Thursday, March 14, 2013

మన ప్రతిభావంతులు - మునిమాణిక్యం నరసింహారావు

మన ప్రతిభావంతులు


‘కాంతామనోహరుడు’, ‘కథా కనకమూర్తి’ మునిమాణిక్యం నరసింహారావు

(1898 – 1973) (జయంతి మార్చి 15)

సారస్వత తలమానికం

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రతిభా దిగ్గజాలు కేంద్రం పనితనానికి ‘నేను సైతం’ అంటూ ఎందరో మహానుభావులు తమ తమ వంతు ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న రోజులవి. స్థానం, దేవులపల్లి, గోపీచంద్, నాయని, బుచ్చిబాబు, దాశరథి లాంటి హేమాహేమీలు అందించిన కళా సాహిత్య సంగీత హాస్య  సౌరభ సంపద నేటికి చిరస్మరణీయ సంఘటనలుగా పేర్కొనడం జరుగుతూనే వున్నాయి. ఆ పరంపరలోనే ‘హాస్య పరమేశ్వరుడు’ ‘కాంతామనోహరుడు’, ‘కథక చక్రవర్తి’  సుప్రసిద్ధ హాస్య రచయిత మునిమాణిక్యం నరసింహారావు గారిని స్మరించకుండా తెలుగు సాహితీపుటలు వెలవెలపోవడం తథ్యం. ఆధునికతని, తెలుగుదనాన్ని పండిస్తూ, మునిమాణిక్యం వారు ప్రయోక్తలా ఆకాశవాణి ప్రసారాలను పరిపుష్టం చేసుకున్న కార్యక్రమాలను శ్రోతలు అత్యంత శ్రద్ధాసక్తులతో విని ఆనందించేవారు.  అటువంటి ఆనందానుభూతుల్ని అందించిన వారిలో మునిమాణిక్యం నరసింహరావు గారిని ప్రథమశ్రేణిలో ప్రస్తావించాల్సిందే! ఆ తరానికి ప్రాతినిథ్యం వహించే మునిమాణిక్యం వారిని ‘సారస్వత తలమానికం’ అని ఏకాభిప్రాయంగా ప్రస్తావిస్తూ, పైన పేర్కొన్నవారి సహపంక్తిలో వీరికి స్థానం కేటాయించవలసిందే!

ఇరయ్యవ శతాబ్దం మొదటి పాదంలో ఒక కథకుడిగా రూపుదిద్దుకున్న మునిమాణిక్యం  ఈయన సృష్టించిన కాంతం పాత్ర, ఆమె పేరుతో కథలు, తెలుగు సాహిత్యంలోనే పెద్ద పీట వేసుకుని కూర్చున్నాయి. పదహారణాల తెలుగింటి ఆడపడుచుగా, అమాయకత్వం, ఆంధ్రత్వము సరిసమపాళ్ళతో రంగరించిన ‘కాంతం’ కథలు సుమధుర సుగంధ కర్పూర కణికలు.  దాంపత్య జీవితంలోని సౌందర్యం, కుటుంబ జీవితంలోని కష్టసుఖాలు, ఈయన కథలలో ప్రస్పుటంగా కనిపిస్తాయి అన్నది సాహితీ విమర్శకుల ఏకైక విశ్లేషణాత్మక అభిప్రాయంగా చెప్పక తప్పదు.

మునిమాణిక్యం నరసింహారావు గారు గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, సంగం జాగర్లమూడి వాస్తవ్యులుగా  వెంకాయమ్మ, సూర్యనారాయణ దంపతులకు 15 మార్చి 1878న సదాచార సంపన్న కుటుంబంలో జన్మించారు. విజయనగరం కళాశాలలో బిఏ, రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణని పూర్తిచేసి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. బిఏ చదువులోనే ‘సాహితీసమితి’ మరియు తల్లావఝ్ఝుల శివశంకరశాస్త్రిగారి ప్రోత్సాహంతో రచనలు చేయడం ప్రారంభించి, ‘సాహితి’ తొలిసంచికలో ‘ఉఫ్’ అనే స్కెచ్ ని వ్రాయడం తర్వాతే కథలను వ్రాయడం జరిగింది. తెలుగు రచయితల్లో ఎక్కువమంది ఉపాధ్యాయులుగా వృత్తిని నిర్వహిస్తూ రచనలు సాగించడం, తద్వారా సాహిత్యానికి మూలస్థంభాలుగా సుప్రతిష్ఠులవ్వడం మనదైన తెలుగుదనం ఉట్టిపడే సంస్కృతిలో భాగంగా మారిపోయిన వైనంలో మునిమాణిక్యం వారేకాక, వారి తండ్రిగారు కూడ ఉపాధ్యాయులే! ఉపాధ్యాయులుగా  విద్యార్థులకు స్నేహంగా, సన్నిహితంగా మెలగడం, విద్యార్థులు అల్లరిచేస్తే, కోపాన్ని కూడ బహు చమత్కారంగా, తమాషాగా ప్రకటించి విద్యార్థిలోకాన్ని నవ్వించడం ఆయన నిత్య సరదాల్లో ఒకటి. సాధారణ సంభాషణల్లో విషయాలను తనపక్షంలో అన్వయించుకుని, హాస, పరిహాసాల్ని తనదైన హాస్యధోరణిలో విస్తరించి వివరించి చెప్పడంలోనే మునిమాణిక్యం సంతరించుకున్న ప్రత్యేకతని తన కథల్లోనూ ప్రతిబింబించుకునేవారు. బందరు హైస్కూలులో చరిత్ర ఉపాధ్యాయకత్వం నుంచి, గుంటూరు, భీమవరం, బచ్చన్నపేట(వరంగల్లు), వేటపాలెం పాఠశాలలతోపాటు, ఆకాశవాణిలో విద్యావిషయ కార్యక్రమాలను రూపొందించే ప్రక్రియలో, హైదరాబాదు ఆంధ్ర సారస్వత పండిత శిక్షణాలయంలో ప్రథానోపాధ్యాయుడిగా వృత్తిని నిర్వహించారు. చరిత్ర పాఠాలు చెప్పే బడిపంతులుకు ఇంత చతురత, చమత్కారధోరణి, హాస్యరససమీకరణం ఎలా అలవరచుకున్నారా! అని ఆశ్చర్యం పోయినవారు అనేకం మనకు గోచరిస్తారు. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ మునిమాణిక్యం వారికి విశిష్ట సభ్యత్వంతో సత్కరించిన(1968) సందర్భంలో ప్రశంసాపత్రాన్ని అందిస్తూ, దివాకర్ల వేంకటావధానిగారు ఇలా విశ్లేషించారుః “మునిమాణిక్యం  వారి బోధనా పద్ధతి అనన్య సామాన్యమైనది; చరిత్ర, భూగోళ, భాషా పాఠములేవి బోధించినను, వారు ఔషధముతో అనుపానమువలె వానితో హాస్యోక్తి చమత్కారమును జతచేసి, విద్యార్థుల సత్వర గ్రహణమునకు పాటుపడుచుండిరి; కాలక్రమమున ఉన్నత పదవులందిన వారి శిష్యులు పలువురిప్పటికిని వారి బోధన పాటవము సాటి లేనిదని చాటి చెప్పుదురు.”

కథా సాహితీ మణిపూస ‘కాంతం’

మునిమాణిక్యం వారంటే మనందరికీ వెనువెంటనే స్ఫురించే రచన – కాంతం కథలు. తెలుగు కథా సాహిత్యంలో ఒక మణిపూసగా భావించబడే ఈ రచనలో పన్నెండు కథల సంకలనం వెలువడింది. దీనిలో – మా కాంతం, నేనూ మా కాంతం, ఊదాచీర, తేనీటి గిన్నెలో తుఫాను, కోటు, తేనీరు, సప్తాహం, ఒకరోజు, మరియొకరోజు, కొత్తయెత్తు, ప్రయాణం, ఎందుకు? అన్న కథలున్నాయి. ఈ కథల సంపుటి గురించి ఆనాటి భారతి 1928 జూలై పత్రికలో జరిపిన సమీక్ష విశ్లేషణలో – “ఈ కథలు  చాలవరకిదివరకు, ఆంధ్రదేశపు పత్రికలలో ప్రచురింపబడినవే; వీనిలో ఉత్కృష్ట భావములుగాని, ఉన్నత భాషాశైలిగాని లేకపోయినను చదువుటకింపుగా, చమత్కారముగా, సంసారపక్షముగా ఉండును” అని వ్రాయడం జరిగింది. ఈ వివరాలను వివరిస్తూ, మహాకవి “ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం(4) – చిన్న కథ, పెద్ద కథకులు” అన్న విభాగంలో మునిమాణిక్యం వారి గురించి ఇలా చెప్పారు: “కాంతం కథలు ప్రజాదరణ పొంది, కాంతంతోబాటు ఆమె భర్త వెంకట్రావు కూడా ఆంధ్రసారస్వతంలో ఒకనాడు జ్ణాపకం పెట్టుకొనే పాత్రలయ్యారు. “కాంతం పేరు వినని తెలుగు సాహిత్యాభిమానులు బహుశా వుండరు; ఈ పాత్ర తొంభై ఏళ్ళ  సంవత్సరాల క్రితం (1921-22) జన్మను పొందితే, జన్మనిచ్చినవాడు  తండ్రి అయితే, కాంతానికి జన్మనిచ్చినది మాత్రం ఒక భర్త; కేవలం మధ్య తరగతి భర్త; ఆ భర్త పేరు మునిమాణిక్యం నరసింహారావు అని పేర్కొంటూ, మధ్యతరగతి జీవితాల్లోని అనుభవాలు హాస్యంగా మలిచి, దాపత్య జీవితంలోని అందచందాల్ని ప్రదర్శించిన విశిష్ట కథారచయితగా మునిమాణిక్యం వారిని ‘సాహిత్య పరిచయం’లో ప్రముఖ రచయిత ఇంద్రగంటి శ్రీకాంత శర్మ విశ్లేషించారు. జీవితం ఆనందదాయకంగా ఉండటానికి కాస్త ఓర్పు, నేర్పు, హాస్యచతురతా ధోరణి ఉండాలని సందేశం అందించే కాంతం ‘శరద్రాత్రులు’, ‘కాంతం కథలు’, ‘నేనూ-మా కాంతం’ కథాసంపుటాల్లో  సుస్పష్టంగా సాక్షాత్కరించే కాంతం ప్రత్యేకంగా పాఠకుల మనసుల్లో ముగ్ధగా, ప్రౌఢగా నిలిచిపోతుంది; అయితే, ‘కాంతం వృద్ధాప్యం’ను కూడ మునిమాణిక్యం చిత్రించడంతో మరో దృక్కోణం ఏర్పడడంతో, వృద్ధ కాంతాన్ని చిత్రించకుండా వుంటే బావుండేది అని శ్రీకాంతశర్మ అన్నారు. చిన్న శృంగార కలాపంగా వ్రాసిన మొదటి కథ ‘టీ కప్పులో తుఫాన్’ లోనే ప్రత్యక్షమయిన కాంతం, తర్వాతి సాహిత్యంలో ‘కాంతం లేకపోతే కథేలేదు’ అని స్వయంగా మునిమాణిక్యం వారే అన్నారు.  ‘కాంతం ప్రత్యేకత’ ని వివరిస్తూ, ‘హాస్య చమత్కార చక్రవర్తి మునిమాణిక్యం నరసింహారావు’ అన్న గ్రంథ రచయిత్రి డా. కె.బి.లక్ష్మి యిలా విశ్లేషించారుః

“మునిమాణిక్యం కథకులుగా ప్రాముఖ్యత సంపాదించడానికి ఆయన కథాశిల్పం, భాష, శైలి, సంభాషణాచాతుర్యం, సన్నివేశ కల్పన, కొండొకచో చిరుభావస్ఫోరక వర్ణనలు, సహజత, సరళత ఎంత ఎత్తో కాంతం ఒక్కటీ అంత ఎత్తు. కాంతం కేవలం కాంతం మాత్రమే కాదు; ఒకతరం తెలుగువారినందరినీ ఎంతగానో ఆకర్షించిన నిత్యనూతన అయస్కాంతం. అందం, అమాయకత్వం, అనురాగం, అసూయ, అధికారం, అహంభావం, పట్టుదల, స్నేహశీలత్వం, భక్తి, సంసారపక్షమైన తెలివితేటలు సహజలక్షణాలై అలరారిన సజీవచైతన్యమూర్తి మునిమాణిక్యం స్ఫూర్తి. ఆయన్ని చూడగానే కాంతం గుర్తొచ్చి ముసిముసిగా నవ్వుకోని ఆంధ్రుడుండకుండా చేసిన ప్రభావశాలి. సంసారంలో చెలరేగే కల్లోలాన్ని ఆకళించుకొని, మాతృమూర్తిగా పిల్లల్ని, అర్థాంగిగా భర్తనూ ఆప్యాయంగా ప్రేమగా చూసుకుంటూ, నవ్వుతూ, నవ్విస్తూనే ‘రిపార్టీలు’ ఇస్తూ జీవితం గడిపిన కాంతాన్ని స్త్రీలోకానికి ఒజ్జబంతిగా చేశారు మునిమాణిక్యం”.


మునిమాణిక్యం ‘కాంతం’ చుట్టూ అల్లిన రచనల్లో, కాంతం, నేనూ మాకాంతం, కాంతం కైఫీయత్, కాంతం కాపురం, కాంతం కథలు, కాంతంగారి సీతయ్య, కాంతం వృద్ధాప్యం అన్నవి శీర్షికల్లోనే కనిపిస్తాయి. మునిమాణిక్యం జీవితంలో, రచనల్లో ‘కాంతం’ ఆయనకూ, పాఠకులకూ ఎంత ప్రభావం చూపిందంటే, మునిమాణిక్యం వారికి ‘కాంతామనోహరుడు’, ‘కాంతం మొగుడు’ అని బిరుదులిచ్చి, సత్కార సన్మానాలను కూడ ఆయన సాహిత్యాభిమానులు చేశారు. మునిమాణిక్యం సాహిత్యంలో ‘కాంతం’ అన్న అంశంపైనే పలు పరిశోధనలు చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. అసలు ఈ కాంతం – తన స్నేహితుడి చెల్లెలు ‘కాంతం’ అన్న పేరు, ఆయనకు ఈ పేరు ఎంతో నచ్చి, కాంతం అంటే మనోహరం అన్న అర్థానికి మురిసిపోతూ, మధుర మనోహర సృజనకథలుగా ‘కాంతం’కథలతోపాటు ‘కాంతం’ పాత్ర ఆధారంగా మునిమాణిక్యం వారు ఎన్నో రచనలు చేయడం, ఆయన రచనాపరంపరలో ప్రముఖపర్వంగా మారిపోయింది. మునిమాణిక్యం వారి ప్రతిభను కాకాని నరసింహారావు పద్యాన్ని డా. కె బి లక్ష్మి ఉదాహరించారు.

“నిత్యము దోచు సంఘటన నీడల దాగుడు మూతలాడు స్త్రీ / కృత్యపు హాస్యమెత్తి, గిలిగింతలుబుట్ట లిఖించి, యాంధ్ర సా / హిత్యము నందు కాంతమున కెక్కడ లేని ప్రతిష్ట దెచ్చి మౌ / ద్ధత్యము దానగాంచిన కథా కనకమూర్తి నృసింహు డల్పుడే?”

“అల్లసాని వరూధినిలా, ముక్కుతిమ్మన సత్యభామలా, నండూరి ఎంకిలా – మునిమాణిక్యం వారి కాంతం కూడా స్నిగ్ధగా, గడుసరిగా, ప్రౌఢగా, చతురమతిగా తెలుగు సాహిత్యాభిమానుల హృదయాల్లో తిష్టవేసిన పాత్ర. అపురూపంగా సృష్టించిన కాంతం చుట్టూనే కథా సాహిత్యంలోని సమస్త సన్నివేశాలు తిరిగేలాగ చేసిన మునిమాణిక్యం రచనా నైపుణ్యం అనితర సాధ్యం” అన్న డా. కె బి లక్ష్మి మాటలు తెలుగు సాహితీ విశ్లేషకులెవరైనా అంగీకరించవలసిందే!

1928లో రచయిత జీవితంలో జరిగిన రెండు విషాద ఘటనల్ని వివరిస్తూ, ఒకదాని వెంట ఒకటి జరిగిన భార్య శేషగిరమ్మ (కాంతం), పెద్దకూతురు రుక్మిణి హఠాత్తుగా మరణించడం వల్ల హాస్యచతురుడైన మునిమాణిక్యం ఈ హఠాత్పరిణామంనుండి తేరుకోడానికి కొంత సమయం పట్టింది.

రచనోద్దేశ్య ప్రకటనలు:

మునిమాణిక్యం రచనలు చేసుకుంటూ పోవడం మాత్రమే కాక, ప్రతీ రచనకూ ఉద్దేశ్యాలను వివరించారు.

దాంపత్యోపనిషత్తు

జనరంజకంగా రచనలు వ్రాయడం ఒక ఎత్తైతే, ప్రతీ రచన ఎందుకు చేయవలసివచ్చిందో విపులంగా వివరించడం మునిమాణిక్యం ప్రత్యేకతగా భావించాలి. ఈ కోవలో, ‘మేరీ కహానీ’, ‘శారద రాత్రులు’, ‘దాంపత్యోపనిషత్’, ఇంటావిడతో పోట్లాట’, ‘ప్రణయ కలహం’, ‘భార్యను లొంగదీసుకోవడం ఎలా?’ అన్న రచనలను ప్రస్తావించక తప్పదు. ప్రత్యేకతల్లో ప్రత్యేకతగా ‘దాంపత్యోపనిషత్’ గ్రంథం బాపు ముఖచిత్రమే కడు ప్రత్యేకతల్ని దర్శనీయం చేస్తుంది. ‘సంసారపు పాలకడలిని చిలకడంలో చిందిన తుంపరులను పోగుచేయగా ఏర్పడిన గ్రంథం అని వివరిస్తారు. పుష్కళ కావ్యగుణం, ఆద్యంతం చమత్కారం, మంజుల మధుర వాక్కులతో కథాకథనం, గార్హస్త్య జీవిత సౌందర్యాన్ని మనోహరంగా ఆవిష్కరణ పఠితులకి సాక్షాత్కరిస్తాయి. సంపూర్ణ హాస్యగ్రంథంగా గుర్తించి, కాస్సేపు నవ్వుకోవడానికి సిద్ధపడి మరీ పుస్తకం తెరవమని, విసుగుగా ఉన్నప్పుడు చదవరాదని హెచ్చరికలు చేస్తూ, పుస్తకాన్ని ఎలా చదవాలి అన్న విషయం కూడ ప్రస్తావిస్తూ, అసలు మంచి పద్ధతిగా వివరించిన తీరు యిలా సాగిందిః

“వెన్నెల రాత్రి ఆరుబయట రెండు ప్రక్కలు వేసుకోవాలి; తెల్లటి దుప్పట్లు వాటిపై పరవాలి; కాసిని మల్లెపూలు పక్కలపై పోసుకోవాలి; ఆ తర్వాత భోజనాలు చేసి, తాంబూల చర్వణం కూడా పూర్తిచేసి, దీపం కనబడేటట్లు పెట్టుకుని పరుపుపైన పడుకుని, మీ ఆవిడను వినమని ఈ పుస్తకం చదవాలి; ఇద్దరూ కలిసి నవ్వుకుంటారు; అదీ నా అభీష్టము” అని వ్రాశారు.

కాంతం కథలు రచనతోపాటు, మునిమాణిక్యం ‘అప్పులు చెయ్యడం-తీర్చడం, గృహప్రవేశం, హాస్య కుసుమావళి, మాణిక్య వచనావళి, స్తుతి-ఆత్మస్తుతి రచనలు చేశారు.

అప్పులు చెయ్యడం – తీర్చడం : ‘అప్పులు చేయడంపై అపార పరిశోధన జరిపి, “అప్పు చేతిన మొత్తమును తిరిగి యిచ్చేవాడు అధముడు; కాలం గడిపేవాడు మధ్యముడు; తెచ్చిన మరుక్షణములో ఆ మాటను సులువుగా మరువగలిగినవాడు ఉత్తముడు’ అని మాణిక్యమైన సూత్రీకరణం చేశారు.

“మన హాస్యం”

తెలుగు హాస్యరచనకు కొత్త ఒరవడి పెట్టిన మునిమాణిక్యం వారు ఏకంగా, ‘మన హాస్యం’ అన్న ఆరు ప్రకరణాల హాస్య ప్రక్రియకు సమగ్ర సిద్ధాంత భూమికను ఏర్పరచడంలో ఆయన ప్రత్యేకతని చాటారు. ఆంధ్రసారస్వత పరిషత్తు వారు ద్వితీయ ముద్రణ అందించిన సందర్భంలో, డా. సి నారాయణరెడ్డి ముందుమాటగా ‘అవతారిక’లో “మౌలికంగా పరిశోధనాత్మక గ్రంథమైనా, సందర్భోచిత ఉదాహరణలతో ఆహ్లాదకరమైన రచనగా తీర్చిదిద్దారు. ప్రాచీమ ఆలంకారికులు ప్రయోగించిన పారిభాషిక పదాలను స్వీకరించి సాంకేతిక పదసంపదను సమకూర్చి, పండితులకు, పరిశోధకులకు, విద్యార్థులకు ఉపకరించే  గ్రంథాన్ని మునిమాణిక్యంవారు రచించారు” అన్నారు. మునిమాణిక్యం వారు ప్రథమ ముద్రణలో వ్రాసిన ముందుమాట ప్రకారం ‘మన హాస్యం’ అన్న పేరును గడియారం రామకృష్ణశర్మ భావన అని వివరిస్తూ, ముట్నూరి సంగమేశం హాస్యం మీద ఒక పుస్తకాన్ని ఇదివరకే వ్రాసినట్లుగాను, హాస్యానికి సంబంధించిన మొదటి హాస్య సిద్ధాంత గ్రంథం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘ప్రస్తావిక’లో ముదిగొండ వీరభద్రశాస్త్రిగారు, “హాస్యరసాన్ని మనపూర్వులు ప్రధానరసాలలో గుర్తించినప్పటికీ మన సాహిత్యంలో దానికి ఉండదగినంతటి ప్రాధాన్యం ఏర్పడలేదు; పాశ్చాత్య వాంగ్మయ ప్రభావం ప్రసరించిన తర్వాత వచ్చిన ఆదునికాంధ్ర సాహిత్యంలో హాస్యరీతులలో కొంత వైవిధ్యమూ, క్రొత్తదనమూ కనవస్తుంది; అయినా హాస్యరస స్వరూప స్వభావాలను సాకల్యంగా పరామర్శించే గ్రంథజాలం వెలువడలేదు; ఈ కొరత తీర్చడానికి శ్రీ మునిమాణిక్యం ప్రయత్నించారు.” ఈ మనహాస్యం అన్న గ్రంథంపై ధారావాహిక ప్రసంగాలు ఏర్పాటుచేసి, మన సాహిత్యంలోనే కాక, మన జీవన విధానంలో, సమాజంలో సుఖమైన, ఆహ్లాదకరమైన జీవితానికి హాస్యం చాలా దోహదం చేస్తుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేసే అవసరం ఎంతైనా వుంది. హాస్యరస సిద్ధాంతాన్ని, హాస్యలక్షణాలను నిరూపించే గ్రంథంగా తెలుగులో మునుముందు హాస్యాన్ని గూర్చి కృషి జరిగితే, ప్రామాణికంగా నిలబడగల విషయాలను పరిచయం చేసిన ఈ గ్రంథంలో – హాస్యం, ఇది హాస్యం కాదు, ఏది హాస్యం కాదు, నవ్వెందుకు వస్తుంది, హాస్యము-భేద ప్రభేదాలతోపాటు, నవ్వు ఆరురకాలని, వేషగత చేష్టాగత వాగ్గత హాస్యాలు, హాస్య లక్షణాలు, హాస్యరసము, హాస్యశీలుడు – కవి, పాఠకుడు అన్నవాటితోపాటు, హాస్యానికి ఆనందానికి తేడా కూడ వివరించిన అద్భుత గ్రంథం ‘మన హాస్యం’. చివరగా ‘చమత్కారం’, హాస్యం’లను పర్యాయపదాలుగా ప్రయోగిస్తామని, అది సరికాదంటూ, కొత్తదనం, వైశిష్ట్యం, ప్రతిభాప్రదర్శనలు రెంటికీ అవసరమని వివరిస్తూ,  ‘కావ్యగుణము’ గలది చమత్కారమని, మరోవిధమైన రామణీయకతని కలదాన్ని ‘హాస్యం’ ము అవుతుందని వివరించారు. చమత్కారం హాస్యానికి సన్నిహితమైందనీ, చమత్కారంలో ఉండే కావ్యగుణము పెరిగితే అది ఉత్తమమైన కవిత్వమవుతుందనీ, చమత్కారం దిగజారి వికృతిని సంతరించుకుంటే అదిహాస్యమవుతుందనీ అన్నారు. మునిమాణిక్యం కలం అంతకుముందు ‘తెలుగు హాస్యం’ అన్న పుస్తకాన్ని వ్రాశారు.

గృహప్రవేశం

కేవలం కథలేకాక, నాటిక ప్రక్రియలో కూడ మునిమాణిక్యం సిద్ధహస్తులని చెప్పడానికి ‘గృహప్రవేశం’ రచనని ఉదాహరించాలి. సహజ సుందర సంభాషణలతో, స్వభావ సిద్ధమైన లలితహాస్యంతో, మిక్కిలి హృదయంగమంగా ఈ నాటికను ప్రస్తావించాలి. వృద్ధుడైన కాంతయ్యకు రెండవపెళ్ళి జరిపించి డబ్బు సంపాదించాలన్న స్వార్థపు వెంకటప్పయ్య, తనబిడ్డను డబ్బుకి కొందామన్న రామారావు స్వార్థాన్ని పాత్రలద్వారా వ్యక్తీకరించిన విధానం ఆకట్టుకుంటుంది.

హాస్యకుసుమావళి

హాస్యాన్ని శక్తి, ఉక్తిల ప్రోద్బలముచేత జనించిన రమణీయ వాక్ వ్యాపారాన్ని ‘జోక్’ అని చెప్పి ఉదాహరణలను పేర్కొనడంలోనే మునిమాణిక్యం వివరించారు. హఠాజ్జనితమైన ఒక మధురోహల భావాల్ని ఎంతో మేథాసంపత్తితో, సరస సంభాషణలతో పరివ్యాప్తమై, మనం నిత్యం చెప్పుకునే ‘జోక్స్’ ని అర్థం చేసుకునే చర్యల నేపథ్యంలో దాగిన హాస్యాన్ని అర్థం చేసుకుని, ఆ చమత్కారాన్ని అర్థం చేసుకుని ఆనందం పొందడం అంత సులభంకాదని, హాస్యకుసుమావళి చెప్పకనే చెబుతుంది. భాషాజ్ణానం, పరిశీలనాశక్తితోపాటు హాస్యరచనలందు అనురక్తి మిళితమై నవ్వగల శక్తి పఠితలకు లభిస్తుంది. పుస్తకాలు చదివి చికాకు రప్పించే స్థితినుంచి బయటపడాలంటే, పొందే హాయితోపాటు చమత్కారాన్ని అర్థంచేసుకునే మేథాసంపత్తి వృద్ధి అవుతుందని పెక్కు విశ్లేషకులు చెప్పారు. ఎప్పుడన్నా, విసుగుగా వున్నా, మనసును కొంచెం తేలిక చేసుకునేందుకు ఉపయోగపడే పుస్తకాల్లో హాస్యకుసుమావళి ఒకటి అని చెప్పి తీరాలి. రకరకాల మాటల్ని, పదాల్ని కలపడం ద్వారా పుట్టుకొచ్చే చమత్కార పదాల్లోంచి హాస్యసృష్టి చేయడంలో ఈ రచన ప్రత్యేకత తెలుస్తుంది. ఉదాహరణకు –

గ్రంథకర్త – సమకాలికులను, స్నేహితులను విసిగించడంలో తృప్తిపడక ముందు తరాలవారిని ఏడ్పించడానికి ప్రయత్నించేవాడు.

బ్రహ్మచారి – అందరికీ తెలిసిన బార్య లేనివాడు, ప్రక్కనుండి నిద్ర లేచేప్పుడు ఏవైపునుంచి అయినా దిగడానికి అవకాశం ఉన్నవాడు.

విసుగు పుట్టించే సంభాషణ – నీవు నిన్ను గురించి మాట్లాడాలని అనుకుంటూంటే అవతలివాడు తనను గురించి ఆపకుండా మాట్లాడటం.

దాంపత్యంలో సరిగమలు – కాంతం కథలు

మన కవిత్రయం లాగానే, మన తెలుగు సాహిత్యంలో హాస్యకవిత్రయంగా పేరుపొందిన భమిడిపాటి, మొక్కపాటి, మునిమాణిక్యం పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నదాంట్లో అతిశయోక్తి లేదు. పరమ ఆహ్లాదకరమైన కుటుంబ ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకొని, చమత్కార భరితంగా వ్రాసిన కథలు – కాంతం కథలు. ఇటు సాంసారిక జ్ణానానికి మునీ, అటు హాస్యానికి మాణిక్యంగా పేరుపొందిన మునిమాణిక్యం హాస్యం యొక్క విశ్వరూపాన్ని సాక్షాత్కరింపజేసిన రచనగా ‘కాంతం కథలు’ను చెప్పుకోవాలి. సంసారపక్షంగా  ఉండే హాస్యాన్ని పెంచి పోషించిన రచనల్లో – సెలయేరు సోయగమే కాని, జలపాతం జోరు ఉండదంటారు. నవ్వు వికృతిలో జనిస్తుందని మాత్రమే తెలిసిన జనానికి, ప్రకృతితో, భావంతో జనించే పద్ధతిని తన రచన చమత్కృతితో చవిచూపిన చతురవచోనిథి. మరో హాస్యరచయిత పోలాప్రగడ సత్యనారాయణమూర్తిగారన్నట్లు “ఆనందంగా నవ్వుకుంటూ విహరించడానికి ఒక రమ్య హాస్య మందిరాన్ని నిర్మించి ఇచ్చిన మాణిక్యం శ్రీ మునిమాణిక్యం” వెక్కిరింపులకు, వెటకారాలకు చోటులేని హాస్యం మునిమాణిక్యం వారిది. దాంపత్య జీవితపు సరస సరాగాల అంచచందాలను మధ్యతరగతి భిత్తికపై నిల్పి, గృహమనే స్వర్గసీమను, ఇల్లాను అనే బంధాన్ని పటిష్టపరచిన రచయితగా మునిమాణిక్యం సృష్టించిన ‘కాంతం’ పాత్ర, కథల్లోని ఆ భాషావిధానం మంజుల మధుర వాక్కులతో నిత్య విహారం చేయడమే కాక, తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోయే పాత్ర ‘కాంతం’. ‘హాస్యవిష్ణువు’గా తనకు తానే చెప్పుకున్న మునిమాణిక్యం కాంతం కథలు లో కోటూ, నేను మా కాంతం, తేనీటి గిన్నెలో తుఫాను, కొత్త ఎత్తు, ప్రయాణం ఎందుకు?, సప్తాహం అన్న కథలు రసభరితంగా దర్శనీయమవుతాయి.

ఒక రసరమ్య సన్నివేశం:

కాంతం, నేనో కబురు చెబుతూను విటావూ? ఒక తమాషా జరిగింది.

ఏమిటి?” అన్నది కాంతం; “నీ విషయమై ఒక కథ వ్రాసాను

ఏమని వ్రాశారు? ఇల్లు ఊడవదనా? లాంతర్లు శుభ్రంగా తుడవదనా? భర్తను గౌరవించదనా?

కొంటె పిల్ల అనీ, అల్లరి జంతువనీ, గోలచేస్తుందనీ వ్రాసి ఉంటారు. బాగా తిట్టారా మీ కసి తీరేటట్టుగా? ఏం వ్రాశారో చెప్పరే?

కథలో కాంతం వంటి మంచి భార్య, సుగుణవతీ, ప్రేయసీ, ప్రపంచంలో లేదని వ్రాశాను అని, చెప్పవద్దూ, చేసిన పాపం? పళంగా ఆమెను చెక్కిలిపైన ఒక చిన్ని ముద్దు పెట్టుకున్నాను

ప్రపంచయుద్ధాలు, రాజకీయ రణగొణధ్వనులు చెలరేగుతున్న కాలంలో కూడ ‘కాంతం కథలు’ ప్రజలకు ఒక ఉల్లాసాన్ని, ఆనందాన్ని అందించాయి. 

“అందం, ఆనందం, రమ్యహార్మ్యాలలోను, మహోన్నత సౌధాలలోను మాత్రమేగాక రసవిహీనమనుకున్న సామాన్య గృహస్థ జీవితంలో కూడా ఉన్నదని చూపడానికి నేను నా జీవితమంతా ప్రయత్నించాను” అని స్వయంగానే చెప్పుకున్నారు. 

“మునిమాణిక్యం రచనల్లోని ప్రత్యేకతలు, విశిష్టతలు మనకు ప్రతీ రచనలోను కనిపిస్తాయి. ఆయన సృష్టించిన వేదికలు, కవితలు అవసరం లేకపోవడమేకాక, క్లిష్టమైన పదజాలం, అందమైన అలంకారాలతో అంతకన్నా పనిలేని మునిమాణిక్యం హాస్యవేదిక, నాటక ప్రదర్శనానికి అవసరమైన రంగస్థలం కేవలం ఓ మధ్యతరగతి కుటుంబీకుని గృహం; ఇలాంటి సాదాసీదా నేపథ్యంలో, సగటు మనిషి భాషలో సామాన్య, అసామాన్య పాఠకులను ఏకరీతిలో అలరించడం ఒక మునిమాణిక్యానికే చెల్లుతుంది; అందుకే ఆయన ‘నవ్వులరాజు’ అయ్యారు” అని ‘హాస్య ప్రపంచం’ మరొక శాస్త్రీయ పరిశోధనాత్మక గ్రంథంలో అన్నారు.

నలభైకి పైగా రచనలు చేసిన మునిమాణిక్యం నరసింహారావుగారు ‘కాంతం మొగుడు’, ‘ఆంధ్రా బారీ పెయిన్’, కథక చక్రవర్తి, హాస్యపరమేశ్వర్, ‘మధుమయఫణితీనామ్ మార్గదర్శీ మహర్షి’, ‘సర్వాంధ్ర జన సాదర పఠిత, సరస కృతి రచనా దురంధరులు’ అన్న బిరుదులూ, సత్కారాలు పొందిన వీరు ఉపాధ్యాయవృత్తితోపాటు, ఆకాశవాణిలో విద్యా విషయక విభాగంలో నిర్మాతగా బాధ్యతలను నెరవేర్చిన హైదరాబాదులో తన 75వ ఏట 4 ఫిబ్రవరి 1973 న స్వర్గస్థులయ్యారు. “ఇంటి ఇల్లాలికి సాహిత్య గౌరవం కల్పించి, సంసారం సాగరం కాదు, అదొక అందాల ఆలయం, ఆనందాల నిలయం అని నిరూపించి  – సంసారంలో చిప్ఫిల్లిన ఆనందాన్ని సార్వజనీనం చేసిన ఘనత మునిమాణిక్యం గారిదే” అన్న కర్నాటి లక్ష్మీనరసయ్యగారి భావన సత్యం, శివం, సుందరం. ‘హాస్యకిరీటి’ మునిమాణిక్యం నరసింహారావు గారి జయంతి సందర్భంగా అక్షరనివాళి సమర్పించాల్సిన సందర్భం.

No comments: