Thursday, March 7, 2013

కవితా సరోవరం - మానవత – మారణహోమం

కవితా సరోవరం

 
మానవతమారణహోమం
చౌసీతి లక్షాణాం జీవానాం -

ప్రథమ సృష్టిలో 84 లక్షల

జీవరాసులు; మనుషులు మాత్రం

కేవలం ఒక లక్షేనట!

వారే మానవులు;

వారి నివాసం సమాజం

సమాజం అంటే

సమజం కానిది;

సమజంపశుపక్ష్యాదుల

నివాస స్థలి;

ఆహార నిద్ర సుఖ భయ మైథునాలు

అందరికీ వర్తింపు, సమ్మతం

మతంఅని పేరుపెట్టారు

సర్వులకూ సమ్మతమనే సమత

అంతరం మాత్రం

వివేక విచక్షణ విజ్ణానాలు.

మానవులు కనుక

కొన్ని వలువల్లాంటి విలువలని

మానవవిలువలన్నారు

విధి విధానాల వాదాన్ని

మానవతావాదమని నిర్థారించారు

అన్నిటికంటే అతీతంగా

సృజనాత్మకంగా

శాస్త్రీయ, నైతిక, మౌలిక

సంస్కృతీ ఆధ్యాత్మికతలను

రంగరించి

విశ్వజీవన సరళి

సమీకృతమై

వరప్రసాదమైన జీవన మరణాల మధ్య

విరామమే జీవితమన్న సత్యాన్ని మరచి

తరతరాల వారసత్వ సంపదని

వినియోగించుకోలేని దుస్థితిలో

అందించిన వ్యక్తిగతోపదేశాల్ని

ఆచరణయోగ్యం కావించుకోలేకపోతున్నారు

ఆత్మగుణాల్ని అవగతం చేసుకోలేక

అవహేలనగా అభాసుపాలు చేసుకుంటున్నారు

సమాజోపయోగిత గుణాల పట్ల

సహనం కోల్పోతూ, అనైకమత్యంతో

దూరదృష్టిని మరింత దూరం చేసుకుంటూ

మనోనిగ్రహాన్ని జారవిడుచుకుంటున్నారు

మానవత్వపు విలువల్ని రక్షించుకోలేక

దోషదూషణం కావించుకుంటూ

అస్థిత్వాన్ని కోల్పోతున్నారు

విశ్వవినువీధుల్లో అపహాస్యం పాలవుతున్నారు

మహోపదేశంగా అందిపుచ్చుకున్న

మానవతని మంటలపాలు కావిస్తున్నారు

పురుషార్థాలకి అనర్థాలని కల్పించుకుంటూ

ఆదర్శజీవన ధ్యేయ సరళిని

వ్యక్తిగతజీవనంలోనూ సమాజంలోనూ

అనుసరించలేకపోతున్నారు, అక్రమార్కులవుతున్నారు

నిగ్రహాన్నీ విగ్రహాల్నీ కోల్పోతున్నారు

ఆగ్రహావేశపరులుగా ఆశయరహితులవుతున్నారు

మరణానికి, మారణానికి మధ్య

దృశ్యాదృశ్యంగా రేఖల్ని చిత్రించుకుంటున్నారు

మానవాళి మనుగడకి ముప్పుతెచ్చుకుంటున్నారు

బలిమి చాలనుకుంటూ ఆత్మశక్తిని అతిక్రమిస్తూ

సంస్కారరహితంగా సందర్భౌచిత్యాలను కోల్పోతున్నారు

జాతి యావత్తుకీ ఆత్మసంస్కారక్షామదశలో

ప్రశాంతతని కోల్పోతున్న జనజీవనవాహినీయానంలో

ఉదాత్తగంభీర సంస్కృతీరాహిత్యాన్నివిడుచుకుంటున్నారు

మానవజీవనసరళికి అర్థపరమార్థాల్ని అందుకోవాలి

సంస్కారపూరిత సమభావాన్ని ఆకాంక్షించాలి

సమాజంలో సాధ్యమైనంత సమత్వం సంతరించాలి

బుద్బుదప్రాయ క్షణిక జీవితంలో

విహంగయానం

కావిస్తున్న వైనం.

మానవతావాదమే

మానవత్వం అంటూ

మా నవత్వం అని

మురిసిపోయారు.

మతం కాదు, తత్వం కాదు

జీవనదృక్పథం అన్న ఇంగితాన్ని

మరచి, అస్థిత్వాన్నే కోల్పోయారు

అసలుకే ముప్పు తెచ్చుకున్నారు

మానవత్వపు పరీక్షని ఎదుర్కోవడానికి

కేవలం కనీస అర్హతని ఆపాదించుకున్న

అభ్యర్థిత్వాన్ని పొందినా సత్పలితాలకోసం

నిరీక్షణలో నిండా మునిగిపోయారు

విజయాన్ని చవిచూడలేకపోతున్నారు.

సుయోధనుడని పిలుచుకుంటూ

దుర్యోధనుడి ఆవేశకావేశాలతో

ఆలోచనల్ని పేనుతూ పేరుస్తున్నా

ఆచరణలో ఆశయాల్ని కోల్పోతున్నారు

జీవన వైకుంఠపాళి క్రీడలో

పరమపదసోపానాన్ని అధిరోహించాలన్న

దురాశతో కదలిన వెంటనే

పెద్ద విషనాగు కోరలకు దొరికిపోతున్నారు

సర్వంలో మానవజన్మ సుకృతం అంటూ

జంతూనాం నరజన్మ దుర్లభమనీ అంటూ

రెండుకాళ్ళ ముసలిలా కాలంతో

పరుగిడలేక, ఓటమిని సహించలేక

జీవచ్చవాల జీవనయానం కావిస్తున్నారు

స్వరూప స్వభావాల్ని కించపరచుకుంటూ

నిత్యసత్యాల్ని విస్మరించుకుంటూ

ఆశల్లో, ఆశయాల్లో, ఆకాంక్షల్లో మేథాహృదయాల్లో

ఏకీకృతమవుతూ, ఏకత్రాటి ఆలోచనలతో మునగాలి

చరిత్రకందనికాలంనుంచీ లభ్యమైన సంస్కృతిని

అభ్యుదయ నిశ్శ్రేయసాల్ని అందిపుచ్చుకోవాలి

త్యాగ,యోగ,సత్య,ధర్మ,శాంతి,ప్రేమాహింసాంకితమై

మానవజీవనవాహినిని పవిత్రీకరించుకుంటూ

సుగంధభరితంగా, సునాదమయస్వరాల్ని

విరచించుకుంటూ మానవతా వికాసానికి పాటుపడాలి

మారణకాండల్ని,ఉగ్రవాద ఉన్మాదపంథాల్ని విడనాడాలి

వివక్షతల్ని, విచక్షణాధోరణుల్ని, హింసాత్మకతని వీడాలి

మనుజులార మాది ఘనమైన మతమని

తరిమి తరిమి యుగ్గతించు పెక్కు మతములిట్లు పేచీలు సాగింప మార్గమేది యైకమత్యమునకు?”

మానవాళికి నిజంగానే మంచి కాలం రహిస్తుందా?

దారుణ ద్వేషాన్ని పెంచే దానవత్వం నశిస్తుందా?

సాధుసత్వపు సోదరత్వపు స్వాదుతత్వం జయిస్తుందా

అన్న సందేహాలు పోవాలి? మానవత్వం మాత్రం నిత్యం,

అనుక్షణం పుట్టిచచ్చే వెలుగుకిరణమన్న భయపూరిత భ్రాంతిమదాన్ని పారద్రోలాలి,

నత్వహం కామయే రాజ్యం... నాకు రాజ్యం వద్దు, స్వర్గం వద్దు,

మోక్షం కూడా వద్దు, నాకు కావలసినదల్లా - ప్రాణుల కష్టాలన్నీ తొలగించే శక్తి  ఆవహించాలి!

మతములన్నియు మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును-

యెల్ల లోకము వొక్క యిల్త్లె, వర్ణ భేదము లెల్ల కల్త్లె-

ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచునుఅన్న గురజాడని ఆచరించాలి!

ఓహో! భగవంతుడా! మమ్ము కరుణించు,కటాక్షించు

స్థితిగతుల్ని మార్చలేని స్తబ్దతలో                                  

కనీసపు నిబ్బరాన్ని ప్రసాదించు

మార్పు తేగలిగే స్థితుల్లో

మార్పిడికి అవసరమైన ధైర్యాన్నివ్వు

పైరెంటి నడుమ వుత్పన్నమైన

అంతరాన్వేషణ కొరకు జ్ణానాన్ని అందించు!

సత్యసత్వరగతిని మారణకాండకి భరతవాక్యం రచించు!

మానవతామహోద్యమానికి నూతనశ్వాసల్ని కలిగించు!

 

No comments: