మధురకవి మల్లాది రామకృష్ణశాస్త్రీయం (1905 - 1965) - 12 సెప్టెంబర్, వర్ధంతి
ఆధునికసాహిత్యపర్వంలో అనర్ఘరత్నం
ఆంధ్ర సారస్వత క్షేత్రంలో పసిడిపంటలు పండించిన పుంభావ సరస్వతి. ఆంధ్రాంగ్లాలు కాక ఎన్నో భాషలు నేర్చుకున్నారు. ప్రాశ్చ పాశ్చాత్య సాహిత్యాల సారాన్ని ఆకళించుకొన్నారు. కమ్మగా కవితలల్లగినా, కలాన్ని వచనానికి మీదు కట్టి జాతి కధలుగా వాసి కెక్కారు. మురిపాల ముద్దుల మూటలు కట్టేట్టు తెలుగు వచనాన్ని తీర్చిదిద్దారు. శౄంగార ప్రబంధాల ప్రచురణకు ఒరవడి పెట్టారు. చిత్రసీమ సాహిత్యకారుడిగా, సాహిత్య ప్రవక్తగా గురుస్థానం అధివసించారు. రకరకాల శిల్ప విన్యాసాలతో మలచిన వందలాది కధారచనలుగా తీర్చిన కబుర్లతో కధా కధనం పరవళ్ళు తొక్కించారు. పాత్రోన్మీలనం జరుగుతూ నిండైన నిలువెత్తు మనుష్యులతో వెనకటి తరం భాసమానమయ్యేలా చేయగలిగిన ఆధునిక సాహిత్యపు సశాస్త్రీయ అనర్ఘరత్నం.ఆయన ఎవరోకాదు, మధురకవి మల్లాది రామకౄష్ణశాస్త్రిగారు.
సినీకళామతల్లి వొడెలో వ్రాలిన మల్లాది
మల్లాదివారు 1905లో జూన్ 16 న కౄష్ణాజిల్లలోని మచిలీపట్నం తాలూకా, చిట్టిగూడూరు లో పండిత వంశంలో జన్మించిన స్వస్థలం బందరులో బి.ఏ., మద్రాసులో ఎం.ఎ. చదువుకున్నారు. బందరునుంచి మద్రాసుకు తరలివచ్చి సినీకళామతల్లి వొడిలో వాలిపోయారు. ఆయనకు సంప్రదాయం మీద వల్లమాలిన మోజు; అలాగని అన్నంతమాత్రాన ఆధునికత అంటే సరిపడదనికాదు. ఆనాడే మల్లాదివారు తెలుగుదనమంటే ఎక్కువ మక్కువ, జానుతెనుగు, తేనెతెనుగు, తేటతెనుగు మల్లాదివారు రంగరించిన కలకండపలుకులు ఆయన సాహితీసరాలు. శాస్త్రిగారు సాహితీక్షేత్రానికి కౄషీవలుడుగా అత్యంత ప్రతిభావంతంగా వ్యవసాయం చేశారు. సాహిత్యపరంపరలో పాటలు కట్టారు, కధలు అల్లారు, నవలలు వ్రాశారు, కొడవటిగంటి కుటుంబగారు ప్రచారంచేసిన గల్పికను కల్పించారు.
రాశి-వాసిల మేలుకలయిక శాస్త్రిగారి సాహితీభాండారం
మల్లాదివారు మరపురానిమనీషి. రామకౄష్ణశాస్త్రిగారిని స్మరణకు తెచ్చుకుంటే, అగణిత కధలు, గీతాలు మెదడులో మెరుస్తాయి. గొప్పదైన హస్తవాసితనంతో సౄష్టించిన జాతికధకులు, కధలలో, నవలలలో వెల్లివిరిసిన తెలుగు జాతీయత తెలుగు సంస్కౄతికి నిష్ణాతమైన నిరూపణగా విలసిల్లాయి. కధాసరిత్సాగరాన్ని కదనకుతూహలంతో మధించిన మహానుభావుడు. అచ్చతెనుగు నుడికారానికి గుడికట్టిన వాడు. శాస్త్రిగారి కధలలో, నవలలో వెల్లివిరిసిన తెలుగు జాతీయత తెలుగు సంస్కౄతికి చక్కని నిరూపణ. మల్లాదివారు తమ రచనా పద్ధతిని తన మాటల్లో వివరిస్తూ, మన ఊహపోహలతో పగ్గాలు వేసి వాళ్ళను పట్టకుండా ఉంటే మన కధల్లో కనపడే మనుష్యులు వాళ్ళ పలుకు వాళ్ళు పలికి, వారి కధ వారు నడుపుకుపోతారు అన్న ధీమంతులు. శాస్త్రిగారి రచనల్లోని సంభాషణలకు సొగసులు దిద్దిన ఘనత ఆయన భాషది. తేటతెనుగు మాటలు, ఆ మాటలతో తీర్చిన పదబంధ నందనాలు. ఆ పదబంధనందనాలలో సాక్షాత్కరించే విలక్షణ ప్రయోగ పారిజాతాలు ఆ భాషకు అలంకారాలు కాగా ఆయన భాష 'అధిక చక్కనిదీ, ఆంధ్రికి వరమైనది అని శాస్త్రిగారి కౄష్ణాతీరం నవలకు బి. నళినీకాంతారావు మరియు పి.యస్. గోపాలకౄష్ణల కలగలుపు మనోల్లాసభరిత మున్నుడిలో సుమనోహరంగా వర్ణించారు.
రామ 'కౄష్ణాతీరా సమీరం
మల్లాది వారి రచనల్లో మేలుబంతి కౄష్ణాతీరం. మెరుగులన్నీగల ఈ సాంఘిక నవలను ప్రస్తావిస్తూ, మీ కధకు నీతి ఏమిటన్న ప్రశ్నకు దానికున్నదల్లా జాతి అని జవాబు చెప్పిన జ్ణానపధులు. నవలలోని పాత్రలు వారి మాటలను, వారిచుట్టూ నడిచే కధను వాటంతట అవి నడుపుకుని పోతూనేవుంటాయి. సంభాషణలు, నానుడులు, ఒక కొత్త అర్ధాన్ని, పరమార్ధాన్ని యివ్వడం మల్లాదివారి ప్రత్యేకత. మచ్చుకు కొన్ని చూద్దాం - సకల మంచివాడు; కస్సుమనకుండా కన్నబిడ్డను పలకరించినట్లు; కలో గంజో అలవాటైన ప్రాణి, ఒంటినేత అంగోస్త్రమల్లే ఈచుకుపోయి ఉసూరు మంటూ ఉండాలి; పప్పు ఎనిపినట్లు, మీది అద్దరి - మాది ఇద్దరీ, వాలకంలో గంగిగోవయినా వనరులో సింహమే, పాలెం పాలెం కోడై కూస్తూంటే, అధిక చక్కనిది, నిత్యపెళ్ళికూతురు, కూసుచిప్పిళ్ళు, గారాలకూచి, నిక్షేపరాయుడు, గుణకారం మనిషి, లోకరివాజు, చెడుగుడాట (వాద ప్రతివాదాలు సాగించడం), ఏడుపాయల జడ అల్లడం (డొంకతిరుగుడుగా మాటలాడడం), యిలా చెప్పుకుపోతే వేలు, వేనకువేలు. ఈ నవలకు సమస్త అందాలు అలవడడం, ఆ అందాలకు తెలుగు నుడికారపు యింపుసొంపులు, పలుకులకులుకులు, చమత్కారపుచతురతలు, అన్నీ ఒక్కసారే కలిసివచ్చినందువల్లనే మనకు అనర్ధరత్నం లభించింది. ఈ నవలలో మరొక విశేషం - కధ, కధలోంచి కధలోంచి కధలు పుట్టుకువచ్చే ఉపాఖ్యానాల్ని నైపుణ్యంతో ప్రదర్శించడం జరిగినా, కధాగమనం కించిత్తు మందగించిందేమో అన్నవారు కూడ లేకపోలేదు. నిజానికి శాస్త్రిగారు కౄష్ణాతీరం నవలని బౄహగ్రంధంలా తయారుచేద్దామనుకున్నారని, ఏవో కారణాంతరాల వలన వీలుపడలేదని ఆప్తులు చెప్పడం కూడ జరిగిందట. ఆంధ్రులు ఈ విషయంలో దురదౄష్టవంతులు. కౄష్ణాతీరవిహారయానం ఆంధ్రసాహితీలోకంలో తిరుగులేనిమనోల్లాసయానం అనే చెప్పాలి. మల్లాదిశాస్త్రివారు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారినుద్దేశించి - ఆయన రచనలు మరోభాషకు లొంగవు; జానుతెనుగు నేర్చినవారికే, తెలుగు వారైన వారికే శ్రీపాదవారికి కధలు చదివి ఆనందించే అదౄష్టము, అని అన్న మల్లాదివారి మాటలు వారికే అన్వయిస్తాయి అని నళినీకాంతరావుగారు అనడం సర్వసమంజసం అని అనిపించక తప్పదు.
చిత్రసాహితీజీవన మకరందం
రవికి, కవికి తేడాలేదంటారు. కవి స్వయంప్రకాశసమానుడు. తెలుగు చిత్రకవితాయానంలో ఎందరో కవితాభిమానులు ఎన్నో ఏళ్ళగా మునిగితేలుతున్నారు. కవితాలపన చేసి రసికలోకాన్ని మైమరపించి, రసనలోకాన్నికూడ ఆనందడోలికల్లో ముంచెత్తుతున్నారు. మల్లాదివారి హస్తవాసితనాన్ని పూర్తిగా కనిపింపచేసే చిత్రాలు - పూజ్యులు, ఎందరికో గురుతుల్యులు అయిన మల్లాది రామకౄష్ణశాస్త్రిగారు మహాకధకులు,మహా పండితులు అని చెప్తూ, వేటూరివారు అతికొద్దిమంది ముఖ్యులలో మల్లాదివారు ఒకరు అని నా అభిప్రాయం అన్నారు. పాటలలో తెలుగు నుడికారాన్ని, యిట్టే పసిగట్టవచ్చు. మచ్చుకు - తెల్లవారవచ్చె తెలియక నాస్వామి (చిరంజీవులు), ఓ సుధలోక సుహాసినీ మధులోక విలాసినీ (చివరకుమిగిలేది), అందమే ఆనందం - ఆనందమే జీవిత మకరందం (కీట్స్ భావన), చిటారు కొమ్మన మిఠాయిపొట్లం చేతికందదేం గురుడా - వాటం చూసి వడుపుచేసి వంచర కొమ్మను నరుడా (కన్యాశుల్కం) లాంటి చిత్రాలు, పాటలు ఎన్నో చెప్పుకోవచ్చు. ఆంగ్లకవుల హౄదయవేదనను తెనిగించి అధ్బుతమైన గీతాలు సందర్భానుసారం వ్రాయడం, స్వరపదసంయోగం కనిపించే లక్షణం, అద్భుత సంగీతాభిజ్ణత, ప్రేమగీతాలు, విరహగీతాలు, తెలుగు చిత్రసాహితీవనంలో అరుదైన పంటలను పండించారు. శబ్దచమత్కారం, అర్ధగాంభీర్యత, మల్లాదివారి పాటల్లోని గట్టికోటలు.
మల్లాదివారి ౠణం తెలుగుసాహితీపాఠకలోకం ఎప్పుడూ తీర్చుకోలేదు. తీరడం కూడ తెలుగుసాహితీప్రేమికులకు అంతగా యిష్టం కూడా కాదు. ఎవరాపును రవి రుక్కును, కవి వాక్కును అని నారాయణరెడ్డిగారు అన్నట్లు, మల్లాదివారి వాక్కు ఎన్నడూ ఆగలేదు. ఆయన సాహిత్యం యావత్తూ, చిరస్థాయిగా భద్రపరచుకోవాలేగాని, అనంతంగా గుర్తు వుండిపోతుంది అన్నదాంట్లో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అది సత్యం కనుక.
మల్లాదివారు, చినికిన చినుకెల్ల మంచిముత్యము కాదు అన్న పాటపల్లవి కూర్చారు. మల్లాదివారి విషయంలో మాత్రం యిది సరిపడదు. ఆయన చినుకులధారనుంచి జాలువారినవన్నీ ముత్యాలుగా అయిపోయాయి, మిలమిల మెరిసిపోతున్నాయి. శాస్త్రిగారు సశాస్త్రీయంగా, భావసౌందర్యంతో పలికిన మాట, వ్రాసిన వ్రాత పదికాలాలు నిలిచేట్టు మలిచారు; ఆ సాహిత్యమేఘం చినికిన చినుకులన్నీ కేవలం ముత్యాలుకాదు, ఆణిముత్యాలుగా అలరిస్తూనేవున్నాయి. ఆద్యంతాలు రసవంతాలైన రసగుళికలు.
పలు భాషలపై 'పట్టుల పుట్టలూ
మల్లాదివారు సంస్కౄత, ఆంధ్ర భాషల్లో ఎం.ఏ పట్టా పొంది, ఉర్దూ, అంగ్ల భాషల్లో ప్రావీణ్యం సంపాదించి, ఖురాను, బైబిల్ గ్రంథాలను ఔపోసన పట్టారు. జిజ్ౙాస, ఉత్సాహం ఉంటే సాధించలేనిది లేదంటూ ఆయన, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, హిందీ, కన్నడ, తమిళం, ఒరియా వంటి దేశీయ భాషలతో పాటు సింహళం, ఫ్రెంచ్, గ్రీకు, లాటిన్, జర్మన్, జపనీస్, చైనీస్ వంటి విదేశీ భాషల్ని కూడా ఆధ్యయనం చేసి సుమారు సుమారు 50 భాషలతో పరిచయం పెంచుకున్న విశిష్ట సాహిత్య బహు భాషా విశారదుడు. స్వగ్రామం బందరు లో చదువుకునే రోజుల్లోనే, ఒక ముస్లిం పండితుని దగ్గర 'ఉర్దూ' నేర్చుకుని, 'ఖురాణ్ ను ఆమూలాగ్రం పఠించడమేకాదు; అదే శైలిలో, 'బైబిళ్ సంపూర్ణంగా చదివి, సంబంధిత పీటర్-కేటర్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారట. భాషలు నేర్చుకోవడానికి, పాండిత్య పరిశోధనలకు - వయో, వర్గ, మత భేదం లేదని ఆనాడే నిరూపించిన గొప్ప పండితీశాస్త్రీయం. అలాగే, వేదాధ్యయనం, బ్రహ్మసూత్రాలు, మహాభాష్యాల్ని నేర్పుగా నేర్చుకున్నారట. మల్లాది మహా బహుభాషా పండితుడు. ఈ భాషలతో పాటు శాస్త్రిగారు ఖగోళం, జ్యోతిష్యం, చిత్రలేఖనం, తర్క, వేదాంత, అలంకార, సంగీత మర్మాలెన్నింటినో తెలుసుకోవడమే గాక తాలింఖానా లో చేరి కుస్తీపట్టుల్ని మంకుపట్టుగా నేర్చుకున్న మహామనీషి, మల్లాది అన్న సత్యం మరువలేం.
ఎందరెందరో - ప్రశంసల జల్లులు
ప్రతిభావంతుల ప్రతిభని సామాన్యుల కలంనుంచి రంజు గా వర్ణించలేం కదా! ఒక ప్రతిభావంతుని నోట మాటలతో, మల్లాదివారిలాంటి ప్రతిభాపాటవాల్ని వర్ణించిన తీరు బహు చక్కగా, కడు మనోహరంగా, సత్యవాక్కులా ఘోషిస్తాయి. యివిగో, మచ్చుకు - మల్లాది గురించి - మహానుభావుల మాటల్లోనే -
సినిమా పాటకి కావ్యగౌరవం కల్పించిన మహాకవి (తాపీ ధర్మారావు).
లేఖిని నుండి వెలువడిన సంతత సారస్వత ధారావాహినికి జోహారు; అనర్గళ వాక్చాతుర్య సౌశీల్యానికి కైమోడ్పు. (పింగళి నాగేంద్రరావు).
తెలుగు సినిమా పాటకి సాహిత్య ప్రశస్తి సంతరించిన ఆద్యులలో ప్రముఖుడు. (శ్రీశ్రీ)
అతని శైలిలోన అమౄతాలు తొణుకాడు నతని పలుకులందు నలరు లలరు. (దాశరథి).
ప్రతి పదబంధం మధు నిష్యందం. (సి. నారాయణరెడ్డి).
పలుకుల్లోంచి అమౄతం పుట్టింది; అది తెలుగు సినిమా పాటను చిరంజీవిని చేసింది. (వేటూరి సుందరరామమూర్తి)
ఆంధ్ర సాహిత్యానికి కవిత్రయం - నన్నయ, తిక్కన, ఎర్రన, అయితే, తెలుగు చలన చిత్ర సాహిత్యానికి కవిత్రయం - సముద్రాల, పింగళి, మల్లాది. (వెన్నెలకంటి).
పాటలు పరిమళలహరులు, పిలిచిన పలికే వీణలు, ఆనందలహరులు. జ్ౙాపకం వస్తే చాలు, పెదవిని చిరునగవును మొలిపించ గలిగిన జాణలు. (వి.ఎ.కె. రంగారావు).
ఆకు పచ్చ సిరాసిరి, అచ్చ తెలుగు జిలుగు జరీ. శ్రీనాథుల వారి క్రీడాభిరామంలో శ్రీకాకుళపు తిరునాళ్ళ పరవళ్ళు త్రొక్కిన కిలికించితాల కౄష్ణాఝరి. ఇక్ష్వాకులపు రోజులనుంచి మనోబుధ్యహంకారాల అలంకారాల కలనేతగా దర్శనమిచ్చే ఇమేజరీ. 'ముంగిట పొలసిన మోహనమాత్మల పొంగించే' ఘన పురుషుడి తాలూకు మగసిరి, వెలనాటి బ్రాహ్మణీకపు మన్మథపురాగ్రహారీకపు రసపట్టుదల సరేసరి - పూజ్యులు శ్రీ మల్లాది రామకౄష్ణశాస్త్రిగారు - తెలుగు వారికిచ్చిన సిరి సంపదలు. (వేటూరి.)
మన ఆధునిక కవులలో వచన, రచన చేసినవారు ఉండవచ్చు. వచన రచయిత అయ్యుండీ, కవిత్వం వైపు వచ్చినవారు అరుదు. ఆ అరుదైన కోవ, మల్లాది వారిది. శాస్త్రిగారు మూడు సంస్కారాల త్రిపుటి. (ఇంద్రగంటి శ్రీకాంత శర్మ)
మల్లాది వారి ఠీవి, శాస్త్రిగారి ఠేవా, వారి పాటల్లో, మాటల్లో, కథల్లో కనబడతాయి. ప్రస్ఫుటంగా చాపకింద నీరులా, దాకొని, జలదాంతర్భాగాన దాగిన నీటి బిందువులో ఇంద్ర ధనస్సు నక్కిన రీతి, ఎదుటనున్న మేఖాలయవనికపై ఫెళ్ళున నీలిగే హరివిలుల్లాగ, ఇదేంగులహంగు గడ్డిపోచపై, సాలీడు గూడులో చెక్కిన నీటి బిందువులోనూ ఉంది. జలపాతాల ఒలిపిరిలోనూ ఉంది.
శాస్త్రిగారి సాహిత్యపు తునకలు - సన్నజాజి తీగలు, సంపంగి పూజలు. జౌను నిజం!
మహా రచయిత, బ్రహ్మశ్రీ మల్లాది రామకౄష్ణశాస్త్రిగారి జయంతి (సెప్టెంబర్ 12) సందర్భంగా, తెలుగురథం శతసహస్ర సాహితీ నీరాజనాలని సనినయంగా, వినమ్రంగా, సమర్పించుకుంటోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.
3 comments:
నాకు తెలుగు సాహిత్య విషయాలు అంతగా తెలియవు.నేను లెక్కలలో పనిచేసాను. ఎప్పుడైనా తేలిక తెలుగైతే చదువుతాను. బహుశా పొరపటు పడుతున్ననేమో.
'అందమె ఆనందం' సముద్రాల జూనియర్ గారి పాట.
'తెల్లవార వచ్చె ' ను గురించి ఒక కథ ఉన్నది. వారి అబ్బాయి సూరి శాస్త్రి గారు పొగుడుతు ఉత్తరము రాస్తే , రామక్రిష్ణ శాస్త్రి గారు సమధానములో అందులో పదాలు చాలా ఒక పాత మేలుకొలుపు పాటలోనించి తీసుకొన్నానని చెప్పారట. "కనుక అందులో సారస్వము ఉందంటే ప్రావీణ్యుడైన ఆ అజ్ఙాత మహాకవిది. నా రచన ఇంతవరకే" అన్నారట.ఈ మాటలు 'వినవేడుక ' 44 పుటలో ఉన్నవి.
నాకు ఆయన రాసిన ఒక పాటలొని పదాలు "వల్లమాలిన మమత కమ్మతెమ్మెర లాగ కమ్ముకున్నది నిన్ను చిన్నదానా ' రోజూ గుర్తుకు వస్తూనే వుంటాయి.
Minor comment:
'Andame anandam' was written by
Samudrala Jr.
A number of lines in 'tellavare vache' were from an old melukolupu paata and Sri Malladi himself apparently said that the credit should go to the unknown ancient poet.
thanks for the comments.
Post a Comment