మన ప్రతిభావంతులు
అలనాటి
గాయని ‘స్వర్ణలత’ జయంతి/వర్థంతి (మార్చి 10)
ఈ
స్వరం ‘స్వర్ణ’భాస్వరం
ఆధునిక
సమాజంలో, ఎంత సాంకేతికాభివృద్ధిని సాధిస్తున్నా, సామాన్యమానవునికి రోజు సగటు
వినోదానికి లభ్యమయ్యే సులభసాధనం చలనచిత్రమే! అదీ సినీమాహాలులో కూర్చుని వీక్షించిన
దానికి ప్రత్యామ్నాయం నేటివరకూ లేదు, బహుశ తొందరలో రాదేమో కూడా! మన
చలనచిత్రపరిశ్రమ అందుకే మూడుపువ్వులూ ఆరుకాయలుగా నిత్యనూతనంగా తన ప్రస్థానాన్ని
కొనసాగిస్తోంది. అందులో మనకు సినీమాలో అపురూపమైన సాహిత్య, సంగీత ప్రక్రియగా పాటలు
కూడాను. పాటలు లేని చిత్రాలు బహుకొద్దిగా అప్పుడప్పుడు వైవిధ్యానికి రావడం
జరుగుతూంటాయి. ఈ గీత ప్రక్రియలో రచయితలు, గాయకులు, సంగీతకారులు ముఖ్యపాత్రలు.
రచయిత పాటను రాస్తే, సంగీతజ్ణుడు స్వరపరిస్తే, గాయనీగాయకులు అనుగుణంగా పాడడం,
సినీమాలో జొప్పించడం చిత్రనిర్మాణంలో ప్రముఖాంశం.
చిత్ర గీత
గాయక పర్వంలో ఎంతమందో గాయనీగాయకులు మన తెలుగుసీమలో తమదైన ముద్ర వేసి సినీమాకు
సొగసుల్ని అద్దారు. అటువంటి గాయనీమణుల్లో అలనాటి సుప్రసిద్ధ గాయకురాలు ‘స్వర్ణలత’
దక్షిణభారతాన్ని ప్రభావితం చేశారు. ఎవరికి ఎటువంటి ముద్ర పడుతుందో చెప్పలేని
విచిత్ర పర్యవసానంగా, స్వర్ణలత వైవిధ్యమైన పాటల్ని పాడినా, హాస్యగాయనిగానే
ముద్రపడడం ఆశ్చార్యాన్ని, వింతని అందించింది. ఏది ఏమైనా, స్వర్ణలత గాత్రం మాత్రం
‘స్వరభాస్వర’ సరిసమానం అనే చెప్పాలి. విజయావారి చిత్రాల్లో ‘గిరిజ’ ధరించిన
పాత్రలకి పాడిన ‘స్వర్ణలత’ది విలక్షణమైన కంఠం, కాస్త మోటుగా, మరీకాస్త హాస్యంగా,
విసురుగా ఉండేదన్న పేరువచ్చినా, ‘కాశీకి పోలేదు రామాహరి – మురికి కాల్వలో నీరండి
రామాహరి’, ‘ఓ కొంటె బావగారూ!’ లాంటి సరదా
పాటలు పాడి తెలుగుశ్రోతల్ని అలరించి, సినీమా పాటలతో స్వర్ణలత తనదైన పేరు
సంపాదించుకుంది.
సినిమా పాటలు పాడే గాయనీ గాయకులు అన్ని రకాల, రసాల పాటలూ పాడతారు.. పాడగలరు. మధుర గాయకులు అనిపించుకున్నవారు కూడా హాస్యగీతాల్లాంటివి పాడారు. కానీ, ఒక్క స్వర్ణలతకి మాత్రం 'హాస్యగీతాల గాయని'గా ముద్రపడింది. చిన్నతనంలో ఎనిమిదేళ్లపాటు క్షుణ్ణంగా సంగీతం నేర్చుకుంది. నాట్యం కూడా అభ్యసించింది. పౌరాణిక నాటకాల్లో పద్యాలు చదువుతూ నటించింది. గాత్రకచేరీలు చేసింది. అయినా తొలిసారి సినిమా కోసం పాడిన పాట హాస్యనటుడితో పాడడం వల్ల కాబోలు అలా ముద్ర పడిందనిపిస్తుంది. ఆ సినిమా 'మాయా రంభ' (1950). ఆ పాట కస్తూరి శివరావుతో కలిసి పాడిన 'రాత్రీ పగలనక...' ఆ ముద్రని అంటుకుందనే చెప్పాలి.
ఆనాటి సినిమా కథా సంప్రదాయం ప్రకారం నాయికానాయకులతోపాటు హాస్యజంటకు కూడా పాటలుండేవి. పురాణ, జానపద, సాంఘిక చిత్రాలన్నింటిలోనూ ఇలాంటి పాటలు వినిపిస్తాయి. చాలా పాటలు జనాదరణ పొందాయి. ఒక్కసారి స్వర్ణలత పాటలు గుర్తుకు తెచ్చుకుంటే- 'కాశీకి పోయాను రామా హరీ', 'ఓ కొంటె బావగారూ' (అప్పుచేసి పప్పుకూడు: 1959), 'అంచెలంచెలు లేని మోక్షము' (శ్రీకృష్ణార్జున యుద్ధం: 1963), 'తడికో తడికో' (అత్తా ఒకింటి కోడలే: 1958)అన్న గీతాలు ‘భాస్వరంలాంటి స్వరంతో పలికిన స్వర్ణలత చిత్రగీతాలున్నంతకాలం
చిరంజీవే అని చెప్పాలి.
చిత్రసీమలో
స్వర్ణలత తన గాత్రాన్ని అందించినవి రాసిలో
కొలదైనా, వాసిమాత్రం అందరినీ అలరించింది.
1950, 60 దశకాల్లో
విడుదల అయిన బహుళ ఆదరణ పొందిన సినీమాల్లో, ప్రముఖంగా ప్రస్తావించదగ్గ
రాణీరత్నప్రభ
(1955), అప్పుచేసి పప్పుకూడు (1958), కృష్ణలీలలు (1959), శ్రీ వేంకటేశ్వర మాహాత్మ్యం
(1960), శాంతినివాసం (1960), శభాష్ రాజా (1961), శ్రీకృష్ణార్జున యుద్ధం (1963)
లాంటి చిత్రాలు స్వర్ణలతకు మంచిపేరుని తెచ్చిపెట్టింది. స్వర్ణలత పాడిన పాటల్లో
మైలురాళ్ళుగా నిలిచిపోయిన పాటలను ప్రస్తావించాలంటే - రాత్రీ పగలనక(మాయారంభ) ,కాశీకి పోయాను రామా హరీ , ఓ కొంటె బావగారూ (అప్పుచేసి పప్పుకూడు),అంచెలంచెలు లేని మోక్షము (శ్రీకృష్నార్జున యుద్ధం),తడికో తడికో (అత్తా ఒకింటి కోడలే),ఏమయ్యా రామయ్యా (బొబ్బిలి యుద్ధం),రుక్మిణమ్మా రుక్మిణమ్మా(ఉయ్యాల జంపాలా),బలే బలే హిరణ్యకశిపుడరా'(గురువును మించిన శిష్యుడు), 'డివ్వి డివ్వి డివ్విట్టం' (దాగుడు మూతలు), 'ఆడ నీవూ ఈడ నేనూ' (హరిశ్చంద్ర), 'ఏమిటి ఈ అవతారం' (చదువుకున్న అమ్మాయిలు), 'ఆశా ఏకాశ' (జగదేకవీరుని కథ) 'విన్నావ యశోదమ్మ'(మాయాబజార్')లాంటివెన్నో చెప్పక తప్పదు.
జీవిత విశేషాలు:
ఇంటివాళ్ళు పెట్టిన అసలు పేరు ‘మహాలక్ష్మి’ అయిన
స్వర్ణలత కర్నూలు జిల్లాలోని చాలగమర్రి గ్రామంలో 10 మార్చి 1928 న జన్మించి,
మద్రాసులో నివాసం ఏర్పరచుకున్నారు. 1958లో డా. అపరాధ్ ని వివాహం చేసుకున్నారు. వీరు బ్రాహ్మణ కుటుంబంలోంచి వచ్చినా, కొన్ని పరిస్థితుల్లో
క్రిస్టియన్లుగా మారి జీవితాన్ని కొనసాగించారని, పరిచయస్థులు చెబుతారు. స్వర్ణలత
దంపతులకు తొమ్మిదిమంది సంతానం కాగా,(6 కొడుకులు,3 కూతుర్లు) కొడుకుల్లో సినీ నటుడు ఆనంద్రాజ్, డాన్సర్ నటరాజ్ (అనిల్రాజ్ అని కూడ పేరు)లతోపాటు, నలుగురు కొడుకులు, ఒక కూతురు అమెరికాలో డాక్టర్లుగా స్థిరపడ్డారు. పెద్దకూతురు చాముండేశ్వరి చనిపోయింది.
స్వర్ణలత మరొక కూతురు తనపేరున్న ‘స్వర్ణలత’ కూడ తల్లిలాగానే దక్షిణభారత చిత్రాల్లో గాయని. 'భారతీయుడు'(మాయామశ్ఛీంద్రా), 'ప్రేమికుడు' (ముక్కాల ముక్కాబుల), కలిసుందాం రా (నచ్చావే పాలపిట్ట),చూడాలని వుంది (రామ్మాచిలకమ్మా), మొదలైన పాటలతోపాటు క్రైస్తవ భక్తిగీతాలు పాడి పేరుతెచ్చుకున్న స్వర్ణలత (1973 – 2010) దక్షిణ భారత గాయనిగా సుమారు 7000 పాటలు తమిళం, కన్నడం, తెలుగు, హిందీ, మలయాళం, ఉర్దూ, బెంగాలీ, ఒరియా, పంజాబీ మరియు బాడిగ భాషలలో పాడి ప్రేక్షకుల మన్ననలను మరియు ఎన్నో పురస్కారాలు పొందారు. ఈమె కూడా ఇటీవలే (2010) కన్నుమూశారు.
‘స్వరభాస్వరం’గా పేరుతెచ్చుకున్న అలనాటి
తరం గాయనీమణి ‘స్వర్ణలత’ 10 మార్చ్ 1997 న దురదృష్టవశాత్తూ దోపిడీ దొంగలచే హత్య చేయబడి, దివంగతులయ్యారు. స్వర్ణలత జన్మించడం, మరణించడం కూడ ‘10 మార్చ్’నే యాదృచ్చికంగా సంభవించింది. స్వర్ణలత
స్వరప్రస్థానానికి ఆమె జయంతి మరియు వర్థంతి సందర్భంగా ‘స్వరనివాళి’ని సమర్పించడం
సమయం, సందర్భం.

No comments:
Post a Comment