
ఏకైక మహిళా ప్రధాని - ఇందిరాగాంధీ జయంతి
సాహసం అనేది లేకుండా మనిషి యింక ఏ యితర సద్గుణాలనీ ఆచరణలోకి తెచ్చుకోలేడు - యిందిరాగాంధి.
కుటుంబరాజకీయాలకి పరాకాష్ఠ
"రెండురకాల వ్యక్తులు రాజకీయాలలో గొప్పగా రాణిస్తారు; ప్రవర్తన లేకపోయినా ప్రతిభ వున్నవారు, ప్రతిభలేకపోయినా పైవారి క్రింద అణగిమణగి వుండేవారు" అని 'వె డెల్ ఫిలిప్శ్ అని ఓ ప్రబుద్ధుడు నిర్వచించాడు. ఈయనికి భారతదేశ రాజకీయాల గురించి అవగాహన వుందే లేదో తెలియదు కాని, యించుమించు మన రాజకీయాలని చూచాయగా చెప్పకనే చెప్పాడు. అటువంటి మనదేశపు రాజకీయవ్యవస్థలో మొట్టమొదట ప్రస్తావించవలసినది, తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూనే అని చెప్పాలి. ఆయన సుపుత్రిక, భారతదేశపు మూడవ ప్రధాని - యిందిరాగాంధి. ఆ తర్వాత ఆమె ప్రియ తనయుడు రాజీవగాంధి. కొంచెం విరామం వచ్చినా, ఈయన తల్లి సోనియాగాంధి పాత్రపై వాదోపవాదాలు వచ్చినా, ప్రస్తుతం మాత్రం ఈ విదేశీవనిత హయాంలోనే దేశం నడుస్తోంది అన్నదాంట్లో ఏమాత్రం సంశయం, సందేశం రానేరాదు. యిది సరిపోక, నెహ్రూ కుటుంబ నేటితరం నాయకుడు రాహుల్ గాంధీ కూడ రాజకీయ రంగప్రవేశం చేసి, తనదైన శైలిలో చురుగ్గా అడుగులు వడివడిగా ముందుకు వేసి, వచ్చీరానట్లు రాజకీయ వైకుంఠపాళీలో నిచ్చెనల్ని ఎక్కేసేందుకు సామగ్రిని తయారుచేసుకుంటున్నాడు. సంక్షిప్తంగా మన భారతీయ రాజకీయ ఆధునిక చరిత్రని అధికకాలం ఒకేఒక కుటుంబం నిర్ధారించినదనే చెప్పాలి. యిందులో సగభాగం, భారం మహిళానిర్దేశకత, దర్శకత్వం వహించడం అన్నది కూడ సత్యంగానే చెప్పాలి. నేటివరకూ, మన భరతదేశాన్ని పరిపాలించిన ఏకైక మహిళాప్రధాని మాత్రం 'యిందిరాగాంధీ.
జగమెరిగిన జాణ
కొందరు ప్రపంచంలోంచి పుట్టుకొస్తారు. మరికొందరు ప్రపంచం కోసం పుడ్తారు. యింకొందరు ప్రపంచపు చివరిటంచులవరకు పయనిస్తారు. అయితే ఈ మూడు విధానాలని ముప్పేటగా రంగరించుకుని కొందరు దర్శనమవుతారు. ఈ కోవలో గణనీయమైన అగ్రగణ్యులు కోటికొక్కరు, యుగానిక్కొరు మనకు దర్శనీయమవుతారు. సంభవామి యుగేయుగే అని శ్రీకౄష్ణుడన్నట్లు మనకు వరప్రసాదాలు లభ్యమవుతాయి. మన దేశచరిత్రలో అటువంటి అరుదైన ఆణిముత్యం, జగమెరిగిన జాణ - యిందిరా ప్రియదర్శని; అందరికీ చిరపరిచితురాలైన - యిందిరాగాంధి. మన భారతదేశానికి మొదటి మహిళా ప్రధాని. మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకి ప్రియతనయ. ఈమె తనదైన చురుకు, ఉరుకులతో దేశాన్ని ఒక చిన్నతరహా పాఠశాలలా, తాను ఒక ముఖ్య ఉపాధ్యాయురాలుగా ప్రజలకూ, తోటి ఉపాధ్యాయులకూ కూడ నవరసాలతో పాఠాలను నేర్పించిన నెలత - యిందిరా ప్రియదర్శిని.
గడచిన తొమ్మిది దశాబ్దాలు
దేశాన్ని ముందుకు నడిపించిన మహామనీషి. అభివౄద్ధికి ఆనవాలు. ధైర్యానికి కితాబు. సాహసానికి మారుపేరు. ఎక్కడ అడిగిడినా విజయేందిరగానే చెలామణీ అయింది. ఆమె పుట్టినప్పుడు పెట్టిన పేరు - యిందిరా ప్రియదర్శని. విశ్వరాజకీయ చిత్రపటంలో భారతావనికి పరమపదసోపాన స్థానాన్ని కలగజేసిన ప్రతిభామూర్తి. అభివౄద్ధి చెందుతున్న, వెనుకబడిన, బలహీన రాజ్యాలకి ప్రత్యేక పరిగణనలుండాలని పట్టుపట్టిన ఆదర్శమూర్తి. ప్రపంచశాంతికై కౄషి సలిపిన ప్రమధగణ ప్రతినిధి.
భారతదేశపు అతిపెద్ద రాష్ట్రం, ఉత్తరపదేశ్ లోని త్రివేణీ సంగమస్థలి అయిన అలహాబాదు నగరంలో, సుసంపన్నకుటుంబంలో జన్మించిన యిందిరా ప్రియదర్శని 19 నవంబరు 1817 న జన్మించింది - యిందిరా ప్రియదర్శని జవహర్ లాల్, కమలాభాయి లకు ఏకైక సంతానం. అందుకే గారాలపట్టి. యిందిరా విద్యాభ్యాసం - పూనా, శాంతినికేతన్, స్విడ్జర్లాండ్, యింగ్లండు లో జరిగింది. పదమూడేళ్ళకు 'వానరసేనా ను స్థాపించడం, ఈ సేన ద్వారా దేశంలోని ప్రముఖ యువతను సంఘటితం చేసి, దేశ స్వాతంత్ర్య సమరానికి సన్నిధ్ధులయ్యే వేదికకు శ్రీకారం చుట్టింది.
తిరుగులేని, తిరిగిరాని ప్రస్థానం
1942 దేశ స్వాతంత్ర్యచరిత్రలో చిరస్థాయి సంఘటన 'క్వీట్ యిండియా అయితే, అదే సంవత్సరం యిందిర ఫిరోజ్ గాంధిని వివాహమాడింది. రాజీవ్, సంజయలు కొడుకుల తల్లి, మాతౄత్వానికి చిహ్నాలు. పదవిలో ఉండగానే చిన్నకొడుకు సంజయగాంధి ని జోరు రాజకీయజోక్యధోరణిని ఆపలేకపోయి, 'అత్యవసర పరిస్థితీ పేరున దేశాన్ని కొరడాతో ఝళిపించి, భయభ్రాంతులతో పరిపాలించడానికి ముఖ్య హేతువు ఈ ప్రబుద్ధుడు. అయితే విధి నిర్ణయానికి, 1980 లో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించి పుత్రశోకానికి గురయింది. ఈ అనూహ్య పరిణామం యిందిరకు వ్యక్తిగతంగా, రాజకీయంగా క్రుంగదీసిందనే చెప్పాలి. ఏదో తెలియని ఆవేశం, అనాలోచిత నిర్ణయాలను తనదైన మంకుపట్టు పద్ధతులతో రాజకీయాన్ని, దేశాన్ని తన కొంగుచాటుగా, కొంగుముడితోనూ నడుపవచ్చు అనుకుని తిరుగులేని వడివడి అడుగులు కాకుండా అంగలు వేసుకుంటూ ప్రస్థానం చేసిన వైనాలు, రాజకీయం నుంచి ఉగ్రరాజకీయం వరకూ తనకు తాను తెలియకుండ సాగిపోవడం జరిగింది. ప్రోత్సహించిన ఉగ్రవాదం, పాముకు పాలు పోసి విషపు కోరలను నిశితం చేసినట్లుగా మారి, మనం పెంచిన విషనాగుకోరలే మనల్ని కాటువేసేలే చేసుకున్న రీతుల్లో రాజకీయాన్ని రక్కసిలా నడిపించింది. బలిదానం కావించుకుంది. రాజకీయాలంటే ఏమాత్రం ఆసక్తిలేకుండ, విదేశాల్లో చదువుకుంటూ, ప్రేమవివాహం ద్వారా విదేశీవనితను వివాహమాడి, 'పైలట్' వౄత్తిని నైపుణ్యంతో నిర్వహించుకుంటూ ప్రశాంత జీవితాన్ని గడుపుకుందాం అనుకుంటున్న పరిస్థితుల్లో, దేశరజకీయ రధసారధ్యానికి నాయకత్వం వహించవలసి వచ్చింది. అయిష్టంగా స్వీకరించినా, రాజకీయంలో యువతని, యుక్తుల్ని, నూతనభావాలతో సమసమాజాన్ని మరింత సుఖవంతంగా నడిపించాలన్న నిష్కళంకంగా కొత్తకొత్త ప్రణాళికలు, పధకాలను, సమాచార, సాంకేతిక రంగాలను విశ్వవ్యాప్తం చేసుకుంటూ, దేశాన్ని ప్రపంచచిత్రపటానికి సునాయాసంగా అతికించి, భారతదేశం అంటే ఏమిటో బయస్కోపు ద్వారా చూపించిన ఘనత మాత్రం రాజీవ్ గాంధీదే అని ముక్తకంఠంగా చెప్పవచ్చు. అయితే, తల్లిని పొట్టపెట్టుకున్న కుటిల ఉగ్రవాద రాజకీయం తెలియని రంగులు పులుముకుని, తిరిగి భారతదేశ ప్రధానిని కోల్పోయిన దురదౄష్టకరమైన రాజకీయ ప్రస్థానం మనది.
యిందిర జయాపజయ సంకేతాలు
తండ్రి జవహర్ లాల్ నెహ్రూ తరవాత, లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో పదవిని నిర్వహిస్తూ, వెంటనే దేశపు రాజకీయరధసారధ్యాన్ని చేపట్టిన యిందిర తన యాత్రలో తిరిగి వెనుకకు చూడలేదు. చూడవలసివచ్చినా, వెనుకకు తిరుగలేదు. యీ పద్ధతిలో, అంతేకాక, అత్యంత ప్రతిభావంతంగా, ప్రకాశవంతంగా ప్రధాని పదవిని నిర్వహించారు. ముదుసలి రాజకీయాలను విశ్రాంతిమందిరాల్లోకి నెట్టివేసి, రధాన్ని తనదైన వేగంతో నడిపించారు. భారతదేశపు మూడవ ప్రధాని, తొలి మహిళాప్రధానిగా, 24 జనవరి 1966 న పదవీబాధ్యతలను స్వీకరించి, చివరి మజిలీని 1977 వరకూ నిరాఘాటంగా నడిపించిన ఘనత మాత్రం యిందిరదే అని చెప్పాలి. 1975 లో ఆమె లోక్ సభ ఎన్నికలు చెల్లవని కోర్టు తీర్పు యివ్వడం, అహం, అధికారం, ఆభిజాత్యం రంగరించిన రసరాట్టు ఆనాటి రాజకీయరణానికి మందు అనుకుని రంగరించి, అరగదీసి అదిమిన లేహ్యం కొత్త రోగాలని తెచ్చి రాజకీయాన్ని మరింత అనారోగ్యంగా తయారు కావడానికి పూర్తి బాధ్యత ఆమెదే అని అనిపించేలా అధికారాన్ని తనకు తెలియకుండా, తన హితులు, సన్నిహితులుగా చిన్న చితక నాయకుల్ని చేరదీసి, వారివల్లే రాజకీయ అస్త్రాల్ని సంధింపచేసుకుని, వాటినే తిరిగి ఎదుర్కొంటూ, ఘోర అపజయాన్ని స్వీకరించక తప్పలేదు. బలీయమైన విధిరాతకు రాజకీయం మినహాయింపు కాదు అని రుజువుచేసుకుంది. ఫలితంగా, 1977 ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదు. రాజకీయ పులిజూదంలో రంకెలు, గంతులు తప్పవని నిరూపిస్తూ, 1980 లో జయపతాకాన్ని విజయేందిర దేశపు రాజకీయ వినువీధుల్లో రెపరెపలాడించింది. తిరుగులేని రాజకీయాన్ని మరింత తిరుగుబాటుతనాన్ని తెలియకుండ ప్రోత్సహించుకుంటూ కదపిన రాజకీయ చదరంగపు పావులు - నలుపు, తెలుపు రంగుల మిశ్రమై రాజకీయం కలగాపులగంగా మారి, వివర్ణమై, పాలిపోయి, పేడిలా మారి, ఆ మాయలమారి సూదంటురాయి తన గుండెలోకే దూసుకుపోయింది. ఫలితంగా, తన వ్యక్తిగత రక్షకభటుడి తుపాకీయే ఈ దేశపు ప్రధానమంత్రిణి ని నిర్దయగా, నిర్దాక్షిణ్యంగా హతమయ్యేలా చేసింది కుటిల కుతంత్ర రాజకీయం. బలిదానం చేసుకుంది.
యిందిర పరిపాలనలో ధ్రువ నక్షత్రాలు
నాటినుంచి, నేటివరకూ, యిందిర తీసుకున్న ఆర్ధిక, సామాజిక, రాజకీయ, పరిపాలనా విధానాలు, నిర్ణయాలు, రవంత సవ్వడిని, అలజడిని లేవదీసినా, మార్పును మాత్రం తీసుకువచ్చాయి అన్నదాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. మచ్చుకు - బాంకుల జాతీయకరణ, బంగ్లాదేశ్ కు విముక్తి, ప్రాముఖ్యతను సంతరించుకున్న 20-సూత్రాల పధకం, 'గరీబీ హటావో' అన్న నినాదం బీదరికాన్ని ఎంత తగ్గించింది అన్న ప్రశ్న వేయకుంటే, రష్యారాజ్య పరిపాలనా విధానాన్ని అనుకరించిన తీరుమాత్రం అనూహ్యం. రాజభరణాలను రద్దుచేయడం లాంటివి ఎన్నో నిర్ణయాలు యిందిరను వైకుంఠపాళీలో నిచ్చెనలను ఎక్కేందుకు పరికరాలుగా వినియోగించుకుంది.
అమౄతసరోవరం తెచ్చెన ముప్పు
పవిత్ర దేవాలయం అమౄతసర్ ప్రాంగణంలోనుంచి ఉగ్రవాద వలస కేంద్రాని తరిమివేయాలన్న తీవ్రతలంపుతో 'ఆపరేషన్ బ్లూస్టాఋ చర్య ద్వారా, ఉగ్రవాదాన్ని అణచాలన్న ప్రయత్నం సబబైనా, జరిగిన తీరుమాత్రం రాజకీయ శత్రుత్వాన్ని రగులుకొలిపింది. ఆ తీక్షణచర్యపై పగపూని, చివరి కపటచర్యగా, యిందిరగాంధిని తన అధికారిక నివాసంలోనే, తన స్వంత రక్షకభటుడి చేతులమీదుగానే, హతమార్చడం జరిగింది. ఈ దుర:కార, దుర్వినీతి, దుష్ట రాజకీయం తన పగను నెరవేర్చుకుంది. జాతికి మచ్చమాత్రం చిరస్థాయిగా నిలచిపోయింది.
సరిగ్గా, ఈ రోజే, 31, అక్టోబర్ 1984 న దేశపు ఏకైక మహిళా ప్రధానమంత్రి - యిందిరాగాంధి తన తుదిశ్వాసను విడిచింది. జాతిరత్నం, మహామనీషి, మణిమకుటసమానం, సరిసములులేని వ్యక్తిత్వం, వెరసి యిందిరా ప్రియదర్శిని గాంధి, మహాభినిష్క్రమణం కావించింది.
భారతదేశం మరో మహిళా ప్రధానమంత్రి కోసం ఎదురుతెన్నులు చూస్తూంది. కలలు ఫలిస్తాయో, లేదో, కాలధర్మం, కాలనిర్ణయం చేసే విధిలిఖితం పై ఆధారపడింది అన్నది సత్యం.
యిందిరాగాంధి భావ లహరి
కలసి మెలసి జీవించే మానవాళి మనుగడ వికాసంలోనిసహజ పరిణామమే - అంతర్జాతీయ స్థాయిలో సైతం దశదిశల నుంచి లభించే సంపూర్ణ సహకారం.
ప్రజా ప్రభుత్వ పద్ధతిలో నడిచే సమాజంలో మనలని మనం క్రమశిక్షణతో నడిపించుకోవడం, అన్నిటినీ మించిన యుక్తి అవుతుంది.
జీవితం ఓ అధ్బుతమైన లక్ష్యానికి అంకితం అయినప్పుడే దాని సార్ధక్యం పెరుగుతుంది; అలా అంకితం అవటంలో చక్కటి జ్ౙానంతోపాటు సరైన న్యాయమూ ఉండాలి.
యిందిరాగాంధి జయంతి (19 నవంబర్) సందర్భంగా - తెలుగు రథం ఘననివాళులను సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగు రథం.
No comments:
Post a Comment