Friday, June 13, 2008

మహాప్రస్థాన నిర్మాత, మహారాజశ్రీ శ్రీశ్రీ

శ్రీరంగం శ్రీనివాసరావు (1910 - 1983) - 15 జూన్ వర్ధంతి
శ్రీశ్రీ జీవనప్రస్థానం ... యిదిగో ... యిలా ...
అది 1910 వ సంవత్సరం. ఈ ఏట మువ్వింతలు జరిగాయట. ఒకటి తోకచుక్క పొడవడం; రెండు గురజాడ అప్పారావు గారు ముత్యాలసరాలు రచనచేయడం; యిక మూడవది మహాకవి శ్రీశ్రీగా ముందు ప్రపంచానికి సుపరిచితులైన శ్రీరంగం శ్రీనివాసరావుగారు జన్మించడం. శ్రమైక జీవన సౌందర్యానికి, సమానమైనది లేనేలేదోయ్ అన్న ప్రజాకవి, విప్లవకవి, మహాకవి, మహాప్రస్థానం నుంచి మరోప్రస్థానం వరకు తనదైన శైలిలో ప్రపంచంలో మరోప్రపంచాన్ని సౄష్టించిన, ఈయన జీవనప్రస్థానం యిలా సాగిపోయింది.
1910 జనవరి 2 న విశాఖపట్టణంలో శ్రీ వెంకట రమణయ్య, శ్రీమతి అప్పన్నకొండ లకు జన్మించిన శ్రీశ్రీ, పుట్టిన ఏడాదికే తల్లిని పోగొట్టుకున్నాడు. ఎవియన్ కాలేజీలో లెక్కలమాష్టారుగా తండ్రి పనిచేయడం, అక్కడే శ్రీశ్రీ చదువుకున్నాడు. 1925లో చదువుతోబాటు వెంకటరమణమ్మతో వివాహం, యింటర్మీడియట్ చదువు 1928 లోను, 1928లో మద్రాసు కాలేజీలో, బి.ఎ. జంతుశాస్త్రం లో చేరినా, 63 రోజుల టైఫాయిడ్ జ్వరం వలన, 1931 లోనే పూర్తిచేయడం జరిగింది. చదువుకున్న కాలేజీలోనే డిమాన్సేట్రర్ గా పనిచేస్తూ కప్పలమాస్టారు గా పేరు తెచ్చుకున్నారు. 1938లో మద్రాసులోని ఆంధ్రప్రభలో ఉపసంపాదకునిగాను, 1942లో డిల్లీ ఆకాశవాణిలోనూ, 1943లో లక్నోలో మిలటరీలో లేబరేటర్ అసిస్టెంట్ గానూ ఉద్యోగపర్వాన్ని నిర్వహించారు. 1945లో తండ్రి మరణం జరగ్గా, 1946లో నిజాం నవాబుగారి రిఫార్మ్ సెక్రటేరియట్ లోను, 1946-49లో ఆనందవాణిలో ఉద్యోగాన్ని కొనసాగించారు. 1947లో మద్రాసులో రాయపేటలో మకాం వున్న శ్రీశ్రీకి గుర్రపుపందాల సరదా జోరుగా వుండేది. 1949లో చుట్తాలమ్మాయిని 'లెనినా అన్న పేరుపెట్టుకుని అభిమానపుత్రికగా పెంచుకోవడం జరిగింది. 1950లో నళినికుమార్ తో స్నేహం, 1954లో హెల్సెంకీలో జరిగిన ప్రపంచశాంతి మహాసభకు ప్రతినిధిగాను, రష్యా, పారిస్, లండన్ పర్యటన చేశాడు. 1856లో ఉపద్రష్ట సరోజినితో వివాహం అవగా, కూతురు (1959), కొడుకు (1962) గలగడం, 1967లో రెండవసారి రష్యా ప్రయాణం, 1970లో విశాఖపట్టణంలో షష్టిపూర్తి ఉత్సవాలు జరిగాయి. ఈ దశలో శ్రీశ్రీ చలంగారిని కలుసుకోవడం ప్రముఖ ఘట్టంగా భావించారు. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా శ్రీశ్రీని అరెష్ట్ చేసి, విడుదల చేయడం జరిగింది. 1976లో చైనాయాత్ర జరిపారు. 1979లో శ్రీ రాజాలక్ష్మీ ఫౌండేషన్ వారి మొదటి అవార్డుని, పదివేల నగదు బహుమతిని పొందడం జరగ్గా, 1980లో కాకినాడలో స్పతి పూర్తిసభ నిర్వహించారు. ఈ సమయాన్నే, పురిపండావరితో లండన్ ప్రయాణం జరిగింది. 1981లో శ్రీమతితో అమెరికా ప్రయాణం చేశారు. 1982లో అభిమానుల ఆర్ధికసహాయంతో కోర్టుకేసుని పోరాడారు. సుదీర్ఘ సాహితీజీవనం, నిజజీవనం జరుపుకున్న శ్రీశ్రీ 1983 జూన్ 15 న ఈ భౌతికజగత్తుని వదలి మరోప్రపంచంలోకి వెళ్ళిపోయారు.
శ్రీశ్రీ సాహితీపర్వం ... యుగంగా మారిన వైనం
మానవజాతిని ఉద్ధరించడానికి కొత్తమతాన్ని కనిపెట్టిన ప్రవక్త. ప్రపంచపు సరిహద్దుల్ని వూగించాలని ప్రయత్నించిన అతని హౄదయోద్రేకాన్ని వర్ణించడం అసాధ్యమైన పని. నెత్తురూ, కన్నీళ్ళు కలిపి కొత్త మందును తయారుచేశాడు. హౄదయం ఎల్లా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్నివ్వడం అతనికే తెలుసు. మాటల్ని కత్తులూ, యీటెలూ, మంటలుగా మార్చడం అతనెకే చేతనవును. పద్యాలు చదువుతూంటే, యివి మాటలుకావు, అక్షరాలు కావు - ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు - అతని హౄదయంలోంచి మన హౄదయంలోకి నేరుగా పంపిన ఉత్సాహాలు, నెత్తులుకాలవ అనిపిస్తుంది. ఏ లోకంలో అన్యాయాలు, అధికారాలు, ఏడుపులు, క్షామాలు, యాచకాలు, క్షుద్రకవిత్వాలు, శిక్షణలు, అవినీతిపర్వాల్లాంటివి స్వప్నలోకంలో వీక్షణం చేస్తూనేవున్నాడు. దేవుడు, అధికారాలు, పాతర్లు, సౌఖ్యాలు, నీతులు, స్వర్గం, మర్యాదలు, మూటకట్టుకుని కులికే ఎంతోమందికి అర్ధంకాని బాధ, మరణం, దరిద్రం, అవిశ్వాసం, అశాంతి, యివన్నీ అర్ధంకాక గట్టిగా సౄష్టినే ప్రశ్నించిన యువకుల లక్ష కంఠాల్ని ఏకం చేసి పలికిన ప్రజాపక్షపాతి. ఈ మాటలు, వర్ణనలు, ఈ వ్యాసరచయితవి అనుకునే ప్రమాదం వుంది. ఆ యిబ్బందేమీలేదు. శ్రీశ్రీ మహాప్రస్థానం కు యోగ్యతాపత్రంను అందించిన చలం శ్రీశ్రీ గురించి, ఆయన కవిత్వం గురించి అనుభవించి పలవరించిన అచంచలభావాలు. బాధతో అన్నా బోధవాచకాలు - తెలుగువాడి జాతీయధనం ఓర్వలేనితనం; అసలు సిసలైన తెలుగు వాడికి పొరిగింటి పుల్లకూరే నచ్చుతుంది అన్న నిర్మొహమాటం పడని నిజవాది.
శ్రీశ్రీ రచనాపరంపర
మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానంతో మహాయోగం పొందినా, అంతకు ముందుగా ప్రభవ, వారం వారం, సంపంగితోట అన్న రచనలు వ్రాశాడు. ఆయన కలం ఆగని వాడితనంతో, వేడితనంతో, అమ్మ, మీమీ, మరోప్రపంచం, త్రీచీర్స్ ఫర్ మేన్, చరమరాత్రి, మానవుడిపాట్లు, సౌదామిని, గురజాడ, మూడు ఏభైలు, మహాప్రస్థానం తర్వాత అంతటి పేరును తెచ్చిన ఖడ్గసౄష్టి, వ్యూస్ అండ్ రివ్యూస్, అయిదు సంపుటాల శ్రీశ్రీసాహిత్యం, మిన్నేలని, రెక్క విప్పిన రెవల్యూషన్, వ్యాసక్రీడలు, మరోమూడు ఏభైలు, చినయానం, మహాప్రస్థానం తర్వాత మరోమలుపుని తెచ్చిన మరోప్రస్థానం, పాడవోయి భారతీయుడా (శ్రీశ్రీ చిత్రగీతాలు), న్యూ ఫ్రంటీర్స్, అనంతం, ప్ర-జ, రచనలను అందించిన అమరకవి. అనంతం (ఆత్మకధ), ప్ర-జ రచనలను ఆయన మరణం తర్వాత ప్రచురించడం జరిగింది. శ్రీశ్రీ నిజంగానే భారతీయసాహితీకారుల్లో అగ్రగణ్యుడు. అందుకనే, భారతీయ సాహితీనిర్మాతలు అన్న శీర్షికన శ్రీశ్రీ వ్యక్తిత్వంపై సుదీర్ఘవ్యాసాన్ని ప్రముఖ సాహితీవేత్త బూదరాజు రాధకౄష్ణ, కేంద్రసాహిత్య అకాడమీ వారు ఈ రచనకు 2006 లోనే మూడవ ముద్రణనిచ్చారు.
శ్రీశ్రీ గురించి కధనకుతూహలం
శ్రీవాణి తో నూతన వరవడితో ప్రారంభించిన తెలుగు సాహిత్యం శ్రీశ్రీవాణితో మరోమలుపు తిరిగి అక్కడ ఒక యుగంపాటు నిలిచిపోయింది. అదే శ్రీశ్రీ యుగం. అంతకుముందు, విశ్వనాధ సత్యనారాయణ గారు నిర్మాణం చేసుకున్న పధంలో ఒక యుగం నిలచిపోయింది. శ్రీశ్రీ, విశ్వనాధలు జంటకవులు కాకపోయినా, యిద్దరూ చెరొక యుగానికి ప్రాతినిధ్యం వహించడం తెలుగు సాహితీవాణికే గర్వకారణమయినది.
శ్రీశ్రీని నూత్న కవితా భగీరధుడుగా డా. దివాకర్ల వెంకటావధానిగారు కితాబునిచ్చారు. సాహితీమార్క్స్ గా రాచకొండ విశ్వనాధశాస్త్రిగారు సెలవిచ్చారు. మానవత్వంలోప్రవహించే నది అని డా.నాయని కౄష్ణకుమారి అని అన్నారు. ఆరని విప్లవ జ్Yఓతి, పధ నిర్దేశకుడు, శ్రీశ్రీది మనిషితనం అని, ఆధునిక సాహితీ చరిత్రకు 'గురుజాడలుగా, గురజాడ-చలం-శ్రీశ్రీ ని వర్ణించడం, కవి-మనిషి-వ్యక్తిగా శ్రీశ్రీకి త్రివేణీసంగమసత్కారాలతో వేనోళ్ళ కొనియాడారు. ఒకప్పుడు సాహిత్యం భోగవస్తువు; ఈ నాడది ఉపయోగ వస్తువు కావాలి అని తన నినాదాన్ని ప్రకటించాడు శ్రీశ్రీ. ప్రజలభాషల్ సన్నగా సంగీతం సాహిత్యంలో వినిపించిన కాలాన్ని తానే స్వయంగా నిర్మించుకున్నాడు శ్రీశ్రీ. సాహిత్య జగత్తులో మనిషి మేల్కొన్న తరుణమది. నేను సైతం ప్రపంచాగ్నికి, విశ్వసౄష్టికి, భవనఘోషకు ... అంటూ సొంతగొంతుకతో జయభేరి మ్రోగించిన మొదటిగేయాన్ని విరచించిన విద్వాంసుడు. శ్రీశ్రీ కవితా జీవితం ఒక మహాస్రవంతి; మహాకవిని చేసింది. అభ్యుదాయాంధ్ర కవిత్వయుగకర్త శ్రీశ్రీ, ప్రజాకవి, సమాజ చైతన్యాన్ని మేల్కొల్పి, దానిలోని వేడిరక్తాన్ని ఉడికించి,కవితను ప్రజావాణిగా పలికించి, ప్రపంచ పీడితజన బాధామయగీతాన్ని హృద్గీతగా పొంగించి, జీవితానికీ, సాహిత్యానికీ మంగళ సంవిధానాన్ని సాధించి,పండిత పామరజనరంజకమైన కవితాస్రవంతిని తెలుగునాట క్రొత్తతియందనాలతోపారించి, అభ్యుదయపధాన్ని చూపించిన శ్రీశ్రీ ఆధునికాంధ్ర సాహిత్య రధసారధి. ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారన్నట్లు, తిక్కన్న, వేమన్న, గురుజాడలు శ్రీశ్రీలో కొత్తరూపం తాల్చారు. తెలుగువారికి - తెలుగువాణికి ఒక అంతర్జాతీయకవిని సమర్పించారు. అందుకే, నిజంగా నేను, ప్రజల కవిన్నేను, ఎంచేతంటేను, వాళ్ళను చదివేను, చదివించే రాసేను అని తానే చెప్పాడు. ప్రజలను చదివినవాడూ, చదివింది వ్రాసినవాడూ ప్రజాకవి, దానికి మారుపేరు శ్రీశ్రీ అనికూడ అచార్యులు వివరించారు. నా రచనలలో లోకం ప్రతిఫలించి, నా తపస్సు ఫలించి, నా గీతం గుండెలలో మూర్ణిల్లగ, నా జాతి జనులు పాడుకొనే మంత్రంగా మ్రోగించాలి అని తన ప్రణాళికను సుస్పష్టంగా విశదపరచారు. వ్యదారజీవిత యదార్ధదౄశ్యం పునాదిగా ఇక జనించబోయే భావివేదముల జీవనాదముల జగత్తుకంతా చవులిస్తానోయ్ అని ప్రతిజ్ణ చేసిన శ్రీశ్రీ తనవాదాన్ని వేదంగా పేర్కొన్నాడు. విప్లవ కవిత పాడేడప్పుడు కూడ, నా వినుతించే, నా విరుతించే, నా వినిపించే నవీనగీతికి, భావం, భాగ్యం, ప్రాణం,ప్రణవం అని, చివరకు మిగిలేది సర్వనాద మూలబిందువైన ౠతం, అదే ప్రణవం అని ప్రవచనం చెప్పాడు. శ్రీశ్రీ ని సారాంశంగా ఒకే ఒక వాక్యం చెప్పాలంటే, ఆలోచన నా ఉనికికి సూచన అనే చెప్పాలి. ఆలోచన ఉన్నస్థితిలో అసంతౄప్తిని కలిగించి, ప్రశ్నించడం నేర్పుతుంది. ప్రశ్నించడం అన్వేషణకు కారణమౌతుంది. అభ్యుదయానికిప్రేరణ అవుతుంది. ప్రగతికి పునాది అవుతుంది. సరిగ్గా, సమంగా, శ్రీశ్రీ విషయంలే యిదే జరిగింది. శ్రీశ్రీ కి మరణం లేదు. మహాకవి ప్రతినిత్యం మన మనసుల్లో, నిత్యకౄత్యాల్లో, ఆలోచనల్లో, ఎదో రూపాన, మసలుతూనే వుంటాడు. జననమరణాల మధ్య జీవితం ఒక విరామసంకేతం. శ్రీశ్రీ మనకు స్వల్ప విరామం ప్రసాదించాడు. త్వరలో శ్రీశ్రీ మరల అవతారమెత్తుతాడు. లేదా కనీసం మరోశ్రీశ్రీని అవతరింపచేస్తాడు. మరో మహాప్రస్థానాన్ని తప్పక అందిస్తాడు. మనం మాత్రం మరో చలాన్ని సిద్ధం చేసుకోవాలి, యోగ్యతాపత్రం అందించడానికి. యిరువురూ కలసి వస్తారేమో ఎవరికెరుక!?!?
మహాకవి శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా ఆయనలోని మంచితనానికి , మనిషితనానికి సహస్రనమస్సుమాంజలుల్ని సమర్పిస్తూ -
కొంపెల్ల శర్మ - తెలుగు రధం.

2 comments:

Bolloju Baba said...

శ్రీ శ్రీ గారిని అక్షర బద్దం చేయటం దుశ్శాహసమే. ఆయన వ్యక్తిత్వంలో రైన్ ఫారెష్టంతటి వైరుధ్యాలు, కవిత్వంలో అగ్నిపర్వతపు లావా భుగభుతలు ఉంటాయి.

కొండ అద్దమందు ఇమిడి ఉండదా అన్న రీతిలో మీ వ్యాసం సాగింది. మూడుపేజీలలో ఎంతవరకైతె చెప్పగలమో అంతకంటే ఎక్కువే చెప్పారు.
ధన్యవాదాలు,
బొల్లోజు బాబా

Unknown said...

Dear Sri Baba gariki
thanks for the comments. A small effort on the poet magnum opus, in a mode of tribute from an not so much literate person.