అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం - సెప్టెంబర్ ౮
అక్షరం
అక్షరం పరబ్రహ్మ స్వరూపం అక్షరం - క్షరం కానిది, లేనిది. క్షరం అంటే నాశము లేక నాశనము. అక్షరం అంటే బ్రహ్మము, ముక్తి, అక్కరము. అక్షరుడు - విష్ణువు, శివుడు, చెడనివాడు. అక్షరం సహాయంతోనే సృష్టి రచించబడిందని చెప్పవచ్చు. చరిత్ర, సాహిత్యం, కళలు సృష్టించబడ్డాయి. అక్షరంబు తల్లి అఖిలవిద్యల కన్న, అక్షరం లోకరక్షకం. అక్షరం లేనివాడికి భిక్ష పుట్టబోదు పృధ్విలోన అని చాటువుకారుడు సెలవిచ్చాడు. అక్షరాస్యత అమూల్య వరం అక్షరాల సహాయంతో మాట్లాడడం, చదవడం, వ్రాయడం అనే ప్రక్రియలు జరుగుతాయి. శిశువు తొలిగా మాతృమూర్తితో భాషతో సంబంధంలేని భావాల్ని అందిస్తాడు, అందిపుచ్చుకుంటాడు. అది పేగుబంధం, తల్లి అందించే స్థన్యం, వాత్సల్యం, ప్రేమ, అనురాగం, వెరసి మనం పిలుచుకునే మాతృత్వం. తల్లిదండ్రులు ధనస్సులు. ఆ ధనస్సులు సారించే బాణాలు పిల్లలు. ఉయ్యాలనాడు తల్లిపాడిన జోలపాట సమాధి వరకూ కొనసాగుతుందట. మన సంస్కృతీసంస్కారాల ద్వారా అలవడేది అసలైన అక్షరాస్యత. దీనికి తోడు బడిలో గురువుద్వారా నేర్చుకునే అక్షరాలు, గుణింతాలు జీవితాన్ని మరింత గుణించుకోవడానికి పరికరాలు అవుతాయి. యివి లేని అక్షరాస్యత, నిరక్షరాస్యతతో సమానం; ఆ వ్యక్తి నిరక్షర కుక్షి అనే పిలవబడతాడు. అక్షరాలు ఐరావతాలు నా వ్రాలు సుధారసాలు; కవిరాజుల కెల్ల మనోహరాలు, వజ్రాలు; సరస్వతీ విమలచారుకుచాగ్ర సరాలు అన్నాడు మరో చాటువుకర్త. నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు; నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు; నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు - అంటాడు ప్రముఖ కవి తిలక్, నా కవిత్వం అన్న ఖండికలో. అక్షరజ్ణానానికి, చదువుకు మరొక్క కోణంలో ప్రముఖ రచయిత రాచకొండ విశ్వనాధశాస్త్రి, రత్తాలు రాంబాబు అన్న నవలలో - దేవకాంతే అయినప్పుడు ఆవిడకి అక్షరజ్ణానం ఉంటేనేవిటి, లేకపోతే నేవిటి. ఆ మాటకొస్తే, మానవకాంతలైన సీతాసావిత్రులు ఏమ్మేలూ బియ్యేలు పాసెయారంటారా? అని ఆశ్చర్యంగా ప్రశ్నిస్త్డ్డు. ప్రపంచ అక్షరాస్యత లో మనదేశం స్థానం ప్రపంచంలో 6.1 బిలియన్ల (600 కోట్లు) జనాభా వున్నారని అందులో 400 కోట్ల జనాభా మాత్రమే అక్షరాస్యులుగా పరిగణింపబడుతున్నారు అని మన విశ్వగణాంకాలు ఘోషిస్తున్నాయి. యింక మన దేశం సంగతి వస్తే, 2001జనాభాలెఖ్ఖలప్రకారం, 10.27 మిలియన్ల జనాభా దేశసంచారం కావిస్తుంటే, అందులో 65.38 శాతం మాత్రమే అక్షరాస్యులుగా భావించవచ్చట. అందులో యిక ఆడ, మగ సంగతికొస్తే, మన మహిళా సాధికారతకు వెక్కిరింతగా వుంది. మగ మహారాజులు 75.85 శాతం చదువరులయితే, మన మహిళామణులు కేవలం 54.16 శాతం మాత్రమే అక్షరాస్యులుగా పరిగణింపబడుతున్నారు. అదండీ మన మహిళలకు సమాజం నుంచి, ప్రభుత్వం నుంచి అందుతున్న ఆసట, ఊరట, సహాయ సహకారాలు, ప్రభుత్వ లక్ష్యలక్షణాల ఫలితాలు. చదువు, చట్టుబండలు యిలా అఘోరిస్తుంటే, యిక పెద్ద పెద్ద విషయాలు - స్త్రీస్వేఛ్ఛ, స్వాతంత్ర్యం, అధికారం కేవలం ఆలోచనలకే కాని ఆచరణలకు ఎన్నడూ నోచుకోలేదని బాధాకరంగా చెప్పవలసిన పరిస్థితి. యింక, గ్రామాల్లో 59.40 శాతం, పట్టణాల్లో 80.30 శాతం అక్షరాస్యులుగా గోచరిస్తున్నారు. యిక్కడ కూడ, పల్లెలు, పల్లెప్రజలు మన ప్రణాళికలచే, మన అధినేతలచే, ప్రత్యక్షంగా మోసం చేయబడడం జరుగుతోంది. ఈ దురాచారాన్ని మన సభ్యసమాజం చూసి వినోదంగా వీక్షించి పులకిస్తోంది. తెలుగుగడ్డ లో సాంకేతికతకే కాని సాక్షారతకు లేని స్థానం యిక మన ఆంధ్రరాష్ట్రం విషయానికొస్తే, మనం యింకా అధ్వాన్న పరిస్థితుల్లో, దుస్థితిలో వున్నామని చెప్పడానికి ఏమాత్రం సందేహం, ఆశ్చర్యం రాదు. దేశపు సరాసరి పరిస్థితినుంచి మరింత దారుణంగా వున్నామని చెప్పాలి. రాష్ట్ర సరాసరి 61.11 శాతం అక్షరాస్యులు అయితే, పురుషులు 7.85, స్త్రీలు 51.17శాతం మాత్రమే వున్నారు. మన భారతదేశం కంటే, మన స్వంత తెలుగుదేశంలో అక్షరాస్యత స్థితిగతులు - మంచంకోళ్ళ మాదిరి మూడు అని రెండు సంఖ్యని చూపించడం లా వుంది. పరిస్థితి యిలా వుంటే, ప్రజలు తాము సహాయం పొందబడుతున్నారో, నిర్లక్ష్యం, మోసం కావింపబడుతున్నారో కూడ తెలుసుకోలేని తెలివితేటలు మన ప్రజది. ఈ పరిస్థితినుంచి ఎలా రక్షింపబడతామో తెలియని అయోమయం, అవివేకం లో కొట్టుకుపోతున్నామని మాత్రం చెప్పవచ్చు. అక్షరదీపాల్ని వెలిగించండి అక్షరాలు కావవి క్షరం; అక్షరాలే మనిషికి వరం; లక్షల విలువ చేస్తాయి, మన లక్ష్యానికి చేరుస్తాయి అని చెప్పాలి. అక్షర దీపాన్ని వెలిగించడం, ఆ కార్యక్రమంలో - చదువంటే మూడోకన్ను, చదువే మనిషికి జీవమని, అక్షరాలు నేర్చుకోవాలని ప్రచారం మరింత వేగం పుంజుకోవాలి. ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన బ్రతుకు పెద్దసున్న అని, చదువు వల్ల ఆలోచన పెరిగేది, వివేచన కలిగేది అని నచ్చచెప్పాలి. అన్ని కులాలకు, మతాలకు అతీతమైనది చదువు. మానవతకు సన్నిధి, పెన్నిధి, వెతలు తీర్చేటి బంధువు - చదువు. చదువే మనిషికి జీవమని, జ్ణానమని, మానవ ప్రగతికి అస్త్రమని, తెలివికి మూలమని, చెడుచేయని చెలిమియని, దొంగలు దోచని సొత్తు అయిన ఈ చదువులతల్లి భవితకు బంగరువిత్తు, మనకు కనిపించని సొత్తు అనే చెప్పాలి. భగవంతుడు మనకు ప్రసాదించిన గొంతుతోటి నాలుగు అక్షరాలని పలకడం, చేతివ్రాలుగా నాలుగు అక్షరాలని వ్రాయడం, కళ్ళతోటి చదవడం, చేయగలిగి, సమాజంలో భాగంగా, మనం సహజీవనం చేయగలిగితే, మానవజన్మకు అంతకన్న సార్ధకత వేరే లేదు అని చెప్పాలి. అక్షరాస్యత నుంచి చదువు వరకు చదువు అంటే పఠనం, విద్య అని చెప్పారు. అంతేకాదు, చదువు అంటే వేదం అనికూడ అర్ధం చెప్పబడింది. నిరక్షరాస్యత - అంటే చదవడం, వ్రాయడం, కనీసావగాహనను పొంపొందించుకోవడం, విద్యమాట ఎలావున్నా వినయ వివేకాల్ని కలగడం, చదువు మాట ఎలావున్నా సంస్కారాన్ని పొందడం, విజ్ణానప్రజ్ణానాలు కాకపోయినా కనీసపుజ్ణానాన్ని పొందడం వల్ల మానవజన్మకు సార్ధకతను కలిగిస్తాయి. సార్ధకత లేని బ్రతుకు చావుతో సమానమంటారు. అందుకే మన ప్రజాకవి వేమన - చదివి చదివి చదివి చావంగ నేటికి? చావు లేని చదువు చదువవలయు; చదువులేక కోటి జనులు చచ్చిరికదా! అనిఘోషిస్తాడు. కేవలం చదువేకాదు, చదువుల్లో మర్మమాలన్నింటినీ చదవాలి అంటాడు మన మధురకవి పోతన. అందుకే విద్యావంతుడుని చదువరి అని, చదువుల పడతిని సరస్వతిగాను, చిలుక, కీరము లను చదువుల పులుగుగాను, నలువ, బ్రహ్మలను చదువులముదుకడుగాను, చదువుల వేలుపుగాను, మన గురువు, ఉపాధ్యాయుని చదువులయ్యగాను చెప్పడం జరిగింది. చదువు తెస్తున్న అనర్ధకాలు - నాడూ, నేడూ ఈ దేశంలోని యువతరం చచ్చుపడిపోడానికి యిక్కడి చదువే చాలావరకూ కారణం అని ఒక రచయిత అన్నాడు. యిది ఆధునికత భావన అనుకుంటే పొరబాటు అని చెప్పాలి. ఎందుకంటే, ఏకాలానికి ఆకాలపు చదువు వల్ల అర్ధం, సార్ధకతతోపాటు అనర్ధం, అపాయం కూడ తెచ్చిపెట్టాయి. ఎటొచ్చీ, పాలు, శాతం ఎంత అన్నది మాత్రమే ఆలోచించాల్సింది. నాకొడుక్కి చదువుకొనుటకు పూర్వం తొండకు బల్లికి భేదం తెలిసేది. యిపుడు గాడిదకు, గుర్రానికి భేదం తెలుసుకోలేకపోతున్నాడు, అని పానుగంటివారు తన మాలతీమాల రచనలో. స్వభావాలను చదువులు మార్చలేవు అని కౌసల్యాదేవి, శాంతినికేతన్ నవలలో. చదువు ఉపయోగం మనస్సును పదునుపెట్టేవరకే అంటాడు గోపీచంద్, పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా అన్న రచనలో. చదువు వల్లించవలసిన చట్టుబండ అని తరచుగా అంటారు మనవాళ్ళు. చదువనంతవరకూ కాకరకాయ, చదివిన తర్వాత కీకరకాయ అని, మొదట సంకరుండు, పిదప షంకరుండు అన్న ప్రముఖ నానుడి కూడ ఈ దుష్ప్రభావాన్ని ప్రతిబింబించిందికదా. విశ్వవిద్యాలయాల్లో పెద్ద పెద్ద సంస్థల్లో ఆచార్యులు అయినాకనే చాలామంది నిజంగా చదువుకోవడం మొదలుపెడతారు అని వేదం వెంకట్రాయశాస్త్రిగారు తన వ్యామోహం అన్న రచనలో స్పష్ఠంగా చెప్పారు. నాతో మాట్లాడ్డమే ఒక ఎడుకేషన్ అని కుహనాప్రసంగాలు చేశాడు మన గిరీశం, కన్యాశుల్కం నాటకంలో, అందుకే చివరకు డామిట్! కధ అడ్డంతిరిగింది అనుకోవలసివచ్చింది. కాని గురజాడ మాత్రం విద్య వంటి వస్తువులేదు అనే సందేశం యిచ్చారు ఆ రచనలో. ఈ రోజుల్లో ఎడ్యుకేషనంటే, ఎవడేమన్నాడో తెలుసుకోవడం అన్నాడు ప్రముఖరచయిత బుచ్చిబాబు తన ఆత్మవంచన రచనలో. యిక మన చదువులయ్యల విషయానికొస్తే, విశ్వనాధవారు అన్నట్లు, నీవు నేర్పిన చదువే నీ కర్ధంకాదు అని చెలియలికట్ట లో చెణుకులు విసిరారు. పదహారేళ్ళు చదువుకున్న వాడికి కాలం జరగదంటే ఆ చదువు చదువు కాదు అని నిష్కర్షగా చెప్పారు, పాపికొండలు లో కృష్ణారావుగారు. నగ్నసత్యాన్ని రామకృష్ణశాస్త్రిగారు, మన చదువు ఇతరులకు ఒంటపట్టింది అన్నారు. బుద్ధిపూర్వకంగా పూర్తి ఇష్టంతో చదివేదే చదువు అని, సులభంగా వచ్చే చదువు సులభంగానే పోతుందని, ప్రముఖ రచయిత కొడవటిగంటివారు చదువు నవలలో. లోకానుభవం కూడ విద్యయే అన్నారు చిలకమర్తివారు. ఫలితంగా, ప్రస్తుతం మన చదువు కేవలం చదువుకోవడానికే; చదువుకున్నాం అని చెప్పుకోవడానికే కాని, అది అనుకున్నంత అర్ధం, అర్ధవంతం గా ఫలించటంలేదు. అందరికీ చదువు, అందరితో చదువు నేటి ఆశయం, ఆచరణ కావాలి. ప్రతీవారు, కుటుంబంనుంచి, ప్రపంచం వరకూ - ఈ స్థాయీల్లో జాగ్రత్తవహించే అంతర్జాతీయ సంస్థలు, అన్ని కలసి, 2003-2012 దశాబ్దాన్ని అంతర్జాతీయ అక్షరాస్యతాదశాబ్దం గా ప్రకటించి, ముందుకు దూసుకుపోతున్నారు. సగభాగం అయిపోయింది. యింకా సగకాలం దొర్లాలి. ఫలితాలు ఎంతవరకూ వచ్చాయో, యింకా సాధించాల్సినది ఎంతో, వేచిచూద్దాం. యునెస్కోవారి సంకల్పంలో లక్ష్యశుద్ధి, లక్ష్యసిద్ధి సాధనలను గమనిద్దాం. అగ్నిలో కాలనిది, రాజులకు అలవికానిది, నీళ్ళ నాననిది, చోరుల పాలుకానిది, సోదరులచేత ఎప్పటికీ పంచుకొనుటకు వీలులేనిది, అయిన విద్యకు చేటులేదు, రాదు, అని దూబగుంట కవి, తన పంచతంత్రం లో చదువుకు సార్ధకతను సాక్షాత్కరింపచేశారు. అందుకే అందరినీ చదివించుదాం. అందరితోనూ చదువుకుందాం. యింకా మనముందున్న అధిక నిరక్షరాస్యులను కనీసపు అక్షరాస్యులుగా తీర్చిదిద్దే సత్సంకల్పంతో ముందుకు పయనిద్దాం. పరుగెడదాం. ప్రస్తుత అక్షరాస్యులను కనీసపు తీరుతెన్నులతో చదువును అందిద్దాం. అప్పుడే మనం చదువుకున్న చదువుకు సార్ధకత్వం అని అన్యధా నొక్కి వక్కాణించక్కరలేదు.
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా భారతీయ ప్రజని తమ జీవనానికి దైనందిక సార్ధకతని పొందేందుకు అవసరమైన సాక్షారతని పొందాలని, వారి వారి జీవితాలను మరింత సుసంపన్నమైన జీవితాని అనుభవిస్తారని, తెలుగురధం ఆశిస్తోంది.
No comments:
Post a Comment