స్థానం నరసింహారావు
స్థానం నరసింహారావు
(1902 – 1971)
స్థానం నరసింహారావు గారి జయంతి - సెప్టెంబర్ 23
“కులుకుల
బెళుకుల నటనం, తళుకుల చమకుల వదనం, కలికిల కళలకు ప్రాణం – స్థానం అభినయ కళకే ప్రస్థానం”
అని “మరపురాని మాణిక్యాలు” భావచిత్రాలుగా రూపుదిద్దిన
సుప్రసిద్ధ రచయిత, చిత్రకారుడు బ్నిం స్థానం వారిని ప్రస్తుతించారు. చంద్రమతి, రోషనార,
సత్యభామ, చిత్రాంగి, ముర, మధురవాణి, రాణీసంయుక్త, దేవదేవి, చంద్రముఖి, దమయంతి, చింతామణి,
సుభద్ర లాంటి సుప్రసిద్ధ మహిళాపాత్రలను ఆడవారే
పోషించారా అన్నట్లు, అంతేకాక వారికన్న అధికంగా తన నటన ద్వారా మెప్పు పొందించిన అద్భుతాభినయమూర్తి
స్థానం నరసింహరావు గారే అని చెప్పక తప్పదు.
స్త్రీ పాత్రలతోనే నాటకరంగాన్ని ఏలి, నవనవోన్మేష నటన శబలతతో భరతశాస్త్రానికే
మెరుగులు దిద్దిన వారు స్థానం నరసింహారావు.
“మృదు
మధూక్తుల రాశి మా మధురవాణి, నిత్య శక్త్యాత్మగౌరి మా సత్యభామ, అస్థిరాంగ లక్ష్మి మా
చిత్రాంగి వనితలేకమై పుష్పమాలగ నెసగుత”మని పేరు వహించిన స్థానంవారు భావశబలతకు పెట్టిన
పేరు అని శ్రీ వేలూరి శివరామశాస్త్రిగారు అంటూ, భావశబలతని సమగ్రంగా కాళిదాసు రచిస్తే,
నటించినవారు మాత్రం స్థానంవారే అన్నారు.
మన
రాష్ట్రంనుండి మొట్టమొదటివారిగా ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్న ప్రతిభావంతుడు
స్థానం సంగీత నాటక అకాడమీ పురస్కారంతోపాటు నటకావతంస, ఆంధ్ర గంధర్వ, నటశేఖర బిరుదులు
ఆయనని కైవసం చేసుకున్నాయి.
స్థానం
నరసింహారావు గారు 1902 సెప్టెంబర్ 23న గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. చిన్ననాటినుంచే
వారికి సంగీత, ప్రాచీన సాహిత్య, చిత్రకళలన్నా అమితమైన అభిరుచి వుండేది. ప్రబంధాల్లోని
పాత్రలకు చిత్రరూపాలిచ్చేవారు. తన 18వ ఏటనే 1920న స్త్రీపాత్ర ధారణతో నాటకరంగం ప్రవేశం
చేయడం వెనుక, నాటక ప్రియులు, నటులైన మేనమామ, మామగారు కామరాజు వేంకటనారాయణగారు స్థానం
వారిలో దాగిన లలితకళాభిరుచికి దోహదమిచ్చి, లలితకళాభివ్యక్తికి రూపుదిద్దడం ముఖ్యభూమికగా
భావించాలి.
స్థానం
నటనను అనేకమంది ప్రముఖులు వీక్షించి పరవశులయ్యేవారు. తిరుపతి వేంకటకవులు అవధాన నిమిత్తం
బాపట్ల రావడం, వారి గౌరవార్థం ప్రదర్శించిన
‘హరిశ్చంద్ర’ నాటకంలో నిర్థారిత చంద్రమతి పాత్రధారి రాకపోవడం మూలాన, అప్పటికే స్థానంవారిని
గమనించిన నాటక నిర్వాహకులు చోరగుడి హనుమంతరావుగారు ఆ పాత్రను వేయించడం, బెదురుగా వేసిన
పాత్ర విజయవంతం గావడంతో తిరుపతి వేంకటకవుల ఆశీర్వాదం కూడ లభించడమే స్థానంవారికి కొండంత
బలం, ధైర్యం సమకూరాయి. అలా మొదలైన నాటక ప్రస్థానం, స్త్రీ పాత్రలతో నాటకరంగాన్ని ఏలి,
నవనవోన్మేష నటనతో భరత శాస్త్రానికే మెరుగులు దిద్దినట్లుగా స్థానం వారిని పలువురు భావిస్తారు.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, హరీంద్రనాథ చటోపాధ్యాయలాంటి మేథావులు స్థానంవారి నటనకు
ముగ్ధులయ్యారట. కళాభిరుచితో మేనమామతో నాటకసభలకు వెళ్ళే స్థానంవారు తర్ఫీదు పర్వాల్లో
హార్మోనియం శృతి చేయడం, యథాలాపంగా ఆ నాటకాలు, పద్యాలు, పాటలు, పాడుకోవడం నిత్యంగా మారి,
ఆ పాడుకోవడంలో అందరి దృష్టి పడడం, ప్రోత్సాహాలు కలిగి నటనలో ప్రవేశించడం జరిగింది.
చిత్రకళతోపాటు, ఫొటోగ్రఫీలో పొందిన అనుభవం ద్వారా, నాటక పాత్రకల్పనలో, చాలా ఉపకరించి,
అవగాహనని పెంచుకోవడం జరిగింది.
తెనాలిలో
కృష్ణ హిందూ థియేటర్సు నాటకసంఘంలో నెలసరి జీతంగా 25 రూ.తో స్త్రీపాత్రధారి ఉద్యోగంతో
నిర్వహించిన యశోద, లీలావతి, మోహిని పాత్రలు ఎంతో కీర్తిప్రతిష్ఠలను తెచ్చిపెట్టాయి.
రామ విలాస సభ ద్వారా స్థానం వారు రోషనార, సత్యభామ, చిత్రాంగి, ముర, మధురవాణి, రాణిసంయుక్త,
సుభద్ర పాత్రలు ధరించి, సభకు, వారికి కూడ వన్నెలు తెచ్చుకోవడం జరిగింది. రామ విలాస
సభలో శిక్షణ ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆధునికతని సంతరించుకున్న వైనం మూలాన,
శాస్త్రకారులు నిర్వచించిన రసానుగుణమైన వాక్యాభినయం, భావానుగుణమైన శబ్దొచ్చారణ, పాత్రోచితమైన
ఆహార్య, ఆంగికాభినయాల్తో స్థానం వారి నటన సామాజికులను రంజింపచేసే లక్ష్యం నిర్థారించుకున్న
ఆదర్శాలను స్థానంవారి ద్వారా సాధించుకోవడం జరిగేవవేనారు. త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి
శిక్షణ, నాటక ప్రదర్శన మరునాడు తప్పనిసరిగా జరిగే విశ్లేషణ, విమర్శగోష్ఠి, తప్పిదాలకు
జరిమానాలు తప్పని విషయాలు. గోవిందరాజుల సుబ్బారావులాంటి మహానటులకే జరిమానాలు, శిక్షలు
తప్పేవికావుట. శ్రీకృష్ణ తులాభారం నాటకంలో నారదుడు సత్యభామతో సంభాషిస్తున్నప్పుడు స్థానం
వారికి వచ్చిన ఆవులింతని కూడ చాతుర్యతో సత్యభామ సౌభాగ్య గర్వం, అజాగ్రత్త చూపడం ఒప్పన్న
దానికి తాను చెప్పిన విషయాన్ని అందరూ అంగీకరించిన సంఘటనని “ఆనాటి నా ఆవులింత’ అన్న
వ్యాసంలో వివరించినట్లు స్థానం వారే వివరించారు.
మన
రాష్ట్రంలోనే కాక, ఇతర రాష్ట్రాల్లో, పరదేశాల్లో తన నాటకసమాజంతో పర్యటించి నటనానైపుణ్యంతో
అందరినీ మంత్రముగ్ధుల్ని చేయడమే కాక, మగవారు ఆడవారి వేషాలెయ్యడమా?, నవ్వం కాక నవ్వం
అని మూతిముడుచుకొన్నవారిని విరగబడి నవ్వేవారంటే స్థానంవారి అభినయానికే అని ఒప్పుకోవడమే
ప్రత్యేకత అయింది. ఆంధ్రనాటక కళాపరిషత్తుని స్థాపించి, అధ్యక్షత వహించిన స్థానంవారు
అగణిత పతకాలు, కిరీటాలను పొందడంలోనే ప్రతిభ వెల్లడయింది. దాదాపు నాలుగు దశాబ్దాల నట
ప్రస్థానంలో స్థానం నరసింహారావు గారు సుమారు రెండువేల ప్రదర్శనల్లో భాగస్వామ్యం వహించడమే
కాక, ఏ పాత్రనైనా తిరుగులేనిదిగానే పోషించడం జరిగిందని నాటకరంగం నిత్యం పలవరించడం ఓ
రివాజు.
స్త్రీపాత్రలే
కాక, పురుష పాత్రలు కూడ ధరించడంలో భాగంగా, ఒకేఒక నారద పాత్రని రాధాకృష్ణ నాటకంలో అందించడం
ఒక ఆహ్లాదకర, ఆసక్తికరమైన అనుభూతిగా మిగిలిపోయింది.
“ఏది వినిపించడానికైనా
భాష ముఖ్యం; అది జటిలంగా ఉంటే ఏమిటి ప్రయోజనం? ఇక మన తర్వాతి మెట్టు వాచికం, మాట
లేకుండా,
భాషతోపనిలేని అభినయాన్ని అందించడమే” అనేవారట. స్థానం వారు దేవి ఉపాసకులవడం మూలాన
తెల్లవారకుండానే
స్నాన సంధ్యలతో పూజలు చేయడంలానే, ఆయన నటవృత్తిని అంత పవిత్రంగానూ నిర్వహించారు.
ఇతిహాసం,
పురాణం, చారిత్రకం, సామాజికం, నేపథ్యం, కథాంశం ఏదైనా, పలు వైవిధ్యమైన స్త్రీ పాత్రలను
నవరసానుభూతుల్ని
రంగరించి పోషించి, నటనకే భాష్యాన్ని అందించిన ప్రస్థాన పరంపర స్థానం
వారు స్వంతం చేసుకున్నారు. వేష వస్త్ర ధారణలో
ప్రత్యేకంగా అందాన్ని మరింతలు చేసే చీరకట్టు
సొగసుల్ని, సౌందర్యాల్ని కలిగించే నైపుణ్యం ఆయన స్వంతబాణీగా గుర్తింపు
పొంది, అనన్య,
అసామాన్య ప్రతిభాసంపత్తుల్ని పుణికిపుచ్చుకున్న మహానుభావుడు స్థానం నరసింహారావు గారు
1971
ఫిబ్రవరి 21 న కాలధర్మం చేసి, నాటకరంగానికి దూరమైన పరమ ఆదర్శప్రాయుడుగా, దిక్సూచిగా,
మార్గదర్శిగా చిరకాలం
నిలిచిపోయారు. స్థానం నరసింహారావు గారి జయంతి సందర్భంగా ‘తెలుగు
రథం’ ప్రణామాలు సమర్పించుకుంటోంది
No comments:
Post a Comment