Sunday, September 23, 2012

'మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి


'మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి (1922 - 1987) - జయంతి 
 

'ఈమనీ అంటే ఏమని ! 
వీణ ప్రాశస్త్యం, ప్రస్తావన  వీణ - తంత్రీవాద్యవిశేషం. వీణ అంటే మనకు వెంటనే స్ఫురణకు వచ్చే వ్యక్తులు, సరస్వతి, నారదుడు. సరస్వతి వీణ - కఛ్ఛపి. వారదుడి వీణ - మహతి. వీణ అంటె మెరపు. వీణియ - వీణావాద్యం. కస్తూరిమృగముయెక్క కస్తూరియుండెడి బొడ్డుకాయ. భల్లాణచరిత్రం - అన్న రచనలో - వాలేశ్వరుడు అన్న కవి - కస్తూరి వీణియలును పిల్లిగడ్డలను - అని ప్రస్తావించాడు. ఆంధ్రకవితాపితామహుడు, అల్లసాని పెద్దన, మనుచరిత్రలో నాయిక వరూధునితో వీణను వాయించాడు. "తరుణాంగుళీ ధూతతంత్రీస్వనంబుతో జిలిబిలిపాట ముద్దులు నటింప ... కరపంకరుహ రత్న కటక ఝణఝణధ్వనిస్ఫూర్తి తాళమానములు గొలుప నింపు దళుకొత్త వీణ వాయింపుచుండీ" అని అద్భుత వర్ణన చేశాడు. యింటి ఆవరణలోని మామిడిచెట్టు కింద అరుగుమీద  కూర్చుని వీణ వాయిస్తూంటే, వేరే మద్దెల లేదట; అమె చేతి కంకణముల ధ్వనియే మద్దెలవలె వుందిట. అది వీణ ప్రాశస్త్యమో, లేక వరూధుని ప్రత్యేకతో మరి. వీణ ప్రాశస్త్యాన్ని ప్రముఖ కవి అడవి బాపిరాజుగారు - నారాయణరావు - నవలలో - వీణమీది తానం ఫిడేలు మీద కాదు. ఫిడేలు మీది సంగతి వీణకు రాదు. వీణ ఒదుగు ఫిడేలులో లేదు. వీణలో ధవి ఫిడేలులే లేదు. దీన్ని బట్టి ఫిడేలు రాగాలు వేరు, వీణ స్వరతంత్రీవాదవ విధానం ప్రత్యేకత కలిగినదని ఈ భావాన్ని బట్టి చెప్పవచ్చు. 
శంకరశాస్త్రిగారి జీవన సంగీత రేఖలు 
ఈమని శంకరశాస్త్రిగారు తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలో 23 సెప్టెంబర్ 1922న జన్మించారు. కేవలం మూడు వసంతాల ప్రాయంలో శాస్త్రిగారు వీణ పై దృష్టిని పెట్టడం ఆశ్చర్యం. కేవలం సంగీత పరికరం పై దృష్టికాదు, సంగీతంలోని లయ, గమకాల క్రమం పై అవగాహనను ఆకళింపు చేసుకోవడంలోనే ఆ శైశవకళాప్రతిభ వెల్లడైంది. సంగీతంలో వీణపై తొలి శిక్షణను తండ్రి అచ్యుతరామశాస్త్రివద్దనేకాక, తాతగారు ఆనాటి గొప్ప వైణికవిద్వాంసులు ఈమని సుబ్బరాయ శాస్త్రిగారి వద్ద కీలకాంశాలను అభ్యసించారు. ఈ అభ్యాసకాలంలో కేవలం వీణసంబంధిత శిక్షణే కాక, అంతవరకూ  సంగీతకచేరీల్లో వీణకు పరిమితంగానే వుండడం గమనించి, వీణమాధ్యమంతో సంగీత కార్యక్రమాల్ని ఎలా విస్త్ర్రుతం చేయాలో తీవ్రతరంగా ఆలోచించారు. ఆయనకు ఒక విదేశీసంగీతాభిమాని బహుమతినిచ్చిన మైకు ద్వారా వీణానాదతంత్రీస్వరస్థాయిల్ని పెంచడంలో సాధ్యులయ్యారు. శంకరశాస్త్రిగారు వీణను మందర, అనుమందరస్థాయిల్లో తంత్రుల్ని మీటడంలో విశారదస్థాయిని అతిస్వల్పకాలంలోనే చేరుకున్నారు. అంతేకాక, వీణద్వారా నాదాల్ని దీర్ఘం, అనల్పకాలంపాటు ప్రదర్శించడం, ఆనాదాలు వాయుసంగీతపరికరాల ద్వారా వచ్చే నాదాలనుపోలడం కూడ ఈమని వారికి అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. వీణాసంగీతంలో ప్రతిభను సాధించినా, చదువును మాత్రం వెనక్కు నెట్టవలసి వచ్చింది. తండ్రి అచ్యుతరామశాస్త్రిగారికి మాత్రం తన శంకరతనయుడు సంగీతాన్ని వృత్తిగా స్వీకరించడం ఎంతమాత్రం యిష్టంలేదు.  కాకినాడ పిఠాపురం మహారాజా కాలేజీలో పట్టభద్రులయ్యాక, వైణికుడిగానే జీవితప్రారంభం చేశారు. కానీ, తనయుడి సంగీతకృషిలో ప్రదర్శిస్తున్న తన్మయత్వాన్ని గమనించి, పట్టుదలను వీక్షించి, శ్రమకు ఫలితం తప్పక వుంటుందనే నమ్మకానికి రావడం ఒక శుభ పరిణామం. వీణతో జీవితాంతం తాదాత్మ్యం చెంది అవిభాజ్య సంబంధాన్ని పెనవేసుకున్న సంప్రదాయ సంగీత విద్వాంసులు, కళాకారుల్లో ఈమని శంకర శాస్త్రిగారిని ప్రప్రధమంగా ప్రస్తావించాలి. 1940 లో తిరుచ్చి ఆకాశవాణిలో శాస్త్రిగారు వీణకచేరీ చేసిన తర్వాత, ఆయనకు వచ్చిన పేరు గగనవీధుల్ని తాకింది. 1942-50 మధ్యకాలంలో, మద్రాసు జెమినీ  స్టూడియోల్లో  సాలూరు రాజేశ్వరరావుకు సంగీతంలో సహాయసహకారాల్ని అందజేయడంలో చూపిన ప్రతిభ అజరామరం. అందుకే పాతచిత్రాల్లో, ప్రముఖంగా, రాజేశ్వరరావుగారి చిత్రాల్లో, ముఖ్యంగా తప్పక ఒక వీణపాట వుండేది.  శంకరశాస్త్రిగారి శాస్త్రీయత,  సంప్రదాయత  సంగీతకుటుంబానికి వారసులేకాక, వీణావాదన సంగీతకళలో ఆలోచనాత్మకమైన సంగీతశైలిని నిర్మాణం కావించి, ఆ ప్రత్యేకశైలికి ప్రచారం చేయడమే కాక, శాస్త్రిగారిని శాస్త్రీయసంగీత ప్రపంచంలో సశాస్త్రీయమైన విశిష్ఠ కళాకారునిగా తీర్చిదిద్దబడ్డారు. కర్ణాటక శైలితోపాటు, హిందుస్తానీ, పాశ్చాత్య సంగీత శైలీవిధానాల్ని ఆకళింపు చేసుకున్న పుంభావ సంగీత సరస్వతీపుత్రుడు - ఈమని శంకరశాస్త్రిగారు. శాస్త్రిగారు ముఖ్యంగా ఆకాశవాణిలో నిర్మాణం చేసిన సంగీత కార్యక్రమాలు, ఆయన నాయకత్వంలో ప్రదర్శించిన వాద్యబృంద, స్వరరాగతాళ విన్యాస కార్యక్రమాలు నభూతో నభవిష్యతి అన్నట్లు ప్రఖ్యాతమయ్యాయి.  శాస్త్రీయ ప్రియ వీణారాగాలు  సంప్రదాయబద్ధమైన, శంకరాభరణం, వరాళి, కాంభోజి రాగాలతో అధికంగా తాదాత్మ్యం చెందినా, సంగీతరసికులకు ఎప్పుడూ ఏదో నూతన ప్రయోగం చేసి 'ఈమని అంటే ఏమనీ! అని అందరూ ముక్కుమూద వేలు వేసుకునే సందర్భాలు తరచుగా ఎదురయ్యేవిట. 
గళగాత్రంతో పాటు వీణావాదనం 

సంప్రదాయ గాత్ర-వీణాసంగీత కళాకారుల మార్గంలోని వారైనా, శాస్త్రిగారు, సంగీతకచేరీలో వీణావాదనంతోపాటు ఆయనే గాత్రసంగీతాన్ని కూడ జోడించి బహుముఖ ప్రతిభను ఏకముఖంగా ప్రదర్శించేవారు. హిందూస్థానీ కృతుల్ని మధ్యాంతరంలోను, హిందూస్థానీరాగాలజోడీని ప్రదర్శించడంతోపాటు సంగీత కార్యక్రమంలో, శాస్త్రిగారి వేదప్రవచనం - స్వరసహితంగా గానం చేస్తూనే, వీణాతంత్రీనాదస్వరాల్తో శ్రవణసుభగం చేసేవారట. ఆకాశవాణి ఆదరించిన శాస్త్రీయత1959 లో డిసంబర్ 1 న, ఆనాటి కేంద్ర సమాచార, ప్రసారశాఖామంత్రి, డా.కేస్కర్, కేంద్రకార్యదర్శి, ఆర్.కె. రాం దయానీ ల ఆహ్వానం మేరకు ఈమని శంకరశాస్త్రిగారు మద్రాసు - ఆకాశవాణిలో కళాకారునిగా చేరడం, రెండేళ్ళలోపునే కేంద్రప్రసారవిభాగానికి, జాతీయసంగీతవిభాగపు సంగీతవిభావరిశాఖకు నాయకత్వం కూడ వహించారు అంటే ఆయన ప్రతిభ వర్ణనాతీతం. ఆయన ప్రదర్శించిన అసమాన ప్రతిభ శాస్త్రిగారిని ముఖ్య నిర్మాతగానే కాక, జాతీయసంగీతవిభావరికి దర్శకునిగా నియమించబడ్డారు. అనూహ్యమైన ఈ సదవకాశం ద్వారా నూతన శైలిలో సంగీతరాగాల్ని, తన వాద్యబృందాల ద్వారా అధ్బుతమైన ప్రతిభను వెన్నంటుకున్నారు. సంప్రదాయ, ఆధునికతల సంగీతస్వరమేళవింపులు శంకరశాస్త్రిగారు ఒక ఆసక్తికరమైన 'కొత్తపాతలమేలుకలయిక అన్న ప్రయోగం అన్నది నిర్వివాదం. కార్యక్రమాన్ని బట్టి, అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్రిగారు కృతుల్ని ఎన్నుకుని, స్వరపరచుకునేవారు. ఆయన ప్రతిభాసిగలో నిత్యం తారసిల్లేవి, గమకాలు, స్వరప్రస్తారాలు, తానం అన్నవి ఆయన స్వాధీనంలోనే నివాసం చేసేవి. ఈమని వారికి సంగీతం అంటే ...శంకరశాస్త్రిగారికి, సంగీతం అంటే ఒక మహాసముద్రం - దాగిన ఎన్నో మణులు, మాణిక్యాలు. సంగీతంలోని శాస్త్రీయతను, పరమౌషధగుణాన్ని, ప్రజలదగ్గరకు తన రాగ, స్వరమాధుర్యాలద్వారా తీసుకుని వెళ్ళడంలో ఆయన ఎప్పుడూ కృతతుల్యులయ్యారు. స్వరరాగ సృష్టికర్త - ఈమని ఈమనివారు గొప్ప వైణిక విద్వాంసులేకాక, శాస్త్రిగారు ఎన్నో కౄతులు, పదాలు, జావళీలను రూపొందించడమే కాక, తోడిరాగంలో రాగం-తానం-పల్లవి అంశాలను కూడ నిర్మాణం చేశారు. 
ఈమని వారి అంతేవాసులు 
గొప్పవిద్వాంసుడు, కళాకారుడుగా రాణించి విశ్రాంతి తీసుకుంటే నడవదు. గురువుస్థానంలో ఉన్న కళాకారుడు అంతే సరిసమప్రతిభను కలిగిన అంతేవాసుల్ని తయారుచేయడంలోనే ప్రతిభావంతమైన కళకు, కళాకారుడికి సార్ధకత, సాఫల్యత చేకూర్చినప్పుడే కళలో ఆవృత్తం పూర్తవుతుంది. శంకరశాస్త్రిగారు అంతే ప్రతిభ గల విద్వాంసులు - 'వీణ చిట్టిబాబు, యం.వై.కామశాస్త్రి గారు అవతరించారు. సాలూరివారిదగ్గర ఉన్నప్పుడు, ప్రముఖ నేపధ్యసంగీతకారుడు పి.బి.శ్రీనివాస్ ని చిత్రరంగానికి పరిచయం చేసిన ఘనత మన ఈమని శంకరశాస్త్రిగారిదే. శాస్త్రిగారు తెరవెనుక వున్న అధినాయకులు, తెరపై దర్శనం యిచ్చిన చిత్రసంగీతంలో ఆయన ప్రతిభతోపాటు పాళ్ళు కూడ అధికమే అని చెప్పే కళాకారులు ఎంతోమంది శాస్త్రిగారి సంగీత ప్రతిభను గురించి తరచు ప్రస్తావిస్తారు. ఈ సృష్టి వున్నంతకాలం కళ, కళలున్నంతకాలం సంగీతం, సంగీతం విరాజిల్లుతున్నంతకాలం వీణ, వీణ వినిపిస్తూ,  కనిపిస్తున్నంతకాలం మనకు ఈమని శంకరశాస్త్రిగారు మనకు జీవితంలో నిత్యభాగంగా, మన మనసుల్లో, హృదయాల్లో, ఉల్లాస, వినోద, విజ్ణానంతోపాటు, మనకు దివ్యౌషధంగా పనికొచ్చే పరికరాలుగాను, ప్రముఖవ్యక్తుల్లో ఒకరుగాను, ప్రతిభాదర్శనం కావిస్తూనేవుండడం జరుగుతుంది. యిది తధ్యం. సత్యం. ఈమనిశంకరశాస్త్రిగారి అమూల్య కర నఖాగ్రాలతో అధ్బుతవిన్యాసాల్ని విశ్వవ్యాప్తంగా వినుతికెక్కిన ఈ సంగీతవిదురుడు, ప్రతిభాకోవిదుడు, నిత్యస్మరణీయుడు. 
'వీణా శంకరశాస్త్రిగారికి, జయంతి సందర్భంగా  శతసహస్ర సంగీత కళాభివందన, వినమ్రత, నమస్సుల్తో స్వరరాగ నివాళి సమర్పిస్తూ  ... కొంపెల్ల శర్మ- తెలుగురధం  
కొంపెల్ల శర్మ

No comments: