చిలకమర్తి లక్ష్మీనరసింహం ( 1867 - 1946 ) జయంతి - 26 సెప్టెంబర్
పండిత పామరులకు అందుబాటులో ఉండే శైలిలో రచనలు సాగించి తెలుగు పఠితలోకానికి వినోదాన్ని ప్రసాదించిన మహనీయుడు. ఆయన చారిత్రక, సాంఘిక పౌరాణిక నవలలు, జీవిత చరిత్రలు, స్వతంత్ర, అనువాద నాటకాలు, స్వీయచరిత్ర, ఆశుపద్యాలు, తెలుగువాళ్ళకు ఆవశ్యపఠనీయాలయ్యాయి. సంఘ సంస్కరణోద్యమంలో కందుకూరివారికి బాసటగా నిలిచిన ప్రజాసేవాపరాయణుడు. వీరి పేరు వినగానే, వెంటనే స్ఫురించేవి - నీవు చెప్పిన విద్యయే నీరజాక్ష, ముదితల్ నేర్వగరాని విద్యకలదే ముద్దార నేర్పించినన్, భరతఖండంబు చక్కని పాడియావు, వంటి పద్యోక్తులు, సామెతలు సంపాదించుకున్న ప్రాచుర్యాన్ని అందుకో జాలినవి. ఆయన భాషలోని సారళ్యం గురించి అనుభూతి చెందవలసినదే కాని వర్ణించలేము. ఆ మహానుభావుని రచనలు చదువనివాడు, అధునిక ఆంధ్ర సాహిత్యాద్యోనవనంలో ఒక విరబూచిన అరుదైన ప్రసూనవల్లరిని చూడలేనివాడై, ఆఘ్రాణించని వాడుగా చరిత్రలో చిరస్థాయిగా స్థాపితమవుతాడు. ఆయన పేరు శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు.
తన ప్రజ్ణాచక్షువులతో లోకాన్ని
పశ్చిమగోదావరి
జిల్లా, పెరవలి మండలంలోని ఖండవిల్లి గ్రామంలో వెంకన్న, రత్నమ్మ పుణ్యదంపతులకు 1867 సెప్టెంబర్ 26 న జన్మించిన చిలకమర్తివారు ఒక బ్రాహ్మణకుటుంబంలో జన్మిచారు. వీరవాసరం, నరసాపురంలో ప్రాధమికవిద్య, రాజమండ్రి హైస్కూలులో పట్టంచేబూనడం, 1889లో ఆర్యపాఠశాలలో ఉపాధ్యాయపదవి, యిన్నీసుపేట, మున్సిపల్ స్కూళ్ళలో విద్యాబోధన సాగించారు. తర్వాత సరస్వతి పత్రికాసంపాదకునిగా చేసి, ఉద్యోగానికి స్వస్తిచెప్పి, ఆపైన హిందూ సెకండరీ పాఠశాలను స్థాపించి, తొమ్మిదేళ్ళు నడిపిన తదుపరి, ఈ సంస్థని వీరేశలింగం హైస్కూలుగా మార్చబడింది. దురదృష్టవశాత్తు 30 ఏళ్ళకే రేచీకటి వ్యాధికి గురైనాకూడా, ఆ అవరోధాన్ని త్రోసిరాజని, తన రచనలను కొనసాగించడంలో చిలకమర్తిగారికున్న పట్టుదలను, ప్రతిభను కొనియాడక తప్పదు.
వైవిధ్యభరిత ప్రతిభారంగాలు
హేమలత, అహల్యాభాయి, సుధాశరశ్చంద్రం లాంటి ముఖ్య నవలలను రచించారు. సరస్వతి పత్రిక సంపాదకులుగా ఉన్నప్పుడు, సౌందర్యతిలకం, పార్వతీపరిణయం రచించారు. యివికాక ఎన్నో రచనలను వ్రాశారు. చిలకమర్తివారి రచనలను మొత్తంగా ప్రచురణకావడం, 1943లో ఆంధ్రవిశ్వవిద్యాలయంవారు కళాప్రపూర్ణ సత్కారంతో సన్మానించడం జరిగింది. సాహిత్యంతోపాటు, సంస్కరణాభిలాష ఉపాధ్యాయకత్వం, పత్రికాసంపాదకత్వం, రచనావ్యాసాంగాలతోపాటు, చిలకమర్తివారిలో నిష్కళ్మష మనోప్రవృత్తితో నడిపించిన పథంగా సంఘసంస్కరణ కార్యక్రమం చెప్పుకోదగ్గ అంకం. మొదటితరం సంస్కరణవేత్తగా 1909లో సంఘంలో వెనుకబడిన వర్గప్రజలకోసం పాఠశాలను స్థాపించడమే కాక, పుష్కరపైకాలం నడిపారు. బ్రహ్మసమాజం, హితకారిణీసమాజం వంటి సంస్కరణాధ్యేయంగల సంస్థలతో పాలుపంచుకున్న కార్యక్రమాలు, దేశమాత అనే వారపత్రికద్వారా తెల్లవారి పరిపాలనకు వ్యతిరేకంగా వ్యాసాంగం కావించడం కూడ జరిపారు. యితర ప్రత్యేక వ్యవహారాలు మొదటినాటకం కీచకవధను 1889 జూన్ 15న ప్రదర్శించి మెప్పుపొందడం జరిగింది. కలకత్తా బ్రహ్మసమాజం నాయకుడు పండిట్ శివానందశాస్త్రి, చిలకమర్తివారిని స్థానిక షేక్స్ పియర్ అని ప్రశంసించేవారు.
భరతవాక్యం చిలకమర్తివారి పద్యంలోనే !
రాజభక్తి, దేశాభిమానం, జాలి, విధి, అంటూ పద్యాలను చెప్పి పాఠకుల్ని, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం, ఆనాటి సభాసదుల్ని మంత్రముగ్ధుల్ని చేసినట్లు కదలకుండా చేయడం నాటి రివాజు. చిలకమర్తివారి పేరు వెంటనే, అనేక నోళ్ళళ్ళో నానిన పద్యం - భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడవై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు, పితుకుచున్నారు మూతులు బిగియగట్టి - అన్న పద్యం చరివినదే చదవడం, ఎందరో కంఠోపాఠం చేయడం, కృష్ణానదీ వంతెన గోడలమీద పెన్సిళ్ళతో చెక్కబడడం, ఆనాటి గోదావరి సాహితీసభాపర్వాల్లోని పద్యాలతోబాటు హరికధల్లోకికూడ చేరిపోయింది. 1905లో బెంగాలు విభజన సందర్భంగా, బ్రహ్మమత ప్రచారకుడైన బిపిన్ చంద్రపాల్ రాజమండ్రిలో చేసిన ఆంగ్లోపన్యాసాలకు చిలకమర్తివారి ఆంధ్రానువాదాలకు ముగింపు పద్యంగా - ఈగ వ్రాలినగాని వేగ జారెడునట్లు - అన్న పద్యం, ప్రత్యేకంగా, చెవుల సందున గిరజాలు చిందులాడ, మొగము మీదను జిరునవ్వు మొలకలెత్తి, టంగుటూరి ప్రకాశము రంగు మెరియు, ధవళగిరితీర్ధమునకు తరలివచ్చె – అన్న వాక్యాలు, చిలకమర్తి, టంగుటూరి ప్రకాశం, తిరునాళ్ళకు ధవళేశ్వరం వెళ్ళినప్పుడు చెప్పిన పద్యం శాశ్వతంగా చిలకమర్తివారి సాహిత్య పద్యరచనా రహస్యాలలో ముఖ్యమైనవి. అయితే, చివర్లో, నాటక లక్షణశాస్త్ర ఫక్కీలో, 'చిలకమర్తివారు, గౌతమ మండల సభకు ఖ్యాతి మెరయ, పూర్ణ భక్తి సమర్పించె పుష్పమాల, వసుధ వీరవాసరపుర వాసియైన, చిలకమర్తి లక్ష్మీనరసింహమూర్తీ అనే నాటకభరతవాక్యం లాంటి పద్యపుష్పమాలను సమర్పించి గోదావరీమండంలంలో ప్రముఖస్థానాన్ని, ప్రఖ్యాతతను పొందారు.
ఈ భరతవాక్యంతోనే ఈ వ్యాసం పరిసమాప్తిచేయడం ఔచిత్యం, సమంజసం. ప్రముఖ సాహితీవంతుడు, తెలుగుసీమను వీడి జూన్ 17, 1946 రోజున మనకు భౌతికంగా ఎడబాటు తెచ్చినా, చిలకమర్తివారు మాత్రం తెలుగుహృదయాల్లో మాత్రం ఆత్మగౌరవాన్ని నిరంతరం నింపుతూ చిరస్థాయిగా సుప్రతిష్ఠులయ్యారు అన్నది మాత్రం సత్య, శివ, సుందర భావసమగ్రం.
కొంపెల్ల
శర్మ - తెలుగురథం
2 comments:
తెలుగు పుస్తకానికి కొత్త చిరునామా
ప్లీజ్ visit
http://www.logili.com/
and also see this link...
http://www.logili.com/pages/book
తెలుగు పుస్తకానికి కొత్త చిరునామా
ప్లీజ్ visit
http://www.logili.com/
and also see this link...
http://www.logili.com/pages/book
Post a Comment