Tuesday, October 28, 2008

సంధ్యా దీప నమోస్తుతే - దీపావళి శుభాకాంక్షలు

అజ్ణాన తిమిరాన్ని పారద్రోలేది 'దీపం'
కామ క్రోధ లోభాలు నరకానికి కారణాలు అయి గీతాచార్యుడు వివరించాడు. ఈ మూడింటినీ జయించాలంటే, అజ్ణానాంధకారాన్ని జయించాలి. ఈ అంధకారాన్ని జయించేందుకు జ్ణానదీపాన్ని వెలిగించాలి. జీవితాలను నరకప్రాయం నుంచి రక్షించేందుకు మనందరకు కావలసినది జ్ణానదీపం ఒక్కటే. ఆ దీపం యిలా ఉండాలి అని పురాణాలు చెప్తున్నాయి.

'వైరాగ్య తైల సంపూర్ణే, భక్తివర్తి సమన్వితే, ప్రబోధపూర్ణ పాత్రేతు, క్షిప్తిదీపం విలోకయేట్.

నిండైన ప్రమిద ప్రచోధమైతే, ఆ ప్రమిదను వైరాగ్యమనే నూనెతో నింపి, భక్తి అనే వత్తిని జ్ణానమనే దీపాన్ని వెలిగించాలి. ఇలా భక్తి వైరాగ్యాలతో అజ్ణానాంధకారాన్ని ఎదుర్కొని జ్ణానజ్యోతిని వెలిగించాలనే విశిష్టమైన సందేశాన్ని ఈ దీపావళి మనకు నిత్యం అందిస్తూనేవుంది.

దీపం వెలిగించిన పిదప -

'దీపం జ్యోతి పరబ్రహ్మ:, దీపం సర్వ తమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీప నమోస్తుతే'
'దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన:, దీపేన హరతే పాపం, సంధ్యాదీప నమోస్తుతే'

దీపాన్ని వెలిగించిన తర్వాత దీపాన్ని స్తుతించడం సంధ్యాసమయంలో దీపాన్ని దర్శించడం, దీపాన్ని నమస్కరించడం మనకు సదాచారం, సత్సంప్రదాయం.

" చుట్టూరా ఆవరించుకుని వున్న
చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం
కంటె, ప్రయత్నించి ఎంత చిన్న
దీపాన్నయినా వెలిగించడం మంచిది "

అన్న సూక్తిని ఊపిరిగా భావిస్తూ, దీపావళి పండుగ శుభసందర్భంగా తెలుగురథం శుభాకాంక్షలను తెలియజేస్తోంది.

కొంపెల్ల శర్మ - తెలుగురథం.

1 comment:

మాలతి said...

మంచిమాట చెప్పేరండీ. బాగుంది.