Tuesday, October 2, 2012

మరువలేని మరో మహాత్ముడు - లాల్ బహదూర్ శాస్త్రి 104 వ జయంతి - 2 అక్టోబర్



మరువలేని మరో మహాత్ముడు - లాల్ బహదూర్ శాస్త్రి 104 జయంతి - 2 అక్టోబర్

 

 

'జైజవాన్ జై కిసాన్ - మరో మహాత్ముని తారకమంత్రం మనం మరువలేని మూడు రోజులు మన దేశం, ప్రజలు మాత్రం ముచ్చటగా మూడు రోజులు, తేదీలు మర్చిపోరు సరిగదా, ప్రతీ ఏట వీలైనంతగా స్మరిస్తూనే వుంటారు. ఎవరు ఎక్కువసార్లు స్మరిస్తే వాళ్ళకు దేశభక్తి అపారం అని జమకట్టారు మన నిర్ణయకారులు. మన బలం, బలహీనత అదే. రోజులు - ఆగష్టు 15 (స్వాతంత్ర్యదినోత్సవం), అక్టోబర్ 2 (మహాత్మాగాంధీ జాతిపిత జయంతి), జనవరి 26 (భారతీయ గణతంత్ర దినోత్సవం). అక్టోబర్ 2 - మరో మహాత్ముని జయంతి కూడా !!! అక్టోబర్ 2 వచ్చిందంటే మనకు వెంటనే స్ఫురించే వ్యక్తి, ప్రత్యేకత దేశమంతా ఒక్కటే మూస ఆలోచన. అదే గాంధీజయంతి. మహాత్మాగాంధీ, మోహన్ దాస్ కరం చంద్ గాంధీ జయంతి. ప్రతీ ఏట దేశప్రజావళి సామూహికంగా స్మరించుకునే రోజు. అదే గాంధీ పుట్టినరోజు. అదేరోజు యాదృఛ్ఛికంగా మన దేశపు మూడో ప్రధానమంత్రి అయిన లాల్ బహదూర్ శాస్త్రిగారి జన్మదినోత్సవం. యించుమించు దేశం యావత్తు మరచిపోయినరోజు. కొందరి విషయంలో పునరుక్తి విధానం దోషంకాదు. కాని స్మరించ వలసిన వ్యక్తిని స్మరించకపోవడం నేరం కాదు, దురదౄష్టవశాత్తూ మన భారతదేశంలో. ఏది ఏమైనా, మనం మరపురాని రోజుగా గాంధీజయంతిని పండుగగా జరుపుకునే అక్టోబర్ 2 రోజు మనం అదేరోజున మన దేశం మూడవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిగారి జన్మదినం కూడ అదేరోజు అన్నది మరచిపోయిన రోజు కూడ అదే అన్నది వింత, విడ్డూరం కలిగిస్తాయి. బహదూర్ జీవనప్రస్థానం సామాన్య కుటుంబంలో ఉత్తరప్రదేశ్ లోని ముగల్ సరాయ్ లో 1904 అక్టోబర్ 2 జన్మించిన లాల్ బహదూర్ శాస్త్రి, బాల్యం అంతా కటిక దరిద్రంలో గడిపారు. కాని, నిజాయితీ ఆయనకు సంపన్నత. మానవీయతతోపాటు యదార్ధవాది. కాశీవిద్యాపీఠంలో విద్యను అభ్యసించి, సాంఘికసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన అభ్యుదయవాది. లాలా లజపతి రాయ్ స్థాపించిన 'సర్వెంట్స్ ఆఫ్ పీపిల్ సొసైటీ' కి పరిపూర్ణమైన సేవలతో అంకితం అయ్యారు. స్వరోజ్యోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులవి. శాస్త్రి కూడ ఉద్యమంలో ప్రవేశించడం జరిగింది. ఫలితంగా అనేకసార్లు జైలుశిక్షను అనుభవించాడు. ప్రజాసేవ మరింతగా చేయాలన్న తలంపుతో, మొదటిసారిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆనాటి ప్రధాని నెహ్రూ కేంద్రానికి తరలించాడు. ఫలితంగా కాంగ్రేసుకి సాధారణ కార్యదర్శి పదవిని చేపట్టారు. తర్వాత, కేంద్ర రైల్వే మంత్రిగా ప్రతిభావంతమైన సేవలను అందించారు. నిజాయితీపరుడికి నిత్యం పరీక్షలే. దురదౄష్టమైన రైలు ప్రమాదం జరిగిన సందర్భంగా, పూర్తి నైతిక బాధ్యతను తాను స్వీకరిస్తూ, భారతరాజకీయాల్లో ఒక మార్గదర్శకతతో, మంత్రిగా రాజీనామా చేశారు. రాజకీయనాయకునికి కూడ రాజీపడడం, నిజాయితీతో నడచుకోవడం అత్యవసరం అని నిరూపించారు. 1964 లో జవహర్ లాల్ నెహ్రూ మరణాంతరం, భారతదేశపు మూడవ ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రిగారు ఎన్నికయ్యారు. అల్పకాలంగా ప్రధానిగా సేవలనందించినా, అనల్పమైన నాయకునిగా పేరుప్రఖ్యాతులను పొందారు. విజయం తెచ్చిన విషాదం భారత్-పాకిస్తాన్ మధ్య 1965 లో జరుగుతున్న యుద్ధం సందర్భంగా శాస్త్రి ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, సంకల్పం, దీక్ష, సరిసములు లేని ధీరలక్షణాలు నాయకునివి. దేశానికి మూలమూలలకు వ్యాపించిన నినాదం 'జై జవాన్ జై కిసాణ్ అన్నది లాల్ బహదూర్ శాస్త్రిగారి భావనే. అవాంతర పరిస్థితుల్లో ప్రజలను త్యాగవంతులుగా ముందుకు రావాలని కోరిన మహానుభావుడు. పాకిస్తాన్ తో అమోఘమైన విజయాన్ని సాధించాడు. ఆనందం పంచుకునే లోపున, 1966 లో పాకిస్తాన్ తో తాష్కెంట్ లో జరుపుకున్న అంగీకార సమావేశం ఫలితంగా అంగీకారపత్రంపై తన ముద్రని యిచ్చిన వెంటనే, మరణించడం దురదౄష్టకరం. శాస్త్రీ సరిలేరు నీ కెవ్వరూ ! శాస్త్రిగారు భారత రాజకీయాల్లో తనదైన శైలిలో చెరగని ముద్ర వేశారు. అందరి మనసును దోచిన విషయాలు - శాస్త్రిగారు ప్రదర్శించిన నీతిపూర్వక నడత, నిరాడంబరత, రికామీ వ్యక్తిత్వం, త్యాగశీలత, శాంతమూర్తి, ధౄఢనిర్ణయకారుడు. ఆయన భౌతికంగా వామనమూర్తి అయినా ఆయన తరానికి మాత్రం నడతలో ఆజానుభాహుడు. స్వాతంత్ర్యం కోసం సమరం జరిపిన ప్రతిభామూర్తుల్లో ప్రముఖుడు. ఆటువంటి వ్యక్తి మాత్రం భారతీయ రాజకీయ వ్యవస్థలో కనివిని ఎరుకలేదు. మళ్ళీ తిరిగి దర్శనం అవుతాడు అన్న విశ్వాసం, నమ్మకం, సన్నగిల్లిపోతున్నాయి. క్రమేపీ, నిరాశకు దారితీస్తోందే కాని, మరో గత్యంతరం కనిపించుటలేదు. స్మారకం లాల్ బహదూర్ శాస్త్రిగారి మరణం తర్వాత, తాష్కెంట్ నుంచి ఆయన భౌతికకాయాన్ని తీసుకొచ్చి ఆయన స్మౄతి చిహ్నంగా డిల్లీలోని విజయఘాట్ లో స్మారకకేంద్రాన్ని నిర్మించడం ఆయనకు మనం అందజేసిన నివాళి, ప్రణామాలు. శాస్త్రిగారు దేశానికి అందించిన సేవలకు గుర్తింపుగా, కీర్తిశేషులుగా దేశపు అత్యున్నత పురస్కారం 'భారతరత్నా తో గౌరవించడం ఎంతో సమంజసం, ఔచిత్యం అన్నది సత్యం. భారతమాత గర్విత ముద్దులబిడ్డగా లాల్ బహదూర్ శాస్త్రిగారి పేరు మాత్రం చరిత్ర సువర్ణాక్షరాలతో చిరస్థాయిగా లిఖించబడింది. లాల్ బహదూర్ శాస్త్రిగారు మాత్రం - భూతో భవిష్యతి. రాజకీయాల్లోను, పరిపాలనలోను, అంతటి నిబద్ధత, శాస్త్రీయత, మానవీయత మరింక కానరావేమో ?! ప్రజావళి ఎదురుచూడ్డం కన్నా వేరే దారి ఏముంది ? మహాత్మాగాంధి, జాతిపిత, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జన్మదినంతో పాటు మరోమహాత్ముని జన్మదినం కూడ అదేస్థాయిలో స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా వుంది అని మరోసారి వక్కాణిస్తూ, నివాళి సమర్పించమని కోరుతూ ... లాల్ బహదూర్ శాస్త్రి శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం నీరసంగా, చడీచప్పుడు లేకుండా నిర్వహించడానికి కారణమేమిటో మాత్రం నాకు బోధపడటం లేదు; ఉత్సవాలకోసం ప్రభుత్వం వందకోట్ల రూపాయలను కేటాయించినా, చాలావరకూ ఖర్చు చేయకపోవడం గమనార్హం. ఏది ఏమైనా, నెహ్రూ, ఇందిర, రాజీవ్ ప్రభుత్వాల్లో లాల్ బహదూర్ శాస్త్రికి మాత్రం కాంగ్రేసు నుంచి గౌరవం అందవలసినంత లభించనేలేదు - అని ప్రముఖ రచయిత, సీనియర్ పాత్రికేయులు, బ్రిటన్ లో భారత మాజీ హైకమిషనర్ - కులదీప్ నయ్యర్ ఒక ప్రత్యేక వ్యాసంలో సుస్పష్టంగా ప్రస్తావించడంలో గల సూక్ష్మాన్ని అందరూ గ్రహించాలి. నిత్య సత్య స్ఫూర్తి ప్రదాత - లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా, మహాత్మాగాంధి, జాతిపిత జయంతి సంబరాలు, ఉత్సవాల్లో కొద్దిపాటైనా శ్రద్ధ, చోటు చూపెడితే, మనం మన జాతినేతల పట్ల నిష్పక్షత, వివక్షత చూపెట్టడంలో కొంచెం ఆలోచిస్తున్నట్లే అని అనుకోవాలి. జై కిసాన్ భావ నిర్మాత, మరువలేని మరో మహాత్ముడు - లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా తెలుగురథం ఘన నివాళిని సమర్పిస్తోంది.

కొంపెల్ల శర్మ - తెలుగురథం.

 

 

2 comments:

srujana said...

Win Exciting and Cool Prizes Everyday @ www.2vin.com, Everyone can win by answering simple questions. Earn points for referring your friends and exchange your points for cool gifts.

vsrao5- said...

అయ్యా,
మీరు చేస్తున్న కృషి బహుదా శ్లాఘనీయం. తెలుగుకి తెలుగువారికి మీరిస్తున్న ప్రోత్సాహానికి ఇవే మా నెనర్లు.
- ఊ. సాంబశివ రావు, భాగవత గణనాధ్యాయయి
http://www.telugubhagavatam.com/