
ఆచార్య వినోబా భావే - వర్ధంతి - 15 నవంబర్
'జై జగత్! నా కార్యకలాపాలన్నీ విశ్వమానవుల హౄదయసంగమం కొరకు తపనే'
'చిత్ పవణ్ బ్రాహ్మణ వంశీయుడు
స్వాతంత్ర్య సమరంలోకి ...
మహాత్మాగాంధీతోటి స్వాతంత్ర్య సమరంలోకి దూకిన వ్యక్తి. తెల్లదొరలతోటి సమరం మూలాన, 1932 లో వినోబాను జైల్లో పెట్టారు. కాని మన వినోబా జైలులో ఉబుసుపోక, భగవద్గీతపై తనదైన భాష్యాన్ని తోటి ఖైదీలకు, మాతౄభాషైన మరాఠీలో వివరించేవాడట. ఆ ఉపన్యాస భావలహరి తర్వాత 'ఉపన్యాసగీతా గా ప్రచురించడం, అన్ని దేశీయభాషల్లోకి, కొన్ని విదీశీభాషల్లోకి, తర్జుమా కావడం జరిగినదాన్ని బట్టి వినోబా విద్వత్తు వెల్లడవుతుంది. మిగతా కార్యక్రమాల్ని, దినచర్యని పక్కకి నెట్టినా, గీతోపన్యాసాలద్వారా, మంచి అనిర్వచీయనీయమైన అనుభూతి ఆవహించింది అని వినోబా చాలాసార్లు చెప్పారు. ఆయన సత్యనిష్ఠా తత్పరతకు సంతోషించి, గాంధీ, సత్యాగ్రహానికి ఎన్నుకున్న మొదటి వ్యక్తి వినోబా అన్నది ఆనాడు ఆశ్చర్యం కలిగించింది. ఆనాడు క్విట్ యిండియా ఉద్యమంలో కూడ పాల్గొన్న ప్రముఖుడు.
సర్వోదయ, భూదానం, గోరక్షణ - జీవన నేస్తాలు
వినోబా అన్ని మతాల సత్యసారాన్ని ఆధ్యయనం చేసి అర్ధంచేసుకున్న మేధావి. 'ఓం తట్ అన్న పారాయణ అన్నిమతాలకు అన్వయించేలా ధ్యానం చేశేవారు. పైగా బహుభాషాప్రావీణ్యుడు. కన్నడ భాషాలిపిని విశ్వభాషాలిపులకు మహారాణి అని పొగడేవారు. భారతదేశంలోని పల్లెలలో జీవించే సగటుజీవి అనుభవించే కష్ఠాలకు సమస్యలను అన్వేషించడంలో చాలా కౄషిని సలిపారు. కొన్నింటికి ఆధ్యాత్మిక ధోరణి సమంజసం అని కూడ భావించారు. ఈ ధోరణి క్రమేణా 'సర్వోదయా ఉద్యమానికి దారితీసింది. వినోబా భావేతో మమైకం చెందిన మరొక మహత్తర కార్యక్రమం - భూదానోద్యమం. ఈ నూతన తరహాలో నడచిన ఈ భూదానోద్యమ ప్రచారంలో భాగంగా, దేశం నలుమూలలు పాదయాత్ర చేశాడు. ప్రతీ భూకామందుని వ్యక్తిగతంగా, తనను కొడుకుగా భావించి, కొంతైనా భూమిని యివ్వాలని ప్రార్ధించాడు. అలా సేకరించిన భూమిని పేదలకు దానం ద్వారా పంచి పెట్టాడు. అహింస, ప్రేమలను మేళవించిన విధానం ఆయన తత్వం. వినోబా అంటే వెంటనే స్ఫురించే అంశం - గోహత్య విధాన నిర్మూలనం.
ఆయనొక ఆశ్రమవాసి!
వినోబా తన జీవిత చరమాంకం, మహారాష్ట్రలోని 'పౌనాఋ లో నిర్మించుకున్న ఆశ్రమ వాతావరణంలో గడిపాడు. యిందిరాగాంధి విధించిన అత్యవసర పరిస్థితిని సమర్ధించిన వారిలో వినోబా ఒకరు కావడం, ఆ కాలాన్ని 'అనుశాసన పర్వం'గా అభివర్ణించి, క్రమశిక్షణకు సరియైన సమయం అని వ్యాఖ్యానించారు.
విమర్శల మధ్య వినోబా
విద్వత్తు ఉన్నచోట వివాదం, అసూయలు జనిస్తాయి. 'అర్కంలేని అతి గాంధీవాదం'వినోబాదిఅని ప్రముఖ సాహితీవేత్త వి.యస్.నాయిపాల్ విమర్శించాడు. కాని, భారతీయ ఆర్ధిక, రాజకీయవిధానంతో భాగస్వామ్యం పొందని నాయిపాల్ నుంచి యిటువంటి విమర్శలు రావడం చాలా విడ్డూరం అని ప్రతి విమర్శలు రావడం కూడ జరిగాయి.
ప్రతిభకు పురస్కారాలు
1958 లో వినోబాకు 'సామాజిక నాయకత్వం'పై భారతీయ రామన్ మెగ్సయ్సాయ్ పురస్కారం మొట్టమొదటి స్వీకర్త వినోబా కావడం మనదేశానికి గర్వనీయం. 1983 లో భారతరత్న బిరుదుని వినోబా మరణాంతరం వెంటనే బహూకరించారు.
వినోబా భావాలు
విప్లవాలకు ఆధ్యాత్మికభావాలే మూలం; మానవుల హౄదయాలని, మనస్సులని ఏకీకౄతం చేయడానికే నా కార్యక్రమాలపై దౄష్టి పెట్టడం జరిగింది.
ప్రశాంతత అనేది మానసికం, ఆధ్యాత్మకం. ఈ ధోరణులనుంచే మానవుల వ్యక్తిగత జీవితాల్లో ప్రవేశిస్తాయి. ప్రపంచగమనం వీటిపైనే ఆధారపడింది.
జై జగత్! విశ్వానికి విజయం!
బీదప్రజల హౄదయాలను సుసంపన్నంగాను, సంపన్నప్రజల హౄదయాలను బీదతనంతోను భగవంతుడు సౄష్టించడం విడ్డూరం, ఆశ్చర్యకరం.
ప్రజాశక్తి, ప్రజాబలం సంకల్పంగా సాధించాలి. హింసాయుత, బలవంతపు అధికారిక రాజ్యపాలనం ఆహ్వానించదగ్గది కాదు.
ఏ దేశమైనా, సైన్యం, యుద్ధసామగ్రి బలంతో కాక, నైతినబలంతో సమర్ధించుకోవాలి.
పాతపడిన యుద్ధసామగ్రితో కొత్త యుద్ధాలు చేయగలగడం అసాధ్యం.
ప్రభుత్వాల తప్పిదాలపై విమర్శించ వలసిన పని నాకు లేదు. మంచి పనులని అనుకున్నవాటిపై నా విమర్శ ఉంటుంది.
విప్లవవాదాన్ని ప్రభుత్వమే ప్రచారం చేస్తుంది అన్న భావం, భావన ఎన్నటికీ రానీయకూడదు.
అహింసా విధానాలపై నిదానధోరణిని అవలబించకూడదు. అహింసామార్గం ద్వారా, అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే, కాలయాపన, జాప్యం శతౄవులు అనే అనుకోవాలి. పట్టు ఎంతమాత్రం సడలకూడదు. మెతకదనం, పసలేని, ప్రభావంలేని అహింసావిధానాలను అవలంబించినందువల్ల ప్రస్తుత స్తబ్ధత కొనసాగే ప్రమాదంతోపాటు, పెరుగుదల, అభివౄద్ధి చతికిలబడతాయి. చివరకు పరాజయం, నిరాశ తప్పవు.
సమాజసేవ, అహింసామార్గం, గోరక్షణ, ఆధ్యాత్మకధోరణి, కుష్టివ్యాధిగ్రస్థులకు సహాయసహకారాలు, భూదానోద్యమం, యిలా ఎన్నో సేవలను అందించిన వినోబా భావే వివాదం లేని పరమాచార్యులు. భారతదేశానికి ప్రధానాచార్యులలో ఒకరు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఆచార్య వినోబా భావే 1982 నవంబర్ 15 న, చివరి రోజుల్లో ఆహారం, నీరు తీసుకోడానికి నిరాకరించి, 'సల్లేఖనం' గా భావించగా, కీర్తిశేషులైనారు.
వినోబా భావే మహానుభావ భావపరంపరకు, నేటివరకు చెరగని ముద్రవేసిన ఈ మహనీయునికి తెలుగురథం నీరాజనాల్ని సమర్పించుకుంటోంది.
తెలుగురథం - కొంపెల్ల శర్మ
2 comments:
గురువు గారు,
ఈ రోజు, ఒక గొప్ప మహానుభావుని గూర్చి పరిచయం చేసారు. ఆయన జీవిత విశేషాలని బాగా వివరంగా చెపారు. మా తాత గారి నాన్న గారు, ఆచార్య వినోభా భావే కి 43 ఎకరాలు సమర్పించుకున్నారు. అంతటి మహాను భావుని యజ్ఞం లో మా పాత్ర కూడా వున్నందుకు ఇప్పటికి మాకు గర్వకారణమే.
ధన్యవాదాలు. ఆచార్య వినోబా భావే గారితో మీ పూర్వీకుల సంబంధాల గురించి వివరాలు ఏమైనా ఉన్నచో పంపించండి. వ్యాసంలో చేర్చుకోవచ్చు. కొంపెల్ల శర్మ, తెలుగురథం
Post a Comment