Saturday, February 2, 2013

ఉద్యమ కవి, విప్లవ రచయిత - మగ్దూం మొహియుద్దీన్‌



ఉద్యమ కవి, విప్లవ రచయిత - మగ్దూం మొహియుద్దీన్
(4-2-1908- 25-8-1969)  (ఫిబ్రవరి 4 జయంతి)
“అడవుల కొండల అనుంగుబిడ్డలు, పొలాల పొత్తిట పెరిగిన పాపలు లేచిరి క్రోధోద్ధత భీకరులై, సమరోద్దృత కాక్షేయక కరులై, తళతళ తళతళ మెరిసెను కొడవలి, ఎగసి ఎగసి నర్తించెను నాగలి. పుట్టకీటుతో కదిలి రాచరిక అట్టాలికములు మట్టిని కలిపెను, బేరకుబేరుల మేడలు మిద్దెలు గడగడ గడగడ వడకుచు కూలెను, హలాకూల జారుల పరిపాలన పర్రెలువారి బదాబదలయ్యెను.”
ఆనాడు రజాకార్ ప్రభుత్వంపై సాగిస్తున్న సాయుధ పోరాటకాలంలో ‘తెలంగాణా’ పేరుతో ఆవిర్భవించిన సుప్రసిద్ధ గేయాన్ని రచించినది హైదరాబాద్ లో సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా పోరాటానికి తోడు నిలిచిన యోధుడు, ప్రసిద్ధ ఉర్దూ కవి, వక్త మఖ్దూం మొహిద్దీన్.
ఆధునిక ఉర్దూ మహాకవి, అభ్యుదయ భావ సముజ్జ్వల రవిగా పేరుగాంచిన ప్రముఖ ఉపాధ్యాయుడు, నాటకకర్త, నటుడు, గాయకుడు పార్శాలేకాక, నిజాము కు వ్యతిరేకంగా తెలంగాణా సాయుధ పోరాటం లో కీలకపాత్ర పోషించిన బహుముఖీన ప్రతిభావంతుడు, ‘మగ్ధూం’గా పేరుపొందిన ‘అబూసయీద్ మహ్మద్ మగ్ధూం మొహియుద్దీన్ ఖుద్రీ’ భాగ్యనగరపు సాహిత్య, సాంస్కృతిక శ్రామిక ప్రతిభా రంగానికి దిక్సూచి. మగ్ధూం కవియేకాక, కార్మిక నాయకుడు, కమ్యూనిష్టు నేతగా అందరి ప్రశంసల్ని పొందాడు. 'షాయరే ఇంక్విలాయ్' (ఉద్యమ కవి, విప్లవ రచయిత) బిరుదాంకితుడు, 1956-69 మధ్య శాసనమండలి సభ్యత్వం వహించాడు. ఫాసిజానికి వ్యతిరేకంగా సమసమాజ స్థాపనకోసం క్రియాశీలంగా రాజకీయాల్లో పాల్గొంటూ, ప్రగతిశీల భావాలతో పీడితుల పక్షాన కలమెత్తి నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్నంకితం చేసిన అపురూప వ్యక్తిత్వం మక్ధూంది.
ఉత్తరాది నుండి దక్కన్ కు వలస
తెలంగాణాలోని మెదక్ జిల్లా ఆందోల్ లో 1908 ఫిబ్రవరి 4 న జన్మించిన వీరి కుటుంబం మహ్మద్ ప్రవక్త సన్నిహిత సహచరుల్లో ఒకరైన హజ్రత్ అబూసయీద్ ఖుద్రీ మఖ్దూం మూలపురుషుడని చెబుతారు. మఖ్ధూం తాతలది ఉత్తరప్రదేశ్ లోని అజంగడ్; ఆయన పితామహుడు రషీరుద్దీన్, ఔరంగజేబ్ సైన్యాలతోపాటు దక్కన్ పీఠభూమికి వచ్చాడు. ఆయన మాతామహుడు సయ్యద్ జాఫర్ ఆలీ కూడ అదే రాష్ట్రంలోని షాజహానాబాద్ నుంచి 1857 లో ఇక్కడికి రావడం జరిగింది. మఖ్ధూం తండ్రి గౌస్ మోహియుద్దీన్ ఆందోల్ తహసిల్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా వుండేవాడు.
వైరుథ్యాల సమాహారం
‘మఖ్దూం జ్వలత్ప్రభాదీప్తిజ్వాల, హిమశీతల తుహినమాల, ఆయన విప్లవకాహళి, మంజీర ఝణంఝణారవళి’ – విద్య, ఆచరణ, విజ్ణానం, విప్లవం, గెరిల్లాల చేతి తుపాకి, గాయకుల చేతి వీణ, తుపాకి మందు వాసన, మల్లెపూల పరిమళం – వెరసి సమ్మేళనంగా, అపురూప గుణ సమాహారంగా మారిన మనిషి, మనీషి. ‘మనిషి’గా మనిషా – సంక్లిష్టాల సముచ్చయమా? అని సందేహం రాకమానదు. గుడ్డివాళ్ళు ఏనుగును వర్ణించడానికి చేసిన ప్రయత్నంలా వున్నవి ఆ భావాలని ఖాజా అహ్మద్ అబ్బాస్ నిర్వచించి, విరోధాలతో సంక్లిష్టమైన సమస్యకు సమాధానం చెప్పడం జరిగింది.
మఖ్ధూం జన్మించేనాటికి భారత కార్మికవర్గ విప్లవ చరిత్రలో ప్రధానఘట్టంగా బ్రిటిష్ పాలకులు తిలక్ మహాశయుని నిర్బంధించడం పట్ల తలెత్తిన నిరసనగా బొంబాయి కార్మికులు సమ్మె చేయడం, కార్మికవర్గం ప్రదర్శించిన రాజకీయ పరిణత స్థితిని మహాశయ మహానేత లెనిన్ దృష్టిని కూడ ఆకర్షించడంతోపాటు బొంబాయి కార్మికులకు జేజేలందజేస్తూ, కార్మికవర్గ విజృంభణలోగల విప్లవ ప్రాముఖ్యత దర్శనీయమవడం చారిత్రాత్మక కథనంగా మారింది.
మగ్దూం చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తల్లి మరో పెళ్ళి చేసుకోవడంతో మగ్దూం తన బాబాయి వద్ద పెరిగాడు. ప్రాథమిక విద్య హైదరాబాదు లోని ధర్మవంత హైస్కూల్లోను, మెట్రిక్యులేషను సంగారెడ్డిలోను చదివాడు. మఖ్దూం తండ్రి పరమ భక్తుడు - మహమ్మద్ గౌస్ మొహియుద్దీన్. తల్లి - ఉమ్దా బేగం. భర్త మరణానంతరం ఆమె వేరే వివాహం చేసుకుంది. పినతండ్రి బషీరుద్దీన్ పెంచాడు. మఖ్దూం విద్యాభ్యాసం ఆందోల్ నుండి హైదరాబాద్ చేరి 1929 లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తయింది. ఇంటా బయటా విరివిగా పుస్తకాలు చదవటం, సాహిత్య అధ్యయనాలు, తాత్విక విషయాల పరిశోధన మఖ్దూం నిత్యకృత్యాలైనాయి. మెట్రిక్యులేషన్ తరువాత మఖ్దూం ట్యూషన్లు చెప్పడం, చిత్రపటాలు విక్రయించడం, పత్రికలకు వ్యాసాలు రాయడం తొలిదశలో జీవనోపాధికై ఎన్నుకున్న కొన్ని విధానాలు. కొన్నాళ్లు హైదరాబాద్ రాష్ట్ర దఫ్తర్లో గుమాస్తాగా తరువాత హైదరాబాదులోని సిటి కాలేజీలో ఉపాధ్యాయవృత్తిలో చేరాడు.1941లో హైదరాబాద్ ఉర్దూ అభ్యుదయ రచయితల సంఘ స్థాపనకు పూనుకున్నాడు మఖ్దూం. 1944లో అఖిల భారత అభ్యుదయ రచయితల సమావేశాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేసినాడు.
 
రవీంద్రుడు మెచ్చిన నాటకం
మఖ్దూం కవితారంభం మధుర భావగీతం ‘టూర్’ తో 1934 లో ప్రారంభమై, నాటక రచయితగా, నటుడిగా పేరుపొంది, మీర్ హసన్ సహకారంతో రచించిన ‘హోష్ కే నాఖూన్’ నాటకం బెర్నార్డ్ షాకు కూడ మొదటి నాటకమైన ‘విధురుల గృహాలు’ కు అనుసరణ, రవీంద్రుని సమక్షంలో హైదరాబాదులో ప్రదర్శించగా,  మెచ్చుకుంటూ, నాటకాంతంలో ‘జనగణమన’ గీతాన్ని ఆలపించారు. శాంతినికేతన్ కి వచ్చి చదువుకోవలసిందని మక్ధూంని ఆహ్వానించడం జరిగింది. ఈ సంఘటనకి ప్రేరణగా మఖ్దూం ‘టాగోర్ – అతని కవిత’ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఎమ్మే చదువులో భాగంగా ‘ఉర్దూ నాటకం’ పై పరిశోధన చేశాడు. మఖ్దూం ‘ముర్షదే కామిల్’(సమర్థ పురోహితుడు) నాటకం క్వెట్టా భూకంప బాధితుల సహాయార్థం ప్రదర్శించడం, ఖాజాహసన్ నిజామీ పోలికలతో ఆహార్యం ధరించిన పురోహిత పాత్రను మఖ్దూం నిర్వహించిన తీరు అందరినీ అలరించింది.
ప్రేమలేఖల విన్యాసం
మఖ్దూం చేపట్టిన ఉద్యోగాలు అనేక వైరుధ్యాలతో కొనసాగాయి. సుల్తాన్ బజార్ లోని ఆకుపచ్చరంగు పెద్ద మసీదు నేలమాళిగలో నివాసం, చిత్రాలను అమ్మడంలో సంతృప్తిపడక జీవిక కోసం సినీమా తారల చిత్రాలను అమ్మడం, పత్రికల్లో పనిచేయడం, పిల్లలకు పాఠాలు చెప్పడంతోపాటు సమాంతరంగా మరొక ఆసక్తికరమైన మరో ఉద్యోగం చేశాడు; ఒక నవాబు గారికి ఆంగ్లో ఇండియన్ ప్రేయసి ఉండడం, ఆయన పేరున ఆమెకు ప్రేమలేఖలను ఆంగ్లంలో వ్రాయడం జరగ్గా, వాటికోసం ఇంగ్లీష్ లోని ప్రేమలేఖల్ని చదవడం మఖ్దూం వంతయింది. ఫలితంగా ‘గోథే ప్రేమలేఖలు’ అన్న కృతి ఆవిర్భవించడం, అవి ‘మత్కబా’ అనే పత్రికలో ప్రచురించబడ్దాయి. హైదరాబాద్ లో బహుళ ప్రచారంలో వుండే జమాలుద్దీన్ జోక్స్ కు ప్రవక్త, ప్రచారకర్త మఖ్దూంకాగా, ఆయన పేరుతో మరిన్ని జోక్స్ ను సృష్టించడం కూడ జరిగింది.
పచ్చ శాలువా
విశ్వవిద్యాలయం స్థాయిలో ఆరోజుల్లో కూడ ఎక్కువగా ఉన్న రాగింగ్ లో భాగంగా పెద్దవాళ్ళు చిన్నాళ్ళని ఏడిపించడం, ఒక రోజని అనుకుని కులాసాగా విందు చేసుకోవడం కోసం విరాళాలు సేకరించడం సందర్భంలో ఒక జూనియర్ ని ఏడిపించేందుకు నిర్థారించుకుని, ఆ ప్రక్రియలో అతడు ఎప్పుడూ కప్పుకుంటుండే పచ్చ శాలువాని దొంగిలించడం జరగ్గా, దిగులు పడ్డాడు. ఈ నేపథ్యంతో ‘పీలాదుషాలా’ (పచ్చశాలువా) అనే పాటను తొలి కవితగా రాయడం, అది హైదరాబాద్ విద్యార్థిలోకంలో చాలా ప్రసిద్ధి పొందింది. మఖ్దూం ‘జంగే అజాదీ’ (స్వాతంత్ర్య సమరం), ‘బెంగాలు కరువు” అనే ప్రసిద్ధ కవితా ఖండిక, కజాక్ కవి జాంబుల్ జాంబిర్ వ్రాసిన ప్రసిద్ధ గీతానికి ‘స్తాలిన్ కీ ఆవాజ్’ (స్టాలిన్ కంఠం) అనువాద కవిత దేశభక్తిని ఫాసిజంపై మండుతున్న ద్వేషాన్ని రంగరించి పోసిన ఈ కవితలో  శయ్య, శబ్ద గాంభీర్యాలకు ఈ గీతం మెప్పు పొందడమే కాక, దీన్నే మూలగీతంలా భావించిన సందర్భాలూ ఉన్నాయి.
జైలు జీవితం
మక్ధూం జీవితంలో జైలు జీవితం ప్రముఖ పాత్ర వహించింది. తొలిసారి 1943లో హైదరాబాదులో చేసిన వివాదాత్మక ప్రసంగం మూడు నెలల జైలుజీవితం గడపాల్సివచ్చినా, స్వామి రామానంద తీర్థలాంటి కాంగ్రేసు సత్యాగ్రహులు తోడయ్యారు. జైల్లో ఇచ్చిన ఆకుకూరలతో మఖ్దూం ఒక తాడు పేని జైలు అధికారికి ఇచ్చేవాడు. అరెస్టు అవడం, జామీనుపై విడుదల, రహస్య జీవితాన్ని గడపడం మఖ్దూం జీవితంలో సర్వసామాన్య విషయాలే. మఖ్దూం 1951 లో జైల్లో ఉన్నప్పుడు ‘ఖైదు’ అనే గేయం రచించాడు. విడుదల అయ్యాక, అనేక సభల్లో చదివి వినిపించేవాడు. “ఏండ్ల తరబడి వివశమై యున్న యవ్వనము నిగళాలలో కలత నిదురలో మునిగింది; కదిలితే చాలు శృంఖలలు ఘల్లని మ్రోగు, కలలలోనే బ్రతుకు, కలకలము వినిపించు. బందిఖానాకు నా బ్రతుకర్పితమయ్యె కాని యీ దేశమను కటకటాలను ముక్తి సాధించలేదన్న బాధయే మిగిలింది”. పోరాడే తన ప్రజలమధ్య వుండాలన్న తపన ఈ గీతం నిండా వ్యక్తమవ్వడమేకాక, రాచరిక నిరంకుశత్వాన్ని దుర్దమననీతిని ఎదిరిస్తూ వీధుల్లో తిరుగాడే లక్షలాది ప్రజల హృదయాలలో మఖ్దూం హృదయం ఈ గీతం నిందా ప్రతిస్పందిస్తూ ఉంటుంది.
ప్రతిభాపూరిత సేవలు బహుముఖాలు
హుజూర్ నగర్ నుంచి శాసన సభకు ఎన్నిక, ప్రపంచ ట్రేడ్ యూనియన్ సమాఖ్య, ప్రధాన కార్యాలయం (వియన్నా)లో కావ్యనిర్వహణ, శాసనమండలి సభ్యత్వం, అనేక కార్మిక సంఘాలకు నేతృత్వం, అంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యత్వం, ఎఐటియుసి ఉపాధ్యక్షత, భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి సభ్యత్వం, యిలా, ఎన్నో, మరెన్నో బాధ్యతల్ని కడు సమర్థవంతంగా నిర్వహించడంలోనే ఆయనలోని ప్రతిభ అసామాన్యంగా వెల్లడయింది.
సాహిత్య పరంపర
మఖ్దూం  రచనలు ఇంగ్లీష్, రష్యన్, హిందీ, తెలుగు తదితర భాషల్లో కవితలు ప్రచురించబడ్దాయి. గజల్ లు, పాఠ్యకాంశాలలోను, సినిమాలలోనూ జోడించడం, 'ఫిర్ ఛిడీ బాత్, బాత్ ఫూలోం కి' అను గజల్(గేయం) చాలా సుప్రసిధ్ధగేయంగా పేరుపొందింది. సుర్ఖ్ సవేరా (అరుణోదయం), గుల్ తర్ (తాబీపూవు), బిసాతె రక్స్ (నాట్య వేదిక) పేర మూడు కవితా సంపుటాలను రచించినాడు. 1944-51 మధ్యకాలంలో 'తెలంగాణ' అనే కవిత రాశాడు. మఖ్దూం మొహియుద్దీన్ శతజయంతి (1908-2008) మరియు ప్రథమ వర్థంతి నివాళి ప్రచురణగా ‘కవిత’ సంకలనం ఉర్దూ నుండి తెలుగు అనువాదాలను అందించిన సుప్రసిద్ధ కవులు డా.దాశరథి, గజ్జెల మల్లారెడ్డి, డా. సి నారాయణరెడ్డి, కౌముది, రాంభట్ల కృష్ణమూర్తిల ప్రతిభకూడ మూలానికి జోడింపబడ్డాయి.
‘‘తెలంగన్” అన్న గేయకవితకు దాశరథి ‘తెలుగుపిల్ల’ అన్నది చాలా రసోత్తరంగా అనుసృజనని అందించారు.
‘మెలిక తిరిగిన పొలం గట్టులమీద, మెలికలు తిరుగుతూ,
మెత్త మెత్తని తియ్య తియ్యని నవ్వులను వెదజల్లుతూ
చేతిగాజుల గలగలలలో సిగ్గులను కలగలుపుతూ!
తెలుగుపిల్లా! పాడవే! వల పొలకబోస్తూ పాడవే! తెలుగుపిల్లా పాడవే!
మెత్తని తియ్యని నవ్వుల్ని వెదజల్లడం, గాజుల గలగలతో సిగ్గులను కలగలపడం లోనే కవితాత్మకమైన భావనలుగా అనిపించాయి.
దాశరథి అనువదించిన మరొక కవిత ‘అప్నా షహర్’కు ‘మన నగరం’ కవితలో –
‘మన నగరం మహావిచిత్రం, నిసిరాతిరి రోడ్డుమీద నడుస్తుంటే, నీతో గుసగుసలాడుతుదో నగరం; గుండెలోని రహస్యాలవలె, పుండుపడిన తనను విడమరచి చూపుతుంది; మూసిన కిటికీలు, మూగపడిన సందుగొందులు, కూలిపోతున్న కుడ్యాలు, పెదవులమీద సీళ్ళు వేసుకున్న ద్వారాలు, ఇళ్ళలో యేండ్లుగా శవాలు నివసిస్తున్నాయి కిరాయకు!”
నగరం నీతో గుసగుసలాడడం, పెదవులమీద సీళ్ళు వేసుకున్న ద్వారాలు – కవితకు సొబగునిచ్చే పదప్రయోగాలుగా భావించక తప్పదు. 
‘షాయర్’ అన్న కవితకు డా. సినారె ‘కవి’ శీర్షికన తెలుగుసేత చేశారు. ‘ఇంద్ర ధనుస్సు నుండి ఒక్కింత వన్నె స్వీకరింతు, చిరుతారల నుండి కొంత జీవకాంతి దొంగిలింతు.’ … ‘స్వర్గ స్మృతిలో కూర్చుని చక్కని మూర్తిని మలతును, మొండి రాతిలో సైతము గుండె చప్పుడును కూర్తును.” సినారె అనువాదంలో ఉర్దూ కవిత మూలం అని ఎక్కడా అనిపించకపోవడం, ఉభయభాషల్లో ఆయనకున్న ప్రావీణ్యమే కారణం.
హరివిల్లునుంచి వన్నెని స్వీకరించడం, తారలనుండి జీవకాంతిని దొంగిలించడం, మొండి రాతినుండి గుండె చప్పుడిని సమకూర్చడంలో సామాన్య పదాలకూటమి కాక కవిత్వం ప్రత్యక్షమయింది. ‘పోయినవి శృంఖలలు, పోయెను బానిసత్వము, మెరుగు పెట్టిన వజ్రమై, మిరుమిట్లు గొల్పెను మానవత్వం’ అన్నది ఆలోచనాత్మకం.
‘చుఫ్ న రహో’ అనే కవితకు ‘ఉపేక్షించకు!’ అన్న కౌముది తెలుగుసేత మూలానికి మరింత వన్నె తెచ్చింది.
ఈ కవితా సంకలనంలో అధిక కవితలకు సుపసిద్ధ కవి గజ్జెల మల్లారెడ్డి అనువాదకవితలుగా అనేక భావాలను సానపెట్టి మరింత కాంతిపుంజాలుగా అందించడం ఓ ప్రత్యేకత!
25.08.1969 తేదీన మఖ్దూం సాహిత్య, శ్రామికవర్గాన్ని దుఃఖసాగరంలో ముంచి భౌతికంగా దూరమయ్యాడు. భావ, ప్రణయ, మధుర కవితలో సైతం మఖ్దూంది ప్రత్యేక శైలి; ద్వేషానలంలో మసిగాక, ప్రణయం విజయం చేబట్తాలని కాంక్షించే మఖ్దూం జీవితంలో లాగే కవితారంగంలో కూడా అభ్యుదయ కవిగా విప్లవపథ నిర్దేశకుడిగా తుదిక్షణందాకా ప్రజలకోసమే తన యావత్తు జీవితాన్ని వినియోగించిన ఉద్యమ కవి, విప్లవ రచయితగా మఖ్దూం చిరస్మరణీయుడు, మరువలేని మరువరాని మహనీయుడు – మఖ్దూం మోహియుద్దీన్.

No comments: