Tuesday, October 7, 2008

అడవి బాపిరాజు (1895 - 1952) - 8 అక్టోబర్ - జయంతి సందర్భంగా సాహితీనీరాజనాలు

అడవి బాపిరాజు (1895 - 1952) - 8 అక్టోబర్ - జయంతి సందర్భంగా సాహితీనీరాజనాలు
త్రివేణీకళాసంగమం - బాపిరాజు
శ్రీ బాపిరాజుగారు కవి, గాయకుడు, చిత్రకారుడు. మూడు కళలను ముద్దచేసి ఆయన అద్భుతాలైన గేయాలను రచించారు. గానంలో స్థాయిని ప్రేరేపించి, కవితలో భావాన్ని పోషించి, చిత్రంలో రూపాన్ని నిరూపించిన సంపూర్ణమైన కళాస్వరూపాన్ని తయారుచేశారు. వాక్కునకందని రూపాన్ని చిత్రంలో, చిత్రానికందని భావాన్ని వాక్కులో పట్టి యివ్వగల నేర్పాయనకు సహజసిద్ధం. ఆయన వరద-గోదావరి అద్భుత ఖండకావ్యం. ఆస్వాల్డు కూల్డ్రే దొర అంతేవాసిగా సాహిత్యం, చిత్రకళల్లో ప్రావీణ్యమే కాక ప్రభావాన్ని కూడ అధికంగా పొందారు.
మన బాపిబావ
ప్రముఖగీతం 'బావా బావా పన్నీరూ అన్నపాట స్మరించని తెలుగుగుండె లేనేలేదని చెప్పవచ్చు. ఆ పాట రాసిన తీరు యిలా వుంటుంది.
బావా! బావా! పన్నీరు
"బావా! బావా! పన్నీరు బావను పట్టుక తన్నేరు
మూడు గుద్దులు గుద్దేరుమూలన మంచం వేసేరుముంతెడు గంజి యిచ్చేరు. బావా
వీధి వీధి తిప్పేరువీశెడు గంధం పూసేరుచావిడి గుంజకు కట్టేరుచప్పిడి గుద్దులు గుద్దేరు బావా
పల్లేరు తెప్పించి పక్క వేయండీనల్లేరు తెప్పించి నలిచి విడువండీనల్లేరు చేతాను నయము కాకుండీదూలగొండి తెచ్చి దులిపి పంపండీ బావా
సన్నిహితులు, తోటి కళాకారులు బాపిరాజుగారిని, బాపిబావ అని ముద్దుగా పిలుచుకోవడంలో వెనుక దాగివున్న రహస్యం - బావా బావా పన్నీరు అని బావలను పట్టించే హాస్య రసగుళిక.
బాపిరాజు జీవనప్రస్థానం
పాత్రికేయుడు, రచయిత, చిత్రకళాకారుడు, గాయకుడు, నాటకకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, వెరసి అడవి బాపిరాజుగారిని బహుముఖప్రతిభాసంపన్నుడు అని ఖచ్చితంగా చెప్పితీరాలి.
కౄష్ణయ్య-సుబ్బమ్మ దంపతులకు 8 అక్టోబర్ 1895 న జన్మించారు. పశ్చిమగోదావరిజిల్లా, భీమవరం లో జన్మించగా, హైస్కూలులో చదివుతోపాటు బి.ఎ. తర్వాత బి.యల్. చదివారు. 1920లో సత్యాగ్రహంలో జైలుకు వెళ్ళారు. కొంతకాలం న్యాయవాది వౄత్తిని నిర్వహించారు. యితర రంగాలలో కౄషి చేయాలన్న ఉద్దేశ్యంతో న్యాయవాదితనాన్ని విరమించారట. బందరు నేషనల్ కాలేజీలో అధ్యాపకత్వం (1934-39), హైదరాబాదు ప్రచురణ - మీజన్ తెలుగు దినపత్రిక కు సంపాదకునిగా, విజయవాడ-ఆకాశవాణి లో కేంద్ర సలహాదారుగా, నవ్యసాహిత్య పరిషత్తుని స్థాపించిన వారిలో ప్రముఖులు, చిత్రకళను అభ్యసించడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ను స్థాపించారు.
బహుముఖ కళాధారణం
1922లో సహకార నిరాకరణోద్యమంలో ఏడాదిపాటు జైలులో వున్నారు. ఈ కాలపు జైలు అనుభవాలను తమ రచన 'తొలకరీ నవలలో ప్రతిబింబనం చేశారు. జైలులోనే శాతవాహనుల కాలంనాటి కధలను తీసుకుని తమ సుప్రసిద్ధ ఆంధ్ర చారిత్రక నవలను 'హిమబిందూ రచనను ప్రారంభించారు. ఈ ధారావాహికకధనం 1924-25 లో 'శారదా పత్రికలో వెలువడింది అని ఆరుద్రగారు తన సమగ్రాంధ్ర సాహిత్యంలో చెప్పడం కూడ జరిగింది. నూరు అధ్యాయాల నవల అవడం విశేషమే. నవలాకారునిగా బాపిరాజుగారు ఆధునికయుగంలో అజరామరమైన ప్రతిభను ప్రదర్శించారు. కవిగా, చిత్రకారునిగా, కధారచయితగా అందించిన రచనలు జమీందారీయుగంలో లబ్ధప్రతిష్ఠులవడం జరిగింది. ఈ వ్యవధిలో వ్రాసి, ప్రచురణ జరిగిన కధలు - పేరులేని పాప, యుగములనుండి నీకొరకు కనిపెట్టుకొని యుంటిని, నాగరాజు, నరపతి, గుడ్డిపిల్ల కధలు ఆనాటి ప్రముఖప్రచురణలైన, భారతి, ఆంధ్రపత్రిక లో దర్శనం యిచ్చాయి. అంతే కాక, 'అంజలీ, 'రాగమాలికా, 'తరంగిణీ పేర్లతో బాపిరాజుగారి కధాసంపుటాలు వచ్చాయి.
ఎంకి, కిన్నెరసాని చిత్రణారూపాలు
బాపిరాజుగారిలోని చిత్రకళాకారుడు, ప్రముఖులు నండూరి సుబ్బారావు గారి 'ఎంకిపాటలూ, విశ్వనాధ సత్యనారాయణ గారి 'కిన్నెరసాని పాటలూ అంశాలకు విలువను పెంచేరీతిలో చిత్రాలను ఆనాటి బాపుశైలిలో వేశారు అన్నదాంట్లో సంశయం లేదు. బాపిరాజుగారికి చిన్నవయసునుంచే కవితలు వ్రాసే అభిరుచి వుండేదిట.
బాపిరాజు గారి రచనలు
అడవి బాపిరాజుగారు అన్నవెంటనే, మనకు తెలుగుసాహిత్యంలో, సాహితీరసికులకు వెనువెంటనే స్ఫురించే రచనలు ఉన్నాయి. ప్రత్యేకంగా నవలలు స్మరణకు రాకమానవు.
నవలలు - నారాయణరావు, తుఫాన్, గోనగన్నారెడ్డి, కోనంగి, హిమబిందు.
నారాయణరావు నవలకు ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారు పురస్కారం లభించింది.
రేడియో నాటికలు - దుక్కిటెద్దులు, ఉషాసుందరి, భోగిరలోయ.
కధలు - తూలికానౄత్యం, హంపీశిధిలాలు, శిల్పబాల, వీణ.
చిత్రదర్శకత్వం వహించినవి - మీరాబాయి, అనసూయ, ధ్రువవిజయం. అన్నీ పౌరణీకాలు అన్నది గమనించదగ్గది.
బాపిరాజుగారి ఎన్నో కధలు, గేయాలు రచించారు. కనడభాషలోకి కూడ అనువాదం చెంది పేరుపొందాయి. తొలకరి, గోధూళి అను పేర పదకవితలను, శశికళ అను పేర పద్యకౄతులను రచించారు.
అడవి బాపిరాజు గారి సాహితీప్రతిభను ఆధునిక యుగపు సాహిత్యంతో అనుసంధానించి, సరియైన విశ్లేషణ చేయవలసిన అవసరం ఎంతైనా వుంది అని ఆరుద్ర ప్రగాఢంగా చెప్పారు.
అడవి బాపిరాజు గారి కావ్యమాల నుండి మచ్చుతునకలు :
గోధూళి నుండి :
1.చెరువుమెట్లు
చకన్ని చిన్నది చుక్కలరాణైపాటపాడుతూ పడతి నిలిచినదితెల్లనిచీరా మెల్లని నడకామెళ్ళోహారం తెల్లనిపూవులు చక్కని చిన్నది
బిందె బుజాన సందెనీటికైచ్ర్లోకలువలు నల్లనికన్నులు
కంఠమెత్తినదికలచుపాటలవిపాటలుపాడుతూ పడతి నిలచినది
చెరువు మెట్లపై చెలియ నిలిచినదిబంగరునీటిలొ ప్రతిఫలించినది
సందెచీకటిలో చక్షులుకలిసెనుఎర్రని పడమట ఇంతివెనుకనే
పాటేభామై భామైపాటైపాటా భామా పడమటిరంగైబంగరునీరై పొంగెడి ప్రేమైచెరువుమెట్లపై చిత్రాలైరీ చక్కని చిన్నది
2. వరద గోదావరి
ఉప్పొంగిపోయింది గోదావరి తానుతెప్పన్న యెగసింది గోదావరీకొండల్లొ ఉరికింది కోనల్లు నిండిందిఆకాశగంగతో హస్తాలు కలిపింది ఉప్పొంగి
అడవిచెట్లన్నీని జడలలో తురిమిందిఊళ్ళు దండలుగుచ్చి మెళ్ళోన తాల్చింది
వడులతో సుడులతో గరువాల నడలతోపరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తువచ్చింది
శంఖాలుపూరించి కిన్నెర్లు మీటించిశంకరాభరణరాగాలాపకంఠియై
నరమానవుడి పనులు శిరమొగ్గి వణికాయికరమెత్తిదీవించి కదలికే నడిచిందిఉప్పొంగిపోయింది గోదావరి తానుతెప్పున్న ఎగసింది గోదావరి ఉప్పొంగి
తెలుగుసాహితీకళారంగాన్ని తనదైన ప్రతిభాపాటవాలతో అలరించిన బహుముఖప్రతిభాశాలి - అడవి బాపిరాజుగారు - మన బాపిబావ - 22 సెప్టెంబర్ 1952 న భౌతికలోకాన్ని వీడినా, తెలుగుసాహితీజగతి ఎల్లప్పుడూ ప్రముఖ స్థానాన్నివ్వడమేకాక, దాన్ని భద్రంగా పరిరక్షిస్తోంది అని చెప్పాలి. బాపిరాజుగారి జయంతి సందర్భంగా 'తెలుగుజర్నళ్ సాహితీ నీరాజనాలను సమర్పిస్తూ ... కొంపెల్ల శర్మ - తెలుగురధం.

3 comments:

ఉమాశంకర్ said...

చాలా విషయాలు తెలిసాయి. 89, 90 ప్రాంతాల్లో బాపిరాజు గారి రచనలు కొన్ని చదివాను. ఏవి చదివానో కూడా స్ఫురణ కి రావటం లేదు.

మీ పోస్టుకు ధన్యవాదాలు ...

నిషిగంధ said...

బాపిరాజు గారి గురించి ఎన్నో విషయాలు తెలియజేసారు.. కృతజ్ఞతలు!
మా గురువుగారి ప్రోద్భలంతో ఈమధ్యనే 'నారాయణరావు ' ని చదివాను.. అద్భుతమైన రచన! అప్పటినించీ బాపిరాజు గారి మిగతా రచనల కోసం ప్రయత్నిస్తున్నాను!

Unknown said...

నాకిష్టమైన బావా బావా పన్నీరు, ఉప్పొంగి పోయింది గోదావరి పాటలు వ్రాసినది బాపిరాజు గారని నాకింతవరకూ తెలియదు.కృతజ్ఞతలు.