మన ప్రతిభావంతులు
చిత్ర ప్రమదావనంలో నిత్య గుబాళింపుల సహజ ‘కస్తూరి’
హాస్యనటుడు ‘కస్తూరి శివరావు’ (1913 – 1966) – శతజయంతి మార్చ్ 6
బహుముఖప్రతిభాశాలి
ఆనాడు చలనచిత్రరంగంలో అంచెలంచెలుగా
వస్తున్న కథానాయకులతో సరిసమానంగా ఎక్కువ ఫ్రేముల్లో హాస్యనటులు కూడ ప్రత్యక్షమవడం,
చిత్రకథాకథనాల్లో ప్రముఖాంశంగా హాస్యపర్వం చిత్రవిజయానికి దోహదపడేది. తెలుగు సినీమా
తొలిదశలో హాస్యనటులను ప్రస్తావించాలంటే, ప్రప్రథమంగా కస్తూరి శివరావుని, ఆ తర్వాతే
బాలకృష్ణని స్మరించి తీరాలి. మూకీ చిత్రాలకు వ్యాఖ్యాత, గాయకుడు, హాస్యనటుడు, కథానాయకుడు,
నిర్మాత, దర్శకుడుగా అతి స్వల్పకాలంలో అనల్పంగా తనదైన ప్రస్థానాన్ని కొనసాగించిన అతికొద్దిమందివారిలో
‘కస్తూరి శివరావు’ ఒకరు. సీనియర్ శ్రీరంజని చివరిచిత్రంగా, మహాభినేత్రి పి భానుమతితోపాటే
చిత్రరంగ ప్రవేశం చేసిన ‘వరవిక్రయం’(1939) సినీమాతో చిన్న పాత్రలోనైనా తనవాటాన్ని చూపించడంలో
శివరావు విజయాన్ని సాధించాడు. తనదైన ముద్రని
‘చూడామణి’, ‘స్వర్గసీమ’, ‘బాలరాజు’ చిత్రాలద్వారా శివరావు నేటికీ మరువలేని మహాప్రతిభను
ప్రదర్శించాడు. అయితే, 1949 సంవత్సరం శివరావుకి, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఉభయత్రా
స్వర్ణయుగంగా చెప్పుకోవాలి. ఆ ఒక్క సంవత్సరమే
గుణసుందరి కథ, లైలా మజ్ను, రక్షరేఖ, శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి చిత్రాలు శివరావు ప్రతిభారేఖ గగనతలంవైపు
పయనించేలా చేశాయి.
స్వర్గసీమ చిత్రంలో నాటకసంస్థ మేనేజర్
పాత్రతో ప్రేక్షకులకు కనువిందు చేశాడు శివరావు. అయితే, ఏడవ చిత్రంగా ‘బాలరాజు’ ద్వారా
అక్కినేని నాగేశ్వరరావు ప్రియసఖుడుగా శివరావు జీవితమేకాక, అక్కినేని జీవితాన్నికూడా
మార్చివేసింది అనే చెప్పాలి. అప్పటి వరకూ చిన్న వేషాలు వేసిన కస్తూరి శివరావు 'యలమంద' పాత్ర వేసి ఎంతో పేరు తెచ్చుకొన్నారు. సముద్రాల రాఘవాచార్య రచించిన ‘దేవుడయ్యా
దేవుడు’, ‘వరాల కూన నిన్ను’ అనే ‘సోలో’ పాటలను, ‘ఒకరిని నానవేశా’ పాటని నారీమణితో యుగళం,
గాలిపెంచల నరసింహారావుగారి సంగీత దర్శకత్వంలో
పాడడం శివరావు నటనతోపాటు గాత్రంకూడ సౌరభాల్ని అందించిన విధానం ప్రేక్షకుల్లో చిరస్థానాన్ని
పొందాడు.
జీవనప్రస్థానం
తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ స్వస్థలంగా
కస్తూరి శివరావు 6 మార్చి 1913 న జన్మించాడు. మంచిమనిషిగా సంఘంలో గౌరవం తెచ్చుకున్న
శివరావు నాటకాల్లో హాస్య పాత్రలు ధరించి, ప్రేక్షకులనుంచి తొలిసారిగా హాస్యపాత్రకు
అత్యంత ప్రేమాభిమానాల్ని అందుకున్నాడు. చిత్రాల్లోకి ప్రవేశించకముందు, శివరావు మూకీ
చిత్రాలకు కథనవ్యాఖ్యానం అందించి, ప్రేక్షకులకు సినీమాలపట్ల శ్రద్ధాసక్తులను కలిగించాడు.
సరసోక్తులతో, చమత్కారాలతో, తనదైన హాస్యధోరణితో ఉత్సాహభరితంగా వ్యాఖ్యానం అందించి,
‘వ్యాఖ్యాత శివరావు’ అన్న పేరుని సంపాదించుకోవడమేకాదు, అలా ప్రచారం చేస్తే చిత్రాలకు
జనం విపరీతంగా వచ్చేవారట. ప్రేక్షకులు చిత్రం చూస్తూ, వ్యాఖ్యాతని చూడడం సాధ్యం కాకపోవడం,
శివరావుని చూడడానికి వెంటబడేవారట.
‘గిడి గిడి’ సందడి
షేక్సిపియర్ ప్రముఖ ఆంగ్ల నాటకం కింగ్ లియర్ ప్రేరణతో నిర్మితమైన చిత్రం ‘గుణసుందరి కథ’లో - రాజ్యంలోని కుంటీ, గుడ్డీ, మూగ, చెవిటి వాళ్ళనందరినీ రప్పించి వారిలో అన్ని అవలక్షణాలు కల ఒక ముసలి పాత్ర దైవాధీనం పాత్రలో కస్తూరి శివరావు
అద్భుత అభినయంతో అలరించాడు. ‘ఒహరే ఒహరే ఓ ఒహరే బ్రహ్మదేవుడా నీవెంత వంతకారివయ్యా’(శివరావు), చిటి తాళం వేసినంటే చిట్టంటుడు చేసినంటే – (శివరావు, పి.లీల) పాటలు కూడ శివరావునుంచి మన దృష్టిని
మరలించలేనివిధంగా చిత్రించారు. గుణసుందరి కథ లో శివరావే కథానాయకుడు నిజానికి. ఆ చిత్రంలోని ఊతఓదం ‘గిడి గిడి’ తో జనసందోహం చేసిన సందడీ, గోలా ఆకాశం అంటేవి అని పాతచిత్రాభిమానులు తరచు తమ ఆనందానుభూతుల్ని
పంచుకుంటారు. ‘లైలామజ్ణూ’లో
(‘సలామాలేకుం అంతా బాగున్నార మీరంతా బాగున్నారా’ - శివరావు), ‘రక్షరేఖ’లో
(‘చెయ్యి చెయ్యి కలుపుకోర చిన్నారి మావగా చిలకలాంటి - టి. కనకం, శివరావు)( భలే పిల్లా చూశానమ్మా పిల్లంటే పిల్ల కాదు లోకంలో పిల్లలంతా - శివరావు), ‘స్వప్నసుందరి’లో ‘కోపమేలనే నాపైన
నాగిణీ’(శివరావు), ‘పలుకే పిల్లా నాతో’(శివరావు), పాటలద్వారా నటన, గానం
సన్నివేశాలు శివరావుని నటుడిగా, గాయకుడుగా అవిభాజ్య ధోరణిలో సంయుక్తంగా
మెప్పించాయి. శివరావు నటించిన ‘ముగ్గురు మరాఠీలు’, ‘పాండురంగమహాత్మ్యం’,
‘అప్పుచేసి పప్పుకూడు’,చిత్రాల్లోని పాత్రలు ప్రత్యేక స్థాంనాన్ని అలంకరించాయి.
‘శ్రీలక్ష్మమ్మ కథ’లో శివరావు పాడిన పాటలో అపస్వరాలు చోటుచేసుకున్నాయనీ, మాటల్లో
కూడా ధ్వనించరానివి ధ్వనించాయన్న విమర్శలు ఎక్కువగా రావడం జరిగాయి. రమారమి
‘హాస్యం’ పేరున నలుగురిలో పలకరాని పదాలు చోటుచేసుకోవడం ఈ చిత్రంలోనే శ్రీకారం
చుట్టబడి, ఇంతింతై అపహాస్యం మరింతలుగా విస్తరించి, నేటికి అందరూ చెప్పుకుంటున్న
‘హాస్యనటవటవృక్షం’గా ఆకాశాన్నంటింది. దేదీప్యమానమైన హాస్యదీపం అందించిన కాంతిరేఖలు
హాస్యచక్రవర్తిగా కొంతకాలమైనా కస్తూరి శివరావుని చిత్ర ప్రమదావనం
(నందనోద్యానవనం)లో గుబాళింపుల ‘కస్తూరి’గా ప్రఖ్యాతునిగా నిలబెట్టింది. ఈ సహజ
వికటనట కస్తూరి కాపీకొట్టలేని దస్తూరిగా నిత్యనూతనంగానే చిత్రరంగంనుంచి
నిష్క్రమించాడు.
స్వంత
చిత్ర నిర్మాణం – మరపురాని మెరుపు! మరువలేని మలుపు!
ఆనాటి ప్రముఖ దర్శకుడు సి పుల్లయ్య దగ్గర సహాయకునిగా
పనిచేసిన అనుభవంతో, హాస్యనటుడు, గాయకుడు, కథానాయకుడుగా సమాంతరంగా రాణిస్తున్న
శివరావు ఆలోచనలు స్వంత చిత్రనిర్మాణంవైపు నడవడం ప్రారంభించాయి. ఫలితంగా, ప్రముఖ
రచయిత తాపీ ధర్మారావు చిత్రానువాదం-సంభాషణలతో, శివరావు నిర్మాణ దర్శకత్వ బాధ్యతలను
చేపట్టి ‘పరమానంద శిష్యుల కథ (1950)’ చిత్రాన్ని ‘ఎలైడ్ ప్రొడక్షన్స్’ బానర్ మీద
అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడు(చంద్రసేనుడు)గా, లక్ష్మీరాజ్యం
కథానాయిక(లీలావతి)గా, సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వంలో వచ్చిన చిత్రంలో – ‘ఏదిరా లక్ష్మణ సీతా పర్ణశాల లేదు (శివరావు బృందం)’, ‘రంగారంగేళి లోకం మతలబు – శివరావు) పాటల ద్వారా గాత్రాన్ని కూడ అందించిన
చిత్రం హాస్యనటులతో, హేమ పాత్ర ద్వారా గిరిజని ప్రవేశపెట్టడం జరిగింది. కాని స్వంత
చిత్రనిర్మాణం చేదు అనుభవాన్ని మిగిల్చింది. ప్రముఖ హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య
ఈ చిత్రంలో నటించడం, క్రమేపీ రేలంగి పుంజుకోవడంతో శివరావు చిత్రరంగంనుంచి పలచన కావడం
జరిగిపోయింది. చిత్రరంగంతోపాటు శివరాజు జీవితంలో కూడ మార్పులు రావడం ప్రారంభమయ్యాయి.
తగ్గిపోయిన తన జోరుని తానే విశ్లేషించుకుని, రాజీపడడం కూడ జరిగింది. "హాస్యనటులకి ఎప్పుడూ వుండేదే ఇది. ఒక దశలో మాత్రం గొప్పగా వెలిగిపోతారు" అని తెలిసినవాళ్లు అంటారు. "అంత బతుకు బతికిన వాడిని, ఇప్పుడు దేహీ అనవలసిన అవసరం లేదు నాకు!" అన్న అహంభావపూరిత ఆభిజాత్యం ఆవరించిన వైనంతో మొండిపట్టుగా కూర్చోవడం - సినిమా నిర్మాతలకి నచ్చలేదు. ఈ దుస్థితికి తోడు వ్యసనాలకి బానిసకావడం,
సినిమాలల్లో అవకాశాలను దెబ్బ తీసింది. చిత్రరంగ ప్రవేశానికి ముందు ‘సక్కుబాయి’(కాశీపతి),
చింతామణి(సుబ్బిసెట్టి), చాలాపేరు తెచ్చిపెత్తిన నాటకానుభవం చిత్రజీవితం తర్వాత జీవనార్థం తిరిగి నాటకాల్లో నటించేలా చేసింది. శివరావు చిత్రరంగంలో తనవంతు సేవలుగా ‘జూనియర్
ఆర్టిష్ట్స్ సంఘం’ నెలకొల్పడం, మద్రాసు సినీ వర్కర్స్ ఎసోసియేషన్’కు సహాయ కార్యదర్శిగా
సేవలనందించడం జరిగింది.
‘బ్యూక్’ కారు నుంచి తిరిగి ‘సైకిలు’ ప్రయాణం
రాజసానికి, దర్జాకి ఆరోజుల్లో
సాక్షి సంతకంగా చిత్రరంగంలోని స్థాయీపరులందరూ శివరావుతో సహా ‘బ్యూక్’ కార్లలోనే
తిరిగేవారు. మద్రాసు చలనచిత్ర మంత్రనగరిలో భాగంగా విరాజిల్లే పాండీబజార్ ప్రాంతంలో
ఈ కారు కనిపిస్తే, వెర్రి అభిమానులు కారువెంట అదేపనిగా పరుగులెత్తేవారు.
ప్రతిభతోపాటు ప్రభ కూడా తగ్గే రోజులు రావడంతో కారులూ కనిపించవు, వెంటబడి పెట్టే
పరుగులూ కానరావు; అదే జరిగింది శివరావు విషయంలో కూడా. చివరి దశలో సినిమాల్లో అవకాశాలు రాకపోవడం, శివరావు మీద అభిమానముతో ఎన్.టి.రామారావు గారు పలు సినిమాలల్లో అవకాశాలు కల్పించారు.
జీవితాంత వేదాంతం
జీవితానుభవంనుంచి నేర్చుకున్న
పాఠాలు మనిషిని వేదాంతుని చేస్తాయన్న సత్యం శివరావు జీవితంలో నిజమై కూర్చుంది. తన
మాటల్లోనే "మొదటి రోజుల్లో మద్రాసులో సైకిలు తొక్కుతూ తిరిగేవాడ్నీ. తర్వాత కార్లమీద తిరిగాను. ఇప్పుడు మళ్ళీ సైకిలు మీదనే తిరుగుతున్నాను. ఒకప్పుడు మా ఇంటి పేరైన కస్తూరి వాసనే నిత్యం గుప్పుమనేది. ఇప్పుడు ఇంటిపేరు కస్తూరి వారు - ఇంట్లో గబ్బిలాల కంపు"
అని, తన మీద తనే చమత్కారబాణం సంధించుకోవడమేకాక, "తప్పులేదు, ఆకాశంలో వెలిగే నక్షత్రాల వయసు కొంతకాలమే ! అందుకే సినిమా నటీ నటుల్ని నక్షత్రాలతో పోల్చారు. నేనూ ఆత్మాభిమానం వున్నవాడ్నే. ఐతేనేం - జీవితం మిట్ట పల్లాలతో వున్నప్పుడు ఇలాంటివి సహజం" అని వేదాంతిలా మాట్లాడేవాడు ఆయన.
అంతిమ ప్రయాణం
1966లో అతను ఒక నాటకంలో వేషం వెయ్యడానికి తెనాలి వెళ్ళి, అక్కడే రైల్వే స్టేషన్ లో మరణించడం, ప్రయాణీకుడు శివరావు మృతదేహాన్ని గుర్తుపట్టడం యాదృచ్చికంగా జరిగింది. బ్యూక్ కారులోని దర్జా, ఠీవినుంచి కారు డిక్కీలో, అనేక అవాంతరపు ప్రయాణాలను కావించుకుంటూ మూడు రోజులపాటు ప్రయాణం చేసి శివరావు మృతదేహం మద్రాసులోని ఇల్లు చేరుకుంది. యావత్తు సినిమా పరిశ్రమకూ మరణ వార్త తెలిసినా, చిత్రపరిశ్రమ చిత్రాతిచిత్ర విచిత్రంగానే ప్రవర్తిస్తుందన్న
ధోరణిని నిరూపిస్తూ, వారి వారి విజ్ణత, ప్రాధాన్యతలు ‘చివరిచూపు’ లకు రాకుండా చేశాయి. వేలాదిమంది అభిమానుల్ని వెంట పరుగెత్తించుకోవడం, నిర్మాతలను ఇంటి గుమ్మం ముందు గంటలు గంటలపాటు నిరీక్షీంప చేసుకోవడం జరిగిన శివరావు అంతిమయాత్ర ఎవరి తోడూ లేకుండా దాదాపు ఒంటరిగానే వెళ్ళవలసి వచ్చిందని చరిత్ర చెబుతున్న సాక్ష్యం. "అంతటిస్థితినుంచి, ఎంతటి స్థితికి జారిపోయాడో పాపం!"
అని జాలిపడుతూ, వెంట వెళ్ళిన ఆ ఏడుగురి చేతులమీదుగా కస్తూరి శివరావుకి
అంత్యక్రియలు జరిగాయి. ఆయన ఆత్మ శాంతించే వుంటుంది.
కస్తూరి శివరావు శతజయంతి
(మార్చి 6, 1913) సందర్భంగా యావదాంధ్రదేశం, తెలుగుజాతి ఘననివాళిని సమర్పించవలసిన తరుణం
ఈ సమయం, సందర్భం.

No comments:
Post a Comment