“ఆరోగ్యం భాస్కరాత్
ఇచ్చేత్”
మయూరమహాకవికృతం
శ్రీ సూర్య శతకమ్
సూర్యస్తుతిరూపమగు
మనోహర సంస్కృత కావ్యము – భావార్థ వివరణ సహితము
వ్యాఖ్యాత :
బ్రహ్మశ్రీ పోతూరి సీతారామాంజనేయులు గారు
సూర్యద్యుతి (ప్రభా) వర్ణనమ్ (6)
శ్రీర్ణఘ్రాణాంఘ్రిపాణీన్-వ్రణిభిరవఘనై-ర్ఘర్ఘరావ్యక్తఘోషాన్
దీర్ఘాఘ్రాతానఘౌఘైః-పునరపి
ఘటయ-త్యేక ఉల్లాఘయన్యః
ఘర్మాంశోస్తస్య-వోంత-ర్ద్విగుణఘనఘృణా-నిఘ్ననిర్విఘ్నవృత్తే-
ర్దత్తార్ఘాన్నిద్ధనంఘై-ర్విదధతు
ఘృణయ-శ్శీఘ్రమంహోవిఘాతమ్ (6)
భావార్థముః
సూర్యుని
కిరణములను ఉద్దేశించి సిద్ధులు (మొదలగు దేవజాతివారు కూడ) ఆయా విహితకాలములందు అర్ఘ్యములను-పూజలను)
అర్పించుచుందురు. అంతటి రవి సామాన్యుడా! అతని కిరణములు వెచ్చనివి. అనగా సంతతమును క్రియాశీలములు.
అలసత్వము లేక యుండునవి. అతడో! తన అంతఃకరణమునందు ద్విగుణము-అత్యధికము-అగు దట్టమగు కరుణ
కలవాడు అగుచు ఏమాత్రమును విఘ్నము-నిలుపుదల-లేక నిరంతరమును ప్రాణులకై ఉపకారమును చేయుటయందే
ప్రవర్తిల్లుచుండును. ఎట్లు అనగా కుష్ఠము మొదలగు వ్యాధులచే తమ ముక్కులు చేతులు కాళ్ళు
శిథిలములు కాగా తమ బాధను వ్యక్త పరచు ధ్వనులు చేయజాలక అస్పష్ఠధ్వనులు చేయుచు ఇట్టి
బాధలకు మూల హేతువుగా పాపముల సమూహములచే ఎంతయో కాలమునుండి వ్యాపించబడి యుండు జనులు ఎందరో
ఉందురు. అట్టివారిని కూడ సూర్యుడు తన కిరణముల ప్రభావమున వ్యాధిరహితులనుగా చేసి ఇతరుల
అందరవలె ఆరోగ్యవంతులనుగా చేయును. అట్టి సూర్యభగవానుని కిరణములు శీఘ్రముగా మీ పాపములను
నశింపజేయుగాక!

No comments:
Post a Comment