Tuesday, September 18, 2012


 శ్రీ గణేశ మాహాత్మ్యము

“నమామి విఘ్నేశ్వర పాద పంకజమ్”


లోకమున ప్రతి మానవుడు, ఆయురారోగ్యైశ్వర్యములను కోరుచుండును. అవి మనము కోరినంత మాత్రముననే ప్రాప్తించేవి కావు. పూర్వజన్మ సుకృతమును బట్టియే ప్రాప్తించుచుండును. సుకృతము పుణ్యకర్మలచే ప్రాప్తమగును. ప్రాప్తాప్రాప్తములకు అనేక కారణములుండును. ప్రాప్తములకు అనేక అంతరాయములు కలుగుచుండును. అట్టి అంతరాయములు కలుగకుండా మనము ప్రతీ కార్యారంభమునకు "ఆదోవ్ పూజ్యో గణాధిపా" అన్నట్లు గజాననుడిని, గణపతిని, పూజించుతూంటాం. యిది సర్వులకు విదితమే. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధి నాడు సర్వ మానవులు వినాయకునికి పూజలు జరుపుకోవడం అనివార్యం. గణపతికి అనేక నామధేయాలు వివిధ రూపాల్లో, వివిధ నామాల్తో గణపతి కి పూజలను చేస్తారు భక్తులు. మన భారత దేశంలో యించుమించు అన్ని ప్రాంతాల్లో పూజిస్తారు. మదురై లో 'వ్యాఘ్రపాదగణేశూనిగా, మైసూరు లో "హాలీబీడూ హరాయ సర్వేశ్వరాలయం లో దివ్యవర్ధనుడు స్థాపించిన బంగారుచాయ గల గణపతిగాను, మహారాష్ట్ర లో బాలగంగాధర తిలక్ తీర్చిదిద్దిన సమాజ మంగళమూర్తి 'గణపతి పప్ప మోరియా'గాను, భాగ్యనగరపు విఘ్నరాజభాగ్యంగా అనేక రూపాలుగాను, యావత్తు దేశంలోని మారుమూల గ్రామాల్లో కూడ నిత్య దర్శనం కలిగిస్తాడు. విదేశాల విషయం వస్తే, మెక్సికో లో ధ్యానదేవతగా, చైనాలో ''కాంగేతణ్ అంటే బుద్దిని సమ్రుద్ధిగానిచ్చే దైవం గాను, ఆరాధించడం సదాచారంగాను, సత్సంప్రదాయంగాను, నిలచిపోయింది.
ముద్గల పురాణంలో 32 గణపతులను బహుధా పూజింపదగినవిగా ప్రస్తావించడం జరిగిందని పెద్దల ఉవాచ. వాటిలో 16 ప్రముఖ గణపతి మూర్తుల నామాల్ని పేర్కొనడం జరిగింది. బాల, తరుణ, భక్తి, వీర, శక్తి, ద్విజ, పింగళ, ఉచ్చిష్ట, విఘ్న, క్షిప్ర, హేరంభ, లక్ష్మి, మహా, భువనేశ, నృత్య మరియు ఊర్ధ్వ గణపతులుగా వర్ణించడం జరిగింది. ఏ దేవుని అనుగ్రహము వలన ధర్మార్థకామాలు లభిస్తాయో, షోడశాత్మకుడైన ఆవిఘ్నరాజుయొక్క స్తోత్రం చెప్పబడుతోంది. గణేశం ప్రమదాధీశం, నిర్గుణం సగుణం విభుం, యోగినోయత్పదంయాంతి, తంగౌరీ నందనం భజే అని కొలవడం పరిపాటి. వేదాల్లో, పురాణాల్లో, తంత్రశాస్త్రములో, సంహితలో, పరబ్రహ్మ గణపతి తత్వం సుస్ఫష్టంగా గోచరిస్తుంది. శ్రీ గణేశ్వరునికి సంబంధించిన ఉపాసన, సాధన, మంత్ర, తంత్ర విధానాలు, సాహిత్యం అన్నిటా, "గాణాపత్యం" అన్న పేరుతో ప్రసిద్ధిపొందటం కూడ పరిపాటి.
మనము ప్రతి నిత్యం స్మరణ చేసుకునే "శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చరుర్భుజం, ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంత యే" అన్న శ్లోకం లోని విష్ణు శబ్దమునకు వినాయకుడు అని అర్ధం. విష్ణు శబ్దం సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తూంది. "వ్యాపకత్వాత్ విష్ణు: వ్యాప్నోతి విష్ణు:' అని ప్రమాణం. "భూతాధిపం భూత గణాది సేవితం, కపిత్థ జంబూఫల సార భక్తితం, ఉమాసుతం శోక వినాశ కారకం, నమామి విఘ్నేశ్వర పాదపంకజం" అన్నది ప్రస్తావించి తీరాలి. "విఘ్నాలను తొలగించి శుభములను కలిగించు శుభదాయకుడు గణపతి. సర్వశుభకార్యములలో విఘ్నేశ్వరునికే ప్రధమ స్థానం. దేవతా సమూహము లోనూ గణపతికి విశిష్ట స్థానం. వినాయకుడే తన బొజ్జలో ఎన్నో విశిష్ట విషయాలను దాచుకున్న విశిష్ట దైవం. ఆయనే విష్ణువు. ఆయనే ఓం కారమున్నూ. సిద్ధిని, బుద్ధినీ యిచ్చే ఆహ్లాద, ఆర్యోగ విషయ బోధకుడు. సృష్టిలో ఆయన తత్వం నిండి యుండనిది ఏదీ లేదంటారు. అట్టి వినాయకుని సుచరిత తెలిసుకోవడం అత్యావశ్యకం. గణేశుడు వేరువేరు యుగాల్లో వేర్వేరు అవతారాలుగాకృతయుగం - కశ్యపపుత్రునిగా, సింహవాహనుడై అసురసంహారం చేయగా, త్రేతాయుగంలో - మయూరేశ్వరుడిగాను, ద్వాపరయుగంలో - సింధురాసురుని సంహరించిన గజాననుడిగాను, ప్రస్తుత కలియుగంలో - ధూమ్రకేతువుగా అవతరించి అశ్వారూఢుడై నాస్తికులను రూపుమాపుతున్న గణేశునికి హిందూశిల్పశాస్త్రం కూడ ప్రముఖ స్థానంగా మారింది. ఏదేవుని అనుగ్రహమువలన ధర్మార్ధకామాలు లభిస్తాయో, షోడశాత్మకుడైన అవిఘ్నరాజుయొక్క స్తోత్రం - "గణేశం ప్రమదాధీశం, నిర్గుణం సగుణం విభుం, యోగినోయత్మదంయాంతి, తంగైరీ నందనం భజే' అని స్తుతించవలసినదే.
శ్రీ వేద వ్యాస మహర్షి 18 పురాణాలను రచించి, వాటిలోని విశద పడని అనేక, నిగూఢ రహస్యములను వివరించుటకై మరి 18 ఉపపురాణాలను కూడ రచించాడంటారు. వీటిలో 'గణేశ పురాణమూ ప్రముఖమైనది. వ్యాధి పరిహారమునకు భృగువు గణేశపురాణ పారాయణం చేసి ఫలితం పొందాడు అని చెప్తారు. మంత్రరాజమైన - 'గణానాంత్వా గణపతిగం హవామహే, కవింకవీనాం ఉపమశ్రవస్తువం ... జ్యేష్ట రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆణశౄణ్వన్నూతిభిస్సీదసాదనం శ్రీ గణాధిపతయే నమ: " అని గణాధీశుని వర్ణన జేయబడడం విదితమే. యిక్కడ, 'బ్రహ్మణ స్పతి" అని వినాయకుని వర్ణించడం, 'బ్రహ్మా అనగా వాక్కు, దాని ద్వారా వర్ణం, ఉచ్చారణ, గురు లఘువులు, సమస్త మంత్ర, వర్ణ చందో విజ్ఞాన మయమైన బ్రహ్మసాగరమంతా ఉధ్బవించడం, ఫలితంగా విద్యాప్రదాతగా విరాజిల్లుతున్నాడు. అందుకే మధురకవి బమ్మెర పోతన "విద్యలకెల్ల నొజ్జయై" అని ప్రస్తావించాడు. విద్యాభ్యాసప్రారంభం 'తొండము నేకదంతము లేకుండా కాదు, కాలేదు. విద్యతో బాటు, శతృ పూజలు చేయడం అన్నది గమనిస్తే గణేశుని ఘనత వేరే చెప్పనక్కరలేదు. త్రిమూర్తులు, శ్రీకృష్ణుడు సత్ఫలితాల్ని సాధించారు అన్నది పురాణచరిత్ర ఘోషిస్తోంది. దైవ ప్రియత్వం గురించి చెప్పాలంటే, సూర్యుడు నమస్కారప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక స్తుతి ప్రియుడు అయితే, గణపతి తర్పణ ప్రియుడు గా విరాజిల్లుతున్నారు. ఆది శంకరులు 'ముదాకరాత్త మోదకం, సదావిముక్తి సాధకం, కళాధరావతంసకం, నమామి వినాయకం' గణేశుని మనోహరంగా కీర్తించి ఆరాధిస్తే, త్యాగరాజాది సంగీత వాగ్గేయకారులందరూ "శ్రీ గణపతిని సేవింపరారే' అంటూ రసమయ భక్తిగానామృతధారలతో పరవశులయ్యారు.
జాతి ప్రగతికి ఐక్యతకు భారత దేశ స్వతంత్ర పోరాట సమయంలో భారతీయులకు ధార్మిక శక్తి, సామాజిక దేశభక్తియుత ప్రబోధానికి 'తిలక్' మహాశయుడు గణేశుని ఉత్సవాలు జరిపించడం ఆధునికసమాజపరంగా సామూహిక భక్తిపూజాకార్యక్రమాలు చాలా ప్రసిద్ధి వహించాయి. పూర్వం భాగ్యనగరం హైదరాబాదు-సికింద్రాబాదు జంటనగరాల్లో అంతగాలేని వినాయకచవితి పూజామాసం కడు పునీతకాలంగా వర్ణించాలి. ప్రాకృత, వేద, సంస్కృత, ఆంధ్ర భాషల కవిత్వాల్లో కూడ కవులు తమ రచనలను తరచుగా దైవప్రార్ధనతోనే శుభారంభం గావించడం కూడ కవిసమయ సంప్రదాయంగా మారడం నేటికీ జరుగుతూంది. "శ్రీసిద్ధిబుద్ధు లబ్బగ, దోసములుం దొలగ, విఘ్నదు:ఖము లడచన్, శ్రీ సిద్దగణవిభుం డని, వాసిని గన్నట్టి నీకు వందనము ప్రభూ" అని, "శ్రీ గణేశ్వరు నిర్విఘ్నశివసమగ్ర కార్యసాధన కాదరగరిమ మెరయ, మ్రొక్కి నుతియింతు వాణి నిర్దుష్టమైన పల్కు, భావమ్ము గలిగింప బ్రణుతి జేతు" అని, "శ్రీ వాగీశాదులు సర్వావశ్యకకార్యసిద్ధి వలసిన దొలి నే దేవుని మ్రొక్కిరొ నేనా శ్రీ విఘ్నేశ్వరున కర్ధి జేతును జోతల్ అని భక్తి వర్ణనలతో బాటు, " గణేశుని పుట్టుకే యెంతో వింత, గిట్టుటయు నంతకంటెను గట్టి వింత, మరల పుట్టుట యంతకు పెఋగు వింత, అంతకంటెను నా కధ యంత వింతా గజాననుతో సరిపోల్చుకుని తాదాత్మ్యం చెందుతూ ధన్యత్వం పొందుతున్న ఆధునిక కవులు కూడ మనకు తారసపడుతున్నారు.
గణేశుని స్తుతి గావించే నవనిధ భక్తి మార్గాలు తప్పక 'తనయ తనయాది శుభదసంతానవృద్ధి మాన్యసద్గుణవృత్తి సంపత్సమృద్ధి కలుగుచుండును గణనాధు కరుణవలన అన్నది సత్యం, తధ్యం. భూతాధిపం భూత గణాది సేవితం కపిత్ద జంబూఫల సార భక్షితం ఉమాసుతం శోక వినాశ కారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. (ఫలశృతి) ఈ మానవ లోకంలో బహు దుర్లభమైన గజానన స్మరణచే మానవులు కృత కృత్యులగుదురో, అట్టి గజాననుని మహిమను వర్ణించుట శేష, చతుర్ముఖాదులకైననూ బహు దుర్లభము. అనేక జన్మార్జిత పుణ్యవశంబునగాని యిట్టి కధామాహాత్మ్యము లభింపదు. పాషందులు, నాస్తికాదులు వినలేరు. నిత్యనిర్గుణ, అనంత స్వరూఫుడగు గజానన స్వరూపమును వర్ణించుటకైనను, తరంబుగాదు. అనేక వ్రతములు, దానములు, యజ్ణంబులు, తపస్సులు, చేయుటచే కల్గిన పుణ్యవశంబునగాని, మాహాత్మ్యమునందు వుత్సాహము కలుగదు. మాయా వికారంబులైన సంసారధర్మములందు విరక్తులైన వారలకు సులభము, సుగమము అని మహనీయుల ఉపదేశ సందేశసారం. సర్వాభీష్టసిద్దికి సర్వేశ్వరుడైన శ్రీగజాననుని ప్రార్ధిస్తూ, స్వామి గణపతిని ఆత్మానుసంధాన రూపమగు ప్రార్ధన, అర్చనాదులను సమర్పించి, భక్తసాధకులకు సర్వశుభములు ఒనగూరుతాయన్నది సత్యం."తత్పురుషాయ విద్మహేవక్రతుండాయ, ధీమహి, తన్నోదంతి: ప్రచోదయాత్ "ఓం సమస్త స్తై గణేశాయ బ్రహ్మ విద్యా ప్రదాయినేయస్యా గస్త్యాయతే నామ విఘ్న సాగర శోషణే"ఓం గం గణపతయే నమ:

మూలాధార చక్రము

కుండలినీ యోగము ప్రకారంము షట్చక్రాలలో మొదటిదైన మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. చక్రంలోనే కుండలినీ శక్తి సాధారణంగా అంతస్థితమై (చుట్టు చుట్టుకొని, నిద్రాణమై) ఉంటుంది. వినాయకుని రూపంలో పామను చూపడానికి, మూలాధార చక్రంతో ఉన్న సంబంధానికి సాఱూప్యం చెబుతుంటారు. గణపతి అధర్వశీర్షంలో కూడా విషయం చెప్పబడింది. కనుక వినాయకుడు అన్నింటికీ "మూలాధారము" అని కూడా వివరిస్తుంటారు
వినాయకుని ఆకారం పై ఎన్నో చర్చలు, అభిప్రాయాలు, తత్వార్ధ వివరణలు, కధలు ఉన్నాయి. ఏనుగు తొండం, పెద్ద బొజ్జ, ఎలుక వాహనం - ఇవి ప్రధానంగా కనిపించే స్వరూప విశేషాలు.
  • వినాయకుని ఆకారం దేవనాగరి లిపిలో "ఓం" (ప్రణవం)ను పోలి ఉన్నదని చెబుతారు. ఇది చిత్రకారులకు చాలా ప్రియమైన విషయం. ఓంకారంలో వినాయకుడిని చూపిస్తూ ఎన్ని బొమ్మలు గీయబడ్డాయో చెప్పలేము. ఎందరో చిత్రకారులు విషయంలో తమ సృజనాత్మకతను ప్రదర్శించారు.
  • వినయకుని తొండము "ఓం"కారానికి సంకేతమని చెబుతారు.
  • ఏనుగు తల - జ్ఙానానికీ, యోగానికీ చిహ్నము.
  • మనిషి శరీరము - మాయకూ, ప్రకృతికీ చిహ్నము
  • చేతిలో పరశువు - అజ్ఙానమును ఖండించడానికి సంకేతము
  • చేతిలో పాశము - విఘ్నాలు కట్టిడవసే సాధనము
  • విరిగిన దంతము - త్యాగానికి చిహ్నము
  • మాల - జ్ఙాన సముపార్జన
  • పెద్ద చెవులు - మ్రొక్కులు వినే కరుణామయుడు
  • పొట్టపై నాగ బంధము - శక్తికి, కుండలినికి సంకేతము
  • ఎలుక వాహనము - జ్ఙానికి అన్ని జీవుల పట్ల సమభావము ఉండాలి.
ఓం గం శ్రీ లక్ష్మీగ ణపతయేనమః  

బీజాపూరగదే క్షు, కార్ముక, భుజా చక్రా బ్జపాశోత్పల

వ్రీహ్యగ్రస్వవిషణరత్నకలశ ప్రోద్యత్ కరాంభోరుహః

ధ్యేయోవల్లభయా, సపద్మకరయాశ్లిష్టోజ్వల ధ్చూషయా

విశ్వోత్పత్తి, విపత్తిసంస్థితి కరోవిఘ్నేశ యిష్టార్థదః

వందే నిరంతర సమస్త కళాకలాపం - సంపత్కరం, భవహరం గిరిజాకుమారం

లంబోదరం, గజముఖం ప్రణవత్స్వరూపం - లక్ష్మీ గణేశ మఖిలాశ్రిత కల్పభూజం.

శ్రీ సిద్ధి, బుద్ధి సహిత గణేశ ప్రసాద సిద్ధిరస్తు.

గణేశం ప్రమదాధీశం, నిర్గుణం సగుణం విభుం - యోగినొయత్పదంయాంతి తం గౌరీనందనం భజే.

విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనం – పురతార్థీ లభతే పుత్రం, మోక్షార్థ పరమంపదం.

సంసార సాగరే, ఘోరే పతితం సద్గతి వర్జితం, దీనబంధో దయాసింధో మాముద్దరగణాధిప.

‘కలౌ చండీ వినాయకా’

కలియుగం సంకటమైనది. సంకటాలన్నీ కట్టగట్టుకుని మనిషి ముందుకు  వచ్చి ఎదురు నిలిచి సవాలు చేస్తాయి. ఓ ప్రక్క దరిద్రం, కుటుంబభారం, రోగాలు, నష్టాలు, కష్టాలు, వివాహాలు – విభేదాలు శతృత్వాలు, వివాదాలు, ద్వేషాలు, మిత్రభేదాలు, మరోప్రక్క గ్రహ పీడలు, జన్మాంతర పాప ఫలితాలు, ఇలా ఎన్నో రకాలు, ఎదుర్కొనవలసిన వాడు మాత్రం మానవుడు ఒక్కడే. వీటన్నిటినీ యెదిరించి నిలవగలిగిన సులభమైన ఉపాయమే గణపతి ఆరాధన. సంకటాలను హరించి ఊరటనిచ్చే సంకటహర గణపతి వ్రతం యెంతో ముఖ్యమైనది, అనన్యమైనది. సంకటాలను తొలగించుకుని సుఖంగా, శుభంగా సంసారయాత్ర సాగించడానికి కలియుగంలో గణపతి, చండికలు మాత్రమే త్వరగా అనుగ్రహించే దైవాలు అని పలువురి విశ్వాసం.
ప్రణమ్య శిరసాదేవం, గౌరీపుత్రం వినాయకం – భక్త్యాస్మతి న్నిత్యం, సర్వ కామార్థ సిద్ధయే.

ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్ర్రం చతుర్భుజం – పాశాంకుశ ధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం.

ఉత్తమ గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం – భక్తాభీష్ట ప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం.

గణాధిప నమస్తేస్తు ఉమాపుత్రాఘనాశన, వినాయ కేశతనయ సర్వసిద్ధి ప్రదాయక

ఏకదంతైక వదన తథా మూషిక వాహన, కుమార గురవే తుభ్యం అర్పయామి సుమాంజలిమ్.

తత్పురుషాయ విద్మహే, వక్రతుండాయ ధీమహి, తన్నోదంతి ప్రచోదయాత్.

శ్రీ గణేశ చతుర్థి సందర్భంగా, తెలుగురథం శుభాకాంక్షలను అందజేస్తూ, గణనాథుడు యావత్ప్రజానీకానికి మరింత సుసంపన్నమైన, ఆరోగ్యమైన, అర్థవంతమైన, ఆహ్లాదకరమైన జీవితాన్ని ప్రసాదించాలని, మానవజన్మకి అర్ధాన్ని, పరమార్ధాన్ని, సార్ధకతని కలుగజేయాలని, ప్రార్ధిస్తూనమామితం వినాయకం. ఓం శాంతి: శాంతి: శాంతి:
తెలుగురథం - కొంపెల్ల శర్మ (97017 31333)(kbssarma@gmail.com)



No comments: