Wednesday, September 19, 2012

నవయుగ కవిసార్వభౌమ, రసాద్వైత కవి - బోయి భీమన్న

నవయుగ కవిసార్వభౌమ, రసాద్వైత కవి

- బోయి భీమన్న

ఇది వైకుంఠము వేంకటేశ్వరుడు లక్ష్మీశుండు కొల్వుండుటన్

ఇది కైలాసము మల్లికార్జునుడు ఆర్యేశుండు చెల్వొందుటన్

ఇది బ్రహ్మోర్వి సరస్వతీ చరణ పంకేజాతమై యుండుటన్

ఇది మా ఆంధ్రము నీకు పీఠపు త్రిశక్తీ పూజగైకోగదే.

వాణియ తీరవాటిక భవానియె రాయలసీమ శ్రీ తెలం

గాణము పూర్ణరాజ్యరమగా ముగురమ్మల మూర్తి దాల్చి గీ

ర్వాణపథముల్లన్ కదలివచ్చితివే జగమేలు కొమ్మికన్

రాణదలిర్ప మానవత రంజిల ఆంధ్రమ భాగ్యసాంద్రమా. (త్రిశక్తి - డా. బోయి భీమన్న)

తెలుగుతల్లిని, తెలుగుభాసను సంస్తుతించే పద్యాలను భావగర్భితంగాను, మనోహరంగాను రచించిన వారు ఎవరో కాదు; 1975 లో భాగ్యనగరంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆనాడు డా. బోయి భీమన్న గారు అల్లిన పద్యాలు నేటికీ సుమధుర కలకండ పలుకుల తునకలతోపాటు, మరొక మహాకవి, శైవ సంప్రదాయ వంశజులైన ముదిగొండ వీరభద్రకవిగారు  “మంచిగుమ్మడికన్న దంచిన ఎర్రని క్రొవ్వడ్ల బియ్యము కూడుకన్న” అంటూ తీయనైన దెయ్యది? అదే తెనుగుభాష” అన్న  ఆంధ్రప్రశస్తి గీతాలను సుప్రసిద్ధ గాయకుడు కె బి కె మోహన్ రాజు ప్రపంచ తెలుగు మహాసభల్లో గానం చేయడం ద్వారా ప్రఖ్యాతి పొందిన వారిలో బోయి భీమన్న గారొకరు అని నిస్సందేహంగా చెప్పక తప్పదు.

‘మోక్షం నా జన్మహక్కు’ అన్న భావనకు వెంటనే ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అన్న బాల గంగాధర తిలక్ మహాశయుడు మనకు స్ఫురణకు రాక మానదు. తెలుగు సాహిత్యపు పల్లకీని తనదైన హస్తాలతో సున్నితంగా స్పృశిస్తూ భారాన్ని మోసిన ప్రముఖ బోయీల్లో పద్మభూషణ్, కళాప్రపూర్ణ డా. బోయి భీమన్న గారిని మరచిపోతే మనకు మనం తెలుగు సాహిత్యం పట్ల, సాహితీకారులపట్ల చిన్నచూపుని చూసి మనల్ని మనమే అగౌరవపరచుకోవడమే అని చెప్పక తప్పదు.  “ఏది రాసినా అందరిలో ఒకరివి కాకూడదు; నీ కంటూ ఒక ప్రత్యేకత నిలుపుకోవాలి” అన్న వైవిధ్యపరమైన సందేశ సలహాల్ని భావి తరానికి అందించిన అసామాన్యుడు బోయి భీమన్న కవి.

జీవితాంతం సత్యావిష్కరణ, పుస్తకాలతోనే జీవితం, సమాజాభ్య్హుదయమే పరమావధిగా అధికంగా రచనలు చేయడం, విలక్షణమైన మాట తీరు, అంతరంగాన్ని ఆవిష్కరించకుండా ముభావాన్ని మాత్రమే బయటకు ప్రదర్శించగలగడం, మరింత భిన్న శైలిలో వాస్తవాలను వ్యక్తీకరించడం,  సంఘధోరణిని అవగాహన చేసుకుంటూ నిరాశని, క్రోధాన్ని కించిత్తైనా ప్రదర్శించని నిశ్శబ్ద భాష్యకారుడు భీమన్న కవి.  

ఎప్పటికప్పుడు నూతనోత్సాహంతో ఉరకలు వేసిన మనసుతో నాటినుంచి నేటివరకూ ఎంతో వైవిధ్యభరితమైన సాహితీ సౌరభాలను వెదజల్లిన మహోన్నత భావకవి అయిన డా. బోయి భీమన్న 1911 సెప్టెంబరు 19 న తూర్పు గోదావరి జిల్లాలో సుప్రసిద్ధ కోనసీమ ప్రాంతంలో భాగమైన మామిడికుదురు గ్రామంలో సంప్రదాయ, సంస్కరణల సమన్వయ బంధంలో గడపిన కుటుంబంలో జన్మించి, చదువుకుని, సర్వసాధారణ సంబంధాల్లో భాగంగానే అసాధారణమైన జీవనాన్ని గడిపి, మంచి రూపురేఖలతోపాటు కవితాశక్తి, పాండిత్యం, తన పద్యగేయాలని తానే చక్కగా పాడుకునే శ్రావ్యగళసీమ వరంగా పొందిన భీమన్న కవి ‘హిందూ పల్లకీకి బోయనవుతా’ అని నినదించిన నిగర్వి. సాధారణ ఉపాధ్యాయ పదవి నుంచి కళాప్రపూర్ణ, పద్మభూషణ్, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతగా, ‘నవయుగ కవిసార్వభౌమ’గా, నూతన సిద్ధాంతాలను, నవ్య తత్వాలను ప్రతిపాదించి, రసాద్వైత కవిగా పేరుపొందిన వీరు నిర్భయ గుణశీలిగా, విశిష్ట తాత్త్విక కవిగా వినుతికెక్కిన విశిస్టకవి బోయి భీమన్న కవి.

మన దివ్య  భవ్యభూమి

మన జాతి, నేల, దేశ వైభవాన్ని తనదైన అనుభూతితో వర్ణించిన తీరు అందరినీ దేశభక్తిపరంగా ఆవేశపరుల్ని కావించి, కర్తవ్యాన్ని ప్రబోధించేలా వుంటుంది.

“ఆర్యభూమి సూర్యభూమి వీరభూమిరా మనది, అంధకారమును గని వెనకడుగు వేయకురా!

సత్యభూమి చిత్త్వ్వభూమి తత్త్వభూమిరా మనది, రాజసతామసముల గని ఓజ చెడకురా!

యంత్రభూమి తంత్రభూమి మంత్రభూమిరా మనది, పరమాణువులు పగులుట గని భయము చెందకురా!

అన్నభూమి వెన్నభూమి కన్నభూమిరా మనది, భవ్యభూమిరా! మనది, దివ్య భూమిరా!”

విద్యాలయాల్లో పాఠ్యపుస్తకాల్లో ‘దెశభక్తి ప్రబోధ’గీతాల్లో తప్పక జోడించవలసిన గీతం అని చెప్పక తప్పదు.

వస్తు భావనల నవ్యత

‘ఆధునికాంధ్ర కవిత్వం – సంప్రదాయములు, ప్రయోగములు’ అన్న ఉద్గ్రంథ పరిశోధనాగ్రంథంలో చివరి అధ్యాయంగా ‘అతినవ్యకవితా ధోరణులు’ అన్న విభాగంలో కవితాసమీక్ష లో సంప్రదాయ నవ్య మార్గాలను రెంటినీ కలపుకున్న  సమన్వయ మార్గ ప్రస్తావన చేస్తూ, “వృత్తములలో సరిక్రొత్త వస్తువును  సంతరించుకొన్న నవ్యకావ్యాల్లో భీమన్న ‘దీపసభ’ని పేర్కోంటూ, దీపం ప్రధానవస్తువని, సృష్ట్యాదినుండి వెలువడిన వివిధ దీపములు కావ్యపాత్రలుగా, మైనం, బండి, హరికేన్లాంతరు, ఉల్క, వీథిలాంతరు, విద్యుద్దీపాదులను విశ్వేశ్వరియగు పరంజ్యోతి అధ్యక్షతలో జరిగిన విశ్వదీపికాపరిషత్తు సమావేశమున తమతమ అనుభవములను విన్నవించుకోవడం, దీపములన్నీ ఆ పరంజ్యోతి అంశలేయని కావ్య సారాంశముగా భావిస్తూ, దీపం ప్రధాన వస్తువుగా తొలుదొల్త వెలువడిన సమగ్రకావ్యంగా డా. సి నా రె పేర్కొంటూ, దీపముల స్వానుభవప్రకటనవ్యాజమున కవి మానవజీవితచక్రమునకున్న అన్నియంచులను స్పృశించిన తీరు, సృష్టి  యెడల మానవునకు కలిగెడు జిజ్ణాసను ప్రదర్శించిన వైనం, రచనా విషయమున సంప్రదాయమార్గములోనున్నను, వస్తుభావాదుల విషయమున నవ్యత కలిగిన కావ్యంగా ఉదాహరించడంలో కవి ప్రతిభను కొనియాడారు.

మారనివాడు మనవాడు

సమాజంలోని అసమానతల్ని, ఎక్కువ తక్కువ ధోరణుల్ని, అంటరానితనాన్ని, హరిగిరిజనులు సంపన్నులద్వారా  నిత్యజీవితంలో అనుభవిస్తున్న అవాంచనీయ, అమానుష సంఘటనల్ని ‘మారనివాడు’ కవితలో వర్ణిస్తూ వ్యక్తపరచిన తీరు పలువురిని ఆలోచింపజేస్తుంది.

“వాడా? వాడు? వాడు చచ్చినా మారడు! మనిషి మారినా, సమాజం మారినా, లోకమే మారినా, వాడు మాత్రం మారడు?’ అని సర్వ సర్వనామాలతో ప్రారంభించిన కవిత క్రమేపీ నామవాచక యదార్థ విషయ ధోరణుల్ని వివరించిన తీరులో – ‘పబ్లిసిటీ లేని ప్రజాసేవ, పనిలేని మంగలితనం’ లాంటి చెణుకులు, “ఎన్ని చట్టాల రాజ్యాంగ రథాలపై వీణ్ణి కాస్త ముందుకు తోలుకుపోదా మనుకొన్నా, వీడు ఒక్క అడుగైనా ముందుకు కదలడు! … వీడి గతి ఇంతే, వీడు వట్టి మారని వాడు’ అంటారు. అంతేకాదు, ‘ఈ ఒంటెద్దు వ్యవసాయంగాడు మింగడానికి మెతుకైనా లేనివాడు, కడుపూ కన్నూ నకనక మండుతున్నా, ఎదుటి దుకాణం నుంచి ఒక్క కబళం లాక్కు తినడమైనా చేతకాని వాడు, వీడికి వెంట నాలుకు కుక్కలు కూడానా!” అని సునిశితంగా, నిర్ద్వందంగా విమర్శించిన తీరు సత్యకఠోరం, అనన్యసాధ్యం.

‘బొమ్మ’ తత్త్వధోరణి

భగవదారాధన పై – ‘నిను తెచ్చుకో లేక, నీ బొమ్మ తెచ్చుకొని, పూజలో నెలకొల్పి పూజారి నైనాను, కనిపించునా నాదు వేదన? నీకు వినిపించునా నా నివేదన? అని భగవంతుని ప్రశిస్తూ, విత్తు ముందా, చెట్టు ముందా అన్న వాదంలో, ‘విత్తనమ్మున మొక్క, మొక్కలొ విత్తనము – ఈ రెంటికిని నడుమ ఎంత జీవన గాథ! ప్రతి జీవలతయు నీదు గుడి! పరబ్రహ్మయే విత్తనాల మడి’ అని ముగించడం భావనలో పరాకాష్ట అనే చెప్పాలి. అలాగే, పాత పువ్వుల్లో కొత్త పరిమళాన్ని, కొత్త మొగ్గల్లో పాత కోరికలను ప్రస్తావిస్తూ, ఏ రుతువు గతి ఆ రుతువుదే, ఏ బ్రతుకు రతి ఆ బ్రతుకుదే అని విశ్లేషించిన విధం కూడ ఆక్కటుకుంటుంది. 

సాహితీ లత

భీమన్న ఏ ప్రక్రియ, వస్తువుని గ్రహించినా, ఆ సాహిత్య విభాగాన్ని సృష్టించడంలో నవ్యత, నాణ్యత సమాంతరంగా అందించడం జరిగింది. డా. బోయి భీమన్న కవిగారి సాహితీలత భావలహరి సాగిన తీరుః

“ఎవరు తుడిచితిరి నా యీ నిదుర కనులు? ఎవరు తెరచితిరి నా కీ వెలుగు కిటికీలు?

సాహితీ లత, ఉషస్సౌహార్ద  లేఖ, నవ నవోన్మేష సుందర భావరస రేఖ.

ఎవరు తొలగించినా రీ యిరుల పరదాలు? ఎవరు వెలిగించినారీ యరుణ కిరణాలు

సాహితీలత ప్రేమ వాహినీ గతి శీల, సరస ప్రజా హృదయ సంలగ్నమూల.

వేయి రేకులు తొడిగి వికసించు నెవరిదీ? వేదపూర్వము నుంచి వినిపించు నెవరిదీ?

సాహితీలత, లస త్సర్వాంగ రాగ, పూర్ణేందు రుచి భోగ పులకితావేగ.

ఎవరు నా కొసగిరి నవరత్న పేటిక? ఎవరు నా కుంచిరీ పువు బొట్టు కాటుక?

సాహితీలత, విశ్వసారస్వత విభూతి, అనునిమిషావిష్కృతానంద చిజ్జ్యోతి.”

ఆంధ్ర సాహితీ నందనోద్యానవనంలో, ఘనసాహితీవన సుక్షేత్రంలో ‘సాహితీ లత’ని పుష్పింపజేసి, తెలుగు సాహితీవతంసులకి సుందర సౌరభాల్ని అందించిన ఘనసాహితీ ఘనాపాటి, నవయుగ కవిసార్వభౌముడు, రసాద్వైతకవి, కవనకళాప్రపూర్ణుడుగా డా. బోయి భీమన్న సాహితీ వినీలాకాశంలో ధృవతారగా నిత్య సత్య ప్రకాశితులుగా కొనసాగుతారన్నది సత్యం, శివం, సుందరం.

బోయి భీమన్న సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మ భూషణ్ తో పాటు లెక్కకు మిక్కిలిగా గౌరవ, సమ్మానాలందుకున్న కవి, బోయి భీమన్న. పేదరికంతో పాటు, అంటరానితనం వంటి దురాచారాలు కూడా చిన్నప్పటినుండి భీమన్నకు అనుభవమే. షహజంగానే ఆయన వీటిని నిరసించాడు. అంబేద్కర్ రాసిన కులనిర్మూలన పుస్తకాన్ని తెలుగులోకి తర్జుమా చేశారు.

కాలేజీ చదువు తర్వాత, ‘జయవాణి’, ‘ప్రజామిత్ర’, ‘నవజీవన్’ మోదలైన పత్రికల్లో సంపాదకత్వం, క్విట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొనడం, ‘ఆంధ్రప్రభ’ లో సహాయ సంపాదకునిగా తన ప్రతిభను అందించిన భీమన్న ‘రాగోదయం’ కావ్యం లోని గేయాలను ఆకాశవాణిలో ప్రసారం కావించేవారు. మంచాల జగన్నాథరావు, పాలగుమ్మి విశ్వనాథం, చిత్తరంజన్ మొదలైన సుప్రసిద్ధ స్వరకర్తలు స్వరబద్ధం కావించి, గీతాలు, సంగీత రూపకాలకు బహుళప్రచారం అందాయి. బహుళ ప్రజాదరణ కలిగినవాటిలో – ‘మోహనరాగరాగిణి’ (ఈ మాసపు పాట), ‘ఎవరదీ యింతగనను వెంటాడేదెవరది’, ‘ఎత్తవోయీ కేల యీ బేల సుమబాల’, ‘చూచేకొలదీ సుందరము’, ‘పయనించు సెలయేటి’, ‘ఎంత కాలమాయెరా’, గీతాలు ఆకాశవాణి, దూరదర్శన్ ల్లొ ప్రసారమవడం జరిగింది. భీమన్న గారి ‘కాళీయమర్దనం’ సంగీతరూపకం, ‘ముజ్జగాలు మోహించగ మురళిని వాయించరా’ అన్న గీతం సుప్రసిద్ధ నటి పి శాంతకుమారి మద్రాసు ఆకాశవాణిలో అందించిన గానం పలు ప్రశంసలకు నోచుకున్నాయి. తెలుగువారికి అగణిత రసగుళికల గీతాలను అందించిన ఘనుల్లో భీమన్నగారి స్థానం అద్వితీయం.

జన్మభూమి ‘కోనసీమ’ పై పద్యం

జననీ జన్మభూమిశ్చ అన్న భావం భీమన్నగారిలో అణువణువునా కనిపించేది. వారి జన్మస్థలం కోనసీమ పై చెప్పిన పద్యం –

“పొలముల నీటి బోదెలను బొబ్బరి తోటలు మోట బోదెలన్

నిలిచి నవాంకు రమ్ములకు నీరము కట్టెడు వీగు వేళ నీ

చెలువము సస్యదేవతకు చిన్నెలు వన్నెలు తెచ్చు నన్నపూ

ర్ణలు నీ వడువునన్ శ్రమి యింతురు తెల్గు పల్లెలన్.”

అంతేకాక, జన్మభూమిని కవితారూపంలో పరవశింపజేసి, కోనసీమ సహజ సహజ సౌందర్యాన్ని –

“శ్యామలములైన లంకల అంశములను పమిట చెరగున మలయా నిలములు వీచి

పాంథ జనులకు పారమ్య పదవినొసగు కోమలా రామసీమ మా కోనసీమ” అని మురిసిపోయారు.

ఆరో క్లాసులోనే పద్యం ఎలా వ్రాస్తారని ఒక్కొక్క వృత్తమే తీసుకోవడం, నాలుగు పాదాలకీ అక్షరాలను లెక్కపెట్టి ప్రతీపాదంలోనూ రెండో అక్షరం ఒకటిగానే వున్నదని కనుక్కుని తనకితానుగా పద్యాల సంగతుల్ని స్వీయపరిశోధన ద్వారా తెలుసుకొని,  పద్యాలను వ్రాయడం ప్రారంభించిన భీమన్నగారి తెలుగు ఉపాధ్యాయుడు – “ఒరేయ్! గణాలు తెలుసుకోకుండా పద్యాలు వ్రాస్తే గండాలు వస్తాయిరా’ అని నిరుత్సాహపరచినా, “మన భీమన్న కవిత్వం, పాఠశాల ప్రక్కనే కల్లు దుకాణం నిర్వాహకురాలు గవండ్ల గంగమ్మ కవిత్వం’ అని ఆక్షేపించినా, ఆనాటి మహాకవి, కవి సార్వభౌములు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారికి, భీమన్నగారి కులదేహాకృతులు నచ్చకపోయినా,   ‘కృష్ణాన్వేషణ’ ఖండికలోని పద్యం చదవగా మెచ్చుకున్న వైనం భీమన్నగారి ప్రతిభాసంపత్తులు చెప్పకనే చెప్పాయి.

“మరిచితివేమొ గోపసుకుమారుని మారుని కన్నతండ్రి నీ

విరులకు మోహపున్ పదను వెట్టిన ప్రేయసునీ ప్రియాళికిన్

వరమురళీరవాను నటనమ్ములు నేర్పిన విశ్వసాధకున్

మరచివేమొ గొపవిభు మావిభు గోవిభు గోపికావిభున్.”

ఇంతగా పద్యం రాసేవాళ్ళు నాకు తెలియకుండా ఉండడమేమిటి? అని శాస్త్రిగారు ఆశ్చర్యపోతే, పద్యం నచ్చినా, పద్యం వ్రాసిన మనిషి నచ్చకపోవడం పట్ల అశ్చర్యపడడం భీమన్నగారి వంతుగా మారింది. భీమన్నగారి పద్యాలను పిఠాపురం జమీందారు, డా. బాబాసాహేబు అంబేద్కర్ లతొ సహా పలువురు మెచ్చుకోవడం కూడ జరిగిందని భీమన్నగారే పలుచోట్ల చెప్పారు.

“నా కావ్యానికీ, నా ప్రతీ రచనకూ ఒక ప్రేరణ శక్తి ఉంటుంది; ఏదో ఒక ప్రేరణను ఆధారంగా చేసుకొని ఒక కవిత, ఒక కావ్యమో పుడుతుందన్నమాట. అకారణంగా పుట్టిన కవితలు నా దగ్గరలేవు; ప్రతీదానికి ఒక కారణముంది” అన్న భీమన్నగారు “భీమన్న కావ్య సుమాలు’ అన్న గ్రంథావిష్కరణ కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి అధ్యక్షతన జరగడం, ఆ సభలోనే భీమన్న గారిపై విశ్వనాథ వారికి మంచి అభిప్రాయం కలగడం జరిగిందని భీమన్నగారు స్వయంగా చెప్పుకోవడం జరిగింది. అదే సభలో, ఆవిష్కరించబడిన కావ్యంలోని తొలి పద్యాన్ని భీమన్నగారు చదవడం జరిగిందన్నారు.

“నీరు గట్టి మళ్ళు గట్టి నారుగట్టి, కంచెలును గట్టి నన్ను పోషించరెవరు

అడవి మొక్కను నేను విశ్వావకాశ వీథులందు ఇష్టమొచ్చినట్లు విరియు చుంటి” అని తనను తాను వర్ణించుకున్న కవి భీమన్నలో ఎంత హుందాతనం, ఆత్మ విశ్వాసం, స్వీయానుభవానుభూతులను విశదపరచిన తీరు అనూహ్యం, అద్భుతం.

కవిత్వం అంటే జీవితం; జీవితంలో ఉండే అందాలు, ఆనందాలు, సుఖదుఃఖాలు, సంతోసాలు – ఇది కవిత్వం అన్న భీమన్నగారు తనదైన పలు భావనల సమాహారంగా కవితామహాప్రస్థానాన్ని మన తెలుగువారికి లభించిన తెలుగు వెలుగు.

లలిత రసాద్వైత లహరి

కేవలం కవిగానే కాకుండా లలితగేయ రచయితల్లో చెప్పుకొతగిన, చేవగలిగిన మంచి రచయితల్లో బోయి భీమన్న సుప్రసిద్ధులు. భీమన్న గేయాలుగా ‘రాభీలు’ చాలా ప్రసిద్ధం వహించాయి. రసస్వరూపుడైన భగవంతుడు రసాన్నే పొంది అనుభవిస్తున్నాడన్న ‘రసోవైసః’ అంటే భగవంతుడు రసస్వరూపుడని, ‘రసం హ్యేవాయం లబ్ధానందీ భవతి’ అంటే రసమునే పొంది  ఆనందము కలవాడుగను, శృతులు ఘోషిస్తున్నాయి. జీవిత పరమార్థం ఇదేనని, తాను నమ్మిన తన వాదానికి ‘రసాద్వైతం’ అని పేరు పెట్టి, తన ఆధ్యాత్మిక సిద్ధాంతానికి అనువుగా ‘రాభీలు’ లలితగీతాలను రచించారు         . ప్రకృతిలోని స్త్రీ సహజమైన రామము, పురుష సహజమైన భీమము – కలగలిపి రచించిన ప్రేమ గీతాలకు ‘రాభీలు’ గా నామ నిర్థారణ కావించుకుని, వీటిలోని రసావేశమంతా మధురభక్తియుతమైనదిగా గ్రంథానికి వ్రాసుకున్న ముందుమాట వల్ల విశదమవుతోంది. వీటి ద్వారా వైయక్తిక ఆనందాన్ని కోల్పోతున్న మానవాళికి హృదయకవాటాలు తట్టి రాగాన్ని, రసాన్ని కురిపించారని, తెలుగు లలిత గీతాల పై సమగ్ర పరిశోధన కావించిన సుప్రసిద్ధ లలితగేయకర్త డా. వడ్డేపల్లి కృష్ణ తన గ్రంథంలో – లలితగీత విస్తారం అన్న విభాగంలో బోయ భీమన్నగారి లలితగీతాల సంకలనం ‘రాభీలు’ గ్రంథం పై సుదీర్ఘ విశ్లేషణం కావించడం, భీమన్న ప్రతిభను అవిష్కరించడం జరిగింది. మొదటి గేయం ‘నమస్తే’ లో సరస్వతీ స్తుతితో నాంది పలికి, ‘నమస్తే శరత్పూర్ణ చంద్రచ్యుతీ, నమస్తే, నమస్తే, సరస్వతీ’ అని వాగ్దేవికి ప్రణామాలు అర్పించి, లేఖినిని రసాద్వైతంలో ముంచెత్తారన్నది సత్యం. మూడు వందలకు పైగా చోటుచెసుకున్న లలితగీతాలతో బోయి భీమన్నగారు ‘రాభీలు’లో తన భావాలకు రసాద్వైతంగా రూపుకట్టించి, ఆమలిన శృంగారానికి అద్దం పట్టడమే కాక, పలు లలితగీతాలను వ్రాసి, లలితగీత విస్తారానికి నడుం కట్టారని డా. వడ్డేపల్లి వ్యాఖ్యానించారు.

‘పాలేరు’ అందించిన గండపెండేరం

కవిత్వంతోపాటు, అత్యధికంగా అనేక నాటకాలను కూడ రచించి ప్రాచుర్యం పొందిన భీమన్నగారి కలంనుంచి తొలి ప్రక్రియగా ‘పాలేరు’ నాటకం ఆవిర్భవించడం, వంద ప్రదర్శనలకు నోచుకోవడం, దామోదరం సంజీవయ్య గారి చేతులమీదుగా గండపెండేరం తొడిగించుకోవడం, పదివేలమంది జనం డప్పులు, చిందులు, కర్రసాములతో పట్టపగలే దివిటీలు పెట్టి బ్రహ్మరథం పట్టి ఊరేగించడం మరువలేని మధురానుభూతిగా స్వయంగా చెప్పుకోవడం జరిగింది. భీమన్న కలంనుంచి, ఆదికవి వాల్మీకి, వేదవ్యాసుడు, ధర్మవ్యాధుడు వంటి పౌరాణిక నాటకాలు, పాలేరు, కూలిరాజు, అసూయ, ప్రగతి, పడిపోతున్న అడ్డుగోడలు వంటి సాంఘిక నాటకాలు అధిక ప్రాచుర్యం, ప్రాభవం పొందాయి.

భీమన్న గురించి …

“మార్క్సిస్టు సిద్ధాంతాలపై విశ్వాసం లేకున్నా, వీరు దారిద్ర్యపు బాధల్ని స్వయంగా అనుభవించి, పేదల జీవితాలు బాగుపడాలని కొరిన అభ్యుదయవాది; కుహనా సంస్కర్తలు దారిద్ర్యాన్ని ఏదోలాగ మిగిల్చి వుంచుతున్నారని వీరి ఆందోళన. (రామమోహనరాయ్)”

భీమన్న నిజమైన కవి. ఆర్తి ఆయన కవిత్వానికి ప్రాణం; వ్యంగ్యం జీవకళ. మన సమాజంలో అసమానతలు ఉన్నంత వరకు భీమన్న కవితలు  బ్రతికి వుంటాయి” (ఎన్. గోపి)

“బెంగలను బాధలను తొలగించి, నిరాశా నిస్పృహలను ఊదేసి, మనస్సులు ఉత్తేజపరచి ఆత్మను అలరించేది కవిత” అని తనకు తానుగా కవితా నిర్వచనాన్ని అందించిన బోయి భీమన్నకవి అభ్యుదయ, మానవతావాద కవిత్వంతో అలరించి, సంప్రదాయం పై తనదైన నిశ్చిత భావనాసరళితో భారతీయ సంస్కృతిని అపారంగా అభిమానించి, అరాధించిన జాతీయభావకవిగా ప్రఖ్యాతి పొందారు.

రచనలు

  • రాభీలు, గుడిసెలు కాలిపోతున్నాయి, మానవుని మరో మజిలీ, పైరుపాట, పిల్లి శతకం, కూలీశతకం, దీపసభ, రాగవాశిష్ఠం, కావ్య కుసుమాలు.
  • పాలేరు, కూలి రాజు నాటకాలు

పురస్కారాలు

డా.బోయి భీమన్న జయంతి (సెప్టెంబరు 19) సందర్భంగా అక్షరాంజలి సమర్పిస్తూ …

 

 

No comments: