మన తెలుగు సాహితీ ప్రముఖులు
విద్వత్కవిలోకానికి 'విజయ వైజయంతిక '.
వేటూరి ప్రభాకర శాస్త్రి గారు (7-2-1888 - 20-8-1950)
తెలుగు సాహితీబాలకు 'శ్రీమంత ' సౌభాగ్య ప్రదాత - వేటూరి ప్రభాకర శాస్త్రి గారే
ఎండలు మెండు, నీళ్ళు లభింపవు, కూరలు లేవు, పూవులుం
బండలు కానరావు, బలవంతమెయైనను వానలేమి చే
బండదు భూమి, లేమిబడుపాటులు మిక్కిలి, దారి దోపుడుల్
మెండిటు వంటి దేశమున మేము చరించుచునుంటి మిత్రమా!
విద్వత్కవిలోకానికి 'విజయ వైజయంతిక '.
వేటూరి ప్రభాకర శాస్త్రి గారు (7-2-1888 - 20-8-1950)
తెలుగు సాహితీబాలకు 'శ్రీమంత ' సౌభాగ్య ప్రదాత - వేటూరి ప్రభాకర శాస్త్రి గారే
ఎండలు మెండు, నీళ్ళు లభింపవు, కూరలు లేవు, పూవులుం
బండలు కానరావు, బలవంతమెయైనను వానలేమి చే
బండదు భూమి, లేమిబడుపాటులు మిక్కిలి, దారి దోపుడుల్
మెండిటు వంటి దేశమున మేము చరించుచునుంటి మిత్రమా!
దేశంలో యిలా సంచారం చేయడం కొంతగా ఉద్యోగ ధర్మమైనా, అంతా పుస్తకాలపై ఎంతెంతో చెప్పలేని అభిమానం పరమ సంపదగా భావించుకొన్నవారు మహానుభావులు వేటూరి ప్రభాకర శాస్త్రిగారు. ప్రాచీన గ్రంథాల వెదకులాట, పరిశోధనా పర్వాలలో కాలికి బలపం కట్టుకొని తిరిగిన పరమసంచారి వేటూరి వారు పడ్డ కష్టాలు ఎన్నో చెప్పలేనివి. కానీ, సాధించిన విజయాలు పరమ ఘనతరాలు. స్వతహాగా కవి, పండితుడు, కనుక గ్రంథ సంచాలనంకోసం సహజంగానే శ్రమ అనుకోలేదు. దేశ సంచారం పైగా కొంత ఉద్యోగ ధర్మంగా మారడం కూడా బాగా ఉపయోగమైంది. మద్రాసు, తంజావూరు, నెల్లూరు, గుంటూరు, విశాఖ మొదలైన ఎన్నో స్థలాలు దర్శించడం, గ్రంథాలయాల్లోని గ్రంథ సంచలనం, పరిశోధనలు, ప్రకటనలు, ప్రచురణలు తర్వాత చరిత్రలో భాగమైపోయాయి.
మద్రాసు ప్రాచ్య లిఖిత గ్రంథాలయాన్ని తన పరిశోధనకు వేటూరి ప్రభాకర శాస్త్రిగారు వినియోగించుకున్నారు. శాస్త్రి గారు 1906 లో మద్రాసు చేరుకొని కెల్లెట్ హైస్కూలు లో పండితులుగా చేరారు. విశ్రాంతి సమయాల్లో మద్రాస్ ఓరియంటల్ లైబ్రరీ లో గ్రంథాలు చదివేవారు. 1910 ఆగష్ట్ లో ఆ గ్రంథాలయంలోనే లేఖకోద్యోగంలో చేరారు. గురజాడ అప్పారావు గారి మేనల్లుడు పోతరాజు నరసింహం గారి సలహా మేరకు శాస్త్రిగారు యోగమార్గంలో పడ్డారు. 1910 కి ముందే గురజాడ వారికి యువ పరిశోధకుడైన వేటూరి వారితో పరిచయం ఏర్పడింది. అంతేకాదు, గురజాడ అప్పారావు గారు కూడా వేటూరి వారిని తర్వాత కాలంలో కలుసుకొని తమ చరిత్ర పరిశోధనలు కొనసాగించుకొన్నారు. వీరిరువురికీ మైత్రి ఏర్పడింది.
గ్రామ్యమీమాంసం
1917 లో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వాడుక భాషను రాసే విధానంలో కొత్తదారులు తొక్కారు. కృష్ణాపత్రిక లో రాసిన 'గ్రామ్యమీమాంసం' అనే వ్యాసంలో -
"మండలాల్లో మాటలు మారాయని భాష చెడ్డ భాషవుతుందా? అలా అయితే ఈ పై మాటలన్నీ పాడైపోయేవే. ఇవన్నీ గ్రాంథిక భాష కావలసిన వానికి కావాలా? అఖ్ఖరలేదా? ఇలాగే ఇంకో మండలంలో మాట్లాడే కొత్త మాటలు రాకపోతే, భాషాపారగుడు ఎట్లా అవుతాడు? అన్య మండలాల్లో కొత్త మాటలన్నీ రావలసిందే, కొత్త గ్రంథాలు చదువుకొని, కొత్త మాటలు నేర్చుకొన్నట్లు అనయ మాండలిక గ్రంథాలు చదువుకొని ఆ పదాలు నేర్చుకోవాలి? ఆ మాటలు తెలియవని, ఆ భాష చెడ్డదని, అనటం మంచిది కాదు. మనకు అరవం రాదనీ, ఆ భాష చెడ్డది అంటే అపహాస్యమవుతుంది. మనకు తెలియని భాషల్లా చెడ్డదని అనాల్సివస్తుంది. ఇంతకంటే నవ్వుబాటేమీ లేదు. మారడం భాషకు సహజం."
ఈ వ్యాసంలోనే వావికొలను సుబ్బారావు, తాపీ ధర్మారావుల - "గ్రామ్యం - గ్రాంథికం కలిస్తే పేడా బెల్లం పిసికినట్లుంటుంది" అన్న వాదాలను వేటూరి ప్రభాకర శాస్త్రి గారు యిలా ఖండించారు:
"సంస్కృతం - ప్రాకృతం - శూరసేని - మాగధి - చూళిక - పైశాచి - అరేబియా - ఆఫ్గానిస్థానం - పర్షియా - మలయ - ఇంగ్లీష్ - ఓడ్రం - దక్కని - బంగాళం - బటేవియా - చీనా - తుర్కీ - తురేనియా - తార్తారం - మహారాష్ట్రం - పరాసు - లాటిన్ - పోర్చుగల్ - ఇటలీ - గ్రీసు - స్పెయిన్ - ద్రావిడం - కర్ణాటకం - తుళు - ఈ భాషలన్నీ కలిస్తే - పేడా -బెల్లం కలిసినట్లున్తుందా?
అని తనదైన శైలిలో ఆ నాటి పెద్దమనుషులకు కూడా బుద్ధి చెప్పారు.
తిట్ల ప్రహసనాలు
ఏకడం, తిట్టడం మొదలైన లక్షణాలకే పరిమితమైన ప్రహసనాలకు తెలుగునాటక రంగంలో స్థానం విరివిగా ఉండేది. అసలు మన మార్గ రూపకాల్లో ప్రహసనాలు పరిమిత దూషణకు నిలయాలుగా ఉండాలి. క్రీ.శ. 600 నాటి పల్లవ మహేంద్ర విక్రమ వర్మ శాసనంలో 'భగవదజ్జుకం', 'మత్తవిలాసం' అంటే రెండు ప్రహసనాల ప్రసక్తిలో - మొదటి రచనలో బౌద్ధమత ఖండనం చాలా వెటకారంగాను, రెండవ రచనలో బౌద్ధ, కాపాలిక, పాశుపత మతాల వారిని నీచంగానూ తిట్టడం జరిగిన వైనం నేపథ్యంలో - వేటూరి వారు అనువదించడం జరిగింది. మార్గ ప్రహసనాలు ఎలా ఉన్నా, తెలుగులో ప్రహసనాలకు మార్గం చూపిన వీరేశలింగం గారు 'ఆక్షేపణ గర్భ నాటకం' అనే నిర్వచనంతో కొన్ని ప్రహసనాలు రాసిన సంగతి యిక్కడ ప్రస్తావించడం అప్రస్తుతం కాబోదు. వేటూరి వారు, కర్ణభారం (అనువాదం-1913), మధ్యమ వ్యాయోగం (అనువాదం-1913), భగవదజ్జుకం (అనువాదం-1924), ప్రతిమ (అనువాదం-1927) రచనలు రాశారు.
వేటూరి ప్రచురణలు:
ప్రకటనలు:'
చాటుపద్య మణిమంజరి(మొదటి భాగం)(1914)
ప్రబంధ రత్నావళి (1918)
చాటుపద్య మణిమంజలి (రెండవ భాగం((1922)
బసవపురాణం (1928)
ప్రచురణలు:
తంజావూరు ఆంద్ర రాజుల చరిత్ర (1914)
అప్పన చారుచర్య (1922)
శృంగార శ్రీనాథం (శ్రీనాథ కాలం, కృతులు)(1923)
ఉద్భటారాధ్య చరిత్ర (1925)
మనుచరిత్ర (1926)
క్రీడాభిరామం (1928)
కనకాభిషేకం (శ్రీనాథ సంబంధితం)
నీతినిధి (వచనం)
కడుపుతీపు, కపోతకథ, విశ్వాసం, మూన్నాళ్ళ ముచ్చట (ఖండ కావ్యాలు)
ప్రతిమానాటకం, కర్ణభారం, మధ్యమవ్యాయోగం (భాస కృత అనువాదాలు)
భగవదజ్జుకం (బోధాయన కృతి ప్రవాసనం' కు అనువాదం)
తెలుగు మెరుగులు
ప్రభాకర శాస్త్రి గారు అనేక ఆధునిక గ్రంథ సంపాదనలు అందించారు. గురజాడ, గిడుగు, మానవల్లి - ఎందరికో శాస్త్రిగారు ఎన్నో రకాలుగా తోడ్పడ్డారు.
వేటూరి ప్రభాకర శాస్త్రి గారి వల్లనే తెలుగు సాహిత్యం శ్రీమంతం అయింది.
ఎడతెరపి లేని భాషా పరిశ్రమ, గడితేరిన ఉభయ సారస్వత పాండిత్యాలు, వడిగల కార్యదీక్షా దక్షత, చెడని తలపులు, ఒడిదుడుకులు లేని తేటతెనుగు కవితా రచన, కడతాకిన తాత్త్వికదృష్టి, - ఈ విశిష్ట లక్షణములతో పుట్టిన మహారచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అన్న మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారన్న వాక్యాలు వేటూరి పట్ల సత్యశివ సుందరాలు.
భోగ త్యాగములు సరిగా అలవరచుకొన్నవారిలో వేటూరి శాస్త్రి గారిది ఉత్తమస్థానం. సమాజ సంస్కారమును వాచించుటయేకాక, ఆచరించి చూపుట వీరి విశిష్ట విశేషణం. భాషా సాహిత్య పరిశోధనల్లో ప్రసిద్ధులైన వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవనం విద్వత్కవిలోకానికి 'విజయ వైజయంతిక '.
మహానుభావులు, మహా పండితులు వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జయంతి సందర్భంగా - తెలుగురధం శాత సహస్ర అక్షర నీరాజన సహిత ప్రణామాల్ని తెలుగురధం సమర్పిస్తోంది. (కొంపెల్ల శర్మ, తెలుగురధం)

No comments:
Post a Comment