Saturday, February 2, 2013

కవి మార్తాండ - ‘నోరి నరసింహశాస్త్రి’




కవి మార్తాండ - ‘నోరి నరసింహశాస్త్రి’ (1900 – 1979)

(  ఫిబ్రవరి 6 జయంతి సందర్భంగా
 

భావ కవితా ప్రతిభామూర్తి

తెలుగు కవిత్వ ధోరణుల్లోభావ కవిత్వంఒక ముఖ్య పరిణామంగా పరిణత చెంది బహువిధాల, ప్రభావ ప్రేరణల్ని అందించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆంధ్ర భాషా సాహిత్యాలను ఆధునిక రీతుల్లో అభివృద్ధి చేయడానికిఆంధ్ర సాహిత్య పరిషత్తుకలసిరాదని తేలుతున్న రోజుల్లో (1919-1924), నూతనోత్సాహంతో రచనలు చేద్దామనుకొన్న సాహితీపరులందరూ ఒక నూతన కూటమిగా ఏర్పడిన వారిలో నోరి నరసింహశాస్త్రిగారు ఒకరు. ఆదిలో ఈ మిత్రమండలి గ్రాంథిక భాషావాదులే అయినా, తల్లావఝ్ఝుల శివశంకరశాస్త్రిలాంటివారు వ్యవహార భాషలో రచనలు చేయడం రసవంతంగా ఉంటుందనే నిశ్చయానికి వచ్చి, చింతా దీక్షితులు నాయకత్వంలో అందరినీ  ఒప్పించి వాడుకభాషవైపు మళ్ళించడం మరొక ప్రముఖ పరిణామంగా భావించబడిన ప్రత్యేక కాలం. ఫలితంగా 1919లో ‘సాహితీసమితి’ ఆవిర్భానికి దారితీసింది. 20 శ. నాటి జమీందారీ యుగపు చివరి దశాబ్దాలలో ఆధునికాంధ్ర సాహిత్యానికి మైనారిటీలోకి వెళుతున్నప్పుడు భావ కవిత్వం గజ్జెకట్టి రంగప్రవేశం చేయడం జరిగింది. ఆధునిక కవిత్వానికి ముఖ్యంగా భావకవిత్వానికి ఆంగ్ల సాహిత్య పరిచయం వల్లనే ప్రోద్బలం వచ్చిందన్నది కూడ పలువురి భావన. ‘ఈ కాలపు కవులు నిక్కముగ స్వతంత్రులు’  అన్న కట్టమంచి రామలింగారెడ్డిగారి మాటలతో ఏకీభవిస్తూ స్వతంత్ర భావ పోకడలను పలువురు మెచ్చుకోవడం, భావకవులే ‘సంకెలలో సంగీతమా? కట్టుబాటులో కవిత్వమా?” అంటూ తమ స్వాతంత్ర్యాన్ని 1922లో ప్రకటించుకోవడం తెలుగు కవిత్వపు పరిణామ దశలో ఒక అనూహ్యమైన మెరుపు, మలుపు. అలా స్వతంత్రించుకున్న భావకవిత్వపు ప్రథమశ్రేణిలోని ప్రతిభావంతుల జాబితాలో ‘నోరి నరసింహశాస్త్రి’గారు ఒకరు. వీరి కవిత్వపు సమగ్ర దర్శనం వల్లనే భావకవిత్వపు స్వభావ ప్రభావాలను అంచనా వేయడం సాధ్యమయింది అన్నది కూడ పలువురి అభిప్రాయం. తెలుగు సాహితీపరులందరికీ, గ్రాంథికాంధ్రాన్ని సంరక్షించడమే ఆశయంగా గ్రాంథిక, వ్యవహారిక భాషావాదులు సభ్యులుగా  పిఠాపురం మహారాజావారి ఆదరాభిమానాలతో, జయంతి రామయ్యపంతులుగారు 1911లో సంస్థాపించిన సంస్థ ‘నవ్యసాహిత్య పరిషత్తు’ సంస్థలో నోరి నరసింహశాస్త్రిగారు 1936-1942 మధ్యకాలంలో అనేక హోదాల్లో సేవలనందించడం జరిగింది.

తల్లిదండ్రుల ప్రతిభా వారసత్వం

‘నల్లనయ్య’, ‘గానుగచెట్టు’, ‘మరణానంతర జీవితం’ లాంటి రచనలను అందించిన ప్రతిభావంత కవి నోరి హనుమచ్చాస్త్రిగారి తనయుడే నోరి నరసింహశాస్త్రిగారు. హనుమచ్చాస్త్రి, మహాలక్ష్మమ్మలకు ‘వికారి’ నామ సంవత్సరం ‘మాఘ శుద్ధ సప్తమి’ అంటే ‘రథసప్తమి’ పర్వదినాన 6 ఫిబ్రవరి 1900 న త్రిలింగ దేశపు కంఠాహారమైన గుంటూరు లో నరసింహశాస్త్రిగారు జన్మించారు. నిరాడంబరత, నిర్మలమనస్సు, సత్యస్నేహపరాయణత, నిర్భయత్వం, విశ్వశ్రేయోవాంచ, పరోపకార ప్రవృత్తి శాస్త్రి గారి వ్యక్తిత్వాన్ని పెంపొందింపచేసిన సల్లక్షణాలు.  తండ్రినుంచి శాస్త్ర సాహిత్య పరంపర, తల్లినుంచి సాంగావేదాధ్యయన సంపన్నతలని పుణికిపుచ్చుకున్న పుంభావ సరస్వతి కవిసమ్రాట్ నోరి నరసింహశాస్త్రిగారు.
 

చారిత్రక నవలా శిరోమణి

సప్రామాణిక చారిత్రక నవలా రచనా విధానాన్ని ఒక యోగ యాగ సమ్మేళన ప్రక్రియగా శాస్త్రిగారు రచించిన చారిత్రక నవలల్లో, నారాయణభట్టు,  రుద్రమదేవి, వాఘిరా, మల్లారెడ్డి, కవిద్వయం, కవిసార్వభౌముడు, ధూర్జటి ప్రముఖమైనవిగా నేటికీ సాహితీపిపాసకులను  రంజిల్లజేస్తున్నాయి.  
 

శాస్త్రిగారు చారిత్రక నవలలే కాకుండా కవిత్వము, పద్యగేయ నాటికలు, కథలు, అసంఖ్యాకమైన వ్యాసాలు, సమీక్షలతోపాటు శ్రీనారాయణ తీర్థులవారి ‘శ్రీకృష్ణలీలాతరంగిణి’ ని దేవనాగరలిపిలో, ఆంగ్లంలో సంపాదకత్వం వహించారు. శాస్త్రిగారి బహుముఖీనమైన ప్రతిభను, ‘నోరి పద్యగేయనాటికలు’ గ్రంథానికి ముందుమాటలో ప్రస్తావించబడిన ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారి అభిప్రాయం – “శ్రీ నరసింహ శాస్త్రిగారు ఆంధ్ర సరస్వతికి ఒనరించిన వరివస్య అపరితమైనది; వారు కావ్యములు వ్రాసిరి; సమీక్షలు కావించిరి; గ్రంథ సంపాదన మొనరించి వానిని అమూల్యములైన పీఠికలతో అలంకరించిరి; నాటికా రచనలో శాస్త్రిగారు సిద్ధహస్తులు; వారి నాటికలు కొన్ని కేవలము వచనరూపములు, కొన్ని కేవలం గేయ రూపములు; కొన్ని గేయమిశ్రవచనరూపములు. ఈ నాటికలన్నియూ ఒక ఉన్నతాదర్శమో, యుత్తమోపదేశమో దృష్టియందుంచుకొని వ్రాయబడినట్టివి” అని అవధానిగారు విశ్లేషించారు. శాస్త్రిగారు రాసిన పద్యగేయ నాటికల్లో, ప్రముఖంగా పూజావనం, ఆత్మస్తుతి, కన్యాకుమారి, గజ్జెల మొలతాడు, వరాగమనము, దాగుడుమూత నాటికలను ప్రస్తావించక తప్పదు. శ్రీ శివశంకరశాస్త్రిగారిలాగ, నోరివారు కూడ అధికంగా పద్యనాటికల్ని వ్రాసేందుకు మక్కువ చూపించేవారని తెలుస్తోంది. పద్యనాటికలన్నీ దేనికదే అద్భుతమైన రసగుళికలుగా రచించినవేకాక, కవితావేశముతో కూడిన తన్మయత్వము లేనిదే రచనకు పూనుకొనరని వారి పద్యనాటికలను ఆధ్యయనం చేసిన వారికి విశదమవుతుంది.

“శిష్టాచార సంపదలో నోరివారి వంశం పేరు మోసినది; అద్యతనాంధ్రకవులలో సంప్రదాయసిద్ధమైన రచన సాగించుచున్నారు; వీరి కలమునకు బహుముఖములుగా సాగునేర్పు కలదని స్పష్టపడుచున్నది” అని సుప్రసిద్ధ రచయిత మథునాపంతుల సత్యనారాయణశాస్త్రిగారు తన ‘ఆంధ్రరచయితలు’ అన్న 113 కవుల సాహిత్య జీవిత చిత్రణలో నోరి సుబ్రహ్మణ్యశాస్త్రిగారి పరిచయాన్ని పొందుపరచారు. మథునాపంతుల వారు వివరించినట్లు నోరి వారికి కథారచనలోనూ అత్యంత శ్రద్ధవంతమైన పద్ధతిని అనుసరించారనే చెప్పాలి. ప్రముఖ కథల్లో, “గులాబిపువ్వు, శ్యామసుందరుడు, గానభంగము, చేసుకున్నవారికి చేసుకున్నంత” యిత్యాది కథలు ఆనాటి సాహితి, సఖి, భారతి, ఆంధ్రవార్షిక సంచికలలో ప్రచురించడం జరగడం ఓ ప్రత్యేకతగా భావించేవారట.

నోరి నరసింహశాస్త్రిగారి కలంలోంచి వచ్చిన మరో అద్భుతం – శ్రీదేవీ భాగవతం;  పరిపూర్ణ పరిణతతోపాటు హృదయంగమశైలితో వెలిసిన ఆంధ్రీకరణం గ్రంథం కృతి సమర్పణలో భాగంగా వివరించిన పద్యం సాహితీపరులందరికీ నిత్యం స్మరణీయం;

“కోరను దీనికై ధనము, కోరను నదృశ్యమైన గాని, నే

గోరను గౌరవాంకములు, కోరను సత్పథ జన్మ భాగ్యముల్

కోరను జన్మ మోక్షము, కోరున దొక్కటె సుస్థిరంబులై

శ్రీరమణీయ పాద సరసీరుహముల్ విలసిల్లుటన్ మదిన్”

అన్న పద్యం శాస్త్రిగారి వ్యక్తిత్వాన్ని సూచిస్తుందని ఆయన కుమారుడు, సుప్రసిద్ధ రచయిత శ్రీ నోరి సుబ్రహ్మణ్యశాస్త్ర్రిగారు “మా నాన్నగారు” (సాహితీప్రముఖుల జీవిత విధానాలు – డా.ద్వానాశాస్త్రి) అన్న వ్యాసంలో వివరించారు.

శాస్త్రిగారు కవిత్వంలో కూడ తనదైన ప్రతిభను ప్రదర్శించారు. ‘తల్లి’ అన్న ఖండికలో – ‘విశ్వనాథ’వారన్నట్లు తనదైన అనుభూతి తనదిగాన అని శాస్త్రిగారు నిరూపించారు.

తల్లి! అసహాయవై నీవు ధరణిమీద / పడితి వెప్పుడు నాదుగర్భంబు జీల్చి

ప్రకృతియంతయు నూత్నశోభల వెలింగె / ప్రాణనాథుడు నా నిజప్రాణమయ్యె.

          ఎప్పుడేడ్చితి వీవు నోరెత్తి, యెడద / తత్ క్షణంబ కృపాక్షీరధార లుబికె

          చిన్ని నవ్వెప్డు నీమూర్తి చిందులాడి / హృదయము కలంచె, ఎరిగితి ప్రేమబాధ.

చిగురు పెదవుల ముద్దులు చిల్కనెపుడు / ‘తల్లి’ యని పిల్చి నన్నీవు దరిసినావొ

అపుడు శృతమయ్యె సృష్టి రహస్యమెల్ల / ‘తల్లి’ యని మారుపిల్చి నిస్తబ్ధనైతి.

          ఆత్మయేకాక నాదు దేహమ్ము కూడ / కొల్లగొట్టి మాధుర్యంపు గుప్పవగుచు

          తల్లి! నిశ్చింత ననువీడి తరలిపోతె? / ‘తల్లి’ యను నాదు ఆర్తనాదమె మిగిల్చి.

పండితవంశంలో జన్మించి, న్యాయవాది వృత్తిగా స్వీకరించిన నోరి నరసింహశాస్త్రిగారి ప్రవృత్తి సాహిత్యం అవడమే కాక, రచనల్లో తలమానికంగా చెప్పబడుతున్నది  ‘శ్రీమద్భగవద్ గీతారహస్యము’. మహారాష్ట్ర భాషలో లోకమాన్య బాలగంగాధర తిలక్ కృతికి ఆంధ్రీకరణం. భగవద్గీత భిన్న కర్మమార్గాల సంపుటీకరణమని లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వంటి మహనీయులు భావించడం, గీతాదర్శాలను అనుష్ఠించి తరించిన కర్మయోగి తిలక్ మహారాష్ట్ర భాషలో సమాజానికందించిన గీతారహస్య గ్రంథానికి శాస్త్రిగారి ఆంధ్రానువాదాన్ని ఆస్తికజనులకు అందించడం తెలుగువారికీ, శాస్త్రిగారికీ లభించిన అపూర్వావకాశం, అదృష్టంగా భావించక తప్పదు. తమ అనుభవాన్ని తాత్త్విక సంపదను రంగరించి లోకమాన్యుడు అందించిన ఈ గీతారహస్యం అఖిలాస్తిక జనాదరణ పొందిందన్నది చరిత్ర చెప్పిన సాక్ష్యం. ఈ రచనతో శాస్త్రిగారు, ఆంధ్రభక్తజనావళి కూడ ధన్యులవడం జరిగింది.

శ్రీ శృంగేరీ విరూపాక్ష పీఠాథీశ్వరులు జగద్గురు శ్రీ కల్యాణానంద భారతీమాంతాచార్య దీక్షాగురువుగా పేరొంది, ‘విజ్ణానానందనాథ’ దీక్షానామంతో పేరుపొందిన శాస్త్రిగారు సంస్కృతాంధ్ర కర్ణాటక భాషల్లో పాండిత్యం అనేక ఆధ్యాత్మిక రచనలకు ఉపకరించింది.  ‘కవిసమ్రాట్టు’(1947) బిరుదుతోపాటు, రేపల్లె నగర పుర ప్రముఖుల సమక్షంలో జరిగిన సన్మానసభలో హయగ్రీవవిద్యాపీఠంవారిచే ‘కవి మార్తాండ’ (1959) బిరుదులను పొందిన వీరు 3 జనవరి 1978 న శ్రీదేవీసాయుజ్యం పొందారు.  సౌజన్యానికి సంకేతంగా, ఆప్యాయతకు ఆమ్రేడితంగా సాక్షీభూతంగా నిలిచిన నోరి నరసింహశాస్త్రిగారు తెలుగుసాహిత్యపుటల్లో చిరస్థాయిగా సుస్థిరస్థానం పొందుతూనేవుంటారు. వీరి సాహిత్యసౌరభాల్ని కుమారుడు నోరి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ‘నోరి నరసింహశాస్త్రి చారిటబుల్ ట్రష్టు’ ద్వారా సమాజానికి అందిస్తున్న వైనం అభినందనీయం.

No comments: