ప్రతివాది భయంకర శ్రీనివాస్
జన్మదినోత్సవం సెప్టెంబరు 22 - శుభాకాంక్షలు
పి.బి.శ్రీనివాస్ -
కవిగా, స్వరకర్తగా, గాయకుడిగా అందరి హృదయాల్లో మెదలుతూ ప్రతినిత్యం పరవశింపజేసే ప్రముఖ చలనచిత్ర నేపథ్యగాయకుడి సహజ నామం ప్రతివాది భయంకర శ్రీనివాస్. అష్టభాషా ప్రవీణుడిగా పేరుపొందిన శ్రీనివాస్,
దినదినాభివృద్ధి చెంది, సర్వజ్ణానశూన్యత్వం నుంచి సర్వవిజ్ణానమాన్యత వరకూ కొనసాగుతున్నారంటే,
ఆయన ప్రతిభే తార్కాణం. భక్తిగీతంనుండి
హాస్యగీతం వరకు ఏ తరహా పాటనైనా పాడగల సమర్థులని చిత్రరంగ ప్రవేశంనుండి నేటి వరకూ
తిరుగులేని సరాగప్రస్థానం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా, కాకినాడలో 22
సెప్టెంబరు 1930న ఫణీంద్రస్వామి, శేషగిరమ్మ దంపతులకు జన్మించిన పదహారణాల
తెలుగుబిడ్డ మాతృభాషే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ, హిందీ బాషల్లోని చిత్రాల్లో
అధికంగా తన స్వర్ణగళాన్ని అందించిన ఘనుడు. 1954 లో ‘జాతకఫలం’ చిత్రంతో తెలుగులో
గాయకునిగా రంగప్రవేశం చేసిన పి బి కన్నడ చిత్రసీమని అత్యధికకాలంపాటు ఏకచత్రాధిపత్యం
వహించారనే చెప్పాలి. మార్దవం మూర్తీభవించిన చిత్రగీతాలు ఈయన ప్రతిభకు తార్కాణంగా
నిలిచిపోయాయి.
‘ఓహో
గులాబిబాల, అందాల ప్రేమమాల’ (మంచిమనిషి), ‘నీలి మేఘాలలో’ (మదనకామరాజు కథ), ‘తలచినదే
జరిగినదా’ (మనసే మందిరం), ‘ఎవరికి ఎవరు కాపలా’ (ఇంటికి దీపం యిల్లాలే) లాంటి
గీతాలు కొన్ని వేలు శ్రీనివాస్ గళప్రసాదాలే .
కేవలం చిత్ర గీత గానమే కాక, ఎన్నో గజల్స్ ని వ్రాయడం, పాడడం, ‘మహాసాధ్వి’
చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడం ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో కేవలం కొన్ని తునకలు
మాత్రమే.
‘పాత పాటకు మంచి రోజులు వస్తాయి’ అన్న దృఢవిశ్వాసంతో
కొనసాగుతున్న పి బి – చిత్రరంగం అరవై ఎనిమిది సంవత్సరాల తెలుగు సినీమా ప్రస్థానం
సందర్భంగా ఆంధ్రప్రభ ‘మోహిని’ అన్న రెండు భాగాల బృహద్గ్రంథాన్ని వెలువడడం, దానిలో
జరిపిన ప్రత్యేక ముఖాముఖీలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించిన తీరు
శ్రీనివాస్ గారి ప్రతిభకు సరిసములు లేవని అనిపించక మానదు.
కొన్ని విషయాలను యిక్కడ ప్రస్తావించడం పరమ ఔచిత్యంగా
భావిస్తూ, పొందుపరచడం జరుగుతోంది.
·
మా తల్లిగారికి
సంగీలో ప్రవేశముంది. సినీమాలు చూసి అప్పటికప్పుడు పాటలను కంఠతా పట్టి నేర్చుకునేవాడిని;
నాకంటూ స్వంతగ్రాఫ్స్ తయారు చేసుకుని వాటికి అనుగుణంగా వివిధ గాయకులు పాడిన పాటలను
ఇమిటేట్ చేస్తూ పాటలు పాడేవాడిని; ఇలా సినీమారంగంపై ఆసక్తి పెరిగింది.
·
సుప్రసిద్ధ
వైణికులు ఈమని శంకరశాస్త్రిగారు మా కుటుంబానికి సన్నిహితులు; నా చేత ఒక పాట పాడించి,
మంచి భవిష్యత్తు ఉందన్నారు; మొదట్లో చిన్న చిన్న దోహాలు (కవిత్వపు పంక్తులు) పాడే
అవకాశాలు వచ్చాయి.
·
ఎవరికైనా
సరిపోయే విధంగా బేస్ వోయిస్ ఉండటం నాకున్న ప్లస్ పాయింట్ గా భావిస్తాను.
·
చెబితే
ఆశ్చర్య పోతారు కాని నాకు ఈ రోజువరకు శాస్త్రీయ సంగీతం అంటే పూర్తిగా తెలియదు;
చిన్నప్పుడు ఇంటి ప్రక్కన ఒక అమ్మాయి సంగీతం నేర్చుకుంటుంటే వెక్కిరించేవాడిని
కూడా!
·
భావం
తెలియని సాధన శుద్ధ దండగ అనే భావనలో ఉండేవాడిని; నాకు అప్పట్లోనే ‘సర్వజ్ణానశూన్యుడు’
అనే టైటిల్ వుండేది; అయితే, ఎవరివద్ద శిక్షణ తీసుకోలేదు; నాకున్న అవగాహనతోనే ఆ
రంగంలోనూ అనుభవం సాధించాను.
·
చీకటి
రోజుల గురించి ఆలోచించే అలవాటు నాకు లేదు; నేను వెలుగుని కోరుకునేవాడిని.
·
మార్పు
అనేది సహజం; మనం ఒంటెద్దు బండి కాలం నుంచి రాకెట్ యుగం వరకు వచ్చాం; కాలంతోపాటు మనమూ
మారాలి; ఇప్పటి సంగీతం మీద వెష్ట్రన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది; వాయిద్యాల
విషయంలోనూ ఇదే జరుగుతోంది; అంటే జనం మెచ్చడం లేదని కాదు; వచ్చిన చిక్కంతా ఏమిటంటే
సంగీతంలో సాహిత్యం కనిపించడంలేదు; ప్లోర్ మీదికి వచ్చాక పాటలు రాయించుకుంటున్న
రోజులివి; ఇప్పుడి సింగర్స్ ఎవరి ట్రాక్ లో వారు పాడుకుంటున్నారు; కొంతకాలంపోతే వాయిద్యాలది
ఇదే పరిస్థితి అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు; అయితే కాలం ఎప్పటికైనా మారి తీరుతుందని
గట్టిగా నమ్మేవారిలో నేనొకడిని; మళ్ళీ పాత పాటలనే ప్రేక్షకులు కోరుకునే రోజు
దగ్గర్లోనే ఉంది.
·
నాపై
అందరి ప్రభావం ఉంది; సినీమా రంగానికి వచ్చిన తర్వాత మాత్రం నాకంటూ సొంత గొంతు
ఉండాలనే తపనతో అలా పాడుతూ వస్తున్నాను.
·
మొదటినుంచి
సాహిత్యంపై నాకు మక్కువ ఎక్కువ; అన్ని భాషలలోని సాహిత్యంపై కూడ పరిశోధన చేశాను; నిరంతర
పఠనమే నాకు సాహిత్యంలో స్ఫూర్తిని కలిగించింది; ఇంతవరకూ తెలుగులో లేని చందస్సును
కనుగొని ‘శ్రీనివాస గాయత్రీ వృత్తాలు’
పేరిట పుస్తకరూపంలో ప్రచురించాను; అలాగే గజల్స్ పై అభిమానంతో వాటిని
ప్రచురణ రూపంలోకి తెచ్చాను.
·
సంగీతం
డామినేషన్ లో వారి ప్రతిభ మూలన పడకూడదు; పాట పాడటం ద్వారా అనుభూతి పొందగలగాలి; ఇది
యువతరం నేర్చుకుంటే మంచిది;
·
ఆర్టిష్టుకు
రిటైర్మెంటు అనేది లేదు; చివరి క్షణం వరకూ పాడుతూనే ఉంటాను.
పి బి శ్రీనివాస్ గారు 1998 లో వెలుబుచ్చిన భావాలు
నేటికీ చిత్రరంగానికి వర్తిస్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేనేలేవు. ఈ విషయాలనే
తిరిగి శ్రీనివాసు గారితో ప్రస్తావిస్తే వచ్చే భావాలు ఎలా వుంటాయో ఆసక్తికరమైన
విషయం కదా!
చెన్నైలో నివాసం వుంటున్నప్పుడు ‘తెలుగు జర్నల్’’
అంతర్జాల పత్రిక పక్షాన ఒక వీడియో సంభాషణ ద్వారా వెలుబుచ్చిన అభిప్రాయాలు మరింత
ఆసక్తికరాలు అన్న వాస్తవం స్ఫురణకు రావడం ఒక అనుభూతిగా గోచరిస్తోంది. ప్రతివాది
భయంకర శ్రీనివాస్ గారి జన్మదినోత్సవం (సెప్టెంబరు 22) సందర్భంగా ‘తెలుగురథం’ శుభాకాంక్షలను,
అభినందన మందారాలను తెలియజేస్తూ, మరింతలుగా ఆయన ప్రస్థానాన్ని కొనసాగిచాలని ఆ పరాత్పరుణ్ణి
ప్రార్థిస్తున్నాం.

No comments:
Post a Comment