Monday, October 6, 2008

తెలుగురధం - భాష, సాహిత్యం, సంస్కృతీ రంగాల విశ్లేషణా వేదిక

తెలుగురధం
జాతిని, సంస్కృతిని, భాషను, సమయ సందర్భానుసారం విశ్లేషించే ప్రయత్నంలో భాగంగా 'తెలుగురథం' వేదికను ప్రారంభించాలనే తలపుకు కార్యరూపం.
"అపి స్వర్గమయీం లంకా! నమే రోచతే లక్ష్మణా! జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ" అన్న శ్రీరామచంద్రుని పలుకులను బట్టి, 'మాతౄమూర్తి, మాతౄదేశం స్వర్గానికన్న మిన్నా అన్న భావన అవగతమౌతోంది. మాతౄభూమి, మాతౄదేశంతో మాతౄభాషది ముప్పేటలా విడదీయరాని బంధం. ఈ నేపథ్య భావనతో, తెలుగునేల, తెలుగుజాతి, తెలుగుభాషాసంస్కౄతులను 'తెలుగురథం' వేదిక ద్వారా విశదపరచాలన్న సత్సంకల్పానికి అందరి ఆశీర్వాదాలని, సహాయ సహకారాల్ని కోరుకుంటున్నాం.
రథం అంటే మనకు స్మరణకు వచ్చేది మన పవిత్రమైన పండుగ - రధ సప్తమి, రధాంక సప్తమి. సూర్యుడు ఆరాధనామూర్తి.
'జననీ త్వం హిలోకానం సప్తమీ సప్తసప్తికీ, సప్తవ్యాహృతికే దేవి నమస్తే సూర్యమాతౄకే"
సప్తాశ్వములు గల ఓ సప్తమీ! నీవు సకలభూతములకును, లోకములకును, జననివి, సూర్యునికి తల్లివైన నీకు నమస్కారము. సూర్యారాధనం మనకు వేదకాలంనుండియే కలదు.
"అసత్యేన రజసా వర్తమానో నివేశయ న్నమృతం మర్త్యం చ హిరణ్యయేన సవితా రధేనా దేవో యాతి భువనాని పశ్యన్"
సూర్యుని గమనం ఏడు గుర్రములు పూంచిన బంగారు రథం మీద సాగుతుందని వేదం "హిరణ్యయేన సవితారథేనా అని తెలుపుతుంది. సూర్యగమనం ప్రకారం ఉత్తరాయనం, దక్షిణాయనం అని రెండు విధములు. ఆషాఢమాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయనం. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. అందుకే ఈ రోజు పవిత్రదినంగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు. కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు "భారతీ' అంటే వేదమాత. వేదమాతను ఆరాధించువారును భారతీయులే. హిరణ్యరధమునెక్కి సూర్యుడు వెళ్ళుచున్నాడని ప్రాచీనులు ఎంతో సుందరముగ ఊహించి ఆరాధించారు. ఈ సూర్యుని రధానికి చక్రమొకటే. ఆ చక్రమునకు ఆకులారు; గుర్రములు ఏడు. సూర్యుడు సంవత్సరమునూ ఒకే చక్రముగల విశ్వమను రధమున ఛందస్సులను ఏడు గుర్రములను పూంచి వచ్చుచున్నాడు. సంవత్సరం ఆవృత్తమగు ఆరు ౠతువులు సముదాయం కనుక చక్రముగాను, సూర్యకిరణమున ఏడురంగులు భాసిస్తాయి కనుక వాని అశ్వములుగను పూర్వులు వర్ణించారని పండితపరిశోధకుల భావన. మాఘ శుద్ధ సప్తమి సూర్యగ్రహణముతో సమానం. ఆరోజు అరుణోదయవేళ స్నాన,జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్నీ అనేకకోట్ల పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలనిచ్చును. సప్తమినాడు షష్ఠి తిథి గూడయున్నచో షష్టీ సప్తమీ తిథుల యోగమునకు 'పద్మామని పేరు. ఈ యోగము సూర్యుని కత్యంత ప్రీతికరం. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానం చేసినచో, ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధం తెలుపుతోంది. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి 'అర్కా అనె పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక, ఏడు జన్మల్లో చేసిన పాపాలను, ఏడు రకాలైన వ్యాధులను నశింపజేస్తాయి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధం. రథసప్తమి వ్రతం మన సంప్రదాయాన నిలచియుండుట భారతీయతకు చిహ్నం.
రధం తో మమైకమైన 'తెలుగూ 'జనని సంస్కౄతంబు సకల భాషలకును, దేశభాషందు తెలుసు లెస్స, జగతి తల్లికంటె సౌభాగ్యసంపద, మెచ్చుటాడుబిడ్డ మేలు గాదె?'
అన్నాడు సాహిత్య చక్రవర్తి శ్రీనాధ మహాకవి.
'తెలుగదేల యన్న దేశంబు తెలు; గేను తెలుగువల్లభుండ తెలుగొ కండ, యెల్ల నృపులు గొలువ నెఋగవే బాసాడి, దేశభాషలందు తెలుగు లెస్స!'
అని సామ్రాజ్య చక్రవర్తి అన్నాడు.
ఈ యిద్దరు మహానుభావులు అందించిన నుడి, నానుడిలను ఊపిరిగా, శ్వాశగా గ్రహించుకుని మన మాతౄభాష తెలుగుని జనని, జన్మభూములతో సరిసమానంగా స్వీకరిస్తున్నాం అన్న భావన అత్యుక్తిగా భావించినా లేకపోయినా, అతిశయోక్తి ఎంతమాత్రం కానే కాదు అని మా భావన. తెలుగుతనానికి, తెలుగుదనానికి వారసులు రసరమ్య హౄదయులైన మా తోటి తెలుగుతల్లి అనుంగు బిడ్డలకు సవినయంగా సమర్పించుకుంటున్న శతకోటి వందనాలు. మన జన్మభూమి, పుణ్యభూమి, ధన్యభూమి అయిన అమరభారతం - ఆంధ్రప్రదేశం - సుజల సుమధుర సుందరతరం. సత్యం, శివం, సుందరం. తెలుగుభాష అన్నా, తెలుగువారన్నా, తెలుగు సాహిత్యం అన్నా, సంస్కౄతి అన్నా వల్లమాలిన అభిమానమే ఈ - 'తెలుగు సంస్కౄతీ, సాహిత్య, కళారంగాల సంకలన విశ్వ వీక్షణ విహార దర్శినీ అయిన 'తెలుగురధం' ను ప్రతిష్ఠాత్మకంగా మహాప్రస్థానం కావించాలని, ఈ ప్రస్థానంలో అందరి అండదండల్ని, చేయూతల్ని అందించమని ప్రార్థిస్తూ, మనసా వాచా కర్మణా భావిస్తూ, విశ్వవిస్తూ, మనందరి 'తెలుగురథం' ప్రస్థానంలో 'నేను సైతం' అంటూ ముందుకు వేయాలని కోరుకుంటూ - మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేయ సాహసిస్తున్నాం. మా ముందడుగులోని సాధ్యాసాధ్యాలు మీ హార్ధిక, ఆర్ధిక సహాయ సహకారాలపైనే ముఖ్యంగా ఆధారాపడి ఉన్నది - తెలుగురథం ప్రస్థానపు తీరుతెన్నులు.
'సర్వధారీ విజయదశమి శుభాకాంక్షలతో - తెలుగుప్రజావళికి త్వరలో 'తెలుగురధం' ద్వారా తెలుగుదనాన్ని ప్రతిబింబచేసే - "భాష, సాహిత్యం, కళ, సాంస్కృతిక రంగాల విశ్లేషణా వేదిక"కు మీ ఆశీర్వచనాలని అందజేయమని ప్రార్థిస్తున్నాం.
'తెలుగురథం' విశ్లేషణా వేదికను అందరూ ఆశీర్వదించి అక్షింతలు చల్లుతారని ఆశిస్తూ -
కొంపెల్ల శర్మ/అధ్యక్షులు (97017 31333) రావి గణపతి/కార్యదర్శి (99892 73178)
తెలుగురథం - వస్తోంది, వచ్చేస్తోంది. త్వరలో దర్శనమవుతోంది.

2 comments:

కొత్త పాళీ said...

చాలా సంతోషం.
బ్లాగు ఆల్రెడీ నడుస్తోంది కదా, కొత్తగా అచ్చు పత్రిక ఏవైనా ప్రారంభిస్తున్నారా? సరిగ్గా అర్ధం కాలేదు.

Unknown said...

మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. 'తెలుగురథం' పేరునే, సాహితీ సంస్కృతిక సంస్థను ప్రారంభిస్తున్నాం. మీ అభినందనలు/ఆశీస్సులు చాలా ఉపయోగపడతాయి. పూర్తి స్థాయి సాహితీ పత్రికను, స్వంత వెబ్ సైట్ లో త్వరలో ప్రారంభిస్తున్నాము. భౌతిక పత్రిక ప్రచురణ ఈ రోజుల్లో జరగని పని కదా.


కొంపెల్ల శర్మ - తెలుగురథం.