
హారికధాపితామహ - 'ఆదిభట్లా నారాయణదాసుగారు ( 1864 - 1945 )
వికాస వినోద విజ్ణానానికి కధనాలు
మానవుని మనోవికాసమునకు విజ్ౙానముతోపాటు వినోదముకూడ అవసరం. సాధారణంగా వాగ్రూపంలో కధనం చేసే విధాననైపుణ్యమే పూర్వం కధకునితోపాటు అంతరించేది.ఆదిలో అన్ని మానవ సంఘాలలో కధాకధనం నృౠత్యగీతవాద్యాలతో ముప్పేటగా ముచ్చటగా అలరారేది. నాగరికత పెరుగుతూ వచ్చాక, ఈ ముప్పేటముడినుంచి గీతం దూరమవడం. పురాణపఠనం, పురాణశ్రవణం వచ్చాక, నౄత్యవాద్యాల ప్రమేయం లేకుండానే గీతాలతో, వ్యాఖ్యానంతో కధనాన్ని వివరించడం బహుళ ప్రచార సాధనమైనది. జ్ౙాననిధుల కళాప్రక్రియల్లో ప్రఖ్యాతమైన జక్కులు, జంగములు, కధనాలను ప్రస్తుతించడం, యక్షగానాలు, వీధిభాగవతాలు, గుంపులు, వేదికలపై ప్రదర్శించిన వాటిలో పాటలు, పద్యాలు చేర్చనిదే ఆకొట్టుకొనడం జరగలేదు. పురాణాలు, యితిహాసాలు, ప్రబంధాలు, చరిత్రలు, స్వీయచరిత్రలు, గాధలు అన్ని కళాప్రక్రియలు నేపథ్యాలుగా మారాయి. యిలా వాగ్రూపంగా ప్రచారమయిన కళామాధ్యమాలు, క్రమేపీ గ్రంధస్థమవడం ప్రారంభమయ్యాయి.
కధలకు తలమానికం హరికధ
సంగీత సాహిత్యాలు రమారమి సమమైనపాళ్ళలో మేళవింపబడి నవరసభరితంగా భక్తిని, నీతిని, వైరాగ్యమును, సమకూర్చి శ్రోతల మానసికగ్లానిని ప్రేరేపించి పరమానందము కూర్చు ప్రక్రియలు అనేకం. ఆ ప్రక్రియల్లో ప్రముఖంగా చెప్పదగినది, హరికధ. దీనికి పూర్వం యక్షగానం (కన్నడిగులు), కాలక్షేపం (తమిళులు), అభంగ్ (మహారాష్ట్రులు), సరే యిక మన తెలుగువారు 'హరికధా అని పిలవడం సంప్రదాయంగా వస్తూంది. హరికధ మనకు మహారాష్ట్రుల నుండి దిగుమతి అయిందని, తమిళులకు, కర్ణాటకులకు, తెలుగువారికి ఈ ప్రక్రియ సరిసమానమే అని, ప్రబంధకవిత్వంలోని రుచి వాగ్గేయకారుల వడ్డనతో హరికధతో విందులు చేయడం మొదలైనది అని ఆరుద్రగారి అభిప్రాయం. ఐతిహాసకాలంలో కుశలవుల రామాయణగానం ఈ కోవకే చెందినది. అయితే యక్షగానం లో ఎక్కువమంది వుంటారు. ఏకవ్యక్తికమై బహుపాత్రాభినయంతో ప్రస్తుతించే సంగీత సాహితీకధనోపన్యాసం గా అభివర్ణించవచ్చును. అట్టి కధాగానం చేసేవారిని భాగవతులని, హరిదాసులని, పిలవడం కూడ ఆనవాయితీగా వచ్చింది. భగవద్భక్తి కలవారిని భాగవతులుగా, హరివిషయక జ్ౙానులను హరిదాసులుగా చెలామణి అయ్యారు. తెలుగునేలపై హరికధకు ప్రాచుర్యాన్ని తెచ్చినవారు - ఆదిభట్ల నారాయణదాసు గారు అన్నది ఏకాభిప్రాయం. వారికి ముందుకాలంలో కూడ హరికధ ఉందా, లేదా అంటే, ఈ ప్రక్రియ ఎన్నోరూపాల్లో వుండవచ్చు కాని, హరికధ అంటే మనకు గుర్తువచ్చేవ్యక్తి మాత్రం ఆదిభట్ల నారాయణదాసుగారు మాత్రమే.
ఆదిభట్లవారి జీవనకధనం
ఆంధ్రదేశంలో హరికధావిధానమునకు మూలపురుషులు ఆదిభట్లవారు. వీరు హరికధాపిథామహ అని సార్ధకబిరుదుని అందుకున్నారు. వీరి సంప్రదాయములో కధాగానమున నౄత్యము విశిష్టస్థానాన్ని సంతరించుకుంది. శ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు, వెంకటచైనులు - లక్ష్మి నరసమాంబ దంపతులకు ప్రియతనయుడైన ఆదిభట్లవారు విజయనగరం జిల్లాలోని అజ్జాడ గ్రామంలో ఆగష్టు 31, 1864 న జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు సూర్యనారాయణ, యింట్లో అందరికీ సూరన్న అని, చిన్నసూరి అని పిలిచెడివారట. తండ్రి సంస్కౄతాంధ్రవిద్వాంసులు, పౌరాణికులు. తల్లికి పురాణేతిహాసాల్లో సద్పరిచయం. ఆమెను పురాణాల నరసమ్మ అని పిలిచేవారట. తల్లిదంద్రుల పురాణ పఠనం, పరిచయాల సంగమవిజ్ౙానం చిన్నసూరిని చిన్నప్పుడే పెద్దతరహాగానే మానసికంగా తీర్చిదిద్దాయి అని చెప్పాలి. చిన్నాతనంలోనే తలిదగ్గర భారత భాగవతాది పురాణాలు నేర్చిన దాసు, 'గుంపా అనే శివక్షేత్రంలో తిరునాళ్ళు జరిగాయి. తల్లితో వెళ్ళిన పసికూనకు ఒక పుస్తకాల దుకాణంలో పోతన భాగవతం బొమ్మల పుస్తకం ఆకర్షించగా, వ్యాపారిని అడగడం, వాడు తిరిగి, 'పసివాడివి నీకు భాగవతం ఎందుకయ్యా" అని వెటకరించడం ఒకేసారి జరిగాయట. వ్యాపారి పెట్టిన పరీక్షలో - ఒక ఘట్టం చదవమంటే, అనర్గళపు ఆధ్యయాన్ని చూసి నెవ్వరపోవడం వ్యాపారి వంతు అయింది. అంతేకాదు, భాగవతం పుస్తకంతో పాటు, ఆ రోజుల్లో, అయిదు రూపాయల పారితోషికం యిచ్చాడుట మన దాసుగారికి. బొబ్బిలి ఆస్థానవిద్వాంసులు వాసా సాంబయ్యగారివద్ద వీణను పదేళ్ళప్రాయంలో మీటారు. అంతేకాక సంగీతంకూడ అభ్యసించారు. ఆనాట విజయనగరంలో మహభిత్ ఖాన్ లాంటి హిందూస్థానీసంగీతవిద్వాంసుల గానామౄతాన్ని ఆస్వాదించేవారు దాసుగారు. ఆదిభట్లవారిలో తెలియకుండానే నిండైన హరికధాకళాకారుడు తయారయ్యాడు. మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణతని పొంది, ఎఫ్.ఎ. పరీక్షలో ఉత్తీర్ణులు కాకపోవడంతో చదువుకు స్వస్తి చెప్పడం జరిగినా, పారసీకం, అరబ్బీ, ఉర్దూ, సంస్కౄతం, ఇంగ్లీషు భాషలలో ప్రావీణ్యం సంపాదించిన వైనం కడు ప్రశంసనీయం. ఆయన తెలుగు, ఇంగ్లీషు, సంస్కౄత భాషల్లో కవితలు, రచనలు చేశారు కూడా. తమ 19వ ఏట మెట్రిక్ చదువుతూ, 1883 లోనే మొట్టమొదట విజయనగరంలో విన్న హరికధ - మద్రాసునుంచి కుప్పుస్వామి భాగవతార్ అనే ఆయన చెప్పడం, వినడం, సంగీతనౄత్యసాహిత్యాలు ఏకానుసంథానం అయ్యే ఈ కళాప్రదర్శన పట్ల ఆదిభట్ల సూర్యనారాయణగారు ఆకర్షితులయ్యారు.
ఆదిభట్ల సూర్యుని హరికధ రంగప్రవేశం
దాసుగారు కేవలం హరికధకులేకాదు, అష్టభాషాప్రవీణులు, పుంభావసరస్వతిగా కొనియాడబడినవారు. ఈయన హరికధారంగప్రవేశాన్ని, ఆరుద్రగారు తన సమగ్రాంధ్రసాహిత్యంలో వివరించిన కధనసారాంశం యిలా వుంది.
కుప్పుస్వామివారు చెప్పిన ధ్రువచరిత్ర కధనే చెప్పడానికి ప్రయత్నాలు చేశారు. కొన్ని సొంతగీతాలు రాసుకొని విశాఖపట్నంవాసుడైన ధూళిపాళ కౄష్ణయ్య పద్యాలను, ఆంధ్రభాగవతంలోని పద్యాలను, పంచతంత్రంలోని పిట్టకధలను పేర్చుకుని, కధను, కధనాన్ని తయారుచేసుకుని, సోదరుడి పేరన్న పక్కపాటతో, మరొక సోదరుడు సీతారామయ్య ప్రేక్షకుడుగా కధను చెప్పారు. అంతే తమ్ముని కాళ్ళకు గజ్జెలు అలంకరించబడ్డాయి. వేణుగోపాలస్వామి మఠములో ఆదిభట్లవారు తన మొదటి హరికధనాన్ని ప్రస్తుతించారు. నాటినుంచి ఆయన హరిదాసు.
ఫలితంగా, నారాయణకధలను హరికధల రూపంలో అందించినందులకు (సూర్య)నారాయణదాసు అయ్యారు. యింటిపేరుతో ఆదిభట్లతో సూర్య కనుమరుగై నారాయణదాసుగా మారారు. హరికధాపితామహుడు గా విశ్వవ్యాప్తంగా పేరుతెచ్చుకున్నారు.
బరంపురంలో మొదలయి, ఎన్నో సంస్థానాల్లో జరిగిన సన్మాన కార్యక్రమాలకు తోడుగా, మైసూరు వెళ్ళినఫ్ఫుడు, పండితులెందరో ఆసీనులైన కార్యక్రమంలో ఆదిభట్లవారు వీణ వాయించడానికి, ఈయన అన్నగారు సంగీతనిష్ణాతుడు పాటపాడుటకు ఏర్పాట్లు చేసినా, రక్తికట్టకపోయిన మూలంగా, నారాయణదాసుగారు తాను పాటపాడెదనని, అన్నగార్ని వీణ వాయించమని, గాత్రారంభం చేయగా, ఆ హరికథాగానామౄతఝరి మైసూరు మహారాజుని పరవశింపచేసి, ఆదిభట్లవారిని అభినందించి, బహుమానాలతో సత్కరించారట. ఈ వార్తను పరిశీలించి, విజయనగరం మహారాజు ఆనందగజపతి శ్రీ ఆదిభట్లను ఆస్థాన విద్వాంసునిగా నియమించిన తీరు అనేక అధ్బుతాల్లో ఒకటి మాత్రమే.
హరికథా పితామహ, వాగ్గేయకారుడు, సంగీత కళానిథి అయిన శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారు 1945 జనవరి 3వ తేదీన మనలని భౌతికంగా వీడినా, ఆ మహానుభావుడి సంగీతకళాసౄష్టి మాత్రం మనలని ఎన్నటికీ వీడదు అనే చెప్పాలి. ఆ హరికథామూర్తి నిర్యాణం చెందిన రోజు, కర్ణాటక సంగీత విద్వత్రయంలో ప్రముఖుడు అయిన త్యాగరాజు ది జయంతి అవడం కూడ విశేషమే కదా మరి.
అజ్జాడ ఆదిభట్ల సూర్యనారాయణ అనబడే, శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారు, హరికథా పితామహుల వర్థంతి సందర్భంగా, ఆధ్యాత్మిక, సంగీతకళానిథికి నివాళిని - తెలుగురథం కడు వినమ్రతతో, సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.
No comments:
Post a Comment