మన ప్రతిభావంతులు
‘సాహిత్య విద్యా ప్రవీణ’ పిలకా గణపతి శాస్త్రి
(1911 - 1983)
జయంతి ( 24 ఫిబ్రవరి)
(24.2.1911
– 2-1-1983)
20వ.
శతాబ్దపు తెలుగు సారస్వతంలోని ప్రముఖులను ప్రస్తావించాలంటే, పిలకా గణపతి శాస్త్రిగారి
గురించి చెప్పక తప్పదు. సంస్కృతాంధ్రాంగ్లాల్లో ప్రావీణ్యమే కాక హిందీ, బెంగాలీ, ఫ్రెంచ్
భాషల్లో కూడ అభినివేశం పొందిన వీరు కవి, నవలాకారుడు, కథకుడు, అధ్యాపకత్వం, పత్రికలలో
ఉపసంపాదకత్వం కావించిన శాస్త్రిగారి రచనలు, రత్నోపహారం, మణిదీపిక (కావ్యాలు), విశాలనేత్రాలు,
గృహిణి (నవలలు), విభ్రాంతామరుకం, ప్రమధ్వర, మణిదీపిక, ప్రాచీన గాథాలహరి మొదలైనవి పిలకా గణపతి శాస్త్రిగారి ప్రతిభా సిగకి
అలంకారాలు.
సాహిత్య
విద్యా ప్రవీణ, ఉభయ భాషాప్రవీణలతోపాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి విజయనగరం ఓరియంటల్
కాలేజీ లో చదివారు. విజయనగరం ఆంధ్ర యువతి సంస్కృత కళాశాల, రాజమండ్రి వీరేశలింగం పాఠశాలలో
అధ్యాపకునిగా పనిచేసిన పిలకా గణపతి శాస్త్రిగారు 24 ఫిబ్రవరి 1911 న జన్మించారు.
సంప్రదాయసాహిత్యంలో
తమదైన ప్రతిభా శైలిని ప్రధానంగా అనుసరిస్తూ, ఆధునిక సాహిత్యంలో తమదైన ముద్ర వేసిన కవుల్లో విశ్వనాథ, ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి, మథునాపంతుల
సత్యనారాయణ శాస్త్రి, మల్లంపల్లి శరభయ్య శర్మ, జమదగ్ని శర్మ, టి రామలింగేశ్వరరావులాంటి
వారి శ్రేణిలో ‘పిలకా గణపతి శాస్త్రి’గారు కూడ ప్రతిభను చాటారు. అలనాటి సాహిత్యపత్రిక
‘భారతి’లో శాస్త్రిగారి అనేక రచనలు వచ్చాయి. ‘ఆంధ్రశిల్ప’ పత్రికకు సంపాదకులుగా పనిచేశారు.
భావకవిత్వయుగంలో అందరి భావకవులతోపాటు పిలకా గణపతిశాస్త్రిగారిని కూడా ప్రస్తావించక
తప్పదు. భావకవిత్వంలో ప్రముఖాంశాల్లో భాగంగా కవి ప్రేయసిని పలుకరించే విధానంలో దేవులపల్లి
కృష్ణశాస్త్రి తదితర భావకవులు తమ ప్రేయసిని ఏ విధముగా ప్రస్తావించిననూ, తమ ప్రేయసిపట్ల
ఎనలేని గౌరవప్రపత్తిని కనబరిచిననూ, ప్రేయసిని వీరెంత పూజ్యభావముతో చూచిననూ, ‘నీ’వనియే
సంబోధించిరి; కాని, పిలకా గణపతి శాస్త్రిగారు మాత్రము ‘మీరు’ అని సంబోధించి నవ్యతను
చూపించిరని - ఉదాహరణగా
ప్రేయసి
సంబోధనలో నవ్యత
‘మీ
మధురహాసలేశోదయముల దేవి!, తోచె నానంద విస్మృతాత్మునకు నాకు, ఏ మహారాజరాజాధిరాణ్మహార్హ
హైమమకుటమణి ప్రభాధామమునని.... మీ స్మరణసాగరామృతోర్మికల....” అని వివరిస్తూ, డా. సి నారాయణరెడ్డిగారు ‘ఆధునికాంధ్ర
కవిత్వము – సంప్రదాయములుః ప్రయోగములు’ అన్న పరిశోధనాగ్రంథంలో (భావకవిత్వము - ప్రేయసీపూజ్యత)
వివరించారు. అలాగే అభ్యుదయ కవిత్వం, సమసమాజ నిర్మాణంలో కూడ శాస్త్రిగారు తన ప్రతిభను
తెలిపారు. సమాజంలో గూడుకట్టికొనియున్న ఆకలి, దరిద్రత, వ్యాధులు, అసమానత మున్నగునవి
తొలగిపోయి, అది వర్గరహితస్వర్గముగా వెలుగొందవలెనని అభ్యుదయ కవుల ‘హార్దిక లక్ష్యము’లో
శాస్త్రిగారు కూడ నేనుసైతం అంటూ యాగంలో సమిధను అందించారు. గణపతిశాస్త్రిగారి ‘అమ్మా
మాదాకబళం తల్లీ’ అన్న ప్రఖ్యాత గేయము ఈ దృష్టికి నిదర్శనం అని కూడ డా. సినారె వివరించారు.
శాస్త్రిగారి ‘అమ్మా మాదాకబళం తల్లి’ అనే గీతిక కూడ చాలా ప్రాచుర్యం పొందింది. అలాగే,
శాస్త్రిగారు వ్రాసి ప్రాచుర్యం పొందిన ‘పాపాయికి’
లాంటి కవితలు అనేకం.
“శ్రీఉషసి చరణ
మంజీరాల విడివడిన
చిన్న బంగను
మువ్వలారా!
చిట్టిబంగరు
పిచుకలారా!
వీధిచూరులదిగువ
వేలాడు రాజనపు
వరిజాలరులమీద
వాలిపోదురుగాని
మెరిసేటి బంగారు
చిరుమువ్వలై వచ్చి,
పాపచుట్టూ తిరిగి
పలకరించండీ!
పాప నొకమారైన
ఆడించిపొండీ!
చిట్టి ఈ వేళేమొ
పట్టిందిపోరు
ఉయ్యాల ఊపగా
చెయ్యూరుకోదు
శ్రీఉషసి చరణమంజీరాల
విడివడిన
చిట్టిబంగరుపిచుకలారా!
గలగలను
చిన్ని బంగరుపిచుకలారా!”
(పాపాయికి)
శాస్త్రిగారు
తన సాహిత్య ప్రస్థానాన్ని ‘రత్నోపహారం’(1943), ‘విభ్రాంతమరుకం’(1946), ‘మణిదీపిక’(1954)
రచనలతో తనదైన ప్రతిభను చాటారు. నవ్యసాహిత్యపరిషత్ లో సభ్యత్వం, ఆంధ్రపత్రిక
(1949-64) తదుపరి ఆంధ్రపత్రిక (1964-71)లో ఉపసంపాదకులుగా సాహితీసౌరభాల్ని వెదజల్లడంలో
తమవంతు పాత్రను నిర్వహించారు. కళ్హణుడి ‘రాజతరంగిణి’ కథలను ‘ప్రాచీనగాధాలహరి’ పేరున
వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కవిత్వంనుండి ప్రస్థానాన్నికథకుడిగా, నవలాకారుడిగా
మరలించుకోవడం శాస్త్రిగారి సాహితీపరంపరలో ఒక విన్నూతన మలుపు అని చెప్పవచ్చు.
చారిత్రక
గాథల్ని శృంగారకథలుగా వర్తమాన సదృశ్యమానాలుగా తీర్చిదిద్దడంలో శాస్త్రిగారు తనదైన ప్రత్యేకతని,
ప్రతిభను చాటారు. ‘కాశ్మీరపట్టమహిషి’(1967), ‘నాగమాలిక’(1970), ‘అందని చందమామ’(1978)
నవలలు ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోక తప్పదు. సంస్కృత రచనల్ని తెలుగులోకి తీసుకురావడంలో
సఫలీకృతమైన రచనలుగా ‘మహాభారతం’, ‘హరివంశం’ (ఎర్రన రచన ఆధారంగా వచనం), ‘దేవీభాగవతం’,
‘శ్రీకృష్ణభాగవతం’ రచనల్ని అలనాటి ఆంధ్రపత్రికలో సీరియళ్ళుగా రావడమే కాక, ఆ పత్రికకి
మరింతగా సొగసుల్ని, సొబగుల్ని అద్దడంలో శాస్త్రిగారు సఫలీకృతులయ్యారు. కేంద్రసాహిత్య
అకాడమీ కోరిక మేరకు, శరచ్చంద్ర చటర్జీ ‘గృహదహ’, తారాశంకర బందోపాధ్యాయ ‘కవి’ రచనల్ని
మూలానికి మరింతగా మెరుగుల్ని పేర్చి తెలుగులోకి తెచ్చారు. పిలకా గణపతి శాస్త్రిగారు
అంటే అందరికీ ముందుగా స్ఫురించే రచన ‘గృహిణి’. ఈ నవలో మధ్యతరగతి సామాన్య గృహిణుల కష్టనష్టాలు,
ఆత్మీయమైన ప్రేమాభిమానాలతోపాటు నాటకరంగానికి అపఖ్యాతలు నేటికీ సంతరించుకుంటున్న కాంట్రాక్ట్
నాటకాల భాగవతాలను కూడ రంగరించి అందించిన నవల గృహిణి.
శాస్త్రిగారి
మరో ప్రతిభావంతమైన కృతి – హరివంశం. సంపూర్ణ హరివంశం అంటే మనకు కవిత్రయంతోపాటు, నాచన
సోమన్న ఉత్తర హరివంశం, నేమాని భైరవకవి కూడ హరివంశ కర్తలుగా మనకు గోచరిస్తారు. శాస్త్రిగారు
ఎర్రన కృతిని ఆధారంగా గద్యరచనగా అలనాటి ఆంధ్రపత్రిక ఆదివారం సంచికలో వచ్చిన ధారావాహికం
ఎంతో ఆసక్తిని రేపింది. శ్రీరంగనాథస్వామి తమ భక్తుల్ని ఎలా అక్కున చేర్చుకున్నదీ ‘హేమపాత్ర’
నవలలోనూ, అశోకచక్రవర్తి పరివర్తనగాథగా శాస్త్రిగారు
‘అశోకవర్థనుడు’ నవలలు పాఠకుల్ని చారిత్రాత్మక విశదీకరణంతోపాటు కథనశైలి అందరినీ ఆశ్చర్యపరుస్తాయి.
ప్రముఖ
ప్రవక్త రామానుజాచార్య కాలంలోని ఒక గాథను తీసుకుని ‘విశాలనేత్రాలు’ అన్న ప్రేమగాథను
మలచిన తీరు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీవారినుంచి పురస్కారం అందుకునేలా చేసింది. ఈ
నవలలో కథానాయిక ‘హేమసుందరి’ అనురాగవతి, గాయని, నర్తకి అయిన హేమసుందరి పాత్రని మలచిన
తీరు, అలనాటి ప్రముఖ చిత్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ‘విశాలనేత్రాలు’ చిత్రనిర్మాణం
కావించాలన్న తపన చిత్రానికై ప్రత్యేకంగా నాయికకోసం చేసిన అన్వేషణ కూడ నవల ప్రాధాన్యతని
చెప్పింది. ఈ నవలలో శాస్త్రీయ సంగీతాని కూడ కథలో ఆలోచనాత్మకంగా పొందుపరచిన విధం కూడ
మనల్ని ఆకట్టుకుంటుంది. నవలలో కథానాయిక ‘హేమసుందరి’ మంద్ర మధురగానాన్ని, తంజావూరు వీణపై
తన కలకంఠం మేళవింపుతో, కళ్యాణిరాగంలో చేసిన ఆలాపన – ‘కావేటిరంగా – కలనైనా కనరావుగా,
కలికి ఎవ్వతె నిను కనులార గాంచెనో?, కౌగిలింతల సోలి కనుమూసి నిదురించెనో! లాంటి అంశాలు
ఎన్నో ‘విశాలనేత్రాలు’లో కానవస్తాయి.
అల్లసాని
పెద్దన ‘మనుచరిత్రం’ కథానేపథ్యాన్ని తీసుకుని, ‘అందని చందమామ’ అన్న రచన ద్వారా ప్రేమను
కొత్తకోణంలో చూపిన విధానం అందరినీ అలరిస్తుంది. అలాగే గోపాలకృష్ణుని నేపథ్యంలో మనకు
ఏ రచన అయినా, గోపికలు, బృందావనం, రాసకేళిలచుట్టూ పరిభ్రమించే వేణుగానసహిత గోపాలకృష్ణుడు
చుట్టూ రమణీయంగా అల్లిన రచన – ‘నాగమల్లిక’ మరో ప్రత్యేకతని సాధించుకుంది.
కాశ్మీరరాజుల
చరిత్ర ఆధారంగా కల్హణ మహాకవి రచన ‘రాజతరంగిణి’ కథల్లో, జన్మభూమిపట్ల ప్రగాఢభక్తి, నిష్పక్షపాతవైఖరితోకూడిన
వాస్తవికదృష్టి, నిర్మల చారిత్రాత్మక దృక్పథం, హృదయంగమమైన కవితామాధురి కలబోసిన ‘రాజతరంగిణి’కథలు
మరెన్నో రచనలకు ప్రేరణాత్మకాలయినాయి. వీటిలో సూచనప్రాయంగా ప్రస్తావించిన విషయాలను
‘చైత్రపూర్ణిమ’గాథలుగా మలచడంలో శాస్త్రిగారి ప్రత్యేక ప్రతిభను కొనియాడక తప్పదు.
పిలకా
గణపతిశాస్త్రిగారి ఎన్ని రచనలను పేర్కొన్నా, వారి ఏడు సంపుటాల మహాభారత వచన రచన ప్రత్యేకంగా
ప్రస్తావించవలసిన అవసరం ఎంతైనా వుంది. సంస్కృతాంధ్రాంగ్ల భాషల్లో పాండిత్యం శాస్త్రిగారి
మహాభారత రచనలో సుస్పష్టంగా గోచరిస్తాయి. మహాభారతంలోలేని లోకధర్మం లేకపోవడం, విశ్వజనీనమైన
సార్వకాలిక సత్యాలతో నిండిపోయే రచనగా, అసంఖ్యాకమైన పాత్రలూ, స్వభావాలూ, చిత్తవృత్తులూ
కొత్తకాకపోయినా, చదివిన ప్రతీసారీ శ్రద్ధగా గమనిస్తేనే మనకు ధర్మం కానవస్తుంది అన్న
భావనతోనే ఈ రచన చేశారు. సరళ సుబోధమైన వచన రచనగా మనకు ఆద్యంతం ఆసక్తిని కనపరుస్తూ చదివింపజేస్తుంది.
శ్రీమహావిష్ణువు ఏకవింశతి
అవతారాల
వర్ణన
భాగవతంలో
దర్శనీయం
ఒక పార్శ్వమైతే, భాగవత పురాణం
పోతనగారి ఆంధ్రీకరణంతో
వన్నెకెక్కింది.
శ్రీకృష్ణభాగవతం
పిలకా
గణపతి
శాస్త్రిగారి
మనోజ్ఞ
వచనానుసరణ
రచన కూడా ఆంధ్రపత్రికలో ధారావాహికంగా
ప్రచురితమై
తెలుగు
పాఠకుల
మనస్సులను
దోచుకుంది.
‘సాహిత్య
విద్యా ప్రవీణ’ గా వినుతికెక్కిన పిలకా గణపతిశాస్త్రిగారి శతజయంత్యుత్సవాలు యిటీవలే
జరగడం, వారి సాహిత్యమంతా ప్రచురించడం జరగడం తెలుగుసాహిత్యానికి ఒక అపురూప పర్వంగా మనం
భావించుకోవడం సమంజసం. శ్రీ గణపతి శాస్త్రిగారు 2 జనవరి 1983 న సాహితీజగతిని వీడి మనకు
భౌతికంగా దూరమైనా ఆయన సాహితీసౌరభాలు మాత్రం నిత్యం సాహితీపిపాసకుల్ని ఆవహించి ఆహ్లాదపరుస్తూనే
వుంటాయన్నది సత్యం.

