Thursday, March 14, 2013

మన ప్రతిభావంతులు - ‘సంగీత కళా శిఖామణి' శ్రీపాద పినాకపాణి

మన ప్రతిభావంతులు

సంగీత కళా శిఖామణి – శ్రీపాద పినాకపాణి
 

సామవేదాత్ సంగీతం అనే నానుడి మన దేశంలో అనాదిగా వినవస్తోంది. వేదకాలంనాటి భారతీయ సమాజంలో శిష్టులైన ఆర్యరుషుల కృషి ఫలితంగా భారతీయ సంగీతం ఉద్భవించింది. సంగీతకళ అనేది సమాజంలోని అన్ని తరగతుల జనులకూ చెందిన ప్రకృతి ధర్మం. దానిని శాస్త్రీయ దృష్టితో పరిగణించి పరిశీలించి ఒక శాస్త్రంగా దిద్ది తీర్చిన ఘనత పైన చెప్పిన పురాణ ప్రసిద్ధ స్త్రీ పురుషులదో, వారి పేరున ప్రాతిశాఖ్యలు, శిక్షాశాస్త్రము (వేదములను ఉచ్చరించి సస్వరముగా పలుకురీతిని వివక్షించు శాస్త్రము), నాట్యశాస్త్రము వంటి వానిని పరోక్షంగా దేశమున కల్పించిన రుషులతో కాక తప్పదు.

ప్రణతి ప్రణతీ ప్రణవ నాద జగతికీ

ప్రణుతి ప్రణుతి ప్రణుతీ ప్రధమ కళాసృష్టికీ

అంటూ సాగే అనంత స్వరక్షీరసాగరంలో సుస్వరాక్షర పారిజాతాలు - సంగీత సారస్వత పారిజాతాలు.

రసాస్వాదన ఒకయోగం, భోగం. ఎక్కడైతే స్వరాల కల్పవల్లి సరస్వతికి 'సుస్వరార్చన' జరుగుతుందో ప్రదేశం శాంతి, సౌభాగ్యాలతో అలరారుతుందన్నది 'సామవేదసారం'.'వేదాలు నాద ప్రబోధాలు' అంటారు విజ్ణులు.

సంగీతం క్షీరసాగరం. సముద్రం విస్తీర్ణానికీ గాంభీర్యానికీ, స్వరశిఖరాలకూ అగాధాలకూ భయగౌరవాలతో నమస్కరిస్తాం. శాస్త్రీయ సంగీతం ఆలోచనామృతం,లలిత సంగీతం ఆపాతమధురం, దానిలోని తరంగాలు సినిమా పాటలుగా అలరిస్తున్నాయని పలువురి భావన.

 
కర్ణాటక సంగీతానికి రాగమే జీవనము. వర్ణము, కృతి పదము, జావళీ, రచన గానం చేసినా ఒక రాగస్వరూపమును స్వరగమకాది భూషణములతో అలంకరించి మనోహరంగా చిత్రించడమే ధ్యేయం. తానవర్ణము, మధ్యమకాలంలో రాగసంచారము, రాగ లక్షణములను తెలియజేస్తుంది. సాహిత్యాక్షరముల దన్నుతో లయబద్ధముగా ప్రదర్శించిన రాగ స్వరూపమే కృతి. రసవంతముగా రచియింపబడిన కృతిని అనుష్ఠానమును చేస్తే మంచి రాగజ్ణానం కలుగుతుంది. రాగజ్ణానం కలిగిన తర్వాత పాడిన కృతి పుష్టివంతంగా ఉంటుంది. కృతి సంపద విశేషంగా ఉన్నచోట రాగజ్ణానం పెరుగుతుంది. కృతిని బట్టి రాగము, రాగాధారముచే కృతి పరస్పరాభివృద్ధి చెందుతూ సంగీతజ్ణానం ఇనుమడిస్తుంది. ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులలో పెద్దలు పాడి ప్రచారము చేసిన పాఠాంతరములలో కర్ణాటక సంగీత లక్ష్య,లక్షణ సంప్రదాయము నిబద్ధమై ఉంటుంది.

 

ఆంధ్ర వాగ్గేయకారచరిత్రముగ్రంథంలో బాలాంత్రపు రజనీకాంతరావు గారు యిలా వివరించారు.

 

ప్రాచీనకాలమునుండి మధ్యయుగాలలోని 12 . వరకు, భారతీయ సంగీతం ఆసేతు శీతాచలం ఏకైక సాంప్రదాయాన్ని అనుసరించింది. గ్రామము-మూర్చన-జాతులు, మతంగుడు-బృహద్దేశి, సోమేశ్వరుని అఖిలషితార్థ చింతామణి, సంగీత మకరందము, శారంగదేవుని సంగీత రత్నాకరము, జాయప-సోమనలు, రెడ్డిరాజులు-శ్రీనాథుడు లను వివరిస్తూ, సాహితీయుగవిభజన మాదిరి, సంగీతచరిత్రను వేదగాన/సామగాన, గాంధర్వ, ఆఖ్యాన, ధృవగాన, రాగకావ్య, గీత గోవింద యుగాలుగా విభజన చేయడం జరిగింది.”   

 

సంగీత కళా శిఖామణి, సంగీత కళానిథి, పద్మభూషణ్, శ్రీపాద పినాకపాణి

నాద నృత్యమే సంగీతం’ - పినాకపాణి

(Music is the Dance of Sound – Sripada Pinakapani)

 

 మన ఆంధ్రరాష్ట్రంలో కడచిన మూడు దశాబ్దాలలోను అధమం అరడజనుమంది విద్వాంసులు శిఖరాయ మానంగా పెరిగి అధికారిక పదవులను, బాధ్యతాయుతమైన ఉన్నత స్థానాలను సంపాదించినవారు కనబడతున్నవారు. శిఖరాయ మానులందరిలో అత్యున్నతుడు డా. శ్రీపాద పినాకపాణిఅని శ్రీపాద పినాకపాణిగారి గురించి రజనిగారు అదే గ్రంథంలో ఇలా వివరించారుః

 

ఆయన రెండు తరాల విద్వాంసులకు నడుమ సేతువు వంటివారు. తన ముందు తరంలోని ఉత్తమ విద్వాంసుల ఉత్తమ సంప్రదాయములను అనిటినీ గ్రహించి తన తరువాతి తరానికి చెందిన ఉత్తమ విద్వాంసులను తయారు చేసినాడు. వృత్తి రీత్యా వైద్యుడైనప్పటికీ సంగీత క్షేత్రంలో ఆయన తానే ఒక సంస్థ అనదగిన గౌరవాదరాలకు పాత్రుడైన విద్వత్ శిరోమణి - విద్వాంసులకు విద్వాంసుడు. రాగం, కృతి, నెరవలు, స్వరం పాడడంలో ఆయనకు స్వచ్చమైన కర్ణాటక శైలితో పాటించే ఆంతరంగిక అనుబంధం తమ శ్రోతలపట్ల అంతగా కనపడదంటారు. కొందరు సామాన్య సంగీత సభాసదులు. ఆయనగాత్రం సౌకర్యవంతం కాదేమోననిపిస్తూ ఉంటుంది. అయినా సాంప్రదాయిక కర్ణాటక సంగీత  శైలి పై అభిమానులు మాత్రం గాత్ర ధర్మాల ద్వారా రాగరూపంలో అనితర సాధ్యమైన ఆదర్శ సంకేతాలను నేర్చగల సామర్థ్యం ఆయన గాత్ర చాతుర్యంలో నిబిడమై ఉంటుందని భావిస్తారు.

 

డా.పినాకపాణికి శిష్యుల్లో ప్రముఖంగా నేదునూరి కృష్ణమూర్తి. ఓలేటి వెంకటేశ్వర్లులను ప్రస్తావించాలి. సంగీత విదుషీమణుల్లో తొలుత విజయనగర వైణికులైన కవిరాయని జోగారావు శిష్యురాలై తర్వాత డా. పినాకపాణి శిక్షణలో సానదేరిన వజ్రమనిపించుకున్న శ్రీరంగం గోపారరత్నం. సంగీత సభా సమ్మోహన విద్యను సాధించిన కొద్దిమంది విదుషీమణుల్లో ఒకతె..

 

జీవన ప్రస్థానం

 

సంగీతానికి దివ్యౌషధంలా ప్రభావం చూపే గుణం, విలువ వుంటే, వైద్యుడు సంగీతజ్ణుడవడంకన్నా ఉత్తమం అన్యథా లేదు అనే చెప్పాలి. సమజోడి డా. పినాకపాణిలో గమనిస్తాం. మానవ శరీర శాస్త్రంతోపాటు, సంగీతశాస్త్రాన్ని కూడ కడు క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నారు. దక్షిణభారత శాస్త్రీయ సంగీత కళాకారుల చరిత్రలో,శ్రీపాద వారి స్థానం అపూర్వం. కామేశ్వరరావు- జయమ్మ దంపతులకు సంగీత కళానిథి, పద్మభూషణ్, ఆచార్య డా. శ్రీపాద పినాకపాణి గారు 3 ఆగష్టు 1913 శ్రీకాకుళం జిల్లాలోని ప్రియ అగ్రహారంలో జన్మించారు.  మైసూర్ బి.యస్. లక్ష్మణరావు వద్ద ప్రాధమిక అభ్యాసం చేసి, సంగీతంలో మలిదశ శిక్షణను సంగీతంలో ద్వారం వెంకటస్వామి నాయుడు, రంగరామానుజ అయ్యంగార్ల వద్ద స్వీకరించారు.

1936 లో సంగీత కచేరీకి శ్రీకారం చుట్టిన శ్రీపాద పినాకపాణి, ఆకాశవాణి సహా అనేక కచేరీలను ప్రదర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానపు ఆస్థాన కళాకారుడుగానున్న పాణిగారు అనేక రక్తి రాగాలకు తానవర్ణాల్ని స్వరపరచిన విశిష్టుడు.

ప్రస్తుతంలో కర్నూలులో తన సార్థక జీవితాన్ని గడుపుతున్నారు.

 

వృత్తి వైద్యరంగం

 

సుప్రసిద్ధ వైద్యులు, వైద్యరంగంలో పరిపాలనాదక్షులు, వైద్యవిద్యలో ప్రముఖాచార్యులుగా చెప్పుకోవాలి. అందరూ చదివే వైద్యం చదువుని 1932 లో ప్రారంభించి 1938 లో ఆంధ్రా వైద్య కళాశాల, విశాఖపట్నం లో నిర్ణీత సమయంలోనే పూర్తిచేసి, 1945 లో సాధారణ వైద్య విభాగంలో మాష్టర్ పట్టాని కూడ అక్కడే పొందారు. సహాయ ఆచార్య (1944-49), ఆచార్య (1951-1968) పదవుల్ని సమర్థవంతంగా నిర్వహించి, కర్నూలు కు బదిలీ అయి, 1968 ఆగష్టు 2 పదవీ విరమణ పొందారు. 

 

ప్రవృత్తి కళారంగం శాస్త్రీయ సంగీతం

 

శాస్త్రీయ సంగీత ప్రపంచంలో ప్రప్రథమ సంగీత విద్వాంసుడిగా ప్రతిభను నేటికీ ప్రదర్శిస్తున్న వైనం. మొదటి సారిగా, మూడు నెలలు ప్రముఖ వాయులీన కళాకారుడు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి అంతేవాసితనంలో చాలా నియమ నిష్ణలతో గడిపారు. సంగీతకళని ప్రవృత్తిగా కొనసాగించారు. ప్రతీ ప్రముఖ సంగీతోత్సవాల్లోనూ, సంగీత కచేరీల్లోనూ శ్రీపాదవారి కార్యక్రమం లేకపోవడం జరగలేదు అనే చెప్పాలి. పినాకపాణి గారిని ఆచార్యులకు ఆచార్యులు అని పేరు వహించారు. ఆయన అందించిన ప్రతిభాశిష్యుల్లో నేదునూరి, నూకల, మల్లాది సూరిబాబు మరియు వారి తనయులు ప్రముఖంగా చెప్పుకోవాలి. శ్రీపాద వారు అనేక సంగీత గ్రంథాల్ని రచించారు. గానకళాసర్వస్వం అన్న ఉద్గ్రంథం అనేక సంపుటాలుగా రావడమే కాక, ప్రతీ కృతీ అతి విపులంగా వివరించబడింది. వీరు రచించిన యితర గ్రంథాలు మనోధర్మ సంగీతం, పల్లవి గానసుధ, సంగీత సౌరభం

 

శ్రీపాద పినాకపాణి గారి సంగీత ప్రతిభకు అనేక గుర్తింపులు వచ్చాయి. ప్రథమంగా ప్రస్తావించాలంటే, సంగీత కళానిథి (మ్యూజిక్ అకాడమీ, చెన్నై), కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం, భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్  గౌరవాలు  వరించాయి. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు అన్నమాచార్య ప్రాజెక్ట్, ఉత్తర అమెరికా (సప్న) వారు సంయుక్తంగా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. సన్మాన సత్కారాలు ఆయనను వరించడంలో కించిత్తైనా ఆశ్చర్యం కలిగించవు.  శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించే కోరికున్న వారికి, బిరుదులు, సత్కార సన్మానాలు యాదృచ్చంకా వరిస్తాయి అన్న ప్రముఖ భావన శ్రీపాద వారికి ప్రథమంగా వర్తిస్తుంది. అందుకే, పాణి - బాణి అన్న ప్రయోగం సంగీత విద్వాంసుల నోళ్ళలో ప్రతినిత్యం నానుతూనె వుంటోంది. గానకళాప్రపూర్ణ (ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ), సంగీత కళా శిఖామణి (మద్రాస్ ఫైనార్ట్స్ అకాడమీ) కూడ శ్రీపాదవారిని వరించాయి.

 

25 నవంబర్ 2005 కర్నూలు లో జరిగిన సంగీత పేరోలగం అతిరథుల మధ్య జరిగిన వైనం సంగీతజ్ణులకు నిత్య స్మరణీయం. ఆయన శిష్యులు, నేదునూరి, నూకల, మల్లాది సోదరులు, శ్రీపాద వారికి కలిగిన అస్వస్థత కారణంగా కర్నూలులోనే ఏర్పాటు చేయడం ప్రత్యేకత. మూడు విలువైన సిడి లు  పినాకపాణి స్వయంగా స్వరపరచిన కృతులను ప్రముఖ సంగీత విద్వాంసులు గడియారం రామకృష్ణ శర్మ గారు విడుదల చేశారు. సందర్భంగా, శిష్యులు తమ గురువులను సత్కరించడం ఒక ప్రత్యేకాంశంగా పేర్కొనబడింది. సిడీ లను తీసుకురావడం లో జంధ్యాల దక్షిణామూర్తి స్మారక సంఘం, విజయవాడ వారి ప్రోద్బలాన్ని అభినందించక తప్పదు. సందర్భంగా శ్రీపాదవారు, కర్ణాటక సంగీతంలో ఆంధ్రుల పాత్ర, దక్షిణభారతంలోని యితర రాష్ట్రాల్తో పోలిస్తే, అధికం, ఘనం అని చెప్పడం గమనించదగ్గ విషయ్యం. 

 

నాదం చేసే నృత్యం సంగీతం (శ్రీపాద పినాకపాణి)

సంగీతం ఆయనకు నిత్య దేవతార్చన

 

అందరి సంగీతకళాకారుల్లాగానే, పినాకపాణి గారి కృషి సమగ్రం అనే చెప్పాలి. కానీ, జీవితాన్ని త్యాగాన్ని చేసి తన సంగీతప్రతిభను తెలుగుజగతికి అందించిన విద్వాంసులు. తొమ్మిది పదుల వసంతాలను పూర్తిచేసుకున్న సంపూర్ణ మహామనీషి యొక్క మేథస్సు, జ్ణాపకశక్తి అపూర్వమే కాక, యిప్పటికీ ఉచ్చారణ కడు స్వచ్చం. కృతి రాగాన్ని, ఆలాపనని, స్వరసహితంగా వివరిస్తోంటే, కొంచెం వార్థక్యాన్ని సూచిస్తున్నా, యువగాయకుడికి ఆలనాడున్న ఘనస్వరమే నేటికీ అలరారుతోంది అనే చెప్పాలి అని పలుమంది అంటారు. మనోధర్మ సంగీత శై లికి శ్రీకారం చుట్టినవారిలో మనవాళ్ళలో శ్రీపాదవారు అగ్రగణ్యులు అనే చెప్పాలి. ఒక వైద్యుడు, అంతటి అత్యుత్తన స్థాయి సంగీత విద్వాంసుడు, కళాకారుడుగా మారిన జీవన వ్యక్తిత్వ వికాసాన్ని గమనిస్తే, ఆశ్చర్యం కలగక మానదు.

 

పినాకపాణి గారు తన బాల్యంలో పెద్దవాళ్ళు తనకిచ్చిన సలహాలు, ఆజ్ణలు ఖాతరు చేయక, సంగీతం కేవలం అమ్మాయిలకే అన్న చాందసపు భావాచరణను త్రోసిరాజన్న సంగీతరారాజు. కాలంలో తన సోదరి మైసూర్ బి.యస్. లక్ష్మణరావు వద్ద అభ్యసిస్తున్న సమయంలో, ఆమె సాధనలో లోపాలను ఎత్తిచూపే వైదుష్యాన్ని తనంతగా సంపాదించుకున్న తరహా శ్రీపాద వారిది. చివరికి, తండ్రి, లక్ష్మణరావు కలసి సంగీత విద్యను అభ్యసించవలసినదని ప్రోత్సహించడం జరిగింది. తన పదకొండవ ఏట సంగీతాన్ని ప్రారంభించి, గురువు లక్ష్మణరావు తొట్టతొలిగా గజానన సదా యనుచు అన్న తోడిరాగంలో స్వరకల్పనతో కృతిని విశదీకరించారు. ఆశ్చర్యంగా కృతికి తనే స్వయంగా స్వరరచన చేయడం కూడ జరిగింది. పద్ధతిలో రమారమి ఏభై కృతులను ఆకళింపు చేసుకున్నారు. రావు గారు తన శిష్యుణ్ణి సంగీత కచేరీలకు తీసుకువెళ్ళడం, ఏమైనా, అద్భుతమైన కృతులను వినడం సంభవిస్తే, తన శిష్యునికి కూడ కృతిని అభ్యసించమని వేడుకునేవారట. ఫలితంగా కళాకారుడు, కచేరీ చేసి, వూరు వదలిపోయే లోపున, ఒక గంట సేపు శ్రీపాద వారికి శిక్షణ యిచ్చేవారట.

 

తన జీవితంలో ఎంతో కష్టపడిన పినాకపాణిగారు, పాఠశాల/కళశాలలకు సైకిలు పైనే వెళ్ళి, తన శృతికి అనువైన సైకిలు బెల్ కోసం వెదుకులాడేవారట. దాన్ని సంపాదించి, అమర్చి, తన ప్రయాణంలో కూడ సంగీతం అలపించుకునేవారుట. మేళకర్తరాగాలను అనుసంధించుకుని, కీర్తనల ఆరోహణావరోహణల్లోని స్వర స్థానాలను మననం చేసుకునేవారట. ఆయన టెలీఫోను నంబర్లను రత్నాంగిలతో కూడిన రెండు చారుకేశి అని గుర్తుచేసుకునేవారట. తన కారు నంబరు 3654 ని, చక్రవాక-శంకరాభరణం అని భావించేవారట.

 

స్వయంకృషి పై విశ్వాసపరుడు

 

స్వయంకృషి, స్వీయసాధన పై అపార విశ్వాసాన్ని పెంచుకున్నవారు, తనకున్న విస్తృతిని విస్తరించుకుంటూ, మనోధర్మ సంగీత విధానాన్ని ఒక క్రమశిక్షణలాగ పాటించేవారు. తన కాలంనాటి నిష్ణాతులైన విద్వాంసుల కచేరీలను శద్ధాభక్తులతో ఆలకించేవారు. ఏదైనా, ఒక కృత్యాంశాన్ని విని వెంటనే దానిని యథాతథంగా స్వరపరచి, విశ్లే షించి, తనకు అనిపిస్తే, సద్విమర్శ కూడా చేసి, బహుముఖీనమైన వనరుల ద్వారా తన విద్యను పెంచుకునేవారు. నేపథ్యంలో తనదైన శై లిని రూపొందించుకుంటూ, స్థిరీకరించుకున్నారు. పినాకపాణి బాణి అని విశ్వవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.

 

శాస్త్రీయ సంగీత కచేరీకి ఒక కొత్త రూపుని, ఊపుని అందించిన తొలితరపు సంగీత విద్వాంసుడు శ్రీ ఆరియకుడి రామానుజ అయ్యంగారు అంటే అమితపైన గౌరవం, ప్రేరణ కలిగాయి. అరియకుడి సంగీతానికి ఒక కాంతిని, స్థాయిని యిచ్చారు అని అంటారు. ప్రతీ శుక్రవారం తప్పనిసరిగా వీక్షించే ప్రముఖ సంగీత విద్వాంసురాలు వీణ ధనమ్మ కచేరీని కూడ ప్రస్తావించాలి. ద్వారం నాయుడు గారితోపాటు, తన గురువుల్ని, టి.వాసుదేవన్, ఆర్. రంగరామానుజ అయ్యంగార్, మార్గదర్శకుల్ని, స్నేహితుల్ని నిత్యం స్మరించుకుంటూనే వుండేవారు.

 

కళని కళగానే  కళాత్మకంగా  భావించిన సంగీతకళాకారుడు శ్రీపాద పినాకపాణి గారు నాదం చేసే నృత్యం సంగీతం అని, సంగీతం ఒక దినచర్య అయిన దేవతార్చన అని అంటారు.

 

సౌరభసమాహారం సంగీత సౌరభం

కర్ణాటక సంగీతానికి రాగమే జీవనము. వర్ణము, కృతి పదము, జావళీ, రచన గానం చేసినా ఒక రాగస్వరూపమును స్వరగమకాది భూషణములతో అలంకరించి మనోహరంగా చిత్రించడమే ధ్యేయం. తానవర్ణము, మధ్యమకాలంలో రాగసంచారము, రాగ లక్షణములను తెలియజేస్తుంది. సాహిత్యాక్షరముల దన్నుతో లయబద్ధముగా ప్రదర్శించిన రాగ స్వరూపమే కృతి. రసవంతముగా రచియింపబడిన కృతిని అనుష్ఠానమును చేస్తే మంచి రాగజ్ణానం కలుగుతుంది. రాగజ్ణానం కలిగిన తర్వాత పాడిన కృతి పుష్టివంతంగా ఉంటుంది. కృతి సంపద విశేషంగా ఉన్నచోట రాగజ్ణానం పెరుగుతుంది. కృతిని బట్టి రాగము, రాగాధారముచే కృతి పరస్పరాభివృద్ధి చెందుతూ సంగీతజ్ణానం ఇనుమడిస్తుంది. ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులలో పెద్దలు పాడి ప్రచారము చేసిన పాఠాంతరములలో కర్ణాటక సంగీత లక్ష్య,లక్షణ సంప్రదాయము నిబద్ధమై ఉంటుంది.  

అటువంటి కృతులను వెయ్యికి పైగా సేకరించి వీలైనంతమట్టుకు వివరములతో స్వరపరచి ఆంధ్ర యువతరానికందజేయగలిగితే, వారి కృతి సంపదలతోబాటు సంగీత జ్ణానము, సంగీతపు బాణి, గీటుకందిన అంతస్థు చేరుకుంటాయి అనే ధీమాతో శ్రీ శ్రీపాద పినాకపాణి గారు చేసిన ప్రయత్నమే నాలుగు సంపుటముల ఉద్గ్రంథం సంగీత సౌరభం. త్యాగరాజు, తదితర వాగ్గేయకారుల కృతులు ముత్తుస్వామి, శ్యామశాస్త్రి, సుబ్బరాయశాస్త్రి, అన్నమాచార్య, పదములు, జావళీలు, తానవర్ణములు, తిల్లానాలు, తిరుప్పుగళ్ లు, క్షేత్రయ్య పద రచనలు ఏన్నో చోటుచేసుకున్నాయి. వీటితోపాటు, రాగములకు సంక్షిప్త రాగలక్షణములు కూడ చేర్చబడినవి. సహస్ర సంగీత రసగుళికల సమాహారం సంగీత సౌరభం. అకారాది వర్ణక్రమంలో అంశాల్ని పేర్చడంతోపాటు, సాహిత్యం, సంగీతపు సంగతుల వివరాలు కూర్చబడిన విధానం అపూర్వం. గమకాల్ని చదవడానికి వీలుగా పెద్ద అక్షరాలతో ముద్రించడం కూడ ప్రత్యేకతే.

పల్లవి గాన సుధ

పల్లవి గాన సుధ - పల్లవి రచనల సంకలనం. రాగం తానం పల్లవి అన్న ప్రక్రియ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ప్రముఖాంశం. అతి క్లిష్టమైన అంశాన్ని కడు ప్రతిభావంతంగా, రసవంతంగా ప్రదర్శించడం కళాకారుని ప్రతిభ వెల్లడవుతుంది. దిశలోనే, పల్లవి గాన సుధ ఒక అద్భుత సంగీత వనరులా ఉపయోగపడుతుంది. ఒక సందర్భంలో, పల్లవి గాన సుధలోని ఒక ప్రముఖ పల్లవిని పాణి శిష్యులు, మల్లాది సోదరులు అమెరికాలో గానం చేయగా, అద్భుతమైన ఆదరణ లభించిందని చెప్తారు. 162 పల్లవులున్న గానసుధలో, 22 పల్లవులకు సుదీర్ఘప్రస్థానం చేయడం జరిగిందట. తెలుగు, ఆంగ్ల భాషల్లో దీనిని ప్రచురించడం జరిగింది.

మేళరాగమాలిక

ప్రణతార్థిహర ప్రభో పురారే - అన్న రాగమాలికను 72 మేళకర్తరాగాలను ఆదితాళంలో ప్రస్తుతీకరించారు. మహా వైద్యనాథ అయ్యర్ కర్ణాటక సంగీతానికి అందించిన మహావర ప్రసాదంగా భావిస్తారు. డా.పినాకపాణిగారు, చదువరికి, ప్రతీ మేళకర్తరాగాన్ని అభ్యసించేందుకు ఒక మార్గదర్శిగా దీన్ని రూపొందించారు. ప్రతీ మేళకర్తరాగానికి రాగసంచారాలు, గాయకునికి వివాద, వివాద రహిత మేళాలను ప్రస్తుతించడంలో, ఒక రాగం నుంచి మరియొక రాగానికి తరలినప్పుడు ఉపయోగపడతాయి. ప్రతీ సంగీత కళాకారుడికి మార్గదర్శి గా చెలామణీ అవుతున్నా, అనేకమందికి ఒక సవాలుగా మాత్రం నిలిచిపోయింది.

 

శ్రీపాద పినాకపాణిగారు, సంగీత ప్రస్తావన వచ్చినప్పుడల్లా, సంగీతం, సంగీతకారులు, శైలి సంవిధానం గురించి తనదైన శైలిలో వివరిస్తారు.  తంజావూరు సంగీత శైలి నుంచి ఆంధ్ర సంగీత విధానానికి మార్పిడి విషయంలో, నాలుగు విధాలైన నాణ్యతలను పాటించాలని,  శైలిని అభ్యసించి ఆకళింపు చేసుకోవడం, నిత్య నిరంతర సాధన, కచేరీలద్వారా స్వయంగా, శిష్యబృందాల ద్వారా ప్రచారం, సంగీతపు  సాహితయాంశాల్ని స్వరరచనతో సహా ముద్రించి అందుబాటులోకి తేవడం, తప్పని సరి అని వక్కాణిస్తారు. ప్రచారం, ప్రచురణల ద్వారా సంగీతకళాకారుడు నిత్య స్మరణీయుడుగా రాణిస్తూ విరాజిల్లుతాడంటారు.

 

తన మనస్సుకు గోచరించిన భావ సౌందర్యాన్ని మరో హృదయం అనుభవించేలా చేయటం చిత్రకారుడి లక్ష్యం; తన హృదయం అనుభవించిన భావ మాధుర్యాన్ని మరో హృదయంలో స్పందింపజేయడం గాయకుడి లక్ష్యం; హృదయానుభవాల వినిమయమే కళల పరమార్థం. ఈ పరమార్థానికి ప్రతీక అయిన డా. శ్రీపాద పినాకపాణిగారి మాట సరళం, వారి వ్రాత సుందరం” అని ‘సంగీత మేరుశిఖరాలు” అన్న గ్రంథంలో డా.జానమద్ది హనుమచ్చాస్త్రిగారంటారు. శ్రీపాదవారిని జానమద్దివారు కలిసి, విపుల చర్చలు చేసిన తర్వాత గ్రంథస్థం చేసిన ఆ వ్యాసంలో పినాకపాణి గారు సంగీతంపై తమ అభిప్రాయాల్ని వివరించారుః

 

సంగీతం పై ‘శ్రీపాద’ అభిప్రాయాలుః

·         సంగీత సాధనలో ‘వినికిడి’ చాలా ముఖ్యం.

·         సాయంత్రం, తెల్లవారుఝామున, ప్రతీదినం సంగీత సాధన చేసేవాణ్ణి. నాతోపాటు జయతి శ్రీరామమూర్తి కూడా సాధన చేస్తూండేవారు. బాల్యం నుంచీ సంగీత వాతావరణంలో పెరిగాను. విశాఖపట్నంలో జరిగే సంగీత కచ్చేరీలకు తప్పకుండా వెళ్ళేవాణ్ణి.

·         ఆ కాలంలో సంగీత పరీక్షలు లేవు.

·         బాగా నేర్చుకోవాలన్న పట్టుదల రాజమండ్రిలో ముదిగొండ వెంకటరామశాస్త్రి, ఈమని అచ్యతరామశాస్త్రి (ఈమని శంకరశాస్త్రి గారి తండ్రి) గార్ల కచ్చేరీలకు వెళ్ళి వారి గానరీతులను శ్రద్ధగా ఆకళించుకున్నాను.

·         రాగాలాపనలో నాకు శ్రద్ధ ఎక్కువ.

·         తమిళదేశంలో సంగీత వ్యాప్తికి ప్రధాన కారణం సన్నాయి మేళం. ప్రతి శుభకార్యంలోనూ సన్నాయి మేళం తప్పక ఉంటుంది. ఉత్సవాలలో సన్నాయి వాద్య కచ్చేరీలుండేవి.

·         ఆంధ్రదేశంలో సన్నాయి మేళం అంతగా వ్యాప్తిలో లేదు. పాట కచ్చేరీలు తక్కువ. అసలు తెలుగువారు పాడితే అట్టేరారు. తమిళుల కచ్చేరీలకు ఎక్కువగా వస్తారు. తంజావూరు పరిసరాల్లో త్యాగరాజులవారు ఉన్నందున వారి ప్రభావం ఎక్కువ. అంతేకాదు, ఆ ప్రాంతంలో సంగీత త్రిమూర్తుల ప్రభావం ఎక్కువ. మనవారికి ఆ డైరక్షన్ లేదు. మన విద్యార్థులు వారి వద్దకు వెళ్ళి నేర్చుకునేవారు. తంజావూరు శైలి గోదావరిలో నేర్పాలన్నది నా ఆశ.

·         సంగీత త్రిమూర్తులు మహర్షుల వంటివారు. త్యాగరాజులవారిది ద్రాక్షాపాకం, దీక్షితులవారిది నారికేళ పాకం, శ్యామశాస్త్రుల వారిది కదళీపాకం. అన్నమాచార్యుల సంగీత సంప్రదాయం మనకందలేదు. వారి పదాల్లో కవిత్వం పాలు ఎక్కువ.

·         సంగీతం ద్వారా రోగ నివారణ చేయవచ్చు. అందరికీ, అన్ని రీతులలో సంగీతం నచ్చదు. కొందరికి సంగీతం ఇష్టం. కొందరికి హిందూస్తానీ గాత్రం, మరి కొందరికి వాద్య సంగీతం ఇష్టం. రసికులకు మాత్రమే సంగీతం ఆనందం ప్రసాదిస్తుది. నాదం వినేవారి మనసుపై కొంత ప్రభావం కలిగిస్తుంది. ధ్వని తరంగాలు మన చెవులకు, చర్మానికి తాకుతాయి. అప్పుడు ఒక విధమైన ‘మసాజ్ ఎఫెక్ట్’ కలుగుతుంది. అది ‘వైబ్రేషన్ ఎఫెక్ట్’. ఇంతవరకు ప్రయోగాత్మకంగా సంగీతం ద్వారా రోగ నివారణ చేసిన దాఖలా లేవీ లేవు. సంగీత రసాస్వాదనా శక్తి అందరికీ ఉండదు. గాయకుడికీ, శ్రొతకు సంస్కారం – యోగ్యత – ఉండాలి. ప్రతి రాగం లేదా కృతి మాధుర్యంలోని సూక్ష్మాంశాలను గ్రహించేందుకు అనుభవజన్యమైన సూక్ష్మ సంవేదనా శక్తి అవసరం. శ్రోతలలో ఈ సంస్కారం లేనప్పుడు వారికి మిగిలేది ధ్వని. అది చెవికి సోకినప్పుడు అదే సంగీతం అనిపిస్తుంది. ‘ఇయర్ ఆఫ్ ది ఇయర్ ఈజ్ బ్రెయిన్”.

·         సంగీతం పరిశుద్ధంగా ఉండాలి. సామాన్యుల కొరకు శాస్త్రీయ సంగీతం విలువలను విస్మరించరాదు.

·         చాలా కచేరీలు చేశాను. ఏనాడూ, ఎక్కడా ఇంత సంభావన ఇవ్వమని కోరలేదు. వచ్చిన దాంతో తృప్తిపడేవాణ్ణి. నేను డబ్బుకోసం ఏనాడూ కచేరీలు చేయలేదు. భగవంతుడు నాకు కాలసినంత ఇచ్చాడు. నాకు తృప్తిగా ఉంది.

·         1972లో జాతీయ సంగీత కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు. పదిహేనేళ్ళు ఆలస్యంగా అందజేసిన ఆహ్వానాన్ని తిరస్కరించాను.

·         వర్థమాన గాయకులకు నా సలహా – “బాగా సాధన చేయండి. పేరు ప్రతిష్ఠల కోసం పరుగులు తీయకండి. సంగీతాన్ని శుద్ధంగా ఉంచండి. కర్ణాటక సంగీతం అమరం”.

3 ఆగష్టు 1912 నుంచి శతమానంభవతి అని నిండునూరేళ్ళ జీవనప్రస్థానోత్సవాల్ని ఘనంగా జరుపుకుంటున్న శుభఘడియల్లో, ఆ శతవత్సరం పూర్తి అవకుండానే, శ్రీపాద పినాకపాణి గారు సంగీత దుఃఖసాగరంలో యావద్విశ్వసంగీతరసికుల్ని, వదిలివేసి, అమరస్వరాగఝరీసీమకు తరలిపోయారు. ఆ సరాగస్వరసమ్రాట్టుకి స్వరనివాళిని అందజేస్తూ, శతసహస్ర ప్రణామాంజలుల్ని అర్పించుకుంటూ, కైమోడ్పులందిచాల్సిన తరుణం,సందర్భం.

No comments: