Tuesday, September 2, 2008

శ్రీ గణేశ మహాత్మ్యం

గణేష మాహాత్మ్యము

లోకమున ప్రతి మానవుడు, ఆయురారోగ్యైష్వర్యములను కోరుచుండును. అవి మనము కోరినంత మాత్రముననే ప్రాప్తించేవి కావు. పూర్వజన్మ సుక్రతమును బట్టియే ప్రాప్తించుచుండును. ఆ సుక్రుతము పుణ్యకర్మలచే ప్రాప్తమగును. ఆ ప్రాప్తాప్రాప్తములకు అనేక కారణములుండును. ప్రాప్తములకు అనేక అంతరాయములు కలుగుచుండును. అట్టి అంతరాయములు కలుగకుండా మనము ప్రతీ కార్యారంభమునకు "ఆదోవ్ పూజ్యో గణాధిపా" అన్నట్లు గజాననుడిని, గణపతిని, పూజించుతూంటాం. యిది సర్వులకు విదితమే. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధి నాడు సర్వ మానవులు వినాయకునికి పూజలు జరుపుకోవడం అనివార్యం. గణపతికి అనేక నామధేయాలువివిధ రూపాల్లో, వివిధ నామాల్తో గణపతి కి పూజలను చేస్తారు భక్తులు. మన భారత దేశంలో యించుమించు అన్ని ప్రాంతాల్లో పూజిస్తారు. మదురై లో 'వ్యాఘ్రపాదగణేశూనిగా, మైసూరు లో "హాలీబీడూ హరాయ సర్వేశ్వరాలయం లో దివ్యవర్ధనుడు స్థాపించిన బంగారుచాయ గల గణపతిగాను, మహారాష్ట్ర లో బాలగంగాధర తిలక్ తీర్చిదిద్దిన సమాజ మంగళమూర్తి 'గణపతి పప్ప మోరియా'గాను, భాగ్యనగరపు విఘ్నరాజభాగ్యంగా అనేక రూపాలుగాను, యావత్తు దేశంలోని మారుమూల గ్రామాల్లో కూడ నిత్య దర్శనం కలిగిస్తాడు.విదేశాల విషయం వస్తే, మెక్సికో లో ధ్యానదేవతగా, చైనాలో ''కాంగేతణ్ అంటే బుద్దిని సమ్రుద్ధిగానిచ్చే దైవం గాను, ఆరాధించడం సదాచారంగాను, సత్సంప్రదాయంగాను, నిలచిపోయింది.ముద్గల పురాణంలో 32 గణపతులను బహుధా పూజింపదగినవిగా ప్రస్తావించడం జరిగిందని పెద్దల ఉవాచ. వాటిలో 16 ప్రముఖ గణపతి మూర్తుల నామాల్ని పేర్కొనడం జరిగింది. బాల, తరుణ, భక్తి, వీర, శక్తి, ద్విజ, పింగళ, ఉచ్చిష్ట, విఘ్న, క్షిప్ర, హేరంభ, లక్ష్మి, మహా, భువనేశ, నౄత్య మరియు ఊర్ధ్వ గణపతులుగా వర్ణించడం జరిగింది. వేదాల్లో, పురాణాల్లో, తంత్రశాస్త్రములో, సంహితలో, పరబ్రహ్మ గణపతి తత్వం సుస్ఫష్టంగా గోచరిస్తుంది. శ్రీ గణేశ్వరునికి సంబంధించిన ఉపాసన, సాధన, మంత్ర, తంత్ర విధానాలు, సాహిత్యం అన్నిటా, "గాణాపత్యం" అన్న పేరుతో ప్రసిద్ధిపొందటం కూడ పరిపాటి.మనము ప్రతి నిత్యం స్మరణ చేసుకునే "శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చరుర్భుజం, ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంత యే" అన్న శ్లోకం లోని విష్ణు శబ్దమునకు వినాయకుడు అని అర్ధం. ఈ విష్ణు శబ్దం సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తూంది. "వ్యాపకత్వాత్ విష్ణు: వ్యాప్నోతి విష్ణు:' అని ప్రమాణం. "భూతాధిపం భూత గణాది సేవితం, కపిత్థ జంబూఫల సార భక్తితం, ఉమాసుతం శోక వినాశ కారకం, నమామి విఘ్నేశ్వర పాదపంకజం" అన్నది ప్రస్తావించి తీరాలి."విఘ్నాలను తొలగించి శుభములను కలిగించు శుభదాయకుడు గణపతి. సర్వశుభకార్యములలో విఘ్నేశ్వరునికే ప్రధమ స్థానం. దేవతా సమూహము లోనూ గణపతికి విశిష్ట స్థానం. ఈ వినాయకుడే తన బొజ్జలో ఎన్నో విశిష్ట విషయాలను దాచుకున్న విశిష్ట దైవం. ఆయనే విష్ణువు. ఆయనే ఓం కారమున్నూ. సిద్ధిని, బుద్ధినీ యిచ్చే ఆహ్లాద, ఆర్యోగ విషయ బోధకుడు. ఈ సౄష్టిలో ఆయన తత్వం నిండి యుండనిది ఏదీ లేదంటారు. అట్టి వినాయకుని సుచరిత తెలిసుకోవడం అత్యావశ్యకం. గణేశుడు వేరువేరు యుగాల్లో వేర్వేరు అవతారాలుగా - కౄతయుగం - కశ్యపపుత్రునిగా, సింహవాహనుడై అసురసంహారం చేయగా, తృఏతాయుగంలో - మయూరేశ్వరుడిగాను, ద్వాపరయుగంలో - సింధురాసురుని సంహరించిన గజాననుడిగాను, ప్రస్తుత కలియుగంలో - ధూమ్రకేతువుగా అవతరించి అశ్వారూఢుడై నాస్తికులను రూపుమాపుతున్న గణేశుని హిందూశిల్పశాస్త్రం కూడ ప్రముఖ స్థానంగా మారింది. ఏదేవుని అనుగ్రహమువలన ధర్మార్ధకామాలు లభిస్తాయో, షోడశాత్మకుడైన అవిఘ్నరాజుయొక్క స్తోత్రం - "గణేశంప్రమదాధీశం, నిర్గుణం సగుణం విభుం, యోగినోయత్మదంయాంతి, తంగైరీ నందనం భజే' అని స్తుతించవలసినదే. శ్రీ వేద వ్యాస మహర్షి 18 పురాణాలను రచించి, వాటిలోని విశద పడని అనేక, నిగూఢ రహస్యములను వివరించుటకై మరి 18 ఉపపురాణాలను కూడ రచించాడంటారు. వీటిలో 'గణేశ పురాణమూ ప్రముఖమైనది. వ్యాధి పరిహారమునకు భౄగువు ఈ గణేశపురాణ పారాయణం చేసి ఫలితం పొందాడు అని చెప్తారు. మంత్రరాజమైన - 'గణానాంత్వా గణపతిగం హవామహే, కవింకవీనాం ఉపమశ్రవస్తువం ... జ్యేష్ట రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆణశౄణ్వన్నూతిభిస్సీదసాదనం శ్రీ గణాధిపతయే నమ: " అని గణాధీశుని వర్ణన జేయబడడం విదితమే. యిక్కడ, 'బ్రహ్మణ స్పతి" అని వినాయకుని వర్ణించడం, 'బ్రహ్మా అనగా వాక్కు, దాని ద్వారా వర్ణం, ఉచ్చారణ, గురు లఘువులు, సమస్త మంత్ర, వర్ణ చందో విజ్ఞాన మయమైన బ్రహ్మసాగరమంతా ఉధ్బవించడం, ఫలితంగా విద్యాప్రదాతగా విరాజిల్లుతున్నాడు. అందుకే మధురకవి బమ్మెర పోతన "విద్యలకెల్ల నొజ్జయై" అని ప్రస్తావించాడు. విద్యాభ్యాసప్రారంభం 'తొండము నేకదంతమూ లేకుండా కాదు, కాలేదు. విద్యతో బాటు, శతౄ, ౠణ, రోగాలను కూడ నివారిస్తాడు గణపతి అన్నది కూడ భక్తుల అచంచల విశ్వాసం. గణపతిని కేవలం మానవులే కాదు, సర్వదేవతలు ప్రార్ధనలు, పూజలు చేయడం అన్నది గమనిస్తే గణేశుని ఘనత వేరే చెప్పనక్కరలేదు. త్రిమూర్తులు, శ్రీకౄష్ణుడు, శ్రీరాముడు కూడ గణపతివందనం చేసి సత్ఫలితాల్ని సాధించారు అన్నది పురాణచరిత్ర ఘోషిస్తోంది. దైవ ప్రియత్వం గురించి చెప్పాలంటే, సూర్యుడు నమస్కారప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక స్తుతి ప్రియుడు అయితే, గణపతి తర్పణ ప్రియుడు గా విరాజిల్లుతున్నారు. ఆది శంకరులు 'ముదాకరాత్త మోదకం, సదావిముక్తి సాధకం, కళాధరావతంసకం, నమామి వినాయకం' గణేశుని మనోహరంగా కీర్తించి ఆరాధిస్తే, త్యాగరాజాది సంగీత వాగ్గేయకారులందరూ "శ్రీ గణపతిని సేవింపరారే' అంటూ రసమయ భక్తిగానామౄతధారలతో పరవశులయ్యారు. జాతి ప్రగతికి ఐక్యతకు భారత దేశ స్వతంత్ర పోరాట సమయంలో భారతీయులకు ధార్మిక శక్తి, సామాజిక దేశభక్తియుత ప్రబోధానికి 'తిలక్' మహాశయుడు గణేశుని ఉత్సవాలు జరిపించడం ఆధునికసమాజపరంగా సామూహిక భక్తిపూజాకార్యక్రమాలు చాలా ప్రసిద్ధి వహించాయి. పూర్వం భాగ్యనగరం హైదరాబాదు-సికింద్రాబాదు జంటనగరాల్లో అంతగాలేని వినాయకచవితి పూజామాసం కడు పునీతకాలంగా వర్ణించాలి. ప్రాకౄత, వేద, సంస్కౄత, ఆంధ్ర భాషల కవిత్వాల్లో కూడ కవులు తమ రచనలను తరచుగా దైవప్రార్ధనతోనే శుభారంభం గావించడం కూడ కవిసమయ సంప్రదాయంగా మారడం నేటికీ జరుగుతూంది. "శ్రీసిద్ధిబుద్ధు లబ్బగ, దోసములుం దొలగ, విఘ్నదు:ఖము లడచన్, శ్రీ సిద్దగణవిభుం డని, వాసిని గన్నట్టి నీకు వందనము ప్రభూ" అని, "శ్రీ గణేశ్వరు నిర్విఘ్నశివసమగ్ర కార్యసాధన కాదరగరిమ మెఋఅయ, మ్రొక్కి నుతియింతు వాణి నిర్దుష్టమైన పల్కు, భావమ్ము గలిగింప బ్రణుతి జేతు" అని, "శ్రీ వాగీశాదులు సర్వావశ్యకకార్యసిద్ధి వలసిన దొలి నే దేవుని మ్రొక్కిరొ నేనా శ్రీ విఘ్నేశ్వరున కర్ధి జేతును జోతళ్ అని భక్తి వర్ణనలతో బాటు, "ఈ గణేశుని పుట్టుకే యెంతొ వింత, గిట్టుటయు నంతకంటెను గట్టి వింత, మరల పుట్టుట యంతకు పెౠగు వింత, అంతకంటెను నా కధ యంత వింతా గజాననుతో సరిపోల్చుకుని తాదాత్మ్యం చెందుతూ ధన్యత్వం పొందుతున్న ఆధునిక కవులు కూడ మనకు తారసపడుతున్నారు. గణేశుని స్తుతి గావించే నవనిధ భక్తి మార్గాలు తప్పక 'తనయ తనయాది శుభదసంతానవౄద్ధి మాన్యసద్గుణవౄత్తి సంపత్సమౄద్ధి కలుగుచుండును గణనాధు కరుణవలనాఅన్నది సత్యం, తధ్యం.భూతాధిపం భూత గణాది సేవితంకపిత్ద జంబూఫల సార భక్షితంఉమాసుతం శోక వినాశ కారకంనమామి విఘ్నేశ్వర పాద పంకజం.ఫలశౄతిఈ మానవ లోకంలో బహు దుర్లభమైన ఏ గజానన స్మరణచే మానవులు కౄత కౄత్యులగు దురో, అట్టి గజాననుని మహిమను వర్ణించుట శేష, చతుర్ముఖాదులకైననూ బహు దుర్లభము. అనేక జన్మార్జిత పుణ్యవశంబునగాని యిట్టి కధామాహాత్మ్యము లభింపదు. పాషందులు, నాస్తికాదులు వినలేరు. నిత్యనిర్గుణ, అనంత స్వరూఫుడగు గజానన స్వరూపమును వర్ణించుటకైనను, తరంబుగాదు. అనేక వ్రతములు, దానములు, యజ్ణంబులు, తపస్సులు, చేయుటచే కల్గిన పుణ్యవశంబునగాని, ఈ మాహాత్మ్యమునందు వుత్సాహము కలుగదు. మాయా వికారంబులైన సంసారధర్మములందు విరక్తులైన వారలకు సులభము, సుగమము అని మహనీయుల ఉపదేషసందేశసారం. సర్వాభీష్టసిద్దికి సర్వేశ్వరుడైన శ్రీగజాననుని ప్రార్ధిస్తూ, స్వామి గణపతిని ఆత్మాను సంధాన రూపమగు ప్రార్ధన, అర్చనాదులను సపర్పించి, భక్తసాధకులకు సర్వషుభములు ఒనగూరుతాయన్నది సత్యం."తత్పురుషాయ విద్మహేవక్రతుండా య, ధీ మహి, తన్నోదంతి: ప్రచోదయాత్X""ఓం సమస్త స్తై గణేశాయ బ్రహ్మ విద్యా ప్రదాయినేయస్యా గస్త్యాయతే నామ విఘ్న సాగర శోషణే"ఓం గం గణపతయే నమ: ఓం శాంతి: శాంతి: శాంతి:
గణేశ చతుర్దశి సందర్భంగా, తెలుగురథం శుభాకాంక్షలను అందజేస్తూ, ఆ గణనాథుడు భారతదేశ ప్రజకు మరింత సుసంపన్నమైన, ఆరోగ్యమైన, అర్థవంతమైన, ఆహ్లాదకరమైన జీవితాన్ని ప్రసాదించాలని, మానవజన్మకి అర్ధాన్ని, పరమార్ధాన్ని, సార్ధకతని కలుగజేయాలని, ప్రార్ధిస్తూ - నమామితం వినాయకం.
తెలుగురథం - కొంపెల్ల శర్మ

1 comment:

చిలమకూరు విజయమోహన్ said...

font సైజు చాలా చిన్నగా వున్నందువల్ల చదవడం కష్టంగా వుంది.font సైజు పెంచితే బాగుంటుంది.మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.