
అభినవ త్యాగరాజు - 'నాగయ్యా వర్థంతి.
అధ్బుత సంగీత నటనావైదుష్యం'అభినవ త్యాగరాజూ, 'రంగభూషణా, 'నటయోగీ, 'పద్మశ్రీ', సత్కారాలతోబాటు, సకలకష్టాలను కూడ అనుభవించి, సగటు మానవుడు జీవితంలో పడకూడని ఆష్టకష్టాలు పడి, అర్ధాన్ని కూడబెట్టకపోయినా, పరమార్ధాన్ని పుష్కళంగా సంపాదించుకున్న మహానుభావుడు - చిత్తూరు వి. నాగయ్య. నాగయ్యను పరిచయంచేసే సాహసం, ధైర్యం ఎవరైనా చేయ ప్రయత్నించే దుస్సాహసం వారికి తగదు, కూడదు.
బాలసంగీతకళాకారుడు - సమగ్ర సంగీతాభ్యాసంచిత్తూరు వ్. నాగయ్య గా సుపరిచితులైన, నాగయ్యగారి యింటిపేరు 'వుప్పలధడియం' వారు. తండ్రి పేరు రామలింగేశ్వరశర్మగారు. 1904 మార్చి 28న గుంటూరు జిల్లా లోని రేపల్లె లో జన్మించారు. బాల్యదశలోనే, తండ్రి పాండిత్యాన్ని, సంగీతవిద్వత్తుని, యితిహాస-పురాణాలపై ఆసక్తిని రంగరించుకుని తనదైన మార్గాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేయసాగాడు. సంగీతసాధనలో తండ్రి దగ్గర శిక్షణ, చదువుపై కన్న, సంగీత కచేరీలపై మక్కువను పెంచింది. బాలనాగయ్య బాలకళాకారుడుగా రాణించడానికి అనువైన వాతావరణంలో పెరిగాడు. చెవిపోగుల్ని విక్రయం చేసి, సంగీతకచేరీలోని కళామాధుర్యానికి వినియోగం చేసేందుకు ప్రాధాన్యం చూపాడు. గమనించిన తండ్రి, నాగయ్యను 'విద్వాన్ చిత్తూరు పేరయ్య పిళ్ళే దగ్గర సంగీతాభ్యాసానికి ఏర్పాట్లు కడు సంతోషంతో చేశాడు. ఆనాటి ప్రముఖ సంగీత విద్వాంసులైన 'పుష్పవనం అయ్యఋ, 'గోవిందస్వామి పిళ్ళేలు తన తొలి గానప్రయత్నానికే, భాగవతంలోని ప్రహ్లాద పద్యాలని భావ, రాగ యుక్తంగా, మధుర స్వరాన్ని విని, 'గొప్ప కళాకారుడవుతావూ అని ఆశీర్వాదాలు పొందడం కన్న వేరే భాగ్యం ఎందుకు? నయన పిళ్ళె, మహారాజపురం విశ్వనాధ అయ్యర్ ల వద్ద సంగీత విద్యాభ్యాసం - మనసుకు మక్కువై, కాలేజీ చదువు అర్ధంతరంగా ముగిసింది.
చదువు - ఉద్యోగం మధ్య రాణించిన నటనాపర్వం
కర్ణాటక శైలితోబాటు హిందుస్తానీ సంగీతాన్ని కూడ ఆకళింపు చేసుకున్నారు. అయితే, కాలేజీచదువుతో పాటు, నాటకాల్లో వేషాలు చాలా పేరు తెచ్చాయి. చదువుకు భరతవాక్యం, చిత్తూరు బోర్డు కార్యాలయంలో గుమాస్తాగిరికి శ్రీకారం, స్థానిక లక్ష్మి, రామవిలాససభలు, మద్రాసులోని సుగుణవిలాససభ, యిండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీలాంటి నాటక సంస్థలనుంచి పోషించిన మొదటి దఫా, ఆడవేషాలు - సావిత్రి, దమయంతి, చిత్రాంగి పాత్రలు తెచ్చిన ప్రశంసలు, బళ్ళారి రాఘవతో కలిసి వేసిన నాటకాలు, కబీరు పాత్రలో 'కహో రాం రాం' అన్న పాట ప్రాభవం, అన్ని కలసి, నాగయ్య నటనా కౌశలాన్ని మెచ్చి, కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు 'రంగభూషణా బిరుదుని బంగారు పతకంతో సత్కార్యం పొందాఋరు.
కళాకారుడైనా తప్పని అష్టకష్టాలుకళల్లో దిట్ట అయినా, నాగయ్యకు జీవితంలో కష్టాలు తప్పలేదు, కుటుంబంలో చాలా అగాధం ఏర్పడి, మనోవ్యధకు గురయ్యారు. మనశ్శాంతికోసం నాగయ్య, రమణాశ్రమాన్ని ఆశ్రయం పొందారు. పుణ్యక్షేత్రసందర్శనంవల్ల కొంతగా లభించిన తనకు కళారంగమే సరి అని అంతరాత్మ ప్రబోధించింది. 1932 లో ఉద్యోగాన్ని వదలడం, రాజకీయప్రవేశం కూడ జరిగాయి. అక్కడా సరిపడక, తిరిగి మద్రాసు వచ్చి కళారంగంలో అడుగుపెట్టారు.ప్రలోభాలకు, మోసాలకు కూడ గురయ్యారు.
మరువని సంగీతం నుంచి మరువలేని నటనకునాగయ్యగారి చిరకాల మిత్రుడు అచ్యుతనాయుడు హచ్చిన్స్ సంగీతసంస్థలో సంగీత సంస్థ, మధురస్వరానికి ముగ్ధులై, సంగీతదర్శకునిగా నియమించుకున్నారు. ఎన్నో గ్రాంఫోను రికార్డులు పేరు తెచ్చాయి. ఈ దశలో, 1935లో ప్రముఖులు బి.యన్.రెడ్డిగారిని కలవడం, మిత్రులు హెచ్.యం.రెడ్డిగారికి పరిచయం చేయడం, 'గౄహలక్ష్మీ చిత్రంలో సంఘసేవకుని పాత్ర నాగయ్యను వరించడం, ఆపాత్ర అందించిన 'కల్లుమానండోయ్ బాబూ కళ్ళు తెరవండోయ్' అన్న పాట ఆంధ్రదేశం ప్రతిధ్వనించడం, ఆకాలపు మద్యపాన నిషేధం అమలు మూలాన, బహుళ ప్రజాదరణ పాటకు, నాగయ్యకు ఒకేసారి లభించాయి. తర్వాత, నాగయ్యకు తిరుగులేని ప్రయాణం. ఫలితంగా, 'వందేమాతరం', 'సుమంగళీ, 'దేవతా, చిత్రాలు పేరుప్రఖ్యాతులు లభించాయి. ఈ దశలో, 'ఫిల్మ్ యిండియా' పత్రిక నాగయ్య నటనాసార్వభౌమత్వాన్ని విశ్లేషిస్తూ, 'ఆంధ్రా పాల్ మునీ గా కొనియాడాడు.
నిరంతర నాగయ్య నటనాప్రభంజనంభక్తిపరంపర, హావభావాలు, చిరస్మరణీయ అభినయం వెరసి 'భక్తపోతనా ద్వారా నేటికీ మైమరపిస్తున్న 'పావన గుణ రామా', స్వయంగా చిత్రనిర్మాణం (రేణుకా సంస్థ) చేసిన 'త్యాగయ్యా చిత్ర ప్రారంభానికి ముందు తిరువాయూర్ లోని త్యాగయ్య సమాధి ముందు ఉపవాస దీక్ష, నాయకునిగా, సంగీత దర్శకునిగా అఖండ కీర్తితో బాటు, యునెస్కో ద్వారా అంతర్జాతీయ చిత్రోత్సవంలో భారతదేశ కీర్తిపతాకను రెపరెపలాడించిన ఘనతాకీర్తులు ఆయనవే. తెలుగు చిత్రాలతో పాటు, తమిళ రంగ ప్రవేశం చేశారు. మోసాలు, తంత్రాలకు గురవడం, విజయంతోపాటు ఆవహించిన అపస్వరాలు, నాగయ్య నిర్మించిన 'రామదాసూ నాయకుని కష్టాలతోపాటు, నిర్మాత నాగయ్య కూడ అంతకన్న కష్టాలు అనుభవించిన తీరుతెన్నులను వర్ణించనలవికావు అని నేటికీ అంటారు. ఎదురైన నిరాశ, అశాంతి, పుట్టపర్తిసాయినాధుని ఆశ్రయం పొందాయి. యిక్కడ సుగుణం, సుకౄతం ఏమిటంటే, నాగయ్యగాసి షష్టిపూర్తి కార్యక్రమం మద్రాసులో బాబా ఆధ్వర్యంలో, ఆశీస్సులతో నిర్వహించడం మరువరాని సంఘటన.
దక్షిణభారత చిత్రసీమలో మొదటి 'పద్మశ్రీ'మరోనటునికి దక్కని అగణిత సన్మాన, సత్కారాలు. 1965 లో మొదటి పద్మశ్రీ లభించడం, నాలుగు దశాబ్దాల చిత్రజీవితంలో 200 తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటిస్తే, కేవలం తమిళం లో 160 చిత్రాల్లో నటించడం, ఆయన పాత్రల ప్రత్యేకత - ఆయన నటించక, జీవించారనే చెప్పాలి. మహానటులేకాదు, మహాదాత కూడా. ఆంధ్రరాష్ట్రావతరణ సమయంలో, అంధ్రకేసరికి అప్పుచేసి భారీ విరాళాన్నివ్వడం తో పాటు, అనేక దానధర్మాలు చేసిన ఘనత ఆయనకు వచ్చినా, జీవనచరమాంకంలో ద్రవ్యం లేని గతి చాలా ఉపద్రవాన్నే తెచ్చిపెట్టింది. ఈ విషాదసారాన్ని, ఆయన ఆత్మకధలో ఆవేదనతో పేర్కొన్నారు.
భక్తి నుంచి వైరాగ్యానికిపోతన, త్యాగయ్య, రామదాసు లాంటి భక్తిరసామౄతాన్ని అందించిన నాగయ్య, వేమన, పోతన చిత్రాల్ని ప్రభావితంగా, ప్రేరణాపూర్వకంగా వీక్షించిన 'బాలుడూ యోగిగా మారి, ప్రసిద్ధ 'ముమ్మిడివరం బాలయోగీ గా మారిన వైనం మరచిపోలేని ఘటన. ప్రముఖుడు డా.సర్వేపల్లి రాధాకౄష్ణన్, నాగయ్య, ఆయన మిత్రులను చూసి, స్వయంగా అహ్వానితులు కావడమే కాక, నాగయ్యగారికి పాదాభివందనం చేస్తే చాలు, పుణ్యం వచ్చి తీరుతుంది అని పులకరింతలతో పలవరించారట. దానికి నాగయ్యకు కలిగిన పులకరింతలు వేలకు వేలు.
'రఘుపతి రాఘవ రాజారాం' తో చివరి శ్వాసఅవసాన దశలో, అనారోగ్యంతో సతమతమవుతున్న నాగయ్యకు, తన మిత్రులు 'రఘుపతి రాఘవ రాజారాం' అంటూ గానం చేస్తుంటే, అపర పోతన, అభినవ త్యాగరాజు, 1973 డిసెంబరు 30 న, మద్రాసు, అడయార్ లోని వి.హెచ్.యస్. వైద్యకేంద్రంలో, తన తుదిశ్వాసను వదలడం, కన్నుమూయడం ఒకేసారి జరిగాయి.
ప్రతిభకు ప్రతిమాదర్పణంతిరువాంకూరు మహారాజు దర్బారు హాలు, మహాపండితులు, సంగీత నాట్య,నటనాకళాకోవిదులతో, సకల రాజభోగ మర్యాదలతో, మేళతాళాలతో ప్రవేశించిన మహాతెలుగునటునకు, రాజు గద్దెదిగి, ఎదురేగి, ఆమహానటవిరాట్టుని సాదరంగా, కౌగలింతతో ఉక్కిరిబిక్కిరి అవడం, సమున్నాతసనం పై ఆసీనులై, వేదమంత్రఘోష మధ్య, పాదపూజ జరగడం, కనుకలను, బిరుదులతో సత్కరించబడడం, మైసూరు సంస్థానాధీశ్వీరుడు నటరాజుకు సకల రాజలాంచనసహిత స్వాగతంతో పాటు 101 బంగారు కాసుల బహూకరణం, మద్రాసు, త్యాగరాజనగర్, పానగల్ పార్కులో, 'నటయోగి నాగయ్యా కాంస్య విగ్రహ ప్రతిష్టాపన, వి.వి.గిరి చేతులమీదుగా జరగడం, ఏటా, డిసెంబరు 30 న, నాగయ్య వర్ధంత్యుత్సవాలు జరుపుకోవడం, ఆ మహావ్యక్తికి, ఆవ్యక్తిలో దాగిని కళామతల్లికి జోహార్లు నిత్యం అర్పించుకోవడం ఆయన ఘనతకు, కీర్తికి తార్కాణాలు.
ప్రముఖ కళాకారుడు చిత్తూర్ వి. నాగయ్యగారి వర్థంతి సందర్భంగా తెలుగురథం ఘననివాళిని సమర్పించుకుంటోంది.
కొంపెల్లశర్మ - తెలుగురథం.
1 comment:
chittooru nagayya gaari gurinchi inta vipulam gaa raasinanduku dhanyavaadaalu. Chaala kaalam krindata aayana gurinchi na oka souvenir chadavatam thataschinchindi. Appude motta modatasaari aayana gurinchi vipulam gaa telisi ravaadam.
Greetings
zilebi
http://www.varudhini.blogspot.com
Post a Comment