Saturday, August 2, 2008

స్నేహితుల దినోత్సవం - జగతి సంబరాలు

స్నేహం పై జగతి సంబరాలు - ఆగష్టు 3 (మొదటి ఆదివారం) స్నేహితులదినోత్సవం
స్నేహమే - జీవితం, శాశ్వతం, పెన్నిధి
నిరంతరం చలామణీ - స్నేహం, స్నేహితుడు

అల్లాయే దిగివచ్చీ ఆయ్ మియా! ఏమి కావాలంటే, మిద్దెలొద్దూ, మేడలొద్దూ, పెద్దలెక్కే గద్దెలొద్దంటాను, ఉన్ననాడూ, లేనినాడూ, ఒకే ప్రాణమై నిలిచే ఒక దోస్తే చాలంటాను, ఒక్క నేస్తం కావాలంటాను. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిధి అని వివరిస్తూ, స్నేహంకోసం చుక్కలను కోసుకుని తెస్తాను, దిక్కులను కలిపేస్తాను, చంద్రుణ్ణి దింపుతాను, సూర్యుణ్ణి తుంచుతాను, ఏమైనా చేస్తాను, కోరితే ప్రాణమైనా యిస్తాను అని దోస్తీకి నజరానా చిరునవ్వు, స్నేహితుల మధ్య స్నేహానికి సంకేతంగా, ఒక్క నవ్వే చాలు, వద్దులే వరహాలు, అని ప్రముఖ సాహితీవేత్త, భారతీయ జ్ణానపీఠ పురస్కార గ్రహీత, నారాయణరెడ్డెగారి గీతం స్నేహం, చిరునవ్వు వున్నంతకాలం చలామణీ అవుతూనే వుంటుంది. స్నేహానికి మాటలు అక్కరలేదు - అది ఒంటరితనం నుంచీ వెలువడే ఏకాంతం అన్నాడు మరోకవి. కాని, ఒంటరితనాన్ని ప్రాలద్రోలేది, ఏకాంతంలో కూడ లోటురానీయని స్మౄతులను కలిగించేది, స్నేహం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుకే జీవనక్రమంలో కొత్త స్నేహాలు చేయని మనిషి కొంత కాలానికి ఒంటరివాడై పోతాడు అని ప్రముఖ కవి శామ్యూల్ జాన్సన్ అంటాడు. అందుకే, స్నేహితుల కోసం జీవితాన్ని త్యాగం చేసినవాడికన్నా గొప్ప ప్రేమికులు ఎవరూ వుండరు అని బైబిల్ నిర్ద్వందంగా ఘోషిస్తోంది.
జీవితంలో విలువైన వలువ - స్నేహం
మానవజీవితంలో స్నేహం నిత్య నదీప్రవాహం. ఆ ప్రవాహంలో దిశలు మారవచ్చు కాని, ఎప్పుడూ పొడిగా ఆరిపోదు. జీవితం అనే మధుర వంటకంలో స్నేహం ఒక సుగంధద్రవ్యం. పరిమళభరితమైన నిత్య సువాసితం. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నది స్నేహానికి వర్తించడమే కాక, ఆరోగ్యం వున్నంతకాలం దాని విలువ తెలియదు; అనారోగ్యం వస్తే కనుక దాని విలువ తెలుస్తుంది. మానవుని జీవనపర్వంలో స్నేహం ఒక విలువైన వలువ. అందుకే జీవితానికి ఒక స్నేహితుడు చాలు, ఇద్దరు ఎక్కువ, ముగ్గురు కష్టసాధ్యం అన్న సూక్తి, రాశి కాదు వాసి అన్నది స్నేహానికి వర్తిస్తుంది.
జగతి స్నేహానికే అంకితం
కాలప్రమాణంలో దేని ప్రత్యేకత దానిదే. ప్రతిరోజు మంచిరోజు, భలేమంచిరోజు. అలాగే, విశ్వవ్యాప్తంగా విలువలను విరాజిల్లుతున్న స్నేహానికీ ప్రత్యేకంగా ఒక రోజుని కేటాయించారు. ప్రణాళికలను పరిచారు. స్నేహపూరిత, సహౄధ్బావ వాతావరణాన్ని సౄష్టించుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా, ఒక దశాబ్దకాలంగా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. అమెరికారాజ్య దేశాల కాంగ్రేసు, 1935 లో ఆగష్టు నెలలోని మొదటి ఆదివారం రోజున జాతీయ స్నేహితోత్సవాలని జరుపుకోవాలని నిర్ణయం తీసుకోవడం, వెనువెంటనే సంబరాలను ఘనంగా వార్షీకోత్సవంగా జరుపుకోవడం సదాచారంగా వస్తున్నది. అమెరికాలో ప్రారంభమైన సదాచారం, క్రమేపీ అన్ని దేశాల్లోనూ, భారతదేశం తో సహా, జరుపుకుంటున్నారు. ఈ ఘనతను గుర్తించి, ఐక్యరాజ్యసమితి 1997 లో 'విన్నీ - ది ఫూ' ని ప్రపంచ స్నేహ రాయబారి గా నియమించడం జరిగింది. జాతీయ స్నేహోత్సవం ఆగష్టు మొదటి ఆదివారం జరుపుకుంటుంటే, మహిళాస్నేహోత్సవాలు ప్రత్యేకంగా ఈ నెలలోనే మూడవ ఆదివారం జరుపుకునే సంప్రదాయం కూడ వుంది. అంతర్జాతీయ స్నేహోత్సవ మాసంగా ఫిబ్రవరి లోను, ప్రాచీన, నూతన స్నేహితుల పండగలను మే మాసం మూడవవారంలో జరుపుకోవడం కూడ ఆనవాయితీగా వస్తున్నది. దారులు ఏమైనా, గమ్యం, లక్ష్యం ఒక్కటే, స్నేహం. స్నేహితులు తమ స్నేహంతో ప్రేమికులుగా మారి, జీవితంలో అందం, ఆనందం, మకరందం, త్రివేణీసంభూతంగా అలరించాలి. ఆకాశాత్పతితం తోయం యధాగచ్చతి సాగరం - ఆకాశం పైనుండి పడిన ప్రతి చినుకు, సాగరప్రవేశం చేయవలసినదే. అలాగే, స్నేహంకోసం వేసే ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, బిందువు, స్నేహసాగరంలోకి ప్రవహించవలసినదే.
సర్వమతాతీతం స్నేహం
మతం ఏదైనా, అన్నిటికీ సమ్మతం స్నేహం. మతాతీతమైన హితం, సహితం, స్నేహం. స్నేహపూరిత వాతావరణం ప్రతీమతం ఘోషిస్తోంది. ముసలమాను సోదరులు జరుపుకొనే రంజాను పండుగ, ప్రపంచ నాగరికత వ్యాప్తికి స్నేహానికి ప్రాధాన్యతనిచ్చిన బైబిలు, స్నేహాన్ని వివిధకోణాల్లోంచి ప్రస్తావించిన మహాభారతం, విశ్వమానవాళి సౌజన్యానికి, వసుధైకకుటుంబ ధోరణికి ప్రత్యక్ష తార్కాణం. అబ్రహాం ను భగవంతుని స్నేహితునిగా వర్ణించారు. జీసస్ - అభిమానులు, గురువు - శిష్యులు, యజమాని - నౌకరు, బాంధవ్యం ఏదైనా, స్నేహంగానే భావించాలి; ఆ భావనతో ఆచరణయోగ్యమయ్యేది, సార్ధకమయ్యేది, స్నేహం వల్లనే అని అందరూ అంగీకరించిన సత్యం. హిందువులకు మతగ్రంధం, వేదసమ్మితంగా భావించబడుతున్న మహాభారతం లో, ప్రముఖ పాత్ర జగన్నాటకసూత్రధారి, శ్రీకౄష్ణపరమాత్ముడు, స్నేహాన్ని, అభిమానం, ప్రేమ, వాత్సల్యం, సంరక్షణం, మార్గదర్శనం, సన్నిహితత్వం, చమత్కారపూరితపరిహాసం అని సోదాహరణంగా వివరించాడు. స్నేహం విషయంలో భగవంతుని ప్రార్ధించవలసివస్తే, ' ఆస్తులు, అంతస్తులు, సిరిసంపదలు, కాకుండా, స్వచ్చత్వంతోకూడిన స్నేహాన్ని అందించే హితుడిని ప్రసాదించమని ప్రార్ధిస్తే, జీవితానికి అర్ధం, పరమార్ధం తప్పక లభిస్తాయి.
స్నేహం గురించి ప్రముఖుల అనుభూతులు, పలవరింతలు
పుట్టుకవల్ల ఏర్పడేది తల్లిదండ్రులతో సంబంధం, సంస్కారంవల్ల వచ్చేది స్నేహం, పుట్టుకకన్నా సంస్కారమే గొప్పది; కనక రక్తసంబంధంకన్నా స్నేహబంధమే గొప్పది అని, ఉద్యమం అన్న కధలో ప్రస్తావిస్తారు, వివినమూర్తి.
స్నేహానికి కాలం గుర్తు అన్నది ఒక భావన. అయితే, - స్నేహకాలం కన్నా, స్నేహంలోని తీవ్రతయే ప్రధానం అని అంటాడు కేశవరెడ్డి, అతడు అడవిని జయించాడు, అన్న రచనలో.
అంతరంగ స్నేహానికి హౄదయనైర్మల్యమే ప్రధానం కాని పరిధి కాదు, అని బుచ్చిబాబుతో స్నేహం అన్న వ్యాసంలో సంజీవదేవ్ భావిస్తారు.
గుంపులో గోవింద, మందగతి లా కాకుండా, - స్నేహ మది యెల్లరు గూడిచరించుటేకదా! అని మహాకవి విశ్వనాధవారు, రామాయణకల్పవౄక్షం లో.
స్నేహమొక అనుబంధం, ఒక విశ్వాసం, అనుక్షణం తౄప్తితో పీల్చే ఉచ్చ్వాశం అని ఘననిర్వచనం చెప్పాడు, వేణుగోపాల్, స్నేహం రచనలో.
తన్నెరిగిన ప్రతివానికి పెన్నిధానమది స్నేహము అని స్నేహనిధిని పెన్నిధిగా వర్ణించారు, ప్రముఖ కవి, నారాయణరెడ్డిగారు.
తరుగు పెరుగులమాట ఎరుగునా స్నేహంబు? స్నిగ్ధతను వీడు నా స్నేహమెపుడైనా? అంటారు, ప్రజాకవి కాళోజీ.
నీ మిత్రుడిపైన నీకుగల నిజమైన అభిప్రాయం ఆ మిత్రుడి దగ్గర నుండి వచ్చిన ఉత్తరం అందుకున్న క్షణాన కలిగిన అనుభూతిని బట్టి వుంటుంది అని డేవిడ్ మెకల్నే అన్న కవి తన నిశ్చితాభిప్రాయాన్నిచ్చాడు.
స్నేహితుడు గురించి ...
ఆపదలకు సఖుడైనట్లు చుట్టమాపాటిగా నేరడారసిచూడ, అని అంటాడు గోన బుద్ధారెడ్డి. స్నేహితులే ఆప్తులకంటే ఎక్కువగా తోడ్పడుతారు, అని ఈ చీకటి వీడదేమి? అన్న రచనలో సరస్వతీదేవి.
నా స్నేహితుడి దగ్గర నేను నిజాయితీగా వుంటాను; బిగ్గరగా ఆలోచిస్తాను, అన్నాడు ప్రముఖ కవి ఎమర్సన్.
మిత్రుల హౄదయములు రహస్య రత్నములు, దాచందగిన యినుపపెట్టెలు అంటారు, చిలకమర్తివారు కర్పూరమంజరి లో.
ప్రియమున కన్న హితమును కోరువాడే స్నేహితుడు అని వరదాచారి (వైశాలిని) అంటే, రహస్యాలు, చీకటితప్పులు పంచుకునేవాడే స్నేహితుడు అని, ఒకే నిద్ర - ఎన్నో కలలు రచనలో బుచ్చిబాబు నిర్వచనం చెప్పాడు.
స్నేహం, స్నేహితుల గురించి యిలా కూడా చెప్పారు మరి !?
మైత్రి ఔచిత్యమును పాటించనీయదు అని, బద్ధనసేనాని రచనలో అంటారు విశ్వనాధవారు.
లుబ్ధునితో స్నేహం సొమ్ము పెట్టువరకే; వైష్ణవునితో స్నేహం వంటయింటి వరకే, అని రాధాకౄష్ణ లో పానుగంటివారు తనశైలిని దర్శనం యిచ్చారు.
ప్రముఖ రచయిత రావిశాస్త్రిగారు, గోవులొస్తున్నాయి జాగ్రత్త లో, దొరతో సావాసం మానేయగల్నుగాని, దున్నపోతుల్తో స్నేహం చెయ్యడం మాత్రం నాతరం కాదు, అని ఒక పాత్రతో చెణుకులు చెప్పిస్తారు.
స్త్రీపురుషుల స్నేహానికి లోకమిచ్చిన పర్యాయపదం కళంకం అని జీవవాహిని - శ్యామలారాణి లోకపుతీరుని అవలోకనం చేశారు.
ఆత్మలాభ పరాయణులగుచు నరులు ప్రాణమిత్రులవలెనె కంపట్టుచుందురవసరము తీఋర అందరు అడగుచుండ్రు, నిజహితుడు లేడు అవనిలో నిశ్చితంబు, అని ఆనాడే, గయోపాఖ్యానంలో చిలకమర్తివారు నిస్సంకోచంగా నేటి నేస్తపుతీరుల్ని జోస్యం చెప్పినట్లు చెప్పారు.
మైత్రి - వైరం
జీవించే ప్రతి జీవికి రెండు పరస్పర వ్యతిరేక మైన మనోగుణాలుంటాయి. ఒక మనోగుణానికి జీవిత పరిస్థితులతో మైత్రి, రెండవ గుణానికి జీవిత పరిస్థితులతో వైరం రెండూ ముఖ్యమైనవే అని చెప్పినవారూ వున్నారు. అయినా, చెడి స్నేహితులింటికే వెళ్ళమన్నారు. అంతేకాదు, ముదిరిన కొద్దీ కుక్కమూతి పిందెలు వేసేదేమిటంటే స్నేహితమని తటపటాయించకుండా జవాబు చెప్పవచ్చు అని ఘంటాపధంగా చెప్పినవారూ వున్నారు. చివరగా, ప్రపంచంలో ఎట్టివారికి అన్ని అవస్థలయందును స్నేహితులు దొరకుచునే వుందురు అన్న వాదోపవాదతరంగాలను రువ్వినవారూ వున్నారు.
మనలో అజ్ణాతంగా ఉన్న అజ్ణానమూ, అవకతవకలూ, అస్తవ్యస్తాలూ, డాబులూ, దర్పాలూ, ఎదుటివాడిలో ప్రదర్శితమయితే మనకు నవ్వేనా వస్తుంది, లేక కోపమేనా వస్తుంది; వీటిని దూరం చేసుకుంటేనే స్నేహం అలవడుతుంది; స్నేహితులు అవతరిస్తారు.
ఉన్నతస్థితి సంపద మున్నగునవి చిన్ననాట సహజమైత్రిని తుదముట్టింపక వుంటేనే, ప్రపంచము సైఖ్యభూయిష్ఠమై భాగ్యవంతమై వుండును కదా అని చిలకమర్తివారు తన సుఖాశరచ్చంద్రము అన్న రచనలో వివరించిన వైనం సత్యం.
మంచి చేడు ల మధ్య స్నేహం, స్నేహితుడు
చెడు స్నేహం చెదపురుగువంటిది; చెదపట్టిన గోడను కూల్చినట్లే, చెడు స్నేహం మిత్రుల పతనానికి దోహదం చేస్తుంది. మంచి స్నేహం స్తంబాలవంటిది. అది బలంగా నిలబడి సహాయం చేస్తుంది.
ఉపశౄతి
జీవితానికి ఒక స్నేహితుడు చాలు; ఇద్దరు ఎక్కువ; ముగ్గురు కష్టసాధ్యం.
నా శతౄవులనుంచీ నన్నునేను రక్షించుకుంటాను; నా స్నేహితులనుంచీ దేవుడు నన్ను రక్షించుగాక.
స్నేహం తరచు నీరు పోయవలసిన మొక్కలాంటిది.
స్నేహితుల దినోత్సవం సందర్భంగా, స్నేహాన్ని ఆహ్వానిద్దాం. స్నేహితుల్ని పెంచుకుందాం. నెయ్యాన్ని పంచుకుందాం. స్నేహాన్ని వేదంలా మనవాదంగా మననం చేద్దాం.
స్నేహితుల దినోత్సవం (మొదటి ఆదివారం - ఆగష్టు 3) సందర్భంగా - విశ్వవ్యాప్తంగా మానవాళిని అభినందిస్తూ, స్నేహాన్ని అందించి, పొంది జీవితాన్ని సుఖమయంగా చేసుకోవాలని ఆశిస్తూ, తెలుగురథం శుభాభినందనలని తెలియజేస్తోంది.
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

No comments: