పుస్తకప్రపంచం
నాకు తెలియని నేనెవరో - ముకుంద రామారావు
'కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడూ అని ఒక యుగళగీతంలో చెప్పాడు ఒక చిత్రగీతకవి. అలా ప్రేయసీప్రియులు తమ కళ్ళద్వారా ప్రేమరామాయణాన్ని పంచుకుంటారు. కాని కవిత్వం వచ్చేసరికి కవి తన కవితల ద్వారా కవితాభిమానులకు ఒక కొత్తతరహా చక్షువుల్ని అందించే బాధ్యత తప్పదు మరి. అవసరమైతే, పాఠకుడు తనదైన తరహాలో దర్శనాన్ని చేసుకోగల స్థాయి, సత్తా ఉంటేనే, సాహితీపిపాసకు ఆపోసన పట్టినట్లు నిర్ధారణ అవుతుంది. ఈ రెండు దౄక్పధాలు సమపాళ్ళలో అవతరించాయి - ప్రముఖ కవి, రచయిత ముకుంద రామారావు రచించిన కవితాసంకలనం - 'నాకు తెలియని నేనెవరో' లో.
కళ్ళు అందించిన పరవళ్ళు
కవి ముకుంద రామారావు తన సంకలనంలోని 46 కవితల్ని 'కళ్ళూ అని భావించడమే కాక, చదువరుల కళ్ళల్లో కళ్ళుపెట్టి చూస్తాయి కూడ అని ఒక విధమైన భరోసాని అందించారు. ఆ కళ్ళు సాహితీప్రియుల కళ్ళలోకి ఎంతవరకూ దౄష్టిని సారించాయి అన్నది వ్యక్తిగత అనుభూతి అనే చెప్పాలి. మామూలు చూపులను కాకుండా, అవి ఆనందాప్యాయతలను కూడ అందిస్తాయని వివరించారు.
కవి భావనాప్రపంచం
జీవితం అంటే - కవి 'ముకుందా తనదైన నిర్దిష్ట భావానుభవాలను సంకలనంలోని ముందుమాట ద్వారా చెప్పిన తీరు పఠితల్ని ఆశ్చర్య పరచక మానవు. మనిషి జీవితం ఒక ప్రయాణం, యాత్రగా సాగుతూనే, దశలూ, మజిలీలు దాటుతూంటాయి. ఉద్యోగ విరమణ కూడ ఒక కొత్త మజిలీ అని భావించడం జీవితాన్ని అర్ధంచేసుకున్న వారే అలా భావించగలరు. ఎంత చూసినా, తెలిసినా, ఎదిగినా, ఎంత తక్కువో అనగలగడం మనిషిలోని రికామీ వ్యక్తిత్వానికి ప్రతీక. కవిలోని నిరాడంబరతకు నిదర్శనం. ప్రపంచం, ప్రకౄతినుంచే నేర్చుకునేవి కోకొల్లలు అని కూడ అంటారు.
కవిత్వం అంటే - కవి లాగే, రామారావు కవిత్వం అత్యంత పరిశుభ్రతని అనిపించడమే కాక, అతిశయోక్తి, భాషాజాడ్యం మచ్చుకైన కానరావు అని ప్రముఖ కవి అజంతా అంటారు. మరో ప్రముఖ సాహితీవేత్త సంజీవదేవ్ మాటల్లో చెప్పాలంటే - ముకుంద కవనశైలి - ఉత్తమైన వస్తురూపసంపద, మరింత ఉత్తమ కవితని, భావాన్ని దర్శనీయం చేయడం ఉత్తమ కవితకు లక్యలక్షణం అని అంటారు.
ముకుంద శైలి కవిత్వం
కవిత్వానికి నిర్వచనాలు వేలకువేలు ప్రత్యక్షమవుతాయి. కానీ, సాధికారత అన్నది లేదు, రాదు, రాలేదు. ఎవరి అభిప్రాయం, అనుభూతి వారిది కనుక. ముకుంద వారి కవిత్వాన్ని యిలా నిర్వచించారు. 'ఉదయాస్తమయాలంత నిత్యనూతనం, సూర్యకిరణాల చైతన్యం, శాఖోపశాఖల చెట్టు, సముద్రంలో కలిసేవరకూ సాగే నది, జీవన సంగీతం, అనుభవ సారం, నన్ను నేను తెలుసుకునే సాధనం, ఒక కొత్త ఊపిరి, నిండుగా ఆనందించి ఆశ్చర్యపోవాలి, అడ్డంకుల్ని దాటుకుంటూ పోవాలి.'
రామారావు గారు కవిత్వానుభూతిని ప్రకటించిన తీరు మరింత ఆనందానుభూతుల్ని వివరిస్తుంది. 'పసిపిల్లలంత స్వచ్చంగా ఉన్నట్లు, అనారోగ్యం నుండి తేరుకుంటున్నట్లు, చీకటి నుండి వెలుగులోకొస్తున్నట్లు, ఎన్నో సంవత్సరాల తరువాత ఇంటికొస్తున్నట్లు, వెన్నెల అడవిలోకి చొచ్చుకుపోతున్నట్లు, వేసవిలో చల్ల గాలి తాకినట్లు, ఎదురు చూస్తున్న మొక్కలకు నీళ్ళు పోస్తున్నట్లు, వడగళ్ళ వానకి వీధంతా పిల్లల వరదైనట్లు, వచ్చే ప్రతీ రోజూ ఒక పేరు ఒక తేదీతో వస్తున్నట్లు, నీటిలో నీరు, పాలలో పాలు, నూనెలో నూనెలో కలిసి పోతున్నట్లూ అని చెప్పినతీరుని బట్టే, నిస్సందేహంగా ముకుందం రామారావు కవుల వరసలో ప్రధమపంక్తిలో పరిగణించడం అలవోకగా జరిగిపోతుంది అని ఘంటాపధంగా చెప్పవచ్చు. పుట్టుకమీద, ప్రేమమీద, చావుమేద ఉన్న నమ్మకమే కవిత్వం మీద కూడ అని చెప్పడంలో ముకుందంలో నిద్రాణమైన తత్వవేత్త కనిపిస్తాడు. అందుకే, కవితాసంకలనానికి పెట్టిన పేరు - నాకు తెలియని నేనెవరో - అన్నది నిజంగా కవిత్వం అంత ఆనందానుభూతుల్ని అందిస్తోంది. ఈ విషయంలో ముకుందం వారిని అభినందించక తప్పదు.
ముకుంద వారి కళ్ళ దొంతరలు
ముకుంద తన సంకలనం లోని మొదటి కవితే చదువరులని ఆకర్షిస్తుంది. 'ప్రయాణం' అన్న కవితలో ప్రతీ రోజూ లేచిందే పరుగు (నగరజీవన యాంత్రీకరణ కు సూచన) అంటూ, మనం నిత్యం పీల్చే గాలి ఎప్పటికీ మన ఆస్తిగా మారదంటూ, మరణం మన అధీనంలో లేదు (బుద్బుదప్రాయం అని చెప్పడం) అని అంటారు. తత్వతకు వేరే నిదర్శనం అనవసరం. ప్రపంచాన్ని ఒక నదితో పోల్చడం ఒక నవ్యత అయితే, ఆనవాళ్ళయినా మిగల్చని పడవ ప్రయాణం జీవితం అనడం గొప్ప భావన. 'ఉనికీ అన్న కవితలో - వినకుండా వింటూ, చూడకుండా చూస్తూ, మాటాడకుండా మాటాడుతూ ' అనడం జీవితంలో మన ఉనికిని కోల్పోతున్నాం అని చెప్పడం కూడా సహజభావం.
ముకుంద ప్రయోగాలు
కొన్ని మచ్చుతునకలుగా చెప్పుకోదగ్గ ప్రయోగభావజాలాన్ని యిలా చెప్పుకోవచ్చు.
ఎంత మార్పుకోసం ఎదురుచూసినా, నేడు నిన్నటి రేపు (నేడు నిన్న రేపు), వచ్చిపోయే మేఘాల్లో అయినా తడిపి వెళ్ళినవే గుర్తుంటాయి ఎన్నాళ్ళయినా (ఐనా - అతిథుల గురించి), మాటాలు వేరు, మనుషులు వేరు (ఫోనుల్లో), విత్తినవి మొలకెత్తి, మొలకెత్తినవి నిలిచి, నిలిచినవి ఎదుగుతున్న కొద్దీ, ఎంత ఆనందమో; ఎవరు పెంచిన పిల్లలో, నిత్యం తారసపడే ఈ చెట్లన్నీ (చెట్లు - పిల్లను లేని లోటు చెట్లలో చూసుకునే తిమ్మక్క - స్వఛ్ఛంద సేవకురాలి భావానికి కవితారూపం), మారుస్తున్న దుస్తుల్లా, మారుతున్న బాధ; రాత్రి ప్రపంచం చల్లబడ్డాక కూడా, సముద్రంలా నా శరీరం ఇంకా వెచ్చగానే ఉంది (రాత్రంతా), ఎన్ని భాషలు తెలిసినా, హౄదయ భాష, బతుకు భాషతోనే (పొగ), నేను మీ అమ్మని కాదు, మా అమ్మనీ కాదు, మా అమ్మకి కూతుర్ని (విదేశంలో మనుమరాలు), ఆకారాన్ని తప్ప, అద్దం కూడా నన్ను ప్రతిఫలించదు; వసంతం ఎలా వచ్చిందో ఎవరికీ తెలీదు; బాధ తెలిసాక, ఓదార్పు తెలుస్తుంది (ఒక ఒంటరి వేళ), ఆకాశాన్ని శుభపరుస్తోయో మలిన పరుస్తాయో; కొత్తవో పాతవో, అంతటి సూర్యుడికే అడ్డుగా నిలుచోగల అహంకారమో; ఏమిటో ఈ మేఘాలు ఎప్పుడూ (ఈ మేఘాలేమిటో), ఇంటికంటే ముందే బయట వెలుగు, బయటకంటే ముందే యింట్లే చీకటి, ఎక్కడున్నా కాస్త ముందో వెనకో (ఇంటా బయటా), సమయానికి సహనం లేదు, సానుభూతి జ़్జాపకాలు, దిద్దుబాట్లూ ఏవీ లేవు (సమయం), వెనుకచూపుది జ़్జాపకాల గతం, వెనక్కి పోలేక, ఏవీ మార్చలేక; ముందు చూపుది కోరికల భవిష్యత్తు, ఊరిస్తూ బతికిస్తూ; తనలోకి తానే లోచూపు, గతాగతాలు లేకున్నా, నిదానంగా నిబ్బరంగా (చూపు), ఎందుకో ఏమో చావు పుట్టుకలంత రహస్యం ఇప్పటికీ (గుండె కోత), కాలాన్ని కాలం, దూరాన్ని దూరం, మింగుతూనే ఉన్నట్టు, ఆశని ఆశ (సొంతిల్లు), అంత దూరం నడిచాకే, దగ్గరి దారేదో తెలిసింది; ఆకలి రుచీ లేకపోతే, అన్నంతిన్నా అలసిపోయే వాడినేమో (కొన్ని).
యిలా చెప్పుకుపోతే - 'ముకుంద (కవన)మాల కడు సుదీర్ఘం కాక తప్పదు.
ప్రముఖ కవి 'మో' అన్నట్లు, ఆధునిక కవిత్వానికి చేస్తున్న దోహదాన్ని వాల్లస్ స్టెవన్స్ మాటని, కాగితంలో ఎక్కువ తెలుపుదనం, తక్కువ అక్షరాలూ నేర్పాను - అన్నట్లు మౌనంతో, ధ్యానంతో సేవ చేసున్నట్లు ముకుంద రామారావు గారిని అభినందించడంలో ఔచిత్యం ఎంతో వుంది కదా.
ముకుంద వారి స్వంత కవితాభాషణంలోనే చెప్పాలంటే - 'ప్రతి రోల్జూ చేతులు అలసిపోయేవరకూ కొత్త కొత్తగా నన్ను నేనే రాసుకోవలనుంది మళ్ళీ మళ్ళీ' అన్న ఆయన ఆశ, ఆశయం రెండూ తీరుతాయి అన్నదాంట్లో ఎటువంటి సందేహం లేదు, రాదు.
'నాకు తెలియని నేనెవరో' అన్న కవితాసంకలనం చదివాక, ప్రతీ సాహితీప్రేమికుడు తనను గురించి మాత్రం తాను రవంతైనా ఆలోచించక తప్పదు. అంతమాత్రమైనా, ప్రభావం, ప్రేరణ, ఈ సంకలనం కలిగిస్తుంది.
ముకుంద రామారావు - రచించిన, వలసపోయిన మందహాసం,మరో మజిలీకి ముందు, ఎవరున్నా లేకున్నా రచనలతోపాటు, వలసపోయిన మందహాసం కవితాసంకలనానికి శ్రీ రమణా సుమనశ్రీ పురస్కారం లభించడం కవి ప్రతిభాకు తార్కాణం.
కొంపెల్ల శర్మ - తెలుగు రధం.
No comments:
Post a Comment