Saturday, February 2, 2013

వట్టికోట ఆళ్వారు స్వామి



వట్టికోట ఆళ్వారు స్వామి (1915-1961) వర్థంతి – 4 ఫిబ్రవరి
 

సమర పోరాటం -  సాహిత్య స్ఫూర్తిమంతం

“ఇప్పటికీ ఇండియా అసమానతల దేశమే. తెలంగాణా ఎప్పటికీ అందులోని ప్రదేశమే. దేశమంటే మనుషులు, ప్రజలు. ప్రజలే తమ చరిత్రను తాను సృష్టించుకొన్నట్లు ప్రజలే తమ సాహిత్యాలను సృష్టించుకొంటారు. ఆరాటం నుంచి పోరాటం దాకా సాగిన విప్లవ తెలంగాణా తన చరిత్రను తాను సృష్టించుకొంటూ తన సాహిత్యాన్ని తాను విరచించుకొంది. అందులో వివిధ వర్గాల సాజాత్య వైజాత్యాలు స్ఫుటంగా వెల్లడయినాయి. పామరులు పాడుకున్న నోటిపాటలు, కల్పనాశక్తిగల గ్రామీణకవులు కైగట్టి కాగితాల కెక్కించిన గేయాలూ, ప్రజలు కష్టసుఖాలను స్పందించి అభ్యుదయ దృక్పథంతో రచనలు చేసినవారి కావ్యాలూ, విప్లవ తెలంగాణా విరచించుకొన్న వీర గీతాలకు సజీవ స్వరూపాలు. ఆ సాహిత్యాన్ని నెమరు వేసుకోవడం పుష్టికీ, సంతుష్టికీ అవసరం.” అని “తెలంగాణా సమర సాహిత్యం” అన్న అధ్యాయంలో ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ గ్రంథంలో అభ్యుదయ కవి ఆరుద్ర తన ప్రస్తావనలో పేర్కొన్నారు.  తెలంగాణా పోరాటంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాల్గొని, పోరాట స్ఫూర్తితో వివిధ సాహిత్య ప్రక్రియల ద్వారా సమర సాహిత్యాన్ని ప్రజలకు అందజేసినవారు ఎందరో మహానుభావులు! కవిత్వం, గేయం, నాటకం, కథ, నవలాది ప్రక్రియలద్వారా తెలంగాణా జీవితాన్ని సహజంగా చిత్రించడం జరిగింది. తెలంగాణా పోరాటం గురించి రాసిన మొట్టమొదటి నవల ‘మృత్యుంజయులు’ (1946) రచయిత బొల్లిముంత శివరామకృష్ణది అయితే, ఉత్తరోత్తరా ప్రముఖంగా ‘ప్రజల మనిషి’, ‘గంగు’ నవలల ద్వారా ప్రభావితం కావించిన వారిలో తెలంగాణా వైతాళికుడు అని పేరుపొందిన వట్టికోట ఆళ్వారు స్వామి ఒకరు.

సిసలైన ప్రజల మనిషి

ఆళ్వారు స్వామి తెలంగాణా ప్రాంతం నల్గొండ జిల్లాలోని నిరుపేద వైష్ణవ కుటుంబంలో 1 నవంబర్ 1915 న జన్మించి, స్వయంకృషితో విద్యావంతుడై తెలంగాణా ఉద్యమాల్లో పాల్గొని జైలుకెళ్ళడం జరిగింది. కమ్యూనిస్టు పక్షంలో చేరిన స్వామి తన అనుభవాలను వాస్తవ చిత్రీకరణంతో రచించిన ‘ప్రజల మనిషి’ నవలలో తెలంగాణా వాతావరణం, ప్రజాజీవితాన్ని ప్రతిబింబించడంలో సార్థకులయ్యారు. 1952-55 మధ్య కాలంలో రచించిన ‘ప్రజల మనిషి’ లో నిజాం క్రూర నిరంకుశ దోపిడీ పాలన, గ్రామాల్లో పెత్తందార్ల చేత సామాన్య ప్రజానీకం సామాజికంగా ఆర్థికంగా పీడింపబడి నిస్సహాయపు బ్రతుకులను తిరుగుబాటుతనంతో వెళ్ళదీసిన వైనం,  కులమతాలు మానవ పురోగతికి అడ్డుగోడగా నిలుస్తాయన్న సత్యంతోపాటు ఆ బ్రతుకుల్లో క్రమేపీ మేల్కొన్న చైతన్యం, ప్రముఖంగా ఆర్థిక చైతన్యపు ధోరణుల్ని, స్పష్టంగా విశ్లేషించడం కానవస్తుంది.

నిక్కమైన నీలం

20 శ. లోని అభ్యుదయ పథగాములైన కవులను మూడు తెగలుగా విభాగించవచ్చని వివరిస్తూ, అభినవ పోతన వానమామలై వరదాచార్యులుగారు, ‘తెలంగాణా కవులు’ అన్న వ్యాసంలో గేయకవులు, పద్యకవులు, గేయపద్యకవులు అని పేర్కొంటూ, గేయకవులుగా – కాళోజి, పొట్లపల్లి, వెల్దుర్తి, ఆళ్వారుస్వామి మొదలగువారు గేయకవులని ప్రస్తావించడం, ఆళ్వారుస్వామిని గేయకవిగా కూడ ప్రతిభను చెప్పక చెప్పారు. ఈ సందర్భంలో స్వామి గురించి ప్రస్తావిస్తూ, వానమామలై వారు “అధునాతనులైన కవులలో చాలామంది యువకులు సాహిత్యోద్యమాల్లో పాల్గొని, ఉత్సాహంగా రచనలు చేస్తున్నారు; వ్రాసింది తక్కువైనా విలువగల రచనలుగా చెప్పడంలో, ఆళ్వారుస్వామిగారు ఎక్కువగా వ్రాయకపోయినా, వ్రాసిన కొన్నిగేయాలు అపురూపంగా ఉంటా”యని వివరిస్తూ, యావద్భారత ప్రశస్తి గాంచిన ‘సాలార్జంగ్ కళానిలయము’ను గురించి స్వామి వ్రాసిన గేయాన్ని ఉదాహరించారు.

సాలార్జంగ్ కళానిలయం, చాటిందొక శాశ్వతసత్యం

కనకానకు కట్టెపుల్లకు, కోహినూరు వజ్రానకు

కొండపల్లి బొమ్మకు, ఇటలీ పాలరాతికి

ఇంటిముందరి చొప్పబెండుకు, కళలలో భేదం లేదని

నూలుపోగు చేతబట్టి, రంగుకుంచె నడిపించి

సుత్తెకు సుందరత నేర్చి, ప్రకృతినంత పట్టితెచ్చి

పందిట్లో నిలబెట్టి, నూర్జహాన్ని చూపెదనని

పట్టుదల పరిశీలన, ప్రధానాశయాలైన

సాధకునకు తలఒగ్గని సమస్యలే లేవని” చాటిందొక శాశ్వత సత్యమని చెప్పుకున్నారని వివరించారు.

అంతేకాక, ‘నిక్కమైన నీలమొక్కటి చాలు” అన్నట్లు కొన్ని రచనలయిన ఇట్లు సరసంగా ఉండాలిగాని, గణబద్దమగు తుక్కు అక్షరబద్ధమగు చెత్తగూర్చి సారస్వతమునకు శిరోభారంగా వ్రాస్తే ప్రయోజనము లేద’ని విమర్శించారు.

వట్టికోట వారి రచనలను ప్రముఖంగా ప్రస్తావించాలంటే – ‘జైలులోపల’ (కథలు), ‘ప్రజలమనిషి’ (తెలంగాణా తొలి నవల), ఆత్మకథలోని ఘట్టాలను చెప్పుకున్నట్లనిపించే ‘రామప్ప రభస’, తెలంగాణా (వ్యాస సంకలనం)తోపాటు అసంపూర్తి నవల ‘గంగు’ని విశ్లేషించక తప్పదు.

ప్రజల మనిషి – తెలంగాణా తొలి నవల/నవలాకారుడిగా ఆళ్వారుస్వామిని సత్యవంతమైన ప్రజలమనిషి, ప్రజోద్యమాల్లో పాల్గొన్న మనిషి, స్వాతంత్ర్య సమర యోధుడుగా ‘ప్రజల మనిషి’ నవలను సహజత్వంతో రూపుదిద్దడమే కాక, తెలంగాణా జనజీవనంతోపాటు తెలంగాణా పలుకు తీయదనంతో ప్రజాజీవనచిత్రణ కావించారు. స్వల్ప కథతో ఉద్యమ పూరిత సాంఘిక చరిత్రను రచించారు. ప్రథాన పాత్ర ‘కంఠీరవ’ రచయిత పక్షానే నిలిచినట్లనిపిస్తుంది. దొరల పెత్తనాన్ని, ఆ పెత్తనంతో నలిగిపోయిన జనసామాన్యం కడగండ్లనీ చిత్రించిన తీరు చదువరులను ఉత్కంఠతని రేకెత్తిస్తుంది.

ప్రజల మనిషి నవలలో కంఠీరవం పాత్రోచిత సంభాషణలు ఆలోచనలను రేకెత్తిస్తాయి.

ఇస్లాం అంటే శాంతి . శాంతిని కోరి సత్యానికి పోటీపడే ఏమతమైనా నాకు సమ్మతమే ! కాని మీరు , మీ మతాన్ని శాంతికి ద్రోహం చేసేదిగా మార్చినారు “.”కులాల పేర, మతాల పేర ప్రారంభమైన అడ్దుగోడలు క్రమంగా బలమైన అడ్డంకులుగా తయారైనాయి . దాంతో మనలో ఐక్యత నశించింది

జైలులోపల (కథలు) – తాను జైలు జీవితాన్ని అనుభవిస్తూ, జైలు జీవితాన్ని అనుభవించే వారి జీవితాల నేపథ్యాన్ని కథలుగా మలచిన తీరు అపురూపం. మనుషుల మీద పరిసరాల ప్రభావం తప్పక వుంటుందని నమ్మిన వట్టికోటలో ఈ కథలద్వారా మానవతావాది ఆవిష్కరణ జరిగింది. స్త్రీ స్వేచ్చ, వంటింటి చాకిరీ లాంటి భావజాలం మానవతా దృక్పథంలోంచి మెరిసిన అంశాలే అని చెప్పక తప్పదు. స్త్రీ స్వేచ్చ ఒంటరి పోరాటానికి, పురుష ద్వేషానికి దారితీయకూడదన్నది స్వామి నిశ్చితాభిప్రాయం. స్త్రీవాదాన్ని ఆనాడే దృవీకరించిన అద్వితీయుడు, అపురూపవ్యక్తి వట్టికోట. తెలుగు సాహిత్యానికి అపురూపమైన గౌరవాన్ని సంపాదించిపెట్టిన ‘జైలులోపల’ కథల్లో భాష, శైలి ఉత్కృష్టమై, కథనకుతూహలాన్ని కలిగిస్తాయి.

రామప్ప రభస -  రామప్ప ద్వారా ఆత్మకథనాన్ని వివరింప చేసిన ప్రయత్నం సఫలీకృతమయింది. స్వాతంత్ర్య సమరయోధుడిగా గౌరవం, మంచివాడనే పేరున్న మంచి స్నేహితుడులాంటి వ్యక్తి స్వాతంత్ర్యం వచ్చాక ప్రజలు అందించిన విలువలపై సంధించిన విశ్లేషణాత్మకమైన విశిష్ట రచనగా ‘రామప్ప రభస’ పేరుపొందింది.

తెలంగాణా – వ్యాసాలు – తెలంగాణా సుదీర్ఘ పోరాటంనుచి ఊపరి పీల్చుకుని, నిర్మాణాత్మకంగా పురోగమిస్తూ, చరిత్ర నిర్మాణంలో భాగంగా  ఆవిర్భవించిన చరిత్ర పరిశోధన, సంస్కృతి గౌరవంతోపాటు పురులువిప్పిన సృజనశక్త్యాదులను విశ్లేషిస్తూ రచించిన వ్యాసపరంపర ‘తెలంగాణా’ రచనలు ఆళ్వారు స్వామి ప్రతిభావంత సాహిత్యపురిలో కీర్తికిరీటంగా చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ సమయానికి తెలంగాణాలోని చరిత్రను సమఉజ్జీ స్థానంలో ఉంచడానికి చేసిన ఆత్మగౌరవప్రదమైన రచనగా ‘తెలంగాణా వ్యాసాలు’ నేటికీ చెలామణి అవుతున్నాయి. తెలంగాణా సంస్కృతీ పునరుజ్జీవన స్రవంతీ ప్రవాహానికి కావలసిన చైతన్యస్ఫూర్తిని అందించిన వ్యాసాలుగా పేరుపొందాయి. ఆదిరాజు వీరభద్రరావు, దాశరథి, వానమామలై వరదాచార్య, రావి నారాయణరేడ్డి, కోదాటి నారాయణరావు తదితరులు వ్రాసిన వ్యాసాలు చాలా విలువలతో నిండివున్నాయి.

నిజాం రాచరిక ఇనుప కటకటాల్లో మూల్గులు పడిన తెలంగాణా జీవితానికి అద్దాలాంటివి వట్టికోట రచనలు. జాగీర్దారీ జులుం, పెత్తందార్ల పైశాచికాట్టహాసం, పేదల నిస్సహాయక స్థితిగతులు, ప్రజాజీవన పదజాలం, కట్టుబాట్లు స్వామి రచనల్లో గుబాళింపులతోపాటు సొగసుల్ని, సౌరభాల్ని కూడ వెదజల్లాయి. చుట్టూరా ఆవరించుకున్న చీకటిలో వెలుగుకై పేర్చిన దీపశిఖలా, తెలంగాణా వ్యాసాలు గోచరిస్తాయి.

 స్వాతంత్ర్యం పూర్వం  రాజకీయ, సాంఘిక ప్రజా ఉద్యమాల చిత్రణతో గంగు(అసంపూర్తి) నవల మరొక ప్రత్యేకతగా పేర్కొనాలి.

గ్రంధాలయోద్యమంతో అంకురించిన ప్రేరణ ఆళ్వారుస్వామిని నిజాం వ్యతిరేకోద్యమం దాకా నడిపించడమే కాక, ప్రజల్లో కలిసి ఆయన పని చేసిన తీరు నిజాంకు రప్పించిన కోపం  జైలులో పెట్టించింది.  జీవనార్థం చేసిన వివిధ వృత్తులు, వంటపని, ప్రూఫ్ రీడింగ్‌, హోటల్ ఉద్యోగిగా పని చేస్తున్నప్పుడు ఆయన పొందిన అనుభవాలు ఆయన ప్రజల మనిషిగా నిలబడేట్టు చేశాయి. నిజాంను గడగడలాడించిన 'ఆంధ్రమహాసభ' నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకుడుగా ప్రజాచైతన్య రథసారథిగా వట్టికోట ఆళ్వారుస్వామి చిరస్మనీయులు. నల్లగొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని చెరువు మాదారం లో సింహాద్రమ్మ, రామచంద్రాచార్యులకు జన్మించిన ఆళ్వారుస్వామి, తండ్రి చిన్ననాట చనిపోవడంతో సీతారామారావు అనే ఉపాధ్యాయుడికి వండిపెడుతూ విద్యాభ్యాసం, సారస్వతాభ్యాసం చేశాడు. ఆళ్వారు స్వామి చదువు మధ్యలో ఆపేసి గ్రంథాలయోద్యమంలో కొనసాగాడు. దాశరధి పద్యాలు జైలు గోడల మీద రాసి దెబ్బలు తిన్నాడు. హోటల్ కార్మికుడిగా జీవితం ప్రారంభించిన ఆయన స్వయంగా చదువు నేర్చుకుని, రచయితై , ప్రచురణ కర్త అయ్యాడు. తెలంగాణ చైతన్యం కోసం 'దేశోద్ధారక గ్రంథమాల' స్థాపించి 35 పుస్తకాలు ప్రచురించిన వట్టికోట ఆళ్వారుస్వామి 1961 ఫిబ్రవరి 5 మరణించారు. తెలంగాణా చైతన్య సాంస్కృతిక సాహిత్య స్ఫూర్తి ప్రస్తావన వచ్చినప్పుడల్లా వట్టికోట ఆళ్వారుస్వామి ప్రతిభావ్యుత్పత్తిల్ని విశ్లేషించుకుంటూ ప్రశంసించకుండా ఉండలేం అని చెప్పక తప్పదు.

 

 

No comments: