“ఆరోగ్యం భాస్కరాత్
ఇచ్చేత్”
మయూరమహాకవికృతం శ్రీ సూర్య శతకమ్
సూర్యస్తుతిరూపమగు
మనోహర సంస్కృత కావ్యము – భావార్థ వివరణ సహితము
వ్యాఖ్యాత :
బ్రహ్మశ్రీ పోతూరి సీతారామాంజనేయులు గారు
సూర్యద్యుతి (ప్రభా) వర్ణనమ్ (4)
వ్రభ్రశ్యత్యుత్తరీయ-త్విషి
తమనీ సము-ద్వీక్ష్య వీతావృతీన్ర్సా –
గ్జంతూం స్తంతూన్యథా
యా-నతను వితనుతే-తిగ్మరోచిర్మరీచీన్
తే సాంద్రీభూయ
సద్యః-క్రమవిశదదశా-శాదశాలివిశాలం
శశ్వత్సంపాదయంతో-బరమమలమలం-మంగళం
వో దిశంతు. (4)
భావార్థం:
రాత్రి
సమయమున లోకములు అన్నియు చీకటితో నిండిపోయెను. అట్లు అవి తమపై నల్లని ఉత్తరీయమును (దుప్పటిని)కప్పుకొనెనేమో
అనునట్లు తోచుచుండెను. క్రమముగా రాత్రి ముగియుచుండెను. చీకటులు తొలగసాగెను. ఆయా ప్రాణుల
ఒడళ్ళపై ఏ ఆవరణమును (కప్పడమును) లేనట్లు తోచుచుండెను. అంతలో తూర్పున ముందుగా ఉదయించుచుండిన
సూర్యుడు వారికి ఆచ్చాదనమునకై తెల్లని వస్త్రమును (కప్పుకొనుటకై) అందజేయదలచెను. అందులకై
మొదట దారములను పడుగుగా ప్రసరింపజేయ (పరచ)వలయును గదా! ప్రాతఃకాలపు రవి ఆ పని చేసెను.
ఆ పడుగుదారములు క్రమముగా దట్టమగుచు తెల్లని అంచులు గల విశాలమగు తెల్లని వస్త్రముగా
నయ్యెను. ఉదయించు రవికిరణములే అట్టి పడుగుదారములు; అవి క్రమముగా దట్టమగుటతో తెల్లనగుచు
విండారిన పది దిక్కుల అంచులే సూర్యుడు అను నేతగాడు నిర్మించు తెల్లని వస్త్రపు అంచులు.
అతని ఆ కిరణముల కాంతులతో పూర్ణముగా తెల్లనైన ఆకాశమే చివరకు ఏర్పడిన వస్త్రము. అనుకొనుచో
ఇట్లు ప్రాణులకై తెల్లని వస్త్రమును నిర్మించి ఇచ్చుటకు దారములుగా ఉపయోగపడు ఏ సూర్యకిరణములు
కలవో అవి మీకు శుభమును కలుగజేయునుగాక!
No comments:
Post a Comment