Monday, September 15, 2008

మరువరాని మరువం - మోక్షగుండం

'సఋ మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861 - 1962)గంధపుచెక్కలా సేవలో అరిగిపో, కాని యినుములా తుప్పు పట్టవద్దు - అన్నది ఈ మహానుభావుని జీవనధ్యేయం.
మేము మాటలతో కాలయాపన చేశాం, మీరు నిరంతర క్రియాశూరులై నవభారత నిర్మాణానికి కౄషిచేసిన మహనీయులు - అన్ని భారత తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చే స్వయంగా కొనియాడబడిన మన భారతదేశపు ముద్దుబిడ్డ.
మీరేమైనా చెప్పండి, భారత గ్రామీణుల గురించి నాకు మీకంటే ఎక్కువగా తెలుసు - అన్న మహాత్ముని మాటలను సున్నితంగా తిరగగొట్టి - నేను మీకంటే పదేళ్ళు పెద్దవాడినన్న విషయం గమనించమని, దేశ ఆర్ధిక ప్రగతి విషయంలో మీ కంటే ఎక్కువ అవగాహన నాకుంది - అంటూ జాతిపితనే ధైర్యంగా ఢీకొట్టగలిగిన అసమాన ప్రతిభాశాలి, ధీరుడు.
పాలనాదక్షుడు, రాజనీతిజ్ణుడు, నిష్కామదేశభక్తుడు, అంతేకాదు, విశ్వవిఖ్యాత ఇంజనీర్ గా ప్రఖ్యాతమైన పేరును పొంది, భారతరత్న సన్మానం పొందారు.
వీరు ఎవరో, మరెవరో కాదు, ఆయన - శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆ మహా ప్రతిభావంతుని జయంతి విశ్వవ్యాప్తంగా 'యింజనీర్ల దినోత్సవం' గా జరుపుకోవడం పట్ల మోక్షగుండం వారి ప్రతిభ చెప్పకనే చెప్పబడుతోంది.నూరేండ్లకు పైగా జీవించిన దీర్ఘాయుష్మంతుడు, ప్రసిద్ధ ఇంజనీరు - మోక్షగుండం విశ్వేశ్వరయ్య. బెంగుళూర్ కు దగ్గరగా వున్న ముద్దినహళ్ళె గ్రామంలో జన్మించగా, వీరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం గ్రామానికి చెందిన వారవడం తెలుగువారి గర్వకారణమే కదా. మూడు శతాబ్దాల క్రితం మైసూరుకు వలస వెళ్ళారు.
కౄష్ణరాజసాగర్ డాం, హైదరాబాద్ అభివౄద్ధి పధకం, విమానాల ఫ్యాక్టరీ పధకం, బీహార్ లో గంగానదిపై రైలు వంతెన నిర్మాణం మొదలైన వాటిలో ఈయన పాత్ర శ్లాఘనీయం. హైదరాబాద్ సంస్థానికి స్పెషల్ కన్సల్టీఇంగ్ ఇంజనీర్ గా, అదే సమయంలో మైసూర్ చీఫ్ ఇంజనీర్ పదవిలో కొనసాగారు. అనేక సాంకేతిక రచనలను చేశారు. 1955 లో భారతరత్న బిరుదుతో సత్కరించడం విశ్వానికే గర్వకారణం అని చెప్పాలి. విశాఖపట్నం రేవును సముద్రపు కోతనుండి రక్షించే వ్యవస్థను రూపొందించడం, బెంగుళూర్ లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించడం, మైసూర్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడంలోను బౄహత్తరమైన భూమికను నిర్వహించారు. బ్రిటిష్ ప్రభుత్వం వారు నైట్ హుడ్ (సర్) బిరుదు, ఆయన శతజయంతి సంవత్సరంలో విశ్వేశ్వరయ్య పారిశ్రామిక, సాంకేతిక ప్రదర్శనశాల ను బెంగుళూరులో స్థాపించడం లో కూడ ఈయన చలవ వుంది.
కర్తవ్య నిర్వహణలో, నిజాయితీలో, ఓ పట్టాన కానరాని వ్యక్తిత్వం, అరుదైన నిరాడంబరత, విశ్వేశ్వరయ్య గారిలో ప్రత్యక్షమయేవిట. భారతదేశంలో పెద్ద జలాశయాలు, ఆనకట్టలు నిర్మించుటలో వారి సలహాలను ప్రభుత్వం గొప్పగా భావించేది.
యావజ్జీవితం దేశాభివౄద్ధికి, ప్రజాసంక్షేమానికి నిర్విరామ కౄషిని సలిపిన ఘనుడు, మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారు, ఏప్రిల్ 12 1962 న పరమపదించారు.
మనదేశానికి మాత్రం నేడు మోక్షగుండం లాటివారి అవసరం ఎంతైనా వుంది. ఎక్కడ ప్రత్యక్షమవుతారో, అందరూ కలసికట్టుగా అన్వేషణ గావించాలి. ఆ దిశలో ముందుకు నడవాలి. పదండి ముందుకు.
సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా తెలుగురథం వినమ్రసహిత ప్రణామాల్ని సమర్పిస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

2 comments:

suresh said...

ధన్యవాదాలండి.విశ్వేశ్వరయ్య గారి గురించి చెప్పి ఆనందింపచేసారు.అటువంటి మహాత్ములవలనే మన దేశం గర్విస్తోంది.చాలా చాలా ధన్యవాదాలు.

Anil Dasari said...

మంచి వివరాలు తెలియజేశారు. విశ్వేశ్వరయ్యగారి పేరు మీద బెంగుళూరులో ఒక టెక్నాలజీ మ్యూజియం ఉంది. ఆయన శత జయంతి సందర్భంగా కట్టారు దీన్ని. బెంగుళూరు వెళ్లిన వాళ్లు తప్పక దర్శించాల్సిన మ్యూజియం ఇది.