును, దైవముండెడెన్.
సమాజంలో అధర్మం-అసత్యాలచేత, ధర్మము-సత్యం దారుణంగా చరచబడుతున్నా, దానిని నిరోధించేశక్తి వుండీ ఉపేక్షించినవారికి తమ ఉపేక్షే చేటుగా పరిణమిస్తుంది. సరిగ్గా యిదే పరిస్థితి ఆనాటి భారతకాలంలో వున్న స్థితిగతులే, నేటి ఆధునిక, కలియుగ భారతావనిలోనూ ప్రత్యక్షదర్శనం అవుతున్నాయి. మార్పు ఎటొచ్చీ, యుగం, యుగధర్మపరంపర మారుతున్నాయి. అవే సమాజాలు, మనుషులు వారే. కొంచెంగా సాంకేతికత, శాస్త్రాలు, ప్రపంచవ్యాప్తంగా తంత్రాలు, కుతంత్రాలు, మనకున్న అంతశ్శతౄవులతో తోడయి సమాజాన్ని నిజమైన చెడబారినదైన అవస్థగా మారుస్తున్నారు, మన నేటి రాజకీయదక్షులు. నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చే వానిని ఈనాటి సంఘంలో 'కాంజెనిటల్ ఈడియట్'గా పరిగణిస్తున్నారు అన్నాడు ఒక విశ్లేషకుడు. అది అసాంతం మన న్యాయవాదులకు, న్యాయమూర్తులకు, న్యాయస్థానాలకు, ఉమ్మడిగా వర్తిస్తుంది. నైతిక విలువలు మాత్రం మన చట్టాల్లోను, న్యాయశాస్త్రపుపుటల్లోనూ భద్రంగానే వుంచారు. తరచుగా వాటిని సంప్రదించవలసివస్తుందని, మన తీర్పులు సంవత్సరాలకొద్దీ ఓ కొలిక్కి రాలేని సమయ ప్రణాళికను రూపొందించి, వచ్చినా, అనూహ్యమైన కొసమెరుపులతో, ఆశ్చర్యానుభూతుల్ని కలిగిస్తాయి. ఒక న్యాయస్థానం నుంచి, మరొకదానికి పైకి, అదే వరసలో కింది న్యాయస్థానాల మధ్య క్రీడావిహారం చేస్తుంటాయి వాయిదాల రూపంలో.
న్యాయంపై, న్యాయం చుట్టూరా ఆవరింపులు
ప్రజాస్వామ్యదేశమైన మనభారతావనిలో సగటుజీవికి న్యాయం గురించి ఆలోచించే జ్ౙానం, తీరిక కూడ లేదు. కడుపుకాలుతూ, డొక్క లోపలికిపోతూ, రోజును గడుపుతున్న నీరసహౄదయ నలుసు ప్రాణానికి న్యాయమా, అన్యాయమా, ఏదీ వద్దు, తనను యధాతధంగా బతకనివ్వమంటాడు.
మన న్యాయవ్యవస్థపై ప్రముఖ రచయిత రావిశాస్త్రిగారు విసరిన బాణాలు యిలా వున్నాయి.
పని కూలీ వెధవల్ది, లాభం బుగతది, ఏమైనా అంటే, ఎదురు తిరిగితే మన సాయానికి కోఋర్టులున్నాయి, జైళ్ళున్నాయి (మాయ).మడిసి మాంసం అమ్ముకొని మడుసులు బతకడం నాయం కాదుకదా? (రత్తాలు రాంబాబు).పక్కింట్లో దొంగలు పడ్డప్పుడు లక్షలక్షలు పోవాలి, అది న్యాయం. (కష్టార్జితం)కేసుల్లోనే న్యాయం వుంటే ఈ పోలీసులం మేమెందుకు? ఇంతమంది ఈ ప్లీడర్లు అంతా ఎందుకూ? ఈ కోర్టులన్నీ ఎందుకూ? (న్యాయం).అన్యేయం చేయించీ నాలుగురోజు లూరుకుంటే అదే నాయెం ఊరుకుంటుంది. (విషాదం).
భమిడిపాటి వారి న్యాయం పై నిర్వచనం యిలా వుంది.తను ఇతరుల్ని అంటే, తమాషాలు; తన్ని అంటే ఇతరులు, ఈర్ష్యట; ఇదిట న్యాయం.
న్యాయమన్న బోనులో చిక్కుకున్న ప్రాణి బయటపడ్డానికి వీలులేదు, అంటారు న్యాయంపై యజ్ౙన్నశాస్త్రి.
మన మహాకవి శ్రీశ్రీ న్యాయం పై పంచరత్నాలు చెప్పారు. అందులో ఒక రత్నం యిలావుంది.నడిబజారులో నలుగురి ముందు హత్య జరిగినా సాక్ష్యం బందు, న్యాయం గుడ్డిది మాత్రమే కాదు, కుంటి, మూగ అని ఘోషిస్తాను, అని ఉధ్ఘోషించారు.
న్యాయం ఉరిపోసుకున్న పరిస్థితి కూడ మన రచయితలు చెప్పారు.నాకు విలువలేనప్పుడు నేనెందుకు? మీ ఏడుపేదో మీరే ఏడవండంటూ అక్కడే - కోర్టు గుమ్మానికే - ఉరేసుకుంది - న్యాయం ఉరేసుకుంది, అని అల్లంరాజు, న్యాయం ఉరేసుకుంది అని ప్రకటించారు.
ఏది ఏమైనా నిరూపించలేని నిజాలను చట్టం ఒప్పుకోదు. మన న్యాయశాస్త్రం చెడ్డవాడిని మరింత చెడ్డవాడిగా చెయ్యడానికే ఉపయోగపడుతుందమ్మాయ్ అని సూర్యారావు ఒక పాత్రద్వారా, శ్రీమతులు-శ్రీయుతులు అన్న రచనలో చురకను అంటించారు.
పైన వివరించిందంతా, జరిగినది, జరుగుతున్నది. మరి జరగాల్సిన తంతు సంగతి మాట ఏమిటి? దాని కధ, కమామీషూ ఎలా వుండాలి? సమాధానంగా - అధికారదుర్వినియోగంలాంటి అంటురోగాలకు దూరంగా, కేవలం పుస్తకాల్లోని వెర్రిమొర్రి న్యాయం కాక మంచులా స్వచ్ఛమైన న్యాయం జరగాలి ప్రతి మనిషికీ - అని అంటారు, కోర్టు అన్న రచనలో విశ్వం.
యిటువంటి న్యాయం మన భారతావనిలోని సగటుమనిషికి, గ్రామీణ నిరుపేదకు, ఎవ్వరూ ప్రశ్నించకూడని, సమాధానపరచుకునే అవసరం రాని నిత్యజీవనం చేయడానికి కావలసిన సదుపాయాలను ఎలాగూ అందించలేకపోతున్నాం. కనీసం, న్యాయాన్నైనా అందించడానికి మనసావాచాకర్మాణా సంకల్పం చేద్దాం. దీక్షపూనుదాం. మన మేధలకు కంకణాల్ని కట్టుకుందాం. అన్యాయం పై న్యాయం వచ్చేవరకూ పోరాటం సాగిద్దాం. న్యాయం పేరిట అందిస్తున్న అన్యాయాన్ని తోసిపారేద్దాం. అప్పుడే, మన సర్వస్వతంత్ర స్వేచ్ఛాపూరిత భారతావని జరుపుకునే సంబరాలు,ఆరు దశాబ్దాల స్వేఛ్ఛాస్వాతంత్ర్య సంబరాలకు అర్ధం, పరమార్ధం. అది లేనినాడు, పండుగలన్నీ దండుగలే.
ప్రపంచ న్యాయ దినోత్సవం సందర్భంగా - న్యాయంలా దర్శనం యిచ్చే అన్యాయాల్ని, అన్యాయాలుగా కనిపించే న్యాయాలపై మన న్యాయ నిర్ణేతలు, నేతలు, నాయకులు, వినాయకులు ఆలోచించాల్సిన సమయం. తమ తమ మస్తిష్కాలకు పదును పెట్టగలిగి, ఆలోచనాస్రవంతిని చైతన్యవంతంగా తగు ప్రణాళికలను నిర్మాణం చేసుకుని ఆచరణకు సుసాథ్యం చేసుకునే ప్రయత్నంలో ముందుకు అడుగు, సత్సంకల్పం, దీక్ష తో వేయగలిగితే, కించిత్తైనా న్యాయాన్యాయ విశ్లేషణాత్మక వ్యాఖ్యానానికి కొంచెం అర్ధం, పరమార్ధం గోచరిస్తాయి.
ప్రపంచ న్యాయ దినోత్సవం సందర్భంగా - తెలుగురథం శుభాకాంక్షలను అందాజేస్తోంది.
కొంపెల్లశర్మ - తెలుగురథం.

విశ్వజనీన సంగీత సర్వస్వ కళానిధి - సుబ్బులక్ష్మి

విశ్వజనీన సంగీత సర్వస్వ కళానిధి - సుబ్బులక్ష్మి
సంగీత కళానిధి, తపస్విని, సుస్వరలక్ష్మి
నేనెవర్ని? కేవలం ఓ ప్రధానమంత్రిని, ఈ సంగీత కళానిధి ముందు నేనెంత? అని భారతదేశపు తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వినమ్రుడై, యం.యస్.సుబ్బలక్ష్మి పై అభిమానాన్ని ప్రకటించాడు.సుబ్బలక్ష్మి మీరాకు ప్రతిబింబంకాదు; మీరాయే వచ్చి సుబ్బలక్ష్మిగా నటించి వెళ్ళింది - అని మీరా చలనచిత్రానికి దర్శకుడు డంకన్ పలవరించాడు.ఆమె ఒక తపస్విని అని ప్రముఖ గానకోకిల లతామంగేష్కర్ అన్నారు.ఉస్తాద్ బడే గులాం ఆలీఖాన్, సుబ్బులక్ష్మిని సుస్వరలక్ష్మి అని అన్నారు.
సంగీతం అంటే ప్రాణమే అన్న యం.యస్. పుణికి పుచ్చుకున్న విదుషీమణి, నిగర్వీ, క్షీరాబ్ధికన్యక. నాకు భక్తి సర్వస్వం అని సవినయంగా ప్రకటించుకున్నారు.
శక్తి + రక్తి + భక్తి + ముక్తి = సంగీతం = మధురై షణ్ముఖవడిపు సుబ్బులక్ష్మిసంగీతంలో శక్తి కావలసిన వాళ్ళకి శక్తీ, రక్తి కోసం పాకులాడేవాళ్ళకి రక్తీ, భక్తి పారవశ్యంలో ఉన్నవాళ్ళకు భక్తీ, ముక్తికై తపించే వాళ్ళకు ముక్తీ దొరుతుతాయి. వీటన్నింటినీ కలబోసి బ్రహ్మ సౄష్టించాడు మన మధురై షణ్ముఖవడిపు సుబ్బులక్ష్మిగా. సంగీతజగతి ప్రేమగా పిలుచుకునే యం.యస్. అన్నదే సంగీత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైంది.
సంగీత ప్రచారంతో ధన్యజీవనంభరణీ నక్షత్రంలో, తులాలగ్న, మేషరాశిలో, సుబ్రహ్మణ్యయ్యర్, వీణైషణ్ముఖవడివు దంపతులకు తమిళనాడు, మదురైలో 16 సెప్టెంబర్ 1916 న జన్మించిన 'సుబ్బూ తన బాల్యాన్ని సంప్రదాయ సంగీత వాతావరణంలో గడపడం శుభారంభ సుకౄతం. తల్లితండ్రులు ఈఅమెను రాజతిప్ప (తండ్రి)గాను, కుంజమ్మ (తల్లి) గాను ముద్దుగా పిలుచుకునేవారు. కుటుంబ వాతావరణం సంగీతమయమే. అమ్మమ్మ అక్కమాల్ వైలన్ వాద్యంలోను, తల్లి వీణాకళాకారిణి అవడం మరింతగా వన్నెలబ్బాయి. మధురై, పశ్చిమ హనుమంతరాయన్ వీధిలో జన్మించిన ఈ కళామతల్లి, కేవలం పదేళ్ళవయసులోనే 78 ఆర్పీయం తో తన కోకిలగానాన్ని - మరకత వడివు అన్న గీతం - ముద్రించుకోగలిగిన ఈ విద్వన్మణి ప్రముఖులైన శ్రీ సెమ్మనగుడి శ్రీనివాస అయ్యర్, పండిట్ నారాయణరావ్ వ్యాస్ ల వద్ద సంగీతశిక్షణను పొందారు. 1932 లో మద్రాసు మ్యూజిక్ అకాడమీలో కచేరీని ప్రతిభావంతంగా నిర్వహించిన, ఈ కళాకారిణికి, మహమకం లో(కావేరీ తీరాన), మహారాజపురం విశ్వనాధ అయ్యర్ నుంచి బంగారుపతకాన్ని స్వీకరించారు. 1940 లో సదాశివం తో వివాహమైన సుబ్బు, గాంధీ దర్శనం కలగడం, 'హరితుమా గానం చేయడం ఆమె జీవితానికి ఒక మరపురాని సంఘటన అంటారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, మొదటిసారిగా మహిళకు లభించిన సంగీతకళానిధితోపాటు, అత్యంతోన్నత సత్కారమైన భరతరత్న పురస్కారాన్ని 1998 లో సుబ్బులక్ష్మి స్వీకరించారు.
చిత్రాతిచిత్రంగా చిత్రరంగప్రవేశం1937 లో చిత్రరంగంలో కూడ కాలుమోపిన ఈ చిన్ననాటి కుంజమ్మకు, ప్రముఖ సంగీతకారుడు పాపనాశం శివన్ సంగీత దర్శకత్వంలో, నటేశ అయ్యర్ నాయకునిగా, సేవాసదన్ (1932లో) చిత్రంతో చిత్రాతివిచిత్రంగా చిత్రరంగ ప్రవేశం జరిగింది. వెనుతిరగని ఈ సంగీతలక్ష్మి, నారదపాత్రలో సావిత్రి (1942), ప్రముఖ సంగీతకారుడైన జి.యన్.బాలసుబ్రహ్మణ్యన్ తోపాటు శకుంతల (1943) విజయవంతమైనాయి. అయితే, ప్రత్యేకంగా చెప్పుకోతగ్గది మీరా చిత్రం. ప్రముఖులు చిత్తూర్ వి. నాగయ్యతోపాటు యం.జి.ఆర్. కూడ చిన్న పాత్రలో నటించిన మీరా (తమిళం) చిత్రానికి, ప్రముఖ రచయిత కల్కి సంభాషణలతో, తలమానికంగా విరాజిల్లనిది మాత్రం సుబ్బు నటనాకౌశల్యాన్ని, ఈనాటికీ చెప్పుకోవడమే ఆనాటి గొప్పదనం నేటికీ చిరస్మరణీయం. అందుకే మీరా చిత్రాన్ని అదే పట్టుదలతో హిందీలో నిర్మించి అక్కడకూడ అధ్బుతవిజయాన్ని సాధించారు.
సంగీతలహరిగురువులు కూడ గుర్తించలేని లక్షణశైలి, రసధ్వని ప్రధానమైన భావాలోచనాలు నిత్యం ప్రవహించేవి. మానవునిలో భక్తికూడ పెరుగుతూంటుంది అని, ఆ భక్తుని హౄదయంలో, నివాసంలో, దర్శనీయమయ్యే భగవంతుడు, ఆ దైవంపై ప్రకటించవలసిన భక్తిధ్యానాదులపై దౄష్టిలోనుంచుకుని, భక్తుల మేధస్సును పదునుపెట్టేలా, స్వరరాగభావప్రవాహాన్ని తమదైన శైలిలో అనేకవేలకువేలు కీర్తనలను, రచనలను స్వరపరచి, తనగానంద్వారా సంగీతప్రచారాన్ని ప్రతిభావంతంగా అర్ధశతాబ్దకాలంపాటు నిరంతరంగా సమాజసేవలను అందించిన ఘనత కేవలం యం.యస్. కే చెల్లుతుంది.
సంగీతం ద్వారా సమాజసేవలుమానవసేవయే మాధవసేవ అన్న సూత్రాన్ని మనసావాచాకర్మణా విశ్వసించి, సంగీతం ద్వారా, సమాజానికి వివిధ ప్రక్రియల్లో సేవను అందించారు. 200 పైకి సహాయ కార్యక్రమాల్ని అందించిన అమూల్యాన్ని, ద్రవ్యంతో విలువకట్టాలంటే, ఆ విలువ 30 మిలియన్ల రూపాయలను సౄష్టించింది. ఆర్ధికపరమైన సమాజసేవలను గుర్తించి ఆమెకు మెగస్స్యే పురస్కాన్ని అందజేశారు. ఆమె సంగీతం ద్వారా లబ్ధి పొందిన సంస్థల్లో, ఉదాహరణకు వీటిని చెప్పవచ్చు.
కస్తూర్బా స్మారకనిధి, గాంధీస్మారకనిధి, త్యాగరాయ శతవర్ష నివాళిసంఘం, సేవూర్ క్షయ వైద్యశాల, శంకర నేత్రాలయ, ఇంద్రప్రస్థ మహిళా కళాశాల, సుబ్రహ్మణ్యభారతి స్మారక సంస్థానం, నానక్ సంస్థానం, వాలంటీర్ ఆరోగ్య సేవాసంస్థ, రామకౄష్ణ మిషన్, న్యూయార్క్ హిందూ దేవాలయం, కంచి మహాస్వామి మణిపంటపం, సముద్రి, కమలానెహ్రూ వైద్యశాల,దక్షిణ భారత విద్యాసంస్థ, తిరుమల తిరుపతి దేవస్థానం, కాన్సర్ సంస్థ,మ్యూజిక్ అకాడమీ, సంస్థలు కేవలం సూచిక క్రిందకే వస్తాయి. ఈ సేవల జాబితాలు అంతులేని కధనాలుగా చెప్పాలి.
స్వంత సేవాసంస్థలు
సముద్రి, సుబ్బులక్ష్మి-సదాశివం సంగీత నృౠత్య పరిశోధనాసంస్థ (శౄతి నిర్వహణ), సంప్రదాయ సంగీత పరిరక్షణం, భారతీయ సంస్కౄతిని విశ్వవిఖ్యాతం చేయడానికి ప్రముఖంగా చెప్పుకోవాలి. మణిమంటపం - కంచి మహాస్వామికి ఈ దంపతులిద్దరూ అపార భక్తాగ్రేసరులు.
అనుభవ ప్రవచనాలుయం.యస్. తన సంగీత కచేరీ చేస్తున్నప్పుడు తీసుకునే జాగ్రత్తల విషయానికొస్తే, రాగస్వరూపాన్ని, ప్రారంభంలోనే రసికునికి త్వరితరీతిని అవగాహనకు రావాలని, అనవసరపు ఉత్కంఠను రేపకూడదని, ప్రస్తుతించే రాగం - పూర్వికళ్యాణియా లేక పంతువరాళియా అన్న రెండు రాగాల్లోని అంతరం, ముందుగానే తెలపాలి అన్న భావాన్ని ప్రతీ కచేరీలోను ప్రకటించారు అని ఆమె రసికులు, సంగీతప్రేమికులు, నిత్యం పలవరించే మాటలే. రాగాలాపనలో మూడు స్థాయిల్లోను సక్రమంగా పాటించడం విధిగా ఆచరించాలంటారు. అసమంజస, అసంభవ ధోరణులకు కడుదూరంగా వుండాలని, వీణలాంటి సంగీత సాధనాల ద్వారా గురుత్వాన్ని స్వీకరించాలి అని చెబుతారు. సంప్రదాయాన్ని గౌరవిస్తూ, ఆచరిస్తూ, సంగీతాలాపనతోపాటు, సాహిత్యోచ్ఛారణంలో సమప్రాధాన్యం యిచ్చి తీరాలన్న భావన ముఖ్యమనేవారు. సంగీతశిక్షణలో అనుభవం వున్న గురువు దగ్గర కనీసకాలంపాటు సుశిక్షణాభ్యాసాలు పూర్తిచేయాలని, నిరంతర అభ్యాససాధనలే ప్రతిభాపధంవైపు పయనింపజేస్తాయని తరచుగా వివరించేవారు. స్వరరాగాలాపనతోపాటు, సాహిత్యాంశం పై అవగాహన, భావసౌందర్యం, తాత్పర్యం, అలవరచుకోవాలంటారు.
సుబ్బులక్ష్మి వ్యక్తిత్వంలో ప్రధానాంశాలు
సంగీతకళానిధి యం.యస్. కేవలం సంగీతలక్ష్మి, నటి, సేవాపరురాలు కాదు. మనందరికీ తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అవి యివి :
శిక్షణ పొందిన భరతనాట్య కళాకారిణి.వైణికురాలు, తల్లినుంచి శిక్షణ, సెమ్మనగుడి శ్రీనివాస అయ్యర్ కచేరీకి వీణావాదనం.సోదరుని నుంచి మౄదంగం అభ్యాసం పొందడం, ప్రతిభావంతమైన మౄదంగవాదనంలో ప్రవీణురాలు.ప్రముఖ సంగీతకళాకారుడు చెంబై వైద్యనాధన్ ఈమె కచేరీకి వైలన్ స్వరాన్నందించారు.కీర్తనల పాఠాల్ని ఎన్నడూ కచేరీ చేస్తున్నప్పుడు దగ్గరగా వుంచుకోవడం అలవాటేలేదు.శివం - శుభం అన్న యింటిపేరులోనే భక్తిపారవశ్యపుభావం.శంకరాభరణరాగం - అత్యభిమానపాత్రమైనది.మనసుమెచ్చే రంగు - నీలవర్ణం.ఐస్ క్రీం అన్నది జీవితాంతం రుచి చూడనేలేదట.శీతలపానీయాలన్నవి కూడ దరికి రానిచ్చేవారు కాదట. గొంతుని ప్రాణప్రదంగా చూసుకోవడంలో రాజీలేని మార్గాన్ని అవలంబించారు.
శస్త్రచికిత్సను నిరాకరించిన వైద్యుడుమధురగానకోకిల గాత్రం కదా. ఆ గాత్రానికి ఎందరు మహానుభావులు, భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డలు ఈమె స్వరప్రస్థానానికి చెవులు కోసుకునేవారో. 1930 ప్రాంతంలో యం.యస్. గొంతుకు గద్గదం ప్రవేశించడం మూలాన, వైద్యుని సంప్రదించారు. అందులో, ప్రముఖులు, విశ్వవిఖ్యాత శస్త్రనిపుణులు - డా. పి.వి.చెరియన్, ఆమె గొంతుకకు శస్త్రచికిత్స చేసేందుకు భక్తితో నిరాకరించారట. అది వాస్తవానికి, వౄత్తికీ, ప్రవౄత్తికీ, వర్ణనాతీతమైన సంఘర్షణ, అనుభవించిన వారికే అవగతం.
1997 లో భర్త సదాశివం మరణం తర్వాత యం.యస్. సంగీతానికి స్వస్తి, భరతవాక్యాన్ని స్వరపరిచారు.
చరమపర్వంసంగీతలక్ష్మీసరస్వతీసంగమమైన యం.యస్.సుబ్బులక్ష్మి మానవజన్మకు సార్ధకతను తెచ్చిపెట్టినవి - ఆమె గానంచేసినవి - శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, శ్రీ విష్ణుసహస్రనామావళి, అర్ధశతాబ్దపుకాలంపాటు ఈ విశ్వంభర ప్రతీ గౄహాన్నీ పావనం చేశాయి. ఆశ్చర్యం ఏమిటంటే, హిందువులే కాక, యితర మతస్థులు కూడ భక్తిభావనతో వీటిని విని యిప్పటికీ పరవశం పొందుతారట. తమిళులకు పుణ్యతిధిగా భావించే అమావాస్య నాడు, సుబ్బులక్ష్మి 11 డిసంబర్ 2004 న తమ అంతిమశ్వాసను విడిచి, ఈ భౌతికలోకంనుంచి మాత్రమే తప్పుకున్నారు. ఈ సంగీత కళామతల్లిని స్మరించని, శ్రవణం చేయని గౄహం లేదు; మనస్సు లేదు; స్పందించని హౄదయం లేదు.
శ్రేయోభూయాత్ సకల జననం
బిలియన్ (100 కోట్లు) జనాభాకు ప్రతినిత్యం మేలుకొలుపుల ద్వారా విశ్వసౌభ్రాత్రత్వం, ప్రపంచశాంతిని అందిస్తున్న ఈ నైటింగేల్ - సంప్రదాయ భక్తి సంగీతజగతికి స్వరసర్వస్వం. ఆమె ఒక సంగీతవిశ్వవిద్యాలయం.
సుబ్బులక్ష్మి సంగీతానికి సమాంతరాలు, రూపాంతరాలు
సర్వకళలకూ గానమే మకుటాయమానమైతే, గాత్ర సంగీత విద్యా రహస్యాల్ని వన్నెచిన్నెలతో కూర్చి, పేర్చిపెట్టిన సంగీతకళానిధి, భక్తి సంగీత సర్వస్వం, యం.యస్.సుబ్బులక్ష్మి అనీంటారు, ప్రముఖ పాత్రికేయుడు, అధికారభాషాసంఘం అధ్యక్షులు, ఎ.బి.కె.ప్రసాద్ గారు. యం.యస్. సుబ్బులక్ష్మి సంగీతం అనగానే, ప్రతీ మనస్సుకీ, హౄదయానికి హత్తుకునే అంశాలు ఎన్నో ఉన్నాయి. మచ్చుకు కొన్ని ఉదాహరణలు :
కొలువుదా భక్తి కొండల (కేదారగౌళ), పరమ పురుష (షణ్ముఖ), దీనుడ నేను దేవుడనీవు (సావేరీ), మరలి మరలి జయమంగళం (రాగమాలిక), ఇదియే సాధన (రీతి గౌళ), స్వరరాగసుధ, నీనామమె (మధ్యమావతి) కీర్తనలను చెప్పుకోకుండ వుండలేరు.
ఎ.బి.కె. ప్రసాద్ గారు తన నిబద్ధాక్షరి - సాహిత్యకీయాలు అన్న సంపాదకీయాల సంకలనంలో, 'భక్తి సంగీత సర్వస్వం 'సుబ్బూ అన్న అనుభూత్యాత్మక,ఆలోచనాత్మక వ్యాసంలో ఉదాహరించిన భరతుని సూక్తిని పున:ల్లేఖితమైతే :
"అలంకారం లేని సంగీతం, చంద్రుడు లేని రాత్రి, నీరులేని నది, పుష్పాలు లేని లత, ఆభరణాలు లేని వనితా లతోపాటు, సుబ్బులక్ష్మి గాత్రంలేని మేలుకొలుపు, ఆమె సంగీతస్వరరాగప్రాభవాన్ని స్మరించని సంగీతకార్యక్రమం, ఆలోచనకు రాలేని భావం, భావన.
యం.యస్. సుబ్బులక్ష్మి సంగీతరాగస్వరాలాపనలు, ప్రతి జీవరాశి మనసుకి, హౄదయానికి ఆనందం, ఉల్లాసం, సర్వాలంకారశోభాయమానంగా అలరిస్తాయన్న మాటలు సత్యశివసుందరభరితాలు.
ప్రశంసల ప్రవాహం
సుబ్బులక్ష్మీ! రామధున్ నువ్వే గానం చేయాలి. - మాహాత్మాగాంధి.
నాదేముంది? నేను ఒక దేశానికి ప్రధానమంత్రిని మాత్రమే! ఆమె సంగీత సామ్రాజ్యానికి మహారాజ్ౙి. - జవహర్ లాల్ నెహ్రూ.
తన 'భారతకోకిలా బిరుదును సుబ్బులక్ష్మికిచ్చేస్తున్నాను. - 'భారతకోకిలా సరోజినీనాయుడు.
సుబ్బులక్ష్మి సంగీత విద్వాంసులకే విద్వాంసురాలు - కామ్రేడ్ జ్యోతి బాసు.
సరస్వతి వీణాపాణి - అయితే, సుబ్బులక్ష్మి వీణా కంఠి. - కరైకుడి సాంబశివ అయ్యర్.
ఆహా! ఏమి స్వరం! ఆ స్వరంలో ఎంత వశీకరణ శక్తి వుంది! - చెంబై వైద్యనాథ్ అయ్యర్.
కళారంగంలోని వారిని నడిపించేవారు ఒకరు వుండాలి. ఈ విషయంలో సుబ్బులక్ష్మి అదౄష్టవంతురాలు. ఆవిడకు సదాశివం (భర్త) ఉన్నారు. - డా. మంగళంపల్లి బాలమురళీకౄష్ణ.
ప్రశంసలైనా, పురస్కారాలైనా, సుబ్బులక్ష్మి సంగీతసామ్రాజ్యానికి చేసిన సేవలకు, సంఘసేవకు లభించిన వరాలే! కళాసేవ ద్వారా మన దేశానికి, విశ్వానికి విఖ్యాత వైభవాల్ని తెచ్చిపెట్టిన మహిమాన్విత మనీషి, మహిళామణి, కళాకారిణి, సంగీతకళామహారాజ్ౙి - యం. యస్. సుబ్బులక్ష్మి.
డిసెంబర్ 11, 2004 ఒక దుర్దినం. సంగీతకళారంగానికి పగలే నిశీధి ఆవహించిన రోజు. సుబ్బులక్ష్మి మననుంచి భౌతికయానం గావించినా, మనందరి మనోవాక్కాయకర్మల్లో, అనునిత్యం, నిరంతరం, ఈ పట్టమహిషి ప్రతిభ ప్రతినిత్యం - సుప్రభాతం నుంచి పవళింపు సమయం వరకూ, ఆ పైన స్వప్నాకౄతిలో మనకు దర్శనీయయోగాన్ని, యోగ్యతను అందిస్తూనే ఉంటారు.
నేడు, మధురై షణ్ముఖ వడివు సుబ్బులక్ష్మి, సంగీత సరస్వతి జయంతి సందర్భంగా, ఆ మహనీయురాలికి శతసహస్ర సరాగభరిత నివాళిని, నీరాజనాల్ని, సమర్పిస్తూ, తెలుగురథం ఆ సంగీత కళానిథి కి పాదాభివందనాల్ని సమర్పించుకుంటోంది.
తెలుగురథం - కొంపెల్ల శర్మ.