Monday, September 15, 2008

మనసు కవి, మన సుకవి - ఆచార్య ఆత్రేయ


మనసుకవి - మన సుకవి - 'ఆచార్య ఆత్రేయా వర్ధంతి - సెప్టెంబరు 13 (1921 - 1989)
సాంఘిక నాటకాలకు ప్రజాదరణ సంపాదించిన గౌరవం వీరిది. నాటక నిర్వహణంలో చక్కనిసామర్ధ్యం, ఎటువంటి పాత్రనైనా పోషించి భేష్ అనిపించగల అబినయ కౌశలమూ పుష్కళంగా కలిగినవారు. అనేక నాటకాలని రచించి, రసవంతపు పోషణాభినయానికి తనదైన శైలిలో సంపూర్ణ బాధ్యతను వహించిన వ్యక్తి - 'ఆచార్య ఆత్రేయా గా ప్రసిద్దిపొందిన ఆత్రేయసగోత్రీయులు, ఖిళాంబి వేంకట నరసింహాచార్యులుగారు. ఆచార్యులు వారు 7 మే 1921 న నెల్లూర్ జిల్లా, సూళ్ళూరుపేట, మంగళంపాడు గ్రామంలో జన్మించారు. నాటకరంగంతోపాటు, చిత్రసీమలో ప్రవేశించి, గీతరచన, కధారచనలతో పాటు, మరొక రెండు విభాగాలు - దర్శకత్వం, నటనలో కూడ తనదైన మోతాదుని ఒక నమూనాగానే చూపించి నిత్యనూతనత్వాన్ని సుస్థిరంగానే పదిలపరచుకున్న ప్రవర్ధమానుడు ఆచార్య ఆత్రేయుడు.
నాటకరసరమ్యంభారత స్వాతంత్ర్యపు రజతోత్సవం సందర్భంగా, తెలుగు తీరుతెన్నుల సమీక్ష లో, 'నాటికా పై విశ్లేషన చేస్తూ, ఆనాటి ప్రముఖ నాటకరచయిత గొల్లపూడి మారుతీరావు, '1947 ఆగష్టు 15, రచయితకు గొప్ప అన్యాయం జరిగిపోయింది అని చెబుతూ, స్వాతంత్యం గురించి అరిచే అవసరం రచయితకు చచ్చిపోయిందని, దాదాపు వంద సంవత్సరాలు పెంచి పోషించిన గొప్ప యితివౄత్తపుదుర్మరణానికి ఆరోజు సంకేతమని, దేశస్వాతంత్ర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలో ఈ దేశానికి అర్ధంకానట్లే అన్నారు.
ఆంధ్రనాటకకళాపరిషత్తు పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా ఏలూరు లో (1949) ఒక అద్భుత నాటకం ప్రదర్శిస్తున్న రోజు అది. విదేశీపాలన స్వతంత్రభారతానికి ప్రసాదించిన 'దారిద్ర్యం, అజ్ణానం, కుతంత్రం, కుట్రాదులూ నికౄష్ట ఆర్ధిక సామాజిక వ్యవస్థలో గతి తప్పి, గత్యంతరం లేక నలిగిపోయి, అలిగిన ఆర్తుని క్షుభితాత్మ విజౄంభణాన్ని ఆవిష్కౄతమవుతున్న కధనమే ముఖ్యాంశం. ఆ నాటకం పేరు 'యన్.జి.ఓ'. 1947-57 దశకకాలంలో ఆంధ్రనాటకరంగాన్ని ఉఋఋర్రూతలూగించిన ప్రసిద్ధ నాటకకర్తలకున్న పాండితీప్రకర్షణలు లేకపోయినా, అనేక సమకాలీన సమస్యలపై, చిన్న, చితక నాటకాలను అధ్బుతంగా రచించి, ప్రదర్శింపబడ్డ సత్కాలం. వైవిధ్యమైన యితివౄత్తాలతో, ఆత్రేయ నాటకాలు బహుళ ప్రజాదరణకు నోచుకున్నాయి. ప్రముఖతరంగా పేరువచ్చిన నాటకాలను, ప్రాతినిధ్యంగా చెప్పాలంటే, హిందూమహమ్మదీయసఖ్యతను ప్రతిపాదించే 'ఈనాడూ, మానవజీవితాలను నిరసించిన శాస్త్రీయప్రయోగాలను సమీక్షించే 'విశ్వశాంతీ, సమాజానికి వ్యంగ్యచిత్రణమైన 'కప్పలూ, ప్రాచీనచరిత్రకు సమకాలీన తత్వవ్యాఖ్యానానిచ్చిన ప్రతీకాత్మకరచన 'అశోకసామ్రాట్టూ, భయంలోని నికౄష్ట తత్వాన్ని ఆవిష్కరించిన 'భయం' ధనకాంక్షకు ప్రజాక్షేమం దౄష్టితో నిర్వహించే వౄత్తి-విధుల మధ్య జరిగిన సంఘర్షణ పై 'ఎవరు దొంగా, మొదలైన నాటక-నాటికలు ఆచార్య ఆత్రేయ కలం తీర్చిదిద్దిన సుప్రసిద్ధ అభినయపర్వాలు.
సంభాషణలు, గీతాలు చిత్రాతిచిత్ర తరంగాలుమూకీశైలిలో ప్రారంభమైన చలనచిత్రానికి, సంభాషణలు అంతముఖ్యం కాదేమో అన్న మీమాంసను, చార్లీచాప్లిన్ చిత్రాలు నిత్యసాక్ష్యాలుగా నిలవడం అన్నది సత్యమైనా, పరిమితంగానైనా మాటలు సినీమాకు అవసరం, ఎందుకంటే, ప్రపంచంలో చార్లీచాప్లిన్ ఒకేఒక్కడు కనుక అని, ప్రముఖ రచయిత ఎంవీయల్, సినీమా రచన పై తన భావాన్ని వెలిబుచ్చాడు. అందుకని, మాటలను, క్లుప్తంగా, సంక్షిప్తంగా, అల్పంలో అనల్పం మాదిరి మాటల తూటాలను వదిలితే, ప్రతిభావంతమైన రచనగా చెలామణి అవుతుంది. ఏది ఏమైనా, వాస్తవానికి, క్లుప్తత అన్నది బహులుప్తంగా మారిపోయింది. ఆచార్య ఆత్రేయ అందించిన సంభాషణలు, అసాధారణమైన క్లుప్తత, భావుకత, సౄజనాత్మకత, రమణీయత, వాస్తవికత, ఈ సల్లక్షణాలన్నీ కలసి, వెరసి, 'ఆత్రేయతా గా మారి, ఒక చిత్రకధనసాహితీపీఠంగా మారి, చిత్రప్రేమికులను ఆనంద, అధ్బుత, ఆశ్చర్యరంగాల్లో ముంచుతూనేవుంది. మాటమీద మాట, మాట కోసమే మాట, మాటచుట్టూమాట తరహాలు ఒక విధమైన ఆచార్య తత్వాన్ని ప్రకటించేది. సినీమాకు మాటలు, పాటలు అందించే విధానాలను చెప్పాలంటే, వ్రాయక నిర్మాతలని, వ్రాసి ప్రేక్షకులని, వ్రాస్తూ తను అనుభవిస్తున్న పరిస్థితులకు తనకుతానే ఏడుపించేవాడని, ఆత్రేయకు కితాబు, మధురచురకలు కూడ. సామాన్యంగా ప్రతినిత్యం మట్లాడుకునే వాడుకభాషలోనే మాటలు వ్రాసి, వాడిగా, వేడిగా, వేడుకమూటలను అందించేవాడు. ఆత్రేయ అందించిన చిత్రాలకు మాటలు ప్రత్యేకంగా, వెలుగునీడలు, తేనెమనసులు, ప్రేమనగర్, సెక్రటరీ, ఇంద్రధనుస్సు, కోడెనాగు, దసరాబుల్లోడు, ఎన్నో, మరెన్నో. ఈయన చిత్రాలకు అందించిన మాటలు, పాటలు, రెండు రకాలుగా విభజించవచ్చును. అది, దసరాబుల్లోడు సినీమాకు,ముందు, తర్వాత అని. దసరాబుల్లోడు సినీమా, తెలుగుచిత్రరంగంలో ఒక అద్భుతతరంగం, అల, పోటు, కెరటం. అసాధారణ కుటుంబవాతావరణంతో సమగ్ర ఉల్లాసభరితకధాచిత్రం, నిత్యవినోదాన్ని సర్వదా అందింస్తూనే వుంటుంది. ఆత్రేయగారి మాటలు 'తేటతేటతెలుగులా', పాటలు 'మధురరసాలూరే ఊటబావిలా', కధ,కధనం నవరసభరితయింధనంలా అలరిస్తూంటాయి.
ఆత్రేయ మూస సంభాషణలుశ్రీశ్రీ భాషలో చెప్పాలంటే, రచయితలు గోల్డ్ స్మిత్స్ కావడానికి సావకాశం వుంది; సినిమారచయితలు వర్డ్ స్మిథ్స్ మాత్రమే కాగలరు. వాస్తవంగా సినిమారచనను సినిమా కధ, సంభాషణలు, గీతాలు, పద్యాలు కలసి చెప్పుకోవాలి. ఆత్రేయ విషయానికొస్తే, ఆయన గోల్డ్ వర్డ్ స్మిత్ అని చెప్పక తప్పదు. ఆత్రేయ చిత్ర సంభాషణల సొగసు, సౌందర్యాల మచ్చులు చూద్దాం.
వెలుగునీడలునాయికా నాయకులు షికారు కెళ్ళారు; నిజానికి పాటకోసం కల్పించిన సన్నివేశం అది; ఆ కౄతకత్వాన్ని కనబడనీయని సంభాషణలు యిలా సాగుతాయి.
ఏదీ నీ చెయ్యి, ఏం జోస్యం చెబుతారా, కాదు నిజం చెబుతాను.
ఇక్కడ జోస్యం మీద నమ్మకం లేంది రచయితకే కాని పాత్రక్కాదు. నాయకుడికి ఆ ప్రసక్తి అనవసరం. అయినా జోస్యం గురించి తన అభిప్రాయం చెప్పి, 'ధనవంతులు వంటినిండా నగలు పెట్టుకుని ఆడంబరంగా వుంటారనీ, నాయిక చెయ్యి రిష్టువాచ్ తో చూడ ముచ్చటగా వున్నది ఉద్ఘోషిస్తాడు. రచయిత, అక్కడ కష్టజీవుల గురించి చెబుతూ సామ్యవాద సంఘాన్ని సూచించే పాట వుంది. శౄంగార వైరాగ్యాల మధ్య వూగులాడే ఆ సన్నివేశంలో ఆ పాట అతకదు. అయినా రచయిత చాకచక్యంగా రాసిన ఆ మూడు మాటలూ ముచ్చటగా అతికి సన్నివేశాన్ని, పాత్ర్ల్ని అసహజత్వంనుంచి రక్షించేలా చేసిన రచయిత ధోరణిని ప్రతిభ కాక మరేమంటాం.
ఇలా పాత్రల్నీ కధనీ మించిన సంభాషణల రచన ఒకోసారే అతుకుతుంది; మాటలు పన్నడంలో ఆత్రేయ అవాక్కులు రాసిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఆత్రేయ చాలా చిత్రాల్లో 'నినాదాలూ లాగా రాసే సంభాషణలు పాయసంలో మిరపకాయల్లా వుండిపోతాయి అని సినీమా రచన, మాటా మంచీ అన్న రచనలో ఎంవీయల్ అంటారు.
ప్రేమనగర్ఆత్రేయ, ప్రేమనగర్ ల బంధం అవిభాజ్యమనే చెప్పాలి. ఆయన రాసిన మాటలు, పాటలు, ప్రతీ సన్నివేశంలోనూ తనదైన ముద్రను వేయడమే కాక, అందరినీ ఆశర్యానందాల్లో ముంచెత్తెవేసింది. సంభాషణలు యిలా ప్రవహిస్తాయి.
నిలకడకోసం, ఏ మాత్రం నిలకడ లేని నాదగ్గర కొచ్చారా?ఇక్కడ నుంచే మా అధికారం ప్రారంభం అవుతుంది. అహంకారం విజౄంభిస్తుంది. ఇక్కడి వందల వేల ఎకరాల స్థలం అంతా మాదే. కాని చివరకు మనిషికి కావలసింది ఆతు ఆరడుగులు, ఇటు రెండడుగులు.
ఆత్రేయ నేస్తం ఆయన మనస్సే!మనసులు అన్న పేరున్న చిత్రాలన్నింటిలోను - మంచిమనసులు, తేనెమనసులు, కన్నెమనసులు, మూగమనసులు, ఎక్కువగా పాటలను, మాటలను కూడ రాయడం జరిగింది. మనసును గూర్చి రాసిన పాటల్లో అంతటి విషాదపూరితమైన జీవనసత్యాలను చెప్పడం, ఆత్రేయ రాసినన్ని పాటలు వేరే చిత్రరచయిత బహుశ రాయలేదేమో. అందుకనే అతడిని మనసు కవి అని, మనకున్న కొద్దిమంది మంచికవుల్లో ఆత్రేయ ఖచ్చితంగా ఒకరని, మన సుకవి అనికూడ పిలవడం పరిపాటి.
దర్శక, నటనాప్రయోగాలుఆచార్య ఆత్రేయ స్వతహగా నాటకరచయిత. చిత్రసీమలో ప్రవేశించి అనేక చిత్రాల్లో మాటలు, పాటలు అందించడంతోబాటు, కొత్తదాన్ని చవిచూపించే ప్రయత్నంలో, వాగ్దానం సినీమాకు దర్శకత్వం, మల్లెమాల చిత్రానికి రచనతోపాటు, కధానాయకుడి గురువు పాత్రలో, అజరామరమైన నటనాసార్వభౌమత్వాన్ని ప్రదర్శించి, బహుమన్నలను సంపాదించుకున్నారు.
చిత్రరంగం సమాజంలో చెలామణి అవుతున్నంతకాలం, సినీమా పాటలు, మాటలు, కధలగురించి చర్చలొచ్చినప్పుడు, మనసు కవి,మన సుకవి అయిన ఆచార్య ఆత్రేయని స్మరించడం తప్పనిసరి.
ఖిళాంబి ఆచార్యులు వారు 1989, సెప్టెంబర్ 13 న, చిత్రంగా, చిత్రసీమకు, నాటకరంగానికి, ఆంధ్రదేశపుప్రజలను దు:ఖసాగరంలో ముంచి, భవతీరాలకు చేరుకున్నారు. మనకు ఆత్రేయ మన మనసుల్లో సుస్థిరవాసం చేస్తున్నారు.
ప్రముఖ పాత్రికేయుడు, అధికార భాషాసంఘం అధినేత - ఎ.బి.కె.ప్రసాదు గారు ఆచార్య ఆత్రేయ గురించి - వేదనల విషం త్రాగి - అమౄతం పంచిన ఆత్రేయ, అన్న నివాళి వ్యాసంలో యిలా భావించారు.
జీవితంలో అతి దారిద్ర్యమూ, అంతస్తులూ చూచిన ఆత్రేయ చలన చిత్రరంగంలో ఆటపాటల మేలుకలయికలో ఆదర్శ కవితా ఝరిని అందించిన రచయిత. తెలుగువాడి మనస్సు, వాడి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, పలుకుబళ్ళు, జానపదుల లౌకికతత్వం,బోళాతనం, నెల్లూరు వాడైనా తెలుగునేల నాలుగు చెరగులా గుమ్మడిపాదులా పాకిపోయిన మాండలికాలలోని తియ్యందనాలు ఆకళించుకున్నవాడు ఆత్రేయ. మానవతా విలువలు కలవీ, హౄదయాలను స్పందించేవి, కన్నీళ్ళు పెట్టించేవి, ఉద్రేక పరిచేవీ, ఉత్సాహ పరిచేవీ; అవి సందేశాత్మకాలూ, వేదనా కలశాలూ. ఆత్రేయకూడా సమాజం కోసం కళాకారుడుగాని, కళాకారుని కోసం సమాజం కాదన్న ఆదర్శాన్ని , ప్లెఖనోవ్ భావాన్ని నరనరాన జీర్ణించుకున్న రచయిత. వేదనల విషం త్రాగి జనతకు సమతామౄతం పంచిపెట్టాడు.
ప్రసాద్ గారి విశ్లేషణతోనే ఆచార్య ఆత్రేయ పై వ్యాసానికి భరతవాక్యం వ్రాయడం సముచితం, సమంజసం.
మహాకవి, మనసు కవి, మన సుకవి - అయిన ఆచార్య ఆత్రేయ వర్ధంతి సందర్భంగా తెలుగురథం ఘన నివాళిని సమర్పింస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

No comments: