Wednesday, November 28, 2012

ఈ భక్తులు మాకొద్దు - నాటకం - రచన - తిరుమల వెంకటస్వామి

పుస్తక ప్రపంచం

ఈ భక్తులు మాకొద్దు - నాటకం - రచన - తిరుమల వెంకటస్వామి

నేటి కుహనా  భక్తి ధోరణికి నాటకరూపం

కలియుగంలో భక్తి పర్వం వింతపోకడలు పోతోంది అన్నది సత్యం. పాప ప్రక్షాళనం కోసమో, పుణ్యపు పాళ్ళని   పెంచుకోవడానికోఅవలంబించే సులభతరమైన మార్గం 'భక్తి' గా మారింది అన్నది   కూడ సత్యమే. ఆధ్యాత్మిక పరంగా కాకుండా, ముక్తి సోపాలను అధిరోహించే ప్రయత్నంలో భాగంగా కాకుండా, తమ తమ యిష్ట దైవాలని తమ స్వార్థంతో అక్రమంగా   సంపాధించిన  సొమ్ములను కానుకలుగా దేవాలయ హుండీల లో కానుకలుగా సమర్పించి తమ మేళ్ళు, తమకనుకూలంగా, స్వప్రయోజనాలు సమకూరేలా కోరుకుంటే మానవ సంరక్షకులైన దేవతల హృదయావేదనలు ఎలా ఉంటాయో, తెలియజెప్పిన నాటక రచన 'ఈ భక్తులు మాకొద్దు'. సంపాదించిన ధనానికి త్యాగస్వభావం సమకూరితేనే సార్థకత చేకూరుతుంది అన్నది సత్యం. నిస్స్వార్థ, సచ్చీలతలచే సంపాదించిన సొమ్ము   ఫలాపేక్ష లేకుండా   దానధర్మాలు చేసి, దైవ కైంకర్యాలకు తమ తమ ధనాన్ని వినియోగించాలన్న సందేశాన్ని అందించిన రచన.  ఈ రచనలో వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, శంకరుడు, వెంకటేశ్వరస్వామి, దేవేంద్రుడు, బ్రహ్మ సరస్వతి, విష్ణుమూర్తి, కుబేరుడు, వకులాదేవి, గోవిందరాజులు యిత్యాది దేవతలందరితోపాటు భక్తులతో నారదుడు సూత్రధారిగా, సమన్వయము చేయడం, భక్తిప్రపత్తుల్ని బేరీజు వెసుకుని, కలియుగ భక్తులు మాత్రం మాకొద్దు అని  దేవతలందరూ  తీర్మానించడంతో  నాటకం  ఆలోచనాత్మకంగా   ముగుస్తుంది.  గతజన్మలో చేసుకున్న పుణ్యం వల్లనే భక్తులు ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, జన్మించి సుఖసంతోషాలను అనుభవించడం, సత్యం మరచిపోయి, మనోబుద్దుల వైకల్యాల చేత   ప్రలోభులై వారి దైవాలని కూడా ప్రలోభపెట్టి హిన స్థితికి మానవులు చేరుకుకోవడం, మల్లి మల్లి జన్మకు కారకులై హీనాతిహీన జీవనం గడుపుకోవడానికి పునాదులు వేసుకుంటున్నారని దేవతల పక్షాన శివుడు చెప్పడం, వినాయకుడు కోపోద్రేకుడై సత్కర్మలు చేసి నీతి నిజాయితీలతో ధర్మబద్ధంగా జీవితాన్ని గడపకపోతే, జనులు చెడిపోవడం తథ్యం అని వివరిస్తాడు. చివరిలో ధర్మం తప్పితే దానవులు, నీతి తప్పితే నీచులు, మానవత్వం మరచితే మహా రౌరవాది నరకాలను అనుభవిస్తారని హెచ్చరిక చేస్తారు. తత్ఫలితంగా, ఎలాంటి భక్తులు కావాలో దేవతలందరినీ నారదుడు కోరగా, 'ధర్మపరాయణులై, ధర్మార్జన పరులై, కుటుంబం, రాష్ట్రం, దేశక్షేమం మనసా వాచా కోరుకునే భక్తులుంటే తమకు ఏంతో ముద్దు కాని, మరెలాంటి భక్తులు వద్దు కాక వద్దు అని దేవతలందరూ వక్కాణించారు. అంతే కాక, పాపిష్టి సొమ్ముతో, కోరరాని కోర్కెలు తీర్చమనే అన్యాయపు భక్తులతో హుందీలద్వారా కోర్కెలు తీర్చుకునే ప్రయత్నాలు చేయరాదని, 'ఈ భక్తులు మాకొద్దు' అని గణపతి, కుమారస్వాములు ప్రతిపాదించగా, మిగతా దేవతలందరూ గొంతు కలపగా, నాటకం ఆలోచనాత్మకంగా ముగుస్తుంది. రచన ప్రదర్శనతో మరింతగా ప్రతిభను సంతరించుకుంటుంది అని చదువరులకు అనిపించక మానదు. రచన ఆద్యంతం ఆసక్తిదాయకంగా, ఆలోచనాత్మకంగా చదివిస్తుంది.  కలియుగదైవం తిరుమలేశుడు చుట్టూ యితర దైవాలతో అలంకరించిన ముఖచిత్రం బాగుంది.

 
  
 

No comments: