Sunday, November 18, 2012

భారతరత్న - సి.వి.రామన్ - సాటిలేని శాస్త్రవేత్త  ( 1888 - 1970 )
 
ధైర్యశాలి భావాలు  రాజకీయవాదులు విజ్ౙానరంగంలోకి ప్రవేశింపకూడదు. 
 
ప్రతీ ఏట జరిగే యిండియన్ సైన్స్ కాంగ్రేసు మహాసభలను భారతీయ ప్రధానులు, నెహ్రూ, యిందిరాగాంధీలు ప్రారంభించడం నచ్చని వ్యవహారం, సముచితం కాదు. 
 
రాజీపడని రామన్ విజ్జాన  పరిశోధనారంగానికి నిరంతర 'రామన్ ఎఫెక్ట్'
 
ఘనచరితస్థలం - జన్మస్థలం  సారవంతమైన కావేరీ డెల్టాప్రాంతానికి ప్రసిద్ధి చెందిన ఆ జిల్లాకు మూడు తలల రాక్షసుడి పేరు (త్రిశిర) నుంచి వచ్చింది. జిల్లా చరిత్ర రాజకీయ పరమైన పల్లవులు, చోళులు, నాయకరాజులు మరియు చివరగా రవి అస్తమించని తెల్లదొరల పరిపాలనాధోరణుల ప్రభావాలకు గురై బయట పడిన ప్రాంతం - తిరుచిరాపల్లి, క్రమేనా, తిరుచ్చి, త్రిచి గా కుచించుకుపోయింది. ప్రసిద్ధ శ్రీరంగనాధుడు (10 శ.), మ్యూజియం, జంబుకేశ్వరాలయం, రాక్ ఫోర్ట్, ప్రసిద్ధమైన చర్చిలు, సైంట్ జోసెఫ్ కాలేజీతోపాటు కల్లనై డాం (గ్రాండ్ ఆనకట్ట), 7వ శ. నాటి శివాలయం, శిత్తనవసల్ వద్ద జైన్ గుహాలయాలతో ప్రసిద్ధిపొందిన తిరుచిరాపల్లికి చారిత్రాత్మక, వైజ్ౙానిక పరంగా మరొక మైలురాయి - సర్.సి.వి.రామన్ ఈ గడ్డపై పుట్టడం భారతావని చేసుకున్న సుకృతం. ఆ ధరణి చేసుకున్న పునీతవైనం వర్ణనాతీతం.  రామన్ కుటుంబ నేపథ్యం  చంద్రశేఖర్ అయ్యర్, పర్వతీ అమ్మాళ్ మధ్యతరగతి కుటుంబ దంపతులకు తమిళనాడు, తిరుచిరాపల్లి జిల్లా, అయ్యన్ పెటాయ్ గ్రామంలో 7 నవంబర్ 1888 న జన్మించారు. వ్యవసాయంతో ముఖ్యజీవనం చేసుకునే ఈ కుటుంబం, తండ్రి తిరుచిరాపల్లి హైస్కూల్ లో ఉపాధ్యాయకత్వం, విశాఖపట్నం లో భౌతికశాస్త్రంలో ఆచార్యపదవి, వీటితోపాటు, కళలైన, జ్యోతిషం, వీణ, వాయులీనవాదనంలో నైపుణ్యాలను కూడ సంపాదించడం బహుముఖప్రతిభకు ఉదాహరణం.  తల్లి పార్వతీ అమ్మాళ్ తండ్రి కూడ గొప్ప తపండితుడు.  రామన్ వ్యక్తిత్వ దర్పణం  వాల్టేర్ కాలేజీ లో యింటర్మీడియట్ చదివి, మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఎ. కై చేరిన రామన్, మొదటిరోజునే ఆంగ్లభాష ఆచార్య, యిలియట్, ప్రియశిష్యులలో ఒకడు అయ్యాడు. అనిబిసెంట్ ఉపన్యాసాలతో ఆకర్షితుడయ్యాడు. హిందూపురాణాలు - వ్యాసానికి ప్రధమపురస్కారం, బి.ఎ. లో ఎలిఫిన్ స్టన్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఎం.ఎ. పదార్ధవిజ్ణానశాస్త్రం, ధ్వనిశాస్త్రంలో ప్రయోగాలు, ఎవ్వరూ కనుగొనని లక్షణాలు అవ్వడంవల్ల, ఆచార్య జోన్స్, రేలేల ప్రశంసలను అందుకున్న ఏకైక వ్యక్తి. వేదాంతపత్రిక,లండన్ లో వ్యాసం ప్రచురణ, మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ. భౌతికశాస్త్రశాఖ చరిత్రలోనే ప్రధమశ్రేణి విద్యార్ధిగా సువర్ణాక్షరాలతో నిలచిపోయాడు. శారీరక దుర్బలత్వం, పరిశోధనకు అనుకూలించని శరీరం, వాతావరణం అని వైద్యులు అభిప్రాయాన్ని చెప్పినా, త్రోసిరాజని, రాజీపడని, నిరంతర పరిశోధనాపరుడు. 18 ఏళ్ళకే ఉద్యోగం సంపాదించిన రామన్, లోకసుందరి తో శాఖాంతర వివాహాన్ని చేసుకున్నాడు. వివాహమయినా, మనసంతా పరిశోధనలతోనే మునిగిపోయింది. కలకత్తా ట్రాం బండి రామన్ దశ, దిశలను నిర్దేశించింది. 'ది యిండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్శ్కు కార్యదర్శి మహేంద్రలాల్ సర్కార్ తో పరిచయం అయింది. రామన్ ప్రతిభకు గుర్తింపు, స్వతంత్ర ప్రయోగాలకి, ప్రత్యేక సౌకర్యం లభ్యం, రామన్ రాకతో సంస్థ ప్రతిష్ఠ పెరిగింది. కలకత్తా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు అశుతోష్ ముఖర్జీ ఆదరణకు గురయ్యాడు.  1915 లో భౌతికశాస్త్రంలో ఆచార్యపీఠం స్థాపనకు సర్ తారకనాధ్ పాలిట్ భూరివిరాళం యివ్వడం, ఆయన దౄష్టి రామన్ పై పడడం కూడ జరిగింది. అంతేకాక, పదవికి నిర్ధారిత నిబంధనలను సడలించి, రామన్ ని ఎన్నుకోవడం, ఆచార్యపదవిని చేపట్టడం జరిగింది.  రామన్ ప్రతిభకు కలికితురాయిలు  రామన్ ప్రతిభ వరించిన పదవులు, అధికారాలు ఎన్నో, మరెన్నో. భారతీయ శాస్త్రజ్ౙుల సంఘం, కార్యదర్శి(1919), బ్రిటిష్ విశ్వవిద్యాలయకాంగ్రెసు సభకు భారతీయప్రతినిధి (1922), కెనడా శాస్త్రీయ కాంగ్రెసు కు విశేషభారతీయప్రాతినిధ్యంలో, అనేకదేశాల్లో ప్రసంగాలు, రాయల్ సొసైటీ ఫెలోషిప్ సత్కారం, భారతీయ సైన్స్ కాంగ్రేసు స్థాపన (1924), నిరంతర పరిశోధన ఫలితంగా రష్యన్ సైన్స్ అకాడమీ ఆహ్వానం (1925), 'రామన్ ఎఫెక్ట్' పై ఆసియాఖండం నుంచి సత్కారం అందుకున్న మొట్టమొదటి శాస్త్రవేత్తగా నోబెల్ బహుమానం (1928), 15 సం. కలకత్తా విశ్వవిద్యాలయంలో అపూర్వ కౄషి, యిండియన్ యినిస్ట్యూట్ ఆఫ్ సైన్స్, డైరక్టర్ గా చేరడం, యిండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అవతరణ (1934), రామన్ స్వంత సంస్థ, రామన్ పరిశోధనాసంస్థ ప్రారంభం  (1948), ప్రముఖ ఘట్టాలుగా చెప్పక తప్పదు.   రామన్ పరిశోధనాసంస్థ నుంచి ప్రముఖ శిష్యగణం  రామన్ పరిశోధనాసంస్థ నుంచి ఉద్భవించిన రామన్ ప్రముఖ శిష్యగణంలో, ముఖ్యంగా చెప్పవలసిన వారు - డా. హోమీ జె. బాబా, డా. సూరి భగవంతం, డా. విక్రం సారాభాయ్, డా.రామశేషన్ లను ప్రస్తావించకుండ రామన్ వ్యక్తిత్వం అసంపూర్ణమే.  సర్, భారతరత్న రామన్  స్వతంత్ర భారతావనిలో శాస్త్రీయ పరిశోధనారంగంలో కొత్త అధ్యాయం - విశ్వవ్యాప్త రామన్ కీర్తి - బ్రిటిష్ ప్రభుత్వం సత్కరించిన 'సఋ బిరుదుతోపాటు, ఎన్నో విశ్వవిద్యాలయాలు అందించిన గౌరవ డాక్టరేట్. 1954 లో భారతప్రభుత్వం అందించిన అత్యుత్తమ పురస్కారం 'భారతరత్నా సాటిలేనిది.   రామన్ నిర్మొహమాటం లేని ధైర్యశాలి  - ఎవ్వరికీ జంకని ధైర్యశాలి, స్వతంత్ర భావప్రకటనకు ఎన్నడూ వెనుకాడలేదు. రాజకీయవాదులు వైజ్ౙానికరంగంలో ప్రవేశించరాదు అన్న అభిప్రాయాన్ని నిష్కర్షగా ప్రకటించాడు.   - ప్రతీ ఏట జరిగే, భారతీయ సైన్స్ కాంగ్రేసు మహాసభలకు భారత ప్రధానులు, నెహ్రూ, యిందిరాగాంధి ప్రారంభించడం సముచితం కాదని రామన్ నిశ్చితాభిప్రాయాన్ని ప్రకటించాడు.  శాస్త్రీయ పరిశోధనాభరిత జీవితంలో -  మరువరాని 'రామణ్ మెరుపులు  రామన్ శాస్త్రం-కళలపై పరిశోధనలో సన్మిశ్రమాలు  సంగీతశాస్త్రములో విశిష్టప్రవేశం - మౄదంగ వాదనంపై, శబ్దతరంగాలపై సాగిన ప్రయోగాలు - ఫొటోగ్రఫీ, రబ్బర్, ప్లాష్టిక్ పరిశ్రమలకు మంచి తోడ్పాటు అయిన రామన్ పరిశోధనల గురించి మరువరాని, మరువలేని మెరుపులు.  రామన్ - కొసమెరుపులు  1. బెంగుళూర్ లోని ఒక బ్యాంకర్ వద్ద రామన్ 75 వేలు వుంచడం, తర్వాత దివాలా అవడం తెలుసుకొని, 'నోబెల్ బహుమతి గ్రహీతకీ టోపీ పెట్టిన బ్యాంకర్ కు నోబెల్ పారితోషికం యివ్వడం సబబూ అన్న హాస్య చతురుడు.  2. కార్యసాధకులకు హంగులు, హార్భాటాలు అనవసరం. నోబెల్ బహుమతి కొరకు సాగించిన ప్రయోగానికి పెట్టుబడి కేవలం 200 రూపాయలే అన్న రికామీ వ్యక్తిత్వం, రామన్ ది.  3. జాతీయ పరిశోధనాలయాలపై - అనవసర/విపరీత ధనవ్యయం చేయడం సరిపడని పనిగా భావించాడు. ప్రయోగశాలల్లో శాస్త్రీయ పరిశోధనా పరికరాలను నిక్షేపం చేసెందుకుకే నిర్మీచారని - రామన్ వాదన.  4. ఎంత గొప్ప శాస్త్రజ్ౙుడో, అంత గొప్ప వక్త. క్లిష్ట శాస్త్రీయ విషయాల్ని జనరంజకంగా ఉపన్యాసం చేయగలిగిన మహామేధావి, మానవతావాది, శాస్త్రజ్ౙుల పరిశోధనలు ప్రపంచ ప్రజల సంక్షేమానికి వినియోగపడాలని చాటిచెప్పిన మహనీయుడు, మన రామన్.  5. జీవితమంతా శాస్త్రీయ పరిశోధనలోనే గడపడం - భారత దేశ కీర్తి పతాకాన్ని దిగ్దింతాలకు రెపరెపలాడించిన వైజ్ణానిక విశ్వభరిత విద్వన్మూర్తి - సర్, భారతరత్న, రామన్.   ఈ విశ్వాంతరాళంలో శాస్త్రం ఉన్నంతకాలం పరిశోధనలు, ప్రయోగాలు. యివి వున్నంతకాలం రామన్ కీర్తిని గణించడం, గుణించడం జరుగుతూనే వుంటుంది.   రామన్ జనన మరణాలు ఒకే నెలలో జరగడం యాదౄఛ్ఛికం. 1888 నవంబర్ 7 న జన్మిస్తే, 1970 నవంబర్ 21 నే కీర్తిశేషులయ్యారు రామన్.  ఆ మహనీయుని వ్యక్తిత్వానికి, ప్రతిభకు, ఈ సందర్భంగా తెలుగురథం  నీరాజాలని అర్పిస్తోంది.  కొంపెల్ల శర్మ - తెలుగురథం.

No comments: