ప్రపంచ సంగీత ఉత్సవం - 1 అక్టోబర్
విజ్ణాన వేదాంతాలకన్న సంగీతం ఒక మెట్టు ఎక్కువే అన్నాడు ప్రముఖ సంగీతకారుడు 'బేథోవెణ్. విశ్వవ్యాప్తంగా మానవాళి ఉపయోగించే అద్భుతమైన భాష - సంగీతం. అని అంటాడు - లాంగ్ ఫెలో. సంగీతనౄత్యకళలు నాగరికతకు ప్రతీకలు భాషతోనే పుట్టాయి ఆటపాటలు. వాక్యం లయతాళబద్ధమైనప్పుడు పాటగా రూపొందుతుంది. భావం లయతాళాలకు అనుగుణమైన కదలికలను కరచరణాద్యవయవాల్లో కలిగించినప్పుడున్న నౄత్యం రూపొందుతుంది. మానవుని కళాత్మక చైతన్యానికి సంగీతనౄత్యాలు అందమైన ప్రతీకలు. సంగీతంలేని భాషలేదు. నౄత్యంలేని నాగరికత లేదు. లయాన్వితంగా వెలువడిన భాషకు శ్రవణతర్పణగుణం ఉంటుంది. చెవులకి ఇంపులేని భావానికీ, భాషకూ ఆకర్షణ లేదు. కనుకనే సంగీతాత్మకమైన భావమే కవిత్వమన్న భావానకు ప్రాచుర్యం లభించింది. కవిత్వాన్ని రాగమాధురిమలతో సుసంపన్నం చేసిన మహనీయుల జీవితాలు ధన్యమైనాయి. సంగీతసాహిత్యాలు అవిభాజ్యాలు - సాక్ష్యం సరస్వతీదేవి. సంగీతం ఓ అధ్బుతం - సౄష్టిలో దాని స్థానం అద్వితీయం. కనుకనే మనుషులేం ఖర్మ? దేవతలు సైతం సంగీతాన్ని వదలలేకపోతూంటారు. ఒక్కోసారి వేణువు, ఒక్కోసారి డమరుకం సాయంతో సంగీత సాధనం జరుగుతుంటుంది. బహుశ ఆ కారణంగానేమో - చదువలతల్లి సరస్వతీదేవికి కూడా ఓ చేతిలో పుస్తకం వుంటే,మరోచేతిని వీణ అలంకరించింది. జడత్వం నిండిన దీపం సయితం ప్రకాశపుంజంగా మారిపోగలగడమే సంగీతానికి అసలైన గీటురాయి. పై మాటలు అన్నవి ఏ వాగ్గేయకారుడి భాష్యమో అవగతం అవటంలేదు. కాని, ఈ భావాన్ని వ్యక్తం చేసినది - భారత తొలి రాష్ట్రపతి - డా.బాబూ రాజేంద్రప్రసాద్, ప్రముఖ కళాభిమాని.
సంగీతం - మానవజీవితం. జీవితంలాగే సంగీతానికి గుర్తింపు వుంది కాని, ఆ కళను అర్ధంచేసుకుని, ఆకళింపుచేసుకుని, అనుభవిస్తూ, ఆచరించేవాళ్ళు చాలా తక్కువ అనే చెప్పాలి. అందుకే, సంగీతం లేకుండా జీవితం పెద్దఘోరం అంటాడు ప్రసిద్ధ జర్మన్ తత్వవేత్త ఫ్రెడ్రరిక్ నీట్జిషె. ఈ మధ్యకాలంలో పెరుగుతున్న అవగాహనను బట్టి, భౌతికంగా, మానసికంగా, సంగీతంవల్ల ప్రయోజనాలు మానవాళి ప్రయోజనాల్ని పొందడం తధ్యం అనే భావనకు రావడం జరుగుతున్న పరిణామం శుభదాయకం. రాగభావనతో చెప్పాలంటే, మానవజీవితంలో ఆద్యంతాలైన జననమరణాల్లో ఏడవడం, ఏడిపించడం రెండూకుడా సంగీతఛాయల్లో కనిపిస్తాయి.
సంగీతం - మానవీయత 'ఓ నాదమా, నీ ధ్వనిలోతుల్లో మా గుండెను పేరుస్తాం, ప్రాణాల్ని అర్పిస్తాం, చెవులతో చూడగలుగుతున్నాం. గుండెలతో వినగలుగుతున్నాం' అన్నాడు ఓ కవి. లలితకళల్లో ఘనమైన కళగా విరాజిల్లుతున్న సంగీతం - అణగారిన ప్రేమకర్చే కన్నీళ్ళకు మాతౄమూర్తిలా, కవులకు, వాగ్గేయకారులకు, శిల్పకళాకారులకు ప్రేరణామూర్తిలా, సౌందర్య భావనలో ప్రేమామౄతమూర్తిలా, ప్రాణాలను కోల్పోతున్న జీవిలకు శక్తిలా, సున్నిత దయాసాగరస్ఫూర్తిలా గోచరిస్తూంది. సంగీతం - సరాగశైలి భారతీయ హైందవ ధర్మ సంస్కౄతీకళాపరంపరలో ఒక అంతర్భాగంగా, భారతీయ మేధోన్మయమూర్తులకు ప్రత్యేకశైలిలో అవతరించినదన్నది సత్యం. ప్రత్యేక లక్షణ, లక్ష్యములవల్ల ప్రపంచ సంగీతకళకి సరిసములులేనిదిగా తలమానికంగా అలరిస్తోంది. దీనికి నిర్వచనోదాహరణంగా, 'రాగా పద్ధతిగా, స్వరరాగాలాపనలో విశిష్టప్రక్రియగా ప్రఖ్యాతమవుతూంది.
సప్తస్వర సమన్వయం శిశుర్వేత్తి పశుర్వీత్తి వేత్తి గానరస: ఫణి: అన్నది ప్రాచీనసూక్తి. శిశువులు, పశువులు, పాములు సంగీతానికి ఆనందం పొందుతాయి అని అర్ధం. సోమదేవుని 'కధాసరిత్సాగరం'లో సంగీత ప్రస్తావన వుంది. భరతముని రచించిన - భావ-రాగ-తాళ సమన్వితమైన నాట్యశాస్త్రంలో కూడ అనేక సంగీతపరమైన ప్రస్తావనలు కానవస్తాయి. వాస్తవానికి బాష పుట్టుకకు ముందే సంగీతం జంతువుల అరుపుల అనుకరణం ద్వారా ఉద్భవించిందని కూడ మన ప్రాచీనులు వివరిస్తారు.
భాషకు అతీతమైంది సంగీతం అయితే, శ్రావ్యత దాని పరమధర్మం. ఏ ప్రాణికైనా అది ఇంపుగా, వినసొంపుగా వుంటుంది. యింతటి నేపథ్యకధనంగల భారతీయ సంగీతం సప్తస్వరసహితమైంది. స్వప్తస్వరాలను - 'స, రి, గ, మ, ప, ద, ని,' అన్నవి. వీటికి సంకేతాలను కూడ నిర్ధారించారు. అవి - షడ్జ, రిషభ, గాంధార, మధ్యమ, పంచమ, దైవత, నిషాదాలకు సంకేతాలు. స - నెమలి అరుపు నుంచి; రి - ఎద్దురంకె నుంచి, గ - మేక అరుపు నుంచి, మ - నక్క ఊళ నుంచి, ప - కోయిల కూజితం నుంచి, ద - గుర్రం సకిలింపు నుంచి, ని - ఏనుగు ఘీంకారం నుంచి - రూపొందించినట్లు మన శాస్త్రజ్ణులు, పండితులు భావన వ్యక్తపరచారు. ఫలితంగా - మన సమజం లో ప్రముఖ జీవులైన - నెమలి, ఎద్దు, మేక, నక్క, కోయిల, గుర్రం, ఏనుగు వాటి సవ్వడులుంచి మనకు సంగీతం రాగా, అది సమాజానికి నేడు అజరామరమైన కళగా, దివ్యౌషధంగా అక్కరకు వస్తూంది. ఆ జీవరాసులు నేను సైతం అంటూ అగణిత సేవలను మానవాళికి అందిస్తున్నాయి. కాని వాటికి మనం చేస్తున్న సహాయం ఏమిటి ? సహాయం మాట ఎలా వున్నా, మనం హింసామార్గాలు అవలంబించి, వాటిని హతమార్చి, మన వినోదానికి, ఆహారానికి, లౌకికావసరాలకి వాడుకుంటున్న వైనం, తీరుతెన్నులు, మనం వేరే పాపం చేయడం ఎందుకు? ఎంతెంత పుణ్యం చేసుకున్నా, మనకు నరకం మాత్రం అనివార్యం. అంటే మనం సమాజంలో భాగంగా పశు, పక్ష్య, జంతు, వానర, క్రిమి, కీటక, స్థావర, జల, చరాది జీవరాశులపై కరుణాకటాక్షాలను రవంతైనా ప్రదర్శించవలసిన కనీస విధికర్తవ్యాలను మరవరాదు అన్నది గ్రహించాల్సిన తరుణం ఈ రోజు - ప్రపంచ సంగీత ఉత్సవం నాడు ప్రతిజ్ణ చేయాలి అని వేరే వక్కాణించవలసిన అవసరం లేదు. అందుకే సమజం - అంటే ఈ జీవరాశులుండే స్థలం. అది కానిది, అంటే మనుషులుండేది - సమాజం - సమజం కానిది. ఈ సప్తస్వరాలకు 22 శౄతులు ఆధారం కాగా, వాటిని రకరకాలుగా కలిపితే రాగాలు ఉద్భవించాయి. వాటిలో ప్రముఖమైనవి 72 అని, వాటిని మేళకర్తరాగాలని నిర్ణయించారు మన పెద్దలు. వీటిని 'జనకారాగాలని, స్వల్పాతిస్వల్ప మార్పులతో మరెన్నో ఉపరాగాలను సౄష్టించారు. వాటిని 'జన్యారాగాలని నిర్ధారించారు.
వేదసంస్కౄతికన్నా ప్రాచీనం - సంగీతం. భాష పుట్టుక కన్న ముందునుంచే సంగీతం వుందన్నాం కదా. యిలా నియమాలు ఏర్పాటు చేసినప్పటికీ, సంగీతం వేదసారస్వతం ముందు కాలానికే సంగీతం వికాసం చెందించి అని చెప్పాలి. వేదాలలో, సంగీతం గురించి, సంగీత వాద్యవిషేషాలను వర్ణిస్తూ ఎన్నో సూక్తులు, ప్రస్తావనలు దర్శనం అవుతాయి. సామవేదం - రాగాధారభూతమైన స్వరసంపన్నసమన్వయం అని చెప్పవచ్చు.
రాగాలు - పౄకౄతి ప్రసాదమైన ౠతువులు సాంప్రదాయంగా వస్తున్న అభిప్రాయాన్ని చెప్పాలంటే - సంప్రదాయ సంగీతపు - ఆరు రాగాలు, ఆరు రుతువులకు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి అని చెప్పవచ్చంటారు మన ప్రాచీన విశ్లేషకులు. ఈ విషయాన్ని ప్రస్తావించిన విద్వాంసుల్లో - సోమేశ్వర చక్రవర్తి - చాళుక్య సామ్రాజ్యాధిపతి (1127-1137 క్రీ.శ.) - గాత్ర, వాద్య సంగీత విధానాలు తన 'మానసోల్లాసం' అనే గ్రంధంలో వివరించాడు. ఆయన, 'పండిత దామోదరం' రచించిన 'సంగీతదర్పణం' (16-17 శ.) లో వివరించాడని ప్రస్తావిస్తూ - రాగాల్ని, ౠతువుల్ని సమన్వయం చేయడం జరిగింది. వాటి తీరు యిలా వుంది. భైరవి, మేఘ, పంచమ, నటనారాయణం, శ్రీ, వసంత రగాలను ఆరు ౠతువులకు అనుబంధంగా చెప్పబడ్డాయి. అయితే, ఈ ౠతువికి, యిదేరాగం అని బద్ధతతో చెప్పడం మాత్రం జరుగకపోవచ్చు. ౠతువులతో పాటు, ప్రత్యేక సమయాల్లో (రాత్రి, పగలు) కూడ రాగాల్ని అన్వయించుకోవడం భారతీయ సంప్రదాయ సంగీతం విశిష్టత అనె చెప్పాలి.
భావం - రస, రాగ, లయ సమన్వితం 'భావం' అనే పదం - భూ - భవ్ అనే ధాతువులకి మూలం. భావం ప్రకటన చేస్తేనే స్పష్టత గోచరమవుతుంది. సంగీత కౄతిలో - భావం, రస-రాగ-లయ సమనివమై, భాష స్వతంత్ర పరమైన కౄతికర్తశైలి, స్వరకర్త విధివిధానం కలసి వివిధ పాత్రలు వహించడం జరుగుతుంది. సంగీతకౄతిలో సాహిత్యం లేక మాటల సముదాయం చాలా ప్రధానపాత్ర పోషిస్తాయి. భావ ప్రకటనకి సంగీత స్వర సహిత నిర్మాణం చేదోడుగా నిలుస్తుంది. సంగీతకౄతిని అర్ధవంతంగా, సత్య, శివ, సుందర శైలిలో విడుదల చేయాలంటే - భావగర్భితంగా, సంగీత సభను అలరించేవిధంగాసంగీత విద్వాంసుడు తన కౄతిద్వారా భావ ప్రకటనని ప్రస్తుతించాలి. కళాకారుడు - తన అనుభవం, ఆలోచన, మానసిక పరిపక్వత దశలను కౄతికర్తనుంచి స్వరకర్త వరకూ, కళాకారుడినుంచి సంగీత శ్రోత, ప్రేక్షక, రసికులవరకూ - ప్రసరింపచేయగలిగితే, భావపరంగా న్యాయం జరిగినట్లే అని భావించాలి. వ్యక్తిగతంగా, ప్రతి వ్యక్తి అనుభావానుభూతి పొందగలిగితేనే, భావ ప్రకటన సమంజసంగా జరిగినట్లే అనుకోవాలి.
గమకం - సంగీతంలో కళ, శాస్త్రం గమకం - 'గం - గఛ్ఛా నుంచి వచ్చింది. 'గమ-గమనా పదాలతో సంబంధమైంది. సంగీతపరంగా అన్వయించుకోవాలంటే, 'స్వరం' యొక్క ప్రస్థాన ప్రక్రియ - స్వస్థానం నుంచి అన్యక్షేత్రంలోకి గమనం. అభ్యాసంలో - స్వరప్రస్థాన ప్రకటనతో 'గమకం' పని పూర్తి కాదు. కొన్ని గమకాలని నిర్వహించడంలో,ప్రత్యేక శైలీవిధానంలో, ఖండికను ప్రస్తుతించే విధానాన్ని అమలు చేయడంద్వారా స్వరం ప్రాధాన్యత సంతరించుకుంటూంది. సంగీతంలో తాళ ప్రధానం ప్రత్యేక నాదశైలి, గణాంక స్వభావత, కలిపిన తాళ ప్రిక్రియ అంతర సమన్వయం, లక్షణలక్ష్యాలు, గణాంక నిబద్ధతతో కూడిన ఈ ప్రత్యేక 'తాళా విధానం - కర్ణాటక సంగీతానికి ప్రాణప్రదమైన ప్రక్రియగా అలరారుతోంది. సంప్రదాయ కర్ణాటక సంగీతంలో 'తాళా ప్రాధాన్య ప్రభావాలు ఖచ్చితమే కాకుండా, సుందరమైన అతివ్యాప్తి, అవ్యాప్తి దశలను సమంజసంగా అందజేస్తుంది. భారతీయ సంప్రదాయ సంగీతానికి ప్రతిభాపాటవాలను కలిగించిన సంగీత ప్రక్రియల్లో - తాళ ప్రాధాన్యత వేరేవాటితో పోల్చతగ్గదికాదు. శౄతి, లయ, తాళ దశ ప్రాణులు. సంగీతపర సాహిత్యంలో తాళ ప్రస్తావనలు, మార్గి, దేశి తాళ పద్ధతులు, లఘుదౄతం, అనుదౄతం, యిత్యాది విధాలుగా తాళం సంగీతంలో మిళితమై, సంగీత ప్రాభవానికి కౄషి సల్పుతోంది. ఆది, రూపక, మిశ్రచాపు, ఖండచాపు తాళాలు, కర్ణాటక సంగీతంలో ఎక్కువగా వినియోగింపబడిన తెగలు. అదే హిందూస్తానీ సంగీతంలో - చతురస్ర, లఘు, దౄతంతో, సామాన్యతాళం (తీన్ తాళ్) వినియోగింపబడినా, అధ్బుతమైన శైలికి దారితీస్తూంది. త్యాగరాజు, ఆయన కీర్తనలను అత్యధికంగా 'ఆదీతాళశైలిలోనే రచించడం జరిగిందని పండితులు చెబుతారు. పాశ్చాత్య సంగీత పద్ధతిలో 'సాధారణ సమయతాళం' వాడుకలో వుంటుంది అని చెబుతారు. సంగీత పరిజ్ణానం కన్నా రసికత, కళాహౄదయం ప్రధానం విశ్వసౌభ్రాతత్వం, వసుధైక కుటుంబం, మానవాళి మాధ్యమభాషగా అలరిస్తున్న సంగీతకళను ఆనందించి, ఆస్వాదించడానికి 'రసికతా, కళాహౄదయం' ప్రధానంగాని, విశిష్టజ్ణానం, అంతగా అవసరం లేదని అనుకోవచ్చు. నాదప్రధానమైన సరసస్వరసురఝరీగమనశైలిలో విరాజిల్లుతున్న సంగీతానికి ఎల్లలు, భాషా పరిధులు లేవు, రావు, రాకూడదు. రాగాలకు లింగ నిర్ధారణ సంగీతపరంగా సౄష్టించబడిన రాగాలకు ప్రాచీనకాలంనుంచే, లింగ నిర్ధారణ కూడ జరిగింది. మాతంగునిచే విభజింపబడిన ఈ పద్ధతి (500 క్రీ.పూ.)కి ముందే, శార్దూల, యస్తిక, దుర్గాశక్తి, కాశ్యపులచే స్త్రీ పురుష రాగాలుగా విభజన జరిగినా, సుస్ఫష్టంగా, పాల్కురికి సోమనాధుని (1300) బసవపురాణం ద్వారా సాహిత్యంలో ప్రస్తావన జరిగింది. అతనే, తిరిగి 'పండితారాధ్యచరితం' లో పునరుద్ఘాటించాడు. కాని, మూడవ లింగం (నపుంసక) లింగం ప్రస్తావించాడు. హిందూస్థానీ సంగీతంలో - 'రాగమాలా(1576), 'నర్తన నిర్ణయా (1605) రచ్కనల్లో, పుండరీక విఠ్ఠల ప్రస్తావించాడు. యిలా ప్రారంభమైన రాగ నిర్ధారణ ఎన్నో మలుపులు తిరిగాయని పండితుల అభిప్రాయం. 'రాగ-రాగిణీల జననసంయోగం రాజస్థాన్ సామ్రాజ్యాధిపతి - ప్రతాపసింహుడు (1779-1804), సంగీత-నాట్యశాస్త్రాలపై 'రాధాగోవిందసారం' ఉద్గ్రంధ రచనను చేయగా, దానిలో రాగ-రాగిణి ల జననం, హనుమన్మత శివతాండవాన్ని దేవతలు-రాక్షసులు వీక్షించేందుకు సమావేశమవగా, రాక్షసులు యిబ్బందులు కలిగించగా, దేవతలను రక్షించే ప్రయత్నంలో, రాక్షసశిక్షకు ప్రతీకగా, శివుడు తన అఘోరవదనం నుంచి 'భైరవరాగం, మిగతా నాలుగు వదనాలనుంచి - మాలకౌన్స్, హిందోళ, దీపక, శ్రీ, మేఘ రాగాలను జననం చేయించాడు. ఈ రాగాల్లాపన విని, రాక్షసులు భయకంపితులై వెళ్ళిపోగా, దేవతలు సంతౄప్తిచెందారు. అయితే, ఈ ఆరురాగాలు, శివుని ప్రార్ధించగా, పార్వతి సలహే మేరకు వరాలు ప్రసాదించిన భాగంగా, ఒక్కొక్క రాగానికి అయిదుగురు సహరచులని (రాగిణిలను) సౄష్టించి, ఈ రాగాలను గానంచేసినవారి ప్రతీకోరిక నెరవేరుతుందని అభయం వెలిబుచ్చాడని కధనం. వీరికి సంతానం పుట్టి ఆరు కుటుంబాలయ్యాయట. ఆరుగురు పురుష రాగాలకు, ఒక్కొక్క రాగానికి 5 స్త్రీరాగాలు, వీరికి 47 మంది సంతానం కలిగిందని కూడ కధనాలు దర్శనం యిస్తాయి. వెంకటమఖి విభజన యిలా సౄష్టింపబడిన రాగాలు, ఎన్నో సవరింపులతో, ఎందరో విద్వాంసులు చేసిన వేర్వేరు విభజనలు, చారిత్రాత్మకంగా పరిణామం చెంది, సంగీతశాస్త్రాన్వయంచెంది, అభ్యాస, శిక్షణాప్రక్రియల్లోకి, 17 శ. నాటి వెంకటమఖి ప్రతిభాప్రేరణలతో, 20 శ. నుంచి, ఒకకొత్త పధాన్ని తొక్కింది. ఫలితంగా, 72 మేళకర్తరాగ సంప్రదాయానికి నాందీ పలికింది. రాగవిభజన ప్రక్రియ కర్ణాటకలో ఉద్భవించి, పెరిగి, హిందూస్థానీ సంగీత పద్ధతిలో కూడ విస్తరించింది. కర్ణాటక సంగీతం, కన్నడిగల నుంచి రాగ విభజన, హిందూస్థానీ సంగీత విద్వాంసులు ప్రేరణ పొందారు. 20 శ. 'మేళా సంప్రదాయం పాటించి జనక-జన్యరాగాలపై దౄష్టిసారించడం జరిగింది. అహోబలాది సంగీతవిద్వాంసులు విరివిగా హిందూస్థానీపర రాగవిభజనను ఆచరించి, ఆదరించడం జరిగింది. చివరగా 1660 లో 'చతుర్దండిప్రకాశికా - తంజావూర్ లో ఉద్భవించింది. ఈ రచన, కర్ణాటక సంగీతం - ఆధునిక పోకడలను పోహళించుకుని - సంగీత పితామహుడు, మార్గదర్శకుడు - వెంకటమఖి రచనని చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ నుంచి, పండితుడు సుబ్రహ్మణ్యశాస్త్రిగారు అన్నవారు 1934 లో ప్రచురించిన వైనం సంగీతజగతి చేసుకున్న పుణ్యపరంపరలో భాగం. ఈ గ్రంధంలో, స్వరాలు (శుద్ధ, వికౄత), వాటికి లక్ష్యలక్షణాలని వివరిస్తూ, నిర్వచనోదాహరణాలను ప్రస్తుతించారు. సంగీతం - నాదవివరణం సంగీతం ద్వారా వచ్చే 'నాదా ధోరణులకు కూడ విభజన చేయడం జరిగింది. శరీరజ (శరీరం ద్వారా వచ్చే ధ్వని - గాత్రం), నఖజ (గోళ్ళద్వారా - వీణ, గొట్టువాద్యం, బిన్, సుర్ బహార్), ధ్వనిజ (వంగిన పరికరాలు - సారంగి, దిల్ రుబ, వైలన్), వాయుజ (గాలిమాధ్యమాలు - వేణువు, నాగస్వరం), చర్మజ (తోలుతొడిగినవి - మౄదంగం, తవిల్, తబల, డోలక్, తంబట్ట), లోహజం - లోహాలతో చేసినవి - సింబల్, తాళం). ధ్వని స్వఛ్ఛత, ప్రధానంగా విభజింపబడిన తరగతులు అని భావించాలి. దీనినే, తట, బితట, సుశిర, అనబధ్వ,ఘన సంగీత వాద్య పరికరాలుగా కూడ విభజించారు. కాలసమయ సందర్భస్ఫూర్తి - రాగనిర్ణయం రాగాల్లోని అంతర్లీన లక్షణాలనిబట్టి - ప్రకౄతి వాతావరణ, సమయాలకు అనువైన రాగాలను ప్రతిపాదించారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్ర సమయాల్లో ప్రదర్శీచతగిన రాగాలను వివరించడం, వాటిని శాస్త్రీయంగా ఆచరించడం కూడ జరుగుతోంది. (ఉదాహరణకి : ఉదయం (భైరవి), మధ్యాహ్నం (సారంగి), సాయంత్రం (కళ్యాణి). శౄతిలయలు - సంగీతం ఆధ్యాత్మక, ధ్యానసంగీతానికి సంగీతం సన్నిహితం అన్నది సత్యం. సంగీతంలో శౄతి, ముఖ్యమైన అంశం. సంస్కౄతంలో సూక్తి ప్రకారం - 'శౄతిర్మాత: లయ: పిత:" - శౄతి తల్లి, లయ తండ్రి. సంగీతం - గాత్రంలేక వాద్యం - శౄతిసహిత ప్రదర్శన అయితేనే - మాతౄ సాదౄశకమవుతుంది. అదిలేనిదే, కేవలం గీతం కాని, సంగీతం అనిపించుకోదు.
దక్షిణ, ఉత్తర భారత సంగీత ప్రాంతాల వారధి - వింధ్య కొండలు రాగ-రాగిణిల పున: సమన్వయం చేసి, గత ఐదు శతాబ్దాలుగా అనుసరింపబడుతున్న విధానానికి కొత్తరూపు, ఊపు నిచ్చిన సంగీత మహావిద్వాంసుడు - తాన్సేన్. ఫలితంగా, ఉత్తరభారత సంగీతం - వింధ్యాగిరుల ఆవలి సంగీతధోరణి అన్నది అవతరణకు వచ్చింది. వింధ్య పర్వతాలు భౌగౌళికంగా లేకపోతే - 'భారతీయ సంగీత సంప్రదాయ శైలీ అన్నది వేరే పద్ధతిలో ఉండేది అన్నది మరువరాని మాట. సంగీతం - తాన్ సేన్ అవిభాజ్యాలు 'తాన్ సేణ్ అంటే సంగీత స్వరాలు ప్రవహించే సైన్యం' అనే అర్ధం వస్తుంది. హిందు-ముస్లిం సంస్కౄతుల ఐక్యతాభావాన్ని ప్రతిబింబించేశైలి. 'రాం తాణ్ - హిందూ బ్రాహ్మణుడు ముకుంద్ పాండే కుమారుడు. ముస్లిం ముని - ముహమ్మద్ గౌస్, 'రాం తాణ్ లో బాలకళాకారుణ్ణి కనుగొన్నాడు. తాన్ సేన్ ముస్లింపేరు - మహామ్మద్ ఖాన్. ఆన్ సేన్ 1506-1589 మధ్యకాలంలో జీవించిన అసమాన ప్రతిభాశాలి. క్రమంగా ఆయన ప్రతిభకు గుర్తింపుగా - నవరత్న ఆస్థాన సంగీత విద్వాంసుల్లో - ఒకరిగా అక్బర్ పాదుషా ఆగ్రా రాజాస్థానంలో కొలువు సంపాదించడం జరిగింది. హరిదాసముని - తాన్ సేన్ లోని రహస్యాఅలను కనుగొని, బౄందావనంలో పదేళ్ళుగా అభ్యాసం పొంది, గ్వాలియర్ మహారాణి ఆస్థానంలో చేరాడు. హిందూకన్య - ముస్లింపేరు 'హుస్సేనీ'ని వివాహమాడగా, నలుగురు కుమారులు సంగీతకళాకారులుగా, కూతురు సరస్వతి, విణావిద్వాంసురాలుగా పేరుపొందడం వెనుక దాగిన కౄషి, సంకల్పం, దీక్ష, పట్టుదల, వర్ణనాతీతం. వింధ్యకు ఆవలి సంగీతధోరణులు వింధ్యపర్వతాలకు ఆవలిపక్కన, అనేక రూపాల సంగీత ప్రక్రియలు అలరించబడ్డాయి. అందులో 'ద్రుపడ్ గాత్ర సంగీతం దీర్ఘస్వరసహితం, బౄందావన - బ్రజ్ భాష (వ్రజ - గోపగోపికల భాష) సంబంధితం. బ్రిటిష్ దొరల పరిపాలనలో - కొత్త తరహా సంగీత ప్రక్రియలు పుట్టుకొచ్చాయి. వాటిల్లో - ఖయాల్ ప్రక్రియ్ను శ్రీ పన్నాలాల్ ఘోష్ అన్వేషణలో ప్రఖ్యాతమయ్యింది. తుమ్రి - ప్రక్రియ కరుణ, శౄంగార రస ప్రాధాన్యతతో, 18-19 శ. లో భాగా ప్రచారమయ్యింది. యింక రవీంద్రసంగీతం సంగతి వేరే చెప్పనక్కరలేదు. నాటికీ, నేటికీ, బహుఋళ ప్రచారమార్గంలో పయనిస్తూనేవుంది. రవీంద్రసంగీతానికి మన మహానుభావుడు - మంగళంపల్లి బాలమురళికౄష్ణ - తనదైన ప్రతిభతో - ఒక కుదుపు కుదిపాడు అన్నది చరిత్ర చెప్పిన సాక్ష్యం. అమీర్ ఖుస్రో - ప్రముఖ సంగీత కళాకారుడి నూతన సౄష్టి - ఖవాలి - హిందువులు, ముస్లిములు సంయుక్తంగా గానం చేయబడుతున్న ప్రక్రియగా మారింది. అలాగే, ఘజల్ (ఆలాపనలేని, పర్షియన్ సంప్రదాయ కౄతి), ధున్ (స్వఛ్ఛంద రాగనిర్ణయంతో జానపద గుబాళింపు), గత్ (ఆలాపనకు ముందుగా) - పేరువహించాయి.
భాష, సరిహద్దులు లేనిదే సంగీతకళ నిజమైన సంగీతకళాకారుడు - ప్రపంచం - చిన్న గ్రామమైపోతున్న సమయాన, గ్రామం కాదు - నిజంగా వసుధైవకుటుంబంగా మారిపోతున్నకాలంలో ఏ సంగీత ప్రక్రియనైనా, విశ్వవ్యాప్తం చేస్తూ అనుబంధం పెంచుకోవాల్సిన తరుణంలో, విభజనధోరణి పాటించరానిది అన్నది ఆలోచనాత్మకం. సంగీతం ద్వారా దక్షిణం, ఉత్తరం - ఏదైనాసరే, అందుకునే మధురానుభూతివల్ల రక్తాన్ని తాకుతూ, హౄదయాంతరాళ్ళోకి సూటిగా ప్రవేశింపచేయగలగాలి. మేధస్సుని ప్రశాంతంగా మలచుకోగలిగిన దివ్యౌషధంగా సంగీతం అన్నది మాత్రం సత్యం. ఆవేదన, ఆందోళనలను సుదూరం చేసి, మనసావాచాకర్మణా సిద్ధత్వం, శుద్ధతని ప్రసాదించాలి. జీవితాన్ని అందంగాను, ఆనందంగాను మార్చాలి. సంగీత స్వర కుటుంబీకరణం సారంగదేవుని 'సంగీతరత్నాకరం' (13 శ.), నారదశిక్షలో సప్తస్వరాలకు వేరుగా కుటుంబం, రంగు, కులం, స్వరసంకేతం, ప్రేరణాశక్తులు, ప్రకౄతిసిద్ధరూపాలకింద విభజన జరిగింది. భారతీయ సంగీతశాస్త్ర పద్ధతుల్ని - శౄతి, స్వర, తాళ, గమకాది విషయాల్లో వివరించడం జరిగింది.
మారుతున్న విలువలు, ధోరణుల మధ్య సంగీతం 'భాషా విభజనకు దారితీస్తే, 'సంగీతం' కలుపుతోంది అన్నది సత్యం. నాగరికతకు ఏకైన శక్తి, సంగీతమే భాషగా మారింది. దైవత్వాన్ని పొందింది. విశ్వవ్యాప్తమైంది. అన్నిరకాల అవరోధాల్ని, పరిధుల్ని త్రోసిరాజంది. లలితకళల్లో - ఘనమైనది, అజరామరమైనది, సంగీతకళ ప్రధమస్థానం అందుకుంది. భారతీయతలో సంగీతం విలీనమైంది. ఉత్సవాలు, ఆరాధనోత్సవాలు జరుపుకుంటున్న పర్వకాలంలో ఉన్నాం ప్రస్తుతం. నాట్యాది కళలకు సంగీతం ప్రాణప్రదమైంది. ఉత్సవాల్లో భాగంగా - తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ దక్షిణప్రాంతాలతోపాటు, ఢిల్లీలోని ఖాజీనయీముద్దీన్-అర్స్, మరియు శ్రద్ధాంజలిలో భాగంగా, తులసీదాస్, కబీర్, తూకారాం, భక్తరామదాస్, పురందరదాసు, సూరదాస్, మీరా, అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న - తాన్ సేన్, త్యాగరాజ ఆరాధనోత్సవాలు కళాత్మకంగా జరుగుతూనేవున్నాయి. బహుళప్రజాదరణ పొందుతూనేవున్నాయి. ఆంధ్రదేశానికి వరప్రసాదం - సంగీత త్రిమూర్తులు - త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి మహానుభావులు స్వతహగా ఆంధ్రులు కావడం, యాదౄఛ్ఛికంగా ఆనాడు పరిస్థితులవల్ల దక్షిణాంధ్రప్రాంతానికి వలసవెళ్ళడం జరగడం కేవలం ఒక సంఘటనగానే పేర్కొనాలి. ప్రముఖాంధ్రులు, సంగీతకళాకారులు - ఈనాదు శతవసంతలత సంగీత గురువులకే గురువులుగా మార్గదర్శకత్వం వహిస్తున్న డా. శ్రీపాద పినాకపాణి గారు, మన మంగళంపల్లి బాలమురళీకౄష్ణ,నేదునూరి కౄష్ణమూర్తి, ఈ పరంపరలోనే తమదైన ప్రతిభను అందిస్తూనే వున్నారు. అలరిస్తూనే వున్నారు.
ప్రముఖ సంగీత వాగ్గేయకారులు రచనలను స్వయంగా నిర్మాణం చేసుకుని, వాటిని తనదైన ప్రతిభతో స్వరరాగబద్ధం చేసుకుని, గానం చేయగలిగిన త్రివేణీసంగమైన ప్రతిభను పుణికిపుచ్చుకున్న పుంభావసరస్వతీమూర్తులను వాగ్గేయకారులు అని భావించుకోవాలి. అట్టికోవలో, మనకు ఉన్న సంపన్నమూర్తులు - జయదేవుడు, పురందరదాసు, సూరదాసు, తులసీదాసు, అన్నమయ్య, పెదతిరుమలాచార్యులు, నారాయణతీర్ధులు, క్షేత్రయ్య, రామదాసు, సారంగపాణి, పోతులూరి వీరబ్రహ్మం, మునిపల్లె సుబ్రహ్మణ్యకవి, శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, సుబ్బరాయశాస్త్రి, స్వాతితిరుణాల్, మైసూర్ వాసుదేవాచార్య పరంపరను ముందుకు కొనసాగిస్తున్న మంగళంపల్లి బాలమురళీకౄష్ణని ప్రముఖ వాగ్గేయకారుల్లో చెప్పుకోవాలి.
ప్రపంచ సాహిత్యాలన్నిటా పద, పద్యకవితల్లో పదమే ప్రారంభం అన్న విషయం పండితలోకానికి విదితం. సంకీర్తన పద్ధతిని కౄష్ణమాచార్యుని 'సింహగిరీ వచనాలతో ప్రారంభమైనా, అన్నమాచార్య సంకీర్తనలతోనే పదరచన సమున్నతస్థాయికి వచ్చింది. నేటి భారతీయ సంగీతం లో వివిధ ప్రక్రియలు కర్ణాటక, హిందూస్థానీ సంగీతాలు స్థూల విభజన అయితే, భక్తి, కాలక్షేపం, నాట్యం, జానపదం, జాతీయత, దేశభక్తి సంగీతపద్ధతులు ప్రస్తుతకాలంలో అలరింపులుగా ఉన్నాయి. కర్ణాటకసంగీతంలో - కచేరీ సంప్రదాయాన్ని అనుసరించే పద్ధతితోపాటు, గీతం, స్వరజతి, జతిస్వరం, వర్ణం, కీర్తన, కౄతి, రాగమాలిక, తాళమాలిక, పదం, జావళీ, తిల్లానా లను ప్రముఖంగా ప్రస్తావించాలి. ఆఖరుగా ప్రస్తావిస్తున్నా, ప్రముఖ శాఖలుగా విరాజిల్లుతున్న - లలితసంగీతం, జానపదసంగీతం, చిత్రసీమకు ఆయువుపట్టైన చిత్రసంగీతం శాఖల్ని కూడ మరువరాని మెరుపులు, సంగీతకళకు ముఖ్య ప్రస్థానాలు.
సంగీతం గురించి .. ఎందరోమహానుభావుల పలవరింతలు. సంగీతం గురించి ఎందరో మహానుభావులు నిర్వచించారు, నిర్ధారించారు. వర్ణించారు. అనుభూతిని ప్రకటించారు. సూక్తులను వల్లెవేశారు. దాని సారాంశం యిలా చెప్పుకోవచ్చు.
- నానాటికి ఆత్మకి పట్టే మలినాలని దూరం చేయగలిగేది - ఈ సౄష్టిలో ఒక్క సంగీతమే - ఎవర్టెక్.
- ఎంతటి కోలాహలంలోనైనా సంగీతాన్ని వినగలిగే మనుషులు జీవితంలో గొప్పగొప్ప ఫలితాలని సాధించినట్లే. - డా. విక్రం సారాభాయి.
- తన సంగీత మధురిమలులేని మనిషి, మధురమంజుల సంగీత సుస్వరాలకి స్పందించని మనిషి, సౄష్టిలోని సున్నితమైన అధ్బుతాలని అందుకోలేడు. - షేక్స్ పియర్.
- పగిలిముక్కలై చెదరిపోయే హౄదయానికి దివ్యమైన ఔషధం - సంగీతం. - యం. హంట్.
- సంగీతాన్ని దేవతల భాషగా అభివర్ణించడం సబబే. - కార్లైల్.
- మనం పాడకపోతే హృౠదయం బీటలు వారుతుంది. - ఠాగూర్.
ప్రపంచవ్యాప్తంగా సంగీతోత్సవం - 1 అక్టోబర్.
ప్రపంచంలోని వివిధవర్గ, జాతులమధ్య సఖ్యతకోసం, సంస్కౄతులమధ్య సమన్వయం, ఆదాన ప్రదానాలకోసం అంతర్జాతీయ సంగీతోత్సవాల్ని జరుపుకునే సత్సంప్రదాయంలో భాగంగా, 1971 అక్టోబర్ 1975 నుంచి ప్రారంభం అయ్యాయి.
ప్రముఖ సంగీతకళాకారుడు యెహందిమెనుహిన్ చేతులమీదుగా ప్రారంభమైన ఈ శుభదినోత్సవాలు ప్రతీఏట జరుగుతూనే ఉన్నాయి. విశ్వమానవాళికి సంగీతనాదాలు వినిపిస్తూనేవున్నాయి. తారకమంత్రంలా దివ్యశక్తిని అందిస్తూనే వున్నాయి.
కొసమెరుపు
హౄదయసంగీతాన్ని ఎప్పుడూ కాగితం మేద పెట్టలేం. - పాబ్లో కాసల్క్స్.
సంగీతం పలకలేని ప్రేమభావన ఏమున్నది ? - జాన్ డ్రైడన్.
ప్రపంచ సంగీత ఉత్సవాల సందర్భంగా సంగీతకళ ద్వారా ఈ జగతిని ప్రతిభావంతంగా ప్రభావితం కావించిన, కావిస్తున్న ఎందరో మహానుభావులు, అందరికీ శతసహస్ర ప్రణామాలని 'తెలుగురధం' సమర్పించుకుంటూ ...
కొంపెల్ల శర్మ - తెలుగురధం



No comments:
Post a Comment